Sri Ramacharitha    Chapters   

శ్రీ రామచరిత మానసము

ప్రథమ సోపానము

బాలకాండ

వర్ణముల వాని అర్థజాలముల, రసముల, ఛందస్సుల, మంగళముల కర్తలగు వాణీ వినాయకులకు వందనమొనర్తును.

శ్రద్ధావిశ్వాస స్వరూపులగు భవానీ శంకరులకు వందనము కావింతును. వారు లేనిదే సిద్ధజనులు తమ అంతఃకరణములయందున్న ఈశ్వరుని కనుగొనజాలరు.

జ్ఞానమయుడు, నిత్యుడు, శంకరస్వరూపుడు అగు గురునికి వందనము చేతును, గురుని ఆశ్రయించియేకదా వక్రియైన చంద్రుడు సహితము అంతటా గౌరవింపబడుచున్నాడు.

సీతారాముల గుణగణము లనబడు పావన వనమున విహరించు విశుద్ధ విజ్ఞాన సంపన్నులగు కవీశ్వరునికి, కపీశ్వరునికి ప్రణతి ఒనర్తును.

ఉత్పత్తి, స్థితి, సంహారకారిణి, క్లేశహారిణీ, సర్వశ్రేయస్కరి - రాముని ప్రియురాలు అగు సీతకు నమస్కరింతురు.

ఈ అఖిలవిశ్వము, బ్రహ్మాదిదేవతలు, రాక్షసులు ఎవని మాయావశులై వర్తింతురో, ఎవని ఉనికిచే రజ్జు సర్పభ్రాంతివలె ఈ సకలదృశ్యజగత్తు సత్యమువలె ప్రసిద్ధ మగుచున్నదో, భవజలధిని తరింప కోరువారికి ఎవనిపాదములే ఏకమాత్ర నౌకలో - అట్టి అశేషకారణాతీతుడు, రామాభిధానుడు, ఈశుడు అగు హరికి వందనము లర్పింతును.

అనేక పురాణ, నిగమ, ఆగమ సమ్మతమైనది. రామాయణమున స్పష్టముగా మడువబడినది, మరికొన్ని ఇతర ఆధారములనుండి సంగ్రహింపబడినదియు అగు ఈ 'రఘునాథ గాథ'ను తన ఆత్మానందముకొరకై తులసీదాసు అతి మంజులమగు భాషలో విశదముగా రచించుచున్నాడు.

ఎవని స్మరణమాత్రమున కార్యసిద్ధి కలుగునో అట్టి గణనాయకుడు, కరివరవదనుడు, బుద్ధిరాశి, శుభగుణసదనుడు నన్ను అనుగ్రహించుగాక !

ఎవనికృపచే మూగవాడు వాచాలుడగునో, కుంటివాడు దుర్గమమగు గిరులపై ఆరోహించునో, సకలకలిమలములను దహింపచేయు దయాళుడెవడో - ఆతడు నాపై కృపచూపుగాక !

నీల సరోరుహశ్యామవర్ణుడు, తరుణారుణ వారిజనయనుడు, క్షీరసాగర శయనుడు - శ్రీమన్నారాయణుడు నా హృదయమున సదా వసించుగాత ! కుందపుష్పమును, చందమామను పోలు శరీరుడు, ఉమారమణుడు, కరుణానిలయుడు, మదనాంతకుడు, శంకరుడు నాపై కరుణచూపుగాత !

కృపాసాగరుడు-నరరూప శ్రీహరి, మహామోహమను గాఢాంధకారమును హరించు సూర్యకిరణసముడు అగు గురుని పాదములకు నా వందనములు.

గురుచరణ కమలరజము-సుందర, సుగంధ, అనురాగ, రసభరితమైనది. సుందర సంజీవనీ మూలికాచూర్ణము అది. సకలభవరోగపరివారమును అది నాశనమొనర్చును. ఆ పద్మపరాగమునకు నా ప్రణతులు. పుణ్యవంతుడగు శంభుని శరీరము నందలి విమల విభూతి ఆరజమే. మంజుల కల్యాణమునకు, ఆనందమునకు అది జనని. భక్తజనుల మనోముకురములపై ఉండు మలినమును తుడిచివేయునది ఆ ధూళియే. తిలకముగా ధరించినచో అదియే సద్గుణగణములను వశపరచుకొనును.

శ్రీ గురుచరణ నఖజ్యోతి మణికాంతికి తుల్యమైనది. దానిని స్మరించినంతనే హృదయమున దివ్యదృష్టి జనించును. అజ్ఞానాంధకారమును ఆ జ్యోతి పారద్రోలును. ఆ జ్యోతిని హృదయమున కలిగినవాడు కడు భాగ్యవంతుడు. ఆ జ్యోతిచే హృదయము యొక్క నిర్మలనేత్రములు తెరచుకొనును. సంసారమను రాత్రియొక్క దోషములు, దుఃఖములు నశించును. 'రామచరిత' అను మణులు. మాణిక్యములు ఏ గనియందు ఉన్నను, గుప్తముగా ఉన్నను - బహిరంగముగా ఉన్నను సరే బహిర్గతమగును. సిద్ధాంజనమును కన్నులకు పూసికొన్నచో సాధకుడు సిద్ధినిపొంది, జ్ఞానియై పర్వతముల యందలి, భూగర్భమునందలి అనేక నిధులను కౌతుకమున కనుగొనకలుగును కదా ! గురుపాదధూళి - మృదు మంజుల నేత్రాంజనము, అమృతము. నేత్రదోషములను అది పోగొట్టును. ఆ అంజనముచే వివేకనేత్రములను నిర్మలము కావించుకొని. భవమోచనకరమగు రామచరితను వర్ణింతును.

మోహజనిత సంశయములనన్నిటిని హరించు మహీసురుల చరణములకు ప్రథమమున వందనము చేతును.

సకల సద్గుణఖని అగు సాధు సజ్జన సమాజమునకు ప్రేమసహితమగు రమ్యవాణితో ప్రణామము కావింతును. సాధుజనులచర్యలు ప్రత్తి పండ్లవలె స్వచ్ఛమైనవి. రసము లేనివి. గుణమయమైనది. ప్రత్తి కష్టములను సహించి వస్త్రమై పరుల రహస్యభాగములను మరగుపరచును. అట్లే సాధుసజ్జనులు తమ దుఃఖములను సహించి ఇతరులదోషములను కప్పివైతురు. కనుకనే వారు జగమున వందనీయమగు యశమును పొందుట. సాధుసమాజము ఆనందప్రదము. మంగళమయము. లోకమున ఒక సంచార తీర్థరాజము - ప్రయాగ అది. రామభక్తి అను గంగానదీధార అందున్నది. బ్రహ్మవిచార ప్రచారమను సరస్వతియు అందు కలదు. చేయవలయు కర్మలను, చేయతగనివానిని తెలుపునదియు, కలిమలములను హరించునదియు అగు నదియే సూర్యకుమారి-యమునానది. హరిహరుల కథలు త్రివేణియై విరాజిల్లుచున్నవి. వానిని వినిన చాలు - సకల ఆనందములు, మంగళములు త్రివేణియే ప్రసాదించును.

స్వధర్మమున నిశ్చలమగు విశ్వాసమే ప్రయాగయందలి అక్షయ వటవృక్షము- శుభకర్మలే ఆ తీర్థరాజమునందలి సమాజము. సాధు సజ్జనరూపమున ఉండు ఆ తీర్థరాజము అన్ని దేశములయందును, అన్ని సమయములయందును అందరికి అందుబాటున ఉండును. సాదరముగా దానిని సేవించినచో అది క్లేశములను తొలగించును. వర్ణనాతీతమైన, లోకోత్తరమైన తీర్థరాజము ప్రయాగ. అది ఫలితమును వెంటనే ప్రసాదించును. దానిప్రభావము ప్రత్యక్షము.

సాధు సమాజరూపమగు ఈ తీర్థరాజముయొక్క ప్రభావమును ముదితమనస్కులై వినువారు, తెలిసికొనువారు, అత్యంత అనురాగమున దీనియందు స్నానమాడువారు ఈ శరీరములతోనే ధర్మ, అర్థ, కామ, మోక్షములను చతుర్విధఫలములను పొందగలరు. ఈ తీర్థమున స్నానముచేసిన ఫలము వెంటనే కానుపించును. కాకి కోయిల అగును. కొంగ హంస అగును. దీనిని విని ఎవ్వరునూ ఆశ్చర్యపడనక్కరలేదు. సత్సంగముయొక్క మహిమ దాగదు.

వాల్మీకి, నారదుడు, కుంభసంభవుడు తమ చరిత్రలను స్వయముగా తామే తెలిపిరి. జలచరములు, భూచరములు, నభోచరములు - జడచేతన జీవులు సృష్టియందు ఎన్ని ఉన్నవో వానిలో - ఏవి. ఎప్పుడు ఎక్కడ ఏ యత్నముచేనైనను జ్ఞానమును, కీర్తిని, సద్గతిని, ఐశ్వర్యమును, మేలును పొందినవనినచో అది అంతయు సత్సంగముయొక్క ప్రభావమే అని తెలిసికొనుడు. వీనిని పొందుటకు వేదమున కాని, లోకమున కాని వేరొక ఉపాయము లేదు. సత్సంగము లేనిచో వివేకము కలుగదు. రామకృప లేనిదే సత్సంగము సులభముగా లభింపదు. ముదమునకు, కల్యాణమునకు మూలము సత్సంగము. సత్సంగప్రాప్తియే ఒక ఫలము. సాధనలన్నియు దాని పుష్పములు. సత్సంగమువలన దుష్టులు సంస్కరింపబడుదురు. పరశువేదియొక్క స్పర్శచే ఇనుము బంగారమైనట్లే ! విధివశమున సజ్జనుడు దుస్సాంగత్యమున పడినచో సర్పము యొక్క మణివలెనే అతడు తన గుణములనే అనుసరించును. దుస్సాంగత్యప్రభావము అతనిపై ఉండదు. సాధువులమహిమను వర్ణించుటయందు బ్రహ్మ, హరి, హరుడు, కవులు, పండితులు సహితము న్యాయము చేకూర్పలేరైరి. ఇక నే నెట్లు వర్ణింపగలను ? కూరల నమ్మువాడు మణులయొక్క గుణగణములను తెలుపగలడా ? సాధు సజ్జనులకు నమస్కరింతును. వారి చిత్తములయందు సమానత్వమే రాజిల్లును. వారికి ఒకడు హితుడు కాడు. ఇంకొకడు అహితుడు కాడు. దోసిటియందుంచిన మంచి పూవులు రెండుచేతులకు సుగంధమును ఈయవా ? సాధుజనులచిత్తములు సరళములు. జగత్తునకు హితకరములు. సజ్జనులస్వభావము, ప్రేమ నాకు ఎఱుకయే. నా ఈ పసితనపు ప్రార్థనలను ఆలకించి, కృపఉంచి, శ్రీరామ చరణములయందు నాకు ప్రీతి కలిగించుడని వారిని ప్రార్థింతును.

ఇక ఖలులకు సహితము సత్యమగు భావనతో మ్రొక్కుదును. ఏ ప్రయోజనము తమకు లేకపోయినను వారు తమకు మేలుచేసినవారికే కీడు చేతురు. హితము చేసిన పరులకు హాని కలిగించుటయే వారిదృష్టిలో లాభము. ఒకరు నాశనమైనచో వీరికి ఆనందము. ఇంకొకరు బాగుపడినచో వీరికి విషాదము. హరిహరుల యశమను పూర్ణచంద్రునికి నీరు రాహుగ్రహములు. పరులను నిందించుటయందు వీరు సహస్ర బాహునివంటి వీరులు. ఇతరుల దోషములను ఎన్నుటకు వీరికి వేయికన్నులున్నవి. పరహితమనబడు నేతికి ఈగలు వీరు. తేజమున వీరు అగ్నితుల్యులు. రోషమున మహిషేశులగు యములు. పాపము ! వీరు పాపఅవగుణ ధనమున కుబేరసములు. వీరి అభివృద్ధి ఎల్లరి హితమును నాశనమొనర్చు తోకచుక్క వంటిది. కుంభకర్ణునివలె వీరు నిద్రించి ఉండుటయే మేలు. వడగళ్లు పొలములను నాశనము చేయును. అవియును నశించిపోవును. అట్లే ఖలులు ఇతరులపనులను పాడుచేయుచూ తామునూ నశింతురు. దుష్టులు పరులదోషములను వేయినోళ్లతో, అతిరోషముతో వర్ణింతురు. ఆదిశేషునికి సమానులు ఈ ఖలులు. వీరికినీ వందనమొనర్తును. పరుల పాపములను పదివేల చెవులతో విందురు వీరు. పృథుభూపాలునివంటివారు వీరు. [భగవానుని యశమును వినుటకు పదివేల చెవులు కావలెనని పృథువు కోరెనట] ఖలులకు మరి ఒకసారి ప్రణమిల్లుదును. ఖలులు ఇంద్రునివంటివారని తెలిసికొని వారికి వినయమున నమస్కరింతును. ఖలులకు సురానీకము కడు హితకారి, శ్రేష్ఠమైనది. వజ్రమువలె కఠోరమగు వచనములు ఖలులకు సదా ప్రీతి. పరులదోషములను వేయికన్నులతో వీరు వీక్షించుచుందురు. శత్రువులు కానిండు. మిత్రులు కానిండు, తటస్థులు కానిండు- ఎవరు మంచి చెప్పినను వీరు మండిపోదురు. ఈ విషయము నాకు తెలియును. కనుకనే ఈ దాసుడు రెండుచేతులు జోడించి ఖలులకు వినతిచేయుచున్నాడు. నా పక్షమున నేను వినతి కావించితిని. ఐన నేమి? వారు చేయవలసినది వారు తప్పరు. మాలకాకిని అతి గారాబమున పెంచుడు. మాంసము తినుట అది ఎన్నడైన మానునా ? సజ్జనుల, దుర్జనుల చరణములకు నమస్కరింతును. ఇరువురు దుఃఖము కలిగించువారే. కాని వారియందు కొంత వ్యత్యాసము కలదు. సజ్జనుల ఎడబాటు దుఃఖదాయకము. అది ప్రాణములను హరించును. దుర్జనసంగమము దారుణ దుఃఖప్రదము. జగమున అందరూ ఒకేచోట జన్మించినను జలజము. జలగలవలె వారిగుణములు వేఱు వేఱు, సాధువులు అమృత తుల్యులు, ఖలులు మదిరవంటివారు, సజ్జనులు, దుర్జనులు జన్మించినది జగమను అగాధ సముద్రముననే, మంచివారు, చెడ్డవారు తమ తమ చర్యలనుబట్టియే సత్కీర్తినికాని. అపకీర్తినికాని ఐశ్వర్యముగా అర్జింతురు. సుధ, సుధాకరుడు, సురనది - సాధువులు. గరళము, అనలము, కలిమలములు ప్రవహించు కర్మనాశనది - వేటకాడు - వీనిగుణములు, అవగుణములు అందరు ఎఱుగుదురు. ఎవరికి ఏది రుచించిన అదియే వారికి మంచిదనిపించును. మంచివాడు మంచినే గ్రహించును. నీచుడు నీచత్వమును గ్రహించును. అమరత్వమును ప్రసాదించుటకు పేరుకనినది అమృతము. మృత్యువు నిచ్చుటకు పేరుపొందినది గరళము. ఖలుల పాపములు, దుర్గుణములు - సజ్జనగుణగాథలు - రెండునూ అపారసముద్రములు; అగాధములు. వీని గుణదోషములు కొన్నియే వర్ణించితిని. విచక్షణలేకయే వానిని గ్రహింపజాలము - త్యజింపనూలేము. మంచి చెడ్డలు రెండునూ బ్రహ్మ సృష్టించినవే. గుణదోషములను విచారించి వానిని వేదములు వేరు చేసినవి. విరించి సృజించిన ఈ ప్రపంచము గుణ, అవగుణ మిశ్రమమని వేదములు ఇతిహాసములు, పురాణములు వచించుచున్నవి. సాధుజనులు - ఖలులు; సుజాతి - కుజాతి దానవులు - దేవతలు, ఉచ్చ - నీచములు, అమృతము - విషము, సుందరజీవనము - మృత్యువు, మాయ బ్రహ్మ, జీవుడు - జగదీశ్వరుడు, సంపద - దారిద్ర్యము, రాజు - పేద, కాశీ-మగధ, గంగ- కర్మనాశి, మార్వాడు - మాలవ, భూసురుడు - కసాయి, స్వర్గము - నరకము, అనురాగము-విరాగము-అను వీనినన్నిటిని వేదశాస్త్రములు గుణదోషవిభాగము చేసినవి. జడ, చేతనమగు ఈ విశ్వమును గుణదోషమయముగా విధాత సృజించినాడు. సజ్జనులనబడు హంసస్వరూపులు దోషములనబడు జలమును విడిచి, గుణములనబడు క్షీరమును గ్రహింతురు. ఇట్టి వివేకమును విధాత ప్రసాదించినపుడు దోషములను త్యజించి గుణములయందే మనస్సు అనురక్తమగును. కాలస్వభావమున, కర్మప్రాబల్యమున సాధుసజ్జనులు సహితము మాయావశులగుదురు. అప్పుడప్పుడు సన్మార్గమునుండి పొరపడుదురు; తప్పిపోదురు. హరిభక్తులు ఆ దోషములను సంస్కరించుకొందురు. దుఃఖమునిచ్చు ఆ దోషములను నాశనమొనర్చి నిర్మలయశమును పొందుదురు. అట్లే ఖలులు సహితము సత్సంగమువలన అప్పుడప్పుడు మేలును కావింతురు. కాని ఎన్నడునూ భంగము కానట్టి - వారి మలినస్వభావముమాత్రము మారదు. మంచి దుస్తులను ధరించిన కపటులను, వంచకులనుకూడా ఆ వేషముయొక్క ప్రతాపముచే లోకము పూజించును. తుట్టతుదకు ఏదో ఒకనాడు వారి మోసము బయటపడక తప్పదు. తుదివరకు వారి కపటము కొనసాగదు. కాలనేమి, రావణ, రాహువుల గతివలెనే ! చెడువేషములు ధరించినను సాధువులకు సన్మానమే జరుగును. జాంబవంతునికి, హనుమంతునికి జగమున ఆ రీతినే జరుగలేదా ! దుస్సాంగత్యమువలన హానియు, సత్సాంగత్యములచే లాభము కలుగును. ఇది లోకవిదితము. వేదకథితము అందరు ఎఱిగినదే ఇది. గాలితో కలిసి ధూళి ఆకాశమున ఎగురును. అదియే పల్లమునకు ప్రవహించు నీటితో కలసినచో బురదలో కలసిపోవును. చిలుకలు, గోరువంకలు - సాధుసజ్జనుల ఇండ్లలో పెరిగినచో ''రామ-రామ'' అనును. అవియే దుర్జనులవద్ద పెరిగినచో అదేపనిగా, చెప్పరాని తిట్లు తిట్టును. దుస్సాంగత్యమువలననే పొగ - నల్లగా మసిఅగును. సత్సాంగత్యముచే అదియే చక్కని సిరాయై పురాణములు వ్రాయుటకు పనికివచ్చును. ఆ పొగయే నీరు, నిప్పు, గాలితో కలసి మేఘముగా మారి లోకమునకు జీవనదాత అగును.

గ్రహములు, ఔషధములు, జలము, గాలి, వస్త్రము. ఇవి అన్నియు మంచి వానితో కలసి మంచిపదార్థము లగును. చెడ్డవానితో కలయుటచే అవియే చెడుపదార్థములగును. మంచిలక్షణములు కలవారు దీనిని గ్రహింపగలరు. నెలయందలి రెండు పక్షములయందు చీకటి-వెలుగులు సమానములే. వీని పేర్లలోమాత్రము విధాతభేదము చూపించినాడు. ఒక పక్షమునందు చంద్రుడు వృద్ధి చెందును. రెండవదానియందు క్షీణత పొందును. ఆ వృద్ధి, క్షీణతలను అనుసరించి ఒక పక్షమునకు కీర్తి, మరి ఒక దానికి అపకీర్తి విధాత ప్రసాదించినాడు.

జగమునఉన్న జడ, చేతన జీవులన్నియు 'రామ' మయమని ఎఱిగి వాని అన్నిటి చరణకమలములకు కరములు జోడించి వందనము చేతును. దేవతలకు, దానవులకు, నరులకు, నాగులకు, ఖగములకు, ప్రేతములకు, పితృదేవతలకు, గంధర్వులకు, కిన్నరులకు, రజనీచరులకు, ప్రణామము కావింతును. ఇక వీరెల్లరు నన్ను కృపచూతురుగాక ! నాలుగువిధములగు జీవులు- ఎనుబదినాలుగులక్షల యోనులలో - నీటిలో. భూమిపై ఆకాశమున వసించును. వీనితో నిండిఉన్న ఈ జగమంతయు సీతారామమయము. ఈ సత్యమును తెలిసి - కరయుగములు జోడించి వీనికి ప్రణమిల్లుదును. నేను మీ దాసుడనని ఎరిగి - కృపానిధులగు మీ రెల్లరు కలసి. కపటము విడిచి నాపై దయచూపుడు.

నా బుద్ధిబలమున నాకు నమ్మకములేదు. కనుక మీకెల్లరకు వినతి చేయుచున్నాను. రఘుపతియొక్క మహాగుణములను వర్ణింపవలెనని నా ఇచ్ఛ. నా బుద్ధి అల్పము రామచరిత అగాధము. కావ్యముయొక్క ఏ అంగముకాని, ఎట్టి ఉపాయముకాని నాకు తోచుటలేదు. నా మతి నిరుపేద. మనోరథముమాత్రము ఎంతోగొప్పది. నా బుద్ధి అత్యంతనీచమైనది. కోరికలో అతి ఉన్నతమైనవి. అమృతము సేవించవలెనని నాకోరిక. జగమున ఎక్కడనూ చల్లని మజ్జిగయైనను దొరకదు ! సజ్జనులు నా సాహసమును మన్నింతురుగాక ! బాలుర చిలుకపలుకలను తల్లిదండ్రులు ముదితమానసులై విందురు. అట్లే నా బాలవచనములను మనస్సు లగ్నముచేసి వినవేడుచున్నాను. పరుల దోషములనే భూషణములుగా ధరించు క్రూరులు. కుటిల మానసులు. చెడు తలచువారు నవ్వుదురు. రసవంతముగా ఉండనిండు. రసహీనమై ఉండనిండు - ఎవరి కవిత వారికి రుచించును ! ఇతరుల రచనలు విని ఆనందించు పురుషవరులు లోకమున ఎక్కువమంది లేరు. సరస్సులను, నదులనుపోలు నరులు జగమున పెక్కురున్నారు - సోదరా. సరస్సులు, నదులు నీరు వచ్చిపడినచో వరదలతో పొంగిపోవును. తమ అభివృద్ధిని కాంచియే ఇవి ఆనందించును. సజ్జనులు సాగరమువంటివారు. పూర్ణచంద్రునిచూచి పొంగిపోవుసముద్రమువలె పరుల అభివృధ్ధిని కని ఆనందించు సజ్జనులు సకృత్తుగా ఉందురు. నా అదృష్టము అల్పము. అభిలాష అధికము. కాని నాకు ఒక్కవిశ్వాసమున్నది. దీనిని విని సజ్జనులు సంతసింతురు. ఖలులు పరిహసింతురు. దుష్టులు పరిహసించిన నాకు హితమే. కోయిల కలకంఠము కఠోరమని కాకి అనును. హంసనుచూచి కొంగ నవ్వును. చాతకపక్షిని కనుగొని కప్ప నవ్వును. అట్లే మలినబుద్ధికల ఖలుడు నిర్మలవాణిని పరిహసించును. కవితారసికుడు కానివానికి, రామచరణములయందు ప్రేమ లేనివానికి ఈ రచన ఆనందమగు హాస్యము కలిగించనిండు. ఇది ఒక దేశభాషారచన. నాది మూర్ఖపుబుద్ధి. ఇది నవ్వతగినదే. నవ్వుటయందు వారి దోషమేమియు లేదు. ప్రభుని పాదములయందు ప్రేమ లేనివారికి, సరియైన తెలివి లేనివారికి - ఈ కథ వినుటకు చప్పగానే ఉండును. హరిహరుల చరణములయందు ప్రీతి కలవారికి, కుతర్కబుద్ధి లేనివారికి రఘువరునికథ మధురము.

ఈ కథ రామభక్తిచే భూషితమైనదని సజ్జనులు తెలిసికొందురు. కమనీయమగు వాణితో దీనిని కొనియాడుదురు. విందురు. నేను కవిని కాను. వాక్యరచనా ప్రవీణుడను కాను. సకలకళాహీనుడను. సర్వవిద్యా విహీనుడను.

నానావిధములగు అక్షర, అర్థ అలంకారము లున్నవి. అనేకరీతులగు ఛందస్సులు, ప్రబంధములు, భావములయందు అపారభేదములు. కవితలో పలు రీతులగు గుణదోషములు కలవు. వీనిలో ఏ ఒక్క కవితావివేకమును గురించిన జ్ఞానము నాకు లేదు. క్రొత్త కాగితముమీద ఇట్లు వ్రాసి సత్యము పలుకుదును. నా రచన సకలగుణరహితమైనది. కాని - దీనిలో విశ్వవిదితమగు ఒక్క గుణమున్నది. దానినిగురించి ఆలోచించి నిర్మలజ్ఞానులగు సుమతులు దీనిని విందురుగాక. దీనియందు రఘుపతి యొక్క మహత్తరమగు నామమున్నది ! అతి పావనమైనది ఆ నామము. శ్రుతుల పురాణముల సారము అది. మంగళములకు అది మందిరము. అది అమంగళములను హరించును. ఉమాసమేతుడగు పురారి దానిని జపించును.

సుకవి రచించిన అనుపమమగు కవితయైనను - రామనామము లేనిదే శోభించదు. చంద్రవదన అగు సుందరి సర్వాలంకారభూషితయైనను వస్త్రవిహీనయైనచో శోభిల్లదు ! కుకవి రచించిన కవిత - సకలగుణరహితమైనను - రామనామముచే, యశముచే అంకితమైనదని తెలిసికొని బుధులు సాదరముగా దానిని వర్ణింతురు. విందురు. మధురకరములవలె సజ్జనులు సద్గుణములనే గ్రహింతురు !

ఈ నా రచనలో కవితారసము ఒక్కటియూ లేదు. కాని దీనియందు రాముని ప్రతాపము ప్రకటమై ఉన్నది. నా మనస్సున ఒక్కటే విశ్వాసము. సత్సంగముచే ఘనత పొందనివారు లేరనియే. అగరుయొక్క సంపర్కమువలన పొగయును సుగంధమును పొందును. పొగవాసన పోవును. నా కవిత గ్రామ్యమై, అందవిహీనమైనదే. కాని జగన్మంగళకారి అగు ఉత్తమవస్తువు ఇందు వర్ణింపబడినది.

రఘునాథుని కథ మంగళకరము. కలిమలములను అది హరించును. నా ఈ వక్రరచనాస్రవంతీగమనము పావన గంగానదివలెనే వక్రమైనది. ప్రభుని సుయశముతో కలయుటచే అదియును సుందరమగును. సజ్జనులమనస్సులను రంజింపచేయును. స్మశానమునందలి బూడిద శివునిసాంగత్యమువలన మనోహరమగును. స్మరణమాత్రమున అది పావనమొనర్చును ! శ్రీరామునికీర్తితో మిళితమైనందున నా కవనము ఎల్లరకు అత్యంత ప్రియమగును. మలయపర్వత సాంగత్యముచే సాధారణమగు కట్టె చందనగంధమునుపొంది వందనీయమగుచున్నది ! ఆ కట్టెనుగురించి ఎవ్వరైనను ఆలోచింతురా ! ఆవు నల్లనిదైనను దానిపాలు తెల్లనివై గుణముకలవై ఉండును ! ఆ పాలను అందరు త్రాగుదురు. దేశభాషయందైనను సీతారాముల యశమును బుధులు ఉత్సాహముతో వర్ణించుచున్నారు వినుచున్నారు.

మణులు, మాణిక్యములు, ముత్యములు, ఎంత శోభ కలిగినవైనను - సర్పము, పర్వతము, ఏనుగులతలలపై ఉన్నచో అవి రాణించవు. రాజుల కిరీటములయందు, తరుణుల శరీరములయందు వానికి అధికమగు శోభ. అట్లే సుకవుల కవిత - దానిని గ్రహింపకలిగిన వారివద్దనే భాసిల్లును. ''కవియొక్క భక్తివలన - అతడు స్మరించి నంతనే శారద బ్రహ్మలోకమునువదలి పరుగెత్తుకొని వచ్చు''నని బుధులు పలుకుదురు. సరస్వతి పడిన ఈ శ్రమ, అలసట రామచరిత మానససరోవరమున ఆ కవిస్నానము చేసిననే తప్ప ఇతర కోటిఉపాయములచేతనైనను తొలగదు. ఇట్లు తమ హృదయములయందు భావించి కవులు, కోవిదులు కలియుగమందలి పాపములను హరించు శ్రీహరియొక్క కీర్తిని వర్ణింతురు.

ప్రాపంచిక మానవుల గుణగణములను వర్ణించినచో శారద తల బాదుకొని వగవుచెంద సాగును. హృదయము సముద్రమునకు, బుద్ధి ముత్తెపుచిప్పకు, శారద స్వాతినక్షత్రమునకు సమమని వివేకులు వచింతురు. 'ఉత్తమభావములు' అనుజలము వర్షించినచో రమణీయ ముక్తామణులనుపోలు చక్కని కవిత ఉదయించును. ఆ మణులను యుక్తితో కోపి, రామచరిత అను రమ్యమగు దారమున గ్రుచ్చి, తమ నిర్మలహృదయములయందు సజ్జనులు ధరింతురు. అంతట వారికి అతి అనురాగమును శోభ కలుగును.

భయంకరమగు కలికాలమున జనించినవారియందు చర్యలు కాకివి - వేషము హంసది - కలవా రున్నారు. వేదమార్గమునువీడి కుమార్గమున నడచువా రున్నారు. కపటము మూర్తీభవించినవా రున్నారు. కలియుగ పాపములకు భాండములైనవారున్నారు. రామభక్తులమని ప్రజలను మోసగించువా రున్నారు. కామినీ కాంచనములకు దాసులగువా రున్నారు. పోకిరీచర్యలతో ధర్మధ్వజమును ధరించినవా రున్నారు. కపటమును, ఆడంబరమును మోయువారు కలరు. లోకమున ఇట్టివారిలో మొట్టమొదటి వానిగా గణింపదగినవాడను నేను. నా అవగుణములనన్నిటిని వివరించవలసినచో కథ పెరిగిపోవును. అంతమే ఉండదు. కనుక చాలా తక్కువగనే వర్ణించితిని. అభిజ్ఞులు ఈ కొలదిగుణములతోనే గ్రహించగలరు.

వివిధవిధములగు ఈ నా వినతులను గ్రహించి ఈ కథను వినువా రెవ్వరునూ దోషమును ఆపాదించకుడు. ఇంకనూ శంకించువారు నా కన్నను అధికమూర్ఖులు, బుద్ధి లోపించినవారు.

నేను కవినికాను. చతురుడ ననిపించుకొనజాలను. నా బుద్ధిని అనుసరించి రాముని గుణములను వర్ణించుచున్నాను. రఘుపతియొక్క అపారచరిత్ర ఎక్కడ? ప్రపంచాసక్తుడగు తులసీదాసు బుద్ధి ఎక్కడ? మేరుపర్వతమును ఎగురకొట్టు గాలి ముందు దూది ఒక లెక్కయా ఏమి? రాముని అమితమహిమను గుర్తించి నా మానసము కథారచనకు ముందువెనుక లాడుచున్నది. శారద, శేషుడు, మహేశుడు, విరించి, ఆగమములు, నిగమములు, పురాణములు 'నేతి-నేతి' అని నిరంతరము ఎవని గుణగణములను వర్ణించునో ఆ ప్రభునిమహిమ అనిర్వచనీయమని ఎల్లరకు తెలియును. ఐనను వర్ణింపక ఎవ్వరూ ఉండలేదు.

భజనయొక్క ప్రభావము బహువిధముల వర్ణింపబడినదని వేదములు వివరించినవి.

భగవానుడు ఏకమాత్రుడు. ఇచ్ఛారహితుడు. ఆతనికి రూపము లేదు, నామములేదు. పుట్టుక లేదు. ఆతడు సచ్చిదానందస్వరూపుడు. పరంధాముడు. సర్వవ్యాపకుడు. విశ్వరూపుడు. శరీరధారియై అతడే నానావిధములగు చరితలను కావించును. ఆ చరితలు, లీలలు కేవలము భక్తుల హితముకొరకే. అతడు పరమకృపాళుడు. శరణన్నవారి యెడల ఆతనికి కడు అనురాగము. భక్తజనులపై అతనికి అతి మమత. అతి దయయును. అతడు ఎవనియందైనను కరుణ చూపెనా - ఇక ఎన్నడూ అతనికి వానిపై కోపము రాదు. ఆతడు పేదలపై కృప చూపును. కోల్పోయినవస్తువులను ప్రాప్తింపచేయును. రఘునాథుడు సరళస్వభావుడు. సర్వశక్తివంతుడు. ఈశ్వరుడు. బుధజనులు ఈ విషయమును గ్రహించి శ్రీ హరియొక్క కీర్తిని వర్ణింతురు. తమ వాక్కును పునీతము, సత్ఫలము నిచ్చుదానినిగా చేసికొందురు. ఆ ఈశ్వరబలముచేతనే - రామపాదములకు ప్రణమిల్లి రఘుపతియొక్క గుణగాథలను వర్ణింతును. ఇట్లే పూర్వము కవులు హరికీర్తిని వర్ణించిరి. గానము చేసిరి. సోదరా. వారి మార్గమున చనుట నాకును సుగమము కదా.

అతి అపారమగు మహానది ఉండును. నరపాలుడు దానికి వంతెన నిర్మించును. ఒక చిన్న చీమయు దానిపై ఎక్కి, శ్రమలేకయే ఆవలి ఒడ్డును చేరును. ఇట్లు నా మనస్సునకు ధైర్యముచూపి రఘునాథుని రమణీయకథను రచింతును, వ్యాసాది కవిపుంగవులు అనేకులు అమిత ఆదరమున హరియశమును వర్ణించిరి. వారి అందరి చరణకమలములకు వందనమొనర్తును. నా మనోరథములనన్నిటిని వారు సఫలము కావింతురుగాక ! రఘుపతియొక్క గుణములను వర్ణించిన కలియుగమందలి కవులకు ప్రణమిల్లుదును. దేశభాషలలో హరి చరిత్రను వర్ణించిన అత్యంత బుద్ధిమంతులగు ప్రాకృత కవులకు - పూర్వము ఉన్నవారికి, ఇప్పుడు ఉన్నవారికి - ఇకముందు ఉండబోవువారికి - ఎల్లరకు - కపటమంతయు వీడి ప్రణమిల్లుదును. వారెల్లరు ప్రసన్నులై సాధుసమాజమున నా కవిత గౌరవము కాంచునట్లు వరమిత్తురని ప్రార్థింతును. అభిజ్ఞులు ఆదరించని రచనను మూర్ఖులగు కవులు సహితము వ్యర్థపరిశ్రమగనే పరిగణింతురు.

గంగానదివలె ఎల్లరకు హితము కలిగించిననే - కీర్తి, కవిత, ఐశ్వర్యము ఉత్తమము లనబడును. రాముని సత్కీర్తి అతి సుందరమైనదియే. మరి నా కవిత అట్లు కాదుకదా. ఇది చిక్కుతో కూడినవిషయమే. కనుకనే నాకు సందేహము. ఐనను మీ దయతో ఇదియునూ నాకు సులభమగును. పట్టుతోచేసిన కుట్టుపని గోనెపట్టాలమీదనైనను అందముగనే ఉండును. సరళము, నిర్మలము అగు చరిత్రను వర్ణించు కవితను నిపుణులు ఆదరింతురు. దానిని విని శత్రువులు సహితము తమ సహజవైరమును విస్మరించి ప్రశంసించునట్లు ఉండవలెన. నిర్మలమగు బుద్ధిలేనిదే అట్టి కవిత ఉదయించదు. మరి - నా బుద్ధిబలము అతి అల్పము. పదేపదే మిమ్ము ప్రార్థింతును. హరికీర్తిని నేను వర్ణింపకలుగునట్లు అనుగ్రహింపుడు.

కవులారా, కోవిదులారా, 'రామచరిత' అను మానససరోవరమునందలి మంజుల మరాళములు మీరు. బాలుడనగు నా వినతిని వినుడు. నా కోర్కెను కనుగొనుడు. నన్ను దయకనుడు. 'ఖరుని' గురించి వివరించునదైనను సుకోమలమైనది. మంజులమైనది రామాయణము. 'దూషణ' సహితమైనను దోషరహితమైనది రామాయణము. దానిని రచించిన [వాల్మీకి] మునియొక్క పాదపద్మములకు వందనము కావింతును.

భవసాగరమును తరించుటకు నావలవంటివి, రఘువరుని నిర్మలకీర్తిని వర్ణించుటయందు క్షణమైనను శ్రమ చెందనివి ఆగు చుతుర్వేదములకు వందనమొనర్తును.

సాధుమూర్తులగు సుధ, శశి, సురధేనువులను, దుష్టగరళమును. మదిరను కలిగిన భవసాగరమును సృజించిన విధాతయొక్క పాదరేణువునకు ప్రణమిల్లుదును, దేవతల, విప్రుల, బుధుల, గ్రహములపాదములకు చేతులు జోడించి మ్రొక్కుదును. 'ప్రసన్నులైనా మంజుల మనోరథములనన్నిటిని సఫలము చేయుడ'ని వారిని వేడుదును. శారదకు, సురనదికి మరి ఒకసారి నమస్కరింతును. వీ రిరువురు పునీత చరిత్రులే. మనోహరచరిత్రులే. తనయందు స్నానము చేసినవారి, తన నీటిని త్రాగిన వారి పాపములను ఒక తల్లి [సురనది] హరించును. తనమగురించి వినివారి. తెలిసినవారి అజ్ఞానమును మరి ఒక అమ్మ [శారద] హరించును.

భవానీ మహేశులు నాగురువులు, నాజననీ జనకులు. దీనబాంధవులు, నిత్యదాన నిరతులు. సీతాపతికి సేవకులు, అధిపతులు, సఖులు, తులసీదాసునకు సర్వవిధముల కపటరహితులగు హితకరులు. అట్టి పార్వతీపరమేశ్వరులకు ప్రణామము చేతును. గిరిజాహరులు కలికాలమును వీక్షించిలోకహితమునకై శాబర మంత్రజాలములను రచియించిరి. ఆ మంత్రాక్షరములు అనన్యమైనవి. వానికి సరియగగు అర్థము ఉండదు. జపవిధానము ఉండదు. ఐనను మహేశ్వరుని ప్రతాపమువలన వాని ప్రభావము ప్రత్యక్షము. ఆ ఉమేశుడు నాకు అనుకూలుడగుగాక. ఈ కథయొక్క ముడ మంగళములకు ఆతడు మూలకారణుడగుగాక. శివ, పార్వతులను స్మరించి, వారి ప్రసాదమును స్వీకరించి, ఉత్సాహభరిత చిత్తములతో రామచరితను వర్ణింతును. శివునికృపచే నా రచన తారాచంద్రులతో కూడిన రేయివలె వెలుగొందుగాత! ప్రేమయుతులై, జాగరూకలై ఈ కథను వినువారు. వినిపించువారు కలియుగ పాపరహితులగుదురు. సన్మంగళముల భాగస్వాములగుదురు. రామచరణానురాగు లగుదురు.

హరునికి, గౌరికి స్వప్నమందైనను నాయందు ప్రసన్నత ఉన్నచో దేశభాషయందలి ఈ నా రచనకు నేను రచించిన ప్రభావము సర్వము సత్యమగును.

అత్యంతపావని అగుఅయోధ్యాపురికి, కలి కలుష వినాశని అగు నరయూనదికి వందనము చేతును. ప్రభునికి అమిత మమత కలిగిన ఆ అయోధ్యయందలి స్త్రీలకు, పురుషులకు ప్రణమిల్లుదును. సీతను నిందించుటవలన ప్రాప్తించిన వారి పాప జాలములు నశించెను. వారు శోకరహితులై పరముపదమును పొందిరి.

సకలజగమున కీర్తివ్యాపించిన కౌనల్యఅను పూర్వదిశకు వందనము కావింతును. విశ్వమునకు సుఖప్రదుడు, ఖలులనబడు కమలములకు తుషారము వంటివాడు అగు రఘపతి అను పూర్ణచంద్రుడు ఆ పూర్వదిశను ఉదయించెను. సుకృత, సుమంగళములమూర్తిదశరథుడు. సకల రాణీసహితుడగు ఆతనికి మనో, వాక్‌, కర్మలచే ప్రణామము చేతును. తమ పుత్రుని సేవకుడనని ఎంచి నన్ను వారు కృపచూతురుగాత. వారిని సృష్టించి విరించియే ఘనత కాంచినాడు. శ్రీరాముని జననీ జనకులై నందున వారు మహిమకు అవధులైరి. రామపాదములయందు దశరథునికి స్వచ్ఛమగు ప్రేమ, దీనదయాళుడగు ప్రభుని వియోగము కలిగినంతనే ప్రియమగు తన తనువును తృణమువలె త్యజించినవాడు ఆ అయోధ్యాపతి. ఆతనికి నా వందనములు.

రామచరణములయందు విగూఢమగు ప్రేమకలిగిన జనకుడు యోగమునందును. భోగమునందును తన ప్రేమను గోప్యముగా ఉంచెను. రాముని వీక్షించగనే ఆ ప్రేమప్రకటమయ్యెను. అట్టి జనకునికి, ఆతని పరిజనమునకు ప్రణామము లాచరింతును.

రాముని సోదరు లందరియందు ముందుగా భరతునికి మ్రొక్కుదును. భరితుని నియమములు, వ్రతములు వర్ణింపజాలము. ఆతని మనస్సు రామచరణపంకజముల యందు మధుపమువలె మోహితమయ్యెను. అది ఎన్నడునూ వానిని వీడదు.

చల్లనివాడు, చక్కనివాడు, భక్తసుఖప్రదాత లక్ష్మణుడు. రఘుపతి కీర్తిఅను విమల పతాకమునకు అతని యశము ధ్వజము. లక్ష్మణుని పాదకమలములకు నా ప్రణామములు. సహస్రశీర్షుడు, జగత్కారణుడు అగు శేషుడు భూదేవియొక్క భయమును పారద్రోలుటకు అవతరించెను. గుణాకరుడు, కృపాసాగరుడు అగు సౌమిత్రి నాయందు సదా అనుకూలు డగుగాక.

శూరుడు, సచ్ఛీలుడు, భరతుని అనుగామి అగు శత్రుఘ్నుని పాదకమలములకు నమస్కరింతును.

శ్రీరాముడే స్వయముగా ఎవని యశమును వర్ణించెనో ఆ మహావీరునికి, పవన కుమారునికి ప్రణామము చేతును. ఖలులనుబడు వనమును దహించుటకు ఆతడు పానకుడు. మహాజ్ఞాని, శరచాపధరుడగు రాముడు ఆతని హృదయాగారమున నివసించును.

అధమశరీరములతోడనే రాముని పొందకలిగిన కపీశుడగు సుగ్రీవుని భల్లూకపతి అగు జాంబవంతుని, రాక్షస రాజగు విభీషణుని, అంగదాదుల, వానరసమాజము ఎల్లవారి చరణసరోజములకు వందనమొనర్తును. రఘుపతియొక్కచరణములను ఉపాసించుచు, నిష్కామసేవచేయు ఖగముల. మృగముల, సురల, నరుల, అసురుల, అందరి పాదసరోజములకు వందనము చేతును.

శుక సనక నారదాదిమునులకు, భక్తులకు, విజ్ఞానవిశారదులకు - సర్వులకు - ధరణిపై నాశిరమునుంచి ప్రణమిల్లుదును. ఓ మునీశ్వరులారా, నేను మీ దాసుడనని గ్రహించుడు. నన్ను అనుగ్రహించుడు.

జనకసుత, జగజ్జనని, కరుణానిధి అగు రాముని ప్రియతమ అగు జానకి యొక్క చరణకమల యుగళమును స్తుతింతును. ఆమెయొక్క కృపచే నాకు విర్మలమగు బుద్ధి కలుగుగాక.

రాజీవనేత్రుడు, శరచాపధరుడు, భక్తవిపత్తిభంజనుడు, సుఖదుడు అగురఘు నాయకుని పాదకమలములకు మరి ఒకసారి మనో వాక్‌ కర్మలచే వందనము కావింతును.

వాక్కు, దాని అర్థము - జలము, జలతరంగములు - మాటలలో భిన్నములే. వాని పేర్లలోనే భేదము. కాని అవి భిన్నములు కానేకావు. అట్లే సీతారాములు వేఱు వేఱు కాదు. సీతారాముల పాదములకు వందనము చేతును. జానకీరాములకు దీనులు పరమప్రియులు.

రఘువరుని 'రామ' నామమునకు నమస్కారము, అగ్నిబీజమగు 'ర' భాను బీజమగు 'ఆ', చంద్రబీజమగు 'మ' కలసినది ఈ నామము, బ్రహ్మ విష్ణు శివరూపమైనది 'రామ' నామము. వేదములకు ఇది ప్రాణము. నిర్గుణ, అనుపమగుణ విధానము ఇది. మహామంత్రమగు ఈ రామనామమును మహేశ్వరుడు జపించుచుండును. ఈ నామమును ఆతడు కాశీయందు ఉపదేశించును. ఇది ముక్తికారణము. ఈ నామ మహిమను గణనాథుడు ఎఱుగును. రామనామమహిమవలననే ఆతడు అందరికంటె ముందుగా పూజల నందును. రామనామమును వ్యత్యస్తముగా జపించి పరిశుద్ధుడైన ఆదికవి వాల్మీకికి ఆ నామప్రభావము తెలియును. విష్ణుని సహస్రనామములు ఒక్క 'రామ' నామ తుల్యములని భవుడు కావించిన ఉపదేశమును విని భవాని పతితో కలసి రామనామమును జపించును. నామమనిన భవానికి కల ప్రీతిని కనుగొని హరుడు హర్షము చెందెను. వనితాభూషణముగ ఆమెను తన భూషణమును కావించుకొనెను. రామనామప్రభావము శివునికి బాగుగా తెలియును. కనుకనే ఆతనికి కాలకూటము అమృతఫలము నిచ్చినది.

రఘుపతియందలి భక్తి వర్షఋతువు. ఉత్తమసేవకులు ధాన్యము. 'రా-మ' అను ఉత్తమ అక్షరములు - శ్రావణ, భాద్రపద మాసములు. ఈ రెండు అక్షరములు మధురములు. మనోహరములు. వర్ణమాల అను శరీరమునకు ఇవి నేత్రములు. భక్త జనులకు జీవనములు. సర్వజనులు స్మరించుటకు సులభ##మైనవి. సుఖమును ప్రసాదించునవి. ఇహలోకమున లాభప్రదముల ఇవి. పరలోకమున శక్తిప్రదములు. సర్మరించుటకు, జపించుటకు ఈ రెండక్షరములు మధురములు. సుందరములు. తులసీదాసునకు రామ లక్ష్మణువలె ప్రియమైనవి. ఈ రెండు అక్షరములను వేఱు వేఱుగా వర్ణించినచో వానియందు ప్రీతియు వేఱగును. బ్రహ్మము, జీవములవలె సహజముగనే ఇవి కలసి ఉండును. నరనారాయణులవలె ఇవి సుందరసోదరులు. జగమును పాలించునవి. భక్తజనులను విశేషముగా రక్షించునవి. 'భక్తి' అను రమణికి ఇవి కర్ణాభరణములు. లోకహితమునకై ఇవి నిర్మల రవి చంద్రులు. 'సద్గతి' అను అమృతము వలె, భూభారమును వహించు ఆదిశేషునివలె. ఆదికూర్మమువలె, భక్తజనహృదయ కమలములకు మధుపములవలె, - యశోదకు బలరామ, కృష్ణులవలె జిహ్వకు మధురమును, హృదయమునకు సంతృప్తిని ఇవి కలిగించును.

'రామ' నామమునందలి 'ర' కారము గొడుగై, 'మ'కారము మకుటమణియై అన్ని అక్షరములకు అతీతమై విరాజిల్లుచున్నవి. తెలిసికొనినచో 'నామము', ఆనామధారి ఒక్కటే. ఈ రెండింటికి -ప్రభునికి సేవకునికి కల సంబంధమే కలదు. తన నామమును ప్రభువు అనుగమించును. నామము, రూపము రెండునూ ఈశ్వరునికి ఉపాధులు. అవి అనిర్వచనీయమైనవి. అనాదివి. పరిశుద్ధ భక్తికలిగిన బుద్ధవలన మాత్రమే ఇవి తెలియనగును.

నామ, రూపములయందు ఏది ఎక్కువ, ఏది తక్కువ అను ఆలోచన చేయుట అపరాధము. వీనియందలి తారతమ్యము వినిన సజ్జనులు తెలిసికొనగలరు. నామమునకు అధీనమై ఉన్నట్లు రూపము కనపడును. నామములేనిదే రూపజ్ఞానము కలుగదు. రూపము మనచేతిలోనే ఉన్నను నామము తెలియనిదే ఆ రూపమును గుర్తింపలేము. రూపము లేకున్నను దాని నామమును స్మరింపవచ్చును. విశేషమగు ప్రేమతో ఆ రూపము మన హృదయముల గోచరించును.

నామరూపముల స్థితియొక్క కథ అనిర్వచనీయము. దానిని తెలిసికొనినచో ఆనందము కలుగును. దానివి వర్ణింపలేము. సగుణ నిర్గుణములకు మధ్య నామము చక్కని సాక్షి. నిపుణుడగు ద్విభాషివలె అది వానిని బాగుగా బోధించును. నీ అంతరంగమున, బహిరంగమున జ్యోతిని కాంక్షింతువేని 'రామ' నామమును ఒకమణిదీపమువలె నీ 'జిహ్వ' అను ముఖద్వారపు గడపవద్ద నిలుపుము తులసీ.

బ్రహ్మ సృష్టించిన ఈ ప్రపంచమునుండి విడివడిన విరాగులు, యోగులు, ఈనామమును జిహ్వతో జపించుచు మేల్కొని ఉందురు. నామ రూపరహితము, అనుపమము, అనిర్వచనీయము, అనామయము అగు బ్రహ్మానందమును అనుభవింతురు.

ఈశ్వరుని నిగూఢరహస్యమును తెలియకోరువారు జిహ్వతో నామమును జపించియే దానిని తెలిసికొందురు. ప్రేమమగ్నులై సాధకులు నామజపముచేతనే ఆణిమాదిసిద్ధులనుపొంది సిద్ధులగుదురు. ఆర్తులగు భక్తులు నామము జపించినచో వారి మహాదుష్టసంకటములన్నియు నశించిపోవును. వారును సుఖమును పొందగలరు. జగమున చతుర్విధ రామభక్తులున్నారు. ( ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, జ్ఞానులు). వీరందరు సుకృతులే, అనషులే. ఉదారులే. చతురులగు ఈ భక్తులకు నలువురికి నామమే ఆధారము. వీరిలో జ్ఞాని-ప్రభునికి విశేషప్రియుడు. నాలుగు యుగముల యందును, చతుర్వేదములయందును నామము ప్రభావముకలిగియే ఉన్నది. కలియుగమున నామప్రభావము మరింత విశేషము. నామముతప్ప మరి ఒక శరణ్యము లేదు. సకలకామనారహితులై రామభక్తిరసమున లీనమైనవారు సహితము నామమును రమణీయ ప్రేమామృత సరోవరమున తమ మానసములను మత్స్యలను కావింతురు.

సగుణ నిర్గుణములు బ్రహ్మయొక్క రెండు స్వరూపములు. రెండునూ అని ర్వచనీయములే. అగాధములైనవే. అనాదియు అనుపమమునై నవియే. నా అభిప్రాయమున ఈ రెండింటికంటెను నామమే గొప్పది. స్వశక్తిచే అదిసగుణ నిర్గుణములను తనవశము కావించుకొన్నది. ''ఇట్లు నుడువుట ఈ దాసుని సాహసమే'' అని కాని, కేవలము ఇది కావ్యప్రౌఢి అని కాని సజ్జనులు తలంపకుందురుగాక. నా మనస్సునందలి విశ్వాసము, ప్రేమ, రుచులనుబట్టియే నేను ఇట్లు వచించుచున్నాను. సగుణ, నిర్గుణములు అగ్నివంటివి. ప్రకటముకాని అగ్నికి సమానము నిర్గుణము. అగ్ని కట్టెల యందుకలదు. కాని కనుపించదు. వెలువడిన నిప్పువంటిది సగుణము. అది ప్రత్యక్షముగా కనుపించును. తెలిసికొనుట రెండునూ అతి కఠినమే. నామమువలన తెలిసికొనుటకు రెండునూ సులభమగుచున్నవి. కనుకనే బ్రహ్మముకంటెను, రాముని కంటెను నామము గొప్పదని నేను వచించుట.

బ్రహ్మ సర్వవ్యాపకుడు. ఏకమాత్రుడు. అవినాశి. సత్తా, చైతన్య, ఆనందఘనరాశి. అట్టి అవినాశి అగు ప్రభువు సర్వహృదయములయందు ఉన్ననూ జగమందలి జీవులు దీనులై దుఃఖితులై ఉన్నారు. నామమును విరూపణచేసి, యథార్థ స్వరూపమును తెలిసికొని, నామ జపమును సాధనచేసినచో - రత్నమును తెలిసికొనినపిదప దానిమూల్యము తెలిసికొనగలిగినట్లు - ఆ బ్రహ్మము ప్రకటమగును. ''నిర్గుణము కంటె నామప్రభావము అధికము, అపారము'' అని నేను వచింతును. [రామ] నామము రామునికంటెను గొప్పది. తన భక్తుల హితమునకై రాముడు మానవదేహమును దరించి కష్టములను సహించెను. సాధుజనులను ఆనందింపచేసెను. ప్రేమతో నామ జపమునుచేయుచు భక్తజనులు సహజముగనే ఆనందమునకు, మంగళములకు నిలయులగుదురు. తాపసస్త్రీ అగు అహల్యను ఒక్కతెనే రాముడు తరింపచేసెను. ఆతని నామమో - కోట్లకొలది దుష్టుల దుర్బుద్ధిని సంస్కరించినది. విశ్వామిత్ర ఋషియొక్క హితమునకై సుకేతుని సుత ఆగు తాటకయొక్క సేనను సుతుని రాముడు పరిమార్చెను. ఆతని భక్తుల దోషములను, దుఃఖములను, దురాశలను - దివాకరుడు నిశను నశింపచేయునట్లు ఆతని నామము పిండిచేసివైచును. రాముడు స్వయముగా ధవుని చాపమును భంగపరచెను. భవభయముల నన్నిటివి నామప్రతాపమే భంగము కావించెను. దండకవనమును మనోహరము చేసినాడు ప్రభువు. అసంఖ్యాక భక్త జనుల మనములను పావనమొనర్చినది ఆతని నామము. రఘునందనుడు నిశాచర నికరమును మర్దించినాడు. ఇక ఆతని నామమో - కలికలుషము లన్నిటిని వ్రేళ్ళతో సహా పెకలించివైచినది. రఘునాథుడు శబరికి, జటాయువునకు ఇతర ఉత్తమ సేవకుఅకుముక్తిని వ్రసాదించెను. ఆతనినామము అనేక ఖలులను ఉద్ధరించెను. నామగుణ చరిత వేదవిదితము. సుగ్రీవునికి, విభీషణునికి - రాముడు శరణమిచ్చెను.ఈ విషయము ఎల్లరు ఎరిగినదే. రామనామము అనేకపేదలపై కృవచూపెను. నామము యొక్క ఈ సత్కీర్తి లోకమున, వేదములయందు విఖ్యాతి కాంచినది. భల్లూక, కపి సేనలను సమకూర్చుకొని సేతువును బంధించుటకై రాముడు ఎంతో శ్రమపడెను. కాని, ఆతనినామమును స్మరించినంతనే భవసాగరము ఎండిపోయెను. సజ్జనులారా, యోచించుడు. రావణుని సకులముగా రాముడు వధించెను. సీతాసహితుడై తన పురమునకు తిరిగివచ్చెను. రాజయ్యెను, అయోధ్య ఆతని రాజాధాని, సురలు, మునులు ఆతని గుణగమములను శ్రావ్యముగా కీర్తించిరి. భక్తజనులు ప్రేమయుతులై శ్రమలేకనే నామమును స్మరించి మోహముయొక్క ప్రబలదళమును జయింతురు. ప్రేమమగ్నులై స్వీయానందమున విహరింతురు. నామప్రసాదమున వారికి ఎట్టి విచారము కలలోనైనను కలుగదు. బ్రహ్మముకంటెను, రామునికన్నను రామనామము మహత్తరమైనది. వరప్రదాతలకు సహితము ఇది వరములను ప్రసాదించును. మహేశ్వరుడు ఈ విషయమును తన హృదయమున గ్రహించియే శతకోటి రామచరితలనుండి 'రామ' నామమును గ్రహించెను. నాప్రసాదమువలననే శంభుడు అవినాశి అయ్యెను. అమంగళ వేషధారియైనను - మంగళరాశి అయ్యెను. శుకశౌనకాది సిద్ధులు, మునులు, యోగులు నామప్రసాదముచేతనే బ్రహ్మానందమును అనుభవింతురు. నామమహిమ నారదునికి తెలియను. సర్వలోకప్రియుడు శ్రీహరి. హరిహరు లిరువురికి ప్రియుడు నారదుడు. నామము జపించిన ప్రహ్లాదునిపై ప్రభువు కృపచూపెను. ప్రహ్లాదుడు భక్తశిరోమణి అయ్యెను. గ్లానితో ధ్రువుడు హరినామమును జపించెను. స్థిరమగు అనన్యపదమును పొందెను. పావనమగు నామమును స్మరించి పావని రాముని తనవశము గావించుకొనెను. నీచుడగు అజామిళుడు. గజేంద్రుడు, గణిక హరినామ ప్రభావమును ముక్తులైరి. నామమహిమను నేను ఎంతని పొగడగలను? రాముడే నామముయొక్క గుణములను వర్ణింపలేకపోయెను!

రామనామము కలియుగమున కల్పవృక్షము, కల్యాణనిలయము. నామస్మరణ వలననే గంజాయివంటి తులసీదాసు తులసి అయ్యెను.

చతుర్యుగములయందు, త్రికాలములయందు ముల్లోకములలో జీవులు నామ జపమువలన శోకరహితులైరి. సకలపుణ్యములకు ఫలము రామనామమున ప్రేమ కలిగి ఉండుటయే. సజ్జనుల, వేద, పురాణముల అభిమత మే ఇది.

సత్యయుగమున ధ్యానమువలన, త్రేతాయుగమున యజ్ఞమువలన, ద్వాపరయుగమున పూజచే ప్రభువు ప్రసన్నుడగును. కలియుగము కేవలము పాపములకు మూలము. మలినమైది. మానవుల మానసములు కలియుగమున పాపజలధియందలి మీనములు. భయంకరమగు ఈ కలియుగమున రామనామము కల్పతరువు. స్మరణ మాత్రమున నామము ప్రపంచ జంజాటములన్నిటిని నాశనమొనర్చును. కలియుగమున రామనామము అభిమత ప్రదాత. పరలోకమునకు పరమమిత్రము. ఈ లోకమున జనని, జనకుడు రామనామమే.

కలియుగమున కర్మలు లేవు. భక్తిలేదు. జ్ఞానము లేదు. రామనామము ఒక్కటే అవలంబనము. కపటనిధి అగు కాలనేమివంటిది కలియుగము. దానిని సంహరించుటకు సమర్థుడగు బుద్ధిమంతుడు - హనమంతుడే రామనామము. రామనామము నారసింహుడు. కలియుగము - కనకకశిపుడు. జపయోగులు - ప్రహ్లాదులు. సురరిపులను సంహరించి జప మొనరించువారిని సంరక్షించును రామనామము.

ప్రేమభావముననో, శత్రుభావముననో, క్రోధముననో, సోమరితనముననో - ఏవిధముననైనను నామము జపించుటవలన దశదిశలయందును కల్యాణము సంప్రాప్తించును.

అట్టి రామనామమును స్మరించి, రఘునాథునికి శిరమువంటి నమస్కరించి రాముని గుణగణములను వర్ణింతును. నా దోషములనన్నిటిని ఆతడే సవరించును. నాపై కొంత చూపినందున ఆతనికృప తఱుగునా?

ఆహో! ఎంత ఉత్తమస్వామి శ్రీరాముడు! ఎంతనీచసేవకుడను నేను! ఆ దయానిధి నావంకచూచి, కనికరించి నన్ను పాలించినాడు. ఉత్తమస్వామి ప్రార్థనలను వినును. వినగనే ప్రేమను గుర్తించును. అతని లక్షణములు ఇట్లే ఉండునని లోకమున, వేదములయందు ప్రసిద్ధి, ధనవంతుడు - నిరుపేద, గ్రామీణుడు - నగరవాసి, పండితుడు - మూఢుడు, ఆపకీర్తిపాలైనవాడు - యశప్వి, సుకవి - కుకవి, స్త్రీలు - పురుషులు ఎల్లరు తమతమబుద్ధిని అనుసరించి నరపాలుని పొగడుదురు. సజ్జనుడు, బుద్ధిమంతుడు, సచ్ఛీలుడు, ఈశ్వరాంశసంభూతుడు - కృపాళుడు అగు భూపాలుడు అందరిని విని వారి సద్వచనములను, భక్తిని, వినయమును, నడవడికలను గుర్తించును. మధురవచనములతో ఎల్లరను సన్మానించును. ప్రాకృత భూపాలుర స్వభావమే ఇది. ఇక కోసలనాధుడు చతురశిరోమణి కదా. పరిశుద్ధమగు భక్తికి రాముడు ముగ్ధుడగును. జగమున నాకంటె మందమతి కలవాడెవ్వడు? దుర్బద్ధిపరు డెవ్వడు? ఐనను కృపాళుడగు రామునికి శఠుడగు ఈ సేవకునిపై ప్రీతి, అనురాగము. రాళ్ళను నావలుగా, కవులను భల్లూకములను సుమతులగు సచివులనుగా చేసినవాడు రాముడు!

నేను రామ సేవకుడనని అందరు అందరు. నేనును అట్లే వచింతును. ''సీతా నాధునివంటి స్వామికి తులసీదాసువంటి సేవకుడా!'' అను ఎగతాళిని ప్రభువు భరించుచున్నాడు. ఇది నా మహాసాహసము, దోషమునూ. దీనిని వినినచో నరకమున సహితము నాకు స్థానము లేదు. ఈ విషయము తలచి నాకు నేను కల్పించుకొనిన భయము వలన నాకు భయమగుచున్నది. శ్రీరాముడు కలలోనైనను నా సాహస, దోషములపై దృష్టిని మరల్చలేదు. ఈసంగతి విని, కని - తన 'మంచి మనస్సు' అను కన్నులతో విలోకించి, నా భక్తిని, బుద్ధిని ఆతడు కొనియాడెను. ఆతని దాసుడనని నేను నుడువుచున్నను. ఇతరులను నుడువనిచ్చినను నా హృదయమునమాత్రము నా యోగ్యత నాకు తెలియదా? భక్తజనుల హృదయములను గ్రహించియే రాముడు ముగ్ధుడగును. భక్తులు చేసిన పొరపాట్లు, తప్పులు ప్రభుని మనస్సున గుర్తుండవు. ఆయనకు వారి హృదయములే వందలాదిపర్యాయములు గుర్తు. ఏ పాపకారణమున వాలిని ఆతడు వేటకానివలె వధించెనో ఆ తప్పుదారినే సుగ్రీవుడు నడచెను. విభీషణుని చర్యయు అట్టిదే. వారి దోషములను స్వప్నముననై నను రాముడు మనమున తలచలేదు. అంతే కాదు. భరత సమాగమసమయమున ఆతడు వారిని సన్మానించినాడు! రాజసభయందు వారి గుణములను రఘువీరుడు ప్రశంసించినాడు!

చెట్ల నీడను ప్రభువు! చెట్టుకొమ్మలపై కోతులు! ఆ వానరులను సహితము తనతో సమానులుగా కావించెనే ప్రభువు! రామునికి సాటిఅగు శీలనిధి, స్వామి ఎందునూ లేడోయీ తులసీ, రామా, మంగళకరమగు నీ స్వభావము సర్వులకు కల్యాణకరము. ఇదియే నిజమైనచో తులసీదాసునకునూ నిరంతర కల్యాణమే.

ఇట్లు నా గుణదోషములను నుడివితిని. మరి ఒకసారి ఎల్లరకు శిరమువంచి. వందనమొనరించి రఘువరుని విమలయశమును - ఇక వర్ణింతును. దీనిని వీనినచో కలియుగపాపములు నశించును.

మనోహరమగు ఈ రామకథను యాజ్ఞవల్క్యుడు భరద్వాజమునివరునికి వచించెను. వారి సంవాదమునే నేను వర్ణింతును. సజ్జనులెల్లరు దీనిని ఆనందముగా ఆకర్ణింపుడు, పూర్వము ఈ సుందరచరితను శంభుడు రచియించెను. కృపతో ఆతడు దీనిని ఉమకు వినిపించెను. ఆ చరిత్రనే - కాకాభుశుండి రామభక్తుడనియు, యోగ్యుడనియు ఎంచి శివుడు ఆతనికి వివరించెను. ఆకథనే కాకభుశుండివద్ద యాజ్ఞవల్క్యుడు తిరిగి తెలిసికొనెను. యాజ్ఞవల్క్యుడు భరద్వాజునికి వర్ణించిన కథ అదియే. ఆ వక్తయు, శ్రోతయుతుల్యశీలవంతులే. సమదర్శులే. హరిలీలలను తెలిసికొనినవారే. తమ జ్ఞానముచే వారు త్రికాలములను కరతలామలకముగా తెలిసికొనిరి. చతురులగు హరిభక్తులు ఈ చరితను అనేకవిధముల వివరింతురు. విందురు. తెలిసికొందురు. ఇదే కథను వరాహక్షేత్రమున నేను నా గురుముఖమున తెలిసికొంటిని. కాని ఆనాడు నేను బాలుడును. ఏమియు తెలియనివాడను. దీనిని తగురీతిని తెలియలేకపోతిని. నిగూఢమగు రామకథయొక్క శ్రోత, వక్త - ఇరువురు జ్ఞాననిధులై ఉండవలెను. మరి నేనో - కలి కలుషములచే పీడింపబడు మహా మూఢుడగు జడజీవిని. ఎట్లు తెలిసికొనగలను ఆ కథను నేను? ఐనను - పలుమారులు నా గురువు చెప్పిన కథ అది కనుక నా బుద్ధిని అనుసరించి స్వల్పముగామాత్రము తెలిసికొంటిని, దానినే ఇప్పుడు నా మానస సంతృప్తికొరకై దేశభాషలో రచింతురు. నా బుద్ధి, వివేకముల శక్తిని అనుసరించి నా హృదయమున జనించిన శ్రీ హరిప్రేరణచే ఆకథను నుడువుదును. సంసారమనునదిని దాటుటకు నావయు, నా సందేహ, అజ్ఞానములను, భ్రమను తొలగించునదియు అగు కథను వివరింతును.

రామకథ పండితులకు శాంతిని ప్రసాదించును. సకలజనులను రంజింపచేయును. కలి కలుషములను హరించును. కలియుగమను సర్పమునకు అదిభరణీ మంత్రము. వివేకమను అగ్నిని వెలువరించు ఆరణి అది. కలియుగమున సర్వకామ్యములను సఫలమొనర్చు కామధేనువు రామకథ. సజ్జనులకు చక్కని సంజీవనీ మూలిక అది. వసుధాతలమున అమృతతరంగిణి అది. జనన మరణ భయభంజని అది. భ్రమ అను మండూకమును భక్షించు సర్పిణి అది. అసురసేనవంటి నరకమును అది నాశనము మొనర్చును. సాధు, విబుధకులములకు హిత మొనరించు గిరికుమారి అది. సజ్జన సమాజమను పయోధికి అదిరమాదేవి. విశ్వభారమును వహించుటకు అచల అగు భూదేవి అది. యమదూతలకు మసిపూయుటకు ఈ లోకమున అది యమునానది. జీవులకు ముక్తిని ప్రసాదించుటయందు కాశీయే అది. పావని అగు తులసివలె అది రామునికి ప్రియమైనది. తులసీదాసునకు ఆతని జనని హులసివలె హృదయ హితకారిణి. మేఖలాశైలసుత అగు నర్మదవలె రామకథ శివునికి ప్రియమైనది. సర్వసిద్ధులకు, సుఖసంపత్తులకు రాశి ఈ కథ. సద్గుణ స్వరూపులగు సురగణములకు మాత అగు అదితికి తుల్యమైనది. రఘువరునియందలి భక్తి ప్రేమలకు పరమావధి రామకథ.

రామకథ మందాకినీ నది. నిర్మలచిత్తమే చిత్రకూటము. సుందరప్రేమయే సీతారములు విహరించిన వనము. రామచరిత రమ్యమగు చింతామణి. భక్తుల సన్మతి అను వనితకు అది మనోహరమగు శృంగారము. రాముని గుణ గణములు జగత్కల్యాణకరములు. ముక్తిని, సంపదను, పరమధామమును, ధర్మమును ప్రసాదించునవి అవి. జ్ఞాన, వైరాగ్య యోగములకు అవి సద్గురువులు; భయంకర భవరోగమును నాశనమొనర్చు ఆశ్వినీదేవతలు. సీతారాములయందు ప్రేమ జనించుటకు అవి జననీ జనకులు. సకలవ్రతములకు, ధర్మములకు నియమములకు అవి బీజములు. పాపమును, సంతాపమును, శోకమును రాముని గుణములు పోగొట్టును. ఇహపరలోకముయందు అవి మన రక్ష. జ్ఞానమను రాజునకు అవి వీరులగు సచివులు, లోభమను అపారపారావారమునకు అగస్త్యుని వంటివి అవి. భక్తజన మాననములయందలి కామము, క్రోధము, కలిమలము అను ఏనుగులను పరిమార్చు సింహములు అవి. పురారికి పూజ్యులు, ప్రియతములు అగు అతిథులు అవి. దరిద్రమను దావానలమును చల్లార్చుటకు అవి కామ్యములనిచ్చు మేఘములు. విషయసౌఖ్యము లనబడు సర్పములవిషమును హరించుటకు అవి మంత్రములు, మహామణులును. లలాట లిఖిత ప్రారబ్ధరేఖలను అవి తుడిచివేయును. మోహాంధకారమును హరించుటకు భాను కిరణములు అవి. సేవకులనబడు ధాన్యమును సంరక్షించుటకుఅవి మేఘములు. అభిమతములను ఈడేర్చు కల్పతరువులే అవి. హరిహరులవలె అవి సులభ సేవ్యములు. సుఖప్రదములు. సుకవులనబడు శరదృతువునకు మానసమను నభమున రాజిల్లు తారాగణములు అవి. రామభక్తుల జీవనధనమే రామ గుణగణములు - సకల సుకృతములఫలములు. మహాభోగములకు సమములు అవి. జగత్తునకు కపట రహితమగు హితము కూర్చుటయందు అవి సాధుసజ్జనులను పోలినవి. సేవకుల మానసము లనబడు మానససరోవరమునకు హంసలు అవి. పావనమొనరించుటయందు అవి గంగాతరంగ మాలలవంటివి. కుమార్గగాములను, కుతర్కవాదులను, దుర్వృత్తి సంచారులను, కలియుగ కపటులను, దంభులను, పాషండులను, భస్మము చేసివైచు ఇంధనమునకు ప్రచండ అగ్ని అవి.

రాకాచంద్రుని కిరణములవలె రామచరిత ఎల్లరకు సుఖము నిచ్చును. సజ్జను లనబడు కలువల, చకోరముల మానసములకు విశేష హితకారి, బహుప్రయోజన ప్రదాయిని అది.

భవాని శంకరుని ఏ రీతిని ప్రశ్నించెనో, శంభుడు ఏ విధిని వర్ణించి వివరించెనో అంతయు విచిత్రమగు కథగా ఆ కారణములన్నిటిని రచించి వర్ణింతును.

ఈ కథను ఇంతవరకు విని ఉండనివారు ఇప్పుడు విని ఆశ్చర్యము పొందవలదు. అలౌకికమగు ఈ కథను విను జ్ఞానులు - లోకమున రామకథ అనంతమైనదని తెలిసికొని ఆశ్చర్యము చెందరు. వారి మానసములయందు అట్టి విశ్వాసముండును. రామావతారము అనేకవిధముల జరిగెను. అపారములగు శతకోటి రామాయణములున్నవి. కల్పభేదముల ననుసరించి హరియొక్క సుందరచరితను మునీశ్వరులు బహురీతుల వర్ణించిరి. ఈ భేదములనుగురించి హృదయమున సందేహము వలదు. సాదరముగా ప్రేమతో ఈ కథను ఆకర్ణింపుడు.

శ్రీరాముడు అనంతుడు. ఆతని గుణములు అనంతములు. ఆతని కథల విస్తృతికిని అంతము లేదు. నిర్మలభావము కలవారు ఈకథను విని అచ్చెరువొందరు. ఇట్లు సంశయములనన్నిటిని దూరముచేసి, గురుచరణ పంకజరజమును శిరమున ధరించి. మరి ఒకసారి కరములమోడ్చి ఈ కథారచనయందు ఏ దోషము ఆపాదింపబడకుండుగాక అని వినతి ఒనర్తును.

ఇక సాదరముగా శిరమువంచి శివునికి నమస్కరించి శ్రీరాముని గుణగాథను విశదముగా వర్ణింతును.

(క్రీ. శ. 30-3-1574) పదహారువందల ముప్పదిరెండవ సంవత్సరమున ఈ కథారచనను ప్రారంభించితిని. చైత్రమాసమున నవమీ మంగళవారమున అయోధ్యా పురియందు ఈ చరిత్ర ప్రకటమయ్యెను. ఆనాడు రాముని జన్మదినము. సర్వతీర్థములు ఆ దినమున అయ్యోధకు తరలివచ్చును. ఈది వేదవాక్కు, అసురులు, నాగులు, పక్షులు, నరులు, మునులు దేవతలు - అందరు ఆనాడు అయోధ్యకు ఏతెంతురు. రఘునాయకుని సేవింతురు. సజ్జనులు రామ జనన మహోత్సవమును జరుపుదురు. రాముని రమ్యయశమును గానము చేతురు.

ఆ దినమున సజ్జనబృందములు సరయూనదీ పావనజలముల స్నానమొనర్చి సుందర శ్యామలగాత్రుడగు శ్రీ రాముని తమ హృదయముల ధ్యానింతురు. ఆతని నామమును జపింతురు. సరయూనదీ దర్శన, స్పర్శన, స్నానములు, ఆ నదీజల పానము పాపములను హరించునని వేద, పురాణములు నుడువుచున్నవి. సరయూనది అతి పునీతమైనది. దానిమహిమ అమితమైనది. నిర్మలమతి అగు సరస్వతియైనను ఆ మహిమను వర్ణింపజాలదు.

శోభాయమానమగు అయోధ్యాపురి రామధామమును ప్రసాదించును. సకలలోక ములయందు ఆ పురి ప్రసిద్ధమైనది.అతి పావనమైనదియును. లోకమున నాలుగు విధములగు జీవులు - అనంతమైనవి ఉన్నవి. అయోధ్యయందు తనువును త్యజించిన జీవులకు ఈ లోకమున ఇక జన్మ ఉండదు.

అయోధ్యానగరము సర్వవిధముల మనోహరమైనదనియు, సకల సిద్ధులను ప్రసాదించుననియు, మంగళములకు గని అనియు తెలిసికొని విమలమగు ఈ కథను నేను ఆరంభించితిని. దీనిని వినినచో కామ, మద, దంభములు నశించును.

దీనిపేరు రామచరిత మానసము, ఈ పేరు విన్నంతనే శాంతి లభించును. విషయములనబడు అగ్నియందు పడి భస్మమగు 'మనస్సు' అను ఏనుగు రామచరిత మానసమున వచ్చి పడినచో సుఖి ఆగును. రామచరితమానసము మునులకు ప్రియకరము. సుందరము, పావనము ఆగు దీనిని సంభుడు రచియించెను. త్రివిధ దోషములను, దుఃఖములను, దారిద్ర్యమును, కలియుగ కుతంత్రములను, కలి కలుషములను ఇది నాశనమొనర్చును.

మహేశుడు దీనిని నిర్మించి తన మానసముననే దాచిఉంచెను. మంచి సమయమును కనుగొని ఆతడు దీనిని పార్వతికి వినిపించెను. తన హృదయమున హరుడు దీనిని వీక్షించి, హర్షము జెంది దీనికి 'రామచరిత మానసము' అను పేరు పెటెను. సాదరముగా మనస్సును లగ్నముచేసి మహాత్ములారా, వినుడు.

ఈ రామచరిత మానసము ఎట్టిదో, ఎట్లు రచింపబడినదో, ఏ కారణమున ఇది లోకమున ప్రచారముకాంచెనో ఆ విషయమంతయు నేను ఇప్పుడు ఉమా-వృషకేతులను స్మరించి వచింతును.

శంభుని ప్రసాదముచే ఈ తులసీదాసుని హృదయమున సద్బుద్ధి, ఆనందాతిరేకము ఉప్పొంగెను. అంతట ఈతడు రామచరిత మానసకవి, అయ్యెను! తన బుద్ధిని అనుసరించి దీనిని మనోహరముగా ఈతడు రచించుచున్నాడు. సజ్జనులారా, సన్మతితో దీనిని అవధరింపుడు. సంస్కరింపుడు.

సద్బుద్ధి అనునది భూమి. హృదయము దానియందలి అగాధస్థలము. వేదములు, పురాణములు సాగరము. సాధుసజ్జనులు మేఘములు. రాముని సత్కీర్తి అను మధుర, మనోహర, సుందర, కల్యాణ కరజలమును అవి వర్షించును. ఇక వర్ణింపబడు [రాముని]సగుణలీలలు ఆ వర్షపు జలముయొక్క స్వచ్ఛత. ఆ నిర్మలత్వము మలినములను నశింపచేయును. వర్ణనాతీతమగు ప్రేమభక్తియే ఈ జలమునందలి మాధుర్యము, సుశీతలతయు. రాముని సుయశమును సత్కర్మ అను ధాన్యమునకు హితకారీయు రామభక్తులకు జీవనమే అది. ఆ పావనజలము బుద్ధి అను భూమిపై పడినది. సుందర శ్రవణ రంధ్రమార్గగమున ప్రవహించినది. 'మానసము' అను పవిత్రప్రదేశమును నింపినది. అచ్చట స్థిరపడినది. సుఖదమై, శీతలమై, రుచికరమైనది.

