Sri Ramacharitha    Chapters   

ద్వితీయ సోపానము

అయోధ్యకాండ

వామ అంకమున పర్వతరాజపుత్రి, శిరమున గంగ, లలాటమున బాలచంద్రుడు, గళమున గరళము, వక్షస్థలమున సర్పరాజు శోభించు భస్మవిభూషణుడు, సురవరుడు, సర్వాధిపుడు, సంహారకర్త, సర్వవ్యాపకుడు, శివుడు, శశిసన్నిభుడు, శ్రీ శంభుడు సర్వదా నన్ను రక్షించుగాత !

రాజ్యాభిషేకమునివ సుముఖత్వముకాని, వనవాస దుఃఖమువలన వ్యాకులతకాని పొందని రఘునందనుని ముభాంణజశ్రీ సదా నాకు మంజులమగు మంగళముల నిచ్చుగాత !

నీలకమల సమశ్యామల కోమలాంగుడు, వామభాగమున సీత విరాజిల్లువాడు, అమోఘబాణ, సుందర ధనుష్పాణి, రఘువంశనాథుడు అగు శ్రీరామునికి నమస్కరింతును.

శ్రీ గురుచరణ సరోజ రజముచే నా మనస్సును అద్దమును శభ్రపరచి-ధర్మ, అర్థ, కామ మోక్షములకు చతుర్విద పురుషార్థ సంప్రాప్తి కొరకు రఘువరుని విమల కీర్తిని వర్ణింతును.

రాముడు వివాహమాడి ఇంటికి ఏతెంచినప్పటినుండియు అయోధ్యయందు నిత్యనూతన మంగళములు ఆనందశుభాకాంక్షలు మారుమ్రోగుచున్నవి. చతుర్దశ భువనములు - సుకృతములనెడు మేఘములు ఆనందమనువర్షము కురిసిన మహాపర్వతములవలె ఉన్నవి. ఆ వర్షపునీరు - సంపదలు, బుద్ధి, సిద్ధి అను మహానదులై వెల్లివిరిసి, పొంగి పొరలి అయోధ్య అను సముద్రమున సంగమమగుచున్నది. అయోధ్యానగర స్త్రీలు, పురుషులు ఎల్లరు మేలుజాతి మణిగణములు. సకలవిధముల పావనులు. వెలలేనివారు. సుందరులు. ఆ నగరముయొక్క ఐశ్వర్యము కొంచెమైనను వర్ణింప శక్యముకాదు. విరించియొక్క శిల్పచాతుర్యమునకు ఇది అవధి అనిపించును.

రామచంద్రుని ముఖచంద్రుని కాంచి నగరనివాసు లెల్లరు సర్వవిధముల సుఖులై ఉన్నారు. తల్లులు, సకియలు దాసీలు తమ మనోరథములను లతలు ఫలించగా కనుగొని ఆనందించుచున్నారు. రాముని రూపమును, గుణమును, శీలమును, స్వభావమును కని విని, దశరథుడు కడు సంతసించుచున్నాడు. తాను జీవించిఉండగానే రాజు రామునికి యువరాజపదవిని ప్రసాదించవలెనని ఎల్లవారి హృదయాభిలాష. అందులకై అందరు మహేశ్వరుని ప్రార్థించుచు న్నారు.

ఒకానొకదినమున రఘుకులనాథుడు దశరథుడు తన సర్వసమాజముతోసహా సభయందు విరాజమానుడై ఉన్నాడు. సకల సుకృతమూర్తి అగు ఆ నరపాలుడు రాముని సత్కీర్తిని విని మిక్కిలి ఆనందించుచుండెను. నృపతులెల్లరు దశరథుని కృప అభిలషించుచుండిరి. లోకపాలకులు ఆతని ఇంగితమును గ్రహించి అతనికి ప్రీతి ఒనకూర్చుచున్నారు. త్రిభువనములలో త్రికాలములయందు దశరథునివంటి మహా భాగ్యవంతుడు లేడు. మంగళములకు మూలాధారుడగు శ్రీరాముని సుతునిగా పడసిన అతని అదృష్టమును ఎంత వర్ణించినను ఆ వర్ణన అల్పమే. దైవయోగమున దశరథుడు ఒక అద్దమును తనచేతిలో పట్టుకొనెను. దానిలో తన ముఖమును చూచుకొనెను. కిరీటమును సరిచేసికొనెను. ఆతని చెవులవద్ద కేశములు తెల్లపడిఉన్నవి !

''ఓయీ రాజా, యువరాజపదవిని రామునికిచ్చి, నీ జీవితమును, జన్మమును ఏల సాఫల్యము చేసికొనవోయీ?'' అని వృద్ధాప్యము తనకు ఉపదేశించుచున్నట్లు దశరథునికి అనిపించినది. హృదయమున ఈ విచారముతో నృపాలుడు ఒక శుభదినమున, శుభసమయమున, ప్రేమ పులకితశరీరుడై, ఆనందమగ్నమానసుడై గురుని సమీపించి ఇట్లు నివేదించెను :-

''మునినాయకా, నా విన్నపమును ఆలకింపుడు. రాముడు ఈనాడు అన్నివిధముల యోగ్యుడైనాడు. సేవకులు, సచిపులు, సకలపురవాసులు - మన శత్రువులు, మిత్రులు, ఉదాసీనులు - ఎల్లరు నావలెనే అతనిని ప్రేమింతురు. తమ ఆశీర్వాదమే శరీరమునుధరించి శోభించుచున్నట్లున్నది. ప్రభూ, పరివారమునకు, విప్రులకు తమ వలెనే అతడనిన ప్రేమ.

గురుచరణరజమును శిరమున ధరించువారు సకలవైభవములను తమవశమున ఉంచుకొందురు. ఇట్టి అనుభవము కలిగినవాడు నావంటివాడు ఇంకొకడు లేడు. తమ పావన పాదధూళిని పూజించియే నేను సర్వమును పొందితిని. ఇప్పుడు నా మనస్సున ఒక్క అభిలాష కలదు. ప్రభూ, అదియును తమ అనుగ్రహముననే సఫలమగును.''

ప్రభుని సహజప్రేమను వీక్షించి ముని ప్రసన్నుడై ''నరేశా, ఆజ్ఞ ఇమ్ము. రాజా, నీపేరు, నీకీర్తి నీ అభిమతములను ఈడేర్చును. రాజమణీ, నీ మనసుసకల అభిలాష - దాని ఫలితమును అనుగమించుచున్నది'' అనెను.

గురువు సర్వవిధముల ప్రసన్నుడయ్యెనని దశరథుడు గ్రహించి సంతోషమున మృదువగు వాణితో ''నాథా, రాముని యువరాజును చేయుడు. దయచేసి ఆజ్ఞ ఇచ్చి నచో తగు సన్నాహము కావింతును. నేను జీవించిఉండగానే ఈ ఆనందోత్సవము జరుగవలెను. ప్రజలందరు వీక్షించి నేత్రసాఫల్యము కాంతురు. ప్రభుని అనుగ్రహముచే శివుడు నా కోరికలన్నిటిని నెరవేర్చినాడు. ఈ అభిలాష ఒక్కటే నా మనసున మిగిలినది. తరువాత నా తనువు ఉండనిండు లేకపోనిండు. చింతలేదు. ఇక ఏవిధమగు పశ్చాత్తాపము నాకు ఉండరాదు'' అని పలికెను.

దశరథునియొక్క మధుర, మంగళకర, మోదమూలములగు వచనములను విని మునియొక్క మానసము మిక్కిలి సంతసించెను.

''రాజా, వినుము, ఎవనికి విముఖులగు నరులు దుఃఖింతురో, ఎవని భజన తప్ప హృదయబాధలను హరించుటకు ఇతరమార్గము లేదో - అట్టి స్వామి శ్రీరాముడు- పవిత్రప్రేమానుగామి. అతడు నీ తనయుడైనాడు. ఆలపింపకుము. శీఘ్రమే సర్వము సమకూర్చుము. రాముడు యువరాజగు ఆదినమే సుదినము. సుందరమగు మంగళదినము ఆ దినమే!'' అని వసిష్ఠుడు వచించెను.

మహీపతి ముదితుడయ్యెను. మందిరమునకు మరలెను. సేవకులను, సచివుడగు సుమంత్రుని పిలిపించెను. వారు వచ్చిరి. ''సదా విజయోస్తు-చిరంజీవ'' అని వచించిరి. శిరములువంచి నమస్కరించిరి. సుమంగళకరమగు వార్తలను భూపాలుడు వారికి తెలిపెను. ''పెద్దలగు మీ అందరికి సమ్మతమైనచో, సంతుష్టహృదయులై రాముని పట్టాభిషేకము కావించుడు'' అని కోరెను.

ప్రియకరమగు ఈ పలుకులను వినగానే తమ మనోరథమను చిన్నమొలకపై వాన కురిసినట్లు మంత్రులు సంతసించిరి. కరములు మోడ్చి, ''జగత్పతీ, నీవు కోటి సంవత్సరములు జీవింతువుగాక ! జగన్మంగళకరమగు సత్‌కార్యమును కావింపతలచి తివి. ప్రభూ. వేగమే కావింపుము. ఆలసింపవలదు'' అనిరి.

సచివుల సుభాషితములనువిని నరపాలుడు - పెరుగుచున్న తీగెకు ఒక చక్కని కొమ్మ సహాయము దొరకినట్లు ఆనందించెను.

''రామా రాజ్యాభిషేకమునకై మునిరాజు ఇచ్చు ఆజ్ఞలన్నిటిని వెంటనే ఆచరింపుడు'' అని అతడు నుడివెను.

మునిరాజు ఆనందమున మృదువచనములతో ఆనతి ఇచ్చెను. ''సకల సుతీర్థజలమును తెప్పించుము'' అనెను. ఓషధులు, కందమూలములు, పండ్లు, పూవులు, పత్రములు. ఇతర అనేక మంగళద్రవ్యముల వివరములను లెక్కించి నుడివెను. చామరములు, మృగచర్మములు, పలువిధములగు వస్త్రములు. అసంఖ్యాకములగు జాతుల ఉన్ని, పట్టుబట్టలు, మణులు ఇంకను అనేకవిధములగు కల్యాణప్రద పదార్థములను లోకమున భూపతుల అభిషేకమునకు యోగ్యమగువానిని అన్నిటిని తెప్పించుమని ఆనతి ఇచ్చెను. వేదవిదితములగు సర్వవిధానములను వసిష్ఠుడు వివరించి ఇట్లు నుడివెను - ''పురమునందు పలుచోట్ల వితానములను అలంకరింపుడు. ఫలసమేతములగు మామిడి, పోక, అరటిచెట్లను వీధులకు అన్నివైపులను నాటించుడు. నాలుగు వీధులు కలియుచోట్లను సుందరమగు మణులతో శృంగారింపుడు. వీధులన్నియు వెంటనే అలంకరింపవలెనను ఆజ్ఞ పంపుడు.

గణపతిని, గురువులను, కులదేవతలను పూజించుడు. భూసురులను సర్వవిధముల సేవింపుడు. ధ్వజములు, పతాకములు, తోరణములు, కలశములు, అశ్వములు, రథములు, గజములు అన్నియు అలంకరింపబడవలెను.''

మునివరుని వచనములను తలదాల్చి అందరు తమతమ పనులలో నిమగ్నులైరి. మునీశ్వరుడు ఆజ్ఞాపించినరీతిని ఎల్లరు తమవిధులను వేగమే నిర్వహించిరి. ముని ఆనతి ఇచ్చుటకుముందే ఆ పనులు నెరవేర్చినా అనునట్లు కనుపించింది. విప్రులను, సాధువులను, దేవతలను రాజు పూజించెను. రాముని హితము నుద్దేశించి మంగళకరములగు పనులను కావించెను.

రామరాజ్యాభిషేకమును గురించిన శుభవార్త వినగానే అయోధ్య అంతయు ఆనందగానములతో మారుమ్రోగెను. సీతారాముల శరీరములయందు శుభశకున సూచనలు కానవచ్చెను. మంగళకరములగువారి సుందరాంగములు ఆదర మొదలిడెను.

''ఈ శుభశకునములన్నియు భరతునిరాకను సూచించుచున్నవి. అతడు వెడలి పెక్కుదినము లయ్యెను. అతనిని చూడవలెనని మనస్సు ఉవ్విళ్లూరుచున్నది. ఈ శకునములు ప్రియమిత్రసమాగమును దృఢపరచుచున్నవి. భరతునివంటి ప్రియుడు జగమున మనకు ఎవడున్నాడు? శకునములఫలితము ఇంతే. మరిఒకటి లేదు'' అని సీతారాములు పులకితశరీరులై సప్రేమముగా ఒండొరులు భాషించుచుండిరి.

తాబేటికి తన గ్రుడ్లపైవలె రామునికి భరతునిగురించియే రాత్రింబవళ్ళు చింత. ఇదేసమయమున ఈ సువార్తనువిని రాణివాసమెల్లయు - వృద్ధిచెందుచున్న చంద్రుని చూచి సాగరమునందలి కెరటములు ఉప్పొంగునట్లు ఆనందించెను. ప్రప్రథమమున చని ఈ వార్తను రాణివాసమున తెలిసినవారు అనేకభూషణములను, వస్త్రములను బహుమతి పొందిరి. రాణుల శరీరములు ప్రేమచే పులకించెను. వారి మనస్సులు ప్రేమ మగ్నమయ్యెను. వారందరు మంగళకలశములను అలంకరింప మొదలిడిరి. ముత్యాల ముగ్గులుపెట్టి మణులతో వివిధరీతుల అతి రమణీయముగా, మనోహరముగా ముంగిళ్ళను సుమిత్ర అలంకరించెను. ఆనందమగ్నయైఉన్న రామమాత కౌసల్య విప్రులకు అనేకదానము లిచ్చెను. గ్రామదేవతలను, సురలను, నాగులను పూజించెను. రామునికి శుభము కలుగునట్లు వరము ప్రసాదించుడని వారిని ప్రార్థించెను. శుభము కలిగినపిదప మరికొన్ని కానుక లిత్తునని మ్రొక్కెను. కోకిలవాణులు, చంద్రముఖులు, మృగనయనలు అగు వనితలు మంగళగానమును చేయసాగిరి. రామరాజ్యాభిషేకవార్త విని స్త్రీలు, పురుషులు ఎల్లరు తమ హృదయములయందు ఆనందించిరి. విధి తమకు అనుకూలుడయ్యెనని వారు సుమంగళసామగ్రిని అలంకరింప మొదలిడిరి.

అంతట దశరథుడు వసిష్ఠుని పిలిపించెను. తగుబోధ చేయుటకు ఆ మునిని రాముని మందిరమునకు పంపెన. గురుని ఆగమనమును విని రఘునాథుడు ద్వారము వద్దకువచ్చి తలవంచి వసిష్ఠునిపాదములకు వందనము చేసెను. సాదరముగా అర్ఘ్యమిచ్చెను. మందిరములోనికి తోడ్కొని వెడలెను. షోడశోపచారములను కావించెను. సన్మానించెను. సీతాసహితుడై మునియొక్కచరణములను గ్రహించెను. కరకమలములను జోడించి, ''సేవకుని సదనమునకు స్వామి విచ్చేయుట మంగళములకు మూలము; అమంగళవినాశకరము. ఐనను నాథా, ప్రేమపూర్వకముగా దాసునే పనికై పిలిపించిఉండుట సమంజసము, నీతియును - కాని విశేషాదికారమును విడిచి స్వయముగా వేంచేసితిరి. ఈ దాసునిపై ప్రేమ చూపితిరి. నేడు ఈ గృహము పావనమయ్యెను. స్వామీ, ఆజ్ఞ దయచేయుడు. నిర్వర్తించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. స్వామి సేవయందే సేవకునికి మేలు కలదు'' అని రాముడు నుడివెను.

ప్రేమ మయమగు ఈ పలుకులను విని వసిష్ఠుడు రఘువరుని ప్రశంసించెను. ''రామా, నీవు సూర్యవంశావతంసుడవు. ఈరీతినే పలుకవా మరి!'' అని అనెను. రామునియొక్క గుణ, శీల, స్వభావములను కీర్తించి మునిరాజు పులకితుడయ్యెను.

''రాజ్యాభిషేకమునకు భూపతి సన్నాహము కావించినాడు. ఆయన నిన్ను యువరాజును చేయగోరుచున్నాడు. రామా, నీవు నేడు సంయములన్నిటిని పాటింపుము. వానిచే విధాత కుశలపూర్వకముగా ఈ కార్యమును సఫలము చేయును'' అని ముని రామునితో అనెను. ఇట్లు బోధించి గురువు రాజువద్దకు అరిగెను. రాముని హృదయమున విస్మయము కలిగెను.

''మేము అన్నదమ్ములను అందరము ఒకేసారి జన్మించితిమి. భుజించుట, శయనించుట, చిన్ననాటి ఆటలు, కర్ణవేధము, ఉపనయనము, వివాహము మొదలగు అన్నిఉత్సవములు అందరికి ఒకేపర్యాయము జరిగినది. మిగిలినవారిని విడిచి పెద్దవానికి రాజ్యాభిషేకము చేయుటమాత్రము ఈ విమలవంశమున ఒక అనుచితవిషయమైనది'' అని ఆతడు చింతించెను. ప్రభుని సుందర, ప్రేమపూర్వక పశ్చాత్తాపము, భక్తుల మనములయందలి కుటిలతను వారించుగాక !

ఇంతలో ప్రేమ, ఆనందమగ్నుడై లక్ష్మణుడు ఏతెంచెను. రఘుకుల కమల చంద్రుడగు రాముడు ప్రియవచనములను పలికి తమ్ముని సన్మానించెను.

నానావిధములగు మేళములు మ్రోగచున్నవి. అయోధ్యాపురముయొక్క ఆనందము వర్ణింపతరము కాదు. ప్రజలెల్లరు భరతుని రాకనుగురించి ప్రార్థనలు చేసిరి. వేగమే భరతుడువచ్చి - తాము నేత్రసాఫల్యముపొందినచో ఎంత బాగుండునని వారు తలచుచున్నారు. అంగళ్ళలో, వీధులలో, ఇండ్లలో, సందులలో, తిన్నెలపై పురుషులు, స్త్రీలు - ''విధాత మన అభిలాషను పూర్తిచేయు అ శుభలగ్నము ఇంకనూ ఎంతలో ఉన్నదో!'' అని తమలో తాము సంభాషించుకొనుచున్నారు.

''స్వర్ణసింహాసనమున సీతాసమేతుడై శ్రీరాముడు ఎన్నడు ఆసీనుడగును? మన కోర్కెలు ఎన్నడు ఫలించును'' అని అందరు ఒకరినొకరు ప్రశ్నించుచున్నారు. 'రేపు' అనునది ఎన్నడు ఏతెంచునా అని అయోధ్యయందు ఎల్లరు చింతించుచున్నారు.

కాని, దుష్టస్వభావులగు దేవతలు విఘ్నములు కలుగవలెనని పండుగలు జరుపుకొనుచున్నారు ! దొంగలకు వెన్నెల రుచింపనట్లు - వారికి అయోధ్యయందలి ఆనందము ఇంపుగా లేదు. దేవతలు శారదను ఆహ్వానించిరి. పదేపదే వినయమున వారు ఆమెకాళ్లు పట్టుకొనిరి. పలుమారులు ఆమెపాదములపై పడిరి.

''తల్లీ, మాకు ప్రాప్తించిన మహావిపత్తును వీక్షింపుము. రాజ్యమును త్యజించి రాముడు అడవులకు వెడలునట్లు, సురకార్యమెల్లయు సఫలమగునట్లు సహాయము కావించుము'' అని వారు ఆమెను సవినయముగ ప్రార్థించిరి.

సురల వినతినివిని శారద విచారించుచు నిలచి పశ్చాత్తాపము చెందెను. ''సరోజవనమునకు హేమంతరాత్రి నైతినే నేను!'' అని ఆమె చింతిల్లెను. ఆమె ఇట్లు విచారించుచున్నట్లు దేవతలు కనుగొనిరి.

''అమ్మా, దీనియందు నీకు దోషము ఏమాత్రము అంటదు. రఘునాథుడు విస్మయ, హర్ష రహితుడు. అతని ప్రభావము సర్వము నీవు ఎఱుగుదువు. కర్మవశులై సుఖదుఃఖములను జీవులు మాత్రమే అనుభవింతురు. దేవతలహితమునకై నీవు అయోధ్యకు వెడలుము'' అని వారు వేడిరి. మాటిమాటికి వారు ఆమె పాదములను పట్టుకొని ఆమెను సంకోచమున పడవైచిరి.

''దేవతలబుద్ధి ఇంతే ! నీచమైనది అది. వారి నివాసము ఉన్నతస్థానమున. చేష్టలు - నీచస్థానమున ! పరులఐశ్వర్యమును వారు చూడలేరు'' అని సరస్వతి తలపోసెను. జరుగనున్నదానినిగురించి ఆమె ఆలోచించెను.

''చతురులగు కవులు రామచరితమును వర్ణించుటకై నా కృపను వేడుదురు'' అని ఆమె తన హృదయమున సంతోషించుచు - దుస్సహము, దుఃఖదాయకము అగు ఒక గ్రహదశవలె దశరథుని పురమునకు వచ్చెను.

మంథర అను పేరుగల మందబుద్ధి ఒకతె కైకేయియొక్క దాసి. అపకీర్తికి దానిని నిలయము కావించి దానిబుద్ధిని మరల్చివైరి మరలినది సరస్వతి. నగరమంతయు అలంకరింపబడిఉండుట చూచినది మంథర. మనోహరమగు మంగళవాద్యములు, శుభాకాంక్షలు నగరమంతయు మారుమ్రోగుచున్నవి.

''ఈ ఉత్సవమేమి?'' అని అది వారిని వీరిని ప్రశ్నించినది. ''రాముని పట్టాభిషేకము!'' అని వారు, వీరు తెలిపిరి. దానిహృదయము భగ్గుమన్నది. ''ఈరాత్రికి రాత్రియే ఈ కార్యము భగ్నము చేయుట ఎట్లా?'' అని ఆ దుర్బుద్ధికలిగిన నీచజాతిది. విచారింపసాగెను.

కుటిలస్వభావముకల ఒక కొండజాతి వనిత తేనెపట్టును ఒకదానిని కనుగొని 'దానిని పడగొట్టుట ఎట్లా ?'' అని ఆలోచించినరీతిని మంథర చింతింప మొదలిడినది

భరతమాత అగు కై కేయివద్దకు ఏడుపుమొగముతో అది చనినది. కైకేయి నవ్వుచూ, 'అన్యమనస్కవై, విచారముగా ఉన్నావేమే మంథరా?' అని ప్రశ్నించినది. ప్రత్యుత్తరమీయక మంథర నిట్టూర్పులను విడిచినది. ఆడువారివలె అది కపటపు కన్నీరు కార్చినది. రాణి నవ్వి ''నీకు నోటితొందర ఎక్కువ. లక్ష్మణుడు ఏదో నీకు బుద్ధి చెప్పినాడనుకొందును'' అనినది. ఆ పాపి మంథర అంతకూ మారుమాటాడక నల్లత్రాచువలె నిట్టూర్పులు విడచుచున్నది.

''మాట్లాడవేమే ? రాముడు, మహీపాలుడు, లక్ష్మణుడు, భరత శత్రుఘ్నులు అందరూ కుశలమేనా ? అని భయపడుచు రాణి ప్రశ్నించినది. ఈ ప్రశ్నలను విని ఆ కుబ్జ మనస్సున మహాబాధ కలిగెను.

''అమ్మా, ఒకరు మాకు బుద్ధి ఎందుకు చెప్పవలెను ? ఎవరి అండ చూచుకొని నేను తొందరపడి మాటలాడగలను ? రామునికితప్ప ఇంకెవరికి నేడు కుశలము? ఆయనను రాజు యువరాజును చేయుచున్నాడు కదా ! విధి నేడు కౌసల్యకు అత్యంత అనుకూలుడు. దీనిని చూచుకొని ఆమె తనహృదయమున గర్వము అణచుకొన లేకున్నది. స్వయముగా నీవే వెడలి ఆ శోభను ఎందుకు తిలకింపరాదు ? దానినిచూచి నా మనస్సుమాత్రము కలవరపాటు చెందెను. నీ కొడుకు విదేశములలో ఉన్నాడాయె ! నీవేమో అమాయకురాలివి. 'నా నాథుడు నా వశముననే ఉన్నాడు!' అని అనుకొందువు. మెత్తని పాన్పులపైపడి నిద్రపోవుటయే నీకు అతిప్రియము. రాజుగారి కపటయుతమగు నేర్పు నీకు కనుపించుటయే లేదు''అని మంథర పలికెను.

మంథరయొక్క ప్రియవచనములను కైక విన్నది. దానియొక్క దుర్బుద్ధిని తెలిసికొన్నది. ''చాలు-నోరుమూయుము. ఇక ఎప్పుడైనను - కొంపలో తంపులు పెట్టు ఇట్టిమాటలు పలికితివో - నీ నాలుక పీకించివైతును సుమీ'' అని ఆమె నుడివెను.

''ఒంటికంటివారు, కుంటివారు, గూనివారు, కుటిలస్వభావులై ఉందురని ఎఱుగవలె. వారియందు స్త్రీలు మరింత ! దాసీలవిషయము చెప్పనక్కరయే లేదు.'' అని కైక చిరునవ్వు నవ్వెను.

''ప్రియభాషిణీ, మంథరా. నీకు తెలియచేయవలెననియే ఇట్లంటినే ! కలలో నైనను నీపై నాకు కోపము కలదటే ! నీమాటలు నిజమైనదినమే సుదినము మంగళదాయకమగు దినము.

జ్యేష్ఠుడు ప్రభువగుట, చిన్నవారు వాని సేవకులగుట దినకరవంశపు ఉత్తమఆచారము. అది రమ్యమైనదియును. నిజముగా రేపే రాముని రాజ్యాభిషేకమైనచో - నీకు ఇష్టమగుదానిని కోరుకొనుము ఇత్తును. రాముడు సహజముగనే తల్లులెల్లరిని కౌసల్యతో సమానముగనే ప్రేమించును నాయందు అతనికి విశేషమగు ప్రేమ. అతని ప్రేమను నేను పరీక్షించి తెలిసికొంటిని. విధాత కృపతో ఇంకొకజన్మ నాకు ఇచ్చుచో రాముడు నా పుత్రుడుగా, సీత నా కోడలుగా కావలెనని నా కోరిక. రాముడు ప్రాణములకంటె నాకు అధికప్రియుడే. రాముని పట్టాభిషేకమనిన ఎందుకే నీకీ క్షోభ? భరతుని పై ఒట్టు! కపటమువిడిచి నిజము చెప్పుము. సంతోషసమయమున ఈ విషాదమేలనే నీకు ? కారణము తెలుపుము'' అని ఆమె మంథరను అడిగినది.

''ఒక్కసారియే మాట్లాడినాను. నా ఆశలు అన్నియు తీరినవి. ఇక రెండవ నాలుకతో మరికొంత తెలుపుదును. నా దౌర్భాగ్యపుతల చెక్కలు కాను ! మంచిమాటలు చెప్పికూడా నిన్ను దుఃఖపెట్టినది. అమ్మా, అబద్ధమును నిజమని చెప్పువారు నీకు ప్రియులు. నా మాటలు నీకు చేదు. ఇక నేనుకూడా నీకు ముఖప్రీతిమాటలు పలుకుదును. లేనిచో రాత్రింబవళ్ళు నోరు మూసికొనియే ఉందును. బ్రహ్మ నన్ను కురూపిని చేసినాడు. పరులక్రింద పడవైచినాడు. చేసికొనినవారికి చేసికొనినంత ! ఎంత చేసికొంటిమో అంతేకదా ఫలితము ! ఎవడు రాజైననేమి? మాకేమి హాని ? ఈ దాసీపదవి విడిచి నేనేమి రాణినౌదునా ఇప్పుడు? నీ అహితము నేను చూడలేను. కనుకనే ఏదో వాగితిని. మా స్వభావమే ఇంత. తగులపెట్టతగినది. కాని అమ్మా, పెద్ద పొరపాటు చేసితిని, క్షమింపుము మహాదేవీ'' అని మంథర ప్రత్యుత్తరమిచ్చినది.

అస్థిరబుద్ధికలిగిన కైకేయి సురమాయావశురాలయ్యెను. కనుకనే ఆమె నిగూఢ, కపటయుతవచనములను వినెను. వైరిఅగు మంథరను - తన మేలుకోరు హితకారిణి అనుకొని నమ్మినది. పదేపదే కైక మంథరను సాదరముగా ప్రశ్నించుచున్నది. వేటాడు శబర స్త్రీ యొక్క పాటను విని ఆడులేడి మోహపరవశ##మైనట్లున్నది ఆమె స్థితి. భావిని అనుసరించియే బుద్ధియే మారిపోయినది. తన ఎత్తుగడ ఫలించెనని మంథర సంతసించినది.

''తల్లీ, నీవు అడుగుచుంటివి. కాని, మారు చెప్పుటకు నాకు భయము కలుగుచున్నది. ఇదివరకే నాకు పేరు పెట్టితివికదా - తుంటరిదానినని'' అని అది నుడివినది. అనేకవిధముల మాయమాటలతో అది రాణియొక్క విశ్వాసమును సంపాదించినది. తుదకు అయోధ్యకు పట్టిన ఏలినాటిశని అగు ఆ దాసి ఇట్లు వచింపసాగినది :-

''అమ్మా, రాణీ సీతారాములు నీకు మిక్కిలి ప్రియులంటివి. రామునికి నీవు ప్రీతిపాత్రురాలనంటివి. సరే. నిజమే. కాని అది ఏనాటిమాటో ! ఆదినములు గడచి పోయినవి. కాలము మారినప్పుడు మిత్రుడు శత్రుడగును. కమలకుల సంరక్షకుడే సూర్యుడు. కాని నీరు లేదనుకొనుము. ఆ సూర్యుడే కమలములను కాల్చి బూడిద చేయును. నీ సవతి కౌసల్య నిన్ను సమూలముగా పెకలించివేయవలెననుకొనుచున్నది. కనుక ఉపాయమును మంచి అడ్డు గట్టువేసి సంరక్షణ చేసికొనుము. 'రాజు నావళుడు కదా' అనుకొని నీవు నీ సౌభాగ్యమునుగురించి చింతించుటయేలేదు. అతని మనస్సు కలుషితమైనది-మాట మధురమైనది. నీ స్వభావమే మో సరళము.

రామునితల్లి బహుచతుర, గంభీరస్త్రీ అవకాశము చూచుకొని తన నాటకము ఆడినది. ఆమె సూచనపైననే రాజు భరతుని అతని తాతగారివద్దకు పంపివైచెను. కౌసల్యయొక్క ఉద్దేశ్యము దీనితో నీవు గ్రహించవచ్చును.

'నా సవతులందరు చక్కగా నాకు సేవచేయుచున్నారు. కాని భరతుని తల్లి మాత్రము భర్త అండచూచుకొని గర్వించిఉన్నది' అని కౌసల్య తలచుచున్నది. అందువలన ఆమెకు నీవు ప్రక్కలో ముల్లువలె ఉన్నావు. ఆమె కపటమున కడునిపుణురాలు. ఆమె మనసులో ఏమికలదో తెలిసికొనలేము. నీయందు రాజునకు విశేషమగు ప్రేమ. సవతిస్వభావమున కౌసల్య దానినిచూచి ఓర్వజాలదు. రాజును వశపరచుకొని రాముని పట్టాభిషేకమునకు లగ్నము నిశ్చయింపచేసినది. రాముని పట్టాభిషేకము సాంప్రదాయసిద్ధమైనదే. అందరికి ఇది ఆనందప్రదమే. నాకునూ పరమానందమే. కాని-భవిష్యత్తునుగురించి ఆలోచించినచో నాకు భయము కలుగుచున్నది. దీనిఫలితము ఆ కౌసల్యయే అనుభవించును.'' ఇట్లు మంథర కుటిలత్వమునుగురించిన కోటానుకోట్ల కథలను తారుమారుచేసి కైకేయికి చెప్పెను. కైకేయికి కౌసల్యయందు విరోధము వృద్ధిఅగునట్లు వందలాది సవతులకథలను అది అల్లి చెప్పినది.

భావివశమున కైక మనస్సున విశ్వాసము కలిగెను. ఆమెచే ఒట్టు పెట్టించుకొని తిరిగి మంథర కైకను ఇట్లు ప్రశ్నించెను :-

''ఇంకనూ తెలియనేలేదా నీకు ! ఏమిప్రశ్నలమ్మా ఇవి? తమకు ఏదిహితమో, ఏది కాదో పశువులుసహితము గుర్తింపగలవే ! పక్షముదినములనుండి ప్రయత్నములు జరుగుచున్నవి. నేటికి నాద్వారా నీకు ఆవిషయము తెలిసినది. నీ సేవచేయుటచే నాకు కూడు-గుడ్డ దొరకుచున్నవి. కనుక నిజము వచించుటయందు ఏ దోషమూలేదు నాకు. ఏ కొలది అసత్యమైనను నేను కల్పించి నిజమని నుడివినచో విధి నన్ను దండించి తీరును. రేపు రామునికి పట్టాభిషేకము జరిగినచో విధి నీ విపత్తిబీజమును నాటినా డన్నమాటే ! భామినీ, పాలలోపడిన ఈగవలె అయిపోవును నీ బ్రతుకు ! గీతగీచి ఈ మాట గట్టిగా చెప్పగలను. ఇక నీవు నీ సుతునితోసహా సేవచేయుచు ఉండదలచినచో ఇంట ఉండవచ్చును. ఈ ఇంట ఉండుటకు ఇంకొక ఉపాయముమాత్రము లేదు.

ఆనాడు వినతకు కద్రువ తెచ్చిపెట్టినదుఃఖమును నీకు కౌసల్య ప్రసాదించును. భరతుడు కారాగారమును సేవించుచుండును. లక్ష్మణుడు రామునికి సహాయకుడై ఉండును'' అని మంథర సమాధానమిచ్చెను. మంథర పలికిన కటువగు పలుకులను కైకయ రాజసుత వినినవెంటనే ఆమె భయపడెను. ఆమె శరీరమంతయు చెమటలు క్రమ్మెను. అరటిఆకువలె ఆమె కంపించసాగెను.

మంథర తన నాలుక కఱచుకొనెను. తిరిగి అది అనేక కపటపుకథలను చెప్పెను. ధైర్యము వహించుమని కైకకు బోధించెను. మంథర కైకేయికి ప్రియురాలయ్యెను. కైకకు విధి విపరీతమయ్యెను. కొంగను హంస అనుకొనినది ఆమె ! ఇట్లు దానిని పొగడ మొదలిడినది.

''మంథరా, నీవు చెప్పినది నిజమేనే ! వినవే, నా కుడికన్ను ప్రతిదినము అదరుచున్నదే ! రాత్రులందు పీడకలలు వచ్చుచున్నవే ! తెలివితక్కువచే నేను ఇంతవరకు నీకు చెప్పనేలేదు, సఖీ ! ఏమిచేయను ? నా స్వభావము కపటము లేనిదాయెను ! నావారెవరో కాని వారెవరోకూడా నాకు తెలియవు ! ఇంతవరకు నాకు తెలిసినంతవరకు ఎవ్వరికీ నేను కీడు చేయలేదు. ఐనను దైవము ఈ దుస్సహదుఃఖమును ఏల తెచ్చిపెట్టెనో ! ఏ పాపముచేసితిననియో తెలియదు సవతిని సేవించుచూ జీవితమంతయూ ఇక్కడ గడపుటకంటె నేను మా పుట్టింటికిపోయి అక్కడే జీవితము గడుపుదును. శత్రువుల ఆధీనమునఉండి బ్రతుకమని దైవము వ్రాసిపెట్టినపుడు బ్రతికి ఉండుట కంటె చచ్చుటమేలు'' అని ఇట్లు అనేకవిధములగు దీనవచనములను రాణి నుడివెను. వానిని విని గూనిది స్త్రీమాయను పన్నెను :-

''ఎందులకమ్మా - మనసున ఈ విచారము? అట్లు వచింతువేమమ్మా! నీ సుఖ, సౌభాగ్యములు ఇక దినదినము ద్విగుణీకృతము కానున్నవి. నీకు కీడు తలపెట్టిన వారికే ఆ కీడు తగులును. తల్లీ, ఈ దుర్వార్త వినినప్పటినుండియు నాకు పగలు ఆకలి లేదు. రాత్రి నిదురరాదు. జ్యోతిష్కులను అడిగితిని. వారు లెక్కలువేసి చెప్పిరి. ''భరతుడు రాజగును. ఇది నిజము'' అని-భామినీ, నీవు కావింతునన్నచో ఒక్క ఉపాయము వచింతును. రాజు నీవశుడై ఉన్నాడు. నీకు ఋణపడిఉన్నాడు కూడా'' అని మంథర వచించెను.

అంతట కైకేయి :- ''నీవు చెప్పినచో నూతిలోనైనను దూకుదునే, సుతుని, పతిని సహితము త్యజింతునే. నా ఘోరదుఃఖమునుచూచి నీవు ఇంత చెప్పినపుడు మంచిదానివే-నా మంచికై నీవు చెప్పినపని ఎందుకు చేయనే?'' అని నుడివెను.

ఆ గూనిది కైకేయిని బలిపశువుగా చేసివైచినది. కపటమను ఖడ్గమునకు తస హృదయమనురాతిపై పదునుపెట్టినది. దాపురించుచున్న ఆపదను కైకేయి గ్రహించ లేకపోయినది. బలిపశువు పచ్చగడ్డిని మేయును !

మంథరమాటలు వినుటకు మెత్తనివే. వానిఫలితముమాత్రము కఠోరము తేనెతోకలిసి విషము త్రాగించుటవంటివి. ఆ చెలికత్తె అడిగినది:-

''దేవీ ! ఎన్నడో ఒకకథ నాకు చెప్పినావు నీవు. గుర్తుఉన్నదా లేదా ? రాజు నీకు రెండువరములు ఇచ్చినాడనియు ''నేను కోరినప్పుడు వానిని ఇత్తువు లెమ్మ''ని నీవు ఆనాడు వానిని గ్రహించలేదనియు నుడివిఉంటివి. ఆ రెండింటిని ఇప్పుడు అడిగి మనశ్శాంతి పొందుము. నీ కుమారునికి రాజ్యమును రామునికి వనవాసమును ఇమ్మని కోరుకొనుము. నీ సవతియొక్క సంతోషమంతయు ఇక నీదే. రాజు రామునిపై ఒట్టు పెట్టుకొన్నప్పుడే ఈ వరములు కోరవలెసుమా ! అప్పుడు ఇక అతడు మాట తప్పడు. నేటిరేయిగడచినచో కార్యము భగ్నమగును. నా మాటలు నీ ప్రాణముకన్న అధిక ప్రియమైనవి'' అని.

పాతకి అగు మంథర తన దుర్మార్గపుపథకమును బాగుగా ప్రయోగించినది. ''అమ్మా, కోపగృహమునకు పొమ్ము. కడు జాగరూకతతో ప్రవర్తించవలె ! తొందరగా రాజును నమ్మవద్దు''అని అది హెచ్చరించెను.

గూనిదానిని రాణి తన ప్రాణప్రియనుగా ఎంచెను. దాని పెద్దబుద్ధిని పొగడి ''ప్రపంచము అంతటిలో నాకు నీవంటిహితులులేనేలేరే మంథరా, కొట్టుకొనిపోవుచున్న నన్ను ఆదుకొంటివికదే. ఆ విధాత నా మనోరథములను రేపు సఫలముచేసెనా మంథరా. నిన్ను నా కంటిపాపవలె కాపాడుకొందునే'' అని ఇట్లు కైకేయి అనేకవిధముల తన చెలిని కడు ఆదరించి కోపగృహమునకు చనెను.

విపత్తి బీజమైనది, సఖియ వర్షఋతువైనది. కైకయొక్క దుర్బుద్ధి ఆ బీజము నాటుభూమి అయ్యెను. ''కపటము-అను నీటిచే ఆ బీజమునుండి మొలక వెలువడెను. రెండునరములు ఆ అంకురమునకు రెండు ఆకులైనవి. పరిణామము దుఃఖమను ఫలము!

కోపమును ప్రదర్శించుటకు వలయుసామగ్రిని కైకేయి సమకూర్చుకొనెను. ఆమె చని నిదురించెను. ఆమె రాణియే. కాని తన దుర్బుద్ధిచే ఆమె వంచిపంబడినది.

నగరము, రాజమందిరము కోలాహలముతో నిండిఉన్నవి. ఈ కుతంత్రము ఎవ్వరికీ ఎంతమాత్రము తెలియదు. పురజనులెల్లరు స్త్రీలు, పురుషులు - ఆనందమున మహోత్సవమునకు అలంకరించుచున్నారు. ఒకడు రాజదర్బారులోనికి పోవుచున్నాడు. ఇంకొకడు బయటికి వచ్చుచున్నాడు. రాజద్వారమువద్ద తండోపదండములు జనులున్నారు. రాముని బాల్యమిత్రులు పట్టాభిషేకవార్త విని ఆనందించుచున్నారు. పదుగురుకలసి రామునివద్దకు ఏగుచున్నారు. వారిప్రేమను గుర్తింపు ప్రభువు వారిని ఆదరించుచున్నాడు. మృదువచనములతో కుశలప్రశ్నము చేయుచున్నాడు. ప్రియమిత్రుని ఆనతిపొంది, శ్రీరాముని గుణగణములను ప్రస్తుతించుకొనుచు ''లోకమున రఘువీరుని వంటి శీలవంతుడు స్నేహధర్మపరాయణుడు ఇంకొకడు ఎవ్వడున్నాడు?'' అని సంభాషించుకొనుచు వారు మరలిపోవుచున్నారు.

''మన కర్మలననుసరించి మనకు ఏ జన్మ ప్రాప్తించిననూ ఏ యోనులయందు మనము జన్మించినను సీతానాథుడు మనస్వామి అగునట్లును, మనము అతని సేవకులమగునట్లును బాంధవ్యమును భగవానుడు ప్రసాదించుగాక !'' అని నగరమునందలి అందరి అభిలాషయు, కాని కైకయొక్క హృదయముమాత్రము మండిపోవుచున్నది. దుస్సహవాసముచే నశించనివాడెవడు? నీచులబుద్ధిని అనుసరించునో నిలుచునా నేర్పు?

సంధ్యాసమయమున రాజు - సాక్షాత్తుగా ప్రేమయే తనువునుధరించి మూర్తీభవించిన విష్ణురతవద్దకు వెడలినట్లు ఆనందమున కైకేయి యొక్క మందిరమునకు చనియెను. కోపభవనము పేరు వినినంతనే రాజు అదరిపడెను. భయముచే ఆతని అడుగు మందుకు పడుటలేదు.

ఎవని బాహుబలముపై సురపతి ఆధారపడిఉన్నాడో, ఎవనికృపకై రాజలోకము నిరీక్షించుచుందురో - అట్టి దశరథుడు ఒక ఆడుదానికోపమునుగురించి విని భయపడుచున్నాడు! కాముని ప్రతాపమును, మహిమను కనుగొనుడు. తమ దేహములపై త్రిశూల, వజ్ర, ఖడ్గాది ఆయుధప్రహారములను సహించువారు సహితము రతిపతి యొక్క పుష్పబాణములకు గురియై గాయపడినారు !

భయపడుచు నరేశుడు ప్రియురాలిని సమీపించినాడు. ఆమెయొక్క స్థితినిచూచి అతనికి దారుణమగు దుఃఖము కలిగినది. కైకేయి నేలపై పడిఉన్నది. ఒక పాతముతుకబట్టను ఆమె కట్టిఉన్నది. ఆమె ఆభరణములన్నియు తీసి పారవేయబడిఉన్నవి.

రానున్న వైధవ్యమును సూచించుచున్నదో అనునట్లున్నది దుర్బుద్ధికల కైకయొక్క ఆ పాడువేషము. దశరథుడు కైకేయిని సమీపించి మృదువగు వాణితో ''ప్రాణప్రియా, ఏల ఈ కోపము?'' అని ప్రశ్నించెను. ''ఏల ఈ అలుక?'' అని చేతితో అతడు ఆమెను స్పృశించెను. అతనిచేతిని ఆమె నెట్టివైచెను. రోషపూరితయైన నాగిని క్రూరదృష్టిని ప్రసరించుచున్నట్లున్నది ఆమె. కోరికలు రెండునూ ఆ నాగిని యొక్క రెండు నాలుకలు. రెండువరములు రెండుకోరలు. కాటువేయుటకు మర్మస్థానమును కనుపెట్టుచున్నది ఆ నాగిని.

భావివశుడై నృపతి ఇదిఅంతయు కాముని క్రీడయందలి భాగమే అని తలచుచున్నాడు! మాటిమాటికి అతడు ఆమెను ''ఓ సుముఖీ, ఓ సులోచనీ, ఓ కోకిలవాణీ, ఓ గజగామినీ, నీ కోపకారణము నాకు తెలుపు''మని వేడుచున్నాడు.

''ప్రియురాలా, నీకు ఈ అనిష్టము కావించిన దెవడు? ఆ రెండుతలలవాడెవ్వడు? ఎవనిని కొనిపోవమన్నాడు యముడు? చెప్పుము. ఏ పేదవానినైనను ప్రభువును కావింపనా ? లేక ఏ రాజునైనను దేశమునుండి బహిష్కరింపనా ? నీ శత్రువు - ఏ దేవతఐనను సరే - వానిని సంహరింతును. ఈ మానవస్త్రీలన్ననో కీటక ప్రాయములు. నీకు తెలియునుకదా నా స్వభావము. నీ వదనచంద్రునికి చకోరము నా మానసము. నా సర్వస్వము - ప్రాణము, సుతులు, పరిజనములు, ప్రజలు, అన్నియు నీ వశము. భామినీ నేను ఏమాత్రమైనను కపటము పలుకుచున్నచో రామునిపై నూరు ఒట్లు! నవ్వుచూ నీ మనోరథమేదియో కోరుకొనుము. మనోహరమగు నీ శరీరమున భూషణములను తిరిగి అలంకరించుకొనుము. సమయాసమయములను యోచించుము. ప్రేయసీ, వేగమే ఈ పాడువేషమును తీసిపార వేయుము'' అని దశరథుడు కైకేయిని ప్రార్థించెను.

ఈ మాటలువిని, రామునిపై రాజు పెట్టినఒట్టును గుర్తించి మందబుద్ధి కల కైక నవ్వుచూ లేచెను. ఆభరణములను తిరిగి ధరింపసాగెను. కిరాతస్త్రీ ఒకతె లేడిని చూచి వలను సిద్ధము చేసినట్లున్నది ఆమె చర్య. ఈ చర్యలనుచూచి కైకేయి హృదయము మంచిదే-అని దశరథుడు తలచి, ప్రేమచే పులకితుడయ్యెను. మధురమగు వాణితో అతడు ''భామినీ, నీ కోరిక సఫలమయ్యెను కదా. నగరమున ప్రతిగృహము ఆనందోత్సవములు జరుపుకొనుచున్నవి. రేపే రాముని యువరాజుని కావించుచున్నాను. కమలాక్షీ, మంగళకరముగా అలంకరించుకొనుము'' అని నుడివెను. ఈ వచనములను వినగానే కైక యొక్క కఠోరహృదయము - చితికిన కురుపుమీద చేయివేసినట్లు మండిపోయెను. ఇట్టి మహాకష్టమునుకూడా ఆమె నవ్వుచు - దొంగవానిభార్య రహస్యము బయటపెట్టనిరీతిని - అణచుకొనెను ఈ కపటనైపుణ్యమును రాజు ఊహించనే లేదు. కుటిలకోటి శిరోమణి అగు గురువు-మంథర నేర్పినవిద్య అది !

దశరథుడు నీతిశాస్త్ర నిపుణుడే. కాని నారీచరిత్రము అగాధసముద్రము! తిరిగి కైకేయి తన కపటప్రేమను ప్రదర్శించినది. ముఖమును ప్రక్కకు త్రిప్పినది. దృష్టిని మరల్చినది. నవ్వుచు ''అడుగుము -అడుగుము అనుటయే కాని ప్రియుడా, నీవు ఇచ్చునది లేదు. నేను పుచ్చుకొనునదియు లేదు. రెండువరములను ఇత్తునంటివి. వానినిగురించికూడా నాకు అనుమానమే'' అని ఆమె అనినది.

దశరథుడు నవ్వి ''నీ ఉద్దేశ్యము నాకు ఇప్పుడు తెలిసినదిలే. అలుక నీకు అతిప్రియము. వరములు నావద్ద కుదువపెట్టి ఉంచితివి. తిరిగి వానిని నీవు అడుగనేలేదు. మఱపు నా స్వభావము. కనుక నాకును ఆవిషయము జ్ఞప్తియేలేదు. అసత్యవాది ననుదోషము నాకు అంటకట్టకుము. రెండువరములకుగాను నాలుగు కోరుకొనుము. ప్రాణము పోయినను సరే మాట పోరాదు. ఇది రఘుకులసాంప్రదాయము. అసత్యము వంటి పాపపుంజము లేదు. కోటి గురివెందగింజలైనను ఒక కొండకు సమమగునా? సకల ఉత్తమపుణ్యములకు సత్యమే మూలము. శ్రుతులు, పురాణములు ఇట్లని వచించును. మనువుసహితము ఇట్లే నుడివెను. అంతేకాక రామునిపై శపథము నా నోటి వెంట వచ్చినది. రఘురాముడు నా సుకృతములకు, నా ప్రేమకు అవధి'' అని పలికెను.

ఇట్లు ప్రమాణముచే రాజును బంధించి, దుర్బుద్ధి కలిగినకైక నవ్వినది. డేగను విడుచుటకు దాని కండ్ల గంతలు తీసివైచినట్లు !

నరేంద్రుని మనోరథము రమ్యమగు ఒక వనమై అందరి ఆనందము-సుందరమగు పక్షులసమూహమై ఉండగా కిరాతస్త్రీని పోలిన కైక - ములుకులవంటి తన పలుకులనబడు భయంకర డేగను ఆ పక్షులపై వదలతలచినది. ''ప్రాణప్రియుడా, వినుము. నా మనస్సునకు ఆనందప్రదమగు ఒకవరము-భరతునికి పట్టాభిషేకము. ఇక రెండవవరము. నాథా, దీనినికూడా చేతులు జోడించి వేడుచున్నాను. నా కోర్కెను సఫలము కావించుము. 'తాపసివేషమున-అత్యంత ఉదాసీనభావమున రాముడు పదునాలుగుసంవత్సరము వనమున నివసింపవలెను'' అని ఆమె కోరెను.

కైకేయి మృదువుగా నుడివిన ఈ వచనములను విని భూపాలునిహృదయమున- చంద్రకిరణస్పర్శచే చక్రవాకము కలతపడునట్లు శోకము కలిగెను. రాజు భయపడెను. ఏమియు మాట్లాడజాలకపోయెను. అడవియందు ఒక చిన్నపక్షిపై ఒకడేగ అకస్మాతుగా పడి తన్నుకొనిపోయినట్లున్నది ఆతనిస్థితి. పిడుగుపడిన తాడిచెట్టువలె అతని శరీరవర్ణము మారిపోయెను.

దశరథుడు తననెత్తిపై చేతులు పెటుకొన్నాడు. కన్నులు రెండు మూసికొన్నాడు. శోకమే తనువు ధరించి విలపించుచున్నదా అనునట్లు దుఃఖింపసాగినాడు.

''నా మనోరథమను కల్పతరువు పూవులు పూచినది. కాని, అది ఫలించుసమయమున కైక అను ఒక ఆడఏనుగు దానిని సమూలముగా పీకివైచి ధ్వంసము కావించినది. కైక అయోధ్యను నాశనముచేసివైచినది. విపత్తికి శాశ్వతమగు పునాది వేసినది.

ఎట్టిసమయమున ఎంతపని జరిగినది ! యోగసిద్ధి ఫలించుసమయమున అవిద్య ఆ యోగినే సర్వనాశనము చేయునట్లు స్త్రీని విశ్వసించి ఎంత భంగపడితిని నేను!'' అని ఆతడు తనలోతాను దుఃఖించుచుండెను. దుర్బుద్ధిపరురాలగు కైకేయి దశరథుని ఈ దురవస్థలో కనుగొని దురుద్దేశ్యముతో క్రుద్ధురాలయ్యెను.

''భరతుడు కుమారుడుకాడా ఏమి నీకు ? నన్ను డబ్బిచ్చి కొంటివా ? నా మాటలు వినగానే బాణము గ్రుచ్చుకొన్నట్లయినదే నీకు ? అట్లే ఐనచో-ఆలోచించియే మాటలాడలేకపోతివా ? ప్రత్యుత్తరమిమ్ము. అవునో, కాదో చెప్పుము. నీవు రఘువంశజుడవు. సత్యసంధుడవు. నీఅంతట నీవే వరము లిత్తునంటివి. సరే-ఇప్పుడు లేదనుము. సత్యమును వీడుము. జగమున అపకీర్తిపాలగుము. సత్యసంధుడనని గొప్పలు చెప్పుకొని వరము లిత్తునని అంటివి. ఏగుగ్గిళ్ళనో కావలెనని వరము కోరుదు ననుకొంటివి కాబోలును. శిబి, దధీచి, బలి - చెప్పినది చేసినారు. తనువును, ధనమును సహితము త్యజించి మాటను, ప్రతిజ్ఞను నిలబెట్టుకొన్నారు'' అని ఇట్లు కైకేయి అతి నిష్ఠురవచనములను పలికినది. పుండుమీద ఉప్పు చల్లినట్లున్నవి ఆమె పలుకులు.

ధర్మధురంధరుడగు దశరథుడు ధైర్యము వహించెను. కండ్లు తెరచెను. తలను మోదుకొనెను. దీర్ఘ నిశ్వాసము విడిచెను. ''ఇది నన్ను ఆయువుపట్టులో కొట్టినది!'' అనుకొనెను. మహాకోపముతో మండిపడుచున్న కైకేయి దశరథుని ఎదుట నిలచినది. రోషమే ఖడ్గరూపమున ఒరనుండి బయటికివచ్చి నిలచినచో అనునట్లున్నది ఆమె! ఖడ్గమునకు పిడికిలి మంథర దుర్బుద్ధి, నిష్ఠురత దానిపదును. 'గూనిది'అను సానపై అది పదును పెట్టబడినది. దశరథుడు ఆ ఖడ్గమును కనుగొనెను. ఆ ఖడ్గము చాలా పెద్దది. భయానకమైనది కఠోరమైనది.

''ఇది నిజముగా నా ప్రాణము తీయునా?'' అని అతడు అనుకొనెను. తన హృదయమును రాయిచేసికొని అతడు వినయమున కైకేయికి ప్రీతికరమగు వాణితో ఇట్లు నుడివెను. :-

''ప్రియురాలా, భీరురాలా, ప్రేమను, విశ్వాసమునువిడిచి ఇట్టి దుర్వచనములను ఎట్లు పలుకుచున్నావు,'' భరతుడు, రాముడు నాకు రెండుకన్నులు. శంకరుని సాక్షిగా సత్యము వచించుచున్నారు. రేపు ప్రాతఃకాలముననే నేను అవశ్యము దూతలను పంపెదను. వారివలన వార్తవినగానే భరతశత్రఘ్నులు ఇద్దరు వత్తురు. మంచిరోజు చూపించి అన్నిఏర్పాట్లు కావించి, భేరీమ్రోగించి, భరతుని రాజు చేతును. ఈవిషయము నొక్కి చెప్పుచున్నాను.

రామునికి రాజ్యలోభము లేదు. భరతునిపై అతనికి అతిప్రీతి. నేనే నా మనస్సున పెద్ద-చిన్న వయోభేదము విచారించి రాజనీతిని పాలించుచుంటిని. రామునిపై నూరుఒట్లు పెట్టుకొని నిష్కపటముగా చెప్పుచుంటిని. రామునితల్లి ఈవిషయమున నాకు ఎన్నడూ ఏమియు వచించిఉండలేదు. నిజమే. నిన్ను అడగకనే ప్రయత్నము లన్నియు కావించితిని. కనుకనే నా మనోరథములన్నియు భగ్నమైపోయినవి. రోషమును విడువుము. మంగళకరముగా అలంకరించుకొనుము. కొలదిదినములలోనే భరతుడు యువరాజు కాగలడు. నీవు కోరిన రెండవవరము అసమంజసమైనది. ఇది ఒక్కటే నాకు దుఃఖము కలిగించినది. దానితాపముచే నాహృదయము మండిపోవుచున్నది. ఇది రోషమా ? పరిహాసమా ! లేక వాస్తవమా? కోపముమాని రాముని అపరాధమేమియో తెలుపుము. రాముడు ఉత్తమ సాధుపురుషుడని నుడువుదురు. నీవు సహితము రాముని కొనియాడుచుంటివి ! అతడనిన నీకు ప్రేమకదా ; ఇప్పుడు నీ మాటలు విని నాకు సందేహము కలిగినది. రాముని స్వభావము అతని విరోధులకు కూడా అనుకూలమైనది. అట్టి రాముడు తల్లికే ప్రతికూలముగా ఎట్లు ప్రవర్తించును ?

ప్రియా, పరిహాసమును. రోషమును విడువుము. కన్నులార నేను భరతుని రాజ్యాభిషేకమును కనుగొనకలుగు వరమును వివేకమున విచారించి కోరుము. నీరు లేకయే చేప బ్రతుకవచ్చును. మణి లేకయే సర్పము దీనయై, దుఃఖమున జీవించవచ్చును. కాని, నా మనస్సున కపటమేమియులేక పలుకుచున్నాను. హృదయపూర్వకముగా తెలుపుచున్నాను. రాముడు లేనిదే నా జీవము లేదు. నీవు చతురవు. ప్రియురాలా, బాగుగా యోచింపుము. నా బ్రతుకే రామదర్శనముపై ఆధారపడినది.''

ఇట్లు దశరథుడు పలికిన మృదువచనములను విని దుర్బుద్ధికలిగిన కైక నిప్పులో నేయిపోసినట్లు మిక్కిలి మండిపండినది.

''కోటి ఉపాయములు నీవు ప్రయత్నించవచ్చును. చేయవచ్చును. కాని నీ మాయలు నావద్ద పనికిరావు. నేను కోరినవరము ఇమ్ము. లేనిచో 'ఇవ్వను' అనుము. అపకీర్తిని పొందుము. ఈ అత్యుక్తులు, వివాదములు నాకు నచ్చవు. రాముడు సాధుమూర్తి. నీవును అంతేకాక బుద్ధిమంతుడవునూ. రాముని తల్లియు మంచిదే. అందరిని గురించి నాకు తెలియును. కౌసల్య ఎట్టిమేలును నాకు చేయతలచినదో అట్టిలాభమునే ఆమెకు గుర్తు ఉండునట్టిదానిని నేను చెల్లింతును.

తెల్లవారగానే మునివేషము ధరించి రాముడు అడవులకు పోవనిచో - ఇదిగో రాజా, నా చావు నిక్కమని తెలిసికొనుము. నీకు అపయశము నిశ్చయమని గ్రహింపుము'' అని పలికి దుష్టురాలగు కైక లేచినిలచెను. రోషమను ఒక నదిపొంగి, పొరలు చున్నదో అనునట్లున్నది. ఆ నది పాపములనబడు పర్వతములయందు ఉదయించి, క్రోధమనబడు జలముచే నిండినది. చూడలేనంత భయానకమై ఉన్నది. రెండువరములు ఆ నదికి రెండుగట్లు, కైకయొక్క మొండిపట్టు ఆ నదీప్రవాహము, గూని మంథరయొక్క ప్రేరణవాక్కులు ఆ నదియందలి సుడిగుండములు. భూపాలుడను వృక్షమును వ్రేళ్ళతోసహా కూల్చివైచుచున్న విపత్తి అను సముద్రమువైపునకు ఆనది ప్రవహించుచున్నది.

''స్త్రీ రూపమున మృత్యువు నా తలపై నాట్యము చేయుచున్నది. ఇది అంతయు వాస్తవమే!'' అని దశరథుడు గ్రహించెను. అతడు కైకేయియొక్క కాళ్ళు పట్టుకొనెను. వినయమున ఆమెను కూర్చుండమని కోరెను. ''దినకరవంశమునకు నీవు గొడ్డలివి కాబోకుము. నా శిరమును కోరుకొనుము. ఇప్పుడే ఇత్తును. నన్ను రామవిరహముపాలుచేసి చంపకుము. ఎట్లయినను రాముని నిలుపుము. లేకున్నచో జీవితాంతము నీవు గుండెమంటతో చత్తువు'' అని అతడు అనెను.

జాడ్యము అసాధ్యమైనదని నృపతి గ్రహించెను. అత్యంత ఆర్తవచనములను ''హా రామా, రామా, హా రఘునాథా'' అని అరచుచు, తలను బాదుకొనుచు దశరథుడు నేలపై పడిపోయెను. ఆతడు వ్యాకులడయ్యెను. అతని శరీరమంతయుశిథిలమయ్యెను. కల్పతరువును ఒక ఆడఏనుగు పెకలించి పారవైచినది ! దశరథునికంఠము ఎండి పోయెను. అతని నోటినుండి మాట వచ్చుటలేదు. నీటివెలుపల చేపవలె అతడు కొట్టుకొనుచున్నాడు. పుండుమీద విషము చల్లినట్లు కైక మరల కఠోర, నిష్ఠుర వచనములను ఇట్లు పలుక మొదలిడెను. :-

''తుదకు ఈ రీతిని చేయదలచినవాడవు 'కోరుకొనుము-కోరుకొనుము' అని ఏల నన్ను అడిగితివి? పకపక నవ్వులు, మూతి విరుపులు - రెండును ఒక్కమారేనా? మహాదాత అనిపించుకొనవలెను ! పిసినిగొట్టుతనము విడువరాదు ! వీరుడై, శూరుడై ఉండవలె ! దెబ్బలుమాత్రము తగులరాదు ?

ప్రతినను విడనాడుము. లేనిచో ధైర్యము వహించుము. అంతేకాని అబలవలె ఏడ్పులు, బొబ్బలు వలదు. ''తనువు, స్త్రీ, పుత్రులు, గృహము, ధనము, ధరణి అన్నియు సత్యసంధునకు గడ్డిపోచవంటివి అని చెప్పబడినవి'' అని ఇట్లు కైక పలికిన మర్మభేదకరములగు వచనములను విని దశరథుడు ఇట్లు నుడివెను :-

''నీ ఇష్టము వచ్చినట్లు మాటలాడుము. నీదోషమేమియు లేదులే. నా కర్మయే పిశాచమై నిన్ను ఆవహించినది. అదియే ఇట్లు నీచే ప్రేలించుచున్నది. పొరపాటుననైనను భరతుడు రాజ్యమును కోరడు. విధివశమున నీ హృదయమున దుర్బుద్ధి ప్రవేశించినది. ఇదిఅంతయు నా పాపపరిణామమే. ఈ కానిసమయమున విధి విపరీతమయ్యెను. ఈ సుందర అయోధ్య తిరిగి సౌభాగ్యవంతము కాగలదు. సకల సుగుణధాముడగు రాముడు రాజ్యము పాలించును. అతని తమ్ములందరు అతనిని సేవింతురు. ముల్లోకములయందు రాముని మహిమ వ్యాపించును. నీ కళంకము, నా పశ్చాత్తాపము మనము గతించిన అనంతరముకూడా నశింపవు. నీకు ఇష్టమువచ్చినరీతిని కావించుము. నీ ముఖము నాకు చూపకుము. నా కండ్ల ఎదుట నిలువకుము. చేతులుజోడించి చెప్పుచున్నాను. నా ప్రాణము లున్నంతవరకు ఏమియు మాట్లాడకుము. ఓసీ దౌర్భాగ్యురాలా, 'పులిని మేపుటకు గోవును హత్య చేసితి''నని నీవు అంతమున విచారింతువే' దశరథుడు ఇట్లు విలపించి అనేకవిధముల కైకేయికి బోధించెను.

''ఎందులకే ఇట్లు సర్వనాశనము చేయుచున్నావు?'' అని అతడు పలుమారులు పలికి నేలపై పడిపోయెను. కపటమున నిపుణతకలిగిన కైక ఏమియు మాటలాడలేదు. స్మశానమున మౌనముగా కూర్చుండి ప్రేతమంత్రమును పఠించుచున్నదా-అనునట్లున్నది. ఆమె. దశరథుడు 'రామ-రామ' అని అదేపనిగా ఉచ్చరించుచున్నాడు. రెక్కలులేని పక్షివలె కలతచెందుచున్నాడు. ''ఇక తెల్లవారకున్నచో బాగుండును ! ఈ విషయము రామునికి ఎవ్వరూ చెప్పకఉన్నచో బాగుండును!'' అని తలపోయుచున్నాడు.

''రఘుకులగురూ, రవీ, ఉదయింపకుమయ్యా, అయోధ్యను కాంచి నీ హృదయము బాధపడునయ్యా,'' అని అతడు సూర్యభగవానుని ప్రార్థించినాడు. భూపాలుని యొక్క ప్రేమను, కైకయొక్క కాఠిన్యమును - ఈ రెండింటిని విధి చేతనైనంత వరకు సృష్టించినాడు !

దశరథుడు విలపించుచునే ఉన్నాడు. తెల్లవారినది, వీణా, వేణు, శంఖనాదములు రాజద్వారమువద్ద వినవచ్చినవి. వందిమాగధులు రాజుయొక్క బిరుదావళిని పఠించుచున్నారు. గాయకులు ఆతని గుణగణములను గానముచేయుచు వర్ణించుచున్నారు. అవి బాణములవలె నృపతికి తగులుచున్నవి. సహగమనము చేయనున్న స్త్రీకి ఆభరణములవలె ఈ సకల మంగళ అలంకారములు భూపతికి రుచించుటలేదు. రామదర్శనలాలసులై, ఉత్సాహపూరితులై ఉన్నందున ఎవ్వరికీ ఆరాత్రి నిద్రయే లేదు.

రాజద్వారమువద్ద మంత్రులు, సేవకులు గుమికూడిరి. సూర్యోదయమును కనుగొని వారు ''ఏమి విశేషమో ! నేడు అయోధ్యాపతి ఇంకనూ మేలుకొనలేదు! నిత్యము రాత్రి తుదిజామున మేల్కాంచువాడు! ఈనాడు అతి ఆశ్చర్యముగా ఉన్నది'' అని వారు అనుకొని ''సుమంత్రా, నీవువెడలి భూపతిని మేల్కొలుపుము. ఆయనయొక్క ఆజ్ఞలను స్వీకరించి మనపనులను నిర్వర్తింతము'' అని వారు సుమంత్రుని పంపిరి.

సుమంత్రుడు రాజమందిరమున ప్రవేశించెను. మందిరము భయానకముగా ఉన్నది. భయపడుచునే అతడు లోనికి ప్రవేశించెను. ఏదో పరుగెత్తుకొనివచ్చి తనను మ్రింగివేయనున్నట్లు అతనికి కానవచ్చెను. దానివైపు చూచినాడు. కాని అడుగుముందుకు పడదు విపత్తి, విషాదము అచ్చట కాపురము చేయుచున్నట్లున్నది. అతడు ప్రశ్నించెను. కాని ఎవ్వరూ ప్రత్యుత్తరమీయలేదు. దశరథుడు, కైకేయిఉన్న భవనమునకు సుమంత్రుడు నడచెను.

''చిరాయురస్తు, విజయీభవ'' అనుచు అతడు తలవంచి నమస్కరించి కూర్చుండెను. దశరథుని స్థితినిచూచి అతడు తెల్లబోయెను. రాజు విచారముతో వ్యాకులుడై పడిఉన్నాడు. అతని వదనము కళావిహీనమై ఉన్నది. మొదలునుండి విడిపోయిన కమలమువలె అతడు నేలపై పడిఉన్నాడు. భయభీతుడై సచివుడు ఏమియు ప్రశ్నించలేకపోవుచున్నాడు. అశుభభరితయై, శోభావిహీనయైన కైక ''రాజునకు రాత్రి అంతయు నిదురలేదు. కారణము ఆ జగదీశ్వరునికే ఎఱుక. ఆయన 'రామ-రామ' అనుచునే ఉన్నాడు. తెల్లవారినది. దీని రహస్యమేదియో రాజు చెప్పనేలేదు. శీఘ్రమే చని రాముని పిలిచి తోడ్కొనిరమ్ము. అప్పుడు అడుగవచ్చును విషయమంతయు'' అనెను.

రాజుయొక్క ఇంగితమును గ్రహించి సుమంత్రుడు వెడలెను. రాణి ఏదోకుతంత్రము పన్నెనని అతనికి తెలిసినది! సుమంత్రుడు ఆలోచనలతో వ్యాకులుడైనాడు. దారియందు అడుగు ముందుకు పడుటలేదు. అతనికి. ''రాముని రప్పించిఏమని చెప్పునో రాజు!'' అని చింతించుచు అతడు ధైర్యమువహించి ద్వారమువద్దకు నడచెను. అతనియొక్క ఉదాసీనతనుచూచి అందరు ప్రశ్నింపసాగిరి. అందరికి సమాధానముచెప్పి సుమంత్రుడు దినకరకులతిలకుడగు రామునివద్దకు చేరెను.

సుమంత్రునిరాకను రాముడు కనుగొనెను. అతడు పితృసముడని ఎంచి రాముడు మంత్రిని ఆదరించెను. రాముని వదనమును వీక్షించి సుమంత్రుడు రాజు యొక్క ఆనతిని తెలిపెను. రఘుకులదీపకుని రాముని తనవెంట గైకొని అతడు నడచెను. సచివునితో రాముడు చనుచున్న అనుచిత. విపరీతరీతిని పరికించి ప్రజలు ఎక్కడివా రక్కడ విషాదమును పొందుచుండిరి. రఘువంశమణి రాఘవుడు వెడలి - ఆడుసింహమునుచూచి వృద్ధగజరాజు భయపడిపోయినట్లు దీనస్థితియందు పడిఉన్న దశరథనృపాలుని కనుగొనెను.

