Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము .

భగవద్విషయము

ప్రాముఖ్యము

హిందూమతములో మానవు డుత్తమస్థితిని పొందుటకు మూడు మార్గములు గన్పట్టుచున్నవి.

(1) కర్మ, (2) భక్తి, (3) జ్ఞానము.

ఈమూటికిని సామాన్యలక్షణము భగవద్విషయము. ఈశ్వరున కిష్టమైనకర్మనీశ్వరప్రీత్యర్థము చేయుట కర్మయోగము. ఈశ్వరనామస్మరణము, ఈశ్వరారాధనము, ఇత్యాదికము భక్తియోగము. ఈశ్వరానుగ్రహమువలన బడయదగినది జ్ఞానము. కొందఱిమతమున భక్తిని దృఢపరచుటకు సహాయపడునది జ్ఞానము. ఇట్లు హిందూమతములో సమస్తము భగవన్మయమే కావున, హిందూమతములో భగవద్విషయ మొకయంగ మేయని భావింపరాదని తేలుచున్నది.

పైని తెల్పిన మూడు మార్గములతోను పేర్కొనదగిన వైరాగ్యమను నుత్తమసాధనముగూడ భగవద్విషయకమైనదే. ఈశ్వరునియందు మనస్సు లగ్నమగుటకై ప్రాపంచిక సుఖముల నుండియు, బంధములనుండియు మనస్సును మరలించుట వైరాగ్యము.

భగవంతునితో సంబంధింపని దేదియు హిందువునకు రుచింపదు. హిందువుల వాఙ్మయము, కళలు, విద్యలు అన్నియు భగవత్కైంకర్యము కొఱకే యుద్దేశింపబడినవి. ఎంత కవితా సౌందర్యముగల కావ్యమైనను నందు భగవద్విషయములేనిచో దానిని మనవారు కుకావ్యమని నిందించినారు. నృత్యము, గీతము, శిల్పము మున్నగుకళలన్నియు భగవత్సేవాసాధనములుగనే మనప్రాచీను లభ్యసించిరి. త్యాగరాజాది సంగీతాచార్యు లందఱు మహాభక్తులు. నేటికి నిలచియున్న హిందూ శిల్పసౌందర్యము దేవాలయములపైననే కన్పట్టగలదు. ఒక గ్రామ మెంత పెద్దదైనను, ఎంత విద్యాసంపన్నమైనను, ధనసంపన్నమైనను గూడ నందు దేవాలయములేనిచో, దానికి కుగ్రామమనియే మనవారు నామకరణము చేసినారు. తుదకు మనము సంపాదించుకొన్న ధనముతో మనము భుజించుచున్నను. నా భోజనము భగవన్ని వేదితము కానిచో నది నిషిద్ధమే. దానిని మనవారు దొంగసొత్తనినారు. అట్టి యన్నము తినువాడు దొంగయని భగవద్గీత 3-12 చెప్పుచున్నది.

పరమేశ్వర లక్షణములు

భగవంతుని ముఖ్యలక్షణములనుగూర్చి హిందూమతమందలి యన్ని సంప్రదాయములవారు నేకీభవించుచున్నారు. అన్ని లక్షణముల పరమావధులు పరమేశ్వరునిలో గలవు. పరమేశ్వరుడు సర్వవ్యాపి; సర్వజ్ఞుడు; సర్వాధారము; సర్వశక్తిమంతుడు.

మనము చూచునట్టికాని, చూడలేనట్టికాని, మనస్సుచే నూహించునట్టికాని, యూహింప లేనట్టికాని యేస్థలములోనైనను పరమేశ్వరు డున్నాడు.

ఈజగత్తు నశ్వరమగుటచే నీజగద్దృష్టితో మన కేర్పడిన విరాట్పురుషునకును, ఈశ్వరునకును ప్రసక్తి లేనికాలమొకటి యుండవచ్చునని మన మూహించుటలో ననౌచిత్యము లేదు. మన యూహకుమాత్రము గోచరమగునట్టియు లేదా యూహాతీతముగూడ నైనట్టియు నాపరిస్థితిలో నద్వితీయమై యుండునదియే పరమాత్మ. సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన యీయాత్మ సచ్చిదానంద స్వరూపమై నేడుకూడ మహాజ్ఞానులచే ననుభవింపబడుచునేయున్నది. వారిదృష్టిలో నీజగత్తు మ యాకల్పితము. వాస్తవికము గాదు. ఈవిషయములో హిందూమతములోని వివిధ సంప్రదాయములవారు భేదించుచున్నారు. ఇది యద్వైతుల మతము. పరమాత్మకును, జీవునకును, జగత్తునకునుగల సంబంధమును గూర్చి ద్వైతాద్వైతవిశిష్టాద్వైత మతములే కాక సాంఖ్యాదిదర్శనములు గూడ పరస్పరము భేదించుచున్నవి.

ద్వైతులును, విశిష్టాద్వైతులును జగత్తు సత్యమే యందురు. అందు విశిష్టాద్వైతులు జగత్తు పరమేశ్వరు నాశ్రయించుకొని యున్నదందురు. ద్వైతులును, విశిష్టాద్వైతులును కూడ జగత్తులో, ప్రకృతిలో నంతటను, పరమేశ్వరుడున్నాడని యందురు. అద్వైతులు సమస్తగుణములకు నతీతమైన నిర్గుణ బ్రాహ్మపదార్ధమునుగూడ నంగీకరింతురు. సగుణ బ్రహ్మనుగూడ వారంగీకరింతురు. కాని నిర్గుణావస్థయే చరమమందురు.

విగ్రహారాధనము

వైష్ణవులు విష్ణువు వైకుంఠములో నున్నాడనియు, శైవులు శివుడు కైలాసములో నున్నాడనియు, నిట్లే యితర సంప్రదాయములవా రాయాదైవము లాయాస్థానములలో నున్నవనియు చెప్పుమాట వాస్తవమే కాని యేవైష్ణవుడునుగూడ విష్ణువు వైకుంఠములోనేకాని యిచట లేడని చెప్పడు. విష్ణు వెందుపట్టిన నందే యున్నాడనియే యాతడు చెప్పును. శివుడు కైలాసములోనేకాని యిచట లేడని యేశైవుడును చెప్పడు. శివుడు లేనిచోటు లేదనియే ప్రతి శైవుడును చెప్పును. అట్లే యితర సంప్రదాయములవారును తమ దైవము లేనిచోటు లేదందురు. కావున పరమేశ్వరుడు వైకుంఠములోగాని, కైలాసముపైగాని, మరొకచోటగాని యున్నాడని చెప్పువాని కెవ్వనికిని పరమేశ్వరుని వ్యాప్తిని గూర్చి లేశ##మైనను సంకుచితాభిప్రాయము లేదు. పరమేశ్వరుడు వైకుంఠములో నున్నాడనుటను, కైలాసములో నున్నాడనుటను పరిహసించువారికి మాత్రమే యీసంకుచిత భావమున్నది. వీరికి పరమేశ్వరుని గూర్చి విశాలభావమే యున్నచో, పరమేశ్వరుడు వైకుంఠములోగాని, కైలాసములో గాని యున్నాడనుటను పరిహసింపరు.

