Acharyavaani - Vedamulu     Chapters   Last Page

21. ఉపాంగములు : మీమాంస

చతుర్దశ విద్యలలో నాలుగు వేదాలూ, ఆరు వేదాంగాలూ తరువాత మిగిలిన నాలుగు ఉపాంగములు. ఇవి మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము.

''మీమాంస'' అన్న సమాసంలో ''మాజ్‌'' ధాతువుకి ''సన్‌'' ప్రత్యయం చేర్చబడింది. ఈ రెండు మాటల అర్థం పూజిత 'విచారణ' లేక 'ఆదరణీయమైన విషయమై గంభీరమైన పరిశీలన'. ఆ విషయం-వేదాలు. 'నిరుక్తం'లో వేదమంత్రాల అర్థముంటుందని చెప్పుకున్నాం. ఆయా మంత్రాల ప్రాముఖ్యత, ఉద్దేశమూ, వాటి విశిష్టతా నిర్దుష్టంగా గ్రహించే పద్ధతిని మీమాంస తెలుపుతుంది.

వేదాలలో రెండు ప్రధాన విభాగాలున్నాయని చెప్పుకున్నాం. అవి కర్మకాండ, జ్ఞానకాండ. వేదశాఖ మొదటి భాగంలో కర్మకాండ ఉంటుంది. అందువల్ల దానిని పూర్వభాగమంటారు. దీని తర్వాత వచ్చేదానిని ఉత్తరభాగమంటారు. అట్లాగే మీమాంసలో కూడ రెండు భాగాలున్నాయి : పూర్వమీమాంస, ఉత్తరమీమాంస.

పూర్వమీమాంస కర్మకాండలో చెప్పబడిన కర్మల, యజ్ఞాల ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది. ఉత్తరమీమాంస జ్ఞానకాండ విషయమైన ఆత్మసాక్షాత్కారం ప్రాముఖ్యాన్ని విశదీకరిస్తుంది.

ఉపనిషత్తుల గురించీ, బ్రహ్మసూత్రాల గురించీ ప్రస్తావించినప్పుడు ఉత్తరమీమాంస గురించి చెప్పటమయింది. ఉత్తరమీమాంసనే, వేదాంతమని సాధారణంగా అంటారు. ''మీమాంస'' అన్న పదానికి ''పూర్వ'' అని గాని, ''ఉత్తర'' అని గాని చేర్చకపోతే, అది పూర్వమీమాంస క్రిందేలెక్క. అయినా పూర్వమీమాంస గురించి చెప్పుకునేప్పుడు అక్కడక్కడ ఉత్తరమీమాంస, అంటే వేదాంతం, గురించి కూడ ప్రస్తావిస్తాం.

ప్రతి శాస్త్రానికీ ఒక సూత్రము, ఒక వార్తికము, ఒక భాష్యమూ ఉంటాయని ముందే చెప్పుకున్నాం. పూర్వమీమాంసకి సూత్రాన్ని రచించిన ఋషి జైమిని. దానికి భాష్యాన్ని శబరస్వామి, వార్తికాన్ని కుమారిలభట్టు వ్రాశారు. పూర్వమీమాంస సూత్రాలపై ప్రధానమైన వ్యాఖ్యానం, కుమారిల భట్టు రచించిన ''భాట్టదీపిక''. కుమారిల భట్టు - కుమారస్వామి అవతారమంటారు. కుమారిల భట్టు వ్యాఖ్యానానికి కొద్ది తేడాతో ప్రభాకరుడు కూడ ఒక భాష్యాన్ని వ్రాశాడు. అందువల్ల పూర్వమీమాంసని అనుసరించేవారు (అంటే, మీమాంసకులు) రెండు వర్గాలవారు - కుమారిల భట్టు అనుచరులు, ప్రభాకరుని అనుచరులు. వీరి మధ్య గల విభేదాలను మనం పట్టించుకోనక్కరలేదు. పూర్వమీమాంస అంటే ఏమిటో స్థూలంగా తెలుసుకుందాం.

జైమిని రచించిన పూర్వమీమాంసాసూత్రము బృహద్గ్రంథం. దానిలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయంలోనూ ఎన్నో పాదాలున్నాయి. ఒక్కొక్క పాదానికి అధికరణలున్నాయి. మొత్తమ్మీద వెయ్యి అధికరణలున్నాయి. ఒక్కొక్క అధికరణమూ ఒక్కొక్క విషయమే ప్రస్తావిస్తుంది. అంటే మొత్తం మీద వెయ్యి విషయాల ప్రస్తావన ఉన్నదన్న మాట. ఈ అధికరణలలో కొన్ని వేదోక్తుల సూక్ష్మ పరిశీలన ఉంది. వేదాలు శాశ్వతం, ఆద్యంత రహితం, అవి దైవవిహిత శాసనాలు. మనం పాలితులం, ఆయన ప్రభువు. ఆయన ఎందరో అధికారులను నియమించాడు. సృష్టి పరిపాలన నంతా ఎందరో దేవతలు, అంటే - ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, యముడు, ఈశానుడు, కుబేరుడు, నిర్‌ఋతి వంటి వారు నిర్వహిస్తారు. పధ్నాలుగు భువనాలలోని జీవరాశులని పరిపాలించటానికి కొన్ని నిబంధనలు, నియమాలూ ఉండాలి వారికి. ఇవి వేదాలలో ఉన్నాయి. వేదాలను విశ్లేషిస్తే మనమెట్లా నడచుకోవాలో, నిబంధనలను దేవతలు ఎట్లా అమలుపరుస్తారో తెలుస్తుంది. మన నిత్యజీవితంలో, తగాదాలను, న్యాయాధీశులు పరిష్కరిస్తారు. దేశంలోని శాసనానుసారం విషయాన్ని న్యాయవాదులు విశదీకరిస్తే, న్యాయాధీశులు తీర్పు చెప్తారు. ఆ విధంగానే మానవమనుగడకు సంబంధించిన వేదాలలోని శాసనాల అంతరార్థాన్ని, భావాన్నీ జైమిని విశదీకరించాడు. ఏదైనా వాజ్యం న్యాయస్థానానికి వస్తే అటువంటి సమస్యనే అంతకు పూర్వమెట్లా పరిష్కరించారో, అంటే మరొక న్యాయస్థానంలో ఏ తీర్పు చెప్పారో, చూచుకుంటారు. న్యాయాధీశుడు తన తీర్పునిచ్చేముందు, ఆ దృష్టాంతాన్ని కూడ గుర్తుంచుకుంటాడు. వెయ్యి అధికరణలూ వెయ్యి సమస్యలను తీసుకొని పైకి కనబడే అర్థంతో పోనీక వాటి పూర్వాపరాలను కూలంకషంగా చర్చించి ఒక నిర్ణయానికి వస్తాయి. ఈ విశ్లేషణా పద్ధతిని మీమాంస అంటారు. ఆరంభంలో వేదంలోని ఒక విషయవాక్యాన్ని తీసుకుంటారు. ఆ తరువాత, ఆ వాక్యార్థమిదే నని సమస్యని లేవనెత్తుతారు. ఆ పిదప, ఆ అర్థానికి వ్యతిరేకంగా వాదించటం (పూర్వపక్షం) జరుగుతుంది. తరువాతి పని పూర్వ పక్షంలో చెప్పిన దానిని ఖండించటం, దీనిని ఉత్తరపక్షమంటారు. ఆఖరిదశలో పూర్వాపరాలను గ్రహించి, ఒక నిశ్చయానికి రావటం. దీనిని నిర్ణయమంటారు. ప్రతి విషయముపైన నిర్ణయాన్నీ, ప్రతి అధికరణంలోనూ చెప్తారు.