బుద్ధిని, ఆలోచనలను వినియోగించి ఈ మానసమున ఆత్యంత రమణీయము. ఉత్తమము అగు నాలుగు సంవాదములను రచించితిని. [భుశుండి-గరుడసంవాదము, శివ పార్వతుల సంవాదము. యాజ్ఞవల్క్య-భరద్వాజ సంవాదము, తులసీ-భక్త సంవాదము]. పవిత్రములగు ఈ సంవాదములు సుందరమగు ఈ సరోవరమునకు నాలుగు మనోహరఘట్టములు. సప్తకాండలు ఈ రమణీయ సరోవరమునకు సప్తసోపానములు. వీనిని జ్ఞాననేత్రములతో వీక్షించినంతనే మనస్సు ప్రశాంతమగుగను. రఘుపతియొక్క నిర్విఘ్న, నిర్గుణమహిమయే ఈ జలముయొక్క ఆగాధమగు లోతు. ఆ మహిమను వర్ణింతును. సీతారముల కీర్తి ఆమృతసమమగు జలము, ఉదహరింపబడిన ఉపమాలంకారములు ఇంపగు తరంగములు. రమణీయమగు చౌపాయీలే ఈ సరోవరమున వ్యాపించిన కమలములు. ఇందలి కవితాయుక్తులు మనోహరమగు మణులను ప్రసవించు ముత్యపుచిప్పలు. కమనీయమగు చందస్సు-సోరఠులు, దోహాలు, ఈ సరో వరమునందలి బహురంగుల రంజిల్లు కమలసమూహములు. ఈ మానసమునందలి అనుపమమగు ఆర్థములే పుష్పపరాగము. మంజులమగు భావములే మకరందము, మధురమగు భాషయే సుగంధము. పుణ్యపుంజయే మధుపముల మంజులమాల. జ్ఞాన, వైరాగ్య, విచారములు మరాళములు. కవితయందలి ధ్వని, వక్రోక్తి, గుణము, జాతులు మనోహరములగు బహువిధమత్స్యములు. ధర్మ, ఆర్థ, కామ, మోక్షములు నాలుగు, జ్ఞాన, విజ్ఞాన, విచారములు, నవరసములు, జప, తప, యోగ, వైరాగ్యములు ఈ సరోవరమునందలి సుందర లచరజీవములు. సాధుజనులయొక్క, రామనామము యొక్క గుణగానము విచిత్ర జలవిహంగములు. సజ్జన సదస్సు ఈ సరోవరము యొక్క నాలుగుదిశల ఉన్న మామిడితోటలు, శ్రద్ధయే వసంతఋతువని వర్ణింపబడినది. వివిధవిధములగు భక్తినిరూపణము, క్షమ, దయ, దమాదులు లతావితానములు. మనో విగ్రహము, యమ, వియమములు పుష్పములు, జ్ఞానము ఫలము. హరిపాదభక్తియే వేదములయందు వర్ణింపబడినట్లు ఈ జ్ఞానఫలరసము. ఇందలి అనేక కథాప్రసంగములు - పరోవరమునందలి రంగురంగుల చిలుకలు, కోకికలు, పులకింపజేయు ఘట్టములు వాటికలు, ఉద్యానవనములు, వనములు. సుఖదము, సుందరమగునది పక్షుల విహారము. మంచిమనస్సే తోటమాలి. సుందరనేత్రములయందలి ప్రేమజలముతో ఆతడు ఆ వనమును తడుపును. ఈ చరిత్రను సావధానముగా గానము చేయువారు ఈ తటాకపు చతురసంరక్షకులు. రామచరితను సాదరముగా శ్రవణముచేయువారు - స్త్రీలు, పురుషులు ఈ మానససరోవరమునకు అధికారులగు ఉత్తమదేవతలు. అతి దుష్టులు విషయలాలసులు - అభాగ్యులగు కొంగలు, కాకులు, ఈ సరోవరసమీపమునకే రాజాలరు వారు. ఈ సరోవరమున నత్తలు, కప్పలు, నాచులవంటి విషయభోగములకు సంబంధించిన నానావిధ కథలు లేవు. అందుచే పాపము - కాకులు, కొంగల వంటి కాముకులు ఇక్కడకు రాగానే ఆశాభంగము పొందుదురు. ఈ సరోవరమువద్దకు వచ్చుటయే బహుకష్టము. రాముని కృపలేనిదే ఇచ్చటికి రాజాలరు. ఘోరమగు దుస్సాంగత్యమే భయానకమగు దుర్మార్గము. దుస్సంగులవచనములే పులులు, సింహములు, సర్పములు, కుటుంబ ఇబ్బందులు, గృహవ్యాపారములు దుర్గమమగు అతి విశాలశైలములు. మదము, మోహము, మానము భయంకర అరణ్యములు. నానా విధములగు కుతర్కములే భయానకమగు నదులు.

శ్రద్ధ అను దారిభత్యముకాని, సాధు, సజ్జన సాంగత్యముకాని లేనివారికి, రఘునాథునియందు ప్రేమలేనివారికి ఈ మానససరోవరము అగాధమే. ఎవడైనను కష్టములనన్నిటిని సహించి ఈ సరోవరమును చేరినను, చేరినవెంటనే వానికి చలిజ్వరమువలె నిద్ర వచ్చును. గడ్డ కట్టించు చలి వచ్చినట్లు వానిహృదయమున తిమ్మిరి పుట్టును. దానితో ఆ అభాగ్యుడు అక్కడకు చనియు స్నానము చేయజాలడు. సరోవరమున స్నానముకాని, జలపానముకాని చేయలేక అభిమానయుతుడై ఆ అభాగ్యుడు వెనుకకు మరలును. ['నీవు వెడలివచ్చితివి కాద! ఆ సరోవర మెట్లున్నది? అని] ఎవరైన ప్రశ్నించినచో అతడు ఆ సరోవరమును నిందిచును. ప్రశ్నించినవారిని మందలించును. శ్రీరాముడు తన సత్కృపాకటాక్ష వీక్షణములను ఎవరిపైననైనను ప్రసరించినచో [అట్టివారిని] ఈ విఘ్నములన్నియు బాధింపవు. అట్టివారే భక్తియుక్తులై ఈ సరోవరమున స్నానము చేతురు. మహాఘోరతాపత్రయములు వారిని దహింపజాలవు. రామచరణములయందు నిర్మలప్రేమ కలిగిన వారు ఈ సరోవరమును ఎన్నడూ విడువరు. సోదరా, దీనియందు స్నానమాడకోరువారు తమ మనస్సులకు లగ్నముచేసి సత్సంగము కావింపనిమ్ము. ఈ మానససరోవరమును మనోనేత్రములతో వీక్షించి, దానియందు మునిగిని కవి యొక్క బుద్ధి నిర్మలమగును, అతవిహృదయము ఆనందో త్సాహములతో నిండును. ప్రేమ, ప్రమోద ప్రవాహము ఉప్పొంగును. అంతట ఆ నదినుండి రాముని విమల యశమనుజలముతో నిండిన కమనీయ కవితాస్రవంతి ప్రవహింపసాగును. సన్మంగళములకు మూలమగు ఈ నదియే సరయూనది. లోకమతము. వేదమతము. - ఈ రెండు ఈ నదికి చక్కిని గట్లు. సుందర మానససరోవర కుమారి అగు ఈ సరయూనది అత్యంత పావని. కలిమలములను తృణమును. వృక్షములను వ్రేళ్లతో ఇది పెకలించి పారవేయును.

త్రివిధములగు శ్రోతలయొక్క సమాజమే ఈ నిదికి ఇరుప్రక్కలనుండు పురములు, గ్రామముల, నగరములు, సజ్జనసమాజమే సకల సన్మంగళమూలము అనుపమము అగు అయోధ్య.

సుందర యశస్విని. మనోహరి అగు సరయూనది రామభక్తి అనెడు గంగా నదిని కలయుటకు ప్రవహించి దానిలో కలయును.

అనుజసమేతుడగు రాముని పావన సంగ్రామకీర్తి అను సందరమహానదము సోనా-దానిలో లీనమగును. ఈ రెండింటికి మధ్య భక్తి అను గంగానదీ ధార, జ్ఞాన వైరాగ్యములతోసహా శోభిల్లును. త్రినిధతాపములను పారద్రోలు ఈ త్రివేణీసంగమము శ్రీరామ స్వరూపసింధు సమాగమమునకై పరుగిడును. ఈ కీర్తికి మూలము రామచరిత మానసము. ఇది రామభక్తి అను గంగానదిలో విలీనమగును. శ్రోతలగు సజ్జనుల మానసములను పునీతమొనర్చును. ఈ రామచరిత మానసమున నడుమ నడుమఉన్న భిన్న భిన్న విచిత్రకథలు నదీతటమునందలి వనములు, ఉద్యానవనములు.

ఉమా మహేశ్వరుల వివాహమున వరపక్షమువారు ఈ నదియందలి బహు విధములగగు అగణిత జలచరములు. రఘువరుని జననకాల ఆనందోత్సాహములు ఈ నదియందలి సుడిగుండములు, అలలు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యలీలలు ఈ సరోవరమునందలి వికసించిన వివిధరంగుల కమలములు. దశరథభూపాలువి, ఆతని రాణుల, పరిజనుల పుణ్యమే భ్రమరములు, జలవిహంగములు, రమ్యమగు సీతాస్వయంవరకథయే ఈ నదియందు మనోహరసౌందర్యమును ప్రసరించును. పటుతరమగు అనేకప్రశ్నలు ఈ నదియందలి నావలు. ఆ ప్రశ్నలకు వివేకయుతమగు ప్రత్యుత్తరములు నిపుణులగు బెస్తలు. ఈ కథను వినినపిదప దీనినిగురించి జనుల యందు పరస్పరము జరుగు చర్చ - ఈ నదీతటమున పయనించు యాత్రిక బృందము యొక్క శోభ, పరశురాముని క్రోధము ఈ నదియొక్క భయంకర ప్రవాహము. రాముని ఉత్తమవచనములు పటిష్ఠమగు ఘట్టములు.

రాముని, ఆతని సోదరుల వివాహమహోత్సవమే సర్వులకు సుఖదమగు ఈ రామకథ అనునది యొక్కకల్యాణప్రదమగు వెల్లువ.

ఈ కథను విచించియో, లేక ఆలకించియో హర్షము పొందువారు, పులకితులగువారు - పుణ్యాత్ములు. ముదితమనస్కులై ఈ నదిలో స్నానము చేయువారునూ - వారే. రామ పట్టాభిషేకమునకై మంగళద్రవ్యసేకరణ, సన్నాహములు - పర్వముల యందు ఈ నదివద్ద గుమిగూడ యాత్రికబృందము. కై కేయియొక్క దుర్బుద్ధియే ఈ నదియందలి నాచు, మహావిపత్తు దానిఫలితము. అమిత ఉత్పాతములను శాంతపరచు భరతుని చరితయే నదీతీరమున జరుగు యజ్ఞము. దీనియందు వర్ణింపబడిన కలి కలుషములు, ఖలుల అవగుణములు - ఈ నదీజలములోని బురద, కొంగలు, కాకులు.

ప్రఖ్యాతమగు ఈ నది ఆరు ఋతువులయందును రమణీయమై ఉండును. ఎల్ల వేళలందు ఇది అతి సుందరమై, పవిత్రమై ఉండును. ఉమా-శివుల కల్యాణము ఈ ఋతువులలో హేమంతము. రామప్రభుని జన్మోత్సవము సుఖప్రదమగు శిశిరము. శ్రీరామకళ్యాణ సమాజవర్ణనయే ముదప్రదము. మంగళమయము అగు ఋతురాజు -వసంతము, రాముని వనగమనము దుస్సహమగు గ్రీష్మఋతువు, వనమార్గచరిత్రయే కఠినమగు గ్రీష్మము, వడగాలి, నిశాచరులతో ఘోరయుద్ధమే వర్షఋతువు, పంటలకు వర్షమువలె అది దేవతలకు కల్యాణప్రదమైనది. రామరాజ్యమునందలి సౌఖ్యము, వినమ్రత, మహత్వములే- అమలము, సుఖదము, శోభాయకరము అగు శరద్రుతువు. సతీ శిరోమణి అగు సీతయొక్క గుణగాథయే ఈ జలమునందలి స్వచ్ఛ, అనుపమ సద్గుణము. భరతునిస్వభావము ఈ నదియందలి - వర్ణింపకానిదియు, సదా ఒకేరీతిని ఉండునట్టియు, పేదతీర్చు శీతలత్వము. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల పరస్పర అవలోకన, సంభాషణలు, సమాగమము, ప్రే, (మంద) హాసము, రమణీయభ్రాతృత్వము - ఈ నీటియందలి మాధుర్య, సుగంధములు.

నాయొక్క ఆర్తి. వినయము, దీనత - లలితమగు ఈజలముయొక్క లఘుత్వము మాత్రమే. ఈ సలిలము కడు అద్భుతమైనది. దీనినిగురించి వినినంతమాత్రమే గుణమిచ్చును. 'ఆశ' అను దాహమును, మనోమాలిన్యమును ఇది హరించును. రామునియందలి సుందరప్రేమను ఈ జలము పోషించును. సకల కలి కలుషములను, వానివలన ఉత్పన్నమగు గ్లానిని ఇది నశింపజేయును. జన్మ మృత్యు రూప శ్రమను ఎండించును. సంతోషమునే ఇది సంతుష్టపరచును. దురితమును, దుఃఖమును, దోషమును, దారిద్ర్యమును ధ్వంసము కావించును. కామ, క్రోధ, మద, మోహములను ఇది నాశనము కావించును. విమల వివేకమును, వైరాగ్యమును వృద్ధిపరచును. సాదరముగా ఈ జలమున స్నానము చేసినను, దీనిని సేవించినను హృదయపాపము, పరితాపము, తుడిచిపెట్టుకొని పోవును.

ఈ జలమున ఒక్కసారియైనను తన హృదయమును ప్రక్షాళన చేయనివాడు వట్టి పిరికిపంద - కాలికాలముచే భంగపడినవాడు. దాహతోటన్నవాడు ఎండమావులనుచూచి భ్రమపడి అది నీరే అని తలచి పరుగెత్తును. నీరు కనపడదు. ఆతడు దుఃఖితు డగును. తిరిగి వచ్చును. అట్లే కలియొక్క మోసమున పడినవాడు దుఃఖితుడగును.

తన బుద్ధిని అనుసరించి ఈ చక్కని నీటియొక్క గుణములను గుణించి, ఆ జలమున తనమనమును స్నానముచేయించి, భవానీ శంకరులను స్మరించి కమనీయమగు ఈకథను ఈకవి రచించుచున్నాడు.

ఇక - రఘుపతియొక్క పాద పంకేరుహములను నా హృదయమున ధరించి, ఆయన ప్రసాదమును గ్రహించి ఇరువురు మునివరుల సమాగమమునుగురించిన రమణీయసంవాదమును వర్ణింతును.

భరద్వాజముని ప్రయాగయందు నివసించును. రామచరణములయందు ఆ మునికి అత్యంత అనురాగము. ఆతడు తపస్వి, శమ, దమ, దయానిలయుడు. పారమార్థిక పథమున కడు చతురుడు. మాఘమాసమున రవి మకరరాశిని ప్రవేశించినపుడు సర్వజనులు తీర్థరాజమగు ప్రయాగకు వత్తురు. దేవ, దానవ, కిన్నర, నరసమూహములు - ఎల్లరు సాదరముగా త్రివేణియందు మజ్జనమాడుదురు. మాధవుని పాదకమలములను పూజింతురు. తనువులు పులకరింప అక్షయ వటవృక్షమును స్పృశింతురు.

భరద్వాజమునియొక్క ఆశ్రమము అతి పానవమైనది. పరమ రమ్యమైనది. మునివరుల మనసములకు ప్రీతికరమైనది. తీర్థరాజమగు ప్రయాగవద్ద స్నానము చేయుటకు వచ్చు మునులు. ఋషులు ఆ ఆశ్రమమున సమావేశమగుదురు. ప్రాతఃకాలమున వారందరు ఉత్సాహమున స్నానము కావింతురు. హరిగుణగాథలనుగురించి సంభాషింతురు. జ్ఞానవైరాగ్యయుతమగు భగవద్భక్తిని అభివర్ణింతురు. ఇట్లు మాఘమాసమున స్నానమొనరించి తమతమ ఆశ్రమములకు మరలుదురు. ప్రతిసంవత్సరము ఈరీతిని ఇచ్చట అత్యంత ఆనందోత్సాహములు వెల్లివిరియును. మునిబృందములు మకరమున స్నానముచేసి వెడలుదురు.

ఒక మకరమాసమంతయు ఇచట స్నానము కావించి మునీశులెల్లరు తమతమ ఆశ్రమములకు మరలిరి. పరమ వివేకిఅగు యాజ్ఞవల్క్యమహామునియొక్క చరణములను గ్రహించి భరద్వాజుడు ఆతనిని పోనీయక నిలిపెను. యాజ్ఞవల్క్యుని చరణ నరోజములను భరద్వాజుడు కడిగెను. అతి పవిత్రమగు ఆసనమున ఆతనిని ఆసీనునికావించి పూజించెను. ఆతని యశస్సును వర్ణించెను. ఆతి పునీత, మృదువాణితో ఇట్లు నుడివెను:--

''నాథా, నాకు ఒక మహాసంశయము కలదు. వేదతత్త్వమంతయు నీ కరగతమై ఉన్నది. నా సంశయము నుడువుటకు నాకు భయము. లజ్జ కలుగుచున్నవి. పోనీ, చెప్పక ఉందునన్న - హాని సంభవించును. ప్రభూ, గురునిఎదుట రహస్యము దాచినచో హృదయమున నిర్మలమగు జ్ఞానము కలుగనేరదని సజ్జనులు నీతిని వచింతురు. శ్రుతులు, పురాణములు సహితము ఇట్లే నుడువును. మునులునూ ఇట్లే పక్కాణింతురు. దీనిని విచారించి నా ఆజ్ఞానమును ప్రకటించుకొనుచున్నాను. నాథా, ఈ సేవకునిపై కృపచూపుము. ఈ అజ్ఞానమును నాశనము చేయుము. సాధుసజ్జనులు, పురాణములు, ఉపనిషత్తులు రామనామముయొక్క అపరిమితప్రభావమును గానము చేసినవి. జ్ఞాన, గుణరాశి, అవినాశి అగు శివుడు, శంభు భగవానుడు సంతతము రామ నామము జపించును. జగమున ఉన్న నాలుగుజాతుల జీవులు కాశీయందు మరణించుటచే పరమపదమును పొందుచున్నవి. అదియును, మునిరాజు, రాముని మహిమయే. కాశీయందు మరణించువారికి కృపతో శివుడు రామనామమును ఉపదేశించును. ప్రభూ, విన్ను వేడుదును. కృపానిధీ, వాకు వివరించి తెలుపుము. ఈ రాము డెవరు? అయోధ్యాపురీశుని కుమారుడు ఒక రాముడు, ఆతని చరిత లోకమెఱుగును. నారీ విరహమున ఆతడు అపారదుఃఖమును అనుభవించినాడు. రోషముతో రణరంగమున రావణుని సంహరించినాడు. ప్రభూ, ఇతడేనా ఆ రాముడు? లేక త్రిపురారి జపించు రాముడు ఇంకకొ డున్నాడా? నీవు సత్యధాముడవు, సర్వజ్ఞుడవు. వివేకమున విచారించి వివరింపుము. నాథా, భారమగు నా భ్రమ నశించునట్లు ఆ కథను విస్తరించి వచింపుము.''

ఈ మాటలు విని యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి ఇట్లు పలికెను:--

''రఘుపతియొక్క మహిమ నీకు విదితమే. మనోవాక్‌ కర్మలయందు నీవు రామభక్తుడవు. నీ నై పుణ్యము నాకు తెలిసినది. రాముని నిగూఢ గుణగణములను వినవలెనని నీ కోరిక, కనుకనే అతి మూఢునివలె ప్రశ్నించితివి. నాయనా, సాదరముగా మనస్సును లగ్నముచేసి వినుము. రాముని రమణీయకథను వివరింతును. మహా అజ్ఞానమనునది మహా మహిషాసురుడు. రామకథ భయంకర కాళిక. రామకథ చంద్రకిరణముల వంటిది. భక్తచకోరములు దానిని సదా పానము చేయుచుందురు. ఇట్టి నంశయమే ఒకప్పుడు భవానికి గలిగెను. అంతట ఆమెకు మహాదేవుడు అంతయు వర్ణించి చెప్పెను. నా బుద్ధిని అనుసరించి ఆ ఉమా-శంభుల సంవాదమును ఇపుడు తెలుపుదును. ఏ సమయమున, ఏ కారణముచే అది సంభంవించెనో వివరింతును. మునీ, వినుము. నీ విషాదము తొలగును.

త్రేతాయుగమున ఒకప్పుడు శంభుడు ఋషి అగు కుంభజుని దర్శించెను. ఆయనవెంట జగజ్జనని సదీభవాని ఉన్నది. అఖిలేశ్వరుడని గుర్తించి శంభుని అగస్త్యుడు పూజించెను. మునివర్యుడు రామకథను వీవరించెను. పరమానందమున మహేశుడు దానిని వినెను. పరిపూర్ణమగు హరిభక్తినిగురించి ఋషి శివుని ప్రశ్నించెను. అగస్త్యుడు యోగ్యుడని ఎంచి శంభుడు ఆతనికి భక్తినిగురించి వివరించెను. రఘుపతియొక్క గుణగాథలను తెలుపుచు, వినుచు గిరీశుడు కొన్నిదినములవరకు అచ్చటనే వసియించెను. పిదప మునియొక్క ఆనతిని వేడి త్రిపురారి దక్షకుమారీ సహితుడై స్వీయభవనమునకు వెడలెను.

ఆ సమయమున భూభారమును తొలగించుటకై శ్రీహరి రఘువంశమున అవతరించెను. అవినాశి అగు ఆతడు తండ్రి ఆనతిచే రాజ్యమును త్యజించి, తాపసియైదండకాటవిని చరించుచుండెను. ''ఆతని దర్శనము ఎట్లు లభించునా?'' అని శంకరుడు విచారించుచుండెను.

''ప్రభువు గుప్తరూపమున అవతరించెను. నేను వెడలి ఆయనను సందర్శించినచో అందరికి వెల్లడి అగునే!'' అని ఆతడు చింతించెను; శంకరునిహృదయమున ఈ విషయమై అత్యంతకలత కలిగెను. సతీదేవిసహితము ఈమర్మమును ఎఱుగదు. రహస్యమును బయట పెట్టుటకు శంకరుడు భయపడుచున్నాడు. ఆతని నయనములు భగవానుని దర్శనమునకై ఉవ్విళ్లూరుచున్నవి.

''మానవువిచేతిలో మరణము తనకు కావలెనని రావణుడు వేడెను. విధి యొక్క వచనములను సత్యము కావించవలెనని ప్రభుని కోరిక, ప్రభునివద్దకు నేను వెడలినచో నేను పశ్చాత్తాపము చెందవలసివచ్చును'' అని ఈశుడు విచారించుచుండెను; ఉపాయమేదియు ఆతనికి తోచలేదు. ఇట్లు ఆతడు చింతావశుడయ్యెను. అదేసమయమున నీచుడగు రావణుడు మారీచునివద్దకు చనెను. ఆతనిని తనవెంట కొనివచ్చెను. వెంటనే మారీచుడు కపటకురంగ మయ్యెను. మూఢుడగు రావణుడు మోసమున వై దేహిని హరించెను. రామప్రభుని ప్రతాపము వానికి తెలియదు. ఆ లేడిని సంహరించి అనుజునితోకలసి శ్రీహరి ఆశ్రమమునకు తిరిగివచ్చెను. [ఆచ్చట సీత లేదు.] ఆతనికన్నులు నీరు నిండెను. వరునివలె రఘునాథుడు విరహవ్యాకులు డయ్యెను సోదరు లిరువురు అడవిలో సీతను వెదకుచూ తిరిగిరి. ఎవనికి ఎన్నడు సంయోగవియోగము లనునవి లేవో అట్టి ఆతనియందే విరహదుఃఖము ప్రకటమయ్యెను! రఘుపతియొక్క చర్యలు అతి విచిత్రమైనవి. పరమజ్ఞానులుమాత్రమే వానిని తెలిసికొనగలరు. మందబుద్ధులు ఆజ్ఞానవశులై తమ హృదయములయందు ఆన్యథాతలతురు.

ఆ సమయమున శంభుడు రాముని వీక్షించెను. ఆతని హృదయమున ఆత్యంత హర్షము జనించెను. ఆ సౌందర్యాంబుధిని, శ్రీరాముని హరుడు కన్నులార కాంచెను. కాని అది సమయము కాదని తలచి రామునితో ఆతడు పరిచయము కావించుకొనలేదు.

''జగత్పావనుడగు సచ్చిదానందుని జయము'' అని పలుకుచు మన్మథసంహారి శివుడు వెడలెను. కృపానికేతనుడు పదేపదే పులకితుడగుచు సతీసమేతుడై చమచుండెను. సతీదేవి శంభుని పరిస్థితిని అవలోకించెను. ఆమె మనస్సున మహాసందేహము జనించెను.

''శంకరుడు జగముచే వందనీయుడు, జగదీశుడు. సురలు, ముమలు అందరు అతనికి తలవంచి నమస్కరింతురు. అట్టి ఆతడు ఒకరాకుమారునికి ప్రణమిల్లినాడు. సచ్చిదానందుడు. పరంధాముడు ఆవినాడు ఆతనిని. ఆ రాజపుత్రుని సౌందర్యమును చూచి నిగ్రహించుకొనచాలనట్లు - హృదయమున ప్రేమమగ్నుడైనాడు!

సర్వవ్యాపకుడు, మాయారహితుడు, అజన్ముడు, ఆగోచరుడు, ఇచ్ఛారహితుడు, భేదరహితుడు, వేదములకు ఆగోచరుడు అగు బ్రహ్మము-దేహమును ధరించినరు డగునా? ఒక వేళ సురలహితమునకై మానవశరీరమును తాల్చినను విష్ణుభగవానుడు త్రిపురారివలె సర్వజ్ఞుడు కాడా? జ్ఞానధాముడు, శ్రీపతి, అసురారి ఆగు ఆతడు ఆజ్ఞనివలె స్త్రీకొరకై అన్వేషించునా? ఐనను శంభుని పలుకులు అనృతము కానేరవు. శివుడు సర్వజ్ఞుడని సర్వులకు తెలియును.'' అని సతీదేవిమనము అపారసంశయము మొలకెత్తెను. ఆమె హృదయమున ఏవిధమునను జ్ఞానోదయము కలుగదాయెను. భవాని ఎంతమాత్రము తన సందేహమును ప్రకటించలేదు. అంతర్యామి అగు హరుడు అంతయు తెలిసికొన్నాడు.

''సతీ, ఇదిగో వినుము. నీది స్త్రీ స్వభావము. ఇట్టి సందేహములను నీ మనమున ఎన్నడూ కలిగిఉండరాదు. అగస్త్యముని ఎవని కథను వచించెనో, ఎవని యందలి భక్తినిగురించి ఆ మునికి నేను వర్ణించితినో - ఆతడే నా ఇష్టదైవము - రఘువీరుడు. జ్ఞానులగు మునులు సేవించునది ఆతనినే. ధీరులగు మునులు, యోగులు సిద్ధులు, సంతతము విమలమగు మనములతో ఎవనిని ధ్యానింతురో, వేదములు, పురాణములు, శాస్త్రము 'నేతి-నేతి' అని ఎవనికీర్తిని గానముచేయునో - అట్టి సర్వవ్యాపకుడు, సకల బ్రహ్మాండనాథుడు, మాయాపతి, పరమస్వతంత్రుడు, నిత్యుడు అగు రాముడు తన భక్తులహితమునకై రఘుకులమణియై అవతరించినాడు' అని ఇట్లు శివుడు అనేకపర్యాయములు బోధించెను. ఐనను ఆతని ఉపదేశము సతీదేవి గ్రహింపజాలకపోయెను. హరియొక్క మాయాశక్తిని తెలిసికొనిన మహేశుడు మందహాసముచేసెను.

'నీ మనస్సున విశేషమగు సందేహమున్నది. వెడలి నీవే ఏల పరీక్షించరాదు! నీవు తిరిగి వచ్చువరకు నేను ఈ వచవృక్షచ్ఛాయనే ఉందును. ఆజ్ఞానజనితమగు నీ భ్రమ దీనితో తీరును. వివేకముతో విచారణచేసి ఆ రీతిని కావింపుము'' అని ఆతడు నుడివెను.

శివుని ఆనతిని గైకొని సతీదేవి చనెను. ''అన్నా! ఎట్లు పరీక్షింతును?'' అని ఆమె ఆలోచించుచుండెను.

ఇక్కడ శంభుడు--- ''ఈ దక్షకుమారికి శుభము కలుగదు. నేను ఎంత చెప్పినను ఈమె సంశయము తొలగదాయెను. విధి వై పరీత్యము! సతికి మేలు కలుగనేరదు'' అని అనుకొనుచుండెను.

''రాముడు ఏమి వ్రాసిఉంచెనో అది కాకమానదు, ఇక తర్కమెందులకు?'' అని తలచి ఆతడు హరినామమును జపించ మొదలిడెను. సుఖనిలయుడగు రాముడున్నచోటికి సతి చనెను. పదే పదే తనమనస్సున విచారించెను. సీతయొక్క రూపమును ఆమె ధరించెను. రామనృపాలుడు వచ్చుచున్న మార్గమువైపు నడచెను.

ఉమ ధరించినవేషమును లక్ష్మణుడు చూచెను. చకితుడయ్యెను. అతని మనసున అత్యధికభ్రమ కలిగెను. బహుగంభీరుడై అతడు ఏమియు పలుకలోకపోయెను. లక్ష్మణుడు ధీరచిత్తుడు! ప్రభుని ప్రభావము అతనికి తెలియును.

సురనాథుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి అగు శ్రీరాముడు సతియొక్క కపటమును గ్రహించెను. ఎవనిని స్మరించినంతమాత్రమున అజ్ఞానము నశించునో ఆ సర్వజ్ఞుడు, భగవానుడేకదా ఈ రాముడు!

స్త్రీ స్వభావముయొక్క ప్రభావమును చూడుడు! ఆసర్వజ్ఞుని సమక్షమున సహితము సతి తన కపటమును మఱుగుపరచవలె ననుకొన్నది!

తన మాయాబలమును హృదయమున వర్ణించుకొని రాముడు మృదువచనములను నుడువ మొదలిడెను : చేతులు జోడించి ఆతడు సతీదేవికి ప్రణామము కావించెను. ''నేను రాముడును. దశరథ కుమారుడను'' అనెను. ''వృషకేతు వెక్కడ? ఒంటరివై వనమున తిరుగుచున్నా వేలనమ్మా?'' అని ప్రశ్నించెను. రాముని నిగూఢ, మృదువచనములను విని సతికి మిక్కుటమగు సిగ్గు కలిగెను. ఆమె భయపడుచు మహేశునివద్దకు వెడలెను. ఆమె మనస్సున మహాసంతాపము కలిగెను. ''శంకరుడు చెప్పినది నేను విననైతిని. నా ఆజ్ఞానమును రామునియందు ఆరోపించితిని. ఇప్పుడు మరలివెడలి ఏమని ప్రత్యుత్తర మీయగలను?'' అని ఆమె చింతించెను. ఆమె హృదయమున అతి దారుణమగు వేదన జనించెను. సతి దుఃఖించుచున్నట్లు రాముడు కనుగొనెను. తన మహిమను ఒకింత ప్రకటించెను. నడచివెడలుచు సతి ఒక కౌతుకమును మార్గమున కనుగొనెను. సీతా లక్ష్మణ సహితుడై శ్రీరాముడు ఆమె ఎదుటనే నడచుచున్నాడు! సతి వెనుకకు తిరిగిచూచును. అచ్చటనూ సీతా లక్ష్మణ సమేతుడై, సుందరవేషధారియై ఆ రాముడు కనుపించును! ఎటు చూచినను రామప్రభువే ఆసీనుడై ఉండును! ప్రవీణులగు సిద్ధులు, మునీశ్వరులు ఆయనను సేవించుచుందురు! ఎందరో శివులను, బ్రహ్మలను, విష్ణువులను సతి చూచుచున్నది! ఒకరికంటె ఒకరు అమిత ప్రభావమున ప్రకాశించుచున్నారు. వివిధవేషధారులై దేవతలందరు ప్రభుని సేవించుచున్నారు. ఆతని చరణములకు వందనము చేయుచున్నారు. అనేకమంది-సాటిలేని-లక్ష్మీదేవులు, సతీదేవులు, సరస్వతు లున్నారు. బ్రహ్మాదిదేవతలకు అనురూపముగనే వారున్నారు. ఎందరు రఘుపతు లున్నారో అందరు దేవతలు శక్తిసమేతులై కనుపించుచున్నారు. ప్రపంచమున చరాచరజీవము లెన్నికలవో అవి అన్నియు అనేక విధములైనవి కనుపించుచున్నవి. వివిధ వేషధారులగు దేవతలు ప్రభుని పూజించుచున్నారు. కాని-రామునివంటి రూపము మరి ఒకటి కనుపించుటలేదు. సీతాసహితులగు రఘుపతులు పెక్కురున్నారు. వారి వేషములన్నియు ఒక్కటే.

అన్నిచోట్లను ఆ రఘవరుడే - ఆ లక్ష్మణుడే - ఆ సీతయే. దీనినంతయుచూచి సతి కడు భయపడుచున్నది. ఆమె హృదయము కంపించెను. ఆమెకు శరీరస్సృహ లేదు. కన్నులు మూసికొని ఆమె కూర్చుండెను. కొంతసేపటికి ఆమె కండ్లు తెరచినది. చూచినది. ఏమియు కనుపించదు ఆ దాక్షాయణికి! పదేపదే ఆమె రామపాదములకు తలవంచి నమస్కరించుచు గీరీశునివద్దకు చనినది. తనను ఆమె సమీపించగానే మహేశుడు నవ్వెను. ఆమెను కుశలప్రశ్నము కావించెను.

''రాముని నీవు ఎట్లు పరీక్షించితివో ఆ వాస్తవవమెల్లయు సవిస్తరముగా తెలుపుము'' అని ఆమెను అడిగెను. రఘువీరుని ప్రభావమును ఎఱిగిన సతి భయముచే జరిగిన వృత్తాంతము శివునికి చెప్పక దాచినది. ''స్వామీ, పరీక్ష ఏదియు నేను చేయ లేదు. నీవు కావించినట్లే నేనను ప్రణామము కావించితిని. నీవు నుండివినది అసత్యము కానేరదని నా మనస్సున విశ్వాసము'' అని ఆమె ప్రత్యుత్తరమిచ్చినది.

అంతట శంకరుడు ధ్యానముచేసి, సతీదేవి సలిపిన చరిత అంతయు తెలిపికొనెను. రాముని మాయకు ఆతడు తలవంచెను. ఆ మాయ ప్రేరేపించి సతియొక్క నోటినుండి సహితము ఆసత్యము పలికించెను! ''హరి ఇచ్ఛారూపమగు భావి ప్రబలమైనది!'' అని చతురుడగు శంభుడు తన మనమున తలచెను. ''సీతయొక్క వేషమును ధరించినది ఈ సతి!'' అని తెలిసికొనిన శివుని హృదయమున మిక్కిలి విచారము కలిగెను.

''ఈ సతిని ఇక నేను ప్రేమించుచో భక్తిమార్గము నశించిపోవును. మిక్కుటమగు అవినీతి ప్రబలును. సతి పరమపవిత్ర. ఈమెను త్యజించరాదు. కాని ఈమెను ప్రేమించిననూ మహాపాపము-'' అని ఆతడు తలచెను. మహేశుడు బహిరంగముగా ఏమియు చెప్పజాలకపోయెను. ఆతని హృదయము అత్యంత సంతాపముతో నిండెను. అంతట శంకరుడు రామప్రభుని చరణములకు శిరమువంచి నమస్కరించెను. రాముని స్మరించినంతనే ''సతియొక్క ఈ తనువుతో నాకు సమాగమము కలుగరాదు'' అను తలంపు ఆతనికి జనించెను. తన మనస్సున అట్లే ఆతడు నిశ్చయించుకొనెను. ధీరమతి శంకరుడు అంతట రఘువీరుని స్మరించుచు కైలాసమునకు అరిగెను. ఆతడు వెడలుచుండగా ఆకాశవాణి - ''మహేశా, నీకు జయము. నీ భక్తి అతి దృఢమైనది. నీవు తప్ప ఇంకెవ్వరు ఇట్టి ప్రతిన చేయగలరు? నీవు రామభక్తుడవు, సమర్థుడవు, భగవానుడవు'' అని పలికెను ఈ నభోవాణిని విని సతియొక్క మనసున చింతకలిగెను, సిగ్గుతో ఆమె శివుని ఇట్లు ప్రశ్నించెను.

''కృపాళూ, ఏమని ప్రతిన చేసితివి! వివరింపుము ప్రభూ, నీవు సత్యధాముడవు. దీనదయాళుడవు'' బహువిధముల ఆమె ప్రశ్నించినను త్రిపురారి ఏమియు ఆమెకు చెప్పలేదు.

''సర్వజ్ఞుడగు శంభునికి సర్వము తెలిసినది. నేను ఆయనను మోసగించితిని. సహజముగనే స్త్రీ అజ్ఞాని, మూర్ఖురాలు', అని ఆమె తలచెను. ప్రేమయొక్క మనో హరరీతిని కనుగొనుడు. పాలలో కలిపిన నీరుకూడా పాలధరకే అమ్ముడు పోవును. పులుపు కొంచెము కలిసినచో పాలకు పాలు, నీటికి నీరు వేఱగును. ప్రేమయును అంతే. అసత్యమువలన అది భగ్నమైపోవును. తన చర్యలనన్నిటిని జ్ఞప్తికి తెచ్చుకొని సతి తన హృదయమున అమిత విచారము పొందుచున్నది. ఆ చింత వర్ణనాతీతము. ''శివుడు పరమ అగాధ కృపాసముద్రుడు, నా అపరాధమును ఆతడు బయటపెట్టలేదు'' అని ఆమె అనుకొనెను. శంకరుని ఇంగితము గ్రహించి భవాని ''ప్రభువు నన్ను పరిత్యజించినాడు'' అని తెలిసికొనెను. ఆమె హృదయము కలత చెందెను. తాను చేసినపాపమును తలచుకొని ఆమె ఏమియు పలుకజాలకున్నది. కాని ఆమె హృదయమో - కుమ్మరి ఆవమువలె కాలిపోవుచున్నది. సతి విచారగ్రస్తురాలై ఉన్నట్లు వృషకేతుడు కనుగొనెను. ఆమెకు ఆనందము చేకూర్చవలెనని సుందరమగు కథల నెన్నిటినో ఆతడు చెప్పినాడు. బహువిధములగు ఇతిహాసములను మార్గమున ఎన్నియో చెప్పుచు విశ్వనాథుడు కైలాసమును చేరెను. తాను కావించిన ప్రతినజ్ఞప్తికి తెచ్చుకొని ఆతడు వటవృక్షముక్రింద పద్మాసనమున ఆసీనుడై తన సహజ రూపమును నిర్వహించుచు అఖండము, అపారము అగు సమాధిని ప్రవేశించెను. అంతట సతి కైలాసమున వసింప మొదలిడెను. ఆమె మనస్సున అపారదుఃఖము ఆవరించెను. ఈ మర్మమేదియు ఆమెకు కొంచెమైనను తెలియదు. ఆమెకు దినమొక యుగముగా ఉన్నది. ''ఈ దుఃఖసముద్రమును దాటుట ఎట్లా?''అని అనుదినము ఆమె హృదయమున నూతన చింతాభారమే. ''రఘుపతికి అవమానము కావించితిని. పతియొక్క వచనములను అసత్యము చేసితిని. దానిఫలితము విధాత నాకు విధించినాడు. నాకు తగినట్లుగానే కావించినాడు. విధాతా, శంకరవిముఖనగు నా ప్రాణములు తీయవైతివి'' అని ఆమె చింతించెను. సతియొక్క హృదయగ్లాని వర్ణింప శక్యము కాదు. ప్రాజ్ఞురాలగు ఆమె రాముని తన మనమున స్మరించుకొనెను. ''ప్రభూ, నీవు దీనదయాళుడవందురు. ఆర్తి హరుడవని వేదములు ఘోషించినవి. నీ కీర్తిని కొని యాడినవి. ఇదియే సత్యమైనచో నా ఈ దేహమును నేను వేగమే త్యజించునట్లు కృపచూడుము. చేతులెత్తి నీకు వినతి చేతును. శివుని చరమములయందు నాకు ప్రేమయే ఉన్నచో - మనోవాక్‌ కర్మలయందు నా ప్రేమ సత్యమైనచో - సర్వద్రష్టవగు ప్రభూ, నా వినతిని ఆలకింపుము. నాకు మరణము ప్రాప్తించునట్లును శ్రమలేకయే దుస్సహమగు ఈ విపత్తి దూరమగునట్లును వేగమే ఉపాయము కావింపుము'' అని ఇట్లు విచారించుచు ప్రజాపతీసుత వర్ణనాతీతమగు దారుణదుఃఖమున మునిగిఉండెను.

ఎనుబది ఏడువేలఏండ్లు గడచెను. అవినాశి అగగు శంభుడు సమాధినుండి మేల్కొనెను. రామనామమును స్మరింప మొదలిడెను. జగత్పతి శంభుడు మేల్కొన్నాడని సతీదేవికి తెలిసెను. ఆమె వెడలి శంభుని చరమములకు వందనమొనర్చినది. శంకరుడు ఆమెకు తన సమ్ముఖమున ఆసనమిచ్చెను. రసవంతమగు హరకథలను అతడు నుడువసాగెను.

ఆ కాలమున దక్షుడు ప్రజాపతియై ఉండెను. అతడు అన్నివిధముల తగిన వాడని కనుగొని విరించి అతనిని ప్రజాపతుల నాయకుని కావించెను. ఉన్నత అధికారము ప్రాప్తించగనే దక్షుని హృదయమున అమితగర్వము జనించెను. ఐశ్వర్యము లభించగనే మదించనివాడు జగమున ఎవ్వడునూ పుట్టిఉండలేదు!

దక్షుడు మునులను ఎల్లరను రప్పించెను. వారందరు ఒక మహాయజ్ఞమును ప్రారంభించిరి. యజ్ఞభాగములను స్వీకరించు సర్వదేవతలను సాదరముగా దక్షుడు ఆహ్వానించెను. కిన్నరులు, నాగులు, సిద్ధులు, గంధర్వులు, సకలదేవతలు - భార్యలతోసహా వచ్చిరి. విష్ణువు, విరించి, మహేశుడుతప్ప మిగిలిన దేవతలెల్లరు తమ విమానములను అలంకరించుకొని విచ్చేసిరి. నానావిధములగు రమణీయవిమానములు నభోమార్గమున వచ్చుచుండగా సతి చూచినది. సురసుందరీమణులు మనోహరముగా గానము చేయుచున్నారు. ఆ గానము విని మునులైనను తమ ధ్యానమును త్యజింతురు. ''ఇది అంతయు ఏమి?'' అని సతి తనపతిని ప్రశ్నించినది. శివుడు అంతయు వివరించెను. తన తండ్రి యజ్ఞము చేయుచున్నాడని విని సతి కొంత సంతసించెను.

''మహేశ్వరుడు అనుమతించినచో - ఈ నెపమున నేను వెడలి మాపుట్టినింట కొన్నినాళ్లు ఉండవచ్చును'' అని ఆమె తలంచినది. పతి తనను పరిత్యజించినందులకు ఆమెకు మహాదుఃఖము కలిగెను. ఐనను తనదే తప్పు అని గ్రహించి ఆమె ఏమియు పలుకలేకున్నది. కొంతతడవునకు ఆమె భయ, సంకోచ, ప్రేమరసములతో మేళవించిన మనోహరవచనములను ఇట్లు నుడివెను:--

''ప్రభూ, మా జనకునిఇంట మహోత్సవము జరుగుచున్నది. నీ ఆజ్ఞ ఐనచో - కృపానిలయా, దానిని సాదరముగా తిలకించుటకు నేనును పోదును.''

అంతట శివుడు:-- ''నీవు చెప్పినది మంచిమాటయే, నా మనస్సునకునూ ఆనందమే. కాని, ఆయన మనకు ఆహ్వానము పంపలేదు! పిలువకనే పోవుట అనుచితము. దక్షుడు తన కుమార్తెల నందరిని ఆహ్వానించెను. మన వైరమువలన అతడు నిన్ను త్యజించెను. ఒకనాడు బ్రహ్మయొక్కసభలో నన్నుగురించి అతడు అసంతృప్తిని వెల్లడించెను. ఆ కారణమున అతడు నన్ను ఈనాడుకూడా అవమానించినాడు. భవానీ, పిలువనిపేరంటమునకు వెడలినచో నీ మర్యాద, ఆత్మగౌరవము నిలువపు.

మిత్రుని, ప్రభుని, జనకుని, గురుని - ఇండ్లకు పిలువకనే పోవచ్చును. ఐనను - విరోధము ఉన్నచోట్లకు వెడలుట కల్యాణప్రదము కానేరదు'' అని వచించెను. శంభుడు అనేకవిధముల నచ్చజెప్పెను. హెచ్చరించెను. కానున్నది కాకమానదు. సతి యొక్క హృదయమున జ్ఞానము కలుగదాయెను.

''పిలుపురాకనే వెడలినచో అది మనకు మేలుకాదని నా భావము'' అని ప్రభువు మరి ఒకసారి చెప్పెను. హరుడు ఎన్నోవిధముల చెప్పిచూచెను. కాని, ఏమైననుసరే- చనక తప్పదని దక్షకుమారి అనెను.

అంతట త్రిపురారి తన ముఖ్యగణములను వెంటఇచ్చి ఆమెను పంపెను.

తండ్రిఇంటికి భవాని ఏతెంచినది. దక్షునియందలి భయముచే ఎవ్వరూ ఆమెను సన్మానించలేదు. ఆమె తల్లిమాత్రము ఆమెను సాదరముగా కలసికొన్నది. అక్క చెల్లెండ్రు ఆమెను మందహాసముచేయుచు కలసికొనిరి. దక్షుడు ఆమెను కుశలప్రశ్నలైనను అడుగలేదు. సతినిచూచి అతని శరీరమంతయు భగ్గుమన్నది. వెడలి సతి యాగమును చూచినది, దానియందు ఎక్కడనూ శంభునికి భాగములేదు. శంకరుడు నుడివినదంతయు అంతట సతికి గుర్తుపచ్చెను. తన స్వామికి జరిగిన అవమానమును గ్రహించి ఆమె హృదయము మండిపోయెను. ఈ వేదన ముందు - పతి కావించిన పరిత్యాగమువలన తాను పొందిన పరివేదన అల్పమనిపించెను. లోకమున అనేకవిధములగు దారుణ దుఃఖము లున్నవి. స్వజాతి కావించు అవమానము అన్నిటికంటెను కఠోరము! ఈ విషయమెఱిగిన సతికి మహాక్రోధము కలిగెను. తల్లి బహువిధముల బోధించి ఆమెను ఓదార్చెను. శివునికి జరిగిన అవమానమును సతి సహించజాలక పోయెను. ఆమె హృదయమున శాంతి, ఓర్పు లేకుండెను. సభవారినందరిని గగ్గోలు పరచుచు క్రోధభరితములగు పలుకులను ఆమె ఇట్లు వచించెను:--

''సభాసదులారా, సకలమునీశ్వరులారా, ఇదే వినుడు. ఇచ్చట శంకరు నిందిచినవారు, ఆ నిందను వినినవార శీఘ్రమే తగుఫలితమును అనుభవింతురు. నా తండ్రియు బాగుగా పశ్చాత్తాపము చెందగలడు. సాధుసజ్జనులను, శంభుని, శ్రీపతివి గురించిన నిందలు వినవచ్చుస్థలమున - ఆ నిందలను వినువారు - చేతనైనచో - నిందించువాని నాలుకను కోపివేయువలెను. లేదా, చెవులుమూసికొని వారు ఆ స్థలము నుండి పారిపోవలెను. త్రిపురారి అగు మహేశుడు సకలజగమునకు ఆత్మ. జగమునకు తండ్రి, సర్వహితకారి, మందబుద్ధిఅగు నా జనకుడు ఆతనిని నిందించుచున్నాడు. నా ఈ శరీరము దక్షుశుక్రమున జనించినది. కనుక చంద్రమౌళి అగు వృషకేతుని స్మరించి ఈ తనువును శీఘ్రమే త్యజింతును.''

ఇట్లు పలికి సతి యోగాగ్నియందు తన తనువును భస్మము చేసికొనెను. యజ్ఞ శాలఅంతయు హాహాకారము వ్యాపించెను. సతియొక్క మరణవార్తను విని శంభుగణములు యజ్ఞమును విధ్వంసముచేయ మొదలిడిరి. ఆ విధ్యంసమునుచూచి భృగుమునీశుడు యాగమును పరిరక్షించెను. ఈ వార్త అంతయు శంకరుని చేరినది. ఆతడు క్రుద్ధుడై వీరభద్రుని పంపెను. వీరభద్రుడు వెడలెను. యజ్ఞమును విధ్వంసము కావించెను. సకలదేవతలను తగురీతిని దండించెను. శంభు విద్రోహులకు ఏగతి ప్రాప్తించునో - జగద్విదితమగు ఆ గతియే దక్షునకు సంభవించెను. ఈ ఇతిహాసము సకలజగము ఎఱుగును. దానిని సంక్షిప్తముగా నేను వర్ణించితిని.

మరణసమయమున సతి ''జన్మజన్మలయందు శివచరణములయందు అను రాగము కలిగిఉండునట్లు నాకు వరమిమ్మని'' హరిని ప్రార్థించినది. ఆ కారణమున ఆమె హిమాచలుని గృహమునుచేరి పార్వతి అనుపేర జనించినది. హిమాచలమున ఉమ అవతరించిననాటనుండియు అచ్చట సకలసిద్ధులు సంపదలు సమకూడెను. దానిపై అచ్చటచ్చట మునులు రమణీయమగు ఆశ్రమములను నిర్మించుకొనిరి. హిమాచల నాథుడు వారికి తగు నివాసస్థలము నిచ్చెను.

సుందరమగు ఆ హిమశైలమున నానావిధములగు నవద్రుమములు, సదా ఫలపుష్పయుతము లయ్యెను. పలువిధములగు మణిగనులు ప్రకటమయ్యెను. నదులన్నిటి యందు పవిత్రమగు జలము ప్రవహించుచుండెను. ఖగములు, మృగములు, భ్రమరములు-అన్నియు-సుఖముగా జీవించుచుండెను. సకలజీవులు తమ సహజవైరమును వీడెను. ఆ గిరిపై అవి అన్నియు అనురామున జీవించుచుండెను.

రామభక్తి సంప్రాప్తించినపిదప భక్తువలె గిరిజ రాకచే ఆ గిరి శోభాయమాన మయ్యెను. గిరిజానిలయమున నిత్య నూతన మంగళోత్సవములే. ఆ నిలయయశమును బ్రహ్మాదులు గానము చేయుచుండిరి. ఈ విషయమంతయు నారదునికి తెలిసినది. కౌతుకమున ఆతడు హిమగిరికి వేంచేసెను. శైలరాజు నారదుని కడు గారవించెను. మునియొక్క పాదములను కడి%ను. ఉత్తమమగు ఆసనము సమర్పించెను. భార్యా సహితుడై హిమవంతుడు ఆ మునియొక్క చరణములకు శిరమువంచి నమస్కరించెను. ఆ పాదోదకమును తన భవనమున అంతటను చల్లెను. హిమాచలుడు తన భాగ్యమును మిక్కిలి కొనియాడుకొనెను. పుత్రికను పిలిచి మునిపాదములకు ఆమెచే మ్రొక్కించెను. ''మునివరా, నీవు త్రికాలజ్ఞుడవు. సర్వజ్ఞుడవు. సకలమును చరించిన వాడవు. నీ హృదయమున యోచించి ఈ కన్నియయొక్క గుణదోషములను తెలుపవేడెదను'' అని మునిని కోరెను.

నారదముని నవ్వెను. నిగూఢ, కోమలవచనములను ఇట్లు వచించెను:-

é ''నీ కన్నియ సకల సద్గుణఖని, సహజసుందరి. సుశీల, ప్రాజ్ఞురాలు. ఉమ, అంబిక, భవాని అని ఈమె పేర్లు. ఈ కుమారి సర్వలక్షణసంపన్నురాలు. సంతతము పతిప్రేమకు పాత్రురాలు. ఈమె సౌభాగ్యము సుస్థిరమైనది. ఈమెవలన ఈమె జననీ జనకులు యశమును కాంతురు. సకలజగమున ఈమె పూజ్యురాలగును. ఈమెను సేవించినచో దుర్లభ##మేదియు ఉండదు. ఈమె నామమును స్మరించి లోకమున స్త్రీలు 'పాతివ్రత్యము' అను అపిధారావ్రతమును సలుపగలరు.

శైలరాజా, నీ సుత సులక్షణములు కలదియే. కాని, ఈ మెయందు ఒకటి రెండు అవగుణములున్నవి. అవియును వినుము-గుణహీనుడు, మానహీనుడు, జననీ జనకవిహీనుడు, ఉదాసీనుడు, సంశయహీనుడు, యోగి, జటాధారీ, నిష్కామమన స్కుడు, దిసమొలవాడు, అమంగళ##వేషధారి - అగు భర్త ఈమెకు లభించును. ఈమె చేతిలో అట్టిగీత లున్నవి.''

నారదుని మాటలు విని, ఆతని పలుకులు సత్యమని తెలిసికొని, హిమగిరిదంపతులు దుఃఖితులైరి. ఉమ సంతపించెను. నారదునికికూడా ఈ మర్మము తెలియుదు. అందరి మనోభావములు భిన్నములైనను బహిరంగముగా ఒకేరీతిని ఉన్నారు! సఖు లెల్లరు, గిరిజ, గిరిరాజ అతనిపత్ని మేనక పులకితశరీరులైరి. వారికన్నులు నీరు కారుచున్నవి. దేవర్షి పలుకులు అసత్యము కానేరవని ఎంచి ఉమ వానిని తమ హృదయమున ధరించెను. శివుని పాదకమలములయందు ఆమెకు ప్రేమ ఉదయించెను. ఆతనితో సమాగమము కఠినమని ఆమె మనస్సున సందేహము. ఆ విషయమై ప్రస్తావించుటకు అది సమయముకాదని ఆమెకు తెలియును. తన ప్రేమను ఆమె రహస్యముగనే ఉంచెను. వెడలి ఆమె తన సకియఒడిలో కూర్చుండెను.

దేవర్షి చెప్పినది అబద్ధము కానేరదని హిమవంతుడు, అతని భార్య, చతురలగు ఇతర సఖులు చింతించుచుండిరి. గిరిరాజు ధైర్యము వహించి ''స్వామీ, సెలవిండు. ఇప్పు డేది ఉపాయము?'' అని నారదుని వేడెను.

''హమవంతా, వినుము. లలాటమున విధాత లిఖించినదానిని దేవతలైనను, దనుజులైనను, నరులు, నాగులు, మునులైనను - ఎవ్వరూ తప్పింపజాలరు. ఐనను నేను ఒక ఉపాయమును వచింతును. దైవము సహాయపడినచో అది ఫలించును. నేను వర్ణించిన వరునే ఉమ నిశ్చయముగా వివాహమాడును. సందియము లేదు. వరునియందు కల దోషములు - నేను వర్ణించితినే అవి అన్నియు శివునియందు కలవని నా తలపు. శంకరునితో నీ కొమరితకు పెండ్లి జరిగినచో ఆ దోషములన్నియు సద్గగుణములనియే ఎల్లరు వచింతురు. పాముపై పవ్వళించును హరి. ఐనను బుధులు దానిని దోషమనరు. భానుడు, కృశానుడు సర్వభక్షకులు. ఐననూ వారిని ఎవ్వరూ నిందించరు. శుభ్ర, ఆశుభ్ర జలములన్నియు సురనదిలో ప్రవహించును. కాని, గంగానది అపవిత్ర అని ఎవ్వరందురు? రవి, అగ్ని, సురనదులవలె స్వామీ, సమర్థులకు దోషమేదియూ అంటదు. మూర్ఖు డెవడైనను జ్ఞానాభిమానముచే కాదని మొండిగా వాదించినచో అట్టివానికి కల్పాంతరమువరకునరకమే. జీవుడు ఈశ్వరునికి సముడగునా? గంగాజలముతో మద్యము చేయబడినచో ఆ విషయమును ఎఱిగిన సజ్జను డెవడైనను దానిని ఎన్నడైన సేవించునా? కాని, ఆ గంగాజలమున మిళితమగు సురయును పావనమగును. అట్లే ఈశ్వరునికి జీవునికి భేదముండును.

శంభుడు సహజసమర్థుడు. భగవానుడు. ఈ వివాహమున సర్వవిధముల కల్యాణమగును. మహేశుని ఆరాధన కష్టసాధ్యము. ఐనను తపముచే ఆతడు శీఘ్రమే సంతుష్టి చెందును. నీ పుత్రిక తపము కావించినచో త్రిపురారియే ఆమె భాగ్యరేఖను మార్చగలడు. లోకమున అనేకవరులు లేకపోలేదు. ఈమెకు శివుడుతప్ప ఇంకొక వరుడు లేడు. హరుడు వరప్రదాత. శరణాగత ఆర్తిహరుడు. కృపాసింధువు. సేవక జనరంజనుడు. శివుని ఆరాధించనిదే కోటియజ్ఞములు, జపములు చేసినను వాంఛిత ఫలములు ఈడేరపు'' అని ఇట్లు వచించి నారదుడు హరిని స్మరించెను. గిరిజను ఆశీర్వదించెను. ''గిరీశ్వరా, సందియమును వీడుము. ఈ కల్యాణము జరిగితీరును'' అని పలికి ఆ ముని బ్రహ్మలోకమునకు చనెను.

అటుపిమ్మట జరిగన చరితను వినుము - మేనక ఏకాంతమున తన పతితో ఇట్లు నుడివెను :....

''నాథా, మునియొక్క వచనములు నాకు బోధపడలేదు. మన కన్యకు అను కూలమగు కులము, గోత్రముకల వరుడు - తగినవాడు లభించినచో మాత్రమే ఆమెకు వివాహము చేయుము. లేనిచో-ఆమె కన్యగానే ఉండును. ప్రభూ, ఉమ నా ప్రాణ సమానమగు ప్రియ తనూజ. గిరిజకు తగువరుడు లభించనిచో ''ఈ పర్వతుడు సహజ ముగానే జడుడు'' అని నిన్ను లోకులందురు. ఈ విషయమునుగురించి విచారించుము. మనస్తాపము కలుగకుండునట్లు మన తనయకు పరిణయము ఏర్పాటు చేయుము''. ఇట్లు వచించి ఆమె తన భర్తపాదములపై శిరమువంచి నేలపై పడెను. ఆంతట హిమశైలపతి ప్రేమయుతముగా ఇట్లు వచించెను :

''చంద్రునియందు అగ్ని ప్రకటము కావచ్చును. కాని నారదుని పలుకులు అన్యథా కానేరవు, ప్రియా, అన్నివిచారములను వీడుము. భగవానుని స్మరించుము. పార్వతిని సృజించినవాడే ఆమె కల్యాణమును కావించును. నీకు మన కన్యపై ప్రేమ ఉన్నచో నీవు వెడలి ''శివునిగురించి తపము ఆచరింపుమ''ని ఆమెకు బోధించుము. ఆమెకు శివుడు లభించును. ఏ ఇతరఉపాయముచేనైనను ఈ క్లేశము నశించదు. నారదుని పలుకులు నర్మగర్భములు, సహేతుకములు, వృషకేతుడు సకలసౌందర్య గుణనిధి. ఈ సత్యమును గ్రహించుము. అనవసరమగు శంకలను త్యజించుము. శంకరుడు సర్వవిధముల నిష్కళంకుడు.''

పతియొక్క వచనములను విని మేనక మనమున హర్షము పొందెను. ఆమె వెంటనే లేచి పార్వతివద్దకు అరిగెను. ఉమనుకాంచి తల్లి కన్నుల నీరుకార్చెను. ప్రేమయుతముగా ఆమె కొమరితను తన ఒడిలో కూర్చుండపెట్టుకొనెను. పదేపదే ఆమెను కౌగలించుకొనెను. ఆమె గద్గదకంఠయై ఏమియు పలుకజాలకున్నది. జగజ్జనవి. ఆగు భవాని సర్వజ్ఞురాలు. మృదు, సుఖదములగు పలుకులను ఆమె ఇట్లు తల్లితో పలికెను :-

''అమ్మా, వినుము, నాకు ఒక కల వచ్చినది, దానిని నీకు తెలుపుదును. కలలో సుందరుడు, గౌరవర్ణుడు అగు ఒక సద్ర్బాహ్మణుడు కనుపించి ఇట్లు నాకు ఉపదేశించెను:- ''శైలకుమారీ, నారదుడు పలికినది సత్యము. నీవు వెడలి తపము సలుపుము, నీ జననీజనకులు సంతసింతురు. తపము నుఖప్రదమగును. దుఃఖములను, దోషములను అది నాశనమొనర్చును. తపోబలమువలననే విరించి వ్రపంచమును సృజించును. తపోబలముచేతనే విష్ణువు సకలజగమును సంరక్షించును. తపోబలము వలననే శంభుడు దానిని సంహరించును. తపశ్శక్తిచే శేషుడు భూభారమును వహించును. సృష్టిఅంతయు తపముపైననే ఆధారపడిఉన్నది భవానీ, వీనినన్నిటిని గ్రహించుము. వెడలి తపము కావించుము అని ఆ ఉపదేశము.''

ఉమ చెప్పినదానిని విని తల్లికి మహాశ్చర్యము కలిగినది. వెంటనే ఆ తల్లి హిమవంతుని పిలిచినది, స్వప్నవృత్తాంతము తెలిపినది. తల్లిదండ్రులను బహువిధముల ఓదార్చి అత్యంతహర్షమున ఉమ తపము కావించుటకై వెడలినది. ప్రియపరివారము, జననీజనకులు, అందరు వ్యాకులపడిరి. వారినోట మాట రాలేదు.

అంతట అచ్చటకు వేదశిరముని విచ్చేసెను. ఎల్లరకు ఆ ముని తెలియ చెప్పెను. పార్వతియొక్క మహిమను విని అందరు సంతోషము చెందిరి. ప్రాణపతి యొక్క పాదములను తన హృదయమున నిలిపి ఉమ వనములకు చనెను. తపమును ప్రారంభించెను. అతి సుకుమారి ఆమె. ఆమె తనువు తపమునకు తగినదిగాదు. పతి యొక్కపాదములను స్మరించుచు ఆమె సకలభోగములను త్యజించినది. శంభుని చరణములయందు ఆమెకు నిత్య నూతన అనురాగము జనించుచున్నది. ఆమె మనస్సు తపస్సున లగ్నమయ్యెను. తన శరీరమునే ఆమె విస్మరించెను. వేయిసంత్సరములు కందమూలములను, ఫలములను తినుచు ఆమె గడపెను. పిదప నూరేండ్లు ఆకు కూర లనుమాత్రమే తినుచు, తప మొనర్చినది. కొన్నిదినములు ఆమె జలమును, వాయు వునుమాత్రమే భక్షించుచున్నది. మరికొన్నిదినములు కఠోర ఉపవాసమే. ఎండి, నేల రాలిన మారేడుపత్రములను తినుచు ఆమె మూడువేల ఏండ్లు తపస్సు చేసినది. తరు వాత ఆ ఎండిన ఆకులనుసహితము త్యజించినది. అంతట ఉమకు అపర్ణ అను పేరు కలిగెను.

ఆమె దేహము శుష్కించిపోవుట కనుగొని ఆకాశమునుండి గంభీరమగు బ్రహ్మవాణి ఇట్లు వెలువడెను.

''గిరిరాజకుమారీ, వినుము. నీ మనోరథము సఫలమయ్యెను. దుస్సహమగు క్లేశములనన్నిటిని విడనాడుము. త్రిపురారి ఇక నిన్ను కలియును. భవానీ, ధీరులు జ్ఞానులు అగు మునులు ఎందరో ఉన్నారు. కాని నీవలె ఇట్టి ఘోరతపమును కావిం చినవారు లేరు. నిశ్చయమగు ఈ బ్రహ్మవాణిని, సంతతము పావనమనియు, సదా సత్యమనియు తెలియుము. దానిని నీ హృదయమున ధరించుము. నిన్ను ఇంటికి కొని పోవుటకు నీ తండ్రి వచ్చును. అంతట నీ తపమును విరమింపుము. ఇంటికి మరలుము. సప్తర్షులు నిన్ను సందర్శింతురు. ఈ నా వాణి సత్యమని ఆనాడు తెలిసికొందువు.''

గగనమునుండి వినవచ్చిన విధియొక్క పలుకులను వినినంతనే గిరజ ఆనందించెను. ఆమె శరీరము పులకితమయ్యెను.

రమణీయమగు ఉమాచరిత్రను వివరించితిని. ఇక - సుందరమగు శంకరుని చరితను వినుడు.-

సతి చని తనువును త్యజించిన నాటినుండియు శివుని మనమున వైరాగ్యము కలిగెను. ఆతడు సదా రఘునాయకుని నామమును స్మరించుచుండెను. అచ్చటచ్చట రాముని గుణగణములను గురించి కథలను వినుచుండెను. చిదానందుడు, సుఖనిలయుడు, కామ మోహ మద వీరహితుడు అగు ఆతడు - సకలలోకాభిరాముడగు హరిని స్మరించుచు భూమిపై చరించుచుండెను. ఒకచోట ఆతడు మునులకు జ్ఞానోపదేశము కావించును. మరి ఒకచోట రాముని గుణగణములను వర్ణించును.

నిష్కాముడు, చతురుడు అగు శివుడు భగవానుడే ఐనను భక్తులవియోగము వలన ఆతడు దుఃఖితుడగును.

ఇట్లు బహుకాలము గడచినది. రామపాదములయందు ఆతనికి నిత్య నూతన ప్రేమ కలుగుచున్నది. ఆతడు ఆచరించుచున్న కఠోరనియమములను, ఆతనిప్రేమను, హృదయమునందలి అచంచలభక్తిని రాముడు కనుగొనెను, కృతజ్ఞుడు, కృపాళుడు, రూప, శీలనిధి, విశాలతేజుడు అగు శ్రీరాముడు హరుని ఎదుట సాక్షాత్కరించెను. బహు విధముల ఆతడు శంకరుని ప్రశంసించెను. ''నీవుతప్ప ఎవరు ఆచరించకలరు ఇట్టి తపమును?'' అనెను. జరిగినవృత్తాంతమంతయు రాముడు శివునికి వివరించెను. పార్వతియొక్క జన్మచరితను తెలిపెను, గిరిజాకుమారి కావించిన అతి పునీతకృత్యములను సవిస్తరముగా వర్ణించెను.

''శివా, నాయందు నీకు ప్రేమఉన్నచో నా వినతిని వినుము. నీవు ఏగి శైలజను వివాహమాడుము. ఈ నా కోర్కెను మన్నించుము'' అని రాముడు హరుని కోరెను.

''ఇది అనుచితమేయైనను ప్రభుని వచనములను కాదనరాదు. స్వామీ, నీ ఆనతిని తలదాల్తును. పాలింతును. ఇది నాకు పరమధర్మము. జననీజనకుల, గురువుల, ప్రభుని ఆజ్ఞలను - ఎంతమాత్రము యోచింపకనే - శుభ##మైనవని భావింపవలెను. పాలించవలెను. సర్వవిధముల నీవు నాకు పరమహితకరుడవు. నీ ఆనతిని నా శిరమున ధరింతును'' అని శంభుడు వచించెను. భక్తిజ్ఞాన ధర్మయతములగు శంకరుని పలుకులను విని ప్రభువు సంతపించెను.

''హరా, నీ ప్రతిన నెరవేరినది. నేను నుడివినదానిని నీ హృదయమున ధరింపుము'' అని పలికి రాముడు అంతర్థానమయ్యెను. ఆతని ఆ మూర్తిని శంకరుడు తన ఉరమున నిలుపుకొనెను.

ఆ సమయమున సప్తర్షులు శివునివద్దకు ఏతెంచిరి. వారితో ప్రభువు (శంభుడు) అతి రమణీయమగు వచనములను ఇట్లు పలికెను :-''మీరు పార్వతివద్దకేగి ఆమె ప్రేమను పరీక్షించుడు. హిమవంతుని పంపి ఆమెను ఇంటికి పిలిపించుడు. ఆమెకు గల సందేహములను దూరము చేయుడు.''

ఋషులు, వెడలిరి. గౌరిని కనుగొనిరి. మూర్తీభవించిన తపస్సువలె ఉన్నది ఆమె.

''శైలకుమారీ, వినుము, ఎందులకీ ఘోరతపము కావించుచుంటివి? ఎవరిని ఆరాధించుచుంటివి? నీ కోరిక ఎయ్యది? నీ నిజరహస్యమును మాకేల తెలుపవు!'' అని ఆ మహర్షులు ప్రశ్నించిరి.

''తెలుపుటకు నాకు మిక్కిలి సిగ్గగుచున్నది. నా మూర్ఖతను విని మీరు నవ్వుదురు. నా మనస్సు మొండితనమును తాల్చినది. ఎవరు చెప్పినను అది వినదు. నీటిపై గోడ కట్టవలెనని దాని తలంపు. నారదుడు వచించినది సత్యమని ఎఱిగి నేను రెక్కలు లేకనే ఎగిరిపోవలెననుకొనుచున్నాను. మునులారా, నా అవివేగమును పరికించుడు. సదా - శివునే నా పతిగా కావించుకొనగోరుచున్నాను'' అని పార్వతి ప్రత్యుత్తర మిచ్చెను.

గిరికుమారియొక్క పలుకులను విని ఋషులు నవ్విరి, ''పర్వతపుత్రికవు కదమ్మా నీవు! తల్లీ-చెప్పుము. నారదుని ఉపదేశమును విని ఇంతవరకు ఎవడైననూ ఒక ఇంటివాడైనాడా? ఆ నారదుడు దక్షుని సుతులకు ఉపదేశించినాడు! వారు తిరిగి ఇంటిముఖమైనను చూడలేదు. చిత్రకేతుని ఇంటిని సర్వనాశనము చేసినది ఆ నారదుడే. కనకకశిపునికి అట్టిగతియే పట్టినది. నారదుని బోధనలను విను స్త్రీలు, పురుషులు - ఇల్లు, వాకిలి విడిచి, అవశ్యము బిచ్చగాండ్రు కావలసినదే. అతనిమనస్సు కపటమైనది. తనువుమాత్రము సజ్జనచిహ్నము. అతడు అందరిని తనవంటివారినిగా చేయగోరును. అట్టివానిమాటలను విశ్వపించి నీవు ఇట్టిపతిని కోరుచున్నావు. ఆ శివుడు సహజముగనే ఉదాసీనుడు. నిర్గుణుడు. లజ్జావిహీనుడు, కువేషధారి, కపాలధరుడు, కులహీనుడు, ఇల్లువాకిలి లేనివాడు, దిగంబరుడు, నాగభూషణుడు, అట్టి వరుడు లభించినచో - అమ్మా - నీకేమి సుఖము? చెప్పుము. కపటి అగు ఆ నారదుడు చూపిన తప్పు దారిలోపడి పొరపడితివి. పెద్దలమాటలను మన్నించుటకే శివుడు సతిని పెండ్లాడినాడు. కాని, వెంటనే ఆమెను విడిచిపెట్టినాడు. ఆమె మృతికి కారకుడైనాడు. అతనికి ఇక ఏ చింతయాలేదు. అతడు బిచ్చమెత్తి భుజించును. సుఖముగా నిద్రించును. సహజముగనే ఏకాకియై ఉండు అట్టివాని ఇంట స్త్రీలు ఎట్లు కాపురము చేయగలరమ్మా? మా మాటలు వినుము. నీకై మేము మంచివరుని ఎంచి ఉంచితిమి. అతడు అతి సుందరుడు, పవిత్రుడు, సుఖప్రదుడు, సౌశీల్యము కలవాడు, ఆతనికీర్తిని, లీలలను వేదములు కొనియాడినవి. ఆతడు దోషరహితుడు, సకల సద్గుణరాశి, శ్రీపతి. వైకుంఠ పురవాసి, ఆ వరుని నీకు మేము కూర్చెదము!'' అని ఆ ఋషులెల్లరు నుడివిరి.

భవాని ఈ మాటలు విని, నవ్వి, ఇట్లనెను :-''ఈ నా తనువు గిరికి జనించెనని మీరు పలికినది నిజమే. కనుకనే ఇది ప్రాణములనైనను విడుచును కాని, తన పట్టును విడువదు. బంగారముకూడా పాషాణమునుండియే పుట్టును. కాల్చినను సరే అది తన సహజలక్షణమును విడువదు. కనుక నారదుని వచనములను నేను పరిహరించను. నా ఇల్లు ఉండనిండు, నశించిపోనిండు. నేను భయపడను. గురువచనముల యందు విశ్వాసము లేనివారికి సుఖము, సిద్ధి కలలోనైనను కలుగవు. మహాదేవుడు అవగుణనిలయుడు కావచ్చును. విష్ణువు సకల సద్గుణధాముడు కావచ్చును. తాను వలచినదే రంభ, మునీశ్వరులారా, మీరు మొదటనే నావద్దకు వచ్చిఉన్నచో మీ ఉప దేశమును తలదాల్చెడిదాననేమో. కాని ఇప్పుడు నా జీవితము శంభునికే అర్పించితిని. ఇక అతని గుణదోషములనుగురించి విచారము నే నెట్లు చేయగలను? విశేషమగు పట్టుదల కలిగిఉండి మీరు ఈ వివాహవిషయము విడువలేకున్నచో - లోకమున అనేకు లున్నారు కన్యలు, వరులు. పెండ్లిండ్ల పేరయ్యలకు చేతినిండ పనులున్నవి. నేను శంభునే పెండ్లి ఆడుదును. లేనిచో కన్యగానే జీవింతును. కోటిజన్మలకైనను ఇదే నా ప్రతిన. స్వయముగా మహేశుడే నూరుసార్లు చెప్పనిండు. నారదుని ఉపదేశము మాత్రము నేను విడువను. మీ పాదములు పట్టుకొందును. మీ ఇండ్లకు వేంచేయుడు, చాలా ఆలశ్యమైనది'' అని జగదాంబ పలికెను.

జ్ఞానులగు మునులెల్లరు ఆమె ప్రేమను కనుగొని ''జయము, జయము, జగ దంబికా-భవానీ-నీవు మాయవు. శివుడు భగవానుడు. మీ రిరువురు సకలజగమునకు జననీ జనకులు'' అని పలికిరి.

భవానియొక్క చరణములకు శిరములువంచి నమస్కరించి మునులు వెడలిరి. వారి తనువులు పలుమారులు పులకరించెను. వారు ఏగి గిరిజవద్దకు హిమవంతుని పంపిరి. వినతి కావించి హిమవంతుడు ఆమెను తనఇంటికి తీసుకొనివచ్చెను. అనంతరము సప్తర్షులు శివునివద్దకు వెడలి ఉమయొక్క చరిత్రనంతయు తెలిపిరి. ఆమెకు తనయందు కల ప్రేమనుగురించి వినినంతనే హరుడు ఆనందమగ్నుడయ్యెను. సప్తర్షులు హర్షము చెందిరి. తమ తమ నివాసములకు వెడలిరి.

చతురుడగు శంభుడు సుస్థిరమానసుడై రఘునాయకుని ధ్యానింప మొదలిడెను.

ఆ కాలమున తారకుడను ఒక అసురుడు కలడు. వాని భుజబలము, ప్రతాపము, తేజము కడు విరివియైనవి. లోకములనన్నిటిని, లోకపాలురనందరిని వాడు జయించి నాడు. దేవతలెల్లరు సుఖసంపదలను కోల్పోయిరి. ఆ దనుజుడు అమరుడు, అజరుడు. ఎవ్వరునూ వానిని జయింపలేరు. దేవతలు వానితో అనేకయుద్ధములు చేసిరి. కాని ఓడిపోయిరి. అంతట వారు విరించివద్దకు ఏగి మొరపెట్టుకొనిరి. దేవతలందరు దుఃఖితులై ఉన్నారని విధాత కనుగొని వారినెల్లరను ఓదార్చెను.

''శంభు వీర్యసంభూతుడగు సుతుడు రణమున ఈ రక్కసుని జయించును. నా మాట వినుడు. ఒక ఉపాయమును కావించుడు. ఈశ్వరుడు సహాయము చేయును. కార్యము నెరవేరును. దక్షయజ్ఞమున తనువును త్యజించిన సతి ఇప్పుడు హిమాచలమున జనించినది. శంభుడే తనకు పతి అగునట్లుకోరి ఆమె తపము కావించినది. సర్వమును త్యజించి శివుడు సమాధియం దున్నాడు.

చిక్కులు కిలిగినదేయైనను - నా మాట ఒకటి వినుడు. మీరు వెడలి శివునివద్దకు కాముని పంపుడు. శివుని మనమున అతడు సంక్షోభము కలిగించును. అంతట మేము ఏగి శివునికి మ్రొక్కుదుము. వివాహము చేసికొనుమని మాశక్తికొలది చెప్పి ఆయనను ఒప్పింతుము. దేవతలకు హితము కలుగును'' అని విరించి వచించెను.

''ఈ రీతిని దేవతలకు మిక్కుటమగు హితము కలుగును'' -- ''ఈ యోచన చక్కగా ఉన్నది'' అని అందరు కొనియాడిరి. దేవతలెల్లరు అతి భక్తితో మన్మథుని స్తుతించిరి. అంతట పంచబాణుడు - మీనకేతుడు - ప్రత్యక్షమయ్యెను. తమ విపత్తునంతను దేవతలు అతనికి నివేదించుకొనిరి. మారుడు తన మనస్సున ఆలోచించెను. నవ్వి, అతడు - ''శంభునితో వైరము నాకు క్షేమకరముకాదు - ఐనను మీ కార్యము సఫలమొనర్తును. పరోపకారమే పరమధర్మమని వేదములు నుడువును. పరహితమునకై తన దేహమును త్యజించువానిని భక్తులు సదా ప్రశంపింతురు'' అనెను.

ఎల్లరకు నమస్కరించి, పుష్పభాణమును చేబూని, సహాయకసహితుడై మన్మథుడు చనియెను. చనుచు అతడు ''శివునితో విరోధముచే నాకు చావు నిక్కము'' అని విచారించెను.

కాముడు తన ప్రభావమును ప్రకటించెను. లోకమునంతను తనవశము కావించుకొనెను. మీనకేతుడు ఆగ్రహించిన ఒక్కక్షణములో శ్రుతుల ప్రతిష్ఠ అంతయు మంటకలసెను. బ్రహ్మచర్యము, వ్రతము, నానావిధములగు సంయమము, ధైర్యము, ధర్మము, జ్ఞానము, విజ్ఞానము, సదాచారము, జపము, యోగము, వైరాగ్యము మొద లగు వివేకముయొక్క సైన్యమెల్లయు భయపడి పారిపోయెను. వివేకము, దాని సహా యకులు పలాయనమైరి. దానిభటులు వెన్నిచ్చి పరుగిడిరి. ఆ సమయమున అవి అన్నియు సద్గ్రంథములనబడు పర్వతగుహలలోనికిపోయి తల దాచుకొనెను, జగ మంతయు గగ్గోలు జనించెను.

''ఓయి భగవంతుడా? ఇప్పు డేమికానున్నదో? మమ్ము రక్షించువా డెవడు? రతిపతి కోపించి, ధనుర్బాణములను ధరించి, సంహరింపనున్న ఆ రెండుతలలవా డెవ్వడో?'' అని అందరు తలపోసిరి. జగమున ఆడ మగ అనబడు సకల చరాచర ప్రాణులు తమతమ సహజనియమములను విడిచిపెట్టినవి. సర్వము మన్మథవశమయ్యెను.

సకల హృదయములయందు మదానాభిలాషయే! లతలనుచూచి తరుశాఖలు వానిపై వంగుచున్నవి. నదులు పొంగి జలధిని కలియుటకై పరుగిడుచున్నవి. సరస్సులు, తటాకములు ఏకమైపోయినవి. జడజీవములకే ఈ స్థితి కలిగినపుడు ఇక చైతన్యముకల జీవులనుగురించి ఎవడు వర్ణింపగలడు? ఆకసమున ఎగురు పక్షులు, భూమిపై విహరించు పశువులు అన్నియు సమయాసమయములను, కాలమును విర్మరించినవి. సకలము కామవశమయ్యెను. ఎల్లరు కామాంధులై వ్యాకులపడుచుండిరి. చక్రవాకజంటలు రాత్రులు, పగళ్లు చూచుటయే లేదు. దేవతలు, దనుజులు, నరులు, కిన్నరలు, నర్పములు, ప్రేతములు, పిశాచములు, భూతములు, భేతాళములు - వీని విషయమై నేను వర్ణింపలేను. సదా ఇవి కామదాసులే అని నాకు తెలియును. సిద్ధులు, విరక్తులు, మహామునులు, యోగులు సహా కామవశులైరి, యోగవిరహితులైరి. యోగీశ్వరులు, తాపసులే కామవశులై నపుడు పామరులమాట చెప్పగలవా డెవడు? చరాచరమంతయు బ్రహ్మమయమని కనుగొనినవారు అది ఇప్పుడు నారీమయమని వీక్షించుచున్నారు. జగమంతయు పురుషమయమని స్త్రీలు, స్త్రీమయమని పురుషులు!

