Aathmabodha         Chapters          Last Page

9. ఉపోద్ఘాతము

దేశంలో అనాదికాలం నుంచి మానవ జీవితాన్ని సుఖవంతం చేయటానికి విజ్ఞానం కలిగిన వాళ్ళు మానవునిపై అనేక ప్రయోగాలు చేసినట్లు కనిపిస్తుంది. వేద సంప్రదాయమని, ఉపనిషద్మార్గమని, అనేక విధాలుగా మానవుల్ని ఆనందం పొందటానికి మార్గాలంటూ నడిపిస్తుండగా మానవ జీవన విధానాన్ని క్రమబద్ధం చేయటానికి షడ్దర్శనాలు వచ్చాయి. వాటి క్రమ వికాసాన్ని పరిశీలిస్తూ ఆత్మమార్గం వద్దకు వద్దాము. (1) గౌతమ మహర్షి తర్కంతో కట్టుబాట్లకు ప్రాధాన్యాన్ని ఇస్తూ ''న్యాయదర్శనం'' మానవునికి మార్గదర్శకం కావాలని చూస్తే (2) కణాదుడు తర్కాన్నే అనుసరిస్తూ కణానికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి, తత్త్వ చర్చచేసి, మానవుని జీవన విధానాన్ని మరొక మలుపు తిప్పటానికి ''వైశేషిక దర్శనం''లో ప్రయత్నం కొనసాగించాడు. (3) కపిల మహర్షి న్యాయదర్శనాన్ని విడవకుండా దానిలో ఉన్న మంచిని స్వీకరిస్తూనే, ఈ సృష్టి ఎట్లా వచ్చింది అనే ప్రశ్నను తీర్మానించటానికి అనేక విధాల తర్క వితర్కాలతో ప్రయత్నం కొనసాగిస్తూ ''సాంఖ్యదర్శనం'' రాశాడు. (4) పతంజలి మహర్షి యోగసాధన ద్వారా భగవంతుని చేరటానికి సాధన మార్గాన్ని స్వీకరించాడు. శరీర ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం కూడా కుదుటపడటానికి అనేక విధాల ప్రయత్నం కొనసాగించి జీవితాన్ని ఆచరణ యోగ్యం చేయాలని ''యోగదర్శనం'' అందించాడు. (5) జైమిని మహర్షి యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించి కర్మకాండను చర్చిస్తూ, తంతుకు అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి ''పూర్వ మీమాంసా దర్శనా''న్ని సంప్రదాయవాదులకు అనుకూలంగా చేకూర్చాడు. దానితో రాజులందరూ యజ్ఞాలు నెరవేర్చి పవిత్రులమయిపోయామని తృప్తిపడిపోవటానికి మార్గం డబ్బుతో ముడిపడిపోయి నడిచింది. దానితో మానవుని జీవన విధానం క్రతువులను నడిపేవారి చేతిలో కీలుబొమ్మ అయిపోయే స్థితి ఏర్పడి నడిచింది. (6) వ్యాస మహర్షి పైన ఉదాహరించిన ఐదు దర్శనాల్ని ఖండిస్తూ ''ఉత్తర మీమాంసా దర్శనాన్ని రచించాడు. దాన్నే ''బ్రహ్మసూత్రా''లని కూడా అంటారు. ఆయనకు పూర్వమున్న దర్శనాలన్నిటినీ ఖండించటానికి ఆయన ఉపనిషత్తులనే ప్రమాణంగా స్వీకరించాడు. తత్త్వ జ్ఞానాన్ని గ్రహించటానికి ఎదురవుతున్న అన్ని సందేహాల్ని బ్రహ్మసూత్రాల్లో సవివరంగా వివరిస్తూ తత్త్వవిమర్శకు తగిన సమాధానాన్ని అందించగలిగాడు.

నాలుగు వేదాల్లోను 1108 భాగాలున్నాయి. ప్రతి విభాగానికి చివర ఒక ఉపనిషత్తు ఉంది. ఆ విధంగా మానవులకు ఆత్మజ్ఞానమార్గ సంపన్నులైన శ్రేష్ఠులందరూ కలిసి 1108 ఉపనిషత్తులు మార్గదర్శకం అవుతాయని వాటిని మానవులకు అందించగా అందులో ప్రధానంగా 108 ఉపనిషత్తుల్ని ఆశ్రమ శ్రేష్ఠులు స్వీకరించి ఆశ్రమాల్లో శిష్యులకు ప్రబోధిస్తూ వచ్చారు. మళ్ళీ అందులో 10 ఉపనిషత్తుల్ని ప్రధానమైనవని భావించి శంకరులవారు వాటికి వ్యాఖ్యానం రాశారు.

