Nadichedevudu   Chapters  

 

2. జోస్యం నిజమైంది!

కుమారుడు చాలా చురుకైన వాడు. ఈడుకు మించిన తెలివి తేటలు కనబరుస్తున్నాడు. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా కుశాగ్రబుద్ధి అంటున్నారు.

బాలుడి జాతకం ఎవరికైనా చూపించుదామన్న కోరిక కలిగింది తండ్రికి. తన మిత్రుడొక న్యాయవాది. ఆయనకు జ్యోతిషం తెలుసు. ఒకరోజు ఆయనను తన ఇంటికి పిలిచాడు. కుమారుడి జాతకం ఆయన చేతికిచ్చాడు.

పిల్లవాడి జాతకం పరిశీలించాడో లేదో, బాలుని తల్లి వైపుచూసి '' ఒక చెంబుతో నీళ్లు పట్టుకరామ్మా'' అన్నాడు ఆ న్యాయవాది మిత్రుడు.

'నీళ్లెందుకు తెమ్మంటున్నాడా?' అని యోచిస్తున్నాడు పిల్లవాని తండ్రి.

తల్లి నీళ్లు తెచ్చింది. చెంబు అందుకుని ఆ చెంబెడు నీళ్లూ బాలుని పాదాల పై పోశాడు జాతకం చూసిన న్యాయవాది. అంతటితో వూరుకోక, ఆ బాలుని పాదాలకు సాగిల పడ్డాడు!

బాలుని తండ్రి నిర్ఘాంతపొయ్యాడు. మిత్రుని ప్రవర్తన ఆయనకు అర్థం కాలేదు. తికమకపడుతూ ''ఇదేమిటి మీ చర్యలు మాకు బోధపట్టం లేదు'' అన్నాడు.

''విను మిత్రమా, విను. ఒకానొకప్పుడు అశేష ప్రపంచం నాలాగే ఈ చిన్న వాని పాదాలకు ప్రణమిల్లుతుంది. అప్పటికి నేను బ్రతికి వుండను కదా!'' అన్నాడు జాతకం చూసిన న్యాయవాది.

* * *

పిల్లవాని తండ్రి శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి. తమిళనాడులో స్కూళ్ల సూపర్‌వైజర్‌. స్వగ్రామం విళ్లుపురం. హొయసకర్ణాటకశాఖ బ్రాహ్మణులు. పూర్వీకులెన్నడో కన్నడ దేశం నుంచి తమిళ##దేశానికి వచ్చి, అక్కడే స్థిరపడ్డారు.

శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రి ముగ్గురు కుమారులలో ఈ పిల్లవాడు రెండో వాడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు స్వామినాధ. తండ్రికి గారాబు పట్టి.

ఈ మహాపురుషుడే మన కథా నాయకుడు!

Nadichedevudu   Chapters