Na Ramudu   Chapters   Last Page

 

దశరథరాముఁడు

చం. పదిపను లెక్కఁడై కలసి వచ్చెడునట్లు దిగున్‌ ధరిత్రికిన్‌

గదియగ బాసవాలుదొరకజ్జము వేలుపుమాలు గొంగమై

పదితలలైన రక్కసుని భాదలు మాన్పగ వత్తునంచు న

న్నది యొకరూపు కట్టెడు మనంబున యత్నములోన నుండఁగన్‌

ఈ గ్రంథములో ప్రపంచములో నున్న ప్రసిద్ధమైన రామ నామములు తీసికొని శీర్షికలుగా వ్రాయబడుచున్నవి బాలరాముడు. కోదండరాముడు, అయోధ్యరాముడు,జానకిరాముడు, రఘరాముడు ఇవి యన్నియు స్వామి పేర్లుగా చెప్పంబడుచున్నవి. ఈ రఘవంశములోనే పూర్వ రాజులకిట్టి పేరులు లేవు. వంశనామముతో కలపి, అయోధ్యతో కలిపి, తండ్రి పేరుతో కలిపి భార్య పేరుతో కలపి పూర్వరాజుల కెవ్వరికిని పేరులు లేవు. ఈయన కొక్కనికే యున్నది ఎందుకిట్లు వచ్చినది? ఊరకే జనము ఆవెనుకటి పేర్లుతగిలించిరా?ఆ తగిలించుటలో నర్ధమున్నదా? ఆ విచారణయే ఈ గ్రంథము. ప్రతిపేరునకు వెనుక నొక తత్త్వమున్నది. పూర్వపురాజులు అవతారములు కారు. ఈయన నారాయణావతారము. భగవంతుడు ధాత్రి కవతరించునపుడు ఒక్కపనికోస మవతరించఁడు. పదిపనులు పెట్టుకొని యవతరించుఁను. మత్స్య కూర్మ వరాహ నరసింహావతారములు మాత్రమొక పనికోసమే యెత్తెను. రామావతారముమొదలు పది పనులు పెట్టుకొని యెత్తెను. బాసవాలు దొరలు దేవతాధిపతి. బాసవాలనగా దేవత. ఇచ్చట విష్ణుమూర్తియని యర్థము వేలుపుమాలు అనగా రాక్షసుడు. దేవతలను చెడగొట్టువాఁడు. ఆరాక్షసులకు గొంగ. ఆ రాక్షసులను నాశనము చేసెడివాడు. కనుక విష్ణువు నేలకుదిగుచున్నాఁడు. పదిపనులుచక్కఁబెట్టుటకై దిగుచున్నాఁడు. ఎక్కడ దిగవలెనని ప్రశ్న.

చం. ఒక పదకమ్ముగా వలయు నొక్క యెడన్‌ ప్రవహించునందునూ

రక పెరలయన్నియుం గలసి రావలెఁ బుట్టినచోటఁ గూడ త

ప్పక పని యుండగా వలయు వందపనుల్‌ మఱి వందతీర్లు లై

దికము తపోనుకూలమును దించు సపత్నవిదారకంబు వై

ఈ యత్నములో నొక పదకమెత్తవలయును. ఎచ్చటపుట్టినచోఁబనులన్నియు కలసివచ్చునో అచ్చటబుట్టవలయును. వందపనులు వంద విధములుగా నుండును. మరల పుట్టినచోట పనియుండవలయును. తపస్సునకు అనుకూలమైన వైదిక కార్యములను దించు తగ్గించు నాశనముచేయు సపత్నవిదారకములు, సపత్నుడు విరోధి, అట్టివారిని విదారకములు చీల్చునవై యుండవలయును అట్టిచోటఁ బుట్టవలయును. ఎక్కడ పుట్టవలయునని యాలోచన. దశరథుని కడుపునఁ బుట్టవలయునని నిర్ణయము చేసికొన్నాఁడు ఎందుచేత?