ఏవైకుంఠములోనో యుండువాడు లోకమంతలోను నెట్లుండగలడని యీవిమర్శకులశంక, ఒకచోట నుండుచు మఱియొకచోట లేకపోవుట యను శక్త్యల్పత్వము మానవునకేకాని దేవునకు లేదనివీ రెఱుగ లేకున్నారు. ఒకమానవుడొకచోట నున్నాడనుచో, నాతడు మరొకచోటున లేడని వేఱుగ చెప్పనక్కరలేదు, రెండుచోటులను నొకేసమయమున నుండుశక్తి వానికిలేదు. దేవునకుగూడ నీపరిమితశక్తియేనా? ఒకచోట నుండుచునే మరొకచోటగూడ నుండలేకపోయినచో నిక వాడు దేవుడేగాదు. 'విష్ణువు రామావతారముగా వచ్చినపుడు వైకుంఠము శూన్యముగా నుండెనా?' యని ప్రశ్నించువా రీయంశమును జ్ఞప్తియందుంచు కొనవలయును. బాగుగ యోగాభ్యాసము చేసిన మానవుడే యేకసమయమున ననేకస్థలములలో నుండగల్గినపు డిట్టిమానవులను కోట్లకొలది పుట్టించి, పెంచి, గిట్టించుచున్న భగవంతున కీమాత్రముశక్తి యుండదా? భగవంతునిగూర్చి యిట్టి స్వల్పాభిప్రాయ మున్నవానికి, భగవంతునిపట్ల హిందువులకు గలదృష్టి విపరీతముగ నర్ధమగుటలో నాశ్చర్యము లేదు.

హిందువుని దృష్టిలో భగవంతుడు సర్వవ్యాపి కావున నాత డేవస్తువులోనైనను పరమేశ్వరుని దర్శించి యర్చించును. విగ్రహము నారాధించినంతమాత్రమున నేహిందువుడును పరమేశ్వరుడు విగ్రహములో మాత్రమే యున్నాడని తలంపడని గుర్తింపవలయును. విగ్రహారాధన విమర్శకుడు లోకమంతలోను పరమేశ్వరు నెంతమాత్రము చూచుచున్నాడో, యంతమాత్రము విగ్రహారాధకుడును చూచుచున్నాడు. ఏవిగ్రహారాధకుడును విగ్రహమునకు బయటి ప్రదేశములో భగవంతుడు లేడనడు. విగ్రహారాధకునకు విగ్రహారాధనమును నిరసించువానికుండు పరమేశ్వరవిశ్వ వ్యాపకత్వభావ ముండుటయేకాక, యధికముగ పరమేశ్వరుని ధ్యానించుటలో నవసరమగు నేకాగ్రతకు తోడ్పడు సాధన మొకటిగూడ గలదు.

విశ్వవ్యాప్తియైన పరమేశ్వరుని విగ్రహములోనున్నాడని సంకుచితముగ నుడువుట యాతని కవమానము కాదాయని విమర్శకు డనును, కాని పరమేశ్వరుడు మానావమానముల కతీతుడని యీవిగ్రహారాధన విద్వేషులే నుడువుట యొక విశేషము. వారి సిద్ధాంతము ననుసరించియే యీ యాక్షేపణము తొలగిపోవును. మనము భగవంతునకు చేయుసేవ యాతని మేలుకొఱకుగాక మన మేలుకొఱకేకదా! ఉపాసకునిశక్తి ననుసరించియే యుపాసనసాధనము లేర్పడవలెనుగాని పరమేశ్వరుని శక్తినిబట్టి యేర్పఱచుట సాధ్యమా? కొండంత దేవునకు కొండంతపత్రి వేయగలమా? మనకు దృష్టి నిలుచుటకై విశ్వవ్యాపిని తాత్కాలికముగ విగ్రహములో దర్శింతము. ఇది మన సౌకర్యముకొఱకేయని గుర్తింపవలయును.

అనంతశక్తులను అపార వ్యాప్తిని గల్గిన పరమేశ్వరుని తానే సరియైనపద్ధతిలో నారాధించుచున్నానని చెప్పు విగ్రహారాధనద్వేషి తన్ను తాను వంచించుకొనుచున్నాడు. ఈ ప్రతిమారాధనద్వేషి పరమేశ్వరు నేవిధముగ నారాధించుచున్నాడో చూతుమేని, యాతని వాదములోని లోపమెటనున్నదో చూతుమేని, యాతని వాదములోని లోపమెటనున్నదో తెలియగలదు. ''ఓ జగద్రక్షకా,'' ''నా కాహారము నిడు నోతండ్రీ'' యని యీతడు దేవుని స్తుతించును. పరమేశ్వరు డవాఙ్మానస గోచరుడని యాతడు చెప్పును. అయినను తాను వాక్కులతో నెందులకు స్తుతించుచున్నాడు? మనస్సునకు చిక్కని పరమేశ్వరుని తానెందులకు మనస్సులో ధ్యానించుచున్నాడు? ఇట్లు కూడనిపనులను తా నొకవైపున చేయుచు దృష్టి కందని వానిని దృష్టితో బంధించు విగ్రహారాధకు నాత డెట్లు నిందించుచున్నాడు?

సామాన్యమానవులలో భగవంతుని కేదోయొకవిధమైనరూపము నీయకుండ తప్పించుకొనగలవా డుండదు. నిర్గుణబ్రహ్మోపాసన చేయగలవారిమాట నటుంచుడు. అట్టివారు కొలదిమందియే యుందురు. మిగిలినవారందరు పరమేశ్వరునకు రూపకల్పన చేయుచునే యున్నారు. భగవంతుని 'తండ్రి' యని సంబోధించినంతమాత్రముననే యొక రూప మిచ్చినట్లయినది. ఆరూపము మానసికమే యగుగాక. ఏవిశేషణము నుచ్చరించినను నొక మానసికవిగ్రహ ముదయింపక తప్పదు. పరమేశ్వరు డనంతలక్షణోపేతుడు. గావున నాతని కనంతసంఖ్యాక విగ్రహములను కల్పించుటలో నేమియు నసందర్భము లేదు.

