Nadichedevudu   Chapters  

 

21. ''ఎల్లాం సామి అనుగ్రహందా!''

సుబ్బయ్య స్థపతికి తెలుగు బాగా రాదు, కంజీవరం వాస్తవ్యుడు కావడం చేత.

మా ఆవిడకు అరవం వచ్చు. అరవం అర్థం చేసుకొనడమేగాక, అరవవారితో ధారాళంగా ఆ భాషలో మాట్లాడుతుంది.

శ్రీశైలంలో శిల్పం పనిమీద, సుబ్బయ్య స్థపతి కంచినుంచి బయలుదేరి విజయవాడ వచ్చాడు. ఒకరోజు మా ఇంట్లో ఆగాడు.

నా భార్య శ్రీమతి వెంకాయమ్మా, సుబ్బయ్య స్థపతీ, కామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామిని గురించి భక్తితో, ఆసక్తితో మాట్లాడుకున్నారు. ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకున్నారు.

సుబ్బయ్య స్థపతి తమిళంలో చెప్పిన అనుభవ సారాంశం ఇది:

* * *

రామేశ్వరంలో అగ్ని తీర్థానికి ఎదురుగా సముద్రతీరంలో ఆదిశంకర మంటపం నిర్మించాలని స్వాములవారు సంకల్పించారు.

మంటపం అగ్రభాగంలో ఆదిశంకర భగవత్పాదుల విగ్రహమూ, ఆయన నలుగురు శిష్యుల విగ్రహాలూ నెలకొల్పడానికి నిశ్చయించారు. చలవరాతితో తయారుచేసిన ఆ అయిదు విగ్రహాలూ ఒక్కొక్కటీ మనిషి ప్రమాణం కంటే పెద్దవి.

''మంటపంతోపాటు విగ్రహాలు తయారుచేసే మొత్తంపని నాకు అప్పగించారు స్వామివారు. పుణ్యకార్యం కావడంచేతా మొత్తం బాధ్యత స్వామి నాపైన పెట్టడంవల్లా భక్తితో నడుంకట్టి పనిలోకి దిగాను.

అడపాతడపా కంచికి వచ్చేవాణ్ణి. మఠంలో స్వామిని సందర్శించి మంటపం పనిగురించి వారికి నివేదించేవాణ్ణి.

ఆ సందర్భంలో ఒకసారి స్వామికీ నాకూ ఇలా సంభాషణ జరిగింది:

స్వామి: ఏం స్థపతీ, ఎట్లా నడుస్తున్నది మంటపం పని? అనుకున్నట్టు జరుగుతున్నదా? అక్కడ మీకు ఇబ్బందులేవీ లేకుండా సౌకర్యాలన్నీ అమరుతున్నవా? మనం పెట్టుకొన్న ముహూర్తానికి మొత్తం పని పూర్తి అవుతుందా?

స్థపతి: సామీ, పని సాఫీగానే జరుగుతున్నది. మాకే కొరతా లేదు. ఏ నెలకానెల పనివాళ్ళందరికీ జీతాలు సక్రమంగా ముట్టుతూనే ఉన్నవి. తమ దయా, కామాక్షీ అమ్మవారి కటాక్షం ఉంటే, మనం పెట్టుకున్న ముహూర్తం నాటికి అంతా సిద్దమవడానికి ఏ ఆటంకం ఉండదు. కానీ......

స్వామీ: ఏమిటి 'కానీ' అంటున్నావ్‌?

స్థపతి: (మౌనం)

స్వామి: ఎందుకట్లా మాట్లాడకుండా ఉంటావు? సందేహం లేకుండా, ఉన్నదున్నట్టు చెప్పు.

స్థపతి: అంతా సవ్యంగానే జరుగుతూ ఉన్నది సామీ! ఒక్కటే చిన్న ఆటంకం.....

స్వామి: నీళ్ళు నమలకుండా చెప్పు స్థపతీ! నాతో చెప్పడానికి నీకేం భయం? ఏమి జరిగిందో వివరంగా చెప్పు.

