Acharyavaani - Vedamulu     Chapters   Last Page

6. యజ్ఞం

అగ్ని సహాయంతో, మంత్రోచ్చారణతో విధ్యుక్తమైన కర్మలు చేయటమే యజ్ఞయంటే. ''యజ్ఞ'' మన్న పదం ''యజ్‌'' అనే ధాతువునుండి వచ్చింది. దీని అర్థం - ''ఆరాధించు'', లేక, ''సమర్పించు''. క్రతువుని మనసారా, పరమాత్మ పట్లా దేవతల పట్లా సంపూర్ణమైన భక్తి భావంతో నిర్వహించటమే యజ్ఞమంటే.

''మననం చేసేవాడిని రక్షించేది మంత్ర''మని చెప్పుకొన్నాం. పఠించేవాడిని కాపాడటం మంత్రం యొక్క విధి. మననమంటే మనసారా జపించటం. సాధారణంగా మంత్రాలని వినబడేట్టు ఉచ్ఛరించ వలసినా కొన్నిటిని మాత్రం అట్లా పలుకనక్కరలేదు. నిశ్శబ్దంగా జపించినా మంత్రాలు ఆయా నాడులను అనుకూలంగా ప్రకంపింప చేస్తాయి. దానినే బిగ్గరగా వల్లె వేస్తే దాని కొక మహనీయత ఉన్నట్టు తెలుస్తుంది - అర్థం తెలియక పోయినా పరవశింప చేస్తుంది. మనస్సులో ఉన్నది. వల్లెవేసినప్పుడు బయటకు వస్తుంది. అది శరీరకదలిక ద్వారా కార్యరూపం దాలుస్తుంది. వేదోక్తమైన విధినిర్వహణకు మనస్సు, వాక్కు, కాయమూ ఒకే విధంగా పని చెయ్యాలి - అన్నీ పరిపూర్ణంగా పాలుపంచుకొంటున్నట్లవుతుంది. అంటే, మననం శబ్ద రూపంలో నోటి ద్వారా బయటకు వచ్చి, శరీరం చేసే పని ద్వారా యజ్ఞమవుతుంది. అందువల్ల యజ్ఞము వేదోక్తమైన ముఖ్యమైన విధులలో ఒకటి.

ఇతర మతాలలో లేదు :

ఇటువంటి కర్మకాండ ఇతరమతాలలో లేదు. వేదాలపై ఆధారపడి యుండటం వల్ల మన మతాన్ని వైదిక మతమంటారు. దీనికీ, ప్రపంచంలో ఉన్న ఇప్పటి మతాలకీ ఒక ముఖ్య భేదముంది. క్రైస్తవమతం, ఇస్లాం ఇత్యాది మతాలు ''అందరూ ఆరాధించవలసిన దైవమొక్కడే'' అని అంటాయి. వేదాలు కూడా అన్ని ఆత్మలూ తనలోనే ఉన్న ఒకే ఒక దేవుడున్నాడంటాయి. కాని, ''ఒక దేవుడు'' అన్న భావాన్ని అనుభవసిద్ధం చేసుకోవటానికి చింతనద్వారా కలిగే జ్ఞానమవసరం. ఆ స్థితిని చేరుకోవటానికి వినీతి ఎంతో అవసరం. భగవంతునితో ఏకమైనప్పుడు మనకి గోచరించే జగత్తు మాయమవుతుంది : ఆ స్థితిని చేరుకోవాలి. ప్రాపంచక విషయాలలో తేలిపోయే మన జీవితాలను ఎంతో క్రమ శిక్షణకు లోను చేస్తేనే గాని ఆ స్థితిని చేరుకోలేం. ఈ వ్యాపకాలలో చిక్కుకొన్న మనం ధర్మమార్గాన పోవాలి, మనస్సుని క్షాళనం చేసి, పరిణతిని కలిగించే క్రతువులని చెయ్యాలి. ఆ స్థితిని చేరుకొన్న తరువాత ప్రాపంచక బంధాలు తెగిపోతాయి. ఆ గమ్యాన్ని చేరటానికి వేదాలు అనేక మార్గాలనూ, ఉపాయాలనూ సూచించాయి. వీటిలో యజ్ఞమనే కర్మ అతిముఖ్యమైనది. ఒకే ఒక దేవునికి కాక, అనేక దేవతలకు ఉపహారాలిస్తూ ఫలితాన్ని భగవంతునికి సమర్పించటమే యజ్ఞమంటే, యజ్ఞమన్నది మన మతానికి ప్రత్యేకం. ఏ ఇతర మతంలోనూ ఇది లేదు.

