Kamakoti   Chapters   Last Page

 

12. స్వామి ఆకర్షణ

ఆర్ధర్‌ కోయిస్లర్‌ ప్రఖ్యాత రచయిత, మాజీకమ్యూనిష్ఠు. దీర్ఘకాలం రాజకీయాలలో చిక్కుకొన్న ఇతనికి ఎందు చేతనో, మతంపై మనసుపోయింది. వివిధమత పరిశీలన చేద్దామనే ఉద్దేశంతో భారతదేశం వచ్చాడు.

కోయిస్లరు సందర్శించినవారిలో ఆచార్యుల వారొకరు. తన అనుభవాలను ఇతడు 'ది లోటస్‌ అండ్‌ ది రాబాట్‌' అనుపుస్తకంలో వ్రాసుకొన్నాడు. ఈ క్రింది వ్రాసినది ఆ పుస్తకము నుండి సంగృహీతం.

''గుడిప్రక్కన శిధిలమైన ఇల్లు, మేము ఇంటిలోనికి వెళ్ళాలి మాముందు చీకటి ఇరుకైన సందు కొంతదూరంలో మేనా కనపడుతోంది. పంచపాళి అనుకొని ఒక చిన్నగది. అక్కడవేసిన చాపపై ఆసీనులయ్యాం. మేనాలోంచి కుంకుమపువ్వు రంగు శాలువతో శ్రీశంకరాచార్య స్వాములు బయటకు వచ్చారు. సన్నగాఉన్న స్ఫురద్రూపం. మాగదికి వచ్చి ఆసీనులై నన్ను పరకాయించి చూచారు. గదిలోఉన్నవారంతా లేచి సందుదారిలో నిలబడ్డారు. వివేకానంద కళాశాలకు చేరిన వేదాంతోపన్యాసకులు మాసంభాషణ తర్జుమాకు పూనుకొన్నారు.

అర్ధనిముషం మౌనం వహించారు. ఆయనముఖంలోని అప్రతిమాన తేజస్సును అవలోకించాను. ఆయన వదనం తపశ్చర్యచే వాడివున్నది. కాని నేత్రాలు మాత్రం కాంతిపుంజములుగ నున్నవి. పెదవులు మెల్ల మెల్లగా కదులుతున్నాయి.

''మీరు ఇండియాకు ఏనిమిత్తం వచ్చారు ? ''

ఈ దేశాన్నీ ప్రజలనూ చూడటానికి వచ్చారా లేక వారికేదైనా మంచి మార్గం చూపెట్టడానికి వచ్చారా ?

''ఈ దేశంలోని వారిని గూర్చి తెలుసుకోటానికే వచ్చాను ''

''ఒక్కొక్కరి సత్సంకల్పానికే పరిస్థితులు మార్చేంతటి శక్తి ఉంటుంది. అపుడు ఆవ్యక్తి చేయవలసినదంటూ ఏమీ ఉండదు ''

''ఔను, నేను అదేఅనుకుంటున్నాను. మననీడ మనలను వెంటాడుతూనే ఉంటుంది కదా !

స్వామి ప్రశాంతత, వారినవ్వూ నన్ను అట్లే ఆకర్షించింది. అట్టి అమాయకమైన నవ్వును నాజీవితంలో నేను చూచి ఎరుగను. ఆనవ్వులో ఏదోసమ్మోహనం ఏదో ప్రేమశక్తి ఓతప్రోతంగాఉంది. ఆ ముఖమండలంలో ఒక దైవత్వం ప్రస్ఫురిస్తోంది. అఖండమైన జాలి, అనురాగమూ ఉట్టిపడే ఏసుక్రీస్తు ముఖాన్ని చిత్రాలలో చూచి ఆశ్చర్య పడ్డాను కానీ, ఈ వశీకరణశక్తి అక్కడ చూచానా అని సందేహిస్తున్నా.

హిందూ ఆలయాలలో ప్రశాంతత లేదు. గంటల గణ గణ చెవులు గింగురుమనే మేళతాళాలు, మరి ధ్యానానికి ఈ చోట్లలో వీలుంటుందా ?

నిజమే. హిందువుల ఆలయపద్దతులకూ ఇతర మతస్థుల పూజావిధానాలకూ చాలా వ్యత్యాసం. హిందువులు ఆలయానికి వెళ్ళటం, భగవంతునికి తమ కృతజ్ఞతను తెలుపుకోటానికి తమ ఋణాన్ని తీర్చుకోటానికి. ధ్యానానికి అందరి ఇళ్ళలోనూ, పూజామందిరాలుంటవి. అక్కడ ప్రశాంతంగా వాళ్ళు ఆరాధిస్తారు.

కొందరిని చూచి వీరు ఆత్మజ్ఞానం కలవారు అని చెబుతారు కదా ! అటువంటి వారిని కనుగొనుటం ఏలాగు ? దేనినిబట్టి వారు జ్ఞానులని నిర్ణయించటం ?

వారి వారి మనఃస్థితిముఖంలోనే తెలిసిపోతుంది. హంతకుడిని చూచి వీడు హంతకుడనీ, కోపిష్టిని చూచి వీడు కోపిష్టి అని చెప్పినట్లే, ఆత్మజ్ఞానులను వారి ముఖాన్నిబట్టె నిర్ణయింప వచ్చును.

ముఖంచూచి ఆత్మజ్ఞానిని నిర్ణయించవచ్చు అని ఈయన అంటున్నారు. ఈ మహాత్ముడు తాను అట్టి ఆత్మజ్ఞాని అని తెలుసుకొన్నారా ! కొట్టవచ్చే తేజస్సు ఆయన ముఖంలోనే ప్రకాశిస్తోందని ఆయన ఎరుగునా ? అని అనుకొన్నాడు కోయిస్లరు.

అర్జెంటీనా నుంచి మిస్‌. యూగినాబోర్లి నీ అనే ఒకయువతి స్వాములవారు ఇలయాత్తంగుడిలో ఉన్నపుడు వచ్చింది. ''నేను ప్రపంచంలో పెక్కుదేశాలు చూచాను. అనేకమైన అద్భుతాలు, ఆకాశాన్ని అంటే భవనాలూ చూచాను. కాని ఈ కుగ్రామంలోని సహజ సౌందర్యం రామణీయకత ప్రశాంతతా ఎక్కడా చూడలేదు. అని ఆమె అన్నది.

శంకరాచార్యులవారిని గూర్చి - ఆయన దర్శనం నా జీవితంలో ఒక గొప్ప భాగ్యం. ఆయన భూమికి దిగివచ్చిన ఏసుక్రీస్తే ప్రేమస్వరూపి ఐన స్వామివద్దనుండి నేను జ్ఞానబోధలను, కొన్ని ఆధ్యాత్మికరహస్యాలనూ, అవగతం చేసికొన్నాను అని ఆమె చెప్పుకొన్నది.

Kamakoti   Chapters   Last Page