Nadichedevudu   Chapters  

 

15. ''నాపేరు ఎలా వచ్చిందో చెప్పమంటారా?''

డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఠాకూర్‌ బొంబైలో సుప్రసిద్ధ ఆయుర్వేద భిషగ్వరుడు. మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రాంతాలలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖు లనేకులకు చికిత్సలు చేసి, ఘన వైద్యుడుగా పేరు పొందినవాడు.

ఆయుర్వేదంలో పరిశోథనలు సలిపి, వాటిని పత్రికలలో ప్రచురించి విఖ్యాతిగాంచిన విద్యావేత్త. పలుమార్లు విదేశాలలో సంచరించి ఆయుర్వేద ప్రాశస్త్యాన్ని చాటిన ఘనుడు.

1987లో కార్యాంతరంపై నేను బొంబై వెళ్ళినప్పుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఠాకూర్‌ను చూడడం తటస్థించింది. ఆయుర్వేదాన్ని గురించి, వనమూలికలను గురించి, 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' పత్రికలో డాక్టర్‌ చంద్రశేఖర్‌ వ్రాసిన వ్యాసాలను గురించీ ఇరువురం కొంతసేపు మాట్లాడుకున్నాము.

ప్రసంగవశాత్తు, కొన్ని సంవత్సరాలుగా ప్రాస్టేట్‌ గ్లాండ్‌ వ్యాధి (Enlargement of Prostate gland) నన్ను అంటిపెట్టుకుని ఉన్నదనీ, శస్త్రచికిత్స ద్వారా దానిని నివారించుకొనవలసిందని సర్జనులనేకులు సలహా ఇచ్చారనీ, అయిన్పటికీ, గురువు ఆదేశానన్ననుసరించి సర్జనుల సలహాను నేను పాటించలేదనీ, అందువల్ల ఇప్పటివరకూ నా కేవిధమైన అసౌకర్యంగాని, బాధగాని కలగలేదనీ ఆయనతో చెప్పాను.

డాక్టర్‌ చంద్రశేఖర్‌: ఓహో, అలానా? ఆ గురువు ఎవరు? వారిపేరు?

నేను: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి.

డా. చంద్రశేఖర్‌: జగద్గురు శంకరాచార్యులు వారే కదా?

నేను: ఔను, రెండువేల సంవత్సరాలకు పూర్వం ఆదిశంకర భగవత్పాదులు స్థాపించిన కామకోటి పీఠంలో 68వ ఆచార్య పురుషులుగా ఆ పీఠాన్ని అలంకరించిన మహనీయులు.

డా. చంద్రశేఖర్‌: సరి, సరి, నా పేరూ చంద్రశేఖరే! నా తండ్రిగారు నాకీ పేరు ఎలా పెట్టారో చెప్పమన్నారా?

నేను: చెప్పండి వింటాను.

డా. చంద్రశేఖర్‌: అప్పటికి నేనింకా పుట్టలేదు. మా తండ్రిగారు శంకరాచార్య స్వామి వారిని సందర్శించారు. మీ కొక పుత్రుడు కలుగుతాడు, ఆతడు పెరిగి పెద్దవాడై ఆయుర్వేద వైద్యుడుగా పేరు ప్రఖ్యాతులు గడిస్తాడు, అంటూ స్వామివారు నా తండ్రిని ఆశీర్వదించారట!

ఈ విషయమంతా నా తండ్రిగారు తన డైరీలో వ్రాసుకున్నారు. ఇప్పటికీ అది నా వద్ద ఉంది. అందుకే నాకీపేరు పెట్టుకున్నారు - అంటూ ఆనందంతో తాండవం చేశాడు ఆ 'చంద్రశేఖరు'డు!

* * *



నిజమైన ఆరాధన

స్వధర్మాన్ని ఆచరిస్తూ, దాని ఫలం ఈశ్వరుడికి అర్పించడమే నిజమైన ఈశ్వరారాధన.

Nadichedevudu   Chapters