Nadichedevudu   Chapters  

46. దోషాలన్నిటికీ విరుగుడు వర్ణవ్యవస్థ

ఎ.యస్‌. రామన్‌ ఇంటర్వ్యూ

ప్రశ్న: వర్ణవ్యవస్థను తాము ఎలా సమర్థిస్తారు? దేశకాల పరిస్థితులకు విరుద్ధంగా కనిపించే ఈ విధానాన్ని సంస్కరించడానికి, మార్చడానికి అవకాశం ఉన్నదా?

స్వామి: వర్ణవ్యవస్థకు సంబంధించినంతవరకు దానిలో గుణదోషాలు రెండూ ఉన్నవి. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన జీవితవిధానం అది. దానిలో సత్యం ఉండబట్టే నేటికీ అది సజీవంగా ఉన్నది.

ఏ నాగరికత గానీ క్షీణించడానికి ముఖ్యకారణం మానవుని స్వార్థపరత్వమే. స్వార్థంవల్లనే పోటీ, దురాక్రమణ, పరపీడన, చివరకు వినాశనం అన్నీ సంభవిస్తాయి. పేదలను ధనికులూ, అజ్ఞానులను విద్యావంతులూ, అమాయకులను నాగరికులూ, ఆస్తికులను నాస్తికులూ లోబరుచుకుంటారు.

ఆదిలో రూపొందించిన హిందువుల వర్ణవ్యవస్థ మూలసూత్రాలు ఇట్టి దుష్పరిణామాలను ప్రోత్సహించేవి కావు. వాస్తవంలో, ఆ దోషాల కన్నిటికి విరుగుడే వర్ణవ్యవస్థ. అలా కాకపోతే, రమారమి అయిదువేల సంవత్సరాలలో తటస్థించిన అనేకానేక వైపరీత్యాలను, హెచ్చుతగ్గులను తట్టుకుని అది నేటికీ జీవించి ఉండేది కాదు. 'సర్వేజనాః సుఖినోభవన్తు' అన్నదే దాని మూలసూత్రం. వర్ణాంతర్గతమైన ఒక్కొక్క విభాగాన్ని సంఘటితం చేస్తూ, మొత్తం హిందూ సంఘం అభ్యుదయాన్ని సాధించడమే దాని ముఖ్యోద్దేశం. భిన్నత్వంలో సమైక్యతను రూపొందించడమే దాని లక్ష్యం.

ఈనాటికి కూడా యావద్భారతదేశంలో ఆ జీవిత విధానమే కొనసాగుతున్నది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష. రాష్ట్రానికే కాదు, కొన్ని చోట్ల జిల్లాలకు సైతం వేర్వేరు భాషలున్నవి. అయినప్పటికీ, అశేష భారతంలో హిందువు అంతా క్రమానుగతమైన జీవితవిధానాన్నే అనుసరిస్తారు. ఇంత కాలంగా వారి ఆధ్యాత్మిక వికాసానికి ఇదెంతో ఉపకరించింది.

ఆదిలో రూపుదాల్చిన పద్ధతి ననుసరించి వర్ణవ్యవస్థ హిందువు లందరిలో క్షమాగుణాన్ని పెంపొందిస్తుంది. ప్రతి వర్ణమూ స్వధర్మాచరణంపై శ్రద్ధ వహిస్తుందే గాని, ఇతర వర్ణస్థుల విధానాలను అవలంబించాలని కోరదు.

ఉదాహరణకు, బ్రాహ్మణుడు నిరుపేద స్థితిలో ఉన్నా, వైశ్యుని సంపదను చూచి అసూయ చెందడు. అదే విధంగా, వైశ్యుడు తానెంత సంపన్ను డైనా, క్షత్రియుని రాజ్యాధికారానికి తాను ప్రాకు లాడడు...మతం, తత్వశాస్త్రం, కళ, సారస్వతం మొదలైన వివిధ విషయాలలో మనవారు సాధించిన మహోన్నత విజయాలకు మూలాధారం వర్ణవ్యవస్థే నని చెప్పవచ్చు.