వేదమంత్రాలని పఠిస్తూ వివిధ పదార్థాలని అగ్నికి ఆహుతి చెయ్యాలి యజ్ఞంలో. దీనిని ''హోమ'' మంటారు. అగ్నికి ఆహుతి చేసినా అన్నిటినీ అగ్నికే సమర్పిస్తున్నామని అర్థం కాదు. ప్రత్యేకంగా అగ్నికి సమర్పిస్తున్నట్టు మంత్రం చెప్పినప్పుడే అవి అగ్నికి చెందుతాయి. ఇతర దేవతలకి అంటే రుద్రునకూ, విష్ణువునకూ, ఇంద్రునకూ, వరుణునకూ, వాయువునకూ, సోమునకూ సమర్పించిన వాటిని వారికి చేరుస్తాడు అగ్నిదేవుడు. మిగిలిన మతాలకీ, వైదిక మతానికీ గల ముఖ్యమైన వ్యత్యాసమిదే. మనంకూడా ఒకే దేవుడ్ని విశ్వసించినా, ఆయనకే కాక ఇతర దేవతలకి కూడ అగ్ని ద్వారా ఉపహారాలర్పిస్తాం.

మానవసేవ భగవంతునికి ప్రీతిపాత్రమంటాం. సంఘసేవకులు ''మానవసేవే మాధవసేవ - సమాజానికి సేవ భగవంతునికి సేవ'' అంటారు. ఆ విధంగానే యజ్ఞాల ద్వారా, భగవంతుని సృష్టియైన దేవతలకు యజ్ఞమూలకంగా సేవ చేయటం కూడ భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించి పెడుతుంది.

భగవంతు డొక్కడే అనీ, ఆయనే అనేక దేవతల రూపాలను ధరిస్తాడనీ వేదాలు నొక్కి చెప్పుతాయి. ఏ దేవతని వర్ణించినా, ఆ దేవత పరమాత్మ అంటాం. వేదాలు కూడా దైవమొక్కడే అని చెప్తాయి. భగవంతునికీ దేవతలకీ గల భేదాన్ని మాత్రమే అవి సూచిస్తాయి. ఎందరో దేవతలని భగవంతునిగా పేర్కొంటాయి కాబట్టి ''వేదాలు అనేక దేవుళ్లున్నారని అంటాయి'' అనుకోవటం తప్పు. ఒకే దేవుడు అనేక దేవతలుగా కనబడుతాడని అర్థం. విశ్వనియంత్రణకై అనేక దేవతలను సృష్టించాడు భగవంతుడు. ఈ దేవతలు వేరు వేరు విధులను నిర్వహించాలి - మన వలనే దేవతలు కూడ సృష్టింపబడ్డారు. మనని కూడ తననుండే సృష్టించాడు ఈశ్వరుడు. అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవాత్మా, పరమత్మా ఒకటే. అందువల్ల పరమాత్మ దేవతలకు కూడ ప్రతినిధే. అద్వైత సిద్ధాంతాన్ని ఆకళింపు చేసుకొనే స్థితికి చేరుకొనే వరకూ - మనకూ దేవతలకూ భేదముందనుకొంటూ యజ్ఞాలూ, పూజలూ లోకశ్రేయస్సుకోసం చేస్తూండాలని వేదాలు నిర్దేశించాయి. ప్రకృతిలోని శక్తులూ, సర్వభూతాలూ పరమాత్ముని ఆదేశానుసారం, దేవతల ఆధీనంలో, ప్రవర్తిస్తాయి. కాబట్టి మనమూ, మనచుట్టూ ఉన్న ప్రపంచమూ ప్రకృతి శక్తులనుండి లబ్ధిని పొందాలంటే ఆయా అధిష్ఠాన దేవతలను సంతృప్తి పరచాలి. దేవతలు యజ్ఞాల వల్ల సంతుష్టులవుతారని వేదాలు చెప్తాయి. ఆధ్యాత్మికంగా మేల్కొన్నప్పుడూ పరమాత్ముని స్వయంగా గ్రహించినప్పుడూ విడిగా దేవతలని సంతృప్తి పరచవలసిన అవసరముండదు. మనం ద్వైత భావంతో ఉన్నంత కాలమూ ప్రతి దేవతనీ పూజించాలి. ఇది వేదవాక్కు.