రెండు గడియలవరకు బ్రహ్మాండమంతయు కామదేవుడు కావించిన ఈ కౌతు కమే! ఎవరిహృదయమునను ధైర్యమే లేదు. సర్వుల మానసములను మనసిజుడు హరించెను. రఘువీరునిచే రక్షింపబడినవారుమాత్రము ఆ సమయమున తప్పించుకొనిరి. ఈ కౌతుకము రెండుగడియలు నడచినది. రెండుగడియలతరువాత కాముడు శంభుని సమీపించినాడు. శివుని విలోకించి మారుడు భీరుడైనాడు. లోకమంతయు తిరిగి పూర్వస్థితికి వచ్చినది. త్రాగి మతైక్కినవాడు మత్తు దిగినపిదప ఉన్నట్లు జీవులెల్లరు సుఖులైరి. అజేయుడు, దురాధరుడు, దుర్గముడు, భగవానుడు, రుద్రుడు అగు శివునిచూచి మదనుడు కడుభీతిల్లెను. తిరిగి చనినచో సిగ్గు! ఉండి చేయునది లేదు. మదనుడు మరణించవలెనని నిశ్చయించుకొనెను. ఒక ఉపాయమును ఆలోచించెను.

వెంటనే అతడు ఋతురాజగు వసంతుని ఆవిర్భవింపచేసెను. పుష్పించుచున్న సనవృక్షశ్రేణి వెలసి విరాజిల్లినది. వనములు, ఉపవనములు, చెరువు, తటాకములు, అన్నిదిశల విభాగములు అతి సుందరము, మనోహరములయ్యెను. ఎక్కడ చూచినను అనురాగము వెల్లివిరియుచున్నది. మరణించిన మనసులలోసహితము మనసిజుడు మేల్కొన్నాడు. ఆ వనసౌందర్యము వర్ణనాతీతము. మదనుడను అగ్నికి తగిన మిత్రులగు శీతల, సుగంధ, సుమంద వాయువులువీచ మొదలిడినవి. సరోవరములయందు అనేకకమలములు వికసించినవి. వానిపై మధుకరపుంజములు జుంజుమ్మను మంజుల ధ్వనులు నలుపుచున్నది. కలహంసలు, కోకిలలు, చిలుకలు సరసరవములు సలుపుచున్నవి. అచ్చరలు పాటలు పాడుచు, నాట్యము చేయుచున్నారు. ఐననేమి? సేనా సహితుడై కోటివిధముల తన కళలను ప్రయోగించియు మన్మథుడు పరాజితుడయ్యెను. అచలసమాధినుండి శివుడ చలించలేదు. కామదేవుడు క్రుద్ధుడయ్యెను.

ఒక మామిడిచెట్టు కొమ్మను చక్కనిదానిని అతడు కనుగొనెను. కుపితుడై ఆ కొమ్మపై ఎక్కెను. సుమన చాపమున తన శరమును సంధించెను. అత్యంత ఆగ్రహమున దాని గురిపెట్టెను. ఆకర్ణాంతము వింటినారిని సారించెను. తీక్షణములగు పంచబాణములను ప్రయోగించెను. అవి శంభుని హృదయమున గ్రుచ్చుకొన్నవి. శంకరుని సమాధి భగ్నమయ్యెను. ఆతడు మేలుకొనెను. ఆతని మనస్సు మహోక్షోభ చెందినది. ఆతడు కన్నులు తెరచెను. నలుదెసల వీక్షించెను. సౌరభపల్లవముల యందు దాగిఉన్న మదనుడు కనుపించెను. శివునికి మహాక్రోథము జనించెను. ముల్లోకములు కంపించెను. అంతట శంభుడు తన మూడవకంటిని తెరచెను. ఆతనిని చూడగనే కామదేవుడు కాలిపోయి. బూడిదయైనాడు. జగమంతయు మహా హాహాకారము వ్యాపించెను. సురలు భయపడిరి. దానవులు ఆనందించిరి. కామసుఖమును గుర్తుతెచ్చుకొని భోగులు విచారించిరి. సాధుకులకు, యోగులకు నిష్కంటకమయ్యెను. తన పతికి కలిగిన గతిని విని రతి మూర్ఛ చెందెను. ఆమె రోదించినది, విలపించినది. బహువిధముల దీనురాలై ఆమె శంకరుని సమీపించినది. అత్యంతభక్తితో పలువిధముల ఆతనికి వినతి చేసినది. ముకుళితహస్తయై శంభునిఎదుట నిలచినది. అల్పసంతోషి, దయాళుడు అగు శివుడు ఆ అబలను చూచి ఇట్లు ఓదార్చినాడు:--

''రతీ, ఇకనుండి నీ నాధునిపేరు అనంగుడు, శరీరములేకనే ఆతడు సర్వమున వ్యాపించును. నీ పతిని కలయువిధము వినుము.

భూభారమును తొలగించుటకు యదువంశమున కృష్ణుడు అవతరించును. నీపతి కృష్ణునికి కుమారుడై జన్మించును. నా మాట అన్యథా కానేరదు.''

శంకరుని వచనములను విని రతి వెడలెను.

తదుపరి జరిగిన మరి ఒక కథను వర్ణింతును.

ఈ వృత్తాంతము అంతయు బ్రహ్మాదిదేవతలు వినిరి. వారందరు వైకుంఠమునకు చనిరి. అచ్చటినుండి బ్రహ్మ విష్ణు సమేతులై ఎల్లరు కృపానిలయుడగు శంకరుడున్నచోటికి అరిగిరి. వేఱు వేఱుగా శివుని స్తుతించిరి. చంద్రావతంసుడు ప్రసన్నుడయ్యెను. ఆ కృపాసాగరుడు, వృషకేతుడు--''తెలుపుడు, అమరులారా, మీ రెల్లరు వచ్చినపని ఏమి?'' అని వారిని ప్రశ్నించెను.

''ప్రభూ, నీవు అంతర్యామివి. ఐనను, స్వామీ, భక్తివశుడనై నీకు వినతి చేతును. శంకరా, తమ కన్నులార నీ వివాహమును సందర్శించవలెనని దేవతలెల్లరు ఉత్సాహము చెందుచున్నారు. మదనాంతకా, అందరు ఈ ఉత్సవమును వీక్షించునట్లు ఎట్లైనను అనుగ్రహించుము. కృపాసాగరా, ఆనాడు కాముని భస్మము కావించి రతికి ఒక పరమిచ్చి కృపచూపితివి. స్వామీ, ప్రభువులకు ఇది సహజస్వభావము. వారు మొదట దండింతురు. పిదప దయచూపుదురు. పార్వతి అపార తపమొనర్చినది. ఇక ఆమెను స్వీకరింపుము'' అని విధాత సమాధానము పలికెను.

విధాతయొక్క వినయమగు ప్రార్థనను విని, రామ ప్రభుని వచనములను జ్ఞప్తికి తెచ్చుకొని ప్రసన్నుడై శివుడు ''తథాస్తు'' అనెను. అంతట దేవతలు దుందు భులను మ్రోగించిరి. పూలవానను కురిపించిరి. ''జయము-జయము-సురనాథునికి జయము'' అని ధ్వానములు కావించిరి.

ఇదియే సమయమని గ్రహించి స ప్తర్షులు విచ్చేసిరి. వెంటనే వారిని హిమాచలునివద్దకు విరించి పంపించెను. భవానిఉన్న హిమాచలమునకు వారందరు వెడలిరి. ఆమెతో కపటయుతమగు మధురవచనములను నుడివిరి.

''ఆనాడు నారదుని ఉపదేశమును వింటివి. మా మాటలు వినవైతివి. ఈనాడు నీ ప్రతిన అసత్యమయ్యెను. మహేశుడు కామును మంట కలిపివైచెను'' అనిరి. ఆ మాటలు విని భావాని మందహాసము చేసెను.

''విజ్ఞానులగు మునివరులారా, సముచితమగుదానినే మీరు పలికితిరి. శంభుడు కాముని ఇప్పుడు కాల్చివైచినాడని మీరనుచున్నారు. ఇంతవరకు ఆతడు వికారసహితుడనియా మీ తలంపు? నా భావమున శివుడు సదా యోగియే, అజుడే, అనింద్యుడే, నిష్కాముడే, భోగరహితుడే, ఆతడు ఇట్టివాడని తెలిసియే నేను మనోవాక్‌ కర్మల యందు ప్రేమయతముగా సేవించితిననినచో - కృపానిధి అగు ఆ ఈశుడు నా ప్రతినను సత్యము కావించుననియేకదా మునీశ్వరులారా, హరుడు మారుని భస్మము కావించెనని మీరు నుడివితిరి. అది అంతయు మీ అమిత అవివేకమే. నాయనలారా, మంచు ఎన్నడూ అగ్నిని సమీపించజాలదు. అగ్నియొక్క స్వభావమది. ఒకవేళ అగ్నిని మంచు సమీపించినను - అవశ్యము మంచు నశించును. మన్మథ-మహేశ్వరుల విషయమైకూడా ఇదే న్యాయము'' అని ఆమె పలికెను.

భవానియొక్క వచనములకు విని, ఆమె ప్రేమను విశ్వాసమును కనుగొని మునులు తమ హృదయములయందు కడు సంతసించిరి. ఆమెకు మ్రొక్కివారు హిమాచలునివద్ద కేగిరి. జరిగిన వృత్తాంతమంతయు వారు గిరిపతికి వివరించిరి. కామదహనమును విని హిమవంతుడు అతి దుఃఖితుడయ్యెను. రతి పొందిన వరమునుగురించి మునులు తెలిసినపిదప ఆ విషయమును విని అతడు మిక్కిలి సంతసించెను.

శంభుని ప్రభావమునుగురించి మనమున యోచించి హిమవంతుడు మనివరులను సాదరముగా పిలవనంపెను. శుభదినమును, శుభతారను, శుభఘడియను నిర్ణ యముకావించి, వేదవిధిని వెంటనే లగ్ననిశ్చయము చేయించెను. లగ్నపత్రికను వ్రాయించెను. దానిని సప్తఋషులకు ఇచ్చెను. వారిపాదములను పట్టుకొని హిమాచలుడు వినతి కావించెను. ఆ మహర్షులు వెడలి లగ్నపత్రికను విరించికి సమర్పించిరి. దానిని చదివి విధాత తన హృదయమున ఆనందము భరింపజాలకపోయెను. అజుడు ఆ లగ్నమును అందరికి తెలిపెను. దానిని విని సుర, మునిబృందములు హర్షితులైరి. నభమునుండి సుమనవృష్టి కురియసాగెను. దుందుభులు మ్రోగ మొదలిడెను. దశదిశల మంగళకలశములు అలంకరింపబడెను. సురలెల్లరు పలువిధములగు తమ వాహనములను, విమానములను అలంకరించిరి. శుభప్రదములగు శకునములు పొడగట్టినవి. దేవవేశ్యలు నాట్యమాడుచుండిరి. శివగణములు శంభుని శృంగారింపసాగిరి. అతని మకుటమున జటాజూటము కట్టిరి. దానిపై నాగభూషణమును శృంగారించిరి. మహాదేవుడు సర్పకుండలములను, నాగకంకణములను ధరించెను. శరీరమున విభూతిని అలదుకొనెను, ఒడలిపై పులిచర్మమును చుట్టెను. సుందరమగు అతని లలాటమున శశి. శిరమున గంగ, మూడుకన్నులు, భుజంగయజ్ఞోపవీతము, గరళకంఠము, ఉరమున నరశిరముల మాల.

ఇట్లున్నది అతనివేషము, అశుభకరమైనదే అది. కాని-అతడు కృపాళుడు. కల్యాణధాముడు ! ఒకచేత త్రిశూలము, రెండవదానిలో డమరుకము విరాజిల్లుచున్నవి. ఎద్దుపై ఎక్కి అతడు పయనమైనాడు. సురస్త్రీలు అతనిని చూచిరి. మందహాసము చేసిరి. ''ఈ వరునికి తగు వధువు జగమున లభించదు'' అని అనుకొనిరి.

బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతాబృందములు తమ తమ వాహనములపై ఆసీనులై పెండ్లివారితో బయలుదేరిరి. సురసమాజము అన్నివిధముల అనుపమమై ఉన్నది. వరపక్షముమాత్రము వరునికి తగినట్లు లేదు. విష్ణుమూర్తి దిక్పాలకుల నందరిని పిలిపించెను.

''మీరందరు మీ సమాజములతో వేఱువేఱుగా వెడలుడు. మనపక్షము వరునికి తగినట్లు లేదు. నూతననగరమునకు వెడలి అచ్చట నవ్వులపాలగుదుమా ఏమి?'' అని అతడు నుడివెను. విష్ణుని మాటలను విని దేవతలు చిరునవ్వు నవ్విరి. వారందరు తమ తమ బృందములతో వేఱువేఱుగా పయనించిరి. దీనినిచూచి మహేశుడు తనలో తాను నవ్వుకొనెను. ''ఈ హరికి వ్యంగ్యవచనములు పోవు!'' అని అనుకొనెను. తన ప్రియమిత్రుడగు హరియొక్క పలుకులను విని, భృంగిని పంపి హరుడు తన సకల గణములను రప్పించెను. శివుని ఆనతిని విని అందరు వచ్చిరి. ప్రభుని పాదకమలములకు తలలువంచి వందనముచేసిరి. నానావిధములగు వాహనములను ఆరోహించి ఉన్న, నానావేషములను ధరించిఉన్న తన బృందమునుచూచి శివుడు నవ్వుకొనెను. కొందరికి ముఖములు లేనేలేవు. కొందరికి ఎన్నోముఖము లున్నవి. కొందరికి చేతులు, కాళ్లు లేవు. మరికొందరికి ఎన్నో కాళ్లు, ఎన్నో చేతులు ఉన్నవి. కొందరికి ఎన్నో కన్నులు. కొందరికి కన్నులే లేవు. కొందరు చాలా లావుగా, పుష్ఠిగా ఉన్నారు. ఇక కొందరు సన్నగా, దుర్బలులై ఉన్నారు. కొందరు అతి బలహీనులు. కొందరు అతి స్థూలకాయులు, కొందరు పవిత్రవేషధారులు, మరికొందరు అపవిత్రవేషధారులు. భయంకర భూషణధారులు. కపాలధారులు -మొత్తముమీద అందరూ తమ శరీరముల మీద క్రొత్తనెత్తురు పూసికొనినవారే! వారి ముఖములో! గాడిద, కుక్క, నక్క, పందులవి ! ఆ గణములయొక్క అగణితవేషములను ఎవరు లెక్కింపగలరు? అనేక విధములగు ప్రేతములు, పిశాచములు, యోగినులు గుమికూడిరి. వానిని వర్ణింపజాలము. ఆ భూతములన్నియు నాట్యము చేయుచున్నవి. గానము చేయుచున్నవి. మహానందమున మునిగి ఉన్నవి. చూచుటకు అవి అన్నియు అతి విపరీతుగా ఉన్నవి. విచిత్రముగా పలుకుచున్నవి. వరుడు ఎట్టివాడో అతని పక్షమువారునూ అట్లే సిద్ధమయ్యిరి. అందరు పయనించుచున్నారు. మార్గమున బహువిధములగు కౌతుకములు సలుపుచున్నారు.

ఇక్కడ హిమచలుడు - అతి విచిత్రమగు మండపమును కట్టించినాడు. దానినిమాత్రము వర్ణింపశక్యమా ? జగమునఉన్న సకలశైలములకు - చిన్నవానికి, పెద్ద వానికి - వర్ణింపలేనన్నిటికి - వనములకు, సాగరములకు, అన్ని నదులకు, తటాకములకు హిమవంతుడు ఆహ్వానములను పంపించెను. వారెల్లరు కామరూపధారులు. సుందర శరీరములను ధరించి, తమ నారీమణులతో, బృందములతో తుహినాచలుని గృహమునకు వారు వచ్చిరి. అందరు ప్రేమయుతముగా మంగళగీతములను పాడుచుండిరి.

అంతకుముందే హిమవంతుడు ఎన్నో ఇండ్లను అలంకరించి సిద్ధము చేయించెను. వచ్చినవారందరు వారివారికి తగినరీతిని ఆ యా గృహములలో విడిది చేసిరి. ఆ పురముయొక్క సుందరశోభను అవలోకించినచో విరించియొక్క నైపుణ్యము సహితము నిజముగా దానిముందు అల్పమే అనిపించును. ఆ నగరి రామణీయకతను కనుగొన్నచో నిజముగా విధియొక్క చాతుర్యము వెలవెల పోవును. వనములు, ఉద్యానవనములు, కూపములు, చెరువులు, నదులు అన్నియు రమణీయముగా ఉన్నవి. వానిని ఎవరు వర్ణింపగలరు? ఇంటింటను మంగళసూచకములగు అనేక పతాకములు, తోరణములు రమ్యముగా ఎగురుచున్నవి. నగరమునందలి వనితల, పురుషుల సౌందర్యమును, చాతుర్యమునుచూచి మునుల మనములు సహితము మోహితములగును. జగదాంబ అవతరించిన ఆ పురమును వర్ణింప సాధ్యమా? బుద్ధి, సిద్ధి, సంపద, సుఖము అచ్చట నిత్యనూతనములై వృద్ధి చెందుచున్నవి.

మగ పెండ్లివారు నగరమును సమీపించిరి. నగరమున ఆనందము, కోలాహలము వ్యాపించెను. వానితో నగరశోభయు ఇనుమడించెను. నానావిధములగు వాహనములను శృంగారించి, అలంకరించి సిద్ధము చేసికొని పెండ్లివారిని సాదరముగా తీసికొనివచ్చుటకై ఎదురుకోలుకై వధువు పక్షమువారు బయలుదేరిరి. సురసేననుచూచి ఎల్లరు తమ మనములయందు సంతసించిరి. హరిని వీక్షించి ఆనందించిరి. కాని, శివసమాజమును చూచినవెంటనే ఆ వాహనములన్నియు భయపడి పారిపోయెను. కొందరు పెద్దలు ధైర్యము వహించి అక్కడనే నిలచిరి. పిల్లలు అందరుమాత్రము తమ ప్రాణములను చేతబట్టుకొని ఇండ్లకు పారిపోయిరి. ఇండ్లకు చేరినపిదప ''పారిపోయి వచ్చితి రేమి కారణమని'' వారి తల్లిదండ్రులు ప్రశ్నించుచున్నారు. భయకంపితశరీరులై పిల్లలు, ''ఏమని చెప్పము? ఏమి చెప్పుటకు మాటలురావు. ఇది పెండ్లివారిబృందమా లేక యమధర్మరాజు సైన్యమా ? ఆ పెండ్లికొడుకు ఒక పిచ్చివాడు. ఎద్దుపై ఎక్కి వచ్చినాడు. పాములు, కపాలములు, బూడిద - ఇవి ఆతని భూషణములు. అతని ఒడలంతయు బూడిద. పాములు, పుఱ్ఱలు నగలు, అతడు దిగంబరుడు. జటాధారి, భయంకరుడు. అతనివెంట వచ్చినవారు - వికటమఖములు కలిగిన భూతములు, ప్రేతములు. పిశాచములు, యోగినులు. రాక్షసులు ! ఆ పెండ్లివారినిచూచి బ్రతుకకలిగినవారు కడు పుణ్యాత్ములు. ఉమాకల్యాణమును వారుమాత్రము చూడగలరు'' అని అనుచున్నారు. ప్రతిఇంటను బాలకులు ఇవే మాటలు. అది మహేశ్వరుని సమాజమని తల్లిదండ్రులు తెలిసికొని, మందహాసము చేయుచుండిరి. వివిధవిధముల - తమ పిల్లలను వారు ''భయములేదు, నిర్భయముగా ఉండుడు'' అని ఓదార్చుచుండిరి.

ఎదురుకోలుకై ఏగినవారు పెండ్లివారిని తీసికొనివచ్చిరి. వారి కెల్లరకు తగు విడిదిగృహములను ఏర్పరచిరి.

మేనక మంగళహారతిని అలంకరించినది. ఆమెవెంట ఉన్నస్త్రీలు సుమంగళగీతములను పాడిరి. లలితములగు హస్తములలో బంగారుపళ్లెరములు మెరయుచున్నవి. వరునికి హారతి ఇచ్చుటకు మేనక సంతోషమున ద్వారమువద్దకు వచ్చినది. రుద్రుని వికటవేషమును చూడగానే అబల లందరి మనస్సులయందు అమిత భయము జనించెను. మహాభయముచే వారందరు పారిపోయి ఇండ్లలో దూరిరి.

మహేశ్వరుడు తన విడిదికి వెడలెను. మేనకయొక్క హృదయమున భరింపరాని దుఃఖము కలిగెను. గిరికుమారిని ఆమె తనవద్దకు పిలిపించెను. అత్యంత ప్రేమతో ఆమెను తన ఒడిలో కూర్చుండపెట్టుకొనెను. నీలసరోజములవంటి ఆమె నేత్రములవెంట నీరు కారుచున్నది. ''ఇట్టి సుందరరూపమును నీకు ప్రసాదించిన ఆ విధాత - ఈ జడుని - పిచ్చివానిని నీకు వరునిగా ఎట్లు చేసెనమ్మా? ఈ సౌందర్యమును నీకు ప్రసాదించి విరించి నీకొరకై ఈ పిచ్చివానినా సృష్టించినది? కల్పవృక్షమునకు కాయవలసినఫలము బలవంతమున తుమ్మచెట్టునకు కాచినదా! నిన్ను తీసికొని నేను పర్వతముపై నుండి క్రింద పడిపోదును. అగ్నిలోకాలి భస్మమగుదును. లేదా-సముద్రమున దుముకుదును. నా ఇల్లు నాశనము కానిమ్ము. జగమున అపకీర్తి నాకు రానిమ్ము. ఈ పిచ్చివానితో నీకు పెండ్లి - నా బొందెలో ప్రాణమున్నంతవరకు జరుగనీయను'' అని మేనక తన కొమరిత అగు ఉమతో అనెను. మేనకయొక్క దుఃఖమునుచూచి స్త్రీ లెల్లలు వికలులైరి. పుత్రికయందలి ప్రేమచే మేనక విలపించెను. రోదించెను.

''నారదునికి నేనేమి అపకారము చేసితిని? నా కాపురమును అతడు ఇట్లు కూల్చివైచినాడు. ఉమకు అట్టి ఉపదేశము చేసినాడు. దానివలనకదా ఒక పిచ్చి మగని కొరకై ఆమె తపస్సు చేసినది? నిజమునకు ఆ నారదునికి మోహములేదు. మాయయులేదు. ధనములేదు. ఇల్లులేదు. భార్యలేదు, అందరియెడలను అతడు ఉదాసీనుడు. కనుకనే అతడు పరులకొంపను పాడుచేయును. ఎవరనినను అతనికి సిగ్గులేదు. భయములేదు. అవును - గొడ్రాలి కేమితెలియును ప్రసవవేదన ?''అని ఆమె ఎంతయో చింతించెను.

తల్లివ్యాకులపడుచున్నట్లు భవాని కనుగొనెను. వివేకయుత, కోమల వచనములను ఆమె ఇట్లు వచించెను :- ''అమ్మా, ఇట్లు ఆలోచించి నీవు చింతింపకుము బ్రహ్మ వ్రాసినవ్రాతను తప్పింపలేము. పిచ్చివాడే నాకు భర్త కావలయునని నా నుదుట వ్రాయబడిఉన్నచో ఇంకొకరిపై దోషము ఆపాదించనేల ? విధాత గీచినగీతను మార్చగలవా నీవు ? వ్యర్థ కళంకయుత వ్యాఖ్యానము విరమించుము. తల్లీ, ఈ నిందలు మానుము, విచారము వీడుము. ఇది చింతకు సమయముకాదు. నా అదృష్టమున ఏ సుఖదుఃఖములు వ్రాయబడిఉన్నవో వానిని నేను ఎక్కడకు చనినను అనుభవింపవలసినదే.''

ఉమయొక్క వినీత, కోమల వచనములను విని అచ్చటి అబలలందరు విచారింపసాగిరి. కన్నీరు కార్చ మొదలిడిరి.

ఈ వార్తను వినినవెంటనే హిమవంతుడు నారదుని, సప్తమహర్షులను వెంటనిడుకొని ఇంటికి వచ్చెను. నారదుడు పార్వతియొక్క పూర్వవృత్తాంతమును తెలిపి ఎల్లరిని ఓదార్చెను.

''అమ్మా మేనకా, నేను తెలుపు సత్యమును వినుము. నీ సుత జగదాంబ అగు భవాని. ఆమె అజన్మ, అనాది, అవినాశి అగు శక్తి. సదా శంభుని అర్ధాంగి. జగత్తుయొక్క ఉత్పత్తి. స్థితి, లయకారిణి ఈమెయే. తన ఇచ్ఛను అనుసరించియే ఈమె లీలాశరీరమును ధరించును. మొదట ఈమె దక్షునిఇంట జన్మించెను. అప్పుడు ఈమె సుందరశరీరమును సతి అను నామమును కలిగిఉండెను. అచ్చట సహితము ఈమె శంకరుని వివాహమాడినది. ఆ చరిత్ర సకలజగమున ప్రసిద్ధమే. ఒకనాడు ఈమె శివునితో కలసివచ్చుచూ రఘుకులభానుని రాముని చూచెను. మోహవశమున ఆమె శివుడు నుడివినదానిని వినలేదు. భ్రమవశమున సీతయొక్క వేషమును ఈమె ధరించెను. ఆ అపరాధముచే శంకరుడు ఈమెను పరిత్యజించెను. హరవియోగమునఉన్న ఈమె తన తండ్రి కావించుచున్న యజ్ఞమును చూడ ఏగెను. ఆ యోగాగ్నియందు భస్మమైపోయెను. ఇప్పుడు నీ ఇంట జన్మించిని. తన పతికై దారుణమగు తపమును కావించినది. ఈ విషయమును తెలిసికొని సంశయమును విడువుము. గిరిజ సర్వదా శంకరుని ప్రియురాలే'' అని అతడు వచించెను.

నారదుని వచనములను వినిన అందరి విచారము నశించెను. ఒక్క క్షణమున ఈ సంవాదమంతయు నగరమున ఇంటింటికి ప్రాకినది.

అంతట మేనకా-హిమవంతులు ఆనందభరితులైరి. పదేపదే-వారు పార్వతీచరణములకు వందనము చేసిరి. స్త్రీలు, పురుషులు, యువకులు, వృద్ధులు, బాలకులు అందరు అత్యంత హర్షము చెందిరి.

పురజనులు మంగళగీతములు గానముచేయు ప్రారంభించిరి. పలువిధములగు బంగారుకలశములను అలంకరింనిరి. పాకశాస్త్రమున ఎన్నివిధములగు పదార్థము లున్నవో అన్నియు వండి సిద్ధము చేయబడినవి. లోకమాతభవాని వసించుఇంట భోజన పదార్థములను వర్ణించుట ఎట్లు ? మగపెండ్లివారిని అతిథులను, బ్రహ్మ విష్ణులను, సర్వదేవతలను హిమవంతుడు సాదరముగా ఆహ్వానించెను. విందుకై అనేక పంక్తులు తీర్చి కూర్చుండిరి. నిపుణులగు పాచకులు వడ్డన ప్రారంభించిరి. నారీబృందములు మధురస్వరములలో హాస్యములాడ మొదలిడిరి. వ్యంగ్యభరితములగు మాటలు పలుకసాగిరి. ఆ వినోదవచనములను విని దేవతలు ఆనందించుచున్నారు. ఈ ఆనందమున వారి భోజనములు ఆలశ్యమగుచున్నవి. విందుసమయమున కలుగుచున్న ఆ ఆనందమును కోటినో ళ్లైనను వర్ణింపజాలవు. అందరు చేతులు, మొగములు కడిగికొనిరి. తాంబూలములు స్వీకరించిరి. వారి వారి విడుదులకు వెడలిరి.

అంతట మునులు హిమవంతునివద్దకు మరలివచ్చి లగ్నపత్రికను వినిపించిరి. వివాహసమయమును గుర్తెఱిగి దేవతలను రమ్మని వారు వర్తమానము పంపిరి. దేవతలకెల్లరకు సాదరముగా పిలుపు వెళ్లినది. [వారు వచ్చిరి] వచ్చినవారి కెల్లరకు యథోచితమగు ఆసనములు సమకూర్చబడినవి. వేదోక్తవిధిని వేదిక అలంకరింపబడినది. స్త్రీలు మంజులమగు మంగళగీతములను గానము చేయసాగిరి. అత్యంత సుందరము, దివ్యము అగు సింహాసనము అమర్చబడినది. స్వయముగా విరించియే దానిని నిర్మించినాడు. దాని సౌందర్యము వర్ణింపజాలము.

శిరమువంచి విప్రులకు నమస్కరించి ప్రభువగు రఘురామునికి తన హృదయమున వందనమొనరించి శివుడు సింహాసనమున ఆసీనుడయ్యెను.

అనంతరము మునీశ్వరులు ఉమను రప్పించిరి. ఆమెను సింగారించి సకియలు తోడ్కొని వచ్చిరి. ఆమె రూపమునుచూచి దేవతలెల్లరు మోహితులైరి. ఆమెయొక్క సౌందర్యమును వర్ణింపగల కవి లోకమున ఎవ్వడున్నాడు ?

ఆమె జగదాంబ అనియు, భవుని భామ అనియు తెలిసికొని సురలు తమ మనసులయందే ఆమెకు ప్రణామము కావించిరి. లావణ్యమునకు భవానియే అవధి. ఆ మహా సౌందర్యమును కోటినోళ్లు వర్ణించినను ఆవర్ణన అల్పమే. శ్రుతులు, అదిశేషుడు, శారదయు దానిని వర్ణింప జంకుదురే ? ఇక మందమతి అగు తులసి ఒక లెక్కయా ? సౌందర్యఖని అగు భవానీమాత వేదికమధ్య శివుడు కూర్చుండిఉన్న చోటికి వచ్చినది. వినయవశమున ఆమె తన పతియొక్క పాదకమలములను చూడజాలకున్నది. ఆమె మానసమను మధుకరము వానిపైననే ఉన్నది.

ముని ఆనతిని భవానీ శంకరులు గణపతిని పూజించిరి. సురలకు ఆది అనునది లేదని తెలిసిన వారెవ్వరును ఈ విషయమును గురించి సంశయింపరు.

వేదోక్త వివాహవిధి ననుసరించి మహామునులు సర్వమును జరిపించిరి. గిరీశుడు చేతిలో దర్భలను గ్రహించెను. కన్యయొక్క కరమును పుచ్చుకొనెను. ఆమె భవాని అని గ్రహించి, ఆమెను భవునికి సమర్పించెను. మహేశుడు పార్వతీ పాణిగ్రహణము కావించినంతనే సకల సురేశులు తమ హృదయముల సంతసించిరి. మునిగణములు వేదమంత్రములను ఉచ్ఛరింపసాగిరి. దేవతలు ''జయము జయము జయము శంకరా'' అని జయ జయ ధ్వానములు సలుప మొదలిడిరి. వివిధ రీతులగు వాద్యములు మ్రోగసాగినవి. ఆకసమునుండి అనేక విధములగు అలరుసోనల వాన కురియ మొదలిడెను.

గిరిజాహరుల వివాహము జరిగెను. సకల భువనములు ఆనంద ఉత్సాహ సంభరితము లయ్యెను. దాసీదాస జనములు, తురగములు, అరదములు, ఏనుగులు, ధేనువులు, వస్త్రములు, మణులు మొదలగు అనేక వస్తువులు, భోజనపాత్రలు, కనక భాండములు, బండ్లకు బండ్లు వరకట్నముగా ఇవ్వబడెను. వానినన్నింటిని వర్ణింపలేము.

బహువిధములగు వరకట్నమునిచ్చి హిమభూధరుడు కరములు జోడించి ''శంకరా. నీవు పరిపూర్ణకాముడవు - నీకు నేనేమి సమర్పింపగలను ?'' అని పలికి శంకరుని చరణ పంకజములను గ్రహించి అట్లే కొంతతడవు ఉండెను. కృపాసాగరుడగు శివుడు తన మామగారిని అనేకరీతుల ఆనందింపచేసెను.

పిదప ప్రేమ పరిపూర్ణహృదయ అగు మేనక శివుని చరణములను గ్రహించి''ప్రభూ, ఉమ నా ప్రాణముతో సమానము. నీ ఇంటిసేవకులలో ఆమెను ఒకదానినిగా చేసికొనుము. ఈమె చేయి అపరాధముల నన్నిటిని మన్నింపుము - ప్రసన్నుడవై ఈ వరమును నాకు ప్రసాదించుము'' అని ప్రార్థించెను.

శంభుడు అనేకవిధముల అత్తగారిని ఓదార్చెను. అంతట మేనక శివునిపాదములకు తలవంచి నమస్కరించి ఇంటికి వెడలెను.

అనంతరము ఆమె ఉమను పిలిపించి ఆమెను తన ఒడిలో కూర్చుండబెట్టుకొనెను.

''అమ్మా, సదా నీవు శంకరుని పాదములను పూజించుచుండుము. ఇది నారీధర్మము; స్త్రీలకు పతియే దైవము. వేఱొకదైవము వారికిలేడు.'' అని రమ్యవచనములతో ఆమెకు బోధించెను. ఇట్లు ఉపదేశించుచుండగా మేనక కన్నులు నీరు కారుచుండెను. ఆమె ఉమను ఆలింగనము చేసికొనెను.

''విధాత జగత్తున స్త్రీలను ఏల సృజించెనో ? పరాధీనులకు స్వప్నముననైనను సుఖములేదు'' అని నుడువుచు ఆ తల్లిప్రేమచే కడువ్యాకులపడెను. యోచించి అది సమయముకాదని ఆమె ధైర్యము వహించెను. మాటిమాటికి మేనక - తన కొమరి తను కౌగలించుకొని ఆమె చరణములపై పడెను. ఆమె ప్రేమ వర్ణనాతీతము. భవానియు స్త్రీల నెల్లరను ఆలింగనము చేసికొని, తల్లినిచేరి ఆమెను తన హృదయమునకు హత్తుకొనెను. మరి ఒకసారి తన జననిని కౌగలించుకొని పార్వతి బయలుదేరెను. అందరు ఆమెను ఉచితరీతిని ఆశీర్వదించిరి. పదేపదే తల్లివంక - వెనుకకు తిరిగి - చూచుచు ఆమె కదలినది. అంతట సఖులు అందరు ఆమెను శివునివద్దకు తోడ్కొని వెడలిరి.

యాచకుల నెల్లరను సంతోషపరచి శంకరుడు ఉమాసమేతుడై తన భవనమునకు వెడలెను. దేవతలు ఆనందించి పుష్పవృష్టిని కురిపించిరి. ఆకసమున సుందర వాద్యములు మొరసినవి. అల్లుని సాగనంపుటకై అతనివెంట హిమవంతుడు నడచెను. వృషకేతుడు అనేక విధముల అతనిని ఆనందపరచి వీడ్కోలు పలికెను. గిరిరాజు వెంటనే తనభవనమునకు తిరిగివచ్చెను. సకల శైలములను, సరస్సులను పిలిపించెను. వారికెల్లరకు సాదరముగా దాన, వినయ సన్మానపూర్వకముగా వీడుకోలు తెలిపెను.

శంభుడు కైలాసమునుచేరగానే దేవతలందరు తమతమ లోకములకు మరలిరి.

భవానీ శంభులు జగత్తునకు మాతాపితరులు. వారి శృంగారమును నేను వర్ణింపబోను. ఉమా శంకరులు వివిధ విధముల భోగవిలాసములను అనుభవించుచు తమ గణములతో కైలాసమున నివసించుచుండిరి. గిరిజాహరులు నిత్యనూతన విహారములు సలుపుచుండిరి. ఇట్లు చాలాకాలము గతించెను. అనంతరము వారికి షడాననుడు జనించెను. అతడు యుద్ధమున తారకాసురుని సంహరించెను. షణ్ముఖ జన్మవృత్తాంతము సర్వ ఆగమ, నిగమ, పురాణ ప్రసిద్ధము. సకల జగమునకు ఇది విదితము. షడాననుని జన్మ, కర్మ, ప్రతాప, మహాపురుషార్థములు సర్వజగము ఎఱుగును. కనుక వృషకేతుని సుతుని చరితను నేను సంక్షేపముగనే దెలిపితిని.

ఈ 'ఉమా శంభుల వివాహ కథను' రచించు, గానము కావించు స్త్రీలు, పురుషులు కల్యాణ కార్యములయందు వివాహాది మంగళములయందు సర్వదా సుఖమును కాంతురు.

గిరిజారమణుని చరిత వేదములైనను తరింపజాలని సముద్రము. అతి మందమతి, మూర్ఖుడు అగు తులసిదాసు దానిని ఎట్లు వర్ణింపగలడు ?

శంభుని రమ్య చరితను విని భరద్వాజముని మహానందము పొందెను. కథను వినవలెనను అభిలాష అతనికి అధికమయ్యెను. అతని నేత్రములు నీరు క్రమ్మెను. రోమావళి పులకించెను. ప్రేమవివశుడైన ఆమునినోట మాటలు వచ్చుటలేదు. అతని స్థితిని కనుగొని జ్ఞాని అగు యాజ వల్క్యముని కడుసంతసించి ఇట్లు వచించెను :-

''మునీశ్వరా, అహో! నీ జన్మ ధన్యమయ్యెను. గౌరీశుడు నీకు ప్రాణసమాన ప్రియుడు. శివుని చరణ కమలములయందు ప్రీతిలేనివాడు స్వప్నముననైను రామునికి ప్రీతిపాత్రుడు కానేరడు. విశ్వనాథుని పాదములయందు నిష్కపటమగు భక్తిని కలిగిఉండుటయే రామభక్తుని లక్షణము.

ఏపాపము ఎఱుగని సతివంటి స్త్రీని త్యజించినాడు - ప్రతినపూని రఘుపతియందు తనభక్తిని నిరూపించినాడు. రఘుపతియందలి భక్తివ్రతమును ధరించిన అట్టి శివునివంటివాడు మరి ఎవ్వడున్నాడు? శివునికి సముడగు ప్రియుడు రామునికి ఎవ్వడున్నాడు సోదరా ?

ప్రథమముననే శివచరితను నీకు వివరించి నీ రహస్యమును తెలిసికొంటిని. రామునికి నీవు అత్యంత పవిత్ర సేవకుడవు. సకల వికార రహితుడవు. నీ గుణశీలములను నేను తెలిసికొన్నాను. ఇక రఘుపతి లీలలను తెలుపుదును. వినుము. మునీ, వినుము, నీ సమాగమమువలన నేడు నాకు కలిగిన ఆనందము వర్ణింపశక్యముకాదు.

మునీశ్వరా, రామచరిత అతి అపారము. శతకోటి శేషులైనను దానిని వివరింపజాలరు. ఐనను నేను వినినవిధమున దానిని - వాగ్దేవీ ప్రేరకుడగు ధనుష్పాణిని రాముని స్మరించి వినిపింతును.

సరస్వతి ఒక కొయ్యబొమ్మ వంటిది. అంతర్యామి అగు రామస్వామి ఆ బొమ్మను ఆడించు సూత్రధారి. ఒక కవి తనభక్తుడని తెలిసికొని, ఆ కవిపై ఆతడు తన కృపను ప్రసరించును. ఆ కవియొక్క హృదయాంగణమున సరస్వతిని అతడు నాట్యమాడించును. అట్టి కృపాళుడగు రఘునాథునికి ప్రణమిల్లుదును. ఆతని విమలగుణ గాథలను విశదముగా వర్ణింతును.

పర్వతములయందు పరమ రమణీయమైనది. శ్రేష్ఠమైనది కైలాస పర్వతము. ఉమా శివులు సదా అచ్చట వసింతురు. సిద్ధులు, తపోధనులు, యోగిజనులు, సురలు, కిన్నరలు, మునిబృందములు ఆ పర్వతముమీద నివసింతురు. వారందరు కడుపుణ్యాత్ములు. ఆనందమునకు మూలాధారుడగు శివుని వారు సేవించుచుందురు. హరిహర విముఖులు, ధర్మనిరతి లేనివారు కలలోనైనను అచటికి పోజాలరు. ఆ పర్వతముమీద ఒక విశాల వటవృక్షము కలదు. నిత్యనూతనమై, సకల ఋతువులయందు అది సుందరమై ఉండును. త్రివిధవాయువులు అచ్చట వీచుచుండును. ఆ చెట్టునీడ కడు శీతలమై ఉండును. శివుడు విశ్రమించు ప్రదేశమిదియే. దానిని వేదములు కీర్తించినవి.

ఒకానొక దినమున ఆ చెట్టుక్రిందికి ప్రభువు శంభుడు - వెడలెను. ఆ తరువును అవలోకించి ఆతని హృదయము ఆనందభరితమయ్యెను. స్వహస్తములతో ఒక పులి చర్మమును ఆతడు ఆ చెట్టునీడను పరచుకొనెను. దానిమీద ఆ దయాళుడు సుఖాసీనుడయ్యెను. కుందపుష్పమువలె, చందమామవలె, శంఖమువలె ఆతని శరీరము గౌరవర్ణమున మెరయుచున్నది. దీర్ఘబాహువులు, అరుణ తరుణాంబుజ నిభచరణములు - భక్తుల హృదయాంధకారమును హరించు నఖద్యుతి. భుజగభూషణుడు. భస్మధారి. త్రిపురారి ఆననము శరచ్చంద్రుని శోభను హరించును. జటాముకుటము, సురనది శిరమున, విశాల నళినలోచనములు. నీలకంఠము, ఫాలమున బాలచంద్రుడు. శాంతరసమే శరీరము ధరించి కూర్చున్నదో అనునట్లు ఆసీనుడై ఉన్నాడు ఆ మన్మథరిపుడు. అది మంచిసమయమని గ్రహించి భవాని శంభుని సమీపించెను. తన ప్రియపత్ని అని తెలిసికొని శంకరుడు ఆమెను కడు ఆదరించెను. తన వామభాగమున హరుడు ఆమెను ఆసన మొసగెను. ఆనందమున ఆమె శివుని సమీపమున కూర్చుండెను. పూర్వజన్మవృత్తాంతము ఆమెకు గుర్తువచ్చెను. పతియొక్క హృదయమున తనపై అధికమగు ప్రేమ కలదని ఉమ గ్రహించెను. నవ్వుచూ ఆమె ప్రియవచనములను నుడివెను. సకలలోక హితకరమగు చరితను శైలకుమారి ప్రశ్నించ కోరెను.

''విశ్వనాథా, నా నాథా, త్రిపురారీ, నీ మహిమ ముల్లోకములయందు విఖ్యాతమే. చరాచరములెల్లయు, నరులు, నాగులు, సురలు - నీ పాదపంకజములను సేవింతురు. ప్రభూ, నీవు సర్వసమర్థుడవు. సర్వజ్ఞుడవు. శివుడవు. యోగ, జ్ఞాన, వైరాగ్యనిధివి. సకల కళా, గుణ నిలయుడవు. నీ నామము ప్రణతార్తుల కల్పతరువు.

సుఖరాసీ, నీవు నాయెడ ప్రసన్నుడవైతివేని, నిజముగా నేను నీ దాసినని తలచితివేని, ప్రభూ, రఘునాథుని బహువిధకథలను నాకు వినిపించి నా అజ్ఞానమును హరింపచేయుము. కల్పవృక్షముక్రింద ఇల్లు కలవాడు దారిద్ర్యజనిత దుఃఖమును ఏల సహింపవలసి వచ్చును ? శశిభూషణా, నాథా. నీ హృదయమున దీనిని యోచించి అమితమగు నా భ్రమను తొలగింపుము.

ప్రభూ, పరమార్థ తత్త్వవేత్తలగు మునులు 'రాముడు' అనాది బ్రహ్మ అని అందురు. శేషుడు, శారద, శ్రుతులు, పురాణములు అన్నియు రఘుపతియొక్క గుణములనే గానము చేయును. మన్మథ రిపుడవగు స్వామీ, నీవును రేయింబవళ్ళు సాదరముగా 'రామ-రామ' అని జపించుచుందువు. ఈ రాముడు ఆ అయోధ్యాపతి సుతుడేనా ? లేక అజన్ముడు, నిర్గుణుడు, అగోచరుడు అగు మరి ఒక రాముడా ?

అతడు రాజపుత్రుడు, బ్రహ్మ మెట్లగును ? ఆతడే బ్రహ్మమైనచో నారీవిరహమున ఆతని మతి అంత పిచ్చిది ఎట్లయ్యెను ? ఆతనిచరిత్రను ఒకచో విని ఆతని మహిమను మరి ఒకచో కని, నా బుద్ధి మిక్కిలి కలవరపడుచున్నది. ఇచ్ఛారహితుడు, సర్వవ్యాపకుడు, విభుడు అగు బ్రహ్మము మరి ఒకడైనచో - నాథా, అతనినిగురించి నాకు బోధించుము. నేను అజ్ఞానిని. ఇట్లని నాపై ఆగ్రహింపకుము. నా మోహము తొలగునట్లు కావింపుము. పూర్వము వనమున నేను రాముని మహిమను కనుగొంటిని. అతి భయమువలన ఆ విషయము నీకు తెలుపనైతిని. ఐనను నా మలినమానసమున జ్ఞానోదయము కాలేదు. దానికి తగుఫలము సంపూర్ణముగా అనుభవించితిని. ఇప్పుడు సహితము నా మనమున కొంత సంశయమున్నది. నాపై కృపచూపుము. చేతులు జోడించి నీకు వినతిచేతును. ప్రభూ, ఆనాడు నాకు అనేకవిధముల బోధించితివి. నాథా, ఇది అంతయు యోచించి నాపై కోపింపకుము. ఆనాడు నాకు ఉన్న మోహము ఈనాడు లేదు. రామకథను నేడు వినవలెనని నా ఇచ్ఛ. భుజగరాజభూషణా, సురనాథా, రాముని పునీత గుణగాథను నాకు వివరింపుము. ధరిణిపై తలమోపి నీ చరణములకు వందనమొనర్తును. కరములమోడ్చి వినతిచేతును. వేదసిద్ధాంతముల సారమును తీసి నీవు రఘువరుని యశమును వర్ణింపుము. స్త్రీ నగుటచే వీనిని వినుటకు నాకు అధికారము లేకున్నను మనోవాక్‌ కర్మలయందు నేను నీ దాసిని. ఆర్తులగు అర్హులు లభించినపుడు నిగూఢతత్త్వములను సాధుసజ్జనులు వారివద్ద గోప్యముగా ఉంచరు. సురరాయా, అతి ఆర్తురాలనై నిన్ను అర్థించుచున్నాను. నాయందు కృపచూపి రఘుపతియొక్క కథను నుడువుము. నిర్గుణబ్రహ్మ ఏ కారణమున సగుణ బ్రహ్మ అయ్యెనో దానిని ప్రథమమున తెలుపుము. ప్రభూ, రాముని అవతారకథను పిదప వివరింపుము. తరువాత ఆతని అమాయకపు బాలచరిత్రను వినిపింపుము. జానకిని ఆతడు ఎట్లు పరిణయమాడెనో వర్ణింపుము. ఏ రాజ్యమును ఆతడు త్యజించెనో అదియును ఏ దోషమువలననో - చెప్పుము. నాథా, రాముడు వనమున వసించి ఏ చరితను సృష్టించెనో, ఎట్లు రావణుని సంహరించెనో అది అంతయు వచింపుము. సుఖస్వరూపా, శంకరా - సింహాసనము నలంకరించి రాముడు కావించిన మహత్తర లీలల నన్నిటినికూడా వివరింపుము. కృపానిలయా, ప్రజాసహితుడై రఘుకులమణి తన నిజధామమునకు వెడలిన ఆ అద్భుతచరిత్రను సహితము తెలియచేయుము.

అంతేకాక, ప్రభూ, ఏతత్త్వానుభూతియందు జ్ఞానులగు మునులు సదామగ్నులై ఉందురో దానినికూడ నాకు బోధింపుము. భక్తి జ్ఞాన విజ్ఞాన వైరాగ్యములను, వాని విభాగములను నాకు ఉపదేశింపుము.

రామరహస్యము లింకనూ ఎన్నో ఉన్నవి. వానిని సహితము తెలుపుము. నాథా నీ జ్ఞానము అతి విమలమైనది. నేను ప్రశ్నించనివిషయములూ ఉండవచ్చును. దయాళూ, వానినికూడా గోప్యముగా ఉంచకుము.

నీవు త్రిభువన గురుడవని వేదములు వక్కాణించుచున్నవి. ఇతర పామరులకు ఈ రహస్య మెట్లు తెలియును ?''

ఉమయొక్క సహజ సుందర, కపట రహిత ప్రశ్నలనువిని శివుడు మనమున సంతసించెను. రామచరిత అంతయు హరుని హృదయవీథిని గోచరించెను. ప్రేమతో అతని తనువు పులకరించెను. కన్నీరు ప్రవహించెను. శ్రీ రఘునాథుని రూపము అతని హృదయవీథిని సాక్షాత్కరించెను. పరమానంద స్వరూపుడగు శంకరుడు అమిత ఆనందమును పొందెను.

మహేశుడు రెండుగడియలు ధ్యానరసమగ్నుడయ్యెను. పిదప ఆతడు తన మానసమును బహిర్ముఖము కావించి, సంతోషమున రఘుపతి చరితమును వర్ణింప మొదలిడెను.

''రాముని తెలియనిచో అసత్యము సత్యమువలె కనుపించును. గుర్తించనిచో రజు - సర్పమను భ్రమకలిగినట్లే! మేల్కొనినిపిదప స్వప్నమును గురించిన భ్రమ తొలగిపోవును. అట్లే - రాముని తెలసికొనినచో జగమును గురించిన సత్యము తెలియును. ఎవని నామము జపించినచో సర్వసిద్ధులు సులభముగా లభించునో అట్టి రాముని బాలరూపమునకు నమస్కరింతును. మంగళనిలయుడు, అమంగళహరుడు, దశరథ ప్రాంగణ విహారి - నాపై కృపచూపుగాక'' అని త్రిపురారి - శ్రీరామునికి ప్రణామము కావించి హర్షమున సుధాసమమగు వచనములను ఇట్లు వచించెను.

''గిరిరాజకుమారీ, ధన్యురాలవు, నీవు ధన్యురాలవు, నీవంటి ఉపకారులెవ్వరునూ లేరు. రఘుపతియొక్క కథాప్రసంగమునుగురించి ప్రశ్నించితివి. సకలలోకములను, జగములను పావనమొనర్చు గంగానది ఈ కథ. జగత్కల్యాణమునకే ఇట్లు నీవు ప్రశ్నించితివి. నీవు రఘువీరుని చరణానురాగివి. పార్వతీ, రామునికృపచే నీ మనసున శోకము, మోహము, సంశయము. భ్రమ కలలోనైనను ఎంతమాత్రము ఉండవని నా భావము.

ఈ ప్రసంగమును వినినవారికిని, తెలిసినవారికిని ఎల్లరకు శుభమగును. కనుకనే ఈ శంకను వెలిబుచ్చితివి. హరికథలను విననివాని శ్రవణరంధ్రములు పాముల కలుగులకు సమానము. భక్తులను తమ కన్నులతో సందర్శించనివారి కన్నులు నెమలిపింఛమునందలి కన్నులు వంటివే. హరిచరణములకు, గురుపాదములకు మ్రొక్కని శిరములు చేదు సొరకాయబుఱ్ఱలు. హృదయమున హరిభక్తి లేనివాడు బ్రతికియు చచ్చినవాడే. రాముని గుణగణుములను గానము చేయనినాలుక కప్ప నాలుకయే. హరిచరితను విని హర్షించని హృదయము వజ్రమువలె కఠోరము. కఠినము.

గిరిజా, రామునిలీలలను వినుము. ఈ లీలలు సురలకు హితమైనవి. దనుజులను సమ్మోహితులను చేయునవి. రామకథ కామధేనువువలె - సేవించువారికి సర్వసుఖములను ప్రసాదించును. సజ్జనసమాజములే దేవతాలోకములు. ఈ విషయమును ఎఱిగి ఈ కథను విననివాడు ఎవ్వడుండును ? సంశయమను పక్షులను పారద్రోలుటకు రామకథ సుందరమగు కరతాళధ్వని, కలియుగమను వృక్షమును ఖండించు గొడ్డలి రామకథ.

గిరిరాజకుమారీ, సాదరముగా దీనిని వినుము. రాముని కమనీయనామమును, గుణములను, చరితను, జన్మను, అసంఖ్యాకకృత్యములను వేదములు వచించినవి. భగవానుడగు రాముడు అనంతుడైనట్లే ఆతని కథలు, కీర్తి, గుణములు అనంతములు. ఐనను నీకు కల అమితభక్తి కనుగొని, నేను వినినట్లు, నా బుద్ధికి తోచినట్లు నేను వివరింతును. ఉమా. నీ ప్రశ్న సహజముగనే సుందరమైనది. భక్తసమ్మతమైనది. నా మనస్సునకు నచ్చినది. కాని - ఒక్కవిషయముమాత్రము నాకు సంతసము కలిగించలేదు.

భవానీ, మోహవశముననే అది నీవు నుడివితివి. శ్రుతులు కీర్తించినవాడు. మునులు ధ్యానించినవాడు, ఆ రాముడు మరి ఒకడని సూచించితివి. మోహపిశాచ గ్రస్తుడగు నరుడు, పాషండుడు, హరిపదధ్యాన విముఖుడు. సత్యమేదియో-అసత్యమేదియో తెలియనివాడు అగు అధమమానవుడే ఇట్టివానిని వచించును. వినును. అజ్ఞాని, మూర్ఖుడు, అంధుడు, అభాగ్యుడు, మనోఫలకముపై విషయసుఖములను మలినమును పేర్పుకొనినవాడు. వ్యభిచారి, కపటి, అతి కుటిలుడు. కలలోనైనను ఎన్నడు భక్తబృందమును వీక్షించనివాడు, తన లాభనష్టములను తెలిసికొనలేనివాడు - వీరే వేదవిరుద్ధమగు ఇట్టి పలుకులను వచింతురు. హృదయదర్పణము మలినమైనవారు, నేత్రవిహీనులు అగు దీనులు రాముని రూపమును ఎట్లు చూడగలరు?

సగుణమనగా ఏమో, నిర్గుణమనగా ఏమో తెలియనివారు, ప్రగల్భములు పలుకువారు, హరిమాయకు వశులై లోకమున పుట్టును. చచ్చుచు ఉండువారు - ఎట్లు వచించినను వచింపగలరు. వాతరోగపీడితులు, మత్తెక్కినవారు - ఆలోచించి ఏమియు వచింపరు. మహామోహమను మద్యమును సేవించినవారు నుడువు మాటలకు ఎవరూ చెవి ఒగ్గరాదు. ఇట్లు యోచించి సంశయమును త్యజించును. రాముని చరణములను భజించుము. గిరిరాజకుమారీ, వినుము. భ్రమ అను చీకటిని హరించు సూర్యకిరణములవంటి నా మాటలను వినుము.

సగుణ నిర్గుణములకు భేదమేదియు లేదని మునుల పురాణముల, పండితుల, వేదముల వాక్కు. నిర్గుణుడు, నిరాకారుడు, అవ్యక్తుడు, అజుడు అగు అతడే భక్తులయొక్క ప్రేమకు వశుడై సగుణడగును. గుణరహితుడు సగుణు డెట్లు కాగలడా ? నీటికిని వడగళ్ళకును మంచుగడ్డకు భేదము లేనట్లే !

ఎవనినామము భ్రమ అనెడు అంధకారమును తొలగించు భాస్కరుడో - అట్టివానికి మోహ సంగమమా ?

R-5

రాముడు సచ్చిదానందస్వరూపుడగు దినేశుడు. అతనియందు మోహమను నిశ లవలేశమును ఉండదు. సహజముగానే అతడు ప్రకాశస్వరూపుడు, భగవానుడు. ఆతనియందు విజ్ఞానోదయమను ప్రసక్తియేలేదు. అజ్ఞానమనురేయి ఉండినకదా విజ్ఞానమను ఉదయమునకు స్థానము. హర్షము, విషాదము, జ్ఞానము, అజ్ఞానము, అహంకారము, అభిమానము - ఇవి అన్నియు ప్రాణుల ధర్మములు. రాముడు సర్వవ్యాపకుడగు బ్రహ్మ, పరమానంద స్వరూపుడు. పరాత్పరుడు - పురాణపురుషుడు. ఈ విషయము సకల జగమునకు తెలియును. పురాణ ప్రసిద్ధుడగు పురుషుడు, ప్రకాశవిధి, సర్వరూపములయందు ప్రకటమై ఉన్నవాడు, జీవులకు, మాయకు, సకల జగమునకు స్వామి అగు ఆ రఘుకలమణి రాముడే నా స్వామి'' అని ఇట్లు వచించి శివుడు రామునికి తలవంచి నమస్కరించెను.

''అజ్ఞానులు తమ భ్రాంతిని తెలిసికొనజాలరు. ఆ జడులు దానిని ప్రభునికి ఆరోపింతురు. గగనమున క్రమ్ముకొనిఉన్న మేఘములనుచూచి మేఘములు సూర్యుని దాచినవని అజ్ఞానులు అనుకొందురు. వ్రేలితో కన్నులను పొడుచుకొని చూచువారికి ఒక చంద్రుడు ఇద్దరు చంద్రులవలె కన్పించును. ఉమా, రాముని విషయమై ఇట్లు మోహమును ఆరోపించుట - ఆకాశమున అంధకారమును, ధూమమును, ధూళిని కనుగొనినట్లే.

విషయములు, ఇంద్రియములు, ఇంద్రియాధి దేవతలు, జీవుడు - ఇవి అన్నియు ఒకదానివలన మరి ఒకటి సచేతనములగును. [ఇంద్రియములచే విషయ భోగములు, ఇంద్రియాధి దేవతలచే ఇంద్రియములు, జీవాత్మచే ఇంద్రియాది దేవతలు చైతన్యవంతమగును]. వీని నన్నిటిని ప్రకాశింపచేయువాడు - అదిరహితుడగు ఆ బ్రహ్మయే - అయోధ్యాధిపతి రాముడే.

ఈ జగత్తు ప్రకాశింపచేయబడునది. దీనిని ప్రకాశింపచేయువాడు రాముడు : ఆతడే మాయాధిపతి. జ్ఞాన, గుణధాముడు ఆతడే. ఆతనిశక్తి, ప్రతాపములవలననే మోహముయొక్క సాహాయ్యమునుపొంది - జడమగు మాయ సత్యమువలె భాసించును. ముత్యపు చిప్పలో రజతము. సూర్యకిరణములలో నీరు ప్రసిద్ధమగునట్లే మాయయును! ఈ విశ్వాసము త్రికాలములయందును అసత్యమే. ఐనను ఈ భ్రాంతిని ఎవ్వరునూ తొలగించలేరు.

ఇట్లే ఈ జగమంతయు హరిని ఆశ్రయించియే ఉన్నది. ఈ జగత్తు అసత్యమే. ఐనను ఇది దుఃఖమును కలిగించును. తన తల నఱుకబడినట్లు ఒకనికి కలవచ్చును ! మెలకువ వచ్చువరకు ఆతనికి ఆ బాధ ఉండనే ఉండును !

గిరిజా, ఎవనికృపవలన ఈ భ్రమ తొలగిపోవునో ఆ కృపాళుడే రఘునాథుడు. ఆతనియొక్క ఆదిని, అంతమును ఎవ్వరునూ తెలిసికొని ఉండలేదు. తమ బుద్ధిని అనుసరించి ఊహించి వేదములు ఇట్లు అతనిని నిర్వచించినవి.

ఆతడు చరణములులేకయే నడచును. చెవులు లెకయే వినును. చేతులు లేకయే నానావిధకర్మలను కావించును. జిహ్వలేకయే సకల రసములను అనుభవించును. వాణిలేకయే అనర్గళముగా వచించును. శరీరము లేకున్నను అతడు స్పృశించును. కన్నులులేకనే వీక్షించును. ఘ్రాణంద్రియములు లేకున్నను సకల గంధములను గ్రహించకలడు ఆతడు. అట్టి ఆ బ్రహ్మముయొక్క చర్యలు అన్నివిధముల అలౌకికములు. అతని మహిమను వర్ణింపజాలము. వేదములు, పండితులు, ఇట్లు వర్ణించిన, మునులు ధ్యానించిన అతడే దశరథనందనుడు, భక్త హితకరుడు, కృపాళుడు. కోసలపతి. భగవానుడు.

ఎవని నామబలముచే కాశీయందు మరణించు ప్రాణులను కనుగొని నేను వారికి రామమంత్రమును ప్రసాదించి వారిని శోకరహితులను కావింతురో - అట్టి నాప్రభువు, చరాచరనాథుడు, సర్వహృదయాంతర్యామి రఘువరుడే. ఎవని నామమును - ఇచ్ఛాపూర్వకమున కాకున్నను - స్మరించుటచే అనేక జన్మలయందు నరులు కావించిన పాపములు దహింపబడునో -

ఎవని నామమును సాదరముగా స్మరించి సంసారసాగరమును గోష్పాదమునకు సమమగు మట్టిగడ్డనువలె దాటిపోవుదురో - ఆ పరమాత్ముడే రాముడు సుమీ, భవానీ !

ఆ రామునియందే నీవు దోషమును ఆపాదించుట కడు అనుచితము. ఇట్టి సంశయములు మనస్సున జనించుటచే జ్ఞానము, వైరాగ్యము మొదలగు సద్గుణములన్నియు నశించును'' అని శంభుడు వచించెను.

భ్రమను హరించు శివుని వచనములను విని ఉమయొక్క కుతర్కమంతయు మాయమయ్యెను. పదే పదే ఆమె తన పతియొక్క పాదకమలములను గ్రహించి తన పాణి పంకేరుహములను జోడించి, ప్రేమరసమున మేళవించిన మధుర వచనములను ఇట్లు నుడివెను :-

''ప్రభూ, చంద్రకిరణములవంటి నీ చల్లని పలుకులను వినినంతనే - శరదృతువునందలి గ్రీష్మతాపమువలె నా అజ్ఞానము నశించినది. కృపాళూ, నా సందేహము లన్నిటిని నీవు హరించితివి. శ్రీరాముని నిజస్వరూపము ఇప్పుడు నాకు బోధపడినది. నీ కృపచే నా విషాదము అంతరించినది. నీ చరణానుగ్రహమున నేను సుఖినైతిని. స్త్రీని అగుటచే సహజముగా నేను అజ్ఞానిని. మందమతిని. ఐనను నేను నీ దాసినని తెలిసి నీవు నాయందు ప్రసన్నుడవైనచో - నా మొదటి ప్రశ్నకు ప్రత్యుత్తర మిమ్ము.

శ్రీరాముడు పరబ్రహ్మ, చిన్మయుడు, అవినాశి, సర్వరహితుడైనను సర్వహృదయ నగరనివాసి. నాథా, అతడు మానవశరీరమును ఏ కారణమున ధరించెను ? వృషకేతూ, దీనినంతయు నాకు విపులముగా వివరించుము.

ఉమయొక్క పరమ వినీత వచనములను విని, రామ కథయందు ఆమెకు కల పునీత ప్రేమనుకని, కామారి - సహజ సజ్జనుడు. కృపానిధి అగు శంకరుడు మనమున అత్యంత ఆనందమును కాంచెను. ఉమను అతడు పలువిధముల ప్రశంసించి ఇట్లు వచించెను :-

''భవానీ, విమలమగు రామచరిత మానసమను సత్కథను వినుము. పూర్వము కాకభుళుండి దానిని వర్ణించి చెప్పగా గరుడుడు వినెను. ఆ ఉత్తమ సంవాదము ఎట్లు జరిగెనో తరువాత వివరింతును, పరమసుందరము, పాపనాశనకరము అగు రామావతార చరితను ఇప్పుడు ఆకర్ణింపుము.

హరియొక్క గుణములు, నామములు, కథలు అన్నియు అపారమైనవి. అగణీతమైనవి. అమితమైనవి. ఉమా, నా బుద్ధిని అనుసరించి వానిని వర్ణింతును. సాదరముగా వినుము. గిరిజా, ఆగమములు, నిగమములు రమ్యమగు హరిచరిత్రను విపులముగను, విశదముగను వర్ణించినవి.

హరియొక్క అవతారములకు కారణములు ఇదమిత్థమని చెప్పజాలము. మన మనస్సునకు, బుద్ధికి, మాటలకు రాముడు అతీతుడని నా అభిప్రాయము. ఐనను భక్తులు, మునులు, శ్రుతులు, పురాణములు తమతమ బుద్ధిని అనుసరించి వివరించి నట్లు నాకు తోచినట్లు-వివేకవతీ, ఆ కారణములను తెలియచేతును.

ధర్మమునకు హ్రాసము కలిగినప్పుడు, నీచాభిమానులగు అసురులు విజృంభించి, వర్ణింపజాలని అన్యాయములు కావించునపుడు, గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, భూదేవియు దుఃఖించునపుడు - కృపానిధి అగు ప్రభువు పలువిధములగు శరీరములను ధరించి సాధు సజ్జనుల బాధలను హరించును. రాక్షసులను ఆతడు సంహరించి, దేవతలను వారి సింహాసనములయందు స్థాపించును. వేదముల ప్రతిష్ఠను పరిరక్షించును. తన విమలకీర్తిని జగమున వ్యాపింపచేయును. ఇవియే శ్రీ రామావతారమునకు హేతువులు. ఆతని యశమును గానముచేసి భక్తులు భవసాగరమును తరింతురు. కృపాసాగరుడగు భగవానుడు భక్తజనహితమునకై తనువును ధరించును. రామావతారమునకు అనేక కారణములున్నవి. ఒకదానికంటె మరిఒకటి పరమ విచిత్రమైనవి అవి.

సుమతీ, భవానీ, ఆ హేతువులయందు ఒకటి రెండింటిని గురించి వర్ణింతును. సావధానముగా వినుము.

శ్రీ హరికి జయుడు. విజయుడు అను ఇరువురు ప్రియులగు ద్వారపాలకులుండిరి. అందరు వీరిని ఎఱుగుదురు. విప్రశాపమున వారు అసురులై, తామసదేహములను ధరించిరి. వారిలో ఒకనిపేరు హిరణ్యకశిపుడు. రెండవవానిపేరు. హిరణ్యాక్షుడు. సురపతియొక్క గర్వమును వీరు అణచిరి. ఈ వృత్తాంతముకూడా జగత్ర్పసిద్ధమే. హిరణ్యాక్ష, హిరణ్య కశిపులు రణవిజయమున విఖ్యాతవీరులు. వీరిలో ఒకనిని శ్రీహరి వరాహరూపము ధరించి సంహరించెను. మరి ఒకనిని ఆతడు నరహరిరూపమును ధరించి, వధించి తన భక్తుడగు ప్రహ్లాదుని సత్కీర్తిని వ్యాపింపచేసెను.

ఈ జయ విజయులే తిరిగి సురలను జయించిన మహావీరులు, బలవంతులు అగు రావణ, కుంభకర్ణులను రాక్షసులై జనించిరి. జగద్విదితులే వీరునూ, మూడు జన్మ లెత్తుడని వారికి బ్రాహ్మణ శాపము. కనుక భగవానునిచే వధింపబడియు వీరు రెండు జన్మలలో ముక్తులు కారైరి. అందుచే భక్తానురాగి అగు భగవంతుడు వారి హితమునకై మరిఒక అవతారము ధరించెను.

ఈ అవతారమున ఆదితి కశ్యపులు భగవానుని జననీ జనకులైరి వారే కౌసల్యా దశరథులని విఖ్యాతికాంచిరి. ఒక కల్పమున ఇట్లు అవతరించి భగవానుడు లోకమున పవిత్ర లీలలను కావించెను. మరిఒక కల్పమున దేవతలెల్లరు జలంధరుడను రాక్షసునిచే రణమున ఓడి దుఃఖించుచుండిరి. దేవతలతో కలసి శంభుడు రాక్షసునితో ఘోరయుద్ధముచేసెను. కాని ఆ దనుజుడు మహాబలుడగుటచే ఎంతకునూ చావలేదు. ఆ రాక్షసరాజు భార్య మహాపతివ్రత. ఆమెయొక్క మహిమచే త్రిపురారియైనను ఆ దైత్యుని జయింపలేకపోయెను. కపటముచే ప్రభువు ఆ సతియొక్క వ్రతమును భంగముచేసెను. దేవతాకార్యము నెరవేర్చెను. ఈ మర్మము ఆ పతివ్రతకు తెలియగనే ఆమె కోపించి ప్రభుని శపించెను. కౌతుకనిధి, కృపాళుడు, భగవానుడు అగు హరి ఆ శాపమును స్వీకరించెను. ఆ జలంధరుడే ఆ కల్పమున రావణుడై జన్మించెను- ఆ రావణునే రాముడు రణమున సంహరించి పరమపదమును ప్రసాదించెను. రాముడు మానవదేహమును ధరించుటకు ఒక కారణము ఇది.

మునివరా, ప్రతి అవతారమునకు చరిత్ర ఉన్నది. కవులు బహువిధముల వీనిని వర్ణించిరి. ఒకానొక సమయమున నారదుడు ఆతనిని శపించెను. అందుచే ఒక కల్పమున భగవానుడు ఆ మునికొరకై అవతరించెను.''

ఈ మాటలు విని గిరిజ చకితఅయ్యెను. ''నారదుడు విష్ణుభక్తుడు, జ్ఞానియు కదా ? మరి అతడు ఏ కారణమున భగవానుని శపించెను ? రమాపతి కావించిన అపరాధమేమి ? పురారీ, ఆ చరిత్రను నాకు తెలుపుము. ముని మనముననే మోహము జనించెననినచో అది మిక్కిలి ఆశ్చర్యకరమగు విషయమే !'' అని ఆమె ప్రశ్ననించెను.

మహేశ్వరుడు ఈ ప్రశ్నలను విని చిరునవ్వు నవ్వెను.

''ఎవ్వడైనను జ్ఞానియూకాడు. మూఢుడు కాడు. రఘుపతి ఏ క్షణమున ఎవనిని ఎట్లు చేయునో ఆ క్షణమున ఆతడు ఆ విధముగా అగును'' అని ఆతడు నుడివెను.

''భరద్వాజా, శ్రీరాముని గుణగాథను వివరింతును. సాదరముగా వినుము'' అని యాజ్ఞవల్క్యుడు వచింపసాగెను :-

[అభిమానమును, మదమును విడిచి భవనాశకుడగు రఘునాథుని భజింపుడు - అని తులసి ప్రవచనము]

''హిమాలయపర్వతములయందు అతి పునీతమగు ఒక గుహ కలదు. దాని సమీపముగనే గంగానది ప్రవహించును. పరమపవిత్రమగు ఆ ఆశ్రమమును కనుగొని దేవర్షి అగు నారదుడు తన మనమున కడు సంతసించెను. అచ్చటి శైలములను నదులను, వనములను, సుందరదృశ్యములను వీక్షించి నారదునికి రమాపతి పాదముల యందు అనురాగము జనించెను. శ్రీపతిని స్మరించినంతనే నారదునికి దక్షు డిచ్చిన శాపము తొలగిపోయెను. సహజముగనే నారదుని మనస్సు నిర్మలమైనది. కనుక వెంటనే అతడు సమాధి స్థితిలోనికి వెడలెను. నారదుని సమాధిస్థితిని చూచి ఇంద్రుడు భయపడెను. ఇంద్రుడు కామదేవుని పిలిపించి, సన్మానించి ''నీవు నీ సహాయకులతో నా కొరకై వెడలి ఆ నారదుని సమాధిని భంగము చేయుము'' అని వేడెను. మన్మథుడు సంతసించి వెడలెను.

''ఈ దేవర్షి నా అమరావతీరాజ్యమును కావలెనని కాంక్షించుచున్నాడు'' అని ఇంద్రుడు తలచెను. జగమునఉన్న కాముకులు, లోభులు - ఎల్లరు - దుష్టులగు కాకులవలె ఎవ్వరన్ననూ భయపడుదురు. మొండికుక్క ఒకటి ఒక సింహమును చూచినది. ఎండిపోయిన ఎముకలను నోటపట్టుకొని పారిపోయినది. ఎముకలను ఆ సింహములాగి తీసికొనునేమో అని ఆ కుక్క భయము ! ఇదేవిధముగ ఉన్నది ఇంద్రుని స్థితి. ఇట్లు అనుకొనుటకుకూడా సురపతికి సిగ్గులేదు.

మదనుడు ఆ ఆశ్రమమునకు వచ్చెను. తన మాయచే అచ్చట వసంతఋతువును సృష్టించెను. వివిధవృక్షములకు రంగురంగుల పూలు పూచినవి. ఆ చెట్లపై కోకిలలు కుహూ అని కూయసాగినవి. తుమ్మెదలు జుమ్మని మ్రోవ మొదలిడినవి. కామోద్దీపనకారులగు త్రివిధవాయువులు వీచినవి. కామకళాప్రవీణలగు రంభ మొదలగు నిత్య యవ్వన దేవతావనితలు పలు రాగతాళములతో గానము చేయుచుండిరి చేతులతో చెండ్లనుపట్టి నానావిధముల ఆడుచుండిరి. తన సహాయకులను చూచి మన్మథుడు మురిసినాడు. అనేకవిధములగు మాయాజాలములను ప్రదర్శించినాడు. కాని, కామదేవుని కళ##లేవియు నారదమునిపై పని చేయలేదు. పాపిఅగు మనోభవుడు భీతిచెందెను. రమాపతి మహారక్షకుడై ఉన్నవాని నియమములను ఎవడైనను భగ్నము చేయకలడా ?

తన సహాయకులతో సహా మన్మథుడు కడు భయపడెను. తన మనస్సున అతడు ఓటమిని అంగీకరించెను. అత్యంత ఆర్తవచనములను పలుకుచు అతడు నారదుని చరణములను పట్టుకొనెను. నారదుని మనమున ఎంతమాత్రము కోపము రాలేదు. ప్రియవచనములతో అతడు మన్మథుని ఓదార్చెను. మదనుడు నారదుని పాదములకు నమస్కరించి ఆ మునియొక్క ఆనతినిపొంది సహాయకులతో కలసి చనెను.

కాముడు సురపతి కొలువునుచేరి నారదుని సచ్ఛీలమును, తాను కావించిన ఘనకార్యమును అంతయు వివరించెను. మన్మథుని మాటలువిని అందరు అచ్చెరువొందిరి. ఎల్లరు నారదుని ప్రశంసించిరి. హరికి శిరమువంచి నమస్కరించిరి.

అంతట నారదుడు శివుని సమీపించెను. ''కాముని జయించితి'' నను అహంకారము ఆ ముని మనమున జనించెను. మారుని చరిత్రను శివునికి నారదుడు వినిపించెను. నారదుడు తనకు అతి ప్రియుడని తెలిసి అతనికి మహేశ్వరుడు ఇట్లు ఉపదేశించెను :-

''మునివర్యా, పదేపదే నీకు మనవిచేతును. నీవు ఇప్పుడు నాకు చెప్పినట్లు ఈ కథను హరికి ఎన్నడూ తెలుపకుము. ఒకవేళ ఈ విషయము చర్చకు వచ్చినను అప్పుడుకూడా దీనిని రహస్యముగానే ఉంచుము.''

శంభుడు ఇట్లు హితమును ఉపదేశించినను నారదునికి అదిరుచింపలేదు. భరద్వాజా, అటుపిదప జరిగిన కౌతుకమును వినుము. హరియొక్క ఇచ్ఛ బలీయము. రాముడు ఎట్లు చేయవలెననుకొనునో అట్లే జరుగును. దానికి విరుద్ధముగా కావింపగలవా రెవ్వరూ లేరు. శంభుని వచనములను విని నారదుని మనస్సు సంతుష్టి చెందలేదు. అంతట నారదుడు బ్రహ్మలోకమున కేగెను.

ఒకానొకనాడు - గానప్రవీణుడగు నారదమునినాథుడు వీణాపాణియై, హరిగుణగానము కావించుచు శ్రుతిమస్తక స్వరూపుడగు శ్రీనివాసుడు నివసించు క్షీరసాగరమునకు వెడలెను. చరాచరనాథుడు నవ్వి, ''మునీ, చాలాదినములకు దయచేసితివి'' అనెను. ఇదివరకే శివుడు వలదనిచెప్పినను నారదుడు కాముని చరిత అంతయు హరికి పూసగ్రుచ్చినట్లు చెప్పనే చెప్పెను.

రఘుపతియొక్క మాయ అతి ప్రచండమైనది. అది సమ్మోహితులను చేయని వా డెవ్వడున్నాడు?

భగవానుడు నీరసవదనముతో మృదువచనములను ఇట్లు వచించెను :-

''మునీ-వినుము. నిన్ను స్మరించినంతనే పరుల కామ, అభిమాన, మద, మోహములు నశించును ! జ్ఞాన వైరాగ్యములు హృదయమున లేనివారిమనమున మోహము ఉండును. నీవు బ్రహ్మచర్యరతుడవు. మహాధీరమతివి. నిన్ను ఎన్నడూ బాధించలేడు మన్మథుడు.''

నారదుడు గర్వమున - ''భగవానుడా, ఇది అంతయు నీ కృపయే'' అని ప్రత్యుత్తరమిచ్చెను. కరుణానిధి అగు హరి తనమనమున విచారించెను.

''ఈ నారదుని హృదయమున గర్వమను మహావృక్షము అంకురించినది. దీనిని నేను శీఘ్రమే పెకలించివైతును. సేవకులకు హితము కావించుటయే నా ప్రతిన. మునికి హితము, నాకు కౌతుకము కలుగునట్టి ఏదైన ఉపాయమును కావింతును'' అని భగవానుడు తలచెను.

హరియొక్క చరణములకు మ్రొక్కి నారదుడు వెడలెను. అతని హృదయమున గర్వము అంతకంతకు అభివృద్ధి చెందుచుండెను.

శ్రీపతి తనమాయను ప్రేరేపించెను. ఆ మాయ కావించిన కఠినకృత్యములను వినుము.

ఆ మార్గమున శతయోజనవిస్తీర్ణమగు ఒక నగరమును హరిమాయ సృష్టించెను. ఆ నగరమునందలి పలువిధనిర్మాణములు శ్రీనివాసుని నగరమగు వైకుంఠమున కన్నను మిక్కిలి సుందరముగా ఉన్నవి. అచ్చటి సుందరస్త్రీలు, పురుషులు - రతీమన్మథులు తనువుల ధరించి వసించుచున్నారో అనునట్లుందురు. ఆ నగరమున శీలనిధి అను ఒకరాజు కలడు. అతనికి లెక్కలేనన్ని గుఱ్ఱములు, ఏనుగులు, సేనాసమూహములు కలవు. అతని వైభవము, విలాసము నూరు ఇంద్రుల వైభవవిలాసములకు సమము. అతడు రూప, తేజ, బల, నీతి, నిలయుడు. విశ్వమోహిని అను ఒక కుమార్తె అతనికి కలదు. ఆమె రూపమునుచూచి శ్రీదేవి సహితము మోహితఅగును. హరిమాయా జనితఅగు ఆ రాకుమారియొక్క శోభను ఎట్లు వర్ణింపగలము? అసంఖ్యాకులగు మహీపాలురు ఆమె స్వయంవరమునకు అరుదెంచిరి. కుతూహలుడై నారదుడు ఆ నగరమునకు వచ్చెను. పురజనులను అడిగి అతడు వృత్తాంతమెల్లయు తెలిసికొనెను. విషయమంతయు విని అతడు భూపాలుని మందిరమునకు వెడలెను. రాజు మునిని పూజించెను. ఆసీనుని చేసెను. రాకుమార్తెను పిలిపించి నారదునికి చూపించెను. ''స్వామీ, తాము ఆలోచించి ఈమెయొక్క గణ. దోషములను నాకు తెలియజేయుడు'' అని కోరెను.

నారదుడు రాకుమార్తెయొక్క సౌందర్యమును కాంచెను. వైరాగ్యమును విస్మరించెను. ఎంతోసేపు ఆమెవంక అతడు చూచుచునే ఉండెను. ఆమెయొక్క లక్షణములను కనుగొని ముని తనను తాను మరచెను. అతడు తన హృదయమున హర్షము పొందెను. కాని, సంతోషమును అతడు ప్రదర్శింపలేదు.

