Kamakoti   Chapters   Last Page

 

5. శ్రీ శంకరభగవత్పాదులు

శ్రీ టి. వి. విశ్వనాధయ్యర్‌

శ్రుతిస్మృతిపురాణానా మాలయం కరుణాలయం

నమామి భగవత్పాదశంకరం లోకశంకరమ్‌ ||

'శం' అనగా శుభప్రదము. ప్రపంచానికి ఉత్సాహాన్ని సుఖాన్ని ప్రసాదించే వారు శంకరులు. శుభప్రదమైన ఆత్మకు శుభాన్ని అనుభవింప చేయటమే వారి సందేశము. 'శాంతం, శివం, అద్వైతం' అని మాండూక్యోపనిషత్తు.

శంకరుల జననకాలాన్ని గూర్చి అనేక వాదోపవాదాలున్నవి. అవన్ని అనవసరమని నా ఉద్దేశ్యం. వారు ఏం చెప్పారో ఏమి బోధించారో వానినన్నిటినీ విశ్వాసంతో ఆచరించటం మనవిధి.

నైతికత, ఆధ్మాత్మికతకు భంగం వాటిల్లిన సంక్షోభపరిస్థితులలో వారు అవతరించారన్నది సత్యము. వైదికమార్గాన్ని పునః ప్రతిష్టించారు. మన దేశంలోనే వారు అవతరించటం మన అదృష్టం. మనవలెనే రక్తమాంసములు గలిగిన దేహంతో అవతరించి, శేతుశీతనగపర్యంతం పర్యటించి పుణ్యభూమిని పునీతం చేశారు. సాక్షాత్పరమేశ్వరులు గూడా ఈ దేశాన్నే ఎన్నుకున్నారు తాము అవతరించటానికి అనిపిస్తుంది. ఆలోచనలో గాని, ప్రబోధంలో గాని, ఆచరణలో గాని సాటిలేని వారి విజయపరంపరలు అవలోకిస్తే శంకరులు సాక్షాత్తూ అవతారపురుషులు. ప్రాచీనగురుపరంపరను ప్రతిష్ఠించటానికి సాక్షాత్తు దక్షిణామూర్తి శంకరులుగా అవతరించి వారు గురువులై జగద్గురువులుగా ఖ్యాతి వహించారు. ఆర్ష సాంప్రదాయంలో భగవంతుడు గురువుగా చెప్పబడ్డారు. కనుక మనమందరమూ భగవంతుని యెడ చూపే భక్తివిశ్వాసములు, వినయము గురువుయందు చూపాలి అని బోధించారు.

యస్య దేవే పరాభక్తిః యధా దేవే తధా గురౌ

తసై#్యతే కధితాహ్యార్థాః ప్రకాశం తే మహాత్మనాం ||

సంఘంలో పూర్ణత్వప్రాప్తికి వారు మార్గం చేశారు. వారి వేదాంతమార్గం తిరుగులేనిదై, అచలమై, అగ్ని పరీక్షకు తట్టుకొనగలిగి ప్రపంచమంతా జోహార్లర్పించింది. వారి అవతరణకు పూర్వం ఉన్న అవైదికమార్గము నిర్మూలించబడటానికి వారి దిగ్విజయయాత్రయే కారణం. షణ్మతస్థాపనాచార్యులనిపించుకోవటానికి వారే తగుదురు. ఇతరులకందరకూ శంకరుల మార్గము, తార్కిక పద్ధతియే కొలబద్ద. మామూలుగా ఇంకెవరిమాటలనైనా అదేమి వేదవాక్కా? అని పరిహాసంగా అంటాము. కాని శంకరుల రచనలు, బోధనలు అన్నీ నిజంగా వేద వాక్కులే. క్రమంలో అద్వైతం మొదటిది గానే కాక తార్కికంగా దాన్నే అత్యున్నతమైనదిగా శంకరులు ప్రతిష్ఠించారని ఒక వేదాంత నిష్ణాతుడు చెప్పారు.

వేదములలో కొన్ని భాగములు గాక వేదమంతా గూడా ప్రామాణికమైనదిగా అంగీకరించారు. ఏ ఒక్కదాన్ని తోసి వెయ్యకుండా అంతా అంగీకరించటమే అద్వైతం. శృతి, స్మృతి, పురాణాలకూ వాని పూర్తి గౌరవాన్నిచ్చారు. అందులో ఏ ఒక్కదాన్ని కూడా ముఖ్యమైనది కాదని గాని, అనుకూలంగా లేదని గాని తోసివెయ్యలేదు. ఉపాసన, కర్మ, జ్ఞాన మార్గాలను పునరుద్ధరించాడు. జాతిశ్రేయస్సుకు వ్యక్తి ఔన్నత్యానికి, ఆచారము, అనుష్ఠానము, విచారము, అనుభవము, వివేకము, వైరాగ్యములయెక్క అవసరాన్ని అనేకచోట్ల మరీమరీ ఉద్ఘాటించారు.