కర్మల వల్ల మూడు విధాలైన ప్రయోజనాలు :

కర్మలకు ప్రయోజనాలు మూడు విధాలుగా ఉంటాయి. ఈ లోకంలో మనమున్నంత కాలం మనకీ మనచుట్టూ ఉన్న వారికీ దేవతల అనుగ్రహం వల్ల క్షేమం కలగటం. రెండు: చనిపోయిన తరువాత దేవలోకంలో ఆనందంగా గడపగలగటం. దేవలోకంలో నివాసం శాశ్వతం కాదు. మన పుణ్యాన్ని బట్టే అక్కడ నివాసముంటుంది. దేవలోకంలో లభించే సౌఖ్యం భక్తునికి గాని జ్ఞానికి గాని కలిగే ఆనందంతో పోల్చలేం. ''మనీషా పంచకం''లో ఆది శంకరులు ఇంద్రుని ఆనందంకూడా, ఆత్మసాక్షాత్కారం పొందినవాని ఆనందంలో సహస్రాంశం కూడా ఉండదన్నారు. అయినప్పటికీ, ఈ భూమి మీద జీవితంతో పోలిస్తే స్వర్గలోకంలోని నివాసం ఎంతో హృద్యం. ఈ సౌఖ్యం లభించటం యజ్ఞాల నిర్వహణవల్ల కలిగే ఫలితాలలో రెండవది. ఇక మూడవది : ఇది అన్నిటికంటె ముఖ్యమైనది. గీతలో దీని గురించి ఇట్లా ఉంది - ప్రతిఫలాపేక్ష లేకుండా యజ్ఞాన్ని నిర్వహించాలి. ఈ లోకంలో గాని, దేవలోకంలో గాని కలిగే సౌఖ్యం - యజ్ఞాలకి ప్రతిఫలమే. దీనిని కోరకుండా, లోక కల్యాణం కోసం, స్వార్థ చింతన లేకుండా, మమతా రహితంగా యజ్ఞాన్ని నిర్వహిస్తే అది శీఘ్రగతిని మనస్సుని పరిశుద్ధం చేస్తుంది. ఇదే తరువాత జ్ఞానమార్గాన్ని చూపుతుంది. దాని గమ్యం మోక్షం - అంటే, జన్మ రాహిత్యం సచ్చిదానందం అంటే పరమాత్మలో లీనమవుతాం.

అద్వైతానికి సారాంశం ఆత్మ సాక్షాత్కారమూ, శుద్ధజ్ఞానమూ నని చెప్పారు ఆదిశంకరులు. వారే, ''వేదో నిత్య మధీయతాం తదితం కర్మ స్వనుష్ఠీయతాం'' అన్నారు. (వేదాలను నిత్యం అధ్యయనం చెయ్యి, వాటిలో చెప్పబడిన కర్మలను శ్రద్ధగా చెయ్యి) ఇదే మూడవ ఫలితం. ఈ లోకంలోగాని, స్వర్గలోకంలోగాని సుఖంగా ఉండగలుగుతామని వారు చెప్పలేదు. స్వలాభాపేక్షలేకుండా కర్మలను చేయటం వల్ల చక్కని అవగాహన, చిత్తశుద్ధీ కలుగుతాయనే వారి ఉద్దేశం.

మానవులకు, దేవతలకు పరస్పరలాభం :

యజ్ఞ యాగాదులను చేయటం వేదాలలోని ముఖ్యాంశం. దీని గురించి కృష్ణ భగవానుడు గీతలో చెప్పాడు. బ్రహ్మలోకంతో బాటు, మానవులు చేయవలసిన యజ్ఞాలను కూడ సృష్టించాడు. ''యజ్ఞాలను చేస్తూ ఉండు వాటి వల్ల కలిగే ఫలితాలతో సుఖంగా ఉండు. యజ్ఞాన్ని కామధేనువుగా భావించు'' అంటుంది భగవద్గీత.

