Acharyavaani - Vedamulu     Chapters   Last Page

23. ఉపాంగములు : న్యాయము

తర్కము - ఔచిత్యమును తెలిపే శాస్త్రం :

న్యాయశాస్త్రాన్ని తర్కశాస్త్రమని కూడ అంటారు. దీనిని కూర్చినది గౌతమమహర్షి. తర్కం (యుక్తుల) ద్వారా ఈ సృష్టికి కర్త పరమేశ్వడేనని నిరూపించటమే ఆ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈశ్వరుని ఉనికిని సహేతుకంగా ప్రతిష్ఠిస్తుంది. ఈ శాస్త్రానికి ముఖ్యమైన సాధనం తార్కిక పద్ధతి. (హేతు విచారణ పద్దతి)

అనుమితి అనివార్యం. వేదాలు ఒక విషయాన్ని చెప్తాయి. వేదోక్తాల అర్థము, విశిష్టతా ఉత్తరమీమాంస ద్వారా తెలుస్తుంది. వేదాల పట్ల అకుంఠిత విశ్వాసమున్నా, మనస్సులో ఏదో ఒక శంక ఉంటూనే ఉంటుంది. అటువంటి సందేహాలను నివృత్తి చేసి ఆ విశ్వాసాన్ని మనస్సులో ధృవపరచటానికి ఎన్నో సాధనలున్నాయి. ఒక రాటని పాతినప్పుడు, భూమిలో దానిని పాతి అటూ ఇటూ కదుపుతాం. దీని వల్ల అది నేలలో గట్టిగా పాతుకుపోతుంది. ఆ విధంగానే సత్యాన్ని కూడ అన్ని వైపులనుంచీ రకరకాలైన వాదాలతో మార్కొనాలి. అప్పుడే అది ఏ ప్రతివాదమూ లేక సుస్థిర మవుతుంది. ఎటువంటి వాదాన్నైనా మనమాహ్వానించాలి. అయితే, ఈ వాదాలు సహేతుకంగా, సాధికారంగా, సప్రమాణంగా ఉండాలి. కాని ఏదో వితండవాదం చేద్దామని ఏదో మాటల గారడీ చేద్దామని గాని చేయబూనిన వాదాన్ని తిరస్కరించాలి.

ఆదిశంకరుల అంతిమ ఘడియలు ఆసన్నమైనప్పుడు ఆయన శిష్యులు వారిని ఏదో ఒక సందేశమివ్వమని ప్రాధేయపడ్డారు. తత్ఫలితంగా ఆచార్యులవారు అయిదు శ్లోకాలను చెప్పారు. వీటినే ఉపదేశపంచకమనీ, పోపానపంచకమనీ, సాధనపంచకమనీ అంటారు. వాటిలో ఒక భాగమిట్లా ఉంటుంది.

''దుస్తర్కాత్‌సువిరమ్యతాం శృతిమతస్తర్కోను సంధీయతాం''

అంటే ''కుయుక్తులతో కూడిన వాదము విడిచి, వేదసమ్మతమైన అనగా ప్రమాణ బద్ధమైన యుక్తులలో యధార్ద్యమును గ్రహించుము''

వేదాలలో చెప్పిన వాటిని ధృవపరచటానికి వినియోగించే సాధనాలని న్యాయమంటారు. ఈ శాస్త్రకారుడు, గౌతముడు. కణాదుడు కూడ న్యాయశాస్త్రం రచించాడు. దానిని వైశేషిక మంటారు.

రెండు పదార్థాలు విభిన్నములని అన్నామంటే ఆ రెంటిలో ఏదో ప్రత్యేకతలుండటం వల్లే - ఒకదానిలోని లక్షణాలు రెండవ దానిలో లేకపోవటం వల్లనే. ఈ విశేషమే పరిశీలనకి మూలమవటం వల్ల ఆ పద్ధతిని వైశేషిక మంటారు. న్యాయశాస్త్రం శాస్త్రీయ పద్ధతిలో నడుస్తుంది. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, మోక్షము వంటి ఆధ్యాత్మిక విషయాలను ప్రస్తావించేప్పుడు వైశేషికాన్ని చేరుతుంది. ఈ విషయాలనే వైశేషికులు ''అపవర్గ''మంటారు. ఈ రెండూ తర్కాన్నీ, తత్త్వాన్నీ ఉపయోగిస్తాయి. తత్త్వాన్ని తర్కం ద్వారా బోధిస్తాయి.

మౌలిసత్యాన్ని నాలుగు సాధనాల ద్వారా న్యాయశాస్త్రం చర్చిస్తుంది. అవి (1) ప్రత్యక్షం (2) అనుమానం (3) ఉపమానం (4) శబ్దం.

వీటిలో మొదటిది ప్రత్యక్షప్రమాణమనేది మనకి జ్ఞానేంద్రియాల వల్ల అనుభవ సిద్ధమయ్యేది. అంటే చూపు, వాసన, వినికిడి, రుచి ఇత్యాది. రెండవది; అనుమానం ఇది న్యాయశాస్త్రంలో చాలా ముఖ్యమైనది.

అనుమానమంటే ఏమిటి? దూరాన కొండ శిఖరంపై పొగను చూచామనుకోండి. పొగ మాత్రమే కనబడుతుంది, జ్వాల కానరాదు. ముందున్న బండరాళ్లు మనకా జ్వాల కనబడకుండా అడ్డుపడుతాయి. పొగమాత్రమే కనబడుతున్నా మనకి ఆ కొండ మీద నిప్పు అంటుకొన్నది అని నిశ్చయించు కోవటానికి ఏ సందేహమూ ఉండదు. దీనినే అనుమాన మంటారు. కొండ మీద మంట ఉండి ఉండాలని మనం నిశ్చయం చేసుకోవటానికి ఉపకరించే సాక్ష్యంపొగే. దీనిని సాధనమనిగాని, లింగమనిగాని, హేతువని గాని అంటారు.

మన మనుసరించే వేదాంత సిద్ధాంతం ప్రకారం మనకి గురువు అనుగ్రహించిన ఉపదేశాన్ని ధ్యానం చేయాలి. దీనినే మననమంటారు. అంటే, గురువు చెప్పిన దానిని యుక్తి అనే సాధనతో ఎప్పుడూ మనస్సులో గుర్తుంచుకోవటం. ఇక్కడ అనుమాన ముపకరిస్తుంది. ప్రత్యక్షంగా గోచరం కాని దానిని ఇతర సాక్ష్యాల సహాయంతో గుర్తించగలగటానికి అనుమాన మొక్కటే సాధనం. పరమాత్మ, జీవాత్మలు మన జ్ఞానేంద్రియాలైన కళ్లు, చెవులు, నోరు, ముక్కు వంటి వాటి పరిధిలోకి రావు. మోక్షమనే అంతిమ స్థితి వాటి కందదు. దీనిని అనుమానం వల్లనే, హేతుబద్ధమైన అనుమానం వల్లనే, గ్రహింపగలుగుతాం. తెలియని దానిని తెలిసినదాని సహాయంతో గ్రహించటమే అనుమానమంటే.

వైదిక కర్మల నాచరించటం వల్ల మనకి అంతశ్శుద్ధి ఏర్పడుతుంది. గురువు ఇచ్చే ఆదేశాల వల్ల మనకి విశ్వాసముంటుంది. ఆ పరిస్థితిలో వేరెవరో, వేరేదో చెప్తే మనకి సంశయాలు కలుగుతాయి. కాబట్టి ఒక నిశ్చయానికి వచ్చేలోగా సంభావ్యాలైన అన్ని అభ్యంతరాలనూ పరీక్షించాలి. అనుమానం వంటి సాధనలు మన విశ్వాసాలని పరిరక్షించుకోవటానికి ఉపయోగిస్తాయి. న్యాయశాస్త్రము, వైశేషికము తమ తమ చర్చలలో అనుమానాన్నే ముఖ్యంగా ఉపయోగిస్తాయి.

ప్రత్యక్ష ప్రమాణం పరిధిలోనికి వచ్చేవి బహుస్వల్పం. అనుమాన ప్రమాణం వల్ల అర్థం చేసుకోదగిన విషయములు చాలా ఎక్కువ. అనుమానం గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. వైదికసత్యాలని బుద్ధి గ్రహించటానికి ఇది ఉపకరిస్తుంది. అందువల్లనే న్యాయాన్ని వేదానికి ఉపాంగంగా పేర్కొంటారు. మీమాంస ప్రమాణం ద్వారా సహాయపడితే, న్యాయం యుక్తుల ద్వారా సహాయపడుతుంది.

