Nadichedevudu   Chapters  

 

27. జర్మనీ పర్యటనమా, జగద్గురు ఆదేశమా?

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం శిష్టాచారపరులు సముద్రాలు దాటి విదేశాలకు వెళ్ళరాదు. విధిలేక వెళితే, తిరిగివచ్చి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి.

కాని, ఈ కాలంలో ఈ నిషేధాన్ని పాటించేవారు నూటికి కోటికి ఒక్కరూ లేరు. శిష్టాచారుల మాటేమిటి, సన్యాసదీక్ష పుచ్చుకున్న స్వాములెందరో, తీర్థయాత్రలు సేవించినట్టు ఏటేటా విదేశాలు తిరిగి వస్తుంటారు కొందరు డబ్బు మూటలుకట్టి తెస్తుంటారు.

* * *

1967లో విజయవాడలో నేను 'ఆంధ్రప్రభ' సంపాదక పదవిలో ఉన్నప్పుడు, తమ దేశాన్ని సందర్శించడానికి పశ్చిమజర్మనీ ప్రభుత్వం నాకు ఆహ్వానం అందజేసింది.

భారతీయ పత్రికా ప్రతినిధి వర్గంతో లోగడ 1940లో మలయా, సింగపూర్లు పర్యటించి వచ్చానుగాని, పశ్చిమదేశాలు సందర్శించే అవకాశం అప్పటికి నాకు కలగలేదు. అందుచేత, పశ్చిమ జర్మనీ వారి ఆహ్వానం నాకు ముదావహమే అయింది.

జర్మనీకి ఎలాగూ వెళుతున్నాను కదా, ఆ దేశంతో పాటు ఫ్రాన్సు, ఇంగ్లండు దేశాలనుకూడా చూడాలనుకున్నాను. మనదేశంలో ఉన్న ఆ దేశాల రాయబారులకు నా అభిమతం తెలియజేశాను. వారంతా తమ తమ దేశాలలోని చారిత్రక, కళా, సాహిత్య రంగాలకు చెందిన ప్రసిద్ధ స్థలాలను చూడడానికి కావలసిన సౌకర్యాలన్నీ కలగజేస్తామన్నారు.

పశ్చిమజర్మనీలో కొంతకాలం ఆచార్య పదవిలో ఉండి, ఆ దేశంతో బాగా పరిచయంగల నా మిత్రులు డాక్టర్‌ వి.యన్‌.శర్మ, జర్మనీ దేశస్తురాలైన ఆయన సతీమణీ, ఇరువురితో మాట్లాడాను. జర్మనీలో కలుసుకోదగిన ప్రధాన వ్యక్తులు పలువురను గురించీ, చూడదగిన సంస్థలను గురించీ తెలుసుకున్నాను. విసా, పాస్‌పోర్టు వగైరాలన్నీ సిద్ధం చేసుకున్నాను.

కొద్ది రోజులలో ప్రయాణం జరగవలసి ఉంది. ఇంతలో కంచి శ్రీ శంకరాచార్య స్వామిని సందర్శించి, వారి ఆశీర్వాదం పొందాలనుకున్నాను.

స్వామివా రప్పుడు ఆంధ్రప్రదేశంలో కాళహస్తి మకాంలో ఉన్నారు. స్వామిని దర్శించి, నా విదేశయాత్రా సంకల్పం విన్నవించాను.

''పశ్చిమ జర్మనీకి నిన్ను మీ ఆఫీసువారు పంపుతున్నారా? నీ అంతట నీవే వెళుతున్నావా?'' అని స్వామి అడిగారు.

నేను: ఆఫీసు పనిమీద వెళ్ళడం లేదు. ప్రధాన తెలుగు పత్రికకు సంపాదకునిగా పశ్చిమ జర్మనీ ప్రభుత్వం నన్ను వ్యక్తిగతంగా ఆహ్వానించింది.

స్వామి: ఆఫీసు తరపున కాకపోతే, ప్రయాణం విరమించుకోవడం మంచిది.

* * *

పశ్చిమ దేశాల పర్యటనకు నేను పొందిన ఉత్సాహం, ఆ సందర్భంలో పలువురితో నేను సలిపిన సంప్రతింపులూ, ఈ అవకాశం నాకు లభించినందుకు పాత్రికేయులూ, మిత్రులూ నాకు అందజేసిన అభినందనలూ, ఇంగ్లండు, ప్రాన్సు దేశాల రాయబారుల సానుభూతి, సహకారాలూ, అన్నీ ఒక్క క్షణంలో మెరుపు మెరిసినట్టు నా కళ్ళకు పొడగట్టినయ్‌.

మనం సొంతంగా ఎంత డబ్బు వెచ్చించినా, ఆయా దేశాల ప్రభుత్వ సహకారం లేనిది, అంత పరిశీలనగా దేశాలను చూడగలమా? ఇంత చక్కటి అవకాశం జీవితంలో మరల మరల లభిస్తుందా? అయాచితంగా వచ్చిన ఈ ఆహ్వానాన్ని పూర్వాచారంపైగల అభిమానంతో తోసిపుచ్చవలసిందేనా?

ఈ విధమైన ఆలోచనలు మనస్సును కలతపరిచాయి. రాయడానికి ఇంత రాశానేగాని, ఈ ఆశలూ, నిరాశలూ ఇవన్నీ మనసులో మెదలడానికి నిమిషం కూడా పట్టలేదు.

అంతలోనే, మరో విచారధార సముద్రంలో కెరటంలా పైకెగిసింది.

ఏమిటీ వ్యామోహం? ఎందుకీ చాపల్యం? ఎన్ని దేశాలు సంచరిస్తే ఏమి? ఎన్ని ప్రసిద్ధ స్థలాలు సందర్శిస్తే ఏమి? ఎందరు ప్రముఖులను కలుసుకుంటేనేమి?

పరదేవతా స్వరూపులైన గురుదేవుల ఆజ్ఞాపాలనంతో పోలిస్తే ఇవన్నీ ఏపాటి! వీటి విలువ ఎంత? అన్న యోచన స్ఫురించింది. పై కెగసిన కెరటం నేలకు వాలింది!

నా ఆనందానికి అవధులు లేవు!

* * *

Nadichedevudu   Chapters