Shaktipatamu    Chapters    Last Page

శ్రీ మాత్రే నమః 
ఓం ఈం నమః

అవతారిక

సౌమ్యసాధకపాఠకులకు నావి రెండుమాటలు. శక్తిపాత పూర్వక దీక్షాదాన మనుమాట తాంత్రిక గ్రంథములయందుఁబలు తావులఁ జూచియుందురు. అపుడు శక్తిపాతమునుగూర్చిన జిజ్ఞాస పొడముట సహజము. అయినను దీక్షాగ్రహణార్థి గురువుల నడుగడు. గురువులునుం జెప్పరు. కాని, గాయత్ర్యాది మంత్రదీక్షా కాలమున గురువులు చేయు, శిష్యుని చేఁ జేయించు ప్రయత్న క్రియాకలాప మీశక్తి పాతలాభమునకే యని తెలియవలయును. అవ్వేళ నగు హోమాదికార్యములచేఁ దృప్తులగు దేవతల యనుగ్రహము, వేదాది విద్యాసంపన్నులగు సదస్యుల యాశీర్వాదము సైతము గురుశిష్యులం దీశక్తిపాతమునకే తోడగు ననుటయు మఱవవలదు. పలుగురు గురువులు దీక్షల నిచ్చుచున్నారు. పెక్కండ్రు శిష్యులు దాని నందుకొనుచున్నారు. ఈ శక్తి పాతప్రయత్న మపు డెంత జరుగుచున్నదో చెప్పఁజాలము. కాని యథార్థశక్తి పాతమే యగునపుడు తత్కాల మందే కొందఱు శిష్యులందుఁ గొన్నిలక్షణములు గాన వచ్చును. నా చిననాఁటి గురుశక్తి పాతానుభవములు
ఇచట స్వీయకథ కొంత చెప్పక తప్పదు. నా పదియవ యేటనే యొక చంద్రగ్రహణ వేళ మాజనకులు సకుటుంబ పరివారముగా నదికేఁ బోయిరి. అందఱమును స్నానమును జేసితిమి. నాన్నగారు శిష్యసహాయముతో స్త్రీల నింటికి మరల్చిరి. వారివలన మున్నే దీక్షగైకొనియున్న మాతల్లిగారు, నిరువురు శిష్యులుమాత్రమే యట మిగిలియుండి పుణ్య కాలజాపక్రియకుఁ గడంగిరి. ఇంటికి మఱలిపోవువారితో నన్ను బోనీయక యట్టేయుంచి చేరందీసి దర్భాసనముపై గూర్చుండఁ బెట్టి యాచమింపఁజేసి మహాగణపతిమంత్రదీక్షాదానమునకుఁ గడంగిరి, డెబ్బదియేండ్ల వెనుకటి యాచారముగాఁ గుమారుని వడుగుఁ జేసినది మొదలు సమయము వితకాకుండ సంధ్యా వందనక్రమశిక్ష చేయించుటయుఁ, దమయోపినంతగా నందలి విషయము వివరించుటయు నూటికిఁ బాతికగా నైనను జరుగుచుండెడిది. 'గర్భాష్టమేఘ బ్రాహ్మణ ముపనయీత' అనునట్లు కారణాంతరములచేఁ జరుగకున్నను నాతొమ్మిదవ యేట నుపనీతుని జేసిరి. కాన నాచనునాదిక్రియలు వడివడిఁ జేయఁగల్గితిని. నాయనగారు దీక్షాదానమునకై సంకల్పము చేసిరి. దీక్షాగ్రహణమునకై నాచేఁ జేయించిరి. హస్తమస్తక సంయోగము చేసిరి. తీవ్రముగా నా మొగమువంకఁ జూచిరి. తమ కుడియెడమ యడుగులపై నా కుడియెడమచేతులఁ బెట్టించిరి. తన మొగమునే పట్టుగాఁ జూచుచుండు మని నన్ను శాసించిరి. ధ్యానశ్లోకము చెప్పి యనిపించిరి. మూలమంత్రమును జెవినివైచి ముమ్మాఱనిపించిరి. ముసుగు వేయలేదు. ఋష్యాది న్యాసములు చేయింపలేదు, మూఁడవసారి మంత్ర మనఁజేసిన తరువాత మఱల వారు హస్తమస్తకసంయోగాదికమును జరిపి నంతనే యొక వింత. వైశాఖపూర్ణిమ. శీతర్తువు కాదు. అంతదాకఁ జలి లేదు. నాయందు వణకుతో శ్వాసమందు బింకము రేగినది. తల్లియు సతీర్థ్యులును దమజాపమందుఁ దాదాత్మ్యము మాని కుమారున కేమిత్తురో యని కుతుకముతోఁ జూచుచుండి రేమో, నా శరీరకంపాదికమును గాంచి చప్పున లేచి వచ్చిరి. తండ్రిగారు వారిని యథాస్థానమునకుఁ బొమ్మని తర్జనీసంజ్ఞ చేసిరి. వారపుడు తమచేతిని శిరాది మూలాధారాంతము ముమ్మాఱు నడిపి తడిచేతితోఁ గన్నులను దుడిచిరి. కంపాదికము శమించినది. అబ్బీ! నావైపే చూచుచుఁ గూర్చుండు మనిరి. గ్రహణమోక్షపర్యంతము వారేమి చేసిరో నాకుఁ దెలియలేదు. కాని మఱల నందఱమును స్నానముచేసి యిలు చేరితిమి. ఆయేటనే యాశ్వినబహుళషష్ఠి (ఆర్ద్రానక్షత్రము) నా జన్మతిథినాఁడు శ్రీ మేధా దక్షిణామూర్తి మనుదానము చేసిరి. గణశమంత్రాదాన వేళనువలె వణఁకు మున్నగునవి లేవు. కాని గట్టి నవ్వు రేగినది. వారు నొక్కి యడిగినను హేతువు చెప్పలేక పోయితిని.
