Hindumatamu    Chapters    Last Page

అధ్యాయము 3.

వర్ణవ్యవస్థ

హిందూమత ప్రత్యేక లక్షణము

హిందూమత గ్రంథమని చెప్పదగిన పుస్తకమును దేనిని తీసికొన్నను, అందు వర్ణధర్మప్రాముఖ్యము వెల్లడియగును; వర్ణాశ్రమథర్మములే హిందూమతమని తేలును. మనుస్మృతి కంటెను హిందూధర్మప్రతిపాదకగ్రంధము మఱొక టేదియు లేదు. అందు ప్రతిపాదింపబడిన విషయమునకు మనువు వర్ణధర్మమనియే నామకరణము చేసినాడని చెప్పదగును. ఎట్లన : మరీచ్యాదిమహర్షులు మనువునొద్ద కేగి, యిట్లడిగిరని మనుస్మృతి ప్రారంభములోనే చెప్పబడినది.

భగవ& సర్వవర్ణానాం యథావదను పూర్వశః,

అన్తరప్రభవాణాంచ ధర్మాన్నోవక్తుమర్హసి.

(మను. 1-2)

(ఓ భగవానుడా, సర్వవర్ణములకును, అవాన్తర వర్ణములకును గల యాయా ధర్మములను గ్రమముగా మాకు చెప్పుటకు తగియున్నావు.)

దానికి సమాధానముగా మను విట్లు చెప్పెను. ''ఈ శాస్త్రమును నాకు బ్రహ్మ బోధించెను. దానిని నేను భృగుమహర్షికి చెప్పితిని. ఆతడు మీకు దీనిని తెలుపగలడు.''

అంత మహర్షులు భృగునివలన ధర్మములను విందురు. ఆధర్మములే మనుస్మృతిలో గన్పట్టుధర్మములు.

ఇట్లు మనుస్మృతి సర్వవర్ణ ధర్మములను, అవాంతర వర్ణధర్మములను తెలుపవలసినదని కోరిన మహర్షులకు సమాధానముగ చెప్పబడినదని మనుస్మృతియే చెప్పుటచే నిందలి విషయమునకు మనువే ''వర్ణధర్మములు, అవాంతర వర్ణ ధర్మములు'' అను శీర్షిక నిడినట్లు స్పష్టము. ఇట వర్ణధర్మములలో ఆశ్రమధర్మములుగూడ చేరియున్నవని వ్యాఖ్యాతలు వ్రాసియున్నారు. మనుస్మృతిలోవలెనే యితరస్మృతులలోగూడ ప్రతిపాదితవిషయము వర్ణాశ్రమధర్మమని చెప్పవచ్చును.

మన మహర్షుల దృష్టిలో వర్ణాశ్రమధర్మములే సర్వస్వము. వర్ణాశ్రమ ధర్మములు బాగుగ నడుచుచున్నచో, దేశము బాగుగ నున్నట్లును, వర్ణాశ్రమ ధర్మములు సరిగ నడువనిచో దేశము చెడిపోయినట్లును వారి యభిప్రాయము. భారతరామాయణములలోగాని పురాణములలోగాని యొక రాజు పరిపాలనము బాగున్నదని వర్ణింపవలసినచో నపుడు వర్ణాశ్రమధర్మములు బాగుగ నడచుచుండెనని చెప్పబడును. ఒకరాజు పరిపాలన దుష్టముగ నున్నదని చెప్పవలసినపుడు వర్ణాశ్రమధర్మములు సరిగా నడచుటలేదని చెప్పబడును.

శ్రీమద్రామాయణములో శ్రీరామచంద్రుని సత్పరిపాలనమును వర్ణించుచు, వాల్మీకిమహర్షి యిట్లు చెప్పినాడు.

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యాశ్శూద్రా లోభవివర్జితాః

స్వకర్మసు ప్రవర్తన్తే తుష్టాఃసై#్వరేవ కర్మభిః

(యుద్ధకాండ 131 సర్గ. 99 శ్లో.)

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు లోభములేనివారై తమతమ కర్మలచేతనే సంతుష్టులై తమతమ కర్మలయందే ప్రవర్తించుచున్నారు.

ఇట్లే యితర పురాణతిహాస గ్రంథములలోను, వర్ణధర్మసుస్థితి సత్పరిపాలనతో నవినాభావముగ వర్ణింపబడినది. దీని కనుగుణముగనే వేనాదిరాజుల పరిపాలనమున వర్ణధర్మములు చెడినట్లు వర్ణింపబడినది. కావుననే స్మృతులలో రాజధర్మములలో వర్ణాశ్రమ ధర్మసంరక్షణము ముందుగ విధింపబడినది.

వర్ణానాశ్రమాంశ్చన్యాయతో భిరక్షేత్‌

(గౌ. ధ. 11-9)

దేశము బాగున్నదన వర్ణాశ్రమధర్మములు బాగున్నవనియు, దేశము చెడినదన వర్ణాశ్రమధర్మములు చెడినవనియు తెలియుటచే, ఋషులమతములో వర్ణాశ్రమధర్మము లెంత ముఖ్యములో స్పష్టమగుచున్నది.

మన్వాది స్మృతులు కేవలము మానవులలో భిన్న వర్ణములవారి నడుమగల ధర్మభేదములను తెల్పుటకు పుట్టినవేకాదు. స్మృతులు తెల్పు ధర్మములు సాధారణముగా నన్నియు సర్వవర్ణ సామాన్యధర్మములే; అయినను వానిలో గూడ భిన్నవర్ణములవారికి విధింపబడు భేదములు కొన్ని కలవు. ఎట్లన : ఉపనయనము బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బాలురకు సామాన్యధర్మమే యైనను ఉపనయనవయస్సులోను, భిక్షాచరణ నియమములలోను, దండపరిమాణములలోను, నొక్కొక వర్ణపు వటువునకు కొన్ని ప్రత్యేకలక్షణము లుండును. ఇట్లే పంచమహా యజ్ఞములును సర్వవర్ణముల వారికిని విధింపబడినవి; కాని యవి శూద్రునకు అమంత్రకముగ విధింపబడినవి. ఆవిధముననే జాతాశౌచ మృతాశౌచములు సర్వవర్ణములవారికిని గలవు; కాని యీ యా శౌచముల కాలపరిమితి యొక్కొక్కవర్ణమువారి కొక్కొక విధమున నుండును. ఆప్రకారమే ప్రాయశ్చిత్తములు మున్నగునవి యన్నివర్ణములవారికి నున్నను వర్ణభేదమును బట్టి యివి మారుట కలదు.

కావున వర్ణవిభేదమును తీసివేయదలచువారు వృత్తి, వివాహ, భోజనములలోని నియమములనే కాక బ్రహ్మ చర్యవిధులు, ఆశౌచవిధులు, ప్రాయశ్చిత్తవిధులు మున్నగువాని నన్నిటినికూడ తీసివేయవలసియుండును. మనుస్మృతి ఇతర ధర్మశాస్త్రములు, పురాణములు మున్నగువానికి స్థానము పోవును. ఈ పవిత్రగ్రంధములులేని హిందూమతము గగనకుసుమము.

మన స్మృతికర్తలు దయాసత్యశౌచాదులను గూడ వర్ణధర్మములలోనే పేర్కొనుట గమనింపదగిన విషయము.

ఇవి సర్వవర్ణ సామాన్యధర్మములుగ చెప్పబడినవి.

''సర్వేషాం సత్యమక్రోధో దానమహింసా ప్రజననంచ''

(అన్ని వర్ణముల వారికిని సత్యము, క్రోధము లేకపోవుట, దానగుణము, అహింస, సంతానము కనుట అనునవి ధర్మములు) అని వసిష్ఠస్మృతి చెప్పుచున్నది.

వర్ణధర్మములు.

అన్ని వర్ణముల వారికిని విధింపబడియుగూడ, వివరములలో వర్ణమునుబట్టి భేదించు ధర్మములకు కొన్ని యుదాహరణములు పైనీయబడినవి. మరియు దయాసత్యశౌచాదులు సర్వవర్ణ సామాన్యధర్మములని గూడ చూచితిమి. ఇక వర్ణముల ప్రత్యేక ధర్మములను చూతము.

బ్రాహ్మణున కీక్రింది ధర్మములు విధింపబడినవి.