పదార్థమంటే (పదస్య అర్థరి) ''మాటల అర్థం''. ఆధ్యాత్మిక విషయాలలో చర్చలన్నీ ఒక విషయాన్ని నమ్ముతాయి - అసలు పదాల అర్థాలని క్షుణ్ణంగా తెలుసుకుంటే వేదాలలోని సత్యాలు బాగా అవగాహన అవుతాయని. ఒక నిశ్చయానికి వచ్చేముందు అన్ని ప్రమాణాలనూ ఉపయోగించాలి. అవగాహనకి ఉపకరించే సాధనమే, ప్రమాణమంటే.

న్యాయంలో పదార్థాన్ని ఏడువిధాలుగా వర్గీకరించారు. అర్థం చేసుకోవలసిన ప్రతిపదార్థం గురించి వ్రాయటం కష్టం కాబట్టి. ఈ వర్గీకరణ ఆయా పదార్థాలను ఏ మాధ్యమం ద్వారా గ్రహిస్తామో వాటి బట్టి జరిగింది. ఈ ఏడూ రెండు వర్గాలకు చెందుతాయి. భావ - అంటే ఉనికి కలవి, అభావ అంటే ఉనికి లేనివి. ఏడు వర్గాలలోనూ ''అభావం'' అఖరుది. మిగిలిన ''భావా''లని ఆరు వర్గాలుగా విభజించారు.

ఇక్కడొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది - లేనిదాని గురించి ఊహించట మెట్లా? ''లేమి'' అనే దానికి ఒక ప్రత్యేకమైన అర్థముంది. లేమి కొన్ని ప్రదేశాలలోనే సంభవం, అన్ని ప్రదేశాలలోనూ కాదు. ''ఇక్కడ పువ్వులు లేవు'' అన్నప్పుడు పువ్వులు లేకపోవటం ఈ ప్రదేశంలోనే అని అర్థం. ''అక్కడ పూజా మందిరంలో పువ్వులున్నాయి'' అంటే అక్కడ పువ్వులలేమి, అభావం లేదు. అట్లాగే కొన్ని సమయాలలో ఉంటుంది, మరి కొన్ని సమయాలలో ఉండదు. అందువల్ల అభావానికి కూడ నిర్దిష్టమైన ఉనికి ఉంది. కొన్ని సమయాలలో, కొన్ని ప్రదేశాలలో అది ఉంటుంది.

పదార్థం యొక్క ఏడు లక్షణాలివి - ద్రవ్యం - పదార్థం; గుణం - లక్షణం; కర్మ-కార్యం; సామాన్యం - జాతి; విశేషం - ప్రత్యక్ష లక్షణం; సమవాయం - వ్యక్తికీ జాతికీ సంబంధం; అభావం - పదార్థం లేక పోవటం. ద్రవ్య, గుణ, కర్మలను - సత్‌ అంటారు. ద్రవ్యాన్ని - భౌతికంగా చూపించవచ్చు. జ్ఞానం, కొర్కె, సంతోషం, దుఃఖం - ఇటువంటి లక్షణాలను అవి ఆధారపడిన పదార్థాల నుండి విడదీసి చూపవీలుకాదు. తామర ఎఱ్ఱగా ఉంటుంది - అది దాని లక్షణం. ఆ లక్షణాన్ని తామరనుండి విడదీయలేము. అంటే ''గుణ''మనేది పదార్థంలోనే ఉంటుంది. ఆ గుణం దేనికైతే ఉంటుందో, అది ద్రవ్యం - పదార్థమన్నమాట. సంతోషాన్ని గాని, దుఃఖాన్ని గాని విడిగా చూపలేం - కాని సంతోషంగా ఉన్న మనిషినీ, దుఃఖంలో ఉన్న మనిషినీ గమనించగలం. ఆ విధంగా ఆ రెండు స్థితుల గురించీ తెలుస్తుంది. ఎఱ్ఱని తామరను చూచినప్పుడు ఎరుపంటే ఏమిటో అర్థమవుతుంది. కర్మ అంటే పని - కదలటం, నడవటం, పరుగెత్తటం - ఇత్యాది. ఏదో పదార్థానికి సంబంధించినవే ఇవీను - విడిగా ఉండలేవు. పరుగెత్తే వానిని నుండి పరుగెత్తటమనే కర్మని విడదీయలేము. మనిషి పరుగెత్తటం చూడగలం, దాని బట్టి పరుగెత్తటమంటే ఏమిటో తెలుసుకొని, దానికీ కూర్చోవటానికీ, పడుకోవటానికీ గల తేడాని గమనించగలం.

సామాన్యమన్నది జాతికి సంబంధించినది. ఆవుల మంద ఉంది - ఆ మందలోని వాటికన్నిటికీ ''గోవు''లుగా ఉండటం సామాన్యలక్షణం. దీనినే మనం ఆవుల జాతి అంటాం. జాతి ఒకటే అయినా ప్రతి ఆవుకీ ప్రత్యేక లక్షణాలుంటాయి. ఇది 'విశేషం'. ప్రతి ఆవునీ దానికి గల ప్రత్యేక లక్షణాలని బట్టి వేరువేరుగా గుర్తించవచ్చు. ద్రవ్యము - దాని గుణము, ద్రవ్యము - దాని కార్యము, జాతి లక్షణము, జీవి ప్రత్యేకత. ఒక ప్రాణి - దాని అంగములు, సమిష్టి, వ్యష్టి - ఇది సమవాయం. ఒక పదార్థం మరొక దానిని కలిస్తే దానిని సంయోగమంటారు. అవి కలిసైనా ఉండవచ్చు, విడివిడిగానైనా ఉండవచ్చు. ద్రవ్యము, గుణము - సమవాయము ద్రవ్యము, కర్మ కూడ సమవాయమే. గుణం కాని కర్మకాని స్వయం ప్రతిపత్తి లేనివి కాబట్టి అవి ఎప్పుడూ ఏదో పదార్థాన్ని కలిసే ఉంటాయి.

అభావం - ఏడవలక్షణం గురించి పైన చెప్పుకున్నాం ''పదార్థాన్ని ఏడు వర్గాలుగా విభజించినట్లే ప్రతి విషయాన్నీ మళ్లీ వర్గీకరించారు. ద్రవ్యానికి తొమ్మిది వర్గాలున్నాయి - అవి పృథ్వి (భూమి), ఆప (నీరు), తేజస్సు (జ్వాలాకాంతి) వాయువు (గాలి), ఆకాశం, కాలం, దిక్కు, ఆత్మ, మనస్సు. వీటిలో మొదటి అయిదింటిని - పంచభూతాలంటారు. ఆకాశంలేక అంతరిక్షం - వీటి ఉనికిని వీలు పరుస్తుంది. ఈ పంచభూతాలకి సమానంగా దేహంలో పంచేంద్రియాలున్నాయి.

చూచే కళ్లు, వినే చెవులు, రుచి నెరిగే నాలుక, శీతోష్ణాలను గ్రహించే స్పర్శ, వాసన చూచే ముక్కు - ఇవి అయిదు ఇంద్రియాలు. ఈ గ్రహింపు కేవలం పై చర్మానికే కాక, దేహమంతా వ్యాపిస్తుంది. లోపలకూడా తెలుస్తుంది. ఉదాహరణకి - తలనొప్పిగాని, కడుపునొప్పిగాని శరీరంలోపల గల స్పర్శజ్ఞానానికి తెలుస్తుంది. ఈ అయిదు అనుభూతులూ, వాటి సంబంధిత అంగాలవల్లనే కలుగుతాయి. చూపుకంటితోనే సాధ్యం, దేనినైనా నాలుకపైన పెడితేనే దాని రుచి మాత్రమే తెలుస్తుంది, దాని వాసన కాదు. చక్కెర తీపి నాలుకకే తెలుస్తుంది - ముక్కుకి కాదు. అంటే, ఈ ఇంద్రియాలకి ఒకే ఒక విషయం తెలుస్తుంది. రూపమనే గుణం కంటికే తెలుస్తుంది. రూపమంటే ఒక పదార్థపు రంగు, ఆకారము. తెలుపు, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, మట్టిరంగు - అనేవి రంగులు. శబ్దాలూ, వాటిలోని తేడాలూ చెవులకే తెలుస్తాయి. సువాసన, దుర్వాసన ముక్కుకే తెలుస్తాయి. ఆరు రకాల రసాలు (రుచులు) నాలుకకే తెలుస్తాయి. స్పర్వేంద్రియం చల్లదనాన్నీ, వేడిమినీ గ్రహిస్తుంది. ఈ అయిదు ఇంద్రియాలూ అయిదు గుణాలని గుర్తించ గలవు. వీటిని జ్ఞానేంద్రియాలంటారు. ఈ ఇంద్రియాలూ లేకపోతే, ఆయా గుణాల గ్రహింపు ఉండదు. మనకి ఆరు ఇంద్రియాలుంటే ఆరు గుణాలను గ్రహింప గలిగే వారమేమో! ప్రపంచంలో ఎన్ని పదార్థాలున్నాయో మనకి తెలియదు. స్పర్శజ్ఞానమే లేకపోతే మనకి ఉష్ణమూ, శీతలమూ తెలిసేవి కావు. వేడిలోని ఈ మార్పులను స్పర్శజ్ఞానం వల్లనే గ్రహించ గలుగుతున్నాము. గ్రుడ్డివారు, చెవిటివారు రూపాన్నీ, శబ్దాన్నీ గ్రహించలేరు - ప్రపంచంలో ఈ రెంటికొరతా ఏ మాత్రమూ లేదు! కన్ను, నాలుక, ముక్కు, చర్మము (స్పర్శేంద్రియం) చెవులు - ఈ అయిదు ఇంద్రియాలకూ అవి గ్రహించే విషయాలున్నాయి. రూపము, రుచి, గంధం, స్పర్శ, శబ్దం.