నాపదమూడవయేట నాంగ్లవిద్య మూఁడవఫారములోఁ జదువుచుంటిని. ఆ తరగతి యయ్యవారలే శ్రీ రాయవరపు కొండలరావు పంతులుగారు. ఒక రాత్రి తెల్లవారుజామున మా యింటికి వచ్చి మాతండ్రిగారి యనుమతినొంది తమ సంకల్పము బయలుపెట్టకయే పిల్లవానిని నాతోఁ బంపుఁడని కోరుచు 'నాయనా! నీ పొత్తిపంచె, తువాలు పట్టుకొని రమ్మనిరి. నాకు లోతందలేదు. బాల్యము. మా తండ్రిగారు మాత్రము పంతులుగారు సిద్ధపురుషు లనియు, మహర్షితుల్యు లనియు బాగుగా నెఱిఁగియుండుటచే 'నీ మహాత్మునివలన నేదో యాధ్యాత్మికలాభమును మావాఁడు పొందఁగలఁ' డను సంతోషముచేఁ గాఁబోలును, జిఱునవ్వుతో సంపకము చేసిరి. మాష్టరుగా రూరు దాటించి నన్నొక మైలున్నదూరమున నున్న చెఱువునకుఁ గొనిపోయి, వడివడిఁ గాల్యములను నెఱవేర్పించి, స్నాన మాడించి, పొత్తిగుడ్డ గట్టించి, సంధ్యావందనము కానిమ్మనిరి అది ముగియగానే యథావిధిగా శ్రీరామాష్టాక్షరమహామంత్రమును వాగ్బీజయుతముగా నిచ్చి, వారునుఁబున రాచమనాదులఁ జేయించి, మోమునఁ జూపు సారించి, పదిసారు లనిపించి, యొడ్డెక్కించి, చెఱువు దక్కినవుగట్టు దించి, ''అబ్బాయీ! చాలునులే!'' యని నేననువఱకు నీగట్టునఁ బొరలుచునే మంత్రజపము చేయుమనిరి. అది గొడ్రాతినేల చూచి భయపడితిని. కాని మాష్టరుగారి యాజ్ఞ మాటాడలేకపోతిని. ఉల్లంఘించితినా? తండ్రి దండింపఁగలండరి భయము. మేను వ్రాల్చితిని, దొరల నారంభించితిని. కొంతసేపటికి నే నెచట నుంటినో, యేమి చేయుచుంటినో, చెంతనున్న గురువు లేమి చేయుచుండిరో తెలియలేదు, తరువాత వారేమి కనిపెట్టిరో చప్పున వచ్చి లేవనెత్తి కూర్చుండఁ బెట్టి తమచేతి తడిగుడ్డతో మొగముమాత్రమే తుడిచిరి. మేననంటిన ధూళి చేతితోఁ దుడిచివేసిరి. శ్రమ, నొప్పి మున్నగునవి తోవలేదు. మఱలఁ జెఱుపున మునుగఁజేసి నన్ను నాయింట నొప్పగించి రెండవపూట నాలుగుగంటలకుఁ దమయింటికి రమ్మని యానతిచ్చిరి. ధ్యానశ్లోకరహస్యమంత్రార్థములను బోధించి వ్రాసికొమ్మనిరి. ''నాఁటికంపాదికము; నేఁటి కఠిన దండనమును బోలిన కర్తవ్యనిర్వహణమందుఁ గ్లేశ'' - మనునవి గురుశక్తి పాతలక్షణములే యని తెలియఁజాలని వయోవస్థ.