అధ్యాపన మధ్యయనం యజనం యాజనం తథా,

దానం ప్రతిగ్రహంచైవ బ్రాహ్మణానా మకల్పయత్‌,

(మను. 1-88)

''వేదములను (సాంగముగ) చదువుట, ఇతరులకు వానిని బోధించుట, యజ్ఞములనుచేయుట, యితరులచేత యజ్ఞములను చేయించుట, యొకరికి దానముచేయుట, యొకరినుండి దానముపట్టుట- ఈపనులను బ్రహ్మ బ్రాహ్మణుల కేర్పాటు చేసెను.''

క్షత్రియున కీక్రింది కర్మలు విధింపబడినవి.

ప్రజానాం రక్షణం దానమిజ్యాద్యయన మేవచ,

విషయేష్వప్రసక్తిశ్చ క్షత్రియస్య సమాసతః.

(మను. 1-89)

''ప్రజలను కాపాడుట, యొకరికి దానము చేయుట, యజ్ఞములు చేయుట, వేదము చదువుకొనుట, యింద్రియ భోగములను కోరకుండుట- ఇవి సంగ్రహముగా క్షత్రియునకు విధింపబడిన ధర్మములు.''

వైశ్యున కీక్రింది ధర్మములు విహితములు.

పశూనాం రక్షణం దానమిజ్యాధ్యయన మేవచ,

వణిక్పథం కుసీదంచ వైశ్యస్య కృషి మేవచ.

(మను. 1-90)

''పశువులను పెంచుట, కాపాడుట, యొకరికి దానము చేయుట, యజ్ఞములను చేయుట, వేదము చదువుకొనుట, వాణిజ్యము, వడ్డీవ్యాపారము, వ్యవసాయము.''

శూద్రున కొక్కటే కర్మ యాదేశింపబడెను.

ఏకమేవతు శూద్రస్య ప్రభుః కర్మ సమాదిశత్‌,

ఏతేషామేవ వర్ణానాం శుశ్రూషా మనసూయయా.

(అసూయ లేకుండ. నీ వర్ణములవారికి శుశ్రూషచేయుట యను నొకకర్మనే బ్రహ్మ శూద్రున కాదేశించెను)

శిల్పాదివృత్తులు శూద్రులచేతిలోనే యుండవలయును)

(గౌ. ధ. 10-61).

ఇట్లు క్షత్రియ, వైశ్య, శూద్రులకు ప్రజాపాలనము. కృష్యాదికము, పరిశ్రమలు అను లౌకికకర్మలు విహితములనియు, బ్రాహ్మణునకు లౌకికకర్మ యేమియులేక కేవల వైదికకర్మకలాపమే విహితమనియు తెలియుచున్నది. బ్రాహ్మణునకు వేదాధ్యయనము క్షత్రియు వైశ్యులకువలె కాదు. ఆతడు లోకమునకు బోధకుడుగను. పురోహితుడుగను గూడ నుండవలసినవాడగుటచే నాతనికి వేదాధ్యయనము, వైదిక ధర్మపరత ముఖ్యములు. ఇట్లీతడు జ్ఞానప్రధానుడై సత్వగుణోపేతుడై యుండవలసిన వాడగుటచే నీక్రిందివి బ్రాహ్మణ లక్ష్యములుగ భగవద్గీతలో చెప్పబడినవి. అంతరింద్రియ నిగ్రహము, బాహ్యేంద్రియ నిగ్రహము, ఆస్తిక్యము, తపస్సు, శౌచము, ఓర్పు, ఋజుప్రవర్తనము, జ్ఞానము, విజ్ఞానము.

శమో దమస్తపః శౌచం క్షాన్తిరార్జవ మేవచ,

జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మస్వభావజం.

(భ. గీ. 18-42)

ఇతరవర్ణములవారికి కూడ ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము మున్నగునవి యుండవలసినవే, కాని బ్రాహ్మణున కివియే ముఖ్యములు. కావున బ్రాహ్మణుడు ముఖ్యముగ తపస్సునం దనురక్తుడై, లౌకికభోగముల నంతగా కోరనివాడై, జ్ఞానప్రధానుడై యుండవలయును.

ప్రయోజనము

సంఘము నడచుట కిట్టి భిన్నవృత్తులు వివిధవర్ణముల వారికుండుట యత్యవసరము. ఏదేశములోనుగూడ నీవిధముగ నాల్గువర్ణముల విభాగము తప్పదని రెండవ యధ్యాయమున నిరూపింపబడినది. ఈ నాల్గువర్ణములవారును తమ తమ జీవికలను సంపాదించుటకే యీవృత్తులు నిర్ణయింపబడలేదు. సంఘము బాగుగ నడచుట కూడ వీని ప్రయోజనమే. నాల్గు వర్ణములవారును గూడ దేశమునకు సేవచేయుచున్నారు.

బ్రాహ్మణుడు లౌకికాధ్యాత్మికజ్ఞానమునకు నిధియై, అన్నివర్ణములవారికిని గూడ తన జ్ఞానఫలము నందజేయుచు నన్నివర్ణములవారిని ధర్మమార్గమున నడపుటకు యత్నించుచు వివిధవర్ణముల వారికి తమతమ వృత్తులను నిర్వహించుటలో నావశ్యకమగు శాస్త్రజ్ఞానమునుగూడ బోధించుచు అన్ని వర్ణములవారికిని అవసరమగు జ్యోతిషాదిశాస్త్ర ప్రయోజనమునుకూర్చుచు యాగాదులను చేయించుచు, చేయుచు, నందువలన దేవతలను తుష్టిపరచి లోకములో సకాలవర్షాదులవలన దేవతల యనుగ్రహ ఫలమును ప్రజల కందఱకు నందునట్లు చేయుచు, అన్నివర్ణములవారికి గల సమస్తస్మార్తకర్మలను చేయించుచు, సర్వవర్ణములవారి భౌతిక ధార్మికాధ్యాత్మిక శ్రేయస్సును వృద్ధిపొందుచున్నవాడై సంఘసేవ చేయవలయును. క్షత్రియుడు దేశములో నంతఃకలహములు లేకుండగను, దొంగలు ద్రోహులు మున్నగువారు తల యెత్తకుండగను, పరదేశరాజులు దేశము నాక్రమింపకుండగను గాపాడుచు రాజుగాగాని సైనికుడుగాగాని రాజోద్యోగిగాగాని యుండి దేశ##సేవ చేయవలయును. వైశ్యు డుత్పత్తిసాధనములను చేతనుంచుకొని వ్యవసాయము వలన ప్రజలకు కావలసిన వస్తువుల నన్నిటిని పండించుచు, నేప్రాంతముల నేయేవస్తువు లుండవో యాప్రాంతముల కావస్తువుల నన్యప్రాంతములనుండి యందచేయుచు, ప్రజలకేవస్తువునకును కొరత లేకుండచేయుచు గోవులను పెంచి ప్రజలకు స్వచ్ఛక్షీరముల నందజేయుచు తనకు స్వల్పలాభ##మే యుండునట్లు వ్యవహరించుచు పేదవారికి ధనము పెట్టుబడిపెట్టుచు వారినుండి స్వల్పవృద్ధి (వడ్డీ)ని మాత్రమే తీసికొనుచు సంఘసేవ నొనర్పవలయును. శూద్రుడు సమస్త శిల్పములను, కళలను, వృత్తులను పూని పై మూడు వర్ణములవారు నిర్వహింపవలసిన ధర్మములకు తోడ్పడుచు సంఘసేవ చేయవలయును.

ఇట్లు వర్ణధర్మములు జీవికాసాధనములేకాక సంఘసేవా మార్గములనికూడ తెలియగలదు. ఇందొక వర్ణము వారికి సౌకర్యము, మరొక వర్ణమువారికి కష్టములేదు. బ్రాహ్మణుడు జ్ఞానప్రధానుడగుటచే నగ్రవర్ణస్థుడని చెప్పుటకు వీలున్నను, ఆతని జీవితము శూద్రుని జీవితముకంటె హెచ్చు సుఖవంతము కాదు; పైగా హెచ్చు కష్టభాజనము. స్నానములు, ఉపవాసములు, నియమములు, తపస్సులు, అధ్యయనము మున్నగునవి బ్రాహ్మణునకు జీవితములో సుఖమును స్వేచ్ఛను సంకుచితము చేసినవి. అట్లే క్షత్రియుడు ప్రాణము నరచేతను పట్టుకొని యేక్షణముననైనను దానిని వదలివైచుటకు సిద్ధపడి యుండవలసినవాడగుటచే నాతనిపట్ల గూడ పక్షపాతములేదు. అట్లే వైశ్యుడు ధనార్జనము చేయుటకు హెచ్చుగ నవకాశముగలవాడేయైనను లోకమున కుపయోగించుటయే యాతని పరమ ప్రయోజనమగుటచే నాతనికిని ప్రత్యేక సౌకర్యములు లేనట్లే పరిగణింపదగును. శూద్రుడు పరిశ్రమల లన్నిటిని చేత పూనినవాడగుటచే నాతడును సంఘశ్రేయస్సునకై కష్టించినవా డగుచున్నాడు.