కాని, నేటి పరిస్థితి ఆ విధంగా లేదు. నేడు వర్ణ విభాగం నామ మాత్రమే. అది వాస్తవ స్థితిలో లేదు. అందుచేతనే నేడు మన కీదుస్థితి కనిపిస్తున్నది. వైవిధ్యం ఒకప్పుడు మనకు బలాన్ని ప్రసాదించింది. ఇప్పు డది పరస్పర వైరుధ్యానికి హేతు వైంది. నాలుగు వర్ణాల ప్రజలు ఎవరికి వారు వేరై పోవడమే గాక, ఒకరి నొకరు ద్వేషించుకునే పరిస్థితులు కల్పించబడినవి. ఇది చూచి, చాతుర్వర్ణ్య వ్యవస్థకు వెలుపల ఉన్నవారు సంతోషిస్తున్నారంటే ఆశ్చర్యం చెందనక్కరలేదు. ఒక్కొక్క కులాన్ని విడివిడిగా దెబ్బకొట్టవచ్చు. అందువల్లనే, బ్రాహ్మణులు సైతం క్రైస్తవ ఫాదిరీలకు అవలీలగా వశు లైనారు.

నేటి బ్రాహ్మణుని దుస్థితి

పూర్వం బ్రాహ్మణుడు హిందూసంఘానికి ఆధ్యాత్మికపరంగా నాయకుడు. ఆ కాలంలో మన మతం పేరు కూడా బ్రాహ్మణమతం (బ్రాహ్మనిజం) అనే కాని, హిందూమతం (హిందూయిజం) కాదు. ఈ రోజుల్లో కింది కులాల వారు ఆ నాయకత్వాన్ని బ్రాహ్మణుడి చేతులలో నుంచి తప్పించి తమకు సంక్రమింప చేసుకుందామని ఆశిస్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులకు చెందిన ప్రజ లందరూ ఒకరిని ఒకరు చూచి సహించరు. ఎవరికి వారే అగ్రేసరుల మని గర్విస్తారు. ద్వేషించుకుంటారు. ప్రచ్ఛన్నంగా ఈ నాలుగు తెగలకూ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. న న్నడిగితే, ఈ దుస్థితికి ప్రధాన కారకుడు బ్రాహ్మణుడే అంటాను. ఇతర కులాల వారి గౌరవానికి బ్రాహ్మణు డీనాడు పాత్రుడు కావడం లేదు. బ్రాహ్మణతరులు బ్రాహ్మణుణ్ణి విశ్వసించలేదు. ఆధ్యాత్మికంగా హిందూసంఘానికి ఆచార్యుడుగా ఉండే యోగ్యతను బ్రాహ్మణుడు కోల్పోయాడు.

ఒకా నొకప్పుడు బ్రాహ్మణుడు ఆర్థికంగా హిందువు లందరికంటె అట్టడుగున ఉండటమే గాక, మేధావిగా, శాస్త్రవేత్తగా, ఆచార్యుడుగా ఔన్నత్యంలో ఉండేవాడు. నిరాడంబర జీవనానికి ఆదర్శప్రాయుడుగా పరిగణించబడే వాడు. ఎంతటి దరిద్రస్థితిలో ఉన్నా అందరిచేతా అతడు గౌరవించబడేవాడు. గ్రామంలో బ్రాహ్మణుడు ఒక్కరోజు లేకున్నా, అందరికీ లోటుగా, వెలితిగా తోచేది. అతని ఇల్లు తపోవనంలా, ఆశ్రమంలా కనిపించేది. యావత్ప్రపంచం తనను కనిపెట్టి చూస్తున్నదనే భావంతో బ్రాహ్మణుడు ఎల్లరకు ఆదర్శప్రాయుడుగా జీవనం గడిపే వాడు. ఆధ్యాత్మికమార్గంలో తాను అగ్రస్థానం వహించి ఉండడం చేత, ప్రజల ధర్మాన్ని కాపాడేందుకు తా నెంతటి త్యాగమైనా చేయడానికి సిద్ధపడేవాడు.