ఏకేశ్వరోపాసనము.

విశ్వమందు దేనిలో నాపరాత్పరుని మహిమను చూచుటకు వీలులేదు? చెట్టులోను, పుట్టలోను, పశువులోను మానవునిలోను, శునకములోను, నీటిలోను, నిప్పులోను, అది యిది యననేల? అన్నిటియందు పరమేశ్వర శక్తి నీక్షించి నమస్కరింపవచ్చును. పరమేశ్వరుడు సర్వవ్యాపియని చెప్పు నితరమతములవారు కేవలము మాటవరుసకే యట్లు చెప్పుచున్నారు. కాని యాచరణములో నట్లు చేయుటలేదు. హిందువుని పరమేశ్వర విశ్వవ్యాపకత్వవిశ్వాసము కేవలము మాటలలోనే కాక చేష్టలలోకూడ వెల్లడి యగుచున్నది. హిందువు అశ్వత్థ వృక్షమును చూచి, నమస్కరించి, ప్రదక్షిణముచేసి భగవద్భావన వెల్లడించును. చెట్టులోనేకాక పుట్టలో కూడ హిందువు పరమేశ్వరుని చూచును. నాగచతుర్థి నాడు హిందూ స్త్రీలు పుట్టలో పాలుపోసి, సర్పమును పూజింతురు. ఆవును పూజించి హిందువులు పశువులలోగూడ పరమేశ్వరు డున్నాడని వ్యక్తముచేయుదురు. అభిరుచులను, వాసనలను బట్టి హిందువులు సాధారణముగ గోవునందే పరమేశ్వరుని చూచినను, శునకాదులలోగూడ వారు పరమేశ్వరుని చూడకుండలేదు. ''కుక్కలకును, కుక్కలను కాచుకొనువారికిని నమస్కార''మని (శ్యభ్యశ్శ్వపతిభ్యశ్చవోనమః) వేదములో చెప్పబడినది.

మన పూర్వజన్మవాసనలను, అభిరుచులనుబట్టి మనకు కొన్నిటియందే పరమేశ్వరుని చూచి ధ్యానించుటకు మనస్సెక్కును. కాని వాసనలను అభిరుచులను నతిక్రమించి బ్రహ్మాదిస్తంబపర్యంతము, క్రిమికీటకాదులలోకూడ, నేనాడు భగవల్లీలను చూడగల్గుదుమో యానాడే పూర్ణమైన భగవద్భావన గల్గినదని చెప్పవచ్చును. ఆభావన నలవరుచుకొనుటకు సాధనము లనేకములు హిందూమతమున కలవు. గోవు, అశ్వత్థము, ఉత్తమబ్రాహ్మణుడు మున్నగువానిలో పరమేశ్వరుని చూచుట అట్టి అభ్యాసములలో నొకటి. ఇట్లభ్యాసముచేయువాడు క్రమముగ నన్నింటియందును పరమేశ్వరుని, పరమేశ్వరునిలోనే సమస్తమును గుర్తించును. అట్టివా డమరత్వము నొందునని గీత చెప్పుచున్నది.

యో మాం పశ్యతిసర్వత్ర సర్వం చ మయి పశ్యతి,

తస్యాహం నప్రణశ్యామిసచమేనప్ర శ్యతి (గీత 6-30)

ఈయుత్తమస్థితిని పొందదలచిన హిందువులు మేఘుడు వర్షించుటలోను, గాలివీచుటలోను, నదులు ప్రవహించుటలోను, పరమేశ్వరునిశక్తిని చూతురనుటలో నాశ్చర్యములేదు. ఈ శక్తులనువారు ఇంద్రవరుణాది నామములతో వ్యవహరింతురు. ఇట్లే వారు రామకృష్ణశివాది దైవతములను కూడ పూజింతురు.

ఇంద్రవరుణ యమ సూర్యాదిదేవతలను గూర్చి హిందువులలో రెండభిప్రాయములు కలవు. 1. ఈ దేవతానామము లన్నియు పరమేశ్వరున కీయబడిన నామములే. 2. ఈ దేవతలన్నియు పరమేశ్వరునకు లోబడిన శక్తులే. ఈ రెండభిప్రాయములలో దేనియందును పరమేశ్వరు లనేకులున్నారను భావములేదు. ఈ రెండునుకూడ నేకేశ్వరభావమున కనుకూలములే.

ఇందు మొదటి సిద్ధాంతమును ముందు విచారింతము.

ఏకోశ్వరోపాసకులమని చెప్పుకొనుచు, ఇంద్రవరుణాది దేవతల నారాధించుట యనేకేశ్వరోపాసనమని నిందించువారు తాముకూడ వాస్తవముగ నట్టి బహుదేవతారాధనమె చేయుచున్నామని గుర్తింపలేకున్నారు. వారీశ్వరునకు 'వర్షము కురిపించువాడు', 'పాపవిమోచకుడు', 'సంహారకుడు', 'ఆరోగ్యప్రదాత' మున్నగు విశేషములను వాడుచున్నారు కదా! ఆ విశేషణముల యర్ధమే ఇంద్రవరుణాది పదములలో గలదు. పై విశేషణములను వాడెడు నేకేశ్వరోపాసకుని దృష్టిలో నీవిశేషణములు భిన్నములేయైనను, నొకేదేవున కెట్లు చెల్లునో, యట్లే హిందువుని దృష్టినో నీనామములు వేరేయైనను నివియన్నియు నొకే దేవునకు చెల్లును. ఈదేవతలు వేర్వేరనుటకు వీరి కచ్చటచ్చట పురాణములలో గన్పట్టు వివాదములు, వైరుద్ధ్యములు సాక్ష్యములని 'యేశ్వరోపాసకు' లందురు. కాని యట్టి దోషము వారి పద్ధతిలోను కలదు. వారు పరమేశ్వరునకు ప్రయోగించు 'రక్షకుడు', 'సంహారకుడు' అనువానికి వైరుద్ధ్యములేదా? ఇందొక విశేషణము చెల్లినచో, మరొకటి వ్యర్థము కావలసివచ్చునుకదా! ఈదోషమును పరిహరించుటకు వారేసమాధానము చెప్పుదురో యాసమాధానమునే ఇంద్రవరుణాదులకు గన్పట్టు వైరుద్ధ్యమునకు చెప్పుకొనవలయును. ముఖ్యవిషయ మేమనగా, మనమనస్సులు పరిమిత శక్తులగుటచే పరమేశ్వరుని యన్నిలక్షణములను నొకేసారి మనస్సులో నారోపించుకొని మనము ధ్యానింపలేము. పర్యాయముచేత మాత్రమే మన మాతని లక్షణములను ధ్యానింపగలము. ఒక్కొక్క పర్యాయము మనము కొన్ని లక్షణములనే పేర్కొనగలము. కాని యన్నింటిని పేర్కొనలేము. ఏకేశ్వరోపాసకుడనని చెప్పుకొనువాడు పరమేశ్వరుని రక్షకసంహారకాదులైన లొన్నివిశేషణముల నేకరవుపెట్టి సంతుష్టుడగుచుండగా, హిందువంతమాత్రమున సంతృప్తి నొందక యిందొక్కొక్క విశేషణముపై కొంతనిలచి పరమేశ్వరుని ధ్యానించును. ఆతడు రక్షకవిశేషణముతో తృప్తిచెందక యారక్షక లక్షణమునకు సంబంధించిన యంశము లన్నిటిని ప్రోగుచేసి వానికి సాముదాయికముగ విష్ణు ప్రశంస యని పేరిడును. ఇట్లే సంహారకలక్షణములను క్రోడీకరించి వానికి సాముదాయికముగ మరొక పేరిడును. దేవతాస్తోత్రముల యొక్కయు, పురాణగాధలయొక్కయు, తత్త్వమీవిధముగ నేకేశ్వరోపాసకుని ఈశ్వరవిశేషణ లక్షణముల తత్వముకంటె భిన్నమైనదికాదు. కాని యీ హిందూపద్ధతివలన పరమేశ్వర భావము మఱింత దృఢముగ మనస్సునకెక్కు నవకాశము గల్గును. కేవలము విశేషణముల నేకరువుపెట్టినవాని కీసదుపాయములేదు.

