Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

వేదాంతము

'వేదాంతం' అనేమాట మనం తరచుగా వినేదే. పరిహాసానికి కూడా ఒకొక్కప్పుడు 'ఏమిటి? మహా వేదాంతం మాటాడుతున్నావే!' అని అంటాం. గీతలో శ్రీకృష్ణపరమాత్మ తన్ను గూర్చి-'వేదాంతకృ ద్వేదవిదేవచాహమ్‌' అని చెప్పుకున్నాడు.

అంతం అంటే చివర. వేదాంతం అంటే వేదాలకు చివర భాగం అని అర్ధం. చివరకు చెప్పేదే తీర్మానం, నిక్కమయినది, తీర్పు అని అర్థం. పత్రికలలోగూడా ఏదయినా ఒక ప్రసంగం లేక ఉపన్యాసంయొక్క సారాంశం ఎరుగగోరేవారు మొదలూ చివరా చదివి తృప్తిపడతారు. అదే విధంగా వేదముయొక్క ఆద్యంతాలు చూస్తే ఆరంభంలో విషయాలవిరివి ఉన్న వస్తువుయొక్క ప్రధానగుణం ఎక్కడో ఒకచోట సూచింపబడి ఉంటుంది. కడపటికి వచ్చేసరికీ అది తేటతెల్లమయిపోతుంది.

ఆరంభాన్ని ఉపక్రమం అనిన్నీ, అంతాన్ని ఉపసంహారమనిన్నీ అంటారు. నడుమ ఎన్నో విషయ విన్యాసాలూ ఆధారాలూ వున్నా ఉపక్రమోపసంహారాలను చూచి మనం ఇదమిత్థ మని చెప్పగలం.

ప్రభుత్వంకూడా ఎన్నో చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలలోని అభిప్రాయాలమీద ఏవయినా సంశయాలుగా సంకురుమయ్యలూ పుట్టితే ఆ చట్టానికే ఒక వ్యాఖ్యానంగా మరో చట్టాన్ని-'లా ఆఫ్‌ ఇంటర్‌ ప్రిటేషన్‌-ంశూ ుౌ nష|సూస|షశుn' చేస్తారు.

వేదం అనేది మనకు అందరకూ ఉమ్మడి చట్టం. ఇది ఇలా అనాది నుండీ వస్తూంది. వేదం అవధులు లేనిది. దీనికి ఆద్యంతాలు లేవు. ఇది నిత్యచట్టం - 'ఎటర్నల్‌లా'. దీనికి దేశకాలాలు లేవు. స్వామిన్నీ అంతే. ఆయన ఆద్యంతరహితుడు. దేశకాలాలకు అతీతుడు. ఆయన ఎట్లా నిరవధికుడో ఆయన చట్టంగూడా అట్లా నిరవధికం. వేదవాక్యాలకు దేశకాలాల మార్పులులేవు. అందుచేతనే ఎవరయినా పిడివాదం చేస్తూవుంటే- 'నీవు చెప్పిందే వేదవాక్యమా?' అని అంటారు.

వేదం అనాది. వేదానికి ముందు ఉన్నది స్వామి. అందుచేతనే అదియున్నూ వేదానికిమూలమయిన విష్ణువున్నూ అనాది. మూలమని అనడ మున్నదే అది అన్నిటికిని మూలం ఆయన అనియే అనడం. ఆయనయే 'మొదటి ఆ సామి' ఆయనయే చట్టానికి కూడ మూలం.

'యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః'

ఆ పరమ వస్తువే వేదాల ఆద్యంతాలయందును సుప్రతిష్ఠితమయి ఉన్నది. ఆచార్యుల దర్శనం చేసికొని పూర్ణకుంభం సమర్పించేటప్పుడు ఈ మంత్రమే చెబుతారు.

వేదవాక్యాల అభిప్రాయం తెలిసికోవడ మెట్లా? వేదార్థం తెలిసికోడానికి కొన్ని నియమాలున్నవి. వానిని మీమాంస చెబుతుంది. వేదం అనే చట్టానికి 'లా ఆఫ్‌ ఇంటర్‌ ప్రిటేషన్‌, మీమాంస. ఆ మీమాంసలో వేదార్థం తెలిసికొనడానికి ఉపక్రమం, ఉపసంహారం, అభ్యాసం, అపూర్వత, ఫలం అర్థవాదం, ఉపపత్తి అనేవి ఏర్పరుచబడి ఉన్నవి.

వేదముల ఆద్యాంతాలు ఒకే విషయమును గూర్చి చెపుతై. ఆరంభం ఒకటి ఉపసంహారం మఱియొకటిగా ఉంటే దీని సారాంశం ఏమి? అని మనకు సందేహం రావచ్చు. మధ్య ఎన్ని విషయాలు వచ్చానా ఆదిలోనూ అంతంలోనూ విషయైక్యం ఉంటే అదియే ఆప్రసంగం అంతటి యొక్కయూ సిద్ధాంతం, అని మనం నిస్సందేహంగా చెప్పగలం. ఇవియే ఉపక్రమోప సంహారాలు.

