Nadichedevudu   Chapters  

 

3. నా ప్రథమ సందర్శనం

నాకు నలభై సంవత్సరాలు వచ్చేవరకు ఆధ్యాత్మికంగా ఒక గురువును ఆశ్రయిద్దామన్న అభిలాష నాలో తలయెత్తలేదు. అయినా, జీవితంలో ఎవరినో ఒకరిని గురువుగా ఎన్నుకొనడం అవసరమని నాకు సలహా చెప్పినవారు లేక పోలేదు. ఒకరిద్దరు గురువులు తమకు తామే, నన్ను శిష్యుడిగా స్వీకరించే ప్రయత్నం కూడా జరిగింది. అయినా, నేను అందుకు మొగ్గలేదు. ఆ 'గురువుల'పై అంతటి లక్ష్యభావం నాకు కలగలేదు సరికదా, వారిని పరివేష్ఠించి వున్న శిష్యబృందాన్ని చూచిన తర్వాత నా అభిప్రాయం మరింత బలపడింది.

ఇక నన్ను వదిలిపెట్టి, 'ఎవరివద్ద నైనా ఉపదేశం పొంది, జీవితం కడతేర్చుకోండి' అంటూ కొందరు నా భార్యను ప్రోత్సహించారు.

అదీ ఫలించలేదు. ''మనం గురువును ఆశ్రయించవలసిన రోజు వస్తే, అప్రయత్నంగానే అలాంటి గురువు లభిస్తాడులే'' అని ఆమెను సమాధాన పరిచాను.



* * *

నేటికి ముఫ్పయ్యేండ్ల కిందటి మాట. అప్పటికి నేనింకా మద్రాసులోనే వున్నాను. ఒక వైకుంఠ ఏకాదశి నాడు నా సోదరుడు కంచి వరద రాజస్వామి దర్శనానికి బయలుదేరుతూ, మా దంపతులిద్దరినీ ఆహ్వానించాడు. పర్వదినం కావడం వల్ల నాతమ్ముడూ, మరదలూ, మేమిద్దరమూ, అందరం కలిసి కంచికి వెళ్లాము. కంచి వరదుని సేవించుకున్నాము. అంతటితో తిరిగి చెన్నపట్నం రావలసిందే కాని, అలా జరగలేదు.

వరదరాజస్వామి దేవాలయ ప్రాంతాన్ని విష్ణు కంచి అంటారు. ఆ స్వామికోవిలకు సమీపంలోనే కామకోటి పీఠానికి చెందిన చిన్నమఠం ఒకటున్నది. పెద్దమఠం శివకంచిలో శ్రీ కామాక్షీ, ఏకాంబరేశ్వర ఆలయాలకు మధ్య వున్నది.

ఆనాడు కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విష్ణుకంచిలోని చిన్న మఠంలో పూజ చేస్తున్నారని విన్నాము. దగ్గరగా ఉంది కాబట్టి మఠానికి వెళ్లి, ఆ పూజకూడా చూసి, ఇంటికి చేరుకుందామనుకున్నాము.

కామకోటి పీఠం శ్రీ శంకరాచార్య స్వామి గురించి వినడమే తప్ప అంతకు ముందెన్నడూ ఆయనను నేను చూడలేదు. మద్రాసునుంచి వెలువడే ఆంగ్ల 'హిందూ' పత్రికలో అప్పుడప్పుడు ఆస్వామి ఉపన్యాసాలు కొన్ని చదివాను. అవి నన్నాకర్షించాయి. అవి అందరు స్వాములు చేసే ప్రసంగాలు లాలేవు. వేదాంతపరిభాషలో ఏవో కొన్ని పడికట్టురాళ్లు వేసినట్టు గాక, అతిగహనమైన ఆధ్యాత్మిక విషయాలను మామూలు మాటల్లో, సహజంగా, సహేతుకంగా వివరిస్తూ ఆధునికులనూ, విద్యాధికులనూ ఆకట్టుకునేట్టు కనిపించాయి.

ఈ విలక్షణత నా మనస్సులో మెదులుతూ ఉంటంబట్టి, అలా సంభాషించిన ఆస్వామిని ఓసారి చూదామనే కోరిక కలిగింది.