కాని, నేటి పరిస్థితి ఎలా ఉన్నది? బ్రాహ్మణుడు తన బాధ్యతలను పూర్తిగా విస్మరించాడు. తన పూర్వీకులు ఆచరించిన జీవిత విధానాలను ఇతరులకు బోధించడానికి సైతం అర్హతను కోలుపోయాడు. క్షత్రియ, వైశ్య, శూద్రజాతులకూ, బ్రాహ్మణ జాతికీ భేదం అంతరించింది. అట్టి స్థితిలో బ్రాహ్మణతరులు బ్రాహ్మణుని ' నీ ఆధిక్యమేమిటి?' అని ప్రశ్నించడానికి ఆటంక మేమున్నది? అందరూ కలిసి వర్ణవ్యవస్థను కేవలం విమర్శించడమే కాదు, దానిని నామరూపాలు లేకుండా చెయ్యడానికే సిద్ధపడతారు.

నివారణోపాయం

ఇందుకు నివారణోపాయం ఏమిటి? కులాలను రద్దు చెయ్యడమా? అంతకంటే తేలికైన పని వేరొకటి ఉండదు. అయితే, అది పరిష్కారమార్గం కానేకాదు. వర్ణవ్యవస్థను పునరుద్ధరించి, పూర్వపు ఔన్నత్యాన్ని దానికి కట్టపెట్టగల వాడు బ్రాహ్మణుడే గాని, అన్యుడు కాడు. అందుచేత బ్రాహ్మణులకు నా సలహా ఇది. 'మీరు సద్బ్రాహ్మణులుగా జీవితాలు గడపండి. అందరికీ ఆదర్శప్రాయులు కండి. మీ గుణాలను ఇతరులు అనుకరించేటట్టు, మీ దోషాలను వారు పరిహరించుకునేట్టు చూడండి. మనో నిగ్రహం, ఆత్మనిగ్రహం, తమకై తాము దారిద్ర్యాన్ని వరించడం మొదలైనవి, మీ పూర్వీకులూ, మీ పెద్దలూ అవలంబించిన జీవిత విధానంలోని కొన్ని పవిత్ర లక్ష్యాలు. వారివలె మీరు కూడా వాటిని అనుష్టించండి. అప్పుడు హిందూసంఘంలోని బ్రాహ్మణతర ప్రజానీక మంతా మీచే ప్రభావితు లౌతారు. హిందువులలో ఐక్యత సమకూడుతుంది. ఆధ్యాత్మిక విలువలకు సంబంధించినంతవరకు ఎలాంటి పరిస్థితులలోనూ నియమోల్లంఘనం చెయ్యకండి!

ఇందుకు ఎంతో త్యాగం అవసరం. దానిని కా దనను. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన దేశభక్తులు లేరా? తన మతం కోసం, తన ధర్మం కోసం బ్రాహ్మణుడు ప్రాణం ధార పోయలేడా? నాయకుడైన వానికి లాభాలతో పాటు బాధ్యతలు కూడా ఉన్నవి. బ్రాహ్మణుని స్వార్థరాహిత్యమూ, త్యాగపరత్వమూ - ఈ రెంటి మీదనే వర్ణవ్యవస్థ జవసత్త్వాలు ఆధారపడి ఉన్నవి. కాని పక్షంలో, బ్రాహ్మణునిపై విధించబడిన నైతిక ప్రమాణాలను సమర్థించే దెట్లా? ఈ సంస్కరణకు ముందు బ్రాహ్మణుడే ఉద్యుక్తుడు కావాలి.

నైతిక విలువలు

ప్రశ్న: మతపరంగా హిందువుల నుద్ధరించడానికి మీరు సూచించే మార్గమేది?

స్వామి: అన్నటికంటె ముఖ్యమైనది ప్రజల నైతిక ప్రమాణాలను అభివృద్ధి పరచడం. ధర్మమార్గావలంబనం అవసర మనే అంతఃప్రేరణ మనకు రానంతవరకు శాసన రీత్యా ఎలాంటి సంస్కరణలు తలపెట్టినా, అవి నిరుపయోగమే కాగలవు. పాఠశాలల్లోనూ, ఇళ్లల్లోనూ మన బాలబాలికలు నైతికబోధ చెయ్యడం అవసరం. వారి లేత మనస్సులను ఆకర్షించే పద్ధతిలో ఆ బోధనను రూపొందించాలి. వైద్యం, ఇంజనీరింగ్‌ మొదలైన విద్యలను ఉచిత వయస్సులో నేర్చుకొనవచ్చు. విద్యార్థుల నడతకు, నైతిక సూత్రాలకు అన్నిటికంటె ప్రధాన స్థానం ఇవ్వాలి.