శ్రీ కృష్ణ భగవానుడు షడ్దర్శనాల్లో ఉన్న (1) యోగదర్శనాన్ని, (2) బ్రహ్మసూత్రాల్ని తీసుకొంటూ (3) ఉపనిషత్తుల్ని కూడా కలిపి మానవ జీవన విధానం ఎట్లా ఉండాలో, మానవుడు తనను తాను ఎట్లా తీర్చుకోవాలో ప్రబోధించటానికి భగవద్గీతను బోధించాడు. ఆ విధమైన విజ్ఞానాన్ని మానవులకందించటానికి శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతను ఎవరి చేత రాయించాడు ? వ్యాసభగవానుని చేత. కాన ఆయనకు తెలియనివి ఏవీ లేవు కాన యోగాన్ని, సాంఖ్యాన్ని, ఉపనిషత్తుల్ని, బ్రహ్మసూత్రాల్ని ఉపయోగించుకొంటూ, ఆత్మమార్గం యొక్క ప్రాధాన్యాన్ని అందరూ తెలుసుకొనేటట్లు భగవద్గీతలో చేయగలిగాడు. అందువల్ల భగవద్గీత ఆశయం ఏమై నడచిందన్నమాట? ఆత్మమార్గం అనేది సాధనమార్గమై నిలిచి అందరినీ ఆత్మతో జీవించేటట్లు చేయాలనే ఉద్దేశంతోనే నడిచిందన్న మాట. మానవులందరూ అద్వైతాన్ని అర్థం చేసుకొని, జీవితాన్ని ఆచరణయోగ్యం చేసుకోవాలనే ఆశయంతోనే అది కొనసాగిందన్నమాట. దాన్ని ఆచరణయోగ్యంచేయాలనే శంకరాచార్యులవారు 581 శ్లోకాల్లో వివేక చూడామణిని రాశారు. దానిలో ఉన్న ఆచార వ్యవహారాలను, తంతునూ తగ్గిస్తూ ఆత్మమార్గం ఇంకా తేలిగ్గా అందరికీ అందుబాటులోకి రావటానికే 68 శ్లోకాల్లో, హోమియోపతి గుళికల్లా ఆయన ఆత్మబోధను అందించారు.

మానవులందరూ దుఃఖాల్లో కూరుకుపోయి, పాపాలతో భయపడుతూ జీవిస్తుండగా వాటినుండి విముక్తి కావించటానికే ఆత్మబోధ కావిస్తున్నాననే ధ్వని మాత్రంగా శంకరులవారు ఆత్మబోధలో ప్రథమ శ్లోకంలోనే బోధించారు. ఎవరికి జ్ఞానమార్గం కావాలి? ఎవరికి ఈ దుఃఖాలనుంచి, ఈ జీవితాన్నుంచి బంధవిముక్తి కావాలని ఉంటుందో వారికి ఆత్మమార్గం కావాలి. అటువంటి వాళ్ళకే జ్ఞానమార్గం సుఖశాంతుల్ని జీవించి ఉండగానే అందించి ఆనంద సముద్రంలో ఈదులాడేటట్లు చేస్తుంది.

మానవులందరూ మానసిక సముద్రంచేత చుట్టబడి ఉండగా, ప్రతి మానవుడు తన మానసిక జగత్తునందు తాను నిలబడుతున్నాడు. ఆ విధంగా ఉన్నటువంటి స్థితిలో సాధకుడు తన లక్ష్యసాధనకు సంబంధించిన మానసిక స్థితిలో తాను నిలవటానికి సంకల్పించి, దానికనుకూలంగా సాధన చేయటానికి పూనుకొంటూ ఉండాలి. సాధకునికి తాను బ్రహ్మం కావాలి అనే సంకల్పబలం ఎంత ఎక్కువగా ఉంటే అంత తొందరగా ఆతని మనస్సు ఆ శక్తిని పొందుతుంది. కారణమేమిటంటే, లక్ష్యానికి అనుకూలంగా మనస్సు కేంద్రీకరింపబడి, నియతమైన దిశకు సంకల్పాన్ని పంపుతుంది. ఆ విధంగా మనస్సు అత్యంత సూక్ష్మమైన శక్తికలిగి ఉంది. మానవుడు మనస్సును ఉపయోగించుకొని ఉన్నతుడు కావటం అనేది అతని చేతిలో పని.