''ఈమెకు వరుడగువాడు అమరుడగును. సమరభూమిని అజేయుడగును. ఈ శీలనిధియొక్క కన్నియ వరించు నాతని చరాచరాజీవులు సేవింపవలసినదే!'' అని ఆ ముని తన మనమున అనుకొనెను. కన్యయొక్క లక్షణములు నన్నిటిని విచారించి వానిని నారదుడు తన మనమున పదిలపరచుకొనెను. రాజునకుమాత్రము ముఖప్రీతికరమగు మాటలను ఏవో కొన్నిటిని చెప్పి వెడలిపోయెను. ముని మనమున ఒకటే చింత.

''నేను చని ఈ కన్నియ నన్ను వరించు ఉపాయము యోచింతును. ఈ సమయమున ఈ జపముల, తపమువలన ఏదియూ కానేరదు. ఓ విధీ, ఈ బాల నాకు ఎట్లు దక్కునయ్యా? ఇప్పుడ అత్యంతశోభ, సుందరరూపము నాకు కావలెనే ! వానిని కని రాకుమారి నన్ను మోహించవలెనే ! నా కంఠమున ఆమె జయమాల అలంకరించవలెనే ! సౌందర్యము నిమ్మని హరిని ప్రార్థింతును. కాని, అయ్యో, ఆయనవద్దకు వెడలుటకే చాలా ఆలశ్యమగునుకదా ! హరికి సమానుడగు హితుడు నాకు మరి ఒకడు లేడు. కనుక ఆ హరియే ఈ సమయమున నాకు సహాయకుడు'' అని నారదముని యోచించి అనేకవిధముల ప్రభుని వినుతించెను.

అంతట - కృపాశుడు. లీలామయుడు అగు ప్రభువు ప్రత్యక్షమయ్యెను. ప్రభుని విలోకించి నారదుని నయనములు చల్లనయ్యెను. పని ఇక సానుకూలమగునని అతడు మనసున అత్యంత ఆనందము పొందెను. నారదుడు కడు ఆర్తుడై జరిగిన కథ అంతయు హరికి నివేదించెను.

''ప్రభూ, నాపై కృపచూపుము. నాకు సహాయకుడవు కమ్ము. నీయొక్క రూపమును నాకు దయచేయుము. మరి ఏ ఇతరవిధమునను ఆ రాకుమారి నాకు దక్కదు. నాథా, నాకు హితమగునట్లు కావింపుము. అదియును శీఘ్రముగా-సుమా-నేను నీ దాసుడను'' అని అతడు ప్రార్థించెను.

తన మాయయొక్క మహాశక్తిని కనుగొని దీనదయాళుడు తనలో తాను నవ్వుకొనెను.

''నారదా. వినుము. ఏది నీకు పరమహితమగునో దానినే నేను కావింతును. మరి ఒకవిధముగా ఏదియు జరుగదు. నా మాటలు అసత్యము ఎన్నడూ కానేరవు. ఓ యోగీ, మునీ, వ్యాధిపీడితుడగు రోగి అపథ్యమును కోరినచో వైద్యుడు దానిని ఇవ్వడు. అట్లే నీకు హితమునే నేను కలుగచేయ నిశ్చయించితిని'' అని పలికి భగవానుడు అంతర్ధానమయ్యెను.

మాయావశుడై నారదముని మూఢుడయ్యెను. హరి నుడివిన సుస్పష్టవచనములనైనను అతడు గ్రహించలేకపోయెను. ఋషిరాజగు నారదుడు వెంటనే స్వయంవరవేదిక నిర్మించబడిన స్థలమునకు ఏగెను.

చక్కగా అలంకరించుకొని తమ తమ బృందములతో రాజులెల్లరు తమ తమ ఆసనములయందు ఆసీనులై ఉండిరి.

''నా రూపము కడు మనోహరముగా ఉన్నది కదా ! నన్ను కాదని ఆ కన్యమరి ఒకరిని పొరపాటుననైనను వరించదు.'' అని నారదుడు అనుకొనుచు ఆనందించుచుండెను. కృపానిధి అగు ప్రభువు మునిహితమునకై అతనిని కురూపిని కావించెను. ఆ రూపమును వర్ణింపజాలము. ఈ విషయమును ఎవ్వరూ తెలిసికొనలేరైరి. ఎల్లరు అతడు నారదుడే అని తలచి నమస్కరించుచున్నారు.

అచ్చట రుద్రగణములోని వారిద్దరున్నారు. ఈ మర్మమంతయు వారికి తెలియును. విప్రవేషముల ధరించి వారు ఆ కౌతుకమును చూచుచూ తిరుగుచుండిరి.

తన అద్భుతరూపమును చూచుకొని నారదముని గర్వపడుచు కూర్చున్న వరుసతోనే ఆ ఇరువురు ఆసీనులైరి. విప్రవేషమున ఉన్నందున ఎవ్వరునూ వారిని గుర్తించలేదు. నారదుడు వినునట్లుగా వ్యంగ్యముగా వారు ''హరి ఈతనికి అద్భుతసౌందర్యమును ప్రసాదించినాడు. ఈతని అందమునుచూచి రాకుమారి ఇతనినే వరించును. ఇతడు 'హరి' అని తెలిసికొని ఆమె ఇతనిని తప్పక వివాహమాడును'' అని వారు సంభాషించుచుండిరి.

నారదుని మనస్సు అతనివశమున లేదు. అతడు మోహవశుడై ఉన్నాడు. శివగణములు ఆనందించి నవ్వుచున్నారు. వారి పరిహాసపుమాటలు అతడు వినుచునే ఉన్నాడు. కాని భ్రమవశుడైఉన్న అతనికి ఆ మాటలు సరిగా అర్థమగుటయే లేదు. ఈ విచిత్రచరిత్రను ఇంకెవ్వరూ ఎఱుగరు.

నారదుని వానరరూపమును రాచకన్నియ కనుగొన్నది. కోతిమొగము, భయంకరదేహము. అతనిని చూడగనే ఆమె హృదయమున క్రోధము జనించినది. తన సఖులను తీసికొని - రాజకుమారి రాజహంసవలె వెడలెను. తన కరకమలములలో జయమాలను పట్టుకొని మహీపతుల నెల్లరను వీక్షించుచు ఆమె తిరుగ మొదలిడెను. నారదుడు కూర్చుండిఉన్నవైపునకు ఆమె పొరపాటుననై నను కన్నెత్తి చూడలేదు. మాటి మాటికి నారదుడు వ్యాకులపడుచున్నాడు. ఆతురత చెందుచున్నాడు. అతని దశను చూచి హరగణములు చిరునవ్వు నవ్వుకొనుచున్నారు.

కృపాళుడగు భగవానుడు నృపవేషధారియై అచ్చటికి విచ్చేసెను. రాకుమారి సంతోషించి ఆతనికంఠమున జయమాల అలంకరించెను. లక్ష్మీనివాసుడగు భగవానుడు పెండ్లికుమార్తెను తీసికొని వెడలెను. రాజులెల్లరు నిరాశ##చెందిరి. మోహవశమున నారదునికి మతిపోయినది. రాకుమార్తె వెడలుటనుకని అతడు కడు వికలుడైనాడు. ముడి ఊడి మణి క్రిందపడిపోయినట్లున్నది అతనికి. అంతట హరగణములు అతనిని చూచి నవ్వుచు-

''పోయి అద్దములో నీ ముఖము చూచుకొ''మ్మనిరి. వెంటనే వారిద్దరు భయపడి పరుగిడిపోయిరి.

నారదుడు తన ముఖమును నీటియందు చూచుకొన్నాడు. తన స్వరూపమును కనుగొని అతనికి కోపము ఎక్కువయ్యెను. శివగణములను ఇట్లు అతడు కఠోరముగా శపించెను :-

''మీ రిద్దరు కపటులు పాపులు, పొండు. నిశాచరులై జన్మించుడు. మమ్ము పరిహసించితిరి మీరు. దానిఫలితమును అనుభవించుడు. ఇంకొకసారి ఏ మునినైనను పరిహసింతురో . . . . !''

నారదుడు మరల నీటిలో తన వదనమును వీక్షించినాడు. తన నిజరూపము ప్రాప్తించినది. ఐనను అతని హృదయమున ఆనందములేదు. అతని పెదవులు అదరుచున్నవి. మానసము క్రోధభరితమై ఉన్నది. వడివడిగా అతడు కమలాపతి వద్దకు బయలుదేరెను. ''పోయి అతనికి శాపమిత్తును. లేక - నా ప్రాణమైనను విడుతును. అతడు నన్ను జగమున పరిహాసముపాలు చేసినాడు'' అని తనలో తాను అనుకొనుచుండెను.

దారిలోనే నారదునికి దనుజారి శ్రీహరి తారసిల్లెను. ఆయనవెంట రమాదేవి, ఆ రాకుమార్తెయు ఉన్నారు.

''మునీ, వ్యాకులుడవై ఎక్కడకు ఈ ప్రయాణము?'' అని సురనాథుడు మధురస్వరమున నారదుని ప్రశ్నించెను. ఈ పలుకులు వినగానే నారదుని కోపము మరింత ఎక్కువయ్యెను. మాయావశుడై ఉన్నందున అతని మనసున చైతన్యమే లేదు.

''పరుల సంపదనుచూచి నీవు ఓర్వలేవు. నీకు అతి ఈర్ష్య. కపటము. ఆనాడు సముద్రమథనసమయమున రుద్రుని పిచ్చివానిని చేసితివి. దేవతలను ప్రేరేపించి అతనిచే విషమును త్రాగించితివి. అసురులకు మదిరనిచ్చి, శంకరునికి గరళమిచ్చి నీవు స్వయముగా రమామణిని, రమ్యమగు మణిని గ్రహించితివి. నీవు కడుమోసకాడవు, స్వార్థపరుడవు. నీ వ్యవహారములన్నియు సదా కపటములే. నీవు పరమస్వతంత్రుడవు. నీ నెత్తిపై ఎవ్వరూలేరు. నీకు ఏదితోచిన అది చేతువు. మంచిని చెడుచేతువు. చెడును మంచిగా మార్చగలవు. నీ హృదయమున సంతోషముకాని విషాదముకాని లేవు. అందరిని మోసగించుట నీకు అభ్యాసమైనది. నిర్భయుడవైనావు. అందువలన నీ మనస్సున ఎల్లప్పుడు ఉత్సాహమే. శుభా శుభ కర్మలేవియు నిన్ను బాధించవు. ఇంతవరకు ఎవ్వరూ నిన్ను సరిదిద్దలేకపోయిరి. నిప్పుతో చెలగాటమాడితివి. నా బొంట్లను ఇట్లు ఎగతాళిచేసినందులకు తగు ఫలితము అవశ్యము అనుభవింతువు. ఏ శరీరమును ధరించి నన్ను నీవు వంచించితివో ఆ తనువునే నీవు ధరించుము. ఇదియే నా శాపము. నా రూపము కోతిరూపము చేసితివి. కనుక నీకు కోతులే సహాయమొనర్తురుగాక ! నాకు నీవు మహా అపకారము కావించితివి. కాన, నీవును స్త్రీ విరహమున దుఃఖితుడ వగుదువుగాక !'' అని నారదుడు హరిని శపించెను.

ప్రభువు ఆ శాపమును తలదాల్చెను. తన మనమున సంతసించెను. బహువినతితో కృపానిధి అగు భగవానుడు తన మాయాప్రాబల్యమును ఉపసంహరించెను. హరి తన మాయను దూరముచేయగనే అచ్చట రమాదేవి లేదు-రాకుమారియు లేదు. ముని అత్యంత భీతిచెంది హరియొక్క చరణములను పట్టుకొనెను.

''ప్రణతా ర్తిహరా - శరణు. కృపాళూ, నా శాపము మిథ్య అగుగాక'' అని వేడెను.

''ఇది సర్వము నా ఇచ్ఛ'' అని దీనదయాళుడు నుడివెను :-

''ఎన్నియో దుర్వచనములను నిన్ను అంటిని. నా పాపము నశించుట ఎట్లు?'' అని నారదుడు ప్రశ్నించెను. [అంతట] భగవానుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

''నారదా, పొమ్ము. శంకర శతనామములను జపించుము. నీ హృదయమున శీఘ్రమే శాంతి లభించును. శివునివలె నాకు ప్రియుడు మరిఒకడు లేడు. పొరపాటుననైనను ఈ విశ్వాసమును విడువకుము. మునీ, పురారి కృపలేనివానికి నా భక్తియు ప్రాప్తించదు. ఇట్లు నీ హృదయమున యోచించుచు మహీతలమున విహరించుచుండుము. ఇక నామాయ నీ సమీపమునకైనను రాజాలదు.''

ఇట్లు పలువిధముల నారదుని ఓదార్చి ప్రభువు అంతర్ధానమయ్యెను. రాముని గుణగానము కావించుచు నారదుడు సత్యలోకమునకు చనెను. విగతమోహుడై అత్యంత హర్షమనస్కుడై నారదుడు వెడలుచుండగా హరగణములు అతనిని చూచిరి. కడుభయపడి వారు అతనిని సమీపించిరి. అతని పాదములను పట్టుకొని దీనవచనములను ఇటు పలికిరి :-

''మునిరాజా, మేము విప్రులముకాము. హరగణములము, మహాపరాధము కావించితిమి. దానికి ఫలము అనుభవించితిమి. కృపాళూ. శాపమును ఉపసంహరించుము. మమ్ము కనికరింపుము.

దీనదయాళుడగు నారదుడు : ''పొండు. మీ రిరువురు నిశాచరులు కండు. మీకు మహాఐశ్వర్యము, తేజము, బలము ప్రాప్తించగలవు. మీ భుజబలముచే మీరు విశ్వమును ఏనాడు జయింతురో ఆనాడు విష్ణుభగవానుడు మనుజతనువును ధరించును. రణమున హరి కరములలో మీకు మరణము కలుగును. అంతట మీరు ముక్తులగుదురు. తిరిగి ప్రపంచమున మీకు జన్మలేదు.'' అని నుడివెను.

వా రిద్దరు నారదుని చరణములపైబడి తలలువంచి వందనముచేసి వెడలిరి. కాలక్రమమున వారు నిశాచరులై జన్మించిరి.

సురరంజకుడు, సజ్జన సుఖప్రదాత. భూభారభంజనుడు అగు ప్రభువు ఒకానొక కల్పమున ఈ కారణమున మనుజావతారమును ధరించెను. సురలను రంజింపచేయుట, సజ్జనులను ఆనందింపచేయుట, భూభారమును తొలగించుట ఆతని ప్రతిన.

ఈ విధిని హరియొక్క సుందర, సుఖద, విచిత్ర అవతారములు అనేకములున్నవి. కృత్యములు పెక్కులున్నవి. ప్రతికల్పమందును భగవానుడు అవతరించి నానావిధములగు రమణీయ లీలలను కావించినప్పుడు మునీశ్వరులు పరమపవిత్రప్రబంధములను రచించి ఆ కథలను గానముచేసిరి. ఆతని వివిధరీతులగు అసామాన్యలీలలను వర్ణించిరి. వారిని విని వివేకులు ఆశ్చర్యపడరు. హరి అనంతుడు. అతని చరితలు అనంతములు. సాధుసజ్జను లెల్లరు వానిని అనేకవిధముల వినుచుందురు. తెలుపుచుందురు. అంతట శివు డిట్లు వచింపసాగెను :-

''భవానీ, జ్ఞానులగు మునులు సహితము హరి మాయామోహనవశులగుదురని తెలుపుటకే ఈ చరిత్రను నుడివితిని. ప్రభువు లీలామయుడు. ప్రణతార్త హితకారి. సులభ##సేవ్యుడు. అతడు దుఃఖములను అన్నిటిని దూరము చేయును. ప్రబలమగు హరి మాయామోహితుడు కాని వాడు సురలయందు, మునులయందు ఎవ్వడునూ లేడు. ఈ విషయమును మనస్సున గుర్తున ఇడుకొని మహామాయాపతి అగు భగవానుని భజింపవలెను.

శైలకుమారీ, భగవానుని అవతారమునకు మరి ఒక కారణమున్నది. ఆ విచిత్ర చరిత్రను విస్తరించి వివరింతును. వినుము.

అజుడు, నిర్గుణుడు, రూపరహితుడు అగు బ్రహ్మము ఏ కారణమున కోసల భూపాలుడయ్యెనో - అనుజ లక్ష్మణసహితుడై, మునివేషము ధరించి, వనములయందు తిరుగాడుచుండగా ఏ ప్రభుని నీవు వీక్షించితివో - సతీరూపమునున్న నీవు ఎవనిని కనుగొని ఆనాడు అంత పిచ్చిదానివైతివో - భవానీ, నేడునూ ఆనాటినీ ఉన్మాదఛాయ తొలగదో - అట్టి అతని చరితను, భ్రమ అను రోగమును హరించుదానిని - వినుము. ఆ అవతారమున అతడు ఏ ఏ లీలలను కావించెనో - వానినన్నిటిని నా బుద్ధిని అనుసరించి నీకు తెలుపుదును.''

[పిదప యాజ్ఞవల్క్యుడు ఇట్లు నుడవసాగెను.] '' భరద్వాజా, శంకరుని మాటలు విని ఉమ సిగ్గుచే ప్రేమసహితముగా మందహాసము చేసెను. ఆ అవతారమునకు కారణములను వృషకేతుడు వర్ణింప మొదలిడెను.

''మునీశ్వరా, భరద్వాజా. సర్వవృత్తాంతమును వినిపింతును. మనస్సును లగ్నముచేసి వినుము.

రామకథ కలి కలుషములను హరించును. కల్యాణమును ప్రసాదించును. అతి సుందరమైనది ఆ కథ.

అనుపమమగు ఈ నరసృష్టి స్వాయంభువమనువు, అతనిభార్య శతరూపలవలన జరిగెను. ఆ దంపతుల ధర్మము, ఆచరణ కడు శ్రేష్ఠమైనవి. నేడుసహితము వారి ప్రతిష్ఠను వేదములు కొనియాడును. ఆ దంపతుల కుమారుడు ఉత్తానుపాదుడను నరపాలుడు. అతని సుతుడు హరిభక్తుడగు ధృవుడు. స్వాయంభువుని చిన్నకొడుకు ప్రియవ్రతుడు. అతనినికూడా వేదములు, పురాణములు ప్రశంసించినవి. వారిపుత్రిక దేవహూతి. ఆమెభర్త కర్దమముని. ఆదిదేవుడు, ప్రభువు దీనదయాళుడు అగు కపిలుడు గర్భమున జనించెను. సాంఖ్యశాస్త్రమును ప్రకటించిన తత్త్వవిచారనిపుణుడగు ఆ మనువు-కపిలుడు బహుకాలము రాజ్యమేలెను. భగవానుని ఆజ్ఞలన్నిటిని అతడు పాలించెను. ''గృహస్థాశ్రమముననే నాకు వార్ధక్యదశ ప్రాప్తించినది. విషయసుఖములయందు వైరాగ్యము జనించలేదు'' అని అతడు చింతించెను. ''హరిభక్తిలేకనే ఈ జీవితము ఇట్లే గడచిపోయిన''దని అతడు మనస్సున అత్యంత దుఃఖమును పొందెను. వెంటనే అతడు తన సుతునికి బలవంతముగ రాజ్యము నిచ్చిభార్యాసమేతుడై అడవులకు వెడలెను.

అతిపవిత్రమై, సాధకులకు సిద్ధిని ప్రసాదించు తీర్థములలో విఖ్యాతమైనది నైమిశారణ్యము. ముని. సిద్ధసమాజములు అచ్చట నివసింతురు. మనునృపాలుడు సంతుష్టహృదయుడై ఆ అడవికి వెడలెను. ధీరమతులగు ఆ దంపతులు మార్గమున చనుచు - జ్ఞానము, భక్తి శరీరములను ధరించి నడచిపోవుచున్నవో అనునట్లున్నారు. వారు గోమతీతీరమును చేరిరి. నిర్మలమగు ఆ నదీజలమున వారు హర్షమున స్నానము చేసిరి. ధర్మధురంధరుడు. రాజర్షి వచ్చెనని తెలిసికొని అచ్చటి సిద్ధులు, జ్ఞానులగు మునులు అతనిని దర్శించుటకు ఏతెంచిరి. అచ్చటి సుందర తీర్థములను అన్నిటిని రాజదంపతులకు మునులు సాదరముగా చూపించిరి. రాజదంపతులు దుర్బల శరీరులై, కృశించి, మునులవలె వల్కలధారులై భక్తసమాజములయందు నిత్యము పురాణ శ్రవణము చేయుచుండిరి. ద్వాదశాక్షర మంత్రమును అనురాగసమేతులై జపించుచుండిరి. వాసుదేవుని పాదపంకజములయందు వారి మనస్సులు అత్యంతము లగ్నమయ్యెను. శాకాహారులై, ఫలములను, కందమూలములను భుజించుచు వారు సచ్చిదానందబ్రహ్మమును స్మరించుచుండిరి. పిదప హరినిగురించి వారు తపముచేయసాగిరి. పిదప కందమూలములను సహితము త్యజించి జలమునే సేవింప మొదలిడిరి. ''పరమార్థవాదులు చింతనచేయు నిర్గుణుడు. అఖండుడు, అనంతుడు, అనాది అగు పరమాత్ముని, ప్రభుని కన్నులార ఎట్లు కనుగొందుమా ?'' అనునదియే వారి హృదయములయందు నిరంతర అభిలాష.

''వేదములు 'నేతి - నేతి' అని వర్ణించి నిరూపించు ఆనంద స్వరూపుడు, ఉపాధిరహితుడు, అనుపముడు, ఎవని అంశ##చే అనేక బ్రహ్మ, విష్ణు, శంభు భగవానులు ప్రకటమగుదురో - అట్టి ప్రభువు సేవకవశుడు. అతడు భక్తులకొరకై లీలా శరీరధారుడగును. ఈ వేదవాక్కు సత్యమేయైనచో మా అభిలాషయును అవశ్యము ఫలించును'' అని వారు ప్రార్థించుచుండిరి.

ఇట్లు జలమునే సేవించుచు ఆ రాజదంపతులు ఆఱువేల సంవత్సరములు గడిపిరి. తరువాత ఏడువేల వత్సరములు వారు వాయుభక్షకులై నివసించిరి. పదివేల సంవత్సరములు గాలినై వను వారు సేవించనేలేదు. ఇరువురు ఒంటికాలిపై నిలచి తపమొనర్చిరి. ఆ దంపతుల అపార తపమునుచూచి హరిహరులు, విరించియు వారి ఎదుట అనేక పర్యాయములు సాక్షాత్కరించి బహువిధముల వారికి ఆశలుచూపిరి. 'ఏదైన వరము కోరుకొను''డనిరి. కాని. పరమధీరులగు ఆ రాజదంపతులు తమ పట్టును వీడరైరి. కొంతకాలమునకు వారి శరీరములు అస్థిపంజరములయ్యెను. ఐనను వారిమనస్సులలో కొంచెమైనను బాధ కలుగలేదు. మరికొంతకాలమునకు సర్వజ్ఞుడగు ప్రభువు ఆ రాజదంపతులు తనదాసులని తెలిసికొనెను. అంతట పరమగంభీర, కృపామృత సమ్మిళిత వచనములను ''వరము కోరుకొనుడు - కోరుకొనుడు-'' అని ఆకాశవాణి నుడివెను. చనిపోయినవారికి సహితము జీవములనిచ్చు ఆ సుందరవాణి తమ శ్రవణరంధ్రములనుండి హృదయమున చొరగానే రాజదంపతుల శరీరములు సుందరమై తుష్టిని, పుష్టిని కాంచెను. వారు అప్పుడే ఇల్లువిడిచి వచ్చిరా - అన్నట్లుండిరి. అమృతతుల్యమగు ఆ పలుకులను వినినంతనే వారితనువులు పులకరించి ప్రసన్నతచెందెను. మనువు దండప్రణామము చేసెను. అతనిహృదయమున భక్తిపొంగి పొరలుచున్నది.

''ప్రభూ, అవధరింపుము. సేవకులకు కల్పవృక్షము నీవు. నీవే కామధేనువు వారికి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నీచరణరేణువునకు వందనమొనర్తురు. సేవకసులభుడవు. సుఖప్రదుడవు. ప్రణతార్త పరిరక్షకుడవు. చరాచరనాయకుడవు అనాథహితకరుడవు - మాయందు నీకు ప్రేమకలచో ప్రసన్నుడవై ఈ వరమును మాకు ప్రసాదించుము.

ఏ స్వరూపము శివుని మానసమున వసించునో -

ఏ స్వరూపవీక్షణకై మునులు యత్నింతురో -

ఏ స్వరూపము కాకభుశుండి మానసమును మానససరోవరమున విహరించు హంసయో -

ఏ స్వరూపమును సగుణమనియు, నిర్గుణమనియు వేదములు ప్రశంసిచునో - ఆ రూపమును మేము కన్నులార కాంచునట్లు కృపచూపుము. ప్రణతా ర్తమోచనా -'' అని వారు ప్రార్థించిరి.

రాజదంపతుల కోమల, వినీత, ప్రేమరసభరిత వచనములను విని భగవానుడు అత్యంతప్రీతి చెందెను. భక్తవత్సలుడు, కృపానిధానుడు, విశ్వవ్యాపకుడు, ప్రభువు ప్రకటమయ్యెను.

నీలసరోరుహములవలె, నీలమణివలె, నీలమేఘమువలె శ్యామలశరీరము :- అశరీరకాంతిని కని శతకోటి కామదేవులైనను లజ్జ చెందుదురు.

శరచ్చంద్రునివలె-సౌందర్యమునకు అవధి అగు వదనము. కడు సుందరమగు గడ్డము, చెక్కిలి, శంఖమునుపోలు కంఠము, ఎఱ్ఱని పెదవులు, సుందరమగు దంతములు, రమణీయమగు నాసిక, చంద్రకిరణములను కించపరచు దరహాసము. వికసించిన కమలములనుపోలి అతి సుందరమైన కన్నులకాంతి, హృదయానందకరములై మనోహరములగు వీక్షణములు. మనోజశరశోభను హరించు వక్రమగుభృకుటి, లలాటఫలకమున శోభిల్లు తిలకము, కుటిలములై, తుమ్మెదల దండునుపోలిన నీలకేశములు. చెవులకు మకరకుండలములు, శిరమున విరాజిల్లు మకుటము, ఉరమున శ్రీవత్సము, మనోహర వనమాల, రత్నహారములు, మణిభూషణములు, సింహమువంటి మెడ, రమ్యమగు జందెము, భుజములయందు సుందరమగు ఆ భూషణములు, ఏనుగుతొండములవంటి రమణీయ భుజాదండములు. నడుమున అంబులపొది, కరముల శరకోదండములు. విద్యుత్కాంతిని మించు పీతాంబరములు. ఉదరమున త్రిరేఖలు. యమునానదియందలి సుడిగుండముల శోభను పుణికి పుచ్చుకొనినదో అను మనోహరమగు నాభి, ముని మానసభ్రమరములు వసించు వర్ణనాతీతమగు పదరాజీవములు- అతని వామభాగమున సదా అనుకూలవతి. శోభారాశి జగన్మూలకారిణి అగు ఆదిశక్తి.

ఏ శక్తియొక్క అంశను గుణనిధులు, అగణిత లక్ష్మీదేవులు, పార్వతులు, సరస్వతులు ఉత్పన్నమగుదురో ఏ మాతయొక్క భృకుటీవిలాసమున జగము సృష్టింపబడుచున్నదో - అట్టి సీత - రాముని వామభాగమున రాజిల్లుచున్నది.

సౌందర్యసాగరుడగు హరియొక్క రూపమును మనువు-శతరూపయు రెప్పలార్పక చూచిరి. అనుపమమగు ఆ రూపమును సాదరముగా వారు వీక్షించిరి. ఎంతచూచినను వారికి తృప్తిలేదు. ఆనందవివశులై తమ దేహములనే వారు మరచిరి. భగవానుని పాదములను తమ చేతులతో వారు పట్టుకొనిరి. సాష్టాంగప్రణామము చేసిరి.

దయారాశి అగు ప్రభువు తన కరకమలములతో వారి శిరములను స్పృశించెను. వారిని లేవనెత్తెను.

''మీయందు కడు ప్రసన్నుడనైతిని. మీకు వలయు వరమును-ఏదైననూ కోరుకొనుడు. నేను సకల దానప్రదాతనని ఎఱుగుడు'' అని కృపానిధానుడగు భగవానుడు నుడివెను. ప్రభుని వచనములను రాజదంపతులు వినిరి. మనువు చేతులు జోడించెను. ధైర్యము వహించెను. ఇట్లు మృదువచనములను వచించెను :-

''నాథా, నీ చరణకమలములను సందర్శించి మా కోర్కెలన్నియు నేడు ఫలించినవి. ఒక్క పెద్ద కోర్కెమాత్రము మా మనస్సులయందు కలదు. దానిని అనుగ్రహించుట సుగమము, ఆగమము, కనుకనే వివరించుట కష్టము. స్వామీ, దానిని అనుగ్రహించుట నీకు అతి సుగమము. నా దైన్యమును తలచినచో నాకు అది అతికఠినము. దరిద్రుడు కల్పతరువును కనుగొనియు అధిక సంపదను అర్థించుటకు సంకోచించును. ఆ తరువుయొక్క ప్రభావము అతనికి తెలియదు. అట్లే నా హృదయము సంశయించుచున్నది.

ప్రభూ, నీవు సర్వాంతర్యామివి. అన్నియు నీకు ఎఱుకయే. నా మనోరథమును సఫలమొనర్చుము''

అంతట భగవానుడు-''రాజా, సంశయమును విడిచి కోరుకొనుము. నీకు ప్రసాదింపజాలనిది నావద్ద ఏదియు లేదు'' అనెను.

''దానశిరోమణీ, నాథా, కృపానిధీ, నా మనసునందలి నిజమగు భావమును వచింతును - నీవంటి పుత్రుడు నాకు కావలెను - ప్రభునివద్దనే రహస్యమా !'' అని మనువు నుడివెను.

రాజుయొక్క భక్తినికని, అతని అమూల్యవచనములను విని కరుణానిధి ''తథాస్తు - రాజా నావంటివానిని ఎందు వెదుకగలను ? నేనే స్వయముగవచ్చి నీకు సుతుడనై జన్మింతును'' అనెను.

కరములుమోడ్చి శతరూప ప్రక్కనే ఉన్నది. ఆమెనుచూచి ప్రభువు ''దేవీ, నీకు వలయు వరమును ఏదైనను కోరుకొనుము'' అనెను.

''స్వామీ, చతురుడగు నరపాలుడు కోరినవరము నాకునూ అతి ప్రియమైనది. ఐనను, ప్రభూ, సాహసించుచున్నాను. భక్తప్రియా, నా దిట్టతనము సహితము నీకు ప్రియమే అగును. నీవు బ్రహ్మాదిదేవతలకు తండ్రివి, జగన్నాథుడవు, సర్వాంతర్యామివగు బ్రహ్మవు. ఇది అంతయు గుర్తించి నా మనమున సందేహమగుచున్నది. కాని, ప్రభువు పలికినదెల్లయు ప్రమాణము. నాథా, నీ భక్తులు పొందుసుఖమును, వారికి సంప్రాప్తించు పరమగతిని - ఆ సుఖమును, ఆ సద్గతిని, భక్తిని నీ చరణములయందు అట్టి ప్రేమను, వివేకమును, నడవడిని కృపతో మాకు ప్రసాదించుము'' అని శతరూప ప్రార్థించెను. ఆమె నుడివిన మృదు, గూఢ, మనోహర, ఉత్తమ వచనములను విని కృపాసింధుడు. ''నీ మనసున ఉన్న కోరికలన్నిటిని అనుగ్రహించితివి. ఎట్టి సందేహము లేదు. తల్లీ, నా అనుగ్రహమున నీ అలౌకికజ్ఞానము ఎన్నడూ నశించదు,' అని నుడివెను.

భగవానుని చరణములకు మనువు వందన మొనర్చెను.

''ప్రభూ, నా వినతి మరి ఒక్కటి కలదు. పుత్రునియందు జనకునికి కలుగు ప్రేమను నీ పాదములయందు నాకు కలుగునట్లు కృపచూపుము. నేను మూఢుడనని అనుకొనిననూ సరే - మణిలేని ఫణి, నీటలేని చేపలవలె నా జీవితము - నీవులేనిదే నిలువజాలదు'' అని మనువు భగవానిని కోరెను. భగవానుని పాదములపైపడి ఆ చరణములను గ్రహించి అతడు అట్లే కొంతతడవు ఉండెను.

కరుణానిధి అగు ప్రభువు 'అట్లే అగుగాక - నీవు వెడలి నా ఆనతిని శిరసావహించి సురపతియొక్క రాజధాని అగు అమరావతియందు వసియింపుము. అచ్చట కొంతకాలము నీవు బహుభోగములను అనుభవింపుము. అనంతరము నీవు అయోధ్యాపతి వగుదువు. అప్పుడు నేను నీ సుతుడనగుదును. ఇచ్ఛానిర్మిత మానవరూపమునుధరించి నీ ఇంట నేను జనింతును. తండ్రీ, నా అంశలతోసహా దేహధారినై భక్తులకు సుఖదమగు చరిత్రను కావింతును. బహుభాగ్యశాలురగు నరులు ఆ చరితను సాదరముగా విని, తమ మమతను, మదమును త్యజింతురు. భవసాగరమును తరింతురు. జగమును సృష్టించిన ఆదిశక్తి అగు ఈ నా మాయయును ఆనాడు అవతరించును. ఈ రీతిని నీ అభిలాషను నేను సఫలమొనర్తును. నా ప్రతిజ్ఞ సత్యము. సత్యము, సత్యము'' అని పలుమారులు పలికి అంతర్ధానమయ్యెను.

మనువు, అతని పత్నియు భక్తదయాళుడగు భగవానుని తమ హృదయముల ధరించి కొంతకాలము ఆ ఆశ్రమమున వసియించిరి. కాలక్రమమున తమ తనువులను అనాయాసముగా వారు త్యజియించిరి. అమరావతికి చని అచ్చట నివసించుచుండిరి.

భరద్వాజా, అతి పునీతమగు ఈ చరితను వృషకేతుడు ఉమకు తెలిపెను.

''రాముని జననమును గురించిన మరి ఒక కారణము వినుము'' అని యాజ్ఞవల్క్యుడు ఇట్లు నుడువసాగెను :

మునివరా, పావనమగు ఈ ప్రాచీనకథను వినుము, శంభుడు దీనిని గిరిజకు వివరించెను.

కైకయదేశము విశ్వవిదితమగు దేశములయందు ఒకటి. సత్యకేతు అనురాజు ఆ దేశపు ప్రభువు. అతడు ధర్మధురంధరుడు, నీతినిధి, తేజస్వి, శీలవంతుడు బలవంతుడు, అతనికి ఇరువురు కొమరులు. వారిద్దరు వీరులు - రణధీరులు - సకలసద్గుణధాములు. రాజ్యమునకు ఉత్తరాధికారి అగు జ్యేష్ఠపుత్రుని నామము ప్రతాపభానుడు. రెండవవానిపేరు అరిమర్దనుడు. అరిమర్దనుడు అపారభుజబలుడు. రణమున అచలుడు, ఆ సోదరు లిరువురు అత్యంతమైత్రితో మెలగెడివారు. కపటరహితులై, ఏ దోషములు లేక ప్రేమతో వారు వసించుచుండిరి. పెద్ద కుమారునికి రాజ్యమునిచ్చి రాజు శ్రీహరిని ధ్యానించుటకై వనమునకు చనెను.

ప్రతాపభానుడు రాజు కాగానే ఆ సంగతి దేశమునం దెల్ల ప్రకటింపబడెను. వేదవిధి ననుసరించి అతి జాగరూకతతో అతడు ప్రజలను పాలించుచుండెను. అతని రాజ్యమున లేశ##మైనను పాపము లేకుండెను. అతని మంత్రియు అతని హితకరుడే. శుక్రాచార్యునివంటి వివేకి అగు ఆ మంత్రి పేరు ధర్మరుచి. రాజునకు చతురుడగు మంత్రి - వీరులు, బలవంతులు అగు సోదరులు.

ప్రతాపభానుడు ప్రతాపవంతుడు, రణధీరుడు, అసంఖ్యాకులగు యోధులు కలిగిన అపారమగు చతురంగసేన అతనికి కలదు. సంగరమున తమ ప్రాణములను అర్పించుటకు వారు సదా సంసిద్ధులే. తన సేననుచూచి ప్రతాపభానుడు కడు సంతసించెను. జైత్రయాత్రకు దుందుభులను మ్రోగించెను. సేనను సిద్ధము చేసెను. ఒక శుభదినమును నిర్ణయించెను, ఢంకాను మ్రోగించెను. విజయయాత్రకు బయలువెడలెను. అచ్చటచ్చట అనేకయుద్ధములు చేసెను. తన బలముతో అతడు సకల భూపతులను ఓడించెను. స్వీయభుజబలములతో సప్తద్వీపములను వశము కావించుకొనెను. ఆ యా రాజులవద్ద కప్పము కట్టించుకొని వారిని విడుదల కావించెను. ఆ కాలమున సకల అవనీమండలమునకు ప్రతాపభాను డొక్కడే మహీపాలుడు. నిజబాహుబలముచే విశ్వమునంతటిని వశపరచుకొని ప్రతాపభానుడు తన పురమున ప్రవేశించెను. ధర్మార్థ కామాదిసుఖములను అతడు సమయోచితముగా అనుభవించుచుండెను.

ప్రతాపభానుని ప్రతాపముచే భూతలము సుందర కామధేనువయ్యెను. ప్రజలెల్లరు దుఃఖరహితులై, సుఖులై ఉండిరి. స్త్రీలు, పురుషులు అందరు ధర్మశీలురు, సుందరులు. మంత్రి అగు ధర్మరుచికి హరిపాదములయందు అమిత భక్తి. నృపాలుని హితమునకై నిత్యము అతడు ఆ రాజునకు నీతి బోధించువాడు. గురువులను, దేవతలను, మహాదేవులను, సాధుసజ్జనులను, పితరులను ఎల్లరను రాజు సతతము సేవించువాడు. వేదములయందు వర్ణింపబడిన రాజధర్మము లన్నిటిని భూపతి సాదరముగా, ఆనందముగా పాలించువాడు. ప్రతిదినము అతడు నానావిధములగు దానము లిచ్చును. ఉత్తమశాస్త్ర, వేద, పురాణములను వినును. అనేకవిధములగు వాపీ, కూప, తటాకములను పూలతోటలను, సుందర ఉద్యానవనములను, విప్రులకు భవనములను, దేవతలకు విచిత్రమందిరములను తీర్థము లన్నిటివద్ద అతడు నిర్మించెను. శ్రుతులలో. పురాణములలో నుడువబడిన అన్నివిధములగు యజ్ఞములను అతడు అనురాగసహితుడై కావించెను.

అతనికి ఏ ఫలాకాంక్షయు లేదు. అతడు వివేకి. బుద్ధిమంతుడు. జ్ఞాని. మనోవాక్‌ కర్మలచే కావించు ధర్మకర్మములనన్నిటిని అతడు వాసుదేవునికి సమర్పించును.

ఒకనాడు అతడు ఒక ఉత్తమాశ్వమును అధిరోహించి, వేటకు వలయుసామగ్రిని సమకూర్చుకొని వింధ్యాచలమునందలి గంభీరవనములకు వెడలెను. అచ్చట సుందరమగు అనేకలేళ్లను వేటాడెను. అడవిలో తిరుగుచు అతడు ఒక వరాహమును కనుగొనెను. చంద్రుని తననోట గ్రహించి రాహువు వచ్చి అడవిలో దాగినాడా అన నట్లున్నది అది. చంద్రుడు పెద్దవాడు. వరాహము చిన్నది. వరాహపునోట చంద్రుడు ఇముడుటలేదు. అంతేకాదు-క్రోధవశమున వరాహము చంద్రుని మ్రింగుట లేదేమో అనునట్లున్నది. ఆ సూకరపు భయానకమగు కోరలనుగురించియే నేను ఇట్లు వర్ణించినది. ఇక దాని శరీరము చాలా పెద్దది. లావైనది. గుఱ్ఱపు డెక్కల చప్పుడువిని ఆవరాహము అరచుచు చెవులు పైకెత్తి మెలకువతో చూడసాగినది. నల్లని పర్వతశిఖరమువలెఉన్న ఆ వరాహమునుచూచి రాజు కొఱడాతో గుఱ్ఱమును అదలించి వడివడిగా స్వారి చేసెను. ''ఇక నీపని సరి'' అని అతడు ఆ సూకరమును వెంటాడుచూ కేకలు వేసెను. మహాశబ్దమును కావించుచు ఆ అశ్వము తనవైపు వచ్చుచుండుట వరాహము కనుగొనెను. వాయువేగమున అది పరుగిడిపోయెను. వెంటనే రాజు శరమును సంధించెను. ఆ బాణమును చూడగానే వరాహము తప్పించుకొని పారిపోయెను. బాగుగా గురిపెట్టి రాజు బాణమును ప్రయోగించెను. కాని ఆ వరాహము మోసగించి, వంగుచూ తప్పించుకొనెను. అది కొంతసేపు కనుపించును. మరి కొంతతడవు మాయమగును. పారిపోవును. రాజు కోపమున దాని వెంటాడును ! ఇట్లు ఆ సూకరము ఆ ఘోరారణ్యమున బహుదూరము పారిపోయెను. ఆ ప్రదేశమునకు ఏనుగులు, గుఱ్ఱములు పోజాలవు. రాజు ఒంటరియై ఉన్నాడు. అడవిలో అతి కష్టముగా ఉన్నది. ఐనను అతడు మృగమును వెంటాడుట మానలేదు. ''ఈ రాజు బహు ధైర్యశాలి'' అని వరాహము తెలిసికొనెను. పారిపోయి అది ఒక కొండగుహలో దూరెను. ఆ గుహలో చొరబడుట అసంభవమని కనుగొని, పశ్చాత్తాపమున రాజు వెనుకకు మరలెను. ఆ మహారణ్యమున అతడు దారితప్పెను. తిరిగి తిరిగి ఉన్నందున అతడు అలసిఉండెను. అతని అశ్వము, అతడు సహితము ఆకలిదప్పులతో వ్యాకులపడుచున్నారు. ఎక్కడైనను నదియో చెరువో ఉన్నవేమో అని అతడు అన్వేషించెను. నీరు దొరకలేదు. అతడు డప్పిఉన్నాడు. తిరుగగా తిరుగగా ఒక ఆశ్రమము అతనికి కనుపించెను.

ఆ ఆశ్రమమున కపటముని వేషమునుధరించి ఒక నృపతి నివసించుచున్నాడు. అతనిదేశమునే ఇంతకుముందు ప్రతాపభానుడు జయించినది ! ఓడిపోయి ఆ నృపాలుడు సేనను విడిచి పారిపోయినాడు. ప్రతాపభానుని రోజులు మంచివనియు, తనకు కాని కాలమనియు అతడు గ్రహించి విచారించెను. ఆ కారణమున అతడు ఇంటికి మరలిపోలేదు. అభిమానయుతుడగుటచే అతడు ప్రతాపభానునితో సంధినైనను చేసికొనలేదు. దరిద్రునివలె కోపమును చంపుకొని. ఒక తాపసి వేషమును ధరించి అతడు అడవియందు నివసించుచుండెను. ప్రతాపభానుడు తాపసునివద్దకు వచ్చెను. తాపసి ప్రతాపభానుని గుర్తించెను. దప్పికొని ఉన్నందున ప్రతాపభానుడు తాపసిని గుర్తింపజాలకపోయెను. తాపసియొక్క చక్కనివేషమును చూచి అతడు నిజముగా ఒక మహామునియేనని రాజు తలచెను. గుఱ్ఱము దిగి అతడు మునికి ప్రణామముచేసెను. పరమచతురుడు కనుక రాజు తనపేరును మునికి వెల్లడించలేదు.

భూపతి దప్పికొని ఉన్నట్లు కనుగొని ముని అతనికి ఒక సరోవరమును చూసెను. రాజు సంతసించి దానియందు స్నానముచేసెను. గుఱ్ఱముకూడా స్నానమాడెను. రాజు, అశ్వము నీటిని త్రావిరి. రాజునకు అలసట తొలగినది. అతడు సుఖముగా ఉండెను. తాపసి అతనిని తన ఆశ్రమమునకు తీసికొని వెడలెను. సూర్యాస్తమయమయ్యెను. రాజునకు ఆసనమిచ్చి తాపసి అతనిని-

''నీవు ఎవ్వడవు ? సుందరుడవు, యువకుడవు. ప్రాణములను లెక్కచేయక ఒంటరివై ఈ అడవిలో ఏల తిరుగాడుచున్నావు ? నీయందు చక్రవర్తి లక్షణములున్నవి ! నిన్ను చూచి నాకు మిక్కుటమగు జాలి కలుగుచున్నది'' అని మృదువుగా ప్రశ్నించెను.

''మునీశా, ప్రతాపభానుడను ఒకరాజు కలడు. నేను అతని మంత్రిని. వేటకై తిరుగుచూ త్రోవ తప్పితిని. మహాభాగ్యవశమున నీ పాదదర్శనము లభించినది. నీ దర్శనము నావంటివారికి దుర్లభము, కనుకనే ఏదియో మేలు నాకు కలుగనున్నదని తోచుచున్నది'' అని రాజు ప్రత్యుత్తరమిచ్చెను.

అంతట ఆముని ''కుమారా. చీకటిపడినది. నీ నగరము ఇచ్చటికి డెబ్బదియోజనముల దూరము. నా మాట వినుము. ఘోరమగు అంధకారము ! రాత్రివేళ! దట్టమగుఅడవి. దారి కనుపించదు. కనుక ఈ రాత్రి నీవు ఇచ్చటనే ఉండి తెల్లవారిన పిదప వెడలుదువులెమ్ము మిత్రుడా.''అనెను.

భవితవ్యము ఎట్లుండునో అట్లే సహాయము లభించును. మనవద్దకు తనంతట తానే అది రానిచో మనలనే తనవద్దకు అది తీసికొనిపోవును ! ఇది తులసి వచనము. ''స్వామీ, మంచిది'' అని మునిఆనతిని తలదాల్చి ప్రతాపభానుడు గుఱ్ఱమును ఒక చెట్టునకు కట్టివైచి కూర్చుండెను. అనేకరీతుల మునిని అతడు ప్రశంసించెను. ముని యొక్క పాదములకు వందన మొనరించెను. తనభాగ్యమును కొనియాడసాగెను.

''ప్రభూ, నీవు నా తండ్రివంటివాడవని గ్రహించి నేను సాహసించుచున్నాను. మునీశ్వరా, నేను నీ సుతుడను, నీ సేవకుడను - అని తలచి నీ పేరును సవిస్తరముగా తెలియచేయుము'' అని రాజు మునిని వేడెను.

నృపతి ఆ మునిని గుర్తించలేకపోయెను. కాని, ముని రాజును గుర్తింపకలిగెను. భూపాలుడు శుద్ధహృదయుడు. మునియో ! కపటమున నిపుణుడు. శత్రువు - అందునను క్షత్రియజాతి. పైగా - రాజు. కపటముచేనైనను, బలముచేనైనను తన కార్యము సఫలము కావించుకొనవలెనని ఆ మునియొక్క కోరిక. తన రాజ్యమును - ఆ సౌఖ్యమును గుర్తునకు తెచ్చుకొని ముని దుఃఖించెను. అతని హృదయము కుమ్మరి అవములోని నిప్పువలె మండుచున్నది. రాజుయొక్క సరళ వచనములను చెవులార విని, తనవైరమును స్మరించికొని, అతడు లోలోన ఆనందించుచుండెను.

''నాపేరు ఇప్పుడు బికారి- నాకు ధనములేదు. ఇల్లునూలేదు'' అని అతడు కపటయుతముగా, యుక్తియుక్తముగా ప్రత్యుత్తరమిచ్చెను.

అంతట రాజు :- ''మీవంటి విజ్ఞాననిధులు, అభిమాన రహితులు - తమనిజస్వరూపమును సదా గోప్యముగనే ఉంతురు. నీచవేషమున ఉండుటయే సర్వవిధముల శ్రేయస్కరము, కనుకనేకదా నిరుపేదయే హరికి ప్రియుడని సాధు సజ్జనులు. శ్రుతులు ఘోషించును. మీవంటి నిర్ధనులను, భిక్షుకులను, గృహవిహీనులనుచూచి హరుడు, బ్రహ్మయు సహితము సంశయింతురు. స్వామీ, మీరు ఎవ్వరైనను సరే. నేను మీ చరణములకు నమస్కరింతును. నాపైన ఇక కృపచూపుడు'' అని నుడివెను.

తనయందు రాజునకు మిగిలిన సహజప్రేమను, అధిక విశ్వాసమును ఆ కపటముని కనుగొనెను. సర్వవిధముల అతడు రాజును తనవశము చేసికొనెను. అత్యంత ప్రేమను కనపరచుచు ఆతడు ''మహీపతీ, వినుము, నీకు నేను నిజము వచింతును. చాలాకాలమునుండి నేను ఇచ్చు నివసించుచున్నాను. ఇంతవరకు నన్ను ఎవ్వరూ కలసికొనలేదు. నన్నుగురించి ఎవ్వరికీ నేను తెలుపనేలేదు. లోకమున మాన్యత అగ్నివంటిదికదా! 'తపస్సు' అను వనమును అది భస్మము కావించివైచును.'' అనెను.

[సుందరమగు వేషమునుచూచి మూఢుడేకాదు 'చతురుడగు నరుడు సహితము మోసపోవును. చక్కని నెమలిని కాంచుడు. దావి పలుకులు అమృత తుల్యములు. దాని ఆహారము పాములు' అని తులసీదాసుని పలుకులు]

అంతట ఆ కపటముని ఇట్లు నుడువసాగెను:-- ''అందువలననే నేను జగమున గుప్తముగా వసించుచున్నాను. హరియందు తప్ప ఇంకెవ్వరియందును నాకు విశ్వాసము లేనేలేదు. ఆ ప్రభువునకు అన్నియును తెలియును. ఒకరు ఆయనకు చెప్పనక్కరయేలేదు. నీవే చెప్పుము. లోకమును సంతోషపెట్టినచో ఏమి సిద్ధించును? నీవు పనిత్రుడవు. సుమతివి. కనుకనే నాకు పరమప్రియుడవైతివి. నీకు నాపై మిక్కుటమగు ప్రేమ, విశ్వాసము. నాయనా, నీవద్ద ఏదైనను ఇప్పుడు నేను మఱుగు పచినచో అతిదారుణదోషము నాకు ప్రాప్తించును.''

తాపసి ఉదాసీనవచనములు చెప్పుచున్నకొలదియు రాజునకు విశ్వాసము పుట్టు కొనివచ్చుచున్నది. మనోవాక్‌ కర్మలచే రాజును ఆముని వశము కానించుకొనెను. బకధ్యానము చేయుచుండెడి ఆ కపటముని అంతట.

''నాపేరు ఏకతనువు సోదరా'' అనెను. నరపాలుడు ఆ మాటలు విని తల వంచి ''స్వామీ, నీకు నేను ప్రియసేవకుడనని ఎంచి ఈ పేరునకు అర్థమేమియో వివరించు'' డని కోరెను.

కపటముని ఇట్లు వివరింపసాగెను:--

''ఆదిని - ఈ సృష్టి ఉదగ్భవించినపుడే నా ఉత్పత్తియును. ఆనాటినుండి ఇంకొక తనువును నేను ధరించలేదు. కనుకనే నా నామము ఏకతనువు. కుమారా, నీవు ఆశ్చర్యము చెందనక్కరలేదు. తపమునకు ఏదియు దుర్లభము కానేకాదు. తపో లబముచేతనే విధాత జగమును సృజించును. తపోబలమువలననే విష్ణువు లోకమును పరిక్షించును. తపోబలముననే హరుడు దానిని సంహరించును. తపముచే సాధింపజాలనిదేదియు లోకమునలేదు,''

ఈ మాటలు వినిన రాజుయొక్క అనురక్తి అధికమయ్యెను. ఇక ఆతపప్వి పురాణకథలను నుడువ మొదలిడెను. అనేక కర్మల, ధర్మముల గురించిన చరిత్రనుచెప్పి ఆ ముని వై రాగ్య, జ్ఞానములను నిరూపణ చేయసాగెను. సృష్టి యొక్క ఉత్పత్తి, స్థితి, లయములను గురించి అమిత ఆశ్చర్యకరములగు కథలను అతడు వివరించెను. ఆ కథలన్నిటిని విని భూపాలుడు తాపపి వశమ య్యెను. తాపసికి తన పేరును తెలుపమొదలిడెను. అంతట ఆ ముని!--

''రాజా, నీ వెవ్వరివో నాకు తెలియును. నీవు కపటము కావించితివి. అది నాకు బాగున్నది. మహీశా, వినుము. ఎచ్చటనైనను రాజులు తమపేర్లను మొదటనే చెప్పరు, ఇది రాజనీతి, నీ చతురతను కనుగొని నాకు నీయందు అపారమగుప్రేమ జనించినది, నీపేరు ప్రతాపదినేశుడు, సత్యకేతు నరపాలుడు నీతండ్రి. రాజా, గురు కృపచే ఇది అంతయు నాకు తెలియును. కాని చెప్పుట నాకే మంచిదికాదిని చెప్పను. నాయనా నీ సహజ సరళత్వమును, ప్రేమను, విశ్వాసమును, నీతి నిపుణతనుచూచి నా మనస్సున నీపై మిక్కిలి మమత కలిగినది. కనుకనే నీవు అడుగగానే నాకథ వివరించితిని. నేను ప్రసన్నుడనైతిని. సందేహములేదు. సంశయింపకము. రాజా నీ మనస్సున ఉన్న కోర్కెలను తెలుపుము'' అనెను.

ముని పలికిన చక్కనిమాటలను విని భూపతి హర్షము పొందెను. మునియొక్క చరణములను అతడు పట్టి ఇట్లు వినతిచేయ మొదలిడెను:--

''కృపాసింధూ, మునీశ్వరా, నీ దర్శనమువలన చతుర్విధ పురుషార్థములు నాకు కరతలామలకము లయ్యెను. నీవు నాయందు ప్రసన్నుడవైతివి. దుర్లభమగు వరము నిన్నుకోరి నేను శోకరహితుడ నేల కాకూడదు? నా తనువు జరా మరణ దుఃఖ రహితము కావించుము. రణమున ఎవ్వరూ నన్ను గెలువలేకుందురుగాక. శతకల్పములవరకు ఈ మహీతలమున శత్రుబాధలేకుండ నేను ఏకచ్ఛత్రిధిపత్యము వహించునట్లు అను గ్రహించుము''

అంతట తపస్వి ఇట్లు వచించెను:

''రాజా, అట్లే అగుగాక! కాని ఒక కఠినవిషయ మున్నది. దానినికూడా వినుము. కాలుడు సహితము నీ కాళ్లవద్ద తన తలను వంచవలసినదే. ఒక్క విప్రకులముతప్ప మిగిలినవారెల్లరు - మహీశా, నీ పాదములకు తమ తలలువంచి నమస్కరింతురు. తపోబలముచే విప్రులు సదా బలవంతులై ఉందురు. వారికోపమునుండి ఎవ్వరూ తప్పింపలేరు. నరపాలా, నీవు విప్రులను వశపరచుకొంటివో - ఇక బ్రహ్మవిష్ణు మహేశ్వరులు నీకు వశులగుదురు. బ్రాహ్మణకులము ఎదుట బలరాక్రమములు, పట్టుదలలు పనికిరావు. నా రెండుచేతులు ఎత్తి నిజము పలుకుచున్నాను. మహీపాలా, వినుము. విప్రశాపమును తప్పించుకొనినచో నీకు నాశనములేదు.''

ఆ మాటలు విని రాజు అత్యంత హర్షము చెందెను. ''నాథా, ఇక నాకు నాశనములేదు. కృపానిధీ, ప్రభూ నాకు సర్వకాలములయందు కల్యాణమే.'' అని వచించెను.

కపటముని ''ఏవమస్తు'' అని ఇట్లు పలుకులు సాగించెను:

''రాజా, నీవు నన్ను కలసికొన్న విషయము, దారితప్పిన సంగతి - ఎవ్వరికినీ చెప్పకుము. చెప్పినచో నా దోషము లేదుసుమా. వీనిని గురించి ఎవరికైనను చెప్పినచో నీకు అమితమగు హాని కలుగును. ఈ విషయము మూడవ మానవుని చెవిని పడినచో - నీకు నాశనము తప్పదు. నామాట సత్యము. ఇదిగో ప్రతాపభానూ, వినుము. ఈ విషయము బయటపెట్టినను, లేదా, ద్విజశాపముననైనను నీవు నశింతువు. ఇక ఏ ఇతర ఉపాయముచేనైనను - హరిహరులు కోపించినను సరే - నీకు చావులేదు''

ప్రతాపభానుడు కపటమునియొక్క కాళ్లు పట్టుకొన్నాడు. ''నాథా, సత్యము. ద్విజుల, గురువుల ఆగ్రహమునుండి ఎవరు రక్షింపగలరు? చెప్పుడు, విధాత కోపించినచో గురువు రక్షించును. గురువుతో విరోధము కలిగినచో కాపాడువాడు లేనేలేడు ఈ జగత్తున. నీవు చెప్పినట్లు నేను ఆచరించనిచో నాకు వినాశ మేరానిమ్ము - కాని నాకు దీనివలన విచారములేదు. ప్రభూ, ఒకేఒక భయముచే నా మనస్సు దిగులు చెందుచున్నది. భూసురశాపము అతిఘోరామైనది! ఏ రీతిని ఆ విప్రులు వశము కాగగలరో దయచేసి తెలుపుము. దీనదయాళూ, నీవుతప్ప నాకు హితుడు మరి ఒకడు కనుపించుటలేదు'' అని వచించినాడు.

అంతట కపటముని ''రాజా, వినుము. లోకమున ఉపాయములు ఎన్నో ఉన్నవి. అవి కష్టసాధ్యములు. అవియూ ఫలించునో లేదో! ఆఁ - తేలిక అగు ఒక్క ఉపాయమున్నది. కాని - దానియందునూ కష్టముకలదే! ఐనను ఆ యుక్తి నా చేతిలో ఉన్నది. మరి - నేను నీ నగరమునకు రాకూడదే! పుట్టినదిమొదలు ఇంతవరకు నేను ఇంకొకగగ్రామమున కాలుపెట్టలేదు. ఇంకొక గడప త్రొక్కలేదు. కాని - ఇప్పుడు నేను రానిచో నీ కార్యము విఫలమైపోవును. పెద్దచిక్కు వచ్చిపడినదే!'' అనెను.

ఈ మాటలు విని మహీపాలుడు ''స్వామీ, పెద్దలు చిన్నవారిపై కృప చూపవలెనని వేదములు ఘోషించుచున్నవి. పర్వతములు తమ తలలపై గడ్డిని మోయును'' అగాధమగు సముద్రము తన శిరమున నురుగగును ధరించును. ధరణి తన నైత్తిపై దుమ్మును మోయును.'' అని మృజువటనముసను పలికి మునియొక్క చరణములను పట్టుకొనెను.

''స్వామీ, నాపై కృపచూపుము. నీవు సజ్జనుడవు. దీనదయాళుడవు, ప్రభూ, నాకొఱకై ఇంతమాత్రము కష్టము సహించుము'' అని అతడు మునిని వేడుకొనెను.

నరపాలుడు తన అధీనుడైనాడని తెలిసికొని, కపటమున ప్రవీణడగు ఆముని 'భూపాలా, నీకు నిజము వచింతును. వినుము. ఈ జగత్తున నాకు దుర్లభమగునది ఏదియూలేదు. నీ పనిని అవశ్యము కావింతును. మనోవాక్‌ కర్మలయందు నీవు నా భక్తుడవు. రహస్యముగా ప్రయోగించినప్పుడే యోగము, యుక్తి, తపము, మంత్రములయొక్క ప్రభావము ఫలించును. ఇదిగో రాజా, నేను వంట సిద్ధముచేతును. నీవు దానిని వడ్డించుము. నేను వండినట్లు ఎవ్వరికినీ తెలియనీయకుము. ఆ ఆహారమును భుజించినవారెల్లరు నీవు ఏది ఆజ్ఞాపించిన అది చేయుదురు, ఇంతేకాదు. ఆ ఆహారమును ఆరగించినవారి ఇండ్లలో భుజించినవారునూ - రాజా - వినుచుంటివి కదా - నీకు వశులగుదురు. ఇక చని ఈ ఉపాయమును కావించుము. ఒక సంవత్సర కాలము ఈ ప్రణాళిక సాగునట్లు ఏర్పాటుచేయును. ప్రతిదినము క్రొత్తవారిని ఒక లక్షమంది ద్విజులను - వారి కుటుంబములతో సహా - ఆహ్వానించుము. నీ దీక్షాకాల మంతయు నేనే భోజనము సిద్ధముచేతును. ఇట్లు - రాజా - అతిస్వల్ప కష్టముతో విప్రులందరు నీ వశ##మైపోదురు. ఆ విప్రులు హోమములు, యజ్ఞములు, సేవలు, పూజలు కావింతురు. ఈ ప్రకారము సులభముగా దేవతలు సహితము నీకు వళులగుదురు. అంతేకాదు. రాజా, ఇంకొక విషయముకూడా నీకు చెప్పుచున్నాను. నేను ఈ వేషముతోమాత్రము ఎన్నడూ రాను. నా మాయాశక్తిచే నేను నీ పురోహితుని హరించితెత్తును. నా తపోబలముచే అతనిని నావలెచేసి ఒక సంవత్సరమువరకు ఇక్కడ ఉంతును. రాజా, అతని వేషమును నేను ధరింతును. వినుము. అన్నివిధముల నీ పని పూర్తికావింతును. రాత్రి చాలా ప్రొద్దుపోయినది. రాజా, నీవుపోయి నిద్రించుము. నేటినుండి మూడవ దినమున నీవు నన్ను కలసికొనుము. నాతపోబలముచే నీవు నిద్రలో ఉండగానే నిన్ను, నీ గుఱ్ఱమును నీ ఇంటికి చేర్చగలను. నీకు చెప్పిన ఆ వేషమును ధరించి వత్తును. నిన్నుపిలిచి ఏకాంతమున నీ చరిత అంతయు వివరింతును. అంతట నీవు నన్ను గుర్తింతువు.'' అని పలికెను.

ముని ఆనతిని నృపాలుడు నిద్రించెను. కపటజ్ఞాని వెడలి తన ఆసనమున కూర్చుండెను, అలసి ఉండుటవలన భూపాలునికి వెంటనే సుఖనిద్ర పట్టినది. కాని, ఆ కపటముని తీవ్రమగు ఆలోచనలో ఉన్నాడు! అతనికి నిద్ర ఎట్లు పట్టును?

ఇంతలో అచ్చటికి కాలకేతువు అను రాక్షసుడు ఏతెంచెను. ఇంతకుముందు సూకరవేషమున రాజును దారితప్పంచినది వాడే. తాపసభూపాలునకు వాడు పరమ మిత్రుడు. కపటచర్యలయందు మహాఘనుడు. వానికి నూరుగురు కొడుకులు, పది మంది సోదరులు, వారందరు అతి దుష్టులు, వారిని ఎవ్వరూ జయింపలేకుండిరి, దేవతలనువారు పీడించుచుండువారు. విప్రుల, సురల, సాధుసజ్జనులయొక్క దుఃఖమునుచూచి ప్రతాపభానుడు ఆ దుష్టలనందరిని పూర్వమే యుద్ధమున సంహిరించినాడు. ఖలుడగు కాలకేతువు పూర్వవైరమును గుర్తుంచుకొని కపటతాపసిని కలసికొనెను. శత్రువినాశనమునకు ఉపాయమును పన్నెను. కర్మవశమున ఇది ఏదియు ప్రతాప భానునికి తెలియదు.

తేజస్విఅగు శత్రువు ఒంటరియై ఉన్ననూ సరే అతడు అల్పుడని తలచరాదు. తలఒక్కటే మిగిలినది రాహువునకు! ఈనాటికి సహితము అతడు సూర్యచంద్రులను పీడించుచున్నాడే!

తాపసరాజు తన సఖుని చూచి ఆనందముతో లేచి అతనిని కలసికొనెను. ఆతనికి తన కథ అంతయు వినిపించెను. ఆ రాక్షసుడు సంతోషమున ఇట్లు పలికెను:

''నరేశా, వినుము. నేను చెప్పినట్లు నీవు చేసినచో ఆశత్రువును నేను వశము చేసికొనినట్లే. చింతనువీడి ఇక నీవు సుఖముగా నిద్రించుము. ఔషధము అక్కరలేకనే విధి నీ వ్యాధిని కుదిర్చినాడు. శత్రువును కులసహితముగా నిర్మూలనము కావించి నేటికి నాలుగవ దినమున తిరిగివచ్చి నిన్ను కలిసికొందరు.''

ఇట్లు పూర్తిగా ధైర్యము కల్పించి ఆ మహాకపటి, మహాకోపి అగు రాక్షసుడు వెడలెను. ప్రతాపభానుని, అతని అశ్వమును ఒక్క క్షణములో అతడు ఇంటికి చేర్చెను. రాజును రాణివద్ద పరుండపెట్టి నిద్రింపచేసెను. అశ్వమును జాగ్రత్తగా అశ్వశాలలో కట్టివైచెను. రాజుయొక్క పురోహితుని ఎత్తుకొనిపోయెను. మాయచే అతనిబుద్ధిని భ్రమింపచేసెను. అతనిని ఒక కొండ గుహలోనికి తీసికొనిపోయెను. పురోహితుని రూపమును తాను ధరించెను. వెడలి పురోహితుని సుందరశయ్యపై తాను పవ్వళించెను.

తెల్లవారకముందే రాజు మేల్కొనెను. తన ఇంటినిచూచి ఆశ్చర్యపడెను. ఇదిఅంతయు మునియొక్క మహిమయే అని అతడు భావించెను. రాణికి తెలియక ఉండునట్లు మెల్లగా లేచెను. ఆ గుఱ్ఱమునే ఎక్కి అడవికి మరలెను. పురమునందలి స్త్రీ, పురుషులకు ఎవ్వరికీ ఇది ఏమియు తెలియదు. మధ్యాహ్నము రెండుజాములకు భూపతి తిరిగివచ్చెను. ప్రతి ఇంటను ఉత్సవములు జరుప మొదలిడిరి. శుభాకాంక్షలు మారుమ్రోగినవి. రాజు పురోహితుని చూచెను. తన కార్యమును గుర్తునకు తెచ్చుకొని అతడు పురోహితుని చూచుచుండెను. మూడు దినములు ఒకయుగముగా రాజునకు గడచినవి. రాజుయొక్క ఆలోచనలన్నియు కపటముని చరణములయందే మగ్నమై ఉన్నవి. సమయమునకు పురోహిత వేషధారి ఏతెంచెను. రాజుతో చేసికొనిన ఒడంబడికను అనుసరించి ఆన్నివిషయములు అతడు నివరించెను. గురువును గుర్తించి రాజు సంతోషించెను. భ్రమవశుడై అతడు నిశ్చేష్టుడైనాడు. ''వెంటనే ఒక లక్షమంది ఉత్తములగు విప్రులను పిలిపించు'' డని ఆజ్ఞాపించినాడు. వేదములలో నిర్వచింపబడినట్లు షడ్రసములతో చతుర్విధములగు భోజన పదార్థములు పురోహితుడు సిద్ధముచేసెను. అవిఅన్నియు మాయామయములే. గణింపజాలని పదార్థములు సిద్ధిమయ్యెను. పలువిధములగు మాంసములతో వంటలు వండబడినవి. ఆ దుష్టుడు ఆ పదార్థములలో విప్రులయొక్క మాంసమునుకూడా కలిపించెను. విప్రులను భోజనములకు విచ్చేయుడని ఆహ్వానించెను. వారిపాదములను కడిగి సాదరముగా వారిని ఆసీనులను కావించెను. రాజు వడ్డన ప్రారంభించెను. విప్రులెల్లరు భోజనమునకు ఉపక్రమింపనున్నారు. ఇంతలో ఆకాశవాణి ఇట్లు వినవచ్చెను:

''ఓహో విప్రులారా, లెండు, లెండు. మీ ఇండ్లకు పొండు. ఈ ఆహారము భుజించకుడు. దీనిని ఆరగించినచో మీకు మహాహాని కలుగును. పదార్థములు భూసురమాంసముతో వండబడినవి.''

ఆ బయలిపలుకులను నమ్మి ద్విజులందరు లేచినిలచిరి. భూపతి అతి వ్యాకులత చెందుచున్నాడు. అతవికి మతి పోయినది. కర్మవశుడైన ఆ రాజు నోటమాటయే వచ్చుటలేదు. విప్రులు కోపముతో మండిపడుచుండిరి. వారు ఏమాత్రము ఆలోచింప లేకున్నారు.

''మూఢుడా, రాజా, పొమ్ము, నీ పరివారసహితముగా నిశాచరుడవు కమ్ము. ఓరీ నీచ క్షత్రియుడా, నిప్రులకు వారికుటుంబములను రప్పించి ఇట్లు వారిని నాశనము చేయతలచితివిరా? ఈశ్వరుడు మా ధర్మమును కాపాడినాడు. కుటంబ సమేతముగా నశింతువు. ఒక సంవత్సరములోగా నీకు నాశనము కలుగుగాక. నీ వంశమున జలతర్పణము ఇచ్చువాడైనను లేకుండుగాక!'' అని వారు రాజును శపించిరి.

శాపమునువిని రాజు భయపడెను. అత్యంతవ్యాకులుడయ్యెను. తిరిగి గగనము నుండి శుభవాణి ఇట్లు వినిపించెను:--

''ఓ విప్రులారా, మీరు ఆలోచించి శపించలేదు. భూపతి ఎట్టి అపరాధమును కావించనేలేదు.''

ఈ నభోవాణిచి విని భూసురులెల్లరు చకితులైరి. రాజు పాకశాలకు వెడలెను. అచ్చట చూడగా భోజనమూలేదు. వంటబ్రహ్మణుడూలేడు. మిక్కిలి చింతించుచు రాజు వెడలిపోయెను. ఆ వృత్తాంతమంతయు అతడు భూసురులకు తెలిపెను. భయముచే అతడు వ్యాకులుడై నేలపై పడిపోయెను.

''రాజా, నీ దోషమేదియు లేకున్నను కానున్నది కాకమానదు. విప్రశాపము మహాఘోరమైనది.'' అని వచించుచు మహీదేవులందరు మరలిరి. ఈ వార్త పుర మంతయు వ్యాపించెను. పురవాసులెల్లరు చింతించిరి. విధాతను దూషించిరి.

''హంసను చేయవలెననుకొని కాకిని చేసినాడు ఆ బ్రహ్మ'' అని అనుకొనిరి.

పురోహితుని అతని ఇంటివద్దదింపి కాలకేతువు కపట తాపసికి వార్త పంపెను. ఆ దుష్టుడు అన్నిచోట్లకు లేఖలు పంపెను. శత్రురాజులెల్లరు సిద్ధమై దండెత్తివచ్చిరి. రణభేరి మ్రోగించిరి. నగరమును ముట్టడించిరి. అనేకవిధముల యుద్ధము ఎన్నోదినములు జిరిగినది. యోధులెల్లరు రణమున మరణించిరి. ప్రతాపభానుడు సోదర సహితముగా పరాజయము పొందెను. సత్యకేతుని వంశమున ఎక్కడైనను మిగుల లేదు. విప్రశాపము అసత్యమెట్లు కాగలదు? శత్రువును జయించి, నగరమును వశము కావించుకొని రాజులెల్లరు విజయులై, యశమునుపొంది తమతమ నగరములకు మరలిరి.

''భరద్వాజా, వినుము, విధి విపరీతమైనపుడు ధూళి మేరుపర్వత తుల్యమగును. తండ్రి యముడగును. త్రాడు పామగును. మునీ, వినుము. కాలక్రమమున ఆ రాజు, అతనికుటుంబము రాక్షసులై జన్మించిరి. రాజు రావణుడయ్యెను. అతనికి పది తలలు. ఇరువది భుజములు. మహాశూరుడు - వీరుడు అతడు.

ఆరాజు తమ్ముడు అరిమర్దనుడు - మహాబలుడగు కుంభకర్ణు డయ్యెను. రాజు యొక్క మంత్రి - ధర్మరుచి - రావణుని సవతి తమ్ముడగు విభీషణుడై జనియించెను. జగమంతయు విభీషణుని ఎఱుగును. అతడు విష్ణుభక్తుడు. విజ్ఞానఖని. ఆ రాజుయొక్క పుత్రులు, సేవకులు అందరు ఘోర, భయానక రాక్షసులై పుట్టిరి. వారెల్లరు ఖలలు, అనేకజాతులవారు, కామరూపధరులు, దుష్టులు, కుటిలబుద్ధికలవారు. భయంకరులు. వివేకశూన్యులు, కృపారహితులు. హింసకులు. పాపులు, విశ్వమునకే పరితాపము కలిగించువారు. వారిని వర్ణింపజాలము. పావనము, విమలము, అనన్యము అగు పులస్త్యుని వంశమున జన్మించియు వారు మహీసుర శాపమువలన పాపరూపులైరి. ముగ్గురు అన్నదమ్ములు అనేకవిధములగు ఘోర తపములచేసిరి. ఆ తపములను వర్ణంపజాలము. వారి ఉగ్ర తపస్సులను కనుగొని విరించి వారిని సమీంపిచి ''నాయనలారా, నేను ప్రసన్నుడనైతిని. వరములను కోరుకొనుడు'' అనెను. దశాననుడు వినతిచేసి బ్రహ్మయొక్క పాదములను పట్టుకొనెను.

''జగదీశా, వినుము. వానరులు, మానవులు ఈ ఇరుజాతులలో తప్ప ఇతరు లెవ్వరిచేతలలోను నాకు మరణము లేకుండునట్లు వరము ప్రసాదించుము''అని వేడెను.

''అట్లే అగుగాక, నీవు మహాతపము కావించితివి. అని నేనును బ్రహ్మయు అతనికి వరమిచ్చితిమి'' అని శివుడు నుడివెను.

పిదప విరించి కుంభకర్ణునివద్దకు వెడలెను. అతనినిచూచి విధాత కడు విస్మయము చెందెను.

''ఈ ఖలుడు నిత్యము ఆహారము భుజించుచో - ఇక లోకమున ఏదియు మిగులదు! అని తలచి అతడు శారదను ప్రేరణచేసెను. ఆ రాక్షసుని బుద్ధిని మార్చివైచెను. ''ఆఱుమాసములు నిద్ర నాకు అనుగ్రహించు'' మని కుంభకర్ణుడు వరము వేడెను.

అనంతరము విధాత విభీషణుని సమీపించెను. ''కుమారా, వరము కోరుకొనుము'' అనెను.

''భగవానుని పాదకమలములయందు నిర్మలమగు అనురాగము నాకు ప్రసాదించు'' మని విభీషణుడు వేడెను.

వారికెల్లరకు వరములిచ్చి విరించి వెడలెను. అన్నదమ్ములు మువ్వురు ఆనందముతో తమ ఇండ్లకు మరలిరి.

మయుడను దానవునికి మందోదరి అను తనూజకలదు. ఆమె అత్యంత సుందరి. నారీలలామ. ఆమెను తోడ్కొనివచ్చి మయుడు రావణునికి ఇచ్చెను. ''రావణుడు రాక్షసరాజు కాగలడని మయునికి తెలియును. సుందరిఅగుభార్య లభించెనని రావణుడు సంతపించెను. అతడువెడలి తనతమ్ము లిరువురికికూడా పెండ్లి చేయించెను

సముద్రమధ్యమున త్రికూటమను పర్వతమున్నది. బ్రహ్మచే నిర్మించబడిన దృఢమగుకోట దానిపై ఉన్నది. ఆ రాక్షసుడు దానిని అందముగా పునరుద్ధరించెను. కనకరచిత మణి భవనములెన్నో అచ్చట కలవు. నాగకులము నివసించు భోగవతీ పురమువలె, అమరేంద్రుడు వపించు అమరావతివలె ఆపురి అతిరమణీయమైనది. ఆ పురముకంటెను అతి సుందరముగా అచ్చటి దుర్గముకలదు. జగద్విఖ్యాతమగు లంకా పురియే ఆపురి, దానికి నాలుగువైపుల అత్యంత అగాధమగు సముద్రము కందకమువలె ఉండును. దుర్గమునకు చుట్టు మణులతో పొదగబడిన కడు దృడమగు బంగారు అగడ్తలున్నవి. వాని శిల్పచాతుర్యము వర్ణించ తరముకాదు.

హరియొక్క ప్రేరణచే ప్రతికల్పమున ఏ రాక్షసుడు రావణుడగునో ఆ శూరుడు, ప్రతాపవంతుడు, అనన్యబలుడై సేనాసమేతముగా ఆ పురమున నివసించును. పూర్వము అచ్చట మహాయోధులగు రాక్షసులు నివసించిరి. వారినెల్లరను దేవతలు యుద్ధమున సంహరించిరి. ఇప్పుడు అచ్చట ఇంద్రుని ప్రేరణచే కుబేరుని రక్షకభటులు కోటిమంది నివసించుచున్నారు.

దశముఖునికి ఎట్లో ఈవార్త తెలిసెను. అతడు సేనను సిద్ధముచోసికొని, వెడలి కోటను ముట్టడించెను. అతనియొక్క వికట భటులను. సేననుచూచి యక్షులు పారిపోయి ప్రాణములను దక్కించుకొనిరి. దశాననుడు నగరమంతయు తిరిగి పరికించెను. అతనికి విచారముపోయి ఆనందము కలికెను. ఆ నగరము సహజముగనే అతి సుందరమైనది. దుర్గమమైనది. కనుక రావణుడు తన రాజాధానిని అచ్చట స్థాపించెను. వారి వారి యోగ్యతలను అనుసరించి అతడు గృహవసతి ఇచ్చి రక్కసుల నందరిని సుఖులను కావించెను.

ఒకానొక సమయమున అతడు కుబేరునిపై దండెత్తి ఆతని పుష్పకవిమానమును జయించి తెచ్చెను. మరిఒక సమయమున అతడు కౌతుకమున - తన బాహుబలమును పరీక్షించుటకో కైలాసగిరినే పెకలించితెచ్చెను. సుఖము, సంపద, సుతులు, సేన, సహాయకులు, జయము, ప్రతాపము, బలము, బుద్ధి, మహిమ - ఇవి అన్నియు అతనికి నిత్యనూతనమై - లాభములపై లాభము వచ్చునపుడు లోభమువలె - అభివృద్ధి చెందుచున్నవి.

ఆత్యంత బలవంతుడగు కుంభకర్ణునివంటివాడు అతని తమ్ముడు! కుంభకర్ణునికి ఈడగు యోధుడు జగత్తున ఇంతవరకు పుట్టిఉండలేదు. అతడు మధ్యము సేవించి ఆఱుమాసములు నిద్రించును. నిద్రనుండి అతడు మేల్కొనెనా - ముల్లోకములలో సంక్షోభ##మే. ప్రతిదినము అతడు భుజించెనా - విశ్వమంతయు వేగమే శూన్యము కావలసినదే. వర్ణనాతీతుడగు రణధీరుడు అతడు. అట్టివీరులు, శూరులు లంకలో అనేకులున్నారు.

వారిదనాదుడు రావణుని పెద్దకొడుకు, జగమునందలి యోధులయందు అతడు ప్రథముడు. రణమున అతనిని ఎదిరించకలవాడు ఎవ్వడూలేడు. అతడనిన నిత్యము స్వర్గమున హాహాకారమే.

కుముఖుడు, అకంపనుడు, కులిశరదుడు, ధూమకేతువు. అతికాయుడు మొదలగు అనేకయోధులు ఇంకను కలరు. వీరిలో ఏ ఒక్కడైనను జగత్తును జయించ కలడు. అందరు కామరూపములను ధరించగలవారే. రాక్షసమాయను తెలిసినవారే. వారికి దయాధర్మములు కలలోనైనను లేవు.