జగత్సృష్టికి మూలం వేదమంత్రాలే. కనుకనే, ఆ మంత్రాల పఠనం వల్ల ఉద్భవించే తరంగాలకి దేవతలే ప్రత్యక్షమవుతారు. యజ్ఞంలో మంత్రాలను పఠించటం పోస్టలు కవరుపై చిరునామా వ్రాయటంతో సమానం. ఆ మంత్ర పఠనంతో బాటు ఉపాహారాన్ని సమర్పిస్తేనే సందేశాన్ని దేవతలకు అగ్ని చేరవేస్తాడు.

జంతువులలో పిల్లి, కుక్క, గుఱ్ఱం, ఏనుగు, సింహం - క్రమంగా ఒకదాని కంటె ఒకటి బలాఢ్యం. ఆ విధంగానే సృష్టిలో కూడా మర్త్యుల కంటె ఎక్కువ శక్తి మంతులున్నారు. వారే దేవతలు. ఈ లోకంలో పంచభూతాలతో బాటు ఉన్నా దేవలోకంలో మాత్రం ప్రత్యేకమైన రూపాలతో ఉంటారు. మంత్రాలను సవ్యంగా పఠించటం వల్ల కలిగే సత్ఫలితాలలో ఒకటి దేవలోకంలోని వారి రూపాలను సృష్టంగా చూడగలగటం. అంతే కాక, వారనుగ్రహించే ప్రసన్నతను కూడ అనుభవించగలగటం. మంత్రజపం కలిగించే తరంగాల వల్లనే పరమాత్మలో వారు దర్శనమిస్తారు. అంటే మంత్రాలు దేవతల శబ్దరూపాలన్న మాట.

యజ్ఞంలో ఒక్కొక్క దేవతకి సంబంధించిన మంత్రాన్ని పఠించినప్పుడు ఆ దేవతప్రత్యక్ష మవుతాడు. ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన వాళ్లు, వాళ్లని చూడ గలుగుతారు. కంటికి కనబడక పోయినా, వారి ఉనికి స్పష్టంగా తెలుస్తుంది. అయినా, వారికి నేరుగా ఉపహారాలివ్వటం నేరం. మంత్రోచ్ఛారణ జరుపుతూ అగ్నికి సమర్పించటం వల్లనే ఆ ఉపహారాలు దేవతలకు ఆమోద యోగ్యమైన రూపాన్ని పొందుతాయి. మనమిచ్చిన ఉపహారాలలో చాలా భాగం అగ్నిలో ఆహుతైపోగా మిగిలినది మనం ప్రసాదంగా తీసుకోగా అవి గమ్యాన్ని ఎట్లా చేరగలుగుతాయని మనమాశ్చర్య పోనక్కరలేదు. మన వలె దేవతలకు పంచభూతాత్మకమైన (అంటే, భూమి, నీరు, వెలుగు, గాలి, ఆకాశం కల) దేహాలు ఉండవు. మనం తీసుకునే ఆహారం వంటి పదార్థం వారికవసరం లేదు. మనలో కూడా మనం భుజించే ఆహారం ఒంట బట్టేలోగా జీర్ణకోశం దానిని అనేక విధాల మారుస్తుంది. ఆ విధంగానే, యజ్ఞంలో అగ్ని, మనమిచ్చే ఉపహారాలని దేవతలకు కొనిపోయే ముందు ఎంతో సూక్ష్మ రూపంలోకి మారుస్తుంది. ఈ మార్పుకూడా మంత్రాల ప్రభావం వల్లనే జరుగుతుంది.

ఒక ఉదాహరణ చూడండి : పాశ్చాత్యుల ఆచారం ప్రకారం విందుకి కూర్చున్నప్పుడు ఆరోగ్యాన్ని శ్రేయస్సునీ కోరుతూ శుభాకాంక్షలు పలుకుతారు. (టోస్ట్‌) తినేది ఒకరైతే సత్ఫలితాలు వేరొకరికని వారి విశ్వాసం. ఇదెట్లా సాధ్యం? ఇవన్నీ సుహృద్భావానికి చిహ్నాలు. చిత్తశుద్ధితో, విశ్వాసంతో చేస్తే ఆ సద్భావనే సత్ఫలితాలనిస్తుందన్నమాట.

