Nadichedevudu   Chapters  

 

42. ''ఆదిశంకరుల అవతారమే''

''రెండు వేల సంవత్సరాలకు పూర్వం ఆదిశంకరులు కాశీ మహాక్షేత్రానికి విచ్చేసి, హిందూమత పునరుజ్జీవనానికి పునాదులు వేశారని ఎరుగుదుము.

నేటికి మరల ఆ శంకరభగవత్పాదుల అవతారమూర్తులైన కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతులను కాశిలోనే కళ్లారా చూచే భాగ్యం కలిగినందుకు మేమందరం ఆనందిస్తున్నాము.

దక్షిణదేశం నుంచి పాదచారులై పలు శ్రమలకోర్చి శ్రీ కామకోటి స్వాములు కాశీకి రావడం, ఆనాటి ఆదిశంకరుల దిగ్విజయ యాత్రను మరల మరల స్ఫురణకు తెస్తున్నది. ఇది ఒక అపూర్వానుభవం.....''

* * *

1934లో కాశీ హిందూవిశ్వవిద్యాలయం పక్షాన జరిగిన బ్రహ్మాండమైన మహాసభలో కంచి కామకోటి పీఠాధిపతి చంద్ర శేఖరేంద్ర సరస్వతి యతీంద్రులకు స్వాగతం పలుకుతూ, హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు దివంగతుడు శ్రీ మదన మోహన మాలవ్యా పండితుడు నుడివిన స్వాగత వాక్యాలు అవి.

మాలవ్యాపండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడే కాదు, ఉత్తర ప్రదేశంలో జన్మించి యావద్భారత ప్రశస్తిగాంచిన సుప్రసిద్ధ జాతీయ నాయకుడు. గాంధీ, తిలక్‌, నెహ్రూల కోవకు చెందిన అకలంక దేశభక్తుడు. మీదుమిక్కలి, అకుంఠిత సనాతన ధర్మ పరాయణుడు. ఆయన వాణి అశేష భారతహిందూ జనవాణి, ''సమస్త హిందూ సంఘానికి మకుటంలేని మహీపతి'' అని మాలవ్యాపండితుని గురించి లాలాలజపతి రాయి ప్రశంస. సనాతన ధర్మావలంబకుల తరపున కంచి యతీంద్రులకు నివాళులర్పించడానికి మాలవ్యాపండితుల కంటె మహోత్తము లుండరు.

కాగా, కామకోటి పీఠాధీశ్వరులు ఆదిశంకరుల అపరావతారమని మాలవ్యా చేసిన ప్రస్తుతిని మించినది వేరొండు లేదు.

కాశీమహాక్షేత్ర సుదీర్ఘ చరిత్రలో శ్రీ కామకోటి పీఠాధిపతులకు జరిగిన ఈ ఘనసత్కారం ఇతరు లెవ్వరికీ జరగలేదంటే అతిశయోక్తికాదు.

యావధ్బారతంలో హిందువులకు కాశీ క్షేత్రరాజం. ''పావన క్షేత్రముల రాశివారణాసి''. ఆర్ష సంస్కృతికి అనాదినుంచి ప్రధాన కేంద్రం. ఈ క్షేత్రంలోనే ఆది శంకరులు భాష్యగ్రంథ రచన ఆరంభించారు. ఇక్కడినుంచే తమ దిగ్విజయ యాత్ర కొనసాగించారు. కాశీలో సన్మానం పొందితే అశేష పండితలోకం హర్షించినట్టే.

దక్షిణ దేశంలో కామకోటి స్వామి కీర్తి దశదిశలా వ్యాపించింది. ఈ సన్మాన సభా విశేషాలను తెలిసికోడం ద్వారా ఔత్తరాహులలోని విద్వద్వరేణ్యులు స్వామికి ఏ విధంగా బ్రహ్మరధం పట్టారో విదితమవుతుంది.

ప్రయాగయాత్ర ముగించి, అక్కడి నుండి కాశీకి 80 మైళ్లు నడకసాగించి, 1934 అక్టోబరు 6వ తేది కంచి స్వామి కాశీ నగరములో అడుగు పెట్టారు. ఆనాటి నగర ప్రవేశమహోత్సవంలో లక్షమంది ప్రజలు పాల్గొన్నారు.

అలహాబాద్‌ విశ్వవిద్యాలయ వైస్‌-ఛాన్సలర్‌ డాక్టర్‌ గంగానాధ గారితో సహ ఇరవైమంది మహా మహోపాధ్యాయ పండితులు వివిధ సన్మానసభలలో స్వామికి ప్రస్తుతు లందజేశారు. వారిలో నవద్వీప పండితులు కామాక్ష్యనాధ తర్కవాగీశులు, బెంగాలు బ్రాహ్మణమహాసభాధ్యక్షులు పంచానన తర్కరత్న, పండిట్‌ లక్షణశాస్త్రి ద్రావిడ్‌, పండిట్‌ భానుశాస్త్రి వషే, పండిట్‌ పద్మనాభ శాస్త్రి ప్రభృతు లెందరో ఉన్నారు.