దశరథుని పెదవులు ఎండిఉన్నవి. శరీరమంతయు మండిపోవుచున్నది. మణివిహినమగు భుజంగమువలె అతడు దుఃఖించుచున్నాడు. సాక్షాత్తుగా మృత్యుదేవతయే కూర్చుండి గడియలు లెక్కించుచున్నదా - అనునట్లు కైక అతనికి సమీపమున క్రోధమూర్తియై కూర్చుండిఉన్నది.

కరుణామయుడు, మృదుస్వభావుడు రాముడు. దుఃఖమనుదానిని అతడు చూచుట ఇదియే మొదటిసారి. ఇంతవరకు దుఃఖమునుగురించి అతడు విననైనను విని ఉండలేదు. ఐనను ఆతడు సమయమున యోచించి ధైర్యమువహించి, ఇట్లు మధురవచనములను కైకేయితో ''అమ్మా, తండ్రిగారి దుఃఖమునకు కారణమేమి? నాకు తెలుపుము. దానిని నివారించుటకు యత్నము చేతును'' పలికెను. అంతటకైక- ''రామా, వినుము. కారణమంతయు ఇదే - రాజునకు నీయందు అత్యంతప్రేమ. ఆయన రెండువరములు ఇత్తునని నాకు మాట ఇచ్చినాడు. నాకు ఇష్టమైన రెండువరములను కోరితిని. వానిని విని భూపాలునిహృదయమున సంతాపము కలిగెను. నీ కారణముననే అతడు ఈ స్థితియందున్నాడు. ఇటు పుత్రునిపై మోహము - అటు వాగ్దానము ! ఈ సంకటమున పడినాడు రాజు. నీకు చేతనైనచో నరేశుని ఆనతిని తలదాల్చుము. ఆయన యొక్క కఠినక్లేశములను తొలగింపుము''అని వచించి. జంకులేక కూర్చుండెను. స్వయముగా కఠోరతయే విన్నను అత్యంత కలతచెందునో అనునంతటి పరుషవచనములు ఆమెవి. ఆమె నాలుకయే ధనువువలె, వచనములు నానావిధములగు శరములవలె మహీపతి కోమలమగు లక్ష్యమువలె కనుపించెను. కఠోరత్వము స్వయముగా ఒక వీరవరుని శరీరమునుధరించి, ధనుర్విద్యను నేర్చుచున్నదా అనునట్లున్నది.

పరిస్థితినంతయు రఘుపతికి వివరించి కైకేయి నిష్ఠురతయే తనువును ధరించెనా అన్నట్లు కూర్చున్నది.

భానుకులభానుడగు రాముడు సహజముగనే ఆనందవిధానము. అతడు తన మనమున చిరునవ్వు నవ్వుకున్నాడు. దూషణ రహిత, కోమల, మృదు, మంజుల వచనములను వాగ్దేవికే భూషణములు-అనదగువానిని అతడు ఇట్లు వచించినాడు:-

''జననీ, వినుము. తల్లిదండ్రుల ఆజ్ఞలను పాలించుసుతుడు భాగ్యవంతుడు. జననీ జనకులను సంతుష్టపరచు తనయుడు - తల్లీ - సకలప్రపంచమునను దుర్లభుడు. అడవులలో విశేషముగా మునిగణములను సందర్శింపవచ్చును. దానివలన నాకు సర్వవిధముల హితము కలుగును. తండ్రిఆనతిని పరిపాలింపవచ్చును. నీ కోర్కెయు ఫలించును. నా ప్రాణ ప్రియుడగు భరతునికి రాజ్యము ప్రాప్తించును. నేడు విధి నాకు సకలవిధముల అనుకూలుడు. ఇట్టి కార్యమునకై నేను వనములకు వెడలనిచో మూర్ఖులబృందమున నేను మొదటివానిగా పరిగణింపబడవలెను.

కల్పతరువును కాదని ఆముదపుచెట్టును సేవించువారు. అమృతమును విడిచి విషమును కావలెననువారుసహితము మాతా, చేజిక్కిన ఇట్టి అవకాశమును పోగొట్టుకొనరు. ఒక్కవిషయముమాత్రము నన్ను బాధించుచున్నది. అమ్మా, నీ మనమున యోచించి విచారింపుము. నరపాలుడు వ్యాకులుడై ఉండుటకని నాకు అత్యంత దుఃఖము కలుగుచున్నది. తల్లీ, ఇంత స్వల్పవిషయమునకు తండ్రికి ఏల ఈ ఘోరదుఃఖమో ! నాకు విశ్వాసము కలుగుటలేదు. రాజు ధీరుడు. సద్గుణముల అగాధసాగరుడు. నావలన ఏదో మహా అపరాధము జరిగిఉండును. కనుకనే ఆయన నాతో ఏదియు పలుకుటలేదు. నామీద ఒట్టు. అమ్మా, నిజము వచింపుము.''

రఘువరుని సహజ, సరళ వచనములను దుర్బుద్ధికల కైక కుటిలముగా అన్వయించుకొనెను. నీరుఅంతయు సమానమే. కాని జలగ ఆ నీటిలో వక్రమార్గముననే పోవును !

రాముని ఇంగితమును తెలసికొని కైక సంతసించెను. కపటప్రేమను కనపరచుచు ఆమె ''నీపైన, భరతునిపైన ఒట్టు. మరి ఒక కారణమేదియు నాకు గోచరించుటలేదు. నాయనా, నీయందు ఎట్టి అపరాధము ఉండజాలదు. జననీ జనకులకు, సోదరులకు నీవు సుఖప్రదాతవు. రామా, నీవు పలుకునది సకలము సత్యము. తల్లిదండ్రుల ఆజ్ఞలను పాలించుటకు నీవు సదా సంసిద్ధుడవు. నామీద ఒట్టు. నీకు పుణ్యముండును. ధర్మజ్ఞుడవు. నీతండ్రికి నచ్చచెప్పుము. ఈ వృద్ధాప్యమున అపకీర్తిపాలు కావలదని ఆయనకు బోధించుము. నీవంటిసుతుని ప్రసాదించిన సుకృతమును నిరాదరించుట ఉచితము కాదు'' అని నుడివినది.

మగధదేశమున గయాది తీర్థములున్నట్లు కైకయొక్క దుర్ముఖమునుండి శుభవాక్కులు వెలువడినవి ! సురనదిలో కలయు జలమంతయు శుభప్రదము, సుందరము, అగునట్లు రామునికి తల్లి మాటలన్నియు మంచివనియే తోచెను.

ఇంతలో దశరథునిమూర్ఛ తొలగెను. రాముని స్మరించుచు ఆతడు ప్రక్కకు ఒత్తగిల్లెను. ''రాముడు విచ్చేసెను'' అని సచివుడు సమయోచితముగా మనవిచేసెను. రాముడు వచ్చెనని వినినతోడనే రాజుకు ధైర్యము వచ్చెను. ఆతడు కండ్లు తెరచెను. ఆతనిని మంత్రి పట్టుకొని కూర్చుండపెట్టెను. తన చరణములపై పడిన రాముని దశరథుడు చూచెను. కోల్పోయినమణిని సర్పము తిరిగి సంపాదించుకొన్నట్లు రాజు రాముని చూచుచు అట్లే స్తబ్ధుడై ఉండెను. అతని కన్నులనుండి నీరు ప్రవహించుచున్నది. శోకవశుడై ఉన్నందున ఆతడు ఏమియు మాటలాడలేకున్నాడు. మాటిమాటికి ఆతడు రాముని తన హృదయమునకు హత్తుకొనుచున్నాడు. రఘునాథుడు అడవులకు వెడలనట్లు చేయుమని విధిని తన మనసున ప్రార్థించుచున్నారు. మహేశ్వరుని స్మరించుచు ఇట్లు వేడుచున్నాడు:-

''సదాశివా, నా వినతిని ఆలకింపుము. నీవు అల్పసంతోషివి. శీఘ్రముగా ప్రసన్నుడవగుదువు. అడుగుటయే తడవుగా వరములను అనుగ్రహింతువు. నేను నీదీన సేవకుడనని ఎఱిగి నా దుఃఖమును దూరము చేయుము. ప్రేరకుడవై నీవు సర్వుల హృదయములయందు ఉన్నావు. రాముడు నా మాటను కాదని. ఉత్తమస్వభావమును ప్రేమను విడిచి అయోధ్యయందే ఉండునట్లు అతనికి బుద్ధిని ఇమ్ము. లోకమున అపకీర్తి రానిమ్ము. సత్కీర్తి పోనిమ్ము. నేను నరకమునకు చననిమ్ము లేక స్వర్గమును చేరనిమ్ము సర్వవిధములగు దుస్సహ దుఃఖములు నేను అనుభవించినను సరే రాముడు నా కన్నులఎదుటనుండి మఱుగుపడరాదు.''

దశరథుడు తనలో ఇట్లు విచారించుచుండెను. ఆతడు మాట్లాడలేకున్నాడు. ఆతని మనస్సు రావిఆకువలె చలించుచుండెను. తండ్రి - ప్రేమవశుడై ఉన్నట్లు రఘుపతి కనుగొనెను. ఇంకనూ తండ్రి ఏదో పలుకనున్నట్లు అతడు తలచెను.

దేశ, కాల, అవసర, అనుకూలములను యోచించి ఆతడు వినీతవచనములను ఇట్లు పలికెను :-

''తండ్రీ, నా పలుకులను ఆలకింపుము. ఇది నా సాహసమే. నా అనుచితవచనములను నా చిన్నతనపుమాటలుగా భావించి మన్నింపుము. ఈ అత్యంత స్వల్పవిషయమునకై నీవు ఇంత దుఃఖమును పొందుచున్నావు. ఈ విషయము ఎవ్వరూ ముందే నాకు తెలుపరైరి. నీ స్థితినిచూచి, స్వామీ, నేను తల్లిని ప్రశ్నించితిని. ఆమెవలన అన్నివిషయములు విని నేను ఆనందించితిని. తండ్రీ, ఈ శుభసమయమున ప్రేమవశుడవై నీవు చింతింపతగదు. విచారమును వీడుము. హృదయమున ఆనందము పొందుము. నాకు ఆజ్ఞ దయచేయుము.'' ఇట్లు పలుకుచుండగనే రాముని శరీరము పులకించెను.

''ఈ జగతీతలమున ఎవని చరితనువిని వాని తండ్రి అమితానందము పొందునో, ఆతండ్రిజీవితమే ధన్యము. ఎవనికి తల్లి దండ్రులు ప్రాణసమానులో వాని జన్మయే ధన్యము. అట్టివానికి చతుర్విధపురుషార్థములు కరతలామలకములు. నీ ఆజ్ఞను పాలించి, జన్మసాఫల్యముపొంది. శీఘ్రమే నేను తిరిగివత్తును. కనుక దయచేసి ఆనతి ఇమ్ము. తల్లివద్ద సెలవుగైకొని వత్తును. నీచరణములకు ప్రణామముచేసి వనములకు ఏగుదును'' అనిపలికి రాముడు అచ్చటినుండి వెడలెను. శోకవశుడై భూపాలుడు ప్రత్యుత్తర మీయలేకపోయెను. అత్యంత అప్రియకరమగు ఈ వార్త తేలుకుట్టిన వెంటనే శరీరమంతయు విషము వ్యాపించునట్లు - వేగమే నగరమంతట వ్యాపించెను. ఈ వృత్తాంతమువిని - దావానలమునుచూచి వృక్షములు, లతలు వాడిపోవునట్లు - స్త్రీలు, పురుషులు ఎల్లరు వ్యాకులపడిరి. వినినవారు - ఎక్కడవారు అక్కడే తమ తలలను బాదుకొనసాగిరి. ఎక్కడచూచినను విషాదమే. ఎవ్వరికీ ధైర్యము లేదు. అందరిమొగములు వాడిపోయినవి. కండ్లనుండి నీరు కారుచున్నది. హృదయములయందు శోకము ఎవ్వరికీ ఇముడుటలేదు. కరుణరసమనుసేన అయోధ్యపై దండెత్తి వచ్చినట్లున్నది.

''సర్వము చక్కగా అమర్చబడినది. ఇంతలోనే విధి సర్వనాశనము చేసినాడు'' అని లోకులు అన్నిచోట్లను కైకను దూషించుచున్నారు. ''కొత్త తాటిఆకుల కొంప పైకప్పుకు నిప్పుపెట్టినది ఈ పాపిష్టిది. దీనిబుద్ధి ఎటువంటిది?'' తన చేతులతోతానే తన కండ్లను పీకివేసికొని - చూడవలెననుకొనుచున్నది. అమృతమును పారవైచి గరళమును రుచిచూడ కోరుచున్నది. ఈ కుటిలదుష్టురాలు. దుర్మతికల కైక దౌర్భాగ్యురాలు కైక-రఘువంశమను వెదురువనమునకు అగ్నియైనది. కొమ్మలపై కూర్చుండి ఈమె చెట్టును నఱకివేసినది? ఆనందములో విపత్తును తెచ్చిపెట్టుకొనినది. రాముడు ఈమెకు సదా ప్రాణసమానుడు. మరి ఏకారణమున ఈమె ఇట్టికుటిలత పన్నినదో? స్త్రీ స్వభావమును ఏవిధముననైనను గ్రహింప శక్యముకాదని కవులు వర్ణించినది సత్యము. అగాధమైనది అది. రహస్యయుతమైనది. మన ప్రతిబంబమునైనను మనము చక్కగా పట్టుకొనవచ్చును. కాని, సోదరా-స్త్రీలచర్యలు తెలియ తరముకాదు.

అగ్ని దేనిని దహింపజాలదు? సముద్రము ఇముడ్చుకొనజాలనిది ఏమున్నది? అబల అని చెప్పబడు ప్రబలస్త్రీ చేయలేని దేది? జగమున కాలుడు కబళింపని దేది? విధి నిర్ణయించినదేమి? ఇప్పుడు చేసినదేమి ? చూపినదేమి? ఇక చూపదలచినదేమి?'' అని కొందరనిరి.

''రాజు చేసినపని సమంజసము కాదు. యోచించి ఆ దుర్బుద్ధికి అతడు వరములిచ్చిఉండలేదు. తనంతట తానే అతడు ఈ దుఃఖములను తెచ్చిపెట్టుకొన్నాడు! అబలకు వశుడైనందున అతని జ్ఞానము, గుణము నశించినట్లున్నవి'' అని మరికొందరనిరి.

ధర్మరక్షణమును గురించి తెలిసినవారు, బుద్ధిమంతులు రాజునకు దోషము ఆపాదించలేదు.

శిబి, దధీచి, హరిశ్చంద్రుల కథలను కొందరు ఇతరులకును వర్ణించిచెప్పిరి.

''దీనిలో భరతుని పాత్రకూడా ఉన్నద''ని కొందరనిరి. ఇంక కొందరు ఇవి అన్నియు విని ఊరకొనిరి. మరికొందరు చేతులతో చెవులు మూసికొని, పండ్లతో నాలుకలను కఱచుకొనిరి.

''ఇది అబద్ధము, ఇట్లు పలుకుటవలన మీ పూర్వపుణ్యము నశించిపోవును. భరతునికి రాముడు ప్రాణప్రియుడు'' అని అనిరి కొందరు.

''చంద్రుడు నిప్పుకణములను కురిపించనిండు. అమృతము విషతుల్యము కానిండు. స్వప్నముననైనను భరతుడు రామునికి ప్రతికూలమగుపనిని ఏదియు చేయడు'' అని ఇతరులు కొందరు పలికిరి.

''విధాత అమృతమును చూపించి విషమును ప్రసాదించెను'' అని ఒకడు విధాతను నిందించెను. నగరమంతయు గోల బయలుదేరినది. ప్రతిఒక్కడు విచారించుచున్నాడు. అందరి హృదయములయందు భరింపరాని వేదన కలుగుచున్నది. ఉత్సాహము నశించినది. కైకేయికి అతి ప్రియమైనవారు కొందరు, విప్రవనితలు, పెద్దవారు, గౌరవనీయులు - కైకయొక్క శీలమును ప్రశంసించి ఆమెకు బోధించుచుండిరి. కాని, కైకకు వారిమాటలు బాణములవలె గ్రుచ్చుకొనుచున్నవి.

''రామునిపై నాకు కలప్రేమ భరతునిపైనసహితము నాకు లేదని నీవు సదా నుడువుచుండెడుదానవు. ఈవిషయము సకలలోకవిదితము. రామునిపై నీకు సహజమగుప్రేమ కలదు. ఏ అపరాధము చేసినాడని అతనిని నేడు నీవు అడవులకు పొమ్మను చున్నావు? ఏనాడునూ నీకు సవతిపోరు సలుపనేలేదుకదా. నీ ప్రేమ, నీ విశ్వాసము దేశ##మెల్లయు విదితమే. నేడు కౌసల్య నీకు ఏ కీడు కలుగచేసెనని నగరమంతటిపై ఈ పిడుగు పడవైచితివి నీవు?

సీత తనప్రియుని ఎడబాయునా? రాముడులేని ఇంట లక్ష్మణుడు ఉండగలడా? రాముడులేని అయోధ్యారాజ్యమును భరతుడు అనుభవించునా? రాముడులేనిదే నరపాలుడు జీవింపగలడా? యోచింపుము. క్రోధమును త్యజింపుము. శోకమునకు, కళంకమునకు నిలయము కాబోకుము. అవశ్యము భరతునికి యువరాజపదవిని ఇమ్ము. కాని అడవులలో రామునికి ఏమిపని? రామునికి రాజ్యతృష్ణ లేదు. అతడు ధర్మధురీణుడు. విషయాసక్తి లేనివాడు. రాముడు ఇల్లువిడిచి గురుగృహములయందు వసించునట్లు రెండువరమును కోరుకొనుము. మేము చెప్పినపిదపకూడా నీవు అంగీకరింపనిచో - ఇక ఏదియు నీకు అనుకూలించదు. నవ్వులకే నీవు ఈపని చేసిఉన్నచో ఆమాట స్పష్టము చేయుము. రామునివంటి సుతుడు అడవులకు పంపతగినవాడా? దీనిని విని నిన్ను లోకులు ఏమందురు? త్వరగా లెమ్ము. ఈ శోకము, కళంకము ఏరీతిని తొలగునో, ఆ ఉపాయమును ఆచరించి, కులమును సంరక్షింపుము. వనములకు పోవుచున్న రాముని ఆపి, తిరిగి రప్పించుము. మారుమాట పలుకకుము. సూర్యుడులేని పగలు. ప్రాణములేని శరీరము, చంద్రుడులేని రాత్రివలెనే తులసీదాసుని ప్రభువగు రాముడులేని అయోధ్య అగును. భామినీ, నీ హృదయమున ఈవిషయము యోచించుట మంచిది'' అని వినుటకు మధురము. పరిణామమున హితకరములు అగువచనములను సఖులు కైకేయికి ఎంతయో బోధించిరి.

కాని కుటిల స్వభావముకల ఆ గూనిదాని ఉపదేశమువలన కైక చెవులకు ఈ మంచిమాటలు ఎక్కలేదు. ఆమె ఏమియు ప్రత్యుత్తరమీయలేదు. భరింపరాని క్రోధమున ఆమె మండిపడినది. ఆకలిగొన్న ఆడుపులి ఒకలేడిని చూచుచున్నట్లు - కైకేయి చూచుచున్నది.

''ఇది కుదరనిరోగము. ఈకైక మందబుద్ధి ! అభాగిని'' అని అనుకొనుచు సఖియలు ఆమెను విడిచివెడలిరి. ''కైకేయి రాణియే. ఐననేమి? నిధి ఇట్లు ఆమెను నాశనము చేసెను. కైకవలె ఇంకెవ్వరూ ఇట్లు చేయరు'' అని అయోధ్యాపుర స్త్రీ, పురుషులు విలపించుచుండిరి. దుష్టురాలగు కైకను వారు దూషించుచుండిరి.

ప్రజలు వేదన అను విషమజ్వరముచే మండిపోవుచున్నారు. దీర్ఘ నిశ్వాసములు విడుచుచున్నారు. ''ఎవనికి కావలెను రాముడులేని బ్రతుకు?'' అని అనుకొనుచు మహావియోగముచే నీరు ఎండిపోవునప్పుడు జలచరగణములవలె వ్యాకులపడుచున్నారు. ప్రజలెల్లరు అత్యంత విషాదమున ఉన్నారు.

రామస్వామి తల్లివద్దకు అరిగెను. ప్రసన్నవదనముతో అత్యంత ఉత్సాహముతో ఉన్నాడతడు. రాజు తనను వనవాసమునకు పోవలదని చెప్పునేమో అను శంక అతనికి లేదు. క్రొత్తగా పట్టుబడిన ఏనుగును పోలిఉన్నది. రామునియొక్క మనసు, రాజ్యపట్టాభిషేకము ఆ ఏనుగును బంధించు ఇనుపగొలుసువంటిది. 'అడవులకు తాను పోవలెను' అను మాటలనువిని బంధనమునుండి విడివడినట్లు అతడు తలచెను. ఆతని ఆనందము అధికమయ్యెను.

రఘుకులతిలకుడు రెండుచేతులను జోడించి, ముదితుడై, తలవంచి తల్లియొక్క పాదములకు వందనము చేసెను. కౌసల్య అతనిని ఆశీర్వదించెను. హృదయమునకు హత్తుకొనెను. భూషణములను, వస్త్రములను దృష్టితీసి వైచెను, బాష్పపూరిత నేత్రములతో, పులకించిన తనువుతో ఆమె పదేపదే రాముని ముఖమును ముద్దిడుకొనెను. అతనిని తనఒడిలో కూర్చుండబెట్టుకొనెను. మరల కౌగలించుకొనెను. ఆమె స్తనముల నుండి ప్రేమరసము ప్రవహించెను. ఆమెయొక్క ప్రేమను, మహదానందమును వర్ణింప శక్యముకాదు, ఒక బిచ్చగాడు కుబేరుడైనట్లున్నది. రఘువరుని యొక్క సుందరవదనమును వీక్షించి కౌసల్య :-

''నాయనా, చెప్పుము - నామీద ఒట్టు. మంగళకరము ఆనందదాయకము అగు ఆ లగ్నము ఎన్నడు? నా శీలసుకృతములకు - నేను జన్మఎత్తిన ప్రయోజనమునకు సంపూర్ణ అవధి ఎన్నడు? శరదృతువునందు చాతకపక్షులజంట దాహముచే స్వాతి వానను కోరునట్లు అయోధ్యయందలి స్త్రీ, పురుషులెల్లరు ఆ శుభలగ్నమునకై తహ తహ లాడుచున్నారు - తండ్రీ, నిన్ను వేడుకొందును. వెంటనే స్నానముచేసి రమ్ము, ఇష్టమగువానిని భుజించుము. నాయనా, అనంతరము మీ తండ్రివద్దకు వెడలవచ్చును. చాలా ఆలశ్యమైనది - నీ తల్లిని - నేను చెప్పుచున్నాను కదూ'' అనెను.

ఆనందమును మకరందభరితమై, సిరికి మూలమై ప్రేమ అను కల్పవృక్షపు పుష్పములై, ప్రేమసంభరితములైన తల్లి పలుకులను రాముడు వినెను. కాని ఆతని మానసభ్రమరము ఆ పలుకులపై వ్రాలలేదు. ధర్మధురీణుడగు రాముడు ధర్మగమనమును తెలిసికొనెను. తల్లితో ఆతడు ''అమ్మా, తండ్రిగారు నాకు కాననరాజ్యమును ప్రసాదించినారు. నేను అచ్చట కావింపవలసిన ఘనకార్యములు ఎన్నో ఉన్నవి. తల్లీ, నా అటవీయాత్ర మంగళప్రదమగునట్లు ముదితమానసమున ఆనతి ఇమ్ము. నాయందు ప్రేమచే పొరపాటుననైనను ఆందోళన చెందకుము. అమ్మా, నీ అనుగ్రహమున సర్వము సంతోషప్రదమగును. పదునాలుగు సంవత్సరములు వనముల నివసించి, తండ్రి ఆనతిని పాలించి, తిరిగివచ్చి నీ చరణసందర్శనము కావింతును. దుఃఖింపకుము'' అని నుడివెను.

రఘువరుని నమ్ర, మధురవచనములు తల్లి హృదయమున శరములవలె తగిలి గ్రుచ్చుకొనెను. ఆ ఉదాసీనపు పలుకులనువిని కౌసల్య భయపడెను. వర్షపునీరు పడుటచే బ్రహ్మదండి మొక్కలు సన్నగిలి పడిపోవునట్లు ఆమె నేలమీద పడిపోయెను. ఆమె హృదయవిషాదము వర్ణింపతరముకాదు. సింహగర్జన వినినలేడి వ్యాకులపడునట్లున్నది ఆమె. ఆమె కన్నులు నీరు నిండెను. శరీరము కంపించెను. తొలివాన నీటినురుగును తిని చేప స్మారకము తప్పిపడునట్లు కౌసల్యపడి ఉన్నది.

కొంతసేపటికి ధైర్యముపూని తల్లి కుమారునిమోము చూచెను. గద్గదవచనములతో ఆమె- ''నాయనా, నీ తండ్రికి నీవు ప్రాణప్రియుడవు. నిత్యము ఆయన నీ చరితను కని ముదముజెందునే! నీకు రాజ్యము ఇచ్చుటకు శుభదినమునుకూడా నిశ్చయించెనే? ఏ అపరాధము చేసితివని నిన్ను ఇప్పుడు వనములకు పొమ్మనెను ఆయన? తండ్రీ, దీనికి కారణము నాకు తెలియచేయుము. దినకరకులమును బూడిదపాలు చేయుటకు అగ్నియైన వారెవరు? అని ప్రశ్నించెను.

మంత్రికుమారుడు రాముని ఇంగితమును కనుగొని కారణమంతయు వివరించెను. ఆ వృత్తాంతమును విని కౌసల్య మూగదానివలె మాటలాడజాలకపోయెను. ఆమె యొక్కస్థితి వర్ణింపతరముకాదు. రాముని అడవులకు వెడలవద్దనికాని వెడలుమని కాని ఆమె చెప్పలేకపోయినది. ఆమెకు రెండువిధముల దారుణమగు సంతాపము కలిగెను. విధాతయొక్క చర్య ఎల్లప్పుడు సర్వులకు వక్రమైనదే! అతడు చంద్రుని చిత్రింపమొదలిడి రాహువును చిత్రించెను!

ధర్మము, ప్రేమ-రెండును కౌసల్యయొక్క మతిని చుట్టుముట్టినవి. పాముచుంచులవలె ఉన్నది. ఆమెయొక్క స్థితి. (చుంచును తిన్నచో పాము చచ్చునట. మ్రింగలేక కక్కినచో గ్రుడ్డిదైపోవునట అది!)

''ఒకవేళ నేను కుమారుని నిరోధించినచో ధర్మము నశించును. సోదరులలో విరోధము జనించును. అతనిని అడవికి పొమ్మనియే నేను చెప్పినచో మహావిపత్తుకలుగును'' అని తలచుచు రాణి ధర్మసంకటమున పడెను. ఆలోచనలలో మునిగెను. బుద్ధిమంతురాలగు కౌసల్య స్త్రీ ధర్మమును యోచించెను. రాముడు, భరతుడు ఇరువురు మతులు తనకు సమానమే అని ఆమె గ్రహించి - సరళస్వభావముకల రామమాత మిక్కిలి ధైర్యము వహించి ఇట్లు వచించినది :-

''నాయనా, ఏది ఏమైననుసరే - నీవు చేసినది మంచిపని. తండ్రియొక్క ఆజ్ఞలను పాలించుటయే అన్నిధర్మములయందు అత్యుత్తమమైనది. రాజ్యమును ఇత్తుననిచెప్పి రాజు అరణ్యమును ప్రసాదించినాడు. దానిగురించి లేశ##మైనను నాకు దుఃఖములేదు. భరతుడు. భూపాలుడు, ప్రజలు - నీవు లేనిదే ఎంత దుఃఖింతురోకదా. తండ్రీ, కేవలము నీ తండ్రియొక్క ఆజ్ఞయే ఐనచో నీవు వనములకు పోవలదు. తల్లియే అధికమని గ్రహింపుము. కాని, జననీజనకులు ఇరువురు నిన్ను అడవికి పొమ్మనినచో - అడవి నీకు నూరు అయోధ్యలకు సమానము. వనదైవము నీకు జనకుడు, వనదేవి నీ జనని. ఖగములు, మృగములు నీచరణకమల సేవకులు. రాజులకు తమ అంత్యకాలమున వనవాసము ధర్మము. కాని, నీప్రాయమునుచూచి నా హృదయమున దుఃఖము కలుగుచున్నది.

రఘువంశతిలకా, అడవులు భాగ్యవంతములు. ఈ అయోధ్య భాగ్యవిహీన. నన్నుకూడా నీతో వనమునకు తోడ్కొనిపొమ్మని కోరినచో నీ హృదయమున సందేహము కలుగును. తండ్రీ, సర్వులకు నీవు పరమప్రియుడవు. అందరి ప్రాణములకు ప్రాణమవు నీవు. సకలహృదయములకు జీవనము నీవు. అట్టినీవు. 'అమ్మా, నేను అడవులకు పోవుచుంటివి' అనుచున్నావు. నీమాటలువిని నేను చింతించుచూ కూర్చుంటిని. ఇట్లు విచారించుచు అసత్యపు ప్రేమను పెంచుకొని నిన్ను అడవులకు పోవలదని నిరోధింపను. నాయనా-నాపైన అన. నీ తల్లిని నేను. నన్ను మఱువకుము.

పావనమూర్తీ, దేవతలు, పితరులు, ఈశ్వరుడు అందరు నిన్ను కంటికి రెప్పవలె కాపాడుదురుగాక. నీ వనవాసపుగడువ పదునాలుగేండ్లు జలము. నీ ప్రియజనము పరివారము-చేపలు. నీవు కరుణాకరుడవు. ధర్మధురీణుడవు. ఈ విషయమును గుర్తుంచుకొనుము. అందరు బ్రతికి ఉండగానే నీవు తిరిగివచ్చు ఉపాయము ఆలోచింపుము. ఇదే నా దీవన. సేవకులను, పరిజనమును, పురజనులను అనాథులనుచేసి నీవు అడవులకు సుఖముగా వెడలుము. నేడు అందరి సుకృతము ఫలించినది. కఠినకాలము మాకు విపరీతమయ్యెను.'' ఇట్లు పలువిధముల కౌసల్య విలసించెను. తన దురదృష్టమును నిందించుకొనెను. ఆమె రాముని పాదములను చుట్టుకొనెను. ఆమె హృదయమున దారుణ, దుస్సహ సంతాపము వ్యాపించెను. ఆ విలాపకలాపము వర్ణనాతీతము.

రాముడు తల్లిని లేవనెత్తెను. ఆమెను తన హృదయమునకు హత్తుకొనెను. మృదువచనములను పలికి ఆమెను ఓదార్చెను.

ఆ సమయమున ఈ వార్తవిని సీత బహు వ్యాకులపడి లేచెను. అత్తవద్దకువచ్చి ఆమె పాదకమలయుగళముకు ఆమె నమస్కరించెను. తలవంచుకొని కూర్చుండెను. కౌసల్య ఆమెను మృదువచనములతో ఆశీర్వదించెను. అతి సుకుమారి అగుసీతనుచూచి ఆమె వ్యాకులడెను. లావణ్యరాశి, ప్రేమపునీత అగు సీత అవనతముఖియై కూర్చుండి:- ''నా ప్రాణనాథుడు వనములకుపోవకోరుచున్నాడు. ఏ పుణ్యుత్ములు ఆయనవెంట వెడలుదురో! నాతనువు. ప్రాణము రెండును ఆయనవెంట చునునో లేక నా ప్రాణము ఒక్కటే ఏగునో? విధియొక్క చర్య తెలియరాదు'' అని ఆలోచించుచుండెను. తన సుందరమగు కాలిగోళ్ళతో ఆమె నేలపై గీయుచుండెను. ఆమె చరణనూపుములు మధురశబ్దములను కావించుచున్నవి. ప్రేమవశములై ఆ నూపురములు '' సీతయొక్క పాదములు ఎన్నడూ మమ్మువీడక ఉండుగాక అని వినతి చేయుచున్నవి'' అని కవుల వర్ణంతురు. సీతయొక్క సుందరనయనములనుండి కన్నీరు ప్రవహించుచున్నది. ఆ కన్నీటిని కనుగొని రామమాత ఇట్లు నుడివెను. ''నాయనా, సీత అతి సుకుమారి. అత్తమామలకు, పరిజనములకు ప్రియమైనది, ఈమె జనకుడగు జనకుడు భూపాలశిరోమణి. మామ భానుకులభానుడు. గుణ, రూప, నిధానము, రవికుల కమలవనచంద్రుడు, రూపరాశి ఈమె పతి, గుణపతి, శీలవతి, ప్రియమగు కోడలుగా ఈమె నాకు లభించినది. నా కనుపాపగా ఎంచి ఈమెపైనా ప్రేమను పెంచుకొంటిని. నా ప్రాణమంతయు ఈమెయందే నిలిపి ఉంచితిని. కల్పలతనువలె బహువిధముల మురిపెమున ప్రేమజలముపోసి ఈమెను పెంచితిని. ఈ లత పుష్పించి. ఫలించుసమయమున విధాత ప్రతికూలుడైనాడు దీనిఫలితము ఏమగునో తెలియదు. పర్యంకమున, ఒడిలో, ఊయెలలోనే తప్ప కఠితనమగు నేలపై సీత ఎన్నడూ అడుగిడి ఉండలేదు. ఈమెను సంజీవనీ మూలము వలె జాగ్రత్తగా రక్షించుచుంటిని. దీపపువత్తి సరిచేయుమనియైనను ఈమెకు నేను పని చెప్పలేదు. అట్టిసీత ఇప్పుడు నీవెంట అడవులకు రాగోరుచున్నది. ఆమెకు నీ ఆజ్ఞ ఏమని? రఘునాథా, చంద్రకిరనామృతమును కోరు చకోరి సూర్యేనివైపు కన్నులు త్రిప్పగలదా?

ఏనుగులు, సింహముల, నిశాచరులు మొదలగు దుష్టజంతువులు అనేకములు అడవులలో విహరించుచుండును. విషవాటికలో సందరసంజీవనీమూలిక శోభించునా? విషయసుఖము లెరుగని కోల, కిరాత, బాలికలకై విరించి వనములను సృష్టించెను. రాళ్ళయందలి పురుగులవలె కఠోరస్వభావము ఈ బాలికలది. వీరికి అడవులలో ఏ క్లేశము ఉండదు.

తాపస స్త్రీలకును కాననములు యోగ్యములే. తపస్సునకై వీరు భోగములన్నిటిని త్యజింతురు. నాయనా, పటములలోని కోతినిచూచియే సీత భయపడును. అట్టి ఆమె అడవులలో ఎట్లు నివసింపకలదు? సుందర సురసరోవరమునందలి కమలవనమున చరించు హసంకుమారి ఒక చిన్నచెరువులో నివసింపకలదా? యోచింపుము. నీవు ఆజ్ఞాపించినరీతిని నేను జానకికి బోధింతును. సీత ఇచ్చటనే ఉన్నచో నాకు మిక్కిలి సహాయకారి కాగలదు.''

తల్లియొక్క శీల, ప్రేమామృత సంభరితములగు ప్రియవచనములను రఘ వీరుడు నిని, వివేకమయము ప్రియము ఆగు పలుకులతో ఆమెను సంతుష్టపరచెను. అడవులయందలి కష్టసుఖములను ఆతడు జానకికి వివరింపసాగెను.

తల్లి ఎదుట భార్యతో మాటలాడుటకు రాముడు బిడియపడెను. కాని, ఆసమయము అట్టిది - అని గుర్తించి ఆతడు ఇట్లు నుడివెను:-

''రాజకుమారీ, నా బోధనున వినుము. వేరువిధముగా మనసున భావింపకుము. నా మేలును, నీమేలును కోరుదానివైనచో నామాటను మన్నించి ఇంటివద్దనే ఉండుము. నా ఆజ్ఞను పాలించినట్లగును. అత్తయొక్క సేవను చేయవచ్చును. భామినీ, ఇంటనే ఉన్నచో అన్ని విధములగు మేలు కలదు. అత్తమామల పాదపూజ ఆదరమున కావించుటకంటె రెండవధర్మము ఏదియూ లేదు. మాతల్లి నన్ను స్మరించునపుడు ప్రేమచే ఆమె వ్యాకులపడును. ఆమె మనస్సు కలతచెందును. అట్టి సమయముల నీవు సుందరీ, ఆమెకు మృదువచనములతో పురాణకథలను చెప్పి, ఆమెను ఓదార్చుము. నూరు ఒట్లు పెట్టుకొని వచించుచున్నాను. సుముఖీ, మాతల్లికొఱకే నిన్న ఇచ్చట ఉండుమని తెలుపుట. గురు, వేద సమ్మతమైన ధర్మఫలము ఏ క్లేశములేకయే నీవు పొందగలవు. మెండిపట్టుచే గాలవముని, నహుష నరేశుడు సంకటములపాలైరి. సుముఖీ, తరుణీ వినుము. నేను తండ్రి ఆనతిని పాలించి వేగమే మరలివత్తును. దినములు త్వరలో గడచిపోవును. ఆలశ్యము జరుగదు నామాటను వినుము. వనితా, ప్రేమవశమున నీవు మొండిపట్టు పట్టినచో దానిఫలితముగా దుఃఖమును నీవు అనుభవింతువు. కాననములు కఠినమైనవి. బహు భయంకరమైనవి. వానియందు ఎండ, చలి వాన, గాలి అన్నియు అతి భయానకములై ఉండును. మార్గమున కుశలు, ముండ్లు, నానావిధములగు రాళ్ళు ఉండును. పాదరక్షలు లేకయే వానిపై నడువవలయును. నీ చరణకమలములు కోమలములు, సుందరములు. దారిలో పెద్ద పెద్ద పర్వతములు, కొండగుహలు, కొండదారులుండును. అగమ్యము, అగాధము అగు నదులు, నదముల, వాగులు ప్రవాహములు ఉండును. వానిని చూడజాలము, భల్లూకములు, పెద్దపులులు, తోడేళ్ళు సింహములు, ఏనుగులు మొదలగునవి భయంవకరనాదములు సలుపుచుండును. ఆ ధ్వనులు వినినంతనే ధైర్యము పలాయనమగును. నేలపైననే నిద్రించవలెను. వల్కలములే వస్త్రములు. కందమూలఫలములే ఆహారము, అవియును ఎల్లప్పుడు దొరకునా? వానికాలము అనుకూలమైనపుడే అవి లభించును, నరభక్షకులగు రాక్షసులు తిరుగుచుందురు. కోట్లకొలదిమాయావేషములను వారు ధరింతురు. కొండలపై వర్షములు అధికము. అడవులలోని ఆపదలను వర్ణింపతరముకాదు. భీషణసర్పములు, భయంకరపక్షులు, స్త్రీలను, పురుషులను అపహరించు నిశాచరసముదాయములు ఉండును అడవులయందు. అరణ్యములను గురించి స్మరణ వచ్చినమాత్రముననే ఎట్టిధీరుడైనను భయపడిపోవును. హరిణలోచనీ, సహజముగనే నీవు భీరురాలవు, హంసగామినీ వనములకు తగినదానవు కావు నీవు. లోకులు వినిన నాకు అపశయము వాటిల్లును. మానససరోవరమునందలి అమృతతుల్యమగు జలమున పెరిగిన హంస ఎందైనను లవణసముద్రమున బ్రతుకగలదా? నవరసాలవనమున విహరించుకోయిల ఇసుకపఱ్ఱలో పెరుగు ఆకులేనినపొదల అడవిలో శోభించునా? చంద్రవదనా, ఇవి అన్నియు యోచించి ఇంటనే ఉండుము. అడవులలో బహుకష్టము సుమా! సహజ సుహృదయులగు గురువుల, స్వామియొక్క బోధనలను తలొగ్గి విననివారు పశ్చాత్తాపము పొందుదురు వారి హితమునకు అవశ్యము హాని కలుగును.''

ప్రియుని మృదు మనోహరవచనములను సీత వినెను. ఆమెయొక్క లలితమగు లోచనములు నీరు నిండెను. చకోరపక్షిని శరత్‌ చంద్రికవలె రాముని చల్లని పలుకులు సీతను దహించివైచినవి. వైదేమి ఏమియు ప్రత్యుత్తరము చెప్పలేకపోయెను.

''పావనుడు, నాప్రియడు అగు నాస్వామి నన్ను త్యజించి వెడలగోరుచున్నాడు'' అని ఆమె వ్యాకులపడెను. బలవంతముగా ఆమె తన కన్నీటిని అపుకొని ఆ అవనీసుత ఉరమున ధైర్యము వహించి అత్తయొక్క పాదములను పట్టుకొనెను. కరములుమోడ్చి ఇట్లు వచింపసాగెను:-

''దేవీ, నా ఈ అత్యంత అవినయమును క్షమింపుము. నా ప్రాణపతి నాకు పరమమితమును బోధించినాడు. నా మనస్సున నేను ఆలోచించి తెలిసికొంటిని, ప్రియుని ఎడబాటువంటి దుఃఖము జగమున మరిఒకటి లేదు.

ప్రాణనాథా, కరుణానిలయా, సుందరకారా, సుఖప్రదాతా, చతురుడా, రఘుకుల కుముదచంద్రమా, నీవు లేక నాకు స్వర్గమైనను నరకమే, తల్లి, తండ్రి, సోదరి, ప్రియ సోదరుడు, ప్రియపరివారము, సుహృదయ సముదాయము. అత్త మామ, గురువు, స్వజనము సహాయకులు. సుందర సుశీల సుఖదాయకులగు సుతులు - నాథా, ఎందరు ప్రియబాంధవులైనను - వీరందరు పతిలేనిస్త్రీకి సూర్యునికంటె మిక్కుటమగు తాపము నిచ్చువారే. తనువు, ధనము, గృహము, ధరణి,రాజ్యము - అన్నియు పతిలేని స్త్రీకి శోకసమాజములు. భోగమలు రోగతుల్యములు, భూషణములు భారవంతములు, సంసారము యమయాతనకు సమానము. ప్రాణనాథా, నీవులేనిదే ఈ లోకమున నాకు ఏదియు సుఖము నీయదు. ప్రాణములేని శరీరము, నీరులేని నదివంటిదే పురుషుడులేని స్త్రీ. నాథా నీవెంట ఉండి శరత్కాలపు నిర్మలచంద్రునివంటి నీ మోమును చూచుటయందే నాకు సకలసుఖములున్నవి. నీ వెంట ఉండుటచే ఖగములు, మృగములు సహితము నా పరిజనము కాగలవు. వనము నగరమగును. వల్కలములు విమలవస్త్రములగును. వర్ణశల స్వర్గమువలె సుఖమునకు మూలమగును. ఉదారులగు వనదేవీ, దేవతలు అత్త మామలవలె నన్ను పోషింతురు. దర్భచిగుళ్ళతో నిర్మించిన సుందరశయ్యయే ప్రభునికి మనోజుని మనోమర తల్పమగును. కందమూలఫలములు అమృతతుల్యమగు ఆహారమగును. కొండలు ఆయెధ్యయందలి వందలాదిసౌధములకు సమానమగును. క్షణ క్షణమును ప్రభుని పాదకమలములను విలోకించి నేను - పగటిపూట చక్రవాకివలె ఆనందము చెందుచుందును.

నాథా, వనములలో బహు దుఃఖమునియు, అతి భయమనియు, విషాద మనియు, సంతాపమనియు చెప్పితివి, కాని, కృపానిధానమా, ఇవి అన్నియు కలసినను నీ వియోగమునకు లవలేశ##మైనను సరికావు. సుజ్ఞానశిరోమణీ, నీమనస్సున యోచించి నన్ను నీవెంట తోడ్కొనిపొమ్ము. నన్ను ఇచ్చట విడువకుము, స్వామీ, ఇంతకంటె ఎక్కువగా నేను ఏమని వినతిచేయగలను? నీవు కరుణామయుడవు. సర్వహృదయాంతర్యామివి. దీనబంధూ, సుందరా, సుఖప్రదాతా, శీలప్రేమనిలయా - అయోధ్యయందే నన్ను ఉండుమనినచో నా ప్రాణములు ఉండవని తెలిసికొనుము. క్షణక్షణము నీ చరణసరోజములను సందర్శించుటచే నాకు మార్గాయాసము కలుగదు. సకలవిధముల నీకు సేవచేతును. ప్రియా, మార్గజనిత శ్రమనంతటిని పోగొట్టుదును. నీ కాళ్ళుకడిగి, చెట్లనీడను కూర్చుండి. ఆనందించి నీకు గాలివీతును. స్వేదబిందువులతో కూడిన నీ శ్యామశరీరనమును వీక్షించి నా ప్రాణపతివగు నిన్ను దర్శించుచుండు నాకు దుఃఖంచుటకు అవకాశ##మేది? సమతలప్రదేశమున గడ్డిని, చెట్ల ఆకులనుపరచి శయ్యగాచేసి, ఈ దాసి రాత్రి అంతయు నీ చరణమును ఒత్తును. పదేపదే నీ కోమలమూర్తిని తిలకించు నాకు వేడిగాలి అయినను తగులదు. ప్రభునివెంట ఉండు నన్ను కన్నెత్తి చూడకలవాడెవడు? ఆడుసింహమును కుందేళ్ళు, నక్కలు చూడజాలవు. నేను సుకుమారిని, మరి - నాథా, నీవు అడవులకు తగినవాడవునా? నీకు తపస్సు తగినది, నాకు భోగములు తగినావా? ఆవును. ఇట్టి కఠోరవచరములను వినియు, నా హృదయము బ్రద్ధలు కాలేదు! ఈ దౌర్భాగ్యపు ఫ్రాణము నీ వియోగమునకలుగు భయంకరదుఃఖమును సహించునులే ప్రభూ!'' ఇట్లు పలికి సీత మిక్కిలి వ్యాకులపడెను. 'వియోగ' మను మాటను నహితము ఆమె భరింపలేకపయెను.

సీతయొక్క స్థితిని రఘపతి కనుగొనెను. ''బలాత్కారముగా ఈమెను ఇచ్చట విడిచివెడలినచో ఈమె ప్రాణములు నిలుపుకొనజాలదు'' అని ఆతడు గ్రహించెను.

''విచారమును పరిహరించి, నావెంట వనములకు రమ్ము. విషాదమునకు నేడు అవశ్యకతలేదు. శీఘ్రమే వనగమనమునకు సిద్ధము గమ్ము'' అని భానుకులనాథుడు. కృపాళుడు- రాముడు నుడివెను. ప్రియవచనములను పలికి ప్రియురాలిని ఆతడు ఓదార్చి తల్లియొక్క చరణములపై పడి ఆమెయొక్క ఆశీస్సును పొందెను.

''నాయనా, వేగిరమే తిరిగివచ్చి పరజలదుఃఖమును తొలగింపుము. కఠిన హృదయ అగు ఈ జననని మరువకుము. ఓ విధాతా ఎన్నడైన నా దశ మారునా ? నా కన్నులలో తిరిగి మనోహరులుగు ఈ జంటను చూడకలుగుదునా?

నాయనా, నీతల్లి బ్రతికి ఉండి, నీ వదనచంద్రుని వీక్షించు ఆ శుభదినము ఎన్నడు వచ్చునో! ఆ శుభఘడియ ఎన్నడు ప్రాప్తించునో! 'వత్సా' అని, 'బిడ్డా' అని, 'రఘపతీ' అని 'రఘువరా' అని 'తండ్రీ' అని మరల ఎన్నడు పిలచి నిన్ను కౌగలింతునో ! సంతోషమున నిన్ను ఎన్నడు కనుగొందునో !'' అని కౌసల్య పలికెను.

ప్రేమవశురాలై, తల్లి భీరురాలైనదని, ఆమె నోటివెంట మాట రానంత అత్యధిక వ్యాకులత చెందినదనియు రాముడు కనుగొనెను. ఆతడు పలువిధముల జననిని ఓదార్చెను. ఆ పరిస్థితిని, ఆ ప్రేమను వర్ణింప అశక్యము.

ఆంతట జానికి తన అత్తయొక్క పాదముకు నమస్కరించి, ''అమ్మా, నేను కడు దురదృష్టవంతురాలిని, నీకు సేవచేయువలసిన సమయమున దైవము నాకు వనవాసము ప్రసాదించినాడు! నా మనోరథమును సఫలమొనర్చలేదు. తల్లీ. క్షోభను వీడుము. దయనుమాత్రము వీడకుము. కర్మయొక్కగతి కఠినము. నాయందు ఏ దోషమూ లేదు'' అని వచించెను. సీత పలికిన పలుకులను విని కౌసల్య వ్యాకులపడెను. ఆమె యొక్క దశను నేనెట్లు వర్ణించి చెప్పను? పలుమార్లు ఆమె సీతను తన హృదయమునకు హత్తుకొనెను. ధైర్యము తాను వహించెను. జానకికి ధైర్యమును బోధించెను.

''గంగా యమునలయందు జలము ప్రవహించునంతవరకు నీ సౌభాగ్యము సుస్థిరమై ఉండుగాక !'' అని ఆశీర్వదించెను.

అత్తకౌసల్య అనేక ప్రకారముల సీతను ఆశీర్వదించి, బోధించెను. ఎన్నో మారులు సీత - అత్త యొక్క పాదపద్మములకు అతి ప్రేమతో, శిరమువంచి, నమస్కరించెను. వెడలెను.

ఈవార్త లక్ష్మణునికి తెలిసెను. అతడు వ్యాకులుడై విచారవదనముతో లేచి పరుగెత్తెను. అతని శరీరము కంపించినది. కన్నుల నీరు నిండినది. రోమావళి పులకరించినది. ప్రేమచే అతడు భీరుడైనాడు. అతడు వచ్చి రాముని చరణములను పట్టుకొన్నాడు. ఏమియు అతడు పలుకజాలక ఉన్నాడు. రాముని చూచుచునే నిలచి ఉన్నాడు. నీటినుండి బయటికివచ్చిన చేపవలె దీనుడై. ''విధాత ఏమి చేయునున్నాడో? మా సుఖములు, సుకృతములు అన్నియు పరిపూర్ణులై పోయెనా? ఏమిచెప్పునో రఘునాథుడు నాకు? ఇంటనే ఉండుమనునో? లేక తనవెంట తోడ్కొనిపోవునో?'' అని అతడు చింతించుచున్నాడు. చేతులు జోడించి, శరీరమును, ఇంటిని అన్నిటినివిడిచి తన ఎదుట నిలచిఉన్న లక్ష్మణుని రాముడు చూచినాడు.

నీతినిపుణుడు. శీల, ప్రేమ, సరళ, సుఖ సాగరుడు అగు రాముడు లక్ష్మణునితో ఇట్లు నుడివినాడు.

''సోదరా, పరిణామమున కలుగఉన్న ఆనందమును నీ హృదయమున ఎఱుగుము. ప్రేమవశుడవై బీరుడవు కాబోకుము.

జననీజనకుల, గురువుల, యజమానుల ఉపదేశములను తలదాల్చి, ఆచనించువారే - జన్మించినందులకు ఫలితము పొందగలరు. లేనిచో జగత్తున జన్మ వ్యర్థమే. సోదరా, ఈ విషయమును గుర్తుంచుకొనుము. నేను చెప్పునది వినుము. తల్లిదండ్రులసేవ చేయుము. భరత, శత్రుఘ్నులు ఇంటిలో లేదు. రాజు వృద్ధుడు. నన్నుగురించియే ఆయన మనస్సున దుఃఖము, నేను వనములకు పోవుచున్నాను. నిన్ను నావెంట కొనిపోయినచో అయోధ్య సర్వవిధముల అనాథ అగును. గురువు, తండ్రి, తల్లి, ప్రజలు, బంధువులు, అందరు దుస్సహమగు దుఃఖభారము భరింపవలసివచ్చును. నీవు ఇంటనే ఉండుము. ఎల్లరను సంతోషపెట్టుము. లేనిచో, సోదరా, మహాదోషము. ప్రేమపాత్రులగు ప్రజలు దుఃఖించు రాజ్యమును పాలించు ప్రభువు అవశ్యము నరకమునకు భాగస్వామి అగును. ఈ నీతిని యోచించి నీవు అయోధ్య యందే ఉండుము.''

రాముని మాటలను వినగానే లక్ష్మణుడు మిక్కిలి కలతపడెను. మంచు తగిలిన కమలము ఎండిపోవునట్లు - రాముని శీతలవచనములచే లక్ష్మణుడు భయపడి వెలవెల పోయెను. అతడు ప్రత్యుత్తర మీయలేకపోయెను. కలతచెంది అతడు రాముని పాదములను పట్టుకొనెను.

''నాథా, నేను నీ దాసుడను, నీవు నా స్వామివి. నన్ను నీవు త్యజించినచో నేనేమి చేతును? స్వామీ, మంచి ఉపదేశమునే కావించితివి. కాని నేను పిరికివాడను. నీ భోధను భరింపజాలను. ధీరులు, ధర్మధురీణులు మాత్రమే నీతిని. శాస్త్రమును గ్రహింప అర్హులు. ప్రభునియొక్క ప్రేమచే పోషింపబడుచున్న శిశువును నేను. మందరపర్వతమునైనను, మేరుపర్వతమునైనను హంస ఎత్తకలదా? నాథా, హృదయపూర్వకముగా చెప్పుచున్నాను. విశ్వసింపుము. నిన్ను తప్ప - ఏ గురువును, తండ్రిని, తల్లిని నేనెఱుగను. స్వామీ, దీనబాంధవా, స్వయముగా వేదములే వర్ణించిన స్నేహసంబంధము. ప్రేమ, విశ్వాసము, జగము ఉన్నవి. సకలము - సర్వ హృదయాంతర్యామీ, నాకు కేవలము నీవే, కీర్తి, ఐశ్వర్యము, సద్గతులను కాంక్షించువారికే ధర్మమును, నీతిని ఉపదేశించవలయును.

మనో, వాక్‌, కర్మలచే నీ చరణములయందే భక్తికలిగి ఉన్నవానిని త్యజింపవగునా? కృపాసింధూ?'' అని అతడు నుడివెను.

అనుజుడగు లక్ష్మణుని మృదువగు, నమ్రతాయుతమగు వచనములను కరుణాసింధుడు వినెను. లక్ష్మణుడు ప్రేమవశమున భీతిచెందెనని ఆతడు గ్రహించెను. తమ్ముని తన హృదయమునకు హత్తుకొని రాముడు ఓదార్చి, ''లక్ష్మణా, నీవేగి తల్లి వద్ద సెలవు తీసికొనిరమ్ము, వెంటనే వనములకు పోదము'' అనెను, రఘువరుని నిశ్చయమును విని లక్ష్మణుడు సంతసించెను. మహావిపత్తు తొలగెను. లాభము సంప్రాప్తించెను. గ్రుడ్డివానికి కన్నులు తిరిగి వచ్చినట్లు ఆనందమున లక్ష్మణుడు తల్లి వద్దకు వచ్చెను. తల్లికి తలవంచి వందనముచేసెను. అతని మనస్సు జానకీ రఘునందనులవద్దనే ఉన్నది.

ఉదాసీనుడై ఉన్న లక్ష్మణుని మనసును కనుగొని సుమిత్ర కారణము అతనిని అడిగెను. కథఅంతయు లక్ష్మణుడు వివరించెను. అడవి అన్నివైపుల కాలిపోవుచుండగా చూచి లేడి భయపడునట్లు ఆ కఠోరవచనములను విని ఆమె భీతిచెందెను. ''నేడు అనర్థము వాటిల్లినద'' ని లక్ష్మణుడు తలచెను. ''ప్రేమవశమున ఈమె విఫలము చేయునా ఈ కార్యమును?'' అని విచారించెను. ''అమ్మా, సెలవిమ్ము'' అని వేడుచునే అతడు భయపడుచుండెను. ''ఓ విధాతా రాముని అనుసరించుటకు తల్లి అనుమతించునో లేదో!'' అని అతడు సంకోచించుచుండెను.

సీతారాముల లావణ్య, సౌశీల్య, స్వభావములను సుమిత్ర ఎఱుగును, వారి యందు రాజునకు ఉన్నప్రేయుము ఆమెకు తెలియును. తల బాదుకొనుచు ఆమె ఈ పాపిష్ఠి కైక విశ్వాసఘాతిని, ఎంత వలపన్నినది!'' అని అనుకొనెను. కాని, అది సమయముకాదని గ్రహించి, ధైర్యము వహించి సహజముగనే సుహృదయముకలిగిన సుమిత్ర ఇట్లు మృదువచనములన వచించినది:-

''నాయనా. వైదేహినీ తల్లి, సర్వవిధముల నిన్ను ప్రేమించు రాముడు నీతండ్రి. రాముడు నివసించుస్థలమే అయోధ్య. సూర్యుని వెలుగుఉన్నదే పగలు. నిశ్చయముగా సీతారాములు అడవులకు వెడలుచో అయోధ్యతో నీకు పనియేలేదు. గురువును, జననిని జనకుని, సోదరుని, దేవతలను, స్వామిని - వీరిని ఎల్లరను ప్రాణసమానముగా సేవింపవలయును. రాముడు ప్రాణముకంటె ప్రియుడు. ఆతడు మన ప్రాణములకు ప్రాణము. ఎల్లరకు స్వార్థరహితుడగు సఖుడు అతడు. లోకమునకల పూజనీయులు పరమప్రియులు అగు వారెల్లరు రామునితో బాంధవ్యమువలననే గౌరవమునకు అర్హులు. ఇట్లు నీ హృదయమున యోచింపుము. రామునివెంట వనములకు ఏగుము. తండ్రీ జగమున జన్మించిన ప్రయోజనము పొందుము. కపటమువిడిచి నీ మనమును రామ చరణములయందు లగ్నము చేసితివి. కడు భాగ్యవంతుడవైతివి. నాకును నీతోపాటు అదృష్టము సంప్రాప్తించినది. రామభక్తుడగు పుత్రునిపడసిన యువతియే - లోకమున పుత్రవతి. రామునియెడల విముఖుడగు సుతుని కనుటకంటె స్త్రీ - సంధ్యయై యుండుటయే మేలు. ఆ స్త్రీ- పశువువలె ప్రసవించుట వ్యర్థము. నీ భాగ్యవశమున రాముడు అడవులకు వెడలుచున్నాడు. తండ్రీ, మరిఒక కారణము లేదు. సీతారాముల చరణముల యందు సహజమగు భక్తికలిగి ఉండుటయే సకలపుణ్యముల మహాఫలము.

స్వప్నముననైనను రాగ, రోష, ఈర్ష్యా, మద, మెహవశుడవు కాబోకుము. సకలవిధములగు వికారములను విడిచి, మనో, వాక్‌, కర్మలచే సీతారాములను సేవించుము. వనములయందు నీకు స్వరవిధముల సుఖము ఉండును. జననీజనకులవలె సీతారాములు నీవెంట ఉందురు. కుమారా, అడవులయందు రాముడు ఎట్టి క్లేశమును అనుభవింపనట్లు నీవు సంచరింపుము. ఇదియే నా ఉపదేశము.

నాయనా, వనములయందు సీతారాములు నీవలన సుఖమును పొందవలెను. తల్లి దండ్రులను, బంధుజనులను వారు మరచిఉండునట్లు నీవు చరింపుము. ఇదియే నా బోధ.''

తులసీదాసుని ప్రభువగు లక్ష్మణునికి ఇట్లు బోధించి సుమిత్ర అనుమతి ఇచ్చెను. ''సీతా, రఘువీరుల చరణములయందు నిర్మల, అనన్య, ప్రగాఢభక్తి నీకు నిత్యనూతనమై వెలయుగాక!'' అని ఆమె ఆశీస్సుల నిచ్చెను.

తల్లియొక్క పాదములకు తలవంచి లక్ష్మణుడు వందనము చేసెను. భాగ్యవశమున ఒకలేడి గట్టివలను త్రెంపుకొని పారిపోయినట్లు అతడు శంకితహృదయుడైవడివడిగా వెడలెను. జానకీనాథుని సమీంపించెను. ప్రియుడగు రామునిచేరి ఆతడు మనమున ఆనందించెను.

సీతారాముల సుందర చరణముకు లక్ష్మణుడు వందనమొనరించెను. వారితో కలిసి రాజమందిరమునకు అరిగెను.

''ఈ విధాత ఎంతమంచిపనిచేసి దానిని ఎట్లు విధ్వంసము కావించెను!'' అని అయోధ్యపురవాసలు ఒకరితో ఒకరు అనుకొనుచుండిరి. కృశించిన తనువులతో దుఃఖించు మనస్సులతో ఉదాసీనవదనములతో వారు తేనెను కోల్పోయిన తేనెటీగలవలె వ్యాకులపడుచుండిరి. అందరు చేతులు నులుముకొనుచున్నారు. తలల మోదుకొనుచున్నారు. రెక్కలులేని పక్షులవలె ఉన్నది వారిస్థితి. రాజద్వారమువద్ద పెద్దగుంపుకూడినది. అపారమగు ఆ విషాదము వర్ణనాతీతము.

''రాముడు విచ్చేసె'' నను ప్రియవచనములను పలుకుచు మంత్రులు రాజును లేవదీసి కూర్చుండబెట్టిరి. సీతా సమేతులగు సుతుల నిరువురినిచూచి భూపాలుడు మిక్కిలి వ్యాకులపడెను.

జానకీ సమేతులై ఏతెంచిన సుందరులగు సుతులనుచూచి, చూచి భూపాలుడు వ్యాకులుడగుచుండెను. ప్రేమవశమున అతడు పదేపదే వారిని తనహృదయమునకు హత్తుకొనుచుండెను. కలతచెందిన నరనాథుడు ఏమియు పలుకలేకుండెను. ఆతడు శోకజనితమగు దారుణసంతాపమును పొందుచుండెను. అత్యంత అనురామున తండ్రి యొక్కపాదములకు తలవంచి నమస్కరించి, లేచి సెలవిమ్మని రఘువీరుడు వేడెను.

''తండ్రీ, నన్ను ఆశీర్వదించుము. అనుమతి ప్రసాదించుము. ఆనందింపతగు సమయమున ఏల దుఃఖింతువు? జనకా, ప్రియులయందలి ప్రేమవశమున ప్రమాదమునకు లోనైనచో లోకమున యశము హరించును. అపవాదము ప్రాప్తించును'' అని ఆతడు తండ్రిని ఓదార్చెను.

ఈ మాటలువిని ప్రేమవశుడగు దశరథుడు లేచి రఘుపతియొక్క చేతిని పట్టుకొని ఆతనిని దగ్గర కూర్చుండపెట్టుకొనెను.

''నాయనా, వినుము. రాముడు చరాచరనాయకుడని మునులు నిన్ను వర్ణించతురు. వారివారి శుభాశుభకర్మల ననుసరించి ఈశ్వరుడు హృదయమున యోచించి ఎల్లవారికి తగు ఫలముల నిచ్చును. కర్మలననుసరించియే ఫలములు సంప్రాప్తించుచు. ఇదియే వేదనీతి అని ఎల్లరు వచింతురు. కాని, ఇప్పుడు అపరాధము చేసినది ఒకరు - దానిఫలితమును అనుభవించునది ఇంకొకరు. భగవానుని లీలలు కడువిచిత్రములు, అర్హు డెవడున్నాడు వానిని తెలిసికొన లోకమున?'' అని ఇట్లు దశరథుడు కపటము విడిచి రాముని నిరోధించుటకై అనేక ఉపాయములు కావించెను. కాని ధర్మధురంధరుడు, ధీరుడు, బుద్ధిమంతుడు అగు రాముని ఇంగితమును కనుగొని - ఇక ఆతడు అడవులకు వెడలక మానడని తెలిసికొని దశరథుడు సీతను తన హృదయమునకు హత్తుకొనెను. అత్యంతప్రేముతో అనేకవిధముల ఆమెకు బోధించెను. అడవులయందలి దుస్సహ దుఃఖములను వర్ణించెను. అత్తమామలవద్ద. తల్లిదండ్రుల వద్ద కలుగు సుఖములను వివరించెను.

కాని, సీతయొక్క మనస్సు రామచరణానురాగియై ఉన్నది. కనుక ఆమెకు గృహము ఆనందదాయకముగా లేదు. వనము విషాదభరితముగను లేదు. మరి ఒకసారి ఎల్లరు అడవులయందలి విపత్తులనుగురించి మరిమరి హెచ్చరించిరి. మంత్రిభార్యయు, గురుపత్నియు, ఇతర ఉత్తమవనితలు ప్రేమపూర్వకముగా మృదువాణితో ''నీవు వనవాసము ఆదేశింపబడలేదు కదా! అత్తలు, మామ, గురువులు చెప్పినట్లు చేయుమమ్మా'' అనిరి. ఆ శీతల, హితకర, మృదు, మధుర బోధనలు సీతకు రుచింపలేదు. శరచ్చంద్రుని చంద్రిక సోకిన చకోరివలె ఆమె కలతచెందెను. కలవరమున ఆమె ప్రత్యుత్తర మీయలేదు.

ఈ మాటలన్నియు వినిన కైకేయి తటాలున లేచినది. మునులు ధరించు వస్త్రములను, భూషణములను, సామగ్రిని తెచ్చినది. వానిని రామునిఎదుట ఉంచినది.

''రఘువరా, నీవు నృపతికి ప్రాణప్రియుడవు. ఆయన భీరుడై, కరుణను, ప్రేమను వీడజాలడు. సుకృతము, యశము, పరలోకము నాశనమైననుసరే నిన్ను అడవులకు పొమ్మని ఆయన చెప్పడు. దీనిని యోచించి నీకు ఉచితమని తోచినట్లు చేయుము'' అని ఆమె పలికినది. సవతితల్లియొక్క ఉపదేశమును విని రాముడు ఆనందించెను. కాని, ఈమాటలు భూపాలునికి బాణములవలె తగిలెను. ''నా ఈ అభాగ్యప్రాణముల ఇపుడైనను పోనేపోవా?'' అని దశరథుడు అనుకొనెను.

ప్రజలు వ్యాకులపడిరి. రాజు మూర్ఛితుడయ్యెను. ఏమి చేయవలెనో ఎవరికి తెలియుటలేదు.

రాముడు వేగమే మునివేషమును ధరించెను. శిరమువాల్చి జననీజనకులకు నమస్కరించెను. పయనమయ్యెను. వనములకు వయుసామగ్రిని సకలమును నెంట గైకొని సీతా లక్ష్మణ సమేతుడై విప్రుల. గురవుల చరణములకు వందనమొనర్చి అందరను ఆచేతనులనుకావించి ఆతడు బయలుదేరెను.

వసిష్ఠునియొక్క ద్వారమువద్దకువచ్చి వారెల్లరు నిలిచిరి. జనులెల్లరు విరహాగ్నిచే దహింపబడుచు నిలచి ఉన్నారు. ప్రియవచనములుచెప్పి రఘువీరుడు వారిని ఓదార్చెను. విప్రబృందమును పిలువనంపెను. వారికెల్లరకు ఒక సంవత్సరమునకు సరిపడు ఆహారపదార్థములను ఇమ్మని గురుని కోరెను. ఆదరమున, వినయమున దానములొసగి ఆతడు వారిని వశులను కావించుకొనెను. పిదప ఆతడు యాచకులను రప్పించి వారికి దానమిచ్చి, వారిని సన్మానించి సంతుష్టపరచెను. మిత్రులను తనసవిత్రప్రేమచే ప్రసన్నులను కావించెను. అంతట రాముడు దాసులను దాసీలను పిలిపించెను. వారినందరిని గురునికి ఒప్పగించి, చేతులు జోడించి, ''స్వామీ, వీరినెల్లరను తల్లి దండ్రులవలె కాపాడి, రక్షించుచుండు''డని వేడెను. పదేపదే చేతులు జోడించి ఆతడు మృదువాణితో ఎల్లరకు ఇట్లు వచించెను:- ''భూపాలుని సకలవిధముల సుఖిని చేయువాడే సర్వవిధముల నా మిత్రుడు పరమప్రవీణులగు పురజనులారా, నా ఎడబాటు వలన నా తల్లులెల్లరు దుఃఖింపకుండునట్లు ప్రవర్తింపుడు.''

ఇట్లు - రాముడు అందరిని ఓదార్చెను. సంతోషమున ఆతడు గురుని పాదపద్మములకు శిరమువంచి నమస్కరించెను. గణపతిని, గౌరిని, గిరీశుని స్తుతించెను. వారి ఆశీర్వాదమునుపొంది రఘుపతి వెడలెను.

రఘుపతి వెడలగానే అంతడను మహావిషాదము క్రమ్మెను. పురమునందలి ఆర్తనాదము విన శక్యము కాదు.

లంకయందు అశుభశకునములు కనుపించెను. అయోధ్యలో అత్యంతవిచారము క్రమ్ముకొనెను. సురలోకము హర్షవిషాదవశ మయ్యెను.

మూర్ఛతొలగి భూపతి మేల్కొనెను. ఆతడు సుమంత్రిని పిలచి ''రాముడు అడవికి వెడలినాడు. నా ప్రాణములుమాత్రము నన్ను విడువకున్నవి. ఇవి నా శరీరమున ఏ సుఖము పొందవలెనని ఉన్నవో? ఈ తనువును త్యజించుటకు ఇంతకన్నను బలవత్తరమగు వ్యథ ఏమికావలయునో ఈ ప్రాణములకు?'' అని అనెను.

కొంతతడవుకు తిరిగి ధైర్యమువహించి నరనాథుడు ఇట్లు పలికెను. ''సఖుడా, రథమును తీసికొని నీవు రామునివెంట వెడలుము. అతి సుకుమారులగు ఈ ఇరువురు సోదరులను, సుకుమారి అగు జనకసుతను రథముపై ఎక్కించుకొని వనమునుచూపించి నాలుగుదినములతరువాత తిరిగిరమ్ము. ధీరులగు ఈ ఇరువురుసోదరులు మరలిరానిచో - సత్యసంధుడు. దృడవ్రతుడు అగు రఘునాథునికి నీవు చేతులుజోడించి, ''ప్రభూ, మిథిలేశ కుమారినైనను తిరిగి పంపించుము'' అని వినతిచేయుము. అడవని కనుగొని సీత భయపడినపుడు, అవకాశము గ్రహించి ఇట్లు నా బోధను ఆమెకు తెలుపుము.