పరమాత్ముని భావాలే తరంగాలుగా మనకి మంత్ర రూపంలో వచ్చాయి - అవి శ్రేయోదాయకాలే అయి ఉంటాయి కదా. మంత్రానుసారం సమర్పింప బడిన ఉపహారాలు దేవతల శక్తిని వృద్ధి చేస్తాయి. మనకంటె ఎక్కువే అయినా దేవతల శక్తి కూడా పరిమితమే. వాళ్లకీ కోరికలూ, అవసరాలూ ఉంటాయి.

దేవతలని యజ్ఞాలే సంతృప్తి పరచగలవు. వాళ్లు ఈ లోకంలో మన జీవితాలని మెరుగు చెయ్యాలంటే యజ్ఞాల ద్వారా వారిని సంతృప్తి పరచాలి. వారి పటిష్ఠతను వృద్ధి చెయ్యాలి. వారి శ్రేయస్సుని మనసులో ఉంచుకొని యజ్ఞం చేస్తే వారు కూడ మనపై ప్రసన్నులౌతారు. దేవతలు మనపై ఆధారపడినా, వారు మనకంటె ఉన్నతులని మనం మరువరాదు. వారికి తగిన గౌరవం చూపాలి. అన్యమతస్థులు ఒకే ఒక దేవునికి నివాళులర్పిస్తారు, ఆరాధిస్తారు. అనేక దివ్యశక్తులను క్రతువుల వల్ల సంతృప్తి పరచటం వారెరుగరు. మన మతంలో సర్వసంగ పరిత్యాగులైన సన్న్యాసులు మాత్రం దేవతల నాశ్రయింపక భగవంతుడ్నే నేరుగా ప్రార్థించ వచ్చు. ఇతరులు దేవతలని సంతృప్తిపరచి వారి అనుగ్రహానికి పాత్రులవాలి. ఆ సంతృప్తిని కలిగించటానికే యజ్ఞయాగాదులు, ఉపహారాలు ఇత్యాది నిర్వహించాలి.

దీనికే ఒక సామాన్యమైన ఉపమాన మివ్వవచ్చు. దేశం యొక్క రాజుని అందరూ నేరుగా కలిసికోలేరు. తమ తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రభుత్వోద్యోగులను ఆశ్రయిస్తారు. ఆ అధికారులు వ్యక్తిగతంగా కాక ప్రభుత్వమో, రాజో నిర్దేశించినట్టు వ్యవహరిస్తారు. తమ అవసరాలను తీర్చేది పరోక్షంగా ప్రభుత్వాధినేతే, కాని ఆయనని నేరుగా ప్రజలు కలుసుకోలేరు.

అదే విధంగా మన మతంలో కొన్ని ఆచారాలు నిర్దేశింప బడ్డాయి. పరమేశ్వరుడే సార్వభౌముడు. మానవాళి అంతా ప్రజానీకం. వరుణుడు, వాయువు వంటి వారంతా అధికారులు. మన అవసరాలను వారి ద్వారా తీర్చుకోవాలి మనం.

దేవతలను పటిష్ఠం చేయటానికి యజ్ఞాలను చేస్తాం. మనమిచ్చే నైవేద్యాలు వారికి ఆహారం. మనం స్వార్థం లేకుండా త్యజించినవే వారికి చేరుతాయి. అగ్నికి ఆహుతి చేసే వాటిని మనసారా దేవతలకు సమర్పించాలి. అందువల్లనే, ద్రవ్యాన్ని సమర్పించేప్పుడు ''నాది కాదు'' (''న మమ'') అంటాం. దేవతలకు ఆహారం అగ్ని ద్వారా అందుతుంది. ఇట్లాగే అగ్ని ద్వారా, మంత్రాల ద్వారా మన పితృదేవతలకు కూడ ఉపహారాలర్పిస్తాం.