మేము మఠానికి వెళ్లేసరికి పూజ దాదాపు సగపడ్డది. వేదిక మీద జ్యోతులు వెలుగుతున్నవి. మఠం పరిచారకులు తెచ్చి అందజేస్తూన్న ధూప దీప నైవేద్యాలను శ్రీ త్రిపురసుందరీ, చంద్రమౌళీశ్వరులకు స్వామివారు సభక్తికంగా సమర్పిస్తున్నారు. మంగళవాద్యాలు మ్రోగుతున్నవి. వేదపఠనం సాగుతున్నది. ఘంటానాదం వినిపిస్తున్నది.

ప్రేక్షకులు నిశ్శబ్దంగా వేదిక మీద జరుగుతూ ఉన్న పూజాకలాపంలో ప్రతి చిన్న విషయాన్నీ, భక్తి శ్రద్ధలతో, వేయికళ్లతో తిలకిస్తున్నారు. హారతులిచ్చినప్పుడు 'హర హరా, శివ శివా' అంటూ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నారు. పూలమాలలతో, దీపకాంతులతో, సుమంగళుల రత్నాభరణాల ధగధగలతో ఆ ప్రదేశమంతా మెరిసిపోతున్నది.

ఆధ్యాత్మిక పరిమళభరితమైన ఆ వాతావరణంలో భక్తుల మనస్సులు లీనమైనప్పుడు పూజామందిరం అంతా జగన్మాతృ స్వరూపంగా కానవచ్చింది. ప్రకృతి పరవశ##మైంది. దిక్కులు దివ్యగానంతో నిండినవి.

భక్తులందరి దృష్టీ వేదికపై నున్న ఒకేఒక వ్యక్తి మీద కేంద్రీకృతమై ఉంది. ఆయనే కామకోటి పీఠాధిపతి, శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతి.

మఠానికి మేము ఆలస్యంగా రావడం, అందరికంటె వెనుక దూరంగా నిలబడడం, వీటి వల్ల భక్తులందరి చూపులనూ ఆకట్టుకున్న ఆయనమూర్తి స్పష్టంగా మాకు గోచరించకపోయెనే అన్న విచారం కాస్తవేసింది.

* * *

శ్రీ ఆదిశంకర భగవత్పాదులు తాము రచించిన ''సౌందర్యలహరి''లో అమ్మవారిని స్తుతిస్తూ సరిగ్గా ఇలాంటి స్థితినే వర్ణించారు.

ధృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పలరుచా!

దవీయాంసందీనం స్నపయకృపయా మామపి శివే!

అనే నాయం ధన్యో భవతి నచతే హానిరియతా!

వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః||

జగదీశ్వరి అయిన అంబికా సమక్షంలో శ్రీ శంకరులు ఎడంగా, దూరంగా నిలబడి వున్నారట. దూరమైతే నేమి?

''ఎక్కడో దూరదూరాన దీనంగా నిలిచి ఉన్న నన్ను, అరవిడిచిన నీలోత్పలాల వంటి సుదీర్ఘమైన నీ కడగంటి చూపులతో స్నానం చేయించు తల్లీ!

అన్నిటిపైనా చంద్రుడు తన చల్లని కిరణాలతో కాంతివర్షం కురిపిస్తాడు కదా'' అంటారు ఆదిశంకరులు!

* * *

ఇలా తలపోస్తూ ఉండగా హఠాత్తుగా స్వామి, భక్తుల వైపు తిరిగి, ఈచివరనుండి ఆ చివరకు సభామండపమంతా ఒక్కసారి కలయ చూశారు. ఆ చూపు సామాన్యులు చూచిన చూపుగా లేదు. అంతమంది ప్రేక్షకులలో ఒక్కొక్కరి మీదా ఏదో విద్యుత్కాంతి ప్రసారమైనట్టూ, ఉన్నట్టుండి మెరుపు మెరిసి నట్టూ అవుపించింది. అయినా, ఆవీక్షణం తీక్షణంగా లేదు. ప్రసన్నాతిప్రసన్నంగా, చంద్రుడి నుంచి వెడలివచ్చిన పండు వెన్నెలలా భక్తుల హృదయాలను చూరగొన్నది.



స్వకర్మను వదలరాదు

జ్ఞానోదయమై కర్మావసరం లేకున్నా, స్వకర్మను వదలి పెట్టరాదని అర్జునుడికి కృష్ణభగవానుడు బోధించాడు. అసంగ కర్మాచరణం లోక సంగ్రహానికి అవసరం.





Nadichedevudu   Chapters