Kamakoti   Chapters   Last Page

 

శ్రీ కంచికామకోటి జగద్గురు శంకరాచార్య

శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఉపదేశము

4. శంకరజయంతి సందేశము

మన భారతదేశము పుణ్యభూమి. పవిత్రమైన మన దేశంలో సాక్షాత్పరబ్రహ్మమూర్తి శ్రీరామచంద్రమూర్తిగా అవతరించి వారి పాదపద్మములతో అయోధ్యనుండిలంకవరకు పర్యటించి నిత్యమైన ధర్మ ప్రబోథాచరణములు చేస్తూ వారి పాదస్పర్శతో మరింత పునీతం గావించారు. వారే మరోయుగములో శ్రీ కృష్ణ పరమాత్మగా పూర్ణావతారము దాల్చి భగవద్గీతాబోధన ద్వారా, నిత్యసన్నిహిత మృత్యువులైన మానవులకు ఎంతో తేలికగా అమృతత్వాన్ని సాధించుకునే ఉపాయాన్ని మనకు అనుగ్రహించి యొకమారు ధర్మప్రతిష్ఠాపన చేశారు. అట్టి భారతదేశంలో కొన్ని శతాబ్దాలకు పూర్వం పవిత్రమైన రామ, కృష్ణ, శివ ఇత్యాది భగవన్నామోచ్ఛారణకు సైతం భంగం వాటిల్లి నాస్తికమతం ఎంతగానో పెచ్చు పెరిగి దేశం క్షుభితమైంది.

అట్టి పరిస్థితులలో నిత్యసత్యస్వరూపమైన దక్షిణామూర్తి వైశాఖ శుద్ధ పంచమినాడు జగద్గురు శంకరభగవత్పాదులుగా ధర్మ రక్షణకు అవతరించారు. వారి ముప్పది రెండు సంవత్సరాల కొద్ది జీవిత కాలంలో, మానవునిలో సడలిన దైవవిశ్వాసము, ఆధ్యాత్మిక జీవనము పాదుకొలిపి దైన్యాన్ని పారద్రోలి సనాతనవైదిక ధర్మమార్గాన్ని పునఃప్రతిష్ఠితం చేశారు. అలా మానవునిలోని అవిశ్వాసాన్ని, దైన్యాన్ని పోగొట్టి బుద్ధిబలాన్ని సంఘంలో తేజస్సును ప్రసాదించిన నిత్యసత్యమూర్తి అవతరించిన రోజు శంకరజయంతి. జిజ్ఞావులైన ప్రతివారు ధర్మమునందు విశ్వసాన్ని కల్పించుకొని ధర్మజీవనమునకు పునాది వేసుకొని ఆత్మపరీక్షచేసుకొనవలసిన పవిత్ర దినం ఈ రోజు.

ధర్మజీవనానికి అవసరమైనవానిలో ముఖ్మమైనది 'అపరిగ్రహం ప్రతివారు తన నూతనకుటుంబానికి అవసరమైన దానికంటే మించి వస్తుసంచయము చేయకుండుటే 'అపరిగ్రహం' అలాఅవసరానికి మించినదాన్ని కోరకుండా వదలివేయాలి. ఏ విధంగా నైనా సరే అనవసరమైనదాని కొరకు ప్రాకులాడటం చేతనే దేశంలో ఈనాడు ఇలాంటి అనర్ధం సంప్రాప్తమైంది అష్టవర్ష ప్రాయంలోనే శంకరభగవత్పాదులు ఎలాభౌతిక కాంక్షను వదలి వేశారో మనమంతా ఒక్కపర్యాయం ఈరోజున ఆలోచించాలి. మన అవసరానికి మించి మన వద్దఉన్న వస్తు సంచయమంతా విసర్జించటానికి మనలో ప్రతిఒక్కరూ ఆలోచించాలి. నిత్యావసరములుకూడ నోచుకొననివారికి మనమంతా సహకారంచేసి వారిలో నున్న అసూయను పోగొట్టి వారి మనఃప్రవృత్తి ధర్మమార్గంలో ఉండేందుకు దైవవిశ్వాసాన్ని కల్గించేందుకు మనమందరమూ పాటుపడాలి.

మనమందరము అట్టి అపరిగ్రహాన్ని అవలంబించుకొని ధర్మమార్గంలో పయనించుచు అందరము 'శంకరులమగుటకు, వారిదివ్యకటాక్షాన్ని శ్రీజగద్గురు ఆదిశంకర భగవత్పాదులు అనుగ్రహించుగాక!



Kamakoti   Chapters   Last Page