Shaktipatamu    Chapters    Last Page

ప్రాక్కథనము

శక్తిపాత మనునది యొక యున్నత ¸°గిక సాధన విషయము. అట్టి సాధనమం దుత్తమభూమిక నధిష్ఠించి తీవ్రసాధన మొనర్చిన వారికే యిది యాచరణయోగ్యము. ఇంక దీనిం జదివి యానందించు నధికారము సైతము నీచసోపాన స్థితులైన సాధకులకు లేదనియే చెప్పcదగును దీని యాచరణము త్రైవర్ణిక బాలురకుc దత్తదుచితవయస్సులందు నవోపనీతులైన వారలకుc బరమ మంత్రమైన గాయత్రిని శక్తి పాత పూర్వకముగా నుపదేశించి,- ''ఆయాతు వరదా దేవీ''- యని ప్రార్థింపcజేసి, యా బ్రహ్మసమ్మితభర్గశ్శబ్దప్రథితసంధ్యాశక్తిని 'సావిత్రీసరస్వతీత్యాది' నామములతో బిలిపించి, యుత్తమ పర్వశిఖరముగా శాస్త్రములయందు మన్నింపబడినదాని భూమికకుc (సహస్రారమునకు) జేర్పించి, మఱల నా వేద మాతను బ్రహ్మజ్ఞానసంపత్తికొఱకుc దంటాలుపడు నా వడుగుటచే సెలవిప్పించి - 'గచ్ఛదేవి యథాసుఖం' అనుచు వచ్చిన చోటికిc బోc బనుచు ప్రథానసాధనభాగము నాచరణమందుc బెట్టించు శక్తి యథార్థగురువులకు నాcడుండెడిదేమో! అపుడు కాదిప్పటికిని బాలురకు గాయత్రీమంత్రోపదేశము చేయు వారును, ఆచార్యులునైనవారు ముఖ్యముగా జనకులే యగు చున్నారు. పైనc జెప్పిన కర్మపథాభ్యాసమును జనకులో వారి కులగురువులో యెంతవఱకు నాచరణమందుc బెట్లుచున్నారో ద్విజలోక విదితము. ద్విజబాలుర పురోహితులు (ముందుమేలు కోరువారు) జనక కులగురువులలో నెందఱు సార్థకపురోహితులగుచున్నారో మనము తలవాంచి స్మరించి లెక్కించుకొన వలసినదే. వ్రాత్యులై యెంత వయస్సు వచ్చినవారికైనను ద్విజబాలురకు యాంత్రికముగానైనను నేసంస్కారమును జేయ మానcజాలకున్నామో - యది యెటులో నామమాత్రముగా జరిపించి మిథ్యాసంతుష్టి నొందుచున్నారమో యూహించుకొనవలసినదే. ఉపనయన సంస్కారఫలమైన మేధాజననము 'బ్రహ్మాహమస్మీతి స్మృతి' యీయుపనీతులలో నెందఱ కగుచున్నదో లెక్కించుకొన్నప్పుడు మన మనుభవించునది ప్రసాదమా విషాదమా! యథార్థముగ మేధాజనన ఫలకముగాని యీవడుగువని విషాదకరమే యనుచున్న నాది సాహసమే యైనచో యథార్థముగా బాలపురోహితులైన జనక కులగురువులు నన్ను మన్నించి బుద్ధియోగము కలిగింతురుగాక.

ఏ గురువుల నాశ్రయించినను నెట్టి యుపదేశములు చేయcబడినను వేదవేదాంగాదిపాఠము లెన్ని చేయించినను నవి మేథాజననము చేయcజాలని వ్యర్థవ్యయప్రయాసము లేయైపోవుట కంటె విషాద దౌర్భాగ్య హేతువేమున్నది? ఇంతకును దీక్షా దాన మన నేమో తెలిసియది శక్తి పాతసహితము కాకుండుటే హేతువు. ఇంతకంటెను నీ దేశ సౌభాగ్య నాశనమునుగూర్చి విశేషించి వ్రాయను.

ఆంధ్రదేశమున కాదర్శ పండితులై బ్రహ్మలీనులై పోయిన శతావధాని శ్రీవేలూరి శివరామశాస్త్రిగారు నా రచనముల నన్నింటి ననుశీలించిన సాధకశ్రేష్ఠులు, మా కన్యోన్యముఖపరిచయ మేనియు లేకున్నను నన్ను గడుcబ్రేమించువారు - నా 'సాధనసామగ్రి - తొలిమూట' కభిప్రాయ మిచ్చినవారు - నాcడు మాకు నడుచుచుండిన లేఖ ప్రతిలేఖ ప్రేషణమందు నొకదాన ''మీ రచనములం దాడాడ 'శక్తి పాతము' అను మాట కనవచ్చినది. ఇంకను మఱికొన్ని ¸°గిక- తాంత్రిక గ్రంథములందును గంటిని. కావున దానినిగూర్చి యొక చక్కని వ్యాసము వ్రాయించి పంపcగలరా?'' యని ప్రశ్నించిరి. నేనును 'గనుజూపు బొత్తిగా మందగించి యెనుబది దాటిన ముదిమిచే నాదరింపc బడుచున్ననుc గాసశ్వాసములు, రక్తపుcబోటు మున్నగు తెగుళ్ళకు లోగిపోయినను మీ కోరికను గురునానగాc గైకొని ప్రయత్నింతు' నని యొప్పికొంటి, నైనను జరాక్రాంతి కారణముగా వారికోరిక తోడ్తనే తీర్ప లేక వ్రాయమొదలిడియుం దెగులుగొంటి నై పోవుట చేత దెమల లేక పోయితిని. ఇంతలో శ్రీవారు భౌతికోపాధిని వీడుట నా పాపమే కాక తెలుcగునాcటి కొల పండిపోవుట చేత నైనది.