ఏకేశ్వరోపాసకుడనని చెప్పుకొనువా డీశ్వరునకు రక్షక విశేషణమును వాడి పిమ్మట సంహారకవిశేషణమును వాడుచో, వానిని మనము ''రక్షకత్వము గొప్పదా? సంహారకత్వము గొప్పదా?'' యని ప్రశ్నించుచో నాతడు 'రెండు నొకేదేవునకు చెందినవగుటచే రెంటిలో నొకటి తక్కువకా'దనును. అట్లే శివు నారాధించునపు డొక హిందువు శివుడు దైవమని భావించి, విష్ణువు నారాధించునపుడు విష్ణువు దైవమని భావించినను నొకనికే యీలక్షణములు చెందుటచే వీరలకు తారతమ్యముండుట యసంభవమని యాతడు తలంచును.

వైష్ణవులు శివు నర్చింపకుండుటయు, శైవులు విష్ణు నర్చింపకుండుటయు జూడ నీహిందువులకు పరమేశ్వరునిపట్ల సంకుచితభావము వెల్లడియగుట లేదాయని యడుగవచ్చును. ఇట నొక యంశము జ్ఞప్తియందుంచుకొనవలయును. వైష్ణవులు తమ దైవతమునకు శివుని ముఖ్యలక్షణములు లేవని కాని శైవులు తమదైవతమునకు విష్ణుని ముఖ్యలక్షణములు లేవని కాని చెప్పుటలేదు. అట్లు చెప్పినపుడే వారి భగవద్భావమునకు సంకుచితత్వమేర్పడును. విష్ణునకు లోకరక్షణము ముఖ్యలక్షణముగా వైష్ణవులచే భావింపబడుచున్నను, లోకసంహారకత్వము విష్ణువునకు లేదని యేవైష్ణవుడును చెప్పడు. అట్లే లోకరక్షకత్వము శివునకు లేదని యేశైవుడును చెప్పడు. శైవులు, వైష్ణవులు మాత్రమే కాక మిగిలిన యన్ని సంప్రదాయములవారును గూడ తమ తమ దైవములకు సృష్టిస్థితిలయ కారకత్వము నంగీకరించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనేకాక యితర దైవములనుగూడ నందేకము గావింతురు.

ఇక నామవిషయమున, నెవని కేది రుచించునో వాడు దానిని గైకొనును. శివలక్షణములకంటె విష్ణులక్షణములు భిన్నములు కావని యంగీకరించినపుడు, పేరేదియైననేమి? వ్యక్తి యభిరుచికి కొంత తావొసంగవలయునుగదా! అభిరుచినిబట్టి నామముండుగాక!

అట్లే గుణములలోగూడ కొన్ని కొందఱకు నచ్చవచ్చును. ప్రసంగము వచ్చినప్పుడు వైష్ణవులు తమతమ దైవమున కన్నిలక్షణములు నున్నవని చెప్పినను సాధారణముగ వారు భావించు గుణములు తమ యభిరుచులనుబట్టియే యుండును. వారు కల్యాణగుణములను భావింతురు. శాక్తేయులు తీవ్రగుణములను భావింతురు. ఇందేమియు దోషములేదు. ఇచటగూడ నభిరుచియే ప్రధానము. సామాన్య మానవు లెవ్వరు నీయభిరుచిని దాటిపోజాలరు. కనుకనే మానవస్వభావమును బాగుగ గురైఱిగిన హిందూమత మీయభిరుచికి తగిన యవకాశము నొసంగినది.

హిందూమత విమర్శకులు తీవ్రరూపారాధకులైన శాక్తేయుల నాక్షేపించుట కలదు. దానికి శాక్తేయులు చెప్పు సమాధాన మేమన: ''నీభౌతికదేహమున కేది ప్రియమో, దానినే నీవు పరమేశ్వరునియందు చూడగల్గి యితరములను చూడలేకపోయినచో నీకు పరమేశ్వరునిపట్ల గల భావ మసంపూర్ణమగును. తన స్థూలదృష్టికి లాభకరములుగ గన్పట్టు లక్షణములను పరమేశ్వరునియందు చూడగల్గుట ప్రతి మానవునకును సులభము. నిజమగు పరమేశ్వర భావము గలుగవలెనన్నచో ననంతగుణోపేతుడైన పరమేశ్వరునిలో మనకు నప్రియములై, భయంకరములైన లక్షణములనుగూడ చూచుట కలవాటు చేసికొనవలెను. మన భౌతిక దేహములకు మేలొనగూర్చు పరమేశ్వరు నర్చించుటలో విశేషభక్తి వెల్లడికాదు. మన ప్రాణములనుదీయు లక్షణములలోగూడ దేవు నారాధింప గల్గినపుడే భగవదా, వన విషయమున మనము కొంత యున్నతస్థితికి వచ్చినామని తెలిసికొనవలయును.'' ఈ సమాధానము నెవ్వరును ప్రత్యాఖ్యానము చేయజాలరు.