పంచభూతాలలో ఈ గుణాలున్నాయి. భూమికి అయిదు గుణాలూ ఉన్నాయి. భూమికి ఆకారముంది, రుచి ఉంది. మన దేహము, కూరగాయలు, పటిక బెల్లమూ ఇవన్నీ భూమికి సంబంధించినవే. భూమికి గంధం కూడ ఉంది - పువ్వు భూమికి సంబంధించినదే. గట్టితనం, ఉష్ణం, శీలం - ఇవి కూడ భూమికి సంబంధించినవే. భూమికి శబ్దం కూడా ఉంది. బిగించిన దారం శబ్దాన్నిస్తుంది. ఆ విధంగానే కఱ్ఱకూడా - ఇంకొక పదార్థాన్ని కొట్టినప్పుడు. నీటిలో, గంధం తప్ప, ఇతర నాలుగు లక్షణాలూ ఉన్నాయి. నీటిని బాదితే శబ్దం వస్తుంది. భూమికి అయిదు గుణాలే కాక, ఏ ఇతర భూతానికీ లేని గంధం కూడ ఉంది. ఈ వాసన భూమికి ప్రత్యేకం. నీటికి ప్రధాన మైన లక్షణం రసం (లేక రుచి). నీరు లేకపోతే రుచిని గుర్తించలేం. ఆ కారణం వల్లనే రుచిని ఎరుకపరచే యింద్రియమైన నాలుక ఎప్పుడూ తడిగా ఉంటుంది. నాలుక పొడి ఆరిపోతే రుచి తెలియదు. తేజస్సుకి (అంటే, మంటకి) వాసనగాని, రుచిగాని లేవు. రూపము, స్పర్శ, శబ్దమూ మాత్రమే ఉన్నాయి. రూపం దీని ప్రత్యేక లక్షణం. గాలికి రూపం లేదు. ఉన్నదల్లా శబ్దమూ, స్పర్శా మాత్రమే. స్పర్శదాని ప్రత్యేక లక్షణం. అందువల్లనే, గాలి వీచినప్పుడు శరీరానికి తెలుస్తుంది. ఆకాశానికి శబ్దం మాత్రమే ఉంది. ఆధునిక శాస్త్రజ్ఞులు మొదట్లో శబ్దం రావటానికి గాలి కారణమనుకున్నారు. కాని రేడియో (తీగెలులేని ప్రసారం) వచ్చిన తరువాత శబ్దం ఆకాశం యొక్క లక్షణమని గ్రహించారు. ఈ తీగెలులేని ప్రసారం గాలిమీద ఆధారపడదు.

శబ్దమనే ఒకే గుణం కల ఆకాశమూ, శబ్దమే కాక స్పర్శకూడా కల వాయువూ, శబ్ద స్పర్శలతో బాటు కంటికి గోచరించే రూపం కూడ కల అగ్నీ, రసం లేక రుచి గల నీరూ, ఈ నాలుగు గుణాలే కాక గంధం కూడ కల భూమీ - ఇవీ పంచభూతాలంటే. పంచభూతాలకి ప్రతీకలుగా ద్రవ్యాలున్నాయి. ఈ అయిదూ మినహాయిస్తే మిగిలిన ద్రవ్యాలివి - కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు - గంట, నిన్న, రేపు, సంవత్సరము, యుగము వంటివి కాలాన్ని తెలుపుతాయి. దిక్కు అనేది ప్రదేశాన్ని, ఉత్తరం, దక్షిణం, ఇక్కడ, అక్కడ - అనేవి. ఆత్మ అనేదానికి మనస్సుంటుంది, మనస్సే వీటన్నిటినీ గ్రహిస్తుంది. ఆత్మ రెండు రకాలు - జీవాత్మ, పరమాత్మ. జగత్తులో జరిగే వాటినన్నిటినీ సాక్షి వలె చూచేది పరమాత్మ. ప్రపంచ వ్యవహారాలలో నిమగ్నమై వ్యధిత మయ్యేదిజీవాత్మ. జీవాత్మలనేకం - పరమాత్మ ఏకం. రెండూ చైతన్యమే. వేదాంతానుసారం ఎరుకే, వివేకమే ఆత్మ అంటే. కాని న్యాయశాస్త్రం ప్రకారం ఎరుకకలిగినదే ఆత్మ. ద్వైత సిద్ధాంతం వలెనే న్యాయం ప్రకారం కూడ ఎరుక లేనిదే జీవాత్మ. వేదాంతం ప్రకారం ఎరుకకి రెండోది ఏదీ లేదు. అందువల్ల ఎరుక లేని జీవాత్మలంటూ ఏమీ లేవు. న్యాయశాస్త్రం ప్రకారం ఎరుక ఒక లక్షణం. ఆత్మ పదార్థం, ఎరుక దాని లక్షణం. ఆత్మ వివేకానికీ జ్ఞానానికీ - ఎరుకకలిగి యుండటానికీ స్థానం.

సంపూర్ణ జ్ఞానానికి వెలుపల ఏదీ లేదు ''అందువల్లనే న్యాయశాస్త్రం ప్రకారం పరమాత్మ అంటే పరిపూర్ణమైన జ్ఞానం. జీవాత్మలకు ఎరుక పరిమితం. అందుచేతనే వాటిని కించిద్‌జ్ఞులంటారు - అంటే కొంచెం జ్ఞానం కలవని అర్థం. పరమాత్మ సర్వజ్ఞుడు - అంటే ''అన్నీ తెలిసిన'' అని అర్థం. మనం పూర్తి జ్ఞానానికీ, అసంపూర్ణ జ్ఞానానికీ నిలయమే - అంటే రెండూ ఉంటాయి. కాని పరమాత్మకి పరిపూర్ణ జ్ఞానమే. అదే విభుడు ''అన్నిటా వ్యాపించిన'' అని అర్థం. న్యాయశాస్త్రం కూడ పరమాత్మ సర్వవ్యాప్తమని అంగీకరించినా - జీవాత్మ పరమాత్మల భేదాన్ని గుర్తించదు. ప్రతి జీవిలోనూ వివేక ముండటమే దీనికి కారణం. దాని ఉనికి మనస్సులో, మనస్సే సుఖదుంఖాను భూతులను కలిగిస్తుంది.

న్యాయశాస్త్ర ప్రకారం గుణాలు ఇరవై అయిదు రకాలు, కర్మలు అయిదు రకాలు. ఆ శాస్త్ర ప్రకారం, సరియైన పదార్థ జ్ఞానం కలిగితే సత్యం అవగాహన అవుతుంది. అప్పుడు మనస్సు అప్రధానమైన వాటిని నిరాకరిస్తుంది. ''మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఆ స్థితిలో సంతోషవిషాదాలు లేవు! వేదాంత లక్ష్యమైన మోక్షం కోసం మనం ప్రయత్నిస్తాం. దీనికి గురూపదేశపు మననం చాలా ఉపయోగం. ఈ మనన యొక్క ప్రాముఖ్యాన్ని న్యాయశాస్త్రం చెప్తుంది. పంచభూతాలు, జీవాత్మ, మనస్సు - మనకు తెలుస్తాయి. కాని పరమాత్మనెట్లా తెలుసుకోవటం? పరమాత్మను తెలుసుకోలేం. పరమాత్మను తెలిసికోవటానికి అనుమానం అవసరం. మిగిలిన వాటిని తెలిసికోవటానికి పంచేంద్రియాలు సేకరించే ప్రమాణం చాలు. శృతిప్రకారం పరమాత్ముడున్నాడు. అనుమాన పద్ధతి వల్ల న్యాయశాస్త్రం పరమాత్ముడుండి తీరాలంటుంది. అనుమానానికి ఒక ఉదాహరణ : నేను కూర్చున్న కుర్చీని ఎవరో వడ్రంగి చేసి ఉంటాడని తెలుస్తూనే ఉంది. ఆ చేసిన వ్యక్తిని మనం కలుసుకోనంత మాత్రాన దానిని మనిషి చేయలేదన గలమా? ఇతర కుర్చీలను చేయటం చూడటం వల్ల దీనిని కూడ వడ్రంగే చేసి ఉంటాడనుకుంటాం. ఇది వడ్రంగికే సాధ్యమని కూడ మనకు తెలుసు. ఆ విధంగానే జగత్తుకి కూడ ఒక సృష్టికర్త ఉండాలి. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అందరినీ కాపాడటం వల్ల దయామయుడు కూడా. న్యాయశాస్త్రం ఇటువంటి విషయాల పూర్వాపరాలు చర్చించి నిశ్చయానికి వస్తుంది.

