Kamakoti   Chapters   Last Page

 

16. సాధనరహస్యము

స్త్రీ అర్హత

స్వామి అనుభవానంద

నా మాతాజీ !

నీకు మరల ఉత్తరం వ్రాయటానికి, ఆలస్యం అయినందుకుచింతిస్తున్నాను కారణం ఏమిటో తెలుసా ? ఒంగోలునుండి వ్రాసినతర్వాత బ్రహ్మణనిడుమానూరు, వెళ్లాను. అక్కడ ఆ ఊరివాళ్ళ భక్తి ఉత్సాహాలు నీకు తెలుసుగా ! నాకు వ్రాయటానికి అవకాశం లేకపోయింది. ఎప్పుడూ చుట్టూజనం. యెక్కువగా సంకీర్తన. కాబట్టి ఎలా వ్రాసేది ? సాధ్యమైనంతవరకు త్వరలో నీఉత్తరాల విషయాన్ని పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో నాకెక్కువ విక్షేపాలు ఉండని కర్లపాలెం వచ్చాను. ఇక వెంటవెంటనే వ్రాయటానికి ప్రయత్నిస్తాను.

మొన్నటి ఉత్తరంలో మొదటి భాగంలో జ్ఞానులనే వారు స్త్రీలోకంలో పూర్వంగాని యిప్పుడుగాని చెప్పుకోదగినంత ఎక్కువగా లేరన్నాను. ఆమాట మీద నీకు అధైర్యం కలిగిందా ? అలాంటి భయం అవసరమేలేదు. నేను చాలా వరకు స్త్రీజన పక్షపాతినిసుమా. మొదటినుంచి స్త్రీలకొక అపచారం జరిగింది. అది వేదకాలంలోగాక, తర్వాత పురాణ యుగంలో జరిగిఉండవచ్చు' శారీరకంగా స్త్రీలంటే అబలలు, ఆమాటనిజమే. మానసికంగామాత్రం కాదని పూర్వంమనం చర్చించిన గార్గి మైత్రేయి మొదలయిన స్త్రీరత్నాల చరిత్రలే సాక్ష్యం. స్త్రీలుకండబలం లేనివాళ్ళు కాబట్టి పురాణకాలంలో పూర్వము కట్టుబాట్లతో పాటు ఆధ్యాత్మిక కట్టుబాట్లుకూడా స్త్రీలపై పెట్టారు కొందరు పెద్దలు, ఆపెద్దల అభిప్రాయాలు మంచివే అయిఉండవచ్చు. కానికాల క్రమేణ స్త్రీలకు చాల అపచారం వాటివల్ల జరిగింది దానికి ఎదుర్కొనలేక ఆడవాళ్ళు లొంగిపోయారు, అందుచేత వేదాలలో కొన్ని మంత్రాలకే కర్తృత్వము గొన్న స్త్రీలు ఇదివరలో చెప్పినట్లు ఉపనిషత్తులకే ఆధారమైన స్త్రీలు, వేదాలను స్త్రీలు చదువరాదు అనే శాసనానికి లొంగిపోయి ఆధ్యాత్మిక విద్యకే దూరమయి సర్వం మరచిపోయారు స్త్రీలు. రానురాను శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ''అబలలం '' అనేభావం వాళ్ళలో ఏర్పడి నాటుకుపోయింది. ఆకారణాన అన్ని విధాల కృంగిపోయారు మన ఆడవాళ్లు. కాని వెంటనే తంత్రశాస్త్రం వాళ్ళకు అండగా నిలిచింది. ''స్త్రీకే మోక్షార్హతగాని పురుషునికి కాదు' అని ప్రచండ ప్రచారం సాగించాయి తంత్రశాస్త్రాలు. ఈ ప్రపంచాన్నంతా సృజించి పెంచి లయింపచేసేది. ఆదిశక్తి సుమా అన్నాయి తంత్రాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈపరాశక్తి చేతులలో కీలుబొమ్మలన్నాయి తంత్రాలు ప్రపంచం అంతానిజంగా విచారిస్తే స్త్రీత్వమే అన్నాయి తంత్రాలు ప్రపంచంలో ఏ గొప్పదనం ఉన్నా ఆదిశక్తి స్వరూపమే కాబట్టి స్త్రీత్వమే అన్నాయి తంత్రాలు. నోరుకదిలిస్తే శబ్దం, ఆశబ్దం శక్తిస్వరూపం కాబట్టి స్త్రీత్వం అన్నాయి తంత్రాలు. ఇంతెందుకు జీవత్వమే స్త్రీత్వం అన్నాయి తంత్రాలు, ఇదంతా నిజం అన్నాడు శ్రీకృష్ణుడు. అదే నేనన్నాడు గీతలో, ఎల్లప్పుడూ ఆడవాళ్ళతోనే ఉండేవాడు, స్త్రీవలె సున్నితంగా ఉండేవారు. అంతేకాదు నిజమాలోచిస్తే కృష్నుడంటే ఎవరనుకొన్నావు ? అష్ట ప్రకృతుల భార్యలుగా గలిగి పదారువేల కళల చెలికత్తెలుగా గలిగి దగ్గరున్నట్లుగా ఉన్నా అతిదూరంగా ఉన్నానని చెప్పుకోటానికో అన్నట్లు నీలవర్ణంగలిగి, మాయకు లొంగక మాయాతీతుడనుటకు నిత్యబాలకుడై ఉన్న యీకృష్నుడెవరనుకొన్నావు? కృష్ణ అంటే నలుపు కాళి అంటే నలుపు అందుచేత కృష్నుడంటే సర్వమాయాస్వరూపిణి. జగన్మాత కాళికాదేవియే సందేహంలేదు. గీతావిశ్వరూపఘట్టంఅంతా శ్రీకృష్నుని ఆదిశక్తి స్వరూపాన్నే తెలుపుతుంది. అందుచేత భాగవత గ్రంధం అంతా స్త్రీల ఆధ్యాత్మికతకు పోరాడుతున్నదన్నమాట. స్త్రీలకే ప్లీడరులాగా వాదించి బోధించి శాస్త్రాలను చెప్పి, చివరికి తంత్రశాస్త్ర ప్రబోధకుడైన పరమశివుడు చూచావా! సగం స్త్రీ అయి కూర్చున్నాడు. ఇకమన రామకృష్నుని విషయము నీకు తెలిసిందే. ఆయనకూడా పురుషుల కెంత ప్రాధాన్యం యిచ్చాడో స్త్రీలకు గూడా అంత ప్రాధాన్యం ఇచ్చాడేమో అనిపిస్తుందినాకు. ఎలా అంటావా ? స్త్రీయైన కాళికాదేవియే ఆయనకు ఇష్టదైవం తండ్రికంటే తల్లినే యెక్కువగా ప్రేమించాడు. స్త్రీ సన్న్యాసినియైన భైరవినే గురువుగా స్వీకరించాడు. మనశారదను భార్యగా జూడక ఇష్టదైవంగాపూజించాడు. ఇట్టిపూజనీయ దృష్టిలో ఆయన పురుషులను చూడలేదని గట్టిగా చెప్పవచ్చు.