హిందువులలో నధికసంఖ్యాకులు నామరూపభేదములను పాటింపక, పరమేశ్వరు నేనామరూపములలోనైనను నర్చించువారే కలరు. అట్టివారు కూడ నాయా కాలములలో తమ మనఃస్థితినిబట్టి యేదో దైవమును ధ్యానింతురు. ఏనామ రూపములలో మనము పరమేశ్వరుని గ్రహించినను, సర్వనామరూప లక్షణోపేతుడు, లేదా సర్వనామరూప లక్షణాతీతుడు అగు పరమేశ్వరు డీసౌకర్యార్థము గ్రహింపబడిన పరమేశ్వరునికంటె భిన్నుడు కాడను నంశమును మనము గ్రహించుచో నట్టి పూర్ణ పరమేశ్వరుని పూజించినట్లే యర్థము. ఈవిధముగ పరిమిత నామరూపలక్షణములకును పూర్ణపరమేశ్వరునకును సమన్వయము కుదురుట యసంభవముకాదు. అసంఖ్యాకులైన మహాభక్తుల జీవితములే యిటనిదర్శనము. సుప్రసిద్ధభక్తుడైన రామదాసు శ్రీరాముని దశరథపుత్రునిగను, సీతాపతిగను పాణిపాదాదులుగలవానిగను తన హృదయములో ధ్యానించుచుండెను. కాని యీ శ్రీరాముడే విశ్వజనకుడును, విశ్వపతియు, విశ్వవ్యాపియు నైన పరమేశ్వరుడనుభావ మాతని నెన్నడును నెడబాయకుండెను. ఈ విధముగ నేదేవత నారాధించినను నది పూర్ణ దేవతారాధనమె యగును. హిందువులలో సర్వసాధారణముగ గన్పట్టు నారాధన మిద్దియే.

ఇక నింద్రవాయువరుణాదులు పరమేశ్వరునకు లోబడిన శక్తులను సిద్ధాన్తమునుగూర్చి యొకమాట చెప్పవలసి యున్నది. దీనిని బట్టి యీ దేవతలు పరమేశ్వర సృష్టిలోని యొక యున్నతమైన యంతరమునకు చెందినవారనియు, మానవులు వారి నారాధించుచో, వారు సంతుష్టులై మానవుల సంకల్పములను తమశక్తి కొలదియు తీర్తురనియు విశ్వసింపబడు చున్నది. ఇతర సంప్రదాయముల వారు కూడ సృష్టిలో నిట్టియంతరముల నంగీకరించి యున్నారు. ఈ భావముతో నింద్రవరుణాదుల నారాధించుట పూర్ణపరమేశ్వరారాధనము కాజాలదు. ఇట్లారాధించువారి కాయా దేవతలపట్ల పూర్ణమైన శ్రద్ధాభక్తులుండవచ్చును. ఆరాధన ఫలితముగ నాదేవతలు వారికోరికలను తీర్చవచ్చును, కాని యిట నారాధకున కారాధిత దైవతముపట్ల సర్వశక్తిమత్త్వ సర్వవ్యాపకత్వాదిభావములు లేకుండుటచే నిది పరమేశ్వరాతిరిక్త దేవతారాధన మగును. కాని లోకములో నన్నిశక్తులును పరమేశ్వరునివేకాదా! కనుకనే శ్రీకృష్ణు డిట్టివారన్యదేవతారాధకులేయైనను తుదకు వారును తన్నే యపమార్గమున నారాధించుచున్నారని చెప్పినాడు.

యేప్యన్యదేవతా భక్తాయజన్తేశ్రద్ధయాన్వితాః

తే పి మా మేవ కౌన్తేయ యజన్త్యవిధిపూర్వకం. (గీత 9-23)

కావున నేదేవత నారాధించినను, విశాలభావముతో నారాధించుటయే శ్రేష్ఠము. పరిమితశక్తిగల దేవత నారాధించుటలో నేకాగ్రత కవకాశము హెచ్చుగనున్నమాట వాస్తవమే. కాని యాపరిమితశక్తిగల దేవత యనంత పరమాత్మశక్తులలో నొకటియను భావముతో నారాధింపదగును.

ఇంద్రవరుణాదిదేవతల స్తుతులతో నిండిన విశాల వేదసంహితా. వాఙ్మయముయొక్క పరమబోధ యేమన, 'సత్పదార్థ మొక్కటియే. ఇంద్రవరుణాది నామములతో నాపరమాత్మనే పండితులు వ్యవహరించుచున్నారు.' ఈయంశము విస్పష్టముగా బుక్సంహితలో చెప్పబడియున్నది.

'ఏకం సద్విపరా బహుధా వదన్తి' (3-164-46)

పరమేశ్వరానుగ్రహమును సంపాదించుటకై భక్తాగ్రేసరుల నారాధించుట యొకమార్గమని కొన్నిసంప్రదాయములవారు నమ్ముదురు. స్థూలదృష్టితోచూచిన నిది పరమేశ్వరాతిరిక్తారాధనముగనే యుండును గాని సూక్ష్మముగ బరికించిన నిందలి తత్త్వ మేకేశ్వరోపాసనమేయని తెలియగలదు.

ఆరాధన పద్ధతులు

ఇక హిందూమతములోగల భగవదారాధన విధానములను కొన్నిటిని పరికింతము,

1. స్వవర్ణాశ్రమ విహితకర్మ నీశ్వరార్పణబుద్ధితో నాచరించుట భగవదారాధన విధానములలో నొకటి. ఇది తప్పక సిద్ధినిచ్చునని భగవద్గీత చెప్పుచున్నది.

యతఃప్రవృత్తి ర్భూతానాం యేన సర్వమిదం తతం,

స్వకర్మణా తమభ్యర్చ్యసిద్ధిం విందతి మానవః (18-46)

గీత నిష్కామకర్మను బోధించుచున్నదనియు, తామేమియు ఫలము నపేక్షింపక, దేని నాచరించినను నది తమ్ము బంధింపదనియు నాధునికులు కొందరు చెప్పుచున్నారు. కాని గీతామతమున నేదియో యాచరించినచాలదు; శాస్త్రసమ్మతమైన కర్మనే యాచరింపవలయును, మరియు గీత శుష్క నిష్కామకర్మను బోధించుటలేదు; ఈశ్వరార్పణబుద్ధితో కర్మ చేయవలయునని చెప్పుచున్నది. గీతామతమున భగవద్భావన యత్యంతము ముఖ్యము. స్వవర్ణాశ్రమ కర్మ నీశ్వరార్పణ బుద్ధితో చేయుట హిందూమతములో ముఖ్యమైన యారాధన విధానమని చెప్పదగును.