ఒకనాడు దశముఖుడు తన సభలో ఆసీనుడై తన అసంఖ్యాక పరివారమును పరికించినాడు. పుత్రులు, పౌత్రులు, పరిజనులు, సేవకులు - గుంపులు గుంపులుగా ఉన్నారు. ఈ రాక్షసజాతిని ఎవడ లెక్కింపగలడు? సహజ గర్విష్ఠి అగు రావణుడు క్రోధ, మదయుతములగు పలుకులను ఇట్లు నుడివెను:--''ఓ సకల రజవీచరయూథములారా, వినుడు. దేవతాగణములు మన శత్రువులు. ఎదుటపడి వారు యుద్ధముచేయలేరు. బలవంతులగు శత్రువులనుచూచి వారు పారిపోదురు. వారి చావుకు ఒకే ఉపాయమున్నది. దానిని వివరించి తెలుపుదును. వినుడు. ద్విజుల భోజనములవద్దకు, వారుచేయు యజ్ఞ, యాగ, శ్రాద్ధ కర్మలవద్దకు మీరు వెడలుడు. వారిని భాధించుడు. క్షుద్బాధచే బలహీనులై దేవతలువచ్చి నన్ను శరణందురు. అప్పుడు వారిని నేను చంపివైచుటయో లేదు. వారిని చక్కగా నావశముచేసికొని, విడుదల కావించుటయో నేను చూతును.''

పిదప దశాననుడు మేఘనాదుని పిలిపించి, అతనికి బుద్ధులుచెప్పి, తన బలమును వర్ణించి, దేవతలయందు వైరమును పెంపొందించెను.

''కుమారా, రణధీరులు, బలవంతులు, గర్వితులు అగు ఆ దేవతలను నీవు సంగరమున ఓడించి, బంధించితెమ్ము'' అని అతనిని కోరెను.

ఆ సుతుడు లేచెను. తండ్రి ఆనతిని తలదాల్చెను. ఇట్లు అందరికి ఆజ్ఞలు ఇచ్చి దశాననుడు గదనుచేపట్టి చనెను.

దశముఖుడు నడచుచున్నప్పుడు ధరణి వణకెను. అతని గర్జనచే సురవనితల గర్భములు స్రవించెను. క్రోధపూరితుడై రావణుడు వచ్చుచున్నాడని దేవతలు మేరుగిరి యందు తలదాచుకొనిరి. దిక్పాలకుల సుందరలోకములన్నియు శూన్యమై ధశాననుని పాలయ్యెను. పదేపదే అతడు సింహనాదముచేసి - దిక్పాలకులను రణమునకు రమ్మని రంకెలు వేసెను. వారిని తిట్టెను. రణమదముచే మత్తెక్కి అతడు తనకు తగు యోధునికొఱకై వెదకుచు లోకమంతయు పరుగులిడినాడు. తిరిగినాడు. కాని అతనికి ఈడగు యోధుడు ఎచ్చటను కనుపించలేదు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు, కుబేరుడు, అగ్ని, కాలుడు, యముడు మొదలగు పాలకులను, కిన్నర, సిద్ధ, మనుజ, సుర, నాగులను - అందరిని అతడు వెంటాడినాడు. బ్రహ్మయొక్క సృష్టియందున్న శరీరధారులెల్లరు - స్త్రీలు, పురుషులు - దశముఖుని వశులైరి. అందరు భయపడి అతని ఆజ్ఞలను పాలించుచుండిరి. నిత్యము వారువచ్చి అతనిచరణములవద్ద వినీతులై, శిరములువంచి నమస్కరించుచుండిరి. తన భుజబలముచే దశాననుడు విశ్వమంతటిని వశపరచుకొనెను. అతడు ఎవ్వరినీ స్వతంత్రునిగా ఉండనీయలేదు. మాండలిక సార్వభౌముడు - రావణుడు ఇట్లు తన ఇష్టాను సారము రాజ్యము చేయసాగెను.

దేవతలను, యక్షులను, గంధర్వ, నర, కిన్నర - నాగులను - ఎల్లరను జయించి వారి కన్నియలను, సుందర నారీమణులను - అతడు తన భుజబలముచే జయించితెచ్చి వివాహమాడెను.

ఇంద్రజిత్తుతో అతడు ఏదిచెప్పినను - చెప్పుటయే తడవు - ఆ కుమారుడు దానిని పాలించును. అంతకునముందు రావణుడు ఏ ఆజ్ఞలనిచ్చెనో - అవి ఎట్లు పాలింపబడినవో వినుడు.

రాక్షసులెల్లరు చూచుటకు అతిభయానకరూపులు, పాపులు. దేవతలకు దుఃఖము కలిగించుచుండిరి. ఆ అసుర నికాయములు ఉపద్రవములను కల్పించుచుండిరి. మాయచే నానారూపములను ధరించి ధర్మనిర్మూలనకరములు, వేదవిరుద్ధములు అగు పనులనన్నిటిని వారుచేయుచుండిరి. గోవులు, ద్విజులు ఉన్నప్రదేశములు కనుపించిన చాలు. ఆ నగరములను, గ్రామములను, పురములను వారు కాల్చుచుండిరి. ఎచ్చటనూ శుభకార్యములు జరుగుటలేదు. దేవతలను, విప్రులను, గురువులను ఎవ్వరూ మన్నించుటలేదు. హరిభక్తిలేదు. యజ్ఞములులేవు. తపములులేవు. జ్ఞానములేదు. వేదములు, పురాణములు కలలోనైనను వినబడవు. జప, యోగ, వైరాగ్య, తప, యజ్ఞముల యందు దేవతలకు భాగము కలదనుమాట దశవదనుడు ఎన్నడైనను వినునో - అతడు తత్‌క్షణమేలేచి పరుగెత్తుకొని ఆ ప్రదేశమునకు పోవును. దేవతలకు ఏమియు మిగులనీయక, వారి భాగములను తానే గ్రహించి క్రతువును ధ్వంసము చేయును. ధర్మమను మాటయైనను చెవులకు వినవచ్చుటలేదు. లోకమంతయు ఈ రీతిని భ్రష్టమైనది. ఎవ్వడైనను వేదములను. పురాణములను పఠించెనో - వానిని అతడు బహువిధముల బాధించి దేశమునుండి వెడలకొట్టును.

నిశాచరులు సలుపు ఘోర అత్యాచారములను వర్ణింపజాలము. హింసయందే మహాప్రీతికలవారికి పాపము లొక లెక్కయా?

పరధనముపై, పరస్త్రీలయందు ఆశపడు దుష్టులు, దొంగలు, జూదరులు, విజృంభించిరి. తల్లిదండ్రులను, దేవతలను ప్రజలు గౌరవించుటలేదు. సాధువులచే వారు సేవలు చేయించుకొనుచున్నారు. భవానీ, ఈ అత్యాచారము కావించువారెల్లరు నిశాచరులే. ఇట్లు ప్రజలలో ధర్మమునందు ప్రబలుచున్న అనాదరమును కనుగొని భూదేవి కడు భీతిల్లి వ్యాకులపడినది.

''ఈ పరద్రోహివలన నాకు కలుగుభారముతో పోల్చినచో పర్వతముల, నదుల, సముద్రముల భారము నేను మోయునది ఒక లెక్కలోనిదే కాదు'' అని ఆమె తల పోసెను. ఈ ధర్మవైపరీత్యమునంతను పృథ్వి వీక్షించెను. కాని, రావణునియందలి భయముచే ఆమె ఏమియు పలుకలేకుండెను. తుదకు మనమున యోచించి ఆమె గోరూపము ధరించి, మునులు, దేవతలందరు దాగిఉన్నచోటికి ఏగినది. శోకించుచు తన సంతాపమును వారికి తెలిపినది. కాని ప్రయోజనము ఏమియు లేకపోయినది. అంతట సురలు, మునులు, గంధర్వులు - ఎల్లరు కలసి బ్రహ్మలోకమునకు వెడలిరి. గో రూపధారి అగు భూదేవియు - సాపము - భయ, శోకములతో వారివెంట చనినది.

బ్రహ్మ సర్వము తెలిసికొన్నాడు. తనచేతిలో ఏమియు లేదనుకొన్నాడు. ''అవినాశి అగు ఆతడే నీకునూ నాకునూ దిక్కు, ఆతని దాసివికదా నీవు! ధరణీ, మనస్సున ధైర్యము వహించుము. హరి పాదములను స్మరించుము. తన దాసుల కష్టములను ప్రభువు గ్రహించును. నీ దారుణవిపత్తిని ఆతడే దూరము చేయగలడు'' అని విరించి నుడివెను.

''మనము వెడలి మొరపెట్టుకొనవలెననిన - ప్రభువు ఎచ్చట ఉన్నాడో కద!'', అని దేవతలందరు కూర్చుండి ఆలోచింప మొదలిడిరి.

''వైకుంఠమునకు పోవుద'' మని ఒక డనెను.

''క్షీరసాగరమున ఉండునుకదా ప్రభువు!'' అని మరిఒకడు నుడివెను.

ఎవనిహృదయమున ఎట్టి భక్తి, ప్రేమ ఉండునో వానిని అనుసరించియే స్వామి సదా వానికి ప్రకటమగును. గిరిజా, ఆసమాజమున నేనును ఉంటిని. అవ కాశమునుచూచి నేనును ఒకమాట పలికితిని.

''హరి సర్వవ్యాపి. అన్నిచోట్ల సమానముగా ఉండును. భక్తిచే అతడు ప్రకటమగును. ఇట్లని నాకు తెలియును. దేశ, కాల, దిశా, విదిశలయందు ఎచ్చట నైననుసరే ఆ ప్రభువులేనిది ఎక్కడ? తెలుపుడు, చరాచర మెల్లయు ఆతడు వ్యాపించి ఉన్నను ఆతడు విరాగి. సర్వరహితుడు. అగ్నివలె సర్వవ్యాపకుడు'' అని నేను వచించితిని, నా పలుకులు అందరిని ఆనందపరచినవి. ''మంచిది. మంచిది'' అని విరించికొనియాడసాగెను.

నా వచనములను వినిన విరించి మనమున అమిత ఆనందము కలిగెను. ఆతని తనువు పులకరించెను. ఆతని నయనముల ఆశ్రుధారలు ప్రవహించెను. అంతట ఆతడు చేతులు జోడించి, సావధానుడై ఇట్లు స్తుతింపమొదలిడెను.

''జయము - సురనాయకా - నీకు జయము - సేవకజన సుఖదాయకా, నీకు జయము. శరణాగతరక్షకా, భగవానుడా, నీకు జయము. గోబ్రాహ్మణ హితకరుడా, నీకు జయము, అసురారీ, సింధుకన్యా ప్రియపతీ, నీకు జయము, సరసంరక్షకా, పృథ్వీ పాలకా, నీ లీలలు అద్భుతములు, వానిమర్మములు ఎవ్వరూ తెలిసికొనలేరు.

సహజకృపాళుడు, దీనదయాళుడు - ప్రభువు మాపై కృపచూపుగాక!

అవినాశీ, సకలహృదయాంతర్యామీ, సర్వవ్యాపకా, పరమానందస్వరూపా, అజ్ఞేయా, ఇంద్రియాతీతా, పునీతచరితా, మాయారహితా, ముకుందా, నీకు జయము, జయము. విరాగులు, విగతమోహులు అగు మునిబృందములు సహితము అత్యంత అనురక్తులై రేయింబవళ్ళు నిన్ను ధ్యానింతురు. నీ గుణగణములను గానము చేతురు. సచ్చిదానందుడవగు నీకు జయము. వేఱవ్వరి సాంగత్యములేకయే త్రివిధములగు సృష్టిని ఉత్పన్నము చేయువాడవు, పాపములను హరించువాడవు - భగవానుడవు. ఆపదలనుండి మమ్ము కాపాడుము.

భక్తిఅనగా ఏమో మాకు తెలియదు. పూజలు మేమెరుగము. భవభయములను హరించువాడవు, మునుల మనములను రంజిపంజేయువాడవు, విపత్సమూహములను విధ్వంసము చేయువాడవు, మనోవాక్‌ కర్మలచే - మా చాతుర్యమును త్యజించి దేవతా సమూహమెల్లయు నిన్ను శరణువేడ వచ్చితిమి.

శారద, శ్రుతులు, శేషుడు, సకలఋషులు - ఎవ్వరూ నిన్ను తెలియలేరు. నీవు దీనులకు ప్రియుడవని వేదములు ఘోషించును. అట్టి భగవానుడా - మాయందు కృపచూపుము. భవసాగరమును మధించుటకు మందరగిరివి - సర్వవిధముల సుందరుడవు - గుణనిధీ, సుఖరాశీ, నాథ, మునులు, సిద్ధులు, సర్వదేవతలు, భయపడి అత్యంతవ్యాకులమున, నీ పాదపంకజములకు నమస్కరించుచున్నారు.''

దేవతలు, భూదేవి భయభీతులై ఉన్నట్లు తెలిసికొని వారి ప్రేమయుత వచనములను విని - శోక, సందేహములను హరించు-గంభీర గగనవాణి ఇట్లు వెలువడెను:--

''మునులారా, సిద్ధులారా, సురేశ్వరులారా, భయపడకుడు. మీకొరకై నేను మానవరూపమును ధరింతును. పవిత్ర దినకరవంశమున నా అంశలతో అవతరింతును.

అదితి కశ్యపులు మహాతపము కావించిరి. పూర్వము నేను వారికి వరమును అనుగ్రహించితిని. వారు కౌసల్యా దశరథులై కోసలపురియందు నరపాలురై జనించిరి. వారిఇంట రఘుకులతిలకులగు నలుగురు సోదరులరూపమున నేను అవతరింతును. నారదుని వచనములన్నియు సత్యము కావింతును. నా పరాశ క్తిసమేతుడనై నేను అవతరింతును. భూభారమునంతయు హరింతును. దేవతాబృందము లారా, నిర్భయులై ఉండుడు.''

గగనమునుండి వెలువడిన దివ్యవాణిని చెవులార విని దేవతలందరు సంతపించి మరలిరి. వారి హృదయములు చల్లబడెను.

అంతట బ్రహ్మ ధరణిని ఓదార్చెను. ఆమెయు భయరహిత ఆయ్యెను. ఆమె హృదయమున విశ్వాసము జనించెను.

''మీరందరు వానరశరీరములను ధరించి మహీతలమున కేగుడు. హరిచరణములను సేవించుడు'' అని దేవతలకు బోధించి విరించి తన లోకమునకు మరలెను. దేవతలందరు తమ తమ లోకములకు చనిరి. భూదేవికి, వారికి మనశ్శాంతి లభించెను.

బ్రహ్మ ఇచ్చిన ఆజ్ఞలచే దేవతలు కడు సంతపించిరి. వెంటనే వారు భూతలమునకు ఏతెంచిరి. వానరదేహములను ధరించిరి. ఆ వానరులెల్లరు అనన్య బలప్రతాపవంతులు. అందరూ వీరులు. గిరులు, తరులు, నఖములు వారి ఆయుధములు. ధీరమతులగు ఆ కపులెల్లరు భగవానుని అవతరణకై ఎదురుచూచుచుండిరి. వారెల్లరు పర్వతములయందు, అడవులయందు, అచ్చటచ్చట శౌర్యపరాక్రమములు కల సైన్యములను నిర్మించుకొని నివసించుచుండిరి.

రుచిరమగు ఈ చరితనంతయు వివరించితిని. ఇక-మధ్యలో విడిచిన చరితను వినుడు.

అయోధ్యాపురియందు రఘుకులమణి దశరథుడను రాజు కలడు. ఆతనిపేరు వేదవిదితము. ఆతడు ధర్మదురంధరుడు, గుణనిధి, జ్ఞాని, ఆతని హృదయమున సారంగపాణియందు భక్తి కలదు. ఆతని మతియు ఆ భగవానునియందే. ఆతనికి కౌసల్య మొదలగు రాణులుండిరి. వారందరు పవిత్రప్రవర్తన కలవారు. పతికి అను కూలురు. హరిచరణ కమలములయందు వారి కెల్లరకు దృఢ, పవిత్రప్రేమ.

తనకు పుత్రులు లేరని ఆ భూపాలుని మనమున ఒకదినమున అత్యంత విచారము కలిగెను. వెంటనే ఆతడు తన గురుని గృహమునకు వెడలెను. గురుచరణములకు నమస్కరించెను. గురుని వినుతించెను. తన సుఖ దుఃఖములన్నిటిని ఆయనకు నివేదించెను. గురువగు వసిష్ఠుడు ఆతనిని బహువిధముల ఓదార్చి. ''ధైర్యము వహించుము. నీకు నలుగురు సుతులు కలుగుదురు. వారు త్రిభువనవిఖ్యాతులై భక్తుల భయమును హరింతురు'' అని తెలిపెను.

వసిష్ఠుడు ఋష్యశృంగఋషిని పిలిపించి ఆయనచే శుభకరమగు పుత్రకామేష్ఠి యజ్ఞమును చేయించెను. భక్తియుక్తుడై ఋషి ఆహుతి కావించినంత అగ్నిహోత్రుడు హవిష్యాన్నమును, క్షీరమును చేతపట్టి సాక్షాత్కరించెను.

''రాజా, వసిష్ఠుడు తన మనమున తలచినట్లు నీ సకలకార్యము సిద్ధించినది. నీవు వెడలి ఈ హవిష్యాన్నమును నీకు ఉచితమగురీతిని పంచుము'' అని ఆతడు దశరథునితో వచించెను. అనంతరము పావకుడు సభికులెల్లరకు తెలియుచెప్పి అదృశ్యుడయ్యెను. రాజు పరమానందమగ్ను డయ్యెను. ఆతని హృదయమున ఆనందము ఉప్పొంగెను.

వెంటనే అతడు తన ప్రియసతులను పిలిపించెను. కౌసల్యాది సతులు ఆతని వద్దకు వచ్చిరి. పాయసమునందలి సగభాగమును దశరథుడు కౌసల్యకు ఇచ్చెను. మిగిలిన సగమును రెండుభాగములు చేసెను. వానిలో ఒకభాగమును ఆతడు కై కేయికి పంచెను. ఇక శేషించినదానిని తిరిగి రెండుభాగములుగాచేసి ఆ భాగములను కౌసల్య, కై కేయిల అనుమతితో అతడు సుమిత్రకు ఇచ్చెను.

ఈ విధిని రాణులెల్లరు గర్భవతులైరి. హర్షమాణులైరి. మహా ఆనందభరితులైరి, హరి వారి గర్భముల ప్రవేశించిననాటినుండియు లోకము ఎల్లెడలను సుఖసంపదలు వెల్లివిరసినవి. శోభా, శీల, తేజోఖనులై రాణులెల్లరు తమ తమ మందిరములయందు విరాజిల్లుచుండిరి. ఇట్లు కొంతకాలము ఆనందముగా గడచెను. ప్రభువు ప్రకటమగు తరుణము ఆసన్నమయ్యెను.

యోగము. లగ్నము, గ్రహములు, వారము, తిథి అన్నియు అనుకూలములై ఉన్నవి. చరాచరములన్నియు హర్షసంయుతములై ఉన్నవి. శ్రీరామజననము సుఖములకు మూలము. అది పవిత్రమగు చైత్రమాసము. నవమీ తిథి. శుక్లపక్షము. హరికి ప్రియమగు అభిజిత్‌ ముహూర్తము. మధ్యాహ్నసమయము. ఎక్కువ శీతలమై లేదు. ఎండయూ ఎక్కువలేదు. లోకములకు శాంతినిచ్చు పవిత్రసమయము. శీతల, మంద, పరిమళవాయువులు వీచుచున్నవి. దేవతలు ఆనందిచుచున్నారు. సాధుసజ్జనుల మానసములు ఉత్పాహవంతములై ఉన్నవి. వనములు పుష్పించినవి. పర్వతగణములు మణులతో ప్రకాశించుచున్నవి. నదులన్నిటియందు అమృతధారలు ప్రవహించుచున్నవి. సమయము సమీపించెనని విధాతకు తెలిసెను. దేవతలు తమ విమానములను అలంకరించిరి. విరించితితోకలసి వారు పయనమయ్యిరి. విమలమగు గగనము సురసమూహ భరితమయ్యెను. గంధర్వగణములు భగవానుని గుణములను గానము చేయుచుండిరి. తమ రమణీయ అంజలులతో సుందరమగు పుష్పములను వారు వర్షింప మొదలిడిరి. నభమున దుందుభులు మ్రోగసాగినవి. నాగులు, మునులు, దేవతలు స్థోత్రములుచేసి బహువిధముల ఆరాధించిరి. సురసమూహములు ప్రభుని తమ తమ లోకములకు మరలిరి.

అఖిలలోకములకు శాంతిప్రదుడగు జగన్నివాసుడు - ప్రభువు అవతరించెను! దీనదయాళుడు, కౌసల్యాహితకరుడు, కృపాళుడు ప్రభువు ప్రకటమయ్యెను.

మునుల మనములను హరించు - ఆతని అద్భుతరూపమును ధ్యానించి తల్లి ఆనందము పొందెను.

నేత్రానందదాయకమగు ఆ బాలుని శరీరము మేఘశ్యామలమై ఉన్నది. చతుర్భుజములయందు చతుర్విధ ఆయుధములు. శరీరమున భూషణములు, కంఠమున వనమాల. విశాలనయనములు - ఇట్లు శోభాసముద్రుడు, ఖరారి ఆవిర్భవించెను. కౌసల్య తన రెండుచేతులు జోడించి ఇట్లు స్తుతించినది:--

''అనంతా, నిన్నెట్లు స్తుతింపగలను? నీవు మాయాతీతుడవనియు, జ్ఞానాతీతుడ వనియు, గుణాతీతుడవనియు, పరిమాణరహితుడవనియు నిన్ను వేదములు, పురాణములు కీర్తించును. కరుణాసముద్రుడవనియు, సుఖసాగరుడవనియు, సకలగుణనిలయుడవనియు శ్రుతులు వర్ణించును. సాధు సజ్జనులు గానము చేతురు. భక్తజనానురాగీ, శ్రీకాంతా. నా హితమునకై సాక్షాత్కరించితివి.

నీ రోమరోమమునను మాయానిర్మితమగు బ్రహ్మాండనికాయము లున్నవని వేదములు నుడువును. అట్టి నీవు నా గర్భమున వసించితివి. హాస్యాస్పదమగు ఈ విషయము వినినమాత్రమున ధీరుల మనములైనను చలించును.''

తల్లికి జ్ఞానోదయము కాగానే ప్రభువు మందహాసము చేసెను. నానావిధములగు చరిత్రను ఆతడు సృష్టింపతలచెను! తనయందు తల్లికి పుత్రవాత్సల్యము కలుగునట్లు భగవానుడు తన పూర్వ అవతారకథలను వివరించెను.

కౌసల్యయొక్క బుద్ధి చలించెను.

''తండ్రీ, ఈ రూపమును త్యజించుము. అతి ప్రియములగు బాలలీలలను కావించుము. ఆ ఆనందమే నాకు అనన్యపరమానందము'' అని ఆమె పలికెను. ఈ పలుకులు వినినంత సురపాలకుడు, చతురుడు అగు భగవానుడు బాలకుడయ్యెను. ఏడువ మొదలిడెను.

ఈ చరితను గానము చేయువారికి హరిపదసేవ సంప్రాప్తించును. వారు భవకూపమున పడరు. విప్ర, ధేను, సుర, సాధు, సజ్జనహితమునకై భగవానుడు మను జావతారము ధరించెను. ఆతడు మాయాతీతుడు, గుణాతీతుడు, ఇంద్రియాతీతుడు. నిజేచ్ఛా నిర్మితశరీరుడు.

బాలుని బహుప్రియమగు రోదనశబ్దము విని రాణులందరు తత్తరమున పరుగెత్తుకొని వచ్చిరి. ఆనందముతో దాసీజనులెల్లరు అటు ఇటు పరుగెత్తిరి. పురవాసు లందరు ఆనందమగ్నులైరి.

పుత్రుడు జన్మించెనని దశరథుడు చెవులార వినెను. బ్రహ్మానందభరితుడయ్యెను. ఆతనిమానసము అత్యంతప్రేమ సంభరితమయ్యెను. శరీరము పులకరించెను. మనమున ధైర్యము తెచ్చుకొని ఆతడు లేవబోయెను.

''ఎవని నామమును వినినమాత్రముననే శుభములు సంప్రాప్తించునో అట్టి ప్రభువు నా ఇంటికి వేంచేసెను'' అని ఆతడు తలచెను. అతనిమనస్సు పరమానంద భరితమయ్యెను. దశరథుడు మేళగాండ్రను పిలిపించెను. ''మ్రోగించుడు-మేళములను'' అని శాసించెను. గురువగు వసిష్ఠునికి అతడు ఆహ్వానము పంపించెను. ద్విజులను వెంటనిడుకొని వసిష్టుడు రాజద్వారమువద్దుక అరుదెంచెను. అందరు వెడలి అనుపమసుందరమూర్తి అగు బాలుని తిలకించిరి, బాలుడు రూపరాశి, ఆతనిసౌందర్యము వర్ణనాతీతము.

నందీముఖశ్రాద్ధమును, జాగకర్మసంస్కారములను అన్నిటిని దశరథుడు చేయించెను. విప్రులకు సువర్ణ. గో. వస్త్ర, మణి దానముల నిచ్చెను. నగరమున ధ్వజములు, పతాకములు, తదోరణములు అలంకరింపబడినవి. ఆ అలంకారమును వర్ణింపలేము. ఆకసమునుండి సుమనవృష్టి కురిసెను. ప్రజలెల్లరు బ్రహ్మానందమగ్నులై ఉండిరి. బృంద బృందములుగా స్త్రీలు సమావేశమగుచున్నారు. సహజశృంగారమును కావించుకొని వారు లేచి పరుగిడుచున్నారు. బంగారుకలశములను చేబట్టి, పళ్ళెములలో మంగళద్రవ్యములను నింపి, పాటలు పాడుచు వారు రాజద్వారమున ప్రవేశించుచున్నారు. బాలునికి హారతిఇచ్చి దృష్టి తీయుచున్నారు. పదేపదే బాలుని పాదములపై పడుచున్నారు. మాగధులు, సూతులు, వందిగణములు, గాయకులు రఘునాయకుని పావనగుణములను గానము చేయుచున్నారు. ఎల్లరకు భూపాలుడు భూరిదానముల నిచ్చుచున్నాడు. దానములను గ్రహించినవారు వానిని తమవద్దనే ఉంచుకొనుటలేదు, నగరవీధులన్నియు - వానిపై వెదచల్లబడిన కస్తూరి, చందన కుంకుమలతో బురద అయినవి. శోభకు మూలాదారుడగు భగవానుడు అవతరించెనని ఇంటింటను మంగళమయ శుభాకంక్షలు మారుమ్రోగినవి. పురజనులు-స్త్రీలు, పురుషులు అక్కడక్కడ గుంపులుగాకూడి అనందమగ్నులై ఉన్నారు.

కై కేయీ సుమిత్రలు ఇరువురు - సుందరులగు సుతులను ప్రసవించిరి. ఆ ఆనందమును, సంపదను, సమాజమును, చూడవచ్చినవారిని శారద, ఆదిశేషులైనను వర్ణింపజాలరు.

ప్రభుదర్శనమునకై నిశాదేవి ఏతెంచి, భాస్కరునికాంచి, సిగ్గుపడి, విచారించి, సంధ్యాకాంతిగా రూపొందెనో అన్నట్లు అయోధ్యాపురి శోభిల్లుచున్నది. ఆ పురి రామణీయకత వర్ణనాతీతము. అగరువత్తులధూపము సంధ్యాసమయమునందలి అంథకారము వలె ఉన్నది. ఎగురుచున్న ఎఱ్ఱని అగ్నికణములు నిశాదేవియొక్క అరుణకాంతివలె ఉన్నవి. రాజమందిరములయందున్న మణిసమూహములు తారాగణములను పోలి ఉన్నవి. వానిపై ఉన్న సువర్ణకలశములు చక్కని చంద్రబింబములో అన్నట్లున్నవి. రాజభవనమునుండి కడు మృదువగు వాణితో వేదధ్వని వినిపించుచున్నది. సమయోచితమైన పక్షుల మధురకూజనమునుపోలి ఆ ధ్వని ఉన్నది. ఈ కౌతుకమును కనుగొని భానుడు తన పయనమును మరచెను. ఒకనెల ఇట్లు గడచినట్లు ఆతనికి తెలియనే లేదు. మాసము ఒక దినమువలె గడచెను. ఈ మర్మము ఎవ్వరికీ తెలియదు. రధసమేతముగా రవి అక్కడనే ఆగిపోయెనుకదా! ఇక రాత్రి ఎట్లగును? ఈ రహస్యము ఎవ్వరూ ఎఱుగరు, భగవానుని గుణగణములను గానము చేయుచూ (తుదకు) దినమణి కదలెను. ఈ మహోత్సవమును వీక్షించి సురలు, మునులు, నాగులు, తమ భాగ్యమును కొనియాడుకొనుచు తమఇండ్లకు మరలిరి.

గిరిజా, నీ బుద్ధి అతి దృఢమైనది. మరి ఒక రహస్యవిషయము - నాకు సంబంధించినది - నీకు తెలియచేతును. వినుము, కాకభుశుండియు, నేనును ఇరువురము ఆ సమయమున అక్కడే కలసిఉంటిము. మేము మానవరూపమున ఉన్నందున మమ్ము ఎవ్వరూ గుర్తించలేదు. పరమానందమున, ప్రేమ, ఆనందమగ్నులమైఉన్న మేము నగరమునందలి వీథులన్నిటిలో మమ్ము మేము మరచి విహరించితిమి. రామునికృప ఉన్నవారే ఈ శుభచరితను తెలిసికొనగలరు.

ఆ సమయమున ఎవరు ఎట్లు వచ్చిననూ, ఎవరి మనస్సునకు ఏది ప్రీతికరమో దానిని నరపాలుడు వారివారికి బహూకరించెను. ఎనుగులు, రథములు, గుఱ్ఱములు, బంగారము, గోవులు, వజ్రములు, నానావిధములగు వస్త్రములు దశరథుడు వారికి బహుమానముగా ఇచ్చెను. అందరి మనస్సులను ఆతడు సంతుష్ఠపరచెను. అన్నిచోట్ల ప్రజలందరు''తులసీదాసుని ప్రభువులగు నలువురు సుతులు చిరంజీవులగుదురగాక!'' అని ఆశీర్వదించిరి.

ఇట్లు కొన్నిదినములు గడచినవి. ఎవ్వరికీ తెలియకనే రాత్రులు, పవళ్లు పరుగడినవి. పుత్రలకు నామకరణు చేయవలసిన సమయము వచ్చెననిగ్రహించి దశరథుడు జ్ఞాని అగు వసిష్టమునిని పిలిపించెను. ఆ మునిని పూజించి భూపతి ''ముని వర్యా, నీ మనస్సున యోచించినవిధిని వీరికి నామకరణము చేయుడు'' అని కోరెను.

''రాజా, అనుపమములగు నామములు అనేకములు ఉన్నవి వీరికి. ఐనను నా బుద్ధిని అనుసరించి నామకరణము కావింతును'' అని ముని అనెను.

''ఎవ్వనియొక్క ఒక్క అణువుచే ముల్లోకములు సుఖవంతములగునో - అట్టి ఆనందసాగరుడు, సుఖరాశి, సుఖధాముడు, అఖిలలోక శాంతిప్రదాత-అగు ఈతనిపేరు రాముడు.

విశ్వమును భరించి, పోషించు - ఈ రెండవకుమారుని పేరు భరతుడు. ఎవ్వని నామము స్మరించినమాత్రమున శత్రువులు నశింతురో - ఆ వేదప్రసిద్ధుడు శత్రుఘ్నుడు. శుభలక్షణనిలయుడు, రామునికి ప్రియుడు, సకల జగదాధారుడు అగు సుతునినామము లక్ష్మణుడు'' అని ఇట్లు వసిష్ఠుడు నామకరణము కావించెను.

గురుడు మనమున యోచించి ఇట్లు నామకరణముచేపి ''రాజా, నీ కుమారులు నలుపురు వేదతత్త్వము. రాముడు మునుల ధనము. భక్తులసర్వస్వము - శివునికి ప్రాణము. బాలలీలలతో ఆనందించుచున్నాడు'' అని నుడివెను.

బాల్యమునుండియే తన పరమహితైషి అగు స్వామి రాముడని తెలిసికొని అతని చరణానురాగియై లక్ష్మణుడు ఉండెను. భరత శత్రుఘ్ను లిరువురియందును స్వామి సేవకప్రేమ వృద్ధి చెందుచుండెను.

శ్యామవర్ణులు, గౌరవర్ణులు అగు రెండుజంటల సౌందర్యమునుచూచి తల్లులు గడ్డిపోచను త్రుంపిపారవైచి, వారికి దృష్టి తీయుచుందురు. నలుగురు కొమరులు శీలరూప గుణనిలయులు, వారిలో రాముడు అధిక ఆనందసాగరుడు, ఆతనిహృదయమున కారుణ్యచంద్రుడు. ప్రకాశించుచుండును. మనోహరమగు ఆతని మందహాసము ఆ చంద్రకిరణములను సూచించును. కౌసల్య ఆతనిని కొంతతడవు తన ఒడిలో కూర్చుండపెట్టుకొనును మరికొంతసేపు ఊయెలలో పరుండపెట్టును. ''నా ముద్దు బిడ్డా!'' అని లాలించును.

సర్వవ్యాపకుడు, మాయారహితుడు, నిర్గుణుడు, వినోదరహితుడు, అజుడు అగు బ్రహ్మము - ప్రేమకు, భక్తికి వశుడై కౌసల్య ఒడిలో ఆడుకొనుచున్నాడు!

నీలకమలములవలె, గంభీరమేఘములవలె శ్యామలమైన ఆతని శరీరమున కోటి మన్మథులశోభ వికసించినది. అరుణ చరణములయందలి నఖములకాంతి కమలదశములపై ఉన్న ముత్యములా అనునట్లుండును. పాదములు - వజ్ర, ధ్వజ, అంకుశ చిహ్నములతో విరాజిల్లుచుండును. ఆతని నూపురధ్వనిని విని మునుల మనములైనను మోహవశము లగును. నడుమున వడ్డాణము. ఉదరమున త్రిరేఖలు, గంభీరమగు నాభి. ఆ గాంభీర్యము చూచివవనారికే తెలియును. వివిధ ఆభరణములతో విరాజిల్లు విశాలభుజములు. అపూర్వమగు అందమునుచేకూర్చు పులిగోళ్ళు ఉరమున! వక్షస్థలమున రత్నయుక్తమణిహారము - ఆ హారముయొక్క శోభను, భృగుచరణచిహ్నమును వీక్షించిననే చాలు - మానసము మోహవశమగును.

శంఖమునుపోలిన కంఠము, అతి సుందరమగు చుబుకము. వదనమున అగణితమదనుల కాంతి, సుందరమగు దంతములు, ఎఱ్ఱని పెదవులు, ఇక-ఆతని నాసికారామణీయకతను, తిలకపుశోభను ఎవరు వర్ణింపగలరు? సొబగుకల ఆ చెవులు అతి సందదరమగు కపోలము, మధురమగు చిన్నారి పసిడిపలుకులు, ఉజ్జ్వలమై, మృదువై. ఉంగరములు తిరిగి, అనేకరీతుల తల్లిచే అలంకరింపబడిన పుట్టువెంట్రుకలు, వదులైన పసుపు పచ్చని చొక్కా - మోకాళ్లమీద, చేతులమీద ప్రాకుచు నేత్రానందము కొలుపుచున్న ఆ మధురమూర్తిని వేదములు, ఆదిశేషుడు సహితము వర్ణింపజాలరు. ఆ రూపమును కలలో కనుగొనినవారే దానిని వర్ణింపగలరు. సుఖరాశి, మోహాతీతుడు, జ్ఞానాతీతుడు, ఇంద్రియాతీతుడు, వాచామగోచరుడు అగు ఆతడు కౌసల్యా దశరథ దంపతుల పరమప్రేమకు వశుడైనాడు. పావనమగు బాలలీలలను కావించుచున్నాడు.

భవానీ, ఇట్లు అఖిలజగమునకు జననియు, జనకుడు అగు రాముడు కోసలపుర వాసులకు ఆనందప్రదుడయ్యెను. రఘునాథుని చరణానురాగులకు ఇవి ప్రత్యక్షానుభవములు, రఘుపతియందు విముఖుడగు వానిని కోటిఉపాయములచేనైనను భవబంధన ములనుండి విముక్తి చేయకల వాడెవ్వడు? చరాచరజీవముల నన్నిటిని తనవశమును కావించుకొనిన మాయకును ఆ ప్రభువనిన భయమే. భగవానుడు తన భ్రుకుటీవిలానముచే మాయను నాట్యమాడించును. అట్టి స్వామిని విడిచి ఇంకెవ్వరిని భజింపనగునో తెలుపుడు. మన చాతుర్యమును విడిచి మనవాక్‌ కర్మలచే ఆతనిని భజించినచో రఘునాథుడు మనపై కృపచూపును.

ఇట్లు ప్రభువు బాలవినోదమును సలుపుచు నగరవాసులెల్లరకు ఆనందము కలిగించుచుండెను. కౌసల్య ఆతనిని ఒకప్పుడు ఒడిలో ఉంచుకొని ఆడించును. మరి ఒకప్పుడు ఊయెలలో పరుండబెట్టి ఊపును. ప్రేమమగ్నయైన కౌసల్యకు రాత్రులు, పవళ్లు ఎట్లు గడచుచున్నదో తెలియుటయే లేదు. పుత్రవాత్సల్యముచే ఆ తల్లి ఆ బాలుని చరితలమ గానము చేయుచుండును.

ఒకనాడు ఆమె అతనిని స్నానముచేయించి, సింగారించి, ఊయెలలో పరుండపెట్టెను. ఆమెయు స్నానము కావించెను. భగవానుని పూజకు సన్నద్ధమయ్యెను. ఆమె పూజచేసెను. నై వేద్యము సమర్పించెను. స్వయముగా వంటఇంటిలోనికి వెడలెను. ఆమె తిరిగి పూజామందిరమునకువచ్చి చూచునుకదా! ఇష్టదైవమునకు పెట్టిన నై వేద్యము రాముడు ఆరగించుచున్నాడు! కౌసల్య భయపడెను. ఊయలవద్దకు పరుగెత్తెను. బాలుడు ఊయెలలో యథాప్రకారము నిద్రించచున్నాడు. ఆమె పూజా గృహమునకు తిరిగివచ్చెను. ఆ బాలుడే ఇచ్చట ఆరగించుచున్నాడు. ఆమె హృదయము కంపించెను. మనోధైర్యము చలించెను.

''ఇక్కడ ఒక రాముడు! అక్కడ ఒక రాముడు! ఇరువురిని చూచితినే! ఇది నామతి భ్రమకాదుకదా! లేక మరి ఏదైన విశేషకారణమా?'' అని ఆమె తల పోయసాగినది. తల్లి యొక్క వ్యాకులతను తనయుడు కనుగొని మధుర మందహాసము చేసెను.

తన అఖండ, అద్భుతరూపమును ఆతడు తన తల్లికి చూపించెను. ఆతని ప్రతిరోమమున అనేకకొట్ల బ్రహ్మాండములున్నవి. అసంఖ్యాకులగు సూర్యులు, చంద్రులు, శివులు, చతురాననులు, అనేకపర్వతములు, నదులు, సముద్రములు, మహీతలములు, అడవులు. కాలములు, కర్మలు, గుణములు, జ్ఞానము, ప్రకృతి ఎన్నడూ కననివి. విననివి - ఎన్నో కానవచ్చినవి. సర్వవిధముల శక్తివంతమగు మాయ భయ కంపితయై చేతులు జోడించి నిలచిఉన్నది. మాయచే ఆడింపబడుచున్న జీవుని, ఆ జీవుని విముక్తి చేయుచున్నభక్తిని కౌసల్య కనుగొన్నది, తౌసల్య తనువు పులకరించెను. ఆమెనోట మాట వచ్చుటలేదు. కన్నులు మూసికొని ఆమె రామచరణములకు తలవంచి ప్రణమిల్లెను. తల్లియొక్క విస్మయమును కనుగొని ఖరారి తిరిగి శిశురూపమును ధరించెను. కౌసల్య స్తవమునైనను చేయలేకున్నది.

''జగత్పితను నా సుతుడనుకొంటిని! అని ఆమె భీతిచెందెను. హరి ఆమెను పలువిధముల ఓదార్చెను.

''అమ్మా, వినుము, ఈ విషయము ఎవ్వరికినీ తెలుపకూడదు సుమా!'' అని బాలుడు తల్లిని కోరెను.

కౌసల్య పదేపదే చేతులుజోడించి ''ప్రభూ, నీ మాయాప్రభావము ఎన్నడూ నాపై ప్రసరింపకుండునట్లు అనుగ్రహింపుము'' అని వినతి చేసెను.

హరి బహువిధముల తన బాలలీలలను కావించెను. తన దాసులకు మిక్కుటమగు ముదమును ఒసగెను. కొంతకాలము గడచెను. నలుగురు సోదరులు పెరిగి పెద్దవారై తమవారికెల్లరకు సుఖదాయకులైరి.

అంతట గురువు ఏతెంచి వారికి చూడాకర్మను కావించెను. విప్రులు మరల ఎన్నోదక్షిణలను పరిగ్రహించిరి, సుకుమారులగు ఆ రాకుమారులు పెద్దవారై, అపార, మనోహర చరితను సృష్టించుచు తిరుగుచుండిరి.

మనోవాక్‌కర్మలకు అగోచరుడగగు ప్రభువు దశరథుని ప్రాంగణమున విహరించుచున్నాడు.

భోజనసమయమున దశరథుడు తన కుమారుని పిలచును. చెలికాండ్రను విడిచి రాముడు రానేరాడు! ఆతనిని పిలచుటకు కౌసల్య వెడలును. వడివడిగా దగ్గర దగ్గరగా అడుగులువేయుచు ఆతడు పారిపోవును.

'నేతి-నేతి' అని వేదములు ఎవనిని నిర్వచించునో - ఎవని అంతమును శివుడే కనుగొనజాలకపోయెనో - అట్టి ఆతనిని ఆ తల్లి బలాత్కారముగా పట్టుకొనుటకు పరుగెత్తును. ఒడలంతయు దుమ్ముతో ఆతడు వచ్చును. భూపతి నవ్వి ఆతనిని తన ఒడిలో కూర్చుండపెట్టుకొనును. ఆతడు భోజనము చేయుచుండును. కాని ఆతని చిత్తము చంచలము. అవకాశముచూచి ఆతడు పెరుగుఅన్నమును నోటినిండా క్రుక్కుకొనును. హర్షధ్వనిచేయుచు ఆటు ఇటు పారిపోవును. అతి సరళము, మనోహరము అగు రాముని బాలలీలలను శారద, ఆదిసేషుడు, శంభుడు, వేదనములు గానము చేసినవి. ఈ లీలలయందు అనురక్తులు కాజాలని మనుజులను విధాత సృంజిచుట వృథా.

బాలురగు ఆన్నదమ్ములు కౌమారదశకు రాగానే గురువు, జననీ జనకులు వారికి యజ్ఞోపవీత సంస్కారము కావించిరి. విద్యాభ్యాసమునకై రఘురాముడు గురుని గృహమునకు అరిగెను. అల్పకాలముననే విద్యలన్నియు ఆతనికి అబ్బినవి.

చతుర్వేదములు ఎవ్వని సహజ శ్వాసమాత్రములో అట్టి హరి-విద్య నేర్చినాడు! ఎంత ఆశ్చర్యకర విషయమిది! సోదరులందరు విద్య, వినయ, శీలముల యందు నిపుణులైరి. రాజులు నేర్వవలయు విద్యలనన్నిటిని నేర్చిరి. కరముల శరచాపముల ధరించి వారు కడు శోభిల్లుచుండిరి. వారిరూపములను కనుగొనిన చాలు. చరాచరమెల్లయు సమ్మోహితమగును. అన్నదమ్ములు ఆటలాడుచు వీధులలో తిరుగుదురు. ఆ వీధులలోని స్త్రీలు, పురుషులు అందరు వారిని చూతురు. ఎక్కడివారక్కడ నిశ్చలులై నిలచిపోదురు! కోసలపురవాసలగు నరులకు. నారులకు-వృద్ధులకు, బాలురకు-వారి ప్రాణులకంటె ప్రియుడు - కృపాళుడగు రాముడు. ఆతడు తన తమ్ములను, సఖులను పిలచును. వెంటనిడుకొనును. నిత్యము అడవుల కేగును. వేటాడును. పవిత్రకృత్యముగా ఎంచి క్రూరమృగములను సంహహించును. వానిని తెచ్చి నృపాలునికి చూపును. రామబాణముచే వధింపబడినమృగములు తమ తనువులను త్యజించి సురలోకమునకు చనును! అనుజులతో, సఖులతో కలసి రాముడు ఆరగించును. జననీ జనకుల ఆనతిని పాలించును. అయోధ్యాపురప్రజలు సుఖులై ఉండునట్లు ఆ కృపానిధి లీలను కావించుచున్నాడు. వేదములను, పురాణములను ఆతడు మనసును లగ్నముచేసి శ్రవణము చేయును. అనుజులకు స్వయముగా బోధించును.

రఘునాథుడు ప్రాతఃకాలముననే నిద్ర మేల్కొనును. జననీ జనకులకు, గురునికి తలవంచి నమస్కరించును. వారి ఆజ్ఞలనుపొంది నగరకార్యకలాపములను నిర్వహించును. ఆతని నడవడికను కనుగొని రాజు అత్యంతసంతోషము పొందును.

సర్వవ్యాపకుడు, అవయవరహితుడు, ఇచ్ఛారహితుడు అగు భగవానుడు భక్తులకొరకై నానావిధములగు అలౌకిక చరిత్రను కావించుచున్నాడు. ఈ చరిత్ర అంతయు వర్ణించి గానము చేసితిని. ఇక తరువాతకథను శ్రద్ధగా వినుడు.

మహామునియు, జ్ఞానియు అగు విశ్వామిత్రుడు అడవిలో ఒక పవిత్రస్థలమున ఒక్క చక్కని ఆశ్రమమున నివసించుచండెను. జప, యజ్ఞ, యోగములను కావించుచుండెను. ఆ యజ్ఞములను కనుగొనగానే నిశాచరులు పరుగెత్తుకొని వత్తురు. అల్లరి చేతురు. ముని దుఃఖించును. మారీచ, సుబాహులనిన మునికి అతి భయము. ''పాపులగు ఈ నిశాచరులు శ్రీ హరిచేతనే కాని చావరు'' అని గాధిసుతుని మనమున చింతవ్యాపించెను. ''భూభారమును తొలగించుటకు ప్రభువు అవతరించెను. ఈ నెపమున నేను వెడలి స్వామి చరణములను దర్శింతును. వినతి కావించి సోదరుల నిరువురిని కొనివత్తును. జ్ఞాన, వైరాగ్య సకలగుణనిలయుడగు ఆ ప్రభుని నేను కన్నులార కనుగొందును'' అని ఆ మునివరుడు మనమున తలచెను. బహువిధమనోరథములను సృష్టించుకొనుచు ఆతడు శీఘ్రమే పయనమయ్యెను. సరయూనదిలో స్నానముచేసి ఆతడు దశరథుని ఆసానమును చేరెను. మునియొక్క రాకను విని విప్రబృందమును వెంటపెట్టుకొని దశరథుడు మునిని దర్శించుట కేగెను. మునికి సాష్టాంగనమస్కారము కావించి సన్మానించెను. ఆతనిని తోడ్కొనివచ్చి తన సంహాసనమున కూర్చుండ పెట్టెను. మునియొక్క చరణములను కడిగెను. బాగుగా పూజించెను.

''నావంటిధన్యుడు వేఱొకడు నేడు లేడు'' అని నుడివెను. వివిధవిధములగు పదార్థములతో మునికి విందుచేసెను. మునివరుడు హృదయమున అమితముగా ఆనందించెను.

దశరథుడు తన నలుగురు పుత్రులచే మునియొక్క చరమములకు మ్రొక్కించెను. రాముని కనుగొని ముని తన దేహస్మృతినే విస్మరించెను. పూర్ణచంద్రుని చూచిన చకోరమువలె రాముని వదనకాంతిని కనుగొనుచు ముని ఆనందనిమగ్నుడయ్యెను. దశరథుడు మనమున సంతపించి, ''మునివర్యా, ఎన్నడూ తమరు నా యందు ఇంతదయ చూపలేదు. తమ ఆగమనమునకు కారణమేమో తెలుపుడు. దానిని సఫలమొనర్చుటయందు జాగుచేయను'' అని వచించెను.

''రాజా, అసురసమూహములు నన్ను బాధించుచున్నవి. నిన్ను యాచింపవచ్చితిని. అనుజనమేతుడగు రఘునాథుని నాకు ఇమ్ము. వారు నిశాచరులను వధించిన పిదప నేను సనాథుడనగుదును. భూపాలా, హర్షమానసుడవై వారిని నాతో పంపుము. మోహమును అజ్ఞానమును వీడుము. ధర్మము, సత్కీర్తి నీకు కలుగును. ప్రభూ, వీరికి పరమకల్యాణమగును'' అని ముని నుడివెను.

అత్యంత అప్రియమగు ఈ మాటలచే రాజుయొక్క హృదయము కంపించెను. ముఖము కాంతివిహీనమయ్యెను. ''విప్రోత్తమా, వృద్ధాప్యమున నలుగురు సుతులను వడసితిని. తాము ఆలోచించి అడుగరైతిరి! భూమినో, గోవులనో, ధనమునో, కోశమునో - ఏదైనను కోరుడు. నా సర్వస్వమును నేడే అతి సంతోషమున ఇత్తును. దేహ, ప్రాణములకంటె ప్రియమగునవి ఏవియు ఉండవు. వానినైననుసరే ఒక్క క్షణములో నేను సమర్పింతును. నా సుతులెల్లరు నా ప్రాణసమానప్రియులు. వారి యందు రామునిమాత్రము - స్వామీ - ఇవ్వజాలను. అతిక్రూరులు, కఠోరులు అగు ఆ నిశాచరులెక్కడ? నా సుకుమార కుమారుడెక్కడా?'' అని దశరథుడు నుడివెను.

దశరథుని ప్రేమరసభరితములగు పలుకులను విని జ్ఞాని అగు విశ్వామిత్ర ముని యొక్క హృదయమున సంతోషము జనించెను. అంతట వసిష్టుడు రాజునకు పలువిధముల నచ్చజెప్పెను. దశరథుని సందేహము నశించెను. అత్యంత ఆదరమున తన ఇరువుర తనయులను ఆతడు పిలిపించెను. వారిని తన హృదయమునకు హత్తుకొని అనేకవిధముల బోధించెను.

''ఈ నా ఇరువురు పుత్రులు నా ప్రాణము, స్వామీ, ఇక వీరు మీసుతులు. మీరే వీరికి తండ్రి - వేఱవ్వరు కాదు''. అని దశరథుడు విశ్వామిత్రునితో వచించి, సుతులను పలురీతుల ఆశీర్వదించి, వారిని ఋషికి అప్పగించెను. పిదప ప్రభువు తల్లి యొక్క మందిరమునకు వెడలెను. తల్లియొక్క చరణములకు తలవంచి నమస్కరించి మునివెంట వెడలెను.

పురుషసింహులగు సోదరులిరువురు మునియొక్క భయమును తొలగించుటకై ఆనందమున పయనించుచున్నారు. కృపాసాగరులు, ధీరమతులు. అఖిల విశ్వకారణ కారణులు వారు! అరుణనయనములు, విశాలవక్షస్థలము, నిడువగుబాహువులు, నీలకమలము - తమాలవృక్షములవలె శ్యామశరీరము - కట్టిస్థలిని పీతాంబరము, రమణీయ తూణీరము, ఒకకరమున రుచిరమగు ధనువు మరియొకచేత బాణములతో భగవానుడు! శ్యామగౌరవర్ణులు. సోదరులు - రామలక్ష్మణులు సుందరమూర్తులు!

విశ్వామిత్రునికి మహానిధి లభించినది. ''ప్రభువు బ్రహ్మణ్యదేవుడు. నాకు తెలియును. నా కొరకు భగవానుడు తండ్రిని విడచి వచ్చినాడు!'' అని ఆ ముని తలచెను.

మార్గమున చనుచు ఆతడు తాటకిని రామునికి చూపెను. వారిశబ్దమును వినగానే ఆది క్రోధమున పరుగెత్తివచ్చినది. ఒకే ఒక బాణముతో రాముడు దానిప్రాణమును హరించెను. అది దీనురాలని తెలిసికొని దానికి ప్రభువు తన నిజపదమును ప్రసాదించెను.

రాముడు విద్యానిధి అని విశ్వామిత్రునికి తెలియును. ఐనను - ఆకలిదప్పులను పోగొట్టునది, శరీరమున అనన్యబల, తేజములను ప్రకాశింపజేయునట్టిది అగు విద్యను అతడు రామునికి ఉపదేశించెను. సకల ఆయుధములను ప్రభునికి సమర్పించి ముని శ్రీరాముని తన ఆశ్రమమునకు తీసికొని చనెను. రాముడు తన హితుడని గ్రహించి భక్తిపూర్వకముగా కందమూలఫలములను ఆహారముగా ముని సమర్పించెను.

ప్రాతఃకాలమయ్యెను. ''తమరు వెడలి నిర్భయముగా యజ్ఞమును కావించుడు'' అని రఘునాథుడు మునితో ఆనెను. ఆ మాటలు విని మునులెల్లరు హోమము కావింపమొదలిడిరి

రాముడు యజ్ఞమును రక్షించుచున్నాడు. ఈ విషయము విని - ముని ద్రోహి, క్రోధి అగు నిశాచరుడు మారీచుడు తన సహాయకులతో పరుగెత్తుకొని వచ్చెను. తల లేని ఒక శరమును రఘుపతి వానిపై ప్రయోగించెను. మారీచుడు-శతయోజన విస్తీర్ణమగు సాగరమునకు ఆవలిఒడ్డున పడెను. పావకాస్త్రమును సంధించి రాముడు సుబాహుని వధించెను. ఇంతలో రామానుజుడు నిశాచరసేనను సంహరించెను. ఇట్లు అసురులను సంహరించి రాముడు ద్విజులను నిర్భయులను కావించెను. దేవతలు, మునులు ఎల్లరు రాముని స్తుతించిరి.

రఘునాథుడు అచ్చట కొన్నిదినములుండి విప్రులపై కృప చూపెను. ప్రభునికి తెలిసినవైయైనను విప్రులు భక్తివశులై ఏన్నో కథలను నుడివిరి.

అనంతరము విశ్వామిత్రుడు సాదరముగా ''ప్రభూ, వెడలి ఒక చరిత్రను వీక్షింతము'' అనెను. రఘుకులస్వామి ధనుర్యజ్ఞమునుగురించి వినెను, హర్షముతో మునివరునివెంట చనెను.

మార్గమున ఒక ఆశ్రమము కానుపించెను. అచ్చట పశువులు, పక్షులు, జీవ జంతువులు ఏవియూ లేవు. ఒక శిలమాత్రము ఉన్నది. దానిని గురించి రాముడు మూనివరుని ప్రశ్నించెను. దాని చరిత అంతయు ముని వివరించెను.

''ఈమె గౌతముని భార్య, శాపవశమున రాయి అయ్యెను. కడు ఓర్పుతో - నీ చరణకమల రజమును కాంక్షించుచున్నది. రఘువీరా, ఈమెపై కృపచూపుము'' అని ఆ ముని రామునితో ఆనెను.

పావనము, శోకనాశనకరమగు రాముని చరణస్పర్శ పొందగానే యథార్థ తపోరాశిః అహల్య ప్రకటమయ్యెను. భక్తజన సుఖప్రదాత అగు రఘునాయకుని కనుగొని ఆమె చేతులుజోడించి ఆతని ఎదుట నిలచినది. అత్యంతప్రేమవివశ##యై ఆమె ధైర్యమును కోల్పోయినది. ఆమె తనువు పులకించెను. నోటమాట వచ్చుటడలేదు. పరమ భాగ్యశాలిని అగు అహల్య - రాముని చరణములను గ్రహించెను. ఆమె నయన యుగళమునుండి అశ్రుధార ప్రవహించుచున్నది. కొంతసేపటికి ఆమె మనస్సున ధైర్యము వహించినది. ప్రభుని గుర్తించినది. రఘుపతియొక్కకృపచే ఆమెకు భక్తి సంప్రాప్తించినది. అతి నిర్మలమగు వాణితో ఆమె ఇట్లు రఘునాథుని స్తుతించినది:-

''జ్ఞానగమ్యుడవగు రఘువరా - నీకు జయము. నేను స్త్రీని, అపవిత్రను. ప్రభూ, జగమును నీవు సావనమొనరింతువు. రావణారీ, భక్తసుఖప్రదాతా, రాజీవ లోచనా, భవభయమోచనా, నీ శరణుకోరి వచ్చితిని. నన్ను రక్షింపుము-రక్షింపుము ముని ఇచ్చినశాపము నా శ్రేయస్సునకే వచ్చినది. ఆది నాకు వరమఅనుగ్రహమే అని తలతును. దానివలననేకదా భవమోచనుడవగు శ్రీ హరిని నిన్ను కన్నులార కాంచితిని. వీ దర్శనమును శంకరుడు అత్యంతఫలప్రదముగా భావించును. ప్రభూ, నా వినతి ఒకటి. నా మతి కపట మెరుగదు. నాథా, నేను ఇక ఏ వరమునూ యాచించను నా మానసభ్రమరము నీ చరణకమలరజమను ప్రేమరసమును సదా పానముచేయునట్లు అనుగ్రహింపుము. ఇదే నేను కోరువరము. హరుడు శిరమున ధరించిన పరమ పావన సురనది ఏ చరణములనుండి ఆవిర్భవించెనో - ఏ పాదపంకజములను అజుడు పూజించునో - ఆ చరణములను కృపాళుడవగు నీవు నాశిరమున ఉంచితిని.'' ఇట్లు స్తుతించుచు గౌతమపత్ని పదేపదే శ్రీ హరియొక్కచరణములపై పడినది. ఆమె కోరినవరమును పొందినది. ఆనందభరితయై అహల్య తన పతిఉన్న లోకమునకు అరిగినది.

అట్టి దీనబాంధవుడు హరి! నిర్హేతుకకృపాళుడు! ఓయీ మూఢా, తులసీదాసా, కపటమును, జంజాటమును త్యజించుము - హరినే భజించుము.

రామలక్ష్మణులు మునివెంట నడచిరి. లోకపావని అగు గంగానదిని సమీపించిరి. సురసరి ఏ విధిని భూమిపై అవతరించెనో ఆ వృత్తాంతమంతయు వారికి గాధిసూనుడు వర్ణించెను. ఋషిసమేతుడై ప్రభువు గంగానదిలో స్నానము చేసెను. భూసురులకు వివిధదానములను ఇచ్చెను. మునిబృందముతోకలపి ఆనందమున ఆతడు బయలుదేరెను. శీఘ్రమే వారెల్లరు విదేహనగరమును సమీపించిరి.

ఆ పుర రామణీయకతను కనుగొని రామ లక్ష్మణులు అతి ఆనందమును పొందిరి. అమృతతుల్యమగు నీటితోనిండిన వాపీకూపములతో, నదులతో, సరస్సులతో, మణిసోపానములు కలిగిన తటాకములతో ఆ నగరము శోభిల్లుచున్నది. మకరందమును సేవించి మతైక్కిన తుమ్మెదలు మంజులమగు రొద చేయుచున్నవి. బహురంగుల విహంగములు కలరవములు సలుపుచున్నవి. రంగురంగుల కమలములు వికసించినవి. నిరంతరము సుఖమునిచ్చు త్రివిధవాయువులు వీచుచున్నది. అనేక పక్షులు నివసించు పుష్పవాటికలు, వనములు, ఉద్యానవనములు పుష్పించుచున్నవి. మనోహరమగు పల్లవములచే అలకంరింపబడిన ఆ నగరపు నాలుగుదిశలు రాజిల్లుచున్నవి. ఆపురసౌంద్యము వర్ణనాతీతము. ఎటు మరల్చినను మనసు సమ్మోహితమగును. సుందరమగు వీధులు, మణినిర్మితమై విచిత్రమగు గోడల పై భాగములు విరించియే స్వయముగా వానిని నిర్మించెనా అనునట్లున్నవి.

కుబేరునితో సమానులగు ధనికవ్యాపారులు, ద్రవ్యములనుతెచ్చి కూర్చుండిరి. నాలుగువీధులు కలియు సుందరప్రదేశములు, చక్కని వీధులు సుగంధములు చల్లబడిసదా ఘుమఘును లాడుచున్నవి. మందిరములన్నియు మంగళమయమై ఉన్నవి. వానిపై చిత్రములు మొలచినట్లు చిత్రింపబడినవి. కామదేవుడే వానిని చిత్రించెనా అనిపించును. నగరమునందలి స్త్రీలు, పురుషులు అందరూ సుందరులు, పవిత్రులు, సాధువులు, ధర్మశీలురు, జ్ఞానులు, గుణవంతులు,

జనకుని అతి రమణీయ భవనవైభవమును కనుగొని దేవతలు సహితము నిశ్శేష్టులగుదురు. రాజమందిరపు బురజులను చూచినచో మనస్సు ఆశ్చర్యము చెందును. సకలభువనశోభను ముట్టడించినవా అవి? తళతళలాడు ఆ మందిరమున నానావిధముల రమ్యముగ అలంకరింపబడిన మణిజటిత బంగారు జరీతెర లున్నవి. సీత నివసించు ఆ సుందర మందిరశోభను వర్ణించుట ఎట్లు? రాజభవనమునకు అతి రమణీయమగు ద్వారములు. వానికి-వజ్రములతో ధగధగమెరయు కవాటములు. సామంత రాజులు, నటులు, భటులు, కవులు, వందిమాగధబృందములు వానివద్ద గుమికూడి ఉందురు.

గుఱ్ఱములు, ఏనుగులు నివసించుటకు విశాలమగు శాలలున్నవి. అవి ఎల్లప్పుడు ఏనుగలతో, అశ్వములతో నిండియే ఉండును. శూరులు, సచివులు, సేనాపతులు అనేకులున్నారు. వారి సదనములు సహితము రాజమందిరములనుపోలియే ఉన్నవి. నగరమునకు వెలుపల అచ్చటచ్చట సరస్సులవద్ద, నదీతీరమున రాజులు వీడిది చేయుచున్నారు.

అనుపమమగు ఒక మామిడితోట అచ్చట కలదు. సకలవిధముల మనోహరమైన ఆ తోటవద్ద సర్వసౌకర్యములు ఉన్నవి.

''రఘువీరా, సజ్జనుడా, మనము ఇక్కడ విడిదిచేయులో బాగుండునని నాకు తోచుచున్నది'' అని కౌశికుడు అనెను. ''స్వామీ, మంచిది'' అని కృపానిలయుడు రాముడు నుడివెను. ముని సమూహముతో సహా రామలక్ష్మణులు ఆ ప్రదేశమున వసించిరి.

విశ్వామిత్ర మహాముని విచ్చే సెననువార్త మిథిలాపితికి చేరెను. వెంటనే జనకుడు పవిత్రహృదయులగు సచివులను, అనేక సైనికులను, భూసురులను, గురువులను, జ్ఞాతులను వెంటపెట్టుకొని, ముదితహృదయుడై మునినాయకుని దర్శించుటకు అరిగెను. విశ్వామిత్రుని చెరణములపై తన శిరమునువంచి ఆతడు ప్రణామము చేసెను. మునినాయకుడు ముదితుడై జనకుని ఆశీర్వదించెను. విప్రబృందమునకు అందరికి జనకుడు సాదరముగా వందనము కావించెను. ''నా భాగ్యమే మహాభాగ్యమ''ని ఆనందించెను పలుమారులు కుశలప్రశ్నములడిగి జనకుని విశ్వామిత్రుడు ఆసీనుని చేసెను.

పూదోటను సందర్శింపనేగిన సోదరులిరువురు అదేసమయమున అరుదెంచిరి. సుకుమారులగు ఆ కిశోరులయందు శ్యామవర్ణుడు ఒకడు. గౌరవర్ణుడు మరి ఒకడు, వారిని చూచిన కన్నులపండువగును. విశ్వచిత్తచోరులు వారు. రఘఘుపతి రాగానే అందరు లేచి నిలచిరి. విశ్వామిత్రుడు రాముని తనవద్ద కూర్చుండపెట్టుకొనెను. అన్నదమ్ము లిరువురినిచూచి అందరు ఆనందమును పొందిరి. అందరి కన్నులనుండి ఆనంద బాష్పములు ప్రవహించినవి. వారిశరీరములు పులకించినవి. రాముని మధుర, మనోహరమూర్తిని కనుగొని విదేహభూపాలుడు అత్యంతవిదేహు డయ్యెను. తన మనస్సు ప్రేమమగ్నమైనట్లు గ్రహించి జనకుడు వివేకమును తెచ్చుకొని ధైర్యము వహించెను. మునియొక్క పాదములకు వందనమిడి. గద్గద, గంభీరవచనములను ఆతడు ఇట్లు వచించెను:--

''స్వామీ, సుందరులగు ఈ ఇరువురు బాలకులు మునికులతిలకులా? లేక నృపకుపాలకులా? లేక, వేదములు ఎవనిని 'నేతి-నేతి' అని వర్ణించినవో ఆ బ్రహ్మమే ఈ జంటరూపమున ఏతెంచెనా? తెలుపుడు. సహజముగనే నా ముస్సు వైరాగ్య స్వరూపమైనను - చంద్రుని కనుగొనిన చకోరమువలె అది ఇట్లు పరవళమగు చున్నదే! ప్రభూ, కపటరహితముగా అడుగుచున్నాను. మర్మమువిడిచి తెలుపుడు. వీరిని చూచినంతనే నా మనస్సు అతి ప్రేమవశమయ్యెను. అది నిర్బంధముగ బ్రహ్మానందమునే త్యజించినది.''

అంతట విశ్వామిత్రుడు నవ్వి, ''రాజా, నీవు యథార్థమునే వచించితివి. నీ పలుకులు అసత్యము కానేరవు. సర్వప్రాణులకు వీరు ప్రియులు'' అనెను. ముని యొక్క పలుకులను విని రాముడు మందహాసము చేసెను.

''రఘుకులమణి అగు దశరథుని పుత్రులు వీరు. నా హితమునకై ఆ భూపాలుడు వీరిని నావెంట పంపినాడు. ఈ ఇరువురు రా లక్ష్మణులను సోదరవరులు, రూప, శీల, బలధాములు. రణమున వీరు రాక్షసులను సంహరించి నా యజ్ఞమును సంరక్షించిరి. సకలజగము దీనికి సాక్షి'' అని విశ్వామిత్రుడు నుడివెను.

''మునీశ్వరా, నీ చరణసందర్శనము కావించకలిగిన నా పుణ్యప్రభావమును వర్ణింపజాలను. శ్యామ, గౌరవర్ణులు, సుందరులు అగు ఈ సోదరులు ఆనందమునకే ఆనందప్రదాతలు'' అని జనకుడు పలికెను.

వీరి పరస్పర ప్రేమ కడు పవిత్రమైనది. సుందరమైనదియును. అది మనములను ప్రకాశింపచేయును. దానిని మాటలలో వర్ణింపజాలము'' అని ముని వచించెను.

జనకుడు ఆనందించి ''స్వామీ, జీవాత్మకు, పరమాత్మకువలె వీ రిరువురియందు సహజప్రేమ కలదు'' అనెను. అతడు పదేపదే ప్రభుని వీక్షించును. పులకితగాత్రుడగును. అతనిహృదయమున అధికోత్సాహము కలుగుచున్నది. మునిని ప్రశంపించి. ఆయన చరణములకు శిరమువంచి నమస్కరించి వారినెల్లరను తోడ్కొని జనకుడు నగరము కేగెను. సర్వకాలములయందును సుఖదమగు ఒక సుంరమందిరమునకు వారిని తీసికొని వెడలి అచ్చట-వారికి విడిది ఏర్పాటు చేసెను. మునికి సకలవిధములగు పూజలను, సేవలను కావించి జనకుడు సెలవుగైకొని తన భవనమునకు అరిగెను.

రఘువంశమణి - శ్రీరాముడు ఋషులతోకలసి ఆరగించి విశ్రమించెను. పిదప సోదరసహితుడై కూర్చుండెను. సూర్యాస్తమయమునకు ఇంకొకజాము ఉన్నది. జనకపురిని దర్శింపవలెనని లక్ష్మణుడు ఉవ్విళ్ళూరుచున్నాడు. అతనికి రాముడేమనునో అనుభయము. మునియొక్క అనుమతిని కోరుటకు సంకోచము! ఆతడు బహిరంగముగా ఏమియు చెప్పలేక తనలో తాను చిరునవ్వు నవ్వుకొనుచుండెను. తమ్ముని మానస స్థితిని రాముడు గ్రహించెను. ఆతని హృదయమున భక్తవాత్సల్యము ఉప్పొంగెను. గురుని ఆనతినిగైకొని, వినయమున, సంకోచమున. చిరునవ్వు నవ్వుచు ఆతడు ''స్వామీ, నగరమును సందర్శించవలెనని లక్ష్మముని కోర్కె, భయముచే, లజ్జచే తన కోరికను అతడు స్పష్టముగా చెప్పలేకున్నాడు. తమ ఆజ్ఞయైనచో ఇతనికి నగరము చూపించి వెంటనే తిరిగి తీపికొనివత్తును'' అనెను. ఈ మాటలు విని మునీశ్వరుడు ప్రేమయుతుడై ''రామా, నీవు ధర్శప్రతిష్టలను తెలిసినవాడవు. నీతిని పరిరక్షించువాడవు. నాయనా, ప్రేమవశుడవై సేవకులకు సుఖము నిత్తువు. సుఖనిలయులగు మీ రిరువురు సోదరులు వెడలి నగరమును దర్శించిరండు. మీ సుందరవదనములను చూపించి సకలజనుల నయనసాఫల్యమును కావించి రండు'' అని వచించెను.

ఆఖిలలోక నయనానందకరులగు సోదరు లిరువురు మునియొక్క పాదములకు వందనమొనర్చి వెడలిరి. నగరమునందలి బాలకబృందములు వారి సౌందర్యమును. శోభను వీక్షించి, వారివెంట నడువసాగిరి. ఆ బాలకుల మనస్సులు, నేత్రములు సమ్మోహితము లయ్యెను.

సోదరులిద్దరు పీతవస్త్రధారులు. వారి నడుముల అమ్ములపొదులు. కరముల- శోభిల్లు సుందరధనుర్పాణములు. శరీరఛాయకుతగిన చక్కని చందనత్రిపుండ్రములు. శ్యామల గౌరవర్ణములకు మనోహరముగా జత కుదిరినది. సింహమువంటి కంఠములు, విశాలమగు భుజములు. వక్షస్థలముల అతి రమ్యమగు నాగమణి మాలలు, సుందర, అరుణ కమలనేత్రములు, తాపత్రయమునుండి విముక్తినిచ్చు చంద్రవదనములు. శోభనిచ్చు సువర్ణ కర్ణపుష్పములు. చూచువారల చిత్తములను దోచుకొనునట్లున్నవి. కడుమనోహరవీక్షణములు. కమనీయమై వక్రమైఉన్న కనుబొమలు. నుదుట తిలక రేఖలు సౌందర్యమును ముద్రించినట్లు సుందరముగా ఉన్నది. తలలపై నాలుగుకోణములు టోపీలు. నల్లనై ఉంగరములుతిరిగిన కేశములు. సోదరులిరువురు నఖశిఖ పర్యంతము సుందరులు. అవయవములకు, ఆకృతికి తగినశోభ!

రాకుమారులు నగరమును వీక్షించుటకు వచ్చిరనువార్త తెలియగనే పురవాసు లెల్లరు తమ ఇండ్లు వాకిండ్ల ను మరచిరి. పనులనన్నిటిని కట్టిపెట్టిరి. దరిద్రులు ధనాగారమును దోచుకొనుటకు పోవునట్లు పరుగిడిరి. సహజసుందరులగు సోదరు లిద్దరినిచూచి నగరవాసులు నేత్రసాఫల్యముపొంది సంతపించిరి. యువతులు తమ భవన గవాక్షములనుండి అనురాగసహితులై రాముని రూపమును పరికించుచున్నారు.

''సఖీ, కోటి కామదేవుల సౌందర్యమును మించినదే వీరిసౌందర్యము. సుర, నర, అసుర, నాగ, మునులయందు ఇట్టిశోభ ఎచ్చటనూ విననైనను రాదుకదే! విష్ణువునకు చతుర్భుజములు. విరించికి నాలుగు మొగములు. పురారికో! వికటవేషము. పంచముఖములు. ఈ అన్నదమ్ముల సొబగును పోల్చుటకైనను వేఱు దేవతలెవ్వరూ లేనే లేరే! పిన్నవయస్కులు. సౌందర్యధాములు. శ్యామల, గౌరవర్ణులు. సుఖనిలయులు. వీరి ప్రతి అవయవమునకు శతకోటి రతీ దేవలు దిగదుడుపుకదే! ఈ రూపములను కనుగొని మోహితులు కానివా రెవ్వరుందురే. చెప్పవే చెలియా'' అని ఒక సఖియ ప్రశ్నించుచున్నది.

ఇంకొక సఖియ ప్రేమయుతముగా, మృదువగు వచనములను ఇట్లు నుడువుదున్నది.

''ఓపీ వివేకవతీ, నేను విన్నది తెలుపుదునే వినవే. బాలరాజహంసలవలె సుందరులగు ఈ జంట దశరథుని సుతులటవే! విశ్వామిత్రుని యాగమును సంరక్షించినవారు వీరేనట! యుద్ధమున రాక్షసులను పరిమార్చినదియు వీరేనట! అదిగో, ఆ శ్యామలగాత్రుడు. సుందర కమలనయనుడు. మారీచ సుబాహుల మదమును అణచినవాడు, ఆనందనిధి, ధనుర్బాణపాణి - ఆతడేనే కౌసల్యతనయుడు. ఆతనిపేరే రాముడు! అల్లదిగో ఆ గౌరవర్ణుడు, బాలుడు. సుందరవేషధారుడు. శరచాపధారియై రాముని వెనుక నడచుచున్నవాడు - అతడేనే రామునితమ్ముడు - లక్ష్మణుడు. సఖీ, వినవే, అతని జననియే సుమిత్ర. విప్రుడగు విశ్వామిత్రునికార్యమును సఫలమొనర్చి ఆ అన్నదమ్ము లిద్దరు మార్గమున మునిపత్నిని ఉద్ధరించి చాపమఖమును వీక్షించుటకు వచ్చిరే వారు!''

ఈ మాటలు విని స్త్రీలందరు ఆనందించిరి. రాముని సౌందర్యమును తిలకించిన ఒక చెలియ అనినది:-- 'జానకికి తగినవరుడు ఇతడేనే. సఖీ, నరనాథుడు ఈతనిని చుచెనా! తన ప్రతిననువదలి తప్పక ఈతనికే జానకినిచ్చి పెండ్లిచేయునే' అని, మరి ఒక సకియ ''జనకమహారాజు వీరీని గుర్తించినాడు, మునిసమేతముగా వీరిని సాదరముగా సన్మానించినాడు. కాని, సకియా, రాజు తన ప్రతినను వదలనేలేదు. విధివశమున అతడు అవివేకి అయ్యెనే!'' అని పలికినది.

వేఱొకతె ''విధాత మంచివాడే అగుచో - సర్వులకు తగు ఫలము నిచ్చునని విందుము. జానకికి ఈ వరుడే లభించును. దీనిలో సందేహమేమియు లేదు. విధివశమున ఈ అదృష్టమే సంభవించినచో లోకులెల్లరు కృతకృత్యులగుదురు. ఈ సంబంధమునైనను వీరు ఎప్పుడైనను ఇచ్చటకు వత్తురే! ఈ వివాహమే జరుగనిచో, సఖీ, మనకు వీరిదర్శనము దుర్లభము. మన పూర్వపుణ్యము మంచిదైనచో దైవికముగా ఇది జరిగితీరునే'' అని వచించినది.

ఇంకొక ఆమె ఇట్లు పలికినది:--''బాగుగా నుడివితివే సఖీ, ఈ వివాహమే ఎల్లరకు పరమహితుము.''

మరి ఒక మగువ:--''శంకరచాపము కరోరముకదే! ఈ బాలుడో-శ్వామల మృదుగాత్రుడు! సుకుమారుడ. ఇది అంతయు అసమంజనమే - బుద్ధిమతీ,'' అని అనినది.

ఈ పలుకులు విని ఇంకొక సఖి ఇట్లనినది మృదువగా. ''ఈ విషయమై వారునూ వీరునూ ఏమనిరో వింటివా? చూచుటకు బాలకులే కాని - వీరిప్రభావము ఘనమేనని. మహాపాపి అగు అహల్య ఈతని పాదపంకజమును స్పృసించియేకదా తరించినది! ఇట్టి వీరు-శివధనువును భంగపరచక ఉందురటే? పొరపాటుననైనను ఈ విశ్వాసము వీడరాదు. చతురతతో సీతను సృష్టించిన ఆ చతురాననుడే యోచించి ఈ శ్యామసుందరుడగు వరునికూడా సృజించెనే!''

ఈ మాటలువిని అందరు ఆనందించిరి. ''అట్లే అగుగాక'' అని మృదువచనములు పలికిరి.

సునయనలు, సుందరవదనలు అగు వనితలు తండోపతండములుగా, సంతోష హృదయలై పూలను వెదజల్లిరి. సోదరులిరువురు నడచిన స్థలములయందెల్ల పరమానందము వెల్లివిరియుచున్నది.

రామ లక్ష్మణులు నగరము తూర్పువైపునకు ఏగిరి. ధనుర్యజ్ఞమునకు రంగస్థిలి అచ్చటనే సిద్ధము చేయబడుచున్నది. అతి వెడల్పు-పొడవు కలిగిన చక్కని ఏటవాలు స్థలమున - సుందరము, నిర్మలము అగు వేదిక నిర్మింపబడినది. నాలుగువైపుల విశాలమగు ఎత్తయిన, పెద్ద పెద్ద బంగారు ఆసనములున్నవి. వానిపై భూపాలురు ఆసీనులగుదురు. వానివెనుక సమీపముననే నాలుగువైపుల పీఠములు, మండలాకారమున, చుట్టునూ కొంచెము ఎత్తుగా, సుందరముగా ఉన్నవి. నగరవాసులు వానిపై ఆసీనులగుదురు. వానిసమీపముననే విశాల, రమణీయ, పరిశుద్ధస్థానములు అనేకరంగులతో విరాజిల్లుచున్నవి. స్త్రీలెల్లరు వారివారి వంశములననుసరించి యోగ్యమగురీతిని వానియందు ఆసీనులై తిలకింతురు.

వింథిలాపుర బాలురు మృదువచనములను ఎన్నో పలుకుచు యజ్ఞశాలయొక్క నిర్మాణమును ప్రభునికి సాదరముగా వర్ణించుచున్నారు. చూపూచున్నారు. ఈ నెపమున బాలకులెల్లరు ప్రేమవశులై రాముని మనోహరశరీరమును స్పృశించి, పులకితులగు చున్నారు. రామ లక్ష్మణులనుచూచి, చూచి వారి హృదయములు మహా ఆనందమును పొందుచున్నవి. బాలు రందరిప్రేమను రాముడు కనుగొనెను. ప్రీతియుతుడై యజ్ఞ స్థలమును ఆతడు కొనియాడెను. వారివారికి ఇష్టమగువానినిచూపి 'చుడు'డని ఆ బాలకులు రామ లక్ష్మణులను పిలచుచున్నారు. ప్రేమసహితులై రామ లక్ష్మణులు ఆ బాలురవెంట చనుచున్నారు.

ఎవని ఆజ్ఞచే నిమిషమాత్రమున మాయభువన సమూహములను సృష్టించునో అట్టి ఆతడు మృదు, మధుర, మనోహరవచనములు పలుకుచూ తన తమ్మునికి యజ్ఞ భూమియొక్క నిర్మాణమును వర్ణించినాడు. దీనదయాళుడు భక్తివశుడై ధనుర్యజ్ఞశాలను చకితుడై వీక్షించినాడు. కౌతుకమునంతటిని కనుగొని రామ లక్ష్మణులు గురునివద్దకు మరలివచ్చిరి. ఆలస్యమైనదని గ్రహించి భయపడిరి.

ఎవనియందలి భయమువలన - భయమునకే భయము కలుగునో అట్టిప్రభువు భక్తియొక్క ప్రభావమును చూపుచున్నాడు. మృదు, మధుర, సుందరవచనములను పలికి రాముడు - బాలకులను బలవంతముగా పంపివైచెను. భయ, ప్రేమ, వినయ, సంకోచములతో సోదరులిరువురు గురుపాదపంకజములకు వందనమొనరించిరి. గురుని ఆనతినిపొంది కూర్చుండిరి.