దీనియంతటి సారాంశ మేమిటంటావా ? స్త్రీలు సహజంగా చూస్తే మానసికంగా ఆధ్యాత్మికంగాకాని దుర్భలులు కారు. చాలకాలంనుంచి వచ్చిన అభ్యాసంవల్ల పురుషులు అలా భావించడమేకాక స్త్రీలుగూడా అలా అనుకుంటూ అనాదలయిపోయారంటున్నారు. అర్ధం అయిందా? కాని స్త్రీలు మరల పూర్వపుటౌన్నత్యాన్ని ఎలా పొందాలంటావా? విను-చెప్పుతాను వేదాలలో నైనా స్త్రీ పురుషరూపమైన యీ లింగభేదాన్ని ఎత్తకుండానే అన్నారుగదా నాయమాత్మా బలహీనేనలభ్య అని అంటే ఆ యాత్మ బలహీనత్వం అనగా కాయికం అంటే శారీరకం కానే కాదు. అలాగైతే అన్ని వంకర్లుగల అష్టావక్రమహర్షి ఎలా సిద్ధత్వంపొందాడు అంటాం , కాబట్టి ఆ వాక్యానికి అర్ధం ఏమనాలి అంటే మానసికంగా బలహీనులు, అంటే అర్ధ జ్ఞాన శూన్యులకు ఆత్మ సాధ్యంకాదని అర్ధం. ఆధ్యాత్మిక బలహీనులంటే పూర్వసంస్కారం లేనివాళ్ళకు సాధ్యం కాదన్నమాట విద్యాబుద్ధులున్నవాళ్ళకే మంచి సంస్కారాలు ఏర్పడతాయి. మరి ఆత్మ ఎలా లభ్యం అవుతుందంటే, ఆ ఉపనిషత్తులు ఏమంటున్నాయి ? ''త్యాగేనైకే'' అని అన్నాయి. అంటే యోగసూత్రాలలో శ్రీ పతంజలి మహర్షి కూడా చెప్పినట్లు ''అభ్యాసవైరాగ్యాభ్యాం'' అంటే అభ్యాసం చేత వైరాగ్యం చేత ఆ ఆత్మను పొందగలుగుతారు. ఎవరు ? దీనిలో ఆడ మగ విచక్షణ ఎక్కడైనా ఉంది ? దివిటీలు పెట్టి వెతికినా లేదు. కాబట్టి ఈ అభ్యాసవైరాగ్యాలు క్షుణ్ణంగా ఎవరు పొందుతారో, వాళ్ళు స్త్రీలైనా సరే, పురుషులైనా సరే ఆ ఆత్మను పొందితీరాలి. ఈ వైరాగ్యం ఎలా పొందాలి అంటావా ? అభ్యాసం చేత, సత్సంగ్యం చేత. ఈ అభ్యాసవైరాగ్యాల విషయం అవకాశాన్ని బట్టి మరొక పర్యాయం చెబుతాను. అందుకని నా ఉద్దేశ్యం ప్రకారం ఎవరైనా సరే స్త్రీ అయినంత మాత్రాన ఆత్మలాభం దొరకదని అధైర్యం పొందరాదు, ఆత్మానుభూతికి గ్రంధాలలో చెప్పబడ్డ సర్వలక్షణాల్ని పొందడానికై తగిన ఆర్తితో యత్నిస్తే తప్పక పురుషుల వలె స్త్రీలుగూడా పొందుతారని నా నమ్మకం. అలాగే నీవు సైతం యీ దృష్టితోనే యీ దైవమార్గాన్ని నిర్భయంగా నడవవలసిందని నా హృదయపూర్వకమైన సలహా. అంతేగాదు నీవు చిన్నదానివి కాబట్టి యిది నేను నీకిచ్చు ఉపదేశం అనికూడా చెప్పుతాను.