ఈ దేహం వయస్సును బట్టి పరిణామం చెందుతూ ఉండటం వల్ల ఇంద్రియాలన్నీ మానవుని స్వాధీనం తప్పి, బాధలకు లోనయ్యేటట్లు ఈ శరీరం చేస్తుందని మానవులందరూ సహజంగా భావిస్తూ ఉండటం జరుగుతుంది. నిజానికి తప్పు దేహానిది కాదు. తప్పు మనస్సుది. మానవుడు మనస్సుకు ప్రతి దినం అందించిన లోకవాసనలనే ఆహారంవల్ల అది బలిసి, మానవుని శరీరాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకొని, మానవుణ్ణి దారి తప్పేటట్లు చేస్తుంది. ఆ విధంగా శరీరం, ఇంద్రియాలు, మనస్సు దారి తప్పకుండా ఉండటానికే ఆత్మమార్గాన్ని అందరూ తెలుసుకొనేటట్లు, ఆత్మజ్ఞానం బోధించే సంత్‌ పురుషులు ఆత్మబోధను ఆచరణ యోగ్యం చేస్తున్నారు. అది ధ్యానం ద్వారా ఎవరికి వారు సాధించుకోవలసిందే కాని అది ఇంకొకరి ద్వారా ఎవరూ సాధించటానికి వీలుకాదు. అందుకనే ఆత్మమార్గం సాధనమార్గమై ఆనందం అనుభవించటానికి అందరికీ వీలుకుదిరేటట్లు చేస్తుంది.

భగవంతుని యొక్క దివ్యమైన జన్మను, కర్మను ఎవడైతే యథార్థంగా తెలుసుకొంటాడో వాడు మరణానంతరం మళ్ళీ జన్మించకుండా నన్నే పొందుతాడు అంటే నాలో కలిసిపోతాడు అని భగవద్గీతలో (4-9) శ్రీకృష్ణుడు బోధించాడు. అంటే ఆత్మ అనే భగవత్స్వరూపాన్ని ఎవడైతే సాధన ద్వారా తెలుసుకొంటాడో వాడు భగవదైక్యాన్ని పొందటానికి సాధ్యమవుతుందని శ్రీకృష్ణుడు ఇక్కడ బోధించాడు. కావున కనీసం చివరి గడియల్లోనైనా గురుజ్ఞానంతో ఆత్మతో నిలిచిననాడు కూడా మానవుడు మళ్ళీ జన్మించడని సంత్‌ పురుషులైన గురుమహారాజ్‌జీగారు ఎల్లవేళలా ప్రబోధిస్తుంటారు.

మానవుడు బ్రతికుండగానే ప్రతినిత్యం ఆనందం పొందేటట్లు ప్రతి మానవుణ్ణి చేయటమంటే ప్రతి మానవుడు భౌతికంగా స్వస్థత పొందటం అనేదేననిపిస్తుంది. వయస్సువల్ల, వ్యాధివల్ల, మరణభీతివల్ల ప్రతివాడు, ప్రతినిత్యం దుఃఖాన్ని అనుభవిస్తూ తలనొప్పి తెచ్చుకొంటున్నాడు. ఆ తలనొప్పి ఎట్లా తగ్గుతుంది అని ఆలోచించుకొనేటట్లు ఆత్మమార్గం సూచిస్తుంది. ఆత్మమార్గ సాధనలో ప్రతిరోజూ కొద్ది కొద్దిగా శక్తిని కూడగట్టుకొంటుంటే, మానవుడు తన బ్రతుకు తెరువుకోసం, తన జీవన విధానానికి బయటకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే కష్టాల్ని ఎదుర్కోవటానికి ఆ శక్తి ఉపకరిస్తుంది. అంతేకాకుండా ఆ విధంగా ఎదురవుతున్న కష్టం ఉత్పన్నం కాకుండా కూడా చూసుకోవటానికి అది అన్ని విధాలా సహకరిస్తుంది. అందువల్ల ప్రతివాళ్ళు ఆత్మను గురించి బాగా తెలుసుకొని ఆత్మతో జీవించాలి. బట్టలు వేసుకొంటున్నవాడు బట్టలే నేను అని అనుకోవటం లేదు కదా? పెన్నుతో రాసుకొంటున్నవాడు పెన్నే నేను అని అనుకోవటం లేదుకదా ? అట్లా రాయటానికి కావలసిన శక్తి దేహానికి వచ్చింది మనస్సుకున్న బుద్ధిజ్ఞానం వల్ల కదా? అట్లాగే ఆ మనస్సు వాటన్నిటినీ తెలుసుకోవటానికి కావలసిన శక్తిని లేదా దానికి కావలసిన ఆహారాన్ని ప్రతినిత్యం అందిస్తూ, ప్రతివాడు జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకోవాలి.

