Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము .

ఆశ్రమ ధర్మములు

ప్రయోజనము

వర్ణధర్మములు సంఘములోని యంతరములకు సంబంధించినట్లే, ఆశ్రమధర్మములు వ్యక్తి జీవితకాలము యొక్క యంతరములకు సంబంధించినవి. మానవుని జీవితకాలము నూరేండ్లగుచో, నందు సుమారు పాతికేసి సంవత్సరము లెట్లు గడుపవలయునో తెల్పునవి యాశ్రమధర్మములు. మానవజీవితము పవిత్రమైనది, కావున దానిని చక్కనిమార్గమున నడపి మానవుని క్రమముగ దివ్యత్వము నొందించునదియే యీ యాశ్రమవిధానము. ఆశ్రమములు నాలుగు (1) బ్రహ్మచర్యము, (2) గార్హస్థ్యము, (3) వానప్రస్థము (4) సన్యాసము. ఇందొక్కొక్కటి మానవుని యభ్యున్నతి కెట్లు తోడ్పడునో చూతము.

బ్రహ్మచర్యము

సుమారు మొదటి పాతిక సంవత్సరములును బ్రహ్మచర్యములో గడుపవలయును. ద్విజున కుపనయనమైనది మొదలు బ్రహ్మచర్యవ్రతము ప్రారంభమగును.

బ్రాహ్మణునకు ఎనిమిదవ సంవత్సరమునను, క్షత్రియునకు పదునొకొండవ సంవత్సరమునను, వైశ్యునకు పండ్రెండవ వర్షమునను ఉపనయనము గావింపవలెను. గర్భప్రవేశము మొదలుకొనియే సంవత్సరముల పరిగణనము.

గర్భాష్టమేషుబ్రాహ్మణం గర్భైకాదశేషు రాజన్యం

గర్భద్వాదశేషు వైశ్యం. (ఆపస్తంబ ధ. సూ. 1-1-19)

వేదవిద్యాభ్యాసార్థము వేదమూలమున సద్గురు సన్నిధిని జరుపబడుసంస్కారమునకే ఉపనయన మనిపేరు. ఈ సమయముననే గాయత్రీమంత్ర ముపదేశింపబడును. ఈ గాయత్రితో సరియగు మంత్రము మరియొకటిలేదు. గాయత్రీ మహిమను మహర్షులు స్మృతులలోను, పురాణములలోను వేనోళ్ళ కీర్తించియున్నారు. బ్రాహ్మణున కేయితర విద్యాతపస్సులు లేకున్నను గాయత్రీజప మున్నచో నాతడు దుర్బ్రాహ్మణుడు కాకుండ కాపాడబడునని చెప్పుటచే గాయత్రీ మహిమ వెల్లడి యగుచున్నది.

'గాయత్రీ మాత్రసారోపి నచ దుర్ర్బాహ్మణోభ##వేత్‌'.

ఉపనయనమైన పిమ్మట ద్విజుడు గురుకులమున 12 ఏండ్లు బ్రహ్మచర్యమును నడపుచు నొకవేదమునైనను ముగింపవలయును.

ద్వాదశవర్షాణ్యక వేదే బ్రహ్మచర్యం చరేత్‌ (గౌ. ధ. 2-51)

ప్రతివేదమునందును పండ్రెండేసి సంవత్సరములు బ్రహ్మచర్యమును జరుపవచ్చును. (గౌ. ధ. 2-51) కాని యది యవశ్యముకాదు. మఱియు ఋషులమతమున కలియుగములో దీర్ఘ బ్రహ్మచర్యము మంచిదికాదు. కావున పండ్రెండేండ్ల బ్రహ్మచర్యము చాలును. దీనివలన బ్రాహ్మణుడు కనీసము 20 ఏండ్ల ప్రాయమునను, క్షత్రియుడు 23 ఏండ్ల ప్రాయమునను, వైశ్యుడు 24 ఏండ్ల ప్రాయమునను వివాహమాడుట శాస్త్రసమ్మతమని తెలియును. పైని తెల్పబడిన ఉపనయన వయస్సులనుబట్టి యీ వివాహవయస్సులు తేలును. శూద్రుడు గురుకులముప కేగనక్కరలేదు. కావున ఆయువులో నాల్గవభాగము అనగా 25 సంవత్సరముల వయస్సువఱకు నాతడు బ్రహ్మచర్యము గడపి వివాహమాడవలయును.

బ్రహ్మచర్యాశ్రమమున సాధింపవలసిన ముఖ్యప్రయోజనములు మూడు (1) ద్విజులు వేదాభ్యాసమును, ఇతరులు పురాణతిహాసపఠనమును గావించుట (2) ఇంద్రియ నిగ్రహము నలవరచుకొని, మనస్సును పారమార్ధికజీవనమున కనుకూలము కావించుకొనుట (3) శరీరము భోగపరము కాకుండ కష్టములను సహించుదానినిగా చేసికొని, బ్రహ్మతేజస్సును వృద్ధినొందించుకొని, దీర్ఘాయువునకు తగిన యవకాశములను గల్పించుకొనుట. ఈ మూటియొక్క ఫలితములను మానవుడు గృహస్థాశ్రమములో చక్కగా ననుభవించును. గృహస్థాశ్రమములో భోగముల నుచితరీతి ననుభవించును. గృహస్థాశ్రమములో భోగముల నుచితరీతి ననుభవించుటకును, భోగములలో పడి ధర్మమును మరువకుండుటకును, వివేకవంతుడై నైదిక లౌకికధర్మములను నిర్వర్తించుటకును బ్రహ్మచర్యాశ్రమ శిక్షణము సాయపడును.