ప్రమాణాలు :

ప్రత్యక్షము, అనుమానము మాత్రమే కాక న్యాయశాస్త్ర ప్రకారం ఇంకా రెండు ప్రమాణాలున్నాయి. ఇవి ఉపమానము, శబ్దము.

ఉపమానమంటే ఏమిటి? మనకి తెలియని దాని గురించి తెలిసిన దాని సహాయంతో తెలుసుకోవటం. ''గవయమ్‌'' అనే పశువుంది. కాని అదెట్లా ఉంటుందో మనకి తెలియదు. అది గోవువలె ఉంటుందంటారు. అడవి ప్రాంతానికి వెళ్ళి నప్పుడు ఆ వర్ణనకి సరిపోయిన ఒక పశువుని చూస్తాం. అదే ''గవయమ్‌'' కాబోలుననుకుంటాం. ఇది ఉపమానం.

శబ్దప్రమాణం - వేదోక్తి, మహనీయుల ప్రవచనం. వేదాలు గాని, మహర్షుల వంటి మహనీయులుగాని ఏదైనా చెప్తే దానిని ప్రమాణంగా స్వీకరించాలి - అవి అసత్యాలెప్పటికీ కావు కనుక. నైయాయికులు (న్యాయశాస్త్రాన్ని అనుసరించేవారు) వేదాలు భగవంతుని పలుకులే అని నమ్ముతారు. ఆ కారణం చేతనే అవి ప్రమాణాలు. మనోవాక్కాయ కర్మలుగా సత్యవ్రతులైన మహనీయుల పలుకులు కూడ ''శబ్ద ప్రమాణం''గా పరిగణింప బడుతాయి.

ఈ నాలుగు ప్రమాణాలూ కుమారిలభట్టు ప్రతిపాదించిన మీమాంసా సిద్ధాంతంలో భాగాలు. ''అర్థాపత్తి'' ''అనుపలబ్ధి'' అనబడే మరో రెండింటిని కూడ చేర్చి మొత్తం ఆరు ప్రమాణాలను చేశాడు. అద్వైతులు ఈ ఆరుప్రమాణాలను అంగీకరించారు. అర్థాపత్తిని అర్థం చేసుకోవటానికి మన శాస్త్రాలు ఒక ఉదాహరణనిస్తాయి. శాస్త్రం ఇటువంటి వాక్యాన్ని తీసుకొంటుంది: ''పీనో దేవదత్తో దివాన భుంక్తే'' అంటే ''స్థూల కాయుడైన దేవదత్తుడు పగలు ఆహారం తీసుకోడు''. పగలు ఆహారం తీసుకోకపోయినా అతడు సన్నబడలేదు! దీని వలన మనకి అర్థమయేది ఏమిటి? అతడు రాత్రిళ్లు బాగా తింటాడని! వేరే అసంగతమైన ఊహలు - అంటే అతడు అసలే ఆహారం తీసుకోడనీ, ఆహారం తీసుకోకపోయినా సన్నబడడనీ - వీటికి సమాధానం కుదురుస్తుంది. ఈ విధంగా సమాధానాన్ని కుదిర్చి, అసమర్థనీయములైన భావాలను విడనాడే మార్గమే అర్థాపత్తి.

దేవదత్తుడు రాత్రిపూట ఆహారం తీసుకుంటాడనే మన నిశ్చయం పైన ఉదహరించిన 'అనుమానమ'నే రెండవ ప్రమాణం వంటిది కాదు. అనుమాన పద్ధతిలో మనం గుర్తించటానికి వీలైన అంశం ఆ గుర్తించవలసిన పదార్థంలోనే ఉండాలి. ఉదాహరణకి - మేఘాలనుండి ఉరుములు, అగ్ని నుండి పొగ. ఇక్కడ అటువంటి ''లింగం'' - లేక పూర్వోక్తమైన దేదీ లేదు.

ఉపమానం విషయంలోనూ ఇంతే. మనం పశువుని చూచి గవయము అనుకొన్నా అనుమానం తెగలోకి ఇది రాదు. ఇక్కడ రూపాన్ని బట్టి మనమా పశువుని గుర్తించం. మన మెరిగిన రూపాన్ని పోలి ఉండటం వల్ల మనం గుర్తిస్తాం. ఆఖరి ప్రమాణం, అనుపలబ్ధి. ఒక పదార్థం లేదని గ్రహించటమే ఇది. న్యాయంలోని ఆఖరి పదార్థాన్ని అభావమని చెప్పుకున్నాం. అభావాన్ని, అనుపలబ్ధి వల్లనే అర్థం చేసుకోగలం. ''ఆ పాకలో ఏనుగుందేమో చూడు'' అన్నప్పుడు ఆ పాకకి వెళ్లి చూచి అక్కడ ఏనుగు లేకపోతే ఏనుగు లేదని తెలుసుకుంటాం. ఏనుగు కనబడదు. అక్కడ లేదన్న సత్యం తెలుస్తుంది. ఆ సత్యం తెలియటానికి కారణం, ఏనుగు లేక పోవటమే.

ఒక పదార్థం లేకపోవటం వల్ల మన మెరిగే సత్యం అనుపలబ్ధి. ఈ రెండు ప్రమాణాలను న్యాయశాస్త్రం అంగీకరింపదు. కాని మీమాంస, వేదాంతంలోని అద్వైత సిద్ధాంతమూ అంగీకరిస్తాయి.

విచక్షణా జ్ఞానం మనకి భగవంతుని చూపటానికే. ఈ ప్రమాణాల నాధారంగా పరిశీలిస్తుంటే, న్యాయశాస్త్రం అంతమైన చోట, వైశేషికం ఆరంభమవుతుంది. ఈ పద్ధతికి మూల పురుషుడు కణాదుడు. అన్ని పదార్థాలకూ ఆధారభూతమైనది అణువేనని ఆయన సిద్ధాంతం. ఈశ్వరుడు అణువులను వివిధరీతులలో కూర్చి, జగత్తుని సృష్టించాడు.

న్యాయంలోనూ, వైశేషికంలోనూ - ప్రపంచమూ, ఆత్మా - ఈశ్వరునికి భిన్నంగా ఉంటాయి. నిజానికిది ద్వైత సిద్ధాంతమే.

జీవునికి చైతన్యం, బుద్ధి ఎక్కడ నుంచి వచ్చాయి? జడమైన అణువు ఎక్కడ నుంచి వచ్చింది? ఈ విధంగా ప్రశ్నించుకుంటే అన్నీ పరమాత్ముని వివిధరూపాలేనన్న అద్వైత సిద్ధాంతాన్ని చేరుతాం.

ఈ అద్వైత నిశ్చయాన్ని చేరుకోవటానికి న్యాయం ఒక మెట్టుగా ఉపయోగిస్తుంది. విచక్షణకీ, హేతుబద్ధమైన నిశ్చయాలకు రావటానికీ న్యాయం, లేక తర్కం, ఉపయోగిస్తుంది. నిజానికి, బుద్ధితో పరిశీలనా, పరిశోధనా అది. అంతేకాదు, హేతువాదం నాస్తికం గాని, అనాత్మవాదం గాని కానవసరం లేదని చూపుతుంది. అసలు విషయమేమిటంటే - అసంఖ్యాకమైన జీవులూ, క్రమ బద్ధంగా నడచే జీవనగతీ - వీటి వెనుక ఒక సృష్టికర్త ఉండి యుండాలి. కేవలం బుద్ధితో కలిగే అవగాహనకు కొన్ని పరిమితులున్నాయని న్యాయశాస్త్రం అంగీకరిస్తుంది. అందువల్లనే మనం తార్కికంగా గ్రమింపలేని కొన్నిటికి వేదవాక్కును ప్రమాణంగా అంగీకరించాలంటుంది. అంటే, తర్కాన్ని మితిమీరేలాగ కొనసాగించి, దుస్తర్కం చేయరాదు. అంతిమ సత్యాన్ని గ్రహించటానికి తర్కాన్ని ఒక సాధనంగానే వినియోగించాలి.