2. నామస్మరణము, మంత్రజపము అనునవికూడ ముఖ్యములైన పరమేశ్వరానుగ్రహ సంపాదనమార్గములే. నామస్మరణమువలనను, మంత్రజపమువలననుగూడ చిత్తైకాగ్రత సులభముగ గల్గును. మంత్రముల యక్షరసంపుటిలో మహత్తరమయిన శక్తి కలదని యిదివరలో చూచి యుంటిమి. మంత్రముల యొక్క యక్షరములను గాని యది వైదికమైనచో స్వరమునుగాని మార్చుటకు వీలులేదు. మఱియు, మంత్రమును గురుముఖమునుండియే గ్రహింపవలయును. ఆమంత్రము నిదివఱలో హెచ్చుగ జపించి దాని మహత్త్వమును అనుభవపూర్వకముగ గొంత తెలిసికొనిన మహాపురుషుని ముఖమునుండి గ్రహించిన దానికిని ముద్రిత గ్రంథములోనుండి కాని, లిఖితగ్రంధములో నుండి కాని గ్రహించినదానికిని ఫలితములో చాలభేదముండును. కావున మంత్రములను సద్గురువులనుండి యుపదేశము పొంది జపించుట యవసరము.

3. హిందువులలో సాధారణముగ నాచరణములో నున్న భగవదారాధన విధానములలో షోడశోపచార పద్ధతి యొకటి. షోడశోపచారము లెవ్వియన: ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, యజ్ఞోపవీతము, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్పము. మానవుడు సాధారణముగ మానవవాసనల నతిక్రమింపజాలడు. గావున పరమేశ్వరు నర్చించుటలో నీపద్ధతి యెంతయు సహజమైనదియే కాక న్యాయమైనది కూడ నని చెప్పవలయును.

''పరమేశ్వరుని యందు భక్తియుండుచో దానిని లోపల దాచుకొనరాదా? అర్ఘ్యపాద్యాదుల రూపమున నెందులకు వ్యక్తము చేయవలయును?'' యనుట యర్థము లేనిమాట. భక్తియనునది యొకటి లోపలున్నచో, నదియేవిధముగనో బయటకు వచ్చును. భక్తుల భక్తిప్రకటన విధానములను వెక్కిరించుట వెఱ్ఱిపని. భిన్నమానవుల మనః ప్రవృత్తులనుబట్టి భక్తిప్రకటన విధానములుండును. కుమారునిపై తండ్రికి ప్రేమయుండును. ఒక్కొక్కడు కుమారుని దూరమునుండి చూచియే యొక చిరునవ్వు నవ్వును; మఱొకడు కుఱ్ఱవాని చెంతకేగి వానివీపుపై చఱచి యానందమును వ్యక్తపరచును; ఇంకొకడు పిల్లవాని నెత్తికొనిననేకాని తృప్తినొందడు; వేఱొకడు బిడ్డను ముద్దిడుకొనిననేకాని తనయుడు; తనివితీర పిల్లవానిని కరచిననేకాని విడువని తండ్రులు కొంద ఱుందురు. భక్తుని భక్తికూడ నీ ప్రేమవలెనే యనేకవిధముల వ్యక్తమగును. అట్టి భక్తిప్రకటన విధానము నాక్షేపించుట భగవంతు నాక్షేపించుటయే యగును.

''టెంకాయలు, మంత్రపుష్పములు దేవుని కెందులకు? వీనికొఱకై దేవుడు మొగమువాచియున్నాడా?'' యను కువిమర్శకులు గలరు. ఈవిమర్శకులు గూడ భగవద్ధ్యానము చేయువారే. వారు కన్నుమూసికొని, మోకరించి భగవద్ధ్యానము చేయవచ్చును. ''నీకన్నుమూతలకొఱకును, మోకరింపుల కొఱకును భగవంతుడు మొగమువాచియున్నాడా?'' యని యడిగిన అట్టివా డేమి సమాధానము చెప్పును? ''ఇది నామనస్తృప్తికొఱకే చేయుచున్నాను'' అని చెప్పును. షోడశోపచారములను గూడ నితరుడు తన మన స్తృప్తికై చేయకూడదా? భగవంతునకు టెంకాయలు లేవనుభావముతో నొక్కభక్తుడైన నిచ్చుచున్నాడా? ఇట్లు సనాతన భగవదారాధన విధానమును దేనిని తీసికొనినను, అది యాధునికుల విమర్శకులకు లొంగునది కాదని నిశ్చయముగ చెప్పవచ్చును. ఈ షోడశోపచారపద్ధతి యేవిధముగను దూష్యముకాకపోవుటయే కాదు, హిందువులలో భగవదారాధన పద్ధతికి జీవము నిచ్చుచున్న దీవిధానమే యని చెప్పవలయును.

4. మంత్ర తంత్రాగమశాస్త్రవిధుల ననుసరించి గృహములలోను, దేవాలయములలోను జరుగు నర్చనవిధానము హిందూమతములోని మఱియొక ప్రత్యేకలక్షణము. మంత్రతంత్రములప్రశంస యిదివఱలో కొంత గావింపబడినది. హిందూదేవాలయములు కేవలము ప్రార్థనమందిరము లనుకొనరాదు. హిందూదేవాలయములలో ఆగమవిధానముచే మంత్రరూపమునను, యంత్రరూపమునను, తంత్ర రూపమునను, అపారమైనశక్తి ప్రవేశ##పెట్టబడును. అంతటను భగవంతుడున్నను మహాపురుషులలో నాతని యంశము హెచ్చుగ నున్నదని యాధునికులుగూడ నెట్లంగీకరించుచున్నారో యట్లే యన్ని ప్రార్థనమందిరములలోను పరమేశ్వరుడున్నను, ఆగమవిధానము ననుసరించి నిర్మింపబడి నిర్వహింపబడుచున్న దేవాలయములో భగవచ్ఛక్తి హెచ్చుగ నున్నదని యంగీకరింపవలయును. ఆగమానుసరణముచేత మహత్త్వమును పొందిన దేవాలయములలో ఎవరెంతవరకు రావచ్చునో ఏవిధముగా నర్చన చేయవలయునో యను విషయమున ఆగమములు విధించిన నియమములను పాటింపక యందరకును దేవాలయమున నొకేవిధమగు స్థానమునొసగుట వెఱ్ఱిపనియేకాక, దేవాలయములలో ఆగమమూలకముగ ప్రవేశ##పెట్టబడిన మహిమను పోగొట్టుటకును, విషమమార్గమున త్రిప్పుటకును కారణమనికూడ చెప్పవలయును.