''కుమారీ, నీవు తిరిగిరమ్ము. అడవియందు అనేకక్లేశము లుండునని నీ అత్తమామలు నీకు సందేశము పంపి''రని చెప్పుము. ''తండ్రి ఇంటివద్ద కొంతకాలము, మరికొంతకాలము అత్తమామలవద్ద ఆమె ఇచ్చవచ్చినరీతిని ఉండవచ్చు''నని చెప్పుము. ఇట్లే ఉపాయములను అన్నిటిని పన్నుము. సీత తిరిగివచ్చినచో నా ప్రాణములు నిలచుటకు ఆమె సహాయకారి అగును. లేనిచో పరిణామము నా మరణమే. విధి విపరీతమైనపుడు ఏదియూ మనవశము కానేరదు'! ఇట్లు పలికి ''సీతా రామ లక్ష్మణులను తోడ్కొనివచ్చి నాకు చూపింపుము'' అనుచు దశరథుడు మూర్ఛితుడై నేలపై పడిపోయెను.

రాజుయొక్క ఆనతికొని తలవంచి నమస్కరించి సుమంత్రుడు త్వరితగతినిచను ఒకరథమును సిద్ధము చేయించెను. నగరమునకు వెలుపల సీతాసహితులై సోదరులిరువురు ఉన్నచోటికి చేరెను. దశరథుని పలుకులను అతడు వారికి తెలిపెను. వినతి చేసి వారిని రథమునందు ఎక్కించుకొనెను. సీతా రామ లక్ష్మణులు రథమున అధిరోహించిరి. శిరములువంచి అయోధ్యకు తమ హృదయములయందు నమస్కరించి వెడలిరి.

రాముడు ఏగుచుండగా అయోధ్య అనాథయైనట్లు కనుగొని జనులెల్లరు వ్యాకులపడిరి. వారెల్లరు రామునివెంట నడువసాగిరి. కృపాసింధుడు. రాముడు వారిని అనేక విధముల ఓదార్చెను. జనులు అయోధ్యవైపు తిరిగిపోదురు. ప్రేమవశులై మరల వెనుకకు వత్తురు. అంధకారమయమగు కాళరాత్రివలె భయావహమై వారికి అయోధ్య కనుపించెను. పురవాసులు - స్త్రీ. పురుషులెల్లరు ఘోరజంతువులను చూచినట్లు ఒకరి నొకరు చూచుచుండరి. వారికి ఇండ్లు స్మశానమువలె ఉన్నవి. పరిజనులు భూతముల వలె ఉన్నారు. సుతులు, హితులు, మిత్రులు యమదూతలవె కనుపించుచున్నారు. ఉద్యానవనములు, వృక్షములు ఎండిపోయినవి. నదులు, తటాకములు - వానివంక చూడజాలనంత భయానకములై ఉన్నవి. కోట్లాది గుఱ్ఱములు, ఏనుగులు, పెంపుడు లేళ్ళు పుమునందలి పశువులు, చాతకములు, నెమళ్ళు, కోయిలలు, చక్రవాకములు, చిలుకలు, గోరువంకలు, హంసలు, చకోరములు, అన్నియు రామవియోగమున వ్యాకులపడి ఎక్కడి వక్కడ-చిత్రములలోని బొమ్మలవలె నిలచిపోయినవి. అయోధ్య అంతయు పండ్లతో నిండిన ఒక వనమువలో ఉండెడిది ! స్త్రీలు పురుషులు - అందలి పక్షులవలె పశువులవలె ఉండెడువారు! విధాత కైకేయిని ఒక కిరాతినిని చేసినాడు, ఈ అడవికి దశదిశలను దుస్సహ దావాగ్నిని ఆమె రగుల్కొలిపినది. రఘువర విరహాగ్నిని ప్రజలు సహింపజాలరైరి. వారెల్లరు వ్యాకులమున పారిపోయిరి. సీతా రామా లక్ష్మణులు లేనిదే తమకు సుఖములేదని ఎల్లరు విచారించిరి.

''రాము డున్నచోటనే మన మందరమును. రఘువీరుడు లేని అయోధ్యలోమాకు ఏపనియు లేదు'' అని పురజనులెల్లరు దృఢచిత్తులైరి. దేవతలకుకూడా దుర్లబమగు, సుఖదాయకమగు తమ గృహములను వారి విడిచిరి. రాముని అనుగమించిరి.

రామ చరణానురాగులను ఎన్నడైనను విషయభోగములు వశపరచుకొనగలవా?

బాలురను, వృద్ధులను ఇండ్లవద్దవదలి ప్రజలెల్లరు రామునివెంట చనిరి. మొదటిరాత్రి రఘనాథుడు తమసా నదీతీరమున వసించెను. జనులెల్లరు ప్రేమవశులై ఉన్నట్లు రఘుపతి కనుగొనెను. సదయహృదయుడగు ఆతనికి అత్యంత దుఃఖము కలిగెను. రఘునాథస్వామి కరుణామయుడు. పరులదుఃఖమునుచూచి తానును దుఃఖించును. ప్రేమయుతమగు మృదువచనములను పలికి రాముడు ప్రజలను అనేకవిధముల ఓదార్చి ధర్మోపదేశమున గావించెను. కాని, ప్రేమవశులగు ఆ ప్రజలు తిరిగి వెడలుడన్నను మరలిపోనే పోరు! తన శీలమును, ప్రేమను రఘుపతి విడవజాలడు. ఆతడు సందిగ్ధస్థితిలో పడెను. శోకముచే, అలసటవలన ప్రజలెల్లరు నిద్రావశులైరి. కొందరి బుద్ధి దేవతామాయచే మోహవశమయ్యెను.

రాత్రి రెండుజాములు గడచెను. రాముడు ప్రేమపూర్వకముగా సచివునితో ''నాయనా, రథచక్రముల గురుతులు కనుపడనట్లు రథమును తోలుము. మరి ఏ ఇతర ఉపాయమూ లేదు'' అనెను.

సీతా రామ లక్ష్మణులు శంభుని చరణములకు ప్రణమిల్లిరి. రథముపై వెడలిరి. రథముయొక్క గుర్తులు కనపడజాలనట్లు త్వరితముగా రథమును అటు, ఇటు చీకాకు పడునట్లు మంత్రి తోలుకొనిపోయెను. తెల్లవారినది. ప్రజలందరు నిద్రనుండి మేల్కొనిరి. రఘునాథుడు వెడలినాడను గగ్గోలు వ్యాపించెను. రథము ఎటు పరుగిడినదియూ గుర్తులు కనుపించవు. ''రామా, రామా'' అని కేకలువేయుచు జనులు నలువైపులకు పరుగిడిపోయిరి. తమ ఓడ సముద్రములో మునిగిపోయినప్పుడు వ్యాపారబృందములు వ్యాకులత చెందుచున్నట్లున్నది.

''మనకు క్లేశములు కలుగునని తెలిసికొని రాముడు మనలను విడిచి వెడలి నా'' డని ఒకడు మరి ఒకనికి తెలియచెప్పుచున్నాడు. ''ఛీ, ఛీ, రఘువీరుడలేని మన జీవితము ఎందులకు?'' అని కొందరు తమను తాము నిందించుకొన్నారు. కొందరు చేపలను పొగడిరి. (నీటినుండి ఒడ్డుకు రాగానే చనిపోవుస్వభావము చేపలది).

''మనకు ప్రేమపాత్రుల వియోగమును వ్రాసిపెట్టిన ఆ విధి - మనము కావలెనిన కోరినను మనకు మరణము ప్రసాదించడే?'' అని వాపోయిరి.

ఇట్లు విలసించుచు, పరితాపభరితులగుచు వారందరు అయోధ్యకు తిరిగివచ్చిరి వారి విషమ వియోగ దుస్థితి వర్ణింప శక్యముకాదు. పదునాలుగేండ్ల గడువు దాటినపిదప రాముడు ''అయోధ్యకు తిరిగివచ్చును కదా' అను ఆసతోనే వారు తమ ప్రాణములను రక్షించుకొనుచుండిరి. స్త్రీలు, పురుషులు ఎల్లరు రామదర్శనమునకు దీక్షను వహించి వ్రతములుచేయ మొదలిడిరి. సూర్యుడు లేనపుడు చక్రవాకములు, కమలుములు దుఃఖించునట్లు వారు దీనులై దుఃఖించుచుండిరి.

సీతతో, సచివునితో కలసి సోదరులిరువురు శృంగిబేరపురమును చేరిరి. గంగా నదినికాంచి రాముడు రథమును దిగెను. అత్యంత ఆనందమున ఆ దేవనదికి సాష్టాంగ ప్రణామము చేసెను. సీతా లక్ష్మణులు. మంత్రి ప్రణామము కావించిరి. వారెల్లరు - రాముడు - సంతసించిరి. సకలముదములకు, మంగళములకు మూలము గంగానది. ఎల్లవారికి సుఖమును కలుగచేయునది ఆనది, సర్వపాపములను హరించునది ఆనది.

అనేక కథా ప్రసంగములను కావించుచు రాముడు గంగాతరంగములను తిలకించెను. మంత్రికి, తమ్మునికి, ప్రియురాలికి ఆతడు ఆ విబుధనదీ మహామహిమను వర్ణించెను.

అందరు గంగానదిలో స్నానము చేసిరి. వారి మార్గాయాసము తొలగెను. వారు గంగాజలమును సేవించిరి. ముదితమానసులైరి. ఎవనిని స్మరించినంతనే అత్యధిక శ్రమలన్నియు నశించిపోవునో అట్టి ఆతడే శ్రమచెందుట లౌకికవ్యవహారమే! శుద్ధ సచ్చిదానందమయ స్వరూపుడు, సుఖప్రదుడు, భానుకులకేతుడు సంసారసముద్రమును తరించుటకు నావ అగు రాముడు ఒక మానవునివలె ఇట్లు చరిత్రను సృష్టించుచున్నాడు.

నిషాదపతి గుహుడు రామునిగురించినవార్త వినెను. మిక్కిలి సంతోషించెను. తన ప్రియబాంధవులను మిత్రులను సోదరులను పిలిపించెను. కానుక లిచ్చుటకై కావళ్ళతో ఫలములను, కందమూలమును తీసికొని రాముని దర్శించుటకై బయలు దేరెను. అతని హృదయమున అపారమగు ఆనందము జనించెను. గుహుడు వచ్చి రామునికి సాష్టాంగప్రణామము చేసెను. కానుకలను ఆయన సమక్షమున ఉంచెను. అత్యంత అనురాగమున అతడు రాముని వీక్షింపసాగెను. సహజప్రేమవశుడై రఘువతి గుహుని తన సమీపమున కూర్చుండపెట్టుకొని కుశలప్రశ్నము కావించెను.

''ప్రభూ, నీ పాదపంకజసందర్శనముచేతనే నేను కుశలుడనైతిని. భాగ్య వంతులయందు పరిగణింపబడినవాడ నైతిని, దేవా, ఈ ధరణి, ధనము, ధామము సర్వము నీవే. నేను, నాపరిచారము నీ నీచసేవకులము. కరుణించి నా పురమునకు విచ్చేయము. ప్రజలెల్లరు ఈ దాసుని భాగ్యమును కొనియాడునట్లు నా ప్రతిష్టను ఇనుమడింపచేయుము'' అని గుహుడు నుడివెను.

అంతట రాముడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను:- '' చతురడవగు సఖా, నీవు పలికినదంతయు నిజము, కాని, నా తండ్రి నాకు మరిఒక ఆజ్ఞ ఇచ్చినాడు, పదునాలుగు సంవత్సరముల వరకు నేను మునివేషమును ధరించి, మునివ్రతమును ఆచరింపవలెను. మునులకు తగు ఆహారమునే భుజించుచు అడవియందు నివసింపవలయును. గ్రామ వాసము సమంజసము కాదు.''

ఈ మాటలువిని గుహుడు అతి దుఃఖితుడయ్యెను. సీతా రామ లక్ష్మణుల రూపములను కనుగొని గ్రామమునందలి స్త్రీలు, పురుషులు ప్రేమతో కొందరు ''సఖులారా, తెలుపుడు. ఇట్టి బాలకులను అడవికి పంపినవారు ఎట్టి తల్లిదండ్రులే?'' అని ప్రశ్నించిరి, ''రాజు మంచిపని చేసినాడు. ఈ మిషతో విధాత మనకుకూడా నేత్రానందము కలిగించినాడు'' అని మరికొంద రనిరి.

నిషాదరాజు ఆలోచించి ఒక శింశుపావృక్షము మనోహరముగా ఉన్దనిఎంచి రఘునాథుని తోడ్కొనిచని ఆ స్థలమును చూపించెను. ''సర్వవిధముల ఇది సుందరముగా ఉన్నది. అని రాముడు నుడివెను. పురజనులు అతనికి నమస్కరించి తమ తమ ఇండ్లకు మరలిరి. సంధ్యావందనముకై రఘువరుడు ఏగెను. కుశలను, పత్రములనుసేకరించి గుహుడు చక్కని పానుపును అమర్చెను. పవిత్ర మధుర ఫలము లను కందమూలమును స్వహస్తములతో ఏరితెచ్చి దొన్నెలలో నింపి ఉంచెను. సీతా మమంత్ర లక్ష్మణులతో కలసి రఘువంశమణి రాముడు కందమూలఫలములను ఆరగించెను. పిదప ఆతడు విశ్రమించెను. లక్ష్మణుడు రాముని పాదములను ఒత్తుచుండెను. ప్రభువు నిద్రించుచున్నాడని కనుగొని లక్ష్మణుడు లేచెను. 'సుమంత్రా, నిద్రించు'మని అతడు మెల్లగా చెప్పెను. కొంచెముదూరము వెడలి లక్ష్మణుడు బాణమును ధనువుపై సంధించి, వీరాసనమున కూర్చుండి జాగరణ చేయసాగెను.

గుహుడు విశ్వాసపాత్రులగు కావలివారిని పిలిపించెను. అత్యంతప్రేమతో అతడు వారిని వేరువేరు స్థలములయందు నియమించెను. తాను నడుమున బాణతూణీరమును బంధించెను. ధనువున చాపము సంధించెను. లక్ష్మణునివద్దకువెడలి కూర్చుండెను. నేలపై పరుండిన ప్రభుని కనుగొని నిషాదపతి ప్రేమవశుడయ్యెను. అతని హృదయమును విషాదముకలిగెను. అతని తనువు పులకించెను. కన్నుల నీరు ప్రవహించెను. ప్రేమపూర్వకముగా అతడు లక్ష్మణునితో ఇట్లు సంభాషింపసాగెను.

''దశరథభూపాలుని భవనము సహజ సుందరమైనది. సురపతి సరపమైననను దానికి సాటిరాదు. దానియుందు మణిమయమందిరము లున్నవి. అవి - మన్మథుడే స్వయముగా స్వహస్తములతో నిర్మించెనా అన్నట్లు ఉండురు.

శుచియై, అతివిచిత్రమై, సుందరముగ భోగపదార్థములతో, పుష్ప సుగంధ సువానలతో నిండిఉన్నస్థలమున, రమ్యమగు పాన్పుపై, మణిదీపములకాంతిలో, సకలవిధముల సంపూర్ణ విశ్రాంతి లభించుచోట - అనేక వస్త్రములు, తల్పములు విరాజిల్లుస్థలమున, పాలనురుగువంటి కోమల, సుందర హంసతూలికాతల్పములపై సీతా రాములు శయనించెడివారు. తమ లావణ్యముచే మదనునిగర్వము హరించు, ఆ సీతారాములు నేడు అలసి. వస్త్రములు పరచబడనిగడ్డిపై నిదురించుచున్నారు. ఇట్టి స్థితిలో వారిని చూడజాలము. జననీ జనకులు, బంధుజనులు, పురజనులు, సఖులు సత్ప్రవర్తన కలిగిన దాస, దాసీజనములు - ఎల్లరు ఎవనిని తమ ప్రాణసమానముగా ప్రేమింతురో, పాలింతురో - అట్టిరాముడు ఈనాడు నేలపై నిదురించుచున్నాడు!

జగత్ప్రసిద్ధ ప్రభావశాలి అగు జనకుడు తండ్రియై సరేశుని సఖుడగు రఘరాజు మామయై. రామచంద్రుడు పతియైన వైదేహి నేడునేలపై పవ్వశించి ఉన్నది. విధాత ప్రతికూలుడు కానిది ఎవరికి? సీతా, రఘువీరులు కాననమునకు తగినవారా? కర్మయే ప్రధానమని లోకులు వచించునది సత్యము. మందమతి అగు కైకయ రాజనందిని అత్యంత కుటిలత్వమును కావించినది. రఘునందనునికి, జానకికి సుఖసమయమున దుఃఖము తెచ్చిపెట్టినది. దినకరకులమను వృక్షమునకు ఆమె గొడ్డలి యైనది. దుర్బద్దికలిగిన ఆమె విశ్వమునంతటిని దుఃఖమున ముంచినది'' అని గుహుడు నుడివెను.

సీతారాములు నేలపై శయనించి ఉండుటను చూచి నిషాదునకు మహావిషాదము కలిగెను.

అంత లక్ష్మణుడు జ్ఞాన, వైరాగ్య, భక్తి రసభరితమగు మృదువచనములను ఇట్లు పలికెను:--

''సోదారా, సుఖమునుకాని, దుఃఖమునుకాని ఒకరు మరి ఒకరికి ప్రసాదించజాలరు. ఎవని స్వయంకృత కర్మఫలమును వాడే అనుభవించును. సంయోగ - వియోగములు, సుఖ - దుఃఖములు, శత్రుత్వ - మిత్రత్వములు, ఉదాసీనత - ఇవి అన్నియు భ్రమజనిత బంధనములే. భూమి, గృహము, ధనము, నగరము, కుటుంబము, స్వర్గము, నరకము మొదలగువానికి అన్నిటిని - చూడబడువానికి, వినబడువానికి - మనస్సున విచారింపబడువానికి - సకలమునకు మూలము మోహము, అజ్ఞానము మాత్రమే. వాస్తవమునకు ఇవి లేనేలేవు. స్వప్నమున రాజు భిక్షకుడైననను, నిరుపేద స్వర్గాధిపతియైనను - మెలకువ రాగానే వారికి లాభముకాని నష్టముకాని ఏవిధముగా ఉండవో - అట్లే ఈ దృశ్య ప్రపంచమును హృదయమున గ్రహించవలెను. ఎవ్వరియందును క్రోధము కలిగిఉండరాదు. ఎవ్వరిపైనను వ్యర్థముగా దోషము ఆపాదించరాదు. అందరూ మోహమను రాత్రియందు నిద్రించువారే. నిదురించువారెల్లరు అనేక విధములగు కలలు కందురు.

పరమాతర్థవిదులగు యోగులు, ప్రపంచ వియోగులు మాత్రమే ఈ జగత్తును రాత్రియందు మేల్కొని ఉందురు.

విషయ విలాస జగతు నుండి వైరాగ్యము వృద్దిచేసికొనినపుడే - జీవుడు జగమను నిశను మేల్కొని ఉన్నాడని తలచతగును. వివేకము జనించినపుడు మోహరూపముగు భ్రమ పారిపోవును. అంతట వారికి రఘునాథుని చరణములయందు అనురాగము జనించును. సఖుడా, మనోవాక్‌ కర్మలచే రామచరణములయందు భక్తియే పరమ పరమార్థము, రాముడు, పరమార్థ స్వరూపుడు, పరబ్రహ్మ - పరమాత్మ - అగోచరుడు, అవ్యక్తుడు, అనాదిపురుషుడు, అనన్యుడు, అనుపముడు. వికార రహితుడు, అవిభజ్యుడు.

వేదములు ఆతనిని 'నేతి-నేతి' అని నిరూపించుచున్నవి. అట్టి కృపాళుడు, భక్త భూ, భూసుర, గో, దేవతాహితమునకై మనుజ శరీరమును ధరించి లీలలను కావించుచున్నాడు. ఆ లీలలను వినినచో లోకమునందలి జంజాటములన్నియు నశించును. సఖుడా, ఈ రీతిని ఎఱిగి మోహమును పరిత్యజింపుము. సీతారామ చరణ రతుడవు కమ్ము.'' ఇట్లు లక్ష్మణుడు బోధించుచున్నంతలో ఉదయమయ్యెను. జగన్మంగళ, సుఖప్రదాత అగు రాముడు నిద్ర మేల్కొనెను. శౌచకృత్యములు కావించి, పవిత్రుడు, వివేకి అగు ఆతడు స్నానము చేసెను. మఱ్ఱిచెట్టుయొక్క పాలను తెప్పించెను. తమ్ముడు, తాను ఆ పాలతో తలలపై జడలను బంధించుకొనిరి. వారిని చూచి సుమంత్రుడు కన్నీరు కార్చెను. అతని హృదయమున మహాఅగ్నిజ్వాల మండుచున్నది. అతని వదనము మలినమయ్యెను. చేతులు జోడించి అతడు ఇట్లు అతిదీన వచనములను పలికెను:- ''ప్రభూ, రథమును తీసికొని రాముని వెంట పొమ్మని కోసలనాథుడు నాకు ఆనతి ఇచ్చెను. 'వనమును ఆతనికి చూపించి, సురనది అగు గంగలో స్నానము చేయించి శీఘ్రమే ఇరువురు సోదరులను తీసికొనిరమ్ము. వారి సకల సంశయములను, సంకోచములను దూరముచేసి - సీతారామలక్ష్మణులను తిరిగి తోడ్కొనిరమ్ము'' అని మహారాజు నాతో చెప్పినాడు. స్వామీ, తాము ఆదేశించిన రీతినే చేతును. ప్రమాణముచేసి పలుకుచున్నాను.''

ఇట్లు వినతిచేసి సుమంత్రుడు రాముని పాదములపై పడి బాలునివలె రోదనము చేసెను.

''తండ్రీ, అయోధ్య అనాథ కానట్లు కృప చేయుము ' అని ఆతడు వేడెను.

మంత్రిని రాముడు లేవనెత్తెను. ధైర్యము చెప్పెను. ''నాయనా, ధర్మ సిద్ధాంతముల నన్నిటిని నీవు పరిశోధించినవాడవు. శిబి, దధీచి, హరిశ్చంద్ర మహారాజులు ధర్మముకొరకై కోట్లకొలది కష్టములను అనుభవించిరి. వివేకులగు రంతిదేవుడు, బలిచక్రవర్తి అనేక కష్టములను సహించియు ధర్మమునే అవలంబించిరి. నిగమ, ఆగమ, పురాణములు సత్యమునకు సమమగు ధర్మము మరి ఏదియు లేదని వాక్రుచ్చినవి. ఆ ధర్మమును నేను సులభముగనే ఆచరింపగలిగితిని. ధర్మమును విడనాడినచో ముల్లోకముయందును అపయశము ప్రాప్తించును. ప్రతిష్ఠకల పురుషునికి- కోటి మరణములవంటి భయంకర సంతాపమును అపయశము తెచ్చిపెట్టును. నాయనా, ఇంతకంటె ఎక్కువ నేనేమి చెప్పగలను? ప్రత్యుత్తరము పలికినను నాకు పాపము సంభవించును. నీవు తిరిగి వెడలి మా తండ్రి చరణములను పట్టుకొని, కోటి వందనములచేసి, కరములు జోడించి, 'తండ్రీ, నా విషయమై ఎట్టి చింతయు వలదని నా మాటగా వినతి చేయుము. నీవును తండ్రివలె నాకు అత్యంత హితమునుకోరువాడవు. నాయనా, చేతులు జోడించి నీకు వినతి చేతును. మా తండ్రి మమ్ములను గురించి ఎట్టి చింతయులేక ఉండునట్లు చూచుట నీ కర్తవ్యము'' అని రాముడు నుడివెను.

రఘునాథ - సుమంత్రుల సంవాదమును విని నిషాదపతియు, అతని కుటుంబము వ్యాకులపడిరి. పిదప లక్ష్మణుడు కొన్ని అప్రియ వచనములను పలికెను. అవి అనుచితములని ఎఱిగి లక్ష్మణుని రాముడు వారించెను. కలతచెంది ఆతడు ''లక్ష్మణుని సందేశమును మా తండ్రికి తెలపవలదు. నాపైన ఆన!'' అని సుమంత్రుని వేడెను.

అంతట భూపాలుని సందేశమును సుమంత్రుడు రామునికి ఇట్లు కొనసాగించెను:-

''వనవాస క్లేశమును సీత సహింపజాలదు. కనుక ఆమె అయోధ్యకు మరలి వచ్చునట్లు నీవును, రఘువరుడును కర్తవ్యమును ఆలోచింపుడు. లేనిచో నేను నిరాధారుడనై, నీరులేని చేపవలె జీవింపజాలను. అత్తవారిఇంటనైనను పుట్టినింటనైనను సీతకు సర్వసుఖములు కలుగును, ఈ ఆపదలు గడచునంతవరకు ఆమె తన ఇచ్చ వచ్చినచోట సుఖముగా ఉండవచ్చును'' ఇట్లు ''ఎంత ప్రేమతో, దీనుడై భూపాలుడు వినతి కావించెనో - ఆ ప్రేమను, దీనతను వర్ణింపజాలను.'' అని అత డనెను.

కృపానిధానుడగు రాముడు తండ్రి పంపిన సందేశమును విని, అనేవిధముల సీతకు బోధించెను. '' నీవు మరలివెడలినచో నీ అత్తమామల, గురువుల, ప్రియజనుల, బందుగుల చింతలన్నియు తీరును'' అని ఆతడు వచించెను.

వై దేమి తన పతియొక్క పలుకులు విని ''ప్రాణపతీ, ప్రియతమ ప్రభూ, వినుము. నీవు కరుణామయుడవు. పరమవివేకివి. శరీరమును విడిచి నీడ వేరుగా ఉండకలదా? సూర్యప్రభ సూర్యుని వీడి ఎచటికైనను పోగలదా? చంద్రుని విడిచి చంద్రికి ఎచటి కేగగలదు?'' అని ప్రేమమయముగ వినతిని విభునికి కావించి జానకి సచివునితో ఇట్లు మృదు వచనములను నుడివెను:-

''నా తండ్రివలె, నా మామాగారివలె నాకు హితకరులు మీరు. అట్టి మీకు నేను ప్రత్యుత్తరము పలుకుచున్నాను, ఇది కడు అనుచితమే. కాని, తండ్రీ, ఆర్తురాలనై నేను మీ సమ్ముఖమున నిలచితివి. మీరు అన్యథా తలపకుడు. ఆర్యపుత్రుని చరణ కమలములు తప్ప ఈ జగమున మిగిలివన్నియు నాకు వ్యర్థములు. నా జనకుని వైభవమంతయు నేను స్వయముగా వీక్షించితిని, రాజాధిరాజులు నా తండ్రి పాద పీఠమునకు తలలు వంచి నమస్కరింతురు. ఆనంద నిలయమగు - అట్టి జనకుని మందిరము సహితము నా పతి లేనిదే నా మనస్సునకు సంతోషము కలిగించదు.

కోసలరాజుగు చక్రవర్తి నా మామగారు. ఆయన ప్రభావము పదునాలుగు బువనములయందు ప్రకటమే. ఇంద్రుడు కూడా ఆయనకు ఎదురేగి స్వాగత మిచ్చును. తన అర్ధ సింహాసనముపై ఆయనకు ఆసన మిచ్చును. అట్టి ఆయన నా మామః అయోధ్యయందు నివాసము. ప్రియులగు బాంధవులు, తల్లివంటి అత్తలు - అయినను రఘుపతియొక్క చరణరజము తప్ప - నాకు స్వప్నముననైనను ఏదియు సుఖము నీయదు.

దుర్గమమగు బాటయైనను, అగమ్యమగు అడవియైనను కొండలు, ఏనుగులు, సింహములైనను, అగాధములగు నదులైనను, సరస్సులైనను, సూకరములైనను, భిల్లులైనను, లేళ్ళు, పక్షులైనను ప్రాణపతితో ఉన్నచో నాకు సుఖప్రదములే అగును. నన్ను గురించిన చింత ఏదియు వలదని నా పక్షమున నా అత్తమామల పాదములపై పడి వినతి చేయుడు. సహజముగనే అడవిలో నేను సుఖముగా ఉందును. వీరాగ్రణన్యులగు నా ప్రాణనాథుడు, ప్రియమఱది - ధనుర్బాణములను ధరించి నా వెంట ఉన్నారు. నాకు మార్గాయాసము కలుగబోదు. నాకు భ్రమయు లేదు. నా మనస్సున ఎట్టి దుఃఖములేదు. నా కొఱకై పొరపాటుననైనను ఎంతమాత్రము చింత వలదు.''

జానకి పలికిన ఊరడింపు మాటలను విని సుమంత్రుడు మణిని కోల్పోయిన ఫణివలె వ్యాకులపడెను. అతని కండ్లు మిరుమిట్లు కొలిపెను. చెవులు వినబడుటలేదు. అతికలతచెంది అతడు ఏమియు పలుకలేకున్నాడు.

రాముడు పలువిధముల ఓదార్చినను సుమంత్రుని హృదయాగ్ని చల్లారలేదు. రామునివెంట తాను కూడా వచ్చుటకు అనేక ప్రయత్నములను అతడు చేసెను. కాని వాని సన్నిటికి రఘునందనుడు తగు ప్రత్యుత్తరముల నిచ్చెను.

''రాముని ఆనతిని కాదనరాదు. కర్మగతి కఠినమైనది! దానిపై మన వశ##మేమియులేదు.'' అని అనుకొనుచు సుమంత్రుడు సీతారామలక్ష్మణుల చరణములకు శిరము వంచి నమస్కరించి, తన మూలధనము సర్వస్వము కోల్పోయిన వర్తకుని వలె మరలెను.

సుమంత్రుడు రథమును తోలుచున్నాడు. గుఱ్ఱములు రాముని వంక చూచుచు సకిలించుచున్నవి. ఈ దృశ్యమును కని నిషాదుల విషాదవశులైరి. తలలు బాదుకొనుచు వారు శోకించిరి. రామ వియోగమున ఇట్లు పశువులే వ్యాకులపడుచుండగా ఇక ఆతని ప్రజలు. జననీజనకులు ఎట్లు జీవించి ఉండగలరు? బలవంతమున రాముడు సుమంత్రుని తిరిగి పంపి, గంగానదీతీరమును చేరెను. నావను తెప్పించుమని బెస్తవానిని కోరెను. కాని ఆ పల్లెవాడు తీసికొనిరాడే!

''నీ మర్మము నాకు తెలియును, నీ చరణకమలరజమున మనుష్యులను చేయు ఒక మూలిక ఉన్నదిని అందరు అందురు. నీ పాదములను తాకి శిలయే ఒక సుందర స్త్రీ అయ్యెను! రాతికంటె కఠోరమైనదికాదు కట్టె. నా నావ కూడా ఒక మునిపత్ని అగుచో ఇక నా నావ పనియే కాదు నా పనియు సరే. నా కుటుంబమును అంతటిని ఈ నావతోనే పోషించుకొనుచున్నాను. ఇంకొక పని నాకు రాదు. ప్రభూ, నీవు అవశ్యము గంగను దాటదలచినచో నీ పాదపద్మములను నన్ను కడుగనిమ్ము - నీ చరణ కమలములను కడిగి మిమ్ములను నావపై ఎక్కింతును. నాథా, ఇక ప్రత్యుత్తరము నాకు వలదు. నీపైన, దశరథునిపైన ఒట్టు, నేను పలుకునది నిజము. నన్ను లక్ష్మణుడు బాణముతో కొట్టుగాక, నేను మాత్రము నీ కాళ్లు కడుగనిదే - తులిసీదాసుని ప్రభూ, దయామయా, నిన్ను నా నావలో దాటించను'' అని అతడు వచించెను.

పల్లెవాని అజ్ఞానయుత వచనములను విని కరుణానిలయుడగు రాముడు జానకీ లక్ష్మణుల వంక చూచి నవ్వెను. ''సరే - నీ నావ చెడిపోనట్లు చేయుము. వేగమే నీరు తెచ్చి నా కాళ్లు కడుగుము. విలంబమగుచున్నది. మమ్ము దాటింపుము'' అని మందహాసము చేయుచు కృపాసింధుడు నుడివెను.

ఎవని నామమును ఒక్కసారి స్మరించినంతనే నరుడు అపారమగు భవసాగరమును తరించునో, ఎవడు జగత్తునంతను మూడు అడుగులకంటె చిన్నదిగా కావించి వై చెనో - అట్టి కృపాళుడు ఒక పల్లెవానిని వేడుకొనుచున్నాడు!

ప్రభుని వచనములను విని దేవనది గంగయొక్క బుద్ధి కలవరపడెను. ఐనను రాముని కాళ్ళ గోళ్ళను వీక్షించి ఆమె ఆనందము పొందెను. అతని ఆనతిని పొంది పల్లె ఒక కొయ్యపాత్రను నీటితోనింపి తీసికొనవచ్చెను. అతి అనురాగముతో ఆనందముతో పొంగిపోవుచు, అతడు రాముని చరణసరోజములను కడుగ మొదలిడినాడు!'' దేవతలు పూలు కురిపించిరి. ''అహో! ఇతనివంటి పుణ్యమూర్తి ఇంకొకడు లేడు!'' అని వారు గుహుని అభినందించిరి. పల్లె రాముని పాదములను కడిగెను. తన కుటుంబముతోసహా ఆ పాదోదకములను సేవించెను. తన పితృదేవతలను భవసాగరమునుండి తరింపచేసెను. ముదితుడై సీతా రామ లక్ష్మణులను గంగానదిని దాటించెను. గుహ, సీతా, లక్ష్మణసమేతుడై రాముడు నావను దిగెను. నదీతీరమున ఇసుకతిన్నెలమీద నిలచెను. గుహుడు దిగివచ్చి రామునికి సాష్టాంగనమస్కారము చేసెను.

''ఇతనికి ఏమియు ఇవ్వనైతినే!'' అని రాముడు సంకోచించుచుండెను. పతియొక్క హృదయమును గ్రహించిన జానకి సంతోషమున తన వ్రేలి ఉంగరమును తీసెను. ''ఇదిగో, నీ సుంకము!'' అని రాముడు అనెను. బెస్తవ్యాకులపడెను. అతడు రాముని పాదములను పట్టుకొనెను. ''ప్రభూ, నేడు నేను పొందనిది ఏమున్నది? నా దోషము, దుఃఖము, దరిద్రము అన్నియు నశించినవి. బహుకాలము నేను కాయకష్టము చేసినాను. విధాత నాకు భూరిసత్కారము కావించినాడు. దీనదయాళూ, నాథా, నీ అనుగ్రహమువలన ఇక ఏదియు నాకు అక్కరలేదు. నీవు తిరిగి వెడలునప్పుడు నీవు నాకు ఏది అనుగ్రహించినను ఆ ప్రసాదమును శిరమునధరించి స్వీకరింతును'' అని గుహుడు నుడివెను.

రామప్రభువు, లక్ష్మణుడు, సీత ఎంతప్రయత్నించినను ఆ బెస్త ఏదియు గ్రహించనేలేదు! కరుణానిలయుడగు శ్రీరాముడు గుహునికి విమలభక్తిని వరమిచ్చి వీడ్కొలు కావించెను.

అనంతరము రఘుకులనాథుడు స్నానముచేసి పార్థివలింగపూజ కావించెను. శిరమువంచి నమస్కరించి, కరములజోడించి జానకి గంగామతల్లిని ''అమ్మా, నా పతితో, మఱదితో కుశలముగా తిరిగివచ్చి నిన్ను పూజించునట్లు నా మనోరథమును సఫలము చేయుము'' అని ప్రార్థించెను. వినయ, ప్రేమ రసములతోనిండిన సీతయొక్క వినతిని విని విమల గంగాజలములనుండి ఒక ఉత్తమవాణి ఇట్లు వెలువడినది:- వైదేహీ, రఘువీరుని ప్రియురాలా, వినుము, నీ ప్రభావము జగమున తెలియనివారెవ్వరు? నీ కృపావీక్షణ సోకినివారు లోకపాలకులగుదురు. సర్వసిద్ధులు చేతులుమోడ్చి నిన్ను సేవించును. నాయందు కరుణతో నాకు మహిమను అనుగ్రహించుటకై ఇట్లు నాకు వినతిచేసితివి. ఐనను, దేవీ, నా పలుకలు సఫలమగుటకు నిన్ను ఆశీర్వదింతును. నీ ప్రాణనాథునితో, మఱదితో కుశలముగా నీవు కోసలకు తిరిగి వత్తువు. నీ కోర్కెలన్నియు ఫలించును. నీ సత్కీర్తి జగమును వ్యాపించును.''

జగన్మంగళ మూలకారిణి అగు జానకి గంగామతల్లి పలుకులనువిని, దేవనది ప్రసన్న అయ్యెనని ముదము చెందెను. అంతట - ''గుహుడా. ఇక నీ ఇంటికి మరలుము'' అని ప్రభువు వచించెను. ఆ పలుకులు వినగానే నిషాదునిమొగము ఎండిపోయెను. ఆతనిహృదయము దహించుకొనిపోయెను. గుహుడు చేతులు జోడించి ఇట్లు దీనవచనములను పలికెను:-

''రఘుకులమణీ, ప్రభూ, నా వినతిని వినుము, నీ వెంటఉండి నేను నీకు త్రోవచూపింతును, నాలుగుదినములు నీ చరణములను సేవింతును, రఘుపతీ, నీవు నివసించబోవు అడవికి నేనును ఏతెంతును, సుందరమగు ఒక పర్ణకుటీరమును అచ్చట నిర్మింతును. పిదప రఘవీరా, నీవు ఆజ్ఞాపించినట్లు కావింతును. నీపైన ఆన!''

గుహుని సహజప్రేమను కనుగొని రాముడు అతనిని తనవెంట తోడ్కొని వెడలెను. గుహుడు కడు సంతసించెను. తనవారినందరిని పిలిపించి అతడు వారికి పారితోషికములనిచ్చి పంపెను. అనంతరము గణపతిని, శివుని, ప్రభువు స్మరించెను. తలవంచి గంగాభవానికి వందనము చేసెను. సీతా, లక్ష్మణ, గుహ, సహితుడై అడవికి వెడలెను.

ఆనాడు వారందరు ఒక చెట్టుక్రింద వసించిరి. లక్ష్మణుడు, గుహుడు అన్ని ఏర్పాట్లను చేసిరి. ప్రాతఃకాలమున రఘుపతి కాలకృత్యములను నెరవేర్చుకొని తీర్థరాజమగు ప్రయాగను సందర్శించెను.

ఆ తీర్థరాజమునకు సత్యము సచివుడు, శ్రద్ధ-ప్రియుదాలు, వేణీ మాధవునివంటి హితకారి మిత్రుడు - ధర్మార్థ కామ మోక్షములచే పరిపూర్ణమైన భండారము. పరిసర పుణ్యప్రదేశ##మే రాజ్యము, అగమము, బలిష్ఠము, సుందరము అగు దుర్గము ప్రయాగ. శత్రువులుకు అది స్వప్నమున సహితము అభేద్యము. అచ్చటి తీర్థము లన్నియు కలుషములను విధ్వంసమొనర్చు రణధీరులగు వరవీరులు.

త్రివేణీసంగమమే ప్రయాగయొక్క అత్యంత సుశోభితసింహాసనము. మునులు మనములను సహితము మోహింపచేయు అక్షయ వటవృక్షమే దాని ఛత్రము. గంగా యమునల తరంగములే ఆ క్షేత్రపు చామరములు. వానిని చూచినంతనే దుఃఖము, దరిద్రము దూరములగును. పుణ్యాత్ములు, సాధుజనులు దానిని సేవించుచుందురు. తమ మనోరథములన్నిటిని పొందుచుందురు. శ్రుతులు, పురాణములు ఆ పవిత్రక్షేత్రము యొక్క నిర్మలగుణగణములను వర్ణించు వంధిమాగధులు.

పాపపుంజము లనబడు ఏనుగులను సంహరించు సింహము ప్రయాగ. దానిని వర్ణింప ఎవరితరము? అట్టి తీర్థరాజమును వీక్షించి సుఖసాగరుడగు రఘువీరుడు ఆనందమును పొందెను! స్వయముగా ఆతడు సీతా, లక్ష్మణ గుహులకు ఆ తీర్థరాజమహిమను వర్ణించెను. ప్రణామముచేయుచు, వనమును ఉద్యానవనములను సందర్శించుచు అతి అనురాగముతో మహాభక్తితో ఆతడు ప్రయాగమాహాత్మ్యమును ప్రశంపించెను.

ఇట్లు స్మరణమాత్రమున సకల సన్మంగళములను ప్రసాదించు త్రివేణిని రాముడు సమీపించి, విలోకించెను. ముదితుడై త్రివేణియందు స్నానమొనర్చి శివుని సేవించెను. యథావిధిని తీర్థదేవతలను పూజించెను.

అనంతరము ప్రభువు భరద్వాజుని వద్దకు వెడలెను. ఆ మునికి సాష్టాంగ ప్రణామము చేసెను. వెంటనే భరద్వాజముని రాముని తన హృదయమునకు హత్తుకొనెను. ముని మునమున కలిగిన ఆనందము వర్ణింప శక్యముకాదు. అతనికి బ్రహ్మానందరాసి లభించినట్లున్నది. మునీశుడు రాముని దీవించి ''విధి నేడు నా సుకృతఫలములను నా కన్నులఎదుట సాక్షాత్కరింపచేసినాడు!'' అని అమిత ఆనందమును పొందెను.

భరద్వాజుడు రాముని కుశలప్రశ్నము లడిగెను. ఆసనము సమర్పించెను. ప్రేమతో ఆతనిని పూజించి సంతుష్టుని కావించెను. అమృతతుల్యములు మధురములు అగు కంద, మూల, ఫలములను, చిగుళ్ళనుతెచ్చి సమర్పించెను. సీతా లక్ష్మణ గుహ సహితుడై శ్రీరాముడు ఆ సుందర కందమూలఫలములను అతి ప్రీతితో ఆరగించెను. అలసట తొలగి అతడు సుఖి అయ్యెను. పిదప భరద్వాజుడు ఇట్లు మృదువచనములను పలికెను:-

''రామా, నా తపము, తీర్థసేవలు, త్యాగము నేడు సఫలమయ్యెను. నా జపయోగ, వైరాగ్యములు నేడు ఫలించినవి. నా సకల శుభ సాధన సముదాయములు నేడు పండెను. ప్రయోజనమునకు, ఆనందమునకు ఇంతకంటె అవధి ఏదియులేదు. నీ దర్శనముచే నా ఆశలన్నియు పరిపూర్ణములయ్యెను. నాపై కరుణించి నీ పాదకమలములపై సహజభక్తి ని కలిగి ఉండునట్లు వరమున నాకు అనుగ్రహింపుము. మనోవాక్‌ కర్మలచే కపటమునువీడి నీ దాసుడు కాజాలనంతవరకు నరుడు - కోటిఉపాయములచే నైనను, కలలోనైనను సుఖమును పొందజాలడు.''

మునియొక్క పలుకులనువిని, అతనికి భావభక్తివలన కలిగిన ఆనందమును కని రాముడు సిగ్గుపడెను. రఘువరుడు భరద్వాజుని సత్కీర్తిని ఎల్లరకు కోటివిధముల వర్ణించెను.

''నీ ఆదరమును పొందగలవారు కడు ధన్యులు వారు అఖిల సద్గుణగణ నిలయులు'' అని ఆతడు మునితో అనెను.

ఇట్లు రఘువీర, భరద్వాజులు పరస్పరవినమ్రులై అనినిర్వచనీయమగు ఆనందమును అనుభవించిరి.

ప్రయాగవాసులు సీతా రామ లక్ష్మణుల ఆగమనవార్త వినిరి. అచ్చటి బ్రహ్మచారులు, తాపసులు, మునులు సిద్ధులు, సన్యాసులు - ఎల్లరు దశరథుని సుందర తనయులను సందర్శించుటకై ఏతెంచిరి. వారికెల్లరకు రాముడు ప్రణామము కావించెను. వారు కన్నులార రాముని కనుగొని ఆనందము అనుభవించిరి. పరమసుఖమును పొందివారు రాముని ఆశీర్వదించిరి. ఆతని సుందరమూర్తిని ప్రశంసించుచు మరలిరి.

ఆరేయి రాముడు అచ్చట విశ్రమించెను. ప్రాతఃకాలమున ప్రయాగయందు స్నానముచేసి, తలవంచి మునికి నమస్కరించి సీతా లక్ష్మణ, గుహులతో ఆతడు ఆనందమున పయనమయ్యెను. ''స్వామీ, మేము ఏమార్గమును పోవలయునో తెలుపుడు'' అని ప్రేమతో రాముడు మునిని కోరెను.

ముని తన మనమున నవ్వుకొనెను. ''సకలమార్గములు నీకు సుగమములే కదా!'' అని అతడు ప్రత్యుత్తరమిచ్చెను. రామునివెంట వెడలుటకు ముని తన శిష్యులను పిలిచెను. పిలువగానే ఆనందమున ఏబదిమంది శిష్యులు ఏతెంచిరి. వారి కందరికి రామునియందు ఆపారమగు ప్రేమ.

''మార్గము మాకు తెలియును'' అని అందరు నుడివిరి. భరద్వాజముని బహుజన్మలలో సుకృతమొనర్చిన నలుగురు వటువులను రామునివెంట పంపెను. మునికి వందనమొనరించి ఆయనయొక్క ఆజ్ఞనుపొంది ప్రముదితహృదయుడై రఘునాథుడు బయలుదేరెను. ఏదైన ఒక గ్రామమును సమీపించినంతనే ఆ గ్రాహమునందలి స్త్రీలు, పురుషులు పరుగెత్తుకొని వారిని చూచుటకు వత్తురు. జన్మసాఫల్యముపొంది వారు సనాథులగుదురు. తమ మనస్సులను ప్రభునివెంట పంపి దుఃఖితులై మరలుదురు !

రాముడు వటువులకు వినయమున వీడ్కోలు చెప్పెను. తమ వాంఛితములను సఫలము కావించుకొని వటువులు మరలిరి. రామలక్ష్మణులు యమునాతటమున ఆగి ఆ నదీ సలిలమున స్నానము చేసిరి. రాముని శరీరమువలె యమునానదీ జలము నల్లనిది. యమునానదీతీర నివాసులగు స్త్రీలు, పురుషులు సీతారామలక్ష్మణుల రాకను గురించి వినిరి. తమ తమ పనులను మరచి వారు పరుగెత్తుకొనివచ్చిరి. వారి సౌందర్యమును వీక్షించిరి. 'తమ భాగ్యమే భాగ్యము' - అనుకొనిరి. రామలక్ష్మణులను ప్రశ్నించి వారి పేర్లను, ఊళ్ళను తెలిసికొనవలెనని వారి కాంక్ష. ఐనను వారిని అడుగుటకు వెనుకాడుచున్నారు.

ఆ జనులలో వయోవృద్ధులు. చతురులు ఉన్నారు. యుక్తిచే వారు రాముని గుర్తింపకలిగిరి. తండ్రి ఆనతిచే తాము అడవికి వచ్చితిమని రామలక్ష్మణులు తమ కథ అంతయు వారికి వివరించిరి. ఆ కథను విని ఆ ప్రజ లెల్లరు విషాదము చెందిరి. 'రాజు, రాణి చేసిన పని మంచిది కాదని వారు విచారించిరి.

ఆ సమయమున ఒక తాపసి అచ్చటికి ఏతెంచెను. ఆతడు తేజోరాశి. పిన్న వయస్కుడు. సుందరుడు. ఆతని ప్రకృతి కవికి అగోచరము, విరాగివేషము, మనో, వాక్‌ , కర్మలచే రామభక్తుడు, అతడు తన ఇష్టదైవమును ఆతడు గుర్తించెను. అతని కన్నుల నీరు నిండెను. తనువు పులకించెను. కట్టెవలె ఆతడు నేలపై రాలెను. అతని స్థితి వర్ణనాతీతము. పులకితుడై రాముడు ఆతనిని ప్రేమపూర్వకముగా ఆలింగనము కావించుకొనెను. పరమ దరిద్రునికి పరశువేది లభించినట్లైనది! '' ప్రేమయు పరమార్థము రెండును శరీరమును ధరించి కలసికొనినవి!'' అని అందరు అనుకొనిరి. పిదప ఆ తాపసి లక్ష్మణుని పాదములను పట్టుకొనెను. అనురాగముతో ఉప్పొంగి లక్ష్మణుడు అతనిని లేవనెత్తెను. అనంతరము సీతయొక్క పాదధూళిని తాపసి తన తలపై తాల్చెను. 'అతడు తన చిన్నబిడ్డడ' ని ఎంచి సీత అతనికి ఆశీస్సుల నిచ్చెను. నిషాదుడు - గుహుడు అతనికి సాష్టాంగ సమస్కారము చేసెను. 'గుహుడు రామ మిత్రుడని భక్తుడ'ని తెలిసికొని తాపసి అతనిని కౌగలించుకొనెను. ఆ తాపసి కన్నులారా రాముని సౌందర్యామృతమును ఆస్వాదించెను. ఆకలిగొన్నవాడు మృష్టాన్నము లభించినంతట సంతసించునట్లు అతడు ముదము చెందెను.

''ఇట్టి సుందరులగు బాలకులను అడవికి పంపిన ఆ తల్లిదండ్రులు ఎట్టివారో మిత్రమా!'' అని జనులు ప్రశ్నంచుకొనుచున్నారు.

సీతారామలక్ష్మణుల రూపములను వీక్షించి స్త్రీ. పురుషు లెల్లరు ప్రేమచే వ్యాకులపడిరి.

అనంతరము రఘువీరుడు నఖుడగు గుహునికి అనేక విధముల బోధించెను. రాముని ఆనతిని తలదాల్చి గుహుడు త ఇంటికి మరలెను.

సీతారామలక్ష్మణులు మరి ఒకసారి చేతులెత్తి యమునానదికి ప్రణామము చేసిరి. రవిపుత్రిక అగు ఆ నదిని ప్రశంసించుచు, సీతాసమేతులై, ముదితులై ఆ ఇరువురు అన్నదమ్ములు ముందుకు సాగిరి. దారిలో అనేక మంది యాత్రికులు వారిని కలసికొనిరి. రామలక్ష్మణులను చూచి వారు --

''మీ సర్వాంగములయందు రాజచిహ్మములను కనుగొని మా హృదయములలో అతివిచారము కలుగుచున్నది. పాదచారులై అరుగుచున్నారు. మీరు. జ్యోతికశాస్త్రము అసత్యమని దీనిచే మాకు తోచుచున్నది కఠినమగు మార్గము. అన్నియు కొండలు- దట్టమగు అడవి. దాటుల అతిదుస్తరము. దీనికి తోడు మీ వెంట సుకుమారి అగు ఒక స్త్రీ కూడా ఉన్నది. ఏనుగులతో, సింహములతో నిండిఉన్న ఈ అడవి చూచుటకే అతిభయంకరముగా ఉండును. మీరు ఆజ్ఞ ఇచ్చుచో మేమునూ మీ వెంట వత్తుము. మీరు మీ గమ్యస్థానము చేరగానే మీకు మేము నమస్కరించి మరలి పోదుము'' అని ప్రేమవశులై, పులకితగాత్రులై, జలపూరితనేత్రులై వారు వచించిరి. కృపాసింధువగు రాముడు వినీత, మృదవచనములను పలికి వారిని వెనుకకు పంపెను. సీతారామలక్ష్మణులు పయనించుదారిలో ఉన్న పల్లెలను, గ్రామములను - చూచి సురల, నాగుల పట్టణములు ఈర్ష్య చెందినవి. ''ఏ పుణ్యశాలి, ఏ శుభఘడియలో వీనిని నిర్మించోనో! ఇంత పుణ్యమయములై అతిసుందరముగా ఉన్నవి!'' అని ఆయా పట్టణాధి దేవతలు అనుకొనిరి.

రాముడు పాదము మోపిన స్థలములకు అమరావతి యైనను సరిరాదు. రాముడు పయనించు మార్గముల సమీపమున నివసించువారును మహాపుణ్యపుంజములు. సురపురవాసులు సహితము వారిని కొనియాడుచున్నారు. సీతాలక్ష్మణ సమేతుడగు రాముని, ఘనశ్యాముని - కన్నులార కనుగొన్నవారు ధన్యులు ! రాముడు స్నానము చేసిన నదులను, తటాకములను - దేవనదులు, దేవసరోవరములు పొగడుచున్నవి. ప్రభువు ఆసీనుడగుటకు నీడ ఇచ్చు తరువులను కల్పతరువులు ప్రశంసించుచున్నవి. రామపాద పద్మపరాగమును స్పృశించి పృథ్వి తన భాగ్యమే భాగ్య మనుకొనుచున్నది. మేఘములు నీడ నిచ్చుచున్నవి. దేవతలు పూలవాన కురింపిచుచున్నారు. ఈర్ష్యాపూరితముగా కొనియాడుచున్నారు. గిరులను, వనములను, ఖగములను, మృగమును వీక్షించుచు రాముడు మార్గమున నడచి వెడలుచున్నాడు.

సీతాలక్ష్మణ సహితుడై రఘుపతి ఒక గ్రామమును సమీపించెనో - ఆతని రాకను వినగానే బాలురు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరు తమ ఇండ్లను, పని పాటలను మఱుతురు. వారిని దర్శించుటకై వడివడిగా అరుగుదురు. సీతారామలక్ష్మణుల రూపములను వీక్షించి కన్ను లున్నందుకు ఫలితమును పొందుదురు. ఆనందింతురు. వారి కన్నుల నీరు క్రమ్మును. వారి శరీరములు పులకించును. ఆ ఇరువురు సోదరులను వీక్షించి వారు ఆనందమగ్నులగుదురు. వారియొక్క స్థితిని వర్ణింపలేము. నిరుపేదకు సురమణిరాసి దొరకినట్లుండును.

''కన్నులున్నందుకు ఈ క్షణమే ప్రయోజనము పొందుడు'' అని గ్రామస్థులు ఒకరికొకరు బోధించుచున్నారు. కొందరు రాముని చూచిరి. భక్తులైరి. రామునివెంట నడచిపోవసాగిరి. మరికొందరు కన్నులారా రాముని సౌందర్యమును వీక్షించినారు. వారి హృదయమున ఆ సౌందర్యము హత్తుకొ నెను. ఇక వారి తనువులు, మనస్సులు మాటలు పట్టు తప్పెను. కొందరు ఒక మఱ్ఱిచెట్టుయొక్క చల్లని నీడను చూచిరి. మెత్తని గడ్డిని ఆకులను అక్కడ పరచిరి.

''క్షణమాత్రము ఇక్కడ విశ్రమించుడు, మీ శ్రమ తొలగును. వెంటనే వెడలవచ్చును. లేక ఉదయమే పయనము సాగించవచ్చును.'' అని వారు వేడిరి.

"మరికొందరు పాత్రనిండ నీటిని తెత్తురు. "ప్రభూ, సేవించుము" అని మృదువచనములను పలుకుదురు. వారి ప్రియవచనములను విని, మిక్కుటమగు ప్రేమను కని కృపాళుడు, సుశీలుడు-రాముడు-సీత అలసి ఉన్నట్లు కనుకొని ఒక గడియసేపు చెట్టునీడను సేద తీర్చుకొనును. స్త్రీలు, పురుషులు ఆనందమున ఆతని శోభను తిలకింతురు. అనుపమమగు ఆ రూపము వారి నయనములను, మనములను మోహింప చేయుచున్నది. మోహితులై ఎల్లరు రామచంద్రుని చుట్టు నిలచి చంద్రుని చుట్టుచేరు చకోరములవలె రెప్ప వాల్చక చూతురు! నూతన తమాల వృక్షమును పోలుకాంతితో రాముని శరీరము అత్యంత శోభాయమానమై ఉన్నది. దానిని చూచిన చాలు. కోటి మదనులు మానసములు మోహపరవశమగును. విద్యుత్కాంతి సన్నిభ శరీరముతో లక్ష్మణుడు కడుసుందరుడై వెలసుగొందుచున్నాడు. అతడు నఖశిఖ పర్యంతము సర్వాంగసుందరుడు. అతిమనోహరుడు. ఇరువురును మునివల్కలధారులు, నడుములయందు బిగింపబడిన తూణీరములు. కరకమలములయందు అత్యంత శోభాయమానములైన ధనుర్బాణములు, సుందర విశాల నేత్రములు, శిరముల జటాజూటములు, విసాల వక్షస్థలములు, నిడుపగు భుజములు, విరివియగు నయనములు, శరత్పూర్ణిమా చంద్రుని పోలువారి సుందరవదనముపై శోభిల్లు స్వేదకణజాలములు.

మనోహరులగు ఆ జంటయొక్క శోభ అత్యధికము. నాయొక్క బుద్ధియో అతిస్వల్పము. తమ మనస్సులను, బుద్ధిని, చిత్తముని కేంద్రీకరించి అందురు సీతా రామలక్ష్మణుల సౌందర్యమును తిలకించుచున్నారు. దీపమును చూచిన జింకలవలె స్త్రీలు, పురుషులు ప్రేమపిపాసులై అలసట చెందుచున్నారు.

గ్రామీణస్త్రీలు సీతను సమీపింతురు. అతి ప్రేమచే వారు ఆమెను ప్రశ్నించుటకు వెనుకాడుదురు! వారు పదే పదే ఆమెయొక్కపాదములను స్పృశింతురు. సహజ, సరళ, మృదువచనములతో "రాకుమారీ, మేము ఏదోనిన్ను అడుగవలెననుకొందుము. కాని, స్త్రీ స్వభావమున నిన్ను ప్రశ్నింపవలెనన్న భయమగుచున్నది. మా సాహసమును మన్నింపుము, తల్లీ, పల్లెటూరివారిమని మాపై చడు తలపకుము. ఈఇరువురు రాకొమరులు సహజలావణ్యరాసులు! మరకత, సువర్ణములు తమకాంతిని వీరినుండియే పుణికి పుచ్చుకొనినవి. శ్యామవర్ణుడు, గౌరవర్ణుడు సుందరకిశోరవయస్కులు. సౌందర్యశోభానిలయులు. శరత్పూర్ణిమా చంద్రభాననులు. శరత్‌ సరోరూహ నేత్రులు. సుముఖీ, తమ లావణ్యముచే కోటి మన్మథులను సిగ్గుపడునట్లుచేయు వీరు ఏమగుదురు నీకు? తెలుపవమ్మా" అనివారు ప్రశ్నించిరి.

ప్రేమమయమగు వారి మంజులవాణిని విని ఆ సుందరి సిగ్గుచెందెను. ఆమె తనలోతాను చిరునవ్వు నవ్వుకొనెను. వారివంక చూచెను. సిగ్గుపడెను. తలవాల్చెను. నేలవంక చూచెను. ఆ రమణి బిడియము ద్విగుణీకృతమయ్యెను. ఆమె కలవరపడెను. బాలమృగనేత్రి. పికవాణి-సీత లజ్జతో ప్రేమ సహితముగా మధురవచనములను ఇట్లుపలికెను.

" సహజస్వభావుడు, సుందరుడు, గౌరవర్ణశరీరుడు నా చిన్నమఱది అతడు-పేరు లక్ష్మణుడు" అని ఆమె లక్ష్మణుని చూపెను. తన చేలాంచలముతో వదనమును కప్పుకొని తన ప్రియునివంక దృష్టిని ఆమె మరల్చెను. కనుబొమ్మలతో రామునివంక సంజ్ఞ చేసెను. కాటుకపిట్టవలె తన కన్నులను వంకర టింకరగా త్రిప్పెను. "ఈయన నాపతి" అనునట్లు సంకేతముతో తెలిపెను.

గ్రామీణ స్త్రీలందరు దరిద్రులు ధనరాసులు కొల్లగొట్టినట్లు ఆనందించిరి. అత్యంతప్రేమతోవారు సీతయొక్క పాదములపై పడిరి. అనేకవిధముల ఆమెను దీవించిరి.

"శేషునిశిరమున పృథ్వి నిలచువరకు సదా సౌభాగ్యవతివై ఉండుము"ని ఆశీర్వదించిరి." దేవీ, మాపై దయ వీడకు"మని వేడిరి. "పార్వతివలె పతికి ప్రియురాలివి కమ్ము. చేతులెత్తి నీకు వినతిచేతుము. నీవు తిరిగి ఈదారినేరమ్ము" అనిరి. "మేము నీ దాసీలము అని తెలిసికొని మాకు దర్శనమిమ్ము" అని కోరిరి.

వారియొక్క ప్రేమతృష్ణను సీత కనుగొనినది. నల్ల కలువలను వికసింపజేసి వెన్నెలపుష్టి కలుగుచేసెనో అనునట్లు మధురవచనములను ఆమె పలికి, పలికి వారిని సంతుష్టులను కావించినది.

అనంతరము రఘువరుని ఇంగితమును గ్రహించి లక్ష్మణుడు ఆ ప్రజలను మృదువాణితో మార్గమును గురించి ప్రశ్నించెను. ఆ ప్రశ్నను వినగానే స్త్రీలు, పురుషులు దుఃఖితులైరి. వారిశరీరములు పులకితమయ్యెను. కన్నులు నీరునిండెను. ఆనందము నశించెను. విధి తానుప్రసాదించిన నిధిని తానే తిరిగి లాగి తీసికొనిపోయినాడని వారెల్లరు చింతించిరి. కర్మగతిని తలచుకొని ధైర్యము వహించిరి. బాగుగా నిర్ణయించి సుగమమగుమార్గమును తెలిపిరి. జానకీ లక్ష్మణసహితుడై రఘునాథుడు పయనమయ్యెను. అందరికి ప్రియమగు పలుకులునుడివి. వారిని అతడు తిరిగిపంపించెను. వారి మానసములను మాత్రము తనవెంట తోడ్కొనిపోయెను. తిరిగి అరుగురూ, స్త్రీ, పురుషు లెల్లరు కడుచింతించిరి. దైవమును నిందించిరి.

"ఆ విధాత చేయుపనులన్నియు తారుమారులే," అని విచారముతో వారు ఒకరితో ఒకరు నుడువమొదలిడిరి.

"ఆ బ్రహ్మ-నిరంకుశుడు-నిర్దయుడు, నిర్బయుడు, చంద్రుని రోగికావించి కళంకుని చేసినాడు. కల్పవృక్షమును ఒక చెట్టును చేసినాడు. సముద్రుని ఉప్పగా సృష్టించినాడు. అతడే ఈ రాకుమారులను అడవులకు పంపినదియు వీరికి వనవాసమును విధించిన విధి భోగవిలాసములను వ్యర్థముగా సృష్టించినాడు పాదరక్షలు లేకనే ఇట్టివారు నడచిపోవునప్పుడు ఇక అనేకవాహనములను అతడు సృష్టించుట వ్యర్థము. దర్భలు, ఆకులు పరచుకొని నేలపై వీరు పరుండునపుడు సుందరమగు శయ్యలను ఆ విధాత ఎవరికొరకు సృజించెనో? చెట్లనీడలనే వీరికి నివాసస్థలముగా చేసి ఆ విధాత రమణీయ భవనములను సృష్టించి వృథాగా శ్రమపడినాడు. ఈ సుందర, సుకుమారవరులు మునివల్కలమును జటలను ధరించునపుడు-మరి ఆ విధి వివిధ విధములగు భూషణములను, వస్త్రములను ఏల వృథాగా సృష్టించవలె? వీరు కందమూలఫలములను భుజించునపుడు ఇక జగత్తును సుధ మొదలుగ ఆహారములు నిరువయోగములే" అని వారు నడువుచున్నారు.

"వీరు సహజసుందరు. స్వయంభువులు విధి సృజించినవారు కారు. మనకన్నుల, చెవుల మనస్సులద్వారా అనుభవవేద్యమగు ఆ విధాతయొక్క చర్యలు-వేదములు వర్ణించినంతవరకు పదునాలుగు లోకములలో గాలించి వెదకిచూచినను ఇట్టి పురుషులు, ఇట్టి స్త్రీ ఎక్కడ ఉన్నారు? వీరినిచూచి విధియొక్క మనస్సు అనురాగభరితమయ్యెను. అంతట అతడు వీరినిపోలిన ఇతర స్త్రీ, పురుషులను సృజింప మొదలిడెను. ఎంతో శ్రమపడెను. కాని ఎవ్వరూ వీరిపోలికకైనను సరిరాలేదు. ఆ ఈర్ష్యచే విధివీరిని అడవితెచ్చిదాచివైచెను" అని ఒకడు పలికెను.

మరికొందరు:_"మనకు ఎక్కువగా ఏమియు తెలియదు. మనము మహా ధన్యులమని తలచుచున్నాము. వీరిని చూచినవారు, చూచుచున్నవారు, చూడబోవువారు సహితము పుణ్యపుంజలని మాతలంపు" అనెను

ఇట్లు ప్రియవచనములను పలికి, పలికి అందరు కన్నీరు, కార్చిరి, "అత్యంత సుకుమారులగు వీరు దుర్గమమగు ఈ మార్గమునఎట్లుపోగలరు"? అన అనుకొనిరి. ప్రేమవశమున స్త్రీలు కలవరము పొందిరి. సంధ్యాసమయమున చక్రవాకము వియోగ దుఃఖమును అనుభవించునట్లున్నది.

"వీరి పాదకమలములు మృదువైనవి, మార్గమో అతి కఠినమైనది" అని ఎఱిగి వ్యధితహృదయులై వారు వమృదువచనములను ఇట్లు పలికిరి:_

"వీరి కోమల, అరుణారుణచరణములను స్పృశించినంతనే మహీతలము-మన హృదయమువలవలెనే సిగ్గుచెందును. జగదీశ్వరుడు వీరికి వనవాసమే వ్రాసిపెట్టి నప్పుడు వీరిమార్గము అంతకయు పుష్పమయమైనను ఏల కావించలేదో" మనము బ్రహ్మ దేవుని ఏదైన వరము కోరుకొనుచో, వీరిని మన కండ్లఎదుటనే ఉంచుమని వేడుకొందము మిత్రమా!"

సకాలమున అచ్చటికివచ్చి సీతా రామలక్ష్మణులను దర్శింపజాలని స్త్రీలు, పురుషులువారియొక్క సౌందర్యమునుగురించి విని, వ్యాకులపడి "సోదరా, వారు ఇప్పటికి ఎంతవరకు వెళ్ళి ఉందురు?" అని అడిగితెలిపికొనుచున్నారు. వారిలో బలశాలులు పరుగిడి వారినిచూచి-ఆనందమును తిరిగివచ్చి జన్మసాఫల్యత పొందుచున్నారు. అబలలు, బాలకులు, బాలికలు, వృద్ధులు చేతులు నులుముకొని పశ్చాత్తాపము చెందుచున్నారు. ఇట్లు రాముడు కాలిడిన ప్రదేశములయందెల్ల ప్రజలు ప్రేమవశులగుచున్నారు. భానులకు కమలా మనోహరచంద్రుడగు రాముని దర్శించి గ్రామ గ్రామము ప్రజలు ఇట్లు ఆనందించుచున్నారు.

రామ వనవాసమునుగూర్చి ఏమాత్రమైనను వినిన ప్రజలు దశరథునిపై, కైకపై దోషము ఆరోపించుచున్నారు.

"నరనాథుడు చాలా మంచిపనిచేసినాడు మన కన్నులకు సాఫల్యత చేకూర్చివాడు" అని కొందరనిరి. స్త్రీలు, పురుషులు ఒకరితో వఒకరు ఇట్లు సరళ, ప్రేమ పూర్వక సంభాషణలు సలుపుచున్నారు.

"వీరినికన్న తల్లిదండ్రులు ధన్యులు! వీరు విడిచివచ్చిన నగరము ధన్యమయ్యెను. వీరు వెడలు దేశములు, శాలములు, వనములు, గ్రామములు ధన్యములు వీరిని సృజించి విరించియును ఆనందము కాంచెను. విరించికి వీరు సకలవిధముల చెలికాండ్రు."

రామ లక్ష్మణుల బాటసారులై వచ్చుచున్నారను ఆనుందప్రదవార్త అన్నిమార్గములయందును, ఆడవియందు వ్యాపించినది.

ఇట్లు-రఘుకుల కమలములకు రవి అగు రాముడు మార్గమునందలి ప్రజలకు ఆనందము నొసగుచు, జానకీ, సౌమిత్రులతోకూడి వనమును వీక్షించుచు నడచిపోవుచున్నాడు.

ముందు రాముడు, వెనుక లక్ష్మణుడు తాపనవేషములలో విరాజిల్లుచున్నారు. వారిరువురి మధ్య- పరబ్రహ్రమకును జీవునికిమధ్య మాయవలె సీత ఎట్లు శోభిల్లుచున్నదో!

నా మానసమున గోచరించు మరి ఒక రీతిని ఆ శోభను వర్ణింతును. వసంత ఋతువునకు వలరాయనికి మధ్య రతి శోభించునట్లున్నది! నా మనమున గాలించి ఇంకొక సాదృశ్యమును వచింతును. చంద్రునికి బుధునికి మధ్య రోహిణి విరాజిల్లునట్లున్నది-సీత!

ప్రభుని పాదరేఖలకు ఒకదానికి మరి ఒకదానికి మధ్య అడుగిడుచు, భయపడుచు మార్గమున నడచుచున్నది. ఆమె,

ఇక లక్ష్మణుడు-సీతారాముల ఇరువురి చరణ-చిహ్నములను పరిరక్షించుచు, అవి తన కుడివై పుననే ఉండునట్లు అతడు నడచుచున్నాడు.