బ్రహ్మచర్యాశ్రమములో పైని తెల్పిన మానసిక శారీరక సాథన కంగములుగ ననేక నియమములు గలవు. బ్రహ్మచారి వాఙ్మియమము, చేష్టానియమము, ఉదరనియమము గలవాడై యత్యవసరములైన వాక్కులనే పల్కవలెను. అవియు సత్యములే యైయుండవలయును. తన కర్తవ్యమునకు మించిన యే పనిలోను కలుగజేసికొనరాదు. సత్వగుణమును మాత్రమే వృద్ధిపొందించు నాహారము నేదియైనను మితముగనే, తినవలయును.

వాగ్బాహూదర సంయతః. (గౌ. ధ. 1-2-27)

బ్రహ్మచారి భిక్షచేసి యాహారము తెచ్చుకొని దానిని గురువునకు చూపి యాతని యనుజ్ఞ చొప్పున భక్షింపవలయును.

నివేద్యగురవేనుజ్ఞాతో భుంజీత. (గౌ. ధ. 1-2-45)

ఉప్పు, పులుసు, కారము మున్నగు రజోగుణ ప్రకోపకములైన పదార్థములను బ్రహ్మచారి భుజింపరాదు.

ఆతడు మత్తును గల్గించు నే పదార్థమును సేవింపరాదు. మాంసమును భక్షింపరాదు.

యథాక్షారలవణ మధు గ్‌ం సానీతి.

(ఆపస్తంబ ధర్మసూత్రము 1-4-6)

మఱియు నాతడు గంధమాల్యాది సుగంధవస్తువులను ధరింపరాదు; పగలు నిద్రపోరాదు; కాటుక పెట్టుకొనుట మున్నగు శృంగారవిషయములను వీడవలయును; తైలాభ్యం ఙనము చేయరాదు; విలాసార్థమై శకటాదివాహనముల నధిష్ఠింపరాదు; చెప్పులను తొడగరాదు; కామమును దరిచేరనీయరాదు; క్రోధమునకు దూరుడుగా నుండవలయును. దేనియందును, లోభమును పొందరాదు; వివేకమును వీడరాదు. వదరుబోతుగా నుండరాదు; వీణావాదనాదులయందనురక్తుడు కారాదు; ఉష్ణోదక స్నానము చేయరాదు; సుగంథాదులచే విలాసప్రధానముగ దంతధావనాదికము చేయరాదు; దేనిని చూచియు సంతోషముచే పొంగిపోరాదు; నృత్యగానములయం దాసక్తుడు కారాదు. పరుల దోషముల నెంచరాదు; ప్రమాదములచెంత పోరాదు. ఈయంశములనే గౌతమధర్మసూత్ర మిట్లు చెప్పుచున్నది.

వర్జయేన్మధుమాంస గంధమాల్య దివాస్వ

ప్నాంజనా భ్యంజనయానో పానచ్ఛత్ర

కామ క్రోధ లోభ మోహ

వాదవాదనస్నాన దంత ధావనహర్షనృత్త గీత పరీవాద భయాని. (గౌ. ధ. 1-2-19)

బ్రహ్మచారి యిట్టి నియమములు గలవాడై, భిక్షచే జీవించుచు, సాయంప్రాతఃకాలములం దగ్నికార్యముచేసికొను చుండవలయును.

అగ్నీంధనభైక్షచరణ. (గౌ. ధ. 1-2-12)

సంధ్యావందనమును గ్రామముయొక్క బయటకుపోయి చేసికొనవలయును. బహిస్సంధ్యత్వంచ. (గౌ. ధ. 1-2-16)

బ్రహ్మచారి ముఖ్యముగ చేయవలసిన ధర్మము రేతస్సంరక్షణము. ఆధర్మము చెడుచో బ్రహ్మచర్యవ్రతము చెడినట్లే.

కామాద్ధిస్కందయన్‌ రేతోహినస్తివ్రత

మాత్మనః. (మను. 2-108)

అట్లు బ్రహ్మచర్యమును పోగొట్టుకొనినవానికి అవకీర్ణి యని పేరు. అవకీర్ణికి ఘోరములైన ప్రాయశ్చిత్తములు విధింపబడినవి.

కనుకనే బ్రహ్మచర్యమునకు భంగము గల్గించు ప్రసక్తులన్నియు బ్రహ్మచారికి నిషేధింపబడినవి. శృంగార విషయమునకు సంబంధించినవన్నియు దూరముగ నుంచవలసినవే. తుదకు బ్రహ్మచారి అద్దములో తనముఖమును చూచుకొనుటకూడ నిషేధింపబడినది. బ్రహ్మచారి స్త్రీల ముఖమును చూడరాదు; వారితో సంభాషింపరాదు.

స్త్రీ ప్రేక్షణాలంభ##నే మైథున శంకాయాం.

(గౌ. థ. 1-2-22)

బ్రహ్మచారి చదువుకొనుకాలమున గురువునకేమియు దక్షిణ నీయనక్కరలేదు. ప్రజ లుచితముగ భోజనము పెట్టియు, గురు వుచితముగ చదువు చెప్పియు యువకులకు తగిన విద్యాసంపత్తి నొసగు నాగరకస్థితి ప్రాచీనభరతఖండమున నుండెను. ఎంత పేదవానికుమారుడైనను నీవిధముగ మహాపండితుడు కావచ్చును. నవనాగరకతయని చెప్పబడు ప్రస్తుత దుష్కాలసంఘ వ్యవస్థలో నట్టియేర్పాటు లేదు కదా. ప్రస్తుతము ధనికుని బిడ్డనికే యున్నతవిద్యావకాశము కలదుకాని, పేదవాని బిడ్డనికి లేదు. ఆనాడిట్లుగాక ముఖ్యవిషయములలో సంఘసమత్వ ముండెను.