భారతదేశంలోని 90 కోట్ల ప్రజలు అనుభవిస్తున్న అశాంతికి మూలకారణం కుల, మత, జాతి, లింగ వివక్ష వల్ల ఉత్పన్నం కావిస్తున్న విభేదాల వల్లేనని, ఏ దృక్కోణం నుంచి చూసినవాళ్ళకైనా అర్థం అవుతుంది. దాన్ని నివారించటానికే ఆత్మమార్గం అన్ని విధాల సులభమార్గంగా, ఆమోదయోగ్యంగా, ఆచరణ యోగ్యంగా ఉపకరిస్తుంది. వేదాల్లో సృష్టి క్రమాన్ని బోధిస్తూ చెప్పిన 84 లక్షల జీవరాసుల సృష్టి ఒక్క భారతదేశంలోనే జరిగిందా ? మిగిలిన ప్రపంచం అంతా గొడ్డుపోయిందా? చాతుర్వర్ణ్యం నాచేతే సృష్టింపబడింది అని భగవంతుడు చెప్పాడు అంటే అది ఒక్క భారతదేశంలోనే అట్లా సృష్టించటం జరిగిందా? ఇతర దేశాల్లో అట్లా జరగలేదా? ఇక్కడే అంటే భారతదేశంలోనే అట్లా చాతుర్వర్ణ్యం ఉంది, ఇంకా ఎక్కడా లేదు అని మీరు ఎందుకు అంటున్నారు ? అదెక్కడ లేదు? అని ఎదురు ప్రశ్న వేసే వాళ్ళకు నేను చెప్పేది భారతదేశంలో తప్ప ఇంకా ఎక్కడా కూడా పుట్టుక చేత నువ్వు పాపివి, పుట్టుక చేత నేను పుణ్యం చేసిన వాణ్ణి అని చెప్పే దుష్టసంప్రదాయం అనేది మరెక్కడా కూడా లేదు. నీగ్రోలున్నారంటే ఆఫ్రికాలో భూమధ్యరేఖ వద్ద పుట్టటం వల్ల, ఆ వాతావరణానికి అనుకూలంగా వాళ్ళు నల్లవాళ్ళుగా జన్మించారు. వాళ్ళను యూరోపియన్లు, అమెరికన్లు బానిసలుగా కొని వాళ్లను డబ్బులేని వాళ్ళను చేసి, నీచజాతిగా తయారు చేశారు. ఆ విధంగా అక్కడ తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు అనే బేధభావం ఉద్భవించింది. అంతేకాని అక్కడ కులాల చేత పాపులుగా చూడబడటం అనేది అక్కడలేదు. అట్లాగే కేథలిక్కులు, ప్రొటెస్టాంటులు అని క్రిష్టియానిటీలో పాటిస్తున్నారు. అంటే అది శైవ, వైష్ణవాల్లాగా మతంలో ఉద్భవించిన దృష్టిభేదం వల్లేకాని అది కూడా కుల వ్యత్యాసం వల్ల వచ్చింది కాదు. మహమ్మదీయుల్లో షియాలు, సున్నీలు అని విభజనతో అక్కడ చూస్తున్నారు. అంటే అది కూడా మతసంప్రదాయంలో ఉత్పన్నమైన దృష్టిభేదమే కాని అది కూడా కులవ్యత్యాసం వల్ల సంభవించింది కాదు. కాన భారత జాతిలో పెంచి పోషింపబడిన కులవ్యత్యాసం, మతపరంగా, ఆధ్యాత్మిక చింతనలో ఆడవాళ్ళు అనర్హులుగా పరిగణింపబడటం మొదలైనవన్నీ భారతదేశంలో మానవులు సృష్టించిన కల్పితాలైన ఆచార వ్యవహారాలేకాని మరొకటి కాదు. అందరూ అన్నిటికీ అర్హులై ఉన్నారు. అందరూ ఆత్మ అనే భగవంతునితో కలిసి జీవించటానికి అన్ని విధాల అర్హులై జన్మిస్తున్నారు. కాన అందరూ ఆత్మజ్ఞానంతో, ఆనందాన్ని పొందటానికి ప్రతినిత్యం సాధనచేసి, శాంతి సౌఖ్యాల్ని అనుభవించటానికి ప్రయత్నం చేసి, నమ్మకంతో, విశ్వాసంతో, ఓర్పుతో, పట్టుదలతో సాధించండి అని కోరుతున్నాను.

అసలు ఆత్మ విచారణ విషయం వద్దకు వచ్చేటప్పటికి సంప్రదాయవాదుల్లోనే భేదాలున్నాయి. కర్మమార్గీయులు ఆత్మకు నిత్యత్వాన్ని అంగీకరిస్తూనే దానికి కర్తృత్వాన్ని అంటగడుతున్నారు. వాళ్ళు సూక్ష్మ శరీరానికి సంబంధించిన లక్షణాల్ని ఆత్మకు ఆరోపించటం వల్ల ఈ విధమైన అయోమయ స్థితి దాపురిస్తుంది. కర్మ మానవుణ్ణి బంధిస్తుంది అని జ్ఞాన మార్గీయులు చెపుతుంటే, కర్మలే జీవుని బంధ విముక్తికి సాధనాలని కర్మ మార్గీయులు చెపుతున్నారు. ''కర్మకాండ'' కూడా ఆత్మకంటే దేహం విలక్షణమని చెపుతున్నా, కర్మమార్గీయులు పరలోకాల్ని నిర్ణయించి కర్మాచరణను సాధనకు అనుకూలంగా చెపుతున్నారు. జ్ఞానమార్గీయులు దానిని సమ్మతించటంలేదు.