అసలు ఏ విధమైన తర్కమూ లేకుండా భగవంతుడినీ శాస్త్రాన్నీ యథాతథంగా అంగీకరింపగలిగితే ఉత్తమం. కాని భగవత్సాక్షారాన్ని అనుగ్రహించే అటువంటి అకుంఠిత విశ్వాసం దుర్లభం. అకుంఠిత విశ్వాసమూలేక, హేతువాదము చేయని స్థితి ఒక విధంగా సోమరితనమే! తన మేధను ఉపమోగించి భగవంతుడు లేడనే నాస్తిక నిర్ణయానికి తప్పుగా వచ్చిన వాడైనా ప్రమాదం లేదు - అతడు తన బుద్ధిని ఉపయోగింపని వాని కంటే నయం. నాస్తికుడు తన పరిశీలనాత్మకతను కొనసాగింపగా, కొనసాగింపగా నాస్తికత్వాన్ని విడనాడే స్థితిని చేరుకో గలడు. బద్ధకస్తునికి ఏ విధమైన గతీ లేదు.

అందువల్లనే నాస్తికమైన చార్వాక సిద్ధాంతాన్ని కూడ ఒకప్పుడు ఒక ధర్మంగా గుర్తించారు. ''చారు'' ''వాక'' అంటే ''చెవులకు ఇంపైన'' అని అర్థం. ''ఉపవాసాలతో, వ్రతాలతో మానసిక భౌతిక ఆంక్షలతో మనల్ని మనం బాధ పెట్టుకోవద్దు. ఈ శరీరానికీ, మనస్సుకీ స్వేచ్ఛనిచ్చి సుఖిద్దాం''. వినటానికి ఎంతో హాయిగా ఉండే ఈ మాటలే చార్వాక సిద్ధాంత సారం.

కాని ఈ రీతిగా జీవితాన్ని గడుపుతున్నా, సుఖంవెనుకనే దుఃఖం కూడ జొరబడుతుంది. నిజానికి దుఃఖమే ఎక్కువౌతుంది. అనాత్మవాదాన్ని బలపరచని విశ్వాసమొక్కటే దుఃఖానికి పరిష్కారం.

వివేకమవసరం :

మనస్సూ బుద్ధీ బాగా నిశితమైన పరీక్షకు సంసిద్ధమైనప్పుడే వేదాంతపరమైన విచారం సాధ్యం - ఆ కారణం వల్లనే దృశ్యమానమైన జగత్తంతా మిథ్య (మాయ) అనిన ఆదిశంకరుని జగద్గురువుగా సకల శాస్త్ర పారంగతులు అంగీకరించారు.

న్యాయాన్ని తర్కమనీ ''అన్వీక్షికి'' అని కూడా అంటారు. న్యాయాన్నీ కపిలముని స్థాపించిన కాపిలమును, (సాంఖ్య) పతంజలి స్థాపించిన పాతంజలిమును, (యోగం) కుమారిల భట్టు చెప్పిన భాట్టమును, ఆదిశంకరులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.

అద్వైతాన్ని గుర్తింపని ఇతర సిద్ధాంతాలు కూడ అద్వైతంలో ఇమిడి ఉన్నాయి. ఈ కారణం వల్లనే శంకరాచార్య అన్న నామాన్ని ధరించిన నేను, ఇతర శాస్త్రాలు గురించి చెప్తున్నాను. ద్వైతము, విశిష్టాద్వైతము, శైవము, వైష్ణవము - అన్నీ అద్వైతంలో ఉన్నాయి. ఇతర సిద్ధాంతాలను అద్వైతం ఖండించిన సందర్భాలలో కూడా, ఆయా సిద్ధాంతాలే పరమసత్యాలనీ అద్వైతం కాదనీ అవి అన్నప్పుడే. అంతేకాని, ఇతర సిద్ధాంతాలు ఏ మాత్రమూ ఆమోదయోగ్యం కావని అద్వైత మెప్పుడూ ఖండించలేదు. వాటికి ఉచితమైన గౌరవప్రపత్తులను అద్వైతులిచ్చారు.

తర్కశాస్త్రంపై గ్రంథాలు :

న్యాయశాస్త్రాన్ని రచించిన గౌతముడ్ని అక్షపాదుడని కూడ అంటారు. ఆయన ఎల్లవేళలా చింతనా పరుడై బాహ్య ప్రపంచాన్ని పట్టించుకొనేవాడు కాడట. ఈ రోజులలో కూడ పరిశోధనలలో నిమగ్నమైన ఆచార్యులనీ, శాస్త్రజ్ఞులనీ పరధ్యానపరులంటారు. వారి పరధ్యానం పరిహాసానికి పాత్రమయింది కూడాను. గౌతముడటువంటి వాడే. ఒకసారి నడుస్తూ నూతిలో పడిపోయాడు. భగవంతుడతనిని రక్షించి మళ్లీ అటువంటి ప్రమాదం జరుగకుండా, ఆయన పాదాలకు కళ్లని పెట్టాడని ఇతిహాసం కూడా ఉంది. ఆయనకి తెలియకుండా వేసే అడుగుల వల్ల ఏ ఎదురుదెబ్బలూ తగులకుండా ఉండేట్టు ఆ కళ్లు నివారించేట్టు ఆశీర్వచనం చేశాడట భగవంతుడు. కాళ్లకి కళ్లు కలిగి యుండటం వల్ల ఆయన పేరు అక్షపాదుడు (కాళ్లల్లో కళ్లు కలవాడు) అయింది. ఆయనకి మార్గాన్ని భగవంతుడు చూపాడనటానికి ఇదొక పద్ధతి. ఆయన సూత్రాలపై వాత్య్యాయనుడు ఒక వ్యాఖ్యానం రచించాడు. వార్తికాన్ని, ఉద్యోతకరుడు వ్రాశాడు. ఆ వార్తికంపై వ్యాఖ్యానాన్ని వాచస్పతిమిశ్రుడనే అద్వైతి రచించాడు. దీని పేరు ''తాత్పర్యటీకా పరిశుద్ధి''. ''న్యాయకుసమాంజలి'' అన్న గ్రంథాన్ని కూడ ఉదయనుడు రచించాడు. బౌద్ధమతాన్ని ఖండించి, ఈ దేశం నుండి దానిని పారద్రోలిన వారిలో ముఖ్యుడాయన. న్యాయశాస్త్రంపై ''న్యాయమంజరి'' అనే వ్యాఖ్యానాన్ని జయంతుడు రచించాడు. అన్నంభట్టారకుడు ''తర్క సంగ్రహ'' మనే గ్రంథాన్ని, దానికొక టిప్పణినీ (దీపిక) రచించాడు. న్యాయశాస్త్రాన్ని అభ్యసింపగోరేవారు చివర చెప్పిన గ్రంథాలతో ప్రారంభిస్తారు.

కణాద మహర్షి చెప్పిన వైశేషిక సూత్రాలపై ప్రశస్తపాదుడు ఒక భాష్య గ్రంథాన్ని రచించాడు. దాని పేరు ''పదార్థ ధర్మ సంగ్రహం''. దీనిపై ఒక వ్యాఖ్యానాన్ని ఉదయనుడు రచించాడు. ఇటీవల ఉత్తమూర్‌ వీరరాఘవాచార్యులు ''వైశేషిక రసాయన''మనే గ్రంథాన్ని రచించాడు.

వైశేషికానికి మరొకపేరు కూడా ఉంది. అది ''ఔలూక్య దర్శనం''. ''ఉలూక''మంటే గుడ్లగూబ. ఇదే ఆంగ్లంలో Owl అయింది. కణాదునినే ఉలూకమనే వారట. తన చింతనలో పరధ్యానంగా ఉంటూ నూతిలో గౌతముడు పడ్డాడు. కణాదుడు పగలంతా తన పరిశోధనలలో నిమగ్నమై భిక్షాటనం రాత్రిళ్లు చేసుకునే వాడట అందువల్ల ''గుడ్లగూబ'' అన్న పేరు వచ్చింది. (భగవద్గీతలో కృష్ణభగవానుడు అజ్ఞాని రేయి, జ్ఞాని పగలు అని అన్నప్పుడు జ్ఞానులను గుడ్లగూబలుగా వర్గీకరిస్తాడు). కణాదుడు చెప్పిన సిద్ధాంతమవటంచేత వైశేషికాన్ని కణాదశాస్త్రమని కూడ అంటారు. విద్వాంసుల దృష్టిలో వ్యాకరణమూ, న్యాయమూ అన్ని శాస్త్రాలనూ అర్థం చేసుకోవటానికి ఉపయోగపడుతాయి.