చం. కొడుకులకోసమై యతడు గుఱ్ఱపుజన్నము చేయుచుండె నా

యొడయఁడు విష్ణుభక్తుఁడు నవోజ్జ్వలశీలుఁడు పై నివ్యగ్రచి

త్తుడు నదికావలెన్‌ తనకుఁ దొల్తగవానకి బిడ్డఁడైన నే

ర్పడు నిఖిలంబునున్‌ బొసగివచ్చును గావలె నన్నయట్లుగన్‌.

ఆ స్థలమే యెందుకు నిర్ణయించెను. దశరథుఁడు కొడుకులకోసము అశ్వమేథ యాగము చేయుచుండెను. రెండవది విష్ణుభక్తుఁడు. మూడవది నవోజ్జ్వలశీలుడు. అతని శీలమెట్టిదనగా నింతలో క్రొత్తదియై ప్రకాశించును. దశరథుఁడు చేసిన పనులన్నియు నిట్టివే. పాయసములో సగము కౌసల్య కిచ్చెను. భగవంతుఁడు ప్రధానముగా నామెకడుపున పుట్టవలెనని ఆలోచించి చేసెనా? చేయలేదా? ఆలోచించఁడు. ఊరకే చుయును. ఏది చేసినచో మహాఫల ముద్భవిల్లునో అది హఠాత్తుగా చేయును. ఇది 'నవోజ్జ్వలశీలత్వము' అతఁడు వ్యగ్ర చిత్తుఁడు. ఒకదాని మీఁద మనస్సును నిశ్చయముగా నిలుపఁగలిగినవాఁడు. రాముఁడు కొడుకై కూడ భగవంతుఁడు. మనస్సు నాకొడుకుమీఁద నిల్పినాఁడు. శాపఫలితముగా చనిపోయినాఁడు. రామరామ యనుచు చనిపోయెను. మోక్షమును పొందెను. ఇది వ్యగ్రచిత్తుని లక్షణము. అతనికి కొడుకైనచోనన్నియుఁ గలిసివచ్చును. ఎట్లు కలిసివచ్చునో చూతము.

ఉ. బంతిగ నౌతలల్‌ కలుగువాని వధింతునటన్నమాట కే

రింతలు కాదు తానయి వరించిన దింతయు కాదు చూడ వా

డంతలు చేసె వని వధయన్నది చేయుట యొప్పునిన్ను జం

పింతునటంచుఁ జెప్పినది వేదము వానిని, వేలు హేతువుల్‌.

బంత్తిగకల్గు తలలు గలవాఁడనగా రావణాసురుఁడు. పంక్తికంఠుఁడు పంక్తియనగా వరుస. తెలుగులో దానిని మనము బంతి యందుము. బాలురు బంతిగా కూర్చున్నారు వానిని చంపుదునని విష్ణువు దేవతలకు మాట యిచ్చి నాడు. ఏదో అడిగినారులే. వానిని వీరికొఱకు చంపి పెట్టుదము. అని కేరింతలుగా నన్ను మాటకాదు. కాడు. నేను వానిని చంపుదును అని తాను వరించిన పనికాదు. తానుకోరలేదు. వాఁడు ఆ రావణాసురుఁడు అంతలు చేసెను. అంత లనగా ఎన్నో దుర్మార్గములని యర్థము. యజ్ఞముల ధ్వంసము. ఇంద్రుని దిక్పాలకులను గెలుచుట, తాను బ్రాహ్మణుఁడై బ్రాహ్మణ కర్మలను నాశనము చేయుట తాను తపస్వియై ఇతరుల తపస్సులను పాడుచేయుట, తానును తనకొడుకును యాజ్ఞికులై యితరుల యజ్ఞములను పాడు చేయుట, పరస్త్రీలను మానభంగము చేయుట.

వానిని వధించుట న్యాయమే. కానిమ్ము దేవతల కోసము దీనిని చేసిపెట్టెదను. దానిని చంపుట వట్టి యీ మాత్రమునకే కాదు. వేదముసీతయై పుట్టినది. చంపించును? తనచేతనే చంపించవలయును. ఆమె పూర్వజన్మములో నీరావణుని చంపింతునని ప్రతిజ్ఞ చేసినది కనుక తానవతరించి తీరవలయును. మఱి యింక నెన్ని పనులున్నవి.