గురుకులములో బ్రహ్మచారులనడుమ పూర్ణయైన సామ్యవ్యవస్థ యుండెను. మహారాజుబిడ్డడు తనసౌదము దిగివచ్చి, బిచ్చగానిబిడ్డనితో గలసి గురుకులమునచేరి యాతని వలెనే జోలికట్టి బిక్షనెత్తికొని నియమములను పాటించుచు కటికినేలను శయినించుచు కాలక్షేపము చేయుచుండెను.

పూర్వపద్ధతి విద్యావిధానము ప్రస్తుతము మనదేశమున లేకున్నను, పైనిచెప్పిన బ్రహ్మచర్య విధానమును విద్యార్ధులలో నెలకొల్పుట కభ్యంతర ముండజాలదు. ఏ విద్యావిధానము నడచుచున్నను, అన్నివర్ణములవారికిని పురాణతిహాస బోధనము అత్యవసరము.

ప్రాచీనభరతఖండమున బ్రహ్మచారి యిట్లింద్రియ నిగ్రహమును, శరీరదార్ఢ్యమును, కష్టసహిష్ణుతను, విద్యావివేకములను నలవరచుకొని గురుకులమును వీడునపుడు గురువుగారి కేదైన దక్షిణ నీయదలచినవాడై గురువు నభిప్రాయమును గన్గొనుచుండెడివాడు. సాధారణముగ గురువేమియు కోరెడివాడుకాడు. శిష్యునిశక్తిని పరీక్షించుటకుగాని, కేవలము విలాసార్థముకాని యేదైన కోరుటయుకలదు. అపుడు శిష్యుడు దేశములో రాజునొద్దకో యేధనికునియొద్దకో పోయి యాచించుటయు వారాతనికోర్కె నవశ్యము పాటించుటయు కలదు. గురుకులమునువీడిన స్నాతక బ్రహ్మచారి వచ్చి యేది యడిగినను నిచ్చితీరవలయునను నియమము గృహస్థులపైనను, రాజులపైనను స్మృతికర్తలు పెట్టినారు. (మను. 11-1)

ఇట్లు గురుకులవాసమును ముగించుకొని, బ్రహ్మచారి యింటికి తిరిగివచ్చుటకు సమావర్తనమని పేరు. ఇంటికి వచ్చి, అభ్యంగస్నాన పూర్వకముగ బ్రహ్మచర్యాశ్రమమును ముగించుటకు గావింపబడు సంస్కారమునకు స్నాతకమనిపేరు. పైని చెప్పబడిన బ్రహ్మచారికిగల నిషేధము లిప్పటినుండియు తొలగును.

అదివఱలో లేని అద్దము చూచుకొనుట, కాటుక పెట్టుకొనుట మున్నగునవి యానాడే ప్రథమమున జరుగును. నేడు వివాహమునకు పూర్వముజరుగు స్నాతకములో పెండ్లి కొడుకునకు అద్దము చూపబడును; కాటుక పెట్టబడును. కాని యీ బ్రహ్మచారి యిదివరకెన్నడును, అట్టి నియమములు పాటించినవాడు కానేకాకపోవుటచే, నట్టి సమయములయందును మన కొకసారి మన పతనము జ్ఞప్తికి వచ్చుచుండును.

గార్హస్థ్యము.

బ్రహ్మాచర్యవ్రతమును ముగించిన యువకుడు తన వర్ణమునకు చెందినట్టియు, తనగోత్రప్రవరలకు చెందనట్టియు, నెనిమిది తరముల పితృబంధువులలోగాని, యైదుతరముల మాతృబంధువులలోగాని చేరనట్టియు, మంచిలక్షణములు గల్గినట్టియు, నదివఱలో వివాహితకాని, వాగ్దత్తకాని కానట్టియు, రజస్వల కానట్టియు కన్యను వివాహమాడవలయును. (మను. 3-4; వసిష్ఠ 8-2; లిఖిత 4-1; గౌతమ 4-1; యాజ్ఞవల్క్య 1-65)

ఆయువులో రెండవభాగము, అనగా సుమారు 50 సంవత్సరముల పయస్సువచ్చువరకును గృహస్థాశ్రమములో నుండవలయును.

''ద్వితీయమాయుషో భాగం కృతదారో గృహేవసేత్‌''

(మను. 5-169)

గృహస్థాశ్రమప్రయోజనములు రెండు.

1. సామాన్య మానవులకు సహజముగానుండు సంసార వాంఛకు చక్కని మార్గము నేర్పరచి దానిని విశృంఖలముగా పోనీయకుండ, నియమబద్ధముగా నడపి, యావాంఛకే పవిత్రతా పరిమళమును గల్గించు మానవుని క్రమక్రమముగా పరిపక్వస్థితిలోనికి దింపుటకు గృహస్థాశ్రమ ముద్దేశింపబడినది. యావజ్జీవ బ్రహ్మచర్యము సర్వోత్తమమైనదనుటకు సందియములేదు. కణ్వాదిమహర్షులును, శంకరాద్యాచార్య పురుషులును గృహస్ధాశ్రమమును ప్రవేశింపకయే తరించిరి.

