Nadichedevudu   Chapters  

 

18. భద్రాద్రినిధి సేకరణలో నాకు బలమెవ్వరు?

1959లో 'ఆంధ్రప్రభ' దినపత్రికను, వార పత్రికను మద్రాసునగరం నుండి విజయవాడకు తరలించడానికి నిర్ణయించారు.

విజయవాడనుంచి వెలువడే ఆ రెండు పత్రికల సంపాదకత్వం వహించవలసినదిగా పత్రికాధిపతి శ్రీరామనాథ గోయంకా నన్ను కోరారు.

దక్షిణభారత హిందీ ప్రచారసభ కార్యదర్శి, రాజ్యసభాసభ్యులూ శ్రీ మోటూరిసత్యనారాయణగారూ, సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు శ్రీ ఖాసా సుబ్బారావుగారూ శ్రీ గోయంకా ఆహ్వానాన్ని అంగీకరించవలసిందిగా నన్ను ప్రోత్సహించారు. వారుభయులూ నాకు చిరకాల మిత్రులు. నా శ్రేయోభిలాషులుగా వారిని నేను పరిగణించేవాణ్ణి.

ప్రయాణానికి మంచిరోజు చూసుకున్నాను. పెద్దల, బంధుమిత్రుల సెలవు పుచ్చుకున్నాను. మిగిలిందల్లా శ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రస్వామి దర్శనంచేసి, వారి ఆశీస్సులు పొందడం ఒక్కటే.

స్వామి అప్పుడు మద్రాసుకు ఏడెనిమిదిమైళ్ళు దూరాన వానావరం అనే ఒక చిన్న పల్లెటూళ్లో పరివారంతో సహా మకాం చేస్తున్నారు. రేపు ప్రయాణమనగా, ఆరోజు ఉదయం స్నానసంధ్యలు ముగించుకుని బస్సులో వానావరం చేరాను. ఒక చిన్న పూరిపాకలో స్వామి విశ్రాంతిగా ఉన్నాడు.

నా రాకకు కారణం స్వామికి విన్నవించుకున్నాను. స్వామి ఆశీస్సులు అనుగ్రహించారు.

అటు తరువాత, రామేశ్వరంలో అగ్నితీర్థానికి ఎదురుగా తాము నిర్మించ తలపెట్టిన ఆదిశంకరుల మంటపాన్ని గురించి వివరంగా చెప్పారు.

ఒక్కొక్క రూపాయి మొదలుకుని భక్తులు సమర్పించే ఎంత స్వల్ప విరాళ##మైనా సేకరించి మండప నిర్మాణం పూర్తి చెయ్యడం తమ ఆశయమని చెబుతూ, ''మద్రాసులో నీకు తెలిసిన మిత్రులద్వారా కొంత డబ్బు పోగు చేసుకురమ్మ''న్నారు.

''స్వామీ, అలాగే చేస్తా. కాని, రేపే విజయవాడకు ప్రయాణం పెట్టుకున్నాను కదా!'' అన్నాను.

''దానికేం, రేపుకదా నీ ప్రయాణం? ఇప్పుడే మద్రాసుకు బయలుదేరి వెళ్ళి, కొద్దిమందినైనా కలసుకొని ఈ పని నెరవేర్చుకురా'' అన్నారు.

శిష్యులొకరిని పిలిచి, బయట ఎవరిదైనా కారు ఉన్నదేమో చూడమన్నారు. శేషయ్యగారిని ఏదోఒక కారులో మద్రాసుకు తీసుకువెళ్లి, ఆయన చెప్పిన చోటుకువెళ్లి, తిరిగి రమ్మని ఆదేశించారు.

ఎవరిదో ఒక కారులో నన్ను కూచోబెట్టారు. చెన్ననగరానికి షెరీఫ్‌ చేసిన శ్రీ పంచాగ్నుల సూర్యనారాయణగారినీ, మిత్రులు శ్రీ జె.వి. సోమయాజులుగారినీ ఇద్దరిని మాత్రమే చూడగలిగాను.