మా చిన్నతనంలో వలె పాఠశాలల్లో విద్యాభ్యాసం ప్రయోజన కరమూ, ఆధ్యాత్మిక భావసమన్వితమూ అయినప్పుడు, ప్రజల సాంఘిక, నైతిక సంస్కరణలకు సంబంధించిన చట్ట నిర్మాణం అంతగా అవసరం ఉండదు. కేవలం శాసనాల ద్వారా ప్రజల నైతిక ప్రమాణాలను పెంపొందించుదామని నేడు ప్రభుత్వం చేసే ప్రయత్నాలన్నీ ఆచరణ సాధ్యంకాని చట్టాలుగా, మృతాక్షరాలుగా నిలిచిపోతాయి. న్యాయవాదులు తమ జేబులు నింపుకోవడానికి మాత్రమే అవి ఉపకరిస్తాయి. వెనకటి రోజులలో విద్యార్థులకు నీతిని, ధర్మాన్ని బోధించే పాఠ్య పుస్తకాలు నిర్బంధ పఠనీయాలుగా నిర్ణయించేవారు. దొంగతనం చెయ్యనివారికి, అబద్దాలు చెప్పనివారికి, పెద్దల ఆదర్శాలను పాటించే బాలబాలికలకు బహుమతు లిచ్చి వాళ్ళను ప్రోత్సహించే వారు. నేటి పాఠశాలల్లో విద్యార్థుల నైతికశిక్షణతో ఏమాత్రం సంబంధం లేని చదువులకు మాత్రమే పారితోషికా లిస్తున్నారు. బాలల శీలంకంటె వాళ్ల ఉద్యోగాలకూ, జీవనాధారాలకూ ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరుగుతున్నది. యువతీయువకుల నడతలను సరిదిద్దవలసినది పార్లమెంటు చట్టాలుకావు, మన మత గ్రంధాలలో నిర్వహించబడిన మహోత్తమ ఆదర్శాలు.

ప్రశ్న: మత పరమైన జీవితం గడిపే వారు పూర్వాచారాలు పాటించడం అవసరమా? నోములూ, వ్రతాలూ, అనుష్ఠానాలూ ముఖ్యమా? ఏది ఉచితమో, ఏది అనుచితమో నిర్ణయించడానికి ఈ కార్య కలాపాలు ఎంతవరకు అవసరం? భగవంతునిలో విశ్వాసం ఉంటే తప్ప మనిషి నీతిమంతుడు కాడా? సజ్జనులైన వారంతా విధిగా మత విశ్వాసం కలవారా? నీతికీ మతానికీ గల సంబంధంపైనా, దైవభక్తీ, మానవ ప్రేమకూ గల సంబంధం పైనా స్వామివారి అభిప్రాయాలూ వినగోరుతున్నాను. చోరులూ, వ్యభిచారులూ సైతం తమ వ్యాపారాలలో విజయం కలగాలని తమ ఇష్టదేవతలను ఆరాధించవచ్చు కదా?

స్వామి: మానవుని ఆత్మానుభూతికి, ఆత్మసాక్షాత్కారానికి మతకార్య కలాపాలు అంత ప్రధానం కాని మాట నిజమే. అయితే, అది ఒక్కొక్క వ్యక్తి ఆధ్యాత్మికసాధనపైనా, పరిణతి పైనా ఆధారపడి ఉంటుంది.

సామాన్యసాధకుడు, లేదా భక్తుడు శాస్త్రవిధి ననుసరించి ఆచార వ్యవహారాలను తూ.చా తప్పక పాటించడం అవసరమే. వాటిని ఆచరించడం వల్ల కనీసం ఏకాగ్రత సిద్ధిస్తుంది. పారమార్ధిక సాధనకు క్రమశిక్షణ, ఏకాగ్రత, నియమవర్తన, సంకల్పబలం మొదలైనవి అవసరం. మత కార్యకలాపాలవల్ల వీటిని అలవరచుకోవచ్చు.