చం. సుదనిముకోసమై యెదురుచూచుచునుండిన కొంతమందిగా

విదితము శాపనిష్కృతికి వేచుకయుండిన కొంతమందిగా

పదితలలై వధింపఁబడు వాఁడొకఁరడుండఁగ జన్మయెత్తఁ ద

ప్పదనిన గడ్పునంబడుట వానికిఁ బొందికలందు పొందికై.

ఈ రావణుని బాధలెప్పుడు తీరును? ఆసుదిన మామంచిరోజెప్పుడు వచ్చునని వేలమంది యెదురు చూచుచుండిరి. ఇది యొక కారణము. తమ శాపము స్వామి కనిపించినచో స్వామి తమరిని వధించినచో తీరునని ఆశపించిన ఋషులు చెప్పిరి. విరాధుఁడు కబంధుఁడు మొదలైనవారు వారికోసమవతరించ వలయును. ఇది రెండవ కారణము. మూడవది రావణవధ. దశరథుని కడుపున పుట్టకతప్పదు. ఎందుచేత ననగా ఋషి శాపవశమున నతఁడు పుత్రదుఃఖియై చనిపోవలయును. ఆ దశరథుడు విష్ణుభక్తుడు వ్యగ్రచిత్తుఁడు. తనవంటి వాడు కొడుకు కాకపోయినచో నదికుదురదు. తన యవతారమున కిన్నిపొందికలున్నవి. ఈ దశరథ రాజుకడుపున పుట్టుట పొందిక లన్నింటికంటె గొప్ప పొందిక.

ఉ. పొంపిరి వోవగా నిచట పుట్టుట తానయి. సీత తానుగాఁ

బొంపెసలారగా నచటఁబుట్టుట వట్టి ధనుస్సుకోసమై

గుంపుగనై నిమిత్తముల కూడిక యిచ్చటఁబ్రోవుచేసి సా

గింపగ నొక్కచోటఁబొసగింపఁగఁదా నవతార మెత్తెడున్‌

పొంపిరివోవు-వర్థిల్లు, వ్యాపించు, పుట్టు,సంతోషించు, విజృంభించు ప్రసిద్దికెక్కు- ఆమాటకిన్ని యర్థములు. తానిక్కడ పుట్టుట. సీత అచ్చట పుట్టుట. శివధనుస్సు వట్టిమిష. దానిని వంచినదిలేదు. పెట్టినది లేదు. తాను ముట్టుకొనెను. అది విఱిగెను. నిమిత్తములు-కారణములు. ఇన్ని కారణములు ప్రోగుచేసి సాగించినాఁడు. ఒక్కచోట పొసగించినాఁడు. అచట జన్మయెత్తినాఁడు. సీత జనకరాజు కూఁతురు. తానొక రాజుకొడుకు కాకపోయినచో నామెను పెండ్లియాడుట బాగుగా నుండదు. 'వివాహశ్చ వివాదశ్చ సమయో దేవ శోభ##తే'. పెండిగాని వివాదము కాని సమానుల నడుమ నుండవలయును. తాను రేపడవికి పోవును. సీతకాక యింకొక్కస్త్రీయైనచో నేను రాననవచ్చును. ఆమె యోగిని కావలయును. ఆమె మహాపతివ్రత కావలయును. వైరాగ్య వంతురాలు కావలయును. ఆమెయేకాదు. ఆమె పుట్టిన యింటిలో వైరాగ్యము పీట పెట్టుకొని కూర్చున్నది కావలయును. పిల్లను వానికిచ్చినాము. వాఁడడవులను పట్టినాఁడు. ఎందుకును పనికిరాని వానికి పిల్లనిచ్చినాము. అని తమకూతును తీసికొనిపోయి తమదగ్గఱ నుంచుకొని, పదునాలుగేండ్లును సాధింపులు నేడ్పులు నైన కొంపలో పుట్టిన పిల్లకాదు. పదునాలుగేండ్లయిన తరువాత రాజ్యమురాదు. అప్పుడు మఱల నేడుపా? పోనీ. ఏది యెట్లయినచో నది యట్లగును. అన్న వైరాగ్యము గల యింటిలో జానకి యుదయంచినది.