జైమిని సూత్రాలు క్లుప్తంగా ఉంటాయి. వాటిలోని భావాలు శబరస్వామి భాష్యంలో వివరింపబడ్డాయి. ''శబర'' అన్న పదం బోయ జాతికి కూడ వర్తిస్తుంది. రామాయణంలో శబరి ఈ జాతికి చెందిన వ్యక్తే. పరమశివుడు, అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించటానికి వేటకానివేషంలో శబరగా వచ్చాడు. అప్పుడే తన వార్తికాన్ని రచించాడని ఒక కథకూడ ఉంది.

పూర్వమీమాంసలో వెయ్యి అధికరణలుండటం చేత ''సహస్రాధికరణి'' అని కూడ అంటారు. వేదవచనాలకి కేవలం ప్రతి పదార్థాలపై ఆధారపడి తప్పుడు భావాన్ని గ్రహించకూండా అసలైన తాత్పర్యాన్ని వివరించటమే వీటి ఉద్దేశం. పూర్వమీమాంస కర్మకాండ (లేక, పూర్వకాండ) యొక్క అసలైన అర్థాన్ని వివరించినట్టే ఉత్తరమీమాంస జ్ఞానకాండ (లేక ఉత్తరకాండ) యొక్క అసలైన భావాన్ని వివరిస్తుంది.

ఉపనిషత్తులు పరమాత్మాది విషయాల గురించి చెప్తాయి. తన బ్రహ్మసూత్రాల ద్వారా వేదవ్యాస మహర్షి ఉపనిషదర్థములను వివరించాడు. జ్ఞానకాండకు చెందిన ఉత్తరమీమాంసపై వార్తాకాన్ని రచించిన వాడు సురేశ్వరాచార్యుడు - ఆదిశంకరుల శిష్యుడు. ఈయన తన పూర్వాశ్రమంలో, అంటే సన్న్యాసాశ్రమాన్ని స్వీకరింపక ముందు, మండన మిశ్రుడనే పూర్వమీమాంసకుడు. కర్మకాండయొక్క గొప్పదనాన్ని గట్టిగా సమర్థించేవాడు. ఆయనే కర్మనుండి జ్ఞానానికి మారి ఆదిశంకరుల శిష్యుడై బ్రహ్మసూత్రాలపై శంకరుల భాష్యానికి వార్తికమును రచించాడు.

ఉత్తరమీమాంస అంటే వేదాంతం. వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి సుప్రతిష్టం చేసిన ఆదిశంకరులు వేదాల ఉపాంగమైన పూర్వమీమాంసకి అభ్యంతరం చెప్పనేల?

ఈ ప్రశ్నకి సమాధానం చెప్పేముందు. ఏవిద్యకైనా (అంటే మీమాంసకైనా, శాస్త్రానికైనా) లక్ష్యమేమిటో పరీక్షించాలి. ఏ శాస్త్రమైనా చివరికి భగవద్దర్శనానికి దారి తీయాలి. మన శాస్త్రాలన్నీ అటువంటివే. వ్యాకరణానికీ, శబ్దశాస్త్రానికీ కూడ అదే లక్ష్యం. అందువల్లనే వాటిని పధ్నాలుగు విద్యలలో చేర్చారు. సరే, భగవంతుని గురించి పూర్వమీమాంస ఏమంటుంది? ఉత్తరమీమాంస ఏమంటుంది? ఈ రెండు మార్గాలలో భేదాలేమిటి? చూద్దాం.

భగవంతుడెవరు? ఆయన లక్షణాలేమిటి? ఆయనని ఏ విధంగా నిర్వచించాలి? ఆదిశంకరులవారు భాష్యం రచించిన వ్యాసుని బ్రహ్మసూత్రాలు, ఈశ్వరుని గురించి ప్రస్తావించాయి. అందులో ''కర్తా శాస్త్రార్థవత్త్వాత్‌'' అంటారు. అంటే, దృశ్యమానమైన ప్రపంచానికి కర్త, అంటే సృష్టికర్త, ఈశ్వరుడని అర్థం. వైదిక మతానికి ఆవలనున్న మతాలు కూడ భగవంతుని ''కర్త''గానే పేర్కొంటాయి. ఈశ్వరుడు సృష్టికర్తే కాడు - మన మంచి పనులకు చెడు పనులకు సంబంధించిన ఫలితాలను మనకే ఇచ్చే వాడు కూడాను.

మీమాంసకులు, అంటే పూర్వమీమాంసని అనుసరించి కర్మకాండకే ప్రాధాన్యమిచ్చేవారు. సృష్టికార్యంలో ఈశ్వరుని పాత్రగురించి ఏమీ చెప్పరు. వారికి అది అంత ప్రధానం కాదు. వారు ఈశ్వరుని ఫలదాతగా - అంటే మనం చేసే పనులకు ఫలితాలనిచ్చే వానిగా చూడరు.

వేదాలలోనూ, బ్రహ్మసూత్రాలలోను ఈశ్వరుని లక్షణాలుగా పేర్కొనబడినవి రెండు: దృశ్యమానమైన జగత్సృష్టికర్త, కర్మఫలదాత. ఈ రెంటిలో మొదటి లక్షణాన్ని సాంఖ్యులు, రెండవదానిని మీమాంసకులు వ్యతిరేకించారు. మీమాంసకుల దృష్టిలో ప్రతిపనికీ ఏదో ఒక ఫలితముంటుంది, దీనికీ ఈశ్వరుడికీ సంబంధం లేదు. అందువల్ల ఈశ్వరుడు ఫలదాతకాడు. వేదోక్తమైన కర్మలను సక్రమంగా నిర్వహించటం వల్ల పుణ్యం లభిస్తుంది. దుష్కార్యాలు దుష్ఫలితాలనే తప్పకుండా ఇస్తాయి - ఇదీ వారి నమ్మకం. అందువల్ల ఈశ్వరుని ప్రమేయం లేకుండానే మనం చేసే పనులు ఫలితాలను వాటంతటవే ఇస్తాయి. వేదాల పవిత్రతను అంగీకరించిన మతాలలో సాంఖ్యము - భగవంతుని సృష్టికర్తగా నిరాకరించింది. మీమాంస ఆయనని కర్మ ఫలదాతగా నిరాకరించింది *

మీమాంసా సిద్ధాంతాలు :