ఆత్మమార్గంలో ఉన్న ప్రధానమైన విషయం ఏమిటంటే మానవుడు తాను మరచిన విషయాన్ని జ్జాపకం చేసుకోవటమే. మానవుడు తాను ఆత్మే అయి ఉండి దేహం అనుకొంటున్నాడు. కాబట్టి ఆతడు ఆత్మానుభవాన్ని పొందటానికి అతనికి గురుజ్ఞానం అవసరం అవుతుంది. సాధకుడు గురుజ్ఞానంతో అజ్ఞానాన్ని తొలగించుకొంటూ జ్ఞానానుభవంతో నిలవటానికి ఆతనికి నిరంతరం సాధన అవసరం అవుతుంది. సామాన్య మానవుడు లాగానే సాధకుడు తన చుట్టూ ఉన్న అన్నిటినీ యావజ్జీవితమూ గట్టిగా చూస్తూ, అవేవీ వస్తురూపంగాలేవని ఎట్లా అనుకోవాలి అని సంశయించటం, బాధపడటం జరుగుతూ ఉంటుంది. దాన్ని అవగాహన చేసుకోవటానికే శంకరుల వారు స్వప్నాన్ని ఉదాహరించారు. మానవుడు రాత్రి స్వప్నాన్ని అనుభవించిన తర్వాత లేచి అదంతా మాయేనని, భ్రమేనని ఎట్లా అనుకొంటున్నాడో అట్లాగే సాధకుడు పగలు-జాగ్రదవస్థలో ఉంటూ - స్వప్న జగత్తులోనే ఉంటున్నానని తెలుసుకోవాలన్నారు. సాధకుడు సాధనలో నిమగ్నమైనప్పుడు జగత్తులేని స్థితిని ఆత్మతో అనుభవిస్తున్నాడు. కాన తాను లేచినది మొదలు నిద్రపోయేవరకు జీవించే జీవన విధానమంతా కూడా స్వప్నం వంటిదే అని సాధకుడు అనుకోవాలి అని గురువులు గట్టిగా హితవు చెప్పారు. అంటే సాధకుడు సాధన తర్వాత కూడా లోకంలో సాక్షిమాత్రంగా జీవించాలి. సాధకుడు తన శరీరం కాని, మనస్సు కాని, ఇంద్రియాలు కాని పరబ్రహ్మ జ్ఞానానికి వ్యతిక్రమంగా సంచరిస్తున్నప్పుడు అవి నేను కానని, అవి వాటి పూర్వ వాసనలను బట్టి సంచరిస్తున్నాయని, వాటితో నాకు ప్రమేయంలేదని హెచ్చరికలు చేసుకొంటూ, శుద్ధచైతన్యంగా జీవించటానికి, నేను బ్రహ్మాన్ని అని బ్రహ్మంగా నిలవటానికి సాధకునికి ప్రయత్నం నిరంతరం అవసరం అవుతుంది.

ఆ విధంగా సాధకుడు కాలాన్ని గురించి ఆలోచించినప్పుడు గాఢ నిద్రాస్థితిని వదిలేస్తే మిగిలిన కాలమంతా పురుష ప్రయత్నంతో సాధనచేసి శుద్ధచైతన్యంగా నిలవాల్సి వస్తుంది. దీనినే శంకరులవారు 1) వ్యావహారిక సత్యం, 2) ప్రాతిభాసిక సత్యం (లేనిది ఉన్నట్లుగా కనబడటం), 3) పారమార్థిక సత్యం అనే వాటిచేత వివరించారు. జాగ్రత్తనేది స్వప్నం వంటిదే అనే దానికి అనుకూలంగా మనస్సు నిలిచే వరకే సాధకుడు ప్రయత్నపూర్వకంగా సాధన చేయవలసి వస్తుందే కాని నిజానికి కాలమే ఆ పని చేస్తుంది. మానవులు దాన్ని గ్రహించలేకపోతున్నారు. బాల్యం అనేది ¸°వనం వచ్చేటప్పటికి ఆ బాల్యం అనేది లేకుండా కరిగిపోతుంది. అట్లాగే వృద్ధాప్యం వచ్చేటప్పటికి ఆ ¸°వనం అనేది లేకుండా కరిగిపోతుంది. ఆ విధంగా ఒక్కొక్కటి కాలంలో కరిగిపోతున్నాయి అని గ్రహిస్తూ సాధకుడు చుట్టూ ఉన్నదంతా స్వప్నం వంటిదేనని తలంచుచూ బ్రహ్మంగా జీవించాలి. ఉపనిషత్తులు కూడా ఇదే విధంగా మానవుని జాగ్రత్స్వప్న సుషుప్తులనే మూడూ కూడా స్వప్నమే అని వర్ణించాయి. కావున సాధకుడు బ్రహ్మ దృష్టిపెట్టుకొని ఆ దృష్టితో నామరూపాత్మకమైన ప్రపంచాన్ని కరిగిపోయేటట్లు చూడాలి.

