Nadichedevudu   Chapters  

 

31. ''నీలంరాజును ఎరుగుదువా?''

దేశ సంచారం చేస్తూ కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహారాష్ట్రలోని సతారా పట్టణంలో కొంతకాలం మకాం చేశారు.

సతారా పట్టణవాసులేగాక, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా వెళ్ళి స్వామిని సందర్శించారు.

సతారాలో ఒక బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్న ఒక మహారాష్ట్ర యువకుడు అందరితోబాటు ఒకనాడు స్వామి దర్శనానికి వెళ్ళాడు.

స్వామి ఆ యువకుణ్ణి చూశారు. దగ్గరికి రమ్మని పిలిచారు.

''నీలంరాజు వెంకట శేషయ్యను నీవు ఎరుగుదువా?'' అని అడిగారు.

ఆ పేరు వినగానే ఆ చిన్నవాడు ఆశ్చర్యపోయాడు:

''తమరు చెప్పిన పేరు మాత్రం నాకు పరిచయమే. ఆయన మా తండ్రిగారికి స్నేహితులు. అయినా, వారిని గూర్చి మా తల్లిద్వారా వినడమే తప్ప, ఇంతవరకు వారిని నే నెన్నడూ చూడలేదు'' ఆశ్చర్యపోతూనే సమాధానం చెప్పాడు.

''సరి, మంచిది. నీకు శుభం జరుగుతుంది'' అంటూ, ఆ చిన్నవాడికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.

* * *

కొన్ని రోజులకు ఆ కుర్రవాడి దగ్గరనుంచి నా కొక ఉత్తరం వచ్చింది. అది ఇంగ్లీషులో ఉన్నది.

ప్రస్తుతం సతారాలో మకాం చేస్తూ ఉన్న కామకోటి శ్రీ శంకరాచార్య స్వామిని ఇటీవల తాను సందర్శించాననీ, స్వామివారు తనను పిలిచి ''నీలంరాజు వెంకట శేషయ్యను ఎరుగుదువా?'' అంటూ ప్రశ్నించారనీ, స్వయంగా నేను ఎరుగను కాని, ఆయన మా తండ్రిగారి స్నేహితులని సమాధానం చెప్పాననీ, స్వామివారడిగిన ప్రశ్న తనకెంతో ఆశ్చర్యాన్ని సంభ్రమాన్ని కలిగించిందనీ, ఆ ఉత్తరంలో రాశాడు.

* * *

ఉత్తరం చదివిన తరువాత, ఆ చిన్నవానికి కలిగిన ఆశ్చర్యంకంటె పదింతలుగా నేను ఆశ్చర్యపడ్డాను.

ఆ యువకుని తండ్రి మహారాష్ట్రలో కొల్హాపూర్‌ వాస్తవ్యుడు. పేరు జగదీశ్‌రావ్‌ సాలిగ్రామ్‌. హిందూస్థానీ సంగీతంలో విద్వాంసుడు. ప్రఖ్యాత గాయని పద్మాసాలిగ్రాం సోదరుడు. అతడు కొంతకాలం మద్రాసులో ఉన్నాడు. ఆ సందర్భంలో మేమిద్దరం ఆప్తమిత్రుల మైనాము. మద్రాసునుంచి కొల్హాపూర్‌ వెళ్ళిన తరువాత అతడు పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు కుమారులు కలిగిన అనంతరం దురదృష్టవశాత్తూ, అకాలంగా మరణించాడు.

అతడు కొల్హాపూర్‌ చేరిన పిమ్మట అప్పుడప్పుడు ఒకరికొకరం ఉత్తరాలు రాసుకుంటూ వచ్చామేకాని, మళ్ళా కలుసుకోడం తలస్థించలేదు. అతని కుమారులను నేను అసలే ఎరుగను. ఎంతోకాలం గడిచింది.

ఇలా నాకు మహారాష్ట్ర స్నేహితుడు, సంగీత విద్వాంసుడు ఒకరు ఉండేవాడని స్వామితో నే నెన్నడూ ప్రస్తావించలేదు. అలాంటి అవకాశం ఎన్నడూ కలగలేదు.

అలాంటి పరిస్థితుల్లో, గతించిన నా మిత్రుని గురించి స్వామికి ఎలా తెలిసింది? నా మిత్రుని కుమారుని స్వామి ఎలా గుర్తించగలిగారు? ''నేను జగదీశ్‌ సాలిగ్రాం కుమారుణ్ణి'' అని చెప్పుకుంటే తప్ప నేనైనా ఆ చిన్నవాణ్ణి గుర్తుపట్టలేనే! ఏ సంబంధమూలేని ఆ యువకుని ఫలానా అని స్వామి ఎలా తెలుసున్నారు?

స్వామికి ఉన్నదంతా 'అసాధారణమైన ధారణాశక్తి' తప్ప మరొకటి కాదనీ, ఆ శక్తితోనే వారు ప్రజలను ఇలా భ్రమపెట్టగలుగుతున్నారనీ భావించేవారు - మేధావులనే వారిలోనే - కొందరున్నారు. అణిమాది సిద్ధులనూ, అతీంద్రియ శక్తులనూ వీరు నమ్మరు.

కాని, పైన వ్రాసిన దానికీ ధారణా శక్తికీ సంబంధం లేదు. ఒకమారు దేనినైనా వినడమో, చూడడమో సంభవించినప్పుడు, కొంతకాలం గడచిన తరువాత దానిని యధాతథంగా వివరించడం ధారణకు సంబంధించిన విషయం. కనీ, వినీ ఎరుగని విషయాలను కళ్ళకు కట్టినట్టు చెప్పడంతో మేధస్సుకు సంబంధం లేదు. ఇది అతీంద్రియ జ్ఞానం. దేశ కాలావసరాలకు అతీతం. దివ్యదృష్టి. మన లౌకికజ్ఞానానికి, మన తార్కికశక్తికి మించినది.

* * *





సేవకు ప్రతిఫలం

ఒకవ్యక్తి మరొకడికి నిజంగా ఉపకారం చేస్తున్నాడా? ఏమో! అవతలివాడికి నీ వలన వాస్తవంగా ఉపకారం జరుగుతున్నదా లేదా అన్నది సంశయాస్పదం: కాని, నీవు పరులకు మనస్ఫూర్తిగా సాయపడదలచినప్పుడూ, సాయం అందజేసి నప్పుడూ నీ మనస్సూ, నీ బుద్ధీ పరిశుద్ధమవుతాయి. ఈ ప్రతిఫలం ఒక్కటీ చాలు నీవు చేసే సహాయానికి.

Nadichedevudu   Chapters