మీమాంసా సిద్ధాంతాల గురించి కొంత చెప్పుకుందాం. మీమాంసకులు ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనే విషయంపై చర్చించరు. మనం చేయవలసిందల్లా వేదాలలో చెప్పినట్టు నడచుకోవటమే. కార్యాచరణలో అంతర్భాగం తత్ఫలితం కూడా, అందువల్లనే ప్రతికార్యానికీ ప్రతిఫలం వెంటనే ఉంటుంది, అందువల్ల ఈశ్వరుని ప్రమేయం లేదు. మనతోటలో కాచిన కాయని కోసి మనకివ్వమంటూ వేరొక కూరగాయల వర్తకుడ్ని నియోగించుకోవలసిన అవసరమేమిటి? ఈశ్వరుని ప్రమేయం లేకుండా చేసిన పనికి ఈశ్వరునితో ముడిపెట్టటం దేనికి? మనం భూమిని సాగుచేస్తాం. పంటని పెంచుతాం. ఆ విధంగానే, వేదాలలో చెప్పినట్టు మనం నడచుకొంటే ఫలితాలు వాటంతట అవే వస్తాయి. ఈ ఫలితాలని రప్పించటానికి భగవంతుని అవసరం లేదు. భగవంతుడు జగత్తుని సృష్టించాడన్న సమస్యకి బదులుగా, ఆయన సృష్టి ఎందుకు చేయవలసి వచ్చిందని అడుగుతారు. జగత్తుకి మొదలూ, తుదీ అంటూ లేకుండా ఇప్పటి వలెనే ఎప్పుడూ సంస్థితమయ్యే ఉంది. జగత్తు ఏదో ఒక సమయంలో ఉదయించి ఉంటేనే కదా సృష్టికర్త ప్రసక్తి వస్తుంది? ప్రపంచమెప్పుడూ ఇప్పటి వలెనే ఉన్నదే. కాబట్టి దానిని ఎవరు సృష్టించారన్న విషయం ఆలోచించకు. ''నీ విధిని నీవు చెయ్యి, ఫలితాలు వాటంతటవే వస్తాయి''.

శాశ్వతాలైన వేదాలు చెప్పే విషయాలు మానవుని మేధకు అందవు. వేదాల ప్రకారం కార్యాచరణ వల్ల ఫలితాలు వస్తాయి.

సత్కార్యాలు సత్ఫలితాలను, దుష్కార్యాలు దుష్ఫలితాలనూ ఇస్తాయి. మనమా ఫలితాలను అనుభవిస్తూ కాలం వెళ్లబుచ్చుతాం. అందువల్ల వీటిని నియంత్రణ చేయటానికి భగవంతుని అవసరం లేదు. ఏ పనీ చేయకుండా, సోమరివలె ఉండకూడదు - అది పాపం, నరకానికి దారి తీస్తుంది. కర్మని చేయక పోవటమే పాపం. కర్మలు మూడు రకాలు - నిత్య, నైమిత్తిక, కామ్యములు.

ఎల్లవేళలా, ప్రతిరోజూ విధిగా చేయవలసిన కర్మలను నిత్యకర్మలంటారు. ప్రత్యేక సందర్భాలలో చేసే కర్మని నైమిత్తికమంటారు. ఉదాహరణ - గ్రహణమప్పుడు స్నానం చేసి పితృతర్పణం వదలటం. నిత్య, నైమిత్తిక కర్మలు అందరూ తప్పకుండా చెయ్యాలి. ''కామ్య'' కర్మలు ఏదో ఒక ఫలాన్ని అపేక్షించి చేసేవి. వర్షాలు కావాలంటే ''వరుణజపం'' చేస్తాం.

________

* సాంఖ్య వాదం ప్రకారం ఈశ్వరుడు సృష్టికర్తకాడు. ఈశ్వరుడు శుద్ధ చైతన్యం, జగత్తు భౌతిక పదార్థం కావటం వల్ల ఈశ్వరుడు కార్యాన్ని చేసి ఉండడు. దీనికి శంకరాచార్యులవారు, నిర్గుణమైన బ్రహ్మమే సగుణబ్రహ్మంగా కార్యకలాపం చేసి జగత్సృష్టి కావించాడన్నారు.

కుమారుని కొరకు పుత్రకామేష్టిని చేస్తాం. కామ్యకర్మలు చెయ్యాలని నిర్బంధమేమీ లేదు. ఇష్టముంటే చేయవచ్చు లేకపోతే మానవచ్చు.

నిత్యకర్మల లక్షణాలని కూడ మీమాంసకులు చెప్పారు. అవి రెండు రకాలు ''అకరణ ప్రత్యవాయ జనకం'', ''కరణ అభ్యుదయం''. మొదటి రకం కర్మలు చేయకపోతే కీడు వాటిల్లుతుంది, రెండవరకంవి అనుష్టిస్తే సత్ఫలితాలు కలుగుతాయి. మంచి గృహమూ, సంపదా, సత్సంతానం, ఖ్యాతి, జ్ఞానం - ఇవన్నీ అభ్యుదయానికి సంబంధించినవి. వేదాంతంలో ''నిశ్శ్రేయసమ్‌'' అన్న పదాన్ని తరచూ వాడుతారు. మోక్షం వల్ల, అంటే జన్మరాహిత్యం వల్ల, కలిగే నిత్యానందమిది - ఇంతకు మించిన ఆనందమే లేదు. కాని అభ్యుదయం ప్రస్తావించేది అంతకంటె తక్కువ ఆనందం గురించే. మీమాంస దీని గురించే చెప్తుంది. నిత్యానందం గురించి, అంటే నిశ్శ్రేయస్సు గురించి, మీమాంస ఏమీ చెప్పదు.

పని-లేక-కార్యం తగిన ఫలితాలనిస్తుంది. ఇదే కర్మ మార్గమంటే. సత్కార్యాన్ని చేస్తే సంతోషం కలుగుతుంది, చేయకపోతే వేదన సంభవిస్తుంది. నిత్యకర్మ నాచరించక పోతే వేదన తథ్యం.

సంధ్యావందనం ప్రతిరోజూ చేయవలసిన నిత్యకర్మ. చాలా మంది ''మాకు తీరికలేదు. మేము చేయలేము, సత్ఫలితాలను వదులుకుంటా''మంటారు. దీనికి మీమాంస సముచితమైన సమాధానాన్నిస్తుంది. ''కేవలం సత్ఫలితాలను పొందటానికే చేసే కర్మ కాదు సంధ్యావందనం. ఐచ్ఛికంగా చేసే కర్మకానే కాదు. ఆ కర్మని చేయకపోవటం - దుఃఖానికి దారి తీస్తుంది'' - అంటుంది మీమాంస. ఒక కార్యమాచరిస్తే సత్ఫలితాలు వస్తాయనటం సబబు, కాని ఒక కార్యాన్ని చేయకపోవటం వల్ల దుఃఖం కలుగు తుందనటంలో అర్థమేమిటి? సంధ్యావందనం చేయకపోవటం వల్ల చెడు ఫలితాలు వస్తాయి, చేయటం వల్ల ప్రత్యేకమైన సత్ఫలితాలు కలుగక పోవచ్చు. ఈ రకపు కర్మలని ''అకరణ ప్రత్యవాయ'' వర్గంలో చేరుస్తారు.