చం. అరుదుగ నెచ్చటో మనుజులందున వ్యగ్రత తీవ్రమౌఁబరా

త్పరుఁడు నెడందలోపలను వానిఁ దలంచు సమీపవర్తిగా

నరయఁగ సత్పదార్థమున యందున బొందెనయేని తీవ్రతా

స్ఫురణము వ్యగ్రతాగుణము మోక్షము వానికి నందుబాటగున్‌

మానవులలో వ్యగ్రత యుండుట కష్టము. అది తీవ్రమై యుండుట మఱియు కష్టము. హృదయములో నంత తీవ్రవ్యగ్రత యెవనికుండునో? భగవంతుఁడు వానిని తనకు సమీప వర్తిగా భావించును. కంసుఁడు హిరణ్య కశిపుడు, రావణుడు, శిశుపాలుడు మొదలైనవారు విరోధము చేతనైనను తీవ్రవ్యగ్రతకలవారు.

ఈ వ్యగ్రత సత్పదార్థ విషయమున నున్నచో నింకఁజెప్పవలయునా? ఈ తీవ్రవ్యగ్రత సద్విషయమున నున్నచో మోక్షము వాని కందుబాటులో నుండును. గోపికలు, ఋషులు, గుహుడు, విభీషణుఁడు వీరందఱు దాని కుదాహరణము. కంసాదుల విషయములో భగవంతుఁడు వారిని చేదుకొనును. గుహాదుల విషయములో వారు తమకాలు తీసి గడపయాతల పెట్టుదురు. అంతే ఇది భేదము.

చం. దశరథుఁడట్టివాఁడు మమతా విషయంబున చూడఁగైకయీ

వశుఁడగుచున్‌ జరించెడిని వైశ్యమునీంద్రుని శాపమున్నదిన్‌

విశదముగాఁగ పుత్రుఁడయి వీనికి, పుత్రుఁడు కానకేగినన్‌

దశరథుఁడున్‌ మృతింగనును తప్పక మోక్షమొసంగయోగ్యుఁడై

ఈ దశరథుఁడు తీవ్రవ్యగ్రత కలవాఁడు. అతని తీవ్రవ్యగ్రత కామగుణ సంబంధియై కైకేయి యందున్నది. తాను కొడుకైనచో ఆమెను వదలిపెట్టి తనిమీఁదికి వచ్చును. తీవ్రవ్యగ్రత యనగా నేమి? ఒకని కొక శత్రువున్నాఁడు. వానిని చంపుదును. వాని డొక్కఁజీల్చి డోలు కట్టుదును. వానిచేత మూఁడు చెఱువుల నీళ్ళు త్రావింతును. కామమో, క్రోధమో, మనుష్యుఁడు పెరిగి పెరిగి మనస్సులో నేమగును? క్రియలోనికి దిగినచో చెడిపోవును. పాపము చేయును. క్రియకాదు వట్టి మనస్సులో పెరుగుట: ఆ కోపమో కామమో మనస్సులో పెరిగి పెరిగి యేమగును? ఈ కామక్రోధాదులన్నియు క్రియారూపముపొందినచో మనస్సు బుద్ధి అహంకారము వీనినన్నింటిని దాఁటి వీనికి జన్మస్థానమైన జీవుఁడనెడి వస్తువులో చేరును. మాయతోకూడినచో జీవుఁడు, ఈ క్రియా ప్రపంచము మాయ. దీనిని వదలిపెట్టి వాఁడు పెరిగి పెరిగి జీవుని యొద్దకుఁ బోయినాఁడు. మాయావశుఁడైనచో క్రియావశుడగుచున్నాఁడు. క్రియలేక పెరిగినచో జీవుఁడగుచున్నాడు. ఆ జీవుఁడెట్టివాడు. మాయసంబంధము తీవ్రవ్యగ్రత చేత వదలినవాఁడు. అనగా నాత్మ పదార్థముతో కలసిపోవుచున్నాఁడు. కంసాదుల మోక్షమిట్టిది. గోపికాదుల మోక్షమెట్టిది? సరిగా దశరథుని మోక్షము వంటిది. తీవ్రమైన వ్యగ్రత కామ విషయములో జరిగినది. కామము జారిపోయినది. మరల నింకొక స్థలము వెదకికొన వలయును. దానిస్థానమున వెంటనే భగవంతుడైన రాముఁడు కూర్చున్నాఁడు. తీవ్రవ్యగ్రత తీవ్రవ్యగ్రతయే. ఇప్పుడు రామసంబంధి యైనది. దశరథుఁడు చనిపోయినాఁడు. ముని శాపము తీరినది దశరథుఁడు వెంటనే ముక్తుఁడయ్యెను. ఇది రహస్యము, పరమ రహస్యము.