మతమూ, నైతిక వర్తనమూ అన్యోన్యాశ్రయాలు కావు. బుద్ధుడూ, మహావీరుడూ దేవుని నమ్మలేదు. అయినా, వారు నీతిపరులు, ధర్మపథంలో నడిచారు. వైదికమతానుయాయులలో సైతం నాస్తికులు లేకపోలేదు. సాంఖ్యవాదులు నాస్తికులే. సాంఖ్యులకు కర్మ ముఖ్యమైనంతగా దేవుడు ముఖ్యం కాదు.

ఆదర్శం అవసరం

అయితే, మనిషికి ఏదో ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంటేనే గాని, పరిపూర్ణమైన నీతి సాధ్యంకాదు. ఆ ఆదర్శానికి తన్ను తాను సమర్పించుకుంటాడు. అటు తరువాత, అతని జీవితం శుభపరిణామం చెందుతుంది. మానవుని అంతరంగికసాధనకు లక్ష్యమూ, గమ్యమూ భగవంతుడొక్కడే. ఇతర దేశా లన్నిటిలో కంటె భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు అవతరించారు. మన మత సాహిత్యం ఎంత సుసంపన్నమో, ఎంత మహిమోపేతమో చూడండి. ఎంతటి వాడైనా మానవుడు మానవునకు అసంపూర్ణుడే. కావున, మానవుడు పరమ లక్ష్యం కాజాలడు. ఆ కారణం చేత, తన నైతికాభ్యున్నతికై, తన ఆధ్యాత్మికపరిణతికై తనకంటె ఉత్తముడూ, మహోన్నతుడైన వానిని, పురుషోత్తముని ఆలంబనంగా ఎన్నుకుంటాడు.

బుద్ధుడు అహింసను పరమధర్మంగా బోధించాడు. ఆ సిద్ధాంతమే బౌద్ధులకు దేవుని స్థానాన్ని ఆక్రమించింది. కాని, బౌద్ధమతం వ్యాప్తిలో ఉన్న దేశా లన్నిటిలో నేడు మన మేమి చూస్తున్నాము? అహింస పరమధర్మంగా పాటించే ఆ ప్రజల్లో జీవహింస, మాంసాహారం మహావికృత రూపం దాల్చి ఉన్నాయి. మేము అహింసా ధర్మపరాయణుల మని చెప్పు కోవడానికై అచ్చటి ప్రజలు తాము స్వయంగా జంతువధ చేయకపోవచ్చు. మన తూర్పు తీరాలనుంచి కొందరిని తమదేశానికి రప్పించుకుని వారిచేత జంతువులను చంపిస్తారు! ఇదీ వారి అహింస! అందుచేత భగవంతుడనే ఒక ఉత్తమాదర్శాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంటేనే తప్ప మానవుడు నైతికంగా పరిపూర్ణతను సాధించలేడు. వ్యక్తి కంటె కూడా, ఒక జాతికి భగవంతుడనే మహోన్నతమైన ఆదర్శం అవసరం. 'చోరులు, వ్యభిచారులు'అని మీరు ఉదహరించిన దోషులు అపమార్గాన పడిన నేటికాలపు బౌద్ధులలాంటి వారు. ఆధ్యాత్మిక సాధనలో విజయం సాధించలేక పోవడం వల్ల కలిగే ఫలితాలకు మానవ సహజమైన దౌర్భల్యం కారణంగాని, ఆదర్శం కారణం కాదు.

వైజ్ఞానిక పరిశోధన

ప్రశ్న: ఇటీవలి కాలంలో వైజ్ఞానికంగా మానవుడు అత్యద్భుతమైన ఫలితాలను సాధించాడు కదా. మానవుల మత విశ్వాసాలపై ఈ వైజ్ఞానిక పరిశోధనల ప్రభావ మేమైనా ఉండవచ్చునా?