దేవాలయంలో దైవారాధన చేసినా, పేదలకు అన్నదానం చేసినా సత్ఫలితాలు వచ్చి తీరుతాయి. ఇటువంటివి ''కరణ అభ్యుదయ'' వర్గంలోకి వస్తాయి. ఇది న్యాయమే. ''అకరణ ప్రత్యవాయ'' సమర్థనీయమేనా? దీనిని నిరూపింపగలిగే దృష్టాంతమేమయినా ఉన్నదా లోకంలో? ఉన్నది. బిచ్చగాళ్లకు బిచ్చం వేస్తాం. ఏ సంస్థకో దానం చేస్తాం - అట్లా చేసేప్పుడు అవసరమున్న వారిని ఆదుకోవటం మనకి పుణ్యాన్నీ ఇస్తుందనీ, తద్వారా సంతోషం కలుగుతుందనీ అనుకుంటాం. ఒక్కొక్కసారి సహాయం చేయాలనిపించదు. అటువంటి సమయాలలో మనం పుణ్యాన్ని దాని వల్ల కలిగే ఆనందాన్నీ కూడా వదులుకుంటాం. అవసరమైన వారికి సహాయం చేయటం మంచిదే, ఇంకా ఎక్కువగా దానం చెయ్యక పోవటం గర్హనీయమని మాత్రం అనుకోము.

ఎవరిదగ్గరన్నా అయిదు వందల రూపాయలు అప్పుగా తీసుకొని, ఫలానారోజుకి తిరిగి ఇచ్చేస్తామని చెప్పామనుకోండి. అప్పుతీర్చవలసిన సమయం రాగానే ఆ వ్యక్తితో ''నాకు అయిదు వందల రూపాయలివ్వటం వల్ల నీకు వచ్చే పుణ్యాన్ని నీకు దక్కనీయాలని నేను ఆ పైకాన్ని నీకు తిరిగి ఇవ్వదలచుకోలేదు'' అంటే, అప్పిచ్చిన వాడు ఏ మాత్రమూ సంతోషించడు. అటువంటి పుణ్యం తనకి అవసరం లేదనీ, తన డబ్బు తనకి తిరిగి యివ్వమనీ అంటాడు. అవసరమైతే, వ్యవహారాన్ని కోర్టుకి తీసికొని వెళ్తాడు. తన డబ్బునే కాక, దానిపై వడ్డీని కూడ రాబట్టటానికి ప్రయత్నిస్తాడు. ''అకరణ ప్రత్యవాయం'' అన్నదానికి ఇది ఒక దృష్టాంతం - కార్యం చెయ్యకపోవటం వల్ల దుష్ఫలితాలు కలగటం. ఇక్కడ డబ్బు తిరిగి యివ్వకపోవటం. ఈ దృష్టాంతమే సంధ్యావందనానికి కూడ వర్తిస్తుంది. సంధ్యావందన మాచరిస్తే వచ్చే పుణ్యాన్ని వదులు కుంటాననే వాడు, పై ఉదాహరణలో, అప్పు తీసుకున్న వాని వంటివాడే!

ఈ అప్పు గురించిన వ్యవహారం దృష్టాంతంగా ఇస్తే చాలదేమో. ఇంకా కొన్ని ప్రశ్నలుదయిస్తాయి. వాటిని గమనిద్దాం. ఎవరు, ఎప్పుడు అప్పు తీసుకున్నారు? సంధ్యావందనానికి సంబంధించిన ఋణాన్ని ఎవరి వద్దనుండి పొందాము?

వేదాలలో తైత్తరీయ సంహిత (6-3) ఇట్లా చెప్తుంది: ''జన్మతః బ్రాహ్మణులకు మూడువిధాలైన ఋణాలుంటాయి - అవి - ఋషులకు, దేవతలకు, పితరులకు''. వేదాధ్యయనం వల్ల ఋషుల ఋణాన్ని తీర్చుకోవాలి. యజ్ఞాలు, పూజలు చేయటం వల్ల దేవతల ఋణాన్ని తీర్చుకోవాలి. తర్పణము శ్రాద్ధము జరపటం వల్ల పితృఋణం తీర్చుకోవాలి. మనం ఋణం తీసుకున్నామని గాని, ఈ విధంగా ఋణపడి యున్నామని గాని మనకి తెలియదు. మనకి తెలియని విషయాలని వేదాలు చెప్పుతాయి. ఈ ఋణాలకి కారణాలని కొంచెమాలోచిస్తే తెలుస్తుంది. విశ్వాసమున్న వారికి న్యాయంగా తోచే సమాధానం దొరుకుతుంది. ఇద్దరు సహోదరులున్నారను కుందాం. ఒకతను న్యాయమూర్తి, రెండవవాడు పురోహితుడు. అంటే వైదికవృత్తిని అనుసరించేవాడు. మొదటివానికి ప్రతిరోజూ కోర్టుకి వెళ్ళి, వాజ్యాలు విని, నిర్ణయాలు తీసుకోవటం విధి. అతను మొరాయించి ''నేనెందుకు కోర్టుకి వెళ్లాలి, నా సోదరుడు వెళ్లనప్పుడు'' అన్నాడనుకోండి. దానికి సమాధానం చాలా చిన్నదే ''ఆ ఉద్యోగం కోసం అర్థించావు, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చెయ్యటానికి ఒప్పుకున్నావు. అందువల్ల నీవు కోర్టుకి వెళ్లాలి. అది నీ వృత్తి. నీ సోదరుని వృత్తి వేరం''టాం. పూర్వజన్మల కర్మల ఫలితంగా మనం ఉన్నత స్థితిలో జీవించటానికి ఎన్నుకొన్నాం. దీనివల్ల ఈ జన్మలో కొన్ని విధులను నిర్వహించాల్సి వస్తుంది. ఈ విధంగా మనలని నియమించి నియమాలను నిర్దేశించిన అధికారి మనకు అదృశ్యుడు, కాని మన పనులకు సాక్షీభూతుడు. ఇది వేదాంతుల సిద్ధాంతం. మనకి లభించిన స్థితి తనంతటతానే ఫలితాలనిస్తుందంటారు మీమాంసకులు.