''అనేకాని సహస్రాణి కుమార బ్రహ్మచారిణాం,

దివంగతాని విప్రాణా మకృత్వా కులసంతతిం.

(మను. 5-159)

ఇచట ప్రధానవిషయ మేమన, మానవుడు యావజ్జీవము అస్ఖలితబ్రహ్మచారియై బ్రహ్మచార్యాశ్రమములోగాని సన్యాసాశ్రమములోగాని యుండగలడా, లేదా యనునది. ఉండలేనిచో వివాహమాడకున్న యెడల వాడు సర్వవిధముల పతితుడగును. బ్రహ్మచర్యాశ్రమములో బ్రహ్మచర్యము భగ్నమగుచో వాని కుత్తమగతులులేవు. సన్యాసాశ్రమములో బ్రహ్మచర్యము భగ్నమగుచో వానికి ప్రాయశ్చిత్తమే లేదు. వాని కారూఢపతితుడని పేరు. ఇట్లు ప్రమాదభూయిష్ఠమైన యావజ్జీవ బ్రహ్మచర్యమును సామాన్యమానవుడు గడుప ప్రయత్నించుట, ఓటివడవచే సముద్రము దాటుటకు యత్నించుట వంటిది. కావున వాడు వివాహము చేసికొనుట క్షేమకరము.

మరియు వివాహితుడై, ఏకభార్యాలగ్న మనస్కుడగు వానికుండు చిత్తనైర్మల్యము, అవివాహితుడై బహుశాఖా గతబుద్ధియైన వానికుండనేరదు. అంతియేకాక, వివాహ మొక మతసంస్కారముగ నాదేశింపబడుటచే, గృహస్థునకు భార్యపట్ల కాముకభావమేగాక, ధార్మిక ప్రవృత్తిగూడ గల్గును. గృహస్థజీవితములో క్రమక్రమముగా కాముకత తగ్గి ధార్మికత ప్రబలుచుండును. చక్కని సాధనవలన క్రమముగ వైరాగ్యముకూడ నలవడును. వివాహములేక యధార్మిక స్త్రీ సంపర్కమున జీవితము గడపువాడు దుర్గతిని పొందును.

2. వివాహముయొక్క రెండవప్రయోజనము ఋణత్రయాపాకరణాది ధర్మసముపార్జనము. మానవుడు మూడు ఋణములతో పుట్టుచున్నాడని వేదము చెప్పుచున్నది. అందొకటి ఋషిఋణము, రెండవది దేవఋణము, మూడవది పితృఋణము (పితౄణము) వేదములను చదువుటవలన ఋషిఋణము తీరును. ఎట్లన: ఋషులు మనకు వేదము నందజేసినారు. వారిచ్చినది మన ముపయోగించుకొనుటయే మనము వారి ఋణము తీర్చుట. యజ్ఞములను చేయుటవలన దేవతల ఋణము తీరును. ఏలయన, దేవతలు మనకు జీవనయోగ్యమైన సమస్త వస్తుసమూహము నిచ్చుచున్నారు, అందులకు వారికి కృతజ్ఞతను కన్పఱచుటకై వారికాద్రవ్యములో నొకింత భాగమును అగ్నిద్వారమున నర్పించుట మన విధి. అందులకు వారు సంతృప్తులై మన జీవితమునకు సాయపడుచు నుందురు. పితృఋణము సంతానము గలుగుట వలన దీరును. ఎట్లన ఈ శరీరమును మనకు పితరు లిచ్చిరి. వారెట్లు మనకు జన్మనొసగిరో అట్లే మనమును సంతానమును కని వారివంశమును నిలబెట్టవలెనని వారు కోరుచుందురు. కావున సంతానము కనుటవలన పితరుల ఋణము తీరును.

ఈ మూడు ఋణములలో మొదటిఋణము బ్రహ్మచర్యాశ్రమములోనే చాలభాగము తీరినను గృహస్థాశ్రమములో నిత్యవేదాధ్యయనము వలననేగాని అది పూర్తిగా తీరదు. రెండవదియగు దేవఋణము తీరుటకు వివాహ మత్యవసరము. భార్యలేనివారికి యజ్ఞముచేయు నధికారము లేదని వేదము చెప్పుచున్నది.

''అయజ్ఞోవాఏషః, యోపత్నీకః'' (తైత్తిరీయ బ్రాహ్మణము 2-2-2-6)

కావున దేవఋణము తీర్చుటకు మానవుడు దారపరిగ్రహణము చేయవలయును. మూడవదియగు పితౄణము సంతానమువలన తీరునుగదా! స్వభార్యయందు గలిగిన సంతానమే మానవుని పవిత్రుని చేయగలదు; అన్యస్త్రీయందు గలిగిన సంతానము ప్రయోజనకారి కాజాలదు.

అట్టి సంతానము పితృకర్మలుచేయుటకుకూడ అర్హముకాదు.

సవర్ణాపూర్వశాస్త్ర విహితాయాం యధర్తుగచ్ఛత

స్తేషాం కర్మభిః స్సంబంధః. (అ. ధ. సూ. 2-13-1)

పైన తెల్పిన మూడు ఋణములను తీర్చవలసిన విథి వేదములలోనే చెప్పబడియున్నది.

జాయమనోవై బ్రాహ్మాణః త్రిభిర్‌ ఋణవాయతే

బ్రహ్మచర్యేణ ఋషుభ్యోయజ్ఞేనదేవేభ్యః ప్రజయాపితృభ్యః|

ఏషవా అనృణోయః పుత్రీయజ్వా బ్రహ్మచారివాసీ.