1935 ఫిబ్రవరి 9 తేది మాలవ్యాపండితుడు కాశీ హిందూ విశ్వవిద్యాలయం యాజమాన్యాన సమావేశ పరిచిన మహాసభ కాశీ నగరంలో ఉన్న పండిత బృందంతో, విశ్వవిద్యాలయాధికారులతో, సంస్థానాధి పతులతో, యతివరేణ్యులతో నిండి పోయింది. స్వాతంత్ర్యోద్యమ సందర్భంలో తప్ప, అపూర్వమైన ఇలాంటి సభ అంతకు ముందెన్నడూ జరగలేదు.

పండిత మదన మోహన మాలవ్యా శ్రీ కామకోటిపీఠాధిపతులకు స్వాగతం పలికారు.

వారు స్వయంగా రచించి చదివిన పంచరత్నాలను ఈ పుస్తకంలోనే వేరొకచోట ప్రచురించాము.

స్వాగతపత్ర సమర్పణమూ, పండితుల కృతజ్ఞతాపూర్వక ప్రసంగాలూ జరిగిన పిమ్మట శ్రీ కంచి స్వామి సరళ సంస్కృతంలో సభవారి నుద్దేశించి ప్రసంగించారు. స్వామి ఉపదేశ సారాంశమిది.

''విద్య మనశ్శాంతికి కారణం కావాలి. జ్ఞానార్జనం చేస్తూ మర్త్యభావాన్ని అధిగమించగలగాలి. మాలవ్యా పండితులు స్థాపించిన ఈ విశ్వవిద్యాలయంలో ప్రధానంగా ఆస్తిక్యంగల విద్యాభ్యాసాన్ని లక్ష్యంగా పెట్టుకుని విద్యా ప్రణాళికలు రచింపబడాలి.''

ఆలోచనలోను, ఆచరణలోను ఆదర్శప్రాయమైన జీవనం చెయ్యగల విద్యార్థులను తీర్చిదిద్దగల విద్యావిధానాన్ని ఈ విశ్వవిద్యాలయం సృష్టించాలి''





మాలవ్యా పంచరత్నాలు

కాశీ విశ్వవిద్యాలయ స్వాగతాభినందనమ్‌.

యద్వాచాం లసితై స్త్రిలోక జనతా మోహాంధకార క్షయః

పాదాబ్జస్మరణన యస్య కలుష ధ్వంసాత్‌ ప్రసాదః స్థిరః

తస్యాద్వైతగిరాం గురోర్భగవతః శ్రీ శంకర స్యోన్నతం

కాంచీపీఠపదం యతీశ్వర మహత్‌ స్థానం త్వయాధిష్ఠితమ్‌.

తత్త్వజ్ఞాన - తపః సమాధి - కరుణౌదార్య ప్రసాదాదిభిః

పుణ్యం భారతవర్ష మేత దనఘం ప్రాప్నోతి లాభమ్‌ పరమ్‌

కీర్త్యా తేsమలయా యతీంద్ర! మహతామాదర్శతాం ప్రాప్తయా

సంతః సంతత ముల్లసంతిచ దిశః సర్వాః సముద్భాసితాః.

స్వామిన్‌! స్వాగతమస్తు తే శివపురీ శ్రీ విశ్వవిద్యాలయే

శిక్షాకేంద్ర వరేత్ర భారతభువాం విద్యార్థినాం సర్వతః

శ్రీ మద్‌ వక్త్రసరోరుహోదిత శుభాశీ గీ(సు)స్సుధాధారయా

సాఫల్యం శ్రుతి జన్మనోర్భవతు నః శాంత్యై స్రవంత్యా భువః.

ఘోరే కలౌ ప్రతిదిశం భువి సత్యధర్మో

హస్తాపకర్ష మధునా నితరా ముపైతి

తస్యోన్నతిః పునరిహోఖిల మంగళార్థా

భూయాద్యథా కరుణయోపదిశేతి యాచే.

ప్రాచ్య ప్రతీచ్య శుభభావ సమన్వయేన

భోగాపవర్గద సుశిక్షణ దానశీలః

ఏషోs ఖి లా భ్యుదయ కృద్యతివర్యవిశ్వ

విద్యాలయ స్తవ శుభాగమనేన దన్యః.

మాలవీయో మదన మోహనః

Nadichedevudu   Chapters