స్వామి: విజ్ఞానశాస్త్రమూ, ఆధ్యాత్మికమూ రెండూ ఈ రోజులలో ఒకదాని కొకటి దగ్గరకు చేరుతున్నవి. మన కంటికి కనిపించే భౌతిక పదార్ధము నంతటినీ శక్తి (energy) గా మార్చవచ్చు నని వైజ్ఞానికుడు ప్రకటిస్తున్నాడు. ఆ 'ఎనర్జీ'నే నేను పరాశక్తి అంటున్నాను. ఆ విధంగా విజ్ఞానశాస్త్రజ్ఞుడు అనుద్దేశపూర్వకంగానే అద్వైతులలో చేరిపోతున్నాడు!

ఉష్ణము, విద్యుత్తు మొదలైన వివిధ రూపాలలో ప్రత్యక్ష మవుతున్నప్పటికీ 'శక్తి' అన్నది సర్వశక్తిమంతమని వైజ్ఞానికుడు నేడు కనిపెట్టిన విషయం. ఇది నేడు అతనిని శంకరుల వాదం చేరువకు చేర్చక తప్పదు. ద్రష్ట లేదా ఆత్మ దేనిని చూస్తుందో, చూచేదీ, చూడబడేదీ రెండూ ఒకటే అవుతాయి.

ఆధునిక విజ్ఞానశాస్త్రానికి గల సంహారకశక్తీ, దానివల్ల ప్రపంచానికి వాటిల్లే నష్టమూ - ఆ సమస్య వేరు.

ప్రశ్న: మరొక ప్రపంచసంగ్రామం జరుగుతుందని తాము భావిస్తున్నారా? ప్రపంచశాంతి సంరక్షణకు తమ సూచన లేమిటి? తెల్లజాతులకు నల్లజాతులకూ, అరబ్‌ లకు యూదులకూ, హిందువులకు ముస్లింలకూ మధ్య నానాటికీ ప్రజ్వరిల్లుతున్న కలహాలను నశింప జేసే మార్గాలేమిటి?

స్వామి: నేను ప్రవక్తను కానుకదా. అయినా, మూడవప్రపంచ యుద్ధం సంభవిస్తే అది కట్టకడపటి యుద్ధం కావచ్చు. ఈ మాట చెప్పడానికి నేను ప్రవక్తను కా నవసరంలేదు. ఈసారి తిరిగి అట్టి యుద్ధమే సంభవిస్తే, అటు తరవాత ప్రపంచమూ ఉండదు; యుద్ధాలూ ఉండవు.

అయితే, అణ్వాయుధాల నిర్మాణంలో పోటీ పడుతున్న రష్యా, అమెరికా దేశాలు రెండూ, ఒకదాని నొకటి గాని, లేదా రెండూ కలిసి మొత్తం ప్రపంచాన్నే గాని, సర్వనాశనం చేసుకోవని నేను భావిస్తున్నాను. తిరిగి ప్రపంచయుద్ధమే సంభవిస్తే అది రెండు రోజులకు మించకుండానే ముగియవచ్చు.

యుద్ధానికి సన్నద్ధమయ్యే దేశాల మధ్య ప్రేమ, సహనం, పరస్పర అవగాహన, సమాధాన తత్వం మొదలైన ఆదర్శా లున్న పక్షంలో ప్రపంచ ప్రజలలో విద్వేషాలు ఉడిగి, శాంతిస్థాపనకు అవకాశాలేర్పడగలవు.

ప్రశ్న: దేవాలయాల పునరుద్ధరణ పేరిట నేడు కొందరు ధర్మకర్తలు ఆలయాలను వికృతంగా తయారుచేస్తున్నారు. మంచి శిల్పసంపద కలిగిన గోపురాలకూ, రాతిస్ధంభాలకూ సున్నపుపూత పూయడం, రకరకాల రంగులు పులమడం, ఇలాంటి చర్యలవల్ల దేవాలయాల జీవితాలను పొడిగించడం లేదు సరికదా, వాటి ఉదాత్తతను, గాంభీర్యాన్నీ మరుగుపరచి, వాటిని చౌకబారు నిర్మాణాలుగా మారుస్తున్నారు. దీర్ఘకాలం గడిచి నందువల్ల ఈ నిర్మాణాలకు చేకూర వలసిన పవిత్రత మొదలైన ఉత్తమ లక్షణాలు ఆలయోద్ధరణ పేరిట మరుగుపడి పోతున్నవి. మన గోపురాల 'సూడై'లకు కన్నుచెదరే రంగులు పూయడం వల్ల అవి బొమ్మల కొలువుగా తయారవుతున్నవి. తమ అభిప్రాయ మేమి?