5. అనంతరూపలక్షణోపేతుడైన శ్రీపరాత్పరు నుపాసించుటలో ననేకవిధములైన మార్గములు శాస్త్రములలో చెప్పబడినవి. ఆ యుపాసనలన్నియు నియమపూర్వకముగ సద్గురువుల యుపదేశము ననుసరించి చేయదగినవి. ఏవిధమైన యారాధనకైనను, చిత్తైకాగ్రత యవసరము. కావున నన్నిటికిని పాతంజలయోగసహాయము తప్పక యుపకరించును.

ఆరాధన ప్రయోజనము

పరమేశ్వరుని మన మేవిధముగ నుపాసించిన, నావిధమైన సిద్ధియే మనకు గల్గును. ఈసిద్ధిని గల్గించుశక్తి పరమేశ్వరునిలోనున్నది. ఈశక్తిని మన మనస్సు గ్రహింపగలస్థితిలోనికి రావలసియున్నది. ఒకే పాముమంత్ర మొకడు వేసిన ఫలించును; మఱొకడు వేసిన ఫలింపదు. అది మనశ్శక్తులలోని భేదము, ఉపాసననియమములలోని తారతమ్యము గూడ కావచ్చును, ఎట్లయినను శ్రద్ధానియమము లత్యవసరములు. పరమేశ్వరుని మనమెంత యుత్తమలక్షణములలో, నెంత దృఢమైన శ్రద్ధతోను, తన్మయత్వముతోను నర్చింతుమో యంత యుత్తమత్వము మనకంత శీఘ్రకాలములో లభించును. పరమేశ్వరుని ధనప్రదాతగ నర్చించువానికి ధనమేవచ్చును; విద్యాప్రదాతగ నర్చించువానికి విద్యయే వచ్చును; స్వర్గప్రదాతగ నర్చించువానికి స్వర్గమే వచ్చును; మోక్షప్రదాతగ నర్చించువానికి మోక్షము వచ్చును.

నాల్గు విధములైన పుణ్యాత్ములు తన్నారాధించుచున్నారని భగవానుడు గీతలలో చెప్పుచున్నాడు.

''చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినోర్జున,

ఆర్తోజిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ.'' (7-16)

(ఓ యర్జునా! నాల్గు విధములైన పుణ్యాత్ములు నన్నారాధించుచున్నారు. వా రెవ్వరన: బాధలో నున్నవాడు. నన్నెఱుగదలచినవాడు, లౌకికప్రయోజనము నపేక్షించినవాడు, జ్ఞాని.)

ఆర్తత్రాణపరాయణుడను బిరుదము పరమేశ్వరునకు గలదు. ఆర్తునకు పరమేశ్వరునియందు విశ్వాసమెంత దృఢముగనున్న, అంత త్వరలో నార్తి విముక్తిని పరమేశ్వరుడు కల్గించును. పరమేశ్వరవిశ్వాస మత్యంతము దృఢమైనపుడు మానవుడు పౌరుషమునుకూడ పరిత్యజించును. వస్త్రాపహరణ సమయమున ద్రౌపదియు, మకరగ్రహణసమయమున గజేంద్రుడును ఆర్తులై యట్టి విశ్వాసముచేతనే రక్షింపబడిరి.

లౌకికప్రయోజనము నపేక్షించికూడ పరమేశ్వరు నారాధింపవచ్చును. వేదములలోకూడ ధనాదులనిమిత్తమైన ప్రార్థనలుకలవు. ఇందలి యున్నతాభిప్రాయములు రెండు: (1) హిందువుని దృష్టిలో తనకేది లభించినను, అది నిమిత్తమాత్రముగ మనుష్యునినుండియే వచ్చినను, దాని కాదికారణము శ్రీ పరమేశ్వరుడనియే. అట్లే హిందువు ఇతరునకేదైన దానము చేసినను, ఆప్రతిగ్రహీతకూడ నాతనిదృష్టిలో భగవంతుడే. ఈయున్నత విశ్వాసమును పురస్కరించుకొనియే యట్టి ప్రార్థనలు బయలుదేరినవి. (2) ధనాధికమును భగవంతునుండి నర్ధించుటలోని మరియొక యాశయ మేమన : తనకేది లభించినను, నది పరమేశ్వరునకు సమ్మతమైన మార్గములో లభింపవలయును, కాని యన్యాయమైన మార్గములో లభింపరాదను భావ మిందున్నది.

లౌకికప్రయోజనముల నుద్దేశించికాని, స్వర్గాదిసుఖముల నుద్దేశించికాని, జన్మాంతరములోని సుఖము నుద్దేశించికాని చేయబడుకర్మలు ఫలించుననుటలో హిందూమత గ్రంథములలో నభిప్రాయభేదములేదు. గీతలలో భగవానుడు నిష్కామకర్మ నెంత బోధించినను, కామ్యకర్మల ఫలితము నంగీకరించుచునే యున్నాడు. జ్యోతిష్టోమాదిక్రతువుల నాచరించినవారు స్వర్గాదిసుఖముల ననుభవింతురనియు, స్వర్గములో పుణ్యభోగము లించుమించుగా పూర్తియైనపుడు భూలోకమున జనింతురనియు, భగవానుడు గీతలో చెప్పుచున్నాడు.

''త్రైవిద్యామాం సోమపాః పూతపాపా యజ్ఞెరిష్ట్వైస్వర్గ తింప్రార్థయంతే|| తేపుణ్యమాసాద్యసురేంద్రలోక మశ్నన్తి దివ్యాన్‌ దివిదేవభోగాన్‌|| తేతం భుక్త్వాస్వర్గలోకం విశాలంక్షీణ పుణ్య మర్త్యలోకం విశన్తి!'' (9-20, 21)

ప్రయోజనము నుద్దేశించి చేయబడు కర్మలన్నియు, స్వార్థములేయని తలంపరాదు. కొన్ని పరార్థము లుండవచ్చును. యజ్ఞాయాగాదు లనేకములు కర్తృశ్రేయస్సు కొఱకేగాక, లోకశ్రేయస్సుకొఱకుకూడ చేయబడుచున్నవి. అనేక ప్రార్థనలు లోకముకొరకై యుద్దేశింపబడినవి. ప్రతి దినమును పూర్వాచారప్రియుడైన హిందువు ఈక్రింది శ్లోకమును పఠించునుగదా !