మన పూర్వకర్మలు మన జాతిని నిర్థారిస్తాయి. మన నడవడి కూడా తదనుసారంగానే ఉండాలి. అట్లాచేయక పోవటం వల్ల అసౌకర్యమే కాక, దుష్ఫలితాలు కూడ సంభవించవచ్చు. మనమే స్థితిలో జన్మించామో తదనుగుణంగా నడుచుకోవాలి. వేదాలలో విధింపబడిన ఆచారాలను, కర్మలను పాటించాలి. మొదటగా వేదాధ్యయనం చెయ్యాలి, తన విధులను తెలుసుకోవాలి బ్రాహ్మణుడు. కష్టంలో ఉన్నవారికి ఊరట కల్పించి వాళ్లు కూడ వారి వారి అర్హతానుసారం విధులను పాటించేట్టు చేయాలి. తెలుకలవాడు నూనెను తయారుచేసి నూనెనమ్మాలి. చెప్పులు కుట్టేవాడు చెప్పులను తయారు చెయ్యాలి, బ్రాహ్మణుడు తన ఆహార విషయంలో ఎంతో నిగ్రహం చూపాలి - అతడు దైవసాక్షాత్కారాన్ని పొందటానికి వీలుగా, దేహాన్నీ, మనస్సునీ ఆత్మనూ శుద్ధంగా ఉంచుకోవాలి. ఇతరులకు కూడ దైవచింతన కలిగేట్టు చెయ్యాలి. అందువల్లనే పూర్వం అన్ని వృత్తులవారికీ అన్ని వర్గాల వారికీ భూములను దానం చేసేవారు. వంశానుగతంగా చేపట్టిన వృత్తులను విడనాడితే కొంత అసమత తప్పదు. మొట్టమొదటిది - భూమిపోయి, ఆ వృత్తినే అవలంబించే వానికి దక్కుతుంది. ఈ రోజులలో ఆ భూమిపైన కూడ పన్నులున్నాయి. కాబట్టి పూర్వపు వృత్తిని వదులుకోవటం శాస్త్రానుసారం పాపమేకాక లోకవ్యవహారపరంగా కూడ నష్టమే. ఇటీవలి కాలం వరకూ తన కులవృత్తిని ఆచరించటం కొంత గౌరవప్రదం కూడా!

జన్మ వల్ల చేయవలసిన కర్మలను మనం చేయకపోవటం వల్ల సమాజం నానాటికీ దిగజారిపోవటం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారివారి విధులను నెరవేర్చకపోతే సామూహిక వసతులుండవు, దారిద్ర్యం తాండవిస్తుంది కూడా. ఇప్పటి పరిస్థితి అదే.

సంధ్యావందనం వంటి నిత్యకర్మలను చెయ్యకపోతే దుష్ఫలితాలు తప్పవు. ఆ కర్మలను చేస్తే జరిగే మంచి ఏమిటంటే ఆ దుష్ఫలితాలు లేకపోవటమే. సకాలంలో బాకీని తీర్చివేస్తే ఆ ఋణభారం తీరినట్టూ అవుతుంది, తీసుకున్న అప్పుని తిరిగి ఇచ్చిన వానిగా మంచి పేరూ వస్తుంది. ఈ మంచితనం వల్ల వచ్చే మంచిపేరే, వ్యాపారాన్ని వృద్ధి చేస్తుంది. ఆ విధంగానే నిత్యకర్మలను చేస్తూండటం వల్ల మనకి పాపం పెరగకుండా ఉంటుంది. మన శ్రేయస్సు కూడ వృద్ధి చెందుతుంది. అది రెండు విధాలమేలే!

''అకరణ ప్రత్యవాయ''మునూ ''కరణ అభ్యదయ''మునూ - రెంటినీ వేదాంతులు ఒప్పుకున్నారు. మనం కూడా వారినే అనుసరిద్దాం.

నిత్యకర్మలు తప్పకుండా చేయాలి. వేదోక్తమైన అగ్నిహోత్రాన్ని, శాస్త్రోకమైన ఔపాసననీ తప్పకుండా చేయాలి. జీవించి యున్నంతకాలమూ అగ్నిహోత్రం చేయాలని వేదాలు చెప్తాయి. ''దానిని చెయ్యాలి, చేస్తే చాలు''నంటారు మీమాంసకులు. అందువల్లనే వారికి సన్న్యాస ఆశ్రమం ఆమోదయోగ్యం కాదు. సన్న్యాస ఆశ్రమంలో అగ్నిహోత్రంగాని ఇతర కర్మలుగాని అవసరం లేదు. మీమాంసకులు కర్మలను చేయక పోవటాన్ని అశ్రద్ధగా పరిగణిస్తారు. కర్మలను విడచి సన్న్యాసం స్వీకరించటం ధర్మాన్ని విడిచినట్లే. వాళ్లు ''మనిషి వందసంవత్సరాలు తన విహిత కృత్యాలను చేస్తూ జీవించాలి'' అనే ఉపనిషద్వాక్యాన్ని నమ్ముతారు. (ఈశావాస్య - 2వ మంత్రం) తైత్తిరీయ బ్రాహ్మణం ప్రకారం. అగ్నిహోత్రాగ్ని మానడం వల్ల మహావీరుని హత్యచేసిన మహాపాతకం చుట్టుకొంటుంది. మీమాంస సిద్ధాంత ప్రకారం ''దుష్కార్యాలను చేయటం వల్ల పాపమంటు కున్నట్టే, నిత్యకర్మలను చేయకపోవటం వల్ల కూడ పాపం చుట్టుకుంటుంది. సన్న్యాసి ''కర్మభ్రష్టుడు'' - తన విధిని ఉపేక్షించిన వాడు. అందువల్లనే మీమాంసకులు సన్న్యాసిని చూడటమే పాపమనీ, చూస్తే పాపపరిహారం చేసుకోవాలనీ అనుకునే వారు. ''పాపిని చూచినా, అతనితో మాట్లాడినా, అతనిని తాకినా, అతని పంక్తిలో భోజనం చేసినా - ఇవన్నీ పాపాలే. ఆ విధంగానే సన్న్యాసులకి కూడ దూరంగా ఉండాలి''. మీమాంసకుడైన మండనమిశ్రుని వంటి వారి భావాలిట్లా ఉండేవి.

సన్న్యాసం, అనంతత్వం, మోక్షం, జ్ఞానం - వీటన్నిటి గురించి వేదాలలోని జ్ఞానకాండలోనే ప్రస్తావన ఉంది. వాటికి అధికార ప్రతిపత్తి వేదాలవల్లే కలిగింది. అటువంటప్పుడు వాటిని చులకనగా చూడటమెందుకు? మీమాంసకులేమంటారో చూద్దాం -

''ఉపనిషతులలో జ్ఞానమూ, పరబ్రహ్మమూ ప్రస్తావింప బడ్డాయి - నిజమే. కాని వేదమేమిటి? వేదం శబ్దము, వాక్కు. ఏ కారణం చేత అది ప్రవృత్తమైనది. మనకి తెలియని విషయాలను చెప్పటానికి. అదే శబ్ద ప్రమాణం. కంటితోగాని తర్కబుద్ధితోగాని గ్రహింపలేని వాటిని మనం గ్రహించేట్టు చేయటానికే. అనవసరమైన దానిని వర్ణించటం దాని ప్రయోజనం కాదు. అన్ని పదాలకు రెండు ముఖ్య ప్రయోజనాలున్నాయి. ఒకటి, ఏమి చెయ్యాలో చెప్పటం, రెండవది ఏమి చేయకూడదో చెప్పటం''.