ఈ నాల్గు వర్ణములు నేదేశమందైనను, ఏసంఘమందైనను తప్పనిసరిగ నేర్పడుననియు, నాల్గు వర్ణములకు సమానమైన బాధ్యతలు గలవనియు పైని చూచియున్నాము. ఎట్లయినను తప్పనిసరిగ నేర్పడుదానిని జన్మసిద్ధము చేయుటవలన హిందూమతము సాధించిన లౌకికప్రయోజనము లేవన :

(1) వంశపారంపర్యముగ వచ్చు వృత్తిని నేర్చుకొనుట బాలురకు సులభమగుటచే వృత్తివిద్యలను నేర్చికొనుటయందలి శ్రమ తప్పును. ఏకులములో పుట్టినవానికాకులమునందలి వృత్తి సులభముగ నలవడునని పాశ్చాత్యులు గూడ నంగీకరించియే యున్నారు. కులమువరకును పోనేల? వేదపండితుని కుమారునకు వచ్చినంత చక్కగ వేదము మరొకనికి రాదు. వృత్తికిని కులమునకును గల సంబంధము నెవరును గాదనజాలరు. కులవిద్య నేర్చుకొనక పోయినను చూచినంత మాత్రముననే యలవడును. ఎచ్చటనైనను అరుదుగ ఒక వర్ణమునకు చెందిన బాలునకు మరొక వర్ణముయొక్క వృత్తి సులువుగ నలవడుచో వాడు దానిని నేర్చుకొనవచ్చునుగదా యనుప్రశ్న యిట పొడముటకు వీలులేదు. ఏలనన : శాస్త్రవిహితము కావుననే వర్ణపద్ధతి యనుసరింపదగినదనియే ధార్మికుల మతము. సాధారణముగ లౌకికదృష్టి కూడ దాని కనుకూలముగ నుండుననుటకే లౌకిక ప్రయోజనములు చూపబడుచున్నవి. ప్రత్యేక సందర్భములలో నీలౌకిక ప్రయోజనములకు బాధ కల్గినంత మాత్రమున శాస్త్రము ప్రతిహతము కాదు.

(2) ప్రతి మానవుని వృత్తియు జన్మతోనే నిర్ణీతమగుటచేతను, వాడితరవృత్తుల కేగుట దోషమని చెప్పబడి యుండుటచేతను సంఘములో వృత్తులకై పోటీలు తగ్గును. వర్ణపద్ధతి ననుసరించి బ్రాహ్మణునకు బ్రాహ్మణధర్మమే శ్రేష్ఠము. లాభదాయకమనిగాని, సులభమనికాని తలచి యాతడు మరొకవర్ణముయొక్క ధర్మము ననుసరింపరాదు.

స్వధర్మేనిధనం శ్రేయః పరధర్మో భయావహః.

(తన ధర్మములో చచ్చుటయైనను మంచిదికాని పర వర్ణధర్మము ప్రమాదకరమైనది) అని భగవద్గీత నుడువుచున్నది. కావున వర్ణ పద్ధతివలన నీర్ష్యాసూయాదు లుండక యేకులమున పుట్టినవాని కావృత్తియే సర్వోత్తమమైన దనుభావము గల్గును.

(3) ప్రస్తుతప్రపంచము నంతగా బాధించుచున్న నిరుద్యోగ సమస్యకూడ వర్ణ పద్ధతివలన తొలగిపోవును. వర్ణపద్ధతినిబట్టి మానవునకు పుట్టుకతోడనే వృత్తి యేర్పడును. ఈనాడు నాగరికత యెంతపెరిగినను సంఘముకాని, ప్రభుత్వముకాని ప్రతి మానవునకును వృత్తిని చూపలేకపోయినది. యువకు లేదో ఆశతో 10, 15 సంవత్సరములు కష్టించి చదువుటయు, తుద కేవృత్తియు దొరకక మాడుటయు నప్పుడప్పుడు జరుగుచున్నది. ఏవర్ణమునా రావృత్తినే నమ్ముకొని యీ యుద్యోగ దురాశలను వీడుచో నెల్లరకు జీవిక కల్గునని నవ్యభావోపేతులైన రాజకీయనాయకులుగూడ నేడు నుడువుట పేర్కొనదగిన యంశము.

(4) జన్మచేతనే వృత్తులు విద్యలు, ధర్మములు నిర్ణీతము లగుటవలన గలుగు మరొకలాభ మేమన : ఇట్టియేర్పాటే లేనిచో, నేనాడో నశించి యుండెడి వృత్తులు, విద్యలు మనదేశములో నింతకాలము నిలచినవి. బ్రాహ్మణునకు వేదాభ్యాసము ధర్మమను నియమములేనిచో వేదములేనాడో నశించియుండెడివి. అట్లే కొన్ని శాస్త్రములు, శిల్పములు, వృత్తులు నేటివఱకు కులక్రమమున వచ్చుచు నిలచి యుండుటకు కారణ మాయాకులముల వారి కాయావృత్తులు శిల్పములు, విహితములై యుండుటయే.

కొన్ని వర్ణములవారికి గౌరవప్రదములైన వృత్తులుండుటయు, కొన్ని వర్ణములవారికి హీనవృత్తు లుండుటయు జూడ వర్ణపద్ధతిలో న్యాయములేనట్లు తోచునని నేడు కొందఱు నుడువుచున్నారు. కాని యిట్లనువారికి ప్రాచీన హిందూ మతసిద్ధాన్తములం దెట్లు నమ్మకములేదో, యట్లే నవీన ప్రపంచములోని యాదర్శములందును, సిద్ధాన్తములయందును కూడ ప్రవేశములేదని చెప్పవలసియున్నది. నవీనాదర్శముల ననుసరించి, యొకపని గౌరవప్రదము, నొకటి హీనమునని చెప్పుటకు వీలులేదు. బుద్ధిబలముతోకాక, కేవలము శరీర పరిశ్రమతో సంబంధించిన కార్యములలోగూడ గౌరవము గల దనునదియే నవీనసిద్ధాన్తము. నవయుగప్రవక్తలందరు నీపరిశ్రమ గౌరవమును (Dignity of labour) గూర్చి నొక్కి చెప్పియున్నారు. అట్టిపట్ల నవీనులు వర్ణధర్మములో లోటు నెంచుటకు వీ లెట్లు కల్గును?

ఇట్లు వర్ణపద్ధతి సంఘము చక్కని మార్గమున నడచుట కుపయోగపడునదే కాని, యాధునికులు కొందఱు తలచునట్లు సంఘాభివృద్ధి నరికట్టునది కాదు. కావుననే ఈ సృష్టి చక్కగ సాగుటకే బ్రహ్మ వివిధవర్ణములవారికి భిన్నవృత్తుల నేర్పరచెనని మనువు చెప్పినాడు.

సర్వస్యాస్యతు సర్గస్య గుప్త్యర్థం సమహాద్యుతిః,

ముఖబాహూరుపజ్జానాం పృథక్కర్మాణ్యకల్పయత్‌.

(మను. 1-87)

స్వవర్ణవివాహవిధి

వర్ణ పద్ధతిలో వృత్తికంటెను ముఖ్యమైనది స్వవర్ణ వివాహనియమము. అన్ని ధర్మశాస్త్ర గ్రంధములలోను స్వవర్ణ స్త్రీనే వివాహము చేసికొనవలెనను నియమము కలదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యవర్ణములకు చెందినవారు (ద్విజులు) గురుకులము వీడి స్నాతకులై తమతమ వర్ణమునకు చెందిన కన్యలను వివాహమాడవలయునని మనుస్మృతి యాదేశించుచున్నది,

ఉద్వహేత ద్విజో భార్యాం సవర్ణాం లక్షణాన్వితాం.

(మమ. 3-4)

శూద్రులు గూడ నీస్వవర్ణ వివాహనియమమును పాటింప వలసినదేయని మనువు చెప్పుచున్నాడు.