సీతారామలక్ష్మణుల సుందరప్రేమ అనిర్వచనీయమైనది. దానిని వర్ణించుట ఎట్లు? ఖగములు, మృగములు సహితము వారి సౌందర్యమును తిలకించి ఆనందమున మునుగుచున్నవి. పాంథుని రూపమున రాముడు వాని చిత్తములను దోచుకొని పోవుచున్నాడు.

ప్రియపథికులు, సీతాసహితులు ఆగు ఆ ఇరువురు సోదరులను కనుగొనిన వారెల్లరు దుర్గమమగు భవమార్గమును శ్రమ లేకయే-ఆనందమున తరించిరి. నేడు సహితము సీతా రామ లక్ష్మణులు మూవురు తెరువరు-ఎవని హృదయమును- స్వప్నముననైననుసరే-ఎన్నడైన వసించుచో-అట్టివాడు-మునులకైనను దుర్లభమగు శ్రీరామదామమునకు మార్గమును కనుగొనును!

అంతట, సీత అలపిఉన్నట్లు రఘువీరుడు గ్రహించెను. సమీపముననే ఒక వటవృక్షమును, శీతలజలమును చూచెను. ఆనాడు వారందరు అచ్చట విడిది చేసిరి. కందమూలఫలములను భుజించిరి. మరునాటి ప్రాతఃకాలమున స్నానముచేసి రఘునాథుడు పయనము సాగించెను. రమ్యమగు వనములను, శైలములను, సరస్సును వీక్షించుచు ప్రభువు వాల్మీకి ఆశ్రమమును చేరెను. ఆ ముని నివసించు ప్రదేశము మిక్కిలి సుందరమైన ఉన్నట్లు ఆతడు కనుగొనెను. రమణీయమగు గిరులు. కాననములు, పావనమగు జలము అచ్చట కలవు. సరోవరములయందలి సరోజములు, వనములయందలి వృక్షములు పుష్పించి ఉన్నవి. మకరంద రసాస్వాదనమున మునిగి ఉన్న మధుపములు మంజుల, మధుర నిస్వనములు సలుపుచున్నవి. ఖగములు, మృగములు విపుల కోలాహలము కావించుచున్నవి. వైరమునువీడి, ముదిత మానసములతో విహరించుచున్నవి.

పవిత్రమై, సుందరముగా ఉన్న ఆశ్రమమున చూచి రాజీవనయనుడు, రాముడు సంతపించెను. రఘువరుని రాకను విని వాల్మీకముని అతనిని ఆహ్వానించుటకు ముందుకు వచ్చెను. రాముడు మునికి సాష్టాంగ నమస్కారము చేసెను. విప్రవరుడు రాముని ఆశీర్వదించెను. రఘువరుని సౌందర్యము మునియొక్క నేత్రములకు ముదము చేకూర్చెను. వాల్మీకి రాముని సన్మానించి ఆశ్రమములోనికి తోడ్కొని వెడలెను. ప్రాణ ప్రియులగు అతిథులు లభించిరి. మునివరుడు వారికై మధురఫలములను, కందమూలములను తెప్పించెను. సీతారామలక్ష్మణులు ఫలములను ఆరగించిరి. విశ్రమించుటకు ఒక చక్కని స్థలమును వాల్మీకి వారికి చూపించెను. మగళమూర్తి- అగు రాముని కన్నులార కనుకొని వాల్మీకి తన మనమున మహా ఆనందము పొందెను.

అంతట రాఘునాథుడు కరకమలములను జోడించి "మునినాథా, నీవు త్రికాలదర్శివి. విశ్వమెల్లయునీకు కరతలబదరీఫలము" అని వీనులకు విందగు వచనములు వచించెను. ప్రభువు తన వృత్తాంతమునంతయు- రాణికైకేయి తనకు ఏ రీతిని వనవాసము విధించెనో, వివరముగా వర్ణించి చెప్పెను.

"స్వామి, నా తండ్రియొక్క ఆజ్ఞ, తల్లియొక్క హితము, భరతునివంటి సోదరుడు రాజగుట, తమవంటివారి దర్శనము కలుగుట-ఇవి అన్నియు నా పుణ్యప్రభావములే. మునిరాజా, నీ చరణ సందర్శనచే నేడు నా సుకృత మెల్లయు సఫలమయ్యెను. మునులు, తాపసులు ఇక్కట్లు పొందు దేశమును పాలించు ప్రభువులు అగ్నిలేకయే దహింపబడి భస్మమగుదురు. విప్రుల సంతేషమే మంగళములకు మూలము. భూసురుల క్రోధము కోటి కులములను దహించివైచును. ఈ విషయము మనస్సున నిలుపుకొని-సీత సౌమిత్రులతో కలసి నేను నివసించుటకు తగు ప్రదేశమును- మునులకు ఎవ్వరికి ఎట్టి అసౌకర్యము కలిగంచనిదానిని చూపించుడు. తమ ఆనతిని అక్కడఒక సుదర వర్ణతృణశాలను నిర్మించుకొని కొలదికాలము నివసింతును" అని ఆతడు వాల్మీకిని వేడెను.

రఘువరుని సహజ సరళవాణిని విని జ్ఞాని అగు ముని- వాల్మీకీ "మంచిది, మంచిది- లెస్సగా పలికితివి" అనెను. "రఘుకుల ధ్వజస్వరూపా నిరంతర వేదపాలకుడవు నీవు. ఇంతకంటే వేఱుగా ఎట్లు వచింతువు! రామా, నీవు వేదసంరక్షకుడవు. జగదీశ్వరుడవు. జానకి నీ మాయ. కృపానిధివగు నీ ఇంగితమును గ్రహించి ఆమె జగమును సృష్టించును. పాలించుచు. సంహరించును. సహస్రశీర్షుడు-నాగరాజు, ధరణీధరుడు అగు ఆ ఆదిశేషుడే లక్ష్మణుడు. దేవతా కార్యమునకై నరపాలుని రూపమును ధరించి, దుష్టనిశాచరదళమును సంహరించుటకై అవతరించితివి.

రామా, నీ స్వరూపము వాచామగోచరము. బుద్ధికి అతీతము. అవ్యక్తమైనది. అపారమైనది, వర్ణనాతితమైనది. వేదములు సదా 'నేతి-నేతి' అని దానిని వర్ణించును. జగమంతయు దృశ్యము. దాని ద్రుష్టవు నీవు. బ్రహ్మ, విష్ణు, శంభులను సహితము నీవు ఆడింతువు. నీ మర్మమును వారైనను తెలియలేరు. ఇంకెవ్వరు నిన్ను తెలిసికొనగలరు? నీవు తెలిసికొనవచ్చినవాడే నిన్ను తెలియగలడు. నిన్ను తెలిసికొనగానే అతడు నీ స్వరూపమును పొందును. రఘునందనా, భక్తహృదయచందనా, నీ కృపచేతనే భక్తుడు నిన్ను తెలియగలడు. నీ దేహము చిదానందమయము. వికారరహితము. జ్ఞానులు మాత్రమే ఈ రహస్యమును తెలిసకొన అర్హులు, భక్త, దేవతా కార్యసిద్ధికై నీవు మానవశరీరమును ధరించితివి. కాని, ప్రాకృతరాజువలె వచించుచున్నావు. ఆచరించుచున్నావు.

రామా, నీ చరితను కని, విని జడులు మోహమును పొందుదురు. పండితులు సుఖులగుదురు. నీవు పలుకునది. సలుపునది -సర్వము సత్యము. వేషము ననుసరించియే నాట్యము చేయవలెనుకదా? "నేను ఎక్కడ నివసించగలను?" అని అడితిని నన్ను. ఒక్క ప్రశ్న- అడుగుటకే నేను సంకోచించుచున్నాను. నీవులేని స్థలము ఏదియో తెలుపును. నీకు వాసయోగద్యమగుస్థలమును అప్పుడు నేను చూపింతును" అని ఇట్లు వాల్మీకి వచించిన ప్రేమరస సంభరిత వచనములను విని రాముడు సిగ్గుతో తన మనమున చిరునవ్వు నవ్వుకొనెను. వాల్మీకియు నవ్వి అమృత రసపూరితమగు మధుర వచనములను ఇట్లు నడిపెను:_

"రామా, వినుము, సీతాలక్ష్మణ సహితుడవై నీవు నివసించుటకు తగు స్థలమునుఇక తెలియచేతును. నీ కమనీయ కథలనబడు అనేక రమణీయ నదులచే నిరంతరము ఎవని చెవులు సముద్రమువలె నిండుచున్నను తృప్తిచెందవో-అట్టి వాని హృదయము నీ మందరిము.

నీ రూపమను మేఘమును దర్శించుటకై ఉవ్విళ్లూరుచు తమ నయనములను చాతకపక్షులుగా కావించుకొనువారి మానసమే నీ మందిరము.

మహానదులను, సముద్రములను, సరస్సులను తృణీకరించి చాతకపక్షి జలధరమును చూడగోరునట్లు నీ సచ్చిదానంద సౌందర్యమునందలి ఒక బిందువచే సుఖలగు వారి హృదయములే నీ సదనములు. రఘునాయకా, అట్టివారి సుఖదాయకమగు హృదయములయందు నీవు సీతాలక్ష్మణ సహితుడవై వసియింపుము.

నీ కీర్తి అన మానససరోరమున ఎవని జిహ్వ హంసయై, నీ గుణగణము లనబడు ముత్యములను ఏరుకొని తినునో, రామా, అట్టివాని హృదయమున నివసించుము.

నీకు సమర్పింపబడు పవిత్ర, సుందరద్రవ్య సౌగంధమును ఆదరముతో నిత్యము ఎవ్వని నాసిక ఆ ఘ్రాణించినో_

నీకు నివేదింపబడినదానినే ఎవ్వడు భుజించునో, నీకు ప్రథమమున సమర్పించిన వస్త్ర, ఆభుషణములనే ఎవ్వడు ధరించునో_

దేవతలను, గురువులను, ద్విజులను చూచినంతనే ఎవని శిరము కడునమ్రతతో, ప్రేమతో వంగి, నమస్కరించునో_

నిత్యము ఎవని కరము రామచరణ పూజ సలుపునో, ఎవని హృదయమున నీయందే విశ్వాసము ఉండునో, ఇతరులపై ఎట్టి విశ్వాసము ఉండదో_

ఎవని చరణములు శ్రీరామ తీర్థములకు యాత్ర చేయునో రామా, అట్టివారి మనసులయందు నివసించుము.

నిత్యము నీ మంత్రరాజమును జపించువారి మనములయందు పరివార సహితుడవగు నిన్ను పూజించువారి హృదయముల యందును.

నానావిధులగు తర్పణము, హోమము చేయువారియొక్క విప్రులకు భోజనమిడి, అనేక విధములగ దానము లిచ్చువారియొక్కయు.

నీకంటె తమ గురువులనే అధికులనుగా తమ హృదగయములందు భావించి వారిని సకలభావములచే సన్మానించి సేవించువారియొక్కయు.

ఈ సర్వమును ఆచరించి, "రాముని చరణములయందు భక్తిచే ఏకైక ఫలము" గా కోరువారియొక్క మానసమందిరములయందు సీతాసహితులై రఘునందనులు మీ రిరువురు వసియంపుడు.

కామము, క్రోధము, మదము, అభిమానము, మోహము, లోభము, రాగము, ద్వేషము, కపటము, దంభము, మాయ-ఇవి ఏవియు లేనివారి హృదయములయందు రఘునాథా, నీవు నివసింపుము.

అందరికి ప్రమపాత్రుడు, సర్వహితకారి, సుఖ-దుఃఖములను, నిందాప్రశంసలను సమముగా చూచువాడు, చక్కగా ఆలోచించి సత్యమును, ప్రియమును పలుకువాడు, మేల్కొనినపుడు, నిద్రించునపుడు కూడా నిన్ను శరణు పొందువాడు, నీవు తప్ప ఇతర గతి ఏదియు లేదని తలుచువాడు, అగు అట్టివాని హృదయమున రామా, నీవు వసింయిపుము.

పరస్త్రీని, తన కన్నతల్లివలె, సరధనమును విషముకంటే విషముగా పరిగణించువారి-పరుల సంపదను చూచి సంతసించువారి- పరుల విపత్తిని చూచి మిక్కిలి దుఃఖించువారి-నిన్ను ప్రాణసమానప్పియునిగా భావించువారి మానసములు రామా, నీకు వాసయోగ్యమగు శుభ భవనములు, నీవే స్వామివి, సఖుడవు. తండ్రివి, తల్లివి, గురుడవు, సర్వము అగునట్టివారి మానసమందతిరములయందు నీవును. నీ సోదరుడును - సీతాసమేతులై వసియింపుడు.

పరుల అవగుణములను విడిచి, వారి సుగుణములను గ్రహించువారి గో, బ్రహ్మణ హితార్థమై కష్టములను సహించువారి, నీతి, నిపుణతలయందు ప్రతిష్ఠ కలవారి మానసములే నీ సన్మందిరములు, తమ సద్గుణములకు, నీవు బాధ్యుడవనియు తమ దోషములకు తామే బాధ్యులనియు ఎంచి సర్వవిధములు నీపై ఆధారపడువారి, రామభక్తులను ప్రేమించువారియొక్క హృదయములందు వైదేహీ సహితుడవై నీవు వసియింపుము.

జాతి, పంక్తి, ధనము, ధర్మము, గొప్పతనము, ప్రియజనములను, సుఖదాయక ములగు గృహములను అన్నిటిని విడిచి నిన్నె ఎవ్వడు తన ఉరమున ధరించునో రఘునాథా అట్టివాని హృదయమున నీవు వసింపుము.

స్వర్గము, నరకము, మోక్షము ఎవనికి సమానములో అట్టివాడు ఎల్లచోట్లను-ధనుర్బాణధరుడవగు నిన్నే దర్శించును.

మనోవాక్‌ కర్మలలో ఎవ్వడు నీ దాసుడో- రామా - అట్టివాని హృదయమున ఇల్లు కట్టుకొని నీవు నివసింపుము.

ఎవడు ఎన్నడు ఏదియు కోరడో, ఎవనికి నీపై సహజభక్తి ఉండునో వాని మనసున నీవు నిరంతరము నివసింపుము. అదియే నీ మందిరము."

ఇట్లు మునివరుడు రామునికి ఆతని నివాసస్థలములను చూపెను. ఆ మునివరుని ప్రేమయుత వచనములు రాముని మనమునకు ప్రీతికరము లయ్యెను.

"భానుకులనాయకా, వినుము, నీకు ప్రస్తుతము సుఖప్రదమగు ఆశ్రమమును తెలుపుదును. చిత్రకూటగిరిపై నీవు వసింపుము. అచ్చట నీకు సర్వవిధములగు సౌకర్యము లున్నవి. మనోహరములగుశైలములతో మనోజ్ఞమగు కాననము లున్నవి. ఏనుగులు, సింహములు, లేళ్లు, పక్షులు విహరించు స్థలమది. పురాణములు ప్రశంసించిన పునీతమగు నది అచ్చట ఉన్నది. అత్రిమహర్షియొక్క సతిఅగు అనసూయ తన తపోబలముచే ఆ నదిని సాక్షాత్కరింపచేసెను గంగానదికి ఉపనది అది. దాని పేరు మందాకిని, పసిపిల్లలను ఢాకినివలె అదిసకల పాపములను, భక్షించును. అత్రిమొదలగు అనేక మునివరులు యోగ, జప, తపములను కావించుచు తమ తనువలను కృశింపచేయుచు అచ్చట నివసించుచున్నారు.

రామా, నీ వేగి వారి సకల సాధనలను సఫలమొనర్చుము. ఆ పర్వత రాజమునకు గౌరవము ప్రసాదించుము" అని వాల్మీకి మహాముని చిత్రకూటముయొక్క అపారమహిమను వర్ణించెను.

సీతా సమేతులై రామలక్ష్మణులు వచ్చి సురనదియందు స్నానము కావించిరి. పిదప రఘువరుడు:_

"లక్ష్మణా, ఇది కడుసుందరమగు నదీఘట్టము, ఇచ్చట ఎచ్చటనైను మనము నివసించుటకు తగుఏర్పాటుచేయము" అని లక్ష్మణునితో చెప్పెను. లక్ష్మణుడు పయస్వినీ నదికి ఉత్తరతీరమున ఎత్తైన గట్టున కనుగొనెను. "దానికి నాలుగు వైపుల ధనురాకారమున ఒక కాలువ ప్రవహించుచున్నది. మందాకిని ఆ ధనువు యొక్క వారివలె శమ, దమ, దానములు, దాని శరములవలె, సకల కవికలుషములుదాని లక్ష్యములవలె ఉన్నవి. ఈ ధనునువు ధరించి వేటాడు జంతువునకు ఎదురుగా నిలచి గురితప్పక వేటాడగల చలింపని వేటకానివలె చిత్రకూడ పర్వతము కాన్పించుచున్నది" అని నుడివి లక్ష్మణుడు ఆ స్థలమును చూపించెను. ఆ స్థలమును కనుగొని రఘువరుడు సంతసించెను. రాముని మనసు ఆ స్థలమున లగ్నమయ్యెనని తెలిసికొని దేవతలు తమ ప్రధాన స్థపతని-విశ్వకర్మను వెంటతీసికొని బయలుదేరిరి. కోలుల, భిల్లుల వేషములను ధరించి వారు వచ్చిరి. సుందరమగు పర్ణ, తృణశాలలను వారు నిర్మించిరి. రమ్యమగు రెండు కుటీరములు నిర్మింపబడినవి. వానిని వర్ణింప శక్యము కాదు. వానియందు ఒకటి విశాలమైనది. ఇంకొకటి చిన్నది. లలితమైనది.

జానకీ లక్ష్మణులతో కలసి ప్రభువు రుచిరమగు ఆ నికేతనమున రాజిల్లుచుండెను. మదనుడే మునివేషమును ధరించి, రతీసమేతుడై, వసంతఋతు సహితుడై శోభిల్లుచున్నాడో అనునట్లున్నాడు ప్రభువు.

దేవతలు, నాగులు, కిన్నరలు, దిక్పాలకులు ఆ సమయమున చిత్రకూటమునకు వచ్చిరి వారికి అందరికి రాముడు ప్రణమిల్లెను. కన్నులున్నందుకు ఫలితమును పొంది వారు ఆనందించిరి. పూలవాన కురిపించ దేవతాసమాజము "స్వామీ, నేడు మేము సనాథులమైతిమి" అనిరి. వినతిచేసి దుస్సహమగు తమ దుఃఖములను వివరించిరి. స్వామివలన అభయము పొంది తమతమ స్థానములకు మరలిరి.

రఘునందునుడు చిత్రకూటమునకు వచ్చి నివసించుచున్నాడను వార్త విని పలువురు మునులు అతనిని సందర్శింప ఏతెంచిరి. ముని బృందముయొక్క ఆగమనమును కనుగొని రఘుకులచంద్రుడు ముదితుడై వారికి సాష్టాంగప్రణామము చేసెను. మునులు రఘువరుని ఆలింగనము చేసికొనిరి. ''నీ కార్యము సఫలమగు''నని దీవించిరి. సీతా రామ, సౌమిత్రులు సౌందర్యమును మునులు వీక్షించిరి. తమ సాధనలన్నియు ఫలించెనని వారు తలచిరి. యోగ్యమగు రీతిని ప్రభువు మునిబృందమును సన్మానించి వీడ్కోలు పలికెను. తమ తమ ఆశ్రమములయందు ఒక స్వేచ్ఛగా యోగ, జప యజ్ఞ తపములను మునివరులు కావిఁప మొదలడిరి.

రాముని రాకను గురించినవార్త భిల్లులకు, కోలులకు చేరినది., నవవిధులు వారి ఇంటికి ఆరుదెంచినట్లు వారు సంతసించిరి. కందమూలఫలములను వారు దొన్నెలలో నింపిరి బంగారమును కొల్లగొట్టుటకు దరిద్రులు వెడలుచున్నారో అన్నట్లు-వారు బయలుదేరిరి. వారియందు కొందరు రామలక్ష్మణులను ఇంతకుముందు చూచినవారున్నారు. ఇతరులు అట్టివారిని దారిలో ప్రశ్నించుచున్నారు. ఇట్లు రఘవీరుని సౌందర్యమును కొందరు ప్రశ్నించుచు. మరికొందరు వర్ణించుచు- అందరు ఆయనను సందర్శించుటకు ఏతెంచిరి. తాము తెచ్చిన కానుకలను రామునిఎదుట ఉంచి వారు ప్రణామము లర్పించిరి. మిక్కుటమగు అనురాగముతో స్వామిని దర్శించిరి. చిత్రమున వ్రాయబడినట్లువారు ఎక్కడివా రక్కడ నిలచిపోయిరి. వారి తనువులు పులకరించెను. వారికన్నుల నీరు కారెను. వారెల్లరు ప్రేమమగ్నులై ఉన్నట్లు రాముడు కనుగొనెను. ప్రియవచనములనుచెప్పి అతడు వారినెల్లరును సన్మానించెను. పదే పదే వారు రామునికి జోహారులర్పించుచు,చేతులు జోడించి ఇట్లు వినీతవచనములను వచించిరి:_

"ప్రభూ, నీ పాదసందర్శనముచే మేము ఇప్పుడు సనాథులమైతిమి, కోసల రాజా, మా భాగ్యవశముననే నీవు ఇచ్చటికి విచ్చేసితివి. స్వామి, నీవు కాలిడిననేల, అడివి, మార్గము, పర్వతము-అన్నియు ధన్యతచెందినవి, నిన్నుచూచి జన్మసాఫల్యము పొందిన వనచరులగు పక్షులు, మృగములు ధన్యత చెందెను. కన్నులార నిన్ను దర్శించిన మేము ధన్యులము. మా కుటుంబములు ధన్యము లయ్యెను. నివాసనముకు చక్కని స్థలమును ఎంచితివి. సకల ఋతువులయందు ఇచ్చట నీవు సుఖముగా ఉండవ్చచ్చును. ఏనుగుల, సింహముల, సర్పముల, పెద్దపులుల నుండి మేము మిమ్ము సర్వవిధముల సంరక్షించి మీకు సేవచేతుము. ప్రభూ, ఇచ్చటి ఘోరారణ్యములు, పర్వతములు గుహలు, లోయలు అన్నియు ప్రతి అడుగు మేము చూచినవే. వైటకై నిన్ను అచ్చటచ్చటికి తోడ్కొనిపోదుము చెరువులు, సెలయేళ్ళు మొదలువానిని చూపింతము. మేము, మాకుటుంబములు మీ సేకవకులము. ప్రభూ, మాకు ఆజ్ఞలిచ్చటకు సంకోచింపకుము.

వేదవాక్కులకు, మునులకు మనములకు అగోచరుడు-కరుణా నిలయుడు-ప్రభువు- కిరాతులమాటలు - బాలకుల పలుకులను తండ్రివలె వినుచున్నాడు!

రామునికి కేవలము భక్యియే ప్రీతి, ఇట్లనితెలియగోరువారు తెలిసికొనుడు. భక్తిచే పరితుష్టుడై రాముడు మృదువచనములను పలికి ఆ వనచర ప్రజలనెల్లరను సంతుష్టులను కావించెను. అనంతరము వారికి అనుజ్ఞ ఇచ్చెను. వారెల్లరు తలలువంచి నమస్కరించి వెడలిరి. ప్రభుని గుణగణములను వర్ణించుకొనుచు, వినుచు తమతమ ఇండ్లకు చేరిరి.

ఈ రీతిని సురులకు, మునులకు సుఖదాయకులగు ఆ ఇరువురు సోదరులు సీతా సమేతులై అడవియందు వసించుచున్నారు.

రఘునాయకుడు వనమునకువచ్చి నివసింప మొదలిడిననాటనుండియు ఆ వనము మంగళదాయకమయ్యెను. నానావిధములగు వృక్షములు పుష్పించుచున్నవి. ఫలించుచున్నవి. ఆ వృక్షములపై మంజులమగు లతలు అల్లుకొని రమ్యమగు మండపముల వలె ఉన్నవి. కల్పవృక్షమువలె ఆ వృక్షములు సహజసుందరములు. అవి నందన వనములనువదలి ఇచ్చటికి వచ్చినట్లున్నవి. మధుకర శ్రేణులు మధురమగు ధ్వనులు సలుపుచున్నవి. మంద, శీతల సౌగంధపవనములు వీచుచున్నవి. నీలకంఠములు, కలకంఠములు, శుకములు, చాతకములు, చక్రవాకములు, చకోరములు మొదలగు పక్షులు చెవులకు ఇంపుగా, మనోహరముగా పలువిధములు కూయుచున్నవి. ఏనుగులు, సింహములు, కపులు, సూకరములు, లేళ్ళు అన్నియు వైరమునువీడి, కలసిమెలసి తిరుగుచున్నవి. వేటకై విహరించుచున్న రాముని సౌందర్యమును వీక్షించి పశుసమూహములు అమితానందమును పొందుచున్నవి. జగమునఉన్న సురవనములన్నియు రాముడు నివసించుచున్న వనమును కనుగొని ఈర్ష్య చెందుచున్నవి. గంగ,. సరస్వతి, దినకరకన్య యమున, మేఖలాసుత నర్మద, గోదావరి మొదలగు ధన్యనదులు, సరస్సులు సముద్రము, నదులు, నానానదములు, అన్నియు మందాకినిని ప్రశంశించుచున్నవి.

ఉదయాచలము, అస్తాచలము, కైలాసగిరి, మందరగిరి, సుమేరుపర్వతము మొదలు దేవతా నివాసస్థలములు, హిమాచరాదిసైలములు అన్నియు చిత్రకూట పర్వతముయొక్క కీర్తిని గానము చేయుచున్నవి. వింధ్యాచలము మోదముచెందెను. ఆమె ఆనందమును భరింపజాలకున్నది. శ్రమలేకనేఆమె మహిమను సంపాదించెను.

"చిత్రకూటమునందలి ఖగములు, మృగములు, లతలు, వృక్షములు, తృణజాతులు అన్నియు పుణ్యపుంజములు, ధన్యములు" అని రాత్రింబవళ్ళు దేవతలు అను కొనిరి. కన్నులున్న జీవులు. జీవములు రఘవరుని తిలకించి జన్మసాఫల్యమును శోకరాహిత్యమును కాంచెను. అచరములగు పర్వతాదులు ఆతని చరణాధూళి స్పర్శచే ఆనందించినవి. అవి అన్నియు పరమదపమునకు యోగ్యత సంపాదించు కొన్నవి, ఆ వనములు, పర్వతములు సహజముగనే సుందరములైనవి. మంగళమయములైనవి. అతి పావనులనుసహితము అవిపానమొనర్చును. ఆనందసాగరుడగు శ్రీరాముడు నివసించిన ఆ స్థలములమహిమను ఎట్లు వర్ణింపగలము? క్షీరసాగరమునువిడిచి, అయోధ్యను వీడి, సీతా లక్ష్మణ సహితుడై ఏతెంచి శ్రీరాముడు వసియించుచున్న ఆ వనశోభను వేయినోళ్ళు కలిగిన లక్షమంది శేషులైనను వర్ణింపజాలరు. ఇక నేనా వర్ణింపకలుగునది! మురికిగుంటయందలి తాబేలు మందరాచలమును పైకి ఎత్తకలదా? లక్ష్మణుడు మనో వాక్‌ కర్మలయందు శ్రీరాముని సేవించుచుండెను. అతని శీలము, భక్తి వర్ణనాతీతములు, క్షణక్షణము సీతారాముల చరణసందర్శనముచేయుచు, వారికి తనపైకల ప్రేమను గ్రహించి, లక్ష్మణుడు కలలోనైననుతన జననీ జనకులను, సోదరులను జ్ఞప్తికి తెచ్చుకొనుటయే లేదు. రామునితో సీత సుఖముగా ఉన్నది. అయోధ్యాపురిని. పరిజనములను, గృహమును ఆమె మరిచినది. క్షణక్షణము ఆమె తన పతియొక్క ముఖచంద్రుని వీక్షించును. చంద్రునిచూచి చకోర కుమారివలె ఆమె మానసము ప్రమోదము చెందుచుండును. తనయందు నాథుని ప్రేమ దినదినాభివృద్ధి చెదుటనుచూచి పగటియందు చక్రవాకమువలె జానకి ఆనందించుచుండును. సీతయొక్క మనస్సు రాముని చరణానురాగియై ఉన్నది. కనుక ఆమెకు వర్ణకుటీరము ప్రియమయ్యెను. విహంగములు, కురంగములు ప్రియులగు బంధజనతుల్యులైరి. మునిపత్నులు అత్తలవంటి వారైరి. మునివరులు మామతో సమానులైరి. కంద, మూలఫలములు అమృతసమానములయ్యెను. నాథుని వెంటఉన్న ఆమెకు దర్భశయ్యము, మన్మథుని హంసతూలికా తల్పముకంటె వేయిరెట్లు అధిక సుఖము నిచ్చుచున్నది. ఏ అమ్మ వీక్షణమాత్రమున సామాన్యుడు లోకపాలకుడగునో అట్టి ఆమెను విషయ విలాసములు సమ్మోహపరచగలవా?

ఏ రాముని స్మరించినమాత్రముననే భక్తజనులు భోగవిలాసములను తృణప్రాయముగా త్యజింతురో ఆ రాముని ప్రియపత్ని-జగన్మాత, జనని-సీత ఈ భోగవిలాసములను త్యజించుటయందు ఆశ్చర్యములేదు.

సీతా లక్ష్మణులు సుఖముగా ఉండునట్లు రఘునాథుడు ఆచరించుచుండెను. వచించుచుండెను. ప్రాచీనకథలను, గాథలను ఆతడు వారికి చెప్పును. సీతా లక్ష్మణులు వానిని అత్యంత సుఖప్రదములుగా ఎంచి విందురు. అయోధ్యను గురించి ఎన్నడైనను రాముని జ్ఞప్తికి వచ్చును. వెంటనే ఆతనినేత్రము బాష్పపూరితములగును. తల్లి దండ్రులను, బంధువులను, సోదరులను, భరతునియొక్క ప్రేమను శీలమును, సేవా నిరతిని జ్ఞప్తికితెచ్చుకొని కృపాసముద్రుడగు స్వామి దుఃఖితుడగును. అది సమయము కాదని తెలసికొనినంతకనే ధైర్యము వహించును. ఆతడు దుఃఖితుడగుటను తెలసికొని సీతయు, లక్ష్మణుడు వ్యాకులపడుదురు. మానవునివలెనే వాని ప్రతిబింబముకూడ చరించును! అట్టిసమయములలో ధీరుడు. కృపాశుడు భక్తహృదయచందనుడు అగు రఘనందనుడు-ప్రియురాలి, సోదరుని స్థితిని కనుగొని కొన్ని పవిత్రకథలను నుడవ మొదలిడును. సీతా లక్ష్మణులు వానిని విని ఆనందంచుచుందురు.

సీతా లక్ష్మణుసహితుడై వర్ణశాలయందు రాముడు అమరపురియందు ఇంద్రుడు శచీ జయంత సమేతుడై ఉన్నట్లు వసియించుచుండెను. కనుగ్రడ్లును కనురెప్పలు కాపాడునట్లు సీతా లక్ష్మణులను ప్రభువు పరిరక్షించుచుండెను. అవివేకి తన తనువును సేవించునుట్లు లక్ష్మణుడు సీతా రాములను సేవించుచుండెను.

ఖగ, మృగ, సుర, తాపస హితకరుడగు ప్రభువు ఇట్లు వనవాసము సుఖముగా చేయుచున్నాడు.

రాముని సుందర వనయాత్రను వర్ణించితిని. ఇక సమంత్రుడు అయోధ్యకు తిరిగి వచ్చినవిధమును వినుడు. ప్రభుని కొంతవరకు సాగనంప మరలివచ్చిన నిషాదుడు సచివసహితమగు రథమును కనుగొనెను. విషాదుని కనుగొని మంత్రికలతచెందెను. అతనివిషాదము వర్ణనాతీతము.

"రామా, రామా, సీతా, లక్ష్మణా" అని కేకలువేయుచు సుమంత్రుడు వ్యాకులుడై నేలపై పడిపోయెను. రాముడు వెడలిన దక్షిణదిక్కువైపు చూచుచు గుఱ్ఱములు సకిలించినవి. ఱక్కలులేని పక్షులవలె అవి వ్యాకులపడిఉన్నవి. అవి గడ్డితినవు. నీళ్ళు త్రాగవు. కన్నుల వెంట నీరుమాత్రము కార్చును. రఘువరుని అశ్వముల ఈ దశను చూచి నిషాదులెల్లరు ఆందోళనపడిరి. పిదప ధైర్యమువహించి నిషాదపతి 'సుమంత్రా విషాదమును వీడుము. నీవు పండితుడవు. పరమార్థమును తెలిసినవాడవు. విధాత విముఖుడైనాడని ఎఱిగి ధైర్యము వహించుము' అనెను. మృధువచనములతో పలు విధములగు కథలనుచెప్పి గుహుడు బలవంతముగా సుమంత్రుని రథమున కూర్చుండ పెట్టెను. శోకమువలన క్రుంగిఉన్న సుమంత్రుడు రథమును నడుపలేక పోయెను. రఘవరుని ఎడబాటుచే ఆతనిహృదయము మహావేదన అనుభవించుచున్నది. గుఱ్ఱములు తడబడుచున్నవి. మార్గమున నడువజాలకున్నవి. అడవిమృగములనుతెచ్చి రథమునకు కట్టినట్లున్నది. రామవియోగమును సహింపలేకున్న ఆ గుఱ్ఱములు అప్పుడప్పుడు దెబ్బలుతగిలి పడిపోవును. ఇంకొకప్పుడు తిరిగి వెనుకకుచూచును. మహాదుఃఖముచే వ్యాకులత చెందును. ఎవరైనను వైదేహీ, రామ లక్ష్మణులపేర్లు ఉచ్చరించినచో- ఆ అశ్వములు సకిలించి వారివంక ప్రేమతో చూడమొదలిడును. వానియొక్క విరహదశను వర్ణించుట ఎట్లు? మణిని కోల్పోయిన ఫణివలె అవి వ్యాకులపడుచున్నవి. సచివునియొక్క అశ్వములయొక్క దుస్థి%ుతినిచూచి నిషాదరాజు గుహుడు విషాదవశుడయ్యెను. వెంటనే అతడు తన ఉత్తమసేవకులను నలుగురిని పిలిపించి రథసారథి వెంట పంపెను. సారథికి వీడుకోలుపలికి గుహుడు తిరిగి వచ్చెను. అతని విరహమును, విషాదమును వర్ణింపజాలము. నలుగురు నిషాదులు రథమును తోలుకొని అయోధ్యకు వెడలిరి. క్షణక్షణమును వారి విషాదము మునుగుచుండిరి.

"ఛీ, ఛీ, - రఘువరుడులేని ఈ జీవితము ఎందులకు?" అని వ్యాకులుడై, దుఃఖముతో దీనుడై సుమంత్రుడు చింతించుచుండెను. ఆధమగు ఈ శరీరము తుదకు నశించిపోవలసినదే. రఘువీరుని ఎడబాసినవెంటనే ఏల ఇది అంతరించి కీర్తిని పొందలేదో! అపకీర్తికి, పాపమునకు ఈ ప్రాణము భాజనమయ్యెను. ఏల ఇది అంతిమయాత్ర చేయదో? అయ్యో, ఈ మందబుద్ధికి- అవకాశము జారిపోయెను. ఐనను, ఈ హృదయము రెండుప్రక్కలు కాకున్నది" అని సుమంత్రుడు చేతులు నులుముకొనుచుండెను. తలను బాదుకొనుచుండెను. లోభి ధనరాశిని పోగొట్టుకొనినట్లు అతడు పశ్చాత్తాపము చెందుచుండెను.

ఒక మహాయోధుడు వీరుని దుస్తులనుధరించి "నేను మహాశూరుడను, వీరుడను" అను ప్రగల్భములుపలికి తుదకు యుద్ధభూమినుండి పారిపోయినట్లు ఉన్నాడు సుమంత్రుడు. వివేకవంతుడు, వేదవేత్త, సాధుసమ్మత సదాచారి, సత్కులీనుడు అగు విప్రుడు మోసపడి మద్యమును సేవించినట్లు చింతియంచుచున్నాడు అతడు, ఉత్తమకులీనయై, సాధుస్వభావముకలిగి, వివేకవతియై, మనో వాక్‌ కర్మల యందు పతియే దైవమని భావించు పతివ్రత కర్మవశమున పతికిదూరమై ఉన్నప్పుడు ఆమెకు ఎట్టి భయానకమగు సంతాపముకలుగునో అట్టిరీతిని ఉన్నది సుమంత్రుని హృదయము. ఆతనికన్నులలో నీరు క్రమ్మెను. దృష్టి మందగించెను. చెవులు వినవచ్చుటలేదు. మతి కలవరపడుచుండెను. పెదవులు ఎండిపోవుచున్నవి. నాలుక పీకు కొనిపోవుచున్నది. కాని ప్రాణములు మాత్రము పోకున్నవి. అయోధ్యకు రాముడు తిరిగి వచ్చునన్న ఆశ అడ్డువ్చచినది. సుమంత్రుని ముఖము వివర్ణమయ్యెను. దానిని చూడలేము, జననీజనకులను ఇతడు హత్యచేసెనా అన్నట్లు కనబడుచున్నాడు. రామ వియోగమను హానివలన కలిగిన గ్లాని అతని మనస్సున వ్యాపించెను. పాపి ఒకడు నరకమునకు చనుచు దారిలో చింతించెనట! అట్లున్నది సుమంత్రుని స్థితి, అతనినోట మాట వచ్చుటలేదు. "అయోధ్యకుపోయి ఏమిచూడను - అక్కడ?'' అనునదే అతని విచారము

"రాముడులేని రథమును కనుగొనువారు నన్ను చూచుటకు కలవరపడుదురు. కలతచెందిన నగరమునందలి స్త్రీ, పురుషులెల్లరు పరుగెత్తుకొనివత్తురు. నన్ను ప్రశ్నింతురు. నా హృదయము మీద వజ్రము ఉంచుకొని వారికి ప్రత్యుత్తరమిత్తునా? దీనులు, దుఃఖితులు అగు తల్లులెల్లరు ప్రశ్నింతురు. ఓయీ విధాతా. వారికి నేను ఏమని ప్రత్యుత్తరమీయగలను? లక్ష్మణుని తల్లి నన్ను ప్రశ్నించినపుడు ఆమెకు ఏ సంతోషదాయక సందేశము తెలుపగలను? క్రొత్తగా ప్రసవించినగోవు తన లేగ దూడను జ్ఞాప్తికి తెచ్చుకొని పరుగెత్తివచ్చునట్లు రాముని జనని వచ్చును. నన్ను ప్రశ్నించును. 'రామ లక్ష్మణులు. వైదేహియు అమ్మా, అడవులకు వెడలిపోయి' రని ఆమెకు ప్రత్యుత్తరమిత్తునా! ఎవ్వరడిగినను ఇదే ప్రత్యుత్తరమీయవలెను. అయోధ్యకు మరలిచని ఈ సుఖమునే పొందవలెనా నేను? దుఃఖమున దీనుడై ఉన్న నరపాలుని ప్రాణము రాముని అధీనము. రాజు నన్ను ప్రశ్నించును.

"నీ కుమారులను అడవిలోదింపి సురక్షితముగా తిరిగివచ్చితి" నని ఏ ముఖము పెట్టుకుని ఆయనకు ఉత్తరమిత్తును? సీతా రామలక్ష్మణులనుగురించిన వార్తని విని నంతనే నరేంద్రుడు తనువును తృణమువలె త్యజించును" అని సుమంత్రుడు చింతించుచుండెను.

"నీటితేమను కోల్పోయిన బురదవలె నా హృదయము ప్రియతముడగు రాముని కోల్పోయి ఏల బ్రద్దలుకాలేదు.? విధి నాకు ఈయాతనాశరీరమునే ప్రసాదించినట్లు కనపడుచున్నది" అని అతడు మార్గమున విచారించుచుండెను.

ఇంతలో రథము తమసా నదీతీరము చేరెను. నిషాదులకు సుమంత్రుడు వినయమున వీడుకోలు పలికెను. విచారమున, వ్యాకులపడుచు వారు సుమంత్రుని పాదములపై పడి, లేచి మరలిరి.

నగరమున ప్రవేశించుటకు సచివుడు-గురు, బ్రాహ్మణ, గోవధ కావించి నంతగా సిగ్గుపడెను. ఆ దినమంతయు అతడు ఒక చెట్టుక్రింద కూర్చుండి గడపెను. సంధ్యాసమయమయ్యెను. అప్పుడ అతనికి తగు అవకాశము లభించెను. అతడు చీకటి పడగానే అయోధ్యను ప్రవేశించెను. ఈ వార్త వినిప్రజలెల్లరు రథమును చూచుటకు రాజద్వారమువద్దకు వచ్చిరి, రథమును గుర్తించి, గుఱ్ఱములు పొందుచున్న కలతను కనుగొని ఎండలో మంచువలె - వారిశరీములు కృశించి పోవుచున్నవి. నీటినుండి బయటికివచ్చి చేపలవలె అయోధ్యానగర స్త్రీలు, పురుషులు వ్యాకులపడుచుండిరి.

మంత్రియొక్క ఆగమనవార్త విని రాణివాసమువా రెల్లరు కలవరపడిరి. వారికి రాజమందిరము ప్రేతనివాసభూమివలె భీకరమై గోచరించెను.

అతి దుఃఖమున రాణులెల్లరు ప్రశ్నించిరి. కాని సుమంత్రుడు ప్రత్యుత్తరమీయడు! అతనినోట మాటలేదు. చెవులు ­నపడటలేదు! కన్నులకు ఏదియు కనపడుటలేదు. తనను కలసికొనినవారినందరిని ఒకేప్రశ్న అడుగుచున్నాడు -'నరపతి ఎక్కడ?' అని.

సచివుడు వ్యాకులుడై ఉన్నాడని దాసీజనములు కనుగొనిరి. కౌసల్యయొక్క భవనమునకు ఆతనిని వారు తోడ్కొనివెడలిరి. అచ్చట దశరథుని సుమంత్రుడు చూచెను. అమృతవిహీనుడగు చంద్రునివలె ఉన్నాడు రాజు. ఆతనికి అసనము లేదు. శయ్య లేదు. ఆ భూషణములు లేవు. మలినమగు నేలపై అతడు పడిఉన్నాడు. స్వర్గమునుండి క్రిందపడిన యయాతివలె ఉన్నాడు దశరథుడు. దీర్ఘనిశ్వాసముతో అతడు విచారించుచున్నాడు. విచారమువలన క్షణక్షణ అతనిహృదయము పగిలి పోవుచున్నది. ఱక్కలుకాలి పడిపోయిన సంపాతివలెఉన్న దశరథుడు మాటిమాటికి"రామా, రామా, నా ప్రమనిధానమా" అనుచున్నాడు. మరల 'రామ, లక్ష్మణా, వైదేహి' అనుచున్నాడు.

మంత్రి అతనినిచూచి "జయీభవ-చిరంజీవ" అనెను. సాష్టాంగప్రణామము చేసెను. మంత్రియొక్క మాటలు వినగానే రాజు వ్యాకులుడయ్యెను. లేచి అతడు "సుమంత్రా, రాముడెక్కడ? చెప్పుము" అనెను. దశరథుడు సుమంత్రుని ఆలింగనముచేసికొనెను మునిగిపోవుచున్నావానికి స్వల్పఆధారము ఏదో లభించినట్లయినది ప్రేమపూర్వకముగా రాజు మంత్రిని తనవద్ద కూర్చుండబెట్టుకొనెను. కన్నుల నీరు ప్రవహింప, "ప్రియసఖా, రాముడుకుశలమేనా! తెలుపుము. రఘునాథుడు, లక్ష్మణుడు. వైదేహియు ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు? వారిని తోడ్కొనివచ్చితివా? లేక అడవిలోనే ఉన్నారా వారు?" అని అతడు ప్రశ్నించెను.

ఈ ప్రశ్నలను వినగానే సచివుని నయనములు జలపూరితములయ్యెను. శోకమును వికలుడై రాజు" సీత రామలక్ష్మణుల సందేశము వినిపింముము" అని మరల సుమంత్రుని కోరెను. రాముని రూప, గుణ, శీల, స్వభావములను జ్ఞప్తికి తెచ్చుకొని రాజు హృదయమున చింతించుచుండెను.

"రాజ్యము కట్టపెట్టెదననిచెప్పి వనవాసము తెచ్చిపెట్టితిని. ఈ విషయము వినియు రామునిమనమున హర్షము కలుగలేదు. విషాదమూ కలుగలేదు. అట్టి సుతుని ఎబడాసినపిదపకూడా నా జీవములు పోలేదు. నావంటిపాపి ఎవడున్నాడు? సఖా, సీతా రాములున్నచోటికి నన్ను చేర్చుము. లేనిచో నా ప్రాణము లు పోనున్నవి. నేను పలుకు నది నిజము" అని దశరథుడు వచించెను. పదేపదే అతడు"నా ప్రియతమ సుతల సందేశము వినిపింపుము. సుఖా, సీతా రామలక్ష్మణులను నా కన్నులారచూచు ఉపాయము ఏదైన వెంటనే తెలుపుము" అని మంత్రిని కోరుచుండెను. మంత్రి ధైర్యము వహించి, మృధువచనములను ఇట్లు పలికెను:_

"మహారాజా, నీవు పండితుడవు. జ్ఞానిని. శూర, వీర, ధురంధరుడవు. సదా దేవ సాధు సమాజసేవ చేసినవాడవు. స్వామి, జననమరణములు, సుఖదుఃఖముల భోగములు, లాభనష్టములు, ప్రియసమాగమవియోగములు - ఇవి అన్నియు కాల, కర్మవశములు. రాత్రి, పగలువలెనే మనవశమున అవి ఉండవు. జడుడు సుఖములు కలిగి నపుడు ఆనందించును. దుఃఖములు కలిగినపుడు విలపించును. ధీరులు సుఖదుఃఖము లను సమానముగా భావింతురు. సకలలోకహీతకారీ, నీవు వివేకమును విచారించుము. ధైర్యము వహించుము. శోకము త్యజించుము.

మొదటిదినమున వార తమసా తీరమున వసించిరి రెండవదినమున గంగా తటమున ఉండిరి ఆనాడు సీతా సహితులై సోదరులిరువురు స్నానముచేసి నీటినే సేవించిరి. విషాదపతి వారికి ఎంతో సేవచేసెను ఆ రాత్రి వారు శృంగబేరపురమున గడిపిరి రెండవనాడు తెల్లవారగనే మఱ్ఱిపాలను తెప్పించి దానితో రామలక్ష్మణులు తమ శిరములపై జటామకుటములను బంధించిరి.

రాముని సుఖుడగు గుహుడు అంతట ఒక నావను తెప్పించెను. ప్రియురాలిని నావయందు ఎక్కించి తదుపరి రఘుపతి అధిరోహించెను. ధనుర్బాణములను ధరించి, ప్రభునియొక్క దీవన పొంది లక్ష్మణుడు అటుపిమ్మట నావను ఎక్కెను. కలత చెంది ఉన్న నన్ను కనుగొని రఘువరుడు ధైర్యము వహించి ఇట్లు మధుర వచనము లను పలికెను. -"తండ్రీ, మా జనకునికి నా ప్రణామములను తెలుపుము. నా పక్షమున ఆయనయొక్క పాదకమలములను పదేపదే పట్టుకొనుము. నా తండ్రియొక్క చరణములపై పడి ఇట్లు వినతి చేయుము- తండ్రీ, నన్ను గురించి చింత నీకు వలదు. నీ కృప , అనుగ్రహము, పుణ్యమువలన వనమునను, మార్గమునను మాకు మంగళము, కుశలము ప్రాప్తించును.

é నాయనా, నీ అనుగ్రహముచే కాననములకు చనుచు మేము సకల సుఖములను పొందగలము. నీ అనతిని చక్కగా పాలించి, నీ చరణ సందర్శనమునకై కుశల పూర్వకముగా తిరిగి వత్తుము. మా తల్లు లెల్లరి పాదములపై పడి-వారిని ఓదార్చుము. వారికి వినతి కావించుము. కోసలాధిపతి కుశలుడై ఉండునట్లు చేయ ప్రయత్నించుము. గురువగు వసిష్ఠుని చరణ పద్మములను, పలుమారులు గ్రహించి నన్ను గురించిన విచారము లేకుండునట్లు అయోధ్యాపతికి బోధించుమని వేడుము. నాయనా, పురజనులను, పరిజనులను, ఎల్లరును, బ్రతిమాలినా వినతిని వారికి వినిపింపుము. నరనాథుని సుఖిని చేయువాడే నాకు సర్వవిధముల హితకరుడని వారికి తెలుపుము"

"రాజ్యాధికారఘు చేపట్టి నీతిమార్గమును విడువవలద"ని భరతుడు తిరిగి రాగానే అతనికి నా సందేశము తెలుపుము. మనో, వాక్‌, కర్మలచే ప్రజలను పరిపాలించుమనుము. తల్లు లెల్లరు సములని ఎఱిగి వారిని సేవించుమనుము. 'తమ్ముడా, నీ భ్రాతృత్వమును తుదివరకు విధ్యుక్తముగా నిర్వహింపుము. తల్లులను, తండ్రిని స్వజనులను సేవింపము. తండ్రీ, నన్ను గురించి ఎట్టి విచారము ఎన్నడూ రాజునకు కలుగక ఉండునట్లు ఆయనను సేవింపము." అని భరతునికి తెలుపుము"

లక్ష్మణుడు కొన్ని కఠోర వచనములను వచించెను.రాముడు అతనిని వారించి పదే పదే ఒట్టుపెట్టుకొనెను. "తండ్రీ లక్ష్మణుని చిన్నతనపు చేష్టలు తెలుపవలద" ని వన్నుకోరెను.

సీతా ప్రణామముచేసి ఏదో చెప్పబోయెను. కాని ఆమె ప్రేమ వశమున పలుక లేకపోయెను. ఆమె మాటలుఆగిపోయెను. కన్నులు నీరు నిండెను. శరీరము పులకించెను.

ఆ సమయమున రఘవరుని ఇంగితమును ఎఱిగి నావికుడు నావను నడపించెను. ఈవిధమున రఘుకుల తిలకుడు వెడలెను.

ఇక నేను - గుండెను రాయిచేసికొని, చూచుచూ నిలచిపోతిని, నా దుఃఖమును ఎట్లు నీకు వర్ణింపగలను? రాముని సందేశమును తీసికొని ప్రాణముతో తిరిగి వచ్చితిని.

ఇట్లు నుడివి సచివుడు ఇక ఏమియూ పలుకజాలకపోయెను. అతడు హానిని గ్లావిని చెందెను. చింతావశుడయ్యెను. సూతుని పలుకులు వినినంతనే నృపాలుడు నేలపై పడిపోయెను. అతని హృదయమున దారుణమగు వేదన జనించెను. అతడు కలవరపడ మొదలిడెను. అతని మనస్సు అత్యంత మోహముచే వ్యాకులపడెను. తొలకరి వానకు చేపలు మరణించునట్లున్నది ఆతని స్థితి

రాణు లెల్లరు విలపించుచుండిరి. ఆ మహావిపత్తును వర్ణించుట ఎట్లు? ఆ విలాపమును విని దుఃఖమునకు సహితము దుఃఖము కలిగినది. ధైర్యముయొక్క ధైర్యము కూడా పారిపోయినది రాణివాసనమునందలి కలకలమును విని అయోధ్య అంతయు అత్యంత కలవరము వ్యాపించెను. పక్షులున్న దట్టమగు అడవిలో విశాసమయమున కఠోరమగు పిడుగు పడినట్లు అయ్యెను.

దశరథుని ప్రాణము కంఠగతమయ్యెను. మణిని కోల్పోయిన సర్పము వ్యకుల పడుచున్నట్లున్నది.అది అతని ఇంద్రియములన్నియు కలతచెంది నీరులేనిచెరువులోని కమలములవలె వాడిపోయినవి దశరథుడు అతిదుఃఖితుడై ఉన్నట్లు కౌసల్య కనుగొనినది. రవికులభానుడు అస్తమింపనున్నాడుని ఆమె గ్రహించినది. రామమాత అంతట ధైర్యము వహించి సముయోచితముగా ఇట్లు పలికెను.

"నాథా, రామవియోగము ఆపారమగు సాగరము. నీ మనస్సున యోచించిము అయోధ్య అను ఓడను నడిపంచుటకు కర్ణధారుడవు నీవు ప్రజలు ప్రియజనుము అందురు ఆ ఓడలోని యాత్రికబృందము. నీవు ధైర్యము వహించినచో అందరము ఒడ్డును చేరగలము లేనిచో నీ కుటుంబము సర్వము మునిగిపోవును. ప్రియా నీ హృదయమున నా విన్నపము ధరించుము సీతా, రామ, లక్ష్మణులు తిరిగివచ్చి మనలను కలియగలరు.

ప్రియురాలి మృదు వచనములను విన్నంతనే నృపాలుడు కన్నులు తెరచి చూచెను. కలవరపడుచు దీనావస్థయందున్న చేపమీద చల్లనినీటి- తుంపర పడినట్లైనది ధైర్యమును తెచ్చుకొని రాజు లేచి కూర్చుండెను.

"సుమంత్రా, చెప్పుము. కృపాళుడు రాముడెక్కడ? లక్ష్మణు డెక్కడ? నా చెలిమికాడు రాము డేడీ? నా కోడలు వైదేహి ఎచ్చట ఉన్నది అని తడు సముంత్రుని ప్రశ్నించెను. వ్యాకులపడుచు అతడు అనేక విధముల విలపించుచుండెను. ఆ రాత్రి ఒక యుగమువలె ఉన్నది గడచుటయేలేదు. అంధ తావపి తనకు ఇచ్చిన శాపము దశరథుని స్మృతికి వచ్చెను. ఆ కథ అంతయు కౌసల్యకు అతడు వివరించెను. ఆ చరిత్రను వర్ణించుచు అతడు కలవరపడెను.

"ఛీ ఛీ, రాముడులేని ఈజీవితముపై ఏల ఆశ? నా ప్రేమ ప్రతిజ్ఞను పాలింపజాలని ఈ శరీరము నిలుపకొని నేను ఏమి చేయను?

హా, రఘునందనా, ప్రాణప్రియా, నీవులేక జీవించి చాల దినములు గడిచినవి హా, జానకీ, హా లక్ష్మణా, హా రఘువరా, పితృచిత్తచాతక హితకర జలధరా" అని దశరథుడు విలపించుచుండెను.

అతడు 'రామా, రామా' అనెను. మరల 'రామా' అనెను మరి ఒకసారి రామా-రామా' అనెను. ఇంకొకసారి 'రామా' అని రఘువర వియోగ విరహమున అతడు తనువును త్యజించెను. సురధామమునకు చనియెను.

జనన మరణముల ఫలమును దశరథుడు పొందెను. అతని నిర్మలయశము అనేక బ్రహ్మండములయందు వ్యాపించెను. జీవించినపుడు అతడు శ్రీరాముని ముఖచంద్రుని వీక్షించెను. రామవిరహము నిమిత్తముగా అతనికి దివ్యమరణము లభించెను.

రాణు లెల్లరు శోకవశులై కలతచెంది రోధించుచున్నారు. దశరథు రూప, శీల, బల, తేజములను వర్ణించి అనేకవిధముల వారు విలపించుచున్నారు. నేలపై పలుమార్లు వారు పడుచున్నారు.

దానదాసీజనములు వ్యాకులపడి శోకించుచున్నారు. పురవాసులెల్లరు ప్రతి ఇంటను ఏడ్చుచున్నారు. "ధర్మమునకు అవధి, గుణరూపములు భండారము, భానుకులుభానుడు అస్తమించినాడు" అని అనుకొనుచున్నారు. అందరు కైకేయిని దూషించుచున్నారు. లోకము నంతటిని గ్రుడ్డిదానినిచేసినది ఆమె అనుచున్నారు.

ఇట్లు విలాపములతో ఆ రేయి గడిచెను. ప్రాతఃకాలమున సకల మహామునులు, జ్ఞానులు ఏతెంచిరి. వసిష్ఠముని సమయోచితములగు అనేక ఇతిహాసము లను వినిపించి తన విజ్ఞాన తేజముచే ఎల్లరును శోకదూరులను కావించెను. ఆ ముని ఒక నావను నూనెతో నింపించెను నృపాలుని కళేబరమును దానిలో పెట్టించెను. దూతలును పిలిపించెను. "మీరు వేగమే పరుగెత్తుకొని భరతుని వద్దకు చనుడు రాజు మృతిచెందెనని ఎక్కడనూ, ఎవ్వరికినీ తెలియచేయకూడదు 'మీ ఇరువురు సోదరులను గరువుగారు తోడ్కొని రమ్మనిర'ని మాత్రము భరతునితో నడువుడు" అని వారికి వసిష్ఠుడు ఆనతి ఇచ్చెను. మునియొక్క ఆనతి విని దూతలు ఉత్తమమగు అశ్వములు సహితము లజ్జ చెందునంతటి వేగమున పరుగెత్తుకొని చనిరి.

అయోధ్యయందు అనర్థములు ఆరంభ##మైనపుడే భరతునికి అపశకునములు కనుపించసాగినవి. రాత్రులలో అతనికి భయానకమగు స్వప్నములు వచ్చుచున్నవి. మేల్కొనగానే అతడు ఆ కలలను గురించి అనేక దుష్టకల్పనలు చేసికొనుచుండెను. అతడు ప్రతిదినము విప్రులకు దానములిచ్చి, సంతర్పణలు చేయుచుండెను. నానావిధుల శివుని అభిషెకించుచుండెను. తన మనస్సున మహాదేవుని ప్రార్థించి తల్లి దండ్రుల, బంధువుల పరిజనుల క్షేమము కోరుచుండెను.

ఇట్లు భరతుడు తన మనస్సున చింతించుచుండునంతలో దూతలు వచ్చిరి. గురుని అనుశాసమును వినగానే భరతుడు గణశుని ప్రార్థించి బయలుదేరెను. వాయువేగమున పరుగిడు అశ్వములపై అతడు పయనించుచున్నాడు. భయంకరమగు నదులను, పర్వతములను, అడవులను దాటుచున్నాడు. అతని హృదయము అతివిచారభరితమై ఉన్నది. అతనికి ఏదియ ఆనందము ఇచ్చటలేదు.

ఎగిరిపోయి ఆయోధ్యను చేరినచో బాగుగా ఉండుననుకొనుచున్నాడు.భరతుడు. ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క సంవత్సరమువలె గడచుచున్నది.

ఇట్లు భరతుడు అయోధ్యానగరము సమీపించెను. నగరమును ప్రవేశించునప్పుడు కూడా అతనికి అపశకునములే కనుపించినవి. కాకి ఒకటి - ఉండరానిచోట ఉండి, కూయరానివిధముగ 'కావుకావు' అని కూసినది గాడిదలు, నక్కలు విపరీతముగా అరచినవి. వాని నన్నింటిని వినిన భరతుని మనమున ఎంతో బాధ కలిగినది. చెరువులు, నదులు, అడవులు, తోటలు అన్నియూ శోభావిహీనములై ఉన్నవి. నగరము అతి భయానకముగా ఉన్నది. ఖగములు, మృగములు, అశ్వములు, గజములు రామవియోగమున చూడజాలనంతగా దుఃఖించుచున్నవి. నగరమునందలి స్త్రీలు, పురుషులు అత్యంత దుఃఖింతులై ఉన్నారు. తమ సర్వసంపదలు కోల్పోయినట్లు అందరు కనుపించుచున్నారు. పురజనులు కలియుచున్నారు. కాని ఏమియు పలుకరు. నిశ్శబ్దముగా జోహారులు అర్పించి వెడలుచున్నారు.

భరతుడు ఎవ్వరినీ కుశలప్రశ్నము చేయలేకున్నాడు. అతడు మనమునభయము, విషాదము క్రమ్ముకొని ఉన్నవి. అంగళ్ళను, వీధులను చూడజాలము, నగరమునందలి దశదిశలను దావాగ్ని రగుల్కొనినట్లున్నది.

కుమారుడు వచ్చెనని కైకయనందిని వినినది. రవికుల కమలమునకు చంద్రిక అగు ఆమె హర్షముచెంది హారతిని అలంకరించినది. సంతోషముభరితయై లేచి పరుగెత్తినది ద్వారమువద్దనే ఆమె భరత శత్రుఘ్నులను కలిసికొన్నది వారిని తన భవనమునకు తోడ్కొనివ్చచినది.

పరివారమెల్లరు దుఃఖితులై ఉండుట భరతుడు గమనించెను. మంచుచే కమలవనము నాశనమైనట్లు అతడు కనుగొనెను. కిరాతస్త్రీ అడవికి చిచ్చుపెట్టి ఆనందించునట్లు కై కేయి ఒక్కతె సంతసించుచున్నట్లు కనుపించినది. కొడుకు విచారగ్రస్తుడై ఉన్నట్లు కనుగొని కైక "మా పుట్టినింట అందరు కుశలమేనా? అని భరతుని ప్రశ్నించినది. "అందరూ కుశలమే" అని భరతుడు ప్రత్యుత్తరమిడెను. "ఇక్కడ మనవారందరు క్షేమమేనా?" అని అతడు అడిగెను.

"అమ్మా, చెప్పుము, మా తండ్రి ఎక్కడ? మా తల్లులందరు ఎక్కడ ఉన్నారు? సీత ఏదీ? నా ప్రియసోదరుల రామలక్ష్మణు లెక్కడ?" అని అతడు ప్రశ్నించెను.

కుమారుని వచనములు కైక వినెను. ఆ పాపిష్ఠిది కపటపు కన్నీరు కార్చెను. భరతుని చెవులను, మనస్సును శూలమువలె గ్రుచ్చు పలుకులను ఇట్లు ఆ పాపి పలికెను:_

"నాయనా, నీకై సర్వము-సంపూర్ణముగా నేను కావించితిని. పాపము- మంథర సహాయపడినది. కాని, విధి ఇంతలో కార్యము కొంచెము విధ్వసంము చేసినాడు. భూపాలుడు సురపతిపురమునకు వేంచేసినాడు."

ఈ మాటలను వినగానే భరతుడు విషాదముచే వివశుడయ్యెను. సింహపు గర్జనను వినిన ఏనుగువలె అతడు భయపడి "తండ్రీ, తండ్రీ, హా, తండ్రీ" అని అరచుచు అత్యంతవ్యాకులుడై నేలపై పడెను.

"తండ్రీ నీ అంత్యకాలమున నిన్ను చూడనైన లేకపోతిని నన్ను నీవు రామునికి నప్పగించలేదు" అని అతడు విలపించి, కొంతసేపటకి ధైర్యము వహించి తెప్పరిల్లి లేచెను.

"అమ్మా, మా తండ్రి మరణమునకు ఏమి హేతువు? తెలుపుము" అని అతడు తల్లిని వేడెను.

సుతుని పలుకువిని కైకేయి ప్రత్యుత్తరము పలుక మొదలిడెను. మర్మస్థానమును కత్తితోచీల్చి, దానిపై విషము చల్లినట్లున్నది! ఆది నుండి అంతమువరకు తాను కావించిన ఘనకార్యము అంతయు ఆ కుటిల. కఠోరస్త్రీకైక ఆనందమున వివరించినది. రాముని వనగమనమును గురించి వినిన భరతుడు తండ్రి మరణమును గురుంచి మరచిపోయెను. ఈ సకల అనర్థమునకు తానే కారణమని అతడు తెలిసికొనెను. మౌనముతాల్చి అతడు నిశ్చలుడయ్యెను. సుతుడు వ్యాకులుడైనట్లు కనుగొని తల్లి అతనిని ఓదార్చసాగెను. పుండుపై ఉప్పు చల్లినట్లు!

"నాయనా, రాజునుగురించి విచారింపతగదు. పుణ్యమును కీర్తిని సంపాదించి నాడు వానికి తగుభోగములను అనుభవించినాడు. జీవితమున సకల ఫలితము అనుభవించినాడు. తుదకు అమరపతియొక్క సదనమునకు చనినాడు. దీనిని యోచించి చింతను వీడుము. సమాజ సహితముగా అయోధ్యాపురిని పరిపాలింపుము" అని కైక నుడివెను.

రాకుమారుడు-భరతుడు ఈ మాటలనువిని-పగిలిన పుండుకు నిప్పుతగలినట్లు మిక్కిలి భీతిచెందెను. ధైర్యము వహించి ధీర్ఘవిశ్వాసమును విడుచుచు అతడు

"పాపి, సర్వవిధములను కులమును నాశనముచేసితివే! అట్టి చెడుకోరికయే నీకు ఉన్నచో నేను పుట్టగానే నన్ను ఏలచంపకపోతివి? చెట్టునునఱికి ఆకులకు నీరు పోసితివి. చేపలను బ్రతికించుటకు నీటిని బయటికితోడి పారపోసితివి. సూర్యవంశము వంటి వంశము. దశరథుని వంటి తండ్రి, రామలక్ష్మణులవంటి సోదరులు నాకు లఖించిరి. కాని, తల్లీ, నన్ను కన్నదానివి నీవైతివి! విధివశము తప్పింపజాలము ఓసీ కుమతీ, ఇట్టి దుశ్కార్యమును తలపెట్టిన నీ హృదమును ఏలముక్కలు ముక్కలు కాలేదు? వరములుకోరునప్పుడు నీ మనస్సు బాధయే కలుగలేదా? నీ నాలుక క్రుళ్లి పోలేదా? నీ నోటిలో పురుగులుపడలేదా! రాజు ఏల నిన్ను విశ్వసించెను.? మరణ కాలమున విధి ఆయన మతిని హరించెను. నారీహృదయగతిని బ్రహ్మయైనను తెలిసి కొనజాలడు, సకల కపటములకు, పాపములకు అవగుణములకు అదిగని రాజు సరళస్వభావుడు, సౌశీల్యవంతుడు ధర్మరతుడు అట్టివాడు ఎట్లు గ్రహంచగలడు స్త్రీ స్వభావమును? రఘునాథుడు తనకు ప్రాణప్రియుడు కానివాడు జీవజంతువుల యందు ఎవ్వడున్నాడు ఈ జగమున? అట్టి రాముడు నీకు అహితుడైనాడు. నిజము చెప్పుము.నీవు ఎవ్వతెవు? ఎవతెవైననుసరే- నీ ముఖమునకు నల్లమసి పూసికొని లేచిపోమ్ము నా కండ్లఎదుట ఉండకు అవిధాత నన్ను రామవిరోధి కడుపున పుట్టించినాడు. నా వంటి పాపి పాతకి ఇంకెవ్వడున్నాడు? నీకు ఈ మాటలన్నియు చెప్పుట వృథా" అనెను.

తల్లియొక్క కుటిలత్వము విని శత్రుఘ్నుని శరీరమంతయు మండిపోవుచున్నది. కాని అతడుఏమియు చేయలేకున్నాడు. ఆ సమయమున - నానావిధములగు వస్త్రములను, నగలను ధరించి ఆ గూనిది - మంథర అచ్చటికి అరుదెంచినది. దానిని చూచి శత్రుఘ్నుడు కోపభరితుడైనాడు మండుచున్న అగ్నియందు ఆజ్యమును ఆహుతి చేసి నట్లు ఉన్నది. గునిదాని నడుముమీద ఒక్క తన్ను గట్టిగా తన్నినాడు శత్రుఘ్నుడు. అరచుచు ఆ గూనిది నేలమీద బోర్లపడినది. దాని గూని ముక్కలయ్యెను. కపాలము బ్రద్దలయ్యెను. పండ్లుఊడిపోయెను. నోటినుండి రక్తము ప్రవహించుచుండెను. మూలుగుచూ అది "అయ్యో, దైవమా,నేను ఏ కీడు కావించినాను?మంచి చేయపోయినదానికి ఈ ఫలితము వచ్చినది!" అనెను

ఈమాటలు విని శత్రుఘ్నుడు దానిని నఖశిఖపర్యంతము చూచినాడు ఇది దుష్ఠస్త్రీ అనుకొన్నాడు. దాని కొప్పు పట్టుకున్నాడు. ఈడ్వసాగినాడు దయానిధి అగుభరతడు దానిని విడిపించినాడు.

అంతట సోదరు లిరువురు కౌసల్యవద్దకు వెడలిరి. కౌసల్య మలిన వస్త్రములను ధరించిఉన్నది. ఆమె ముఖము వివర్ణమై ఉన్నది. ఆమె వ్యాకులపడి ఉన్నది. దుఃఖభారమున ఆమె శరీరము కృశించి ఉన్నది. సువర్ణ సుందర కల్పలతా వనము మంచుచే నశించిపోయెనో అనునట్లున్నది.

భరతుని చూచి ఆ తల్లి లేచి పరుగెత్తుకొని వచ్చినది. కళ్ళు తరిగి మూర్చిల్లి నేలేపై పడిపోయినది. ఆమెను చూచి భరతుడు మిక్కిలి ఆందోళన చెందెను. అతడు తన శరీరమునే మరచెను. అతడు కైసల్యయొక్క చరణములపై పడెను

"అమ్మా, తండ్రి ఎక్కడ? ఆయనను చూడనిమ్ము. సీత ఎక్కడ? సోదరులు ఇద్దరు రామ లక్ష్మణులు ఏరి? కైకేయి జగమున ఏల జన్మించెను? జన్మించినది పో వంధ్య ఏల కాలేదు? కులమునకు కళంకము అపయశమునకు భాండము ప్రియ జనద్రోహి అగునావంటి పుత్రిని ఏల కనెను? ముల్లోకములలో నావంటి అభాగ్యుడు ఎవడున్నాడు? నా కారణమున, అమ్మా, నీకు ఈ దుఃస్థితి సంభవించెను. తండ్రి స్వర్గస్థుడైనాడు. రఘువరుడు అటవులయందున్నాడు. కేతువువలె ఈ అనర్థములన్నింటికి హేతువును నేను ఛీ వెదురుపొదకు నేను చిచ్చుపెట్టితిని. దారుణమగు వేదనకు దుఃఖమునకు, నేరమునకు భాగస్వామినైతిని" అని భరతుడు విలపించెను.