(తైత్తిరీయసంహిత 6-3-10-4)

ఈ మూడు ఋణములను తీర్పక మోక్షము కోరకూడదని మనుస్మృతి చెప్పుచున్నది.

''అనధీత్య ద్విజోవేదాననుత్పాద్య తథాసుతాన్‌,

అనిష్ట్వాచైవయజ్ఞైశ్చ మోక్షమిచ్ఛన్‌ వ్రజత్యధః.

(మను 6-37)

ఋషులను, దేవతలను, పితరులను సంతృర్తినొందించుటకు గృహస్థుడు ప్రతిదినమునను యత్నించు చుండవలయును. ఋషియజ్ఞము; దేవయజ్ఞము, పితృయజ్ఞము అనునవి నిత్యకర్మలలోనివి. వీనికి తోడుగ గృహస్థుడు ప్రతిదినము చేయవలసినవి మరిరెండు యజ్ఞములుగూడ గలవు. అవి మనుష్య యజ్ఞము, భూతయజ్ఞము అనునవి. ఈ పంచ మహాయజ్ఞములు గృహస్థుడు ప్రతిదినము చేయవలయును.

దేవపితృ మనుష్యభూతర్షి పూజకః (గౌ. ధ. 5-3)

మనుష్యయజ్ఞము గృహస్థున కత్యంతము ముఖ్యము. గృహస్థున కితరాశ్రమములకు లేని ధనసంపాదనాధికారము కలదు. ఆధనము నాతడు తన్ను, భార్యాపుత్రులను పిత్రాది పోష్యవర్గమును, పోషించుటకు మాత్రమే యుపయోగింపరాదు. ఆకలిగొనికాని, యవసరమువలనగాని యింటికివచ్చిన మానవుని దేవభావముతో నర్చింపవలయును. దీనికి మనుష్యయజ్ఞ మనిపేరు. అతిథి విద్యాశీలార్హ తనుబట్టి వానిని పూజించుటలో భేదముండవచ్చును; కాని యెట్టివానికైనను ఆహారమిడవలయును. సర్వజంతువులును తల్లి నాశ్రయించుకొని యెట్లు బ్రతుకుచున్నవో, యట్లే సర్వమానవులును గృహస్థు నాశ్రయించుకొని బ్రతుకుచున్నారు.

''యథా మాతరమాశ్రిత్య సర్వేజీవన్తి జంతవః.

తథాగృహస్థమాశ్రిత్య సర్వేజీవన్తి మానవాః.

వంట చేసికొనలేనివారి కందఱకును అనగా బ్రహ్మచారులు, సన్యాసులు మార్గస్థులు, దరిద్రులు, మున్నగువారికి శక్తికొలదియు భోజనముపెట్టుట గృహస్థుల విధియని మనుస్మృతి జెప్పుచున్నది.

''శక్తితోపచమానేభ్యో దాతవ్యం గృహమేధినా

(మను 2-32)

హెచ్చుధనము నిలువచేసికొనుటకాని, భోగములకొఱకే ధనార్జనము చేయుట ని గృహస్థునకు తగదు.

బ్రాహ్మణగృహస్థుడు మరునాటికికూడ తినుటకు దాచుకొననిచో నది యత్యుత్తమపద్ధతి; మూడుమాసముల గ్రాసమును గల్గియుండుట రెండవపద్ధతి; ఆఱుమాసములకు సరిపడు గ్రాసమును గల్గియుండుట తరువాతిపద్ధతి; మూడేండ్లకు సరిపడు గ్రాసమును గల్గియుండుట చివఱిపద్ధతి. ఈ యంశము మనుస్మృతిలోని యీక్రింది శ్లోకములో చెప్పబడినది.

కుసూలధాన్యకో వాస్యాత్కుంభీధాన్యక ఏవవా,

త్ర్యహైహికోవాపి భ##వేదశ్వస్తనిక ఏవవా (మను 4-7)

ఇందులకు తగినట్లుగానే బ్రాహ్మణగృహస్థునకు ధనార్జన విధుల ప్రాశస్త్యముకూడ నిర్ణయింపబడినది. ఇతరులు తమ కక్కఱలేని దానినిగ భావించిన ధాన్యమును (కళ్ళములలో మిగిలిన గింజలను) ఏరుకొని జీవించుట బ్రాహ్మణున కుత్తమజీవితవిధానము; యాచింపకుండ నెవరైన నిచ్చిన దానిని తీసికొనుట తరువాతిపక్షము; యాచించి తీసికొనుట యింకను నికృష్ణము; వ్యవసాయముచే జీవించుట యింకను నధమము; వర్తకముచే జీవించుట దానికంటెను తక్కువది; సేవావృత్తిచే మాత్రము ఎన్నడును జీవింపరాదు. ఈభావమే నిగూఢములైన పదములతో నీక్రింది మనుస్మృతి శ్లోకములో నిమడ్చబడినది.

ఋతామృతాభ్యాం జీవేత్తు మృతేన ప్రమృ తేనవా,

సత్యానృతాబ్యామపివానశ్వవృత్త్యాకదాచన. (4-4)

గృహస్థుడు జంతువులపట్లకూడ కొంత దాతృత్వము చూపవలయును. కాకులు, కీటకములు మున్నగునవి భుజించుటకై ప్రతిదినమును గృహస్థుడు భూతయజ్ఞ సమయమున కొంత యాహారమును బయట వేయవలయును.