నిశి ప్రవేశించెను. విశ్వామిత్రముని ఆనతి ఇచ్చెను. అంతట అందరు సంధ్యా వందనము కావించిరి. పురాణకథలతో, ఇతిహాసములతో రాత్రి రెండుజాములు గడచెను. మునివరుడు శయనించెను. రామ లక్ష్మణులు మునిచరణములను ఒత్తుచుండిరి.

ఎవరి చరణసరోరుహస్పర్శన, సందర్శనలకై విరాగులు వివిధవిధములగు జప, యోగములను సలుపుదురో అట్టి ఆ ఇరువురు సోదరులు - భక్తివశులై ప్రేమ పూర్వకముగా గురుపాదకమలములను ఒత్తుచున్నారు! ''ఇక చాలు, పోయి నిద్రించుడు'' అని పలుమారులు ముని ఆనతి ఇచ్చినపిదప రఘువరుడు వెడలి శయనించెను.

రాముని చరణములను తన మనమున ధ్యానించుచు ప్రేమతో, భయముతో - పరమసుఖమును అనుభవించుచు లక్ష్మణుడు ఆ పాదములను ఒత్తుచుండెను. అనేక పర్యాయములు ''నాయనా, పోయి నిద్రించుము'' అని రాముడు చెప్పినతరువాత లక్ష్మణుడు అన్నపాదములను హృదయమున ధరించి నిద్రించెను.

రాత్రి గడచెను. కోడికూత చెవిని పడగానే లక్ష్మణుడు మేల్కొనెను. జగత్పతి, చతురుడు, రాముడు గురువు నిద్రలేనకపూర్వమే మేల్కొనెను. శౌచకృత్యములు నెరవేర్చుకొని రామ లక్ష్మణులు వెడలి స్నానముచేసిరి, నిత్యకర్మలను కావించిరి. విశ్వామిత్రునికి నమస్కరించిరి. పూజాసమయమును గుర్తెరిగి, గురుని ఆనతిని పొంది సోదరులిరువులు పూవులు తెచ్చుటకు వెడలిరి. జనకభూపాలుని రమణీయ ఉద్యానవనమును వారు దర్శించిరి. ఆ వనమున వసంతఋతువు సమ్మోహితయై నిలచి పోయినది. మానసమును చూరగొను నానావృక్షములు అచట ఉన్నవి. రంగురంగుల ఉత్తమలతామండపములు అల్లుకొని ఉన్నవి. నవపల్లవ. ఫల, పుష్ప సంభరితములగు ఆ సుందరతరు శోభను కనుగొని కల్పవృక్షములు సిగ్గుపడవలసినదే! చాతకపక్షులు. కోయిలలు, చిలుకలు, చకోరములు మొదలగుపక్షులు మధురస్వనమును కావించుచున్వవి. మయూరములు నృత్యము చేయుచున్నవి. ఉద్యానవనమునకు మధ్య ఒక సుందర సరోపరము శోభిల్లుచున్నది. దానికి విచిత్రముగా నిర్మింపబడిన సోపానములు. దానియందలి జలము నిర్మలముగా ఉన్నది. అనేకరంగుల కమలములు ఆ సరోవరమున వికసించి ఉన్నవి. అందలి జలవిహగములు కలరవమును నలుపుచున్నవి. తుమ్మెదలు రొద చేయుచున్నవి. ఆ ఉద్యానవనమును. సరోవరమును కాంచి రామ లక్ష్యణులు ఆనందించిరి.

జగదానందకారకుడగు రామునికే ఆనందము చేకూర్చిన ఆ ఉద్యానవనము ఎంత రమణీయమైనదో! ఉద్యానవనమునకు నాల్గువైపులను దృష్టినిగిడ్చి చూచి తోటమాలులను ప్రశ్నించి తెలిసికొని రామ లక్ష్మణులు ముదితమనస్కులైరి. పత్రములను. పుష్పములను కోయ మొదలిడిరి. అదేసమయమున సీత అచ్చటికి అరుదెంచెను. గిరిజను పూజించిరమ్మని తల్లి ఆమెను అచ్చటికి పంపించెను. జానకివెంట ఆమె సకియులు సుందర తరుణీమణు లున్నారు. మనోహరగాత్రములతో వారు గానము చేయుచున్నారు.

సరోవరమునకు సమీపముననే గిరజాదేవి ఆలయము సుశోభితమై ఉన్నది. దానిని వర్ణింప తరముకాదు. చూచిననే చాలు. మనస్సు సమ్మోహితమగును.

సభీ సమేతయై సీత సరస్సున స్నానము చేసెను. ఆనందమున ఆమె గౌరీ మందిరమునకు ఏగెను. అత్యంత అనురాగమున ఆమె దేవిని పూజించెను. తనకు తగిన సుందరుని వరునిగా ప్రసాదించుమని ఆమెను వరమడిగెను. ఇంతలో ఒక నకియ సీతనవదలి పూదోటను దర్శింప ఏగెను. రామ లక్ష్మణులను ఆమె చూచెను. ప్రేమ వివశురాలయ్యెను. సీతవద్దకు తిరిగివచ్చెను. చెలులెల్లరు ఆమెస్థితిని కనుగొనిరి. ఆమె శరీరము పులకరించుచున్నది. కన్నులు నీరు కారుచున్నవి. ''ఇంత ఆనందమునకు కారణమేమే?'' అని అందరు కోమలమగు వాణితో ప్రశ్నించిరి.

''ఉద్యానవనమును చూచుటకై ఇరువుర రా కొమరులు విచ్చేపిరి. వారు బాలకులు. అన్నివిధముల అందగాండ్రు, శ్యామలవర్ణుడు ఒకడు. గౌరవర్ణుడు మరి ఒకడు. వారిని ఎట్లు వర్ణింపగలను? వాణికి కన్నులు లేవు. కన్నులకు వాణి లేదు!'' అని ఆమె ప్రత్యుత్తర మిచ్చినది.

యువతులగు చెలియలందరు ఆ పలుకులను వినిరి. సీతయొక్క హృదయమున జనించిన ఉత్కంఠతను వారు గ్రహించిరి. వారిలో ఒకతె:--''సఖీ, నిన్ను విశ్వామిత్రునితో రాకుమారులు వచ్చిరని వింటిమే - వారేనే వీరు! నగరమునందలి స్త్రీ, పురుషుల నెల్లరను తమ రూపలావణ్యములచే సమ్మోహితులను చేసి వశపరచుకొనిరటవారు! ఎక్కడచూచినను ప్రజలు వారి సౌందర్యమునే వర్ణించుచున్నారట! ఆవశ్యము మనము వెడలి వారిని చూడవలెనే! చూడతగినవారట ఆ ఇరువురు!'' అని అనెను. ఆమె మాటలు సీతకు అత్యంత ప్రీతికరములయ్యెను. రాకుమారుల సందర్శనకై ఆమె కన్నులు తహతహలాడుచున్నవి. ఆ ప్రియసఖిని తనముందు ఉంచుకొని సీత నడచెను. ఆ పురాతన ప్రేమనుగురించి ఎవ్వరికీ తెలియదు.

నారదుని పలుకులు సీతకు గుర్తు వచ్చెను. ఆమెమనసున పవిత్రప్రేమ ఆవిర్భవించెను. చకితయై ఆమె నలుదెసల - బెదరిన లేడిపిల్లవలె చూచుచున్నది.

కంకణ కింకిణీ నిస్వనమును, నూపురరవమును రాముడు వినెను. ''విశ్వమును జయించవలెనని మదనుడు తన మనమున సంకల్పించి దుందుభిని మ్రోగించెనేమో!'' అని ఆతడు లక్ష్మణునితో ఆనెను. ఆతడు వెనుకకు తిరిగి ఆ శబ్దము వచ్చువైపునకు చూచెను. సీతా ముఖచంద్రుని - రాముని నయన చకోరములు వీక్షించినవి. ఆ సుందర నేత్రములు అచంచలమయ్యెను. సిగ్గుపడి నిమి రాముని కనురెప్పలను విడచి చనెనో అని పించుచున్నది. సీతయొక్క సౌందర్యమును వీక్షించి రాముడు ఆనందమగ్నుడయ్యెను. తనలో తాను ఆశోభను ప్రశంసించుచుండెను. ఆతని నోటినుండి మాట వచ్చుటలేదు. విరించి తన నై పుణ్యమునంతను మూర్తీభవింపచేసి లోకమునకు ప్రకటించెనో అనునట్లున్నది. - సీతయొక్క సొబగు! సౌందర్యమునకే అది లావణ్యమును చేకూర్చును. సౌందర్యమును భవనము సీతయొక్కశోభ అను దీపకాంతితో తళుకు తళుకుమనుచున్నది. ఉపమానములన్నిటిని కవులు అసత్యము కావించినారు. విదేహకుమారిని ఎవరితో పోల్చగలను నేను?

సీతయొక్క లావణ్యమును తన మనసున వర్ణించుకొనుచు తన స్థితినిగురించి యోచించుచు ప్రభువు పవిత్రమానసుడై సమయోచితమగు పలుకులను ఇట్లు అనుజునితో పలికెను.

''తమ్ముడా, ఈమెయే జనకసుత. ధనుర్యజ్ఞము జరుగనున్నది ఈమెకొరకే. నఖులు ఈమెను గౌరీపూజకై తీసకొనివచ్చిరి. పూదోటను ప్రకాశింపచేయుచు ఈమె విహరించుచున్నది. ఈమెయొక్క అలౌకికసౌందర్యమును కాంచి సహజపవిత్రమగు నా మనస్సు కలత చెందినది! దీనికారణము నిధాతకే తెలియును. సోదరా, నా కుడి అవయవములు శుభసూచకముగా అదరుచున్నవి. రఘువంశజులు పాదము కుపథమున ఎన్నడూ మోపలేదు. ఇది వారి సహజస్వభావము. నా మనస్సు స్వప్నముననైనను పరనారిపై దృష్టిమరల్చి ఉండలేదు. ఈ విషయమై నాకు సంపూర్ణ విశ్వాసమున్నది.

సమరమున శత్రువులకు వెన్ను చూపని, పర స్త్రీలపై దృష్టి ప్రసరించిని బిచ్చమిడక యాచకుని తరుము నరవరులు లోకమున కొలదిమంది మాత్రమే కలరు.''

ఇట్లు తమ్మునితో మాటలాడుచునే ఉన్నాడు రాముడు. ఆతనిమానసము సీతయొక్క స్వరూపమునందే మగ్నమై ఉన్నది. సీతా ముఖసరోజశోభ - మకరందమును రాముని మానస మధుపము ఆస్వాదించుచున్నది. సీత చకితయై నలుదెసలను చూచెను. 'ఆ నృపకిశోరుడు ఎచ్చట?' అనుకొని ఆమె చింతించెను. బాలమృగనయని అగు సీత దృష్టి ప్రసరించినచోట్ల ఎల్లయు శ్వేతకమలశ్రేణి వర్షించుచున్నదా అనునట్లున్నది.

అతంట, లతలచాటునఉన్న శ్యామల, గౌరవర్ణ సుందర రాకుమారులను చెలియలు సీతకు చూపించిరి. వారిరూపములను తలకించి ఆమె కన్నులు తమనిధిని కనుగొని పరవశమయ్యెను. రఘుపతియొక్క లావణ్యమునుకాంచి ఆమె నేత్రములు నిశ్చలము లయ్యెను. కనురెప్పలు కదలుటలేదు. పొంగి పొరలు ప్రేమచే ఆ మెశరీరము శరచ్చంద్రుని వీక్షించు చకోరివలె విహ్వలమయ్యెను. కన్నులద్వారా ఆ తరుణి తన హృదయములోనికి రాముని ఆకర్షించుకొనెను. కనురెప్పలను కవాటములను ఆమె ముసి రాముని తన హృదయమున పదిలముగా బంధించెను.

ఆమె ప్రేమవశ##యైనట్లు చెలియలు గ్రహించిరి. సిగ్గుచే వారేమియు మాటాడలేకున్నారు. ఆ సమయమున మబ్బుతెరలను తొలగించుకొని చందురు లిరువురు వెలు వడినట్లు రామ లక్ష్మణులు లతావితానములనుండి వెలువడిరి.

సోదరులు ఇరువురు సౌందర్యమునకు అవథులు. వారి శరీరములో! నీలకమలమువలె ఒకటి. పీతజలజమువలె ఇంకొకటి. శిరములపై నెమలిపింఛములు. పింఛములమధ్య పుష్పగుచ్ఛములు. నుదుట తిలకము, స్వేదబిందులు. చెవులకు-కాంతిని వెదజల్లు రమణీయ ఆభరణములు. వట్రువలగు కనుబొమలు, ఉంగరములు తిరిగిన కేశములు, నవసరోజములను పోలు అరుణనయనములు. సుందరమగు చుబుకములు. రమ్యములగు నాపికలు, కపోలములు, మనస్సులను హరించు మందహాసవిలాసము. వర్ణనాతీతమగు ముఖకాంతి. చూచిన చాలు! వేయిమంది కామదేవుల సిగ్గుపడవలసినదే! ఉరముల మణిమాలలు, సుందర కంబుగ్రీవములు. కాముని కలభ కరమునుపోలు భుజములు. బలమునకు అవధులే అవి. ''ఎడమచేత పూలదొన్నెను ధరించిన ఆ శ్యామవర్ణురుడు, సఖీ, అతిసుందరుడు, సింహమధ్యముడు, పీతవస్త్రధారి, సౌందర్యరాశి, శీలనిధి, భానుకులభూషణుడు ఆతడు బహుసుందరుడే'' అనినది ఒకతె.

రాముని వీక్షించి సఖులెల్లరు తమను తాము మరచిరి. వారిలో నేర్పరి అగు ఒక తరుణి ధైర్యమువహించి సీతయొక్క కరమునుగ్రహించి--

''గౌరీధ్యానము తరువాత చేయవచ్చునులే. ఈ భూపకిశోరుని చూడరాదటమ్మా? అనెను. సీత సిగ్గుపడెను. కన్నులు తెరచెను. రఘుపింహము లిరువురు ఆమెఎదుట నిలచిఉన్నారు. ఆమె వారిని చూచినది రామునిసౌందర్యమును ఆమె ఆపాదమస్తకము తిలకించుచున్నది. ఇంతలో ఆమెకు తన తండ్రిచేసిన ప్రతిన గుర్తువచ్చి ఆమె మనస్సు అతి క్షోభను చెందెను. జానకి పరవశురాలై ఉన్నట్లు చెలియులు గ్రహించి, భీతిల్లిరి. ''చాలా ఆలశ్యమైనది. రేపు ఇదేవేళకు తిరిగి వత్తములే'' అని ఒక సఖి అని. తన మనమున నవ్వుకొనెను. సఖియయొక్క నిగూఢ వచనము లను విని సీతకు సిగ్గు జనించెను. ''ఆలశ్యమయ్యెను. తల్లి ఏమనునో'' అని ఆమె భయము. ఆమె అత్యంతధైర్యమువహించి, రాముని తన మనమున ధరించి తండ్రి ఆధీనమున తా నున్నానని గ్రహించి ఆమె ఇంటికి మరలెను.

ఒకమృగమునో, ఖగమునో, వృక్షమునో చూచునెపమున ఆమె పదేపదే వెనుకకు తిరుగుచు రఘువీరుని సౌందర్యమును వీక్షించెను. ఆమె ప్రేమ అధికమయ్యెను. కఠినమగు హరచాపము ఇంతలో ఆమెకు గుర్తువచ్చి ఆమె చింతించెను. రాముని శ్యామలమూర్తిని హృదయమున నిలిపి, ఆమె మరలెను. సుఖ, ప్రేమ సౌందర్య ఖని-జానకి అని రాముడు గ్రహించెను. వెంటనే ఆతడు 'పరమప్రేమ' అను చక్కని రంగుతో ఆమె రూపమును తన మనోఫలకముపై చిత్రించుకొనెను.

సీత మరల భవానీ మందిరమున కేగెను. దేవియొక్క పాదములకు వందన మొనర్చెను. చేతులు జోడించి ఇట్లు ప్రార్థించెను.--

''జయ జయ గిరి వర రాజకుమారీ

జయ మహేశముఖ చంద్రచకోరీ

జయ విఘ్నేశ షడానన జననీ

జయ జగదాంబా, జయజయమాతా-

జయ జయ విద్యుత్కాంతి శరీరే.

ఆదిమధ్యాంత రహితవు నీవు. నీ మహాప్రభావమును శృతులైనను తెలియజాలవు. ప్రపంచమును నీవు నృజింతువు. పాలింతువు. నాశనమొనరింతువు. నీవు విశ్వమోహనివి. స్వతంత్రవిహారిణివి. పతియేదై వమని భావించు నారీమణులయందు అగ్రగణ్యవు నీవు. తల్లీ, నీ ఆపారమహిమను సహస్రశారదలు, ఆదిసేషులైనను వర్ణింపలేదు.

భక్తివరప్రదాయివీ. పురారిప్రయా, నిన్ను సేవించిన చతుర్విధ పురుషార్థములు సులభమగును. దేవీ. నీ పాదకకమలములను పూజించి, సురలు, నరులు, మునుల ఎల్లర సుఖులగుదురు. నా మనోరథమంతయు నీవు ఎఱుగుదువు. సదాసకల హృదయ పురవివాహినివికదా నీవు. కనుకనే మనోరథమును నేను నీకు ప్రకటింపలేదు.''

ఇట్లు ప్రార్థించి వైదేహి గౌరీచరణములను గ్రహించెను.

సీతయొక్క వినయమునకు, ప్రేమకు భవాని వశమయ్యెను. దేవి కంఠము నుండి ఒక మాల జారిపడెను. ఆ మూర్తి మందహాసము చేసెను. ఆ ప్రసాదమును సాదరముగా జానకి తన శిరమున ధరించెను. హర్షభరితహృదయమున భవాని ఇట్లువచించెను:--

''సితా, సత్యమగు నా ఆశీస్సును వినుము నీ మనోరథము ఈడేరును. నారదునివచనములు సదా పునీతమైనవి. సత్యమైనవి. నీ మనస్సునకు అనురక్తుడగు ఆ సహజసుందరుడు, శ్యామవర్ణుడు, - ఆతడే నీకు లభించును. ఆతడు కరుణావిధి. సర్వజ్ఞుడు. నీ శీలమును, ప్రేమను ఆత డెఱుగును.''

ఇట్లు గౌరిజానకిని ఆశీర్వదించెను. ఆ ఆశీస్సును విని సీతయు. ఆమె చెలియలు అమితానందమును పొందిరి. పలుమారుల భవానీదేవిని పూజించి ప్రసన్నురాలై సీత తన మందిరమునకు మరలెను. గౌరి తనయెడల అనుకూలముగా ఉన్నట్లు ఆమె తెలిసికొనినపిదప ఆమె హృదయమున జనించిన ఆనందము వర్ణనాతీతము. మంజుల మంగళములను సూచించుచు ఆమె వామాంగములు ఆదర మొదలిడినవి. సీతయొక్క లావణ్యమును తమ హృదయములయందు కొనియాడుచు రామ లక్ష్యణులు గురుని వద్దకు వెడలిరి. జరిగినవృత్తాంతమును కౌశికుని రాముడు తెలిపెను. ఆతని స్వభావము సరళ##మైనది. కపటము ఆతనిని స్పృశించజాలదు. పూలను తీసికొని ముని పూజ కావించెను. మరి ఒకసారి సోదరులను ఆతడు ''మీ మనోరథములు సఫలమగు గాక!'' అని ఆశీర్వదించెను, దానిని విని రామ లక్ష్మణులు ఆనందించిరి.

విజ్ఞాని అగు మునివరుడు భుజించినపిదప పురాణగాథలను వారికి నుడువసాగెను. పగలు గడచెను. అన్నదమ్ము లిద్దరు గురుని ఆనతినికొని సంధ్యావందనమునకు వెడలిరి.

సుందరుడగు చందురుడు తూర్పున ఉదయించెను, రాముడు ఆ చంద్రుని - పీతా వదనబింబమునువలె వీక్షించి ఆనందించెను. ''ఈ హిమకరుడు జానకివదనమునకు సము డెట్లు కాగలడు?'' అని మరల చింతించెను.

''ఈ చంద్రుని జననము సముద్రమున. ఇతినితోడ పుట్టినది విషము. దీని మెల్లయు ఇతడు కళావిహీనుడు. కళంకయుతుడు. పాపము! నిర్భాగ్యుడగు ఈ శశి ఎక్కడ? సీతవదన మెక్కడ? ఆ వదనముతో ఈ చంద్రుడు సము డెట్లు కాగలడు? ఇతనికి కొన్నాళ్ళు వృద్ధి - మరికొన్నినాళ్ళు క్షీణత. విరహిణులకు దుఃఖప్రదాత ఇతడు. అవకాశము లభింపగానే రాహువు ఇతనిని కబళించును. ఓయీ చంద్రా, చక్రవాకికి శోకప్రదా. పంకజద్రోహీ, నీయందు ఎన్ని అవగుణులున్ననోయీ! వైదేహి వదనమును నీతో పోల్చుటచే అనుచితకార్యము కావించిని దోషము అంటును!'' అని ఆతడు చంద్రుని నెపమున సీతావదన లావణ్యమును వర్ణించుచుండ గానే రాత్రి ప్రొద్దుపోయెను. ఆ విషయమును గ్రహించి రామ లక్ష్మణులు గురునివద్దకు వెడలి ఆ మునియొక్క చరణసరోజములకు ప్రణామము కావించి, ముని ఆనతిని పొంది విశ్రమించిరి.

రాత్రి గడచెను. రఘునాయకుడు నిద్రనుండి మేల్కొనెను. తమ్ముని చూచి ఆతడు ''నాయనా, కనుగొనుము. పంకజములకు, చక్రవాకములకు, సకలలోకమునకు ఆనందదాయకమగు సూర్యోదయమైనది'' అని పలికెను. రెండుచేతులు జోడించి లక్ష్మణుడు ప్రభుని ప్రభావమును సూచించు మృదువాక్కులను ఇట్లు నుడివెను:--

''నీ రాకనువిని రాజులెల్లరు ఎట్లు బలహీనులైనారో అట్లే అరుణోదయ మగుటచే కలువలు ముడుచుకొన్నవి. నక్షత్రములు వెలవెల పోయినవి. నరపాలు రనబడు నక్షత్రములన్నియు అట్లే మినుకుమనుచున్నవి. కాని ధనువు అను మహా అంధకారమును ఈ నక్షత్రములు కదల్పజాలవు. నిశాసమయము సమాప్తమగుటవలన కమలములు, చకోరములు, తుమ్మెదలు నానావిధములగు పక్షులు సంతపించుచున్నవి. అట్లే ప్రభూ, శివధనుర్భంగమైనపిదప నీ భక్తులు సంతసింతురు.

భానుడు ఉదయించెను. శ్రమలేకయే ఆంధకారము నశించెను. తారలు మాటున పడెను. లోకమున తేజము ప్రకాశించెను, ఉదయమను నెపమున రవి నీ ప్రతాపమును భూపతులకెల్లరకు ప్రదర్శించుచున్నాడు. రఘువతీ, నీ భుజబలమహిమను ప్రకటించుటకే ధనుర్భంగము నిర్ణయింపబడినది.''

తమ్ముని మాటలు విని రాముడు చిరునవ్వు నవ్వెను. సహజముగనే శుచి అగు ఆతడు స్నానముచేసి పునీతుడయ్యెను. నిత్యకర్మలను కావించెను గురునివద్ద కేగెను. ఆయనయొక్క సుందరచరణ సరోజములకు శిరమువంచి నమస్కరించెను.

అంతట జనకుడు శతానందుని రప్పించి ఆయనను కౌశికమునివద్దకు పంపించెను. శతానందుడు ఏతెంచి జనకుని వినతిని ఆ మునికి వినిపించెను. విశ్వామిత్రుడు హర్షమున రామలక్ష్మణులను రప్పించెను. శతానందుని చరణములకు వందనము కావించి ప్రభువు విశ్వామిత్రునివద్ద ఆసీనుడయ్యెను.

''నాయనా, జనకుడు మనలను పిలువనంపినాడు. వెడలి సీతా స్వయంపరమును తిలకించవలెను. ఈశ్వరుడు ఈ సన్మానమును ఎవరికి ప్రసాదించునో చూతము'' అని విశ్వామిత్రుడు వచించెను.

''స్వామీ, నీ కృప ఉన్నవారే దీనికి పాత్రులగుదురు'' అని లక్ష్మణుడు పలికెను.

ఈ ఉత్తమ వచనములను విని మునులెల్లరు ఆనందించిరి. సంతోషమున వా రెల్లరు రామ లక్ష్మణులను ఆశీర్వదించిరి. అంతట - మునిబృందసహితుడై కృపాశుడు రాముడు ధనుర్యాగశాలను చూడసాగెను.

సోదరు లిరువురు రంగస్థలికి అరుదెంచిరి. ఈ వార్త పురవాసులెల్లరు వినిరి. బాలురు, యవకులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు - అందరు తమ ఇండ్లను పనులను విడిచి బయలుదేరిరి. పెద్దగుంపు చేరినదని కనుగొని విశ్వాసపాత్రులగు తన సేవకులను జనకుడు పిలిపించెను.

''వెంటనే పొండు, వచ్చినవారినందరిని తగురీతిని ఆసీనులను కావించుడు'' అని ఆతడు ఆజ్ఞాపించెను. సేవకులు మృదవచనములను నమ్రతతో పలికి ఉత్తమ, మధ్యమ, నీచ, లఘుశ్రేణులలో స్త్రీ, పురుషులనందరిని వారివారికి తగు స్థానముల యందు ఆశీనుల చేసిరి.

ఆ సమయమున రాకుమారులు రామ లక్ష్మణులు అరుదెంచిరి, మనోహరత్వమే వారి శరీరములను అవహించి వచ్చెనో అనునట్లు వారు ఉన్నారు. గుణసాగరులు, చతురులు, వీరవరులు, సుందర శ్యామల, గౌరవర్ణశరీరులు వా రిరువురు. తారాగణము మధ్య పున్నమచందురులు ఇరువురవలె రాజసమాజమున ఆ సోదరులు విరాజిల్లుచున్నారు. ఎవరికి ఎట్టి భావన కలదో ఆ రీతినే ప్రభుని మూర్తి - వారివారికి గోచరించుచున్నది. వీరరసమే తనువును ధరించెనో అనునట్లున్న రాముని మహారణధీరులగు రాజుల వీక్షించుచున్నారు. కుటిలురగు ప్రభువులు భయపడుచున్నారు. వారికి రాముడు భయంకరమూర్తివలె కానుపించుచున్నాడు.

రాక్షసులు కొందరు కపటమున రాజవేషములను ధరించి అక్కడ ఉన్నారు. వారికి ప్రభువు కాలునివలె కనుపించుచున్నాడు. అన్నదమ్ముల నిరువురిని నరభూషణులుగను, నయన సుఖదాయకులుగాను పురవాసులు వీక్షించుచున్నారు.

స్త్రీలు తమ హృదయములయందు ఆనందించిరి. తమ తమ అభిరుచులను అనుసరించి వారు రాముని వీక్షించిరి. శృంగారరసమే అత్యంత ఉత్కృష్టమగు, అనుపమ మూర్తియై విరాజిల్లుచున్నదో అనునట్లున్నది. విద్వాంసులకు ప్రభువు - అనేక ముఖములు, కరములు, చరణములు, నయనములు, శిరములు కలిగిన విరాట్‌స్వరూపుడై కనుపించుచున్నాడు. జనకుని బంధువులకు ఆతడు ప్రియుడగు స్వీయబంధువువలె కనుపించుచున్నాడు. జనకుడు. ఆతని భార్యలు రాముని తమ శిశుసమునిగా కాంచుచున్నారు. వారిప్రేమను వర్ణింపజాలము. యోగులకు ఆతడు శాంత, శుద్ధ, సమ, స్వప్రకాశుడుగా, పమతత్త్వమయుడుగా గోచరించుచున్నాడు. హరిభక్తులు రామ లక్ష్మణులను తమ ఇష్టేదవులుగా కనుగొనిరి. కడు సంతసించిరి. ఇక- సీత ఏ భావమున రాముని కనుగొనెనా? ఆ ప్రేమను, ఆనందమును నుడువజాలము. సీతారాములు వానిని తమ హృదయములయందే అనుభవించుచున్నారు. ఆ భావమును వారే వర్ణింపజాలరు! అట్టిచో ఏ కవిమాత్రము ఎట్లు వర్ణింపకలడు? ఇట్లు ఎవరికి ఎట్టి భావము కలదో అట్టి భావముననే వారు వారు కోసలాధిపతిని తిలకించిరి. రాజసమాజమున కోసలరాజకిశోరులు - సుందర, శ్యామల, గౌరవర్ణులు, అఖిల విశ్వముయొక్క నేత్రములను చూరగొనుచు - ఇట్లు శోభిల్లుచున్నారు. సోదరులిరువురు సహజ మనోహరులు, కోటి కామదేవులనైనను వారితో సరిపోల్చు అల్పమే. వారి సుందర వదనములు శరచ్చంద్రుని నైనను తృణీకరించును. వారి కమలనయనములు మన మానసములను ఆనందింపచేయును. వారి కమనీయదృక్కులు మారుని మనస్సును సహితము హరించును. హృదయమునకు కడు ప్రియకరములు అవి. వర్థనాతీతములు.

చక్కని చెక్కిళ్లు, చెవులకు వ్రేలాడు కుండలమలు. అందమగు చబుకములు. సుందరమగు అధరములు - మృదునగు పలుకులు. చంద్రకిరణములను తిరస్కరించు నవ్వులు. వక్రమగు భ్రుకుటి - మనోహరమగు నాసికల - విశాలమగు ఫాలముల విరాజిల్లు తిలకములు. ఆ కేశములను కాంచి తుమ్మెదలు సిగ్గు చెందవలసినదే. శిరమున-ప్రకాశించు పచ్చని నాలుగుకోణముల శిరస్త్రాణములు. వానిపై అక్కడక్కడ అల్లబడిన పూలమొగ్గలు. శంఖమునుండి చక్కని కంఠములు వానిపై మనోహరమగు త్రిరేఖలు - త్రిభువనసౌందర్యమునకు అవధులు అవి - ఉరములు గజముత్యముల కంఠహారములు, తులసిమాలలు -వృషభస్కంధములను పోలిన భుజస్కంధములు - సింహమునకు ఉండునట్టి మడమలు, విశాలబలనిధులగు -భుజములు-కటులయందు తూణీరములు, పీతాంబరములు, దక్షిణకరముల శరముల, సుందరమగ వామభుజముల ధనునవులు, పసుపు పచ్చని యజ్ఞోపవీతములు-శోభిల్లుచున్నవి. నఖశిఖపర్యంతము సర్వాంగముల సుందరములై కాంతితో ప్రకాశించుచున్నవి.

రామ లక్ష్మణులను చూడవచ్చిన ప్రజలెల్లరు ఆనందమున రెప్పవాల్చక వారిని వీక్షించుచుండిరి. వారి కనుపాపలైనున కదలటలేదు. సోదరు లిరువురిని కనుగొని జనకుడు హర్షించెను. ఆయన వెడలి విశ్వామిత్రుని చరణకమలములను గ్రహించి తన చరిత అంతయు ఆ మునికి వివరించెను. యజ్ఞశాలను చూపించెను.

మునివెంట రాకుఉమారులు నడచినచోట్లనెల్ల అందరు ఆశ్చర్యచకితులై వారిని చూచుచన్నారు. ప్రతిఒక్కరు రాముడు తనవైపునకే చూచుచున్నట్లు కనుగొను చున్నారు. దీని విశేషమర్మము ఎవ్వరికీ తెలియదు.

''యజ్ఞశాలయొక్క నిర్మాణము అతి అద్భుతముగా ఉన్నది'' అని విశ్వామిత్రుడు జనకునితో అనెను. ముదితుడై జనకుడు మహానందము పొందెను.

వేదిక లన్నిటియందు ఒకటి అధిక రమణీయమై ఉజ్జ్వలమై, విశాలముగా ఉన్నది. మునిని, రామ లక్ష్మణులను జనకుడు దానిపై ఆసీనులను కావించెను. రామునిచూచి రాజులెల్లరు - పూర్ణచంద్రోదయమైనపుడు తారాగణమువలె - కళావిహీనులై, తమ హృదయములయందు నిరాశ##చెందిరి.

''రాముడు నిశ్చయముగా ధనుర్భంగము కావించును. సందేహములేదు'' అని వారి మనములయందు విశ్వాసము కలిగెను. ఈ మహాశివధనువును భంగపరచక పోయినను సీత రామునే వరించును. అతనికంఠముననే హారము వేయును'' అని వారెల్లరు తలచిరి.

''యశమును, ప్రతాపమును, బలమును, తేజమును అన్నిటిని త్యజించి మనము ఇండ్లకు మరలుదము సోదరులారా'' అని అనుచుండిరి.

అవివేకాంధులైన కొందరు రాజులు- గర్వితులు - ఈ సంగతిని విని నవ్విరి.

''విల్లును విఱచినను అతని వివాహము కష్టమే. ఇక విల్లు విఱచకనే వివాహమాడువా డెవ్వడు?'' ''ఆ యమునినైనను సీతకై జయింతుము'' అని వా రనిరి. ఈ ప్రగల్భములను వినిన ధర్మశీలురు. హరిభక్తులు, యుక్తవయస్కులు అగు ఇతర రాజులు చిరునవ్వు నవ్విరి.

''రాజుల గర్వభంగము కావించి రాముడు సీతను వివాహమాడును. రణధీరులగు దశరథసుతులను రణమున జయింపగలవా రెవ్వరు? గప్పాలుకొట్టి వ్యర్థముగా చావకుడు. ఊహాజనిత మోదకములతో ఆకలి తీరునా ? పరమపవిత్రమగు మా బోధను వినుడు. సీత జగదాంబ అని మీ హృదయములలో గ్రహించుడు. రఘుపతి జగత్పతి అని ఎఱుగుడు. కన్నులార అతని సౌందర్యమును కనుగొనుడు. సుందరులు, సుఖప్రదాతలు, సకలగుణరాసులు అగు ఈ ఇరువురు సోదరులు శంభుని హృదయ నివాసులు. చేతికి అందిన సుధాసముద్రమును కాదని మృగతృష్ణకై పరుగెత్తి ఏల చత్తురు? పొండు. మీకు మంచిదని తోచినట్లు కావించుడు-నేడు మా జన్మలు సఫలమయ్యెను'' అని నుడివి యోగ్యులగు నరపతులు అనురాగమగ్నులై రాముని అనుపమరూపమును వీక్షింప మొదలిడిరి. ఆకసమున విమానమునుండి సురలు తిలకించుచుండిరి. కనువీయమగు గానము చేయుచు వారు పూలవానను కురిపించుచుండిరి.

తగిన సమయము సమీపించెనని తెలిసికొని జనకుడు సీతను పిలువనంపెను. చతురలు, సుందరులు అగు ఆమె సఖులెల్లరు ఆమెను తీసికొనివచ్చుటకు సాదరముగా ఏగిరి. రూప, గుణఖని. జగదాంబ అగు జానకియొక్క శోభ వర్ణనాతీతము. ఆమెను వర్ణించుటకు అన్ని ఉపమానములు నాకు అల్పము లనిపించును. ఉపమానము లన్నిటికి ప్రాకృతస్త్రీల అంగవర్ణనలయందే అనురాగము ! సీతను వర్ణించుటకు ఈ ఉపమానములను ప్రయోగించి ఎవడు కుకవి అనిపించుకొనవలెను. ? అపకీర్తిని అర్జించవలెను? ఏ స్త్రీతోనైనను సీతను తులతూచుదమన్నను అట్టి కమనీయ యువతి ఈ జగత్తున ఎచ్చటనైనను ఉన్నదా ఏమి? పోనీ - దేవతలతో పోల్చుదమన్నను - సరస్వతి వట్టి వదరుబోతు. ఆమె వాక్కుకు అంతమేలేదు. భవాని అర్ధశరీరి. ఇక రతియో-తనపతి అనంగుడని కడు దుఃఖించుచుండును. విషము, మద్యము ప్రియసోదరులగు రమతో జానకికి ఎట్లు సరిపోల్చుట? లావణ్యమే సుధాపయోనిధియై భగవానునిరూపమే కచ్ఛపమై శృంగారమే మందరగిరియై, శోభ##యే రజ్జై- ఆ సౌందర్యజలనిధిని మారుడే స్వయముగా తన పాణి పద్మములతో మధించినచో - తత్ఫలితముగా సౌందర్య, ఆనందమూలమగు లక్ష్మియే ఉద్భవించినను కవులు ఆమె సీతతో తులతూగునని జంకుచునే వచింతురు.

తరుణీమణులగు సఖియలు సీతను తోడ్కొని మనోహరముగా గీతములను అలపించుచు ఆమెవెంట నడచుచున్నారు. ఆమె సుకుమారశరీరమున సుందరమగు చీరె శోభిల్లుచున్నది. ఆ జగజ్జననియొక్క మహాసౌందర్యము అనన్యము. ఆమె అవయవములన్నిటియందు సకలఆభరణములను తగురీతిని సఖియలు అలంకరించిరి.

రంగభూమిపై సీత పాదము మోపినంతనే ఆమెయొక్క మనోహరరూపమును, కనుగొని స్త్రీలు, పురుషులు ఎల్లరు మోహితులైరి. హర్షమున దుందుభులను దేవతలు మ్రోగించిరి. అచ్చరలు పూలవానను కురిపించిరి. పాటలు పాడిరి. జానకి కరకమలమున జయమాల అలరారుచున్నదది. భూపాలురందరు ఆమెవంక చకితులై చూడసాగిరి. చకితచిత్తయై సీత రాముని తిలకింప మొదలిడెను. నరపతులెల్లరు మోహవశులైరి. ముని సమీపమునఉన్న ఇరువురు సోదరులను సీత చూచెను. ఆమెనేత్రములు తమ పెన్నిధిని కనుగొన్నవి. ఆ విధియందే కేంద్రీకృతమైనవి. గురుజనులున్నారను లజ్జ ! మహాసభ ! వారిని తిలకించి జానకి బిడియపడెను. రఘువీరుని తన హృదయమున ధరించి తన సఖియలవంక చూడసాగెను. రాముని రూపమును, సీతయొక్క లావణ్యమునుచూచి స్త్రీలు, రెప్పవాల్చుట మానిరి. వా రెల్లరు ఆలోచించుచున్నారు. కాని మాటలాడుటకు జంకుచున్నారు.

''ఓ విధాతా. ఈ జనకుని మూర్ఖత్వమును వేగమే పారద్రోలుమయ్యా. మాకు కల సద్భుద్ధిని అతనికి ప్రసాదించుము. ఏ విచారములేకయే ఈ సరనాథుడు తన ప్రతిజ్ఞనువదలి రామునికి సీతనిచ్చి వివాహము చేయునట్లు చేయుము. ఈ సంయోగము సర్వులకు ఆనందప్రదము - జగమెల్లయు వీరిని మెత్తురు. మొండిపట్టుదలచే తుదకు జనకుడు పరితపించును'' అని అందరదు తమ మనస్సులలో ప్రార్థించుచుండిరి.

''జానకికి తగినవరుడు ఈ శ్యామలవర్ణుడే'' అను ఆశయందే ఎల్లవారు నిమగ్నులై ఉండిరి.

అంతట జనకుడు వందిమాగధులను పిలిపించెను. రాజవంశబిరుదావళిని వర్ణించుచు వారు వచ్చిరి.

''మీరువెడలి నా ప్రతిజ్ఞను ఎల్లరకు తెలియచేయుడు'' అని జనకుడు వారిని ఆజ్ఞాపించెను. వందిమాగధులు వెడలిరి. మహాఆనందమున వారు ఇట్లు బిగ్గరగా ప్రకటించిరి.

''ఓ సకలమహీపతులారా, వినుడు. మా విశాలభుజములను పైకెత్తి విదేహభూపాలుని ప్రతినను ప్రకటించుచున్నాము. నరపాలుర భుజాబలము చంద్రునివంటిది. శివునివిల్లు రాహువును పోలినది. ఆ ధనువు మహాభారమైనది, కఠోరమైనది. అని ఎల్లరకు విదితమే. మహాయోధులగు రావణ, బాణాసురులు ఈ ధనువును చూచి నంతనే పలాయనము చిత్తగించిరి. త్రిపురారియొక్క ఈ కఠోర కోదండమును - ఈ రాజసమాజమున నేడు ఎవ్వరైనను విఱుచుచో - అట్టివారు త్రిలోకవిజయులగుటయే కాక - ఎట్టిసంకోచములేకయే వైదేహి నిశ్చయముగా ఆ విజయుని వరించును.''

ఆ ప్రతినను సకలభూపతులు వినిరి. ప్రయత్నించవలెననియే అందరి ఉబలాటము. తాము వీరులమని గర్వపడు నరపతులు అతురత చెందిరి. నడుములు బిగించిరి. వేగిరపడి లేచిరి. తమ ఇలవేల్పులకు మ్రొక్కిరి. ముందుకు వచ్చిరి. కోపాతిరేకపు చూపులతో శివధనువును వీక్షించిరి. దృష్టిని కేంద్రీకరించి ధనువును పట్టుకొనిరి. కోటివిధముల తమ బలమును ప్రయోగించిరి. ఐనమేమి? ఒక్కరైనను ధనువును ఎక్కుపెట్టలేకపోయిరి. ఏమాత్రమైన వివేకముకలిగిన భూపతులు ఆ చాపమును సమీపింపనేలేదు. మూర్ఖుడగు ఏ రాజైనను గర్వమున దానిని పట్టుకొనును. కాని. దానిని ఎత్తజాలడు ! సిగ్గుపడి అతడు కలతచెందును. తిరిగిపోవును. యోధులందరి బాహుబలమును తానే పొంది ఆ ధనువు అంతకంతకు అధికభారమును పొందుచున్నట్లున్నది. అంతట పదివేలమంది నరపాలురు ఆ ధనువును ఒకేసారి పైకి ఎత్తపూనిరి. కాముకులమాటలను విని పతివ్రతల మనస్సులు ఎన్నడూ చలింపనట్లు శివుని విల్లు కదలలేదు. వైరాగ్యములేని సన్యాసివలె ఆ మహీపతులెల్లరు ఎగతాళిపాలైరి. వారి కీర్తి, విజయము, వీరత్వము, అన్నియు ఆ శివధనువుచేత పడి ఓడి, పారిపోయెను. తమ హృదయముల ఓటమిని అంగీకరించి భూపాలులెల్లరు శ్రీ విహీనులైరి, మరలిచని తమ తమ స్థానములయందు వారు ఆసీనులైరి. నరపతులనుచూచి జనకుడు వ్యాకులపడి, క్రోధసమ్మిళితమగు వచనములను ఇట్లు వచించెను :-

''నేను కావించిన ప్రతిజ్ఞనువిని ద్వీప, ద్వీపములనుండి అనేక భూపతులు వచ్చిరి. దేవతలు, దనుజులు మనుజవేషధారులై విచ్చేసిరి. రణధీరులు. వీరులు అనేకులు ఏతెంచిరి. కాని, ధనువును విఱచి, మనోహరి అగు కన్నియను, మహా విజయమును, అతి కమనీయమగు యశమును పొందగలవానిని ఒక్కనినైనను విరించి సృజించనే లేదనిపించుచున్నది. తెలుపుడు. ఈ బహుమతి రుచించలేదా ఎవ్వరికినీ ? శంకరుని విల్లును ఎవరునూ ఎక్కుపెట్టుట, భంగపరచుట మాట అటు ఉంచుడు. ఒక్కరైనను దానిని నువ్వుగింజంతయైనను నేలనుండి కదదుపనేలేకపోయిరే సోదరులారా ?

పృథ్వి వీరవిహీనమయ్యెనని నాకు తెలిసినది. వీరులమని గర్వించువారు ఎవ్వరూ నామాటలను విని కోపగించకుందురుగాక ! ఆశను వీడి ఎల్లరూ మీమీ ఇండ్లకు పొండు. వైదేహికి వివాహము విధాత వ్రాసిపెట్టలేదు ! నా ప్రతినను విడిచితినో నా సుకృతమే నశించును. ఏమిచేతును ? మా కన్య కన్యగానే ఉండవలయునేమో !భూలోకము వీరశూన్యమైనదని నాకు తెలిసియేఉన్నచో మిత్రులారా. ఈ ప్రతిజ్ఞనుచేసి ఇట్లు నేను అపహాస్యపు పాలయ్యెడివాడను కాను !''

జనకుని పలుకులనువిని స్త్రీలు, పురుషులు ఎల్లరు జానకివంకచూచి దుఃఖితులైరి. ఇంతలో -లక్ష్మణుడు తటాలున లేచెను. అతనివదనము ఎఱ్ఱనయ్యెను. కనుబొమలు వక్రములయ్యెను. పెదవులు అదరెను. కన్నులు క్రోధమున ఎఱ్ఱపడెను. జనకుని పలుకులు అతనికి బాణపుములుకు లయ్యెను. రఘువీరునియందలి భయముచే అతడు ఏమియు పలుకలేదు.

లక్ష్మణుడు రామునిపాదములకు తలవంచి నమస్కరించెను. ప్రామాణికములగు వచనములను ఇట్లు వచించెను :-

''రఘుకులమణి అగు రాముడు ఈ సమావేశమున ఉన్నాడని తెలిసియూ అనుచితమగు వచనములను జనకుడు నుడివినాడు. రఘువంశజులు ఎవ్వరైనను, ఎట్టి సభలయందైనను ఉన్నచో - అట్టిచోట్ల ఇట్టి వచనములను ఎవ్వరూ వచింపరు.

ఓ భానుకుల పంకజభానుడా, వినుము. నేను మనఃపూర్వకముగనే పలుకుచున్నాను. గర్వమున కాదు. నీ ఆనతియైనచో ఈ బ్రహ్మాండమును అంతటిని ఒక బంతివలె ఎగురవైతును. పచ్చికుండనువలె దానిని పగులకొట్టుదును. మేరుపర్వతమునైనను మట్టిగడ్డనువలె ముక్కలు చేతును భగవానుడా. నీ ప్రతాపమహిమచే ! ఈ పురాతనధనువు ఒక లెక్కయా ! ప్రభూ, నీ ఆజ్ఞయైనచో ఒక కౌతుకము కావింతును. దానినికూడా తిలకించుము. ఈ ధనువును కమలనాశమునువలె ఎత్తి నూరుయోజనముల దూరము పారవైతును. నాథా, నీ ప్రతాపముచే, నీ శక్తిచే ఈ ధనువును కుక్కగొడుగునువలె ముక్కలు ముక్కలు చేసివైతును. ఆవిధముగా నేను చేయజాలనిచో-ప్రభుని చరణములపై శపథము చేయుచున్నాను - ఇక నేను ధనుర్బాణములను ఎన్నడునూ చేపట్టను.''

క్రోధమున లక్ష్మణుడు ఇట్లు పలుకగానే భూమి గజగజ వణకెను. దిగ్గజములు కంపించెను. అఖిలజనులు, నిఖిలభూపతులు భయపడిరి. సీత తనహృదయమున సంతసించెను. జనకుడు సిగ్గుపడెను, విశ్వామిత్రుడు, రఘుపతి ఇతర మునులెల్లరు తన మనములయందు సంతోషించిరి. పదేపదే పులకితగాత్రులైరి. సంజ్ఞచేసి రాముడు లక్ష్మణుని నివారించి ప్రేమసహితముగా అతనిని తనవద్ద కూర్చుండపెట్టుకొనెను. అది శుభసమయమని గ్రహించి విశ్వామిత్రుడు అత్యంతప్రేమమయమగు వచనములను ఇట్లు నుడివెను :-

''రామా. లెమ్ము. భవుని విల్లును భంగపరచుము. నాయనా, జనకుని పరితాపమును పారద్రోలుము.''

గురుని వచనములను విని రాముడు ఆయన చరణములకు తలవంచి నమస్కరించెను. అతనిహృదయమున ఆనందమూ లేదు. విషాదమూ లేదు. సింహపుపిల్లకు సహితము సిగ్గు కలిగించునట్లు గంభీరముగా సహజస్వభావమున అతడు లేచినిలచెను. వేదిక అను ఉదయాచలముపై రఘువరుడను బాలభానుడు ఉదయించెను. సాధుసజ్జనులనబడు సరోజములు వికసించెను. లోచనములనబడు మధుపములు సంతసించెను. నరపతుల ఆశలను నిశలు నశించెను. భూపతుల పలుకులనబడు నక్షత్రసమూహములు ప్రకాశవిహీనము లయ్యెను. గర్వితులగు మహీపతులను కుముదములు ముకుళించెను. కపటభూపాలు రనబడు గుడ్లగూబలు మాటుపడెను. మునులు, దేవతలు అనబడు చక్రవాకములశోకము నశించెను. సురలు పూలవానను కురిపించి తమ సేవను ప్రకటించిరి. విశ్వామిత్రుని పాదములకు రాముడు వందనముచేసి 'ఆజ్ఞ ఇండ'ని మునులను కోరెను.

మదించిన మంజులశ్రేష్ఠ కుంజరమువలె సకలజగన్నాథుడు - సహజఠీవితో నడచెను. రాముడు నడచుచున్నప్పుడు మిథిలానగరియందలి స్త్రీ పురుషులెల్లరు ఆనందించిరి. వారి తనువులు పులకరించెను. తమ పితరులకు, దేవతలకు వారు వందనముకావించిన, తమ సుకృతమును స్మరించుకొనిరి. ''పూర్వపుణ్యప్రభావము మాకు ఏమైనను ఉన్నచో. స్వామీ, గణశా, శివధనువును కమలనాశమువలె రాముడు విఱచుగాక!'' అని వారు ప్రార్థించిరి.

ప్రేమతో రాముని విలోకించుచు, సఖులను తన సమీపమునకు పిలచుచు సీత యొక్క తల్లి - ప్రేమవశమున విలపించుచు ఇట్లు పలికెను.

''అందరూ ''మీ హితమును పలుకుచున్నా'' మనుచు వినోదమును చూచువారే కాని ఒక్కరూ గురునికి నచ్చజెప్పరేమే ! సఖియలారా, 'ఈ రామ లక్ష్మణులు బాలకులు. వీరిని ఈవిధముగా బలాత్కరించుట తగదు' అనరేమే? రావణుడు, బాణాసురుడు ఈ చాపమును తాకలేకపోయిరే ! రాజులెల్లరు గర్వించి భంగపడిరికదే ! అట్టి ధనువును ఈ రాకుమారులచేతులలో పెట్టుచున్నారు. బాలహంస మందరాచలమును ఎత్తగలదా ? రాజుగారి వివేచనాశక్తి సర్వము సమాప్తమయ్యెనా ఏమి? సఖియలారా, విధియొక్కగతి ఏమియు తెలియరాదు.''

అంతట ఒక చతుర సఖి మృదువగు వాణితో ''అమ్మా, రాణీ, తేజోవంతులను చిన్నవారని ఎంచరాదు. కుంభజా డెక్కడ ? అపారమగు సాగర మెక్కడ? ఐనను అతడు దానిని ఎండించలేదా ? అతనికీర్తి అఖిలప్రపంచమున వ్యాపించలేదా ? రవిమండలము చూడ చిన్నది. కాని రవి ఉదయించగానే ముల్లోకములయందలి అంధకారము చెల్లాచెదరై పోదా ? హరి, హర, బ్రహ్మలను, సకలదేవతలను వశపరచుకొను మంత్రము ఎంతో చిన్నది. కడు మదించిన గజరాజును ఒక చిన్న అంకుశము వశపరచుకొనుటలేదా ? పుష్పములను ధనుర్బాణములుగా కావించి, మన్మథుడు సకల భువనములను తనవశము చేసికొనినాడు. దేవీ, వీనిని తెలిసికొని సంశయమును విడువుము. రాణీ, వినుము. రాముడు ధనువును అవశ్యము విఱచును'' అని పలికెను. సఖియొక్క మాటలను వినిన రాణికి విశ్వాసము కలిగెను. ఆమె విషాదము తొలగెను. రామునియందు ఆమెకు కలప్రేమ అధికమయ్యెను.

ఆ సమయమున వైదేహి రాముని వీక్షించి కలతపడిన హృదయముతో - ఇట్లు దైవమును ప్రార్ధించెను :-

''మహేశ్వరా. భవానీ, నాయందు ప్రసన్నులు కండు. మీకు నేను చేసినసేవను సఫలము చేయుడు. నాపై కరుణించి ధనువు భారవిహీనమగునట్లు కావించుడు.

ఓ గణనాయకా. వరదాయకా, దేవా. ఈ శుభదినముకొరకే నేను నిన్ను సేవించితిని. మాటిమాటికి నేను కావించు వినతిని విని ధనువుయొక్క భారమును స్వల్పముచేయుము.''

రఘువీరుని తిలకించుచు. తిలకించుచు, ధైర్యమువహించి జానకి దేవతలను స్తుతించుచున్నది. ఆమె నేత్రములనుండి ప్రేమశ్రువులు ప్రవహించుచున్నవి. ఆమె శరీరము పులకించుచున్నవి. కన్నులార ఆమె రాముని సౌందర్యమును వీక్షించును. ఇంతలో ఆమెకు జనకుని ప్రతిన స్మరణకు వచ్చును. ఆమె మనస్సు క్షోభించును.

''అయ్యో, నాతండ్రి ఎంతటి దారుణప్రతిజ్ఞను పూనినాడు ! మంచిచెడ్డలను, పరిణామములను ఆయన గ్రహించనేలేదే ! ఎవ్వరూ నా తండ్రికి బోధింపజాలరు. మంత్రులు భయపడుచున్నారు. పండితసభయందు ఇది కడు అనుచితము. వజ్రము కంటె కఠోరమగు ఈ ధనువెక్కడ? శ్యామల, మృదుగాత్రుడగు ఈ రాకుమారు డెక్కడ? ఓయీ విధాతా, నేను ధైర్యము ఎట్లు వహింతునయ్యా? శిరీష సుమనకణము ఎందైనను వజ్రమును ఛేదించకలదయ్యా? ఈ సభకు మతి భ్రమించినది. ఓ శివచాపమా, ఇక నాకు నీవేగతి. నీ భారమును ప్రజలపైవిడిచి రఘునాథునిచూచి లఘుత్వము వహింపుము'' అని జానకి తన మనమున కడు విచారించుచున్నది. నిమేషలేశము నూరు యుగమువలవలె ఆమెకు గడచుచున్నది.

ప్రభుని వీక్షించుచు, పృథ్విని అవలోకించుచుఉన్న ఆమె చంచలనేత్రములు చంద్రమండల పరిధియందు మదనుని మత్స్యములు రెండు క్రీడించుచున్నట్లున్నవి. సీతయొక్కవాణి అను భ్రమరమును ఆమె వదనకమలము అడ్డగించుచున్నవి. లజ్జఅనెడు రాత్రినిచూచి ఆ వాణి వెలువడుటలేదు. పరమ లోభియొక్క బంగారము ఇంటిలో మూల మూలుగుచున్నట్లు ఆమె కన్నీరు కనుకొలకులయందే నిలచిపోయెను.

తన వ్యాకులత మితిమీరినట్లు గ్రహించి సీత సిగ్గుపడెను.

''మనోవాక్‌ కాయములయందు నా ప్రతిన సత్యమేయైనచో, రఘుపతియొక్క పదసరోజములయందు నా చిత్తము అనురక్తమైనచో - సకలహృదయనివాసి అగు భగవానుడు, నన్ను రఘువరునికి దాసిగా చేయుగాత ! ఎవరికి ఎవరియందు నిజమగు ప్రేమ ఉండునో వారు వారిని కలయుదురు. సందేహములేదు'' అని తలచి ఆమె ధైర్యము వహించి, హృదయమున విశ్వాసము ధరించెను.

సీత ప్రభునివంక చూచెను. ''ఈ తనువు నీదే - లేదా, ఇక ఎవ్వరిదీ కానేకాదు'' అని తనలో తాను ప్రతిన కావించెను.

కృపానిధానుడు-రాముడు సర్వము తెలిసికొనెను. అతడు సీతవంక చూచెను. గరుడుడు ఒక చిన్నపామువంక చూచునట్లు అతడు ధనువువంక చూచెను. రఘువంశమణి రాముడు ధనువువంక తేరిచూచుచున్నట్లు లక్ష్మణుడు గమనించెను. లక్ష్మణుని తనువు పులకించెను. బ్రహ్మాండమును తనకాలితో అదిమిత్రొక్కి అతడు ఇట్లు బిగ్గరగా పలికెను :-

''ఓ దిగ్గజములారా, ఓ కమఠమా. ఆదిశేషుడా, వరాహమా, ధైర్యము వహించుడు. ధరణిని అదిమిపట్టుడు. దానిని కదలనీయక పట్టుకొనుడు. శంకరుని చాపమును రాముడు భంగపరచతలచినాడు. నా ఆనతినివిని ఎల్లరు జాగరూకులై ఉండుడు.''

రాముడు ధనువును సమీపించెను. స్త్రీలు, పురుషులు, దేవతలు తమ పూర్వపుణ్యమును పొగడుకొనిరి. అందరిసందేహములు, అజ్ఞానము, మందమతులగు మహీపతుల అహంకారము, పరశురాముని గర్వప్రాబల్యము, సురల, మునివరులభయము, సీతయొక్క విచారము, జనకుని పశ్చాత్తాపము. రాణుల దారుణ దుఃఖదావాగ్ని అన్నియు సమకూడినవి. శంభుని చాపమనెడు పెద్దఓడపై అధిష్ఠించినవి. రాముని బాహుబలమను అపారసాగరమును తలచినవి. కాని, వానిని దాటించగల నావికుడు లేడు.

రాముడు ప్రేక్షకలోకమువంక వీక్షించినాడు. చిత్రింపబడిన బొమ్మలవలె వారు కనపడిరి. ఆ కృపాయతనుడు సీతవంక చూచినాడు. ఆమె కడు వ్యాకులపడి ఉన్నట్లు కనుగొన్నాడు. నిమిషము ఒక కల్పమువలె ఆమెకు గడచుచున్నట్లు తెలిసికొన్నాడు. ''దప్పి కొనినవాడు ఒకడు నీరు దొరకక మరణించెనట ! అతడు మరణించినపిదప సుధాతటాకము ఉండిమాత్రము చేయకలిగినదేమి ? పొలములన్నియు ఎండిపోయినవి. తరువాత వర్షమువచ్చి ఏమిప్రయోజనము? సమయము దాటిపోయిన అనంతరము పశ్చాత్తాపమువలన ఏమిలాభము?'' అని రాముడు ఆలోచించెను. అతడు జానకివంక చూచెను. ఆమెయొక్క అమితమగుభక్తికి పులకితుడయ్యెను. గురునికి అతడు తన మనస్సుననే ప్రణామము చేసెను. అతిలాఘవమున అతడు ధనువును పైకి ఎత్తెన. రాముడు చేపట్టగానే ఆ ధనువు మెరపువలె తళుక్కుమని గగనమున మండలాకారమయ్యెను ! అతడు ధనువును ఎప్పుడు చేతపట్టెనో, ఎప్పుడు పైకెత్తెనో, ఎపపుడు సంధించెనో - ఎవ్వరూ గ్రహింపజాలనంత వేగముగా అవి జరిగిపోయినవి. రాముడు నిలచుటనుమాత్రము అందరు తిలకించిరి. ఆ క్షణముననే అతడు ధనువును రెండుగా విఱచివైచెను. ఘోర, కఠోరధ్వని భువనమునకు నిండెను. సూర్యుని అశ్వములు తమ మార్గమునువిడిచి పరుగిడమొదలిడెను. దిగ్గజములు ఘీంకరింపసాగెను. పృథ్వి గజగజ వణక ప్రారంభించెను. ఆదిశేషుడు, వరాహము, కచ్ఛపము చలించెను. సురలు, అసురులు, మునులు చెవులుమూసికొని కలతపడిరి. కారణమేమని చింతింపసాగిరి.

శ్రీరాముడు కోదండమును విఱచినాడని ఎల్లవారికి విదితమయ్యెను. జయజయ ధ్వానములు వెలువడినవి. శివుని విల్లు ఒక ఓడ. రఘువరుని బాహుబలము ఒక సాగరము మోహవశులై ఆ ఓడపై మొదటనే ఎక్కినవారు ఈ సాగరమున మునిగిపోయిరి.

ధనువుయొక్క రెండు ముక్కలను ప్రభువు నేలపై పడవైచెను. జనులెల్లరు చూచి ఆనందించిరి. ప్రేమ అనబడు మధుర అగాధజలముతో నిండిన పునీతపయోనిధి వలె ఉన్నాడు కౌశికుడు. రాకాచంద్రునిపోలు రాముని కనుగొని పొంగి పొరలు కెరటములవలె ఆ ముని ఆనందమున ఉప్పొంగెను. సభమున దుందుభులు మారుమ్రోగినవి. దేవాంగనలు గానముచేయుచూ నాట్యమాడసాగిరి. బ్రహ్మాదదిదేవతలు. సిద్ధులు, మునీశ్వరులు ప్రభుని ప్రశంసించిరి. ఆశీర్వదించిరి. రంగురంగులపూలను, పూలమాలలను వర్షించిరి. కిన్నరలు మధురగీతములను అలసించిరి. భువనమెల్లయు జయ జయధ్వానములు క్రమ్మినవి. ఆ ధ్వానమున - ధనుర్బంగముచే వెలువడినశబ్దము వినవచ్చుటయేలేదు.

''శంభుని మహాచాపమును రాముడు విఱచెనట !' అని స్త్రీలు, పురుషులు - ఎచ్చట చూచినను ఆనందమున చెప్పుకొనుచున్నాను. ధీరమతులగు వందిమాగధులు, సూతులు బిరుదావళిని వర్ణించుచున్నారు. అందరు గుఱ్ఱములను, ఏనుగులను, ధనమును, మణులను, వస్త్రములను కానుక లిచ్చుచున్నారు.

కంచువాద్యములు, మృదంగములు, శంఖములు, సన్నాయీలు, భేరీలు, డోళ్ళు, సుందరమగు దుందుభులు మొదలగు అనేకవాద్యములు మ్రోగుచున్నవి. ఎల్లెడలను యువతులు మంగళగీతములను గానము చేయుచున్నారు. సఖులతోసహా రాణులు ఆనందించుచున్నారు. ఎండిపోవుచున్న ధాన్యపుపొలములపై వర్షము కురిసినట్లున్నది. జనకుని విచారము తొలగెను. అతనికి ఆనందము కలిగెను. నీటిలో ఈదుచూ, అలసిపోయినవానికి ఒడ్డు తగిలినట్లయ్యెను. పగటియందలి దివ్వెలవలె నరపతులు ధనుర్భంగము కాగానే కళావిహీనులైరి. సీతయొక్క ఆనందమును ఎట్లు వర్ణింపగలము? చాతకపక్షికి స్వాతివాన కురిసినట్లున్నది. చకోరకిశోరి చంద్రుని చూచునట్లు లక్ష్మణుడు రాముని వీక్షించుచున్నాడు.

అంతట శతానందుడు ఆనతి ఇచ్చెను. సీత రాముని సమీపించెను. సుందరీ మణులు, చతురులు అగు సఖులు ఆమెవెంట ఉండి మంగళగీతములు పాడిరి. బాల మరాళమువలె ఆమె నడచినది. మనోహరి, సుందరాంగి - సఖియలమధ్య జానకి శోభాపుంజములనడుమ మహాశోభవలె వెలుగొందుచున్నది. ఆమె కర సరోజములయందు జయమాల, ఆ జయమాలయందు విశ్వవిజయసౌందర్యము. జంకిఉన్నట్లు ఆమె శరీరము కనుపించును. కాని, ఆమె మనస్సున మహోత్సాహమే. ఆమెయొక్క నిగూఢమగు ప్రేమ ఇతరులెవ్వరికీ తెలియదు. రాముని సమీపించి అతనిశోభను ఆమె తిలకించెను. చిత్రింపబడిన పటమువలె ఆమె నిలచెను. నేర్పరి అగు సకియ ఒకతె ఆమె యొక్కస్థితిని కనుగొన్నది. ''ఆ సుందర జయమాలను అతని కంఠమున అలంకరింపుమమ్మా'' అని అనినది. ఈ మాటలను విని సీత తన రెండుచేతులతో మాలను ఎత్తెను. ప్రేమవివశ##యై ఆమె మాలను రాముని కంఠమున అలంకరింపజాలకున్నది. నాశములతోకూడిన రెండుకమలములు భయపడుచు, జయమాలను చంద్రునికి సమర్పించుచున్నవో అనునట్లున్నది. ఈ శోభనుకాంచి సఖియలు గానము చేయసాగిరి.

అంతట జానకి జయమాలను రామునికంఠమున అలంకరించెను. రఘువరుని కంఠమున జయమాలను కనుగొని దేవతలు పూలవానను కురిపించిరి. భూపాలురందరు సూర్యునిచూచి కలువగణములు ముకుళించుకొనునట్లు సిగ్గుపడి క్రుంగిపోయిరి. నగరమున, సభమున వాద్యములు మ్రోగసాగినవి. ఖలులు విచారగ్రస్తులైరి. సాధుసజ్జనులు సంతసించిరి. సురలు, కిన్నరులు, నరులు, నాగులు. మునీశ్వరులు ''జయము, జయము, జయము'' అనిరి. ఆశీస్సుల నిచ్చిరి. దేవతాస్త్రీలు ఆడిరి. పాడిరి. పలుమారులు కుసుమాంజలులను అర్పించిరి. ఎల్లచోట్లను విప్రుల వేదఘోషయే. వందిమాగధులు బిరుదావళిని పఠించిరి. భూ, పాతాళ నాకలోకములయందెల్లెడల ''రాముడు విల్లు విఱచెను. సీతను గ్రహించెను'' అనుకీర్తి వ్యాపించెను. పురమునందలి స్త్రీలు, పురుషులు హారతులిచ్చిరి. తమశక్తినిమరచి కానుక లిచ్చిరి. సౌందర్యము, శృంగారరసము ఒక్కచోట సమకూడినవో అనునట్లు సీతా రాములజంట శోభిల్లుచున్నది.

''అమ్మా, సీతా, ప్రభునిచరణములను గ్రహింపవమ్మా'' అని సఖులు జానకితో నుడివిరి. కాని, సీతకు భయము. ఆనాడు గౌతమపత్నికి సంభవించినగతి ఆమెకు గుర్తువచ్చెను. జానకి రామునిపాదములను స్పృశించలేదు. సీతయొక్క అలౌకికప్రేమను గ్రహించి రఘువంశమణి చిరునవ్వు నవ్వెను.

అంతట కొందరు భూపతులు సీతనుచూచి మోహావేశులైరి. దుష్టులు, అపవిత్రులు, మూఢులు అగువారు ఆగ్రహము చెందిరి. ఆ అభాగ్యులు అన్నివైపులనుండి లేచిరి. కవచములను ధరించిరి. డంబములు పలుకసాగిరి. ''సీతను లాగికొనుడు. ఆ రాకుమారుల నిరువురను పట్టుకొనుడు. వారిని బంధించుడు. ధనువును విఱచగానే అంతయూ కాలేదు. మేము జీవించిఉండగా ఈ రాజకుమార్తెను వివాహమాడగలవా డెవ్వడు? విదేహభూపతి సహాయమునకు వచ్చునో ఈ ఇరువురు రాకుమారులతోపాటు యుద్ధమున అతనికికూడా జయింతుము'' అని వారు అరచిరి, ఈ మాటలువిని ధర్మసంపన్నులగు భూనాథులు :-

''ఈ రాజసమాజమును కని. వారి పలుకులను విని లజ్జయే లజ్జ చెందినది. మీ బలము, ప్రతాపము, వీరత్వము, గొప్పతనము, ప్రతిష్ఠ - అన్నియు ఆ శివధనువుతోనే నశించిపోయినవి. ఈ వీరత్వమునుగురించియేనా మీ డంబములు. ఇప్పుడు ఎక్కడ నుండియైన వచ్చినదా క్రొత్తశౌర్యము ! అట్టి దుర్బుద్ధిపరులు కనుకనే - మీముఖమున విధాత మసిపూసినాడు. ఈర్ష్య, గర్వము, అగ్రహములను త్యజించి కన్నులారరాముని వీక్షించుడు. లక్ష్మణుని ప్రబలక్రోధాగ్నిని గుర్తెరిగి దానియందు శలభములు కాబోకుడు. గరుడుని కిచ్చిన బలిని కాకి కోరినచో. సింహముయొక్క ఆహారమును కుందేలు కాంక్షించినచో. అకారణ కోపిష్ఠి తన క్షేమమును కోరుచో, శివద్రోహి సర్వసంపదలు తనకే కావలెనని కోరుచో - లోభియు, దురాశాపరుడును మహాకీర్తిని కావలెననుకొనుచో - అవి వారికి లభించునా ? కామికి నిష్కళంకము, హరిచరణ విముఖునికి మోక్షము కావలెనన్న దొరకునా ? ఓ భూపతులారా. సీతయందలి మీ పేరాసయుఅంతే. వ్యర్థము సుడీ !'' అని వచించిరి.

ఈ కోలాహలమును విని సీత శంకించెను. సఖులు ఆమె తల్లివద్దకు ఆమెను తీసికొని చనిరి. సీతయొక్క ప్రేమను తన మనమున వర్ణించుకొనుచు సహజగతిని రాముడు గురుని సమీపించెను.

''విధాత ఇప్పుడు ఏమి చేయనున్నాడో తెలియరాదు'' అని రాణులు, జానకి విచారించిరి. నరనాథులమాటలు విని లక్ష్మణుడు అటు ఇటు తేరిపారచూచెను. రామునియందలి భయమువలన ఏమియు అతడు పలకలేకున్నాడు. అతనికన్నులు ఎఱ్ఱనయ్యెన8. కనుబొమలు వంకరలయ్యెను. ఆగ్రహమున అతడు అచ్చటున్న భూపాలురను చూచుచున్నాడు. మదించిన గజసమూహమును కాంచిన సింహకిశోరివలె అతడు ఆవేశపడుచున్నాడు. ఆ కలవరమును కనుగొని మిథిలాపుర స్త్రీలు వ్యాకులపడుచున్నారు. అందరుకలసి రాజులను తిట్టసాగిరి.

శివధనుర్భంగమునుగురించి విని భార్గవకుల కమలభాస్కరుడగు పరశురాముడు ఆ సమయమున అచ్చటికి ఏతెంచెను. అతనినిచూచి మహీపతులెల్లరు భయపడిరి. డేగవచ్చి పైన పడినప్పుడు చిన్న పక్షులు దాగికొనునట్టున్నది వారిస్థితి.

గౌరవర్ణపు శరీరము, శిరమున జట, తనువున శోభిల్లు విభూతి. విశాలమగు ఫాలము. దానిపై అత్యంత శోభాయామానమగు త్రిపుండ్రములు. చందురునిపోలు సుందరవదనము - క్రోధాగ్నిచే ఎఱ్ఱనై ఉన్నది. వంకరఅగు కనుబొమలు. రోషవశమున స్వల్పముగా ఎఱ్ఱనైనకన్నులు. శాంతుడయ్యును - క్రోధోన్మత్తములగు వీక్షణములు - వృషభస్కంధము. విశాలవక్షస్థలము. పొడవగు భుజములు. సుందరయజ్ఞోపవీతము. కంఠమున మాల, చెంత మృగచర్మము. కటియందు మునివల్కలములు. బంధింపబడిన రెండు తూణీరములు. కరముల శరచాపములు, కమనీయ భుజస్కంధమున పరశువు. శాంతమగు వేషమే - కాని కఠోరమగు చర్యలు - ఆ స్వరూపమును వర్ణింపజాలము. వీరరసము ముని శరీరమునుధరించి భూపతులవద్దకు విచ్చేసెనో అనునట్లన్నది.

భార్గవుని భయానకరూపమును చూచి నృపతులెల్లరు భయపడిరి. కలతచెందిరి. లేచిరి. విలచిరి. తమ తండ్రులపేర్లను తమపేర్లను చెప్పుకొనుచు అందరదు అతనికి సాష్టాంగదండప్రణామము చేయ మొదలిడిరి.

పరశురాముడు సహజముగ ఒకని హితము తలచియే వానివంక చూచిననూ సరే - అతడు ''నా ఆయువు నేటితో సమాప్తి!'' అని అనుకొనవలసినదే.

జనకుడు ఏతెంచెను. భార్గవునికి మ్రొక్కెను. సీతనుపిలచి ఆమెచే పరశురామునికి నమస్కారము చేయించెను.

భార్గవుడు ఆమెను ఆశీర్వదించెను. సఖులు సంతసించిరి. చతురలగు ఆ యువతులెల్లరు వెంటనే సీతను తమవెంట తీసికొని చనిరి.

ఇంతలో విశ్వామిత్రుడు అరుదెంచెను. పరశురామునికి అభివాదనము కావించెను. రామ లక్ష్మణులచే ఆ ముని పరశురాముని పాదసరోజములకు మ్రొక్కించెను.

''వీరు రామ లక్ష్మణులు. దశరథుని పుత్రులు'' అని అతడు వచించెను. సుందరులగు ఆ సోదరులనుచూచి పరశురాముడు వారిని ఆశీర్వదించెను. మారునిమదమును హరించు రాముని అపారసుందరరూపమును తిలకించి భార్గవుడు నిశ్చేష్ఠుడయ్యెను. అచ్చటున్న వారినందరిని అతడు చూచెను. అంతయు తెలిసియు, తెలియనివానివలె ఆతడు - ''ఈ గుంపుఅంతయు ఏమి?'' అని జనకుని ప్రశ్నించెను. అతనిశరీరము క్రోధపూరితమయ్యెను. మహీపతులెల్లరు వచ్చిన కారణమునుగురించిన వృత్తాంతము అంతయు జనకుడు వివరించెను. పరశురాముడు వినెను. అతడు వెనుకకు తిరిగి మరి ఒకవైపు చూచెను. ధనువు యొక్క ముక్కలు నేలపై పడిఉన్నవి - కనపడినవి - మహాక్రోధమున అతడు కఠోరవచనములను ఇట్లు నుడివెను:-

''ఓరీ జడుడా, జనకా, ధనువును ఎవరురా విఱచినది ? వెంటనే వానిని నాకు చూపుము. లేనిచో, మూఢా, నేడే నీ రాజ్యము సర్వమును తలక్రిందులు చేసివేతునురా.''

జనకుడు కడు భీతిచెందెను. భయమువలన ఆతడు ప్రత్యుత్తరమీయలేదు. ఈ స్థితినిచూచి కుటిలమానసులగు నరనాథులు మనముల సంతసించిరి. సురలు, మునులు, నాగులు, నగరమునందలి స్త్రీలు, పురుషులు అందరు భయముచే కంపించిరి. ఎల్లరి హృదయములయందు అత్యంతభీతి జనించెను.

''అయ్యో, సఫలమైనకార్యమును విధాత ఇప్పుడు సర్వనాశనము చేసినాడే!'' అని సీతయొక్క తల్లి విచారించుచున్నది. పరశురాముని స్వభావమును వినిన జానకికి అరనిమిష మొక కల్పమువలె గడచుచున్నది.

ప్రజలెల్లరు భయావహులై ఉన్నట్లు శ్రీ రఘువీరుడు కనుగొనెను. జానకి భీరురాలైనట్లు అతడు గ్రహించెను. అతని హృదయమున హర్షముకాని విషాదము కాని లేవు.

''నాథా, శంభుని ధనువును భంగము కావించినవాడు ఎవడో నీ దాసుడే కావలె. తమ ఆనతి ఎయ్యది? నాకు ఏల తెలుపరు?'' అని రాముడు పరశురామునితో పలికెను. భార్గవుడు ఈ మాటలువిని క్రుద్ధుడై, ''సేవ చేయువాడే సేవకుడు. విరోధి చేయతగుపనిని చేయువాడు యుద్ధమే చేయవలెను. రామా, వినుము. శివునివిల్లును విఱచినవాడు నాకు సహస్రబాహునివంటి శత్రువు. వాడెవ్వడో ఈ సమాజమునుండి బయటిరావలెను. లేనిచో రాజులెల్లరు సంహరింపబడుదురు''అనెను.

మునియొక్క మాటలువిని లక్ష్మణుడు మందహాసముచేసి పరశుధరుని, అవమానముచేయు పలుకులను ఇట్లు నుడివెను :-

''స్వామీ, చిన్నతనముననే ఎన్నో ధనువులను నేను విఱచివైచితిని. కాని తమరు ఎన్నడూ ఇట్లు అగ్రహించిఉండలేదు. ఈ ధనువుపై తమకు ఇంత మమకారమునకు కారణమేమో!''

భృగులకేతువగు పరశురాముడు క్రుద్ధుడై ''ఓరీ నృపబాలకా. కాలవశమున నీ నోటికి ఇంచుకంతయు మితిలేదురా. త్రిపురారియొక్క ధనువు సకలలోకవిదితమైనది. బాలకులు ఆడుకొను చిన్నవిల్లనుకొంటివిరా అది?'' అనెను.

లక్ష్మణుడు నవ్వి ''దేవా, వినుడు. మాకు తెలిసినంతవరకు అన్నిధనువులు

R-10

ఒకేరీతిని ఉండును. ఒక పాతవిల్లును విఱచుటవలన లాభ##మేమి? నష్టమేమి? ఈ విల్లును రాముడు క్రొత్తది అనితలచి మోసపోయినాడు. అతడు దానిని తాకినంతనే అది ముక్కలైపోయినది. ఇందు రఘుపతి దోషమేమియు లేదు. మునీ, నిష్కారణముగా తామేల కోపగింతురు?'' అని పలికెను. పరశురాముడు తన పరశువువంక చూచెను.

''ఓరీ ధూర్తుడా, నీవు నా స్వభావమును వినలేదురా ? బాలుడవని తెలిసి నేను నిన్ను చంపుటలేదు. ఓరీ జడుడా, నేను సామాన్యమునిననియే తలచుచున్నావురా ? నేను బాలబ్రహ్మచారిని. అతి కోపిష్ఠిని. విశ్వవిదిత క్షత్రియవిరోధిని. నా భుజబలముచే ఈ పృథ్విని భూపాలరహితము కావించితిని. రాకుమారా, సహస్రబాహుని భుజములను ఖండించిన నా ఈ పరశువును కనుగొనుము. ఓ మహీశకిశోరమా, నీ తల్లిదండ్రులను చింతలపాలు చేయకుము. నా పరశవు అతి కఠోరమైనది. గర్భమునందలి అర్భకులనుసహితము అది నాశనమొనర్చకలదు సుమా?'' అని అతడు నుడివెను.

లక్ష్మణుడు నవ్వెను. ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ''అహో, మునీశ్వరులు తామొక మహాయోధులమని తలంచుచున్నారు. పదేపదే తమ పరశువును నాకు చూపించుచున్నారు. 'ఉఫ్‌' అని ఊది పర్వతమును ఎగురగొట్ట తలచుచున్నారు. ఇక్కడ గుమ్మడిపిందె ఏదియూ లేదు. చూపుడువ్రేలును చూడగానే చచ్చిపోవుటకు? తమ కుఠారమును, శరాసనములను, బాణములనుచూచియే కొంచెము అభిమానమున నేను పలికితిని. తాము భృగులవంశీయులనియు, తమ జందెమును కనుగొనియు తాము ఏమి వచించినను నా కోపమును ఆపుకొని సహించగలను. సురలపై మహీసురులపై, హరిజనులపై, గోవులపై మాకులమువారు శౌర్యమును ప్రదర్శించరు. వీరిని సంహరించినచో పాపము అంటును. వీరిచేతులలో ఓడినచో అపకీర్తి కలుగును. తాము కొట్టిననూ మేము తమ పాదములను పట్టవలయును. తమ మాట ఒక్కొక్కటి ఒకకోటి పిడుగులకు సమానము. ధనుర్బాణములను, పరశువును తమరు వృథాగా ధరించితిరే ! వానిని చూచి నేను కొన్ని అనుచితమగు మాటలను అంటిని. ధీరుడవగు మహామునీ, వానిని క్షమింపుము.