చం. సలలిత మశ్వమేధమును సల్పెను సల్పినవాఁడు సర్వవాం

ఛలు విడిపించుకోఁగలుగు శక్తిఘటించు కొనున్‌ మఱిప్పుడీ

పొలుపు చెడంగ గల్గినది పుత్రవియోగము పుత్రుఁడున్‌ రమా

నిలయుఁడు మోక్షమిచ్చుటయు నేరుపుతండ్రికినిన్‌ గృతజ్ఞుఁడై.

దశరథుఁడశ్వమేధయాగము చేసెను. అశ్వమేధము సర్వదక్షిణము. అనగా ఆ చేసినవాఁడు. సర్వమును బ్రాహ్మణులకు సమర్పించి తాను వెళ్ళిపోవలయును. దశరథుఁడట్లే చేసెను. అందఱు బ్రాహ్మణులకు సర్వధాత్రియు నిచ్చితాను ఉత్తరీయమును పైని వైచికొని యడవులకు బోవుచుండెను. బ్రాహ్మణులాయనను వారించిరి ఈ రాజ్యము మేము పాలించలేము, మాకు చేతకాదు. పుత్రకామేష్టి చేయుటకు నీ కధికారము కల్గుటకు నీవశ్వమేధమును చేసితివికాని వానప్రస్థాశ్రమమును స్వీకరించుటకుకాదు. అని మరలించిరి. దశరథునకు కొడుకు పుట్టినాఁడు. అతడు రమానిలయుడు. సాక్షాత్తు వైకుంఠవాసి.ఆయన వియోగముచేత నీయన చనిపోయినాఁడు. రాముఁడు మోక్షమిచ్చినాఁడు. రెండు నొకటే. దశరథుఁడశ్వమేధయాగాంతమున సర్వమును వదలిపోనెంచెను. అది మోక్షహేతువు. ఇప్పుడు భగవంతుఁడు మోక్షమిచ్చెను. భగవంతుఁడు దశరథునికి మోక్షమిచ్చుట తండ్రియని యిచ్చెనా? పుత్రవియోగమునకు చనిపోయెనని యిచ్చెనా? అశ్వమేధయాగము చివర సర్వమును వదలిపెట్టి వైరాగ్యమును బొందెను. తత్ఫలితముగా నిచ్చెనా? భగవంతుడు తానవతారమెత్తినప్పుడు తండ్రి నిట్టివాఁడుగా నెన్నుకొనెను.

చం. దశరథరాముఁడన్నయెడ ధాత్రి సమస్తము, తాను నిక్కమే

దశరథరాముఁడే; తనకుఁదండ్రికి నిచ్చట నచ్చటన్‌ మహా

విశదముగాఁగ నెన్ని పెనవేసుక పోయెడి లక్షణంబులో

దశరథరాముఁడన్నయవతారము తాల్చెను స్వామికూర్మితో

ధాత్రిసమస్తమును ప్రజలందఱు దశరథరాముఁడన్నారు. నిజమే తాను దశరథరాముఁడే. ఆ తండ్రికి నీ కొడుకునకు నైహికాముష్మికములయందు నెన్ని లక్షణములు పెనవేసికొని యున్నవి? కనుక భగవంతుఁడెత్తిన యవతారము వట్టిరామావతారము కాదు. దశరథరామావతారము. స్వామి ప్రేమతో నీయవతారమెత్తెను. వట్టిరావణసంహారము కొఱకెత్తలేదు. ఇంక ననేక కారణములున్నవి. అందలో మరీప్రధానమైన కారణము దశరథునకు కొడుకైపుట్టుట. అందుచేత దశరథరాముఁడనుటలో విడ్డూరమేమియు లేదు. ఆ పేరులో నింత సార్థకత యున్నది.



Na Ramudu   Chapters   Last Page