స్థపతి: శంకరుల వారి విగ్రహం నేనే స్వయంగా చెక్కుతున్నాను సామీ. ఇన్నాళ్ళబట్టీ పని చకచకా సాగుతూనే వచ్చింది. అయితే, విగ్రహానికి ముఖంమీద, కంటికి సమీపంలో అంగుళం వెడల్పున ఒక నల్లని మచ్చ కనిపించింది. అది రాతిలోనే ఉన్నది. ఇంతకాలంగా అది పైకి రాలేదు. ఇప్పుడే బయటపడింది. అదెంత లోతుగా ఉన్నదో చెప్పలేను. కొంత చెక్కి చూశాను. తగ్గడం లేదు. ఏమి చెయ్యడానికీ తోచడంలేదు. ఆ అభ్యంతరం ఒక్కటీ తీరిపోతే, విగ్రహాలన్నీ ముహూర్తం నాటికి తయారైనట్టే.

స్వామి: ఇది నిజమైన ఆటంకమే! అందులో మూల విగ్రహానికి. ఇంకోచోట, ఇంకోచోటగాక నొసటిమీదనే ఆ మచ్చ ఉండరాదు. నిజమే.

కానీ ప్రయత్నం చెయ్యి. అమ్మ అనుగ్రహిస్తే, అంతా అనుకూలంగా జరగవచ్చు.

స్థపతి స్వామికి నమస్కారంచేసి, సెలవు తీసుకుని రామేశ్వరం వెళ్ళాడు.

నెల రోజుల తరవాత మళ్ళా ఒకసారి కంచివచ్చి మఠంలో స్వామి దర్శనం చేశాడు. మంటపం పని ఏదేది ఎంతవరకు వచ్చిందో సవిస్తరంగా స్వామికి నివేదించాడు.

అంతావిని, స్వామి అడిగారు: ''సరేగాని, కిందటిసారి నీవు వచ్చినప్పుడు శంకరుల విగ్రహానికి నొసటిపైన రాతిలో మచ్చ కనిపించిందన్నావే, అదేమైంది? దాని సంగతి చెప్పలేదేం?''

స్థపతి: (నవ్వు ముఖంతో) సామీ, దాని పరిమాణంలో కొంత తగ్గింది ఇంకా ఒక కాసు వెడల్పు ఉన్నది.

స్వామి: సరే. నీవు చేయవలసిన ప్రయత్నమంతా చేస్తూఉండు. దాని సంగతి విచారించకు. ఇక వెళ్ళు.

ఇదే విధంగా స్థపతి మరి మూడు నాలుగుమార్లు కంచివెళ్ళి, స్వామిని సందర్శించడం, మండప నిర్మాణం ఎంతవరకు వచ్చిందీ స్వామికి నివేదించడం జరిగింది.

వెళ్ళినప్పుడల్లా స్వామి ఆ మచ్చను గురించి స్థపతిని అడుగుతూ ఉండేవారు. మచ్చ ఏమాత్రం తరిగిపోయిందో స్థపతి స్వామికి విన్నవించేవాడు.

చివరకు మంటపం పని యావత్తూ పూర్తి అయింది. అనుకున్న ప్రకారం మంటపానికి ప్రారంభోత్సవం జరగవలసి ఉన్నది.

కడపటి దఫా స్థపతి స్వామిని సందర్శించడానికి వచ్చాడు.

స్వామి మళ్ళా స్థపతిని అడిగారు. ''ఏమైంది విగ్రహం ముఖంమీద ఆ మచ్చ?''

స్థపతికి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ''సామీ, సామీ! వెంట్రుకవాసి కూడా లేకుండా మచ్చ పూర్తిగా మాయమయింది. ఎల్లాం సామి అనుగ్రహందా!'' అంటూ ఆనంద బాష్పాలు తుడుచుకున్నాడు!



అంగన్యాస, కరన్యాసాలు

ప్రాణుల ఒక్కొక్క అంగంలో ఒక్కొక్క దేవతా స్వరూపం సంస్థితమై ఉంటుంది. ఆ దైవరూపాలకే 'ఆధ్యాత్మికం' అని పేరు. వారు ఆయా అవయవాలలో ఉండి, ప్రాణులను రక్షిస్తూ ఉంటారు. మంత్ర జపాదులలో మనం చేసే అంగన్యాస కరన్యాసాలు ఆ దేవతలను ఉద్దేశించే చేస్తున్నాము.

Nadichedevudu   Chapters