సంవిభాగశ్చభూతేభ్యః కర్తవ్యో నుపరోథతః (మను 4-32)

ఈ భూతయజ్ఞములో జంతువుల కన్నమిడుటయే గాక వృక్షాదులకు కూడ నీళ్ళు పోయవలయునని కొన్ని స్మృతులలో వివరింపబడి యున్నవి.

ఇట్లు దేవతలు మొదలు పశుపక్ష్యాదులు, క్రిమికీటకములు, తరుగుల్మాదులు మున్నగువానివరకును గృహస్థుని థర్మము గలదు. గృహస్థునియిల్లు అక్కరగొన్నవారి కాశ్రయముగ నుండవలయును. అతిథులు లోనికిరాకుండ ప్రాకారమువద్దనే ద్వారమును మూసివైచుట గృహస్థాశ్రమథర్మ విరుద్ధము. పూర్వకాలమున గృహస్థులును వానప్రస్థాలును గూడ నతిథిపూజ యందెంత యప్రమత్తులై యుండెడివారో మన కావ్య పురాణతిహాసములలో ననేకోదాహరణముల వలన తెలియగలదుc గృహస్థుడు గ్రామాంతములకు పోయినను, అతిథిపూజకు తగినయేర్పాటుల నింటివద్ద చేసియే వెళ్ళుచుండెను. మిట్టమధ్యాహ్నమునగాని, నిశీధమునగాని, యే బాటసారియు, పేదవాడును, శీతవాతాతపాదులవలన బాధపడనవసరము లేకుండ లోపలనున్న గృహస్థునకు తెలుపనక్కర లేకుండగనే యాతనియింట శరణముపొందుటకు వీలు గల్గవచ్చునని ప్రతిగృహస్థుడును తన గృహములో కొంత భాగము వీధియరుగు రూపమున ప్రజలకు విడిచివైచుట హిందూసంప్రదాయ సిద్ధాము.

ఇట్లు గృహస్థుడు గృహములోని సౌకర్యముల ననుభవించుటతో బాటు కొంతధర్మనిర్వహణముగూడ మేళవింప జేయబడినది. మఱియు భార్యాసహితుడై గృహస్థుడు సోమయాగాది క్రతువులను, పుణ్యతీర్థ సంసేవనమును, అదియిది యననేల, సమస్తధర్మ సంగ్రహమును జేయవలయును. అంతియేకాదు. జ్ఞానమునకు దారితీయు వైరాగ్యమునుకూడ గృహస్థాశ్రమములోనే క్రమముగా నలవరచుకొనుటకు యత్నింపవలయును. సత్కర్మాచరణమువలన క్రమముగ చిత్తశుద్ధి యేర్పడి శమదమాది సద్ఘుణములుగల్గి తుదకు మోక్షముకూడ ప్రాప్తించును. గృహస్థుడు ఋతుకాలములో భార్యను పొందుచుండవలయును.

''ఋతుకాలాభిగామీస్యాత్‌ స్వదార నిరతస్సదా''

(మను. 3-45)

ఋతుకాలమనగా ప్రతిమాసమును రజోదర్శనమైనది మొదలు పదునారు దినములు.

''ఋతుఃస్వాభావికః స్త్రీణాం రాత్రయష్షోడశస్మృతాః''

ఈపదునాఱుదినములలో మొదటి నాల్గుదినములును విడువదగినవి.

చతుర్భితరై స్సర్థమహోభిః సద్విగర్హిత్తేః (మను. 3-46)

మిగిలిన పన్నెండు దినములలోను అమావాస్య, పూర్ణిమ, ఏకాదశి, పితృదినములు మున్నగు పర్వదినములను విడువవలయును.

''పర్వవర్జం వ్రజేచ్చైనాం తద్ర్వతో రతికామ్యయా'' (మను. 3-45)

గృహస్థుని యిహపరములకును సత్సంతానము గల్గుటకును పై నియమము లత్యవసరములు.

గృహస్థుడు స్వభార్యయందే యనురక్తుడు కావలయును. పరస్త్రీసంసేవనము పాపావహము. 'నపరదారా& గచ్ఛేత్‌' అనివేదము చెప్పుచున్నది. ఆయుస్సును హరించు వానిలో నెల్ల ముందెన్నదగినది పరదారోపసేవన మని మనువు చెప్పుచున్నాడు.

నహీదృశ మనాయుష్యం లోకే కించనవిద్యతే

యాదశం పురుషస్యేహ పరదారోప సేవనం. (మను. 6-134)

వానప్రస్థము

ఇట్లు మానవుడు సుమారు 25 సంవత్సరములు గృహస్థాశ్రమములో గడపి వానప్రస్థాశ్రమములో ప్రవేశింపవలయును; అప్పటికి 50 సంవత్సరముల వయస్సు వచ్చును. కనుకనే మనువు గృహస్థునిశరీరమున నెపుడు ముడుతలుపడునో ఆతనితల నెఱసినట్లెప్పుడు గన్పట్టునో సంతానము యొక్క సంతానము నాతడెపుడు చూచునో యపుడు గృహమును వీడి యడవికి పోవలెనని చెప్పినాడు.

గృహస్థస్తు యదాపశ్యే ద్వలీపలితమాత్మనః

అపత్యిసై#్యవ చాపత్యం తదారణ్యం సమాశ్రయేత్‌. (మను. 6-2)

వార్థకము ప్రవేశించిన పిమ్మట ఎవ్వనికిని సంసారబంధ ముండరాదని దీని యభిప్రాయము. పరమార్థసాధన ప్రయత్నములో తీవ్రముగా దిగవలయునని వార్థకప్రవేశము బోధించును. ఈ దినములలో నరణ్యములు వానయోగ్యములుగా లేకున్నచో స్వగృహముననే యుండియు, సంసార లంపటత్వమును వీడియు పారమార్థిక జీవితమును గడుపుకొనుట ఆ వయస్సులోని వారికి కర్తవ్యము. ఇంద్రియనిగ్రహము వానప్రస్థుని ప్రధాన లక్షణము.