సాధకునకు ఇక్కడ కావలసింది ఏమిటంటే తన దృష్టివిధానం ఎట్లా ఉండాలి అనే దాన్ని స్థిరం చేసుకోవటమే;అదే లక్ష్యాన్ని చేరుస్తుంది. శంకరులవారు ఆత్మానుభవం అంటే ఏ దుఃఖమూ, ఏ సుఖమూ లేని కేవల చైతన్యరూపుడను నేనే అనే దాన్ని అనుభవించటమే అన్నారు. దానివల్ల సాధకుడు కేవలం ఆ శుద్ధ చైతన్య స్వరూపమే ''అహం'' అని అనుకోవటంతో ఆ ఆత్మ అనేది మరెక్కడో నాకు పరోక్షంగాలేదు అని, అది నేనేనని అనుభవానికి తెచ్చుకొంటాడు. సాధకుడు తనను విడిచి బాహిరంగా దర్శించినవాడు - ప్రపంచం పరబ్రహ్మంవల్ల సృష్టింపబడింది కాన - ప్రపంచ లక్షణాలకు భిన్నంగా జ్ఞానస్వరూపంతో సర్వత్రా ఆత్మచైతన్యాన్ని చూడటం అలవర్చుకొంటాడు. సర్వత్రా ఉన్న ఆత్మచైతన్యం సాధకుని స్వరూపమే కాన ఆకాశంలాంటి ఒక అఖండ భావన ఆతని లోపలా వెలుపలా నిండి ఉన్నట్టు అనుభవానికి వస్తుంది. సాధకుడు ఈ విధమైన బ్రహ్మజ్ఞానంతో ప్రపంచాన్ని చూస్తూ ఉండటం వల్ల ప్రపంచం చెప్పకుండానే, దానంతట అదే క్రమేపీ కరిగిపోతుంది. దీన్నే శంకరులు బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఈ విధంగా సాధకుడు 1) గురుతంత్రంతో సాధనయందు 2) పురుషతంత్రంతో బాహిరంగాను బ్రహ్మంగా నిలిచి శాంతిని అనుభవించాలి.

సాధనలో నా మనస్సు నిలువదు అనే వారికి ఒక్క విషయానికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చి ఇక్కడ చెప్పదలచాను. పట్టుదలలేని వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నేను సాధిస్తాను, నాకు సాధించాలని ఉంది అని ఛాలెంజ్‌గా తీసుకొనే వారికే హితబోధ చేయదలచాను. టెంకాయిలో నీళ్ళు తాగాలంటే అంత తేలిగ్గా లభిస్తున్నాయా ? దానిపైన పీచు తొలగించాలి, దాని చిప్ప తొలగించాలి. కొబ్బరి తొలగించాలి, అవి అన్నీ ఆ విధంగా తొలగిన తర్వాతే కొబ్బరి నీరు లభిస్తుంది. కావున సాధన మొదట మొదట కష్టతరంగా కనిపిస్తున్నా క్రమేపీ తేలికై కొబ్బరి నీరు వంటి అమృతాన్ని ఆస్వాదించేటట్లు చేస్తుంది. కాన సాధకుడు సాధనకు మీనమేషాలు లెక్కిస్తూ వెనుకాడకుండా ముందుకు నడవాలి. ప్రతివాళ్ళు ప్రతిరోజు దాహమయితే నీరు తాగుతున్నారు. నీరు తాగేటప్పుడు చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తున్నా, ఏ ఆటంకాలు అడ్డు వస్తున్నా నీటిని తాగేస్తున్నారు. దాహం తీరుతుంది. అట్లాగే మూడు పూటలా ఆహారాన్ని స్వీకరిస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్నవన్నీ కనిపిస్తున్నా, వినిపిస్తున్నా, రకరకాల ఆటంకాలు ఎదురవుతున్నా ఆహారాన్ని ఆరగించేస్తున్నారు; ఆకలి తీరిపోతుంది, పుష్టికూడా చేకూరుతుంది. కావున వీటిని బాగా విచారణచేసి వివేకంతో ఆత్మజ్ఞాన సాధనలో ఎన్ని రకాల ఆటంకాలు ఉత్పన్నం అవుతున్నా, మనస్సు నిలవటం లేదనే అనిపిస్తున్నా గురుజ్ఞాన సాధనను మానకుండా, క్రమం తప్పకుండా, ప్రయత్న సాధన కొనసాగిస్తూ కార్యసాధకుడుగా నిలవటానికి సాధకుడు ప్రయత్న సాధన చేయాలి.

