Upanyasamulu    Chapters   

'నేను' అను భావమున కర్థమేమి?

ఈవిస్తారమగు ప్రపంచమున జీవించియుండు ప్రాణులు కోటానకోటులు కలవు. ప్రతి ప్రాణియందును 'నేను నేను' అను భావము స్ఫుర్తించుచున్నది. ప్రతి జీవుడను ఏదోనొక శరీరములో 'నేను' అను భావముతో కూడుకొనియే యున్నాడు. ఇంత ప్రపంచములో ప్రతి వ్యక్తికూడ ప్రత్యేక ప్రత్యేకముగ 'నేను నేను' అను స్ఫురణ కలుగుచున్నదే దాని యర్థమేమి? దానియుద్దేశ్యమేమి? మన మానవజాతి కప్పుడప్పుడు గలుగు మనోభావములు 'రికార్డు' చేయబడుచుండును. అట్లు మానవునకు మొదట కలిగిన ఉత్తమ భావములకే 'వేదము' అని పేరు. వేదాన్తములన్నను అవియేకాని వేరుకాదు; ఆ వేదములలోకూడామొట్టమొదట 'నేను అను స్ఫురణ కర్థమేమి? ' అను విషయమే యెక్కుడుగ విచారింపబడినది. దానినే మనముకూడా కొంత వఱకు విచారింప ప్రయత్నింతుము.

వేదములలో మొదటిది ఋగ్వేదము. దాని అంత్య భాగమే ఐతరేయ బ్రాహ్మణము. దానిలో ప్రతి మానవుడుకూడా ఈ 'నేను' అనగా నేమియో చక్కగ విచారించి తెలిసికొనవలసినదని చెప్పబడి యున్నది. ఆదికాలమున దీనిని గుఱించి కొందఱు మహామహులు విచారణగావించినట్లుకూడ ఆగ్రన్థములవలన తెలియుచున్నది. కాని ప్రస్తుతము మనకా విచారణవలన కలుగు ప్రయోజనమేమి? అని విచారించినచో మనమిప్పడీ ప్రపంచమున ప్రతిదినమును కోటి కోటి పనుల నెందుకు చేయుచున్నాము? 'నేను' జీవించియుండటకే, మనమెంత చదివినను, ఎంత సంపాదిఁచినను, ఎంత నడచినను, ఎంత ఆలోచించినను, తుదకే చిన్నకార్యమొనర్చినను అదంతయు ఆ 'నేను' జీవించుటకును, ఆ 'నేను' బాగుపడుటకును తప్ప వేఱు ప్రయోజనము కొఱకు కాదు. అయిన ఆ 'నేను' అనగా నేమి? ఈ విచారము ప్రతివ్యక్తికిని అత్యవసరమైయున్నది. ఎవడో చెప్పినదానిని మనము వినియోఎవడో వ్రాసినదానిని మనము చదివియో ఊరకుండరాదు. ప్రతివారునువారివారి స్వబుద్ధిని వినియోగించి ఆ 'నేను' అనగా నేమియో తెలిసికొనుటకు యత్నము చేయవలెను.

ఉద్ధరే దాత్మ నాత్మానమ్‌.