భరతునియొక్క మృదువచనములను విని తల్లి కౌసల్య స్వస్థతచెంది లేచెను. భరతుని ఆమె లేవనెత్తెను. ఆతనిని హృదయమునకు హత్తుకొనెను ఆమె కన్నుల నుండి నీరు ప్రవహించుచున్నది. సరళ స్వబావముకల ఆ తల్లి అత్యంత ప్రేమతో రాముడే తిరిగి వచ్చెనో అనునంతగా భరతుని ఆలింగనము చేసికొనెను. శత్రుఘ్నని కూడా ఆమె కౌగిలించుకొనెను. ఆమె హృదయము శోకమును, ప్రేమను భరింప జాలక ఉండెను.

కౌసల్య స్వభావమును కనుగొనిన వారెల్లరు ''ఆవును- రాముని తల్లికదా| ఆమె స్వభావము మరి ఇంకెట్లుండును?''అనిరి.

కౌసల్య భరతుని తన ఒడిలో కూర్చుండపెట్టుకొని , అతని కన్నీటిని తుడిచి మృదువచనములను ఇట్లు పలికెను:_

''వత్సా, ధైర్యము వహింపుము. ఇవి-కాని రోజులు శోకమును విడువుము. కాలగతిని, కర్మగతిని ఎవ్వరూ తప్పింపలేరు. హానిని గురించి, గ్లానిని గురించి చింతింపకుము, ఎవ్వరిపైనను దోషము అపాదింపకుము, నాకు విధాత సకల విధముల ప్రతికూలుడైనాడు, ఇన్ని కష్టములు వచ్చినను నాకు ఆయువు మాత్రము ఇచ్చినాడు. ఇకముందు ఏమి చేయునున్నాడో నన్ను! ఎవరెఱుగుదురు? నాయనా, తండ్రి ఆజ్ఞచే ఆ భూషణములను, వస్త్రములను రఘువీరుడు విడనాడెను. వల్కలమును ధరించెను. అతని హృదయుమన కొంచెమైననూ విస్మయములేరు. హర్షములేదు. అతని వదనము ప్రసన్నమై ఉండెను. అతని మనస్సున అనురాగము కాని ఆగ్రహముకాని లేవు. అందరిని అన్ని విధములను సంతోషపెట్టి అతడు అడవులకేగెను. ఈ సంగతి విని సీతయును అతినివెంట అరిగెను. రామ చరణానురాగి అగు ఆమె ఇచ్చట నిలువజాలక వెడలెను. ఈ వార్త వినిన వెంటనే లక్ష్మణుడు వారివెంట చనెను. అతనిని నివారించుటకు రఘునాథుడు ప్రయత్నించెను. అనంతరము రఘుపతి ఎల్లరకు తలవాల్చి నమస్కరించి సీతను, అనుజుని వెంటపెట్టుకొని పయనించెను. సీతా రామలక్ష్మణులు అడవికి వెడలిరి. ఇక నేనో వారివెంట పోవజాలనైతిని. నా ప్రాణములనైన వారివెంట పంపించజాలనైతిని. అది అంతయు ఈ నాకన్నుల ఎదుటనే జరిగెను. ఐనను ఈ అభాగ్యజీవి ఈ శరీరమును వీడలేదు. నా ప్రేమను చూచి నాకు సిగ్గు కలుగటలేదు. రామునివంటి సుతునికి నేనా తల్లిని-అనియే నాసిగ్గు. బ్రతుకుట, మరణించుట భూపాలునకే బాగుగా తెలియును. నాహృదయము శతవజ్ర సమానమైనది''.

కౌసల్యయొక్క మాటలను విని భరతుడు, రాణివాసము అందరు వ్యాకులపడి విలపించసాగిరి. రాజమందిరము శోకనిలయమయ్యెను. భరత, శత్రుఘ్నులు కలత చెందిరి. సోదరు లిరువురు విలపించుచుండిరి. కౌసల్య వారిని తన హృదయమునకు హత్తుకొనెను. ఆమె భరతుని అనేక విధముల ఓదార్చి, వివేకముగు వచన ములను నుడివెను. పురాణములనుండి, శ్రుతులనుండి చక్కని కథలను చెప్పి భరతుడు తల్లులందరిని ఓదార్చెను. రెండుచేతులు జోడించి కపట రహితుడై, పవిత్ర, సరళ, సుందర వచనములను అతడు ఇట్లు వచించెను:_ ''అమ్మా, ఈ దుష్కార్యమును నాకు పాత్రుఉన్నను, ఈకుట్రకు నేను సమ్మతించినను-తల్లిని, తండ్రిని, పుత్రులను సంహరించిన సంభవించు పాపము, మిత్రులకు, ప్రభువికి విషయమిచ్చుటచే వచ్చు అఘము, మనోవాక్‌ కర్మలచే ఏఏ పాతకములను, ఉపపాత కములను కవులు వర్ణింతురో అమ్మా, అవి అన్నియు విధాత నాకు విధించుగాక! హరిహరుల చరణములను వీడి ఘోర భూతగణములను భజించువారికి కలుగు గతినే విధాత నాకు విధించుగాక!

వేద విక్రేతలు, భక్తిపేరున ధనమున అర్జించువారు, చాడీలు చెప్పువారు, పరుల దోషములను గురించి భాసించువారు, కపటులు, కుటిలురు, కలహ ప్రియులు క్రోధులు వేదములను నిందించువారు, లోకవిరోధులు, లోభులు, లంపటులు , దుర్మార్గులు, చంచలమనస్కులు, పరధనమునకై పరస్త్రీలకై పొంచి ఉండువారు-తల్లీ, ఎగతిని పొందుదురో- ఆగతినే నేనును ఈ కృత్యమునకు నాసమ్మతి ఉన్నచో ఆర్జింతును.

సత్సంగమును ప్రేమలేనివారు, పరమార్థపథ విముఖులగు అభాగ్యులు, మానవశరీరమును పొందియు హరిని భజించనివారు, హరిహరుల సుయశమును కీర్తింపజాలనివారును, విని ఆనందించనివారు తల్లీ వేదమార్గమును వీడి, దానికి ప్రతికూలమగు మార్గమును అనుసరించువారు, వంచకులు, కువేషదారులై లోకమును మోసగించువారును ఏగతిని పొందుదురో ఆగతిని ఈ రహస్యమును గురించి నాకు తెలిసిఉన్నచో-శంకరుడు నాకు విధించుగాక.

భరతుని యొక్క సహజ, సత్యవచనములను, సరళ వాక్కులను కౌసల్య వినెను.

''నాయనా మనోవాక్‌ కాయములయందు రాముడు నీకు ప్రియుడు. అట్లే రఘుపతికి నీవును అతని ప్రాణముకంటే ప్రియుడవు. చంద్రుడు విషమును వర్షిచుగాక మంచు అగ్నిని కురిపించుగాక, జలచరజీవులు జలముపై విరక్తి పొందుగాక జ్ఞానముచే మోహము నశించక పోవుగాక-నీవు మాత్రము రామునికి ఎన్నడూ ప్రతికూలుడవు కాజాలవు. ఈ విషయమున నీ సమ్మతి ఉన్నదని జగత్తున ఎవరైనను వచించినచో స్వప్నముననైనను వారికి సుఖము ఉండదు. వారికి శుభగతియు లభింపదు''అని ఆమె నుడివి భరతుని తన హృదయమునకు హత్తుకొనెను. ఆమె స్తనములనుండి పాలు స్రవించెను. కన్నులు నీరు క్రమ్మెను.

ఇట్లు కడు విలపించుచు వారు కూర్చుండి ఉండగానే ఆ రాత్రి అంతయు గడచెను. అంతట వామదేవుడు, వసిష్ఠుడు, ఏతెంచిరి. సకల మంత్రులను, మహాజనులను వారు పిలిపించిరి. వసిష్ఠముని పలువిధములగు పరమార్థ మచనములను సమయానుకూలముగను రమణీయముగను భరతునికి ఉపదేశించెను.

''నాయనా, మనమున ధైర్యము వహింపుము, నేటి కర్తవ్యములను నెరవేర్చుము'' అని వసిష్ఠుడు నుడివెను. గురుని పలుకులు విని భరతుడు లేచి''సర్వము సిద్ధము చేయించు''డని కోరెను.

వేదోక్తవిధిని భూపాలుని దేహమును స్నానము చేయించిరి, పరమ విచిత్రమగు ఒక విమానము సిద్ధము చేయబడెను. తల్లుల పాదములు పట్టుకొని ప్రార్థించి భరతుడు వారిని సహగమనము చేయనీయలేదు. రామదర్శనాభిలాషులై వారు సహగమనము చేయలేదు.

చందనము, అగరు, ఇతర అనేక విధములగు, అపార సుగంధద్రవ్యములు మోపులు, మోపులు తెప్పించబడినవి. సరయూనదీతీరమున సుందరమగు చితిపేర్చబడెను. అది స్వర్గమునకు సోపానమా అన్నట్లున్నది.

ఈ విధిని దహనక్రియ అంతయు జరుపబడెను. అందరు విధిపూర్వకముగా స్నానముచేసిరి. తిలాంజలి ఆర్పించిరి. పిదప, వేద, స్మృతి, పురాణవిధిని అందరు నిశ్చయించిరి, ఆప్రకారము భరతుడు తండ్రికి దశగాత్ర శ్రాద్ధము కావించెను. మునివరుడగు వసిష్ఠుడు ఎక్కడ ఏరీతిని ఆజ్ఞాపించెనో అక్కడ ఆ రీతిని భరతుడు సకల కర్మలను వేయి విధుల నెరవేర్చెను. పరిశుద్ధుడైనపిదప అతడు అనేక దానము లిచ్చెను. ధేనువులను, అశ్వములను, గజములను , అనేక ఇతర విధములగు వాహనములను, సింహాసనమును, ఆభరణములను, వస్త్రములను, ఆహార ధాన్యములను, భూమిని, ధనమును , గృహములను అతడు దానమిచ్చెను. భూసురులు దానములను స్వీకరించి, పరిపూర్ణకాములైరి. తండ్రికి సద్గతి కలుగుటకై భరతుడు కావించిన కర్మలను వర్ణించుటకు లక్షనోళ్ళైనను చాలవు.

పిదప శుభదినమును నిర్ణయించి వసిష్ఠ మునివరుడు విచ్చేసి సచివులను , సకల మహాజనులను పిలిపించెను. అందరు వచ్చిరి. రాజసభయందు ఆసీనులైరి. భరత, శత్రుఘ్నులను వారు పిలిపించిరి. వసిష్ఠుడు భరతుని తన సమీపమున కూర్చుండ పెట్టుకొని నీతి, ధర్మమయములగు వచనములను నుడివెను. కైకయొక్క కుటిల వర్తనమును గురించిన వృత్తాంతము అంతయు మునివరుడు మొట్టమొదట వర్ణించెను. తరువాత భూపాలుని ధర్మవ్రతము, సత్యవ్రతము, అతడు తనువును ఎట్లు త్యజించినదియు, ఎట్లు ప్రేమను ప్రదర్శించినదియు వసిష్ఠుడు వివరించెను. రాముని గుణ, శీల, స్వభావములను వర్ణించుచున్న మునిరాట్టుయొక్క నేత్రములు జలభరితములయ్యెను. అతడు పులకిత శరీరుడయ్యెను. సీత, లక్ష్మణుడు చూపిన ప్రేమను ప్రస్తుతించి జ్ఞాని ఆగు ఆమునిశోక, ప్రేమనిమగ్నుడయ్యెను. దుఃఖితుడై మునినాథుడు ఇట్లు నుడివెను. ''భరతా, వినుము. భావిప్రబలమైనది. జీవన, మరణములు, లాభ నష్టములు, కీర్తి అపకీర్తులు , అన్నియు విధి చేతులలోఉన్నవి. దీనిని తెలిసికొనిచో దోషము ఎవరిది? ఎవరిపై వ్యర్థముగా కోపము?నాయనా, నీమనస్సున విచారించుకొనుము.

దశరథ మహారాజును గురించి చింతింప తగదు.

వేద విహీనుడగు విప్రుడు శోచనీయుడు. స్వధర్మములను విడిచి విషయభోగ లలాలనుడగు విప్రుడు శోచనీయుడు. నీతిని తెలియని నృపాలుడు శోచనీయుడు. తన ప్రజలు ప్రాణసమానులు, ప్రియులు కానట్టిరాజు శోచనీయుడు,. ధనవంతుడయ్యును లోభియై, అతిథి సత్కారము చేయక శివభక్తి యందు నైపుణ్యములేని వైశ్యుడు శోకింప తగినవాడు, బ్రాహ్మణులను అవమానించునట్టియు, వాచలుడు, గర్వీష్టి,తన జ్ఞానమును గురించి డాంబికములు పలుకు నట్టియు శూద్రుడు శోచనీయులు, అంతేకాక పతిని వంచించు నట్టియు, కుటిల కలహప్రియ, స్వేచ్ఛావిహారిణి అగునట్టియు స్త్రీలు శోచనీయులు.

బ్రహ్మచర్య వ్రతమును విడనాడి గురుని ఆనతిని అనుసరించని బ్రహ్మచారిని గూర్చి చింతింపవలయును.

మోహవశుడై కర్మమార్గమును విడనాడునట్టి గృహస్థుడు చింతింప తగినవాడు.

ప్రపంచపు మోసములయందు చిక్కుపడి వివేక విరాగశూన్యుడగు సన్యాసి శోచనీయుడు.

తపమును త్యజించి, భోగములను అనుభవించుటయే శ్రేయమనుకొను వాన ప్రస్థుడు శోచనీయుడు.

చాడీలు చెప్పువాడు, అకారణముగా క్రోధముచెందువాడు తల్లిదండ్రుల. గురువుల, బంధుజనులు విరోధి అగువాడు శోచనీయులు. పరులకు అపకారముచేయువాడు. స్వశరీరమునే పోషణచేసికొనువాడు, కడునిర్దయుడు, కపటరహితుడై హరిని భజించనివాడు శోచనీయులు.

కోసలాధిపతి శోచనీయుడు కాడు. ఆతని ప్రభావము పదునాలుగు భువనముల యందును విదితము. నీ తండ్రి వంటి రాజు, భరతా, ఇంతకుమున్ను ఎవ్వడూ లేడు. ఇప్పుడు ఎవ్వడూ లేడు. ఒక ఉండబోడు. బ్రహ్మ విష్ణు శివులు, సురపతి, దిక్పాలకులు, ఎల్లరు దశరథుని గుణగాథలను ప్రస్తుతింతురు.

నాయనా, రామ లక్ష్మణ శత్రుఘ్నుల వంటి, నీ వంటి పవిత్రులగు పుత్రులను కన్నవానియొక్క ఘనతను ఎవరు పొగడగలరు? సర్వవిధముల దశరథ మహారాజు మహాభాగ్యవంతుడు. ఆతనిని గురించిన విషాదము వృథా. ఈ నాపలుకులు విని, యోచించి, విచారము వీడుము. ప్రభుని ఆనతిని తలనుతాల్చి, అనుసరింపుము. రాజ్య పదవిని ఆతడు నీకుఇచ్చెను. తండ్రి వచనములను సత్యముకావించుట నీకర్తవ్యము. మాటనిలుపుకొనుటకొఱకే కదా రాముని త్యజించినాడు నీ తండ్రి. ఆతడు రామవిరహాగ్ని యందు తన శరీరమును ఆహుతి చేసినాడు ! రాజునకు తన మాటయేప్రియము, ప్రాణము కాదు. నాయనా, తండ్రి మాటను సత్యము కావింపుము. భూపాలుని ఆజ్ఞను తలదాల్చి పాలించుము. దీనివలన సర్వవిధముల నీకు మేలుకలుగును.

తండ్రి ఆజ్ఞను పాలించి తల్లిని సంహరించెను పరశురాముడు. లోకమెల్లయు ఈ సంఘటనకు సాక్షియే ! తండ్రికి తన యవ్వనమును దత్తముచేసెనుకదా యయాతి పుత్రుడు ! తండ్రి ఆనతిని పాలించుటవలన ఏపాపము అంటలేదు యయాతి తనయునికి ! అతనికి అపయశయు ప్రాప్తించనూ లేదే !

'అనుచితమా, ఉచితమా' అను విచారమును వీడి పితృవాక్య పరిపాలన చేయుపుత్రుడు సుఖమునకు, సుయశమునకు పాత్రుడై తుదకు అమరపతియొక్క పురమున వసించును.

రాజుయొక్క వచనములను అవశ్యము నీవు సత్యము కావింపుము. శోకమును పరిహరింపుము. ప్రజలను పాలింపుము. స్వర్గమున ఉన్న నరపాలుడు సంతసించును. నీకు పుణ్యము, సత్కీర్తియు లభించును. దోషము కలుగదు. తండ్రి ఎవరికి రాజ్యము ఇచ్చునో అతడే దానిని పొందును. ఇది వేదవిదితము. సర్వ శాస్త్రసమ్మతము గ్లానిని వీడుము. రాజ్యము చేయుము. నామాటలు హితకరములని గ్రహించి అంగీకరింపుము. ఈ విషయము విని వైదేహియు, రాముడు ఆనందింతురు. పండితు లెవ్వరు దీనిని అనుచితమనరు. కౌసల్యాది నీ తల్లులెల్లరు కూడా ప్రజల సుఖమును కనుగొని సంతసింతురు. నీకును, రామునికి కల సంబంధమున తెలిసికొనిన వారెల్లరు నిన్ను సర్వవిధముల మెత్తురు. రాముడు మరలివచ్చిన పిదప ఆతనికి రాజ్యము ఇత్తువు. అత్యంత ప్రేమతో ఆతనిని సేవింతువు.''

సచివులు చేతులు జోడించి ''గురుని ఆనతిని అవశ్యము పాలింపుము. రఘుపతి తిరిగి విచ్చేసినపిదప ఉచితమేదియో దానిని అప్పుడు కావింపవచ్చును'' అని వచించిరి. కౌసల్య ధైర్యము వహించి ''కుమారా, గురుని ఆజ్ఞ పవిత్రమగు పథ్యము, దానిని ఆదరింపవలె. అదియే హితమని ఎంచి దానిని పాలింపవలె. కాలగతిని ఎఱిగి విషాదమును వీడవలె. రఘుపతి వనమున ఉన్నాడు. నరనాథుడు సురపతి అయ్యెను. తండ్రీ, ఇట్లు నీవు పిరికివాడగుచుంటివి. కుమారా, నీ పరిజనులుకు, ప్రజలకు. మంత్రులకు, తల్లులెల్లరకు నీవు ఒక్కడవే ఆశ్రయము. విధి ప్రతికూలమయ్యెనని, కాలము కఠోరమయ్యెనని తెలిసికొని ధైర్యము వహించుము. నీతల్లిపై ఆన ! గురుని ఆనతిని తలనుధరించి, అనుసరించుము. కర్తవ్యమును పాలింపుము ప్రజలను పరిపాలింపుము. పరిజనులయొక్క దుఃఖమును పారద్రోలుము'' అని కోరెను.

వసిష్ఠుని వచనములను, మంత్రుల అభినందనలను భరతుడు వినెను. ఆతని హృదయమునకు అవి చందనమువలె చల్లనయ్యెను. మృదులమై, శీల, ప్రేమ, సరళతాభరితమగు కౌసల్య యొక్క మంజుల వాణినికూడా భరతుడు వినెను. తల్లియొక్క ఉదారవచనమును విని భరతుడు వ్యాకులుడయ్యెను. ఆతని నయన సరోరుహములనుండి నీరు కారి, ఆతని హృదయమునందలి విరహమను నూతన అంకురమును తడిపెను. భరతుని దశను ఆసమయమును చూచి అందరు తమ శరీరములను మరచిపోయిరి. సహజప్రేమకు అవధి అగు భరతుని ఎల్లరు కొనియాడసాగిరి.

ధీర ధురంధరుడగు భరతుడు ధైర్యమువహించి, కరకమలములను మోడ్చెను. అమృతమున ముంచి ఎత్తబడినవో అనదగు వచనములతో అతడు ఎల్లరకు యోగ్యమగు ప్రత్యుత్తరము ఇట్లు వచించెను:-

''గురుడు నాకు సదుపదేశము కావించెను. ప్రజలకు, మంత్రులకు సర్వులకు అది సమ్మతమే. జననియును ఉచితమను తెలిసికొని నాకు ఆజ్ఞ ప్రసాదించినది. అవశ్యము దానిని తలదాల్చి తప్పక ఆచరింపవలెననియే నాకోరిక. గురువుల, జననీజనకుల, యజమానుల, మిత్రులయొక్క హితవచనములను విని, ముదితమానసమున, వానిని మంచివని ఎంచి అనుసరించవలెను. అవి సమంజసమైనవా, అసమంజసమైనవా అని విచారించుచో ధర్మము నశించును. పాపభారము పెరుగును. నేను ఆచరింప యోగ్యమగు మేలైన ఉపదేశములను కావించితిరి. ఇది అంతయు నాకు అవగతమే. ఐనను నా హృదయమునకు ఆనందము కలుగుటలేదు. మీరందరు నావినతిని ఇప్పడు ఆలకింపుడు. నా యోగ్యతకు తగురీతిని నాకు కర్తవ్యమును వచింపుడు. ప్రత్యుత్తరమిచ్చుచున్నాను. నా అపరాధమును మన్నింపుడు. దుఃఖితులగువారి గుణదోషములను సాధుపురుషులు పరిగణించరు.

నా త్రండి స్వర్గమున ఉన్నాడు. సీతారాములు వనమున ఉన్నారు. మీరేమో నన్ను రాజ్యము చేయుమనుచున్నారు. దీనిచే నాకు హితమని మీరు యోచించుచున్నారో లేక మీ కేమైన ప్రయోజనము కలదో! సీతాపతిని సేవంచుటయందే నాకు హితము కలదు. నా తల్లి యొక్క కుటిలతచే ఆ సేవ నాకు దక్కలేదు. మరి ఏ ఇతర విధమునను నాకు హితము కలుగనేరదని నా మనస్సున యోచించి కనుగొంటిని. సీతారామలక్ష్మణుల చరణ సందర్శనము లేనిదే శోకపుంజమగు ఈ రాజ్యమువలన ఏమి ప్రయోజనము నాకు? వస్త్రముల ధరింపక, ఆభరణములను ధరించుటవలె అది బరువుచేటు. వైరాగ్యములేని బ్రహ్మవిచారమువలె అది వ్యర్థము. రోగిష్ఠి అగు శరీరమునకు వివిధభోగములు వృథా. హరిభక్తిలేని జపము, యోగము వ్యర్థములు. జీవములేని సుందరమగు దేహము నిష్ప్రయోజనము. అట్లే రఘుపతి లేనిదే నాకు సర్వము వ్యర్థమే. రామునివద్దకు పోదును. ఆనతి ఇండు. దీనియందే నా హితము కలదు. నన్ను రాజునుచేసి మీ మేలును కోరుచున్నారు. ఇదియును మీరు మోహనశులై పలుకుచున్న మాటయే.

కై కేయియొక్క సుతుడను, కుటిలమతిని, రామ విముఖుడను. సిగ్గులేని వాడను.' అగు నా వంటి అధముని మీరు మోహనశులై రాజు కావలెననుట మీ సుఖముకొరకే. నేను నిజము పలుకుచున్నాను. అంతయు విని విశ్వసింపుడు. ధర్మశీలుడే రాజు కావలెను. బలవంతమున నాకు ఏదో విధముగ సింహాసన మిచ్చినచో మహీతలము శీఘ్రమే పాతాళమునకు క్రుంగిపోవునేమో, నా వంటి పాపికి నిలయమేది? నా కారణమున కదా సీతారాములకు వనవాసము ప్రాప్తించెను? రాజు రామునికి వనమును ప్రసాదించెను. వారు వెడలగానే ఆతడును అమరపురికి పయనించెను.

నేను ధూర్తుడును. ఈ అనర్థములన్నిటికి కారణము నేనే. చైతన్యుడనై కూర్చుండి అన్నియు వినుచున్నాను. రఘువీరుడు లేని భవనమును విలోకించితిని. లోకము నన్ను చేయు ఎగతాళిని సహించితిని. ఇంకను నా ప్రాణములు నిలచియే ఉన్నవి. రాముడు పవిత్రుడు - విషయాసక్తుడుకాడు. లోభినగు నేనో రాజ్య, భోగములయందు ఆకలి కొన్నవాడను. నా హృదయ కఠోరతను ఎంతని వర్ణింపగలను? వజ్రముకంటె అది కఠోరము. కారణముకంటె కార్యమే కఠినమయ్యెను. దీనియందు నా దోషములేదు. ఎముకలకంటె వజ్రము కఠినము. రాతికంటెను లోహము కరాళ##మైనది. కఠోరమైనదియును, కై కేయికి జన్మించిన ఈ దేహమునందు అనురాగము కలుగు ఈ పామరప్రాణి సర్వవిధముల అభాగ్యుడు. ప్రియుని వియోగానంతరము కూడా ప్రాణముమీదనే ప్రీతి దీనికి. ఐనచో ఇక ముందు ముందు ఎంతయో నేను అనుభవించవలయును. సహించవలయును.

కైక సీతారామలక్ష్మణులను అడవులకు పంపించినది. పతిని అమరపురికి పంపి ఆతనికి హితము కలిగించినది. వైధవ్యమును, అపయశమును తనకు తానే కోరి తెచ్చుకొనినది. శోక, సంతాపములకు ప్రజలకు చుట్టపెట్టినది. ఇక నాకు సుఖమును, సుయశమును, సురాజ్యమును ప్రసాదించినది ! ఇట్లు కై కేయి అందరికి అన్ని మంచి పనులు కావించినది ! ఇంతకన్నను మరి నాకు కావలసిన దేమున్నది? పైగా తామెల్లరు నాకు పట్టాభిషేకము చేయుదు మనుచున్నారుకదా. కై కేయి గర్భమునుండి జన్మించిన నాకు ఇది ఎంతమాత్రము అనుచితముకాదు. నన్ను గురించి సర్వము విధాతయే విధించినాడు. ప్రజలైనను, పెద్దలైనను ఏల సాయపడవలెను ? వాతరోగి ఒకనిని దుష్టగ్రహము ఆవహించెను. వానినే తేలు కుట్టినది. అట్టివానికి కల్లు త్రాగించినచో - ఇది ఎట్టి చికిత్సయో తెలుపుడు.

కై కేయి కడుపున పుట్టినవానికి ఏది తగునో దానినే నాకు చతురుడగు విరించి ప్రసాదించినాడు. 'దశరథ తనయుడు', 'రామానుజుడు' అను మహా గౌరవము ఆ విధాత నాకు వ్యర్థముగానే ప్రసాదించినాడు ! తామెల్లరు నన్ను సింహాసనమును ఆలంకరించుమనియే చెప్పుచున్నారు. రాజాజ్ఞను ఎల్లరు ఆమోదింతురు. ఎవరెవరికి ఏ ఏ విధముగా ప్రత్యుత్తర మీయగలను నేను ? మీకు రుచించినట్లు మీరు వచించితిరి. దుష్టబుద్దికలిగిన నా తల్లియు, నేను తప్ప ఈ పని మంచిదని ఎవ్వరందురు ? చెప్పుడు చరాచరమగు ఈ జగమున నాకు తప్ప - సీతారాములు ప్రాణప్రియులు కానిది ఎవరికి ?

ఏది పరమ హానియో అదియే తమ అందరికి అత్యంత లాభకరముగా కనుపించుచున్నది. ఇది నాదుర్దినము. ఎవ్వరి దోషమూకాదు. మీరెల్లరు ప్రేమవశులై ఉన్నారు. సంశయగ్రస్థులై ఉన్నారు. మీరు నుడువునదంతయు సమంజసమే. కౌసల్య చిత్తము అతి సరళ##మైనది. ఆమెకు నాయందు విశేషమగు ప్రేమ. నాదీనతను కనుగొని సహజప్రేమ వశముననే ఆమె ఇట్లు నుడివెను. గురువరుడు వివేకసాగరుడు. ఇదిలోక విదితమే. ఈ విశ్వము సర్వము ఆయనకు కరతలామకలము. నా పట్టాభిషేకమునకు ఆయన సన్నాహములు చేయుచున్నాడు. విధి విముఖుడైనప్పుడు అందరు విముఖులే !

ఈ అనర్థకార్యమునకు నా అంగీకృతిలేదని ఈ లోకమున సీతారాములుతప్ప ఇతరులెవ్వరూ అనరు. ఈమాటలన్నియు నేను సుఖముగా విందును. సహింతును. నీరు ఉన్నచోటనే కదా తుదకు బుదరఅగును, లోకము నన్ను నిందించునను భయములేదు. పరలోకమును గురించి చింత నాకులేదు. నా హృదయమున ఒకే ఒక దుస్సహదావానలము భగ్గుమని మండుచున్నది. నావలననే కదా సీతారాములు కష్టముల పాలైరనియే అది. జీవితముయొక్క ఉత్కృష్టలాభమును లక్ష్మణుడు పొందెను. సకలమును త్యజించి అతడు రామ చరణములయందే తన మనస్సును లగ్నము కావించినాడు. మరి నాజన్మయో ! రఘువరుని వనవాసమునకే నేను జన్మించినది! అభాగ్యుడను. వృథాగా నాకు ఈ పశ్చాత్తపమేల ? ఎల్లరకు శిరము వంచి నమస్కరించి నా యొక్క దారుణ దీనతను వివరింతును. రఘునాథుని చరణసందర్శనము లేనిదే నా హృదయాగ్ని చల్లారదు. ఇంకొక ఉపయమేదియే నాకు తోచుటలేదు. రఘువరుడు తప్పనాహృదయబాధను తెలిసికొనగల వారెవ్వరున్నారు ? నా మనస్సున ఒకే ఉపాయము తట్టుచున్నది. నిశ్చయముగా అది ఇదే. ప్రాతఃకాలముననే నేను ప్రభునివద్దకు వెడలెదను. నేను దుష్టుడను. అపరాధినే ఐనను ఈ ఉపద్రవమంతయు నా మూలముననే జరిగి ఉన్నను సరే, శరణువేడి వచ్చిన నన్ను చూచి, నా అపరాధములనన్నిటిని మన్నించి రాముడు నాపై అమిత కృపచూపును. రఘునాథుడు శీలవంతుడు, వినయశీలుడు, అత్యంత సరళస్వభావుడు. కృపాళుడు. ప్రేమనిలయుడు. ఆతడు శత్రువునకై నను హాని సలుపలేదు. దుష్టుడనైనను నేను ఆతని శిశువును, సేవకుడను. నా వినతిని విని, నేను అతనిదాసుడనని తెలిసికొని రాముడు రాజధానికి మరలి వచ్చునట్లు పెద్దలగు మీరెల్లరు. దీని యందేనాకు శుభము కలుగునని ఎఱిగి, మధుర వచనములతో నాకు ఆజ్ఞఇండు, నన్ను దీవించుడు. నన్ను కన్నది దుష్టబుద్ధి. నేను-దుష్టడను, సదాదోషయుతుడను, ఐనను నాకు రఘువీరునియొక్క అండకలదు.నేను తనవాడనని ఎంచి ఆతడు నన్ను విడనాడడు''.

భరతుని వచనములను అందరు మెచ్చుకొనిరి. రాముని ప్రేమామృతమున మునిగినవో అనునట్లున్నవి. అవి. రామవియోగమను భయంకర విషముచే ఎల్లరు కాలిపోవుచు బీజయుతమగు మంత్రమును వినగనే లేచి కూర్చుండిరో అనునట్లున్నది.

తల్లి, మంత్రి, గురువు, పురస్త్రీలు, పురుషులు అందరు ప్రేమచే మిక్కిలి వ్యాకులత చెందిరి. ఎల్లరు భరతుని ''రామునియందలి ప్రేమయే మూర్తీభవించిన నీ శరీరము'' అని ప్రస్తుతించిరి.

''నాయనా, భరతా, రామునికి నీవు ప్రాణసమానమగు ప్రియుడవు. అవును. అంతకంటె వేరుగా ఎట్లు పలుకుదువు? మూర్ఖుడై ఏ దుష్టుడైనను నీ తల్లి కై కేయి యొక్క కుటిలతను పురస్కరించుకొని నిన్ను సందేహించినచో - వాడు - ఆ నీచుడు - కోట్లకొలది వాని పూర్వజులతోసహ శతకల్పములవరకు నరకమున వసించును. పాముయొక్కపాపమును. అవగుణములను దాని మణి గ్రహించదు. విషమును మాత్రమే అది హరించును. అంతేకాక మన దుఃఖమును, దారిద్య్రమును అది భస్మము చేయును. భరతా, రాముడున్న అడవికి అవశ్యము వెడలుదము. మంచి యోచన కావించితివి. శోకసముద్రమున మునుగుచున్న ఎల్లవారికి నీవు ఆధారమైతివి.'' అని వారు నుడివిరి. అందరి మనస్సులయందు మహా ఆనందమే. మేఘ గర్జనను విని చాతకపక్షులు, నెమళ్లు ఆనందించునట్లున్నది - ఆ ఆనందము.

ప్రాతఃకాలముననే పయనించవలెనను భరతునియొక్క మనోహర నిర్ణయమును వినిన ఎల్లరకు ఆతడు ప్రాణప్రియుడయ్యెను. భరతుడు వసిష్ఠమునికి వందన మొనర్చెను. అందరు శిరములువంచి భరతునికి నమస్కరించిరి. శెలవు తీసికొని తమ తమ ఇండ్లకు మరలిరి.

''జగమున భరతుని జన్మ ధన్యత చెందినది'' అని పలుకుచు భరతుని శీలమును, ప్రేమను కొనియాడుచు వారు వెడలిరి. ''చాల మంచి పని జరిగినది'' అని వారిలో వారు అనుకొనుచు అందరు ప్రయాణమునకు సన్నద్ధులు కాసాగిరి. ''ఇల్లు, వాకిలి కనిపెట్లుకొని మీరు ఇక్కడే ఉండుడు'' అని ఎవరైనను తమను కోరినచో, ''ఇక మా కంఠము తెగిపోయినదని'' వారు అనుకొనుచుండిరి.

''అయోధ్య యందే ఉండమని మాత్రము ఎవరికీ చెప్పవద్దు. ఈ జగమున జీవితమునకు ప్రయోజనము అక్కరలేనిది ఎవ్వరికి? ఈ సంపద, ఇల్లు, సుఖము, స్నేహితుడు, తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, తగులపడపోనిమ్ము. రామ పాదసాన్ని ధ్యమునకు చేర్చజాలనివి సకలము ఏమి ప్రమోజనము?'' అని కొందరు అనుచున్నారు.

ప్రతిఇంటను నానావిధములగు వాహనములు అలంకరింపబడుచున్నవి. ''రేపు ప్రభాతముననే ప్రయాణము.'' అని అందరి హృదయముల యందును ఆనందమే !

భరతుడు ఇంటికి చనెను. ''ఈనగరము. అశ్వములు. ఏనుగులు, భవనములు, భాండారము మొదలగు సర్వసంపదలు రఘుపతివి. వీని రక్షణకు ఏర్పాటుచేయక, వీనిని ఇచ్చట ఇట్లే వదలిపోయినచో కలుగు పరిణామము నాకు శ్రేయస్కరము కానేరదు. స్వామిద్రోహము సర్వపాప శిరోమణి - ఎవరెంత దూషించినను సరే స్వామికి హితము కలిగించువాడే సేవకుడు.'' అని అతడు తలంచెను. స్వప్నమున నైనను తమ స్వధర్మములనుండి చలించని విశ్వాసపాత్రులగు సేవకులను పిలిపించెను. భరతుడు వారికి సకల మర్మములను, ధర్మములను బోధించెను. వారి వారికి తగు రీతిని ఆ ఆ పనులలో వారిని నియమించెను. అన్ని ఏర్పాట్లను కావించెను. రక్షకులను నియమించెను. అంతట భరతుడు కౌసల్యవద్దకు వెడలెను.

ప్రేమతత్వమును ఎఱిగిన భరతుడు తల్లులెల్లరు ఆర్తులై ఉన్నట్లు గమనించెను. వారికి అతడు పల్లకీలను సిద్ధము చేయించెను. సుఖాసనములతో వాహనములను సిద్ధము చేయుడని ఆజ్ఞాపించెను.

నగరమునందలి స్త్రీలు, పురుషులు చక్రవాక జంటవలె ఆర్తహృదయులై ఎప్పుడు తెల్లవారునా అని తహతహపడుచున్నారు. ఆరాత్రి అంతయు వారు మేల్కొనియే ఉన్నారు. తెల్లవారెను. చతురులగు సచివులను భరతుడు పిలిపించెను.

''పట్టాభిషేకమునకు వలయు సంభారము లన్నిటిని తోడ్కొని రండు. వనము నందే వసిష్ఠమునీంద్రుడు రాముని రాజ్యాభిషిక్తుని కావించును. వేగమే పయనము కండు.'' అని అతడు వారిని ఆజ్ఞాపించెను. మంత్రులు విని భరతునికి వందనము లర్పించి శీఘ్రమే అశ్వములను, గజములను, రథములను అలంకరింపచేసిరి. అందరికి ముందు అరుందతి, వసిష్ఠుడు, అగ్నిహోత్రుని వెంటకొని రథమున అధిరోహించి బయలుదేరిరి. వారివెనుక తపో, తేజోనిధులగు అనేక విప్రబృందములు వాహనములు యందు బయలుదేరిరి.

నగర జనులు ఎల్లరు తమ తమ వాహనములను అలంకరించుకొని చిత్ర కూటమునకు పయనమైరి. ఆ దృశ్యము వర్ణనాతీతము. రమ్యమగు పల్లకీలలో రాణులు బయలుదేరిరి. విశ్వాసపాత్రులగు సేవకులకు నగరమున ఒప్పగించి సాదరముగా అందరిని సిద్ధముచేసి, బయలుదేరనిచ్చి సీతారాముల చరణములను స్మరించి భరత శత్రుఘ్నులు ప్రయనమైరి.

రామదర్శన లాలసులై స్త్రీ, పురుషులెల్లరు దప్పికొనిన ఆడ, మగ ఏనుగులు నీటికై పరుగెత్తుకొనిపోవునట్లు పోవుచున్నారు. ''సీతారాములు ఆడవులయందున్నారు'' అని మనమున చింతించుచు భరతుడు అనుజసహితుడై పాదచారియై వెడలుచున్నాడు. వారిప్రేమను కనుగొని జనులు అనురాగమగ్నులై రథ, గజ, తురగములనుండి దిగినడువ మొదలిడిరి. కౌసల్య తన డోలీని భరతునికి సమీపమున నిలిపించి, మృదవచనములను ఇట్లు వచించెను:-

''నాయనా, నీవు రథమును ఆరోహించుము. నా మాట మన్నింపుము. నీవు రథమును ఎక్కనిచో ఈ ప్రియ పరివారము అందరు దుఃఖితులగుదురు. నీవు నడచుచో తక్కినవారు నడచియేవత్తురు. శోకవశమున ఎల్లరు దుర్బలులై ఉన్నారు. నడచుటకు తగినట్లు లేరు.

తల్లి మాటలను భరతశత్రుగ్నులు తలదాల్చిరి. ఆమె చరణములకు తలవంచి నమస్కరించిరి. ఇద్దరు అన్నదమ్ములు రథమున ఆసీనులై పయనింపసాగిరి.

మొదటిరాత్రి వారందరు తమసాతీరమున ఆగిరి. రెండవరాత్రి వారు గోమతీ తీరమున విడిది చేసిరి. కొందరు పాలుత్రాగియే ఉండిరి. మరికొందరు ఫలములనే భుజించిరి. కొందరు ఒక రాత్రిపూట మాత్రమే భుజించిరి. భూషణములను, భోగములను అందరు త్యజించిరి. ఎల్లరు రాముని హితమునకై వ్రతములను, నియమములను పాలించిరి. గోమతికి ఉపనది అగు సయీ నదీతీరమున ఆ రాత్రిగడపి మరునాటి ఉదయమును వారందరు బయలుదేరి శృంగబేరపురమును చేరిరి. నిషాదరాజు గుహుడు ఈ వార్త వినెను. అతడు దుఃఖితుడయ్యెను.

''ఏమికారణమో ? భరతుడు అడవికి వచ్చుచున్నాడు. అతని మనస్సున తప్పక ఏదో కపటభావము ఉండవచ్చును. మనస్సును కుటిలత్వమేలేనిచో అతనివెంట ఈ బలగమెందుకు? 'లక్ష్మణునితో సహా రాముని సంహరించి రాజ్యమును నిష్కంటకముగ పాలింతును' అని అతనుకొన్నాడేమో భరతడు ! అతడు మనసున రాజనీతిని తలపలేదు. అనాడు కళంకము వచ్చినది. ఈనాడు ప్రాణహానియే జరుగనున్నది. సకల సురాసురులు ఏకమై యుద్ధమునకు వచ్చినను రణమున రాముని ఓడించకలవాడు ఎవ్వడూ లేడు. భరతుని చర్యయందు ఆశ్చర్యమేమి కలదు? విషలతలనుండి అమృత ఫలములు ఫలించవు కదా'' అని అతడు విచారించెను.

''అందరు జాగరూకులై ఉండుడు, నావలను అదుపులో ఉంచుకొనుడు. నీటి లోనికి వానిని పోనిండు, రేవులన్నియు కట్టివేయుడు. సిద్ధముగాఉండి రేవులను బంధించుడు. అందరు ప్రాణములు తెగించిఉండుడు. భరతునితో నేను తలపడుదును. నా ప్రాణమువుండగా అతనిని గంగను దాటనీయను. రణమున మరణము-అదియు గంగాతీరమున ! రామకార్యమున ! శరీరములు క్షణభంగురములు. భరతుడు రాముని తమ్ముడు, అంతేకాదు.రాజు నేనో - నీచుడను. అట్టి భరతునిచేతియందు మరణము ఎంతోభాగ్యము. స్వామికార్యమునకై నేను యుద్ధమున పోరుదును. పదునాలుగులోకమును నా కీర్తిచే ప్రకాశింపచేతును. రఘునాథునికొరకై నా ప్రాణములను త్యజింతును. నా రెండుచేతులలో ఎట్ల యిననుసరే 'ముదము' అను మోదకమున్నది. సాధుసమాజములో గణింపబడనివాడు. రామభక్తులయందు స్థానము లేనివాడు లోకమున భూమికి భారమై వ్యర్థముగా జీవించువాడే ! అట్టివాడు తన తల్లి యొక్క యవ్వనమును చెట్టునకు గొడ్డలి.'' ఇట్లు పలికి విషాదరహితుడగుచు నిషాదపతి అందరి ఉత్సాహమును ఉప్పొంగచేసెను. రాముని స్మరించెను. వెంటనే ధనువును. తూణీరమును, కవచమును, అతడు తెప్పించెను.

''సోదరులారా, త్వరపడుడు, ఆయుధములను సిద్ధముచేయుడు. నా ఆనతిని వినుడు. పిరికితనమున వీడుడు'' అని అతడు హెచ్చరించెను. అందరు సంతోషమున 'ప్రభూ, మంచిది' అనిరి. ఒకరి ఆవేశమును మరిఒకరు ఇనుమడింపమొదలిడిరి. నిషాదపతికి జోహారులు మరిమరి అర్పించి వారందరు వెడలిరి. వారెల్లరు శూరులగు వీరులే.రణమున పోరాటము వారికి అతిప్రీతి. అందురు రాముని పాదపంకజ పాదుకలను స్మరించిరి. చిన్నచిన్న తూణీరములను కట్టిరి. ధనువులపై వింటినారలు సంధించిరి. కవచములను తొడగిరి. తలలపై ఇనుపటోపీలను ధరించిరి. గొడ్డళ్ళను, బల్లెములను పదునుపెట్టిరి. కత్తి యుద్ధమున కడు నేర్పరులు కొందరు నేల విడిచి ఆకసముననే గంతులు వేతురేమో అనునంత ఉత్సాహభరితులైరి. తమతమ యుద్ధసామగ్రిని, దళములను సిద్ధముచేసికొని అందరు వెడలి తమ ప్రభువగు గుహునికి వందనము చేసిరి. సభటులనందరినిచూచి గుహుడు వారెల్లరు యోగ్యులని గ్రహించెను. వారినెల్లరను పేరుపేరున పిలచి సన్మానము కావించెను.

''సోదరులారా, నన్ను వంచింపకుడు, నేను నేడు చేయవలసినకార్యము అతి భారమైనది'' అని గుహుడు అనెను. భటులు ఆ పలుకులు వినిరి. వారందరు ఆవేశమున ''వీరుడా, అధీరుడవు కాబోకుము. స్వామీ, రాముని ప్రతాపమువలనను, నీ బలముచేతను మేము భరతుని సేనావిహీనుని చేతుము. ఆతనిసేనలో ఒక్క అశ్వమైనను లేకుండచేతుము. మా బొందెలలో ప్రాణములుండగా మేము అడుగు వెనుకకు వేయము. భూమిని అంతయు శవమయము కావింతుము. కపాలములతో, మొండెములతో దానిని నింపవేతుము'' అని నుడివిరి.

నిషాదనాథుడు తన వీరసైనికదళమును వీక్షించెను. ''రణభేరీని మ్రోగించుడు'' అని ఆజ్ఞాపించెను. ఇంతో ఎవరో ఎడమవైపునుండి తుమ్మిరి. 'ఇది శుభ శకునము' అని శకునములు చెప్పువారు తెలిపిరి. శకునమునుగురించి యోచించి ఒక ముదుసలి ''భరతునితో మైత్రి జరుగును. ఆతనితో మీకు యుద్ధము జరుగదు. భరతుడువచ్చి రాముని వేడుకొనును. ఈ శకునము వైరము సంభవము కానేరదని పలుకుచున్నది'' అనెను. ఈ మాటలువిని గుహుడు ''ఆ ముదుసలి పలికినది నిజము. తొందరపడి మూర్ఖులు ఏదోపని చేతురు. పిదప చింతింతురు. భరతుని శీల, స్వభావములను తెలిసికొనక. ఎఱుగక యుద్ధము చేసినచో మన హితమునకే మహాహాని కలుగును. కనుక వీరులారా, మీరెల్లరు సమీకరించుడు. రేవులన్నియు బంధించుడు. నేను వెడలి భరతుని కలసికొందును అతని రహస్యములను గ్రహింతును. అతని భావము మైత్రియో లేక వైరమో - లేక ఉదాసీనతయో తెలిసికొందును. అంతట తిరిగివచ్చి తగురీతిని ఏర్పాటు కావింతును. వారిసుందరస్వభావమును కని వారిప్రేమను గుర్తించకలను వైరము, ప్రేమ దాచిఉంచుదమన్నను దాగవు'' అని పలికెను.

ఇట్లు వచించి గుహుడు భరత సమాగమమునకు వలయుసామగ్రిని సిద్ధముచేయమొదలిడెను. కందమూలఫలములను, పక్షులను, లేళ్ళను అతడు తెప్పించెను.

పల్లెవారు పీన, పాఠీనము లనబడు చేపలను గంపలలో నింపి తెచ్చిరి. సమావేశమునకు వలయుసామగ్రితో బయలుదేరి వెడలునపుడు మంగళప్రదములగు శుభశకునములు పొడగట్టెను. దూరమునుండియే గుహుడు మునివరుడగు వసిష్ఠుని చూచెను. తనపేరుచెప్పి. మునికి సాష్టాంగప్రణామము చేసెను. అతడు రామునికి ప్రియుడే అని గ్రహించి గుహుని వసిష్ఠుడు ఆశీర్వదించెను. గుహునిగురించి ఆ ముని భరతునికి తెలిపెను. గుహుడు రాముని సుఖుడని వినినవెంటనే భరతుడు రథమును విడిచి వచ్చెను. రథముదిగి అతడు అనురాగమున ఉప్పొంగుచు నడచెను. తన ఊరి పేరు. జాతివివరములు, తనపేరు ప్రకటించుచు గుహుడు నేలపై తలవంచి వందనము కావించెను. సాష్టాంగనమస్కారము చేయుటనుచూచి భరతుడు గుహుని లేవనెత్తెను. అతనిని తన ఉరమునకు హత్తుకొనెను. భరతునిహృదయమున ప్రేమ ఇముడటలేదు. స్వయముగ లక్ష్మణుడే వచ్చెనో అనునట్లు అతడు సంతసించెను. అత్యంతప్రీతితో భరతుడు గుహుని ఆలింగనము కావించుకొనెను, ఆ ప్రేమ పారవశ్యపురీతులను ఎల్లరు కొనియాడిరి.

'ధన్యుడు-ధన్యుడు' అను మంగళములకు మూలమగు శబ్దములను పలుకుచు సురలు భరతుని ప్రశంసించిరి. పూలవాన కురిపించిరి. లోకములు, వేదములు ఎవనిని ఎల్లవిధముల నీచుడని వచించుచున్నవో - ఎవనినీడ సోకినమాత్రమున స్నానము చేయవలయునో అట్టి నిషాదుని - తన హృదయమునకు హత్తుకొని రామానుజుడు-భరతుడు పులకితగాత్రుడై ఆలింగనము చేసికొన్నాడు !

''ఆవులించుచునైనను 'రామ-రామ' అనినవాని ఎదుటకు పాపపుంజములు చేరజాలవు. అట్టిచో రాముడే స్వయముగా కౌగలించుకొని ఈ గుహుని- ఇతనికులమును జగమున పావనము చేసినాడు ! కర్మనాశమను నదీజలము గంగానదిలో కలియును. ఇక దానిని తమ తలలపై ఎవరు ధరింపరు ? తెలుపుడు. రామనామమును వ్యత్యస్తము చేసి జపించి వాల్మీకి బ్రహ్మ అంతటివాడయ్యెనని లోకమెరుగును. చండాలుడు, మూర్ఖుడు, శబరుడు ఖసియుడు, యవనుడు, జడుడు, పామరుడు, కోలుడు, కిరాతుడు, ఎవడైనను సరే - రామనామమును ఉచ్చరించినచో పరమపవిత్ర డగును. భువనవిఖ్యుతు డగును. దీనియందు ఆశ్చర్యములేదు. యుగయుగములనుండియు ఇదే రీతని జరుగుచున్నది. రఘువీరుడు గొప్పవానిని చేయనిదెవ్వనిని?" అని ఇట్లు రామనామమహిమను దేవతలు వివరించిరి. ఈ విషయమును విని, అయోధ్యనగర ప్రజలు ఆనందించిరి.

రాముని సఖుడగు గుహునికి భరతుడు ప్రేమతో స్వాగతము చెప్పెను. కుశల - మంగళ, క్షేమములనుగురించి అతనిని ప్రశ్నించెను. భరతుని ప్రేమను, శీలమును కనుగొని గుహుడు ప్రేమముగ్ధడయ్యెను. తన దేహస్థితినే అతడు విస్మరించెను. అతని మనస్సున సంకోచము, ప్రేమ, ఆనందము అధికమయ్యెను. రెప్పవాల్చక భరతుని చూచుచు అతడు నిలచున్నచోటనే నిలచెను. కొంతసేపటికి ధైర్యమువహించి గుహుడు భరతుని చరణములకు వందనముచేసి, ప్రేమతో చేతులుజోడించి ఇట్లు వినతి కావించెను:-

''ప్రభూ, కుశలమునకు మూలమగు నీ పాదపంకజములను దర్శించి నేను త్రికాలములయందు నా కుశలమేదియో తెలిసికొంటిని. నీ పరమానుగ్రహముచే నేడు నేను, కోట్లాది నా తరములవారు అభీష్టసిద్ధిని పొందితిమి. అల్పమగు నా నేర్పును, నా కులమును గుర్తించి, ప్రభుని మహిమను యోచించి పలుకుచున్నాను. రఘువీరుని చరణములను భజించనివాడు - జగమున విధిచే వంచకుడే.

నేను కపటిని, పిరికివాడను, దుష్టజాతివాడను, దుష్టబుద్ధి కలవాడను, లోకములచే, వేదములచే బహిష్కరింపబడినవాడును. రాముడు నన్ను తనవానిగా చేసికొన్న నాటినుండియు నేను భువనమునకే భూషణమైతిని,''

నిషాదుని ప్రేమను కనుగొని అతని మహావినయమునుచూచి భరతానుజుడు గుహుని మరిఒకసారి కౌగలించుకొనెను. పిదప గుహుడు తనపేరును చెప్పుకొనుచు మధురవాక్కులతో రాణులెల్లరికి సాదరముగా నమస్కరించెను.

రాణులు అతడు లక్ష్మణునికి సమానమైనవాడని కనుగొని ''నూరులక్షల సంవత్సరములు సుఖముగా జీవించుము'' అని అతనిని ఆశీర్వదించిరి. అయోధ్యా నగరి నారీ, నరజనములు నిషాదుని విలోకించి - లక్ష్మణుని చూచినట్లే ఆనందించిరి.

''జీవితమునకు తగు ప్రయోజనమును పొందినది ఇతడే ! రామభ్రదుడు ఇతనిని తన దీర్ఘబాహువులచే బంధించి కౌగలించుకొన్నాడు'' అని అందరు గుహుని పొగడిరి. తన భాగ్యమును ప్రస్తుతించుటనువిని గుహుడు తన మనమున ఆనందమును పొందెను. అందరిని అతడు తోడ్కొనివెడలెను. సేవకులకు ఎల్లవారికి గుహుడు సంజ్ఞచేసెను. తమ స్వామియొక్క ఇంగితమునుగ్రహించి వారు వెడలి తమఇండ్లయందు, చెట్ల క్రింద, సరస్సులతీరమును, వనములలో, అడవులలో నివాసమునకై స్థలములను సిద్ధము చేసిరి.

భరతుడు శృంగబేరపురమును వీక్షించెను. ప్రేమవశమున అతని అంగము లన్నియు సడలెను. నిషాదునిభుజమున తనచేతులుంచి భరతుడు నడచుచుండగా వినయము, అనురాగము తనువులనుధరించి నడుచుచున్నట్లు కనుపించినది.

ఇట్లు సేనాసహితుడై భరతుడు లోకపావని అగు గంగామతల్లి ని సందర్శించెను. రామఘట్టమునకు అతడు ప్రణమిల్లెను. స్వయముగా రామునే దర్శించినట్లు అతని మానసము ఆనందమున మగ్నమయ్యెను.

అయోధ్యనగరి స్త్రీలు, పురుషులు బ్రహ్మమయమగు గంగాజలమును కాంచిముదితులైరి. ప్రణామము కావించిరి. వారెల్లరు గంగానదిలో స్నానముచేసి ''రామ చంద్రుని పాదములయందు మా భక్తి ఎన్నడూ క్షీణింపక ఉండుగాక'' అని చేతులెత్తి ప్రార్థించిరి.

''తల్లీ, సురనదీ, నీ రేణువు ఎల్లరకు సుఖమునిచ్చును. అది సేవకులకు కామధేనువు. సీతారాముల చరణములయందు నాకు సహజమగు ప్రేమ ఉండునట్లు వరమిమ్ము. చేతులెత్తి నిన్ను వేడుకొందును'' అని ప్రార్థించి భరతుడు స్నానముచేసి గురుని ఆనతినిపొంది - తల్లులందరు స్నానముచేసిరని తెలిసికొని అచ్చటినుండి ముందుకు పయనము సాగించెను. ప్రజలవసతికై గుడారములు ఏర్పాటు చేయబడిన చోట్లలో వారి సౌకర్యములనుగురించి భరతుడు తగుశ్రద్ధ వహించెను.

దేవతాపూజను కావించి. ఆజ్ఞపొంది, భరత శత్రుఘ్నులు కౌసల్యవద్దకు వెడలిరి. భరతుడు తల్లుల పాదలములను ఒత్తెను. మృదువచనములను పలికెను. మాతలను అందరిని సత్కరించెను. అనంతరము తల్లులసేవకు శత్రుఘ్నుని నియమించి భరతుడు నిషాదుని పిలిపించెను. సఖుడగు గుహుని చేతులనుపట్టుకొని భరతుడు నడచెను.వారి ప్రేమ అమితము. ఆ ప్రేమచే వారిశరీరములు కృశించినవి.

''ఆ రేయి సీతారాములు నిదురించిన ప్రదేశమునుచూపి నా నేత్ర, మానవ వ్యథను పోగొట్టుము'' అని భరతుడు గుహుని అడగెను. ఇట్లు పలుకుచుండగానే భరతుని కనుకొలకులు జలభరితములయ్యెను. భరతుని పలుకులచే గుహునికి అత్యంత విచారము కలిగెను. వెంటనే గుహుడు రఘువరుడు విశ్రమించిన పావన శింశుపా వృక్షమువద్దకు భరతుని తోడ్కొని చనెను. అతిప్రేమచే, సాదరముగా అ స్థలమునకు భరతుడు సాష్టాంగప్రణామము చేసెను. సుందరమగు దర్బశయ్యనుచూచి భరతుడు దానికి ప్రదక్షిణము చేసెను. రాముని చరణచిహ్నములున్న రజమును అతడు కన్నులకు అద్దుకొనెను. ఆ ప్రేమాధిక్యమును వర్ణింపజాలము. ఆ స్థలమున భరతుడు రెండు మూడు స్వర్ణబిందువులను కనుగొని వానిని సీతకు సమమైనవిగా భావించి తనతలపై ధరించుకొనెను.అతని నేత్రములు నీటితో నిండెను. హృదయము గ్లానితో నిండెను. రమ్యమగు వాణితో అతడు సఖునితో ఇట్లనెను:-

''ఈ స్వర్ణకణము సహితము సీతావిరహముచే అయోధ్యయందలి స్త్రీ. పురుషులవలె శోకమున కృశించి, కాంతివిహీనమై ఉన్నది. జగత్తున భోగ, యోగములను రెండింటిని కరతలము కావించుకొనిన జనకుడు ఈమెయొక్క జనకుడు, ఆయనకు సాటి ఎవరున్నారని చెప్పగలను? భానుకులభానుడగు దశరథభూపాలుడు ఈమెకు మామ. అమరపురిని పరిపాలించు ఇంద్రుడుకూడా ఆయననుచూచి ఈర్ష్య చెందువాడు. ఆమె ప్రాణనాథుడు రఘునాథస్వామి. ఆతని మహిమవలననేకదా ఐశ్వర్యమును, మహిమను ఎవరైనను పొందునది! పతివ్రతాశిరోమణి అగు సీత దర్భశయ్యపై పురండిఉన్నదని నా హృదయము ఏల దహించుకొనిపోవదో! హరా, ఇది వజ్రముకంటెను. అతి కఠినము !

నా తమ్ముడు లక్ష్మణుడు కడుసుందరుడు. ప్రేమార్హుడు. అట్టి సోదరుడు ఇంతవరకు ఎవ్వరికినీ లేడు. ఇప్పుడు లేడు. ఇక ఉండడు. లక్ష్మణుడు అయోధ్య పురజనులకు ప్రియుడు. జననీ జనకులకు ప్రేమాస్పదుడు. సీతారాములకు ప్రాణ ప్రియుడు. సుకుమారకోమలమూర్తి. మృదుస్వభావుడు. వెచ్చనిగాలి ఏనాడు అతని శరీరమునకు తగులలేదు. అట్టి అతడు విపినములయందు వివిధములగు విపత్తులను సహించుచున్నాడు నేడు. కాని ఈ నా హృదయము కోటివజ్రమునైనను నిరాదరించుచున్నది.

రాముడు అవతరించి జగమునే ప్రకాశవంతము కావించెను. రూప, శీల, సుఖ, సకలగుణ సాగరుడు ఆతడు. ఆతనిస్వభావము పురజనులకు, పరిజనులకు, గురువులకు, జననీ జనకులకు - సర్వులకు ఆనందదాయకము. శత్రువులసహితము రాముని గొప్పతనమును కొనియాడుదురు. ఆతని మాటలతీరు, కలిసికొట్టుతనము, వినయము మన మానసములనే హరించును. కోటిమంది శారదలు, శతకోటి శేషులైనను రామప్రభుని గుణగణములను గణింపలేరు. సుఖస్వరూపుడు, రఘువంశశిరోమణి, మంగళ, ఆనందనిధానము - కుశలనునపరచిని నేలపై నిద్రించుచున్నాడు. విధియొక్కగతి అతిబలీయము !

దుఃఖముయొక్క పేరైనను రాముడు చెవులతో వినిఉండలేదు. జీవనతరువును వలె స్వయముగ రాజే అతనిని సంరక్షించుచుండెడువాడు. రాత్రింబవళ్లు కంటికి రెప్పల వలె, మణిని ఫణి రక్షించునట్లు తల్లులెల్లరు ఆతనిని రక్షించుచుండిరి. అట్టి ఆ రాముడు - ఇప్పుడు పాదచారియై చరించుచున్నాడు. కందమూలఫలములను భుజించుచున్నాడు. ఛీ, ఈ అమంగళమునకు మూలము ఆ కై కేయి. ప్రాణప్రియతముడగు పతికి సహితము ఆమె ప్రతికూలమయ్యెను. పాపసాగరుడను, అభాగ్యడును నేను, ఛీ-ఛీ-నా మూలమున కదా ఇవి అన్నియు ఉత్పన్నమైనవి! కుల కళంకునిగా నన్ను విధాత సృజించెను. దుష్టురాలగు నా తల్లి నన్ను స్వామిద్రోహిని కావించెను.''

భరతుని మాటనువిని నిషాదుడు ప్రేమపూర్వకముగా అతనిని ఇట్లు ఓదార్చ మొదలిడెను:-

''నాథా, ఏల వ్యర్థముగా విచారింతువు? రాముడు నీవు ప్రియుడు. నీవు రాముని ప్రేమకు పాత్రుడువు. ఇది నిశ్చయము. ఇక దోషములన్నచో అవి ప్రతికూలుడగు ఆ విధాతవే. విధాత ప్రతికూలుడైనపుడు ఆతనిచర్యలు కఠోరములు. నీ తల్లి అగు కై కేయిని పిచ్చిదానిని చేసినది ఆ విధాతయే. ఆ రాత్రి ప్రభువు నిన్ను పదేపదే కొనియాడుచుండెను. రామునికి అత్యంత ప్రియుడు నీవంటివాడు మరిఒకడు లేడని తులసిపలుకును! ప్రమాణముచేసి నేనును పలుకుచున్నాను. పరిణామము మంగళకరమే అగును. ఇట్లు గ్రహించి నీ హృదయమున ధైర్యము వహింపుము. రాముడు అంతర్యామి. సంకోచ, ప్రేమ, కృపానిలయుడు. ఇట్లు యోచింపుము. నీ మనస్సును దృఢము చేసి కొనుము. వెడలి విశ్రమింపుము.''

సఖుని పలుకులను విని భరతుడు హృదయమున ధైర్యము వహించెను. రఘువీరుని ఆతడు స్మరించెను. నివాసస్థలమునకు అరుదెంచెను.

నగరి నరనారీ జనులెల్లరు రాముని నివాసమును గురించి తెలిసికొనిరి. కడు ఆర్తులై ఆ ప్రదేశమును చూచుటకు వెడలిరి. ఆ స్థలమును వీక్షించి, దానికి ప్రదక్షిణ చేసిరి. ప్రణామము కావించిరి. కై కేయిని బహువిధముల దూషించిరి. కన్నీరు కార్చిరి. ప్రతికూలుడగు విధాతను సహితము నిందించిరి. కొందరు భరతుని ప్రేమను కొనియాడిరి. మరికొందరు దశరథుడు తన ప్రేమను సంపూర్ణముగా నిలుపుకొనెననిరి. అందరు తమను తామే నిందించుకొనిరి. గుహుని కొనియాడిరి. వారి విషాదమును, ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు ?

ఇట్లు ఆ రాత్రి అంతయు వారెల్లరు మేల్కొని ఉండిరి. తెల్లవారగానే నదిని దాటుటకు వారు మొదలిడిరి. సుందరమగు నావపై గురువును అధిష్ఠింపచేసిరి. ఒక క్రొత్త నావపై తల్లులందరిని ఆసీనులను కావించిరి. నాలుగు గడియలలో అందరు నదిని దాటిరి. భరతుడు నావనుండి దిగెను. మిగిలినవారు దిగినట్లు చూచెను. ప్రాతఃకాలకృత్యములను నెరవేర్చుకొని, తల్లులకు పాదాభివందనము చేసెను. తలవండి గురునికి నమస్కరించెను. నిషాదగణమును ముందుగా పంపి, అతడు వారివెంట సేనను పంపెను, అందరికిముందు నిషాదనాథుడు. వారివెనుక - తల్లుల పల్లకీలు.

భరతుడు శత్రుఘ్నుని పిలిచి తల్లులవెంట చనుమనెను. వారవెనకు విప్రులు గురువులు నడచుచుండిరి.

భరతుడు గంగామతల్లికి ప్రణామము కావించెను. సీతారామ లక్ష్మణులను స్మరించెను. అతడు పాదచారియై పయనించుచుండెను. అతనివెంట కళ్లెము కట్టిన గుఱ్ఱములు నడచుచున్నవి.

''ప్రభూ, అశ్వమును అధిరోహింపుము'' అని సేవకోత్తములు పదేపదే భరతుని ప్రార్థించుచుండిరి.

''పాదాచారియై రాముడు వెడలెను. ఇక ఏనుగులు, గుఱ్ఱములు నా కొఱకా? తలక్రిందుగా నడచిపోవుటయే సమంజసము నాకు. సేవాధర్మము అన్నిటికంటె కఠినము'' అని భరతుడనెను.

భరతుని అవస్థను కనుగొని. ఆతని మృదు వచనములను విని సేవక బృందములు దుఃఖమున కరగిపోయిరి. ప్రేమతో ఉప్పొంగుచు ''రామా, సీతా రామా, సీతా'' అని ఉచ్చరించుచు భరతుడు మూడవజామున ప్రయాగను ప్రవేశించెను. అతని పాదములయందలి పుండ్లు - కమలముల మొగ్గలపైనుండు మంచుబిందువులవలె తళతళ మెరయుచున్నది. భరతుడు ఆ దినమంతయు పాదచారియై వచ్చెనని విని అచ్చటివారందరు దుఃఖితులైరి. అందరు స్నానముచేసిరని తెలిసికొని భరతుడు త్రివేణివద్దకు వచ్చెను. త్రివేణికి నమస్కరించెను. గంగా, యమునల, ధవళ, శ్యామలజలమున తాను విధిపూర్వకముగా స్నానముచేసెను. మహీసురులకు దాన మిచ్చెను. వారిని సన్మానించెను. గంగా, యమునల ఉజ్వలశ్యామలతరంగములనుచూచి ఆతని శరీరము పులకించెను. చేతులు జోడించి భరతుడు ఇట్లు నుతి కావించెను. :-

''తీర్థరాజమా, సకలకామ్యములను నీవు సఫల మొనరింతువు. నీ ప్రభావము వేదవిదితము. లోకమున ప్రకటితము. క్షత్రియ ధర్మమును త్యజించి నిన్ను యాచించుచున్నాను. ఎట్టి దుష్కృత్యములనైనను కావించును కదాఆర్తుడు ! ఈ విషయము నెరిగిన దాతలు యాచకుల కోర్కెలను సఫలమొనర్తురు. ధనమునందు నాకు అభిలాషలేదు. ధర్మము నందును నాకు ఇచ్చలేదు. కామమునందు కోర్కెయు నాకు లేదు. మోక్షమున ఆశ##లేదు. జన్మ జన్మలయందును నాకు రామ చరణములయందు భక్తి ఉన్నచాలు. ఇంతే. ఈ వరమునే నేను యాచింతును. మరి ఏదియువలదు. నేను కుటిలుడనని రాముడు అనుకొననిమ్ము. గురుద్రోహిననియు, స్వామిద్రోహిననియు నన్నులోకులుల నిందింపనిమ్ము. సీతారాముల చరణములయందు నా అనురాగము, అను దినమును నీ అనుగ్రహముచే అభివృద్ది అగుకాక!

చాతకపక్షిని జీవితాంతమువరకు మేఘము నిరాదరించుగాక. ఆ పక్షి నీరు కోరినపుడు మేఘము పిడుగులను వడగళ్లను ప్రసాదించుగాక. పదే పదే జలదమును ప్రార్థించని చాతకము నిరసన పాలగును. దాని ప్రేమను అనుసరించియే దాని ప్రతిష్ఠయును. కాల్చిననే కాంచనపువన్నె పెరుగును. అట్లే భక్తుడు తన ప్రియతమ ప్రభుని చరణములయందు ప్రేమను ఎన్నడూ విడువక ఉండుటయందే అతనికి మేలుకలదు.''

భరతుని వచనములను విని త్రివేణిమధ్యనుండి మృదువగు, మంగళ ప్రదమగు ఒక వాణి ఇట్లు వెలువడెను :-

''నాయనా, భరతా, సర్వవిధముల నీవు సాధుమూర్తివి. రామ చరణముల యందు నీకు అగాధమగు అనురాగము. వ్యర్థముగ నీహృదయమున గ్లానిని నీవు అను భవించుచున్నావు. నీవంటి ప్రియుడు రామునికి మరిఒకడు లేడు.''

త్రివేణి నుండి వెలువడిని ఈ అనుకూల వచనములను విని భరతుని తనువు పులకించెను. అతని హృదయము ఆనంద భరితమయ్యెను. ''భరతుడు ధన్యుడు! భరతుడు ధన్యుడు'' అని హర్షభరితులై దేవతలు పుష్పవృష్టి కురిపింపసాగిరి.

తీర్థరాజమగు ప్రయాగవాస్తవ్యులు, వానప్రస్థులు, వటువులు, గృహస్థులు, సన్యాసులు - అందరు ఆనందించిరి. అక్కడక్కడ ఐదుగురు, పదుగురు కలసి ఒకరితో ఒకరు.

''భరతుని ప్రేమ, శీలము పవిత్రమైనవి. సత్యమైనవియును'' అని అనుకొనుచుండిరి.