తరువాత సాధన గ్రంథ మండలి సంస్థాపకులు బ్రహ్మశ్రీ విద్వాన్‌, బులుసు సూర్యప్రకాశశాస్త్రిగారు నా రచనములను జిరమై ప్రచురించుచున్నవారు. మిపులc జనవు చేత నేమో నా రచనముల వెలుపలి యట్టపైని 'రాబోవు గ్రంథములు' అనుచోట ''శక్తిపాతము'' అను మాటను జేర్చి ప్రకటింప మొదలిడిరి. దివంగతులైన శివరామశాస్త్రిగారికిం జేసిన వాగ్దానముతో సమముగా శ్రీబులుసు శాస్త్రిగారి ప్రచురణము నన్ను గట్టిపెట్టినది. శివరామశాస్త్రిగారిమృతి వినియు వారికంటెను బదేండ్లు పెద్దనైన నేను నా యుపాధి యనేక వ్యాధిగ్రస్తమగుటను దలంచికొని నా మతిమాలినతనమునకు నన్ను నిందించుకొనుచుc గన్ను లేమి నెందఱనో బ్రతిమాలికొనుచు గడు నాయాసముతో నీ వ్యాసము వ్రాయించి ముగింపంగలిగితిని. ఇందుల్లేఖింపcబడిన ప్రమాణ వాక్యములు గల గ్రంథములను దీయించి చదివించి వ్యాసమందుం జేర్పించుటకును నెంతో శ్రమ కలిగినది. ఇంతకును శ్రీ శివరామ శాస్త్రిగారు భౌతికోపాధిని విడిచినను, ఆత్మస్వరూపముతో నాంధ్రదేశమునం దంతటను సంచరించుచు నిరంతరాంధ్రవిజ్ఞానాభివృద్ధినే యాశాసించుచందురని మహర్షి తుల్యులైన వారియెడ నాకుంగల విశ్వాసము. ఇట్టి యథార్థవిజ్ఞానమే భావిసంతతి భాగ్యమును గోరుచు, జ్ఞానధన వితరణము చేయుచు స్వేచ్ఛతోను, గాలవశ మునను స్థూలోపాధులను వీడిపోయిన మహర్షులను సాధక లోకముచేత స్మరింపంజేయుచున్నది. కావున నీవిధముగా నీవ్యాస మవతరింప నిదానభూతులై బ్రహ్మలీనులైన శ్రీ శివరామశాస్త్రిగారి పరమప్రేమకును, ఆత్మబలమునకును ననారత వందనములు. భిన్న భిన్నావకాశములందు భిన్న భిన్న శిష్యుల సహాయముచే సిద్ధమైన యీరచనమందు నెన్నివిధముల స్ఖాలిత్యములో చదువరులు కనcగలుగుదురు.

గీ. ముదిమి రాకాసిసందిట నొదింగియుండి

యతిథులంబలెం దెవుళుల నాదరించు

చెట్టొ నాళులు నెట్టెడి యీ రచయిత

నెరసులను సైచి బుధులు మన్నింత్రుగాక !

సాధన గ్రంథ మండలి వ్యవస్థాపకుల నిష్కామ-నిర్మాయిక ప్రోత్సాహరసాయనసేవ తఱచుగా శ్రీ మాతృలీలంగా నగుచుండుటనేమో, నేఁడు కన్ను లేని కదలలేని యీ భౌతికోపాధియం దపూర్వబలమును దలమెత్తించుచు జిన్న చిన్న క్రొంగూర్పులను జేయించుచున్నది పదునై దేండ్లుగా శ్రీమత్సింహాసనేశ్వరి 'ఓం నమలు' నేర్వని లేబిడ్డలను జెంతం బెట్టుకొని వ్రాయంఁ జదువనేర్పు తల్లివలెనే తాను నాకుఁ జెప్పి వ్రాయించిన యాకుంగట్టలకు వీఁకతో వలంఁతులచే మెచ్చులను వ్రాయించి యచ్చునకుం దెచ్చుచు నన్నొక కూరుపరిగాఁ దెనుఁగుమాగాణికిఁ జూపుచున్న శ్రీ శాస్త్రిగారిని మదుపాస్య పరాశక్తి సర్వశక్తి మంతుని జేసి నూఱండ్లు మనుచుగాత మని నిచ్చలు నడిగికొందును.

అపూర్వసాహసముతో బయల్పెట్టిన యీ వ్యాసమును సాధకోత్తములే ప్రేమతో ననుశీలించి యాచరణమునకుఁ దెచ్చుకొని మందాధికారులైన తమ యంతేవాసులకు శక్తి - శక్తి పాత-కుండలినీ - తజ్జాగరణాది ముఖ్య విషయములను బ్రేమతోఁ బోధింపఁ బూను భాగ్యవంతులకు శ్రద్ధావిశ్వాస రూపబలముగా నిత్యము సంధ్యావందన కాలమందుఁ బిలువఁబడు గాయత్రీపరాశక్తి తన 'బలిప్రియా' నామమును సార్థకము చేసికొనుచు సర్వశక్తిమయి కావున సర్వశక్తి మంతులను జేయఁగలదని విశ్వసించుచు నందులకై కుండలినీమహాశక్తిని వేడుకొనుచున్నాను. ఈ వ్యవసాయ మంతయు నాపరాశక్తి యందే యర్పించుచున్నాను.

ఇటులు,

వినీతశాక్తబంధుండు

శ్రీ శ్రియానంద నాథుఁడు

Shaktipatamu    Chapters    Last Page