వనే వసేత్తునియతో యధావద్విజితేంద్రియః (మను. 6-1)

వానప్రస్థునకు జిహ్వోపస్థాచాపల్యము నిషిద్ధము. ఆతడు భార్యను తనతో నుంచుకొనినను, బ్రహ్మచర్యము నవలంబింపవలయును. లేదా భార్యను కుమారుని చెంత విడువచ్చును.

పుత్రేషు దారాన్ని క్షిప్యవనం గచ్ఛేత్సహైవవా (మను. 6-3)

వానప్రస్థుడు దుంపలను పండ్లను భుజించుచుండవలయును. తపస్సు చేసికొనుటలోనే కాలము గడుపుచుండవలయును.

వైఖానసోవనే మూలఫలాశీ తపశ్శీలః (గౌ. ధ. 3-26)

ఆతcడు కేవలము పరమార్థచింతగలవాడై తీవ్ర తపస్సులలోను, చాంద్రాయణాది వ్రతములలోను శరీరమును శుష్కింప చేసికొనవలయును.

తపశ్ఛరంశ్చోగ్రతరం శోషయేద్దేహ మాత్మనః (మను. 6-24)

వానప్రస్థుడు గూడ దేవపితృమనుష్యభూతర్షి పూజలను పంచమహాయజ్ఞములను విడువరాదు. (గౌ. ధ. 4-29)

సన్యాసాశ్రమమున పూర్తిగ నుండవలసిన యింద్రియ నిగ్రహమును వైరాగ్యమును అలవఱచుకొనుటకు వానప్రస్థాశ్రమములో నవకాశము గల్గును. గృహస్థాశ్రమములో నున్నవాడు తాత్కాలిక వైరాగ్యముచేతనో, మఱియే హేతువుచేతనో హఠాత్తుగ అపరిపక్వస్థితిలో సన్యసించుచో, సన్యాసాశ్రమము తీసికొనినపిమ్మట వాని పూర్వవాసనలు తలయెత్తుచో, వాడు భ్రష్టుడగును. ఈ దుస్థితిని తొలగించుటకై వానప్రస్థాశ్రమము తోడ్పడును; వాన ప్రస్థాశ్రమము చాల భద్రమైనది; అందు స్వల్పమగు లోపములు వచ్చినను, సన్యాసాశ్రమములోవలె విశేషపతన హేతువులు కావు. కనుక వానప్రస్థుడు దారపుత్రధనసంపర్కము, ఇంద్రియ చాపల్యము మున్నగువానిని విడచుటకును, నిగ్రహవైరాగ్యములను అలవరచుకొనుటకును యత్నించుచు తన సాధనం పఠిపూర్తియైనపిమ్మట సన్యసించును. సన్యాసములో పతనముగల్గు భయము చిరకాల వైరాగ్యాభ్యాసము వలన పూర్తిగా తొలగిపోవును.

సన్యాసము.

వానప్రస్థాశ్రమమైనపిమ్మట సన్యాసము. సన్యాసి సర్వసంగమములను పూర్తిగా పరిత్యజింపవలయును!

చతుర్థమాయుషోభాగం త్యక్త్యా సంగా న్పరివ్రజేత్‌. (మను. 6-33)

మోక్షమందు దృష్టి నిడుకొనవలయును.

మనోమోక్షే నివేశ##యేత్‌.

(మను. 6-35)

గృహస్థుడు ఇహపరసుఖములను కోరియు పునర్జన్మలో నైశ్వర్యాదులను కోరియు కర్మలనుచేయుట నిషిద్ధముకాదు. కాని సన్యాసి స్వర్గమును కోరరాదు, పునర్జన్మ కోరరాదు, ఇహలోకసుఖములను కోరరాదు; శమదమాదులనుపూర్తిగా కల్గియుండవలయును. ఆత్మపదార్థ మొక్కటియే నిత్యమనియు మిగిలిన సమస్తవస్తువులు నశ్వరములనియు నిత్యము గుర్తించుచుండవలయును. ఈసంపత్తి కల్గిననేకాని యాతడు సన్యసింపరాదు. ఈసంపత్తి బ్రహ్మచర్యాశ్రమములోనే రూఢిగా కల్గినను సన్యసింపవచ్చునని స్మృతులలో కలదు. శంకరాచార్యాదుల జీవితము లీ యంశమును సమర్థించుచున్నవి.

ఆతఏవ బ్రహ్మచర్యవాన్ర్పవ్రజతి (ఆ. ధ. సూ. 2-21-8)

అట్లే గృహస్థాశ్రమమునుండియైనను సన్యసింపవచ్చును. ''బ్రహ్మచర్యాదేవ ప్రవ్రజేత్‌ గృహాద్వావనాద్వా'' యను శ్రుతి కలదు.

ఎప్పుడు సన్యసించుట యనునది యంత ముఖ్యవిషయముకాదు. మోక్షదృష్టిని విడచి మరల ప్రాపంచికవిషయములలోను, అనాత్మచింతలోను పడకుండు పరిస్థితియే ముఖ్యము.

సన్యాసి యే కార్యములను పూనరాదు.