''శూద్రైవ భార్యా శూద్రస్య'' (మను. 3-13)

కాముకపక్షములో మనువు, బ్రాహ్మణుడు క్రింది మూడువర్ణముల కన్యలను, క్షత్రియుడు క్రింది రెండువర్ణముల కన్యలను, వైశ్యుడు శూద్రకన్యనుగూడ వివాహమాడుటను తెల్పియున్నమాట వాస్తవమే; కాని యట్టి యసవర్ణ వివాహము లాతనికి సమ్మతములని చెప్పుటకు వీలులేదు.

''కామతస్తు ప్రవృత్తానాం'' కామముతో ప్రవర్తించు వారికి అని (3-12) యాతడు చెప్పుటచే, నీవివాహములు ధర్మవివాహములు కావని యాతని మతమైనట్లు స్పష్టము. దీనికి తోడుగ ''ఉద్వహేత ద్విజో భార్యాం సవర్ణాం లక్షణాన్వితాం'' అని కూడ నాతడు చెప్పుటచే నాతనికి సమ్మతమైనది స్వవర్ణ వివాహమే యనుట నిస్సందేహము.

ఈకామప్రధాన వివాహమును చేసికొను దంపతులకు జనించినవారు తల్లి దండ్రులు వర్ణములకు చెందరనునది ముఖ్యమైన విషయము. సమస్తధర్మ శాస్త్రకారులునుకూడ నీవిషయమై యేకాభిప్రాయముతోనే యున్నారు. బ్రాహ్మణుడు క్షత్రియస్త్రీని వివాహమాడుచో వారికి పుట్టినవాడు బ్రాహ్మణుడు కాడు. వానికి సవర్ణుడనిపేరు. అట్లే క్షత్రియునకు వైశ్యస్త్రీవలన జనించినవాడు అంబష్ఠుడు. వైశ్యునకు శూద్రస్త్రీవలన జనించినవాడు ఉగ్రుడు. బ్రాహ్మణునకు వైశ్యస్త్రీవలన పుట్టినవాడు నిషాదుడు. క్షత్రియునకు శూద్రస్త్రీవలన పుట్టినవాడు దౌష్యంతుడు. బ్రాహ్మణునకు శూద్రస్త్రీవలన జనించినవాడు పారశవుడు. ఇట్టిబిడ్డల కనులోమసంతాన మనిపేరు. క్రిందివర్ణముల పురుషులవలన పై వర్ణపు స్త్రీలయందు జనించిన సంతానమునకు ప్రతిలోమ సంతాన మనిపేరు. అట్టిబిడ్డలు సర్వధర్మ బహిష్కృతులు. అందును బ్రాహ్మణస్త్రీయందు శూద్రునివలన పుట్టినవాడు పాపిష్ఠుడని ధర్మశాస్త్రములు నుడువుచున్నవి.

అంత్యః పాపిష్ఠః (గౌ. ధ. సూ. 4-27)

ఈ చండాలుడు గ్రామమునకు బయట నుండవలెనని మనువు చెప్పుచున్నాడు.

చండాల శ్వపచానాంతు బహిర్ద్రామాత్ర్పితిశ్రయః.

(మను. 10-51)

ఈయనులోమ ప్రతిలోమ సంతానములకే అవాంతర వర్ణములని పేరు.

కావున, తనవంశమును నిలబెట్టుకొన గోరువాడెల్ల స్వవర్ణసంజాతనే వివాహమాడవలయును. ఒకేవర్ణముగల దంపతులకు పుట్టినసంతానమే యావర్ణమునకు చెందినదగును.

సవర్ణేభ్య స్సవర్ణాసు జాయంతేహి సజాతయః

(యాజ్ఞవల్క్యస్మృతి 1-91)

భిన్నవర్ణముల దంపతులకు చెందిన సంతానము వంశము నిలబెట్టుటమాట నటుంచి యావర్ణమునకే చెందదనునది ప్రధానాంశము. ఆవర్ణముల కర్మల కాసంతాన మర్హముకాదు.

సమానవర్ణముగల భార్యయందు కన్న సంతానమే కర్మ సంబంధము గలదగును.

సవర్ణా పూర్వశాస్త్రవిహితాయాం యథ

ర్తుగచ్ఛతస్తేషాం కర్మభిః సంబంధః

(ఆపస్తంబ ధ. సూ. 2-13-1)

వర్ణము జన్మసిద్ధము.

పై నుదాహరింపబడిన స్మృతి వాక్యములనుబట్టి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నామములు జన్మను బట్టియే కల్గునని స్పష్టమగుచున్నది.

ఇట్లున్నను, కొందరు వర్ణము జన్మసిద్ధముకాదనియు కర్మసిద్ధమనియు నేడు నుడువుట వింతగ తోచకమానదు. ఏధర్మగ్రంథమును తీసికొనినను నీయంశము తెల్లమగును. మహాభారతములో నొకటిరెండుచోట్ల సల్లక్షణములు కలవాడు బ్రాహ్మణుడనియు, దుష్టగుణములు గలవాడు శూద్రుడనియు చెప్పబడినమాట వాస్తవమే, కాని దానియర్థము తీయుటలో మనమొకింత వివేకము నుపయోగింపవలయును.

మహాభారతము పైనుదాహరింపబడిన స్మృతులకు తర్వాత బయలుదేరినదేకాని పూర్వము బయలుదేరినది కాదని ముందుగ మనము గ్రహింపవలెను. భారతము శ్రుతిస్మృతుల ప్రమాణమునుగూడ లెక్కలేనన్నిచోట్ల నంగీకరించినది. మను ధర్మశాస్త్రమును భారతము చాలస్థలములలో నుద్ఘాటించినది. అట్టిపట్ల మహాభారత మట్లనుటలోగల కారణ మేమియని విచారింపవలసియున్నది. యథార్థజిజ్ఞాసువులకిది యొకకష్ట విషయముకాదు. వర్ణములలో బ్రాహ్మణ వర్ణము శ్రేష్ఠము. (వర్ణానాం బ్రాహ్మణో గురుః, అని మనువు. దయాసత్య శౌచములు సర్వవర్ణ సామాన్యధర్మములు. ఇవి యాత్మగుణములలోనివి. ఇవి యెవనియందుండునో వాడును శ్రేష్ఠుడే. జాతకర్మాది సంస్కారముల కంటెను ఆత్మగుణములు ముఖ్యములని గౌతమధర్మ సూత్రాది గ్రంధములు చెప్పుచున్నవి. కొందరీ యంశమును మఱచి వర్ణ సిద్ధమైన శ్రేష్ఠతయే శ్రేష్ఠతయని భావింపవచ్చును. అట్టి భావమును నిరసించుటకే, ముఖ్యముగ నాత్మగుణముల యాధిక్యమును చెప్పుటకే, భారతము సద్గుణములు గలవాడు బ్రాహ్మణుడని చెప్పినది. సారాంశ మేమనః బ్రాహ్మణు డగ్రవర్ణస్థు డగుటవలన నిట బ్రాహ్మ శబ్దము శ్రేష్ఠుడనుట కుపలక్షణము. కావున నెవడు శ్రేష్ఠుడన సద్గుణములు గలవాడు శ్రేష్ఠుడు; ఎవడు నికృష్టుడన దుర్గుణములు గలవాడు నికృష్ఠుడు, ఇంతవఱకే ఈవాక్యముల భావము. కాళిదాసు రఘువంశములో దిలీపమహారాజును వర్ణించుచు నాతడే ప్రజలకు తండ్రియని చెప్పినాడు.

''స పితా పితర స్తాసాం కేవలం జన్మ హేతవః''

ఇచట పితృశబ్దమున కెట్టియర్థమో యట బ్రాహ్మణ శబ్దమునకు నట్టియర్థమే. ఇట్లు కాదేని యెన్నియో చిక్కులు వచ్చును.

(1) ఈశ్లోకమునుబట్టి వర్ణములు రెండే యగును. బ్రాహ్మణశూద్ర వర్ణములు. మహాభారత మితరవర్ణములను గూడ నంగీకరించినట్లు మన మెఱుంగుదుము. (2) విదురుడు సద్గుణములు గలవాడేయైనను నాతడు బ్రాహ్మణుడని భారతములో నెచ్చటను సూచింపబడలేదు. (3) దయాసత్య శౌచాది సద్గుణములను గల్గియుండుట సర్వవర్ణ సామాన్య ధర్మమని హిందూధర్మ గ్రంథములు చెప్పుచున్నవి. బ్రాహ్మణుడు మాత్రమే సత్ర్పవర్తనమును గల్గియుండ వలయునని చెప్పబడలేదు. శూద్రునకుకూడ సత్యము పల్కుట, క్రోధము లేకుండుట, శుచిగా నుండుట ధర్మములని ఈక్రింది గౌతమ ధర్మసూత్రము చెప్పుచున్నది.