రోగపీడితుడగు వాడు ఔషధమును తీసికొనిన రోగము నెమ్మదించుచుగాని ఒకడు ఔషధసేవన మొనర్చిన మఱియొకని దేహము స్వస్థతగాంచునా? ఆ విధముగనే వాడు వాడు ప్రత్యేక ప్రత్యేకముగా దాని తత్త్వమును తెలిసికొని తను తాను తరింపజేసికొనవలసినదేగాని ఎవడో చెప్పుచున్నాడుగదా! ఎవడో వ్రాసినాడుగదా! అని మనమూరకుండరాదు. అయితే మనమీవిషయమున నితరుల యనుభవములను సహకారముగ నుంచుకొనవచ్చును. అయినను మనమీ విషయమున ప్రత్యేకముగ కృషియొనర్పవలెను. మానవున కింతకుమించిన కర్తవ్యము లేదు. దేనికొఱకై మనమీ ప్రపంచ వ్యవహారముల నన్నిటిని చేయుచున్నామో దాని యథార్థ్యస్థితిని మనముకనుగొనిన పక్షమున ఈ ప్రపంచ కార్యములన్నియు, ఈ ప్రయత్నము లన్నయు వ్యర్థములగు, ప్రపంచమునందితర శాస్త్రములన్నియు కాలక్రమముననభివృద్ధి పొందుచున్నవిగాని, ఈ ఆత్మ విచారణ అభివృద్ధి గాంచుటలేదు. అయ్యది అనుభవరూపము కాబట్టి తనకు తాను సాక్షాత్కరించుకొన వలసినదేగాని ఎవరో చెప్పినదానిని మనము విని అంతటితో మనము విరతులము కాగూడదు. మన కనుభవమునకు రావలెను. 10వేల సంవత్సరములకు పూర్వము మనవారెంతవఱకీ విషయమున ప్రయత్న మొనర్చిరో నేడును మనమావిషయమునందంత తీవ్ర యత్నము చేయవలెను. 'ఈనేను' అను భావమున కర్థమేమి? అను విషయమును గురించి ప్రపంచము పుట్టినది మొదలు నేటివఱకును ప్రతి దేశమునందును. ప్రతి మంతము నందును. విచారణ చేయబడుచునే యున్నది. కాబట్టి ఈవిషయమును తెలిసికొనుటకు ప్రతివారును యత్నము చేయవలెను.

బుద్ధిః వాస్తవ పక్షపాతినీ.

అని చెప్పినారు. నీరు ఏ విధముగ నిమ్న ప్రదేశము చిక్కువఱకును అల్లాడుచుండునో, ఆవిధముగనే ఒక వస్తువుయొక్క వాస్తవ స్థితి తెలియ నంతవఱకును మన బుద్ధియును అల్లాడుచుండును. దాని నిజము తెలిసిన శాంతినందును. అందుచేతనే బుద్ధికి సత్యముపై పక్షపాతమని మన ప్రాచీనులు చెప్పినారు. మీరును నేనును ఇక్కడి కెంతయో ఆసక్తితో వచ్చియున్నాము. ఈవిధముగు మాటలతో కాలమును గడుపుచున్నాము. అయిననీ మాటలవలన ఏమి ప్రయోజనమని మీరు విచారించవలదు. ఈ నేను అనగా నేమియో ప్రతివాడును విమర్శించి, తెలిసికొనవలెను. ప్రతివాని దేహమునందును ఇతర లుపదేశము చేయకనే నేనుఅనుభావము కలుగుచున్నది. ఆదేవిధముగ దానిని తెలిసికొనుటలోగూడ మనమే యత్నించి మనమే అనుభవమునకు తెచ్చుకొవవలెను. నాడేమన విచారణకు చారితార్థ్యము కలుగును. ఇతరు లెవరో మనకు దీనిని సంపాదించి యిత్తురనుట కల్ల.

క్రైస్తవమతము.

ఈ నేను అను విషయమునుగూర్చి క్రైస్తవులిట్లు చెప్పుదురు. వారి మతమున జీవుడగు నిత్యవస్తువొకటున్నది. అదొక్కమానవదేహమునందు తప్ప తదితర పశుపక్ష్యాది జంతులలో లేదు. మానవుని దేహము నశించినను ఈజీవుడు నశించడు. మానవుడు చనిపోయిన పిదప దేహము పూడ్చబడినచోట ఆ జీవుడు కూడ నుండును. ప్రళయకాలమున భగవంతుడు ఈజీవుల నందఱిని విచారించి వానివానికి దగిన సుకృత దుష్కృత ఫలము నిచ్చుచున్నాడు. పశుపక్ష్యాది జంతు సంతానమునకు జీవుడులేడందరు.

వైష్ణవమతము.

పూర్వము మన దేశమున రామానుజా చార్యులను వారుండిరి. వారు మహానుభావులు. వారు రచించిన గ్రన్థములు వారు చేసిన ఘనకార్యములు పెక్కులుగలవు. వారిమతము ననుసరించువారు నేటికిని ప్రపంచమున కోటానుకోట్లుగలరు. దానినే వైష్ణవమతము లేక విశిష్టాద్వైతమతము అని చెప్పెదరు. వారి యనుభవములలో, సంపూర్ణమగు వస్తువొకటికలదు. దాని కనేక అంశములు కలవు. ఈ 'నేను' అనునదికూడ అందులోని యంశ##మేగాని అన్యముకాదు. జీవులందఱు జడములు, ప్రతి జీవునిలోకూడ ఆ పరిపూర్ణమగు వస్తువు ఆంతర్యామిగ నున్నది. అని చెప్పదరు.