మఱి నా పదునేనవయేట నైన యయాచిత సౌర మహామంత్రదీక్షాలాభకథ నిటీవల నావ్రాసిన ''మహాసౌర మంత్రపాఠాను వాదమునందుఁ'' జూడఁ దగును. (తెనలి సాధన గ్రంథ మండలి యందు లభించును.)
యోగము నవలంబింపక శ్రేయము నందలేము.
ఇక్కాలమున గృహస్థాశ్రమమును వదలి ఘోరమైన తపస్సు చేయువారికే 'యోగసాధనము సాగు' ననెడి ప్రతీతి యల్లుకొన్నది. మనపూర్వులు గృహస్థ ధర్మపాలనము చేయుచునే యోగమందున్నతస్థితి నందినవిషయము భారతు లెల్ల రెఱిఁగినదే. యోగిరాజైన శ్రీకృష్ణభగవానుని జీవనము నుదాహరణముగాఁ దీసికొనవచ్చును. గృహస్థాశ్రమియై యున్నను శ్రీకృష్ణుని యలౌకికకర్మములవలననే మన మాయనను సాక్షాద్బ్రహ్మముగా స్వీకరించితిమి. గృహస్థాశ్రమము నందుఁ జేయుసాధన మిహపరశుభకరము.
యోగసాధనమునకు దృఢమై యవిరతమైన కృషి యవసరమనియు, నది మనపూర్వులును మార్గప్రదర్శకులునైన వ్యాస వసిష్ఠ పతంజల్యాదులైన వారి గ్రంథములఁ జదువుట వలన మాత్రమే ఫలించుట యసంభవమనియు నంగీకరింపక తప్పదు ఏలన, నా మార్గమందు బ్రహ్మమును జేరుటకు ననేకవిఘ్నములు సాధకుని బ్రలోభముల పాల్జేసి యాతని యంతిమధ్యేయమైన మోక్షప్రాప్తినుండి వంచితుని జేయును. దీనికి నేకైక సులభ##మైన యుపాయ మొక్కటియే. అదియే సద్గురుకృప. అట్టి సద్గురువు లోకోపకార బుద్ధితో సిద్ధమహాయోగలాభమును దన 'శక్తి పాతమువల్లనే' కలిగించును. శక్తి పాతమునకును, 'మెస్మరిజం' అనుదానికి నాకాశపాతాళములకుఁ గలంత యంతరము కలదని జిజ్ఞాసువులు మఱవకుందురుగాక! 'మెస్మరిజమునందుఁ' గర్త నిమిత్తముగాఁ గొన్న వ్యక్తిని వశీభూతునిగాఁ జేసికొని, తన యిష్టానుసారముగాఁ గార్యమును జేయించుకొనును. కాని యీపని కేవలము స్వార్థలాభమునకే యుపయోగపడును. కర్త యొక్క ప్రభావము తొలఁగఁగనే నిమిత్త మాత్రుఁడైనవాఁడు స్వస్థతనుండి సైతము దిగజాఱి పోవును. ఆతఁడు'మెస్మరిజము' చేసినవాని నేనగించుకొనును వానిని జూచి భయభీతుఁ డగును. ఇంక శక్తి పాతమందో, గురువు శిష్యుని యాత్మశక్తిని వికసింపం జేయును. దానివలన శిష్యునకు సర్వతోముఖాభివృద్ధి కలుగుటే కాక యాధ్యాత్మిక జ్ఞాన ముదయించును.
లేళ్లు జలభ్రాంతితో నెండమావుల వెంట నంటి పరుగిడునట్లు మనము దేనికై యాధునిక పాశ్చాత్య దేశములవంకఁ బరువెత్తుచున్నామో, యది భౌతికవిజ్ఞాన మాత్రమే, అది యాత్మజ్ఞానమునకు దవుదవ్వులఁ గొనిపోయి వినాశమువైపునకే యీడ్చుకొనిపోవును. ఆత్మానందలాభమునే మనము పొందఁ గోరుదు మేని- వాస్తవికమైన సుఖమునే యనుభవింపఁ గోరుదుమేని- సర్వతోముఖాభివృద్ధినే యాశింతుమేని - మనదేశమును జాతిని సంస్కృతిని రక్షింపఁ దలఁతుమేని- మన దృష్టులు మన ప్రయత్నములు యోగసాధనమువైపే మఱలవలయును. సద్గురువులు లేరని చింతింపవలదు. హృదయమందుఁ గేవల జిజ్ఞాస పొడమవలయును. ఈ పుస్తకము సహజసాధ్యమైన శక్తిపాతజ్ఞానమును విశదీకరించుటకే యుద్దేశింపఁబడినది. సాధకలోకము దీనివలన యుపయోగమును రవ్వంత పొందు చున్నదని వినుటయే నా యాశించిన ప్రతిఫలము.

Shaktipatamu    Chapters    Last Page