తస్యాపి సత్యమక్రోధ శ్శౌచం. (గౌ. ధ. 10-51)

అయినను నాయావర్ణములకు జన్మసిద్ధముగగల సత్త్వరజస్తమోగుణముల పాళ్ళనుబట్టి యీ సత్యాదిలక్షణముల నలవఱచుకొనుట కొందఱకు సులభము, కొందఱకు కష్టము కావచ్చును. కాని యీధర్మము లందఱకును సమానములుగనే విధింపబడినవి. శూద్రుడు చెడ్డవాడుగా నుండవలయునని యెచ్చటను చెప్పబడలేదు. శూద్రునిపట్ల నట్టి దురభిప్రాయము మన ప్రాచీనులకు లేదు. మంచితనము బ్రాహ్మణుని యందును నుండవచ్చును; శూద్రునియందును నుండవచ్చును. బ్రాహ్మణుడు మంచివాడగుచో సద్ర్బాహ్మణుడనబడును; చెడ్డవాడైనచో, దుర్బ్రాహ్మణు డనబడును; శూద్రుడు మంచివాడైనచో, సచ్ఛూద్రు డనిపించుకొనును. చెడ్డవాడైనచో దుశ్శూద్రు డనిపించుకొనును. మంచిచెడ్డలకును వర్ణములకును సంబంధ మింతియే కాని, మంచిచెడ్డలు వర్ణమును నిర్ణయింపవు. అట్లే నిర్ణయించుచో, నొకడు తన జీవితకాలములో భిన్న సమయములయం దొకప్పుడు మంచి వాడుగను, మఱొకప్పుడు చెడ్డవాడుగను నుండుచో వాని వర్ణము క్షణక్షణమునకును మారుచుండవలయును. ఇట్టి వర్ణవ్యవస్థ యేగ్రంధమునను కానరాదు. (4) గుణకర్మలనుబట్టి వర్ణమును నిర్ణయింపవలయుననుచో నది మిగిలిన మహాభారతభాగమున కంతకును విరుద్ధముగ నుండును. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు క్షత్రియకర్మ నవలంబించినను, వారు భారతములో నెచ్చటను క్షత్రియులుగ పరిగణింపబడలేదు. బ్రాహ్మణులుగ పరిగణింపబడిరి. (5) స్మృతి విరుద్ధమైన యితిహాసమునకు ప్రామాణ్యము లేకపోవుటచేతను, స్మృతుల మతమున వర్ణము జన్మసిద్ధమని తేలుటచేతను మహాభారతము తద్విరుద్ధముగ తెల్పుచో నదియప్రామాణికము కావలసివచ్చును. 6 మహాభారతాంతర్గతమైన భగవద్గీతయొక్క మతమున వర్ణము జన్మసిద్ధమేయని ముందు రుజువుచేయబడును. (7) వేదమతమున వర్ణము జన్మసిద్ధమగుటచే పంచమవేదమని పేరుగాంచిన భారతము దానికి విరుద్ధముగ చెప్పజాలదు.

ప్రధానాంశ మేమన : మంచి చెడ్డలనుబట్టి కులనిర్ణయము నేధర్మశాస్త్రకారుడును చేయలేదు. మంచివాడు బ్రాహ్మణుడు, చెడ్డవాడు శూద్రుడనునది యాధునిక సంస్కర్తలు కనిపెట్టిన విచిత్రవిధానము. ఏధర్మగ్రంధములోను గూడ మానవుని గుణకర్మలనుబట్టి వర్ణమును నిర్ణయించు నేర్పాట్లు గన్పట్టకుండుట ప్రత్యేకముగ గమనింపదగిన యంశము. మీదుమిక్కిలి బ్రాహ్మణునకు 8 వ సంవత్సరమునను, క్షత్రియునకు 11 వ సంవత్సరమునను, వైశ్యునకు 12 వ సంవత్సరమునను ఉపనయనము చేయవలెనని యుండుటచే గుణకర్మలతో నిమిత్తము లేకుండగనే బాలుర వర్ణములను నిర్ణయింపవలెననియు, వాడేవర్ణమున జనించినా డేనునదియే యాలోచనీయమనియు ఋషుల మతమైనట్లు స్పష్టము.

భగవద్గీతా మతమున వర్ణము జన్మసిద్ధమా కర్మసిద్ధమా యను నంశము నిపుడు విమర్శింతము.

గీత సర్వసమత్వమును బోధించుననియు, వర్ణవిభేదమున కందు తావు లేదనియు నేడు కొందఱు నుడువుచున్నారు. మఱికొందఱు గీతామతమున వర్ణము జన్మసిద్ధము కాదనియు మానవుని ప్రకృతినిబట్టి నిర్ణీతము కావలెననియు చెప్పుచున్నారు. ఈరెండు వాదములును నిస్సారములు.

వీరి వాదములే సరియైనవగుచో గీతాగ్రంథమున కుత్పత్తియే లేకుండెడిది. అర్జునుడు క్షత్రియుడగుటచే, ధర్మయుద్ధమునుండి యాతడు విరమింపరాదని కృష్ణుడు ప్రారంభముననే చెప్పియున్నాడు. అర్జునుడు బ్రాహ్మణుడో, మఱియేయన్యవర్ణమునకు చెందినవాడో యైయుండినచో నట్లాతని యుద్ధములోనికి దింపుటకు కృష్ణుడు యత్నించియే యుండడనుటకు గీతలోనే యనేక సాక్ష్యములు గలవు.

''స్వధర్మే నిధనం శ్రేయః'', ''పరధర్మో భయావహః'', ''శ్రేయాన్‌ స్వధర్మోవిగుణః'' మున్నగు వాక్యములు వ్యర్థప్రసంగములు కాకుండవలెనన్నచో, శ్రీకృష్ణుడు వర్ణపద్ధతిని విధించినాడని చెప్పక తప్పదు. నీయిచ్ఛనుబట్టి నీకర్తవ్యము నిర్ణీతమగుచో నీధర్మమును విడచి పరధర్మమును చేపట్టరాదనుటలో నర్థమేమియుండును? జన్మచేతనే నీకొకవిధమైన ధర్మము నిర్ణీతమైనదనియు, నదియే నీస్వధర్మమనియు నీయిచ్ఛనుబట్టి దానినివీడి యన్యధర్మమును వహించుట భయావహమనియు గీత చెప్పుచున్నది. ఈజన్మసిద్ధ వర్ణధర్మముపట్ల కృష్ణభగవానున కధికాభినివేశము గల్గుటచేతనే, గీతలలో స్వధర్మమును వీడరాదనుమాట యనేక పర్యాయములు చెప్పబడినది. ఈస్వధర్మము జన్మసిద్ధమేయని వాచ్యముగ గూడ కృష్ణభగ నుడు నుడివియున్నాడు. ఈస్వకర్మను ''సహజం'' అని భగవానుడు చెప్పినాడు. (సహజంకర్మ కౌన్తేయ సదోషమపి న త్యజేత్‌.) ''నీతో కూడ పుట్టిన''దని దీని యర్థము? వర్ణము జన్మసిద్ధమేయనుట కింతకంటె నేమి కావలయును?

ఎవరి స్వధర్మమును, లేదా వర్ణధర్మమును వారు నిర్ణయించుకొననక్కఱలేదనియు, తానే యాపనిని నెరవేర్చుచున్నాననియు భగవానుడు గీతలో చెప్పుచున్నాడు. ఏజీవు డెట్టికర్మలు చేసికొనినాడో, సత్వరజస్తమోగుణములలో నెట్టిపాళ్ళను గల్గియున్నాడో యాకర్మలకును, గుణములకును తగిన వర్ణములో నాజీవుని పుట్టించుచున్నాననియు. నీవిధముగనే చాతుర్వర్ణ్యసృష్టి తాను చేయుచున్నాననియు భగవానుడు నుడివినాడు. ఒక డొక వర్ణములో జనించినాడన వాడచ్చట జనించుట పరమేశ్వరనిర్దేశమువలననే యని తెలిసికొనవలెను. ఇట్లు గుణకర్మవిభాగమువలననే చాతుర్వర్ణ్య సృష్టిని చేయుచున్నానని శ్రీకృష్ణు డీక్రిందిశ్లోకములో చెప్పియున్నాడు.