ఇక మరల మన గ్రంధవిషయానికి వద్దామా ? మొదట్లో ముక్తిని పొందటానికి నాల్గుమార్గాలు పెద్దలు చెప్పుకొచ్చారని చెప్పాను. ఈ నాలుగుమార్గాలు అనేటప్పటికి ఒక సందేహం కలుగుతుంది. అది ఏదంటే యీ చెప్పబడ్డ నాలుగు మార్గాలు వేరువేరుగా ముక్తిని కలుగజేస్తాయా ? ఒకటైనతరువాత ఒకటిగా వచ్చి ముక్తికి దారితీస్తయ్యా ? లేక అన్నింటిని ఒకేసారిగా ప్రారంభించి ఆచరించాలా ? ఈ విషయం చాలా ముఖ్యం. అంతేకాదు కఠినం. అందుచేతనే పూర్వకాలంలో ఏమిటి ఈవిషయాన్ని చాల చర్చించారు. అంచేత లోకంలో యిన్ని మార్గాలు అంటే యిన్ని మతాలు యేర్పడ్డయి కానీ కొంచెం సూక్మంగామాత్రం చూసిన నిష్పక్షపాతంగా చూస్తే మనకే విశదం అవుతుంది. అంతేకాదు. యీ భేదాలు పోట్లాటలు సాధన చేయకుండా కబుర్లుచెప్పేవాళ్ళకేకాని సాధకులకు ఉంటానికే వీలులేదు. ఎందుకంటావా? సాధనచేసేవాడికి మార్గం యేదిముందు ? యేది వెనుక ? అనే రహస్యంబాగా తెలుస్తుంది. కాబట్టి వాడు యీ వ్యర్ధ తర్కాలలోకి దిగనేదిగడు ఈ రహస్యం తెలుసు కోవాలని తనను ఆశ్రయించినవాళ్ళకు చెప్పేస్తాడు, ఆరహస్యం యిది.

మొదట కర్మయోగం తర్వాత రాజయోగం తర్వాత భక్తియోగం, చివరికి జ్ఞానయోగం వచ్చేస్తుంది. మొదట్లో యీ ప్రపంచంలో ఉన్న కష్టసుఖాలను చూచి అవిక్షణికం అనే రహస్యాన్ని గ్రహించి ఎలాగ ఎప్పుడూ సుఖంపొందే మార్గం అని ఆలోచిస్తుండే మానవునికి వేదాలు కర్మకాండను బోధించాయి. ఈ కర్మకాండలో ఉన్న రహస్యం అంతా పరలోకంలో సుఖాలకొరకు తంటాలుపడటం, ఈ కర్మకాండను అనుసరించాలంటే దేశం ఆరోగ్యంగా ఉండాలి. అందుకనే అష్టాంగమార్గంగా ఉండే యోగమార్గం అవసరం అవుతుంది. అంటే కర్మమార్గంలోకి దిగేటప్పటికి దేహపటుత్వంకోసం ఆసనాలు నాడీపటుత్వంకోసం ప్రాణాయామాలు, బుద్ధి నికలడకోసం ప్రత్యాహార, ధ్యాన ధారణ, సమాధులు మొదలయినవి కావాల్సివస్తయి. ఈ విషయాలు వివరించి వ్రాస్తాను తర్వాత.