గృహాన్ని చీపురుతో పరిశుభ్రం చేస్తున్నప్పుడు కింద ఉన్న దుమ్ము పైకి లేస్తూ ఉంటుంది. దాన్ని చూసి ఊడవటం మానేయకూడదు. చిట్టచివరికి దుమ్మంతా పోయి, గృహం పరిశుభ్రం అవుతుంది. అదే రీతిగా మనస్సును దుస్సంస్కారాల నుంచి దూరం చేస్తున్నప్పుడు, మొదట,మొదట, మరింత దుస్సంస్కార ధూళి మనస్సులో చెలరేగుతుంది. ఇందులో ఎవ్వరూ ఆశ్చర్యపడవలసిన పనిలేదు. అంతమాత్రానికే ఎవ్వరూ మాకు చేతకాదని చేతులెత్తేయకూడదు. సాధకునికి కావలసిందే స్థిర నిశ్చయం. మనస్సు ఒక విలక్షణమైన పదార్థం. అది స్వయంగా అనాత్మ, జడము; కాని బంధమోక్షాలు దాని అధీనంలో ఉన్నాయి. కాబట్టి అది ఆత్మకూడా అవుతుంది. మనస్సు ఏ పదార్థాన్ని బాగా గ్రహిస్తుందో, స్వయంగా అది ఆ ఆకారమే ధరిస్తుంది. అందుకే దాన్ని స్వాధీనం చేసుకోవటానికి అభ్యాసవైరాగ్యాలు స్వీకరించమని పతంజలి సమాధి పాదం 12లో చెప్పాడు. ఎవరి మనస్సు వారికి మచ్చిక అవటానికి చిన్న చిట్కా చెపుతాను. ఆచరించి చూడండి. ఎదుటివారి సుఖదుఃఖాల్ని, పాపపుణ్యాల్ని స్నేహభావంతోనూ, కరుణతోనూ, సంతోషంతోనూ, ఉపేక్షాభావంతోనూ చూడటం నేర్చుకొంటే అప్పుడు చిత్తానికి ప్రసన్నత చేకూరుతుంది; చాంచల్యం నశిస్తుంది అని పతంజలి సమాధి పాదం 33లో వివరించాడు. ఆచరించి చూడండి మీకే తెలుస్తుంది. ఎప్పటి వరకు మనము మనస్సుకు బానిస అయి దాని వెంట నడుస్తూ ఉంటామో అప్పటి వరకూ దానికి చాంచల్యం ఉంటూనే ఉంటుంది. ఎప్పటినుంచి మనం మనస్సును ద్రష్టగా ఉంచటానికి ఇష్టపడతామో అప్పటినుంచీ అది చంచలత్వం కోల్పోతుంది. కావున సాధకుడు సాధనకు కొన్ని నియమాల్ని ప్రధానంగా పాటించాలని పెట్టుకొని నడిచినవాడు మనస్సు మిత్రుడుగా మారి ఎనలేని ఆనందాన్ని, శాంతిని అందిస్తుంది.

ఏ సాధకుడు అయినా సరే ఒక గురువును, ఒక జ్ఞానాన్ని నమ్మి సాధన చేస్తున్నప్పుడు ఇంకొక గురువునో, ఇంకొక ఉపాసననో నమ్మి అవి కూడా తగినవి అని అనుకొంటూ అటువంటి వాటిని కూడా అతని గురుజ్ఞానంతోపాటే కలిపి సాధన చేయకూడదు. అది ఏ మార్గంలో ఉన్నవారికైనా తగింది కాదు. సాధకుడు రెండు బోటుల మీద కాళ్ళు వేయకూడదు. తత్త్వాన్ని అభ్యాసం చేసేటప్పుడు చిత్త విక్షేపాన్ని దూరం చేసుకోవటానికి ''ఏకతత్త్వాన్నే'' అభ్యాసం చేయాలని పతంజలి సమాధి పాదం 32లో వివరించాడు. కాకపోతే ఆత్మజ్ఞానానికి సంబంధించినయి ఎక్కడెక్కడ ఏవేవి ఉంటే, వాటినన్నిటినీ ''తేనేటీగలాగా'' స్వీకరిస్తూ, అవి తన సాధనకు ఎట్లా ఉపకరిస్తాయో, తన సాధననే అవి కూడా మరొకలా ఎట్లా చెబుతున్నాయో వివేచనతో ఆలోచించుకొంటూ మనస్సును నిశ్చలం చేయటానికి అవి కూడా ఎట్లా తనకు పనికొస్తాయో తెలుసుకొంటూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. అంతేకాని అసలు ఇంకొక గ్రంథం చదువుకోకూడదు. ఇంకొక విషయం తెలుసుకోకూడదు అనేటటువంటి వారి మాటలు అజ్ఞానంతో కూడినవే అవుతాయి కాని మరొకటికాదు అని తెలుసుకొని, అట్లాటి తెలివి తక్కువ మాటల్ని ఎవరు చెప్పినా వింటూ విననట్లే వదిలేసి మీ ఆత్మజ్ఞానాన్ని మీరు పెంపొందించుకోవటానికి నిరంతరం ప్రయత్నం కొనసాగిస్తూ ఉండాలి.