ఉపనిషన్మతము.

ఇక మన యపనిషత్తుల పరిశీలించినచో ప్రపంచమందలి సర్వ వస్తువలకును మూలకారణ మొకటికలదనితెలియుచున్నది. ఈగోడ, ఇటుక, కండ, బొమ్మ, వీని కంతయు మట్టి ఏ విధముగ మూలకారణమో ఆవిధముగనే సర్వప్రపంచమునకును ఒక వస్తువు ఆధారభూతమై యున్నది. ఆవస్తునే ప్రతి మానవుని శరీరమునందును కలదు. నేను అను స్ఫురణ కదియే అర్థము. ఆ వస్తువునే తెలివి అనికూడ చెప్పెదరు. దానికి జ్ఞానమనియు పేరు కలదు. ప్రపంచమునందలి పదార్థములన్నియు దానిచే తెలియబడదగినవేగాని దానిని తెలిసికొను పదార్థము లేదు. ఆ తెలివి అనగా ఆ జ్ఞానమే నేను.అయ్యది కేవలము తెలివియేగాక ఆనంద స్వరూపమై యున్నది.

ఆనందమనగానేమి?

ఒకప్పుడు మనము కంటికింపగు పదార్థమును చూచుచున్నానము. చెవికింపగు శబ్దమును వినుచున్నాము. సుగన్ధము నాఘ్రాణించుచున్నాము. అప్పుడు 'నేను' అను వస్తువులో నా నందము కలుగుచున్నది. ఆ సంతోషమునకర్థమేమి? మన యుపనిషత్తులయందు "మనలో కలుగు ఆనందము ఆగంతుకమా? లేక మనలోనుండు ఆనందమే ఒక విధమగు చిత్తవృత్తి విశేషమువలన స్ఫురించుచున్నదా?" అను విషయము గొప్పగ విచారింపబడియున్నది. ఇక్కడ ఎలక్‌ట్రిక్‌బల్బులు వెలుగుచున్నవి. వానిలోనుండి సహజప్రకాశ##మే మనకగుపడుచున్నదా? లేక ఎక్కడనుండియైనను నూతనముగ వచ్చినదా? అని మనము విచారించు పక్షమున అందుండు సహజశక్తియే మనకు గోచరించుచున్నది. కాని ఆగంతుకముకాదు. ఆ విధముగనే మనలోకప్పపడి సంపూర్మముగనుండు ఆందమే ఒకప్పుడు మనకు ఖండఖండముగ ప్రత్యక్ష మౌచున్నది. క్రొత్తదికాదు. వ్యాకరణశాస్త్రమున స్ఫోటవాదమని ఒక వాదమున్నది; మాక్స్‌ముల్లర్‌ పండితుడు వ్యాకరణశాస్త్ర మొక సైన్సు అని చెప్పినాడు. ఆ శాస్త్రమునందుండు కొన్ని నిరుక్తపదములను, కొన్ని వేదశబ్దములనుబడ్డి అతడు ఫైలాలజీ అను శాస్త్రమొకదానిని ప్రారంభించినాడు. ఆ శాస్త్రమునకొన్ని పొరపాటు లుండవచ్చును. అంతమాత్రముచేత ఆపద్ధతి మంచిదికాదనరాదు. అందులోని విచారణకు ప్రాధాన్యమియ్యవలెను. కాలము గడచుకొలదియు దోషములుపోయి అదియేమంచిదగును. అటువంటి వ్యాకరణశాస్త్రమున శబ్దమే బ్రహ్మమని చెప్పబడియున్నది. ఈ క, గ, చ, జ మొదలగు వర్ణములన్నియు నాలుక, పెదవుల, దౌడలు, కంఠతములచేతను కలుగుచున్నవి.

దృష్టాంతము.