వారు ఉభయులూ చెరి అయిదువందలు చందా వేశారు. ఎక్కువమందిని చూసే అవకాశం లేక, తిరిగి వానావరం వచ్చి, స్వామికి నివేదించాను.

ప్రసన్నవదనంతో మరల ఆశీర్వదించారు.

( ఈ శంకరమంటప నిర్మాణానికి ఎంత ఖర్చు అయినా, ఆ మొత్తమంతా తానొక్కడినే భరిస్తాననీ, తనకు ఆ అవకాశం కలిగించవలసిందనీ మద్రాసులోని ఒక కోటీశ్వరుడు స్వామిని అర్థించగా, స్వామి అందుకు అంగీకరించలేదని విన్నాను.)

* * *

మద్రాసులో ఉండగా తెలుగు పత్రిక లన్నిటిలో అనన్యప్రచారం కలదిగా పేరుపొందిన ఆంధ్రప్రభ విజయవాడకు మారినదరిమిలా, దాని సర్క్యులేషన్‌ నామమాత్రంగా మిగిలింది. పూర్వపు టౌన్నత్యం కోలుపోయింది. ప్రజాదరణ సన్నగిల్లింది.

ఈ స్థితిలో శ్రీరామనాథ గోయంకా పత్రికను నా చేతికి అప్పగించారు. ఆయన ఆశలను కొంతవరకైనా సఫలం చేస్తేనే నా పరువుదక్కుతుంది.

కొత్త పత్రికను వృద్ధికి తేవడం వేరు. పడిపోయిన దానిని పునరుద్ధరించడం అంత తేలికైన పనికాదు. అయినా, బరువు నెత్తికెత్తుకున్నాను. ఇప్పుడిక వెనకా ముందులు ఆలోచించి లాభం లేదు. భగవంతుడిమీద భారం వేశాను. రాత్రింబగళ్లు, అవిశ్రాంతంగా, శాయశక్తులా పాటుపడుతున్నాను. సహోద్యోగులు సహకరించారు. అచ్చుకూర్చే కంపోజిటర్లతో సహా పనివారంతా నడుంకట్టి పనిచేశారు. క్రమంగా చందాదారుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

సరిగ్గా ఇదే సమయంలో ఆనాటి దేవాదాయశాఖమంత్రి శ్రీ కల్లూరి చంద్రమౌళిగారు భద్రాచలం దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టారు.

చంద్రమౌళిగారంటే నేటి యువతరానికి అంతగా తెలియకపోవచ్చు. ఆనాడు ఆయన సుప్రసిద్ధ కాంగ్రెసు నాయకుడు. దేశస్వాతంత్ర్య పోరాటంలో పలుమారులు కారాగార శిక్షలనుభవించిన దేశభక్తుడు, 'రామాయణ సుధాలహరి' అనే చక్కని గ్రంథం రచించిన సాహితీవేత్త. ఆయన దేశభక్తికీ దీటైనది ఆయన రామభక్తి.

అట్టి వ్యక్తి భద్రాద్రిరామాలయ పునరుద్ధరణకు పూనుకున్నారని తెలియగానే నాఒళ్లు పులకరించింది.

ఎంతో కాలంగా నేను కంటున్న కలలు నిజం కాబోతాయా అన్నట్టు తోచింది. చెన్నపట్నంలో షెనాయ్‌నగర్‌లో ఏటేటా మా ఇంట్లో శ్రీరామనవమి ఉత్సవం చేసేవాళ్ళం. ఆ పేటలో వారంతా వచ్చి ఉత్సవంలో పాల్గొనేవారు. ఎప్పుడు భద్రాద్రి పోదామా, సీతారాములను కళ్లారా ఎప్పుడు కాంచుదామా అనుకునేవాణ్ణి.

భద్రాద్రి చూడడమేగాక, భద్రాద్రి రాముడికి సేవ చేసే అదృష్టంకూడా పట్టబోతున్నదేమో అనిపించింది.

