Nadichedevudu   Chapters  

 

43. జీవకారుణ్యానికి పరాకాష్ఠ

స్వామి జీవకారుణ్యం ఆదర్శప్రాయం. అనన్యసాధ్యం.

దేశసంచారం చేసే టప్పుడు రైలుగాని, మోటారుగాని ఉపయోగించకుండా, కేవలం నేలపై నడిచి వెళ్లడానికి ఈ జీవకారుణ్యమే ఒక కారణంగా స్వామి పేర్కొన్నారు.

రైలు, మోటారుకార్ల చక్రాల క్రింద భూమిపై తిరిగే కోటానుకోట్ల సూక్ష్మ జీవులు నశించే అవకాశం ఉంది. కాలినడకవల్ల వాటికి అంతహాని సంభవించదు. అలాంటి జీవులకు ఎక్కువహాని జరగని పద్ధతిని తాను అవలంబిస్తున్నా మంటారు.

స్వామి జీవకారుణ్యం ఎంతటి పరాకాష్ఠకు చేరుకున్నదో తెలుసుకోడానికి ఒక నిదర్శనం:

స్వామి ఒకసారి మఠంలో గోడ నానుకుని కూర్చున్నాడు. కూర్చుని ఉండగా కునుకు పట్టింది. అది నిజంగా నిద్రావస్థో, సమాధిస్థితో మనం చెప్పలేము.

కొంతసేపటికి స్వామికి తెలివి వచ్చింది. కళ్లు తెరిచారు. తమ వీపుమీద ఏవో పాకుతున్నట్టు తోచింది. పరిశీలించగా, ఆ గోడపై వున్న చదపురుగులు శ్రీవారి వీపుమీదికి పాకి విహరిస్తున్నాయి!

స్వామి చేత్తోగాని, గుడ్డతోగాని వాటిని విదిలించడానికి ప్రయత్నించలేదు. ఒక శిష్యుని పిలిచారు. తమ వీపుపై పాకే చదల్లో ఒక్కదానికైనా హాని కలగకుండా, నేర్పుగా, నెమ్మదిగా తీసివేయమన్నారు.

చదల కెక్కడ అపాయం జరుగుతుందో నని భయపడుతూ, భయపడుతూ శిష్యుడు ఆ పురుగుల నన్నిటినీ జాగ్రత్తగా తొలగించేసరికి అతడి తలప్రాణం తోక కొచ్చింది! అయినా, స్వామికోరిక నెరవేరింది.

* * *





ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక

ధర్మాచరణకు శ్రద్ధ ప్రాతిపదిక. ధర్మవిషయంలో 'ఎందుకు?' అన్న ప్రశ్నకంటె, 'ఏది?' అన్నదే ప్రధానం. 'ఎందుకు' అనేది అనవసరం.

ధర్మం ఆత్మసంబంధం. ఆత్మ మనస్సుకు పైది. ఆత్మకు సంబంధించిన విషయం మనస్సుకు బోధ పడక తికమకపడుతుంది.

ధర్మం శాసనం. శాసనాలను శాస్త్రాలు చెబుతాయి. ''తస్మాత్‌ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ''

Nadichedevudu   Chapters