ధ్యానం అంటే ఏమిటో అనేటప్పటికి ఆ యోగసూత్రాల్లోనే ఈశ్వరుడు చెప్పబడతాడు, ఆ ఈశ్వరుడు సర్వవ్యాపకుడని, అతన్ని ధ్యానించాలని, అతన్నే ప్రణవం అనాలని మొదలైన విషయాలు అక్కడ చెప్పారు. అంటే స్వర్గభోగాలపై ఉండే బుద్ధి భగవంతునిపైకి మరలుతుంది, భక్తియోగంలో భగవంతు డొకడు కలడని, అతడు సృష్టిస్థితిలయకర్త అని, అతన్నిపొందాలని మొదలైన విషయాలమీదికి బుద్ధి ప్రసరించేటప్పటికి, భగవంతుడు ఆకారంగలవాడా? నిరాకారుడా? గుణాలున్నయ్యా? లేవా? సృష్టి ఎలా చేస్తాడు? ఎందుకు చేస్తాడు? అనే కోటానుకోట్ల సందేహాలు బుద్ధిసూక్ష్మతగల ప్రతివ్యక్తికి కలుగుతాయి. ఆ సందేహాలు కలగటంతోనే జ్ఞానమార్గంలోకి దిగినట్లే. ఈ సంకుచితమైన రూపంతో గుణాలతో ఉండే భగవంతునిపై భక్తి అడుగంటి వీటికన్నిటికి అతీతమైన ఆత్మమీదికి బుద్ధి తిరుగుతుంది. ఆ అద్వితీయమైన ఆనందంలో మునుగిపోయేటప్పటికి జ్ఞానమార్గం సిద్ధించిందన్నమాట. ఇది యీ మార్గాలలో ఉన్న రహస్యం ఇది సాధకుల అనుభవ రహస్యం, అలాగే సాధనమీదనే ఆధారపడి ఆ ఆత్మస్థితిని తెలుసుకోవాలని పూనుకున్నవాళ్ళంతా యీ మార్గాన్నే అనుసరించి తీరాలి. లేకపోతే ఎన్ని జన్మలకైనా వాళ్ళు యీ ఆత్మానందాన్ని పొందనేలేరు.

ఇక ఆ మార్గాలు, అంటే యోగాలు ఏమిటో చూద్దామంటావేమో ! ఆ విషయం తర్వాత చెప్పుతాను. లేకపోతే కష్టం. ఎందుకంటే, యీ మార్గాలలో ప్రవేశించాలంటేనే నీ వడిగే సాధనరహస్యాన్ని పొంది ఉండాలి. ఈ సాధన సంపద పొందకముందే యీమార్గాలు ఎలా అర్ధం అవుతాయి ? కాబట్టి ముందు మన ప్రశ్నను తీర్మానంచేసి, తర్వాత అవసరాన్నిబట్టి తర్వాత యీ నాల్గుయోగాల్ని వేరువేరుగా వివరంగా నీకు చెప్పేస్తాను. కాబట్టి దీన్ని ముందు అర్ధంచేసుకో.

అతడే మన దిక్కు, అనుభవం,

అతడే మన గమ్యం. 8-1-46

-----:0:-----

(87 పేజీ తరువాయి)

పరిపూర్ణుడు. జీవుడు తత్ప్రసాదమునకాకరుడు. ఆత్మ పరమాత్మకనన్యశేషము. ఆత్మపరమాత్మల యైక్యభావమే ఆత్మారామతత్వం, తెలివిగల మానవజన్మెత్తినందుకు

సార్ధకముగా ఆత్మారామతత్త్వమెరుగవలయును. అటుల తెల్సికొనుటే మోక్షసాధనము.

రమంతే యోగినోనంతే నిత్యానందే చిదాత్మని |

ఇహ రామపదేనాసౌ పరబ్రహ్మాభిధీయతే ||

(రామ|| తా|| ఉపనిషత్‌)

సత్యజ్ఞానానంద నిత్యనిర్మల నిరాకారపరబ్రహ్మ స్వరూపమును బ్రహ్మజ్ఞానులు తమ యొక్క ఆత్మస్వరూపముగా నెరిగి, సదా అట్టి నిజస్వరూపమగు ఆత్మయందే రమించుచున్నారు గాన రాముడని పేరు కలిగెను. ఈరామశబ్దముననే పంచాక్షరీ అష్టాక్షరీ మంత్రములు అంతర్భూతములై ఉన్నట్లు మంత్రశాస్త్రం ఉంటుంది. ఇటువంటి రాముని (బ్రహ్మజ్ఞానమును) యందు తానుండి నిష్ట సల్పుచు ఆ నిష్ట వాడుకపడి అప్రయత్నముగా తనంతట (సంతోషము) సహజముగానుండు ''సహజానంద'' స్థితిని పొందినవారు శ్రీ త్యాగయ్య అని మనకు అవగతమగుచున్నది కదా !



Kamakoti   Chapters   Last Page