భృగువంశమణి అగు పరశురాముడు ఈ పలుకులను వినెను. క్రోధమున ఇట్లు గంభీరవాక్కులను నుడివెను. ''కౌశికా, వినుము, ఈ బాలుడు మందబుద్ధి, కుటిలుడు కాలవశమున ఇతడు స్వకులఘాతకుడైనాడు. సూర్యవంశచంద్రునికి ఇతడు కళంకము. ఇతడు కేవలము నిరంకుశుడు. మూర్ఖుడు. నిర్భయుడు. ఒక్కక్షణములో ఇతడు ఇప్పుడే యమునికి ఆహారము కాగలడు. గట్టిగా చెప్పుచున్నాను నేను. ఇక నాదోషములేదు. ఇతనిని నీవు రక్షింపతలచితివేని - మా ప్రతాపము, బలము, క్రోధము ఇతనికి వర్ణించిచెప్పి ఇతనిని వారించుము.

అంతట లక్ష్మణుడు ''ఓ మునీ. తమసత్కీర్తిని, తమరు జీవించిఉండగా మరి ఎవరు వర్ణింపగలరు ? తాము కావించిన చర్యలన్నిటిని తమనోట తమరే స్వయముగా అనేకపర్యాయములు - నానావిధముల వర్ణించిఉంటిరి. ఐనను సంతృప్తిలేనిచో మరికొంత వర్ణించుకొనుడు. క్రోధమును నిరోధించుకొని సహింపరానిదుఃఖమును మాత్రము నిరోధింపవలదు. తమరు వీరవ్రతులు, ధీరులు, క్షోభరహితులు. దూషణ చేయుచో ఏమిశోభ తమకు ? శూరులు యుద్ధమున క్రియసాధకులు. తమనుగురించి తామే పొగడుకొనరు. రణమున శత్రువు ఎదుట నిలచిఉండగా పిరికివారుమాత్రమే తమ ప్రతాపమునుగురించి తాము ప్రగల్భములు పలుకుదురు. కాలుడు తమ బంటుకాబోలును. తమరు మాటిమాటికి అతనిని కేకవైచి నాకొఱకై పిలుచుచున్నట్లున్నారు!'' అనెను. లక్ష్మణుని కఠోరవచనములు వినగానే పరశురాముడు కఠోరమగు తన గండ్రగొడ్డలిని చేపట్టెను.

''లోకులు ఇక నన్ను దూషించకుందురుగాక ! పరుషవాక్కులు పలుకు ఈ బాలకుడు నధార్హుడు. ఇతడు బాలుడుకదా అని ఇంతవరకు రక్షించితిని. కాని, ఇక ఇతడు వాస్తవముగా మరణింపనున్నాడు'' అనెను.

''అపరాధమును క్షమింపుము. బాలుర గుణదోషములను సజ్జనులు పరిగణింపరు'' అని కౌశికుడు వచించెను.

అంతట భార్గవరాముడు:- ''నా పరశువు తీక్‌ష్ణమైనది. నేను దయారహితుడను. క్రోధమూర్తిని. వీడు అపరాధి. గురుద్రోహి. నా ఎదుట ప్రతివచనములను పలుకుచున్నాడు. ఐనను వీనిని చంపకవిడిచితిని. విశ్వామిత్రా, కేవలము నిన్నుచూచియే సుమా వీనిని విడచుట. లేనిచో వీనిని ఈ కఠోరకుఠారముచే ఖండించి వైచి ఉందును. స్వల్పశ్రమతోనే గురుని ఋణమును తీర్చిఉందును.'' అని నుడివెను.

విశ్వామిత్రుడు తనలోతాను నవ్వుకొనెను. ''మునివరునికి సర్వము పచ్చగా తోచుచున్నది. కాని ఇతడు లోహఖండము. చెఱకుగడ కాదు. ముని ఇంకనూ అవి వేకముననే ఉన్నాడు. వీరిశక్తిని తెలిసికొనలేరు'' అని అతడు తలచెను. అంతట లక్ష్మణుడు ''మునీ, తమ శీలమునుగురించి తెలియనివారెవరు? ప్రపంచమంతయు అది ప్రసిద్ధమే. తల్లి ఋణమును, తండ్రి ఋణమును తమరు చక్కగా చెల్లించినారు. ఇక మిగిలినది గురువు ఋణమే. దానిని ఇంతవరకు చెల్లింపలేకపోవుట విచారకరమే. ఆ అప్పు తమరు మా మూలముననే చేసినట్లున్నది. చాలాదినములు గడచినవి. వడ్డీ పెరిగినదేమో ! ఋణదాతలను పిలిపించుడు. శీఘ్రమే నేను సంచివిప్పి ధనము ఇచ్చివేతును''అనెను. లక్ష్మణుని కఠోరవచనములను విని పరశురాముడు గండ్రగొడ్డలిని ఎత్తెను. సభఅంతయు 'అయ్యె, అయ్యె' అని కేకలు వైచిరి.

''భృగువర్యా, పరశువును చూపుచుంటివా నాకు? నృపద్రోహీ, నీవు విప్రుడవని తలచిరక్షించుచున్నాను నిన్ను. రణమున ఇంతవరకు యోధులతో నీవు తలపడలేదు. ఓయీ ద్విజదేవా, నీ ఇంటివద్దనే నీవు గొప్పవాడవు''అని లక్ష్మణుడు అనగానే ''అనుచితమిది'' అని జనులెల్లరరు బిగ్గరగా అరచిరి. రఘుపతి సంజ్ఞచేసి లక్ష్మణుని వారించెను. ఆహుతివంటి లక్ష్మణుని ప్రత్యుత్తరము పరశురాముని క్రోధాగ్నిని ప్రజ్వరిల్లచేసెను. రఘుకులదినకరుడగు రాముడు ఈ విషయమును కనుగొని జలమునుపోలు శీతలవచనములను ఇట్లు వచించెను :-

''నాథా, బాలునిపై దయచూపుము. పసివాడు, పాలుకారు మోమువాడు. ఇతనిపై కోపింపకుడు. ప్రభుని ప్రభావము ఎఱిగినవాడే యైనచో ఈ తెలివిలేనిబాలుడు 'తమకు సముడన'ని తలచునా? బాలుడు కొంచెము చపలత్వము కావించినచో గురువు. జననీ జనకులు మనమున ఆనందభరితులగుదురు. కనుక ఈ శిశువు తమ సేవకుడని ఎంచి దయచూపుడు. తమరు సమదర్శులు. సచ్ఛీలురు. ధీరులు, జ్ఞానులగు మునులు.''

రాముని వచనములను విని పరశురాముడు కొంత శాంతించెను. ఇంతలో లక్ష్మణుడు ఏదోపలికి తిరిగి చిరునవ్వు నవ్వెను. అతని నవ్వునుచూచి భార్గవుని ఆగ్రహము నఖశిఖపర్యంతము వ్యాపించెను.

''రామా, నీ తమ్ముడు మహాపాపి. అతనిశరీరము తెలుపే. కాని హృదయము మిక్కిలి నలుపు. అతనిది కాలకూటముఖము. పాలుకారు మొగముకాదు. అతడు సహజముగనే వక్రి. నీవంటివాడు కాదు. ఈ నీచుడు నన్ను కాలునిగా భావించుటలేదు'' అని పరశురాముడ పలికెను.

లక్ష్మణుడు నవ్వి, ''ఓ మునీ, వినుము. క్రోధము పాపమునకు మూలము. కోపవశులై జనులు అనుచితకృత్యములను కావింతురు. విశ్వమంతటికి వారు ప్రతికూలము చేతురు. మునిరాయా, నేను మీ అనుచరుడను. కోపమును పరిహరింపుము. దయకనుము. కోపమువలన విఱిగిపోయిన విల్లు తిరిగి అతుకనేరదు. నిలచి నిలచి మీ కాళ్ళు నొప్పిపట్టెను. కూర్చుండుడు. ఈ ధనువు మీకు అతిప్రియమైనచో ఒక ఉపాయమును కావించుడు. ఎవరైన ఒక మంచిపనివానిని పిలిపించుడు. ఈ తునకులను అతడు అతికించును'' అనెను.

లక్ష్మణుని మాటలువిని జనకుడు భయపడి ''చాలు, ఇక ఊరకుండుము. అనుచితభాషణము అసమంజసము''అనెను. మిథిలాపుర స్త్రీలు, పురుషులు ఎల్లరు గడగడలాడుచుండిరి. ''ఈ చిన్నవాడు కడు చెడ్డవాడు'' అనుకొనిరి.

లక్ష్మణుని నిర్భయవచనములను విని పరశురాముని ఒడలు కోపముచే మండిపోవుచుండెను. అతనిబలము క్షీణించుచుండెను. రామునిపై దయచూపుచు భార్గవరాముడు ''ఇతడు నీ తమ్ముడని తెలిసికొని ఇతనిని రక్షించుచున్నాను. విషరసభరితమగు స్వర్ణకలశమువలె ఇతనిమనస్సు కల్మషమైనది. శరీరము రమణీయమైనది !'' అని వచించెను.

ఈ మాటలువిని లక్ష్మణుడు మరల నవ్వెను. లక్ష్మణునివంక రాముడు తీవ్రదృష్టితో చూచెను. లక్ష్మణుడు సిగ్గుపడి వంకరటింకర భాషణవదలి గురునివద్దకు వెడలెన. అంతట రాముడు రెండుచేతులుజోడించి అతి వినయమున, మృదువగు చల్లని మాటలను ఇట్లు నుడివెను :-

''స్వామీ, అవధరింపుడు. తాము సహజముగనే సజ్జనులు. బాలునిపలుకులను పరిగణింపకుడు. కందిరీగల, బాలకులస్వభావము ఒక్కటే. సజ్జనుల బాలురదోషములను ఎంచరు. ఐనను లక్ష్మణుడు కార్యమేదియు విధ్వంసము చేయలేదు. నాథా, నీకు అపకారము చేసినవాడను నేను. స్వామీ, కృపచూపుదువో, క్రోధమునే చూపుదువో, వధింతువో లేక బంధింతువో - ఏది చేయదలచినను నన్ను నీదాసునిగా ఎంచి నాకే కావింపుము. ఏ రీతిని నీ కోపము శీఘ్రమే తొలగిపోవునో తెలుపుము. మునినాయకా, నేనే ఆ ఉపాయమును ఆచరింతును.''

అంతట పరశురాముడు. ''రామా, నా కోపముపోవుట ఎట్లు? ఇంకనూ నీతమ్ముడు నాపై వక్రదృష్టిని మాననేలేదు. ఇతనికంఠమున నా పరశువును నేను ప్రయోగించనేలేదు. కోపించిమాత్రము నేను చేసినదేమి? ఏ నాకుఠారముయొక్క ఘోరచర్యను వినినంతనే అపనీపతుల భార్యలగర్భములు స్రవించునో అట్టి ఈ పరశువు నా చేతిలో ఉన్నది. ఐనను నాశత్రుని. ఈ భూపాలపుత్రుని సజీవునిగానే చూచుచున్నాను. నాచేయి కదలుటలేదు. కోపముతో నా హృదయము భగ్గుమనుచున్నది. నృపఘాతకి అగు ఈ కుఠారముకూడా మొక్కవోయినదే ! విధాత విపరీతుడైనాడు. నా స్వభావమే మారిపోయినది. లేనిచో నా హృదయమున దయ అనునది ఎన్నడైన కలిగెనా? ఈ దుస్సహదుఃఖమును నేడు 'దయ' నాచే సహింపచేయుచున్నది'' అని నుడివెను.

ఈ మాటలు విని సౌమిత్రి నవ్వి, తలవంచి ఇట్లనెను:- ''తమయొక్క కృపావాయువుసహితము తమమూర్తికి తగినట్లే ఉన్నది. చెట్లనుండి రాలి క్రిందపడు పూవుల వలె ఉన్నవి తమ పలుకులు. మునీ,కృపచూపినచో తమ తనువు దగ్ధమగునెడల తమరు క్రుద్ధులైనచో విధాతయే తమను రక్షించుగాక !''

అంతట పరశురాముడు ''జనకా, చూడుము. మూర్ఖుడగు ఈ బాలుడు బలవంతముగ యమపురికిపోవ తలచుచున్నాడు. వేగమే ఇతనిని నా ఎదుటనుండి ఏల తీసికొని పోవరు? ఈ రాకుమారుడు చూడ చిన్నవాడే-కాని అతిదుష్టుడు!'' అనెను.

లక్ష్మణుడు నవ్వెను. ''కండ్లు మూసికొన్నచో ఎక్కడా ఏదియూ కనపడదు'' అని అతడు అనుకొనెను. పరశురాముని హృదయము మహాక్రోధభరితమయ్యెను.

''ఓరీ శఠుడా, శంభుని శరాసనమును భంగపరచుటయే కాక - మాకు జ్ఞానోపదేశము కావించుచుంటివిరా?'' నీ తమ్ముడు నీ సమ్మతితోనే ఈ కటువచనములను వచించుచున్నాడు. నీవేమో కపటమున కరములు మోడ్చి వినయమును నటించుచున్నావు. యుద్ధమున నన్ను సంతుష్టునిచేయుము. లేదా 'రాము' డనుపేర పిలిపించుకొనుట మానుము. ఓరీ శివద్రోహీ, కపటమువీడి నాతో యుద్ధముచేయుము. లేనిచో, నిన్ను, నీ తమ్ముని సంహరింతును'' అని అనుచు భృగుపతి తన పరశువును అతికోపమున పైకి ఎత్తెను.

రాముడు తలవంచి తనలో తాను నవ్వుకొనెను. ''తప్పు లక్ష్మణునిది. కోపము నాపైన! మంచితనముకూడా ఒక్కొక్కచోట మహాదోషమే ! కుటిలురని తెలిసియు అందరూ వారికే నమస్కరింతురు! వక్రిఅయిన చంద్రుని రాహువు సహితము కబళించడు!'' అని అతడు అనుకొనెను. అంతట, రాముడు పరశురామునితో ఇట్లు వచించెను:-

''మునీశా, కోపమును వీడుడు. తమచేతియందు పరశువున్నది. తమ ఎదుటనే నా శిరమున్నది. ఏపనిచేసినచో తమక్రోధము నశించునో అట్లే కావించుడు. నేను అనుచరుడననిమాత్రము గ్రహించుడు. స్వామికి సేవకునికి యుద్ధము ఎట్లు సంభవము? విప్రవరా, క్రోధమును త్యజించుడు. తమ వేషమునుచూచి బాలకుడు ఏమో పలికినాడు. అతని దోషములేదు. పరశువును, శరమును, ధనువును ధరించిన తమనుచూచి తాము వీరులని తలచి, బాలునికి కోపము కలిగినది. తమపేరు ఇతనికి తెలియును. కాని తమను గుర్తించలేకపోయినాడు. వంశస్వభావమును అనుసరించి ప్రత్యుత్తరమిచ్చినాడు. మునివలె తమరు విచ్చేసిఉన్నచో, స్వామి, ఈకుర్రడు తమ చరణరజమును తన శిరమునధరించి ఉండువాడు. తెలియని తప్పునకు తాము మన్నించుడు. విప్రులహృదయములయందు అమితమగు దయ ఉండవలెను. దేవా, తమకునూ మాకునూ సామ్యమా? శిరమెక్కడ చరణములెక్కడ? తెలుపుడు - 'రాము'డను నా చిన్నపేరు ఎక్కడ? 'పరశువు'తో కూడిన తమ నామమెక్కడ? దేవా, మాదేమో ఒకేగుణము - ధనువు. ఇక తమవో ! పరమపునీతములగు నవగుణములు. సర్వవిధముల మేము తమచేతిలో పరాజయము పొందినవారమే ! విప్రవరా, మా అపరాధములను మన్నింపుడు.''

పదేపదే రాముడు పరశురాముని 'ముని' అని, 'విప్రవరా' అని పిలచుచున్నాడు భృగుపతి కుపితుడై ''నీవును నీ తమ్మునివలె కుటిలుడవే ! నేను కేవలము ద్విజుడననియే అనుకొన్నావు. నేను ఎటువంటి విప్రుడనో తెలియచేతును నీకు. నా చాపమే స్రువము. నా శరము ఆహుతి - నా కోపము మహాఘోరాగ్ని అని గ్రహించుము. నా సుందర చతురంగబలములు సమిధలు. మహామహీపాలురు యజ్ఞపశువులై పోయిరి. వారినెల్లరును నేను ఈ పరశువుతో వధించి బలిగా అర్పించితిని. ఇట్టి సమరయజ్ఞములను, జపములను కోట్లకొలది నేను కావించితిని. నా ప్రభావము తెలియదు నీకు. కనుకనే నీవు నన్ను నిరాదరించి విప్రుడని నన్ననుచుంటివి. చాపమును విఱచుటచే నీగర్వము కడు హెచ్చినది. 'జగత్తునంతటిని జయించి నిలచితి'నను అహంకారము కలిగినది నీకు'' అనెను.

అంతట రాముడు ''మునీ, యోచించిపలుకుడు. తమ ఆగ్రహము అతి ఘనమైనది. నాదోషము అతి స్వల్పమైనది. పురాతనధనువు ! స్పృశించగానే విరిగిపోయినది. నేను గర్వపడుటకు హేతువేది? భృగునాథా, నిజముగా నేను మిమ్ములను విప్రులనిపలికి నిరాదరించినచో - వినుడు ఈ సత్యమును - ఈ లోకమున నేను భయపడి తలవంచవలసినది ఏ యోధునికి ? దేవతలు, దనుజులు, భూపతులు, నానాయోధులు - నాతో సమానబలులైనను సరే - లేక నాకంటే అధికబలులు కానిండు - ఎవరైనను రణమున నన్ను 'ఎదిరించగలము, రమ్మ'ని పిలచినచో వారితో నేను సంతోషమున పోరుదును. కాలునితోనైనను సరే ! క్షత్రియశరీరమును ధరించి, రణమున వెన్నిచ్చు నీచుడు - తనకులమునకే కళంకమును కలిగించువాడు ! మా కులమును ప్రశంసించుకొనుటకుకాక - సహజస్థితినే వచింతును. రఘువంశరాజులు సమరమున కాలుడనినను భయపడరు. విప్రులనుచూచి భీతిల్లువారు ఇతరులకు ఎవ్వరికినీ భయపడరు. ఇది విప్రవంశ మహిమ'' అని సమాధానమిచ్చెను.

రఘుపతియొక్క మృదు, నిగూఢవచనములను విని పరశుధరుని మతిని ఆవరించినతెర తొలగెను.

''రామా, రమాపతీ, ఈ ధనువును నీచేత ధరింపుము. దీనిని సంధింపుము. నా సందేహములను తొలగింపుము'' అని భార్గవరాముడు తన చాపమును రామునికి సమర్పింపబోయెను. అంతట ఆ విల్లు తనకుతానై రామునివద్దకు పరుగిడెను. పరశురామునిమనమున విస్మయము జనించెను. శ్రీరాముని ప్రభావము అతనికి తెలిసెను- భార్గవుని తనువు పులకించి వికసించెను. పరశురాముడు కరములు మోడ్చెను. అతనిహృదయమున ప్రేమ ఉప్పొంగెను ''జయము-జయము.రఘువంశకమలవనభానునికి జయము. దనుజకుల ఘనవన కృశానునకు జయము, జయము. సుర, విప్ర, ధేనుహితకరునకు జయము-జయము. మద, మోహ, క్రోధ, భ్రమహరా నీకు జయము-జయము. వినయ శీల, కరుణాసాగరా నీకు జయము. వచన రచనా చతురా జయము. సేవక సుఖప్రదాతా జయము. కోటి మన్మథ లావణ్యశరీరా నీకు జయము, జయము! నా ఒక్కనోటితో నిన్నెట్లు ప్రశంసింపగలను? మహేశ మన మానసమరాళమా-నీకు జయము. అజ్ఞానమున నిన్ను ఎన్నో అనుచితమగు మాటలంటివి. క్షమామందిరులగు సోదరులిరువురు నన్ను క్షమింపుడు. రఘుకులకేతువగు రామా, నీకు యము. జయము. జయము.'' అని ఇట్లు స్తుతించి భృగుపతి తపమొనర్చుటకు వనమునకు మరలెను.

దుష్టులగు భూపతులు భీతిచెందిరి. పరికిపందలు నోళ్లుమూసికొని అటు ఇటు పారిపోయిరి. దేవతలు దుందుభులు మ్రోగించిరి. ప్రభునిమీద పుష్పవృష్టి కురిపించిరి. మిథిలానగరి స్త్రీ, పురుషులెల్లరు సంతసించిరి. వారి అజ్ఞానజనితక్లేశము అంతరించెను. వాద్యములు వడివడిగా మ్రోగసాగినవి. ఎల్లవారు మనోహరముగా మంగళకర ద్రవ్యములతో అలంకరించిరి. సుందరవదనలు, మనోహరనయనలు, కోకిలవాణులు అగు స్త్రీలు గుంపులు గుంపులుగాకూడి మధురగానమునుచేయ మొదలిడిరి. జనకుని ఆనందము వర్ణనాతీతము. ఆజన్మదరిద్రునికి పెన్నిధి దొరకినట్లున్నది. జానకియొక్క భయము తొలగిపోయెను. చంద్రోదయమైనపిదప చకోరకుమారివలె ఆమె ఆనందించుచున్నది.

కౌశికునికి ప్రణామముచేసి జనకుడు''ప్రభుని ప్రసాదమున రాముడు ధనుర్భంగము కావించినాడు. సోదరులిరువురు నన్ను కృతకృత్యుని చేసినారు. స్వామీ, ఇక కర్తవ్యమును తెలుపుడు'' అని ఆ మునిని కోరెను.

''చతురుడవగు నరనాథా, వినుము. వింటిపైననేకదా వివాహము ఆధారపడినది. విల్లు విఱుగగానే వివాహము జరిగినది ! సుర, నర, నాగులకు ఎల్లరకు ఇది విదితమే. ఐనను, నీవు వెడలి నీ వంశఆచారము ననుసరించి విప్రులను, కుల వృద్ధులను గురువులను సంప్రదించుము. వేదవిదిత ఆచారవిధిని అనుసరించుము. దూతలను అయోధ్యకు పంపించుము. వారేగి దశరథభూపాలుని ఆహ్వానించి తీసికొనివత్తురు'' అని విశ్వామిత్రుడు చెప్పెను. రాజు ముదితుడై ''కృపాళూ, మంచిది'' అనెను. వెంటనే జనకుడు దూతలను రప్పించెను. వారిని అయోధ్యకు పంపించెను. పురప్రముఖులను పిలిపించెను. అందరు ఏతెంచిరీ. జనకునికి సాదరముగా నమస్కరించిరి.

''అంగడులుండు స్థలములను, వీధులను, ఇండ్లను, దేవాలయములను, నగరముయొక్క నాలుగువైపులను అలంకరించుడు'' అని జనకుడు వారికి ఆజ్ఞిచ్చెను. పురప్రముఖులు ఎల్లరు ఆనందించి తమ తమ ఇండ్లకు వచ్చిరి. అనంతరము జనకుడు పరిచారకులను రప్పించి, ''విచిత్రములగు మండపములను అలంకరించి సిద్ధముచేయుడు'' అని ఆనతి ఇచ్చెను. రాజుయొక్క ఆజ్ఞలను తలదాల్చి సంతోషమున వారందరు వెడలిరి.

పిదప జనకుడు వితాననిర్మాణమున కడు కుశలులగు శిల్పకారులను పిలిపించెను. వారు విరించికి నమస్కరించి తమపనులను ఆరంభించిరి. బంగారు అరటిస్తంభములను సిద్ధముకావించిరి. పచ్చనిమణులతో ఆకులు, పండ్లు చేయబడినవి. పద్మరాగమణులతో పూవులు నిర్మింపబడినవి. ఆ మంటపముల అతి విచిత్రనిర్మాణమునుచూచి విరించియొక్క మనస్సు తబ్బిబ్బుపడెను. వెదురుకర్రలు తిన్ననై గణుపులుకలిగి పచ్చనిమణులతో పొదగబడినవి. అవి వెదుళ్ళో కావో గుర్తింప అలవికాదు. కాంచనముతో నిర్మింపబడిన కమనీయమగు తమలపాకులతీగెలు అలంకరింపబడినవి. ఆకులతో అవి ఎంతో అందముగా గుర్తింపబడజాలక ఉన్నవి అట్టి పత్రములతోనే శిల్పసౌందర్యము ఉట్టిపడునట్లు త్రాళ్ళు కట్టబడినవి వానికి మధ్యమధ్య చక్కని ముత్యపు జాలరులు. మరకత, మాణిక్య, వజ్ర, వైడూర్యములను కోసి, సానపెట్టి నగిషీలతో ఆ వలలయందలి సరోజములు చేయబడినవి. అవి అన్నియు గాలితో కదలును. మధురధ్వనులు సలుపును. రొదలు కావించును. స్తంభములమీద దేవతాప్రతిమలు చెక్కబడినవి. ఆ ప్రతిమలన్నియు మంగళద్రవ్యములను చేతపట్టి నిలచిఉన్నవి. సహజసుందరమైన నాలుగువీథులు కలియస్థలములు అనేకవిధములగు గజముక్తామణులచే అలంకరింపబడినవి. నీలమణులను సానపట్టి చక్కని మామిడిఆకులుగా చేసిరి. బంగారపు మామిడిపుల్లలను పట్టుత్రాళ్ళతోకట్టి, పచ్చలతో కూర్చిన ఫలగుచ్ఛములతో శోభాయమానముగా అలంకరించిరి. మన్మథుడే స్వయముగా అలంకరించెనో అనునట్లు శ్రేష్ఠము, రమణీయములు అగు తోరణములను కట్టిరి. మంగళకలశములు, మనోహరధ్వజములు. పతాకములు, తెరలు, వింజామరలు సిద్ధము చేసిరి. మంజుల, మణిమయములైన అనేకదీపము లమర్చబడిన ఆ విచిత్రమంటపమును వర్ణింప అశక్యము.

వైదేహి వధువైన ఆ కల్యాణమండపమును వర్ణింపగలమతి ఏకవికి కలదు? రూపగుణసాగరుడు రాముడు వరుడైఉన్న ఆ మంటపము ముల్లోకములను ప్రకాశింపదా ? జనకుని భవనమునకు కలిగినశోభ మిథిలానగరమునందలి ఇంటింటను కానుపించుచున్నది. ఆ సమయమున తిరుహూతుని చూచినవారికి పదునాలుగుభువనములు అల్పములని తోచినది. ఆ నగరమునందలి నీచగృహములయందలి సంపదలను కనుగొనినను సురనాయకుడు సమ్మోహితుడగును. లక్ష్మియే కపటనారియై, కమనీయ వేషధారియై వసించు ఆ నగరశోభను వర్ణించుటకు శారద. ఆదిశేషుడుసహితము సంకోచింతురు !

దూతలు రాముని పాపనగరమగు అయోధ్యను చేరిరి. సుందరమగు ఆ పురిని విలోకించి వారు ఆనందించిరి. రాజద్వారమువద్దకుచేరి వారు వార్తను పంపించిరి. దశరథభూపాలుడు ఆ వార్తనువిని దూతలను రప్పించుకొనెను. దూతలు దశరథునికి ప్రణామము చేసిరి. పత్రమును ఆయనకు సమర్పించిరి. భూపాలుడు ముదితుడై లేచెను. స్వయముగా ఆ లేఖను స్వీకరించెను. పఠించెను. దానిని చదువుచుండగా ఆయన నచయనములు ఆనందబాష్పములతో నిండెను. తనువు పులకరించెను. హృదయము ఉప్పొంగెను. ఆయన హృదయమున రామ లక్ష్మణులున్నారు. చేతిలో శుభ##లేఖ ఉన్నది మంచినికాని చెడ్డనుకాని ఏదియో దశరధుడు పలుకజాలకున్నాడు. పిదప, ధైర్యమువహించి అతడు పత్రికను బిగ్గరగా చదివెను. యథార్థవిషయమును విని సఖికులెల్లరు సంతసించిరి.

భరతుడు స్నేహితులతో- తమ్మునితోకలసి, ఆడుకొనుచున్నాడు. వార అతనికి చేరినది. తమ్మునితో స్నేహితులతోకలసి అతడు వచ్చెను. అతి ప్రేమతో జంకుచూ భరతుడు ''తండ్రీ, ఎక్కడనుండి వచ్చినది లేఖ ? ప్రాణప్రియులగు మా సోదరులిరువురు కుశలమేనా ? తెలుపుడు. వారిప్పుడు ఏదేశమున ఉన్నారు?'' అని తండ్రిని ప్రశ్నించెను. ప్రేమ సంభరితములగు ఆ పలుకులను విని నరేశుడు మరి ఒకసారి పత్రికను చదివెను. లేఖనువిని అన్నదమ్ము లిరువురు పులకితులైరి. మిక్కుటమగు ప్రేమ వారితనువుల ఉప్పొంగుచున్నది. భరతుని పవిత్రప్రేమను కనుగొని సభికులెల్లరు కడు సంతోషించిరి.

దూతలను భూపాలుడు తన సమీపమున కూర్చుండపెట్టుకొని ''సోదరులారా, తెలుపుడు. మా కుఱ్ఱలిద్దరు కుశలమేకదా? మీ కన్నులతో స్వయముగా వారిని బాగుగా చూచితిరికదా? నల్లనివా డొకడు. తెల్లనివా డింకొకడు. ధనువులను బాణములను ధరింతురు. చిఱుతప్రాయమువారు - కౌశికమునివెంట ఉందురు. వారిని గుర్తించితిమనుచున్నారుకదా! ఏదీ, వారిస్వభావము తెలుపుడు'' అని మధుర, మనోహర వచనములతో అతడు ప్రశ్నించెను. ప్రేమవివశుడై భూపతి దూతలను ఇట్లు పదేపదే ప్రశ్నించుచు ''ఆనాడు వారి నిరువురిని ముని తనవెంట కొనిపోయిననాటనుండియు నేటికి నిజమైనవార్త తెలిసినది నాకు. వివరింపుడు. విదేహనృపతి ఎట్లు గుర్తించెను. వారిని?'' అని అతడు అడిగెను.

ఈ ప్రియవచనములను విని దూతలు చిరునవ్వు నవ్విరి. ''భూపాలముకుటమణీ, అవధరింపుము. విశ్వవిభూషణులగు రామ లక్ష్మణులను తనయులనుగా పడసిన నీవంటి ధన్యుడులేడు వేరొకడు! నీ పుత్రులను గురించి ప్రశ్నింపనక్కరలేదు. వారు పురుషసింహములు. ముల్లోకములయందు ఉజ్జ్వలస్వరూపులు. వారియశస్సు ఎదుట చంద్రు మలినుడు. వారిప్రతాపము ముందు భానుడు శీతలుడు! ప్రభూ, వారిని మేము ఎట్లు గుర్తించితిమని అడిగితివి. రవిని చూపుటకు చేతితో దీపము పట్టుకొనవలెనా? సీతా స్వయంవరమునకు అనేకులు - భూపాలురు - ఒకరినిమించిన యోధులు ఒకరు - సమావేశ##మైరి. శంభుని శరాసనమును ఒక్కరైనను కదలింపలేకపోయిరి. బలవంతులగు సకలవీరులు పరాజయము పొందిరి. 'ముల్లోకములలో మేము వీరుల'మని గర్వించినవారి అందరిశక్తిని శివునివిల్లు భంగము కావించెను. మేరుపర్వతమును పెకలించిన బాణాసురుడు సహితము హృదయమున ఓటమిని అంగీకరించి ప్రదక్షిణముచేసి పలాయనమైనాడు. కైలాసపర్వతమును లీలగా పైకెత్తిన ఆ రావణుడుకూడా పరాభవమును పొందినాడు. రఘువంశమణి అగు రాముడు - మహీపాలా, వినుము. ఏ ప్రయాసములేకనే శివధనువును ఎట్లు విఱచెననుకొంటివి! ఏనుగు పంకజనాళమును తునుకలు చేయునట్లు!

ఈ వార్తనువిని భృగునాయకుడు ఆగ్రహమున విచ్చేసినాడు. ఎన్నోవిధముల కళ్ళెఱ్ఱచేసినాడు. రామునిబలమును కనుగొన్నాడు. తన ధనువును రామునికి సమర్పించి, బహువిధముల వినతికావించి, తుదకు అడవులకు పయనించినాడు.

రాజా, రాముడు ఎట్టి అతులితబలవంతుడో, ఎట్టి తేజోనిధానుడో అట్టివాడే లక్ష్మణుడును. అతనిని చూచినంతనే భూపతులు-సింహపుపిల్లనుచూచిన ఏనుగులవలె కంపించిపోదురు! దేవా, నీ బాలకులను ఇరువురిని చూచినతరువాత మరి ఇంకొకరు మా దృష్టికి అనుటయేలేదు'' అని ఆ దూతలు వచించిరి.

దూతలయొక్క ప్రేమ, ప్రతాపము, వీరరసమున మునిగిన వాగ్ధాటి ఎల్లరకు ప్రియమై తోచెను. దశరథుడు, సభికులు అనురాగమగ్నులై దూతలకు కానుక లీయబోయిరి.

''ఇది నీతివిరుద్ధము!'' అని దూతలు చేతులతో తమచెవులు మూసికొనిరి. వారి ధర్మశీలమును గమనించి అందరు ఆనందించిరి.

దశరథుడులేచి వసిష్ఠుని సమీపించి ఆ మునికి పత్రికను ఇచ్చెను. సాదరముగా దూతలనుపిలిపించి వారిచే సర్వవృత్తాంతమును గురునికి వినిపింపచేసెను. వసిష్ఠుడు విని అత్యంత ఆనందమును పొందెను.

''పుణ్యపురుషులకు భూలోకము సుఖసంభరితమైనది. సాగరునికి కాంక్షలేకున్నను నదులు అతనిని చేరును. అట్లే పిలువకయే సుఖసంపదలు సహజముగనే ధర్మశీలునివద్ద చేరును. గురువులను. విప్రులను, గోవులను, సురలను నీవు సేవించునట్లే కౌసల్యయు పునీత. నీవంటిపుణ్యాత్ములు లోకమున ఇంతవరకు ఎవ్వరూ లేరు. ఇక ఉండబోరు. రాజా, రామునివంటి పుత్రులను పడసితివి. నిన్నుమించిన పుణ్యాత్ములెవ్వరు? నీ పుత్రులు నలుగురూ వీరులు. వినయశీలురు. ధర్మవ్రతధారులు. గుణసాగరులు. నీకు సదా కల్యాణమే. భేరీలను మ్రోగించుము. వివాహమునకు తరలివెడలుటకు సిద్ధము కమ్ము. శీఘ్రమే పయనించుమ'' అని ఆముని నుడివెను.

గురుని వచనములను విని దశరథుడు ''స్వామీ, మంచిది'' అనెను. శిరము వంచి గురునికి నమస్కరించెను. దూతలకు వసతి ఏర్పాటుకావించి తన భవనమునకు ఏగెను. రాణివాసమునంతటిని పిలిపించెను. జనకుడు పంపిన పత్రికను చదివి వినిపించెను. ఆ సందేశమునువిని రాణివాసమెల్లరు సంతసించిరి. మిగిలినవృత్తాంతము సర్వము రాజు వారికి వివరించెను. మేఘగర్జననువినిన మయూరి ప్రసన్నమగునట్లు రాణులెల్లరు ప్రేమతో ప్రపుల్లితవదనలై కడు శోభించిరి. గురుపత్నియు, వృద్ధనారీమణులు ఆనందించిరి. ఆశీర్వదించిరి. తల్లులు మహాసంతోషనిమగ్నులైరి. అత్యంతప్రియమగు ఆ పత్రికను వారందరు ఒకరితరువాత ఒకరు తీసికొని, తమ హృదయములకు హత్తుకొని సంతసించిరి. దశరథభూపాలవరుడు పదేపదే రామ లక్ష్మణులయశమును, చర్యలను వర్ణించెను. ''ఇదియంతయు ఆ మునియొక్క ప్రసాదము'' అని దశరథుడు బయటికి చనెను.

రాణులు భూసురులను పిలిపించి ఆనందమున వారికి దానము లిచ్చిరి. విప్రవరులు ఆశీస్సులను పలుకుచు మరలిరి. అనంతరము రాణులు యాచకులను రప్పించి వారికి కోటివిధములు దానము లిచ్చిరి.

''దశరథచక్రవర్తియొక్క నలుగురు కుమారులు చిరంజీవులగుదురుగాక!'' అని నుడువుచు భిక్షకులు నానావిధములగు సుందరవస్త్రములను ధరించి వెడలిరి. దుందుభులను మ్రోగించువారు హర్షమున వడివడిగా వానిని మ్రోయించిరి.

ప్రజలెల్లరు శుభవార్త వినిరి. ఇంటింటను శుభాకాంక్షలు మారుమ్రోగించిరి.

''జనకసుతకు రఘువీరునకు వివాహమట!'' అను ఉత్సాహము పదునాలుగులోకములను నిండెను. ఈ శుభవార్తనువిని ప్రజలు అనురాగమగ్నులైరి. మార్గములు, గృహములు, సందులు అలంకరింపసాగిరి. అయోధ్య సదా మనోహరమైనదే. రాముని మంగళమయ, పావననగరముకదా అది! అత్యధికప్రీతికరమగు సందర్భము కనుక అది మరింత మంగళకరముగా అలంకరింపబడినది. ధ్వజ, పతాకములతో తెరలతో రమ్యమగు చామరములచే వీధులన్నియు అపూర్వమగుశోభతో ఉన్నవి. కనకకలశములు, తోరణములు, మణులచే నిర్మింపబడిన జాలరులు, పసుపు, గరికదుబ్బులు, పెరుగు, అక్షతలు, మాలలతో నగరవాసులు తమతమ భవనములను అలంకరించి, మంగళమయమ కావించిరి. చందనము, కస్తూరి, కేసరి, కర్పూరములతో చేయబడిన సుగంధద్రవ్యములతో తమ ముంగిళ్లను లోగిళ్లను శృంగారించిరి. విద్యుల్లతలనుపోలు చంద్రవదనలు, బాలహరిణలోచనలు, తమ సౌందర్యముచే రతీదేవి గర్వమును అణచుసౌభాగ్యపతులగు స్త్రీలు - షోడశకళలతో సింగారించుకొని అక్కడక్కడ గుంపులు గుంపులుగా కూడిరి. మంజులగాత్రములతో మంగళగీతములను పాడుచుండిరి. వారి కలరవమునువిని కోకిలలైనను సిగ్గుపడును.

ఇక ఆ భూపాలుని భవనమును ఎట్లు వర్ణించుట? విశ్వమును సమ్మోహపరచు వితానములు అచ్చట సృజింపబడినవి. మనోహరమగు అనేక మంగళద్రవ్యములు శోభిల్లుచున్నవి. పలుదుందుభులు మ్రోయుచున్నవి. ఒకచోట వందీజనములు బిరుదావళిని చాటుచున్నారు. మరి ఒకచోట విప్రులు వేదఘోష కావించుచున్నారు. సుందర వనితలు సీతారాములపేర్లను చెప్పుచు మంగళగీతములు పాడుచున్నారు. ఉత్సాహము పెల్లుబుకుచున్నది. దానితో పోల్చినచో ఆభవనము చిన్నదే. భవనమున ఉత్సాహము నిండి పొంగి పొరలుచున్నది. సకల సుర శిరోమణి అగు శ్రీరాముడు అవతరించిన దశరథుని ఆ మందిరశోభను ఏ కవి వర్ణింపగలడు?

నరపాలుడు భరతుని పిలిపించెను ''నీ వేగి అశ్వములను, గజములను, రథములను అలంకరింపచేయుము. వేగమే రఘువీరుని వివాహబృందముతో పయనముకమ్ము'' అని చెప్పెను. ఈ మాటలు వినగానే భరత శత్రఘ్ను లిరువురు పులకితులైరి. భరతుడు అశ్వశాలల అధ్యక్షులనందరిని పిలిపించెను. వారికి ఆనతి ఇచ్చెను. వారెల్లరు సంతసించి పరుగెత్తుకొని వెడలిరి. తగువిధమున గుఱ్ఱములకు వారు జీనులను అలంకరించిరి. రంగురంగుల ఉత్తమఅశ్వములు రాజిల్లుచున్నవి. ఆ హయములన్నియు అతి సుందరములైనవి. చంచలమగు నడకలవి. కాలుచున్న ఇనుముపై కాళ్ళు పెట్టినట్లు అవి నేలపై తమకాళ్ళు మోపును. వర్ణింపజాలనివి ఎన్నోజాతుల గుఱ్ఱము లున్నవి. గాలినే కాదని అవి ఎగురవలె ననుకొనుచున్నవి. సుందరులగు యువకులు, రాకుమారులు ఆ అశ్వములపై స్వారిచేయుదురు. వారందరు భరతునికి సమవయస్కులే. వారెల్లరు భూషణములనుధరించి, శరచాపములను చేపట్టిరి. తూణీరములను నడుములకు కట్టిరి. వారందరు ఎంచబడినశూరులు, చతురులు. నవయువకులు. ప్రతిగుఱ్ఱమువెంట కత్తిసామున ప్రవీణులగు ఇరువురు పాదచారులగు భటులున్నారు. బిరుదులుకాంచిన శూరులు, రణధీరులు అగువీరులు అందరు బయలుదేరిరి. నగరమునకు వెలుపలికివచ్చి వారు నిలచిరి. ఆ నిపుణులు తమ అశ్వములను వివిధగతుల చిందులు త్రొక్కించుచుండిరి. రథసారథులు - ధ్వజములను, పతాకములను, మణులను, భూషణములను అమర్చి రథములను అతి విచిత్రముగా సిద్ధము చేసిరి. రమ్యమగు వింజామరలుకూడా రథములయందున్నవి. చిరుగజ్జెలు రుచిరరవమును సలుపుచున్నవి. భానుని రథశోభ##నే అపహరించెనా అనునట్లున్నవి. ఆ రథములు. నల్లని చెవులు కలిగిన గుఱ్ఱములు లెక్కలేనన్ని ఉన్నవి. సారథులు రథములకు వానిని కట్టిరి. అన్నియు చూడ ముచ్చటగా అలంకరింపబడి మనోహరముగా ఉన్నవి. వానిని చూచినచో మునుల మనములైనను మోహపరవశమగును. భూమిపై వలె అవి నీటిపైనను పరుగిడగలవు. తమడెక్కలు నీటిలో మునుగునంతవడిగా అవి పరుగిడును.

శస్త్రములను, అస్త్రములను అన్నిటిని అలంకరించి సారథులు రథికులను పిలిపించిరి. రథములయందు ఆసీనులై పెండ్లివారు నగరమునకు వెలుపల సమావేశ##మైరి. ఏపనికి వెడలుచున్నను ఎల్లవారికి శుభశకునములు పొడగట్టినవి. ఉత్తమగజములపై అందమగు అంబారీలు కట్టబడినవి. ఆ అంబారీలు ఎంత చక్కగా శృంగారింపబడినవో చెప్పజాలము. తమకు కట్టబడిన గంటలను మ్రోగించుచు శ్రావణమాసపు మేఘసమూహములవలె మత్తగజములు నడచుచున్నవి. సుందరమగు పల్లకీలు, సుఖమగు ఆసనములు, రథములు మొదలగు అనేకవిధములగు వాహనములున్నవి. వానియందు విప్రవరబృందములు అధిరోహించిరి. సకలవేదములఛందము శరీరమును ధరించెనో అనునట్లు వారెల్లరు పయనించుచున్నారు. వందిమాగధులు, సూతులు, గుణగాయకులు-వారివారికి తగురీతిని ఆయా వాహనములయందు అధిరోహించి చనుచున్నారు.

కంచరగాడిదలు, ఒంటెలు, ఎడ్లు, అనేకజాతుల - అగణిత వివిధవస్తువులను మోసికొని నడచుచున్నవి. కోటానుకోట్ల జలవాహకులు కావళ్లపై నీటిని తీసికొని చనుచున్నారు. అనేకవస్తువులు - వర్ణింపలేనన్ని - వారివెంట ఉన్నవి. సేవకబృందములు తమతమ సామగ్రిని వెంటకొని నడచుచున్నారు. అందరి హృదయములు అపారమగు ఆనందముతో నిండిఉన్నవి. సర్వులశరీరములు పులకితమై ఉన్నవి. వీరులగు రామ లక్ష్మణులను ఇరువురను ఎప్పుడు కన్నులార వీక్షింతుమా అను నదియే వారి ఆకాంక్ష.

ఏనుగులు ఘీంకారము చేయుచున్నవి. వానికి కట్టబడినగంటలు భీషణధ్వని సలుపుచున్నవి. నాలుగువైపులా రథములరవమే. గుఱ్ఱముల సకిలింపులే. మేఘధ్వనిని మించునట్లు భేరీలు మ్రోగుచున్నవి. తమ మాటలుకాని, ఇతరుల మాటలుకాని ఎవ్వరికీ వినిపించుటయేలేదు.

రాజమందిరద్వారమువద్ద ఒక పెద్ద గుంపుచేరినది. ఆ గుంపుమీద ఒకరాయి విసరినచో ఆ రాయి పిండియై దుమ్ము కావలసినదే. మిద్దెలపై ఎక్కి స్త్రీలు మంగళకరమగు పెద్దపెద్ద పళ్ళెములలో హారతులు చేతపట్టుకొని వీక్షించుచున్నారు. బహువిధములగు మనోహరగీతములను గానముచేయుచున్నారు. వారి అమితానందమును వర్ణింపతరముగాదు.

అంతట సుమంత్రుడు రెండురథములను అలంకరింపచేసెను. సూర్యుని రథాశ్వములనుసహితము ఓడించగల గుఱ్ఱములను వానికి కట్టించెను. రమణీయమగు ఆ రెండురథములను అతడు రాజువద్దకు తీసికొనివచ్చెను. ఆ రథములను శారదయైనను వర్ణింపజాలదు. ఒకరథమున రాజులకుతగిన సామగ్రిని ఉంచిరి. తేజోరాశియు, అత్యంతప్రకాశవంతము, సుందరము అగు రెండవరథమున - దశరథుడు ఆనందమున వసిష్ఠుని ఆసీనుని చేసెను. హరుని, గురుని, గౌరిని, గణశుని స్మరించి దశరథుడు తానును ఆ రథమున ఆసీనుడయ్యెను. వసిష్ఠసమేతుడై ఆ నరపాలుడు సురసహితుడగు పురందరునివలె శోభించుచున్నాడు. కులాచారమును, వేదవిధిని అనుసరించి కావించవలసిన కార్యకలాపములనన్నిటిని కావించి, అందరు అన్నివిధముల సిద్ధముగా ఉన్నారని దశరథుడు కనుగొనెను.

రాముని స్మరించి, గురుని ఆనతినికైకొని ఆ మహీపతి శంఖమును పూరించెను. పయనమయ్యెను. పెండ్లివారిని వీక్షించి సురలు సంతసించిరి. సన్మంగళదాయకములగు పుష్పములను కురిపించిరి.

కోలాహలము వ్యాపించినది. గుఱ్ఱములు సకిలించినవి. ఏనుగులు ఘీంకరించినవి. నభమున, ధరిణిపై వాద్యములు మ్రోగుచున్నవి. సురవనితలు, నరనారీమణులు సుమంగళగీతములను పాడుచున్నారు. సరసమగు రాగములలో సన్నాయీలు అలాపించుచున్నవి. గంటల, చిరుగంటలధ్వనులను వర్ణింపజాలము. పాదచారులగు సేవకులు, కత్తిసాముచేయువారు పైకిఎగురుచు తమ వ్యాయామవిద్యలను ప్రదర్శించుచున్నారు. విదూషకులు నానావిధములగు కౌతుకములను కావించుచున్నారు. రాకుమారవరులు తమ అశ్వములను - మృదంగ, భేరీశబ్దములను అనుసరించి నాట్యము చేయించుచున్నారు. తాళము తప్పక గుఱ్ఱములు నాట్యమాడుచున్నవి. చతురులగు నటులు చకితులై ఆ నాట్యమును తిలకించుచున్నారు.

వరుని బృందమును వర్ణింపజాలము. సుందర శుభదాయకశకునములు కనుపించుచున్నవి. సకలసన్మంగళములను సూచించుచున్నదో అనునట్లు నీలకంఠపక్షి ఎడమవైపున ఆహారము ఏరుకొనుచున్నది. కుడివైపున కాకి ఒకటి సస్యశ్యామలమగు పొలములలో కనపడుచున్నది. ఒక ముంగిసనుకూడా అందరు చూచిరి. త్రివిధవాయువులు అనుకూలమగు దిశలయందు వీచుచున్నది. ముత్తైదువ ఒకతె నీటితో నిండినకుండను పట్టుకొని, చంకలో బాలుని ఎత్తుకొని వచ్చుచున్నది. గుంటనక్క ఒకటి పదేపదే అటు ఇటు తిరుగుచు కానవచ్చినది. గోవు ఒకటి ఎదుట నిలబడి దూడకు పాలిచ్చుచున్నది. సర్వము శుభమగునని సూచించుచు లేళ్లమందలు ఎడమవైపునుండి కుడివైపునకు వచ్చుచున్నవి. తెల్లతల గ్రద్దఒకటి విశేషశుభమును సూచించుచున్నవి. శ్యామపక్షి ఒకటి ఎడమదిక్కున ఒక చక్కనిచెట్టుమీద కనపడుచున్నది. పెరుగును, చేపలను, పట్టుకొని ఒకడు, పుస్తకధారులగు ఇరువురు విప్రులు-విద్వాంసులు, ఎదురుగా వచ్చుచున్నారు. మంగళమయ, కల్యాణమయ, అభిమతఫలదాయకములగు శకునములే అన్నియు, శకునములు సత్యమనిపించుటకే ఒకేసారి అవి కనుపించినవి !

సాక్షాత్తు సగుణబ్రహ్మనే సుందరసుతునిగా పడసినవానికి శుభశకునము లన్నియు సులభ##మే. రామునివంటి వరుడు, సీతవంటి వధువు, జనక దశరథులవంటి వియ్యంకులు! వీరితో కల్యాణము జరుగనున్నదని తెలిసి కాబోలు శకునములన్నియు కలసి గంతులు వేయుచున్నవి. ''ఇప్పుడుకదా బ్రహ్మ మేము సత్యమని ఋజువు చేసినాడు'' అని అనుచున్నవి.

ఇట్లు మగపెండ్లివారు పయనము సాగించుచున్నారు. గుఱ్ఱములు, ఏనుగులు గర్జించుచున్నవి. భేరీలు మ్రోగుచున్నవి. భానుకులకేతువగు దశరథుడు వచ్చుచున్నాడని తెలిసికొని జనకుడు మార్గమందలి నదులపై వంతెనలు నిర్మించెను. మధ్యమధ్య అగుటకు చక్కని విడిది గృహములు కట్టించెను. వానియందు సురపుర సన్నిభసంపదలు వెలయుచున్నవి. ఎక్కడ, ఏవి కావలసిన అక్కడ, అవి - తమ మనోవాంఛితపదార్థములు, ఉత్తమ భోజనము, శయ్య, వస్త్రములు- మగ పెండ్లివారికి లభించును. తమ మానసములకు అనుకూలమగు నిత్య నూతనసౌఖ్యములను చూచి వారెల్లరు తమ ఇండ్లనే మరచిరి.

వడివడిగా మ్రోగు నగారాల శబ్దములను విని, వరపక్షమువారి వరబృందమువచ్చుచున్నదని తెలిసికొని వారికి స్వాగతమిచ్చుటకు ఆడు పెండ్లివారు ఏనుగులను, రథములను, గుఱ్ఱములను, కాల్బలములను అలంకరించుకొని బయలుదేరిరి.

కనుక కలశములను - వర్ణనాతీతమగు, అమృతసమానమగు అనేకవిధములగు పిండివంటలతో నిండిన పెద్ద పళ్ళెరములను, చిన్నపళ్ళెములను, ఇంకను అనేకవిధములగు పాత్రలను, స్వాదిష్టఫలములను, సుందరపదార్థములను ఆనందమున జనకుడు కానుకలుగా పంపెను. భూషణములు, వస్త్రములు, నానావిధములగు మహామణులు.

R-11

పక్షులు, పశువులు, అశ్వములు, గజములు, బహువిధములగు వాహనములు. పలురీతులగు సుగంధద్రవ్యములు, శుభసూచకము, రమణీయములగు మంగళద్రవ్యములు ఆ నరపతి పంపించెను. పెరుగు, అటుకులు, లెక్కలేనన్ని అల్పాహారపదార్థములు కావళ్ళపై నింపి పంపబడినవి.

మగ పెండ్లివారు కనుపించగానే ఎదురుకోలకు ఏతెంచినవారి హృదయములు ఆనందభరితము లయ్యెను. శరీరములు పులకించెను. వారిని, వారు తెచ్చిన సామగ్రినిచూచి వరపక్షమునవారు ఆనందించిరి. భేరీలను మ్రోగించిరి. ఇరుపక్షములవారిలో కొందరు పరస్పర సమాగమమునకై ఉత్సాహమున పరుగెత్తుకొని వెడలిరి. సంప్రదాయమును ఆవలపెట్టి, ఆనందసాగరములు రెండు కలియునట్లు ఆ బృందములు కలిసినవి. సుర సుందరవనితలు సుమములను కురిపించిరి. గానముచేసిరి. ముదమున దేవతలు దుందుభులను మ్రోగించిరి.

ఆడుపెండ్లివారు తాము తెచ్చిన సకలవస్తువులను దశరథుని ఎదుట ఉంచిరి' స్వీకరించుడని అతి అనురాగమున వినతి కావించిరి. ప్రేమతో వానినన్నిటిని దశరథుడు స్వీకరించెను. యాచకులకు దానమిచ్చెను. పూజించి, ఆదర సత్కారములు కావించి. ప్రశంసించి ఆడపెండ్లివారు దశరథుని అతిథి మందిరమునకు తీసికొని వెడలిరి. అద్వితీయమగు వస్త్రములతో చేయబడిన రత్నకంబళ్ళు నేలపై పరచబడినవి. వానినిచూచి ధనదుడు సహితము తన ధనగర్వమును త్యజించవలసినదే. విడిదికి అతిథిగృహములు అతి సుందరముగా ఉన్నవి. వానిలో అందరికి అన్నివిధముల తగు సౌకర్యములు కలవు.

పెండ్లివారు మిథిలాపురమునకు వచ్చిరని సీతకు తెలిసెను. ఆమె తన మహిమను కొంత ప్రకటించి చూపించెను. తన హృదయమున స్మరించి ఆమె సర్వసిద్ధులను ఆహ్వానించి దశరథునికి అతిథ్యమిమ్మని వానిని పంపించెను. సీతయొక్క ఆనతిని విని సిద్ధులెల్లయు సకలసంపదలను, సుఖములను, అమరపురియందలి భోగములను, విలాసములను విడిదికి తీసికొనివచ్చెను. వరపక్షమువారు తమ విడిది ప్రదేశములను చూచిరికదా - దేవతాసుఖములన్నియు అచ్చట ఏర్పాటై ప్రతిఒక్కనికి సులభముగా లభించుచున్నవి. ఈ వైభవముయొక్క రహస్యముఎవ్వరికీ తెలియదు.ఎల్లరూ జనకునే పొగడుచున్నారు! ఇది అంతయు సీతయొక్క మహిమయే అని రఘునాయకునికి తెలియును. సీతయొక్క ప్రేమను గుర్తించి అతడు ఆనందించెను.

తమ తండ్రి ఏతెంచెనని విని రామ లక్ష్మణుల హృదయములయందు ఆనందము ఉప్పొంగెను. నమ్రులై వారు గురునికి ఏమియు చెప్పజాలకున్నారు. తండ్రిని దర్శింపవలెనను ఆసక్తి వారి మనస్సులయందున్నది. వారి అత్యధికనమ్రతను విశ్వామిత్రుడు కనుగొని కడు సంతసించెను. ఆనందముతో అతడు రామ లక్ష్మణులను ఆలింగము చేసికొనెను. అతని తనువు ఉప్పొంగెను. కన్నుల నీరు నిండెన. దప్పికొనిన బాటసారివద్దకు తటాకమే ఏగెనా అనునట్లు వారు దశరథునివద్దకు వెడలిరి. రామ లక్ష్మణులతో కలసి వచ్చుచున్న మునిని దశరథుడు చూచెను. సంతోషమున లేచి సుఖసముద్రపు లోతును కనుగొన్నట్లు వారిని అతడు చూచెను. వారిని సమీపించెను.

దశరథ మహీపాలుడు విశ్వామిత్రునికి సాష్టాంగదండప్రణామము చేసెను. ఆ మునియొక్క పాదధూళిని తన తలపై పదేపదే ధరించెను. కౌశికుడు రాజును లేవనెత్తి కౌగిలించుకొనెను. ఆశీర్వదించెను. కుశలమును అడిగెను. సోదరు లిరువురు తనకు సాష్టాంగనమస్కారము చేయుచుండగా చూచి దశరథుడు అమిత ఆనందమును పొందెను. సుతులను అతడు తన హృదయమునకు హత్తుకొనెను. మరణించినవానికి తిరిగి ప్రాణము వచ్చినట్లున్నది ! దశరథుని దుర్భర దుఃఖము దూరమయ్యెను. రామ లక్ష్మణులు శిరములువంచి వసిష్ఠుని చరణములకు నమస్కరించిరి. ప్రేమానందమున మునివరుడు వారిని కౌగలించుకొనెను. అన్నదమ్ములిద్దరు విప్రబృందమునకు వందనము చేసిరి. తమ కోర్కెలను సఫలమొనర్చు ఆశీర్వాదములను పొందిరి. అనుజసహితుడై భరతుడు రామునికి ప్రణామము చేసెను. రాముడు వారిని లేవనెత్తి తన హృదయమునకు హత్తుకొనెను. భరత శత్రుఘ్నులనుచూచి లక్ష్మణుడు ఆనందించెను. ప్రేమ సంభరిత తనువుతో వారిని ఆలింగనము చేసికొనెను.

పరమకృపాళుడ, వినయుడు అగు రాముడు అయోధ్యాపురజనులను, పరిజనులను, స్వజనులను, యాచకులను, మంత్రులను, మిత్రులను - ఎల్లవారిని యథావిధిని అభినందించెను.

దశరథునితో వచ్చినవారి హృదయములు రామునిచూచి చల్లపడెను. పెండ్లివారి ప్రేమయొక్కరీతులు వర్ణనాతీతము. ప్రక్కనిలచిన అతని నలుగురు సుతులు ధర్మ, అర్థ, కామ, మోక్షములు శరీరములను ధరించి ఉన్నచో అనునట్లు ప్రకాశించుచున్నారు. పుత్రసహితుడగు దశరథునిచూచి మిథిలానగర స్త్రీ, పురుషులు మిక్కిలి ఆనందించిరి. సురలు సుమములను కురిపించిరి. దుందుభులను మ్రోగించిరి. స్వర్గవేశ్యలు గానము చేయుచు నాట్యమాడిరి.

మగ పెండ్లివారికి స్వాగతము పలుకుటకు ఏతెంచిన శతానందుడు, ఇతరవిప్రులు. సచివగణములు, మాగధులు, సూతులు, విద్వాంసులు వందీజనులు దశరథునికి అతని బృందమునకు ఆదరసత్కారములు కావించిరి. ఆనతిపొంది వారు తిరిగి వెడలిరి. లగ్నదినమునకు ముందే మగపెండ్లివారు వచ్చినందున మిథిలాపురమున మహానందము వెల్లివిరియుచున్నది. ఎల్లరు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు.

''రాత్రులూ, పవళ్ళు ఎక్కువగా పొడిగించవయ్యా బ్రహ్మయ్యా'' అని వారు విధాతను ప్రార్థించుచున్నారు. ''సౌందర్యమునకు అవధులు సీతారాములు ! సుకృతమునకు మేరలు ఈ జనక దశరథ రాజులు! జనకుని పుణ్యములమూర్తి జానకి. దశరథుని సుకృతములే దేహమును ధరించిన రామమూర్తి. వీరివలె మరి ఎవ్వరూ శివుని ఆరాధించి ఉండరు. వీరివలె ఇంకెవ్వరూ ఫలములను పొందిఉండదు. వీరికి ఈడగువారు జగమున వేరెవ్వరు లేరు. ఉండలేదు. ఉండబోరు. మనము అందరము సకల సుకృతరాసులము. జనకపురివాసులమై జగమున జన్మించితిమి. జానకీ రాముల సౌందర్యమును కన్నులార కాంచితిమి. విశేషపుణ్యాత్ములు - మనవంటివా రెవరున్నారు? ఇక రఘువీరుని పరిణయమును పరికింతము, కన్నులున్న ఫలమును అనుభవింతము!'' అని మిథిలాపుర స్త్రీలు, పురుషులు అనుకొనుచున్నారు.

కోకిలవాణులగు స్త్రీలు - ఒకరితో ఒకరు ఇట్లు సంభాషించుచున్నారు :-

''ఓసీ సులోచనా, ఈ వివాహమున బహుప్రయోజనము. కలదు కదే! కడు భాగ్యవశమున విధాత ఈ కల్యాణము సమకూర్చినాడు. ఈ అన్నదమ్ము లిద్దరు మన కన్నులపండువ కదే ! ప్రేమవశుడైన జనకుడు మాటిమాటికి సీతను పిలిపించును. కోటిమన్మథ - కమనీయమూర్తులగు ఆ సోదరులు సీతను తీసికొనివెడలుటకు వత్తురు. అప్పుడు అనేకవిధములగు అతిథిసత్కారములు వారికి జరుగును. ఇట్టి అత్తవారి ఇల్లు ఎవరికి ప్రియముకాదే సఖీ? మన పురవాసులెల్లరము అప్పుడప్పుడు రామ లక్ష్మణులనుచూచి ఆనందింతుమే! సఖీ, రామ లక్ష్మణ జంటవలెనే భూపాలునివెంట మరి ఒక జంట ఉన్నదట! వారియందునూ ఇట్లే - ఒకడు శ్యామవర్ణుడు, ఇంకొకడు గౌరవర్ణుడు అట! వారునూ సర్వాంగసుందరులేనట ! వారిని చూచివచ్చినవారు చెప్పిన మాటలేనే ఇవి అన్నియూ.''

ఒకతె అనినది : ''వారిని నేడే నేను చూచితినే ! స్వయముగా విరించి స్వహస్తములతో వారిని సృజించెనేమో అనిపించెనే నాకు! భరతుడు అచ్చము రాముని పోలికయే. ఏ పురుషుడు కాని, స్త్రీ కాని వారిని ఎవరైనదీ గుర్తింపజాలరే వెంటనే! లక్ష్మణ, శత్రుఘ్నుల రూపములు ఒక్కటేనే! నఖశిఖపర్యంతము వారి సర్వాంగములు అనుపమమైనవి. మనస్సులకు అమితానందము కలుగును - వారిని చూచిన చాలు! వారిని మాటలలో వర్ణింపజాలము. వారితో పోల్చతగునది ముల్లోకములయందు ఏదియు లేదు ! వీరికి సాటికి ఎవ్వరూ లేరని తులసీదాసు, కవులు, కోవిదులు నుడువుదురు. బల, వినయ, విద్యా, శీల, శోభాసముద్రులగు వీరికి వీరే సాటి.''

మిథిలాపుర స్త్రీలందరు ''ఈ నలుగురు సోదరులకు ఈ నగరముననే కల్యాణము కావించుము. మే మెల్లరము సుందర మంగళగీతములను గానము చేతును'' అని కొంగుపట్టి విధాతను వేడుకొనుచున్నారు. కన్నుల నీరుక్రమ్మ, తనువులు పులకరింప నారీమణులు ఒకరితో ఒకరు :- ''సఖీ, ఈ రాజులిద్దరు పుణ్యసాగరులే ! వీరి మనోరథములనన్నిటిని త్రిపురారి సఫలముచేయును!'' అని అనుకొనుచున్నారు. ఇట్లు ఎల్లరు మనోరథములను సృజించుకొనుచున్నారు. వారి హృదయములు ఉప్పొంగి ఉత్సాహభరితము లగుచున్నవి.

సీతాస్వయంవరమునకు వచ్చిన రాజులందరు - రామ లక్ష్మణ భరత శత్రఘ్నులనుచూచి ఆనందించిరి. రాముని నిర్మలయశమును కొనియాడుచు మహీపతులు తమ తమ భవనములకు మరలిరి.

ఇట్లు కొన్నిదినములు గడచెను. జనకపురవాసులు, పెండ్లివారు అందరూ ఆనందమగ్నులై ఉన్నారు. మంగళములకు మూలమగు లగ్నదినము వచ్చెను. హేమంతఋతువు, మనోహరమగు మార్గశిరమాసము. గ్రహములు, తిథి, నక్షత్రము, యోగము, వారము అన్నియు శ్రేష్ఠములై ఉన్నవి. విరించియే లగ్నమును శోధించి గణించెను.

లగ్నపత్రిక నారదునిచేత జనకునివద్దకు పంపబడెను. జనకుని జ్యోతిష్కులు కూడా ఆ లగ్నముచే అంతకుపూర్వమే నిశ్చయించిఉంచిరి. ఈ విషయము తెలియగానే ''మా జ్యోతిష్కులుకూడా విధాతలే!'' అని నగరవాసులు నుడివిరి.

నిర్మలము, సకలసన్మంగళముల మూలము అగు గోధూళి సమయము సమీపించెను. శుభశకునములు కనుపించెను. ఈసంగతి తెలసికొని విప్రులు జనకునికి తెలిపిరి.

''ఇక ఆలశ్యమునకు కారణమేమి? అని జనకుడు శతానందుని అడిగెను. అంతట శతానందుడు సచివులను పిలిపించెను. సకల మంగళద్రవ్యమును అలంకరించుకొని, వానిని తీసికొని వారు వచ్చిరి. శంఖములు, నగారాలు, డోళ్ళు - అనేక విధములగు వాద్యములు మ్రోగుచున్నవి. మంగళకరములు, శుభశకునద్రవ్యములు సిద్ధము చేయబడినవి. సుందరులగు సువాసినులు గీతములు గానము చేయుచున్నారు. పవిత్రులగు విప్రులు వేదఘోషను కావించుచున్నారు.

ఈరీతిగా అందరు సాదరముగా మగ పెండ్లివారిని ఆహ్వానించి తీసికొనివచ్చుటకు వెడలిరి. అందరు పెండ్లివారివిడిదికి అరుదెంచిరి. కోసలాధిపతియొక్క బృందము యొక్క వైభవమును కనుగొని దేవేంద్రుని వైభవము సహితము అతి అల్పమే అనిపించినది వారికి.

''సమయమైనది. ఇక విచ్చేయుడు'' అని వారు వినతిచేసిరి. ఈమాటలు వినగానే నగారాపై దెబ్బ పడినది. దశరథుడు వసిష్ఠుని సంప్రదించి తమ కులమర్యాదలను అన్నిటిని పాటించెను. మునులను, సాధుసమాజములను వెంటనిడుకొని అతడు బయలుదేరెను.

అయోధ్యాధీశుని భాగ్యమును, వైభవమునుచూచి బ్రహ్మాదిదేవతలు తమజన్మలు నిష్ప్రయోజనములని ఎంచి, దశరథుని వేనోళ్ళ కొనియాడిరి. శుభ, మంగళ సమయమును తెలిసికొని దేవతలు అలరుసోనలు కురిపించిరి. దుందుభులు మ్రోయించిరి. శివ, బ్రహ్మాదిదేవతలు గుంపులు గుంపులుగా కూడి విమానములయందు అధిరోహించిరి. ప్రేమ పులకితగాత్రులై, ఉత్సాహహరితహృదయులై వారు రాముని కల్యాణమును వీక్షింప ఏతెంచిరి. జనకపురిని చూచి వారు మిక్కిలి అచ్చెరువొందిరి. ఆ పురితో పోల్చిన - తమ లోకములన్నియు - వారికి అల్పము లనిపించెను. విచిత్రమంటపములను, వివిధవిధములగు అలౌకిక నిర్మాణములను వారు చకితులై తిలకించిరి.

మిథిలానగర స్త్రీ పురుషులెల్లరు రూపభండారములు. సౌందర్యనిలయులు. శ్రేషధర్మాత్ములు. సచ్ఛీలురు, సజ్జనులు, వారినిచూచి దేవతలు, దేవతాస్త్రీలు, సర్వులు-చంద్రకాంతియందలి తారలవలె వెలవెల పోయిరి. విధాతకు మహా ఆశ్చర్యము కలిగెను. తన నిర్మాణచాతుర్యము అక్కడ ఎక్కడా అతనికి కనుపించనేలేదు. అంతట శివుడు ''ఆశ్చర్యమున మిమ్ము మీరే మరతురేమో- మరువకుడు?'' అని సురలను హెచ్చరించెను. ''మీ హృదయములయందు ధైర్యము పూనుడు. సీతా రఘువీరుల వివాహమిది అని గ్రహించుడు. ఎవనినామము ఉచ్చరించినవాత్రమున సకల అమంగళములమూలములు నశించునో, చతుర్విథపురుషార్థములు కరతలమగునో ఆ సీతారాములే వీరు'' అని మదనారి వచించెను.

ఇట్లు శంభుడు దేవతలను హెచ్చరించి తన ఉత్తమవాహనముపై ముందుకు సాగెను. మహా ఆనందమున పులకితశరీరుడై దశరథుడు పయనించుచుండగా సురలు వీక్షించుచున్నారు. దశరథునివెంట సాధు, బ్రాహ్మణసమాజము లున్నవి. సకలసుఖములు తనువులను ధరించి దశరథుని సేవించుచున్నట్లున్నారు. సొబగుగల నలువురు కొమరులు - సకల అపవర్గములు శరీరములను ధరించినవో అనునట్లు దశరథునివెంట వెలుగొందుచున్నారు.

మరకతమణి, కనకపువర్ణముకలిగిన జంటల కలయికను కనుగొని సురలు మిక్కిలి సంతసించిరి. రాముని వీక్షించి వారు అమితానందమును పొందిరి. రాజును కొనియాడిరి. పూలను కురిపించిరి.

రాముని సుందరరూపమును నఖశిఖపర్యంతము పదేపదే తిలకించుచున్న ఉమామహేశ్వరుల శరీరములు పులకించెను. వారికన్నుల నీరు నిండెను.

కేకీకంఠద్యుతితో శోభిల్లు శ్యామలగాత్రము. విద్యుల్లతను నిరాదరించు ధగధగమును సుందరవర్ణవస్త్రములు శరీరమున విరాజిల్లు సకలమంగళరూప, వివిధసుందరములగు వివాహ విభూషణములు - నిర్మల శరత్‌పూర్ణిమా చంద్రునివంటి వదనము నవీనకమలములకు లజ్జను కలిగించు రమణీయనయనములు - రాముని సౌందర్యము సర్వము అలౌకికమైనది. వర్ణనాతీతమైనది. మునుల మానసమునకు మహదానందమును కలిగించునది.

మనోహరులగు ఆతని సోదరులు చపలతురగములను అధిరోహించి, వానిచే నాట్యమాడించుచు, కదనుత్రొక్కించుచు రాజిల్లుచున్నారు. ఆ రాకుమారులు తమ ఉత్తమాశ్వముల నైపుణ్యమును ప్రదర్శించుచున్నారు. వందిమాగధులు రాజవంశ బిరుదావళిని ప్రశంసించుచున్నారు. రాముడు అధిరోహించిన అశ్వపు నడకనుచూచి ఖగనాయకుడు - గరుడుడు సహితము సిగ్గుపడుచున్నాడు. సకలవిధముల వర్ణనాతీతమై, సుందరమైఉన్న తురగమది. రాముని శ్రేయముకొరకై కాముడు హయవేషమును ధరించి శోభిల్లుచున్నాడేమో ! తన వయో, బల, రూప, గుణ, గతులచే అఖిలభువనములను ఆ అశ్వము మోహపరవశము కావించుచున్నది. చక్కని ముత్యములు, మణులు, మాణిక్యములు అమర్చి రత్నములుకూర్చిన జీను దానిపై తళుకుమనుచున్నది. చిరుగజ్జెలు కట్టబడినదాని కళ్ళెమునుచూచి దేవతలు, మనుజులు, మునులు - ఎల్లరు ఆశ్చర్యచకితులగుచున్నారు. ప్రభుని మనోభీష్టమున తన మనసును లగ్నము చేసి కదలుచున్న ఆ అశ్వము అత్యంతసుందరముగా ఉన్నది. తారాగణములు, విద్యుల్లతలచే అలంకరింపబడిన మేఘములు ఒక రమణీయమయూరమును నాట్యమాడించు చున్నట్లున్నవి. రాముడు స్వారిచేయుచున్న ఆ అశ్వమును శారదయైనను వర్ణింపజాలదు. రాముని రూపమునుకని శంకరుడు కడు అనురాగమగ్నుడయ్యెను. పదునైదు కన్నులున్నందుకు తాను మహాభాగ్యవంతుడనని తలచుచున్నాడు హరుడు. ప్రేమసహితుడై శ్రీహరి రామునివంక చూచినంతట రమాపతియు, రమయును సమ్మోహితులైరి. రాముని లావణ్యమునుకాంచి విరించియు కడు ఆనందించెను. ''అయ్యో, నాకు ఎనిమిది కన్నులేనా?'' అని అతడు చింతించెను. సురసేనాపతిఅగు కార్తికేయుని హృదయమున మిక్కుటమగు ఉత్సాహము కలిగెను. ''బ్రహ్మకు ఎనిమిది కన్నులు. నాకు పండ్రెండు !'' అని అతడు తలచుచున్నాడు.

చతురుడగు ఇంద్రుడు తన వేయికన్నులతో రాముని వీక్షించుచున్నాడు. ''గౌతమునిశాపము నాకు పరమహితకర'' మయ్యెనని అతడు అనుకొనుచున్నాడు.

''నేడు ఈ పురందరునికి ఈడైనవా డెవ్వడూ లేడ''ని సకలదేవతలు ఈర్ష్యచెందుచున్నారు. రాముని కనుగొని దేవగణములు ముదితులగుచున్నారు.

భూపాలుర సమాజముల రెండింటియందును అమితమగు ఆనందము వెల్లి విరియుచున్నది. నగారాలు కడు వడివడిగా మ్రోగుచున్నవి. ప్రసన్నులై సురలు ''రఘుకులమణి రామునికి జయము-జయము.జయము.''అని కేకలిడుచున్నారు. పూలవానను కురిపించుచున్నారు.

ఇట్లు ఏతెంచుచున్న మగ పెండ్లివారినిచూచి పలువిధములగు వాద్యములు మ్రోగమొదలిడినవి. రాణి ముతెదువులను పిలిపించెను. వరునికి తమవాకిట హారతిని ఇచ్చుటకు మంగళద్రవ్యములను అమర్చసాగెను. అనేకవిధములుగా హారతిని అలంకరించి, సకలమంగళద్రవ్యములను సమకూర్చుకొని అమర్చి - గజగామినులగు వనితామణులు ముదమున-హారతి నిచ్చుటకు కదలిరి. ఆ నారీమణులులెల్లరు చంద్రవదనలు, మృగనయనలు, తమ లావణ్యముచే వారు రతియొక్క మదమును అణచువారే ! వారెల్లరు రంగురంగుల చీరెలను ధరించిరి. సర్వఆభరణములతోతమ శరీరములను అలంకరించిరి. తమ సకలాంగములను సుమంగళకరముగా శృంగారించుకొనిన ఆ తరుణులు కోయిలలుకూడా సిగ్గుపడునంత మధురముగా గానము చేయుచున్నాడు. కంకణములు, కింకిణులు, నూపురములు మ్రోగుచున్నవి. ఆ గజగామినుల గమనమును కనుగొని కాముని గజములై నను సిగ్గుతో తల వంచవలసినదే. బహువిధములగు వాద్యములు మ్రోగుచున్నవి. భూమి, ఆకాశములయందు ఆనందము ఉప్పొంగుచున్నది. పవిత్రహృదయలు, సహజచతురలు, శచి, శారద, రమ. భవాని, మరి ఇతర దేవాంగనలు - అందరు కపటనారీమణులవేషములను ధరించిరి. వచ్చి రాణివాసస్త్రీలలో చేరిరి. కమనీయకంఠములతో మంగళగానముచేయ మొదలిడిరి. ఎల్లరు హర్షవివశులై ఉన్నందున ఎవ్వరూ వారిని గుర్తించలేకున్నారు. ఎవరు ఎవరో ఎవరు చెప్పగలరు? ఆనందవశమున అందరు వరుడైవచ్చని పరబ్రహ్మకు హారతులిచ్చుటకు బయలుదేరిరి. మనోహరగానము ప్రవహించుచున్నది. దుందుభులు మధురముగా మారుమ్రోగుచున్నవి. సురలు సముములను కురిపించుచున్నారు. సర్వము అత్యంతశోభాయామానమై ఉన్నది. ఆనందమునకు మూలాధారుడగు వరుని విలోకించి వనితలెల్లరు సంతసించుచుండిరి. వారి నేత్రములనుండి ప్రేమా శ్రువులు పొంగి పొరలుచున్నది. వారి రమణీయాంగములను పులకావళి క్రమ్మెను. పరవేషధరుడగు రాముని తిలకించి జానకి యొక్క తల్లి పొందిన ఆనందమును వేయిమంది శారదలు, ఆదిశేషులు. శత కల్ప ములయందైనను వర్ణింపజాలరు.

అది శుభసమయమని గ్రహించి రాణులు తమ కన్నీటిని తుడుచుకొని ఆనందమున వరునికి మంగళహారతి పట్టిరి. వేదవిహిత విధిని, కులాచారముననుసరించి సర్వ కార్యకలాపములను రాణి చక్కగా జరుపుచున్నది.

పంచసంగీతములు, పంచధ్వనులు, మంగళగానములు మారుమ్రోగుచున్నవి. అనేకవిధములగు రత్నకంబళ్ళు పఱచబడినవి. రాణులు హారతులిచ్చిరి. ఆర్ఘ్యము లిచ్చిరి. అంతట రాముడు మండపమున ప్రవేశించనేగెను. దశరథుడు, ఆతని బృందము అచ్చట వెలుగొందుచున్నారు. అతనివైభవమునుచూచి లోకపాలురు లజ్జ చెందు చున్నారు. దేవతలు పదేపదే పూలవానను కురిపించుచున్నారు. మహీసురులు శాంతి పాఠములను పఠించుచున్నారు. నభమున, నగరమున కోలాహలము వ్యాపించెను. ఎవరిమాటలు వారికే వినబడుటలేదు. ఇతరులమాటలు సరేసరి.

రాముడు మండపమున ప్రవేశించెను. ఆర్ఘ్యమునిచ్చి ఆతనిని తోడ్కొని వెడలిరి. ఆసీనునిచేసిరి. హారతులిచ్చిరి. వరుని వీక్షించి ఎల్లరు ఆనందించిరి. మణులను వస్త్రములను, ఆభరణములను వారు విరివిగా కానుక లిచ్చిరి. మంగళగీతములను స్త్రీలు గానముచేసిరి. బ్రహ్మాది సురవరులు విప్రవేషములనుధరించి ఆ కౌతుకమును తిలకించుచుండిరి. రఘుకుల కమల రవి అగు రాముని లావణ్యమును వీక్షించి తమ జన్మలు సఫలమయ్యెనని వారు భావించిరి.

మంగళ్లు, దివిటీలు మోయువారు, వందులు, నటులు, రాముని కానుకలను గ్రహించి సంతసించి, శిరములు వంచి, ఆనందభరితహృదయములతో అతని ఆశీర్వదించిరి.

వైదిక లౌకిక ఆచారపద్ధతులనన్నిటిని అనుసరించి కార్యక్రమమును జనకుడు, దశరథుడు జరిపి అతిప్రేమతో ఆలింగనము చేసికొనిరి. ఆ ఇరువురు మహారాజుల సమావేశము అతి శోభాయమానమై ఉన్నది. దానినిపోల్చుటకు తగు సామ్యమును వెదకివెదకి కవులు కనుగొనవలేక విఫలులై తమ ఓటమిని అంగీకరించిరి. తుదకు కవులకు ఒకే ఒక సామ్యముతట్టెను- '' వీరికి సాటి వీరే''అని వియ్యంకుల సమావేశమును చూచి దేవతలు ఆనందించిరి. సుమనవర్షము కురిపించిరి. దశరథ, జనకుల కీర్తిని వర్ణించిరి.

''విరించి జగమును సృజించిననాటినుండియు మనము ఎన్నో వివాహములను గురించి వింటిమి. ఎన్నో కనుగొంటిమి. కాని సర్వవిధముల సమమగు సన్నాహములను, బృందములగు, సములగు వియ్యంకులను నేడు కదా కాంచితిమి!'' అని వారు నుడువ మొదలిడిరి. దేవతల సుందర, సత్యవాణిని విని ఇరుపక్షములయందు అలౌకిక మగు ప్రేమ వ్యాపించెను.