జగత్సృష్టికి కారణం :

సృష్టికి కారణాలు రెండు : నిమిత్తం, ఉపాదానం. మట్టికుండ ఉంటే, దానిని చేయటానికి మన్ను ఉండాలి. కుండ ఉండటానికి కారణం మట్టి. దానిని ఉపాదానమంటారు. కాని మన్ను కుండగా ఎట్లా మారుతుంది? తనంతట తాను కాలేదు కదా. కుమ్మరి మట్టిని కుండగా చేయగలడు. అంటే కుండ ఉండాలంటే కుమ్మరి ఉండాలి. అతడు కారకుడు లేక నిమిత్తం. జ్యోతిషశాస్త్రంలో చెప్పబడిన నిమిత్తం లేక శకునం వేరు.

న్యాయవైశేషిక సిద్ధాంతాననుసరించి, అణువులను ఉపాదానంగా తీసుకొని, ఈశ్వరుడు నిమిత్తకారణమై జగత్తుని సృష్టించాడు. మట్టిని కుండగా చేయటానికి, కుమ్మరి ఉండి తీరాలి. అతడే లేకపోతే కుండ అసంభవం. దీనినే ఆరంభవాదమని గాని, అసత్‌కార్యవాదమని గాని అంటారు. ''సత్‌'' అంటే ఉన్నది; ''అసత్‌'' అంటే లేనిది. మట్టిలో కుండ లేదు. లేనికుండ మట్టినుండి సంస్థిత మవుతుంది. ఆ విధంగానే, అణువులలో లేని జగత్తును ఈశ్వరుడు అణువుల సహాయంతో సృష్టించాడు. న్యాయశాస్త్రపు సిద్ధాంతమిది.

సాంఖ్యవాదుల ప్రకారం దేవుడు లేడు. వారి సిద్ధాంతానుసారం ప్రకృతి తన నుండి తానే జగత్తుని కల్పించింది. ఆధునిక నాస్తికుల వాదానికీ దీనికీ తేడా ఉంది. దీనికి కారణమిది : సాంఖ్యులు నిర్గుణ బ్రహ్మను (లేక, పురుషుణ్ణి) జ్ఞానస్వరూపునిగా గుర్తిస్తారు. జడమైన ప్రకృతి యొక్క సక్రమ వ్యాపకాలకి కారణం, పురుషుని సాన్నిధ్య ప్రభావం వల్లనే అంటారు. ఆ సామీప్యమే సృష్టికీ, అందులోని నియమబద్ధతకీ కారణమంటారు. పురుషునకు ఏ వ్యాపకమూ లేదు. సూర్యకిరణాల వల్ల నీరు ఆవిరి అవుతుంది. మొక్కలు పెరుగుతాయి. తడిబట్టలు ఆరుతాయి. ఇవన్నీ సూర్యుని ప్రభావం వల్లనే జరుగుతాయి. సూర్యునికి మాత్రం కొలనుని ఎండిపోయేట్టు చేద్దామని గాని, మొక్కని ఎదిగేట్టు చేద్దామని గాని ఉద్దేశముండదు. మంచునీళ్లల్లో చేతులు పెట్టితే వేళ్లను బండబారుద్దామన్న ఉద్దేశ్యం మంచునీటికి కలదని అనలేము కదా. ఆ విధంగానే పురుషుడు సృష్టికార్యం సల్పాలని సంకల్పింపక పోయినా, పురుషుని ప్రభావం వల్ల ప్రకృతే తననుండి సృష్టి కార్యాన్ని సల్పుతుంది. ఇది సాంఖ్య సిద్ధాంతం. దీనినే పరిణామ వాదమని కూడ అంటారు.

నైయాయికుల అసత్‌ కార్యవాదానికి ప్రతిగా సాంఖ్యులు సత్‌ కార్య వాదాన్ని ప్రతిపాదిస్తారు. వీరిట్లా అంటారు :

కుండ కూడ మట్టిలో అంతర్భాగమే. మొదట్లో నూనెగింజలను గానుగవాడు ఆడిస్తే ఆ గింజలలోనే ఉన్న నూనె వస్తోంది. మట్టిలోనే ఇమిడి ఉన్న కుండకి ప్రయత్నం వల్ల ఆ రూపంవస్తుంది. మట్టినుపయోగించటం వల్లనే కుండ వస్తుంది. నూనె గింజల నుండి కుండ తయారు కాదు కదా! అట్లాగే, నూనెని మట్టి నుండి పొందలేం. కుండలో మట్టి కణాలు తప్ప ఏవీ లేవు. ఆ అణువుల అమరికని కాస్త మారిస్తే కుండ తయారవుతుంది.

శ్రీ శంకరభగవత్పాదుల వారిట్లా అన్నారు. ''ఆరంభవాదంగాని పరిణామ వాదం గాని సప్రమాణం కాదు. మాయసహాయంతో బ్రహ్మమే సృష్టి రూపం దాల్చాడు. ఆ విశ్వకర్త అయిన కుమ్మరిని విడిచి మట్టిలేదు. అందువల్ల ఆరంభవాదానికి అర్థం లేదు. పరిణామము వలన - అంటే మార్పు వలన - పరమాత్ముడు జగత్తుని పాలనుండి పెరుగువలె సృష్టించాడనటమూ సబబు కాదు. ఎందు వల్లనంటే - అటువంటి పరిణామము సంభవించిన తరువాత పెరుగు మాత్రమే ఉంటుంది కాని పాలుండవు. జగత్సృష్టి తరువాత పరమాత్మ అస్థిత్వం కోల్పోయాడనటం అసందర్భం. పరమాత్ముడు శుద్ధ జ్ఞానం వలె ఒకవైపూ, జీవినిగా - జగత్తుగా మరొకవైపూ ఉంటాడు. ఇదంతా ఆ ''సత్‌'' పదార్థం యొక్క లీల. నాటకంలో పాత్రధరించినంత మాత్రాన ఆ మనిషి నిజస్వరూపాన్ని కోల్పోతాడా? సృష్టి కూడా అంతే. జగత్తులో అనేక రూపాలను ధరించినా ఆ సత్‌ పదార్థానికి మార్పులేదు''. దీని పేరు వివర్తవాదం - శంకరుని సాహసోపేతమైన సిద్ధాంతం.

పాముగా భ్రమింపచేసే త్రాడు - వివర్తం. అది పాముగా మారలేదు. అందువల్ల అది ఆరంభవాదం కాదు. త్రాడు త్రాడుగానే ఉంటుంది, పాము కాలేదు. కాని మన అజ్ఞానం వల్ల అది పామువలె కనబడుతుంది. ఇట్లాగే అవిద్యవల్ల బ్రహ్మమే మనకు జగత్తువలె, సృష్టివలె, అందులోని జీవరాశుల వలె కనబడుతుంది.

ఆచార్యులవారు ప్రతిపాదించిన సత్యాన్ని గ్రహించటానికి అనేకమైన యుక్తులను న్యాయశాస్త్రం చెప్తుంది. పదార్థం యొక్క నిజస్వరూపాన్ని తెలిసికోవటానికి ఈ యుక్తులు ఉపయోగ పడుతాయి. వీటివల్ల వైరాగ్యం సిద్ధిస్తుంది. ఈ స్థితి నుంచి సంతోషదుంఖాలు లేని స్థితికి వెళ్లవచ్చు. ఆ స్థితిని అపవర్గమంటారు. న్యాయవైశేషిక సిద్ధాంతాలు అక్కడితో నిలచిపోతాయి.

ద్వైత సిద్ధాంతం ప్రకారం కూడ అంతకంటె ముందుకు వెళ్లలేం. అద్వైతం ఒకే ఒక సత్‌ ఉన్నదనీ మనము 'సత్‌' అవటమే మోక్షమనీ, జన్మరాహిత్యసిద్ధి అనీ ప్రతిపాదిస్తుంది.

న్యాయం మాత్రం మనం అపవర్గమనే ఉత్కృష్టస్థాయికి చేరుకోగలమనీ, ఈ ప్రపంచపు అసంతృప్తి కరమైన జీవనాన్ని అధిగమించ గలమనీ చెప్తుంది.

