Nadichedevudu   Chapters  

 

36. సౌజన్యానికి మారుపేరు

స్వామి ఔదార్యానికి మేరలేదు. అద్వైతులే కాదు, శైవ, వైష్ణవాది ఏ శాఖకు చెందిన వారినైనా స్వామి ఎంతో గౌరవంతో చూస్తారు. స్వీయప్రతిష్ఠగానీ, పీఠగౌరవంగానీ అందుకు అడ్డురావు.

వైష్ణవ సంప్రదాయానికి చెందిన వానమామలై జియ్యర్‌ ఎనభై సంవత్సరాల వృద్ధు. కంచిపీఠాధిపతిని గురించీ, ఆయన తపోమహిమను గురించీ పలువురి ద్వారా విని, వారిని స్వయంగా చూడాలని ఆశించారు. కొందరు మధ్యవర్తులద్వారా ఆ సంగతి కంచి స్వామికి తెలియజేశారు. ఎప్పుడైనా సరే, కంచిలోనే తనను కలుసుకోవచ్చని శ్రీ జియ్యర్‌కు స్వామి కబురంపారు.

తరువాత కొంతకాలానికి శ్రీ జియ్యర్‌ కంచికి రావడం తటస్థించింది. ఈ సంగతి విన్న స్వామి మధ్యవర్తు లెవ్వరితో పనిలేకుండా, ఏ లాంఛనాలనూ పాటించకుండా, ఎకాయెకిని తామే స్వయంగా బయలుదేరి, జియ్యర్‌గారు మకాం చేస్తున్న ఇంటికి వెళ్లి శ్రీ జియ్యరును కలుసుకున్నారు.

ఆశ్చర్య సంభ్రమాలతో జియ్యర్‌ కంచి స్వామికి స్వాగతం పలికారు. ఉభయులూ గంటసేపు అరమరికలు లేకుండా మాట్లాడుకున్నారు.

ఎవరి వద్దకు ఎవరు రావాలి? అన్న ప్రశ్నకు అవకాశ##మే కలగలేదు.

సౌజన్యానికి మారుపేరు చంద్రశేఖర యతీంద్రులు!

Nadichedevudu   Chapters