అనారంభీ (గౌ. ధ. 1-3-25)

ఆతడు ధనమును సేకరింపరాదు.

అనిచయో భిక్షుః (గౌ. 1-3-11)

ఊర్ధ్వ రేతస్కుడై యుండవలయును. (గౌ. 1-3-11)

సన్యాసి కెవ్వనితోను సంపర్క ముండరాదు; ఎప్పుడు నొక్కడే సంచరింపవలయును.

ఏకఏవ చరేన్నిత్యం. (మను. 6-64)

భిక్షమెత్తుకొని జీవింపవలయును. భిక్షకొఱకుమాత్రమే గ్రామములోనికి పోవలయును.

భిక్షార్థీ గ్రామమియాత్‌. (గౌ. ధ. 3-14)

సన్యాసి తిరుగుచుండవలయును, గాని యొకే గ్రామమున నుండరాదు.

సన్యాసి యింద్రియచాపల్యమును పూర్తిగా విడువవలయును. (గౌ. ధ. 3-17)

ఇంద్రియాణాం నిరోధేనరాగ ద్వేషక్షయేణచ,

అహింసయాచ భూతానా మమృతత్వాయ కల్పతే. (మను. 6-60)

(ఇంద్రియనిగ్రహముచేతను, రాగ ద్వేష పరిత్యాగముచేతను, సర్వభూతముల పట్లను అహింస నవలంబించుటచేతను అమృతత్వము సాధ్యమగును.)

ఏ క్షుద్రజంతువులును కూడ, నెవనివలన నేమియు భయమును పొందవో వానికి దేహత్యాగానంతరము భయము లేదని మనువు సన్యాసప్రకరణమున చెప్పుచున్నాడు.

యస్మాదణ్వపి భూతానాం ద్విజాన్నో త్పద్యతే భయం,

తస్య దేహాద్విముక్తస్య భయంనాస్తి కుతశ్చన. (6-40)

సన్యాసికిగల యీ యహింసాధర్మము మనుష్యులపట్ల మాత్రమేకాక వృక్షములపట్లకూడ గలదు. తీగెలు, చెట్లు మున్నగువాని ఫలపత్రాదులు వానియంత నవి రాలిననే గ్రహింపవలయునుగాని కోసి గ్రహింపరాదు.

నావిప్రయుక్తయోషధి వనస్పతినా మంగ ముపాదదీత. (గౌ. ధ. 1-3-19)

తన దేహముపై మాత్రము సన్యాసి కభిమాన ముండరాదు. ఆతడు మరణమును కోరరాదు. ఎట్లైనను బ్రతుకవలయు ననియు కోరరాదు. సేవకుడు ప్రభువునాజ్ఞ కెదురుచూచు చుండునట్లాతడు మరణకాలమున కెదురుచూచు చుండవలయును.

నాభినందేత మరణం నాభినందేత జీవితం,

కాలమేవ ప్రతీక్షేత నిర్దేశం భృతకోయథా. (మను 6-45)

ఆత డితరులు తన్ను పూజింపవలయునని కోరరాదు. ఇతరు లవమానము చేసినను సహింపవలయునేకాని యుద్రిక్తుడు కారాదు? తిరిగి యవమానము చేయరాదు.

క్రుద్ధ్యన్తం న ప్రతిక్రుద్ధ్యేదాకృష్టః కుశలంవదేత్‌. (మను 6-48)

(కోపపడినవానిపై కోపగింపరాదు, ఒకడు తన్ను నిందించినను వానికి క్షేమమునే పలుకవలయును).

సన్యాసులందఱు ముక్తులుగా నుండవలసినదే యనియు, ముక్తలక్షణములు లేనివాడు సన్యాసి కాడనియు కొందఱకు భ్రమకలదు. ఇది సరికాదు. సన్యాసులలో ముక్తులుకూడ నుండవచ్చును. కాని ముక్తిమార్గముననుండి, పైని వివరింపబడిన వైరాగ్యాది సంపత్తికలవారుకూడ సన్యాసులుగ నుండవచ్చును. అనగా సన్యాసులందరు సిద్ధులుగనే యుండి తీరవలయునను నియమము లేదు. సాధకులుకూడ సన్యాసులుగా నుండవచ్చును. సిద్ధులకుకంటె సాధకులకు హెచ్చు నియమములు గలవు.

సన్యాసి యెవ్వరితోను సంపర్కము పెట్టుకొననివాడై యాత్మపదార్థమునందే క్రీడించుట కలవరచుకొనవలయును. ఆత్మయే యాతనికి సహాయము.

ఆత్మనైన సహాయేన సుఖార్ధీవిచరేదిహ. (మను 6-49)

జనన మరణరాహిత్యము గల్గుటకై యాతడు వాని యందు రోతను గల్గించుకొనవలయును. (మను 6-61)

ఇట్లభ్యాసమువలన జీవించి యుండగానే ముక్తుడు కావచ్చును. లేదా, మరణకాలమునకూడ నిట్టిభావముతోనే యుండుటచే

''యంయం వాపిస్మరన్‌ భావం త్యజత్యత్యన్తే కళేబరం.

తంతమేవైతి కౌన్తేయ సదా తద్భావ భావితః (8-6)

అను గీతావచనము చొప్పున నాతడు తప్పక జనన మరణరాహిత్యము నొందును.

ఇట్లు హిందూమతములోని యాశ్రమవిధాన ముత్తమ సాధనమై మానవుని క్రమక్రమముగా నత్యుత్తమస్థితిని పొందించునదిగా నున్నది.

Hindumatamu    Chapters    Last Page