''ప్రవృత్తిర్వా నివృత్తిర్వా నిత్యేన కృతకేన వా|

పుంసాం యేనోపదిశ్యేత తత్‌ శాస్త్రం అభిధీయతే''

అంటే, ఏ విషయం గురించైనా ప్రయోజనం లేకుండా పలికే పలుకులు వృథా - అవి కేవలం శబ్దాన్నే కలిగిస్తాయి. ఎవరైనా ''కాకి ఎగురుతుంది'' అంటే వినే వానికి దాని వల్ల కలిగే ప్రయోజనమేమిటి? ''కాకి నల్లగా ఉంటుంద''న్న వాక్యం ఏ ప్రయోజనాన్నీ చేకూర్చదు.

అట్లాకాక, ''రేపు రాత్రి ఇక్కడ ఒక ధార్మిక ప్రవచనముంటుంద''ని అంటే దానికొక ప్రయోజనముంది, ఒక సందేశముంది. ప్రజలు సమావేశానికి రావటానికి అదొక ఆహ్వానం, ప్రేరకం. అలాగే, రేపు ఒక దూరప్రదేశంలో ధార్మిక ప్రసంగం ఉందని అంటే, దానికీ ఏ ప్రయోజనం లేనట్టే - అంత దూరమవటం వల్ల వెళ్లటం కుదరదు కాబట్టి. అందువల్ల, నిర్దిష్టమైన ప్రయోజనాన్ని కలిగించని మాటలు వ్యర్థం - అటువంటి వాటిని పలుకరాదు. ఒక్కొక్కసారి అవి కొంత సమాచారాన్ని వ్యక్త పరుస్తాయేమో గాని ఆ సమాచారం వల్ల ఏ లాభమూ లేదు.

నోటిమాట మంచి పని చేయించేట్టుండాలి, లేదా, అసలు పనే చేయకుండేట్టుండాలి. వేదాలు అయిదు మహాపాతకాలని పేర్కొని వాటిని పరిహరించమని ఉద్బోధిస్తాయి. వీటికి ''నివృత్తి ప్రయోజన''ముంది. అంటే, చెయ్యకపోవటం వల్ల లాభం. పాపాన్ని చేయకుండా, దిగజారి పోకుండా ఉండటమే దీని వల్ల మేలు. ఈ రెండు ప్రయోజనాలూ లేని మాటలు కేవలం పుక్కిటిపురాణమే, వ్యర్థమే!

వేదాలలో ఒక భాగం మనం చేయవలసిన పనుల గురించీ, చేయదగని పనుల గురించీ చెప్తుంది. మరొక భాగంలో కొన్ని కథలూ, ఉపాఖ్యానాలూ ఉంటాయి. ఆ కథలకు ప్రత్యేకత ఏమీ లేకపోయినా, వైదిక సూత్రాలతో జోడింప బడి యుండటం వల్ల వాటికొక ప్రయోజనమూ, విశిష్టతా కలిగాయి. వ్యాపార ప్రకటనలను చూడండి కావాలంటే. ఒక సింహంతో కుస్తీపడుతున్న మనిషి బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ రహస్యమేమిటి? ఏమీ లేదు - ఆ ప్రకటనలో చెప్పబడిన టానిక్‌ని కోనేట్టు ప్రేరేపించటమే. వేదాలలో చెప్పబడిన కథలూ ఇంతే - కాని, అవి ఉత్తమమైన ప్రయోజనం కలవి. వేదోక్తమైన విధులను మనం చెయ్యటానికి ప్రోత్సాహకాలివి. కథ పాత్ర ''అర్థవాద''మవుతుంది. ఫలితాన్ని అపేక్షించేది. మందులకి సంబంధించిన వ్యాపార ప్రకటనలు ప్రసిద్ధులైన డాక్టర్ల సిఫార్సులతో ఎందుకుంటాయి? ఆ మందు ఇంకా ఎక్కువమంది కొంటారని. ఇటువంటి ప్రచారంలో అతిశయరూపంలో సత్యాన్ని చూపుతారు. అటువంటి అసత్యాన్ని ''గుణవాద'' మంటారు. ఇంకొకటి ఉంది. దానిని ''అనువాద'' మంటారు. తెలిసిన సత్యాలను పదే పదే చెప్పటం. నిప్పు కాలుస్తుందని తెలుసు, కాని దానినే పునరుక్తి చేయటం, అనువాద మవుతుంది. గుణార్థవాదంలో కల్పన దృష్టాంతంగా చెప్పి వైదిక సూత్రాలను ఆమోదించేట్టు చేస్తారు. ''మద్యపానం వద్దు'' అని వేదాలలో చెప్పబడింది. తాగుడు వల్ల ధ్వంసమై పోయిన మనిషి కథను చెప్పే అది అర్థవాద మవుతుంది. దాని ఉద్దేశం తాగుడు వల్ల ధ్వంసమై పోయిన మనిషి కథను చెప్తే అది అర్థవాద మవుతుంది. దాని ఉద్దేశం తాగుడు మాన్పించటం. ''తాగుడు మంచిది కాదు. అది మత్తుని కలిగిస్తుంది'' అనటం అనువాదం. సారాంశ##మేమంటే, ఈ కథలన్నీ అర్థవాద మన్నమాటే. వాటి ప్రయోజనమొకటే వైదిక సూత్రాలను మనమవలంబించేట్టు చేయటమే.

జ్ఞానకాండ ఉపదేశించే వాటిని ఖండించటానికి మీమాంసకులు ఇట్లా అంటారు. ''వేదం ఒక యజ్ఞాన్ని వర్ణిస్తుంది. అందులో బంగారాన్నేగాని వెండిని దక్షిణగా పెట్టకూడదని ఉంటుంది. తైత్తిరీయ సంహిత కూడ వెండిని దక్షిణగా పెట్టకూడదంటుంది. దీనిని నొక్కి చెప్పటానికి ఒక కథ కూడ చెప్తుంది. ఈ కథ వెండిని దక్షిణగా ఇవ్వటం వల్ల చెడు ఫలితాలని చెప్పి, వెండిని దక్షిణగా ఇవ్వకుండా చేస్తుంది. దీనిని ''నిషేద''మంటారు. చేయవలసిన దానిని ''విధి'' అంటారు. అటువంటి కథలకు ప్రత్యేకత ఏమీ లేకపోయినా, వాటికొక నిర్దుష్టమైన ప్రయోజనముంది''.