''స్వస్తిప్రజాభ్యః పరిపాలయన్తాం

న్యాయ్యేనమార్గేణమహీంమహీశాః.

గోబ్రాహ్మణభ్యశ్శుభమస్తునిత్యం

లోకా స్సమస్తాస్సుజనో భవంతు.''

ఏవిధముగను భగవంతుని నర్చింపనివానికంటె, ప్రయోజనముకోరి భగవంతు నర్చించువాడు శ్రేష్ఠుడు. అట్టి యర్థార్ధికి భగవద్భక్తి విశ్వాసములుండుటచే నవి యెన్నటికైన, నుత్తమలక్ష్యము పైకి పోవచ్చును. భక్తి ధనకాంక్షతోనే ప్రారంభ##మైనను కొంతకాలమున కిట్టి తుచ్ఛవిషయమునకై భగవదనుగ్రహమును వినియోగించుకొననేల! అని తోచును. ధ్రువుడు ప్రారంభములో లౌకికార్థ ప్రేరితుడయియే తపస్సునకు గడంగినను, తుద కాతని కట్టికోరిక నశించి పరమేశ్వర సాన్నిధ్యవాంఛయే కలిగెను.

పరమేశ్వర తత్త్వము తెలిసికొనుటకు, లేదా పరమేశ్వర ప్రీతికొఱకుకూడ, భక్తుడు పరమేశ్వరారాధనమ జేయవచ్చును. వెనుకటి రెండుపద్ధతులకంటె నిది యుత్కృష్టమైనది. ఇట్టి యుద్దేశముతో నారాధనము చేయువానికి భగవంతుడు సులువుగ సహాయము చేయును. ఆనాటికానాడు వానికి పరమేశ్వరజ్ఞానము కలుగును. ఒక యుదాహరణము తీసికొందము. పరమేశ్వర ప్రీతికొరకు నిష్కామకర్మ నాచరించువానిపట్ల పరమేశ్వరుడు సంప్రీతుడై, యా నిష్కామకర్మకు ఫలితముగ నింకను నిష్కామకర్మజేయు బుద్థినాతనికి బుట్టించును. ఇట్లు క్రమక్రమముగ నాతని జీవితమంతయు పరమేశ్వర ప్రీత్యర్థమైన నిష్కామకర్మలతో గూడినది యగును. స్వల్పముగ ప్రారంభింపబడినదైనను, నిట్ట ఈశ్వరార్పణబుద్ధితో జేయబడిన కర్మ గొప్పభయమునుండి రక్షించునని గీత చెప్పుచున్నది.

''స్వల్పమప్యస్యధర్మస్యత్రాయతే మహతోభయాత్‌'' (గీత 2-64)

జ్ఞానముతో తన్ను ప్రేమించువాడు తనస్వరూపుడేయని గీతలలో పరమేశ్వరుడు చెప్పియున్నాడు.

అద్వైతులమతములో జ్ఞానమువలన ముక్తికలుగును; జీవాత్మ పరమాత్మల యైక్యమే ముక్తి. ఈజ్ఞానము పరమేశ్వరానుగ్రహమువలన గల్గును. పరమేశ్వరానుగ్రహము కొఱకు నిష్కామకర్మ నాచరింపవలెను. ముక్తుడైనవాని కిక జన్మలేదు. నిత్యనిరతిశయానందమే ముక్తుని స్వరూపము. సచ్చిదానందస్వరూపమైన పరమాత్మకంటె నితర మెద్దియు సత్యములేదు.

ద్వైతులమతములో ముక్తినిచ్చునది భక్తి, భక్తిని ధృఢపరచునది జ్ఞానము. వీరిమతములోగూడ కర్మాచరణ మీశ్వరానుగ్రహ సంపాదనమున కవసరమే. ద్వైతులముక్తిలో జీవుడు పరమేశ్వరునితో నైక్యము నొందడు; నిరంతర పరమేశ్వర సేవలో జీవు డానందమును బొందుచు పరమేశ్వర సన్నిధినుండును. ద్వైతులమతములోగూడ ముక్తుడు జనన మరణముల కతీతుడు.

విశిష్టాద్వైతులమతమునకూడ మోక్షము పరమేశ్వర భక్తిచే కల్గునదియే, విశిష్టాద్వైతములో ప్రపత్తి, యనగా పరమేశ్వరున కాత్మార్పణము గావించుకొనుట యనుభక్తి విశేష మొక సాధనముగా నున్నది. విశిష్టాద్వైతులును, ద్వైతులవలెనే జీవుడు పరమాత్మకంటె భిన్నుడనియే యందురు. కాని గుణములలో జీవుడును పరమాత్మవంటివాడే యందురు; ద్వైతులన్ననో జీవులకును, పరమేశ్వరునకును వాస్తవికమైన గుణభేదము కలదందురు.

అన్ని సంప్రదాయములలోను జననమరణరాహిత్య లక్షితశాశ్వతానందము నొందుటకు భగవత్సంసేవన మెంత యావశ్యకమో తెల్పుటకే యిట వేదాన్త సంప్రదాయముల ప్రశంస యించుక గావింపబడినది, కాని వివిధ వేదాన్త సంప్రదాయముల స్వరూపమును వివరించు నుద్దేశముతోకాదు. హిందూమతములోని వేదాన్త సంప్రదాయముల విచారము చాల పెద్ద విషయము. దాని కీగ్రంథమున నవకాశము లేదు.

ఇట్లు హిందూమతము ననుసరించి ఇహపరలోకములలో దుఃఖమును తప్పించుకొనుటకుగాని, సుఖముల ననుభవించుటకుగాని, జనన మరణరూప సంసారమునుదాటి శాశ్వతసుఖము ననుభవించుటకుగాని పరమేశ్వరానుగ్రహ మమోఘమైన సాధన మని తెలియగలదు. స్వవర్ణాశ్రమ విహితకర్మ నాచరించుచు, పరమేశ్వరానుగ్రహము నపేక్షించుచు, నితరవాంఛలను వీడుటయే ప్రతిహిందువు నిత్యము నభ్యసింపవలసిన యుత్తమసాధన మనునదియే సమస్త హిందూమతగ్రంథముల పరమోపదేశమని చెప్పదగి యున్నది.

శ్రీ పరమేశ్వరార్పణమస్తు.

Hindumatamu    Chapters    Last Page