చాతుర్వర్ణ్యం మయా స్పష్టం గుణకర్మవిభాగశః (గీత 4-13)

కావున నెవ్వడును తన ఇచ్చనుబట్టికాని, మరొకవిధముగగాని తన వర్ణమును తాను నిర్ణయించుకొననక్కఱలేదు. భగవానుడే యాపనిని చేసినాడని నమ్మి తా నేవర్ణములో జనించిన నా వర్ణముయొక్క ధర్మము నాచరింపు చుండవలెనని యిందువలన తేలగలదు.

ఇట్లు గీతామతమున వర్ణము జన్మసిద్ధమనియు, వర్ణధర్మానుష్ఠానము ముఖ్యకర్తవ్యమనియు తేలుచున్నది. ఉపక్రమోపసంహారములు రెంటిలోను (రెండవ యధ్యాయమునను, పదునెనిమిదవ యధ్యాయమునను) గూడ గీత యీ జన్మసిద్ధవర్ణ ధర్మానుష్ఠానమును నొక్కిచెప్పుట ప్రత్యేకముగ గమనింపదగిన యంశము.

వేదములలో వర్ణవ్యవస్థ లేదని నేడు కొందఱు చేయు వాదము నిరాధారము. ఏ వేదమును దీసికొనినను నాలుగు వర్ణముల ప్రశంస యందు గన్పట్టును.

ఋగ్వేదదశమమండలమున నీ సుప్రసిద్ధఋక్కు గలదు.

బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌,

బాహూరాజన్యః కృతః,

ఊరూతదస్య యద్వైశ్యః,

సద్భ్యాం శూద్రో అజాయత.

(బ్రాహ్మణుడు విరాట్పురుషుని ముఖమాయెను. క్షత్రియు డాతనిబాహువు లాయెను; వైశ్యు డాతనియూరువు లాయెను. శూద్రు డాతని పాదములనుండి పుట్టెను.)

ఇచట నాల్గువర్ణములును పేర్కొనుటయేకాక యావర్ణముల గుణకర్మములు గూడ సూచింపబడినవి.

పై ఋక్కువలన బ్రాహ్మణుడు విరాట్పురుషుని శిరస్సువలె నున్నాడని రూపకముగా చెప్పుకొనినను చెప్పుకొనవచ్చును. లేదా బ్రాహ్మణుడు విరాట్పురుషుని శిరస్సు నుండి జనించినాడని చెప్పుకొనవచ్చును. ఈరెంటిలో నేవిధముగ చెప్పినను శిరోధర్మము బ్రాహ్మణునకు గలదనుట స్పష్టము. ''సర్వస్యగాత్రస్య శిరః ప్రధానం'' అనునట్లు బ్రాహ్మణునకు మానవజాతిలో ముఖ్యముగనుండు బుద్ధి యధికమని తేలగలదు. విద్యలను, వేదవేదాంగములను నాత డభ్యసించి యితరుల కుపదేష్టగ నుండగలడు దీనివలన ప్రధాన బ్రాహ్మణకర్మ తెలియుచున్నది. కర్మయే కాదు, గుణముకూడ వెల్లడి యగుచున్నది. జ్ఞానము సత్వ గుణలక్షణమని వేదాంత గ్రంథములు చెప్పుచున్నవికదా. కావున బ్రాహ్మణుడు సత్వగుణప్రథానుడని యీ ఋక్కు చెప్పుచున్నది. అట్లే క్షత్రియునకు బాహులక్షణమైన బలము, పరాక్రమము నుండునని దీనివలన తెలియుచున్నది. బలపరాక్రమములచే క్రూరులను శిక్షించుట, శిష్టులను కాపాడుట క్షత్రియధర్మమని దీనివలన తేలుచున్నది. ఈకర్మ కనుగుణమైనది రజోగుణము. కావున క్షత్రియునిది ప్రధానముగ రజోగుణమని యీఋక్కు తెల్పుచున్నది. ఇట్లే యూరువుల లక్షణములు వైశ్యులకు గలవని యీఋక్కు తెల్పుచున్నది. ఊరువులు శరీరము నిలచుటకు స్తంభములవలె నాధారభూతములగుచున్నవి. అట్లే వైశ్యుడు సర్వవర్ణములవారు ప్రాణములతో నిలచుటకు కారణభూతుడు. ఎట్లను అన్ని వర్ణముల వారికిని తినుట కవసరమగు ధాన్యాధికము పండించువాడు వైశ్యుడు; మఱియు పాలు, పెరుగు, నెయ్యి మున్నగునవి కూడ నాతని వలననే వచ్చును. గోరక్షణము కూడ నాతని విధులలోనిదేకదా. ఇట్ణు వైశ్యుడు పాడిపంటలను చేత నుంచుకొన్నవాడై, లోకముయొక్క స్థితికి కారకుడయినాడు.

అట్లే శూద్రుడు పాదలక్షణోపేతుడుగ నిందు కన్పఱుబడుటచే, సంఘసేవయను నాతని లక్షణ మిందు సూచింపబడినది.

ఇట్లు నాల్గువర్ణములవారి గుణకర్మలును నీఋక్కులో సూచింపబడినవి. వేద వాఙ్మయములో నింకను ననేకస్థలములలో నిట్లు చాతుర్వర్ణ్యగుణకర్మలు తెల్పబడినవి. ఈవర్ణములు జన్మతోనే వచ్చినవనుటకు ''పద్భ్యాం శూద్రో అజాయత'' అనుదానిలోని 'అజాయత' అను పదము సాక్ష్యము. వేదమును మనమొకసారి చూచుచో నింతకంటెను స్ఫుటముగ నీయంశమును- అనగా వర్ణములు జన్మసిద్ధములు అను నంశమును తెల్పువాక్యము లెన్నియో లభింపగలవు.

ఏవిధముగా జంతువులలో వివిధవర్ణములుగలవో, యావిధముగానే మానవులలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు-అను వర్ణములు కలవనియే మన శాస్త్రముల యభిప్రాయము. రక్తసాంకర్యము చెడ్డదని మన ప్రాచీన వాఙ్మయము నెచ్చట చూచినను తెలియగలదు.

తైత్తిరీయసంహితలో బ్రాహ్మణాదివర్గము లిట్టి భిన్న వర్ణములుగనే చెప్పబడినవి.

''ప్రజాపతి రకామయత ప్రజాయేయేతి, సముఖ స్త్రి వృతం నిరమమీత తమగ్నిర్దేవతా అన్వసృజ్యత గాయత్రీ ఛందో రథన్తరగ్‌ంసామ బ్రాహ్మణో మనుష్యాణా మజః పశూనాం తస్మాత్తే ముఖ్యాముఖతోహ్య సృజ్యన్త ఉరసో బాహుభ్యాం పంచదశం నిరమమీత తమింద్రో దేవాదేవతా అన్వసృజ్యత, త్రిష్టుప్ఛందో బృహత్సామరాజన్యో మనుష్యాణామవిః పశూనాం తస్మాత్తే వీర్యావన్తో వీర్యాద్ధ్య సృజ్యన్త, మధ్యతస్స ప్తదశం నిరమమీత, తం విశ్వేదేవా దేవతా అన్వసృజ్యన్త, జగతీఛందో వైరూపగ్‌ంసామ వైశ్యో మనుష్యాణాం గావః పశూనాం తస్మాత్త ఆద్యా అన్నధానాద్ధ్యసృజ్యన్త, తస్మా ద్భూయాగ్‌ం సోన్యేభ్యో భూయిష్ఠాహిదేవతా అన్వసృజ్యన్త పత్త ఏకవిగ్‌ంశంనిరమమీత తమనుష్టుప్ఛంద అన్వసృజ్యత వైరాజగ్‌ం సామశూద్రో మనుష్యాణామశ్వః పశూనాం తస్మాత్తౌ భూత సంక్రామిణావశ్వశ్చ శూద్రశ్చ తస్మాచ్ఛూద్రోయ జ్ఞేన వక్లప్తో నహిదేవతా అన్వసృజ్యత, తస్మాత్పాదా వుపజీవతః పత్తోహ్యసృజ్యేతాం.'' (తై. సం. 7-1-1)