యజ్ఞాల ప్రాధాన్యమూ, ప్రయోజనమూ :

మన మతంలోనే ఈ క్రతువులు ఉండటానికి కారణం విశ్లేషించే ముందు, అసలు మానవజీవితం ఎట్లా సాగుతుందో గమనిద్దాం. ఒక ప్రాంతంలో ఏ పదార్థమైనా ఎక్కువగా లభిస్తే దానిని ఆ పదార్థం సమృద్ధిగా లేని ప్రాంతానికి పంపి, ఆ రెండో ప్రాంతం నుంచి మనకి లేని దానిని తెచ్చుకుంటాం. వడ్రంగులు, మేస్త్రీలు వంటి శిల్పులు మనకి పనిచేసి పెట్టితే వారి జీవనాధారానికి డబ్బునిస్తాం. ఆవుని మేపుతాం, పాలు ఇస్తుంది. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తాం. మన భద్రతనీ, ఇతర అవసరాలనీ ప్రభుత్వం చూస్తుంది. ఆ విధంగానే పరలోకాలలో కూడా ఇచ్చి పుచ్చు కోవటాలున్నాయి. ఇంజనీర్లు వర్షపునీటిని కాలువ ద్వారా పారనీయగలరు, జలాశ్రయాలలో నిలువ చేయగలరు. అంతేకాని, వర్షాన్నే కల్పించలేరు. మనకి వర్షాలు కావాలంటే దేవలోకానికి కొన్ని పదార్థాలని పంపాలి. ఈ పరస్పర సంబంధాలనే గీత ఇట్లా సూచిస్తుంది.

''సహయజ్ఞాః ప్రజాసృష్టా పురోవాచ ప్రజాపతిః

అనేన ప్రసవిష్యద్వమేషమో స్త్విష్టకామధుక్‌|

దేవాన్‌ భావయతానేన తేదేవా భావయన్తునః |

పరస్పరం భావయంతః శ్రేయఃపర మవాప్స్యథ |

(యజ్ఞాల వల్ల దేవతలను సంతుష్టిపరచు, దేవతలు వర్షాలు మొదలైన వాటితో నిన్ను సంతుష్టుని చేయనీ, ఈ విధంగా ఒండొరులకు సహాయపడుతూ అందరూ వర్థిల్లుగాక).

మార్గాలు వేరు, గమ్య మొక్కటే :

క్లుప్తంగా చెప్పాలంటే, ప్రతిదేవతకీ మంత్రసమేతంగా ఉపహారం సమర్పించటమే యజ్ఞం. ఒక విధంగా చెప్పాలంటే, సామవేద మంత్రాలే దేవతా స్వరూపాలు. యజ్ఞంలో సమర్పించిన ఆహారదినుసులవలె ఈ మంత్రాలలోని పదాలే ఆయా దేవతలకు పోషకాలై వారిని బలవత్తరం చేస్తాయి. కాబట్టి మంత్రాలకి అనేక ప్రయోజనాలున్నాయి. ప్రభుత్వాదాయాన్ని పెంపొందించేందుకు మనం వివిధ రకాల పన్నులను కట్టుతూంటాం. అయినా ఒకో పన్ను ఒకో చోట కట్టాలి - అంటే, ఆదాయపు పన్ను, భూమిశిస్తు, అమ్మకం పన్ను, వాహనాలపై పన్ను వంటివి. ఒకో అధికారి ఒకో రకమైన రసీదునిస్తాడు. అలాగే ప్రతిక్రతువుకీ ప్రత్యేకమైన మంత్రమూ, దేవతా, ఉపహారమూ, సమయమూ - ఉన్నాయి. ఒకో యజ్ఞాన్ని నిర్వహించటానికి ఒకో నియమావళి ఉన్నా అన్నిటి ధ్యేయమూ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవటమే. మనం ఎక్కడ చెల్లించినా, పన్ను ప్రభుత్వాదాయంలోనే జమ అవుతుందని మనమెరుగుదుము. అట్లాగే వేరువేరు దేవతలకై మనం చేసే వివిధమైన యజ్ఞాలు ఆ దేవతల ద్వారా పరమేశ్వరుని చేరుతాయనే అనుకోవాలి.

* * *

Acharyavaani - Vedamulu     Chapters   Last Page