రాముని రమ్య గుణగణములను వినుచు వారు భరద్వాజమునివరుని వద్దకు ఏతెంచిరి. భరతుడు తనకు సాష్టాంగ నమస్కారము చేయుటను చూచి ముని అతడు మూర్తిమంతమగు తన సౌభాగ్యమని ఎంచెను. భరద్వాజముని పరుగెత్తుకొని వెడలి భరతుని లేవతీసెను. అతనిని తన హృదయమునకు హత్తుకొనెను. ఆశీర్వదించెను. కృతార్థుని కావించెను. ఆసనమును ఇచ్చెను. శిరము వంచుకొని భరతుడు కూర్చుండెను. పారిపోయి వచ్చి 'సిగ్గు' అను ఇంట దూరవలెనను కొనుచున్నాడో అన్నట్లున్నాడు అతడు. మునివరుడు ఏమైన ప్రశ్నించునెమో అని భరతుని మనమున మిక్కుటమగు సంకోచము! భరతుని శీలమును, లజ్ఞను భరద్వాజబుషి కనుగొని ''భరతా అంతయు మేము వింటిమి. విధాతయొక్క చర్యలపై మనశక్తి నిష్ర్పయోజనము. నీ తల్లి చేసిన దానిని గురించి చింతింపకుము. తండ్రీ కై కేయి యొక్క దోషము ఏమియు లేదు. వాగ్దేవియే ఆమె మతిని ఇట్లు భ్రమింపచేసినది. ఇట్లు నే నుడివినచో ఎవ్వరూ అంగీకరింపరు. వేదలోకధర్మములను, రెంటికి విద్వాంసులు అంగీకరింతురు. కాని, నాయానా, నీ నిర్మల యశమును కీర్తించినచో ఈ రెండికొ మహిమ చేకూరును. 'ఎవనికి తండ్రి రాజ్యమును ఇచ్చనో అతనిదే రాజ్యము' ఇది వేదలోక సమ్మతము. అందరు నుడువునదియు. నీకు రాజ్యమును ఇచ్చుటకై సత్యవ్రతుడగు భూపాలుడు నిన్ను పిలిపించిఉన్నచో ఆనందము, ధర్మము, గౌరవము ఆయనకు లభించెడివి. ఈ సర్వ అనర్థమునకు మూలము రామునికి వనవాసము విధించుటయే. ఈ వార్త వినినంతనే విశ్వమెల్లయు విషాదభరిత మయ్యెను. అయినను, కర్మగతిని అనుసరించి అజ్ఞానమున రాణి ఈ దుష్కృత్యము కావించినది. తుదకు ఆమె పశ్చాత్తాపము చెందినది. ఈ విషయమున నైనను ఏ స్వల్ప అపరాధము నీయందు ఉన్నదనువాడు అధముడు, అజ్ఞాని, దుర్జనుడు, నీవు రాజ్యము పాలించినను నీయందు దోషము ఉండదు. ఈ విషయమును విని రాముడు కూడా సంతసించువాడు. భరతా, ఇప్పుడు నీవు చేసినపని మంచిది. నీకు యోగ్యమగునది. రఘువరుని చరణములయందు భక్తియే జగమున సకల సన్మంగళములకు మూలము. అదియే నీ ధనము, నీ జీవనము, నీ ప్రాణము, నీ వంటి భాగ్యవంతు డెవ్వడున్నాడు? నీ ఈ చర్య ఆశ్చర్యకరము కానేరదు. దశరథుని సుతుడవు, రామునికి ప్రియ సోదరుడవు నీవు ! భరతా, వినుము, రఘవరుని మనస్సున నీ వంటి ప్రేమపాత్రుడు ఇంకొకడులేడు. సీతారామలక్ష్మణులు అందరు ఆ రాత్రి అంతయు అతి ప్రీతితో నిన్ను కొనియాడుచు గడపిరి. వారు ప్రయాగ తీర్థమున స్నానము చేయునపుడు ఈ రహస్యమును నేను తెలిసికొంటిని వారు నీ యందే ప్రేమమగ్నులై ఉండిరి. మూర్ఖుడగు నరునికి లౌకిక సుఖజీవనమునందువలె రామునికి నీయందు అత్యంతఅనురాగము. ఇది రఘువీరునికి ఇసుమంతయు గొప్పకాదు. ఏలనన తనను శరణుజొచ్చినవారి కుటుంబములను రఘుపతి సంరక్షించును. భరతా, ఇక - నీవు తనువు ధరించిన శ్రీరామభక్తియే అని నా భావము. భరతా, ఇది అంతయు నీకు కళంకమని తలచుచున్నావు. కాని ఇది మాకు ఉపదేశము సుమా, రామభక్తి అను రససిద్ధికై మాకు ఇది గణశపూజ. తండ్రీ, నీ కీర్తి నిర్మల నవీనచంద్రుని వంటిది. రఘువరిని సేవకులు కుముదములు, చకోరములును. నీకీర్తిచంద్రుడు సదా ఉదయించియే ఉండును. ఎన్నడూ అతడు అస్తమించడు. 'జగము' అనబడు ఆకాశమున నీకీర్తి ఎన్నడూ క్షీణించదు. దిన దినము అది ద్విగుణీకృతమగు చుండును. ముల్లోకములనబడు చకోరమునకు 'యశము' అను చంద్రునిపై అత్యంత ప్రేమ. ప్రభుని ప్రతాపభానుడు ఈ చంద్రకాంతిని హరింపజాలడు. ఈ చంద్రుడు రేయింబవళ్లు ఎల్లరకు సుఖప్రదుడై ఉండును. ''కై కేయియొక్క దుష్కృత్యములు,'' అను రాహువు దీనిని మ్రింగలేడు. ఈ చంద్రుడు రామునియొక్క రమణీయ ప్రేమా మృతముతో నిండిఉండును. గురుద్రోహమను దోషముచే ఇతడు దూషితుడు కాలేదు, 'కీర్తి' అను ఈ చంద్రుని సృజించి నీవు భూలోకమున అమృతమును సులభసాధ్యము కావించినావు. ఈ సుధ సేవించి రామభక్తులు ఇక సంతృప్తి చెందగలరు.

స్మరణమాత్రమున సకల సన్మంగళములను ప్రసాదించు ఖని అగు గంగానదిని భగీరథనృపాలుడు భూలోకమునకు తెచ్చినాడు. దశరథుని గుణగణములు వర్ణనాతీతములు. వేయేల? ఆతనికి ఈడగువాడు ఈ జగమున మరిఒకడు లేడు. ఏరాముని రూపమును తన హృదయనయనములతో వీక్షించి హరుడు సంతృప్తిచెందడో - అట్టి రాముడు దశరథునియొక్క ప్రేమకు, వినయమునకు వశుడై స్వయముగా అవతరించెను. అనుపమమగు కీర్తిచంద్రుని నీవు సృష్టించితివి. రామభక్తియే దానియందు నివసించును. తండ్రీ, వ్యర్థముగా నీవు నీ హృదయమున చింతిల్లుచున్నావు. పరశువేదిని పొందియు దారిద్ర్యభయమును పొందుచున్నావు. భరతా, వినుము, ఎన్నడూ అనృతము నేను వచింపమ. ఉదాసీనతాపసిని నేను, వనవాసిని. సకలసాధనల సత్ఫలితమగు సీతా రామ లక్ష్మణ సందర్శనము నాకు సంప్రాప్తించినిది. ఆ ఫలితమునకు పరమఫలితము నీ దర్శనము. ప్రయాగ సహితముగా నేను మహాభాగ్యవంతుడను, భరతా, నీవు ధన్యుడవు. నీ యశముచే జగమును జయించితివి.''

ఇట్లు వచించి భరద్వాజముని ప్రేమమగ్నుడయ్యెను. మునియొక్క పలుకులను విని సభాసదులు సంతసించిరి. భరతుని కొనియాడుచు దేవతలు పూలను కురిపించిరి. గగనమునను, ప్రయాగయందును 'ధన్యుడు భరతుడు-ధన్యుడు' అను ధ్వనిని విని భరతుడు అనురాగమగ్నుడయ్యెను.

భరతుని తనువు పులకించెను. ఆతని హృదయమున సీతా రామలు ఉన్నారు. ఆతని నయనసరోజములు జలభరితము లయ్యెను. మునిమండలికి భరతుడు ప్రణామముచుసి గద్గదస్వరమున ఇట్లు వచించెను:-

''మునిసమాజమున ఈ తీర్థరాజమున సత్యముపై ప్రమాణముచేయుటయు అత్యంత అనర్థదాయకమే. ఇట్టిచోట ఏ కొంచెమైనను అసత్యము పలికినచో ఇంతకుమించి ఇంకొకపాపము లేదు, నైచ్యము లేదు. సత్యభావమున పలుకుచున్నాను. మీరు సర్వజ్ఞులు. రఘునాథుడు సర్వహృదయాంతర్యామి. నా తల్లి కై కేయి చేసినపనికై నేను వగవను. లోకము నన్ను నీచుడని తలచుననుదుఃఖము నాకు లేదు. పరలోక భయములేదు నాకు నా తండ్రి మరణించెనని విచారములేదు నాకు. ఆయనయొక్క సుకృతము, సుయశము, భువనములయందు మనోజ్ఞముగా వెలయుచున్నవి. రామ లక్ష్మణులవంటి సుతులను ఆయన పడసెను. క్షణభంగురమగు తన శీరరమును రామ విరహమున త్యజించెను. అట్టి భూపాలునిగురించి ఏల శోకము? సీతా రామ లక్ష్మణులు పాదరక్షలులేక, పాదచారులై, మునివేషధారులై అడవి - అడవిని తిరుగుచున్నారు. వల్కలాజినములు ధరించినారు. ఫలములనే భక్షించుచున్నారు. కుశ, పత్రములను శయ్యగా నేలపై శయనించుచున్నారు. చెట్లనీడను నివసించుచున్నారు. ఎండ, వానలను, శీత, ఆతపములను అనుభవించుచున్నారు. ఈ దుఃఖాగ్నిచే సదా నా హృదయము మండిపోవుచున్నది. నాకు పగలు ఆకలిలేదు. రాత్రి నిదురలేదు. సకల విశ్వమును నా మనస్సున శోధించితిని. కాని ఈ దుష్టరోగమునకు ఎచ్చటనూ మందులేదు.

నా తల్లియొక్క దుర్బద్ధి ఒక పాపిష్ఠి వడ్రంగియై, నా హితమును గొడ్డలి చేసకొని, కలహమను పాడుకొయ్యనుండి విధ్వంసమను ఒక మాంత్రికయంత్రమును సిద్ధము చేసినది. పదునాలుగుసంవత్సరములు వనవాసమను దుష్టమంత్రమును జపించి దానిని అయోధ్యలో నాటినది. నాకొఱకై నా తల్లి ఈకుయంత్రమునుపన్ని లోకము నంతటిని సర్వనాశనము చేసివైచినది. హాని కావించినది. రాముడు తిరిగివచ్చినపుడే ఈ విపత్తి తొలగగలదు. అప్పుడే అయోధ్య నిలచును. ఇంక ఏ ఇతర విధమునను అది నిలవదు.''

భరతునియొక్క పలుకులను విని భరద్వాజముని ఆనందించెను. అనేకవిధముల అందరు భరతుని కొనియాడిరి.

''నాయానా, విశేషముగా దుఃఖింపకుము. రామపాదసందర్శనమువలన నీ దుఃఖములన్నియు దూరము కాగలవు'' అని మునివరుడనెను.

ఇట్లు మునివరుడు ప్రబోధముకావించి-- ''నా ప్రియ అతిథివి కమ్ము. మేము అర్పించు కందమూలములను, ఫలములను దయచేసి స్వీకరింపుము'' అని కోరెను.

మునియొక్క మాటలనువిని భరతుడు ''ఇది విందులకు తగు సమయము కాద''ని మనమున తలచెను. కఠినకాలమని ఎంచెను. కాని గురుని వచనములు పరమ ఆదరణీయములని యోచించి ఆతడు భరద్వాజుని పాదములకు నమస్కరించి, చేతులు జోడించి, ''స్వామీ, మీ ఆజ్ఞలను మా శిరములధరించి, వానిని పాలించుట మా పరమ ధర్మము'' అనెను. భరతుని పలుకులకు భరద్వాజునిమనస్సు ఆనందించెను.

పవిత్రులగు సేవకులను శిష్యులను దగ్గరకు రమ్మనిపిలచి మునివరుడు ''భరతునికి అతిథసత్కారము కావించవలెను. మీరువెడలి కందమూలఫలములను తీసికొనిరండు" అని చెప్పెను.

''స్వామీ, మంచిది'' అని వారు తలలువంచి నమస్కరించి, ప్రముదితులై తమ తమ పనులకు వెడలిరి.

''ఉత్తముడగు అతిథిని నేను ఆహ్వానించితిని. దేవతను పూజించునట్లు ఈతనిని నేను తగురీతిని పూజింపవలెను.'' అని ముని తలచెను. మునియొక్క తలపును విని బుద్ధి, అణిమాదిసిద్ధులు అరుదెంచి ''స్వామీ. తమ ఆజ్ఞలను నెరవేర్తుము'' అనిరి. ప్రసన్నుడై మునిరాజు :-

''రామవిరహమున భరతుడు అనుజబృంద సహితముగా వ్యాకులుడై ఉన్నాడు. వీరికి అతిథి సత్కారము కావించుడు వీరి శ్రమను తొలగింపుడు'' అని అనతి ఇచ్చెను. మునివరుని ఆనతిని సిద్ధి, బుద్ధి శిరములతాల్చి, అది తమ భాగ్యమని ఎంచిరి.

''రాముని అనుజుడు భరతుడు సాటిలేని మేటిఅతిథి. కనుక మనము ముని వరుని చరణములకు వందనముచేసి రాజ సమాజము అందరు సుఖులగునట్లు చేయవలెను'' అని పరస్పరము అనుకొనిరి, ఇట్లు సంభాషించివారు - విమానములైనను సిగ్గుపడునంతటి రమణీయమగు భవనములను పెక్కంటిని సృష్టించిరి. భోగ, ఐశ్వర్య పరికరములు ఎన్నియో వానిలో నింపిరి. వానిని చూచినచో దేవతలకై నను కన్నుకుట్టును. దాస, దాసీజనములు అతిథుల మనస్సులను గ్రహించి సామగ్రులనన్నిటిని చేపట్టి - కావలసినవన్నియు సమకూర్చుచుండిరి. స్వర్గముననైనను స్వప్నమునందైనను కానరాని వస్తువులు ఱప్పవాల్చు కాలమున సిద్ధియు, బుద్ధియు సమకూర్చుచుండిరి. ప్రథమున వారు ఎవరికి ఏరీతిని కావలయునో ఆ రీతిని సుందర, సుఖదములగు నివాసములను కల్పించిరి. తుదకు భరతునికి ఆతని పరివారమునకు వసతి కావింపబడినది. అది మునివరుని ఆనతి. తన తపోబలముచే మునివరుడు విధాతను సహితము విస్మయుని చేయునట్లు వైభవముగా సర్వము సమకూర్చెను. మునివరుని ప్రభావమును కనుగొని - దానిఎదుట లోకపాలురయొక్క లోకములన్నియు తుచ్ఛములని భరతుడు తలచెను. ఆ సుఖసామగ్రిని వర్ణింపలేము. జ్ఞానులైనను దానిని చూచి వైరాగ్యమును మఱతురు. ఆసనములు, శయ్యలు, మనోహరవస్త్రములు, చాందినీలు వనములు, వాటికలు, పలురకములగు పక్షులు, పశువులు, సుగందపుష్పములు, అమృత తుల్యములగు స్వాదిష్టఫలములు, నానావిధములగు నిర్మల జలాశయములు, అమృతో పమములగు పవిత్ర పదార్థములు-ఎన్నియో ! వానిని చూచి ఎల్లరు-వీరక్తులగు మునుల వలె సంకోచింతురు. అందరి వసతి గృహములయందు కామధేనువు. కల్పవృక్షముకలవు. వానిని చూచి ఇంద్రుడు, శుచి ఈర్ష్య చెందెను.

అది వసంతబుతువు, శీతల, మంద, సుగంధ వాయువులు వీచుచున్నవి. సర్వులకు చతుర్విధ పురుషార్థములు సులభ సాధ్యములగుచున్నవి. మాలా, చందన వనితాది భోగములను పరికించి ఎల్లరు హర్ష, విస్మయ వశులగుచుండిరి. సంపద అను చక్రవాకిని, భరతుడును చక్కవాకమును ఆ ఆశ్రమ పంజరమున ముని ఆనతి అను ఆటకాడు ఆ రాత్రి అంతయు బంధించి ఉంచెను. తెల్లవారెను.

పరివారసహితుడై భరతుడు తీర్థరాజమున స్నానము చేసెను. శిరమువంచి మునివరునికి నమస్కరించెను. బుషియొక్క దీవనను ఆనతిని పొందెను. భరద్వాజునికి సాష్టాంగ నమస్కారముచేసి అత్యంతమగు వినతి కావించెను.

మార్గమున తెలిసిన నిపుణలగు మార్గదర్శకులను వెంట పెట్టుకొని భరతుడు చిత్రకూటమున చిత్తమునుంచి బయలుదేరెను. రామసఖుడగు గుహునిచేతిలో తన చేతిని ఉంచి - సాక్షాతుగా ప్రేమయే శరీరమును ధరించి నడచుచున్నదో అనునట్లు భరతుడు నడచుచుండెను. అతనికి పాదరక్షలు లేవు. తలకు ఆచ్ఛాదనలేదు. భరతుని ప్రేమ, నియమము, వ్రతము, ధర్మము అమాయకములైనవి. సీతారామ లక్ష్మణులు నడచిన మార్గమును గురించి భరతుడు గుహుని దారిలో ప్రశ్నించుచున్నాడు. గుహుడు మృదువుగా సమాధానము చెప్పుచున్నాడు. రాముడు విశ్రమించిన స్థలములను, వృక్షములను చూచి భరతుని హృదయమున ఆపుకొనుదమనినను ప్రేమ ఆగుటలేదు. భరతుని స్థితిని కనుగొని దేవతలు పూలవానను కురిపింపసాగిరి. మహీతలము మృదులమయ్యెను. మార్గము మంగళమూలమయ్యెను. మేఘములు క్రమ్ముకొను చున్నవి. సుఖదములగు సుందరవాయువులు వీచుచున్నవి.

భరతుడు పయనించుచున్న మార్గము రాముడు పయనించిన దానికంటె సుఖదాయక మయ్యెను. మార్గమున అనేక చేతన, అచేతన జీవములున్నవి. వానిలో ప్రభుని వీక్షించినవి. ప్రభుడు కాంచినవి-అన్నియు పరమ పదప్రాప్తికి అర్హులయ్యెను. భరతుని సందర్శించి అవి అన్నియు భవరోగమునుండి విముక్తి పొందెను. స్వయముగా రాముడే తన మనమున స్మరించు భరతునికి ఇది గొప్పవిషయమా? ''లోకమున ఒక్కసారి 'రామ' అని ఉచ్చరించినవారు తాము తరించుటయేకాక ఇతరులను తరితంపచేతురు. ఇక రామునికి ప్రియుడు, అనుజుడు భరతుడు ! అట్టివానికి మార్గము మంగళదాయక మగుట ఏమంత గొప్ప విషయము?'' అని సిద్ధులు, సాధులు, మునివరులు నుడువుచున్నారు. భరతుని చూచివారు తమ హృదయములయందు ఆనందించుచున్నారు.

భరతుని ప్రభావమును సురేంద్రుడు కనుగొనెను. ఆతనికి అలజడి జనించెను. లోకము మంచివారికి మంచిది. చెడ్డవారికి చెడ్డదియును ! ఇంద్రుడు తన గురువగు బృహస్పతిని ''ప్రభూ, రామ, భరత సమాగమము జరుగకుండునట్లు ఉపాయము ఏదేని ఆలోచింపుము. రాముడు వినయసంపన్నుడు. ప్రేమవశుడు. భరతుడు ప్రేమసాగరుడు. మనపన్నాగము భగ్నమగునేమో అని భయమగుచున్నది. కనుక ఏదైన ఉపాయము వెదకుడు'' అని వేడెను.

ఇంద్రుని మాటలు విని సురగురుడు చిరునవ్వు నవ్వెను. వేయికన్నులవాడు కండ్లు లేనివాడని గ్రహించెను.

''సురరాజా, మాయానాథుడగు రాముని సేవకులపై మాయాకృత్యములు ప్రయోగించినచో అవి తిరిగివచ్చి మనకే తగులును సుమీ. ఆనాడు రాముని ఇంగితమును ఎఱిగి ఏదో కావింపబడినది. కాని, నేడు కపటము సలిపినచో మనకే హాని కలుగును. సురేశ్వరా, రఘునాథుని స్వభావమును వినుము. తనకు అపరాధము చేసిన వానిపై ఎన్నడూ ఆయన ఆగ్రహింపడు. కాని రామ భక్తులకు అపరాధము చేసినవాడు రాముని క్రోధాగ్నియందు మాడిపోవలసినదే. లోకమునకు, వేదములకు ఈ ఇతిహాసములు తెలిసినవే. ఈ మహిమ దూర్వాసునికి తెలియును.

సకలజగము రామనామమును జపించును. రాముడు సదా భరతుని స్మరించును! అట్టి భరతునికి ఈడగు రామభక్తుడ మరిఒకడు ఎవడున్నాడు ? అమరపతీ, రఘవరుని భక్తులకార్య విధ్వంసమునుగూర్చి ఎన్నడూ నీమనస్సున తలంపుకురానీయకుము. ఆ విధమున తలచితివో ఈ లోకమున నీకు అపయశము ప్రాప్తించును. పరలోకమున దుఃఖము సంభవించును. శోకనికాయము దినదినము వృద్ధిఅగును. నా ఉపదేశమును సురేశా, ఆలకింపుము. రామునికి ఆతని భక్తులు పరమప్రియులు. తన భక్తుల చేయుసేవచే రాముడు సంతసించును. రామభక్తులతో వైరమువలన రామునితో వైరము పెరుగును. అందరియెడలను ఆతడు సముడు. ఆతనికి అనురాగములేదు. ఆగ్రహమూలేదు. ఎవ్వరి పుణ్యపాపములను, గుణదోషములను ఆతడు ఎంచడు. కర్మకే ఆతడు విశ్వమున ప్రాధాన్యత ఒసగినాడు. చేసికొనిన వానికి చేసికొనినంతయే ఫలము. ఐనను భక్తులయొక్కయు, భక్తులుకాని వారియొక్కయు హృదయముల ననుసరించి ఆతడు వ్యవహరించెను.

గుణరహితుడు, సంబంధ రహితుడు, నిరహంకారుడు, నిశ్చలుడు అగు రాముడు భక్తుల ప్రేమకు వశుడై నందున సగుణమూర్తి అయ్యెను. భక్తుల కోర్కెలను ఆతడు మన్నించును. వేదములు, పురాణములు, సాధువులు, దేవతలు దీనికి సాక్షి, హృదయమున ఇట్లు గ్రహించి కుటిలత్వమును వీడుము. భరత చరణానురాగివి కమ్ము. ఇంద్రా, సురపాల, రామభక్తులు నిరంతరము పరహితమునే తలంతురు. పరుల దుఃఖమువలన వారునూ దుఃఖింతురు. దయాళులగుదురు. భరతుడు భక్తశిరోమణి. ఆతడనిన ఎంతమాత్రము భయపడకుము. రామప్రభువు సత్యసంధుడు. సురహితకరుడు, భరతుడు రాముని ఆజ్ఞానుసారి. స్వార్థవశుడవై నీవు వ్యర్థముగా కలతచెందుచున్నావు. దీనియందు భరతుని దోషమేమియులేదు. సర్వము నీ మోహమే.'' అని బృహస్పతి వచించెను.

సురగురుడగు గురుని వరవాణిని విని సురపతియొక్క మనస్సున మహా ఆనందము కలిగెను. ఇంద్రునియొక్క చింత నశించెను. సంతోషమున సురరాజు సుమన వృష్టిని కురింపిచెను. అతడు భరతుని స్వభావమును కొనియాడసాగెను.

ఇట్లు భరతుడు మార్గమున నడచిపోవు చున్నాడు. ఆతని స్థితిని కనుగొని మునులు, సిద్ధులు సహితము అతనిని పొగడుచున్నారు.

'రామా' అని భరతుడు దీర్ఘవిశ్వాసమును పీల్చును. అంతట నలు దెసలను ప్రేమ ఉప్పొంగుచున్నదో అనునట్లుండును. ఆతని వచనములను విని వజ్రములు, పాషాణములు కూడా కరగిపోవును. అయోధ్యాపుర జనుల ప్రేమను వర్ణింప జాలము.

మధ్య ఒకచోట ఆగి భరతుడు యమునానదీతీరమును చేరెను. యమునా సలిలములను కనుగొని ఆతని నయనములు నీరు క్రమ్మెను. రఘువరుని శ్యామలవర్ణముతో రంజిల్లుచున్న యమునా జలమును వీక్షించి భరతుడు. ఆతని బృందమును రామవిరహసాగరమున మునిగిరి. కొంత తడవునకు వారు వివేకమను నావపై ఎక్కిరి. ఆనాడు వారు యమునాతీరమున వసియించిరి. కాలోచితమగు చక్కని ఏర్పాట్లు కావింపబడినవి.

ఆ రాత్రికి రాత్రియే అన్ని రేవులనుండియు అసంఖ్యాకములగు నావలు అక్కడ వచ్చి చేరినవి. వానిని వర్ణింప శక్యముకాదు. ఉదయముకాగానే అందరు ఒకేసారి యమునను దాటిరి. రామసఖుడగు గుహుడు చేసిన సేవకు సంతసించిరి. స్నానముచేసి, శిరమువలువంచి నదికి నమస్కరించి నిషాదపతితో కలసి ఇరువురు అన్నదమ్ములు ముందుకుసాగిరి. అందరికిముందు సుందర వాహనములయందు మునివరులు, వారివెనుక రాజపరివారము వారెల్లరు వెడలుచున్నారు. సామాన్య ఆభరణ వస్త్ర, వేషధారులగు అన్నదమ్ములు ఇరువురు వారివెనుక నడచుచున్నారు. వారివెంట సేవకులు, మిత్రులు, సచివపుత్రులు సీతారామలక్ష్మణులను స్మరించుచు నడచుచున్నారు. రాముడు విడిదిచేసిన స్థలములకు, విశ్రమించిన ప్రదేశములకు ప్రేమయుతులై వారు ప్రణామము చేయుచున్నారు.

మార్గమున నివసించు స్త్రీలు, పురుషులు వారి రాకను గురించి విని తమ ఇండ్లను, పనులను వదలి పరుగిడి, భరతశత్రఘ్నుల స్వరూప లావణ్యములను ప్రేమతో వీక్షించుచున్నారు. జన్మ ఎత్తినందులకు ఫలమునుపొంది సంతసించుచున్నారు.

గ్రామ స్త్రీలు ఒకరితో ఒకరు ప్రేమ పూర్వకముగా సంభాషించుచున్నారు :-

''సఖీ, వీరు రామలక్ష్మణులేనా? కారా? వీరి ఆకారములు, వయస్సులు, శరీరవర్ణములు, రూపులు అన్నియు ఒక్కటేనే ! వానికి తగినట్లే ఉన్నవి వీరి శీలము, చెలిమియు. వీరిరువురి తీరులుకూడా వారివంటివేనే! అని ఒకతె అనెను !

మరి ఒక ఆమె అన్నది :- ''కాని, సఖియా, వీరి వేషములు వేఱు విధముగా ఉన్నవే ! వీరివెంట సీత లేదు కదే ! వీరిముందు చతురంగబలము లున్నవే ! వీరి ముఖములు ప్రసన్నముగా లేవు. వీరి మానసములలో విచారమున్నది. సఖీ, ఈ భేదమువలన సందేహము కలుగుచున్నది.''

ఆమెయొక్క తర్కము ఇతర స్త్రీ సమాజమునకు నచ్చెను. ''దీనిని పోలిన నేర్పరి మరియొకతె లేదు'' అని వారు వక్కాణించిరి. ఆమెను మెచ్చుకొని ''నీ మాటలు నిజమేనే'' అని సన్మానించి ఇంకొక మగువ మధుర వచనములను నుడివెను. రామరాజ్యభిషేకము గూర్చిన ఆనందము ఎట్లు భగ్నమయ్యెనో ఆ కథాప్రసంగమును ప్రేమపూర్వకముగా వివరించి ఆమె భరతుని శీలమును, చెలిమిని, స్వభావమును ప్రశంసింప మొదలిడెను.

ఆమె అనినది :- తండ్రి ఇచ్చిన రాజ్యమును త్యజించినాడు. పాదచారియై పయనించుచున్నాడు. పండ్లనే తినుచు రఘువరుని ప్రార్థించుటకు చనుచున్నాడు. ఇట్టి భరతునివంటివాడు ఎవ్వడున్నాడే ఈ నాడు? భరతుని భ్రాతృప్రేమ, భక్తి, నడవడికలను గురించి వినినను, నుడివినను దుఃఖము, దోషము హరించునే ! చెలీ, వీనిని గూర్చి ఎంత వివరించినను అల్పమే. రాముని తమ్ముడు మరి ఆ రీతినే ఉండడా ! భరతుని ఆతని అనుజుని చూచి మనమెల్లరము ధన్యస్త్రీలలో పరిగణింప బడితిమి.'' అని.

ఇట్లు భరతునియొక్క గుణగణములను గురించి విని, ఆతని స్థితినికని వనితలు వగచుచున్నారు. 'కైకేయివంటి తల్లికి తగిన పుత్రుడు కాడే ఈతడు !'' అని మరికొందరు అనుచున్నారు :-

''దీనిలో రాణియొక్క దోషములేదు. ఇది అంతయు మనకు అనుకూలుడగు ఆ విధాత చేసినపనియే. లోకము, వేదములు రెండింటిచే బహిష్కరింప బడినవారము మనము. కులముచే, పనులచే మలినమైన తుచ్ఛస్త్రీలము. ఈ అడవులలో, కుగ్రామములలో నివసించుచున్నాము. నీచస్త్రీలము. మహాపుణ్య పరిణామ రూపుడగు ఈతని దర్శనమెక్కడ? మనమెక్కడ ? అనిరి కొందరు. ఆనందమున ఆశ్చర్యమున ఇట్లు ప్రతిగ్రామము ఎడారిలో కల్పతరువు మొలచినదో అనునట్లున్నది. సింహళ##దేశ నివాసులకు విధివశమున ప్రయాగ సులభసాధ్యమైనట్లు భరతుని దర్శించినంతనే మార్గమున నివసించువారి భాగ్యము పండెను.

తన గుణగణములతోసహా రాముని గుణగణ గాథలను వినుచు, రఘునాథుని స్మరించుకొనుచు భరతుడు నడచిపోవుచున్నాడు. ఆతడు ఒక తీర్థమును వీక్షించును. దానియందు స్నానముచేయును. ఒక మునియొక్క ఆశ్రమమును కనుగొనను. దానికి వందనము కావించును. ఒక దేవతామందిరమును అవలోకించును. దానికి ప్రణమిల్లును. సీతారాముల పాదపద్మములయందు భక్తిని ప్రసాదించుమని మనమున వరమును కోరుకొనును. దారిలో భిల్లులు, కోలులు మొదలగు వనవాసులు, వానప్రస్థులు వారిని కలసికొనుచున్నారు. వారికి ప్రణామముచేసి భరతుడు వారిని ''సీతారామలక్ష్మణులు ఏ అడవియందు ఉన్నారు?'' అని ప్రశ్నించును. ప్రభుని గురించిన వార్తలనన్నిటిని వారు వివరింతురు. భరతుని చూచి వారు తమ జన్మ సాఫల్యమును కాంతురు.

''మేము రామలక్ష్మణులను చూచితిమి. వారు కుశలముగా ఉన్నారు'' అని తెలుపువారిని భరతుడు రామలక్ష్మణులను చూచినట్లు చూచును. ఇట్లు అందరిని మృదువగు పలుకులతో ప్రశ్నించును, రామ వనవాసచరితను వినుచు భరతుడు పయనించెను. ఆ దినమున అతడు బసచేసి మరునాటి ప్రాతఃకాలమున రఘువరుని స్మరించి పయనము సాగించెను. వెంట ఉన్నవారికి అందరికిని భరతునికివలె రాముని దర్శింపవలెనను ఆకాంక్షయే. ఎల్లరకు శుభశకునములు కనుపించెను. సుఖప్రదసూచకముగా అందరి కన్నులు, భుజములు అదరెను. ''రాముని దర్శింతుము. మన దుఃఖాగ్ని దూరమగును'' అని భరతుడు, అతని బృందము ఉత్సాహపడుచున్నారు. తమ తమ హృదయాభిలాషల ననుసరించి ఎల్లరు మనోరథములను సృష్టించుకొను చున్నారు. ప్రేమమత్తులై ఎల్లరు నడచుచున్నారు. వారి అవయవములు సడలినవి. వారికాళ్లు వెనుకముందు లాడుచున్నవి. అందరు ప్రేమవశులై వ్యాకుల వచనములను పలుకుచున్నారు.

ఇంతలో రామసఖుడు గుహుడు సహజ సుందరమగు ఒక శైలశిరోమణిని చూపించెను. దాని సమీపముననే పయస్వినీ నదీతటమున సీతాసమేతులై ఇరువురు సోదరులు రామలక్ష్మణులు నివసించుచున్నారు. ఆ పర్వతమును చూచి అందరు దానికి షాష్టాంగ ప్రణామము చేసిరి. ''జయము జానకీ జీవనా, రామా'' అని వారు అరచిరి. రఘునాథుడు అయోధ్యకు తిరిగి వచ్చినాడా అనునంతగా రాజసమాజము ప్రేమమగ్నులైరి. ఆ సమయమున భరతునికి జనించిన ప్రేమను ఆదిశేషుడైనను వర్ణింపజాలడు. అహంకార మమకారములచే మలినమైన మానవులకు బ్రహ్మానందము ఎట్లు అగమ్యమో అట్లే కవికి ఈ వర్ణన ఆగమ్యము. అందరు రఘువరునియందలి ప్రేమచే అలసి ఉన్నందున సూర్యాస్తమయ మగుసరికి రెండు క్రోసులదూరము మాత్రమే నడచిరి. జలవసతిని, స్థల సౌకర్యమును కనుగొని ఆ రాత్రి ఒకచోట వసించిరి. తెల్లవారినపిదప రామప్రియుడు భరతుడు పయనము సాగించెను.

ఇక అక్కడ-రాముడు రాత్రి గడవకపూర్వమే నిద్రనుండి మేల్కొనెను. ఆ రాత్రి సీతకు ఒక కల వచ్చినది. ఆ కలలో సమాజసహితుడై భరతుడు అక్కడకు వచ్చును. రామవియోగతాపముచే అతని తనువు తపించిపోవుచుండును. అందరు తమ మనస్సులయందు ఉదాసీనభావములతో, దీనులై దుఃఖితులై ఉందురు. అత్తల రూపులే మారిపోయి ఉండును !

సీత కనిన కలను విని రాముని నయనములు జలభరితము లయ్యెను. సకల శోక విమోచకుడు తానే శోకవశుడైనాడు !

''లక్ష్మణా. ఈ స్వప్నము శుభకరముకాదు. ఏదో భీకర దుర్వార్తను ఎవరో వినిపింపనున్నారు !'' అని రాముడు వచించి తమ్మునితోసహా స్నానము చేసెను. త్రిపురారిని ఆతడు సేవించెను. సాధువులను సన్మానించెను. దేవతలను పూజించెను. మునులకు నమస్కరించెను. ఉత్తరదిశను చూచుచు కూర్చుండెను. ఆకసమున ధూళిఎగసెను. పలుపక్షులు, పశువులు కలత చెంది పరిగిడి ప్రభుని ఆశ్రమమునకు వచ్చినవి. రామస్వామి వీనిని కనుగొని లేచెను. కారణమేమా అని యోచించెను. అతని మనససున ఆశ్చర్యము కలిగెను. అదే సమయమున కిరాతులు, కోలులు వచ్చి విషయము అంతయు వివరించిరి. సుమంగళకరమగు ఆవార్తను వినినంతనే రాముని మానసమున మిక్కిలి ఆనందము కలిగెను. అతని శరీరమంతయు పులకించెను. శరత్కమలములవంటి అతని నేత్రములు ప్రేమాశ్రువులతో నిండెను.

భరతుని రాకకు కారణమేమై ఉండునా అవి సీతారమణుడు చింతావశుడయ్యెను. ఇంతలో ఒకడువచ్చి ''వారివెంట గొప్ప చతురంగ బలములు కూడా ఉన్నవని'' తెలిపెను. ఈ వార్తను విని రాముడు మరింత విచారించెను. ఒక వంక తండ్రియొక్క ఆజ్ఞ. ఇంకొక వంక తమ్మునియందు గౌరవము. భరతుని స్వభావము అతనికి తెలియును. కనుక అతని మనస్సున స్థిమితము లేదు. ''భరతుడు బుద్ధిమంతుడు. ధర్మసంపన్నుడు'' తనమాట జవదాటడు. అని రామునికి తెలియును. కనుక ఆతని యొక్క మనస్సు సమాధానపడెను. ప్రభుని హృదయము చింతాగ్రస్తమై ఉన్నట్లు లక్ష్మణుడు కనుగొనెను. సమయోచితముగా అతడు ఇట్లు పలికెను :-

''స్వామీ, నీవు అడుగకయే నేను ఏదో వచించుచున్నాను. సమయమును గ్రహించి సేవకుడు సాహసించినచో దానిని దిట్టతనమని అనరు. ప్రభూ, నీవు సర్వజ్ఞ శిరోమణివి. నేను నీ సేవకుడను. ఐనను నాకు తోచిన దానిని నుడువుచున్నాను. నాథా, నీవు సుహృదయుడవు. సరళ హృదయుడవు. శీలమునకు చెలిమికి భండారమవు. అందరియందును ప్రేమయే నీకు; విశ్వాసమే నీకు, ఎల్లరను నీకు సములుగానే నీ హృదయమున భావింతువు. మూఢులగు లౌకిక జనులు ఐశ్వర్యము ప్రాప్తించిన పిదప మోహవశులగుదురు. తమ నిజస్వరూపమును ప్రకటింతురు. భరతుడు నీతిరతుడు. సాధుపురుషుడు. చతురుడు. నీ చరణభక్తుడు ఈ విషయము సకల జగము ఎఱుగును. ఆ భరతుడు నేడు రాజ్యపదవిని పొందినాడు. ధర్మమును, మర్యాదను, త్రోసి రాజని ఏతెంచినాడు. కుటిలుడు, దుర్మార్గుడు అగు భరతుడు ఈ విపరీత అవకాశమును పొంచిచూచినాడు. రాముడు ఏకాకియై అడవిలో ఉన్నాడని తెలిసికొనినాడు. తన మనస్సున దురాలోచన చేసినాడు. సమాజమును సిద్ధము చేసికొని రాజ్యమును నిష్కంటకముగా చేసికొనుటకు ఇక్కడకు వచ్చినాడు. కోటి విధముల కౌటిల్యమును సృజించి, సేనను సమకూర్చుకొని సోదరులిద్దరు వచ్చినారు. వీరి హృదయముల యందు కపటము, దురాలోచనలేనిచో ఈ రథములు, అశ్వములు బారులు తీర్చి వచ్చుట యందు ఏ సొగసు కలదు? ఇంతకూ భరతుని మాత్రమే ఎవరు నిందింతురు? రాజ్యపదవి ప్రాప్తించినచో జగమంతయు మదమెక్కిపోవును కదా ! చంద్రుడు గురుపత్నీగమనము చేసెను. సహషుడు భూసురులతో తన పల్లకీని మోయించెను. వేన రాజువంటి నీచుడు లేనేలేడు. లోకమునకు, వేదములకు, రెంటికి విముఖడయ్యెను కదా అతడు ! సహస్రబాహుడు, సురేంద్రుడు, త్రిశంకుడు, మొదలగువారు ఇట్టివారే. రాజ్యమదము కళంకితులను కావింపనిదెవ్వరిని ? తగిన తంత్రమునే భరతుడు పన్నినాడు. ఋణశేషము శత్రుశేషము ఎంతమాత్రము ఎన్నడూ ఉంచరాదు. కాని ఒక్కమంచిపని మాత్రము భరతుడు చేయలేదు. రాముడు ఆసహాయుడని అతడు అనుకొన్నాడు. నిరాదరించినాడు. నేడు రణమున రామునియొక్క రోషభరితవదనమును కనుగొని ఇదియు అతనికి బాగుగా తెలిసివచ్చును.''

ఇట్లు నుడువుచు లక్ష్మణుడు రాజనీతిని మఱచెను. యుద్ధరసమను వృక్షము పులకావళి అను నెపమున పుష్పించినది.

లక్ష్మణుడు ప్రభుని చరణములకు ప్రణమిల్లెను. ఆ పాదరజమును తనశిరమున ధరించెను. సత్య, స్వభావిక వచనములను ఉద్రేకమున ఇట్లు వచించెను :-

''నాథా, నామాటలు అనుచితమైనవని భావింపకుము. భరతుడు నన్ను రెచ్చకొట్టినది ఇంతింతకాదు. ఎంతవరకు సహింపగలను నేను ? నాకు అండప్రభువు ఉన్నాడు. నాచేత ధనువుకలదు. క్షత్రియజాతియందు, రఘుకులమున జన్మించితిని. రామసేవకుడను. ఇది అంతయు లోకవిదితము. ధూళివలె నీచమగునది ఉన్నదా ? ఆ ధూళియు తన్నినచో ఎగిరి తలపైకి ఎక్కును కదా'' !

ఇట్లు నుడివి లక్ష్మణుడు చేతులు జోడించెను. లేచెను. అనుమతి ఇమ్మని కోరెను. వీరరసమునిద్రనుండి మేలుకొనినట్లున్నది. లక్ష్మణుడు శిరమున జటను బంధించెను. నడుమున అంబులపొదిని బిగించెను. శరాసనము గ్రహించెను.

''రామసేవకుడనను యశమును నేడు ఆర్జింతును. భరతునికి రణమున బుద్ధిని బోధింతును. రాముని నిరాదరించిన ఫలమును పొంది భరత శత్రఘ్నులు సమరశయ్యపై శయనింతురుగాక. సర్వసైన్యము వచ్చినది. మంచిదే. వెనుకటి క్రోధము అంతటిని నేను నేడు ప్రకటింతును. గజ సమూహమును సింహము చెండాడునట్లు చిన్నపిట్టను డేగ గోళ్లతో పట్టుకొని ఎత్తుకొని పోవునట్లు నేను చేతును. భరత, శత్రఘ్నులను వారిసేనను ఓడింతును. శంకరుడేవచ్చి వారికి సాయము చేసినను సరే సమరమున వారిని సంహరింతును. రామునిపై ఆన!'' అని వచించెను.

లక్ష్మణుడు క్రోధముతో మండిపోవుచున్నట్లు కనుగొని ఆతని ప్రతినను విని అందరు భీతిల్లిరి. కలతచెంది లోకపాలురు పారిపోవలెనని అనుకొనిరి. జగము సర్వము భయమున మునిగినది. అంతట ఆకాశవాణి లక్ష్మణుని యొక్క అపారబాహుబలమును ప్రశంసించుచు ఇట్లు పలికెను :-

''నాయనా, నీ ప్రతాపమును, ప్రభావమును వర్ణింప ఎవరి వశము? తెలియ ఎవరి తరము? ఏ కార్యమునైనను అది సమంజసమైనదో, అసమంజసమైనదో బాగుగా తెలిసికొని, ఆలోచించి ఆచరింపవలెను. ఆరీతిని అందరు మెత్తురు. ఏపనినైనను తొందరపడి చేసిన అనంతరము పశ్చాత్తాపము పొందువారు బుధులుకారని శ్రుతులు నుడువును. బుద్ధిమంతులు వచింతురు.''

సురవాణిని విని లక్ష్మణుడు సిగ్గుపడెను. సీతారాముల అతనిని సాదరముగా శాంతపరచిరి. తండ్రీ, నీవు చక్కని నీతులు పలికితివి. రాజ్యాధికార మదము అన్నిటికంటె కఠోరమైనది. సాధుసమాజమును సేవించి ఉండనివారు రాజ్యమదము అనబడు మత్తుపానీయమును సేవించి మత్తెక్కుదురు. వినుము లక్ష్మణా, భరతునివంటి సత్పురుషుని గురించి బ్రహ్మయొక్క సృష్టిలో ఇంతవరకు ఎక్కడా నేను వినిఉండలేదు. కనిఉండలేదు. బ్రహ్మ, శివపదవులను పొందినను భరతునికి రాజ్యమదము ఉండదు.

గంజి చుక్కలచే పాలసముద్రము చెడిపోవునా ? మిట్టమధ్యాహ్నము సూర్యుడు చీకటిలో మునిగిపోవుగాక. ఆకాశము మేఘములలో లీనమైపోవుగాక. గోవు అడుగిడగా పడుగుంటలోని నీటిలో అగస్త్యుడు మునిగిపోవుగాక. భూమి తన సహజక్షమను వీడుగాక. దోమయొక్క ఊపిరిగాలిచే మేరుగిరి ఎగిరిపోవుగాక. భరతునికి రాజ్యగర్వము కలుగనేరదు. లక్ష్మణా, నీ పైనను, మన తండ్రిపైనను ప్రమాణము చేసి వచింతును. భరతునివంటి పవిత్రుడు లేడు లోకమున అతనిని పోలు ఉత్తమ సోదరుడు జగమున లేడు. నాయనా, సద్గుణము లనబడు పాలను ఆ గుణములు లేని నీటిని కలిపి విధాత ఈ ప్రపంచమును సృష్టించును. సూర్యవంశమను తటాకమున హంసరూపమున భరతుడు జన్మించినాడు. గుణదోషములను వేరు పరచినాడు. గుణములనబడు క్షీరమును గ్రహించి, అవగుణములనబడు నీరమును త్యజించి అతడు తన కీర్తిని జగమున ప్రకాశింపచేసినాడు'' అని రఘువరుడు వచించెను.

భరతుని సుగుణములను, శీలమును, స్వభావమును వర్ణించుచు రఘుపతి ప్రేమ పయోధియందు నిమగ్నుడయ్యెను. రఘువరుని పలుకులను విని, అతనికి భరతునియందుకల ప్రేమను కనుగొని సురలెల్లరు 'రామునివంటి కృపానిలయుడు మరి ఒకడు ఎవడున్నాడు? '' అని కొనియాడిరి. ''జగమున భరతుడే జన్మించి ఉండనిచో ధరణిపై ధర్మభారమును వహింపకలిగినవాడు ఇంకొకరు ఎవడున్నాడు!'' అనిరి.

''రఘునాథా, కవికులమునకు ఆగమమగు భరతుని గుణనాథ నీకు తక్కవేఱవ్వరికి తెలియును ?'' అని నుడివిరి.

సీతారామలక్ష్మణులు దేవతావాణిని విని అత్యంత ఆనందమును పొందిరి. ఆ ఆనందము వర్ణనాతీతము.

ఇక్కడ పరివారసహితుడై భరతుడు పవిత్రమందాకినీ తోయములందు స్నానము చేసెను. అందరిని నదీసమీపమున విశ్రమింపచేసెను. తల్లుల, గురువుల, మంత్రుల ఆనతిని కొని. నిషాదరాజును, తమ్మునివెంట గైకొని ఆతడు రఘునాథుడు ఉన్నచోటికి వెడలెను. తన తల్లి కావించిన కృత్యమును జ్ఞప్తికి తెచ్చుకొని భరతుడు సిగ్గుపడెను. అతడు తన మనమున కోట్లకొలది కుతర్కములను చేసికొనెను :-

''సీతారామలక్ష్మణులు నా పేరు విని ఆ చోటు వదలి, లేచి, ఇంకొకచోటికి వెడలరుకదా ! నా తల్లివంటి వాడనే నేనని తలచి ఆతడు నన్ను ఏమి చేసినను అది అల్పమే అగును. నా పాపములను, అవగుణములను అన్నిటిని క్షమించి ఆతడు నన్ను ఆదరింపనిమ్ము. నా మనసు మలినమైనదని తెలిసి నన్ను త్యజింపనిమ్ము, తన సేవకుడనని ఎంచి నన్ను సన్మానింపనిమ్ము. ఏ మైనను సరే నాకు రామపాదుకలే శరణ్యము. రాముడు ఉత్తమప్రభువు. దోషములన్నియు ఆతని దాసునివే. చాతక పక్షియు చేపయు నిత్యనూతన ప్రేమకు, చెలిమికి జగమున కీర్తి కాంచినవి.'' అని ఇట్లు మనమున చింతించుచు భరతుడు మార్గమున చనుచుండెను. ప్రేమ. సంకోచములచే అతని సర్వాంగములు సడలినవి. తన తల్లి కావించిన కీడు అతనిని వెనుకకు మరల్చును ! ధైర్యము వహించి భక్తి బలముచే అతడు ముందుకు నడచును ! రఘునాథుని స్వభావము స్మరణకు వచ్చినపుడు అతని చరణములు వడి వడిగా కదలును ! ఆ సమయమున భరతుని స్థితి ఎట్లున్నది? జలప్రవాహమున నీటితుమ్మెద స్థితివలె ఉన్నది ! భరతుని విచారమును, ప్రేమను చూచి నిషాదుడు తన శరీరమునే మరచెను.

శుభశకునములు గోచరించినని. వానిని చూచి, వానిని గురించి విచారించి ''విచారము తొలగును. ఆనందము కలుగును. కాని పరిణామము మాత్రము విషాదమే'' అని నిషాదుడు నుడివెను. గుహుని వచనములన్నియు సత్యములే అని భరతుడు గ్రహించెను. అతడు ఆశ్రమమును సమీపించెను. అచ్చటి వనములను, శైల సమూహములను ఆతడు తిలకించెను. ఆకలి కొన్నవారికి మృష్ఠాన్నము లభించినట్లు ఆతడు ఆనందించెను.

ఈతిబాధలతో దుఃఖితులై, త్రివిధ తాపములచే, క్రూర గ్రహస్థితిచే, మహామారిచే పీడితులైన ప్రజలు ఒక ఉత్తమదేశమునకు, శ్రేయోరాజ్యమునకు వెడలి సుఖింతురు. అట్లే ఉన్నది భరతుని భావము. ఉత్తమపాలకుని కలిగిన ప్రజలవలె. రాముని వనవాసముచే ఆవన సంపద వర్ధిల్లుచున్నది. ఆవన రాజ్యమునకు జ్ఞానము రాజు. వైరాగ్యము మంత్రి. పవిత్రము సుందరము అగు కాననము పాపనదేశము. యమ, నియమముల ఆదేశపుభటులు. దాని రాజధాని ఒక పర్వతము, శాంతి, సన్మతులు శుచులు, సుందరులు అగు ఆదేశపురాణులు. శ్రేష్ఠుడగు ఆ రాజు సకలాంగ సంపన్నుడు. రామచరణములను ఆశ్రయించి ఉన్నందున ఆ ప్రభుని చిత్తము ఉత్సాహవంతమై ఉన్నది. మోహమను రాజును, అతని సైన్యమును జయించి వివేకభూపాలుడు నిష్కంటకముగా రాజ్యమేలుచున్నాడు. ఆ నగరమున సుఖసంపదలు పొంగి పొరలుచున్నవి. కాలము కలసివచ్చుచున్నది. ఎందరో మునుల నివాసస్థానమగు ఆ వనప్రదేశము పట్టణముల, నగరముల, గ్రామముల, పల్లెల సమూహమువలె ఉన్నది. నానా విధములగు విచిత్రఖగములు, అనేక మృగములు ఆ వనమునందలి ప్రజాసమూహములు ! వానిని వర్ణింప శక్యముకాదు.

ఖడ్గమృగములు, ఏనుగులు, సింహములు, పెద్దపులులు. సూకరములు, దున్నపోతులు, ఎడ్లు మొదలగునవి ఆకర్షణీయములై చూడ ముచ్చటగా ఉన్నవి. ఆ జంతువులన్నియు తమ వైరమును వీడి, కలసి మెలసి విచ్చలవిడిగా చరించుచున్నవి. ఇవి చతురంగసేనలా అనిపించును. సెలయేళ్లు ప్రవహించుచున్నవి. మత్తగజముల ఘీంకారము నానావిధములగు నగారాలు మ్రోగుచున్నవో అనునట్లున్నది. చక్రవాక, చకోర, చాతక, చిలుక, కోయిల సమూహములు, మంజుల మరాళములు ముదిత మానసములతో మధుర స్వనములు సలుపుచున్నవి. తుమ్మెద గుంపులు జుమ్మని గానము చేయుచున్నవి. మయూరములు నాట్యమాడుచున్నవి. రమ్యమగు ఆ రాజ్యము నలువైపుల మంగళమయమే. లతలు, తరులు, తృణములు అన్నియు ఫల, పుష్పభరితములై ఉన్నవి. ముద, మంగళములకు ఆ సమాజము మూలమై విలసిల్లుచున్నది.

రాముడు నివసించుచున్న శైలశోభను తిలకించి భరతుని హృదయమున అత్యంత ప్రేమ జనించెను. తపోనియమము పరిసమాప్తమైన పిదప తపముయొక్క ఫలమును ఆర్జించి సుఖిఅగు వానివలె ఉన్నాడు భరతుడు.

అంతట గుహుడు పరుగెత్తుకొని వెడలి ఒక ఉన్నత స్థలమును ఎక్కి,చేతులెత్తి, భరతునితో

''ప్రభూ, అవిగో, ఆజువ్వి, నేరేడు, మామిడి, ఉలిమిరిచెట్లు, పెద్దవి, కనుపించుచున్నవే. ఆ సుందర వృక్షములమధ్య. రమ్యమగు ఒక విశాల వటవృక్షము శోభిల్లుచున్నది. దానిని చూచినంతనే మానసములు మోహితమగును. నీలము, దట్టము అగు ఆకులున్నవి. దానికి. ఎఱ్ఱనిపండ్లు దానికి వ్రేలాడుచున్నవి. సాంద్రమగుదాని ఛాయ సర్వఋతువులయందును హాయినిచ్చును. ఉత్కృష్టమగు శోభను అంతయు ఒక్కచోట సమకూర్చి అంధకారమును, అరుణకాంతిని సృజించినట్లున్నది. స్వామీ, ఆవృక్షము ఒక నదికిసమీపమున ఉన్నది. రఘువరుని పర్ణకుటీరము ఆ చెట్టు క్రిందనే. దానిఎదుట అతి సుందరమగు తులసిచెట్లు ఒకచోట సీత నాటినవి. ఇంకొకచోట లక్ష్మణుడు నాటినవి కానుపించును. ఈ వటవృక్షఛాయనే సీత తన మంజుల కరకమలములతో కమనీయమగు ఒక వేదికను నిర్మించినది. ఆచోటనే సీతారాములు కూర్చుండి నిత్యము సకల శాస్త్ర, వేద, పురాణములయందలి కథలను, ఇతిహాసములను మునిగణసహితులై విందురు'' అని చెప్పెను.

సఖుని వచనములను విని, వృక్షములను తిలకించి భరతుని కన్నులనుండి నీరు పొంగి పొరలెను. భరత, శత్రుఘ్నులు, సోదరులిరువురు ప్రణామము చేయుచు నడచిరి. వారి ప్రేమను వర్ణించుటకు శారదయు సంకోచించును. రామపాద చిహ్నములను కనుగొని, పరమదరిద్రునికి పరశువేది లభించినట్లు సోదరులిద్దరు ఆనందించిరి. అచ్చటి ధూళిని వారు తమ తలలపై తాల్చిరి; హృదయమునకు అలముకొనిరి; కన్నులకు అద్దుకొనిరి. వారు రఘువరుని కలసికొనినంత సంతసముపొందిరి. భరతుని యొక్క అత్యంత అనిర్వచనీయ స్థితినిచూచి అచ్చటి మృగములు, ఖగములు, జడజీవములు ప్రేమ మగ్నములయ్యెను. మిక్కుటమగు ప్రేమలో నిమగ్నుడగుటచే సఖుడగు గుహుడు సహితము దారిని మఱచెను. చక్కనిదారినిచూపి దేవతలు పూలవానను కురిపించిరి. భరతునియొక్క ప్రేమను, స్థితిని కని సిద్ధులు, సాధకులు కూడా ప్రేమ సంభరితులైరి. అతని సహజప్రేమను వారు ప్రశంసించిరి.'' ఈ భూతలమునభరతుడు జన్మించి ఉండనిచో జడమును చేతనముగాను, చేతనమును జడముగాను ఎవరు చేయగలరు?'' అనిరి.

సాధుజన రూపమున ఉన్న సురల కొరకై కృపాసింధుడగు రఘువీరుడు, భరతుడను గంభీర పయోధిని మథించి, ప్రేమామృతమును వెలువరచినాడు. ఈ మథనమున విరహమే మందరాచలమయ్యెను.

దట్టమగు అడవి అడ్డువచ్చినందున మనోహరులగు జంటను, భరత శత్రుఘ్నులను, లక్ష్మణుడు కనుగొనలేదు. సకల సన్మంగళమయము, రమణీయము, పావనముఅగు రాముని ఆశ్రమమును భరతుడు కనుగొనెను. దానిని ప్రవేశించగనే ఆతని దుఃఖము, తాపము హరించెను. పరమార్థము సంప్రాప్తించిన పిదప యోగి ఉన్నట్లున్నాడు భరతుడు.

ప్రభునికి ఎదుట నిలచి లక్ష్మణుడు ఆతని ప్రశ్నలకు అనురాగపూర్వకముగా ప్రత్యుత్తరము లిచ్చుచున్నాడు. లక్ష్మణుని శిరమునజట, నడుమున ముని వల్కలములు. తూణీరము. కరమున బాణము. భుజమున ధనువు. వేదికపై ముని, సాధు సమాజములు ఆసీనులై ఉన్నారు. సీతా సహితుడై రఘునాథుడు వారిమధ్య రాజిల్లుచున్నాడు. వల్కలములను, జటను ధరించిన శ్యామశరీరుడు, రతిపతియే మునివేషము తాల్చినట్లున్నాడు. తన కరకమలములలో ధనుర్బాణములను త్రిప్పుచున్నాడు. ఆతని మందహాసయుత వీక్షణము ఒక్కటి చాలు అందరి హృదయతాపము హరించిపోవును.

మంజులమగు మునిమండలి నడుమ సీతయు, రఘుచంద్రుడు జ్ఞానసభయందు భక్తియు, సచ్చిదానందము తనువులధరించి విరాజిల్లునట్లు రంజిల్లుచున్నారు. భరత శత్రఘ్నులు, నిషాదుడు ప్రేమమగ్నులైరి. హర్షశోకములను, సుఖ దుఃఖములను వారు విస్మరించిరి.

''పాహి, నాథా, పాహి, స్వామీ'' అనుచు భరతుడు నేలపై కట్టెవలె పడెను. అతని మాటను బట్టి లక్ష్మణుడు భరతుని గుర్తించెను. భరతుడు ప్రణామము చేయుచున్నట్లు లక్ష్మణుడు తెలిసికొనెను. ఒకవంక సోదరుడగు భరతునియొక్క అమితప్రేమ, మరి ఒకవంక ప్రభుని సేవలో మహాపరవశము. రామసేవను విడిచి అతడు భరతుని అభినందించలేడు. ఉపేక్షచేయనూలేడు. లక్ష్మణుని మానసస్థితిని సుకవిమాత్రమే వర్ణింపగలడు. సేవయందే భారమును ఉంచి లక్ష్మణుడు, ఎగురుచున్న గాలిపటమును ఆటకాడు లాగునట్లు నిలచెను. ఆతడు భూమిపై తలవంచి ప్రేమతో :- ''రఘునాథా, భరతుడు ప్రణామము చేయుచున్నాడు''అనెను. ఈమాటలు విన్నంతనే రాముడు అధీరుడై లేచినిలచెను. అతని వస్త్రము ఒకవైపున పడెను. తూణీరము మరి ఒక వైపున పడెను. ధనువు ఇంకొకచోట, శరము వేఱొకచోట పడినవి. కృపానిధానుడగు రాముడు భరతుని బలవంతముగా లేవనెత్తెను. అతనిని తన హృదయమునకు హత్తుకొనెను. రామ భరత సమాగమమును వీక్షించి అచ్చటివారెల్లరు తమను తాము మఱచిరి. ఆ సమాగమమునందలి ప్రేమను వర్ణించుట ఎట్లు ? కవుల మనో, వాక్‌ కర్మలకు అది ఆగమమైనది. మనో, బుద్ధి, చిత్త, అహంకారములను సోదరులిరువురు మఱచిరి. వారు పరమప్రేమ సంభరితులైరి. అట్టి ఉత్తమప్రేమను ఎవరు ప్రకటించగలరు? చెప్పుడు. దాని ఛాయనైనను ఏ కవియొక్క మనస్సు అనుసరించకలదు? అక్షరము, దాని అర్థముయొక్క నిజమైన శక్తియే కవికి కలదు. నటుడు తాళగతిని అనుసరించియే నాట్యము చేయును. భరత, రఘువరుల ప్రేమ అగమ్యము. విరించి, హరి, హరులైనను దానిని తెలియలేరు. మందమతినగు నేనెట్లు దానిని వివరింపగలను ? రెల్లు గడ్డితోచేసిన తీగెలపై చక్కనిరాగము పలికించగలమా?

భరత రఘువరుల సమాగమమును కనుగొని సురగణములు భయభీతులైరి. వారిగుండెలు వడివడిగా కొట్టుకొనెను. సురగురుడు వారికి నచ్చచెప్పినపిదప వారు తెలివితెచ్చుకొని పుష్పములను, ప్రశంసలను వర్షింప మొదలిడిరి.

అంతట రాముడు శత్రుఘ్నుని ప్రేమతో ఆలింగనము కావించుకొనెను. అనంతరము ఆతడు గుహుని కౌగలించుకొనెను. ప్రణమిల్లుచున్న లక్ష్మణుని భరతుడు కౌగలించుకొనెను. ప్రేమతో ఉప్పొంగుచు లక్ష్మణుడు అనుజుడగు శత్రుఘ్నుని ఆలింగనము చేసికొనెను. పిదప అతడు నిషాదపతిని తన హృదయమునకు హత్తుకొనెను. భరత, శత్రుఘ్నులు ఇరువురు సోదరులు మునిగణమునకు వందనముచేసి, తమ అభిమత ఆశీర్వాదములను పొందిరి. ఆనందించిరి.

అనుజ సహితుడై అనురాగమున ఉప్పొంగుచు భరతుడు సీతయొక్క పాదపద్మరజమును తన శిరమున ధరించెను. పదేపదే వారు ఆమెకు వందనము చేసిరి. సీత వారిని లేవనెత్తి తన కరకమలములచే వారిశిరములను స్పృశించి వారినిరువురిని ఆసీనుల కావించెను. వారిని ఆమె తన మనసునందే దీవించెను. ప్రేమమగ్నయై ఉన్నందున ఆమెకు తన దేహస్పృహయే లేదు.

తమయందు సీత సకలవిధముల సానుకూలముగా ఉన్నట్లు కనుగొని భరత, శత్రుఘ్నులు శోకరహితులైరి, వారిహృదయములయందలి కల్పితభయము తొలగెను.

ఆ సమయమున ఎవ్వరూ మాట్లాడుటలేదు. ఎవ్వరూ ఎవ్వరినీ ప్రశ్నించుట లేదు. ఎల్లరిమనస్సులు ప్రేమభరితములై, సంకల్ప వికల్పశూన్యములై ఉన్నవి. అంతట నిషాదుడు ధైర్యమువహించి, చేతులు జోడించి ప్రణామము కావించి, ''నాథా, మునినాథుడగు వసిష్ఠునితోపాటు తల్లులెల్లరు, పురవాసులు, సేవకులు, సేనాపతులు, సచివులు అందరు నీ వియోగమున కలతచెంది వచ్చినారు'' అని వినతి చేసెను.

శీలసాగరుడగు రాముడు గురుని ఆగమనమునుగురించి వినెను. సీతను రిపుదమనునివద్ద విడిచి పరమధీరుడు, ధర్మధురంధరుడు, దీనదయాళుడు, రాముడు వెంటనే వేగముగా వెడలెను. లక్ష్మణసహితుడై ఆతడు గురుని సందర్శించెను. ప్రేమ సంభరితుడై గురునికి సాష్టాంగదండప్రణామము కావించెను. మునివరుడు పరుగున ఏతెంచి వారిని తన హృదయమునకు హత్తుకొనెను. పిదప పేమ్రతో ఉప్పొంగుచు ఆ ఇరువురు సోదరులను ఆతడు కౌగలించుకొనెను. ప్రేమపులకితుడై గుహుడై తనపేరు చెప్పుకొనుచు దూరమునుండియే వసిష్ఠునికి సాష్టాంగవందనము చేసెను. గుహుడు రాముని సఖుడు అని తెలిసికొని ఆ ఋషి అతనిని భూమిమీద పొరలిపోవుచున్న ప్రేమను పోగుచేసికొనునట్లు గాఢాలింగనము కావించుకొనెను.

''రఘుపతియందలి భక్తి సన్మంగళములకు మూలము'' అని ఆకసమునుండి మరలు పొగడుచు విరులవానను కురిపించిరి. ''జగమున ఎల్లరీతుల ఇతనివంటి నీచుడెవడున్నాడు ? వసిష్ఠునివంటి మహానుభావు డెవ్వడున్నాడు? '' అని వారు అనిరి. లక్ష్మణుని కౌగలించుకొనుటకంటె అధిక ఆనందమున గుహుని వసిష్ఠుడు ఆలింగనము చేసికొనినాడు. సీతాపతి భజనయొక్క ప్రత్యక్షప్రతాపము, ప్రభావము ఇట్టివి !

కరుణాకరుడు, సజ్జనుడు, భగవానుడు అగు రాముడు ఎల్లరు ఆర్తులై ఉన్నారని కనుగొనెను. ఎవరికి ఏ భావమున తనను సందర్శింపవలెనను అభిలాష కలదో, వారివారికి ఆ భావమున, ఆయారీతుల ఆ యా అభిలాషలను అనుసరించి లక్ష్మణ సహితుడై ఆతడు ఱప్పపాటుకాలమున అందరిని ఆలింగనము చేసికొనెను. ఎల్లర దుఃఖమును, దారుణసంతాపమును దూరము చేసెను. రామునికి ఇది ఏమంత మహత్కార్యము ? కోట్లకొలది కుండలలో ఒకే ఒక్క సూర్యునియొక్క ప్రతిబింబము ఒకే సారి కనుపించదా ? పురజనులెల్లరు ప్రేమతో ఉప్పొంగి నిషాదుని కౌగలించుకొని, ఆతని భాగ్యమును కొనియాడిరి.

తల్లులెల్లరు దుఃఖితులై ఉన్నారని రాముడు కనుగొనెను. సుందరలతలు మంచుచే మాడిపోయినట్లు ఉన్నారు వారు. ప్రప్రథమమున రాముడు కైకేయిని కౌగలించుకొనెను. తన సరళస్వభావముచే, భక్తిచే ఆమెయొక్క మనస్సును ఆతడు శాంతపరచెను. ఆమెయొక్క పాదములపైపడి ''కాలము, కర్మము, విధి - వీనిదే దోషము అంతయు'' అని వచించి ఆమెను ఓదార్చెను. పిదప రఘువరుడు తల్లులందరిని కౌగలించుకొనెను.

''అమ్మా, జగమెల్లయు ఈశ్వరాధీనము. ఎవరిపైనను దోషము ఆరోపించతగదు'' అని వారిని ఓదార్చి సంతోషపరచెను. అనంతరము రామలక్ష్మణులు భరతుని వెంట వచ్చిన విప్రవనితలయొక్కయు, గురుపత్ని అగు అరుంధతియొక్కయు చరణములకు ప్రణామముకావించి వారినందరిని గంగా, గౌరీలనువలె సన్మానించిరి. ఆ స్త్రీ లెల్లరు ఆనందించిరి, మృదువాణులతో ఆశీర్వదించిరి. అటుపిమ్మట రామ లక్ష్మణులు సుమిత్రయొక్క పాదములను స్పృశించి, ఆమె ఒడిలో అణగి కూర్చుండిరి. మహాదరిద్రునికి సంపద లభించినట్లున్నది. పిదప ఇద్దరు అన్నదమ్ములు - రామ లక్ష్మణులు తల్లి కౌసల్యయొక్క చరణములపై పడిరి. ప్రేమవశమున వారి శరీరములన్నియు శిథిలమయ్యెను. అత్యంత అనురాగమున ఆ తల్లి వారిని తన హృదయమునకు హత్తుకొనెను. తన ప్రేమాశ్రువులలో వారిని ముంచివేసెను. ఆ సమయమున వారు పొందిన హర్ష, విషాదములను ఏ కవియైనను ఎట్లు వర్ణింపకలడు? మూగవాడు తాను తినిన దానిని వర్ణింపకలడా ? అనుజసహితుడై రాఘవుడు జననిని కౌగలించుకొనిన పిదప ''ఆశ్రమమునకు విచ్చేయేడు'' అని గురువును వేడెను. మునీశ్వరునియొక్క ఆనతిని కొని అయోధ్యాపురజనులు ఎల్లరు జల, స్థల సౌకర్యములను విచారించి బస చేసిరి.

భూసురులను, సచివులను, తల్లులను, గురువులను, పురజనులనుండి కొందరిని వెంటబెట్టుకొని రామ, లక్ష్మణ, భరతులు పవిత్రమగు ఆశ్రమమునకు నడచిరి.

సీత ఏతెంచి మునివరుని చరణములను స్పృశించి మ్రొక్కెను. తన మనోవాంఛితములగు దీవనలను పొందెను. ముని పత్నులను, గురుపత్నిని ఆమె ఆలింగనము చేసికొనెను. ఆమెయొక్క ప్రేమ వర్ణనాతీతము. అందరి పాదములకు ఆమె వేఱువేఱుగా మ్రొక్కి తన హృదయమునకు ప్రియమగు ఆశీర్వాదములను పొందెను. అత్తల నెల్లరనుచూచి సుకుమారిఅగు సీత భయపడి కన్నులు మూసికొనెను. ''ఆడు అంచలు వేటకాని వశ##మైపోయినవని'' ఆమె తలచెను.