దీనికొక దృష్టాంతము చెప్పెదను:- ఎండ ప్రపంచమంతయు నిండియున్నది. అదియే చిన్ని రంధ్రము గుండ మన యింటి లోకూడ ప్రవేశించుచున్నది. అయిన నారంధ్రము వర్తులమగు పక్షమున ఆ యెండయు వర్తులముగనే యుండును. లేదా ఆ రంధ్రము చతురస్రముగనుండిన ఎండయు చతురస్రముగనే యుండును. అనగా ఉపాధినిబట్టి భేదమువచ్చినదని అర్థము. అదే విధముగ శబ్ద బ్రహ్మముకూడ పరిపూర్ణమై, అఖండమైయున్నది. అయినను ఈకంఠ, తాల్వాద్యభిఘాతమువలన క,గ,చఇత్యాదిగ నాదములు నివిధములై మన శ్రవణంద్రియుములకు విషయములగుచున్నవి. దీనినే వేదాన్తులు సత్కార్యవాదమనియెదురు.,

అట్లే మనమొక రమ్యమైన, భక్తిభరితమగు గీతమును వినుచున్నాము ఆనందభరితులమగుచున్నాము పులకాంకితులమగుచున్నాము. మనకానందము నూతనముగ కలుగుచున్నదా? లేక సహజముగ మనలో నుండునదేనా? అను విచికిత్సకు ప్రారంభించినచో మనలో నుండు పరిపూర్ణనందమునే ఖండఖండములుగ మన మనుభవించుచున్నాముగాని, ఎక్కడినుండియో మన కానందమువచ్చుటలేదు అని మనకు తెలియగలదు. ఆ నేను అనునటువంటిది ఆనందఘనము. అయినదానికొక యావరకమున్నది-అందుచేతనే మనము దాని ననుభవింపలేక పోవుచున్నాము- ఎప్పడాయావరకము కొంచము తొలగునో అప్పుడు మనకానందము స్ఫురించున్నది-వెంటనే ఆ కప్పు అడ్డుపడుటచేత స్ఫరించుటలేదు- దీనినేశ్రీ శంకరులవారు దక్షిణామూర్తి స్తోత్రములో నిట్లు చెప్పినారు-

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరంజ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిఃస్పందతే| జానామీతి తమేవభాన్త మనభా త్యేత త్సమస్తం జగత్‌ తసై#్మశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

జ్ఞాన మనునది దీపముతో సమానము అనగా దీపసాన్నిధ్యమువలన టీకటయందలి పదార్థముల నెట్లు గుర్తెఱుగుదుమో అట్లే జ్ఞానమువలన ప్రపంచమంతయు నెఱుకపడును. అనేను అనునట్టిది. పరిపూర్ణ జ్ఞాన స్వరూపము ఆనందరూపము, దానికి మనస్సు అనునది ఆవరకము అనగా నాచ్ఛాదకమై యున్నది.

దృష్టాంతము.

రంధ్రములుగల కుండ నొకదానిని దీపము పై మూసిఆపై ముదుకగుడ్డ నొకదానిని కప్పినామనుకొనుడు- అప్పుడు మనకు దీపపుకాంతి యగపడుటలేదు. ఆగుడ్డను కొంచము తొలగించిన కొన్ని రంధ్రములనపుండి వెలుతురు వెలువల వ్యాపించును వస్త్రమును పూర్ణముగ తొలగించిన రంధ్రము లన్నిటినుండియు వెలుతురు వ్యాపింప మొదలిడును. ఒకప్పుడు మనమాఘటమునే పగులగొట్టితి మనుకొనుడు. అప్పుడు సంపూర్ణమైన దీపపు కాంతిని చూడగలుగుదుము. అయిన నాకాంతి క్రొత్తగరాలేదు. ఇతఃపూర్వమాకాంతి అందేదాగియున్నది. మనము రంధ్రముల నేర్పఱచుట, ఘటమును పగులగొట్టుట మొదలగు కార్యములొనర్చుటచేతనే పరిపూర్ణమగు వెలుగును చూడగలుగుచున్నాము. ఇక దార్షాంతికమున:- ఆదీపుకాంతియే మనలోనుండు ఆఖండానందము పైన మూసిపెట్టినఘటము అజ్ఞానము. కాబట్టి ఆ అజ్ఞానము తొలగిన మన మానందసముద్రమును గాంచగలము. అనుభవింపగలము. సర్వప్రపంచమున కదియే మూలాధారము. ఇప్పుడు మనకగపడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు ఇవన్నియు దానిరూపములే. పూర్వము సైన్సులో 72 ఎలిమెట్సుఉన్నవి చెప్పినారు. రానురాను సైన్సు అభివృద్ధియగు కొలదియు వాటిని విభాగించుటకు వీలులేదనియు, అవన్నియు నొకటేతత్త్వమనియు, అందులనుండు ఒకవిధమగు శక్తియొక్క మార్పుచేతనే విభాగములేర్పడుచున్నవనియు చెప్పుచున్నారు. వారజెప్పు ఆశక్తినే (Force) మనము జ్ఞానమనుచున్నాము. దీనినిబట్టి సైన్సు అభివృద్ధినందుకొలదియు మన 'అద్వైతము' దృఢపడుచున్నదని స్పష్టముకాగలదు. సరే ఈ ప్రపంచమంతయు ఆ నేను అను స్ఫురణస్వరూపమే. అయిన దానికొక అడ్డు ఉన్నదని చెప్పినాను. దానిని తొలగద్రోసుకొనుటయే మానవుని కర్తవ్యము:

జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం |

ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ యుపాస్మహే||

అను విద్యాప్రదాయగు హయగ్రీవస్తోత్రమున భగవంతుడు జ్ఞానానందస్వరూపుడగు చెప్పబడినాడు. కాబట్టి మనమందరమును తీవ్రప్రయత్నమొనర్చి ఆపదార్థమును గుర్తెఱుగవలెను. ఆనాత్మవిషయమగు ప్రపంచమున మనమెన్ని కార్యములొనర్చినను ప్రయోజనములేదు. ఈదీపములేకపోయిన ఈ (పురమందిరమందలి) జవనికలు (సీన్సు) ఎట్లు వ్యర్ధములో ఆవిధముగనే మనము జ్ఞానమును పొందకపోయిన ఈప్రపంచమను 'సీను' అంతయు ప్రయోజనరహితమమే, అందుచేతనే మన ప్రాచీనలందరును దానిని గూర్చి నెక్కుడుగ విచారణసల్పినారు. అయ్యది మానవజన్మమునకు సాఫల్యత చేకూర్చునని వాక్రుచ్చిరి. మానవు డేనాడు తనయందలి ఆనందాంశమున కావరకముగనుండు పదార్థమును తొలగద్రోసి సుఖతుడగునో నాడే వాని పౌరుషము సార్థకమగును. దానినే మనవేదములు శాస్త్రములు, ఆచార్యపురుషులు గ్రహింపగలిగినారు. వారిలోకొన్ని అభిప్రాయబేదములుండవచ్చును. మనమువానినెల్ల పాటింపరాదు. వారెంతవఱకు తత్వమును గ్రహింపగలిగిరి అనువిషయమునే మనము గమనింపవలెను ఇటీవల మనదేశమునందొకవిధమగు రాజకీయ వాతావరణమేర్పుడుటచేత శాంతిగన్పట్టుటలేదు. 20,30 సంవత్సరముల లోపలనే మరల నీవాతవరణమంతయు శాంతినొంది దేశము నందొకవిధమగుసైన్సు, వేదాన్తముప్రబలముగలదని నాకుతోచుచున్నది. కాబట్టి ప్రపంచమున ప్రతివానికి ఆ తత్త్వమును తెలిసికొనవలెనని ఒకవిధమగు దాహమేర్పడవలెను. ఆ తీవ్రతవలననే మనము గమ్యస్థానమును చేరగలము. పరమప్రాప్యమును చూడగలము. ఆపదార్థమును తెలిసికొనిన ప్రపంచమంతయుతెలిసినట్లే యగును, మనమెంతకాలమైనను చీకటిలోనే ప్రయాణమొనర్పరాదు. వెలుతురునందు సంచరింప యత్నముచేయవలెను. ప్రతి మానవుడుకూడా శరీరకుటుంబయాత్రల జరుపుకొనుచునే ప్రపంచతత్వమేమి? అనివిచారించి జ్ఞానమను వెలుతురునకు రావలెను. అదియే మానవుడు తరించుటకు మార్గము.

Upanyasamulu    Chapters