వెంటనే శ్రీ చంద్రమౌళిగారికి తెలియచేశా: ''మీ ఉద్యమంలో పాలు పంచుకునే అవకాశం నాకూ కల్పించండి. ఉడతా భక్తిగా సేవచేస్తా, నా పత్రికతో నేను మీతో సర్వవిధాలా సహకరిస్తా'' నంటూ.

సహృదయులు శ్రీ చంద్రమౌళిగారు వెంటనే 'శేషయ్యగారూ, అంతకంటె కావలసినదేముంది? మీ సహకారం నా కెంతో ఉపకరిస్తుంది. ఉభయులం కలసి రాముడి గుడికి విరాళాలు పోగుచేద్దాం.' అన్నారు. విధానసభ స్పీకరు శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు మా సంకల్పం మెచ్చుకున్నారు.

వ్యక్తిగతంగా పెద్దవిరాళాలు అర్థించడంకంటె, పత్రికాముఖంగా చిన్న చిన్న మొత్తాలు ప్రజలనుండి సేకరిద్దామనుకున్నాను.

అయితే, ఇక్కడ ఒక చిన్న సమస్య ఎదురైంది. 'ప్రభ'కు నేను సంపాదకుడనే గాని, యజమానిని కానుకదా! యజమాని అంగీకారం పొందకుండా పత్రికను కొంత కాలంపాటు ఈ ఉద్యమానికి వినియోగించడం సబబు కాదు.

చివరకు ఒక యోచన తట్టింది. ఎంత వ్యాపారస్థుడైనా శ్రీ గోయంకాదైవ భక్తిగల వ్యక్తి. తనకు నచ్చేట్టయితే, ఏ పనికైనా, ఎంత త్యాగానికైనా వెనుకాడని స్వభావం ఆయనది. కాబట్టి బాణం సంధిద్దామని నిశ్చయించాను.

''భద్రాచలం రామాలయ పునరుద్ధరణ ప్రయత్నం జరుగుతున్నది. ''ఆంధ్రప్రభ'' ద్వారా నిధి సేకరణకు నేను ఉద్యమిస్తున్నాను. దయచేసి మీ విరాళం ప్రకటించండి'' అని అప్పుడు ఢిల్లీలో వున్న శ్రీ గోయంకాకు టెలిప్రింటరుద్వారా కబురు పంపాను.

''తగినంత మొత్తం సేకరించగలననే ధైర్యం మీకుంటే అలాగే చెయ్యండి. నా విరాళం అయిదువేలు'' అని మళ్ళా టెలిప్రింటర్‌పైనే జవాబు పంపారు శ్రీ గోయంకా.

ఎద్దులూ, బండీ ఏకమైతే కొండమీదికి పోవడానికి ఎంత సేపు! ''శుభస్యశీఘ్రం'' అని దగ్గరలో ఉన్న ఉగాది నాడే నిధి సేకరణకు అంకురార్పణ చేశాం. అన్నిచోట్లకూ వెళ్లి, అందరినీ చూసే అవకాశం లేనందున, ఫోను మీదనే కొన్ని విరాళాలు పోగు చేశాను.

ప్రథమంలో నాలుగైదు రోజులు కాస్త ప్రయత్నం కావలసివచ్చింది. తెలుగు వారికి ఇలవేలుపైన శ్రీరాముణ్ణిగురించీ, పరమపావనమైన భద్రాచలక్షేత్ర మహాత్మ్యాన్ని గురించీ, రామభక్తాగ్రేసరుడైన రామదాసు సేవలను గురించీ, భద్రాద్రితో గోలకొండ నవాబులకు ఏర్పడిన అపూర్వమైన సంబంధాన్ని గురించీ, మన మతానికీ, మన సంస్కృతికీ గల ఐక్యతను గురించీ ఒకటి రెండు సంపాదకీయ వ్యాసాలద్వారా ప్రజలను మేలుకొలపడం జరిగింది.