దీనినే ముఖ్యంగా తీసుకొని మీమాంసకులు ''జ్ఞానకాండ''కి అభ్యంతరాలు చెప్తారు. ''ఉపనిషత్తులు బ్రహ్మస్వరూపం గురించే చెప్తాయి - దానికి ఏ గుణమునూ ఆపాదించవు. భగవత్సాక్షాత్కారం ఒక అనుభవమే - ఆ స్థితిలో ఏ వ్యాపకమూలేదు. వేదం ఎప్పుడు, ఎట్లా ప్రమాణమవుతుంది? ఏదో ఒక సత్ఫలితమిచ్చి నప్పుడే ప్రమాణమవుతుంది. అందువల్ల ఉపనిషత్తు కేవలం అర్థవాదమే. దీని గురించైనా అది ఎట్లాగున్నదో వర్ణిస్తుంది. ఎరిగిన దాని గురించి ఇంకా తెలుసుకోవలసిందేమిటి? ఏమి చేయాలో తెలుసుకోనవసరం లేదా? ''బ్రహ్మముంది. ఆత్మే బ్రహ్మం'' అని అనటం వల్ల వేదాలు మన జ్ఞానానికి గాని మన శ్రేయస్సుకి గాని ఏ విధంగా దోహదం చేస్తాయి? అందువల్ల మనం యజ్ఞాల వంటి కర్మలు చేయాలి - వేదాల ఉద్దేశం కూడా మనచే ఈ కర్మలను చేయించటమే. వేదం (శబ్దం) ఉన్నదందుకే. సంస్థితమైన దాని గురించి తెలుసుకోవటానికి వేదపాదమక్కరలేదు. ఎప్పుడో ఒకప్పుడు అది తెలియక మానదు. అటువంటి సైద్ధాంతికమైన జ్ఞానం లేకపోయినా నష్టమేమీ లేదు. దృశ్యమైన జగత్తుని వర్ణించే వేదభాగం కేవలం అర్థవాదమే. ఈ కారణం వల్ల ఉపనిషత్తులు ప్రామాణికం కానేరవు. యజ్ఞాలను ఆచరించే వారికి ఔన్నత్యము కలిగించటమే వాటి ప్రయోజనం. కార్యోన్ముఖతే జీవి యొక్క తృష్ణ. అందువల్లనే వ్యక్తి కర్మలను ఇంకా చేయటానికి ప్రోత్సహింప బడుతాడు. కర్మని చేయకుండా ఉండటం తప్పు. వైదిక కర్మలను చేయవలసిన అవసరం లేని పరివ్రాజకుడవటం కూడ తప్పే. ఉపనిషత్తులు జీవుని బ్రహ్మంతో సమానం చేస్తాయి. దీనికి ప్రయోజనమిది : కర్మలను చేసే వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని శ్లాఘించటం. అతను ఇంకా కర్మలను చేసి, ఇతరులచే చేయించటానికి ప్రోత్సహించటం. ఎంతటి బలాఢ్యుడైనా, సింహంతో పోరాడలేనట్టు - జీవి బ్రహ్మత్వాన్ని అందుకోలేడు. ఉపనిషత్తులు అర్థవాదాలు. బ్రహ్మము, జ్ఞానము, మోక్షము ఈశ్వరుడు వంటి మాటల వల్ల మనకే ప్రయోజనమూ లేదు. కర్మే సర్వమూను'' ఇదీ మీమాంసకుల సిద్ధాంతం.

శంకరుని సమాధానం :

దీనికి శంకరుని సమాధానమేమిటి? శబ్దం (వేదం) కార్యోన్ముఖమే కానవసరం లేదు. శబ్దం (వేదం) యొక్క పవిత్రత ఒక విషయం గురించి చెప్పటంలోనే ఉన్నదని మీమాంసకుల నమ్మకం. అంటే, కార్యానికి ప్రతిఫలమే శబ్దం (వేదం) యొక్క ఉద్దేశం. అంతేకాని గమ్యం కేవలం కర్మకాదు - కర్మకూడా కర్మకోసం కాదు. ఏ కార్యాచరణమూ ఉండని స్థితే గమ్యమైతే, ఆ స్థితిని వర్ణించే జ్ఞానకాండమే ప్రమాణ మవ్వాలి. శబ్దం యొక్క ప్రయోజనం ఏదో ఒక ఫలితమే అవ్వాలిగాని కేవలం కర్మాచరణం కాదు. వేదాలు మద్యపానాన్ని విడనాడమంటాయి. దానికి పర్యవసానంగా చేయవలసిన పనియేమిటి? ఏమీ లేదు! అంటే శబ్దానికి ఫలితంతో నిమిత్తం లేదనా? మద్యపానం వల్ల కలిగే చెడు ఫలితాలను నివారించటమే దాని ప్రయోజనం. ఈ విధంగా, ఏమీ చేయక పోవటాన్ని అభావమంటారు. అన్ని నిషేధాల ఉద్దేశమూ అభావమే - ఏమీ చేయకుండా ఉండటం. మీమాసంకులు కూడ వేదం విధించే నిషిద్ధాలను ఆమోదిస్తారు. వారు కూడ అటువంటి పనులను చేయరు. కొన్ని నిషేధాలను వారు అంగీకరించినప్పుడు నిష్క్రియాత్మకమయి నట్టి బ్రహ్మానుభూతిని వారు ఎట్లా విమర్శించ గలరు? ఆత్మసాక్షాత్కారమే పరమోత్కృష్టమైన ఫలం - ఆ స్థితిలో ఏ విధమైన కార్య కలాపమూ ఉండదు. వేదశబ్దాలన్నీ అర్థవంతములు, కేవలం అర్థవాద మంటూ త్రోసి పుచ్చరాదు.

భగవద్గీతలో కృష్ణభగవానుడు ''సర్వం కర్మాఖిలం, పార్థ, జ్ఞానే పరిసమాప్యతే'' అంటాడు. అంటే, కర్మలు జ్ఞానానికే దారితీసి అక్కడ పరిసమాప్తమవుతాయి అని అర్థం. అన్ని పనులూ ఈశ్వరార్పితం కావాలి. సర్వకర్మలకు సిద్ది (గమ్యము) నైష్కర్మ్యము. అదే బ్రహ్మానందం. దానితో జనన - మరణ స్థితి అంతమవుతుంది. వేదాల పరమోపదేశమూ, లక్ష్యమూ కూడా ఇదే. కర్మకాండ అంతా జ్ఞానకాండకి దారి చూపాలి. అందులో లీనమవాలి. అప్పుడే దానికి సార్థకత.

''వేదంలో కర్మలకు సంబంధించిన ఆదేశాలు కర్మకాండలోనే ఉన్నాయి. వాటి వల్ల చిత్తశుద్ధి, సంయమనం కలుగుతాయి కాబట్టి. నైష్కర్మృసిద్ది అలవరినచో, సాధనమయిన వేదోక్త కర్మానుష్ఠానము అవసరంలేదు. ఇదే జ్ఞానకాండ యొక్క సందేశం. అయినా, కర్మకాండలోని విధులు మనస్సుని పరిశుద్ధపరచి ఈశ్వరుని వైపు మార్గం చూపుతాయి. ఈ కారణం వల్లనే అవి వేద సారభూతములైనాయి. కేవలం కర్మకి ఏ ప్రయోజనమూ లేదు. వేదాలు సన్న్యాసాశ్రమాన్ని శ్లాఘిస్తాయి - అది పరమాత్మ సాక్షాత్కారం తర్వాత నెలకొనే స్థితి. అంతే కాదు - అదే పరమాత్మకూడా. ఆ స్థితిని చేరుకోవటానికి మనం కృషి చేయాలి.''