జనకుడు దశరథుని -రమ్యముగ రత్నకంబళ్లపై ఆసీసునికావించి అర్ఘ్యమిచ్చి సాదరముగా వేదికపైకి తీసికొని వెడలెను. ఆమండపమలును, వాని విచిత్రనిర్మాణ కౌశలమును, సౌందర్యమును చూచిన మునుల మనములు సహితము మోహపరవశమయ్యెను. చతురడగు జనకుడు స్వహస్తములతో తెచ్చి వారి అందరికి పింహాసననములను సమర్పించెను. తమ కుల ఇష్టదేవతను వలె వసిష్టుని జనకుడు పూజించెను. వినయుడై అతని ఆశీర్వదమును పొందెను. జసనకుడు కౌశికుని పూజించినవిధమును ఆ పరమభక్తిని వర్ణింపఅలవికాదు. అతడు ముదమున వాదేవాది ఋషులను పూజించెను. ఎల్లవారికి దివ్యమగు ఆసనములను సమర్పించెను. అందరి ఆశీస్సులను పొందెను.

అనంతరము జనకుడు కోసలపతిని ఈశ్వరసమునికగా ఎంచి విశేషముగా పూజించెను. వేఱొకభావము అతనికి లేనేలేదు. చేతులు జోడించి అతడు తన బాగ్యమును, వైభవమును పొగడెను. దశరథుని గొప్పతనమును ప్రశంసించెను. పిదప అతడు మగ పెండ్లివారినందరిని వియ్యంకుడగు దశరథునికి సములుగా భావించి సకలవిధముల సాదరముగా పూజించెను. అందరిని ఉచితాసనములపై ఆసీనులను చేసెను. ఆ ఉత్సవమును ఒక్కనోటితో ఎట్లు నేను వర్ణింపగలను? దాన, మాన, సన్మాన, వినయ వచనములతో జనకుడు పెండ్లవారినందరిని సన్మానించెను.

రఘువీరుని ప్రభావము నెఱిగిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దిక్పాలకులు, దినకరుడు, కపట విప్రవేషములను తాల్చి ఆనందమున ఆ కౌతుకమునంతయు తిలకించు చుండిరి. వారు దేవతాసములని ఎంచి ఆసనములయందు ఆసీనులను చేసెను. ఎవరు ఎవరిని గుర్తించిరి? ఎవరు ఎవరని తెలిసికొనిరి? అందరూ తమను తామే మరచిరాయేను?

ఆనందమునకు మూలకారణమగు వరుని కనుగొని ఇరుపక్షములవారు ఆనంద మయస్థితియందు దున్నారు.

సర్వజ్ఞుడగు రాముడు సురలనుగర్తించి వారికి మానసిక పూజను కావించిరి. మానసిక ఆసనములను సమర్పించెను, ప్రభుని శీలస్వభావములను కనుగొని దేవతల మనస్సులు ముదమును పొందెను.

రామచంద్రుని ముఖచంద్రుని సౌందర్యమును సర్వుల నయనచకోరములు సాదరముగా పానము చేయుచున్నవి. అందరి ప్రేమ, ఆనందము అత్యధికమై ఉన్నది.

సమయమున కనుగొని వసిష్ఠుడు సాదరమున శతానందుని పిలిచెను. ఆ పిలుపువిని శతానందుడు ఏతెంచెను.

''ఇక మీరు వేగమేవెడలి పెండ్లికుమార్తెను తీసికొని విచ్చేయుడు''అని వసిష్ఠుడు ఆయనతో చెప్పెను. ముని ఆనతినికొని శతానందుడు ఆనందమున వెడలెను. పురోహితుని పలుకులువిని బుద్ధిమతి అగు రాణియు, ఆమె సఖులు సంతసించిరి. విప్రస్త్రీలను, కులమునందలి వృద్ధస్త్రీలను రాణి పిలిపించెను. వారు కులోచితరీతిని మంగళగీతములు గానముచేసిరి. నరనారీమణులవేషములను ధరించిఉన్న దేవాంగనలు సహజమనోహరసుందరులు. దాదాపు పదహారు సంవత్సరముల వయస్సువారు , వారిని చూచి రాణివాసపు స్త్రీలు ఆనందించిరి. గుర్తింపబడకయే వారు ఎల్లవారికి ప్రాణాధిక ప్రియులైరి. వారెల్లరు ఉమ, రమ, శారదలకు సమానమైనవారిని ఎంచి రాణి వారిని మిక్కిలి సన్మానించెను.

రాణులు , వారిసఖులు సీతను శృంగారించిరి, ఆమెకు చుట్టు బృందముగా ఏర్పడి వారు సీతను ఆనందముతో కల్యాణమండపమునకు తోడ్కొని రాసాగిరి. మంగళద్రవ్యములను చేపట్టి సీతయొక్క సకియలు, ఇతర భామినులు, సగౌరముగా ఆమెను వేదికవద్దకు తీసికొనివచ్చిరి. వారెల్లరు రమణీమణులే. షోడశవిధముల శృంగారించు కొనినవారే. మత్తగజగామినులే. వారి కమనీయగానమును విని మునులు తమ ధ్యానమును త్యజించిరి. కాముని కొకిలలు సిగ్గుచెందినవి. వారి అందెలు, కాళ్ళగజ్జెలు, అలంకరింపబడిన కంకణములు, తాళగతిని తప్పక ఇంపుగా మ్రోగుచున్నవి. మూర్తీభవించిన లావణ్యరాశివలె లలనాగణములనడుమ సహజసుందరిఅగు జానకి శోభిల్లు చున్నది. సీతయొక్క సౌందర్యము వర్ణనాతీతము, నాబుద్ది అతి అల్పము. ఆమె మనోహరత్వము అతి అధికము. రూపరాశి, సర్వవిధముల పునీత అగు సీతయొక్క రాకను పెండ్లివారు వీక్షించిరి. అందరు తన మాసనములయందే ఆమెకు ప్రణామము చేసిరి. ఆమెను వీక్షించి రాముడు పూర్ణకాముడయ్యెను. సర్వులు శ్రీరాముని కనుగొని కృతకృత్యులైరి. దశరథుడు పుత్రసమేతముగా హర్షముపొందెను. వారి హృదయానందము వర్ణనాతీతము. దేవతలు ప్రణామముచేసి పూలవానను కురిపించిరి. మంగళములకు మూలమగు మునుల ఆశీర్వాదధ్వని వినిపించుచున్నది. గానములచే, నగరాలమ్రోతచే అతి కోలాహలము వ్యాపించినిది. స్త్రీలు, పురుషులు ప్రేమ, ఆననందనిమగ్నులై ఉన్నారు. ఇట్లు జనకి మండపమునకు ఏతెంచినది. ప్రముదితుడై ముని రాజు శాంతిపాఠమును పఠించెను. ఆసమయమునకు తగు సకల విధులు, కర్యాకలాపములు కులాచారములు కుల గురువు లిరువురు జరిపించిరి. ముదితుడై గురువు కులాచారీతిని గౌరికి, గణపతికి, విప్రులచే పూజచేయించెను. సురలు ప్రత్యక్షమై పూజలను పరిగ్రహించిరి. ఆశీర్వదించిరి. మహా ఆనందమును పొందిరి.

మధుపర్కములు, మంగళద్రవ్యములు, సకలము ముని మనస్సున కోరుటయే తడవు తత్‌ క్షణమే పరిచాకులు వానిని బంగారుపళ్ళెరములలో , కనకకలశములలో నింపి , తీసికొనివచ్చుటకు సిద్ధముగా ఉన్నారు. తమకులాచారములన్నిటిని ప్రేమసమేతముగా సూర్యడు వివరించుచున్నాడు. మన్ననతో అవి అన్నియు నెరవేర్చబడు చున్నవి. ఇట్లు దేవతలుకు పూజలు చేయించి సీతను రమణీయమగు సింహాసనమువద్దకు తోడ్కెనివచ్చిరి.

సీతా రాముల పరస్పర వీక్షణ, ప్రేమదృష్టికి అతీతములు. ఉత్తమగు మనసులకు బుద్దికి, వాణికి సహితము ఆగోచరములగు వానిని ఒక కవి ఎట్లు వర్ణింపగలడు?

హోమసమయమున అనలుడు తనువునుధరించి మహాఆనందముతో ఆహుతిని స్వీకరించెను. వేదములన్నియు విప్రవేషములను ధరించి, వివాహవిధులను వివరించినవి. జగద్విఖ్యాత అగు జనకపట్టమహిషిని సీతయొక్క తల్లిని ఎట్లు వర్ణించుట? సత్కీర్తి, సుకృతము, సౌందర్యములను సకలును ఆమెయందు సమకూర్చి ఆయెను విధాత సృజించెను.!

సమయమును ఎఱిగి మునివరులు ఆయెను పిలువపంపిరి. వెంటెనే సువాసినులు సునయనసు సాదరముగా తోడ్కొనివచ్చిరి. జనకుని వామభాగమున ఆమె హిమగిరి ప్రక్కమేనకవలె శోభించుచున్నది. పవిత్రమై సుగంధయుతమగు మంగళజలమును కనకకలశములలో, మణిమయము, సుందరము అగు పళ్లెములలో జనకమహారాజు రాణి ముదితులై స్వహస్తములతో తీసికొనివచ్చి రాముని ఎదుట ఉంచిరి. మంగళకరమగు వాణితో మునులు వేదములను పఠించిరి. శుభసమయమును గ్రహించి గగనము నుండి సుమములు కురిసినవి.

వరుని అవలోకించి జనకదంపతులు ప్రేమమగ్నులైరి. అతని పావనచరణము లను కడుగ మొదలిడిరి. రాముని పాదపంకజములను వారు కడుగ మొదలిడగనే వారి తనువులు పులకరించినవి. భూమ్యాకాశములయందు మ్రోగుచున్న దుందుభుల మ్రోతలు, గానములు, జయజయధ్వానములు నలుదెసలనుండవి ప్పొంగివచ్చుచున్నవో అనునట్లున్నది.

ఏ పాసరోజఉములు మదనాది హృదయసరోవరమున సదా విరాజిల్లుచుండునో

ఏచరణపద్మములను ఒక్కమారు స్మరించినంతనే మానసమున విమలత్వము జనించి, సకలకలిమలములు దూరముగనో-

ఏ పాదస్పర్శచే మునివనిత, పాపమయి అగు అహల్యపరమగతిని పొందెనో-

ఏచరణకమల మకరందరసము(గంగ) శంభుని శిరమున శోభిల్లుచుండునో-

ఏపాదములను సురలు పవిత్రతకు అవధి అని వర్ణింతురో , మునులు, యోగి జనులు తమ మనములను మధుపములను కావించుకొని, సేవించి తమ అభిమతములను సమకూర్చుకొందురో ఆ పాదములను భాగ్యభాజనుడగు జనకుడు కడిగెను.

సర్వులు జయజయధ్వనులు నలిసిరి. కులగురువు లిరువురు వధూవరుల కరములను కలపిరి. వారివారి శాఖలను వివరించిరి. పాణిగ్రహణమును సందర్శించి బ్రహ్మాది దేవతలు, మనుజులు, మునులు ఆనందభరితులైరి. ఆనందమునకు మూలకారణుడగు వరుని చూచి జనకదంపతులు తనువులు పులకించెను. వారి హృదయములు సంతోషమున ఉప్పోంగెను.

రాజభూషణడగు జనకుడు లోక, వేదశిదులననుసరించి కన్యాదానము కావించెను.

హిమవంతుడు మహేశునికి గిరిజను, సాగరుడు హరికి శ్రీదేవిని అర్పించినట్లు జనకుడు శ్రీరామునికి సీతను సమర్పించెను. విశ్వమున మనోహరముమగు నవీన కీర్తి వ్యాపించెను. విదేహభూపాలుడు వినతి ఏదియు కావించలేకున్నాడు. శ్యామలమూర్తి అగు రాముడు విదేహుని విదేహుని కావించెను!

అనంతరము విధిపూర్వకముగా హోమము కావింపబడెను. వధూవరుల వస్త్రముల కొంగులు ముడివేయబడినవి. అగ్నికి ప్రదక్షిణము ఆరంభమయ్యెను.

జయధ్వని, వందీజననిస్వనము, వేదఘోష, మంగళగానము, దుందుభుల మ్రోతలన విని దేవతలు సంతసించిరి. కల్పవృక్షపు పుష్పములను వారు వర్షించిరి. వధువరూలలు మనోహరముగా అగ్నిప్రదక్షిణము చేయుచున్నారు. అందరు వారిని సాదముగా వీక్షించి తకన్నులున్న ప్రయోజనమును పొందుచున్నారు. ఇంపగు ఆ జంటను వర్ణింపజాలము. ఏ సామ్యమైనను వారియెడల అల్పమే.

సీతారాముల సుందరప్రతిచ్ఛాయలు మణిస్తంభములలో తళతళ##మెరయుచున్నవి. రతీమన్మథులు అనేకరూపమునుధరించి అనుపమమగు రామల్యాణమును దర్శించుచున్నారో అనునట్లుది రామదర్శనాభిలాష లజ్జ రెండునూ వారికి అధికముగా ఉన్నవి. ఒకసారి కనపడుచు వెంటనే మఱుగుపడుచు ఉన్నారు. వారు. ప్రేక్షకులెల్లరు ఆనందమగ్నులై మునులు అగ్ని ప్రదక్షిణములు చేయించిరి. కట్నకానుకలను సకలకార్య కలాపమును పూర్తికావించిరి.

సీతయొక్క శిరమున శ్రీరాముడు సింధూరమును సింగారించెను. ఆశోభను ఎట్లు వచింపగలము? అరుణపరాగముచే సరోజమును చక్కగా నింపి, అమృతమందలి తృష్ణచే ఒక సర్పము చంద్రుని అలంకరించుచున్నట్లున్నది.

అంతట వసిష్ఠుడు ఆనతి ఇచ్చెను. వధూవరులు ఒకే ఉత్తమాసనమున ఆసీసులైరి. దశరధుడు ముదితమనస్కుడయ్యెను. తన పుణ్యమనుడు కల్పవృక్షమున నేతనఫములు ఫలించగా చూచి అతని శరీరము పదేపదే పులకిరంచెను. భువనముల యందెల్ల ఉత్సాహము వెల్లివిరిసెను.

''రాముని విహాహమైనదట'' అని అందరు చెప్పుకొనుచున్నారు. నాకు ఒకే ఒక్కనాలుక. ఈమంగళమా మహత్తరమైనది. ఇట్లు వర్ణించుచుపోయినచో దీనికి అంతమెక్కడ?

తదుపరి వసిష్ఠుని ఆనతిని పొంది జనకుడు వివాహోచితముగా అలంకరింపబడిన రాకుమార్తెలను మాండవి, శ్రుతకీర్తి, ఊర్మిళలను పిలిపించెను. జనకుని తమ్ముడగు కుశ##కేతుని పెద్దకూతురు మాండవి, గుణ, శీల, సుఖ శోభామయి ఆమె. ఆచారములన్నిటిని అనుసరించి ఆమెను జనకుడు భరతునకిచ్చి వివాహము కావించెను. జానకి చిన్నచెల్లెలు ఊర్మిళ, ఆమె సకలసందరీ శిరోమణి అని ఎఱిగి జనకుడు ఆమెను లక్ష్మణనకిచ్చి సకలవిధముల సన్మానించి పెండ్లి చేసెను.

సునయన, సుముఖి, సుగుణఖని, రూప, శీల , కాంతివతి అగు శ్రుతకీర్తి అను కన్నియను శత్రుఘ్నునికిచ్చి అతడు పెండ్లి కావించెను.

వధూవరులు తమ తమ అనురూపదాంపత్యములను కనుగొని లజ్జచెందిరి. తమ హృదయములయందు ఆనందము పొందిరి. సర్వజనులు సంతోషమున వారి సౌందర్యమును ప్రశంసించిరి. దేవతాగణములలు పూలను కురిపించిరి.

సుందరలగు వరులవెంట సుందరీమణులగు వధువులు జీవుని హృదయమునందలి నాలుగు అవస్థలు తమ విభులతోకలె ఒకే మండపమున వధూవరులు ఒప్పారుచున్నారు. మహాపాలశిరోమణి, అయోధ్యాదిపతి దశరథుడు (యజ్ఞ, శ్రదా, యోగ, జ్ఞాన) క్రియాసహితముగా (ధర్మ, అర్థ, కామ, మోక్షములను) చతుర్విధ, పురుషార్థములను పొందెనో అనునట్లున్నాడు.

రఘువీరుడు వివాహము జరుపబడిన విధానమునే రాకుమారులందరి వివాహములు జరిగివి. ఆ భూరి వరకట్నములను వర్ణింపలేము. కల్యాణమండము అంతయు కనకముతో, మణులతో నిండిపోయినది. కంబళ్ళు, వస్త్రములు, నానావిధములగు ఆమూల్య, విచిత్రములగు పట్టుబట్టలు, ఏనుగులు, రథములు, గుఱ్ఱములు, దాసదాసీజనములు, అలంకరింపబడిన కామధేనువును పోలు ధేనువులు ఇతర అనేక వసన్తువులు ఆ కట్నములందున్నవి. వానిని లెక్కించుట ఎట్లు? వర్ణించుట ఎట్లు? వానిని చూచిన వారికే తెలియును. ఆకట్నములను కనుగొని లోకపాలురు మోహితులైరి, ఆయోధ్యా ధీశుడు ఆనందమున వానినన్నిటిని స్వీకరించెను. వానిని అతడు యాచకులకు ఏది ఎవరికి ఇష్టమైనది వారికి బహూకరించెను. మిగిలిన వానిని విడిదికి పంపించెను.

అంతట జనకుడు చేతులు జోడించి మగపెండ్లివారిని అందరిని సన్మానించి సంభాషించెను. ఆదర, దాన, వినయములతో పొగడ్తలతో వారిని గౌరవించెను. వారి నెల్లరను ప్రేమయుతుడై సన్మానించెను.

మహా ఆనందమున, ప్రేమపూర్వకముగా, మురిపెమున ముని బృందమును పూజించెను, వారికెల్లరకు వందనము కావించెను. శిరమువంచి, చేతులుజోడించి, దేవతలను ప్రార్థించి జనకుడు ఇట్లు వచించెను.''సురలు , సాధువులు ప్రేమనే కోరుదురు. ఒక దోసెడునీటితో పముద్రము సంతుష్ఠి చెందదుకలదా? '' సోదరసహితముగా ముకుళితకరుడై అతడు స్నేహ, శీల, సుందరప్రేమ, సమ్మిళితమగు వచనములను ఇట్లు కోసలాధీశునితో పలికెను.: ''రాజా, తమతో సంబంధము కలసినందున మేము ఇప్పుడు సర్వవిధముల అధికులమైనాము. ఈ రాజ్యము, ఈ సింహాసనము, మేము వెలఇచ్చి కొనని తమ నేకులమని ఎంచుడు. ఈ బాలికలు నిరంతరము తమ సేవికలని భావించుడు. కరుణతో వీరిని పాలింపుడు. తమను ఇచ్చటకు పిలిపించి నేను కడు సాహసించితిని. మన్నింపుడు మాఅపరాధమును''.

అంత భానుకులభూషణుడగు దశరథడు వియ్యంకుడగు జనకునికి సర్వసన్మానములను కావించెను. వారి పరస్పరవినయమును వర్ణింపజాలము. వారిరువురు హృదయములు ప్రేమసంభరితములై ఉన్నవి.

బృందాకగణములు పూలు కురిపించిరి. దశరథడు విడిదికి వెడలెను. దుందుభులమ్రోత, జయజయధ్వనులు, వేదఘోషలు మారుమ్రోగునవి. నేలపై, నింగిని అత్యంత కుతూహలము వెల్లివిరిసిది.

అనంతరము మనీశుని ఆనతినికొని సఖియలు మంగళగానముచేయుచు వధూవరులను రప్పించి కులదేతను స్థాపించిన తావునకు తోడ్కొనివెడలిరి.

సీత మాటిమాటికి రాముని వీక్షించును, సిగ్గుపడును. ఆమె మనస్సునమాత్రము ధైర్యమే, ప్రేమతృష్ణచే ఆమె నయనములు మనోహరమీనములు లావణ్యమును హరించినవి.

రాముని శ్యామలగాత్రము సహజ సౌందర్యయుతమైనది. ఆశోభను చూచి కొటి మన్మధులైనను తల వాల్చవలసినదే. పారాణి పూయబడిన అతని పాదకమలములు కడు సుందరముగా ఉన్నవి. మునుల మానసములనబడు మధుపములు ఆచరణముల యందే కదా సదా వసించునది! పవిత్రము, మనోహరము అగు రాముని పీతస్త్రము బాలసూర్యునికాంతిని, విద్యల్లతాజ్యోతిని హరించును. అతిని కటియందు సుందరమగు చిరుగంటలు , కటిసూత్రము, విశాలబాహువులకు రమణీమభూషణములు, మహాశోభను ప్రసరించు పసుపుపచ్చని యజ్ఞోపవీతము, మనోహరమగు వ్రేలి ఉంగరము తనువును శోబిల్లు వివాహభూషణములు, అలంకారములు, విరివి అగు ఉరమున విరాజిల్లు ఉరభూషణములు, జందెమువలె వెలుగొందు పసుపుపచ్చని ఉత్తరీయము ఆ ఉత్తరీయపు అంచులు రెండింటియందును అతుకబడిన మణులు, ముత్యములు!

కమలములసుపోలు కమలనీయనేత్రములు, చెవులకు కుండలములు, సకల సౌంధర్యనిధానమగు వదనము, సుందరమగు భ్రుకుటి, మనోహరమగు నాసిక, లలాటమున తిలకము, లావణ్యమునకు నిలయమే అది, మంగళమయమగు ముత్యములు, మణులు, పొదగబడి మనోహరుమగా శోభిల్లు నుదాటిభాసిము అతని సర్వాంగములు చిత్తమును హరించును.

నగరమునందలి స్త్రీలు, పురుషులు, సురసందరీగణములు వరుని విలోకించి గడ్డిపోచను త్రుంపి దృష్టితీసి పారవైచిరి, మణులను, వస్త్రములను, ఆభరణములను వారు బహూకరించిరి. దేవతలు పుష్పవృష్ఠి కురిపించిరి. వందిమాగధలు, సూతులు సత్కీర్తిని వర్ణించిరి. సువాపినులగు స్త్రీలు ఆనందమున వధూవరులను కులదేవతవద్దకు తోడ్కొనివచ్చిరి. అతిప్రీతితో మంగళగీతములను పాడి లోకరీతిని ఆచరించిరి. సతీపతులు ఒకరి ఎంగిలి ఇంకొకరు తిను పద్ధతిని గౌరిస్వయంగా రామునికి బోధించెను. శారద జానకికి నేర్పించెను. రాణివాసమెల్లయు హాసవిలాసములతో ఆనంద పరవశ##మై ఉన్నది. అందరు తమ జన్మసాఫల్యమును పొందిరి.

తనచేతి ఆభరణములయందలి మణులలో సుందరరూపవిధి అగు రాముని ప్రతి బింబము జానకి కనుగొని విరహభయమున తన బాహువులతను, దృష్టిని మరల్చనే లేదు. ఆకౌతుకమును, ఆవినోదమును, ఆప్రేమను, ఆప్రమోదమును వర్ణింపజాలము. అని ఆసకియలకే ఎరుక.

పెండ్లికొమరులను, కొమరికలను సుందరులగు చెలులందరు విడిదికి తోడ్కెని వెడలిరి. ఆ సమయమున భూమి ఆకాశములందు ఎక్కడ విన్నను ఆశీర్వాదములే! ఎక్కడ చూచినను మహానందమే! ఎల్లవారు ఆనందమున నాలుడు జంటలు చిరంజీవులగుదురుగాక! అని అనుచున్నారు.

యోగీంద్రులు, సిద్ధులు, మునీశ్వరులు, దేవతలు, ప్రభుని వీక్షించిరి, దుందుభులు మ్రోగించిరి. సంతోషమున వారందరు పుష్పవర్షము కురిపించుచు, '' జయము జయము, జయము'' అను జయ నినాదములు సలుపుచు తమతమ లోకములకు మరలిరి.

అంతట వధూసమేతులై రాకుమారులెల్లరు తమ తండ్రివద్దకు వచ్చిరి. శోభాయుతమై, మంగళ, ప్రమోదములతో విడిది ఉప్పొంగుచున్నది.

అనంతరము-అచ్చట ఒక గొప్పవిందుకై ఏర్పాట్లు జరిగినవి. జనకుడు పెండ్లి వారిని ఆహ్వానించెను. పుత్రసహితుడై దశరథుడు ఏతేంచెను. అనుపమగు తివాసీలు త్రోవలో పరచబడినవి. అతిథులందరి చరణములను జనకుడు కడిగెను. అందరికి తగు ఆసనములను సమర్పించెను. సౌజన్యమున, అనిర్వచనీయమగు ప్రేమతో జనకుడు దశరథుని చరణములను కడిగెను. హరుని హృదయకమలమున సదాగుప్తముగా వసియించు రాముని పాదకమలములను తరువాత అతడు కడిగెను. ఉచితమగు ఆసనములయందు అందరిని ఆసీనుల చేసెను.

వడ్డనచేయువారిని ఎల్లరిని జనకుడు పిలిపించెను. వారు సాదరశుగా విస్తళ్ళు వేసిరి , మణులు పొదగిన ఆకులకు బంగారుపుల్లలతో కుట్టిన విస్తర్లు అవి. చతురులు, వినీతులు అగు వంటవారు సుందర, రుచికర, పవిత్ర సూపోదమును, ఆవునేతిని క్షణములో అందరకి వడ్డించిరి. అందరు పంచప్రాణాహుతులను గ్రహించిరి. భోజనము ప్రారంభించిరి. వేడుకపాటలు విని అందరు మిక్కిలి ఆనందించిరి. పలువిధములగు పక్వాన్నములు-అమృతతుల్యములైనవి వడ్డించబడినవి. వానిని వర్ణింపజాలము. నిపుణులగు వంటవారు అనేకకూరలను వడ్డించ మొదలిడిరి. ఆకూరలపేర్లన్నియు ఎవరికి తెలియును? భక్ష్య, పేయ, చోష్య, లేహ్యములను చతుర్విధము భోజన పదార్థముములలో ఒక్కొక్కదానిలో వర్ణింపజాలనన్ని అంశములు సిద్ధముచేయబడినవి. షడ్రసములయందు బహువిధముల రుచికరములగు కూరలు. ఒక్కొక్కరసము నను లెక్కలేనన్ని విధములవి! భోజనసమయమున పురుషులు, స్త్రీలపేర్లుపెట్టి స్త్రీలు మధుర స్వరములలే వేడుక పాటలను పాడుచున్నారు. సమయోచితమగు ఆ హస్యపు పాటలు కమనీయములై ఉన్నవి. వానిని విని దశరథుడు , అతని బృందము నవ్వుకొనిరి.

ఇట్లు అందరు విందారగించిరి. అందరికి ఆదరముగా ఆచమనజలము ఇవ్వబడినది.జనకుడు దశరథునికి, అతని బృందమునకు తాంబూలమిచ్చి పూజించెను. సకల భూపాలశిరోమకుటమగు దశరథుడు ఆనందించి విడిదికి వెడలెను.

మిధిలాపురము నిత్యనూతన మంగళమయమై ఉన్నది. రాత్రులు పగళ్ళు నిమిషమువలె గడచుచున్నవి. ప్రాతఃకాలమునకుముందే రాజమణి దశరథుడు మేల్కొనెను. యాచకులు అతని గుణగణములను వర్ణింపమొదలిడిరి. కొడుకులను, కోడళ్ళనుచూచి అతని మనస్సున కలిగిన ఆనందమును ఎట్లు వర్ణింపగలము? ప్రాతఃకాలకృత్యములను నెరవేర్చుకొని దశరథుడు గురువగు వసిష్ఠుని వద్దకు అరిగెను. అతని మానసము మహా ఆనందము, ప్రేమభరితమైఉన్నది. దశరథుడు వసిష్ఠునికి ప్రణామము చేసి ఆయనను పూజించెను. కరములుమోడ్చి సుధాతుల్యములగు పలుకులను ఇట్లు వచించెను:-

''మునిరాజా, అవధరింపుడు, తమకృపచే నేడు నేను కృతకృత్యుడనైతని, స్వామి, ఇక విప్రులనెల్లరను రప్పించుడు. వారికి సాలంకృతధేనువులను సమర్పించుడు''.

వసిష్ఠముని ఈ మాటలను విని రాజును శ్లాఘించెను. ముని బృందములను పిలించెను. వాసుదేవుడు , దేవర్షి నారదుడు, వాల్మీకి, జాబాలి, కౌశికుడు, మొదలగు తపశ్శాలురగు మునివర నికరములు ఏతెంచిరి. దశరథుడు వారికి ఎల్లరకు సాష్ఠాంగ ప్రమాణము కావించెను. వారిని ప్రేమతో పూజించెను. ఉత్తమ ఆసనములను సమర్పించెను. శ్రేష్ఠమగు నాలుగులక్షల ధేనువులను తెప్పించెను. ఆ ధేనువులన్నియు కామధేనువును పోలినవి. సాధుశీలము కలవి. మనోహమైనవి, వానినన్నిటిని చక్కగా అలంకరిపంచేసి మహీపాలుడు ముదితుడై మహాదేవులకు సమర్పించెను.

''నేడుకదా నా జీవితము సఫలమయ్యెను!'' అని అతడు అనేక విధముల వినతి చేసెను. విప్రుల ఆశీస్సులను పొంది ఆనందించెను.

పిదప దశరథుడు యాచకబృందమును పిలిపించెను. కోరినదానిని కనకము, వస్త్రములు, మణులు, గుఱ్ఱములు, ఏనుగులు, రథములు రవికులనందనుడగు దశరథడువారికి బహూకరించెను.

''జయము జయము దిసకరకుల నాథునికి జయము'' అని కేకలువేయుచు దశరధుని గుణగుణములను గానముచేయుచు యాచకులు వెడలిరి.

ఇట్లు శ్రీరాముని వివాహమహోత్సవములు జరిగెను. వానిని సహస్రవదను డైనను వర్ణింపజాలడు. కౌశికుని చరణములకు పదేపదే శిరమువంచి నమస్కరించి ''మునిరాజా ఈ ఆనందమంతయు తమ కృపాకటాక్షప్రసాదమే'' అని దశరథుడు వచించెను. జనకుని ప్రేమను, శీలమును, నేర్పును, ఐశ్వర్యమును అతడు ఎన్నోవిధముల ప్రశంసించెను.

ప్రతిదినము నిద్రలేకవగానే అయోధ్యాధిపతి జనకుని సెలవిండని కోరును. కాని జనకుడు అనురాగమున ఆయనను నిలిపివేయును. జనకుని ఆదరము నిత్యనూతనమై వర్థిల్లుచున్నది. ప్రతిదినము వేయివిధముల ఆతిథ్యము జరుగుచున్నది. నగరమున నిత్యనూతన ఆనందోత్సాహములే దశరథుడు మరలుట ఎవ్వరికీ ఇష్టము లేదు.

ఇట్లు బహుదినములు గడచినవి. మగపెండ్లివారు ప్రేమబందమున కట్టుబడివారేమో!

అంత ఒకనాడు కౌశికుడు, శతానందుడు వెడలి విదేహనృపాలునికి నచ్చచెప్పిరి. ''తమరు ప్రేమవశమున దశరథుని విడువజాలకున్నారు. ఐనను ఆయనకు ఆజ్ఞప్రాసాదించుడు'' అనికోరిరి.

''నాథా, మంచిది'' అని జనకుడు సచివులను పిలిపించెను. వారు వచ్చిరి 'విజయీభవ చిరంజీవి' అనిరి. తలలు వంచి వందనము చేసిరి.

''అయోధ్యానాథుడు తిరిగి వెడలకోరుచున్నాడు. రాణివాసమునకు వర్తమానము పంపించుడు''అని జనకుడు చెప్పెను. ఆమాటలువిని సచివులు , విప్రులు, సభాసదులు రాజుసహితము ప్రేమవశులయ్యిరి. ''పెండ్లివారు వెడలుచున్నారు''అని పురవాసులు విని వ్యాకులపడిరి. ఒకరినొకరు ప్రశ్నించుకొనిరి. పెండ్లివారు వెడలుట నిజమేనని తెలసికొని సంధ్యాసమయపు సరసిజములవలె అందరు ముకుళించుకొని పోయిరి.

పెండ్లివారు వచ్చునపుడు ఎక్కడెక్కడ విడిదిచేసిరో ఆయా స్థలములకు అనేక విధములగు వంటసామగ్రి పంపబడినది. నానావిధములగు పండ్లు, పిండివంటలు, బోజనసామగ్రి వర్ణింపజాలన్ని-లెక్కలేన్ని ఎడ్లపై డోలీలపై నింపి పంపబడిననవి. వానితో జనకుడు అనేక చక్కని పట్టెమంచములను కూడా పంపించెను. ఒకలక్షగుఱ్ఱములు, పాతికవేలు రథములు, నఖశిఖపర్యమతుమ అలంకరింపబడినవి, సింగారింపబడినవే పదివేలే మత్తగజములు, వానిని చూచి దిగ్గజముల సిగ్గుపడవలసినదే అన్నియు పంపబడినవి. సువర్ణము, వస్త్రములు, రత్నములు, గేదెలు, ఆవులు, నానావిధములగు వస్తువులునుకూడా జనకుడు బహూకరించెను. అంతేకాక జెప్పజాలన్ని కట్నములనుకూడా అతడు పంపికెను. లోకపాలుర లోకములయందలి సంపదవానియుండు కడు అల్పమే.

ఇట్లు సామగ్రి సర్వము సిద్ధముచేసి జనకుడు అయోధ్యపురికి పంపించెను. మగపెండ్లివారు వెడలుచున్నారని తెలిసి రాణులందరు నీరులేని చెరువులోని చేపలవలె వ్యాకులపడిరి. పదేపదే వారు సీతను తమ ఒడిలో కూర్చుండపెట్టుకొని ఆశ్వీరదించిరి.

''నీపతికి సదా ప్రియురాలివి కమ్ము. సౌభాగ్యవతివై వర్థిల్లుమ్మా ఇదే మా ఆశీస్సు'' అని దీవించిరి. ''అత్తమామలను, గురువులను సేవింపుము, పతియొక్క ఇంగితమును కనుగొని అతని ఆజ్ఞమును పాలింపుము'' అని తరుణులగు ఆమె సఖియలు అత్యంత ప్రేమవశులై, మృదువచనములతో నారీధర్మములను బోధించిరి. సారముగా కుమార్తెల కలందరికి బోధించి రాణులు వారిని మాటిమాటికి తమహృదయములకు హత్తుకొనిరి.

''బ్రహ్మ ఈ స్త్రీజాతిని ఏల సృష్టించెను?'' అని తల్లులెల్లరు కూతుళ్ళను తమ కౌగిళ్ళలో చేర్చుకొని నుడివిరి. అదేసమయమున బానుకులకేతువగు రాముడు సోదరసహితుడై వీడ్కోలు పలుకులకు జనకుని మందిరమునకు వెడలెను. సహజసుందరులగు నలుగురు సోదరులను వీక్షించుటకు మిధిలానగరి స్త్రీ, పురుషులెల్లరు పరుగెత్తుకొని వచ్చి ఇట్లు పలుకుచున్నారు.

'' నేడు వీరు మరలనున్నారు. వీడ్కోలుకు సర్వసామగ్రిని విదేహపతి సిద్ధముచేసినాడు. దశరథుని నలుగురు పుత్రులను ఈ ప్రియ అతిధుల రూపమున కన్నులారా కనుగొనుడు. ఎవరికెరుక? మనము చేసిన పుణ్యమో ? విధాత వీరిని ఇక్కడకు రప్పించినాడు. మనకు కన్నులపండుగ కావించినాడు. మరణించనున్నవాడు అమృతము గ్రోలినట్లు, పుట్టినవాటి నుండియు ఆకలికొన్నవానికి కల్పవృక్షము లభించినట్లు, నరకనివాసికి హరిపదము సంప్రాప్తినట్లు ఈతని దర్శనము మనకు లభించినది. రాముని శోభను తిలకించుడు. దానిని హృదయమున ధరించుడు. మీమానసములను సర్పములనుగా ఈతని మూర్తినిమణిగా భావించుడు''.

ఇట్లు అందరికి నేత్రానందము కలిగించుచు రాకుమారులు రాజమందిరమునకు ఏగిరి. రూపసాగరులగు ఆ సోదరులను చూచి రాణివాసమున అందరు ఆనందించిరి. అత్తలు ముదితమానసులై అల్లుళ్ళకు దృష్టితీసిరి. హారతులిచ్చిరి. రాముని శోభను కనుగొని అత్యంత ప్రేమమగ్నులైరి. ప్రేమవివశులై పదేపదే వారు రాముని పాదములను పట్టుకొనిరి. వారిహృదములు ప్రేమభరితములయ్యెను. దీనివలన వారికి లజ్జ జనించలేదు. వారి సహజప్రేమను వర్ణించుట ఎట్లు?

రామునికి, ఆతని తమ్ములకు వారు నలుగు పెట్టిరి. స్నానముచేయించిరి. షడ్రసోపేతమగు విందును చేసిరి. మంచిసమయము తెలిసికొని రాముడు:-

''రాజుగారు అయోధ్యపురికి మరలగోరుచున్నారు వీడ్కోలు చెప్పిరమ్మని వారు మమ్ములను ఇచటికి పంపినారు. అమ్మా, ఆనందమున మాకు ఆజ్ఞ ఇండు. మేము మీ బాలకులమని ఎఱిగి మాయందు నిత్యము ప్రేమకలిగిఉండుడు''అని శీల, స్నేహ, సంకోచభరితములగు వచనములను పలికెను. ఈ మాటలను వినగానే రాణివాసము స్త్రీలు విచారగ్రస్తులైరి. ప్రేమవశమున అత్తలు ఏమియు పలుకలేకుండిరి. కుమార్తెలను వారు ఆలింగనము కావించుకొనిరి. వారిపతులకు వారినినొప్పగించిరి. అత్యంత వినతి కాంచిరి.

వినతిచేయుచు వారు సీతను రామునికి ఒప్పగించిరి. చేతులుజోడించి పదేపదే సునయన''నాయనా, సజ్జనుడవు, సీతను నీకు సమర్పించుచుంటిమి. ఎల్లరి యొక్క స్థితి నీకు విదితము. పరిజనమునకు, పురజనులకు , నాకును, రాజునకు, సీతప్రాణప్రియ అని గ్రహించుము. తులసీదాసుని ప్రభూ, ఈమెయొక్క శీలమును ప్రేమను కనుగొని ఈమెను నీదాసిగాచేసికొని స్వీకరింపుము. నీవు పరిపూర్ణకాముడవు. సజ్జన శిరోమణివి భావప్రియుడవు. భక్తజనులగుణములను, గ్రహించువాడవు. రామా, దోషములను నాశనమొనర్తువు నీవు. కరుణానిలయుడవు'అని పలికెను. ఇట్లు వచించిరాణి రాముని చరణములనుపట్టుకొని మౌనముగా ఉండెను. అమెయొక్క వాక్కు ప్రేమ అను ఊబిలో కూరుకొనిపోయెను. ప్రేమయుతమగు ఆ ఉత్తమవచనములను విని రాముడు అత్తగారిని అనేక విధముగా సన్మానించెను. కరములు జోడించి అతడు ఆమెను సెలవిమ్మని కోరుచు పలుమారలు ప్రణామము కావించెను. ఆమెయొక్క ఆశీర్వాదమునుపొంది అతడు మరిఒకమారు తలవంచి నమస్కరించి తమ్ములతోకూడి బయలుదేరెను. రాముని మంజుల, మధురమూర్తిని, తమహృదయములయందు నిలుపుకొని రాణులెల్లరు ప్రేమచే చైతన్యరహితులైరి. కొంతతడవుకు వారు ధైర్యము వహించి కుమార్తెలను పిలిపించిరి. పలుమార్లు కౌగిలించుకొనిరి. కొంతదూరముకూతుండ్రను వారు సాగనంపుదురు. తిరిగివత్తురు, మరలివచ్చి వారిని కౌగిలించు కొందురు. వారి పరస్పరప్రేమ అధికమయ్యెను. పదేపదే కౌగిలించుకొనుచున్నతల్లు లను సఖియచలు విడదీసిరి. ఆవులనుండి క్రొత్తగాపుట్టిన దూడను ఎవరైనను వేరు చేసినట్లన్నది.

స్త్రీలు, పురుషులు, సఖిలయలతో సహా రాణివాసమెల్లయు ప్రేమవిశులై ఉండిరి. విదేహపురమున కరుణ , విరహము కాపురమున్నవా అనిపించుచున్నది. జానకి పెంచి పెద్దచేసి, బంగారపంజరములలో పెరుగుచు, ఆమెచే మాటలు నేర్చుకొనుచున్న చిలుకలు, శారికలు చింతచెందుచున్నవి. ''వైదేహి ఏదీ? అనుచున్నవి. ఆ పలుకులు విన్నవారికి ఎవరికి ధైర్యము ఉండును? ఖగములు , మృగములు కూడా ఇట్లు వ్యాకులత చెందుచుండగా ఇక మనుజులస్థితి ఏమమని వర్ణింపగలము?

అంతట జనకుడు తమ్మునితో కలిసి అచ్చటకి వచ్చెను. ప్రేమఉప్పొంగి అతని కన్నులు నీరు నిండెను. అతడు పరమ విరాగి అని పేరుపొందెను. కాని సీతను చూచి అతని ధైర్యము సహితము పలాయనమయ్యెను. జనకుడు జానకిని తన హృదయమునకు హత్తుకొనెను. జ్ఞానమను నదియొక్క గట్టుతెగెను. బుద్దిమంతులగు జనకుని మంత్రులు అతనిని ఓదార్చిరి. విచారించుటకు అది సమయముకాదని జనకుడు గ్రహించెను. పలుమార్లు పుత్రికను కౌగిలించుకొని, అలంకరింపబడిన చక్కని పల్లకీని అతడు తెప్పించెను. పరివారమంతయు ప్రేవివశులై ఉన్నారు. సుమూహర్తమును తెలసి కొని జనకుడు సిద్ధిని, గణశుని స్మరించెను. కుమార్తెలను పల్లకీలలో ఎక్కించెను. పుత్రికలు అతడు బహువిధముల బోధించెను. నారీధర్మములను, కులాచారములన నేర్పెను. సీతకు ప్రియమైనవారు , విశ్వాసపాత్రులు అగు అనేకమంది సేవకులను దాసీలను, దాసులను ఆమెకు అర్పించెను.

సీత వెడలుచున్నప్పుడు మిథిలాపురవాసులెల్లరు వ్యాకులతచెందిరి. మంగళ పుంజములగు శుభశకునములు చూపెట్టెను. భూసుర బృందముతో సచివులతో కలసి జనకుడు సాగనంపుటకు కొంతదూరము కూతుళ్ళవెంట ఏగెను. ప్రయాణ సమయము రాగానే వాద్యములు మ్రోగెను. మగపెండ్లివారు ఏనుగులను, గుఱ్ఱమును సిద్ధముచేసిరి. దశరథుడు విప్రులను ఎల్లరను రప్పించెను. వారికి దానములిచ్చెను. వారిని సన్మానించెను. సంతుష్ఠులను కావించెను. వారి చరణ సరోజ రజమును తన శిరమున ధరించెను. వారి ఆశీస్సులను పొందెను. ఆనందించెను. గణశుని స్మరించెను. పయనమయ్యెను. మంగళములకు మూలమగు అనేకశకునము లయ్యెను. దేవతలు సంతపించిరి. పుష్పవృష్టి కురిపించిరి. అచ్చరలు నాట్యమాడిరి. దశరథుడు నగరామ్రోగించి ముదితుడై అయోధ్యాపురికి బయలువెడలెను. మిథిలాపురినుండివచ్చిన మహాజనులకు వినతిచేసి వారిని వెనుకకు పంపించెను. యాచకులను సాదరముగా పిలిపించెను. వారికి వస్త్రములను , ఆభరణములను , గుఱ్ఱములను, ఏనుగులను, దానమిచ్చెను. ప్రేమతో వారిని సంతుష్టపరచి పుష్టులను కావించెను. పదేపదే బిరుదావళిని వర్ణిచుచు వారు రాముని తమ హృదముల స్మరించుచు తిరిగి వెడలిరి.

కోసలపతి జనకుని'' మరలివెడలుడు'' అని పదేపదే కోరును. కాని ప్రేమవశనమును జనకుడు తిరిగి వెడలుటకు ఇచ్చగించుడు! మరి ఒకసారి దశరథుడు ''మహీశా, దూరము వచ్చితిరి, ఇక మరలిపొండు'' అని మృదువచనమునలు నుడువును.

రథమునుండి దశరథుడు దిగి నిలచెను. అతని నేత్రములనుండి ప్రేమప్రవాహము పెల్లుబికినది. కన్నులనుండి నీరు కారినది. అంతట జనకుడు చేతులు జోడించి ప్రేమామృతమున మునిగిని పలుకులను''మహారాజా నేను ఎట్లు నీకు వినతిచేగలను? నాకు అత్యంత మహిమను అపాదించితిరి కదా!'' అని నుడివెను.

స్వజనుడైన వియ్యంకుని కోసలపతి సర్వవిధముల సన్మానించెను. వారి సమాగమమునలయందు అధిక వినయమున్నది. హృదయమున ఇముడలేనంత ప్రేమ కలదు. జనకుడు తలవంచి మునిమండలికి నమస్కరించెను. వారి ఎల్లరి ఆశీర్వాదమను పొందెను. పిదప అతడు రూప, శీల, గుణవిధులగు, సోదరులను తన అల్లుండ్రును ఆలింగనము చేసికొనెను. సుందరరోజములవంటి తన కరములను జోడించి ప్రేమ నండియే ఉత్పన్నమైనవో అను వచనములను ఇట్లు నుడిపెను.

''రామా నిన్ను ఎట్లు ప్రశంసింపగలను? మునుల , మహేశుని మనస్సులనెడు మానససరోవరమునందలి మరాళమవునీవు, క్రోథ, మోహ, మదములను, మమతను త్యజించి యోగులు ఎవని కొరకై యోగసాధనచేతురో---

సర్వవ్యాపకుడు, బ్రహ్మ, అవ్యక్తుడు, అవినాశ, చిదానందుడు, నిర్గుణడు, గుణరాశి, అగువాడు ఎవ్వడో..........

మనస్సు, వాక్కు, ఎవనిని తెలియజాలవో-

ఎవనిని ఊహామాత్రముననే తెలియగలవో-

ఎవడు తర్కమును అతీతుడో-

ఎవని మహిమను 'నేతి'యని నుడివి శ్రుతిలు వర్ణించునో-

ఎవడు త్రికాలములందు సర్వదా సర్వథా నిర్వికారుడై ఉండునో అట్టి ఆ సకలసుఖ మూలకారణుడు అతడే నాకనుల ఎదుట ప్రత్యక్షముగా ఉన్నాడు.

ఈశ్వరుడు అనుకూలించినచో జీవులకు జగమున అన్నియు లాభములే. సర్వవిధముల నీవు నన్ను అధికుని కావించితిని. నీవాడనని తెలసికొని నన్ను నీవానిని చేసికొంటివి. పదివేలమంది శారదలు, ఆదిశేషులు, కోట్లకొలది కల్పములు గణించి నను, రఘునాథా, వినుము నాభాగ్యమును, నీగుణగాధలను సంపూర్ణమాగా వర్ణించజాలరు. అతిస్వల్పముగు ప్రేమకైనను నీవు ప్రసన్నడవగుదవు. నేను వచించిన దెల్లయు ఈ నీ ఒక్కబలముపై ఆధారపడియే! పదేపదే కరములు జోడించి నిన్ను వేడుకొందును. పొరపాటుననైనను నామనస్సు నీచరణములను వీడక ఉండునట్లు అనుగ్రహింపుము''

ప్రేమచే పుష్టిచెందినవో అనదగు జనకుని ఉత్తవచనములను విని పూర్ణకాముడు, రాముడు సంతుష్టుడయ్యెను. 'తండ్రి అగు దశరథునికి, గురవగు విశ్వామిత్రునికి, వసిష్ఠునికి సముడు మామ అగు జనకుడు' అని తెలిసికొని అతడు జనకుని సన్మానించెను.

పిదప జనకుడు భరతునికి వినతి చేసెను. ప్రేమతో ఆతనిని ఆలింగము చేసికొనెను. ఆశీర్వదించెను.

అనంతరము అతడు లక్ష్మణుని, శత్రుఘ్నుని కౌగిలించుకొని వారికి ఆశీస్సులనిచ్చెను. పరస్పర ప్రేమవశులై వారు ఒండొరులను మాటిమాటికి శిరములువంచి నమస్కరించుకొనసాగిరి.

పలుమారులు జనకుని ప్రశంసించుచు, కొనియాడుచు రఘపతి తన సోదరులతో కలసివెడలెను. జనకుడు కౌశికుని పాదములనుపట్టుకొని ఆచరణరేణువులను తన కండ్లకు అద్దుకొనెను. వానిని తలపై ధరించెను.

''మునీశా, ఆకర్ణింపుడు, ఉత్కృష్టమగు తమ దర్శనమువలన దుర్లభమగునది ఏదియు లేదు. ఇదినా విశ్వాసము, ఏ ఆనందమును, సత్కీర్తిని, లోకపాలురు వాంఛింతురో, ఏమనోరథమును వెలువరించుటకు వారు వెనుకాడుదురో ఆ ఆనందము, సుయశము, స్వామీ నాకు సులభ##మ్యెను. సిద్ధులన్నియు తమదర్శనమునకు వెనువెంటనే ఉండును'' అని ఇట్లు జనకుడు విశ్వామిత్రునికి అనేకపర్యాయములు తలవంచుకొని వందనముకావించి వినతిచేసెను. కౌశికుని ఆశీస్సునుపొంది జనకమహీశుడు వెనుకకు మరలెను.

నగరాలు మ్రోగించుచు మగపెండ్లివారు పయనించిరి. చిన్నలు, పెద్దలు ఎల్లరు సంతసించిరి. మార్గమున గ్రామములయందలి స్త్రీలు, పురుషులు రాముని దర్శించి కన్నులున్నందుకు సాఫల్యముకాంచి సుఖులైరి. నడుమనడుమ విడిదిచేయుచు, మార్గమందలి ప్రజలను ఆనందింపజేయుచు పెండ్లివారు ఒక పునీతదినమున అయోధ్యను సమీపించిరి.

నగారాపై దెబ్బపడినది. చక్కనిడోళ్ళు మారుమ్రోగసాగినవి. శంఖ, భేరీధ్వనులు, మిన్నుముట్టినవి. ఏనుగులు ఘీంకరించినవి. గుఱ్ఱములు సకిలించినవి. మహానాదమును కావించు కంచువాద్యములు, డప్పులు మ్రోగినవి. రసవంతమగు రాగములను సన్నాయీలు ఆలపించినవి.

పెండ్లివారు ఏతెంచుచున్నారని విని అయోధ్యాపురవాసులు ఆనందించిరి. వారి శరీరములు పులకరించినవి. అందరు తమతమ సుందరపదములను అంగళ్ళను, నందులను, నాలుగువీధులు కలియుచోట్లను, నగరద్వారములను అలంకరించిరి. సందులన్నిటిని సుగంధద్రవ్యములతో ముంచివేసిరి. ముంగిళ్ళనన్నిటిని సింగారించిరి. తోరణ, పతాక, ధ్వజ, మండపములచే వీధులన్నియు వర్ణింపజాలనట్లు సుందరముగా అలంకరించిరి.

పండ్లతోనిండిన పోక, అరటి, మామిడి, పొగడచెట్లు, కదంబ తమాలవృక్షములు వీధులలో నాటబడినది. నాటబడిన ఆసుందరవృక్షములు ఫలభారముచే భూమిని అంటుచున్నవి. వానికుదుళ్ళు మణులతో చక్కని పనితనముతో అలంకరించడినవి. ఇంటింటను అనేకవిధములగు మంగళకలశములు అలంకరింపబడినవి. రఘువరుని నగరమునువీక్షించి బ్రహ్మాదిదేవతలు మోహితులైరి. ఆసమయమున రాజభవనము అత్యంతముగా శోభిల్లుచున్నది. దాని నిర్మాణమునుచూచి మారుని మానసమైనను సమ్మోహితముగును.

శుభశకునములు, మనోహరత్వము, బుద్ధి, సిద్ధి, అన్నియు సహజసుందర శరీరములను తాల్చి దశరథుని ఇంట వసించుచున్నట్టున్నది. రాముని, వైదేహినిదర్శింపవలెనను కోరిక ఎవరకిలేకుండును?చెప్పుడు

మత్తైదువలు గుంపులు గుంపులుగాకూడి వచ్చిరి. తమ సౌందర్యముచే ముదినవిలాసినిని సహితము కించపరచువారే వారందురు. సకలసన్మంగళద్రవ్యములను సమకూర్చుకొని, హారతులను చేపట్టి వారు గానముచేసిరి. భారతీయే బహువేషమును ధరించి గానము చేయుచున్నదా అనిపించినది.

రాజభవనము కోలాహలము చెలరేగెను. ఆ సమయమును, ఆనందమును వర్ణింజాలుము. కౌసల్యాది రాముని తల్లులు ప్రేవవివశులై తమ దేహస్థితినే విస్మరించిరి. గణశుని పురారినివారు పూజించిరి, విప్రులకు విరివిగా దానములిచ్చిరి. పరమదరిద్రునికి చతుర్విధపదార్థములు సంప్రాప్తించినట్లు వారు ప్రముదితులైరి.

తల్లురెల్లరు మోద, ప్రమోదవిశులై ఉన్నందున వారిశరీరములు క్రుంగిపోయినవి. వారి కాళ్ళు ముందుకు సాగుటలేదు. రామదర్శనార్థమై అత్యంత అనురాగులై వారు వధువరులకు హారతి ఇచ్చుటకు సామగ్రిని సిద్ధముచేయు మొదలిడిరి. నానావిధవాద్యములు మ్రోగుచున్నవి. సుమిత్ర ఆనందమున మంగళగ్రిని సమకూర్చెను. పసుపు, గరికదిబ్బలు, పెరుగు పత్రములు పుష్పములు తమలపాకులు, పోకచెక్కలు మొదలగు మంగళకరద్రవ్యములు, అక్షతలు, అంకురములు, గోరోచనము, పేలాలు, తులసీదళములు విరాజిల్లుచున్నవి. రంగులతో చిత్రింపబడిన సహజరమణీయయులైన సువర్ణకలశములు మదనుని పక్షులు గూళ్ళను కట్టినవా- అనిపించుచున్నవి. శుభశకునములను సూచించు సుగంధపదార్థములను వర్ణింపజాలము. రాణులెల్లరు సకల మంగళప్రదపదార్థములను సమకూర్చిరి. బహువిధములగు హారతులను వారు సిద్ధముచేసి ఆనందముతో మధురగానము చేసిరి. బంగారు పళ్ళెరములయందు మంగళద్రవ్యములను నింపి ఆ తల్లులు తమ కరకమలములతో తీసుకొని వచ్చిరి. ముదమునవారు వధువరూలకు స్వాగతముపలుక మొదలిడిరి. వారి తనువులయందు పులకరింతలు చిగిర్చెను.

శ్రావణ మానపు కారుమబ్బులు దట్టముగా క్రమ్ముకొని వ్యాపించినట్లు అగరు వత్తుల పొగలు ఆకాశమున నల్లగా వ్యాపించెను. సురలు కల్పతరుల పూలమాలను కురీపించుచున్నారు. కొంగలగుంపులు తమవైపునకు మన మనస్సులను ఆకర్షించు చున్నవా అనునట్లున్నవి అవి. మంజుల మణిమయతోరణములు అలంకరింపబడిన ఇంద్రధనుసువలె ఉన్నవి. మిద్దెలపై సుందర, చపలవనితలు ఒకమారు కనుపించుచున్నారు. మరిఒకమారు మఱుగుపడుచున్నారు. తళుకుమను విద్యుల్లతలవలె ఉన్నారు వారు. నగరాలధ్వని మేఘముల ఘోరగర్జనవలె ఉన్నది. యాచకుల చాతక పక్షులు, కప్పలు, నెమళ్ళవలె ఉన్నారు. శుచియైన, సుగంధమునిచ్చు జలమును సురలు కురిపించుచున్నారు. ఆయోధ్యనగరమందలి స్త్రీలు, పురుషులు, సన్యములవలె సంతసించుచున్నారు.

ముహూర్తమును గమనించి వసిష్ఠగురువు ఆనతి ఇచ్చెను. రఘుకులమణి అగు దశరథుడు గిరిజను శంభుని, గణరాజును స్మరించి ఆనందమయిన బృందసమేతుడై అయోధ్యానగరమును ప్రవేశించెను.

శుభకునములు కనుపించుచున్నవి. సురలు దుందుభులను మ్రోగించుచున్నారు. పూలను కురిపించుచున్నారు. దేవతావనితలు మంజులమగు మంగళగీతములను ఆలసించిచుచున్నారు. నాట్యము చేయుచున్నారు. మాగధులు, సూతులు, భట్టులు, చతురులగు నటులు త్రిలోక ప్రకాశ ప్రదాత అగు శ్రీరాముని యశమును కీర్తించుచున్నారు. జయజయధ్వనులు, నిర్మల, శ్రేష్ఠ, వేదవాణి సుమంగళయుతమై దిశదిశలను వినవచ్చుచున్నవి. అనేక విద్యాములు మ్రోగ మొదటిడినవి. సభమున సురలు, నగరమున నరులు అనురాగమగ్నులై ఉన్నారు. పెండ్లివారు వర్ణనాతీతముగా సన్నద్ధులైనారు. వారెల్లరు మహాసంతోషముగా ఉన్నారు. వారి హృదయములనుండి ఆనందము ఉప్పొంగుచున్నది. అయోధ్యాపువాసులు రాజునకు జోహారులిచ్చిరి. రాముని కనుగొనగానే వారు ఆనందముపొంది, మణులను వస్త్రములను కానుకలిచ్చిరి. వారి కన్నులు నీరు క్రమ్మెను, శరీరములు పులకరించెను. పురవనితలు ముదితులై హారతులిచ్చిరి. నలుగురు సోదరులను చూచి హర్షము చెందిరి. పల్లకీల రమణీయమగు తెరలను తొలగించి నవ వధువులనుకాంచి వారు ఆనందించిరి.

ఇట్లు అందరికి ఆనందము నిచ్చును రాజద్వారమువద్దకు ఎల్లరు ఏతెంచిరి. కొడుకులకు, కోండండ్రకు తల్లులు దృష్టి తీసిరి, హారతులిచ్చిరి. ఆప్రేమను, ప్రమోద మును మాటలలో ఎవరు వర్ణింపగలరు? పలువిధములగు భూషణములు, రత్నములు, వస్త్రములు, ఆగణితముగు ఇతరవస్తువులు వారికి తల్లులు కానుక లిచ్చిరి.

నలుగురు కొమరులను నలుగురు కోడండ్రను కనుగొని రాణులు మహానందమును పొందిరి. సీతారాముల సౌందర్యమును పలుమార్లు తిలకించి వారు జగమును తమ జీవితము సఫలమయ్యెనని ఎంచి ఆనందించిరి. సఖియలు సీతయొక్క వదనమును పదేపదే అవలోకించి తమపుణ్యమును కొనియాడుకొనిరి. గానము చేసిరి, దేవతలు క్షణక్షణము పూలవాన కురిపించిరి. నాట్యమాడిరి. పాటలు పాడిరి. సేవలు చేసిరి.

మనోహరులగు ఆ నాలుగు జంటలను చూచి శారద సామ్యము లన్నింటిని అన్వేషించెను. కాని, వారిని పోల్చుటకు ఉపమానమేదియు ఆమెకు దొరకనే లేదు. సర్వసామ్యములు వారిముందు అల్పములే. శారదయు రాముని రూపమున అనురక్తయై రెప్పవాల్చక చూచుచున్నది.

వేదవిధిని, కులాచారమును అనుసరించి అర్ఘ్యమునిచ్చి, నడచుదారిలో వస్త్రములు పరపించు హారతులిచ్చి కొడుకులను కోడళ్ళను తల్లులు వారివారి మందిరముల లోనికి తోడ్కొని వెడలిరి. మన్మధుడు స్వహస్తములతో నిర్మించెనా అనునట్లున్న సహజసుందరములగు నాలుగు సింహాసనములపై ఆ తల్లులు రాకుమార్తెలను, కొరమరులను ఆసీసులను చేసిరి, వారి పవిత్రచరణములను కడిగిరి. వేదవిధిని అనుసరించి, మంగళవిధానములగు ఆ వధువరూలకు ధూప, దీప, నైవేద్యములనిచ్చి పూజించిరి, పలుమార్లు హారతులిచ్చి తల్లులు వధూవరుల శిరములకు సుందరమగు నింజామరలు వీచిరి.

అనేక వస్తువుల కానుకలగా వచ్చుచున్నవి. తల్లులెల్లరు ప్రమోదభరితులై ఉన్నారు. యోగులకు పరమతత్త్వము సంప్రాప్తించినట్లు వారు శోభిల్లుచున్నారు. అనవరతము రోగి అగువానికి అమృతము లభించినట్లున్నది. ఆగర్భదరిద్రునికి పరశువేది దొరకినట్లున్నది. అంధులకు సుందరదృష్టి ప్రాప్తించినట్లున్నది. మూగవానినోట శారద ఆవహించినట్లు సమరమున శూరుడు విజయము సాధించినట్లున్నది. ఈ ఆనందములకంటే శతకోటిరెట్లు అధికమగు ఆనందమును ఆ తల్లులు అనుభవించుచుండిరి.

రఘుకుల చంద్రుడు వివాహమాడి తమ్ములతోకలసి స్వగృహమును ప్రవేశించెను. మాతలు లోకాచారములను అనుసరించిరి. వధూవరులు సిగ్గుపడుచున్నారు. ఈ మహామోదమును, వినోదమును చూచి రాముడు తనలో తాను చిరవునవ్వు నవ్వుకొనుచున్నాడు. తమ మనోరథములన్నియు సిద్ధించెనని ఆ తల్లులు సురలను, పితరులను చక్కగా పూజించిరి. ఎల్లరకు నమస్కరించిరి. ''సోదరసహితుడగు రామునికి శుభమగునట్లు |వరమిమ్ము'' ని కోరిరి.

అంతర్హితులై సురలు ఆశీర్వదించుచుండిరి. ముదమున మాతలు వధూవరులను కౌగిలించుకొనిరి. పెండ్లికి వచ్చినవారినందరిని దశరథుడు పిలిపించి వాహనములను వస్త్రములను, మణులను , భూషణములను బహూకరించెను. అనతిపొంది, రాముని తమహృదయములధరించి వారెల్లరు ఆనందమున తమతమ ఇండ్లకు మరలిరి. పురవనితలను, పురుషులను దశరథుడు నూతన భూషణ వస్త్రాలంకృతులను కావించెను. ఇంటింటను ఆనందగానము. శుభాకాంక్షలు మారుమ్రోగ మొదలిడినవి.

యాచకజనులు ఏదికోరినను రాజు దానిని సంతోషమున ప్రసాదించెను. సకల సేవకులకు, వాద్యగాండ్రకు దశరథుడు అనేకవిధములగు దానము లిచ్చెను. వారిని సన్మానించెను. సంతుష్ఠులను కావించెను. అందరు వందనముచేసి ఆశ్వీరదించిరి. రాముని గుణ, గణగాథలను గానము చేసిరి. అంతటనరపాలుడు గురువుతో భూ సూరులతో కలసి తన మందిరమునకు వెడలెను.

వసిష్టుని ఆనతిని దశరథుడు లోక, వేదవిధులననుసరించి సర్వము సాదరముగా నెరవేర్చెను. భూసురబృందములను చూచి తమ మహాభాగ్యమని ఎంచి రాణులందరు సారదముగా లేచినిలచిరి. వారి చరణములనుకడగి, ఎల్లరకు స్నానము చేయించి భూపాలుడు వారినందరని బాగుగా పూజించెను. వారికి విందు కావించెను. ఆదరముతో, దానములతో, ప్రేమతో సంతుష్టమానసులై ఆశీర్వదించుచు వారందరు మరలిరి. దశరథుడు గాధిసుతుని బహువిధముల పూజించి ''నాథా, నావంటిధన్యుడు మరి ఎవ్వడు లేడు'' అనెను. ముని అతడు కడు ప్రశంసించెను. రాణులు అతడు మునియొక్క పాదధూళిని గ్రహించిరి. విశ్వామిత్రుని విడిదికి తగు ఉత్తమస్థలమును దశరథుడు తన మందిరమున ఏర్పాటుకావించెను. నరపతి, రాణివాసము స్వయముగా ఆ మునికి చరణకమలములను మరల పూజించెను. కొడుకులతో, కోడళ్ళతో రాణు లందరితో కలసి అతడు పలుమారులు గరునిపాదమలుకు వందనము కావించెను. మునీశుడు భూపాలును ఆశీర్వదించెను. అత్యంత అనురాగభరిత హృదయముతో తన పుత్రులను, సంపదలన్నిటిని ముని సమక్షమున ఉంచి దశరథుడు స్వీకరించుడని ఆమునికి వినతి కావించెను. మునివినాయకుడు తన కట్నమునుమాత్రము స్వీకరించి అనేకవిధముల ఆశీర్వదించెను.

సీతాసమేతుడు శ్రీరాముని తన ఉరమునధరించు హర్షమున గురువు స్వస్థల మునకు మరలెను.

దశరథుడు బ్రహ్మాణస్త్రీలనందరినీ పిలిపించి వారికి సుందరవస్త్రములను భూషణములను బహూకరించెను. అనంతరము అతడు నగరమునందలి సువాసినలెల్లరును పిలిపించి వారివారి అభీష్టములననుసరించి ఉడుపులను బహూకరించెను. బహూకరణకు యోగ్యులగువారందరు దశరథుడిచ్చిన కట్నములను స్వీకరించిరి, భూపాల శిరోమణి అగు దశరథుడు ఎవరు ఏదికోరిన దానిని వారికి బహూకరించెను. ప్రియులు, పూజనీయులు, అగు అతిథులను భూపతి చక్కగా సన్మానించెను.

రఘవీరుని వివాహమును వీక్షించి దేవతలు ఆ ఉత్సవమును ప్రశంసించి పుష్పవర్షముకురిపించిరి. దుందుభులను మ్రోగించిరి. ఆనందించిరి. పరస్పరము రాముని యశమును గురించి ప్రస్తావించుచు తమతమ లోకములకు ప్రేమతో పెల్లుబుకు హృదయములతో మరలిరి.

సకల విధముల ఎల్లరకు ప్రేమపూర్వకముగా ఆదరసత్కారములను చేసినపిదప దశరథభూపాలుని హృదయము సంపూర్ణ ఉత్సాహముతో నిండెను. అతడు రాణివాసమునకు చని కొడుకులను కోడండ్రను చూచెను. ఆనందమును అతడు కుమారులను తన ఒడిలోనికి తీసుకొనెను. ఆ సమయమున అతడు పొందిన ఆనందమును ఎవరు తెలుపగలరు? పిదప ప్రేమయుతముగా అతడు కోడళ్ళను తన అంకమున కూర్చుండపెట్టుకొని ఆనందమున వారిని లాలానచేసెను. ఆ వైభవమును చూనచి రాణులెల్లరు ఆనందించిరి. వారి అందరి హృదయములందు ఆనందము నివసించుచున్నది.

అంతట దశరథుడు వివాహములు జరిగినవిధమును వర్ణించి తెలిపెను. విని అందరుసంతసించిరి. జనకభూపాలుని గుణ, శీల, మహిమలను ప్రేమ తెఱగును,మనోహరమగు సంపదలను దశరథుడు భట్టువలెను బహువిధముల వర్ణించెను. జనకుడు చేసిన సత్కార్యములను విని రాణులు కడు సంతసించిరి. పుత్రులతో సహా స్నానముచేసి విప్రులను, గురువులను, జ్ఞాతులను ఆహ్వానించి దశరథుడు అనేకవిధములను విందుచేసేను.

ఇంతలో ఐదుఘడియలరాత్రి గడపెను. అందగత్తెలగు స్త్రీలు మంగళగానము కావించిరి. ఆనందములకు మూలమై, మనోహరముగా ఆరాత్రి ఉన్నది. అందరు ఆచమనము కావించి తాంబూలము సేవించిరి, పూలమాలలు, సుగంధద్రవ్యములు మొదలగువానితో విభూషితులైరి, అంతటను శోభఅలముకొనెను. రాముని దర్శించి, రాజుయొక్క ఆనతికొని అందరు తలలువంచి వందనముచేసి తమతమ భవనములకు వెడలిరి. ఆ ప్రేమను, ఆనంద, వినోద, మహత్త్వ, సమయ, సమాజ, మనోహరత్వములను శతశారదలు వందలాది ఆదిశేషులు, బ్రహ్మలు, మహేశులు, గణశులు, వర్ణింపజాలరు. ఇకనేనెటువర్ణింపగలను? వానపాము ధరణి తలపై భరించ గలదా ఏమి?

దశరథుడు ఎల్లవారిని సర్వవిధముల సన్మానించెను. రాణులను రప్పించి మృదువచనములతో ''కోడళ్ళు ఇంకను పసివారు, క్రొత్తఇండ్లకు వచ్చినవారు. కంటికి రెప్పలవలె వారిని కాపాడుడు. పిల్లలు అలసి నిద్రావశులై ఉన్నారు. వీరిని తోడ్కెని వెడలి వరుండపెట్టుడు'' అని చెప్పి అతడు రాముని చరణములయందు తన మనమును లగ్నము కావించు తన విశ్రాంతి గృహమునకు వెడలెను. భూపాలుని సహజ సుందర వచనములనివిని రాణులు మణిఖచిత సువర్ణశయ్యలను పరపించిరి.వానిపై సుందరమై, ఆవుపాల నురుగువలె మృదువైన అనేకవిధములగు తెల్లని దుప్పట్లను వేయించిరి. వర్ణనీతీతమగు తలదిండ్లను అమర్చిరి. మణిమందిరమున పూలమాలలు, సుగంధద్రవ్యములు అలంకరింపబడనవి. రమ్యమగు రత్నదీపములు, చాందనీలు, వానిశోభను వర్ణిపలేము. చూచినవారికే తెలియును. ఇట్లు చక్కని శయ్యను అలంకరించి తల్లులు రాముని లేపి ప్రేమతో వానిపై పరుండబెట్టిరి. రాముడు పలుమారులు తమ్ములకు ఆనతి ఇచ్చెను. వారు తమతమ శయ్యలనుచేరి శయనించిరి. రాముని శ్యామసుందర, కోమలగాత్రమును చూచి అందరు తల్లులు ఇట్లు ప్రేమతో వచించిరి. నాయనా మార్గమున పయనించుచు భయంకరి అగు ఆ రాక్షసిని తాటకను ఎట్లు సంహరించినావయ్యా? తండ్రీ, ఒట్టుపెట్టి చెప్పగలవు. ఆ ముని యొక్క అనుగ్రహముచేతనే ఈశ్వరుడు నిన్ను అనేక ఆపదలనుండి రక్షించినాడు. గురుని ప్రసాదముననే మీ ఇరువురు సోదరులు యజ్ఞమును సంరక్షించితిరి. సకలవిద్యలను సంపాదించితిరి. పాదధూళి సోకినంతనే మునిపత్ని తరించినది. భువనమెల్లయు ఆ కీర్తిసంపూర్ణముగా వ్యాపించినది. తాబేటివీపు, వజ్రము, పర్వతములకంటె కళోరమగు శివుని ధనువును నృపసమాజమున నీవు విరచి, విశ్వ విజయ యశస్సును, జానకిని చేపట్టితివి తమ్ములకు వివాహముచేయించి తిరిగి వచ్చితివి! నీచర్యలన్నియు అమానుషములే కేవలము కౌశికుని కృపచేతనే ఇవి అన్నియు పరిపూర్తి అయ్యెను. తండ్రీ, చంద్రుని వంటి నీవదనమును చూచి నేడు మాజన్మలు సఫలమైనవి. నిన్నుచూడనిదినములు బ్రహ్మ మా ఆయువుని లెక్కించకుండుగాక''!

వినయసంభరితమగు శ్రేష్ఠవచనములను పలికి రాముడు తల్లులను సంతుష్ఠపరచెను. శంభుని, గురువుల, విప్రుల పాదములను స్మరించి అతడు నేత్రములను నిద్రావశము కావించెను. నిద్రలో సహితము రాముని సుందరవదనము సంద్యాసమయము నరసీరుహమువలె శోభిల్లుచున్నది.

స్త్రీలు ఇంటింట జాగరణచేసిరి. ఒకరితో ఒకరు మంగళమయమగు హాస్యమును పలికిరి. ''సఖీ, చూడవే. ఈ రేయి ఎట్లు శోభిల్లుచున్నదో అయోధ్యారి అత్యంతము విరాజిల్లుచున్నది కదే!'' అని రాణులు నుడవి అందకత్తెలగు తమ కోడంద్రను తోడ్కొని వెడలిరి. తమశిరములయందలి మణులు సర్పములు తమ హృదయములయందు దాచుకొనునట్లు వారు కోడళ్ళును దగ్గరకు తీసికొని నిదురించిరి.

ప్రాతఃకాలమున పావనముహూర్తమున ప్రభువు నిద్రమేల్కోన్నాడు. చక్కగా కోళ్ళుకూయసాగినవి. వందిమాగుధలు గుణవర్ణన చేసిరి. పురజనులు జోహారు లర్పించుటకు రాజద్వారమువద్దకు వచ్చిరి. వారి ఆశీర్వములను పొందిరి. మోదము చెందిరి . తల్లులు సాదరముగా తనయవలవదనమును వీక్షించురి. అంతట సోదరుల రాజుతో కలసి బయటకి విచ్చేసిరి. సహజపావనమగు నలుగురు సోదరులు శౌచకృత్యములను నెరవేర్చుకొని, పునీత అగు నరమూనదియందు స్నానము చేసిరి. ప్రాతఃక్రియలను కావించి తండ్రివద్దకు ఏతెంచిరి.

పుత్రులను చూచి దశరథుడు వారిని కౌగిలించుకొనెను. ప్రభుని అనతిపొది ఆనందమున సుతులు ఆసీనులైరి. ''కన్నులున్నందుకు ఇదే అవధి'' అని తలచి సభలోని వారెల్లరు ఆనందించిరి.

అంతట వసిష్ఠిముని, కౌశికుడు విచ్చేసిరి. దశరథుడు వారిని సుందరమగు ఆసనములపై ఆసీనులకావించెను. సుతులతో కలసి వారిని పూజించెను. వారిచరణములకు వందనము కావించెను. గురువు లిరువురు రాముని వీక్షించి అనురాగవశులైరి.

వశిష్ఠుడు ధర్మసంబంధమగు ఇతిహాసములను నుడవుచుండగా రాణివాస సహితుడై రాజు వినెను. మునుల మనములకు సహితము అగోచరమగు గాధిసుతుని చర్యలను వసిష్ఠుడు ముదితుడై విపులముగా , బహువిధముల వర్ణించెను.

''ఈచరిత సర్వము సత్యము. ముల్లోకములయందు విశ్వామిత్రునికీర్తి వ్యాపించినది'' అని వాసుదేవుడు వచించెను. ఈ మాటలను విని అందరు సంతసించిరి. రామలక్ష్మణుల హృదయములయందు అధికఉత్సాహము కలిగెను.

ప్రతిదినము మంగళ, ఆనందకరములగు మహాత్సవములు జరుగుచున్నవి. ఇట్లు దినములు గడచుచున్నవి. అయోధ్య ఆనందముతో పొంగిపోవుచున్నవి. ఆనందముయొక్క అధికమై, అత్యధికమై, అభివృధ్ధి చెందుచున్నది. శుభదినము

R-13

చూచి - రమణీయ కంకణవిసర్జన కావింపబడినది. మంగళ, ఆనంద, వినోదములకు కొరతయే లేదు. అయోధ్యయందలి నిత్య నూతన ఆనందమునుచూచి దేవతలు మోహితులగుచున్నారు. ''అయోధ్యయందు మాకు జన్మ అనుగ్రహింపు''మని వారు విరించిని యాచించుచున్నారు.

తన ఆశ్రమమునకు మరలుదమని విశ్వామిత్రుడు దినదినము అనుకొనును. కాని రాముని వినయ, ప్రేమలకు వశుడై ఆగిపోవును. దినదినాభివృద్ధి చెందుచున్న భూపాలుని ప్రేమను కనుగొని మహాముని రాజగు విశ్వామిత్రుడు అతనిని కీర్తించు చుండును.

తుదకు విశ్వామిత్రుడు దశరథుని అనుమతిని కోరెను. అనురాగమగ్నుడై, సుతసహితుడై దశరథుడు ఆ ముని వరుని ఎదుట నిలచి ''స్వామీ, ఈ సకల సంపదలు తమవి. నేను, నా పుత్రులు, భార్యలు, నీ సేవకులము. ఈ బాలురయందు సదాప్రేమకలిగి ఉండుడు. నాకు తమదర్శనము కలిగించుచుందురుగాక'' అనెను. ఇట్లు వచించి దశరథుడు, అతని భార్యలు, పుత్రులు, విశ్వామిత్రుని చరణములపై పడిరి. వారినోట మాట వచ్చుటలేదు. అనేకవిధముల ఆశీర్వదించి విప్రుడు - విశ్వామిత్రుడు వెడలెను. ఆ ప్రేమను వర్ణింపజాలము. సోదరులనెల్లరను వెంటనిడుకొని ఆ మునిని ప్రేమతో రాముడు సాగనంపెను. ముని ఆనతినికొని వెనుకకు మరలెను.

గాధికుల చంద్రుడగు కౌశికుడు కడు ముదితుడై రాముని రూపమును, దశరథుని భక్తిని, రామ సోదరుల వివాహములను, ఆ ఉత్సవములనన్నిటిని, ఆ ఆనందమును తనలో తాను పొగడుకొనుచు వెడలెను.

వామదేవుడు, రఘుకులగురువగు జ్ఞాని వసిష్ఠుడు గాధిసుతుని గాథలను మరల వర్ణించిరి. విశ్వామిత్రుని సత్కీర్తినివిని దశరథుడు - తన పుణ్యప్రభావమును తనలో తాను వర్ణించుకొనెను.

దశరథుని ఆనతినిపొంది అందరు తమతమ ఇండ్లకు మరలిరి. సుతసమేతుడై దశరథనృపాలుడు తన గృహమునకు చనెను. ఎచ్చటచూచినను ఎల్లరు శ్రీరాముని కల్యాణగాథనే గానము చేయుచుండిరి. రాముని పావన సత్కీర్తి ముల్లోకముల యందును వ్యాపించెను. కల్యాణమై రాముడు అయోధ్యకు ఏతెంచినాటనుండియు అయోధ్యకు సకలవిధములగు ఆనందము అరుదెంచి, అచ్చట నివసించుచున్నది. రామ కల్యాణమువలన కలిగిన ఆనందము, ఉత్సాహము - శారద ఆదిశేషులై నను వర్ణింప జాలరు. సీతారాముల యశము కవికుల జీవనమును పావనమొనర్చును. మంగళములకు అది గని, ఈ విషయమును తెలిసికొని - దీనిచే నా వాణిని పావనముచేయుటకై ఏదో కొంత వర్ణించితివి.

తన వాణిని పావనమొనర్చుటకు తులసీదాసు రాముని కీర్తిని వర్ణించినాడు. రఘువీరుని చరిత అపార వారిధి. ఏ కవి ఆ సాగరమును దాటినాడు ?

రాముని యజ్ఞోపవీతధారణ, మంగళమయమగు వివాహమహోత్సవముల వర్ణన సాదరముగా విని గానము చేయువారు, వైదేహీ రాముల కృపచే సర్వదా సుఖమును పడయుదురు.

సీతా రఘువీరుల వివాహగాథను ప్రేమపూర్వకముగా గానము చేయువారికి, వినువారికి నిరంతరము ఉత్సామమే. రాముని యశస్సు మంగళములకు నిలయము.

Sri Ramacharitha    Chapters