అర్థము:- ప్రజాపతి ప్రజను సృజింపగోరెను. ఆతడు ముఖమునుండి త్రివృతమను స్తోమమును నిర్మించెను. పిమ్మట అగ్నిదేవత, గాయత్రీచ్ఛందస్సు, రధంతరసామ, మనుష్యులలో బ్రాహ్మణుడు, పశువులలో మేక - ఇవి సృజింపబడినవి. ఇవి ముఖ్యమైనవి. ఏలనన : ముఖమునుండి సృజింపబడినవి కదా. ఆతడు (ప్రజాపతి) వక్షస్థలమునుండియు, బాహువులనుండియు పంచదశస్తోమమును సృజించెను. దాని ననుసరించి యింద్రదేవతను, త్రిష్టుప్ఛందమును, బృహత్సామను, మనుష్యులలో రాజన్యుని (క్షత్రియుని) పశువులలో గొఱ్ఱను సృజించెను. పరాక్రమ స్థానములనుండి సృజింపబడినవి కావున నీపైని తెల్పబడినవి వీర్యవంతములైనవి. ఆప్రజాపతి మధ్యభాగమునుండి సప్తదశ స్తోమమును నిర్మించెను. దాని ననుసరించి విశ్వేదేవతలనెడి దేవతలు సృజింపబడిరి. మఱియు జగతీఛందస్సు, వైరూపసామ, మనుష్యులలో వైశ్యుడు, పశువులలో గోవు- ఇవి సృజింపబడినవి. కనుక నవి యనుభవింపతగినవి. భోజ్యస్థానమునుండి సృజింపబడినవికదా. అందువలన వీ రితరులకంటె సంఖ్యలో హెచ్చుగా నున్నారు. ఏలనన హెచ్చుగనున్న దేవతల ననుసరించి సృజింపబడిరి. ఆతడు పాదములనుండి యేకవింశస్తోమమును, దాని ననుసరించి యనుష్టుప్ఛందమును, వైరాజసామమును, మనుష్యులలో శూద్రుని, పశువులలో గుఱ్ఱమును సృజించెను. అందువలన నీశూద్రుడును, గుఱ్ఱమును నితరభూతములపై నాధారపడుదురు. అందువలనే శూద్రుడు యజ్ఞమం దర్హతలేనివాడైనాడు. ఆతడు దేవతల ననుసరించి పుట్టలేదుకదా. అందువలన నీతడు పాదముల ననుసరించి జీవించును.

ఇచ్చటకూడ పైని తెల్పబడిన ఋక్కులోవలెనే నాల్గువర్ణములగు కర్మలును పేర్కొనబడుటయేకాక, వర్ణములు జన్మసిద్ధములేయని స్పష్టముగ చెప్పబడినది. బ్రాహ్మణునితో బాటు ప్రధానమైన గాయత్రీచ్ఛందస్సు సృజింపబడుటచే నాతనికి వేదమునం దుత్తమాధికారము, అనగా అధ్యయనాధ్యాపనాధికారము కలదని తెలియగలదు. మఱియు బ్రాహ్మణునితో బాటు మేక సృజింపబడుటచే మేక జంతువులలో నెట్లు హెచ్చు సత్త్వగుణసంపన్నమో బ్రాహ్మణుడట్లు సత్త్వగుణప్రధానుడవి తెలియగలదు. క్షత్రియునితోగూడ ఛందస్సుపుట్టుటచే నాతడునువేదమునుపఠింప వలసినవాడే యగుచున్నాడు. గొఱ్ఱపొట్టే లాతనితో బాటు సృజింపబడుటచేతను జంతువులలోనెల్ల పొట్టేలే పరాక్రమము గలదగుటచేతను, పరాక్రమము క్షత్రియుని ముఖ్యగుణమనియు, నాతనిలో రజోగుణము హెచ్చనియు తెలియగలదు. గొఱ్ఱలో నీక్షాత్రగు ముహెచ్చని మహాభారతము కూడ చెప్పుచున్నది. (ఆశ్రమ. ప. 43-1, 2)

పెద్దపులి మున్నగునవి క్రౌర్యము ప్రధానముగ గలవే కాని శౌర్యము ప్రధానముగా గలవి కావు. క్షత్రియ లక్షణము శౌర్యమే కాని క్రౌర్యము కాదు.

'శౌర్యంతేజో ధృతిర్దాక్ష్యం' అని గీతావాక్యము. (18-43)

వైశ్యునితోగూడ ఛందస్సు పుట్టినది గనుక, నాతనికిని వేదపఠనాధికారము గలదు. ఆతడు గోవుతోకూడ జనించుటచే గోవువలె నాతడును లోకమును పోషించువాడే. గోక్షీర మాత్రముననే మానవుడు జీవింపగలడుగదా. అట్టిగోవు పాడిపంటలకు చిహ్నముగాగూడ గ్రహింపబడవచ్చును. రజస్తమోగుణములే వైశ్యవృత్తిలో హెచ్చుగా నుండును. శూద్రుడు పైని తెల్పినవిథముగ పరిచర్యాత్మక వృత్తి గలవాడగుటకు అశ్వసాజాత్యము కారణము. ఆతనితో ఛందస్సేకాని దేవత జనింపలేదు. కావున నాతని కధికారముకలది వైదిక ఛందస్సు కాదనియు, లౌకికఛదంస్సనియు తెలియగలదు. వేదములలో ననుష్టుప్ఛంద మున్నమాట వాస్తవమేకాని వైదిక చ్ఛందమునకు దేవత యుండుటచే నది శూద్రున కధికారము కలది కాదు. కావున నాతని కధికారముగలది. వేదమూలకమైన యజ్ఞమునకూడ శూద్రున కధికారములేదని స్పష్టముగనే చెప్పబడినది కదా. ఇట్లు వర్ణవ్యవస్థ పూర్తిగ వేదదృష్టమని తెలియగలదు.

విశ్వామిత్రుడు క్షత్రియుడేయైనను ఘోరతపమొనరించి బ్రాహ్మణత్వమునొందుట వర్ణము జన్మసిద్ధమగుటను బాధించుట లేదా యని కొంద రనవచ్చును. కాని పురాణములలో వివరింపబడిన విశ్వామిత్ర జననవృత్తాంతమును పరిశీలించిన వారికీ సందేహము కలుగదు. విశ్వామిత్రుని తల్లిదండ్రుల కాదిలో పురుషసంతతి లేకుండెను. సత్యవతి యను కుమార్తె మాత్ర ముండెను. ఆమె ఋచీకుడను నొక ఋషికి పరిణయము గావింపబడెను. ఒకనాడు సత్యవతి తనకొక కుమారుడును, తనతల్లి కొక కుమారుడును కలుగునట్లనుగ్రహింపవలయునని భర్తను కోరెను. ఋచీకు డందులకంగీకరించి రెండు కలశలలో మంత్రపూతమైన జలముంచెను. ఒక కలశములోని జలము బ్రాహ్మణ శిశువును జనింపజేయుటకు సమర్థమైనది; రెండవకలశలోనిది క్షత్రియ శిశువును జనింపజేయుటకు సమర్థమైనది. ఇందు మొదటి కలశలోని జలమును సత్యవతియు, రెండవకలశలోని జలమును ఆమె తల్లియు త్రాగవలయునని ఋచీకుని యాదేశము, కాని తల్లి కూతులు పొరబాటున నొకరు త్రాగవలసిన జలమును మరొకరు త్రాగిరి. ఇట్లు బ్రాహ్మణశిశువును జనింపజేయు శక్తిగల జలమును సత్యవతితల్లి త్రాగుటచే నామెకు విశ్వామిత్రుడు జనించెను. కావున విశ్వామిత్రుని జననమునకు కారణమైనది క్షత్రియబీజము కాదు. అలౌకిక శక్తి కలిగిన, బ్రాహ్మణజననసమర్థమైన మంత్రపూతజలమే యాతని జన్మకు కారణము. కావున విశ్వామిత్రుని జన్మవృత్తాన్తము వర్ణము జన్మసిద్ధమను సిద్ధాన్తమును బాధింపదు. బీజభూతమైన మంత్రపూతజలములో నిమిడి యుండిన విశ్వామిత్రుని బ్రాహ్మణత్వము తరువాత తపస్సుచే వ్యక్తమైనది.