కర్మకాండ దుష్కార్యములు చేయటం వల్ల దుష్ఫలితాలు వస్తాయని వాటిని వారిస్తుంది. అటువంటి కర్మలను చేయటం కొందరికి లాభసాటిగా, సుఖదాయకంగా ఉండవచ్చు. ఈ కారణం చేతనే కొందరు దుష్కార్యాలు చేస్తూఉంటారు. అటువంటి పనులను చేయని వాడు ఆ రకమైన లాభాన్నీ, సంతోషాన్నీ విడానాడుకుంటాడు. ఎందుచేత? పాపకార్యాలు మొదట సుఖాన్ని (ముఖ్యంగా, ఇంద్రియసుఖాన్ని) యిచ్చినా, చివరికి మనకి శాశ్వతానందానుభూతిని దక్కనీయవు. ఆ కారణం చేతనే పాపకర్మలను చేయవద్దని మనకి వేదాలు ద్బోధిస్తాయి. ఇవి ఈ లోకంలో సంపదనీ, పితృదేవలోకాల్లో సుఖాన్ని కలిగించినా ఈ సుఖాలు కూడ అనంతం కావు. పుణ్యం హరించుకు పోయిన తరువాత మళ్లీ భూలోకంలోకి రావలసిందే. ''క్షీణ పుణ్య మర్త్య లోకం విశంతి'' అంటుంది భగవద్గీత. నిత్యానంద స్థితి పరమాత్మలో లీనమై ఏ వ్యాపకమూ లేకుండానే ఉన్నప్పుడే సంభవము. తాత్కాలిక లాభాలనూ, సౌఖ్యాన్నీ యిచ్చే కర్మల పరిమితిని దాటటానికీ, ఉత్తమగతుల ప్రాప్తికీ ప్రయత్రించాలి. వేదోక్తమయిన కర్మలను ఆచరించాలి, నిజమే. కాని నిత్యానందాన్ని ఇవ్వలేని ఆ కర్మలను చేయటం వల్ల ప్రయోజన మేమిటి? ఈ కారణం చేత ఆ కర్మలను విడనాడ వచ్చా?

ఆ నిత్యానందమయ స్థితిని నేరుగా చేరుకోవచ్చా? ఇది సాధ్యం కాదు. జ్ఞానమును పొందుట సులభం కాదు. మొదట, మనస్సులోని అపవిత్రత క్షాళనం కావాలి. మనస్సులో రేగే భావాల వెల్లువలని అదుపులో పెట్టగలిగేది కర్మాచరణమే. అందువల్లనే ఆ కర్మలను యధావిధిగా తప్పకుండా చేయాలి. ఆ కర్మలను చేసేప్పుడు వాటి వల్ల సంప్రాప్తించే సుఖాలు, స్వర్గమూ వంటి వాటి నుండి మనస్సు మరల్చుకోవాలి. అంటే, కర్మలని చేస్తూనే వాటి ఫలితాలను స్వచ్ఛందంగా విడనాడు కోవాలి. ఈ కారణం వల్ల, మనస్సుకి సహజంగానే ఉండే అపవిత్రత పోతుంది. ఆ కర్మలవల్ల కలిగే ఫలితాలని ఆపేక్షించటం లేదనీ, ఆ కర్మలను ఈశ్వరార్పితంగా ఆచరిస్తున్నామనీ చిత్తశుద్ధితో భగవంతుడిని వేడుకొంటే మనకి మానసిక పవిత్రతనీ, స్వచ్ఛతనీ, అంటే చిత్తశుద్ధినీ, ఈశ్వరుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ తరువాత విచార మార్గమవలింబింప వచ్చు. అనంతరస్థితి ఏ కార్యమూ లేక - నిత్యానంద మయంగా ఉండటం.

వేదాంతము, మీమాంస :

వైదిక కర్మలను సమర్థించటంలో, అద్వైత సిద్ధాంతం కూడా మీమాంసని ఆమోదించటమే కాక, మీమాంసాకారులు తమవిగా భావించుకొనే ఆరు ప్రమాణాలను స్వప్రయోజనానికి ఉపయోగించుకుంటుంది.

ఆది శంకరుల అద్వైతమూ, రామానుజుల వారి విశిష్టాద్వైతమూ, మధ్వాచార్యులవారి ద్వైతమూ - నిజానికి వైదిక సిద్ధాంతాలే. అద్వైతం వలెనే మిగిలినిన రెండు సిద్ధాంతాలు కూడ వైదిక కర్మలను ఆచరించమనే చెప్తాయి. అంటే, కొంత వరకూ మీమాంసా సిద్ధాంతం మిగిలిన మూడు సిద్ధాంతాలకు ఆమోదయోగ్యమే.

మీమాంసకుల ఆరుప్రమాణాలనూ అద్వైతులంగీకరించినా, విశిష్టాద్వైతులు మూడింటినే ఆమోదిస్తారు. అవి - ప్రత్యక్షం, అనుమానం, శబ్దం (వేదం). ఈ ప్రమాణాలూ మీమాంసకులవే. ప్రమాణాల పాత్ర గురించి, ''న్యాయ''మనే ఉపాంగం గురించిన చర్చలో ఇంకొంచెం వివరిస్తాను.

పిండితార్థమిది - అద్వైతసిద్ధాంతాలని ప్రతిపాదించిన ముగ్గురు ఆచార్యులూ మీమాంసను పూర్తిగా నిరాకరించలేదు. మీమాంసను ఆధారంగా చేసుకునే ద్వైతానికీ విశిష్టాద్వైతానికీ ముఖ్య సాధనమైన భక్తిని చేరుకుంటాం. అద్వైతం అక్కడ నుంచి మరొక మెట్టుకి వెళ్లి జ్ఞానాన్ని చేరుస్తుంది.

కర్మనే ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు కాబట్టి మీమాంసని కర్మమార్గ మంటారు. ఈ కర్మమార్గమూ వేదాంతులు చెప్పే కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలు వేరు. 'కర్మ' అంతిమ దశఅనీ, ఆ పైన ఇంకేమీ లేదనీ వేదాంతమనదు. వేదాంతుల కర్మ మార్గం లేక కర్మయోగం ప్రకారం వైదిక కర్మలను ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పితంగా చేయాలి.

భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ మాటని నొక్కి చెప్పాడు ఈశ్వరుని పట్ల భక్తికీ, మీమాంసకులు నిర్విరామంగా నొక్కి చెప్పే కర్మకీ తేడా ఉన్నది. ఈ కర్మలు సంపదనీ సౌఖ్యాన్ని ఇవ్వటమే కాక, చిత్తశుద్ధిని కలిగించి భక్తి జ్ఞానాలకు మార్గం చూపుతాయి. అంటే మీమాంస లక్ష్యమనుకున్న దానిని, వేదాంతం ఒక సాధనగా మాత్రమే పరిగణిస్తుంది.

* * *

Acharyavaani - Vedamulu     Chapters   Last Page