స్వామి: మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ విషయంపై మీరు వెల్లడించిన భావాలను మించి నేనేమీ చెప్ప నక్కరలేదు. దేవాలయం ప్రజల నాకర్షించవలసిన పనిలేదు. కాని, ఏ ప్రమాణాలైతే దానికి నిర్ణయించబడినవో వాటిని మాత్రం తప్పకుండా పోషించాలి. ఎంత పునరుద్ధరణ చేసినా, ఆదిలో దాని కున్న అందచందాలను, అలంకరణాదులను చెడగొట్టరాదు. ఆలయ ధర్మకర్తలకు దేవునిలో, దేవాలయాలలో విశ్వాసం మాత్రం ఉంటే చాలదు. అభిరుచీ, సంస్కారం కూడా ఉండాలి.

సినిమా - సంఘసంస్కరణ

ప్రశ్న: సామాన్య ప్రజానీకంపై సినిమా ప్రభావాన్ని గురించి స్వామి అభిప్రాయం ఏమిటి?

స్వామి: అణుశక్తి మోస్తరుగానే సినిమా కూడా, మంచికీ, చెడ్డకూ రెంటికీ ఉపయోగపడుతుంది. ఒక కళగా, వైజ్ఞానిక విశేషంగా సినిమా కోర తగిందే కాని, దాని వినియోగం పరిమితమని నా అభిప్రాయం. భూగోళశాస్త్రం, విజ్ఞానం (సైన్సు) వైద్యం, ఇంజనీరింగ్‌, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన విషయాల బోధనకూ, డాక్యుమెంటరీలకు అది ప్రయోజనకరమే.

సాంఘిక సమస్యలను సినిమా చిత్రాలుగా ప్రదర్శించడం సమంజసం కాదు. సంఘసంస్కరణ సినిమా లక్ష్యం కారాదు. సినిమా కళను జీవనోపాధిగా చేసుకొనడంవల్ల మన ఆడవారు కులస్త్రీలకు ఉండవలసిన గౌరవమర్యాదలను కోలుపోయి క్షుద్రమైన ప్రదర్శకురాండ్రగా మారడం అత్యంత శోచనీయం.

నాటకరంగంపై స్త్రీలు అభినయించడం వేరు. భారతపుత్రులని, కళావంతులని, భట్రాజులనే పేర్లతో ఒక ప్రత్యేకతెగకు, కులానికి చెందిన వారు నాటకకళను సంప్రదాయంగా పాటించి, రంగస్థలంపై అభినయించేవారు. అదివారి వృత్తి, నటన వృత్తిగా అవలంబించిన స్త్రీలైనా తమ భర్తల పక్కనే అభినయించే వారు. నటీ సూత్రధారుల రంగ ప్రవేశం గురించి మీరు విని ఉంటారు. నైతిక సూత్రాలను ఉల్లంఘించేవారు కారు. నేను చెబుతున్న విషయాలు నిన్నామొన్నటివి కావు. చాలా పురాతనకాలపు సంగతులు.

నేడీ మర్యాదలను గురించి నియమనిబందనలను విధించే అధికారం ఎవరికున్నది? - అందులో ముఖ్యంగా మన చిత్ర నిర్మాతలకు? చిత్రనిర్మాతలు వారికి వారే అధికారులు.

ప్రశ్న: మన పురాణగాధలను గురించి సినిమాలు తియ్యడం స్వామి వారికి ఇష్టం ఉండ దనుకుంటాను.

స్వామి: సాంఘిక సమస్యలు సినిమాలకు వినియోగించడమే నా అభిమతం కానప్పుడు పౌరాణికగాధలను సినిమాలుగా తీయడం అన్న ప్రశ్నే ఉదయించదు.

Nadichedevudu   Chapters