''దుర్మార్గుడు, విధాత ఎంతటి క్రూరకృత్యము కావించినాడు !'' అని ఆమె వాపోయెను, అత్తలు కూడా సీతనుచూచి కడు దుఃఖించిరి. ''విధి విధించినదానిని అనుభవింపక తప్పదు'' అని వారు తలంచిరి.

పిదప జనకసుత హృదయమున ధైర్యము వహించెను. నీలకమలముల వంటి ఆమె నేత్రములు నీరు నిండెను. అత్తలకు ఆమె వందనము చేసెను. ఆ సమయమున పృథ్వి అంతయు కరుణయే వ్యాపించెను. అత్తలందరి చరణములను గ్రహించి జానకి అత్యంత అనురాగమున వారికి నమస్కరించెను. ప్రేమవశులై వారందరు ''సదా సౌభాగ్యపతివై వర్ధిల్లును'' అని తమ హృదయములయందే దీవించిరి. సీతయు, రాణులును ప్రేమవశమున వ్యాకులపడిరి. జ్ఞానిఅగు గురుడు వారి నందరిని కూర్చుండుడని పలికెను. మాయామయమగు ఈ జగత్తును గురించిన కొన్ని పారమార్థిక కథలను ఆ మునినాథుడు వివరించెను. దశరథుని స్వర్గయాత్రను గురించి పిదప వసిష్ఠుడు తెలిపెను. ఆ వార్తను విని రఘునాథుడు దుస్సహమగు దుఃఖమును పొందెను. తన యందలి ప్రేమచేతనే తండ్రి మరణించెనని అతడు తలచెను. ధైర్య ధురంధరుడగు ఆతడే అత్యంత కలతచెందెను ! వజ్రమువలె కఠోరమగు ఈ దుర్వార్తను విని సీత, లక్ష్మణుడు, రాణులెల్లరు విలపించిరి. ఎల్లరు శోకమున, దశరథుడు నేడే మరణించెనా అనునట్లు వ్యాకులపడిరి.

మునివరుడు రాముని బహువిధముల ఓదార్చెను. వారందరు పవిత్ర మందాకినీ నదియందు స్నానము చేసిరి. ఆనాడు ప్రభువు నిర్జల వ్రతమును పాటించెను. వసిష్ఠముని చెప్పినను ఎవ్వరూ జలమునైనను సేవించలేదు.

మరునాడు తెల్లవారగానే ముని ఆనతి ననుసరించి రఘునందనుడు సకల కర్మలను శ్రద్ధా భక్తులతో కావించెను. వేదోక్తవిధిని పితృకర్మలనన్నిటిని ఆతడు నెరవేర్చెను.

పాతకమను అంధకారమును పారద్రోలు భానుడు పునీతు డయ్యెను. ఎవనినామము పాపమను దూదిని భస్మముచేయు అగ్నియో, ఎవని స్మరణ సకల సుమంగళములకు మూలమో అట్టి ఆతడు - ప్రభుడు - పుణ్యనదులను తనయందు ఆవాహన చేయుటచే తానును పునీతయగు సురనదివలె పరిశుద్ధుడయ్యెను. సాధుపురుషుల అభిప్రాయమే ఇది. శుద్ధి అయినపిదప రెండుదినములు గడచెను. గురుని సమీపించి రాముడు ''స్వామీ, ప్రజలెల్లరు ఇక్కడ కందమూలఫలములను, జలమునుమాత్రమే సేవించుచు అతి దుఃఖార్తులై ఉన్నారు. అనుజులగు భరత, శత్రుఘ్నులను, సచివులను, తల్లులనుచూచి నాకు క్షణమొక యుగముగా గడచుచున్నది. కనుక తాము అందరితోకలసి అయోధ్యాపురికి విచ్చేయుడు. తాము ఇక్కడ - రాజు స్వర్గమున ఉన్నారు నేను మితిమీరి భాషించితిని. ఇదిఅంతయు నా దిట్టతనమే, స్వామీ, తమకు యోగ్యమని తోచినట్లు కావింపుడు'' అనెను. అంతట వసిష్ఠముని :-

''రామా, నీవు ధర్మసేతువు. కరుణానిలయుడవు. అవును - అంతకన్న వేఱు ఏమి పలుకుదువు? ప్రజలు దుఃఖితులై ఉన్నారు. రెండుదినములు ఉండి నీదర్శనము చేయుచు విశ్రాంతి పొందగలరు'' అని నుడివెను.

రాముని వచనములనువిని సమాజమంతయు సముద్రమధ్యమున నావ చలించునట్లు భీతిచెందెను. గురుని సుమంగళమూలములగు వచనములను వినినంతనే ఆ నావకు గాలి అనుకూలమైనట్లయినది.

దర్శనమాత్రమున పాపజాలమును విధ్వంసముచేయు పయస్వినీ నదీతోయములయందు వారెల్లరు స్నానము మూడువేళలయందు చేయుచు, పదేపదే మంగళ మూర్తికి సాష్టాంగప్రణామములు కావించుచు, కన్నుల కరవుతీర రాముని వీక్షించు చుండిరి.

రామశైలమును, అచ్చటి వనమును దర్శించుటకు అందరు వెడలిరి. అచ్చట అంతయు అన్నివిధముల ఆనందమే. దుఃఖమనునది లేనేలేదు. సెలయేళ్ళలో అమృతమువంటి నీరు ప్రవహించుచున్నది. అచ్చటి త్రివిధవాయువులు త్రివిధ తాపములను హరించును. అగణితమగువృక్షములు, లతలు, తృణములు, నానావిధములగు ఫలములు, పుష్పములు, పత్రములు, సుందరమగు శిలలు, సుఖమునిచ్చు చెట్లనీడలు - ఆ వనసౌందర్యమును వర్ణింప ఎవరితరము? సరోవరములయందు సరోరుహములు వికసించి ఉన్నవి. వీటిపక్షులు మధురముగా కూయుచున్నవి. తుమ్మెదలు రొదచేయుచున్నవి. రంగురంగుల విహంగములు, పశువులు, ఆ విపినమున వైరమువీడి విహరించు చున్నవి. కోలులు, కిరాతులు, భిల్లులు మొదలగు వనవాసులు శుచియగు, సుందరసుధాతుల్యమగు, చక్కని తేనెను, బాగుగా కుట్టినదొన్నెలలో నింపి, దానితోపాటు కందమూలఫలములను, అంకురములను. తృణమును తెచ్చిరి. అందరికి వినయమున ప్రణామముచేసి, తాము తెచ్చిన పదార్థములను రుచి, భేద, గుణములప్రకారము వేఱు వేఱుగా పేర్లుచెప్పి సమర్పించిరి. పురజనులు ఆ వస్తువులకు వెల ఇత్తుమన్నను వారు స్వీకరించలేదు! 'తిరిగి ఇచ్చినచో రామునిమీద ఒట్టు' అనిరి.

ప్రేమమగ్నులై, కోమలవాణితో వారు ''సాధుజనులు ప్రేమను గుర్తించి దానిని సన్మానింతురు'' అని పలికిరి. ''మీరు పుణ్యాత్ములు. మేము నీచనిషాదులము. రామకృపచే మీ దర్శనము లభించినది. జలములేని మార్వాడుదేశమునకు గంగధారవలె మావంటివారికి మీ దర్శనము అతి దుర్లభము. దయాళుడగు రాముడు నిషాదునిపై ఎంత కృపచూపెనో ! రాజువలెనే ఆతనిప్రజలు - ఆతనిపరివారము ! ఈవిషయమును హృదయమున గ్రహించి, సంకోచమును విడిచి, మా ప్రేమనుచూచి మాపై కృపచూపుడు. ఈ ఫలములను, అంకురములను స్వీకరించి మమ్ము కృతార్థులను కావించుటకు మా అడవికి మీరు ప్రియములగు అతిథులై విచ్చేసితిరి. మీసేవ చేయగల యోగ్యత మాకు లేదు.

స్వామీ, మీకు ఏమి సమర్పింపగలము మేము? భిల్లులతోడి మైత్రి కట్టెలు, ఆకులవరకు మాత్రమే. మీ బట్టలను, పాత్రలను మేము ఎవ్వరము దొంగిలింపము. ఇదే మీకు మేము చేయగల మహాసేవ. మేము జడులము. జీవగణములను హింసింతుము. దుష్టులము. దుర్మార్గులము. దుర్బుద్ధికలవారము. దుష్టజాతివారము. రాత్రింబవళ్లు మాకు పాపకృత్యములతోనే గడచిపోవున. మా నడుములకు బట్టలేదు. పొట్టల నిండా తిండిలేదు. రఘునందనుని దర్శనప్రభావముచే కాక స్వప్నముననైనను మాకు ధర్మబుద్ధి ఎక్కడ కలదు ఎన్నడైనను? ప్రభుని పాదపద్మములను దర్శించినప్పటి నుండియు మాయొక్క దుస్సహమగు దుఃఖము, దోషము దూరమయ్యెను'' అని వారు వచించిరి.

వనవాసుల వచనములనువిని అయోధ్యాపురజనులు అనురాగభరితులౌ వారి భాగ్యమును కొనియాడమొదలిడిరి. ఎల్లరు ప్రేమపూరితవచనములను పలుకసాగిరి. వనవాసులయొక్క సంభాషణపద్ధతిని, సమాగమరీతిని, సీతారాముల చరణములయందు వారికి కల ప్రేమనుచూచి పురజనులు ఆనందము పొందిరి. కోలుల, భిల్లుల మాటలను విని స్త్రీలు. పురుషులు ఎల్లరు తమదియు ఒక ప్రేమయేనా అని తమప్రేమను నిరాదరించుకొనిరి.

రఘువంశమణి అగు రామునికృప ఇట్టిది ! అతనికృపచే ఓడను తనపై ఎక్కించుకొని ఇనుము నీటిలో తేలును :- ఇది తులసివాక్కు !

జనులెల్లరు దినదినము ఆనందమున అడవిలో నలుదెసల తిరుగుచుండిరి. తొలకరివాసలకు కప్పలు, నెమళ్ళు ఆనందమున విహరించుచున్నట్లున్నారు వారు. స్త్రీలు, పురుషులు అత్యంతముగా ప్రేమమగ్నులైరి. దినమొక నిమిషముగా గడచిపోవుచున్నది.

ప్రతి ఒక అత్తగారికి తాను ఒక ప్రత్యేకవేషమును ధరించి సాదరముగా ఒకే విధముగా సీత సేవ చేయుచున్నది. ఈ మర్మము రామునికితప్ప ఇంకెవ్వరికీ తెలియదు. మాయలన్నియు సీతయొక్క మాయయందే ఉన్నవి. సేవచేసి సీత అత్తలను తనవశము చేసికొన్నది. అత్తలు సంతసించి ఆమెను దీవించిరి. ఆమెకు బోధించిరి. సీతా రామ లక్ష్మణులయొక్క సరళస్వభావమును కనుగొని కుటిలస్వభావము కలిగిన రాణి కైక అత్యంత పశ్చాత్తాపము చెందెను. ధరణిని, యముని ఆమె యాచించెను. కాని భూదేవి ఆమెను తనపొట్టను పెట్టుకొనలేదు! విధాత ఆమెకు చావును ఈయలేదు! రామవిముఖునికి నరకముననైనను తావు లేదనుమాట లోకప్రసిద్ధము-వేదవిదితము- మునివచనము.

''రాముడు అయోధ్యకు మఱలివచ్చునా ? రాడా? అనునదే అందరి మనస్సుల యందలి సందేహము.

భరతునికి రాత్రులు నిద్దురలేదు. పగలు ఆకలిలేదు. పవిత్రమగు ఆలోచనలలో అతడు నీరులేనిబురదయందు మునిగిన చేపవలె ఆందోళన పడుచున్నాడు.

''ధాన్యము పంటకు వచ్చినపుడు ఈతిబాధలు దాపురించినట్లు కాలమే నా తల్లిరూపమున ఇట్లు దుష్కృత్యము కావించినది. రామపట్టాభిషేకము ఏరీతిని జరుగకలదు? ఏ ఉపాయము నాకు తోచుటలేదు. గురుడు ఆజ్ఞాపించినచో రాముడు అయోధ్యకు అవశ్యము మరలివచ్చును. కాని, మునియు రాముని ఇంగితమును తెలిసికొని దానిని అనుసరించియే ఆనతి ఇచ్చును. తల్లి చెప్పినను రఘునాథుడు తిరిగి వచ్చును. కాని రామునితల్లి అతనిని వెనుకకు మరల్చునా ! నేనో - సేవకుడను. నా మాట ఎంత? అందునను నా రోజులు మంచివికావు. విధాత ప్రతికూలుడు నాకు. ఒకవేళ నేను మరలింతు ననుకొనినను అది ఘోరమగు అధర్మమే అగును. సేవకుని ధర్మము కైలాసముకంటె భారమైనది' అని భరతుడు చింతించెను.

ఉపాయము ఏదియు అతనిమనసున గోచరించలేదు. ఆలోచనలతోనే ఆ రాత్రి గడిచినది. మరునాటి ప్రాతఃకాలమున భరతుడు స్నానముచేసి, ప్రభునికి నమస్కరించి కూర్చుండనుండెను. ఇంతలో వసిష్ఠఋషి అతనిని పిలువనంపెను. భరతుడు వెడలిగురు పాదకమలములకు ప్రణమిల్లెను. గురుని ఆనతిపొంది కూర్చుండెను. విప్రులు, మహాజనులు, మంత్రులు, అందరు సభాసదులువచ్చి ఆ సమయమున అచట ఉన్నారు.

అంతట వసిష్ఠమునివరుడు సమయోచితముగా ఇట్లు వచించెను :-

''సభాసదులారా. చతురుడవగు భరతా. వినుడు. భానుకులభానుడు. రాజా రామమూర్తి-ధర్మధురంధరుడు. స్వతంత్రుడు, భగవానుడు, సత్యసంధుడు. వేదసంరక్షకుడు. రాముని అవతారము జగన్మంగళకారణము. గురువుల, జననీ జనకులవచనములను అనుసరించుచు అతడు దుష్టసంఘమును నాశనమొనర్చును. దేవతలకు హితమొనర్చును. నీతి, ప్రేమ, పరమార్థ, స్వార్థములయొక్క యథార్థమును రాముని వలె తెలిసినవాడు ఇంకొకడు లేడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, చంద్రుడు, సూర్యుడు, దిక్పాలకులు, మాయ, జీవుడు, కర్మ, కాలము సర్వము, శేషుడు, భూపాలురు మొదలగువారు ఎందరు ప్రభువులున్నారో అందరు, యోగసిద్ధుల, వేదశాస్త్రములయందు వివరింపబడినవన్నియు - మీ హృదయముల చక్కగా విచారించి తెలిసికొనుడు - అన్నియు రామాజ్ఞకు లోబడినవే. కనుక రాముని ఆనతిని, ఇంగితమును పాలించుటయందే మనకు మేలు. బుద్ధిమంతులగు మీరు కలసి ఈ విషయమును జ్ఞప్తియందు ఉంచుకొని, మీ అభిప్రాయమును అనుసరించి ఒక ఉపాయమును ఆలోచింపుడు. దానిని ఆచరింపుడు. రామపట్టాభిషేకము సర్వులకు సుఖదాయకమే. మంగళ, ప్రమోదములకు మూలమగు మార్గము అది ఒక్కటే. రఘునాథుడు ఏవిధిని అయోధ్యకు తిరిగివచ్చునో ఆ ఉపాయమును యోచించి తెలుపుడు. దానినే ఆచరింతము.'' మునివరుని నీతి, పరమార్థ. లౌకిక శాస్త్ర సంభరితములగు వచనములను ఎల్లరు సాదరముగా వినిరి. ఎవ్వరికీ ఏ ఉపాయము తోచుటలేదు. అందరు విచారణా శక్తి విహీనులైరి. అంతట భరతుడు శిరమువంచి, కరములు జోడించి, ''భానువంశమున ఒకరిని మించినవారు మరిఒకరు మహారాజులు అనేకులు విలసిల్లిరి. వారి కెల్లరకు వారి జననీజనకులు జన్మకారణము మాత్రమే. శుభాశుభకర్మలకు వారికి ఫలము నిచ్చినది విధాత. కాని రవి కులజులు తమ దుఃఖములను జయించి, సకల ఐశ్వర్యములను సముపార్జించుట తమ ఆశీర్వాదమువలననే కదా ! జగమునకు ఇది ఎఱుకయే. స్వామీ, విధాతయొక్క విధానమును సహితము తాము నిరోధింపకలరు. తమరు నిశ్చయించువిధానమును కాదనువారెవరు? ఉపాయము తెలుపమని నన్ను తాము కోరితిరి. ఇది అంతయు నా అభాగ్యము'' అని నుడివెను.

భరతుని ప్రేమమయవచనములను విని గురుని హృదయమున అనురాగము ఉప్పొంగెను.

''తండ్రీ, నీవు పలికినది నిజము. కాని సర్వమునకు రామునికృపయే కారణము. రామ విముఖునికి కలలోనైనను జయము లభింపదు. ఒక్కమాట చెప్పుటకు నేను సందేహించుచున్నాను. నాయనా, తమసర్వస్వము నశించునప్పుడు బుద్ధిమంతులు సగమునైనను రక్షించుకొనుటకు మిగిలినసగమును విడతురు. మీ రిరువురు అడవుల యందు ఉండుడు. సీతా రామ లక్ష్మణులు అయోధ్యకు మరలుదురు'' అని వసిష్ఠముని పలికెను.

ఈ చక్కనిమాటలను విని భరత శత్రుఘ్నులు ఆనందించిరి. వారి సకలఅంగములు పరమానందభరితము లయ్యెను. దశరథుడు బ్రతికివచ్చెనో - రాముడు రాజయ్యెనో - అనునట్లు వారిమనస్సులు ప్రసన్నత చెందెను. వారి శరీరతేజము ప్రకాశించెను. అధికలాభము, అల్పహాని - దీనియందు ఇతరులకు కనుపించెను. రాణులకు మాత్రము సుఖ దుఃఖములు రెండును సమమే అయ్యెను. దీనినిగ్రహించి వారెల్లరు విలపించిరి.

''మునివరుడు చెప్పినట్లు జరిగినచో సకలజగమున ఉన్న జీవులన్నిటికి వారు కోరినవస్తువులను ఇచ్చినంతఫలము కలుగును. నా జీవితమంతయు నేను అడవులలో వసింతును. అంతకంటె అధికమైనది ఏదియు నాకు సుఖకరము కాదు. సీతారాములు సకలహృదయాంతర్యాములు. తాము సర్వజ్ఞులు. సజ్జనులు. హృదయపూర్వకముగా తాము దీనిని వచించిఉన్నచో స్వామీ, తమ పలుకులను సత్యము కావింపుడు. ఆచరింపుడు'' అని భరతుడు నుడివెను. ఆతని పలుకులువిని, ఆతని ప్రేమను కనుగొని సఖికులు, వసిష్ఠుడు తమ దేహములను విస్మరించిరి.

భరతుని మహామహిమ అగాధసముద్రమువలె ఉన్నది. మునియొక్క బుద్ధిఅను ఒక అబల దానితీరమున నిలచి, దానిని దాట గోరుచున్నది. దాటుటకు ఓడ కాని, నావకాని, తెప్పకాని వెదకినను లభించలేదు. భరతుని మహిమను ఎవరు వర్ణింపగలరు? చిన్న చెరువునందలి ముత్యపుచిప్పలో సముద్రము ఇముడకలదా ? భరతుని గుణములు మునియొక్క అంతరంగమునకు ఆనందము కలిగించెను. అందరుకలసి రామునివద్దకు వెడలిరి, ప్రభువు అభివందనలుతెలిపి మునిని సుఖాసీనుని చేసెను. ముని ఆనతిని విని అందరు కూర్చుండిరి. దేశ, కాల, అవపరములను అనుసరించి మునివరుడు యోచించి ఇట్లు వచించెను :-

''నీవు సర్వజ్ఞుడవు. సజ్జనుడవు, రామా, ధర్మ, నీతి, గుణ, జ్ఞాననిధివి, ఆలకింపుము. సకలహృదయనివాసివి నీవు. సర్వుల సద్భావములు, దుర్బుద్ధులు నీకు విదితము. పురజనులకు, తల్లులకు, భరతునికి హితమగు ఉపాయము తెలుపుము. ఆర్తులు ఆలోచించి ఎన్నడూ పలుకరు. జూదరికి తన పందెమునందే దృష్టి !''

మునియొక్క వచనములనివిని రఘుపతి ''ప్రభూ, ఉపాయము నీ చేతిలోనే ఉన్నది. నీ ఇచ్ఛను అనుసరించుటయందును, నీ ఆనతి సత్యమనిఎంచి ఆనందమున పాలించుటయందును అందరి హితము కలదు. ప్రథమమున నాకు నీవు ప్రసాదించు ఆజ్ఞను నేను శిరసావహింతును. పాలింతును. ఇక స్వామీ, నీవు ఎవరికి ఏ ఆజ్ఞ ఇత్తువో వారు దానిని సర్వవిధముల పాలించి నిన్ను సేవింతురు'' అనెను.

అంతట వసిష్ఠముని ఇట్లు నుడివెను : ''రామా, నీవు సత్యము వచించితివి. కాని. భరతునిప్రేమ నన్ను విచారణాశక్తి విహీనుని చేసినది. కనుక పదేపదే నేను పలుకుచున్నాను. నామతి భరతుని భక్తికి వశ##మైనది. నా తలంపు ఇది. భరతునియొక్క ఇచ్ఛను అనుసరించి నీవు ఏది ఆచరింతువో శివునిసాక్షిగా అదిఅంతయు శుభమగును. భరతునియొక్క వినతిని సాదరముగా ఆలకింపుము. దానినిగురించి యోచింపుము. అనంతరము సాధుమతమును, లోకమతమును, రాజనీతిని, వేదసారమును అన్నిటిని ఆలోచించి ఆరీతిని కావింపుము.''

భరతునియందు గురునికికల అనురాగమును కనుగొని రామునిహృదయమున అత్యంత ఆనందము కలిగెను. భరతుడు ధర్మధురంధరుడనియు, మనో వాక్‌ కాయములయందు తన సేవకుడనియు అతడు తెలిసికొని వసిష్ఠుని ఆజ్ఞానుసారము రాముడు మంజుల, మృదు, మంగళమూలములగు వచనములను ఇట్లు పలికెను :-

''స్వామీ, నీపై శపథముచేసి, మా జనకుని పాదసాక్షిగా నేను సత్యము వచింతును. ఈ భువనమున భరతునివంటి సోదరుడు లేనేలేడు. గురుచరణ కమలానురాగి అగువాడు లౌకిక, వైదికముల రెండింటిదృష్ట్యా భాగ్యవంతుడు. తమకు ఇట్టి ప్రేమ కల భరతునియొక్క భాగ్యమును ఎవరు వర్ణింపగలరు? భరతుడు నా తమ్ముడు. అతని ఎదుట అతనిని పొగడుటకు సంకోచించుచున్నాను. భరతుడు వచించినట్లు ఆచరించుట యందే మనకు మేలు.'' ఇట్లు నుడివి రాముడు మౌనము వహించెను.

అంతట మునివరుడు భరతునితో ''నాయనా, సంకోచములన్నిటిని త్యజించి, కృపాసాగరుడగు నీ ప్రియసోదరునికి నీ హృదయమున ఉన్న విషయము తెలుపుము'' అనెను.

మునియొక్క మాటలువిని, రాముని ఇంగితమును కనుగొని, గురువు, ప్రభువు ఇరువురు తనకు సంపూర్ణముగా అనుకూలురని తెలిసికొని, భారమెల్లయు తన శిరముపై ఉన్నదనిగ్రహించి భరతుడు ఏమియు చెప్పజాలక విచారించుచుండెను. ఆతడు పులకితశరీరుడై సభలో నిలచెను. అతని నయనకమలమునుండి ప్రేమాశ్రువులు ప్రవహించెను.

''నేను వచింపవలసినదంతయు మునినాథుడే నుడివెను. ఇంతకంటె ఎక్కువ చెప్పవలసినది లేదు. నా స్వామియొక్క స్వభావము నాకు తెలియును. అపరాధిపైనైనను ఆతడు ఎన్నడు కోపించడు. నాపై ఆతనికి విశేషమగు ప్రేమ, దయ, ఆటలయందైనను అతనిలో నేను కోపమును చూడలేదు. బాల్యమునుండి ఆతని సాంగత్యము నేను విడువలేదు. అతడు ఎన్నడూ నాకు ప్రతికూలమగుపని చేయలేదు. ప్రభునికృప ఎట్లుండునో నా హృదయమున బాగుగా తెలిసికొంటివి. ఆటలలో నేను ఓడిపోయినను నన్నే ఆతడు గెలిపించువాడు, ప్రేమ, లజ్జావశుడనై ఆతనిఎదుట నేను నోరెత్తలేదు. ప్రేమ తృష్ణచే ప్రభు దర్శనమువలన ఇంతవరకు నా కన్నులు తృప్తి చెందలేదు. కాని విధి ఆతనియందు నాకుకల ప్రేమను సహించలేకపోయెను. నీచురాలగు నాతల్లి అనుమిషచే నాకును నా ప్రభునికి మధ్య అంతరము కలిగినది. ఇట్లు పలుకుట నాకు శోభస్కరము కాదు. తమకు తామే సజ్జనులమని, పవిత్రులమని అనుకొన్నంతమాత్రమున ఆవిధమున కాగలరా? 'నా తల్లి నీచురాలు. నేను సత్పురుషుడను. సదాచారిని' అని నేను మనమున తలచుటయే కోటిదురాచారములకు సమము. కొఱ్ఱధాన్యముల మోళ్ళనుండి మంచిధాన్యము పండునా? గుంటలలోని నల్లని నత్తగుల్లలు ముత్యములను ఉత్పన్నము చేయునా? స్వప్నముననై నను ఇందు లేశమాత్రము ఎవ్వరిదోషము లేదు. నా దురదృష్టము సముద్రమువలె అగాధము. నా పాపపరిపాకమును తెలియక నా తల్లిని నిందించితిని. నా హృదయము అన్నివైపుల శోధించితిని. విఫలుడనైతిని. ఇక నా మేలు ఒకే ఒకవిధమున కలదు. గురుస్వామి సర్వసమర్థుడు. సీతారాములు నా ప్రభువులు. కనుక పరిణామము శుభకరమగునని నాతలపు. ఈ సాధుసమావేశమున, గురువుల, ప్రభుని సమ్ముఖమున, ఈ పావనతీర్థస్థలమున సత్యభావమున వచింతును. నేను పలుకునది ప్రేమయో లేక కపటమో, నిజమో లేక అబద్ధమో మునికే తెలియును. రఘురామునికే తెలియును.

ప్రేమప్రతినను నిలుపుకొనుటకు భూపాలుని మరణము. నా తల్లియొక్క దుర్బుద్ధి - ఈ రెండింటికి అఖిలజగమే సాక్షి. తల్లులందరు వ్యాకులపడిఉన్నారు. వారిని చూడలేము. అయోధ్యానగరి స్త్రీ. పురుషులెల్లరు దుస్సహమగు తాపమున మ్రగ్గుచున్నారు. ఈ అనర్థములకన్నిటికి నేనే మూలకారణము ఇట్లని విని, తెలిసికొని ఈ దుఃఖములన్నిటిని సహించినాను. సీతా లక్ష్మణులతో మునివేషమునుధరించి రఘునాథుడు పాదరక్షలు ధరింపక, పాదచారియై అడవులకు వెడలెననువార్త వినియు - ఈ దెబ్బనుండిసహితము నేను తప్పించుకొని జీవించిఉన్నాను. శంకరుడే సాక్షి. నిషాదునిప్రేమను చూచియు - వజ్రముకంటె కఠినమగు ఈ నా హృదయము బ్రద్ధలు కాలేదు. ఇప్పుడు ఇక్కడకువచ్చి అన్నిటిని కన్నులార కనుగొంటిని. ఈ నా జడజీవి నన్ను జీవితాంతమువరకు అన్నివిధముల బాధించును. ఎవరినిచూచి దారియందున్న ఆడుపాములు. తేళ్ళు సహితము భయానకమగు తమ విషమును, తీక్షణమగు తామసమును విడచునో అట్టి సీతా లక్ష్మణ రఘునందనులనుగురించి ఏమని వచింపగలను?

ఇట్టి సీతా రామ లక్ష్మణులను తన శత్రువులుగా భావించిన ఆ కైకయొక్క పుత్రుడవగు నన్నుకాక ఇంకెవ్వరిని దైవము దుస్సహమగు ఈ దుఃఖమును అనుభవింపమనును?'' అని ఇట్లు భరతుడు విలపించుచుండెను.

భరతుని అతి వ్యాకులమగు దుఃఖ, ప్రేమ, వినయ, నీతిభరితములగు పలుకులనువిని అందరు శోకమగ్నులైరి. మంచుపడి కమలవనము ధ్వంసమైనట్లు సభ అంతయు విషాదము క్రమ్ముకొనెను.

జ్ఞానిఅగు వసిష్ఠముని నానావిధములగు పురాణకథలను వినిపించి భరతుని ఓదార్చెను. దినకరకుల కమలవన చంద్రుడగు రఘునందనుడు తగు వచనములను ఇట్లు నుడివెను :-

''నాయనా, నీవు నీ హృదయమున వ్యర్థముగా చింతించుచున్నావు. జీవులగతి ఈశ్వరాధీనము-అని తెలిసికొనుము. త్రికాలములయందును, త్రిలోకములయందును పుణ్యాత్ములెల్లరు నీకంటె తక్కువవారని నా ఉద్దేశ్యము. హృదయముననైనను నీయందు కుటిలతను ఆరోపించువారికి ఈ లోకము లేనేలేదు. పరలోకసద్గతియు వారికి ఉండదు. గురువుల, సాధు సత్పురుషుల సమాజములను సేవించని మూర్ఖులుమాత్రమే జనని కైకేయిపై దోషమును ఆరోపింతును.

నీ పేరు స్మరించినంతనే సర్వపాపములు. ప్రపంచ అజ్ఞానము. అఖిల అమంగళసముదాయములు నశించిపోవును. ఈ లోకమున సత్కీర్తియు, పరలోకమున సుఖమును సంప్రాప్తించును.

భరతా, నేను సహజస్వభావముననే సత్యము వచింతును. శివుడే సాక్షి. ఈ పృథ్వీతలము నీపైననే ఆధారపడిఉన్నది. తండ్రీ, వ్యర్థముగా కుతర్కముచేయకుము. వైరము, ప్రేమ దాచినను దాగవు. ఖగములు, మృగములు మునిగణముల సమీపమునకు పోవును. హింసచేయు వేటకానిని చూడగనే అవి పారిపోవును. తమకు హితుడెవడో, అహితుడెవడో పశువులు, పక్షులుకూడా తెలిసికొనగలవు. ఇక మానవశరీరము సద్గుణములకు, జ్ఞానమునకు నిధానము. నాయనా, నీవిషయము నాకు బాగుగా తెలియును. నేను ఏమి చేయవలెనో - ముందువెనుకలు తెలియనిస్థితియం దున్నాను.

రాజు నన్ను త్యజించి సత్యమును పాలించెను. ప్రేమప్రతిజ్ఞకై తనువును వీడెను. ఆయనమాటను భగ్నముచేయుటకు నా మనస్సు క్షోభించుచున్నది. అంతకన్నను నాకు నీయందు గౌరవము అధికము. దానికంటె అధికము గురుని ఆజ్ఞ. కనుక నీవు చెప్పినదానివే నేను అవశ్యము చేయకోరుచున్నాను. ప్రసన్నమనస్కుడవై సంకోచమునువీడి తెలుపుము. నీవు ఏది చేయుమన్నను నేడే నేను దానిని ఆచరింతును.''

సత్యసంధుడగు రఘువరుని పలుకులను విని అందరు ఆనందించిరి. సురగణములు. సురరాజు భయపడిరి. ''మనము తలంచినది సర్వము ధ్వంసమగుచున్న''దని ఎంచిరి. ఇక ఉపాయము ఏదియు అక్కరకు రాదనుకొనిరి. తుదకు ఎల్లరు తమ మనస్సులలో రాముడే శరణ్యమని భావించిరి. అందరు యోచించిరి. ''భక్తుల భక్తికి వశుడు రఘుపతి'' అని ఒండొరులు సంభాషించుకొనిరి. అంబరీషుని, దుర్వాసుని సంఘటనలు వారికి జ్ఞప్తిరాగానే దేవతలు, దేవేంద్రుడు సహితము పూర్తిగా నిరాశ##చెందిరి. ఆనాడుకూడా ప్రహ్లాదుడు నరహరిని అవతరింపచేసిన నాటివరకు బహుకాలము దేవతలు దుఃఖమును సహించిరి.

దేవతలందరు చెవులు కొఱకుకొనిరి. తలలు బాదుకొనిరి. 'సురకార్యము ఇక భరతునిచేతిలోనే ఉన్నదనుకొనిరి.

''దేవతలారా, ఇక ఉపాయమేదియు గోచరించుటలేదు. తన సద్భక్తులసేవనే రాముడు పరిగణించును. కనుక తన గుణ శీలములచే రామునివశము చేసికొనిన భరతుని మీరెల్లరు ప్రేమసహితముగా హృదయమున స్మరించుడు'' అని అనిరి.

దేవతల అభిప్రాయమును సురగురువు వినెను. ''మంచిది, మీరందరు అతిభాగ్యవంతులు. భరత చరణానురాగము జగమున సకల సన్మంగళములకు మూలము. సీతాపతియొక్క భక్తులకు చేయుసేవ వందలకొలది కామధేనువులకు సమము. రమణీయము. భరతునిభక్తి మీ మనసులకు నచ్చెను. చింతను విడువుడు. విధాతయేదారి చూపినాడు. సురపతీ, భరతునిప్రభావము తిలకింపుము. రఘురాముడు సహజస్వభావముననే అతనికి వశుడైనాడు. భరతుడు రాముని నీడ. ఈవిషయమును ఎఱిగి, సురలారా. మీ చిత్తములను శాంతింపచేయుడు. భయపడకుడు'' అని గురుడు పలికెను.

సురగురుని పలుకులనువిని, సురల అభిప్రాయము కనుగొని, వారివిచారము తెలిసికొని అంతర్యామి అగు ప్రభుని మనమున కలత కలిగెను. భారమంతయు తన తలపై ఉన్నదని భరతుడు తెలిసికొనెను. అతనిహృదయమున కోట్లకొలది తలపులు రేకెత్తెను. భరతుడు పలువిధముల యోచించెను. రాముని ఆనతిని పాలించుటయందే తనకు మేలు కలదని తుదకు అతడు దృఢముగా నిశ్చయించెను. ''తన ప్రతినను వీడి నామాటను రాముడు నిలబెట్టెను'' అని అతడు తలచెను. ''రాముడు నాయందు చూపినది అత్యంత కృప. ప్రేమ. సీతానాథుడు నాపై అన్నివిధముల అమితమగు అనుగ్రహము చూపినాడు !'' అని తలచి భరతుడు తన కరకమలములను జోడించి, ప్రణామముకావించి ఇట్లు వచించెను :-

''స్వామీ, కృపాంబునిధీ, అంతర్యామీ, ఇక నేనేమి వచింపను? ఏమి వచింపచేయగలను? గురువు నా యెడ ప్రసన్నుడైనాడు. స్వామి నాకు అనుకూలుడైనాడు, దీనిని గ్రహించి నా మలిన మనస్సునందలి కల్పితబాధ తొలగెను. నేను లేనిపోని భయమునకు లోనైతిని. నా విచారమునకు మూలకారణము లేదు. దిక్కులను మనము మరచినచో దేవా, దినకరుని దోషములేదు. నా దౌర్భాగ్యము, నా తల్లియొక్క కౌటిల్యము, విధాతయొక్క వక్రగతి, కాలముయొక్క కాఠిన్యము, ఇవి అన్నియు కలసి, పట్టుపట్టి నన్ను నష్టపరచినవి. శరణాగత రక్షకుడవగు నీవు నీమాటను నిలబెట్టుకొంటివి. ఇది నీకు క్రొత్తపద్ధతి కాదు. లోక, వేదవిదితమే ఇది. రహస్యము కానేకాదు. జగత్తు సర్వము అసత్యమైనది, అహితమైనది. నీవు ఒక్కడవే హితుడవు. నీ కృపచేకాక-తెలుపుము - ఇక ఎవని మంచితనమువలన ఒకనికి మేలు కలుగును?

నీ స్వభావము కల్పతరువు వంటిది. అది ఎన్నడూ ఒకరికి అనుకూలమై, ఇంకొకరికి ప్రతికూలమై ఉండదు. కల్పతరువును గుర్తించి దానిని సమీపించినచో దానినీడయే అన్నిచింతలను నాశనమొనర్చును. రాజు,పేద, సన్మార్గుడు, దుర్మార్గుడు-ఎవ్వరైనను దానిని వేడుకొనినచో చాలు - వారి అభిమతములన్నియు ఫలించును. గురునియొక్క, ప్రభునియొక్క సకలవిధములగు ప్రేమనుచూచి నా క్షోభ నశించెను. నా మనస్సున సందేహము ఏదియులేదు. కరుణాకరా, ఈ దాసునికొరకై ప్రభుని చిత్తమున ఏ క్షోభయు లేకుండునట్లు ఆచరింపుము. తనస్వామిని సంకోచమున పడవైచి తనమేలునే కోరు సేవకునిబుద్ధి నీచమైనది. తనసుఖములనన్నిటిని, లోభమునువదలి స్వామిసేవను చేయుటయందే సేవకుని శ్రేయస్సు కలదు. నాథా, నీవు మరలివచ్చుట యందు అందరియొక్క స్వార్థమున్నది. నీ ఆనతిని పరిపాలించుటయందు కోటివిధముల శుభమున్నది. స్వార్థ, పరమార్థముల ప్రయోజనముల అవధి నీ ఆనతిని పరిపాలించుటయందే కలదు. సకల సుకృతములకు సత్ఫలము అదియే. సర్వసద్గతులకు భూషణము అదియే.

దేవా, నా వినతి ఒక్కటి ఆలకింపుము. నీకు సమంజసమని తోచినట్లు కావింపుము. పట్టాభిషేకమునకు వలయుసామగ్రిని తెచ్చితిమి. ప్రభుని మనస్సునకు అంగీకారమైనచో దానిని వినియోగించుము. శత్రుఘ్నుని నన్ను వనములకు పంపుము. నీవు అయోధ్యకు మరలుము. ఎల్లరను సనాథులను కావింపుము. నీవు అయోధ్యకు తిరిగి వెడలనచో నాథా. మన సోదరులను ఇరువురిని అయోధ్యకు పంపుము. నేను నీవెంటవత్తును. అదియు కాదందువేని మేము మూవురము వనములకు పోదుము. రఘుపతీ. సీతాసహితుడవై నీవు తిరిగి వెడలుము. కరుణాసాగరా, ప్రభుని మానసము ప్రసన్నమగునట్లు ఒనరింపుము. దేవా, భారమంతయు నాపైన ఉంచితివి. నాకు ధర్మమును గురించిన తలంపులేదు. నీతివిచారములేదు. నా స్వార్థమునకే అన్నిమాటలు నేను పలుకుచున్నాను. ఆర్తుడగు మానవునిచిత్తమున వివేకము ఉండదు. స్వామియొక్క ఆనతిని విని ప్రత్యుత్తరమును పలుకు సేవకునిచూచి లజ్జయే లజ్జ చెందును. దుర్గుణముల అగాథజలధిని నేను. ప్రేమవశమున నీవు నన్ను సాధుపురుషుడని వర్ణించి, పొగడుచున్నావు. కృపాళూ, స్వామియొక్క మానసమునకు సంకోచము కలిగించనిది. ఏదైనను నాకు ప్రీతికరమే. ప్రభుని పాదములపై శపథముచేసి సత్యము వచింతును. జగన్మంగళమునకు, హితమునకు ఇది ఒక్కటే ఉపాయము. ప్రసన్నమానసమున, సంకోచమునువీడి ప్రభువు ఏ ఆజ్ఞఇచ్చినను దానిని అందరు శిరమున ధరింతురు. సకల అవరోధములు చిక్కులు తొలగిపోగలవు.''

భరతుడు నుడివిన పవిత్రవచనములను విని దేవతలు సంతసించిరి. ''బాగుబాగు'' అనిరి. పూలవానను కురిపించిరి.

అయోధ్యాపురజనులు ముందువెనుకలు తెలియనిస్థితిలో పడిరి. తాపసులు, వనవాసులు, తమ మనస్సులయందు ప్రమోదము పొందిరి. సంకోచమునఉన్న రఘునాథుడు మౌనము వహించెను. ప్రభునిస్థితిని కనుగొని సభలోనివారందరు విచారమున మునిగిరి.

ఇంతలో జనకునిదూతలే ఏతెంచిరి. వారిరాకనువిని వసిష్ఠముని వెంటనే వారిని పలిపించెను. దూతలువచ్చి ప్రణామము చేసిరి. రామునిచూచి, అతనియొక్క మునివేషమునుకాంచి వారు మిక్కిలి దుఃఖించిరి. విదేహభూపాలుని కుశలవార్తలను తెలుపుడని దూతలను మునివరుడు ప్రశ్నించెను. మునియొక్క ప్రశ్నలనువిని దూతలు సిగ్గుతో, నేలపై తలవంచి నమస్కరించి, చేతులు జోడించి ''స్వామీ, సాదరముగా నీవు కావించిన ప్రశ్నచేతనే ఎల్లరు కుశలము, లేనిచో, ప్రభూ, కోసలనాథునితోనే కుశలమంతయు చనెను. జగము సర్వము అనాథ అయ్యెను. మిథిల, అయోధ్యలు అమితముగా అనాథ లయ్యెను. కోసలపతియొక్క మృతినిగురించి విని మిథిలాపురజనులు ఎల్లరు శోకవశమున పిచ్చివారైరి. ఆసమయమున విదేహభూపాలుని చూచినవారు విదేహనామము జనకునికి నిజముగా తగినదని తలచరైరి.

జనకుడు కైక యొక్క కుతంత్రమునుగురించి విన్నాడు. మణిలేని ఫణివలె ఆయన వ్యాకులపడినాడు. 'భరతునికి రాజ్యము ! రఘువరునికి వనవాసము !' అని విని మిథిలేశ్వరుని హృదయమున వేదన కలిగెను. పండితులను, సచివులను జనకుడు సమావేశపరచెను. 'యోచించి, కర్తవ్యమేదియో తెలుపుడు. అయోధ్యయొక్క దుస్థితిని, కలిగినచిక్కును కనుగొని వెడలుటయా లేక వెడలకుండుటయా ? బాగుగా విచారించి, ఉచితమేదియో తెలుపుడు' అని వారిని కోరెను. వెడలవలెననికాని, వలదని కాని వారు ఎవ్వరూ ఏమియు చెప్పరైరి. జనకుడు ధైర్యమువహించి తన మనమున ఆలోచించెను. నలుగురు గూఢచారులను ఆయన అయోధ్యకు పంపించెను. 'మీరు అయోధ్యకువెడలి, భరతునికి రామునియందుకల భావము - సద్భావమో, కాదో - యథార్థమును తెలిసికొని వేగమే తిరిగిరండు. మీ జాడ ఎవ్వరికీ తెలియనీయరాదు సుమా' అని ఆదేశించెను. గుప్తచారులు అయోధ్యకువెడలి, భరతుని నడవడికను గురించి తెలిసికొనిరి. అతడు చిత్రకూటమునకు వెడలెనని తెలిసికొని వారు తిరుహూత పురికి తిరిగివచ్చిరి. భరతుని నడవడికనుగురించి తాము సేకరించిన సమాచారమును తమబుద్ధిని అనుసరించి జనకునిసభలో వారు వివరించిరి. దానిని విని గురువు, పరిజనులు, సచివులు, మహీపతి అందరు చింతించిరి. ప్రేమతో అతి వికలులైరి. జనకుడు ధైర్యమువహించి, భరతుని గొప్పతనము పొగడి ధీరులగు యోధులను, సేనను పిలిపించెను. ఇంటివద్ద, పురమునంతటను, దేశమునందును, రక్షకులను నియమించెను. అశ్వములు, గజములు, రథములు మొదలగు అనేకవాహనములు సిద్ధముచేయించెను. రెండు గడియలలో ముహూర్తము నిర్ణయించి ఆ సమయమున అతడు బయలుదేరెను. దారిలో రాజు ఎచ్చటను విశ్రమించనేలేదు. ఈ ఉదయమున ప్రయాగలో స్నానముచేసి బయలుదేరినాడు. అందరు యమునానదిని దాటిరి. మమ్ములను వార్తలు తెలిసికొనుటకై ముందు పంపిరి. నాథా'' అని ఇట్లు దూతలు నుడివి భూమిపై తలలుంచి నమస్కరించిరి.

మునివరుడు ఆరుగురు, ఏడుగురు కిరాతులను వెంట ఇచ్చి దూతలకు శీఘ్రమే సెలవు ఇచ్చెను. జనకుని రాకనువిని అయోధ్యాపుర జనులందరు సంతసించిరి. రఘునందనునికి మిక్కిలి సంకోచము కలిగెను. సురరాజు ఇంద్రుడు అత్యంత విచారవశుడయ్యెను.

కపలబుద్ధికలిగిన కైకేయి మనస్సున పశ్చాత్తాపముచే కుమిలిపోవుచున్నది. 'ఎవరితో మాటాడను? ఎవరిపై దోషము ఆరోపించను? అని చింతించుచున్నది.

''మంచిదేయైనది - మరి నాలుగునాళ్ళు మనము ఇచ్చట ఉండవచ్చును'' అని స్త్రీలు, పురుషులు అనుకొనుచుండిరి. ఈరీతిని ఆదినముకూడా గడచినది. మరుసటి ప్రాతఃకాలమున అందరు స్నానము కావించి, గణపతిని. గౌరీదేవిని, త్రిపురారిని, ఆదిత్యుని పూజించిరి. రమారమణుని పాదములకు వందనము చేసిరి. పురుషులు రెండు చేతులు జోడించి, స్త్రీలు తమ చేలాంచములనుబట్టి వినతిచేసిరి. ''రాముడు మా రాజు కావలెను, జానకి రాణి కావలెను. రాజధానిఅగు అయోధ్య ఆనందమునకు అవధి కావలెను. ఇక అందరు సుఖముగా ఉండవలెను. రాముడు భరతుని యువరాజు చేయవలెను. ఇట్టి ఆనందామృతమున మేము అందరము మునిగి జగమున జన్మసాఫల్యము పొందునట్లు అనుగ్రహించుడు'' అని వారు ప్రార్థించిరి.

''గురు, సమాజ, సోదరసహితముగా రాముడు అయోధ్యాపురియందు రాజ్యము చేయవలెను. రాముడు రాజై ఉండగానే మేము అయోధ్యయందే మరణించవలెను.'' అని అందరి కోరిక. అయోధ్యాపురజనుల ప్రేమమయమగు వచనములను విని జ్ఞానులగు మునులను తమయోగమును, వైరాగ్యమును నిందించుకొనిరి. ఇట్లు అయోధ్యాపురజనులు నిత్యకర్మలను కావించి, పులకితశరీరులై రామునికి ప్రణామము చేసిరి. గొప్పవారు, కొద్దివారు, మధ్యతరగతివారు, స్త్రీలు, పురుషులు తమతమ యోగ్యతలను, భావముల ననుసరించి రాముని దర్శించిరి. మెలకువతో రాముడు అందరిని సన్మానించెను. ఎల్లరు కృపానిధానమగు రాముని ప్రశంసించిరి. ''చిన్నతనమునుండియు, ప్రేమను గుర్తించుట, నీతిని పాలించుట రఘువరునికి అభ్యాసమే. రాముడు సౌశీల్యసముద్రుడు, శీలసాగరుడు'' అని రాముని గుణగణములను వర్ణించుకొనుచు ఎల్లరు అనురాగభరితులై తమభాగ్యమును కొనియాడుకొనిరి. ''రాముడు తన వారినిగాఎంచు మావంటి పుణ్యమూర్తులు ఈజగమున ఏ కొలదిమందియో !'' అని అనుకొనిరి.

ఆసమయమున అందరు ప్రేమమగ్నులై ఉన్నారు. ఇంతలో మిథిలేశుడు వచ్చుచున్నాడని విని రవికుల కమలభానుడు - రాముడు, సభాసహితముగా, సంభ్రమమున లేచినిలచెను. సోదరులను, మంత్రులను, గురువును పురజనులను వెంటపెట్టుకొని రఘునాథుడు జనకునికి స్వాగతము చెప్పుటకు మందుకునడచెను. జనకభూపాలుడు పర్వతశ్రేష్ఠమును కనుగొనినవెంటనే దానికి ప్రణామముచేసి రథమును విడచివచ్చెను. రామదర్శనలాలసులై, ఉత్సాహమున ఉన్నందున ఎవరికినీ మార్గాయానముకాని, క్లేశముకాని లేశమాత్రమైనను లేదు. వారి మనస్సులన్నియు వైదేహీరఘువరులున్నచోటనే ఉన్నవి. మనస్సులేనిదే తనువునకు సుఖదుఃఖముల స్పృహ ఎవరికి కలుగును?

ఈరీతిని జనకుడు నడచివచ్చుచున్నాడు. సమాజసహితముగా ఆతనియొక్క మతి ప్రేమచే మత్తెక్కిపోవుచున్నది. జనకుడు సమీపించగానే చూచి అందరు ప్రేమ నిమగ్నులైరి. ఉభయపక్షములు కలియగానే సాదరముగా వారు ఒకరినొకరు అభివందనము చేసిరి. జనకుడు మునిజనులపాదములకు వందనము చేసెను. రఘునందనుడు జనకునివెంట వచ్చిన ఋషులకు ప్రణామము చేసెను. తమ్ములతోసహా రాముడు జనక మహారాజునకు నమస్కరించెను. ఆయనను, ఆయనతో వచ్చినవారిని ఆశ్రమమునకు తీసికొనివెడలెను. ఆ ఆశ్రమము శాంతరసమను, పావనజలముతో పరిపూర్ణమైఉన్న ఒక సముద్రమువలె, జనకునిసేన కరుణ అను ఒక నదివలె ఉన్నవి. ఆ నదిని ఆ సముద్రమున విలీనముచేయుటకై రఘునాథుడు తీసికొనిపోవుచున్నాడు.

జ్ఞానవైరాగ్యములను గట్టులను ముంచివేయుచు కరుణ అను ఆ నది ప్రవహించుచున్నది. శోకపూరితవచనములు-నదములు, దానిలో కలియు కాలువలై, విచారమను దీర్ఘనిశ్వాసములు -గాలి వీచుటచే పైకిలేచు తరంగములై, ధైర్యమును గట్లపై ఉన్న ఉత్తమవృక్షములను పెకిలించివేయుచున్నది.

విషమమగు విషాదమే ఆ నదియొక్క వేగమగు ధార. భయము. భ్రమ దానియందలి అసంఖ్యాకములగు సుడిగుండములు, సుడులు. విద్వాంసులరూపమున నావికులు విద్య అను పెద్దనావలతో నిలిచిఉన్నారు. కాని వారు ఈ నావను నడువలేకున్నారు. దానిలోతు వారికి తెలియదు. పాపము ! వనచరులగు కోలులు కిరాతులు - పథికులు. కల్లోలమైన ఆ నదినిచూచి, వారు హృదయమున భయపడి అలసి పోయిరి. ఆ నది ఆశ్రమమను సముద్రములో కలసినపిదప ఆ సముద్రముసహితము కలతచెందినదో అన్నట్లున్నది. ఇరువురు రాచబృందమువారు శోకముచే వ్యాకులపడిరి. ఎవరికినీ జ్ఞానము లేదు. ధైర్యము లేదు. లజ్జయును లేదు. దశరథుని రూప, గుణ, శీలములను ప్రశంసించుచు అందరు రోదనము చేయుచుండిరి. శోకసముద్రములో మునిగిఉన్న ఆ స్త్రీలు. పురుషులు మహావ్యాకులముతో చింతించుచున్నారు. ''ప్రతికూలుడగు విధాత ఎంతపని చేసినాడు!" అని రోషముతో ఎల్లరు విధాతపైననే దోషము ఆరోపించిరి.

సుర, సిద్ధ, తాపస, యోగిజన, మునిగణములలో ఎవ్వరును - ఆ సమయమున విదేహభూపాలునియొక్క స్థితిని చూచి, ప్రేమనదిని దాటకలిగిన సమర్థులు లేరు.

మునివరులు అప్పుడప్పుడు ప్రజలకు మహోపదేశములను చేయుచుండిరి. ''నరేశా, ధైర్యము వహింపుము'' అని వసిష్ఠుడు జనకునితో అనుచుండెను. ఎవనియొక్క జ్ఞానభాస్కరుడు భవమనురాత్రిని పారద్రోలునో. ఎవని 'వచనములు' అనుకిరణములు 'మునులు' అను కమలములను వికసింపచేయునో, అట్టివానిని మోహ, మమతలు సమీపించగలవా? ఇది సీతారాములయందు జనకునికికల ప్రేమమహిమ, జగమున మూడువిధములగు జీవులు కలరని వేదములు నుడువుచున్నవి. (1) విషయాసక్తుడు, )2 సాధకుడు, (3) జ్ఞాని అగు సిద్ధపురుషుడు - వీరు ఆ మూడువిధములగువారు. ఈ మూవురిలో రామునియందు ప్రేమతో తన హృదయమును నింపినవాడుమాత్రమే సాధుసమాజమున కడు ఆదరణీయుడు.

కర్ణధారుడు లేని ఓడవలె రామునియందు భక్తిలేని జ్ఞానము శోభించదు.

వసిష్ఠముని విదేహభూపతిని బహువిధముల ఓదార్చెను. అందరు రామఘట్టమున స్నానముచేసిరి. స్త్రీలు, పురుషులు. సకలజనులు శోకభరితులై ఉండిరి. ఆనాడు నీరునైన సేవించకయే వారు గడపిరి. పశువులు, పక్షులు, లేళ్ళుకూడా మేత మేయలేదు. ఇక ప్రియజనుల, పరిజనులమాట విచారింపనేల?

మరునాటి ప్రాతఃకాలమున నిమిరాజు జనకుడు రఘురాజు రాముడు, వారివారి బృందములు స్నానము చేసిరి. అందరు వటవృక్షచ్ఛాయను కూర్చుండిరి. వారి మనస్సులు ఉదాసీనములై, శరీరములు దుర్బలములై ఉన్నవి.

అయోధ్యాపురజనులు మిథిలానగరనివాసులు అగు బ్రాహ్మణులు, రవివంశగురువు వసిష్ఠుడు. జనకుని పురోహితుడగు శతానందుడు - వీరందరు లౌకిక, పారమార్థిక మార్గములను శోధించినవారే. ధార్మిక, నైతిక, వైరాగ్య, వివేకములను గురించి అనేకవిషయములపై ఉపదేశములను వారు చేసిరి. కౌశికుడు పురాణకథలను సభకు మధురవచనములలో వివరించి తెలిపెను.

అంతట ''నాథా, నిన్నటి దినమంతయు అందరు నీటినైనను సేవింపకయే ఉండిరి'' అని రఘునాథుడు కౌశికునితో అనెను. ''రఘుపతి ఉచితమే వచించెను. రెండున్నర గడియలకాలము గడచెను'' అని విశ్వామిత్రుడు నుడివెను. విశ్వామిత్రుని ఇంగితము తెలిసికొని తిరుహూత ప్రభుడు, జనకుడు''ఇది భుజించుటకు యోగ్యమగు స్థలము కా''దనెను. ఆయన చెప్పినది అందరు మంచిదని ఎంచిరి. ఆనతినికొని అందరు స్నానమునకు వెడలిరి. ఆ సమయమున అనేక విధములగు పండ్లు, పూలు, పత్రములు, కందమూలములు మొదలగునవి కావళ్లలో నింపి, మోపులలోకట్టి వనచరులు తెచ్చిరి. రాముని కృపచే గిరులు కోరినవన్నియు ప్రసాదించుచుండెను. వానిని చూచినచాలు-విషాదములన్నియు పటాపంచలగును. సరస్సులు, తటాకములు, నదులు, వనములు, భూమి భాగములుఅన్నియు ఆనంద. అనురాగముతో పొంగిపొరలుచున్నవి.

లతలు, చెట్లు అన్నియు పూలతో, పండ్లతో నిండిఉన్నవి. పశువులు, పక్షులు, తుమ్మెదలు అనుకూలముగా పలుకుచున్నవి. ఆ సమయమున వనమున ఆనందముతాండవించుచున్నది. సర్వులకు సుఖమునిచ్చు మంద, శీతల, సౌగంధవాయువులు వీచుచున్నవి. ఆవన రామణీయకత వర్ణింప తరముకాదు. భూదేవియే జనకునికి అతిథ్యము ఇచ్చుచున్నట్లున్నది ! ఇంతలో అందరు స్నానముచేసిరి. రాముని, జనకుని, వసిష్ఠుని ఆనతికై కొని రమ్యమగు వృక్షములను కాంచుచు ప్రేమభరితములై వారు అచ్చటచ్చట విడిదిచేసిరి.

పవిత్రము, సుందరము, అమృతసమానము లగు పలువిధ పత్రములను, ఫలములను, కందమూలములను, వనమూలికలను, వసిష్ఠుడు బుట్టలలో నింపించి సాదరముగా అందరికి పంపించెను. పితృదేవతలను, దేవతలను, అతిథులను, గురువులను పూజించి వారు ఆరగించిరి.

ఇట్లు నాలుగురోజులు గడచినవి. రామునిచూచి, స్త్రీలు, పురుషులు ఆనందించుచుండిరి. సీతారాములను తమవెంట తోడ్కొనకయే అయోధ్యకు తిరిగివెళ్లుట ఉచితము కాదని ఉభయపక్షములవారి మనస్సులకు తోచినది. ''సీతారాములతో వనవాసము కోటి దేవలోక నివాస సౌఖ్యమునిచ్చును. సీతా, రామ, లక్ష్మణులను ఇచ్చటవిడచి అయోధ్యయే తమకు ఆనందము కొనువారు దురదృష్టవంతులు. విధాత వారికి విపరీతమైఉన్నట్లే, దైవము అనుకూలుడైనప్పుడే రాముని సమీపమున నివాసప్రాప్తి మనకు కలుగును. మందాకినీ నదియందు త్రికాలములయందు స్నానము, ముదమంగళపుంజ స్వరూపుడగు రాముని సందర్శనము, రామగిరి వన, తాపసస్థల విహారము, అమృతోపమ, కందమూల, ఫల ఆహారము, పదునాలుగు సంవత్సరములు సుఖముగా నిమిషమువలె మనకు తెలియకుండనే గడచిపోవును. మనకు అంతటి సౌఖ్యమా! దానికి అర్హులమా మనము?'' అని అందరు అనుకొనిరి. ఇరుపక్షములవారికి రామ చరణములయందు సహజ స్వాభావిక అనురాగము అట్టిది :

ఇట్లు ఎల్లరు తమ తమ మనోరథములను సృజించుకొనుచుండిరి. వారి ప్రేమయుతమగు వచనములు మనోహరముగా ఉన్నవి.

సీతయొక్క తల్లి తన దాసీలను దశరథుని రాణులవద్దకు పంపెను. అది అనుకూలమగు సమయమని వారు తిరిగివచ్చి ఆమెకు నివేదించిరి. జానకియొక్క అత్తలెల్లరు సావకాశముగా ఉన్నారని విని జనకుని రాణివాస స్త్రీలు వారిని చూచుటకు వచ్చిరి. కౌసల్య వారిని సాదరముగా సన్మానించెను. సమయోచితముగా వారిని ఆసీనులచేసెను. ఉభయపక్షముల వారియొక్క శీలమును, ప్రేమను వినినచో, కనినచో, చాలు. కఠోరమగు వజ్రముకూడా కరగి నీరైపోవును. అందరు పులకిత, శిథిల శరీరులై ఉన్నారు. వారి కన్నులనుండి నీరు ప్రవహించెను. ఎల్లరు తమ కాలిగోళ్లతో నేలపై గీయసాగిరి. చింతింపసాగిరి.

వారందరు మూర్తీభవించిన సీతారాముల ప్రేమవలె ఉన్నారు. కరుణయే స్వయముగా బహువేషములను ధరించి దుఃఖించుచున్నదో అనునట్లున్నది.

''విధాతబుద్ధి బహువక్రమైనది. పాలనురుగును కూడా వజ్రపు ఉలితో పగులగొట్టును, అమృతమును గురించి విందుము, కాని గరళమును ప్రత్యక్షముగా కనుగొందుము. విధాతయొక్క కృత్యములన్నియు భయంకరమైనవి. ఎక్కడచూచినను కాకులు, గుడ్లగూబలు, కొంగలే కనుపించును. హంసలు, మానస సరోవరమునందే కాననగును'' అని జానకి తల్లి సునయన అనెను.

ఈ పలుకులు విని శోకముతో సుమిత్రాదేవి ''విధాతయొక్క గతి అతి విపరీతమైనది. విచిత్రమైనదియును. ఆతడు సృజించును. పాలించును. హరించును. ఆతని మతి చిన్నపిల్లల ఆటవలె వివేకరహితమైనది'' అని వచించెను.

అంతట కౌసల్య : ''దోషము ఎవ్వరిదీకాదు. సుఖదుఃఖములు, లాభనష్టములు అన్నియు మన కర్మఫలములు. కఠినమగు కర్మయొక్క గతి మనకు తెలియరాదు. శుభాశుభ ఫలప్రదాత అగు విధాతకే అది తెలియును. ఈశ్వరాజ్ఞకు అందరు వశులే. ఉత్పత్తి. స్థితి, లయము, అమృతము, విషము, అన్నియుఅట్లే దైవాధీనములు. దేవీ, మోహవశమున చింతించుట వ్యర్థము. విధాతయొక్క చర్యలు, శాశ్వతమైనవి. మార్పులేనివి. మహారాజుయొక్క జీవితమును, మరణమును గురించియే మన హృదయమున చింతించుచున్నామనినచో-ఆతని మరణమువలన మనకు నష్టము వాటిల్లినదనియే !'' అనెను సత్య, సుందరవాణితో సీతయొక్క మాత అనెను:- ''నీవు వచించినది సత్యము. ఉత్తమము. పుణ్యాత్ముల అవధి రూపమగు అయోధ్యాపతియొక్క రాణివి కదా నీవు!'' అని.

దుఃఖభరితహృదయముతో కౌసల్య:- ''సీతారామ, లక్ష్మణులు, వనమునఉన్నచో పరిణామము శుభ పదమే అగును. ఎన్నటికి అశుభము కానేరదు. భరతునిగురించి మాత్రమే నా చింత. ఈశ్వరప్రసాదమున, నీ ఆశీర్వాదమున నా కొడుకులు, కోడళ్లు గంగానదీ జలములవలె పవిత్రులు. సఖీ, ఎన్నడునూ నేను రామునిపై ఒట్టు పెట్టుకొనలేదు. నేడు అట్లు కానించి సత్యము వచింతును. భరతునిశీలము, గుణము, వినయము. మహిమ, భ్రాతృత్వము, భక్తి, విశ్వాసము, మంచితనములను వర్ణించుటకు శారద యొక్క బుద్ధికూడా సంకోచించును. ముత్యపుచిప్పతో సముద్రపు నీటినిగూడ వేయగలమా? భరతుడు సదా కులదీపకుడని నాకు తెలియును. భూపాలుడు సహితము నాకు పదే పదే ఇట్లు చెప్పెను. గీటు రాయిపై గీచినపిదప బంగారము యొక్కయు, రత్నపరీక్షకుడు పరీక్షించిన పిదప రత్నము యొక్కయు విలువ తేలును. అట్లే పరీక్షాసమయము వచ్చిన అనంతరమే పురుషుని స్వభావము తెలియనగును. ఇట్లు నేను నేడు పలుకట అనుచితమే. శోకమువలన, ప్రేమచేత వివేకము క్షీణించును'' అనెను.

కౌసల్య పలకిన గంగాజలతుల్యమగు పావన వచనములను విని రాణులెల్లరు ప్రేమవశమున వికలులైరి. కౌసల్య ధైర్యము వహించి ఇట్లు నుడివెను :-

''దేవీ, మిథిలేశ్వరీ, వినుము. వివేకనిధి అగు జనకుని ప్రియపత్నిని. నీకు ఉపదేశించ గలవార్వెరు? రాణీ, లక్ష్మణుని ఇంటికి మరలుమని, భరతుని అడవులకు చనుమని చెప్పుయమని రాజునకు నీ సూచనగా తగు అవకాశముచూచి చెప్పుము. రాజు యొక్క మనస్సునకు ఇది రుచించినచో చక్కగా యోచించి తగు ప్రయత్నము చేయుమనుము. భరతునిగురించియే నాకు అమితమగు విచారము. అతని మనస్సున నిగూఢమగు ప్రేమ కలదు. అతడు ఇంటివద్ద ఉండుట మంచిదని నాకు తోచుటలేదు.''

కౌసల్యయొక్క స్వభావమును కనుగొని, ఆమె నుడివిన సరళ సద్వచనములను విని రాణులెల్లరు కరుణ రసమగ్నులైరి. ఆకాశము నుండి పుష్పవృష్టి కురియ మొదలిడెను ''ధన్యురాలు, ధన్యురాలు'' అను ధ్వని వెలువడినదది. సిద్ధులు, యోగులు, మునులు ప్రేమచే క్రుంగిపోయిరి. ఆ దృశ్యమునుచూచి రాణివాసమంతయు స్తబ్ధులైరి. అంతట ధైర్యము వహించి సుమిత్ర ''దేవీ, రాత్రి రెండు జాములైనది''అనెను. ఈ మాటలు రామమాత విని ప్రేమపూర్వకముగా లేచెను. ప్రేమసహిత సద్భావముతో ఆమె ''వెంటనే మీరు మీ మీ గుడారములకు విచ్చేయుడు. ఇక మనకు ఈశ్వరుడే గతి. మిథిలేశ్వరుడే సహాయకుడు'' అని వచించెను. ఆమెయొక్క ప్రేమనుచూచి, వినయవచనములను ఆలకించి జనకుని ప్రియసతి కౌసల్యయొక్క పవిత్ర పాదములను పట్టుకొనెను. ''దేవీ, దశరథుని రాణివి. రాముని తల్లివి నీవు. ఇట్టి నమ్రత నీకు తగినదే తన నీచసేవకు జనులను సహితము ప్రభువు ఆదరించును. ధూమమును అగ్ని, తృణమును గిరి తమ శిరములపై ధరించును. జనక మహారాజు మనసా, వాచా, కర్మణా మీ సేవకుడు. భవానీ, మహేశ్వరులు సదా మీ సహాయకులు. మీకు సహాయకులగు యోగ్యత జగమున ఎవ్వరిగికున్నది? దీపపు సహాయముచే సూర్యునికాంతి అధిక మగునా? రాముడు వనములకేగి. దేవతాకార్యమును నిర్వహించి, అయోధ్యకు తిరిగి వచ్చి స్థిరముగా రాజ్యమును పాలించును. అమరులు, నాగులు, నరులు ఆతని బాహు బలముచే తమ తమ స్థానములలో సుఖముగా ఉందురు. ఈ విషయము సర్వము యాజ్ఞవల్క్యముని పూర్వమే వచించెను. దేవీ, మునియొక్క కథనము వృథా కానేరదు'' అని ఆమె నుడివెను.

ఇట్లు పలికి అత్యంత ప్రేమతో సునయన కౌసల్యయొక్క చరణములపై పడి సీతను తనవెంట తీసికొనపోవుటకు అనుమతికోరెను. అనుమతిపొంది సీతను ఆమె తన విడిదికి గైకొని వెడలెను. తన ప్రియ పరిజనమునకు వైదేహి వారి వారికి తగు విధముగా అభివంతనము చేసెను. తపస్వినీ వేషమునఉన్న జానకినిచూచి అందరు అత్యంత విషాదమున వ్యాకులపడిరి.

రామునియొక్క గురువగు విసిష్ఠునియొక్క ఆనతిని కొని జనకుడు గుడారమునకుచని సీతను చూచెను. తన పవిత్ర ప్రేమకు, ప్రాణమునకు ప్రియఅతిథి అగు జానకిని-తన పుత్రికను జనకుడు తన హృదయమునకు హత్తుకొనెను. జనకుని హృదయమున అనురాగ జలధి పొరలెను. అతని హృదయము ప్రయాగవలె ఉండెను.

సీత యందలి ప్రేమరూపమున అక్షయ వటవృక్షము అభివృద్ధి చెందుచు కనుపించెను. దానిపై రామభక్తి అను బాలుడు శోభిల్లుచున్నాడు. జనకుని జ్ఞానమనబడు చిరంజీవి మార్కండేయ ముని కలవరపడి మునుగనుండగా వటపత్రశాయి అగు బాలుని సహాయము ప్రాపించెను. రక్షణ లభించెను.

విదేహ భూపాలుని బుద్ధి మోహమున మునుగలేదు. సీతారఘువీరుల యందలి భక్తియొక్క ప్రభావము అట్టిది.

తల్లితండ్రులయొక్క ప్రేమవశమున సీత కడు వ్యాకులపడెను. తనను తాను సంబాళించుకొనలేక పోయెను. కొంత తడవునకు సమయమును, పద్ధర్మమును యోచించి భూసుత ధైర్యము వహించెను.

సీత ధరించిన తపస్వినీ వేషమునుచూచి జనకుడు అత్యంతప్రేమను సంతృప్తిని కాంచెను.