అటు తరువాత మా ఉద్యమం మూడు పువ్వులూ, ఆరుకాయలతో రాష్ట్రం నలుమూలలకూ పాకింది. ఎక్కడో మారుమూల ప్రదేశాలనుండి కూడా తెంపులేకుండా విరాళాలు వెల్లువలై రాసాగినవి. అయిదులూ, పదులూ సమర్పించిన వారి సంఖ్య అపరిమితంగా పెరిగింది.

ఉద్యోగస్థులు, వ్యాపారస్థులు, కర్షకులు, కార్మికులు, వైద్యులు, విద్యార్థులు, స్త్రీలు, ఒకరేమిటి, ఆబాలగోపాలం అహమహమికతో రాముని సేవకు నడుంకట్టారు.

చాకలి, మంగలి వృత్తులు చేసుకునే వారనేకులు 'మా ఒకరోజు ఆదాయం మీ నిధికి పంపుతున్నాం' అంటూ ఉత్తరాలు రాశారు.

మరీ ఆశ్చర్యమేమంటే, చందాలు పంపిన వారిలో హిందువులే కాకుండా కొందరు ముస్లిములూ, క్రైస్తవులుకూడా ఉన్నారు!

స్వల్పవ్యవధిలోనే నిధి మొత్తం లక్షకు చేరింది. లక్షా ఎనభైయేడువేలు దాటిన తరువాత వసూళ్లు విరమించాము.

ఈ రోజుల్లో లక్ష రూపాయలంటే లెక్కలేకపోవచ్చు. కాని, దాదాపు ముప్పయ్యేళ్లకిందట ఎవరి పలుకుబడి వినియోగించకుండా, ఏ విధమైన వొత్తిడులు లేకుండా ప్రజలనుంచి స్వచ్ఛందంగా అత్యల్పకాలంలో రమారమి రెండు లక్షల రూపాయలు సేకరించడం సామాన్య విషయం కాదు.

ఆంధ్రమహాజనులనుంచి ఊరూరా ఆ విధంగా పోగుచేసిన ధనమే భద్రాచలంలో రామదాసు ధ్యానమందిరంగా రూపొంది, అశేష భక్తకోటిని ఆకర్షిస్తున్నది.

* * *

ఇంతకూ, ఎన్నడో జరిగిన ఈ కథంతా నేడు పాఠకుల ముందుంచడంలో నా ఉద్దేశ్యం నా శక్తిసామర్థ్యాలను చెప్పుకోవడం కాదు.

విజయవాడ ప్రయాణానికి అంతాసిద్ధం చేసుకుని, స్వామి దర్శనం కోసం వానావరం గ్రామానికి వెళ్ళిన నన్ను, ''రామేశ్వరంలోని శంకర మంటప నిర్మాణానికి విరాళాలు వసూలు చేసుకురమ్మం''టూ, అప్పటి కప్పుడు కారులో మదరాసుకు ఎందుకు పంపించారో, స్వామి ఉద్దేశం అప్పుడు నేను ఊహించలేక పోయాను. స్వామి అడిగితేనే చాలు శంకరమంటపానికి వేలూ, లక్షలూ కుమ్మరించే దాతలూ, భక్తులూ ఎందరులేరు? ''ఎంతో కొంత వసూలు చేసుకురా'' అని నన్నే ఎందుకు పంపవలసివచ్చింది? కారణం ఊహించలేక పోయినా, 'స్వామి ఆదేశం పాలించాలి' అనుకుని మదరాసువెళ్లి, పని చేసుకువచ్చాను.

అయితే, భద్రాద్రి ఆలయనిధికి అంతస్వల్ప వ్యవధిలో, అంత డబ్బు, అనాయాసంగా వసూలైన తరువాత, ఈ నిధి సేకరణ ప్రయత్నం జయప్రదం కావడానికీ, ఆనాడు స్వామి నన్ను మదరాసు పంపించడానికీ గల కార్యకారణ సంబంధం బోధపడింది కాదు!

''లోకోత్తరాణాం చేతాంసి

కోను విజ్ఞాతు మర్హతి''

లోకోత్తరులైన మహాత్ముల మనస్సు తెలుసుకొనడం ఎవరి తరం?

* * *

Nadichedevudu   Chapters