ఈ శాస్త్రానికి ఇంకొక విశిష్టత కూడ ఉంది. బౌద్ధులు, సాంఖ్యులు, చార్వాకులు ప్రతిపాదించే సిద్ధాంతాలను ఖండించగల యుక్తులనేకం తెల్పుతుంది. ఈశ్వరుడున్నాడనీ. సృష్టికర్త అనీ కూడ నిరూపిస్తుంది.

కొన్ని సంఘటనలు - వాదాలు :

''తత్త్వచింతామణి'' అనే తన గ్రంథంలో గంగేశమిశ్రోపాధ్యాయ 64 వాదాలను పేర్కొన్నాడు. ఇప్పటి వరకూ ఏవో తాత్త్విక సిద్ధాంతాలతో శ్రమిస్తున్నాం. ఇప్పుడు గంగేశమిశ్రుని గురించి కొన్ని ఉదంతాలు చెప్పుకుందాం.

ఆదిలో గంగేశుడు అంత తెలివైన కుఱ్ఱవాడు కాడు. అతను బెంగాలులోఉన్నతమైన బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. ఆ రోజులలో ఇటువంటి కులీన బ్రాహ్మణ బాలురకు ఎందరో బ్రాహ్మణ కన్యలనిచ్చి వివాహం చేసే ఆచారముండేది. ఆ బ్రాహ్మణ కన్యలలో కొందరు కులీనులు కారు. ఆ రీతిగా ఒక కులీన బ్రాహ్మణులకు ఏభై వరకూ భార్యలుండేవారు. కాని గంగేశమిశ్రునికి ఒకే ఒక భార్య ఉండేది. ఆమెతో అతను అత్తవారి యింట ఉండేవాడు. అతను అవివేకి కావటం వల్ల ఎక్కువ సంబంధాలు రాలేదు.

బెంగాలీలు చేపలు తింటారు. వర్షాకాలంలో పెక్కు ప్రదేశాలు జలమయమవుతాయి. కూరగాయలను పెంచుకోవటానికి నేల దొరికేది కాదు. ఆ కాలంలో సమృద్ధిగా దొరికే చేపలను తినేవారు. తూర్పు బెంగాలులో చేపని జలపుష్పమని కూడ అంటారు. అంటే అది శాకాహారం వంటిదేనని సూచించటానికి. కూరలు పెంచుకొనే అవకాశ##మే లేకపోవటం వల్ల బెంగాలీలకు చేపలు తినటమలవాటయింది. గంగేశుని అత్తవారి యింట్లో చేపలను వండుతూండేవారు. గంగేశుని ''గంగ'' అని పిలుస్తూ ఉండేవారు. అతడు మొద్దు కావట వల్ల అతనికి ఎముకలను మాత్రం వడ్డించి మిగిలిన వారు కండను తినేవారు. ఆ తరువాత అతనిని ఆటలు పట్టించేవారు. దానిని అతడు భరింపలేకపోయేవాడు. ఒకనాడు కాశీకి ప్రయాణమై జారుకున్నాడు. అక్కడ పది సంవత్సరాలు విద్యనభ్యసించాడు. అతడు లేకపోవటాన్ని ఇంట్లో ఎవ్వరూ పట్టించుకోలేదు. అతను తన విద్యను పూర్తి చేసి తిరిగి వచ్చాడు. అన్నాళ్లూ అతను ఏ లక్ష్యమూ లేకుండా, వృధాగా అక్కడా, ఇక్కడా తిరిగి ఉంటాడని అందరూ అనుకున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు అతనికి పాత అలవాటు ప్రకారం చేపని వడ్డించారు. అప్పుడు అతను ''నాహం గంగా, కిస్తు గంగేశమిశ్ర'' (నేను ఇంక గంగను కాను, నేను గంగేశమిశ్రను) అంటే నేను మునుపటి తెలివితక్కువ గంగనైతే చేప ఎముకలనే పెట్టినా సరిపోయేది - కాని ఇప్పుడు నేను పాండిత్యాన్ని సూచించే పేరును చేర్చుకున్నాను అని అర్థం. ఈ అర్థాన్ని క్లుప్తంగా సూచించాడు ఆ వాక్యంలో. అత్తవారు అతని విలువను గ్రహించారు.

ఆ గంగేశమిశ్రుడే ''తత్త్వచింతామణి''ని రచించాడు. దానిపై ఎందరో వ్యాఖ్యానాలు వ్రాశారు. వారిలో రఘునాథశిరోమణి ఒకడు. అతని తరువాతనే గొప్ప సంస్కృత పండితుల పేర్ల చివర ''శిరోమణి'' అన్న బిరుదును చేర్చటం మొదలు పెట్టారు. గదాధరుడనే పండితుడు కేవలం పదిశ్లోకాలపై వ్యాఖ్యగా బృహద్గ్రంథాన్ని వ్రాశాడు. అందులో ఒక్క వాక్యం కూడ అప్రస్తుతమనలేం. ఆ గ్రంథం పేరు ''గదాధరి''. ఇందులోని అయిదు వాదాలనైనా చదివి అర్థం చేసుకో గలిగిన వానిని చదువుకొన్నవాడనవచ్చు. పదింటిని చదివితే మంచి తెలివిగల వాడనవచ్చు. ఈ వాదాలలో ఒక దానిని ''ప్రామాణ్య వాద'' మంటారు. దానిని క్షుణ్ణంగా నేర్పిన వాడిని అందరికంటే వివేకి అనవచ్చు. ఈ నాటికీ తర్కశాస్త్రాన్ని అభ్యసించేవారు గదాధరిని అధ్యనం చేస్తారు.

ప్రామాణ్యవాద మంటే ప్రమాణాలు, లేక ఋజువుల గురించి ఇప్పుడు చెప్పనారంభిస్తే తలతిరిగిపోతుంది. కాని మన ఆచార్యులవారి రోజులలో ఈ ప్రామాణ్య వాదాన్నే మండనమిశ్రుని వాకిటగల రామచిలుకలు కూడ చర్చించేవట!

ఆదిశంకరుడు మండనమిశ్రుని నివాసమున్న మాహిస్మతికి వెళ్లి అక్కడ నదినుంచి యిళ్లకు నీరుని తీసికొని పోతున్న ఆడవాళ్లని మండనమిశ్రుని యింటికి దారి అడిగాడు. ఆ ఆ నగరంలో సామాన్యస్త్రీలు కూడ బాగా చదువుకున్న వాళ్లే. ఆచార్యుని ప్రశ్నకు వారు శ్లోక రూపంలో సమాధానం చెప్పారు. వాటిలో ఒకటి మండనమిశ్రుని యింటి గుర్తులను ఈ విధంగా వివరించింది;

''స్వతః ప్రమాణం పరతః ప్రమాణం

కీరాంగనాః యత్రగిరం వదంతి

ద్వారస్థ నీడాన్తర సన్నిరుద్ధ

జానీహి తత్‌ మండన పండితౌకః''

(ఏ వాకిట ఆడరామచిలుకలు స్వతప్రమాణం గురించీ పరఃప్రమాణం గురించీ చర్చించుకుంటాయో - ఆ యిల్లే విద్వాంసుడైన మండనునిది అని తెలుసుకో)

ప్రాచీన భారతంలో పురుషులే కాక స్త్రీలు కూడ బాగా చదువుకున్న వారేనని దీని బట్టి అర్థమవుతుంది. స్త్రీలే కాదు ఆడరామచిలుకలు కూడ వేదాంత విచారణలో నిష్ణాతులని కూడ తెలుస్తుంది. ఆ శ్లోకం దీనినే సూచిస్తుంది.

ఈ వాదం కష్టమైనదే అయినా దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. దీనికి సంబంధించి ఒక చమత్కారమైన కథ కూడా ఉంది.