''కుమారీ, ఉభయ వంశములను నీవు పావన మొనరించితివి. నీ నిర్మల కీర్తి సకల జగమును ప్రకాశింపచేసినదని లోకమెల్లరు నుడువుచున్నారు. నీకీర్తి అను నది సురనదని సహితము జయించి బ్రహ్మాండ కోటియందు ప్రవహించుచున్నది. అవనీతలమున గంగానది మూడు స్థలములను మాత్రమే పావనము కావించినది. కాని నీకీర్తినది సాధు సమాజములనబడు అనేకతీర్థములన మహిమను ఇనుమడింపచేసినది'' అని సత్య, ప్రేమ సమ్మిళితమగు సుందర వాగ్ధాటితో జనకుడు జానకినిగురించి వచించెను. తండ్రి తనను పొగడగా విని సీత సిగ్గుతో చిన్నవోయెను. తల్లిదండ్రులు మరి ఒకసారి ఆమెను తమ హృదయములకు హత్తుకొనిరి. హితము బోధించి ఆమెను దీవించిరి.

సీత ఏమియు మాటలాడలేకపోయెను. రాత్రివేళ ఇచ్చట ఉండుట భావ్యము కాదని ఆమె తలచెను. జానకియొక్క ఇంగితమును ఆమెతల్లి గ్రహించెను. తమ కుమార్తెయొక్క వినయ, సౌశీల్యములను ఆమె జనకుని తెలిపెను. సీతను పలుమారులు కౌగిలించుకొని, సన్మానించి వారు వీడ్కోలు పలికిరి. నిపుణురాలగురాణి సమయము కనుగొని భరతునియొక్క స్థితిని తన భర్తకు మృదువచనములలో వర్ణించెను. సుగంధమువలె పరిమళ##మై, సువర్ణమువలె స్వచ్ఛమై సుధవలె జీవనప్రదమై, చంద్రుని వలె ఉజ్జ్వలమై విలసిల్లు భరతుని శీలమును గురించి జనకుడు వినెను. ఆతడు నీటితో నిండిన తనకండ్లను మూసికొనెను. పులకిత శరీరుడయ్యెను. ముడితమానసుడయ్యెను. అతడు భరతుని సత్కీర్తిని ఇట్లు ప్రశంసింప సాగెను. :-

''సుముఖీ, సులోచనీ, జాగరూకతతో వినుము. భరతుని చరిత భవబంధ విమోచని. ధర్మ, రాజనీతి, బ్రహ్మవిచారములలో నాబుద్ధిని అనుసరించి. నేనునూ కొంత తెలిసికొంటిని. కాని, నా బుద్ధి భరతుని మహిమను వర్ణింపజాలదు. కపటముచే అది అతని మహిమయొక్క ఛాయనైనను స్పృశించజాలదు. బ్రహ్మ, గణపతి, శేషుడు, శివుడు, శారద, కవులు, జ్ఞానులు, పండితలు, బుద్ధివిశారదులు, వీరెల్లరికి భరతుని నడవడిక, కీర్తి, భక్తి, ధర్మము, శీలము, గుణము విమలఐశ్వర్యము వినుటకు, యోచించుటకు ఆనందప్రదములు. పవిత్రతయందు అవి గంగానదిని, మాధుర్యమున సుధను, సహితము తిరస్కరించును భరతుడు అమిత గుణసంపన్నుడు. నిరుపమ సత్పురుషుడు. భరతునికి భరతుడేసాటి అని గ్రహించెను. సుమేరు పర్వతమును, సేరుతూకముతో పోల్చవచ్చునా? భరతుని పరులతో పోల్చుటకు కవికులము శక్తివిహీనమయ్యెను. భరతుని మహిమ వర్ణించుట, నమణీమణీ, నీరులేని నేలపై చేపనడచుట వంటిది. అసాధ్యమైనది. రాణీ, వినుము. భరతుని యొక్క అమితమహిమ ఒక్క రామునికే తెలియును. ఐనను రాముడునూ దానిని వర్ణింపజాలడు.''

ప్రేమయుతుడై భరతుని ప్రభావమును వర్ణించి, తన పత్నియొక్క మనస్సును తెలిసికొని జనక భూపాలుడు ఇంకనూ, ఇట్లు నుడువసాగెను:-

''లక్ష్మణుడు అయోధ్యకు మరలుచో, భరతుడు వనములకు చనుచో సర్వులకు మేలు కలుగవచ్చును. అందరి కోరికయు ఇదియే. కాని, దేవీ, భరత రఘవరుల పరస్పరప్రేమ, విశ్వాసములు అతీతములైనవి. సమతకు అవధి రాముడైనచో ప్రేమకు, మమతకు భరతుడుసీమ. పారమార్థిక, స్వార్థ సుఖములవంకకు భరతుడు తన మనస్సును స్వప్నముననైనను మరల్చలేదు. రామచరణములయందు భక్తియే భరతునియొక్క సాధన, సిద్ధియు, నాకు కనుపించుచున్న భరతునియొక్క సిద్ధాంతము ఇది ఒక్కటే!"

జనకభూపాలుడు ప్రేమచే గద్గడుడై ''పొరపాటుననైనను భరతుడు రాముని ఆజ్ఞను తిరస్కరింప తలచడు. కనుక ప్రేమవశమున మనము చింతింపరాదు'' అనెను.

రామ, భరతుల సద్గుణములను గురించి ప్రేమపూర్వకుముగా చర్చించుచుండగా సతీపతులకు క్షణమువలె ఆరాత్రి గడిచెను. ఇరుపక్షములవారు మరునాటి ప్రాతఃకాలమున నిద్రమేల్కొని, స్నానముచేసి దేవతాపూజ కావింపమొదలిడిరి. రఘునాథుడు స్నానముకావించి గురువును సమీపించెను. గురు చరణములకు అతడు వందనము చేసెను. గురుని ఇంగితమును గ్రహించి ''స్మామీ, భరతుడు, అయోధ్యాపురజనులు, తల్లులు శోకముచే వ్యాకులపడిఉన్నారు. వనవాసముచే దుఃఖితులైఉన్నారు. మిథిలేశుడగు జనకభూపతియు, ఆతని బృందము బహుదినములనుండి క్లేశములను సహించుచున్నారు. నాథా, యుక్తమగు దానిని ఆచరింపుము. అందరియొక్క హితము నీ చేతిలో ఉన్నది'' అనెను. ఇట్లు వచించి రఘానాథుడు కడు సంకోచించెను.

రాముని శీలస్వభావములను కనుగొని వసిష్ఠముని పులకితుడయ్యెను.

''రామా, నీవులేనిదే ఇరుపక్షములవారి సర్వసుఖసాధనములు నరకతుల్యములు, రామా, నీవు వారప్రాణములకు ప్రాణమవు. ఆత్మకు ఆత్మవు. సుఖములకు సుఖమువు. తండ్రీ, నిన్ను త్యజించి, తమఇంటినే సుఖమని తలచువారికి విధి విపరీతము. రామచరణ పంకజములయందు భక్తి లేనివారి సుఖము, ధర్మము, కర్మలు నాశనము కానిమ్ము. రామునియందు భక్తిప్రధానము కానివానియోగము- దుష్టయోగము. అట్టివాని జ్ఞానము అజ్ఞానమే.

నీవులేనిచో అందరు దుఃఖింతులే. నీవలననే ఎవరైనను సుఖులగుదురు. సకల హృదయములు, సర్వవిషయములు నీకు తెలియును. నీ ఆనతిని ఎల్లరు శిరములధరింతురు. కృపాళుడవగు నీకు అందరి మనోభావములు బాగుగా తెలియును. నీవు ఆశ్రమమునకు విచ్చేయుము'' అని ఇట్లు వచించి మునిరాజు ప్రేమమగ్నుడయ్యెను.

అంతట రాముడు ప్రణామము చేసి వెడలెను. ధైర్యమువహించి వసిష్ఠఋషి జనకునివద్దకు ఏతెంచి రాముని శీల, స్నేహయుతములగు మంజులవచనములను తెలిపెను.

''రాజా, నీవు జ్ఞానినిధివి. సజ్జనుడవు. పవిత్రుడవు. ధర్మధీరుడవు. ఈ సమయమున నీవుతప్ప ఈ చిక్కును విడదీయగల సమర్థుడెవవు?'' అని వసిష్ఠుడు జనకునితో నుడిపెను.

వసిష్ఠమునియొక్క వచనములను విని జనకుడు అనురాగమగ్నుడయ్యెను. జనకునిస్థితిని కనుగొని జ్ఞాన, వైరాగ్యములకు సహితము వైరాగ్యముజనించి అవి పలాయనమయ్యెను. జనకుడు ప్రేమవశమున కృంగిపోయెను. ''నేను ఇక్కడకు రాకనే ఉండవలసినది. నా రాక మంచిదికాదు.'' అని ఆతడు తన మనస్సున విచారింపసాగెను.

''దశరథమహారాజు రాముని అడవులకు పొమ్మని తన జీవితమునే అర్పించి తన ప్రేమను నిరూపించుకొన్నాడు. ఇక మేమో రాముని ఒక వనమునుండి మరి ఒక వనమునకు పంపి మా వివేకమహత్వమును వీక్షించి, ఆనందించుచు ఇంటికి మరలు చున్నాము'' అని అతడు చింతింపమొదలిడెను.

తాపసులు, మునులు, మహీసురులు అంతయు విని, జనకుని స్థితిని కనుగొని, ప్రేమవశమున అతి కలత చెందిరి. కాని- సమయమును గుర్తెరిగి జనకమహీపతి ధైర్యమువహించి, తన బృందముతోకలసి భరతునివద్దకు అరిగెను. భరతుడు ఎదురుగావచ్చి జనకునికి స్వాగతము చెప్పెను. సమయానుకూలమగు ఆసనము సమర్పించెను.

''నాయనా, భరతా'' అని తిరుహూతపతి జనకుడు ''రఘువీరునిస్వభావము నీకు తెలియును. రాముడు సత్యవ్రతుడు. ధర్మనిరతుడు. ఎల్లరకు ప్రేమపాత్రుడు. శీలవంతుడు. ఎట్లి కష్టములను సహించుటకైనను వెనుదీయడు. నీ నిర్ణయమును తెలుపుము'' అనెను.

జనకుని పలుకులనువిని భరతుడు పులకిత శరీరుడయ్యెను. అతని కన్నులనుండి నీరు ప్రవహించెను. అమితధైర్యమువహించి అతడు ''ప్రభూ, మాకు పితృసముడవు నీవు. ప్రియుడవు. పూజ్యుడవు. మా కులగురువగు వసిష్ఠునివలె జననీ జనకులైనను మా మంచిని కోరువారు కారు. నేడు ఇచ్చట కౌశికాది మునిబృందములు, సచివులు ఉన్నారు. జ్ఞానసాగరుడవు నీవు ఉన్నావు. స్వామీ, నన్ను నీ శిశువుగా, సేవకునిగా, అనుగామిగా ఎంచి నాకు ఉపదేశించుము. ఇట్టి సమాజమున, స్థలమున నీవంటి వారు నన్ను అడుగుటయా! నేను మౌనము వహించుచో నన్ను చెడ్డవాడని తలతురు. ఒకవేళ ఏదైనా పలికినచో అది నా పిచ్చియే అగును. ఈ నా చిన్ననోటితో పెద్ద మాటలు పలుకుచున్నాను. తండ్రీ, విధాత నాకు ప్రతికూలుడు. ఈ విషయమును ఎఱిగి నన్ను క్షమింపుము.

సేవాధర్మము కఠినమైనదని లోకమెరుగును. వేద. శాస్త్ర, పురాణములలో సహితము ఇది ప్రసిద్ధమే. స్వామి ధర్మమునకు స్వార్థమునకు సగమెఱుక. ద్వేషము గ్రుడ్డిది. ప్రేమ చెవిటిది. జ్ఞానములేనది. నేను పరాధీనుడను. రాముని అభిప్రాయమును, ఆతని ధర్మమును, వ్రతమును మన్నించుము. నేను పరాధీనుడనని గుర్తుంచుకొనుము. రాముని ఇంగితమును గ్రహించి, సర్వులకు సమ్మతమగుదానిని, సర్వహిత కరమగుదానిని, ఎల్లరప్రేమను ఎఱిగి ఆచరింపుము'' అనెను.

భరతుని మాటలనువిని, ఆతని స్వభావము కనుగొని జనకుడు, ఆతని బృందము ఆతనిని కొనియాడిరి. భరతుని వచనములు సుగమములు, అగమములు, మృదులములు, మంజులములు, కఠోరములును, వానియందలి అక్షరములు కొలదియే. వాని అర్థముమాత్రము అపరిమితము. మన చేతియందలి అద్దములో మన ముఖము కనుపించును. కాని అది మనచేతికి చిక్కదు. ఆవిధముగానే భరతునియొక్క అద్భుత వాణియు గ్రహింప అశక్యము.

అంతట భరతుడు. జనకభూపాలుడు, ముని, సమాజసమేతముగా దేవతా కుముద చంద్రుడగు రామునివద్దకు ఏగిరి. ఈ వార్తను విని తొలకరివానకు చేపలు వ్యాకులవడునట్లు అందరు విచారమున కలతచెందిరి.

కులగురువగు వసిష్ఠుని స్థితిని మొదటచూచి, తదుపరి విదేహభూపాలుని ప్రేమను వీక్షించి, పిదప రామభక్తిమయుడగు భరతుని కనుగొని స్వార్థపరులగు దేవతలు కలవరపడి హృదయములయందు నిరాశ##చెందిరి. ఎల్లరు రామప్రేమయందు నిమగ్నులైనట్లు వారు కనుగొనిరి. సురలెల్లరు విచారమున మునిగి కలతచెందిరి.

చింతాయుతుడై ఇంద్రుడు--''రాముడు ప్రేమ, సంకోచపూరితుడై ఉన్నాడు. మనము అందరముకలసి ఏదేని ఒక పన్నాగము పన్నవలెను. లేనిచో మనలక్ష్యము నాశనమగును'' అనెను. దేవతలు శారదను స్మరించిరి. ఆమెను స్తుతించిరి. ''దేవీ, నీ శరణుకోరి దేవతలము వచ్చితిమి రక్షింపుము. నీ మాయను సృజింపుము. భరతుని బుద్ధిని మరల్పుము'' అని ప్రార్థించిరి.

దేవతల వినతిని విని నేర్పరి అగు దేవి ''ఈ దేవతలు ఇంతే. స్వార్థపరులు, మూర్ఖులు!'' అని తలచెను. ఇట్లు ఆమె పలికెను. ''భరతుని బుద్ధిని మార్చుమని నన్ను కోరుచున్నావు. ఇంద్రా, వేయికన్నులున్నవి నీకు. కాని సుమేరుపర్వతమునే చూడలేకున్నావు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులమాయ అతి బలీయమైనది. అదియు భరతుని బుద్ధివంక కన్నెత్తియైనను చూడలేదు. అట్టి భరతుని బుద్ధిని వంచింపుమని నన్ను వేడుచున్నావు. చండకరుడగు సూర్యుని ఎన్నడైన వెన్నెల దొంగిలించకలదా? భరతుని హృదయమున సీతారాములు వసింతురు. సూర్యకిరణము లున్నచోట చీకటి ప్రవేశింపకలదా?'' అని నుడివి శారద బ్రహ్మలోకమునకు వెడలినది. రాత్రివేళ చక్రవాకమువలె దేవతలందరు కలతచెందిరి. దుర్బుద్ధికలవారు, స్వార్థపరులు అగు సురలు దురాలోచనలు సలిపిరి. కుతంత్రముపన్నిరి. ప్రబలమగు మాయాజాలమును సృజించిరి. భయము, భ్రమ, విచారము, వ్యధ, ఉచ్చాటనలను వ్యాపింపచేసిరి. కార్య సాధన కాని, కార్యభంగము కాని రెండును భరతునిచేతిలోనే ఉన్నవని ఇంద్రుడు కుతంత్రముపన్ని ఆలోచించుచుండెను.

జనకుడు రఘునాథుని సమీపించెను. రవికులదీపకుడగు రాముడు ఆయనను సన్మానించెను. రఘువంశ పురోహితుడగు వసిఘడు సమయ, సమాజ, ధర్మానుకూల ములగు వచనములన నుడివెను. జనక-భరత సంవాదమును తెలిపెను. భరతుడు చక్కగా చెప్పినదంతయు ఆ ముని విచారించెను. ''నాయనా, రామా, నీవు ఏ ఆనతి ఇత్తువో దానినే అందరు ఆచిరింపవలెను. ఇదియే నా అభిప్రాయము'' అని వచించెను.

రఘునాథుడు అంతయు వినెను. తన రెండుచేతులను జోడించెను. సత్య, సరళ, మృదు, వాణిని అతడు ఇట్లు పలికెను. ''తమవంటి, మిథిలేశ్వరునివంటి విద్యావంతుల సమక్షమున నేను వచించుట అన్నివిధములను అనుచితము. తమరు, మహారాజు. ఏ ఆనతి ఇచ్చిననూ - అది అందరికి శిరోధార్యమే, ప్రమాణముచేసి నేను చెప్పుచున్నాను.''

రాముని శపథమును విని సభలోనివారందరు, ముని, జనకుడు స్తబ్ధులైరి. అందరు భరతునివంకనే చూచుచున్నారు. ఎవరినోటినుండియు ప్రత్యుత్తరము వచ్చుట లేదు.

సభ అంతయు కలతచెందిఉన్నట్లు భరతుడు కనుగొనెను. రాముని సోదరుడగు ఆతడు అత్యంతధైర్యము వహించెను. అది తగు సమయముకాదని తలచెను. పెరిగిపోవుచున్న వింధ్యగిరిని అగస్త్యుడు నిరోధించినట్లు పొంగుచున్న తనప్రేమను భరతుడు నిరోధించుకొనెను. హిరణ్యాక్షుడు భూగోళమునువలె అందరియొక్క మతిని శోకము హరించెను. ఆ సమయమున జగద్యోనినుండి విశాలవరాహమువలె - భరతుని నిర్మల గుణగణములనుండి వివేకము ఉదయించి అనాయాసముగా వారిని ఉద్ధిరించెను.

భరతుడు చేతులు జోడించి ఎల్లరకు ప్రణామముచేసి జనకభూపతికి వసిష్ఠునికి సాధుసమాజము అందరికి వినతి చేసెను. ''నేటి నా ఈ అత్యంత అనుచిత చర్యకు నన్ను క్షమించుడు. మృదువైన వదనమునుండి కఠోరమగు వచనములు వచించుచున్నాను.'' అనెను. శారదాసుందరిని అతడు తన మనమున స్మరించెను. అతని మానససరోవరమునుండి ఆ దేవి ఆవిర్భవించెను. భరతుని ముఖపంకజమున ఆమె ప్రవేశించి తాండవించెను. వినుల, వివేక, ధర్మ, నీతి సంభరితమగు భరతుని వాణి అను మంజులమరాళి సభలోనివారెల్లరు ప్రేమతో కృంగిఉన్నట్లు వివేకమను కన్నులతో కనుగొన్నది. సభలో ఎల్లరు ప్రేమతో కృశించిఉన్నారు. భరతుడు అందరికి ప్రణామము చేసెను. సీతారాములను స్మరించెను. ఇట్లు వచించెను. :-

''ప్రభూ, నీవే నా తండ్రివి. తల్లివి. మిత్రుడవు, గురుడవు. స్వామివి, పూజ్యుడవు, నాకు పరమ హితుడవు. నా అంతర్యామివి. సరళ హృదయుడవు. చక్కని స్వామివి. శీల నిధివి. ప్రణతార్త రక్షకుడవు. సర్వజ్ఞుడవు. సజ్జనుడవు. సమర్థుడవు. శరణాగత హితకరుడవు. సద్గుణములను సమాదరించువాడవు. దుర్గుణ ములన, పాపములను హరించువాడవు. స్వామీ, నీ వంటి వాడవు నీవు ఒక్కడవే. స్వామి ద్రోహమున నాకు నేనే సాటి.

మోహవశుడనై నేను నీ మాటను. తండ్రిమాటను మీరి ఈ బృందమును వెంట తీసుకొని ఇక్కడకు వచ్చితిని. లోకమున మంచివారు, చెడ్డవారు. ఎక్కువ వారు-తక్కువవారు, అమృతము, అమరపదవి. విషము, మృత్యువు మొదలగునవి ఎన్నో ఉన్నవి. కాని రాముని ఆనతిని మనసుననైనను అతిక్రమించ గలవానిని నేను ఎన్నడు చూడలేదు. విననూలేదు. సకల విధముల నేను అనుచితమగు సాహసమునే ఆచరించితిని. ఐనను నా సాహసమును భక్తి అనియు, సేవ అనియు నీవు మన్నించితివి.

నాథా, నీ కృపచే, నీ మంచితనముచే నాకు మేలు చేసితివి. దానిచే నా దూషణములు భూషణములే యైనవి. నాకీర్తి నలుదెసల వ్యాపించినది. నీ ప్రవర్తన, స్వభావ మహిమ జగద్విదితములు. వేదములు, శాస్త్రములు వానిని వర్ణించినవి. క్రూరులు, కుటిలస్వభావులు, ఖలులు, కుమతులు, కళంకులు, నీచులు, శీలరహితులు, నిరీశ్వరవాదులు, సాహసులు సహితము 'శరణ'ని నీ సమ్ముఖమునకు వచ్చి, ఒక్కసారి నీకు ప్రణామము చేసిరేని నీవు వారిని నీ వారిని చేసికొందువు. శరణాగతుల దోసములను చూచియు నీవు వానిని నీ హృదయమున పరిగణింపవు. శరణాగతుల సద్గుణములను గురించి విని, వారిని సాధు సత్పురుష సమాజములో ప్రశంసింతువు. సేవకులపై ఇట్లు దయచూపు స్వామి ఇంకెవ్వడున్నాడు? సేవకులయొక్క అవసరములనుతీర్చు నాథుడు మరి ఒకడు ఎవ్వడున్నాడు? సేవకులకు చేసిన మేలును స్వప్నముననైనను నీవు పరిగణింపవు. నీ సేవకులయొక్క వ్యథను విచారించి నీ హృదయమున విచారింతువు. ఇట్టి స్వామి నీవు తప్ప ఇంకొకడు లేడని చేతులెత్తి ప్రమాణముచేసి చాటుదును.

పశువులు నాట్యమాడును. చిలుకలు నేర్చిని మాటలు పలుకుటయందు ప్రావీణ్యత కలవి. కాని, చిలుకల పలుకులు వానిని పలికించువాని అధీనములు. పశువుల నాట్యము - ఆడించు వాని ఆధీనము. అట్లే సేవకులన సంస్కరించి, సన్మానించి, వారిని నీవు సాధు-శిరోమణులను చేతువు. కృపాశుడవు నీవు తక్క నీ బిరుదావళిని మరి ఎవ్వరు ఆవశ్యము పాలింతురు? శోకముచేతనో, లేక ప్రేమ వలననో, లేక బాల్య స్వభావముననో నేను నీ ఆనతిని మీరి వచ్చితిని. ఐనను. కృపాళుడు నన్ను తన హితునిగి ఎంచి నా చర్య మంచిదని తలచెను. సర్వవిధముల నా మేలునే ఎంచెను. సకల సన్మంగళములకు మూలమగు నీ పాదములను సందర్శించితిని. స్వామి నా యందు సహజముగనే అనుకూలుడని తెలిసికొంటిని. ఇంత పెద్ద పొరపాటు జరిగినను స్వామికి నా యందు ఎంత అనుగ్రహము! ఈ మహా సమాజమున నా భాగ్యమును కనుగొంటిని. అంతేకాడు. కృపానిధి నాపై సకలవిధముల పరిపూర్ణ కృపను, అనుగ్రహమును మిక్కుటముగా చూపినాడు. స్వామీ, నీ శీల స్వభావములచే, మంచితనముచే నన్ను లాలించితివి. స్వామి ఉన్నాడని, సమాజము ఎదుట ఉన్నానని సంకోచింపక, ప్రభూ, వినయముననో, అవినయముననో నా ఇష్టము వచ్చినట్లు నుడివితిని. సాహసించితిని, దేవా, నా ఆర్తిని గ్రహించి నన్ను క్షమింపుము. బుద్ధిమంతుడు, సుహృదయుడు, ఉత్తముడు అగు యజమాని ఎదుట అతిగా మాట్లాడుట మహా అపరాధము. సర్వవిధముల నన్ను చక్క చేసితివి. దేవా ఆజ్ఞ ఇమ్ము.

ప్రభుని పాదపద్మ రజము - సత్య, సుకృత, సుఖములకు సుందరమగు అవధి, ఆ ధూళిపై ప్రమాణముచేసి పలుకుదును. మేలుకొని ఉన్నను. నిద్రించి చున్నను, కల కనుచున్నను సరే నా ఇచ్ఛ ఒక్కటే. స్వార్థమును, కపటమును, చతుర్విధఫలములను త్యజించి సహజభక్తితో స్వామిని సేవించుటయే అది. స్వామి ఆజ్ఞలను పాలించుటకు సాటిఅగు సేవ - స్వామికి చేయగలిగినది - మరి ఇంకొకటి లేనేలేదు. దేవా, అట్టి ఆజ్ఞ అను ప్రసాదమును ఈ సేవకుడు ప్రసాదింపబడుగాక!''

ఇట్లు వచించి భరతుడు అత్యంత ప్రేమవశుడయ్యెను. అతని తనువు పులకించెను. కన్నులు నీరు క్రమ్మెను. వ్యాకులుడై అతడు ప్రభుని పాదములను పట్టుకొనెను. ఆ సమయమును ఆ భక్తిని వివరింపజాలము.

కృపాసాగరుడగు రాముడు ఇంపగు పలుకులతో భరతుని సన్మానించెను. అతని చేతులు పట్టుకొని తన సమీపమున ఆసీనుని చేసెను. భరతుని వినయమును, శీలమును కనుగొని సభికులు, రఘునాథుడు ప్రేమవశమున శక్తివిహీనులైరి. రఘుపతి, సజ్జనబృందము, వసిష్ఠముని, మిథిలేశ్వరుడు, ప్రేమచే కృంగిపోయిరి, భరతునియొక్క సోదర ప్రేమను, భక్త్యాతిశయముల మహిమను అందరు కొనియాడిరి. మలిన మనసములతోనే దేవతలు అతనని పొగడిరి. పూలవాన కురిపించిరి. ఎల్లరు భరతుని మాటలను విని కలతచెందిరి. సాయంకాలపు సరోరుహములవలె వారెల్లరు ముకిళించుకొని పోయిరి.

ఇరు పక్షములయందలి స్త్రీ, పురుషుల దైన్యమును, శోకమును చూచి, అతి నీచమానసుగడు ఇంద్రుడు చచ్చినవారినే మరింత చంపి తన అభీష్టమును నెరవేర్చుకొనవలె ననుకొనెను. కపటమునకు, కుతంత్రమునకు అవధి సురపతి. అతనికి ప్రియమైనవి - స్వలాభము, పరులనష్టము, కపట, మోస, మలినములతో నిండిన కాకి పద్ధతులు పాకారివి. అతనికి ఎవ్వరియందు ఎన్నడూ విశ్వాసములేదు. మొట్టమొదట అతడు ఒక కుట్ర పన్నెను. కపటశక్తులను సమీకరించెను. అందరి తలలపై 'విరక్తిని' రుద్దెను. సురమాయచే అందరిని సమ్మోహితులను కావించెను. ఐననేమి? రామునిపై వారికి కల ప్రేమను మాత్రము అతడు దూరము చేయలేక పోయెను. భయముచే, విరక్తివశ##మై వారి మనస్సులు చలించుచుండెను. ఒకక్షణమున వారికి వనమునందే ఉండవలెనను కోర్కె కలుగును. మరుక్షణమున ఇంటికి మరల వలెనను కోర్కె జనించును. ఇట్లు సంకటస్థితిలో పడి దుఃఖభరితము లైనవారి మనస్సులు నదీప్రవాహము సముద్రమున కలయుచోటువలె కలవర పడుచుండెను. భిన్నమనస్కులై, భ్రమించు చిత్తములతో ఉన్నందున ఎవరకీ సంతోషములేదు. ఒకరు ఒకరికి తమ మర్మము తెలుపుటలేదు.

కృపానిధి అగు రాముడు ఈ సరిస్థితిని పరికించి తన మనమున నవ్వుకొనెను.

''కుక్క, కాముడగు యువకుడు, ఇంద్రుడు ఒక్కటే'' అని అతడు తలచెను.

భరతుడు, జనకుడు, మునిజనములు, సచివులు, సాధువులు, జ్ఞానులుతప్ప ఇతరులను వారివారి స్వభావములను అనుసరించి దేవమాయ ఆవహించినది. తన యందలి ప్రేమచే, సురపతి కావించిన కపటముచే ప్రజలు దుఃఖితులై ఉన్నారని కృపాసాగరుడు కనుగొనెను. సభికలు, ప్రభువు, జనకుడు, గురుడు, మహీసురులు, మంత్రులు మొదలగువారి అందరి బుద్ధిని భరతునియొక్క భక్తి-వశము చేసికొనెను. చిత్రమున లిఖింపబడినట్లు కనపడుచు, వల్లె వేసిన మాటలను వప్పగించునట్లు మాట లాడుచున్నారు అందరు. భరతునిప్రేమ, నమ్రత, వినయము, మహిమ, వినుటకు ఆనందప్రదమైనవే. కాని వర్ణనాతీతములు, ఎవనియొక్క లవలేశపు భక్తినికని ముని గణములు, మిథిలేశ్వరుడు ప్రేమమగ్నులైనారో అట్టి భరతుని మహిమను ఎట్లు వర్ణింపగలడు తుసీదాసు? భరతుని భక్తి, సద్భావములే కవియొక్క బుద్ధిని వికసింప చేసినవి. తన అల్పత్వమును, భరతుని మహిమాధిక్యమును ఎఱిగి, పరులయొక్క ప్రతిభఎదుట కవియొక్కబుద్ధి వర్ణింప సాహసింపకున్నది. భరతునియొక్క సద్గుణముల పరిపక్వమును ప్రశంసింపవలెనను కోరిక కలదు. కాని శక్తి శూన్యము. పసి పిల్లల పలుకులవలె నా బుద్ధి తడబడుచున్నది. భరతుని విమల యశస్సు నిర్మల చంద్రుడు. కవియొక్క సద్బుద్ధి ఒక చకోర కుమారి. భక్తుల హృదయములనబడు నిర్మల ఆకాశమున ఆ చంద్రోదయమును కనుగొని అది రెప్పవాల్చక చూచును. భరతుని స్వభావమును వర్ణించుట నిగమములకైనను సుగమముకాదు. నా అల్పబుద్ధి చాపల్యమునకు కవులారా, నన్ను మన్నించుడు.

భరతునియొక్క సద్భావమును వినినవాడు, తెలిపినవాడు సీతారాముల పాద ములయందు అనురక్తుడుకాక ఎట్లుండును? భరతుని స్మరించుటచే రామునియందు ప్రేమ ఎవనికి సులభముకాదో-అట్టి అభాగ్యుడు మరిఒకడు ఎవ్వడైనా ఉన్నాడా?

దయాళుడు, సజ్జనుడు అగు రాముడు అందరి స్థితిని కనుగొనెను. భక్తుని హృదయగీతిని తెలసికొనెను. ధర్మధురీణుడు, ధీరుడు, నయకోవిదుడు, సత్య, ప్రేమ. శీల. ఆనందసముద్రుడు, నీతి, ప్రేమపాలకుడు అగు రఘుపతి దేశ, కాల, అవసరములను, సమాజమును గ్రహించెను. వాణియొక్క సర్వస్వమై, పరిణామమున హితకరములై, వినుటకు అమృతతుల్యములైన పలుకులను అతడు ఇట్లు వచించెను -

''నాయనా, భరతా, నీవు ధర్మధురీణుడవు. లోకమును వేదమును ఎఱిగినవాడవు. భక్తిప్రవీణుడవు. మనోవాక్‌ కర్మలయందు నిన్ను పోలిన నిర్మలుడు నీవే. గురు సమాజ సమక్షమున, ఈ కాని సమయమున తమ్ముని గుణగణములను ఎట్లు వర్ణింపగలను? తండ్రీ సూర్యవంశపు మర్యాద. సత్య సంధుడగు తండ్రియొక్క కీర్తి, ప్రేమ, ఈ సమయము. సమాజము, గురుజలనుల గౌరవము, మిత్రుల, శత్రుల ఉదాసీనుల, అందరి మనస్సులు సర్వము నీకు తెలియును. అందరియొక్క కర్తవ్యము, నీ యొక్కయు నాయొక్కయు హితకరమగు పరమ ధర్మము నీవు ఎఱుగుదువు. నీ పై నాకు సంపూర్ణ విశ్వాసముకలదు. ఐనను సమయోచిత మగుకొన్ని మాటలను నుడువుదును. తండ్రీ, మనతండ్రి లేని సమయమున మనకులగురుని కృపయే నా మాటలను నిలబెట్టినది. లేనిచో మనతోపాటు మనప్రజలు, కుటుంబము, పరివారము, అందరూ నశించిపోయెడివారే. సంధ్యాసమయము కాకపూర్వమే సూర్యడు అస్తమించుచో జగమున క్లేశము ఎవరికి కలుగదు? తెలపుము. సోదరా, అట్టి ఉత్పాతమునే విధి ఈ నాడు మనకు కలిగించినాడు. మిథిలేశ్వరుడు, మునీశ్వరుడు అందరిని అన్నిటినుండి రక్షించినారు.

రాచకార్యము సర్వము, లజ్జ, ప్రతిష్ఠ, ధర్మము, ధరణి, ధనము, గృహములను అన్నిటిని గురునిప్రభావమే సంరక్షించును. పరిణామము శుభమగును. వనమున నైనను, గృహముననై నను నీకును నాకును. మీవారికి నావారికి గురుని అనుగ్రహమే రక్ష. తల్లి దండ్రుల, గురువుల, యజమానుల ఆజ్ఞలను పరిపాలించుట సకలధర్మ స్వరూపమగు ధరణి ఆదిశేషుడు ధరించుట వంటిది. కనుక సోదరా, అట్లే నీవును ఆచరింపుము. నన్నును ఆచరింపనిమ్ము. భానుకులసంరక్షకుడవు కమ్ము. సాధకునకు సర్వసిద్ధులను ప్రసాదించునది, కీర్తి, సద్గతి, ఐశ్వర్యభరితమైనది అగు త్రివేణి ఇది. దీనిని యోచింపుము. మహాసంకటములను సహించుము. ప్రజలను, పరివారమును సుఖులను కావించుము. నా విపత్తియందు అందరు భాగస్వాములై నారు. కాని సోదరా, నా గడువుకాలముమాత్రము నీకు అతి కఠినము. నీవు సుకుమారుడవు. నాకు తెలియును. ఐనను కఠోరవచనములను పలుకుచున్నాను. తండ్రీ, ఇది కాని కాలము. ఈ కాలమునకు తగినవే నా పలుకులు. వజ్రాఘాతమును సహితము చేతులతో ఆపవచ్చును. కత్తిపోటునుండి కాపాడుకొనుటకై చేతిని అడ్డుపెట్టుకొన్నట్లు అత్యవసర పరిస్థితులలో యోగ్యుడగు సోదరుడే డాలువలె సహాయకుడగును. సేవకుడు కర, చరణ, నయనములవలె స్వామి - నోరువలె ఉండవలెను. స్వామి సేవకులమధ్య ఇట్టిప్రేమను విని సుకవులు ప్రశంసితురు.'' ప్రేమసాగరమును మథించగా వెలువడి అమృతముతో మిళతమైట్లున్న రఘువరుని పలుకులను విని అచ్చట ఉన్నవారెల్లరు క్రుండిపోయిరి. ఎల్లరు ప్రేమసమాధియందు మునిగిరి. ఈ పరిస్థితిని కని శారదయే మెదల్చలేకపోయెను.

భరతుని పరమానందము కలిగెను. స్వామి సన్నిధిని ఆతని దుఃఖములు, దోషములు దూరమయ్యెను. అతనివదనము ప్రసన్నమయ్యెను. ఆతని మనమునఉన్న విషాదము నశించెను. మూగవానికి సరస్వతీకటాక్షము సంప్రాప్తించినట్లయినది.

అంతట భరతుడు ప్రేమపూర్వకముగా ప్రణామముచేసి, పాణి పంకజములను జోడించి ఇట్లు నుడివెను:-

''నాథా, నీతో పయనించినంత ఆనందము నాకు లభించినది. జగమున జన్మించి నందులకు ఫలము ప్రాప్తించినది. కృపాళూ, నీవు ఇక ఏ ఆనతి ఇచ్చినను దానిని నేను తలదాల్చి సాదరముగా నిర్వహింతును. దేవ దేవా, నాకు ఏదేని అవలంబనము అనుగ్రహింపుము. దానిని సేవించుచు గడువుకాలము దాటకలుగుదును. దేవా, నీ అభిషేకమునకై గురుని ఆనతినిపొంది నేను సర్వతీర్థజలములు తెచ్చితిని. వానివిషయమై ఏమి ఆజ్ఞ? నా మనస్సున మరి ఒక పెద్దకోరిక ఉన్నది. భయము, సిగ్గువలన దానిని చెప్పలేకున్నాను.''

అంత, రాముడు ''సోదరా, నుడువుము'' అనెను. ప్రభుని ఆజ్ఞనుపొంది ప్రేమపూర్వకముగా కమనీయవచనములను భరతుడు ఇట్లు పలికెను:-

''ఆజ్ఞయైనచో నేను చిత్రకూటమునందలి పవిత్రస్థలములను, తీర్థములను, వనములను, పశువులను, పక్షులను, సరస్సులను, నదులను, సెలయేళ్లను గిరిసమూహములను, అంతేకాక నీ పాదచిహ్నములచే అంకితమైన అవనిని దర్శించివత్తును.''

రాముడు: ''అవశ్యము అత్రిమునియొక్క ఆనతిని తలతాల్చి నిర్భయముగా అడవియందు చరించుము. తమ్ముడా! అత్రిమునియొక్క అనుగ్రహముచే వనములు మంగళప్రదములై పరమ పవిత్రములై అత్యంత రమణీయములయ్యెను. ఋషి నాయకుడగు అత్రి ఆనతి ఇచ్చినచోటున, నీవు తెచ్చిన జలమును స్థాపించుము'' అని ఆనతిఇచ్చెను.

ప్రభుని వచనములను వినీ భరతుడు సంతసించెను. ముదితుడై అతడు అత్రి మునియొక్క చరణకమలములకు నమస్కరించెను.

సకల సన్మంగళములకు మూలమగు భరత రామ సంవాదమును విని స్వార్థపరులగు దేవతలు రఘువంశమును ప్రశంసించిరి. కల్పవృక్షపు పుష్పములను వర్షించిరి.

'ధన్యుడు భరతుడు! రామస్వామికి జయము' అనుచు సురలు అత్యంతముగా ఆనందించిరి.

భరతుని వచనములను విని వసిష్ఠముని, మిథిలేశుడు, జనకుడు, సభాసదులెల్లరు ఆనందోత్సాహములను పొందిరి.

సంతోషమున ఒడలెల్ల పులకరింప విదేహభూపాలుడు, రామ భరతుల గుణ గణములను, పరస్పరప్రేమను ప్రశంసించెను. సచివులు, సభాసదులు ఎల్లరు అను రాగమున తమతమ బుద్ధిని అనుసరించి, స్వామిసేవకుల సుందర స్వభావమును, నియమములను, శీలమును, వారి పవిత్రాతి పవిత్రమగు ప్రేమను పొగడిరి. రామ, భరత సంవాదమును విని, విని ఇరుపక్షములవారి హృదయములు హర్ష, విషాదములను అనుభవించెను.

సుఖదుఃఖములు సమానములని రామమాత కౌసల్య తెలిసికొనెను. రామునిగుణములను గురిచి ఆమె ఇతరరాణులకు బోధించి, వారిని ఓదార్చెను. కొందరు రఘువీరుని మహిమను పొగడిరి. మరికొందరు భరతుని మంచితనమును శ్లాఘించిరి.

అనంతరము అత్రిముని ''ఈ పర్వత సమీపముననే సుందరమగు ఒక కూపము కలదు, పావనము, అనుపమము, అమృతోపమము అగు ఈ తీర్థజలమును దానియందు ఉంచుము'' అని భరతునితో చెప్పెను. అత్రిమునియొక్క ఆజ్ఞనుపొంది భరతుడు జలపాత్రలనన్నిటిని పంపించెను. అత్రి, శత్రుఘ్న, సాధు, మునిసమేతుడై భరతుడు ఆ అగాధ కూపమును సమీపించి ఆ పవిత్రజలమును ఆ పుణ్య స్థలమున ఉంచెను. ప్రేమచే ప్రముదితుడై అత్రి. ''తండ్రీ, ఇది అనాదిసిద్ధ పవిత్ర స్థలము. కాలక్రమమున మఱుగుపడినది. కనుక ఎవ్వరికీ ఇది తెలియదు. నా సేవకులు ఈ స్థలమును చూచిరి. చక్కనినీటికై ఒక మహాకూపమును సిద్ధముచేసిరి. విధి వశమున విశ్వమునకు అంతటికి ఇది ఉపకరామయ్యెను. అత్యంత అగమమగు ధర్మ విచారము ఈ కూపప్రభావమున సుగమమయ్యెను. తీర్థజల సంయోగముచే అతి పావన మైన ఈ కూపమును భరతకూపమని ఇక ప్రజలు పిలుతురు. నియమవ్రతులై భక్తి పూర్వకముగా దీనియందు స్నానముచేయుప్రాణులు మనోవాక్‌ కర్మలయందు నిర్మలులగుదురు'' అని వచించెను. ఆ కూపమహిమను కొనియాడుచు వారందరు రఘునాథుని వద్దకు వెడలిరి. ఆ తీర్థ పుణ్యప్రభావమును అత్రిముని రామునికి వివరించెను. ధార్మిక ఇతిహాసములను నుడువుటలో ఆ రాత్రి ఆనందముగా గడచెను.

తెల్లవారెను. భరతశత్రుఘ్నులు నిత్య క్రియలను కావించి రాముని, అత్రి, గురవులయొక్క ఆజ్ఞలను పొంది తమ బృందముతో కలసి, సామన్య దుస్తులను ధరించి, రామవనమున విహరించుటకై కాలినడకను పయనమైరి. వారి పాదములు కోమలములు. పాదరక్షలు లేవు. అట్లే నడచుచుండగా భూదేవి చూచి తనలో తాను సిగ్గుపడి మృదుత్వము వహించినది. దర్భలు, ముళ్లు, కంకరరాళ్లు మొదలగు కఠిన, కఠోర కంటకములనన్నిటిని ఆమె వారి త్రోవనుండి తీయించి దాచివైచినది. మంజుల, మృదు మార్గమును మహీతలము సమకూర్చినది. సుఖదములగు త్రివిధ వాయువులు వీచెను. దేవతలు పూలవాన కురిపించిరి. మేఘములు నీడ ఇచ్చినవి. ఫలవృక్షములు పుష్పించి, ఫలించెను. తృణములు మృదుత్వము తాల్చెను. తదేక ధ్యానముతో పశువులు వారిని చూచినవి. పక్షులు మధురస్వనము చేసినవి. భరత, శత్రుఘ్నులు రాముని ప్రియ అనుజులని తెలిసికొని సకలము వారిని సేవించెను.

ప్రాకృతపురుషులు - ఆవులించునపుడు ఒక్కసారి 'రామ' అని ఉచ్చరించినచో సర్వసిద్ధులు వారికి సులభమగునే! అట్టిచో రామునికి ప్రాణప్రియుడగు భరతునికి ఇట్టి సేవలు లభించినవనినచో వింతయా?

ఇట్లు భరతుడు వనమున విహరించెను. అతని నియమములను, ప్రేమను వీక్షించి మునులు సిగ్గుపడిరి. అచ్చటి పుణ్యజలాశ్రయములను, వివిధ ప్రదేశములను. ఖగ, మృగ, తరు, తృణ, వనములను, గిరులను, తోటలను అన్నింటిని భరతుడు దర్శించెను. అవి అన్నియు అతి రమణీయమై, పావనమై, దివ్యమై వెలుగొందుచున్నవి. వానిని గురించి భరతుడు మునులను ప్రశ్నించెను. ఋషిరాజగు అత్రి ప్రసన్నమానసుడై వానిపేర్లను, గుణములను, పుణ్యప్రభావములను, హేతువులను వివరించెను. ఆనందమానసులై ఒకచోట భరత, శత్రుఘ్నులు స్నానము చేతురు. ఇంకొకచోట ప్రణామము కావింతురు. మరి ఒకచోట మనోభిరామములగు స్థలములను తిలకింతురు. వేరొకచోట మునియొక్క ఆనతినిపొంది ఆసీనులై సీతారామలక్ష్మణులను స్మరింతురు. భరతుని స్వభావమును, ప్రేమను సేవాభావమును వీక్షించి వనదేవత సంతసించి అతనిని ఆశీర్వదించును!

ఇట్లు వారు విహరించుచుండగా దినమున రెండున్నర జాములు గడచును. తిరిగివచ్చి భరతుడు ప్రభుని పాదకమలములను దర్శించును. ఐదు దినములలో అతడు అన్ని తీర్థములను సందర్శించెను, హరిహరుల సత్కీర్తిని గురించి సాయంత్రమువరకు సంభాషించుచుండగా ఐదవ దినముకూడా గడచెను. ఆరవనాటి ఉదయమున స్నానముచేసి భరతుడు. భూసురులు, జనకుడు, ఇతర బృందము అందరు సమావేశ##మైరి. అది శుభదినమని రామునికి తెలియును. ఐనను ఆ కృపాళుడు దానిని తెలుపుటకు సంకోచించెను. గురువును. జనకభూపుని, భరతుని, సభ్యులను అతడు అవలోకించి, పలుక సందేహించి, దృష్టిని మరల్చి నేలవైపు చూడసాగెను. సభవారెల్లరు అతని శీలమును కొనియాడిరి. రామునివలె నమ్రుడగు ప్రభువు ఎందునూ లేడని తలచిరి. చతురుడగు భరతుడు రాముని ఇంగితమును గ్రహించెను. ప్రేమ పూర్వకముగా లేచి అత్యంత ధైర్యమును వహించి సాష్టాంగ దండప్రణామము కావించి చేతులు జోడించి అతడు ఇట్లు వచింప ప్రారంభించెను.

''నాథా, నీవు నా కోర్కెలనన్నిటిని మన్నించితివి. నాకై అందరు సంతాపమును సహించిరి. నీవు కూడ బహువిధముల దుఃఖమును అనుభవించితివి. స్వామీ, ఇక నాకు సెలవిమ్ము. నేను అయోధ్యకు మరలి గడువు తీరువరకు సేవింతును. కృపాళూ, దీనదయాళూ, కోసలాధీశ్వరా, ఈ దాసుడు మరల నీ పాద సందర్శనము కావింపకలుగు ఉపాయమును తెలపుము. పురజనులు, పరిజనులు, జనలు, స్వామీ, నీ యందలి ప్రేమచే, నీ సాంగత్యముచే - అందరు పునీతులైరి. ఆనందభరితులైరి, ప్రభూ, నీకొరకై భవదుఃఖమను అగ్నియందు మాడిపోవుటయు శ్రేయస్కరమే, నీవు లేనిది పరమపద ప్రాప్తి యైనను వ్యర్థమే. నీవు సజ్జనుడవు. స్వామీ, సకల హృదయములను, సేవకుడనగు నా మనోభిప్రాయమును. అభిలాషను, స్థితిని గ్రహించి నీవు ఎల్లరను పరిపాలింతువు. ఆర్తరక్షకా, దేవా, ఈ లోకమున, పరలోకమున తుదివరకు సంరక్షింతువు. సర్వ విధముల నాకు మిక్కుటమగు విశ్వాసము కలదు. దీనిని గురించి యోచించినచో లేశ##మైనను చింత నాకు లేదు. నా యొక్క ఆర్తి, స్వామియొక్క ప్రేమ రెండునూ కలసి ఇట్లు నాకు ధైర్యమును ఇచ్చినది. ప్రభూ, నా ఈ మహాపరాధమును మన్నించి, సంకోచము వీడి ఈ సేవకునకి ఉపదేశించుము.''

''క్షీర నీరములను వేరుచేయు హంసవలె ఉన్నది భరతునియొక్క వినతి'' అని ఎల్లరు భరతుని కొనియాడిరి. దీనబాంధవుడు, ప్రవీణుడు అగు రాముడు - సోదరుడగు భరతునియొక్క దీన, కపట రహితవచనములను విని, దేశకాల పరిస్థితులకు తగు పలుకులను ఇట్లు నుడివెను :

''తమ్ముడా, నిన్ను, నన్ను, మన పరిజనమును, ఇక్కడ ఉన్నవారిని గురించి, అయోధ్యయం దున్నవారిని గూర్చిన చింత గురునిది. జనక భూపాలునిది. గురువు. విశ్వామిత్రముని, మిథిలేశుడు మనకు సంరక్షకులై ఉన్నంతకాలము నీకు. నాకు స్వప్నముననైనను క్లేశము లుండవు. నీ యొక్క, నాయొక్క పరమ పురుషార్థము, స్వార్థము, సత్కీర్తి, ధర్మము, పరమార్థము - సర్వము మన సోదరులము ఇరువురము మన తండ్రియొక్క ఆనతిని పాలించుటయందే కలవు. మన తండ్రి అగు భూపాలుని ఆనతిని పాలించుటయందే మన మేలు - లోక దృష్టిని - వేదధర్మము ననుసరించియు కలదు. గురువుల, జననీజనకుల యజమానుల యొక్క ఆజ్ఞలను పాలించుటవలన ఎట్టి కఠిన మార్గమున ప్రవర్తించినను పతనము కలుగనేరదు. ఇట్లు యోచించి విచారమును అంతయు వీడుము. అయోధ్యకు మరలుము. గడువు తీరువరకు దానిని పరిపాలింపుము. దేశము, కోశము, పరిజనము, పరివారము - వీని రక్షణభారము గురుచరణ రజమునందే ఉన్నది. నీవు మాత్రము తల్లుల, సచివుల, మునియొక్క బోధనలు అనుసరించి ధరణిని, ప్రజలను, రాజధానిని పాలించుచుండుము.

శరీరమునకు నోరు ఎట్టిదో నాయకుడు దేశమునకు అట్టివాడు, తినుటకు, త్రాగుటకు నోరు ఒక్కటే మార్గము. కాని వివేకయుతముగా సకల అంగములను అదియే పాలించును. పోషించును. రాజధర్మముయొక్క సర్వస్వమిదియే. మనో రథములన్నియు మనస్సుననే దాగిఉన్నట్లు. రాజధర్మము ఇందే దాగిఉన్నది.'' ఇట్లు బహువిధముల రాముడు భరతునికి భోదించెను.

ఏదేని ఒక ఆధారములేనిదే భరతుని మనస్సున శాంతి. సంతోషములు లేవు. ఒకవంక భరతుని ప్రేమ. ఇంకొకవంక గురవుల, సచివుల, సమాజ సంకోచస్థితి. వీనిని కనుగొని రఘునాథుడు ప్రేమ. సంకోచవశుడయ్యెను. తుదకు కృప వహించి ప్రభువు తన పాదుకలను భరతునికి ప్రసాదించెను. భరతుడు సాదరముగా వానిని తన శిరమున ధరించెను. కరుణానిధి అగు రాముని పాదుకలు రెండునూ ప్రజల ప్రాణములకు ఇరువుడు రక్షకభటులవలె ఉన్నవి. భరతుని ప్రేమ అను రత్నమునకు అవి రెండు పేటికలు. జీవుని సాధనమునకు అవి 'రామ'నామ నామమను రెండు అక్షరములు, రఘుకుల సంరక్షణకు అవి రెండు కవాటములు. కుశల కర్మలకు అవి రెండు చేతులు. సేవా సద్ధర్మమును చూపించు విమల నయనములు అవి.

ఆశ్రయము లభించినందున భరతుడు మిక్కిలి సంతసించెను. సీతారాములే తనవద్ద ఉన్నట్లు అతడు ఆనందించెను. అతడు రామునికి నమస్కరించి ఆజ్ఞను వేడెను. రాముడు భరతుని తన ఉరమునకు హత్తుకొనెను.

సమయము చిక్కెనుకదా అని కుటిలుడగు అమరపతి ఇంద్రుడు ప్రజలను విరక్తులను కావించెను. అతని ఈ కుతంత్రము అందరికి వరప్రసాదమే అయ్యెను. ''గురువు పూర్తి అగును'' అను ఆశ##యే వారి ప్రాణములకు సంజీవిని అయ్యెను. విరక్తియే లేనిచో సీతారామలక్ష్మణ వినియోగమను దుష్టరోగముచే వారెల్లరు కలతచెంది మరణించెడువారే.

చిక్కుల నన్నింటిని శ్రీ రామకృపయే తొలగించెను. కొల్లగొట్టవచ్చిన సురసేన యొక్క బుద్ధిమారెను. అదియే హితకారి. రక్షకుడయ్యెను.

రాముడు భరతుని తనివితీర తన బాహువులలో బంధించుకొనెను. ఆతని ప్రేమ వర్ణనాతీతము. మనోవాక్కాయములు మూడింటియందు అది ఉప్పొంగు చున్నది. ధీరధురంధరుడు ధైర్యము త్యజించెను. ఆతని నయన కమలములనుండి నీరు కారెను. ఈ స్థితిని కనుగొని దేవతలెల్లరు విచారగ్రస్తులైరి. జ్ఞానాగ్నియందు తమ మనస్సులనబడు సువర్ణమును పరీక్షించినవారు, విరించిచే నిర్లిప్తులుగా సృజింపబడినవారు. జగత్తు అను జలమున తామరాకువలె జన్మించినవారు అగు ముని గణములు, గురుడు, జనకుడే రఘువర భరతుల అనుపమ, అపార ప్రేమను చూచి వైరాగ్య వివేకయుతులై మనోవాక్కాయలములయందు ప్రేమ నిమగ్నులైరి. జనకుని, వసిష్ఠులని చిత్తములచే అట్లు భంగపరచిని ఆ దివ్యప్రేమను ప్రాకృత ప్రేమ అనుట మహాపరాధము. రఘువర భరతుల వియోగమును వర్ణించు కవిని లోకులు కఠిన హృదయుడందురు. శోక రసభరితమగు ఆ దృశ్యము వర్ణనాతీతము. కవి యొక్క సద్వచనములు ఆసమయమునందలి ఆ ప్రేమను స్మరించి సంకోచము చెందును. రఘువరుడు భరతుని కౌగిలించుకొని ఓదార్చెను. పిదప అతడు ఆనంద మున శత్రుఘ్నుని ఆలింగనము చేసికొనెను. సేవకులు, సచివులు భరతుని ఇంగితమును ఎఱిగి తమతమ పనులకు చనిరి. ఈ విషయమును విని ఇరుపక్షములయందు దారుణమగు దుఃఖము క్రమ్మెను. అందరు ప్రయాణమునకు సిద్ధమైరి.

భరత శత్రుఘ్నులు ప్రభుని చరణ పంకజములనకు వందనముచేసిరి. రాముని ఆనతిని తలదాల్చిరి. ఇరువురు పయనమైరి. మునులకు, తాపసులకు, వనదేవతలకు ఎల్లరకు పదేపదే వారు మ్రొక్కిరి. వినతిచేసిరి. అనంతరము భరతుడు లక్ష్మణుని ఆలింగనము కావించుకొనెను. శత్రుఘ్నుడు లక్ష్మణునికి ప్రణామముచేసెను. సీత యొక్క పాదధూళిని భరత శత్రుఘ్నులు తమ శిరములధరించి, సకల సన్మంగళములకు మూలమగు దీవనలను వడసిరి. ప్రేమయుతులై బయలుదేరిరి.

రామలక్ష్మణులు తలలవంచి జనకునికి వందనము చేసి ఆయనను బహువిధముల వినుతించి, స్తుతించిరి.

''దేవా, దయాశుడవై నీవు బహుదుఃఖములను అనుభవించితివి. సమాజ సహితుడవై కాననములకు అరుదెంచితివి. మమ్ము ఆశీర్వదించి నీవు పురమునకు విచ్చేయుము'' అని వేడిరి. జనకుడు విని ధైర్యమువహించి పయనమయ్యెను.

మునులు, భూసురులు, సాధువులు, హరిహరతుల్యులని ఎఱిగి రాముడు వారిని సన్మానించి వీడ్కోలు పలికెను.

పిదప రామలక్ష్మణులు అత్తగారివద్దకు ఏగి ఆమె పాదములకు నమస్కరించిరి. ఆమెయొక్క దీవనలనుకాంచి, తిరిగివచ్చిరి.

కౌశిక వామదేవ జాబాలులకు, పురజనులకు, పరిజనులకు, విశ్వాపసాత్రులగు సచివులకు, అందరికీ అనుజుడు, రాముడు యథాయోగ్యముగా వినయమున ప్రణమిల్లి వీడ్కోలు పలికిరి. కృపానిధానుడగు రాముడు లఘు, మధ్యమ, ఉన్నతశ్రేణుల వారిని ఎల్లరను సన్మానించి సాగనంపెను.

పిమ్మట రాముడు భరతమాతకు పాదాభివందనము చేసి, పవిత్ర ప్రేమతో ఆమెను కౌగిలించుకొనెను. ఆమెయొక్క విచార, సంకోచములను తొలగించెను. అలంకరింపబడిన పల్లకీలో ఆమెకు వీడ్కోలు తెలిపెను.

ప్రాణప్రియునితో కలసి పవిత్ర ప్రేమికురాలగుసీత తన పుట్టినింటి బందుగులగు, జననీ జనకులను కౌగిలించుకొని తిరిగివచ్చెను. అత్తలెల్లరకు ఆమె ప్రణమిల్లి వారిని ఆలింగనము చేసికొనెను. వారి ప్రేమను వర్ణించుటకు కవియొక్క హృదయమున ఉత్సాహములేదు. అత్తల బోధనలువిని, అభిమతరీతిని సీత వారి ఆశీస్సులను పొందెను. తల్లితండ్రుల అత్తలవంక ప్రేమతో ఆమె చూచుచుండెను.

ఇంతలో రఘుపతి అందమైన పల్లకీలను తెప్పించెను. చక్కగా ప్రబోధించి తల్లులను వానియందు కూర్చుండపెట్టెను. రామలక్ష్మణులిరువురు తల్లులందరిని సమాన మగు ప్రేమతో పలుమారులు ఆలింగనముచేసికొని సాగనంపిరి. భరతుని, జనకుని దళములందలి గుఱ్ఱములు, ఏనుగులు నానావిధములగు వాహనములు అలకంరింపబడి పయనించ మొదలిడినవి. సీతాలక్ష్మణ సమేతుడగురాముని తమ హృదయములయందు నిలుపుకొని అందరు అచేతనులై మరలుచున్నారు. ఎడ్లు, గుఱ్ఱములు, ఏనుగులు మొదలగు పశువులు తమ హృదయమున నిస్పృహతో, విధిలేక బలవంతమున నడచుచున్నవి. సీతాలక్ష్మణ సమేతముగా రాముడు గురునికి, గురుపత్నికి పాదిభివందనము చేసి, హర్షవిస్మయ సహితుడై వర్ణశాలకు తిరిగివచ్చెను. రాముడు నిషాదపతిని సన్మానించి అతనికి వీడ్కోలు చెప్పెను. అతివిషాద, విరహ హృదయముతో నిషాదుడు వెడలెను. పిదప కోలులు, కిరాతలు, భిల్లులు మొదలగు వనచరులు పదేపదే జోహారులు అర్పించి మరలిరి.

ప్రభువు, సీత, లక్ష్మణుడు ఒక వటవృక్షచ్ఛాయను కూర్చుండి ప్రియజనుల, పరిజనుల వియోగమున చింతిల్లుచుండిరి. భరతునిప్రేమను, శీలమును, నమ్ర వచనములను, గురించి ప్రియురాలికి, తమ్మునికి వర్ణించుచున్నాడు రాముడు. ప్రేమవశుడై ఆతడు భరతునికి మనోవాక్కాయ కర్మలయందు కలప్రేమ విశ్వాసములను స్వయముగా వర్ణించెను. పశువుల, పక్షుల, చేపల, చిత్రకూటమునఉన్న చరాచర జీవములు అన్నియు ఆసమయమున విచారమున మునిగెను.

దేవతలు రఘువరునయొక్క స్థితినిచూచి ఆతనిపై పూలవాన కురిపించిరి. తమ తమ స్థితిగతులను అతనికి నివేదించిరి. ప్రభువు వారికెల్లరకు ప్రణామముచేసెను. వారిని ఓదార్చెను. ముదితమనస్కులై, నిర్భయులై వారు మరలిరి.

భక్తి జ్ఞాన వైరాగ్యములు శరీరములు ధరించి శోభిల్లునట్లు సీతాలక్ష్మణ సమేతుడై ప్రభువు పర్ణకుటీరమున భాసిల్లుచున్నాడు.

మునులు, విప్రులు, గురువ, భరతుడు, జనకుడు, వారి బృందములు రామ విరహముచే విహ్వలులైరి. ప్రభుని గుణగనములను మనముల స్మరించుచు వారెల్లరు మార్గమున నిశ్శబ్దముగా నడచిపోవుచున్నారు. వారందరు యమునా నదినిదాటి ఆవలి ఒడ్డు చేరిరి. ఆనాడు నిరాహారులై ఉండిరి. గంగానదికి ఆవలిఒడ్దున వారు మరునాడు విడిదిచేసిరి. అచ్చట అన్ని ఏర్పాట్లను రాముని సఖుడగు గుహుడు కావించెను. పిమ్మట వారు సయీనదిని దాటిరి. గోమతీ జలముల స్నానముచేసిరి. నాలుగవ దినమున అందరు అయోధ్యాపురిని చేరిరి.

జనకుడు ఆ పురియందు నాలుగు దినములు ఉండి రాచకార్యములను, పరిపాలనావ్యవవహారములను చక్కపరచెను. సచివులకు, గురునిక, భరతునికి రాజ్యమును ఒప్పగించి అతడు తిరుహూత నగరికి మరలెను. అయోధ్యా నగరమునందలి స్త్రీలు, పురుషులు వసిష్ఠుని ఉపదేశములను అనుసరించుచు రామ రాజధానియందు సుఖముగా నివసింపసాగిరి.

రామ దర్శనమురకై ప్రజలెల్లరు నియమములను, ఉపవాసములను ప్రారంభించిరి. భోగములను త్యజించిరి. భూషణములను విసర్జించిరి. పదునాలుగు వత్సరముల గడువు తీరునను ఆసతో జీవించుచుండిరి.

మంత్రులకు, విశ్వాసపాత్రులగు సేవకులకు భరతుడు ప్రబోధించి వారి వారి పనులకు నియమించెను. అందరు తమ తమ పనులలో నిమగ్నులైరి. పిదప భరతుడు తమ్ముని పిలిపించి తల్లులసేవ అతనికి అప్పగించెను. భూసురులను పిలిపించి, చేతులు జోడించి వారికి ప్రణామము కావించి అతడు:-

''ఏ కార్యమునైనను సరే - అది శ్రేష్ఠమైనను. అల్పమైనను - మంచిదైనను, చెడ్డదైనను నన్ను ఆజ్ఞాపించుటకు సంకోచింపకుడు'' అని వినయమున ప్రార్థించెను. పరిజనులను, పురజనులను పిలిపించి వారిని సమాధాన పరచెను. వారెల్లరు సుఖముగా నివసించుటకు ఏర్పాట్లు చేయించెను. అనంతరము శత్రుఘ్నునితో కలసి భరతుడు గురుని గృహమునకు వెడలి, గురునిక సాష్టాంగ నమస్కారముచేసి, చేతులు జోడించి ''ఆజ్ఞయైనచో నేను నియమయుతుడనై నివసింతును'' అనెను. వసిష్ఠమునియొక్క తనువ పులకరించెను. ప్రేమసహితుడై ఆ ముని ''భరతా, నీవు తలచునది, పలుకునది, సలుపునది సర్వము జగమున ధర్మసారము కాగలదు'' అని నుడివెను. ఈ పలుకులను విని భరతుడు వసిష్ఠుని ఉపదేశములను, మహదాశీర్వాదమును పొందెను. జ్యోతిష్కులను రప్పించి ముహూర్తము పెట్టించెను. ప్రభుని పాదుకలను భక్తియుక్తముగా సింహాసనమున ప్రతిష్టించెను.

కౌసల్యా వసిష్టుల పాదములకు శిరమువాల్చి మ్రొక్కి, రామప్రభుని చరణపాదుకల ఆనతినిపొంది, ధర్మ ధురంధరుడగు భరతుడు నందిగ్రామమున ఒక వర్ణకుటీరమును నిర్మించి, దానియందు నివసించుచుండెను.

అతడు శిరమున జటాజూటమును ధరించెను. మునివస్త్రములను కట్టెను. నేలను త్రవ్వి, దానిలో ఒక కుశాసనమును పరచెను. ఆహార, వస్త్ర, పాత్ర, వ్రత, నియములను గురించిన అన్ని విషయములయందును అతడు ఋషిధర్మమును భక్తి సహితముగా ఆచరించుచుండెను. మనో వాక్కాయములయందు నానావిధ భూషణములను, వస్త్రములను, భోగములను, సుఖములను ఆతడు గడ్డిపరకగా ఎంచి త్యజించెను.

ఏ అయోధ్యను సురపతి - ఇంద్రుడు ప్రశంసించువాడో, ఏ నగరాధిపతి అగు దశరథుని సంపదనుగూర్చి విని ధనదుడే సిగ్గు చెందువాడో, ఆ అయోధ్యా పురియందు భురతుడు నేడు రాగరహితుడై, చంపకవనమున చంచరీకమువలె వసియించుచున్నాడు. రామభక్తులగు మహా భాగ్యవంతులు లక్ష్మీ విలాసమును వమనమువలె త్యజింతురు. రామ ప్రేమభాజనుడగు భరతుడు ఇట్లు చేయుటలో విశేషమేమున్నది ?

దృఢసంకల్పముచే చాతకపక్షి, నీరక్షీర వివేకశక్తిచే హంసయు మెప్పును పొందును.

దిన దినము భరతుని దేహము శుష్కించుచున్నది. శరీరము సన్నగిలుచున్నది. ఐనను తేజస్సు తగ్గలేదు. అతని బలము ముఖసౌందర్యము మారలేదు. రామునియందు అతని ప్రేమ జ్వాల ఉజ్వలమై ప్రకాశవంతమగుచున్నది. ధర్మ పక్షపాతము వృద్ధి చెందుచున్నది. శరచ్చంద్రికయందు నీరు క్షీణించినను నీటిలోని మేము మొదలగు గడ్డి పెరుగునట్లు కమలములు వికసించునట్లు అతని మానసము మలినమగుటలేదు. శమ, దమ, సంయను, నియము, ఉపవాసాదులు భరతుని హృదయాకాశమున ఉజ్జ్వల నక్షత్రములై, అతని విశ్వాసము ధృవతారవలె. పదునాలగు సంవత్సరముల గడువే పూర్ణిమవలె ఉన్నవి రామస్వామియొక్క స్మృతియే - ప్రకాశించు ఆకాశగంగయై రామునియందలి భక్తి అచలమై, కళంక రహితమై నిరంతరము తారలతో రమ్యముగా రంజిల్లు చంద్రునివలె ఉన్నవి.

భరతుని నడవడిక, వివేకము, శీలము, చర్య, భక్తి, వైరాగ్యములను విమల గుణములను, ఐశ్వర్యమును వర్ణించుటకు సుకవులెల్లరు వెనుకాడుదురు. శేషునికి. గణశునికి, శారదను సహితము అవి ఆగమ్యములు. భరతుడు అనుదినము ప్రభుని పాదుకలను - ప్రేమతో పొంగి పొరలు హృదయముతో పూజించును. ఆజ్ఞలకై పాదుకలను పదే పదే ప్రార్థించుచు, రాచకార్యములనన్నిటి నిర్వహించును. అతని తనువు పులకరించును. అతని హృదయము సీతా రఘువీరులుందురు. అతని జిహ్వ రామనామమును జపించును. అతని నేత్రములు ప్రేమాశ్రువులతో నిండును.

సీతారాలక్ష్మణులు కాననమున నివసించుచున్నారు. భరతుడు ఇంటియందే నివసించుచు, తపము కావించుచు తన తనువును కృశింప చేసికొనుచున్నాడు.

ఇరువైపుల విషయములను యోచించి లోకులు అందరు 'భరతుడు సకల విధముల స్తవనీయుడు' అనిరి. అతని వ్రత. నియమములను గురించి విని సాధు సత్పురుషులు సిగ్గుపడిరి. అతని పరిస్థితిని కని మునిరాజులు లజ్జితులైరి.

భరతుని పరమపవిత్ర చరిత్ర మధురమైనది. మంజులమైనది. మోదకరమైనది. మంగళప్రదమైనది. కలియుగమునందలి మహాపాపములను హరించునది అది. మహా మోహమను నిశిని నశింపచేయు దినేశుని వంటిది. అది. పాపపుంజములనబడు కుంజర ములకు అది మృగరాజు, సకలసంతాప సమూహముల నాశనకారి అది. భక్తజనులను అది రంజింపచేయును. భవ సంకటములను అది నశింపచేయును. రామభక్తి అను సుధాకరుని సారమగు అమృతముఅది.

సీతారాముల యందలి ప్రేమామృతముచే పరిపూర్ణమైనది భరతునిజన్మ, భరతుడు జన్మించి ఉండనిచో మునిగణములకైనను అగమమగు యమ నియమ శమదమాది కఠిన వ్రతములను ఎవ్వడు ఆచరింపగలడు? దుఃఖము, సంతాపము, దారిద్ర్యము, దంభము మొదలగు దోషములను తన సత్కీర్తిచే ఎవడు హరింపగలడు? కలికాలమున తుసీదాసువంటి మూర్ఖుల మానసములను బలత్కారముగా రాముని వైపునకు ఎవరు మరల్చగలడు?

భరతుని చరితమును నియమముతో, సాదరముగా వినువారికి అవశ్యము. సీతా రాముల చరణములయందు భక్తిజనించును. సాంసారిక విషయ రసములయందు విరక్తి ఉదయించును. ఇది తులసివాక్కు.

Sri Ramacharitha    Chapters