నేడు క్రొత్తనాగరికత వ్యాపించుటకు ప్రాచీనవర్ణపద్ధతి సరిపడదని కొందఱు నుడువుచున్నారు. కాని యెట్టి నాగరికత వచ్చినను వర్ణ పద్ధతికి తావుండకపోదు. పూర్తిగ శాస్త్రములలో చెప్పబడినట్లు సంచరింపలేమని నిరాశులమై వర్ణధర్మములను వీడనక్కఱలేదు. నేడు బ్రాహ్మణుడు బాల్యమున వేదాధ్యయనము చేయక యాధునికవిద్య నభ్యసించినను, బ్రాహ్మణులకు విధింపబడిన నిత్యనైమిత్తిక కర్మలను నిర్వహించుకొనుచు తీరిక సమయమును మత గ్రంథపఠనమునను, వేదార్థవిచారణమునను గడపుచు, సత్వగుణమును వృద్ధినొందించు నాహారాదుల నవలంబించుచు, జీవికకై యుపాధ్యాయాది వృత్తులనే పూనుచు వర్ణ ధర్మపరుడై యుండుట కేమియు నాటంక ముండజాలదు. అట్లే క్షత్రియులు దేశరక్షణార్థము కంకణము కట్టుకొని, దేశాభ్యుదయోద్యమమున పాల్గొనుచు నిత్యనైమిత్తికకర్మలను యథోచితముగ నిర్వర్తించుచు భారతపురాణాది వాఙ్మయములో తీరిక సమయమును పుచ్చుచు పండితులైన సద్ర్బాహ్మణుల గోష్ఠిచే మత విషయక విజ్ఞానమును గల్గించు కొనవచ్చును. అట్లే వైశ్యులును ముఖ్యధర్మములను వీడక, ధనసంపాదనము గావించుచు సంఘాభివృద్ధికి దానిని వెచ్చించుచుండవచ్చును. శూద్రులును తమకు విధింపబడినవిధమున నిత్యనైమిత్తీకానుష్ఠానపరులై దేశములోనున్న వివిధవృత్తులను చేతబట్టి విదేశములనుండి యొక్క సరకుకూడ నిట దిగుమతి కాకుండునట్లు దేశమును సర్వవస్తుసంభరితము చేయు పరిశ్రమలను నడిపించువారై, సంఘోద్ధరణమును గావించుచు, పండితులైన బ్రాహ్మణుల సహవాసమున వైదికధర్మములను తెలిసికొనుచు భారతపురాణాది కాలక్షేపము గావించుచు సనాతన ధర్మపరాయణులై యుండవచ్ఛును. నేడు వర్ణధర్మము లీవిధమున నడచుట కేమియు నాటంకములేదు.

బ్రాహ్మణునకు బ్రాహ్మణవృత్తివలన జీవిక గడువనిచో క్షత్రయవృత్తిని, దానివలనను గడువకపోయినచో వైశ్యవృత్తిని నపలంబింపవచ్చునని శాస్త్రములే చెప్పుచున్నవి. (తదలాభే క్షత్రియవృత్తిః తదలాభే వైశ్యవృత్తిః. గౌ. ధ. 7-67)

సంఘాభివృద్ధి కన్నివర్ణములు నవశ్యకములేయని గుర్తించుచో వర్ణపద్ధతిని నడపుకొనుట నేటి ప్రజల కేమియు నాటంకము గన్పట్టదు. పొట్ట గడపుకొనుటకే యిట్లన్య వృత్తిని పూనవచ్చునుగాని భోగము లనుభవించుటకును, ధనమును ప్రోగుచేసికొనుటకునుగాదని ముఖ్యముగ గుర్తింపవలెను. ఏవర్ణము వారును ప్రత్యేసౌకర్యములను పొందుటకు యత్నింపరాదు. ఒక వర్ణముపట్ల మఱొక వర్ణమునకు ద్వేషమును గల్గించు వ్రాతలు, ప్రచారములు నిషేధింపబడవలెను.

వర్ణపద్ధతివలన సంఘసామరస్యము చెడిపోయినదని నేడు చేయబడు ప్రచారము నెదుర్కొనవలసిన బాధ్యత ప్రతి హిందూ మతాభిమానిపైనను గలదు. సంఘసామరస్యమును చెడగొట్టువారు వర్ణపద్ధతి పోవలెననువారే కాని, యుండవలెననువారు కారు. వర్ణపద్ధతియందు నమ్మకమున్నవాడు మరొక వర్ణము వానిని ద్వేషింపడు. నేడు సనాతనులలోనున్న వర్ణసామరస్యము సంస్కర్తలలో లేదు. వర్ణపద్ధతిపై ధ్వజము బయలుదేరనంత కాలము-నిన్న మొన్నటివఱకు- పల్లెటూళ్ళలో నన్నివర్ణముల వారు తమ తమ భేదములను ధర్మవిషయములలోనే కాని యితర విషయములలో మరచి, తోడబుట్టువులవలె ప్రవర్తించుచుండిరి. ఇప్పటికికూడ సంస్కరణభావములు చొరని గ్రామములలో బ్రాహ్మణులును, శూద్రులును, క్షత్రియ వైశ్యులును పరస్పర మత్యంతానురాగముతో ''అన్న'' ''తమ్ముడు'' ''అక్క'' మున్నగు సంబోధనలు గావించుకొనుట వినగా శోత్రపర్వమగును. సంస్కరణభావములు బయలుదేరినచోట వర్ణద్వేషము పెరిగి దారుణమైన వైరము, స్పర్ధ మున్నగునవి వర్ణములనడుమ కన్పట్టుచున్నవి. వర్ణ భేదము పోవలెననువారిట్లు వర్ణ ద్వేషమునకు కారకులగుటయు, వర్ణపద్దతి కావలె ననువారు వర్ణసామరస్యములో నుండుటయు చూడ, సంఘైక్యమునకు సనాతనులు తోడ్పడుచున్నారో, సంస్కర్తలమని చెప్పుకొనువారు తోడ్పడుచున్నారో తెలియగలదు.

వర్ణపద్ధతిని నిర్మూలింపవలెనను సంస్కరణమును బోధించు సంఘములుగాని, వ్యక్తులుగాని వర్ణ పద్ధతిలోనున్న సంఘసామరస్యమును తమ నూతనసంఘమున స్థాపింపలేక పోవుచున్నారు. సర్వవర్ణ సహపంక్తి భోజనము సామరస్య సూచకమని చెప్పు సంస్కర్తలు ప్రదర్శనార్థము జరుగు విందులలోనే తమప్రక్క నితరవర్ణములవారిని కూర్చుండ బెట్టుకొనుచున్నారు. కాని సామాన్య సమయములలో వీరు తమప్రక్క నేపేదవానినో, బిచ్చగానినో కూర్చుండబెట్టుకొని భుజింపరు. ఒక్క సనాతన ధర్మపరాయణుడు మాత్రమే యట్లు చేయును. కోటీశ్వరుడైన బ్రాహ్మణుడు నిత్యకృత్యములో తనప్రక్కను భిక్షనెత్తుకొను బ్రాహ్మణుని కూర్చుండబెట్టుకొని భుజించుటకు శంకింపడు. అట్లే యితరవర్గములవారును, ఇతర సంఘములవారును ధనమునకుచూపు ప్రాముఖ్యమును సనాతనులు చూపరు. అన్నివిధములైన విభేదములలోను ధనమూలకములగునవి హేయములు. జన్మచేనేర్పడు విభేదములలో దౌష్ట్యములేదు; ద్వేషములేదు.

దేశములో మహాపరిణామములు రావలసియున్న కాలమున నన్నివర్ణములవారును దేశాభ్యుదయమునకు తోడ్పడ వలయునని స్మృతులు తెల్పుచునే యున్నవి. ఆపత్తులో (బ్రాహ్మణుడు గూడ శరమును తీయవలెనని మనుస్మృతి చెప్పుచున్నది. వేదభాష్యకర్తయై, యార్యజ్ఞానవిజ్ఞానమూర్తియై, సమస్తార్య విజ్ఞానశాఖలలోసు నత్యుత్తమ గ్రంథములను వెలయింపజేసిన శ్రీ విద్యారణ్యుల వారికంటెను వర్ణాశ్రమ ధర్మపరాయణు డుండగలడా? హిందూధర్మ విజ్ఞానములను నిలబెట్టుట కామహామహుడు విజయనగర సామ్రాజ్యస్థాపకుడై రాజకీయధురంధరుడు కాలేదా? వర్ణపద్ధతి జాతీయతకు విరుద్ధ మనుభావము కేవలము భ్రాంతిమూలకము.

Hindumatamu    Chapters    Last Page