ఏ రోజుకి ఆ రోజుని గడియారంలోకి నెట్టేయకండి. కాలగతిలోకి గత జీవితాన్ని కరిగిపోయేటట్లు చేస్తూ మీ దేహమనే భవనాన్ని, మీ దేహమనే దేవాలయాన్ని మీరే నిర్మించుకోవటానికి, మీరే శుభ్రం చేసుకోవటానికి ప్రయత్నం నిరంతరం కొనసాగించండి. ఎవరో చేసే పూజ, ఎవరో ఆశీర్వదించే ఆశీర్వచనం, ఎవరి నోటి వాక్యమో మిమ్మల్ని రక్షిస్తుందని నమ్మి దగాపడకండి. మీ స్వయంసాధనే మీకు రక్షణ అని నమ్మి, నిరంతరం ఆత్మతో అనుసంధానమై జీవిస్తూ శక్తిమంతులుకండి. దేహాన్ని ఊసరవిల్లి చేయకండి. ఆత్మజ్ఞానం మానవునికి కరదీపిక అయిననాడు పరబ్రహ్మ స్వరూపం విశ్వమందిరంగా అవుతుంది అనేది మరువకండి.

నానాజాతి సమితీ, కలగూరగంప, పంచకూళ్ళ కషాయం అయిన వీళ్ళందరూ ఆత్మజ్ఞానానికి అర్హులెట్లా అవుతారు. వేదవేదాంగాలు వంటి శాస్త్రజ్ఞానంలేని వాళ్ళు, ఏదో ఒక్కదాన్ని నమ్ముకొని నడిచేవాళ్ళు గురువులు ఎట్లా అవుతారు, యమ నియమాలు లేని వీళ్ళంతా శిష్యులు ఎట్లా అవుతారు అని నిందించే పాత చింతకాయ పచ్చడి వంటి మాటల్ని లెక్కచేయకుండా మీ సాధనను మీరు కొనసాగించండి. నిత్యమూ అధిక సంఖ్యలో శ్రేష్ఠులయిన వారికి కలిగే అనుభవాల్ని సిద్ధాంత బలంతో కొట్టేసే అధికారం ఎవరికీ ఉండకూడదను కొంటున్నాను. శాస్త్రం, సంస్కృతి, సంస్కారం, సంప్రదాయం వంటివాటిని హితబోధగా వినిపిస్తూ కరుడుగట్టిన ఆచార వ్యవహారాలతో సంఘాన్ని తిలకించే విధానంలో మార్పురావలసిన అవసరం ఎంతైనా ఉందనేది వివేకులైన వారందరికీ కనిపిస్తూ ఉంది. కావున వీటన్నిటినీ సాధకులు అవగాహన చేసుకొని, ఆనందం పొందే మార్గంలో ఉన్న విషయ విశ్లేషణను వివేచనతో ఆలోచించి, సాధనయందు సద్వినియోగం చేసుకోగలరని ఆశిస్తున్నాను. పర్వతాల్ని లోయల్నీ దాటి వస్తున్న నదీ జలాలకు శిలామాలిన్యం అంటకుండా ఉండాలంటే చిల్లగింజ ఎట్లా ఉపయోగపడుతుందో అట్లాగే ప్రపంచాన్ని, సంఘాన్ని, ఇంటినీ దాటివస్తున్న మీకు అజ్ఞానం అంటకుండా ఉండాలంటే గురుజ్ఞానం అట్లా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మట్టిలో మాణిక్యాలుంటాయి. బోగ్గుగనుల్లో రత్నాలు లభిస్తూ ఉంటాయి. చేతివేళ్ళన్నీ ఒకలా ఉండవు. ఒకే ఇంట్లో ఉన్నా అందరూ ఒకేలా ఉండరు. మీ ఆత్మ ప్రేరణను మీరు ఉపయోగించుకొని మీ ఆత్మానందం మీరు పొందటానికి, మీ మార్గం మీరు ఏర్పాటు చేసుకోండి. మీకు లభించిన అవకాశాన్ని జారవిడువకండి.

18-9-96 యల్‌. చంద్రమోహన్‌

హైదరాబాద్‌ ప్రేమీ.

Aathmabodha         Chapters          Last Page