సాటిలేని వారి ధీశక్తికి నిదర్శనం వారి కొద్దిజీవిత కాలంలో అనుగ్రహించిన ప్రస్థానత్రయ భాష్యములే కాక అనేక శాస్త్రస్తోత్ర ప్రకణములు. ఉదాహరణకు మనీషాపంచకం తీసుకోండి. వేదాంతగర్భితమై, ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది. అంతామనమే ననే భావన కలగాలి. ఇందులోని చండాలఉదంతం జ్ఞానానుభవాన్ని పొందటమే, ఆత్మానుభవం అక్కడ ఎప్పుడూ ఉండనేవున్నది.

అద్వైతం అంటే ఏమిటి?రెండు లేకపోవటం ఉన్నదంతా ఒక్కటే. బ్రహ్మకంటే భిన్నమైనదేదీ లేదు. అవిద్యవల్ల భిన్నత్వం గోచరిస్తుంది. మనకంటే భిన్నమైనదేదైనా ఉన్నప్పుడే కోరిక, అసూయ, భయం మొదలైనవి కల్గుతాయి. అంతామనమే అనుకున్నప్పుడు మనకంటే భిన్నమైనది లేనప్పుడు ఇవి ఉద్భవించటానికి ఆస్కారమే లేదు. అద్వైతం బోధించేది అదే. కనుక ఈ అవిద్యారోగానికి మందు అద్వైతము. అన్నిటా పరమేశ్వరభావం కలిగి ఉండటము అద్వైతం, సత్యమయినదాన్ని చూడటమే అద్వైతం. అద్వైతం బోధింపబడేది గాని నేర్చుకొనేదికాని కాదు. ఎవరికివారే తెలుసుకొన దగింది. ఎవరు తెలుసుకుంటే వారే జీవన్ముక్తుడు, భగవంతుడు.

వారు రచించిన బ్రహ్మసూత్రభాష్యమే మొట్టమొదటి గ్రంధము. శంకరులకంటే గొప్ప భక్తుడు లేడని ఆర్తితో వారు రచించిన స్తోత్రములు చెప్పుచున్నవి.

ఒకపరిక్రమములో భారతదేశమంతా మూడుపర్యాయములు పాదయాత్రతో పర్యటించి అచ్చుపనిముట్లు వ్రాతపరికములు లేని ఆరోజుల్లో ఇంత రచన సాగించిప్రచారం చేశారు.

ఇన్ని రచనలు చేసిన భగవత్పాదులు ఒక చిన్న శ్లోకార్ధంలో విషయమంతా చెప్పివేశారు.

శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంధకోటిభిః

బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః ||

వేల గ్రంథాలలో చెప్పినదంతా ఒక్క శ్లోకార్ధంలో చెపుతున్నాను, బ్రహ్మ సత్యం. బ్రహ్మపదార్ధమొక్కటే నిత్యమైనది. సత్యమైనది, జగన్మిధ్యా ఈ కనుపించే పదార్ధమంతా మాయ. అనిత్యము, అసత్యము, జీవః, బ్రహ్మ, ఏవ, న, అసరః. ఈ జీవుడు బ్రహ్మకంటే భిన్నమైనవాడు కాడు.

మొత్తం అద్వైతసిద్ధాంతములో మనము తెలుసుకోదగినవి అనుష్ఠించదగినవీ ఈ మూడు సూత్రములే. 'జగన్మిధ్యా' అన్నే పదాన్ని సరిగా అన్వయించుకోవాలి. భూతభవిష్యద్వర్తమానకాలములు మూడింటిలోనూ ఉండేవస్తువేదో అదే సత్యము. మిగిలినది లేదని భావము. అంతేగాని ఈ కనుపించే జగత్తును అంగీకరించక పోవడం అద్వైతుని లక్షణం గాదు. ఈ ప్రపంచం లేదని గాని మాయ అని నెట్టివేయడంగాని లక్షణం గాదు. ప్రపంచ ఉనికి, నిత్యత్వమునకు భేదం తెలియాలి. ప్రపంచం ఉండటం వ్యావహారిక సత్యం. మిధ్యాత్వం పారమార్ధిక సత్యం.

Kamakoti   Chapters   Last Page