ఒక దక్షిణాత్యుడు తర్కశాస్త్రాన్ని అభ్యసించటానికి నవద్వీపం వెళ్లాడు. ఆ రోజులలో, ఈ శాస్త్ర పండితులు ఎందరో బెంగాలులో ఉండేవారని పేరు. దక్షిణ దేశం నుండి వెళ్లినాయన మంచి కవి. తన కావ్యాల వల్ల ఎంతో సంపదనార్జించాడు. ప్రామాణ్యవాదం గురించి ప్రత్యక్షంగా నేర్చుకుందామని నవద్వీపం వెళ్లాడు. ఎంత చదివినా బాగా అర్థం కాలేదతనికి. ఇంకా ప్రయత్నించాడు - దానితో అతని కవిత్వధార దెబ్బతిన్నది. ఎప్పుడూ తర్కంతోనే తంటాలు పడుతూండటం వల్ల అతని కవితలోని సొగసు సన్నగిల్లింది. అతను తీసికొని వెళ్లిన సొమ్ముకూడ ఖర్చయిపోయింది. రెండు విధాలా నష్టపోయాడు, ఎంతో దుఃఖించాడు. ప్రామాణ్యవాదం అర్థం కాకపోవటంతో, తనలో - మిగిలిన కవితాగంధంతో ఇట్లా అన్నాడు - ''నా కవిత్వాన్నే అపహరించిన ప్రామాణ్యవాదానికొక నమస్కారం''!, ''నమఃప్రామాణ్యవాదాయ మత్కవిత్వాపహారిణ''

ఒక వస్తువుని చూడగానే మనకి దాని గురించి ఎరుక ఏర్పడుతుంది. ఒక్కొక్క సారి ఈ ఎరుక సరిగ్గా ఉండదు. పటికను చూచి కలకండ (పటిక బెల్లం) అనుకోవచ్చు. ఇది తప్పు జ్ఞానం. సరియైన జ్ఞానాన్ని ''ప్రమ'' అంటారు. తప్పు దానిని ''భ్రమ'' అంటారు. జ్ఞానాన్ని ఇంకా రెండు విధాల విభజిస్తారు. ''సంశయజ్ఞానం'', ''నిశ్చయజ్ఞానం''. సందేహమున్న జ్ఞానాన్ని సంశయజ్ఞానమంటారు. ఏ సందేహమూ లేని దాన్ని నిశ్చియజ్ఞాన మంటారు. తప్పు జ్ఞానం ఒక్కొక్కసారి సరియైన జ్ఞానం వలె అనిపిస్తుంది. అటువంటి సందర్భాలలో దీనినే ప్రమాణం అనుకుంటాం. పటిక, పటికబెల్లం వలె కనబడటం వంటిది. కొన్ని సందర్భాలలో మనకి కలిగిన ఎరుక సంశయాత్మకంగా మొదటే అనిపిస్తుంది. నీటిలో చెట్ల నీడను చూచినప్పుడు అవి తలక్రిందుగా కనబడుతాయి. చెట్లు అట్లా నిలబడవు అని మనం ముందే గ్రహిస్తాం. అందువల్ల ఆ ప్రమాణాన్ని తిరస్కరిస్తాం. అంటే ''ఎరుక'' కలిగిన క్షణంలోనే అది సత్యమో - అసత్యమో తేలిపోతుంది. కొంత కాలవ్యవధి తరువాత కూడ మొదట కలిగిన ఎరుక సరియైనదిగానే నిలుస్తే దానిని ప్రామాణ్య గ్రహ జ్ఞానమంటారు. ఆదిలోనే సంశయాత్మకంగా తోచే జ్ఞానాన్ని అప్రామాణ్యగ్రహాస్కందిత జ్ఞానమంటారు. ''ప్రమ'' లేక సరియైన జ్ఞనంలో వలె, భ్రమలో కూడ ప్రమాణం వల్లనే జ్ఞానమేర్పడుతుంది. అందుచేతనే, పటిక, పటికబెల్లం వలె తోచినప్పుడు, మన ఎరుకే ప్రమాణం.

ఋజువు రెండు రకాలు - ఆదిలోనే సత్యమనిపించేవి, ఆదిలోనే అసత్యమనిపించేవి. ఈ రెంటిలో ఏది సరియైనదన్న విషయాన్నే మండనమిశ్రుని వాకిట రామచిలుకలు చర్చించుకుంటున్నాయి.

ఒక పదార్థాన్ని గుర్తించినప్పుడు తనంతటతానే మనస్సు ఆ గుర్తింపు ప్రమాణమా, అప్రమాణమా నని తెలుసుకోలేదు. ఆ పదార్థపు లక్షణం మీద ఆధారపడి ఉంటుందది. ఆ పదార్థానికే మనపై గల ప్రభావాన్ని పరీక్షించకపోతే, మన అవగాహన సరియైనదో కాదో చెప్పలేము. అంటే, మన అవగాహన ఆత్మాశ్రయమైనది కాదు. ఇది న్యాయశాస్త్రం యొక్క వాదం. మండనమిశ్రుని వంటి మీమాంసకుల దృక్పథం దీనికి భిన్నం. పదార్థం యొక్క తత్త్వాన్ని గ్రహించటం మన బుద్ధికే తెలుస్తుందని వారి వాదం. కాని మన గ్రహింపు అప్రమాణమైనదని ఋజువైతే, దానికి కారణం ఆ పదార్థం యొక్క లక్షణమే. దీనినే ఇంకో విధంగా చెప్పాలంటే - సరియైన అవగాహన, లేక ప్రమాణం, మన మీద ఆధారపడియుంటే, తప్పుడు గ్రహింపు ఆ పదార్థమ్మీద ఆధారపడి యుంటుంది. ఈ విషయాలనన్నిటినీ తర్కశాస్త్రంలో చర్చిస్తారు.

''వాద''మనే మాటని ఈ రోజులలో తమ భావాన్ని సమర్థించటమనే అర్థంలో వాడుతున్నారు. నిజానికి, ఉభయ పక్షాల వాదాలకూ సమన్వయం కలిగించటం. అంతేకాదు, విభిన్నమైన దృక్పథాలను పరిగణనలోకి తీసుకొని ఒక నిశ్చయానికి రాగలగాలి. ఆచార్యులవారు మండన మిశ్రుని వంటి పండితులతో వాదాలను చేస్తూ దేశమంతా తిరిగారన్నప్పుడు మన భావమిదే - ఆయన అందరి అభిప్రాయాలను గ్రహించేవారు, కాని చివరికి వారిదే పైచెయ్యి అయేది. తన ప్రత్యర్థులు చేసిన వాదాలనన్నిటినీ మార్కొని, ఆయన అద్వైతం యొక్క ఔన్నత్యాన్ని ప్రతిష్ఠించారు. ''వాద''మంటే భిన్నాభిప్రాయాలను ప్రకటించుకోవటం, కేవలం తమ దృక్పథాన్నే బలపరచుకోవటం కాదు. తాను ముందే నిశ్చయించుకున్న అభిప్రాయాన్నే సమర్థిస్తూ వాదించటం ''జల్ప'' మవుతుంది; వాదం కాదు. మూడవ రకంది కూడా ఉంది. జల్పంలో వలె ఒక నిశ్చితాభిప్రాయ ముండక పోయినా ఎదిరి చెప్పిన వాటిని ఏదో విధంగా ఖండిస్తూండటం, దీనిని వితండవాదమంటారు.

పన్నెండవ శతాబ్దంలో గంగేశమిశ్రుడు బెంగాలుకి తిరిగి వచ్చినప్పటి నుండి న్యాయశాస్త్రానికి పునరుజ్జీవనం కలిగింది. బెంగాలులో పుట్టిన దీనికి నూతన తేజం వచ్చింది. దీనిని నవ్యన్యాయ మనేవారు. దీనికి ఇంకొక కారణముంది. గంగేశమిశ్రుడు, అతని తరువాతి అనుచరులు, నవద్వీపంలో నివసించేవారు. నవద్వీపాన్ని నాడియాడ్‌ అని కూడ అంటారు. శ్రీ కృష్ణ చైతన్య కూడ ఇక్కడి వాడే. ఆయన కూడ బహుశాస్త్ర కోవిదుడు. కొన్నాళ్ల తరువాత ఆయన కృష్ణ భజన సంకీర్తన చేస్తూ భగవంతుని నామ సంకీర్తనమే మోక్షానికి సోపానమని చాటాడు.

''జగత్తు సత్యం, మిథ్య కాదు, జీవాత్మలనేకం, అవి పరమాత్మకు భిన్నం'' అనే న్యాయశాస్త్ర సిద్ధాంతాలతో అద్వైతం ఏకీభవించదు. న్యాయశాస్త్రం నిరీశ్వరవాదాన్ని ఖండించి, భగవంతుని ఉనికిని నిర్ద్వందంగా సమర్థిస్తుంది. దీనికై అది ప్రతిపాదించే సిద్ధాంతాలు అద్వైతానికి దారి చూపే యుక్తులు. ఆ కారణం వల్ల దానిని ఒక ముఖ్యమైన శాస్త్రంగా పరిగణిస్తారు.

న్యాయం వేదానికొక ఉపాంగం - ఎంతో వివేకమైన, తర్కబద్ధమైన వాదాలకి స్థానమది. పధ్నాలుగు విద్యలలో తరువాతిది పురాణం. దీనినే అధునికులు కొందరు కేవలం మూఢ నమ్మకాలుగా తీసివేస్తారు. పురాణాల విషయం కొంచెం చూద్దాం.

* * *

Acharyavaani - Vedamulu     Chapters   Last Page