ఒక ఉపన్యాసంగాని ఏదైనా ఒక వ్యాసంలో గాని ఏ విషయం మరల ప్రస్తావింపబడుతుందో అదే ఆ పుపన్యాసం యొక్కగాని వ్యాసంయొక్కగాని సిద్ధాంతం అని మనం దృఢంగా చెప్పగలం' ఒక విషయమును ఇట్లా మళ్ళా మళ్ళా చెప్పడానికే అభ్యాసం అనిపేరు. దేనికైనా మననం చెయ్యాలంటే మనం దానినే మళ్ళా మళ్ళా ఆలోచిస్తాం. ఏదైనా ఒక విషయాన్ని సిద్ధాంతం చెయ్యడానికి ఉపయోగపడేది అభ్యాసము. మళ్ళా మళ్ళా చెప్పబడ్డదే దాని తీర్పు లేక సిద్ధాంతం.

మరొకటి అపూర్వత. మనమేదైనా ఒక ప్రసంగాన్ని ఒక రోజు వింటాం. మర్నాడున్నూ వింటాం. దానికి పదపటి దినమునగూడా వింటాం. మొదటినాడు చెప్పిన విషయమే ఈనాడుకూడా చెప్పబడవచ్చు. కాని ఇదివరకు చెప్పని విషయము ఏదైనా నేడు చెపితే అవియే నేడు చెప్పిన మాటలకు సిద్ధాంతం. నేడు ఏది క్రొత్తగా చెప్పబడినదో అదే సిద్ధాంతం. మిగిలినవన్నీ ఉండగా ఇదే అపూర్వత కొత్తగా చెప్పబడే విషయం ఏదైనా ఒక గ్రంథంలో అనేక విషయాలుచెప్పి ఇట్లాచేస్తే ఇట్టి ఫలము కలుగుతుందని చెపితే దానిని ఫలమని అంటారు. అదియే ఆ గ్రంథ సిద్ధాంతం.

ఏవేవో సమాచారాలు చెప్పి నడుమ వేరొకటి చెప్పి ఆ చెప్పినదానిని శ్లాఘిస్తే, స్తుతిస్తే, స్తుతింపబడిన ఆ విషయమే ప్రధానం. దానిని చెప్పడానికే ఈ కథలన్నీ. ఇట్లా కథలు ఆధారంగా చేసుకుని ఒక దానిని స్తోత్రం చేయడం 'అర్థవాదం' ఒక విషయంచెప్పి దానికి కాల నిరూపణం, ఔచిత్యం మొదలైనవి చెపితే ఆ విషయమే ఆ వ్యాసానికి ప్రధానాంశం. దీనికి ఉపపత్తి అనిపేరు.

'ఉపక్రమోపసంహారా పధ్యాసో7పూర్వతా ఫలమ్‌,

అర్థవాదోపపత్తీ చ లింగం తాత్పర్య నిర్ణయే'

అనే ఆరు విధాలయిన లింగాలచే, గుర్తులచే, తాత్పర్య నిర్ణయం చెయ్యవచ్చు అని మీమాంస చెపుతున్నది. దీనికి తాత్పర్యలింగ మనిపేరు. ఈ ఆరు లింగాలూ-గుర్తులు-అంటే ఇది ఈ విషయం తెలుపుతుంది అని తీర్మానించగలం. వీనిలో ఒకటి ఉన్నా చాలు. ఆరున్నూ ఉంటే సందేహానికి తావేలేదు.

ఈ చట్టాన్నిబట్టి వేదాన్ని పరిశీలిస్తే వేదంయొక్క ఆరంభ##మే వేదంయొక్క అంతమందుగూడా వున్నది. వేదారంభంలో ఏ స్వరం ఉన్నచో అదే దాని అంతమందున్నూ ఉన్నది. సంస్కృతంలో 'ఇదం' అంటే ఇది అని అర్థం. 'అదః' అంటే అది అని అర్థం. అది అని అనడానికీ 'తత్‌' అనే పదం ఇంకొకటి ఉన్నది. ఇది అనడానికి 'ఏతత్‌' అని మరొకపదం ఉన్నది.

ఇద మస్తు సన్ని 'కృష్టం' అనగా ఇదమ్‌ అనే సర్వనామం, దగ్గరగాఉండే వస్తువునూ వేరుగా ఉండే వస్తువునూ, ఎదురుగా ఉండే వస్తువునూ వేరుగా ఉండే వస్తువునూ, ఎదురుగా ఉండే వస్తువునూ చెపుతుంది.

'సమీపతరవర్తి చైతదో రూపమ్‌'. మనకు ఎదురుగా కంటిముందు ఉండే వస్తువును చెపుతుంది-'ఇదమ్‌' కంటె మిక్కిలి దగ్గరగా ఉండే వస్తువును చెపుతుంది-'ఏతత్‌'.

'తదితి పరోక్షే విజానీయాత్‌' మనకు తెలియకుండా మరుగున ఉండే వస్తువును చెపుతుంది,-'తత్‌'.

'అతిదూరే విజానీయాః' చాలాదూరమందు ఉన్న వస్తువే స్వామి. ఆదియే 'తత్త్వమ'ని వేదాంతంకూడా చెపుతున్నది. చాలా దవ్వున ఉండేదే 'తత్‌' చూపుడువ్రేలు దానిని చూపుతుంది. దూరాతిదూరంలో ఉన్న స్వామివల్ల మనకు ఏమి ప్రయోజనం అంటే చాలా దూరమందున్నవాడే చాలా సన్నిహితంగానూ ఉన్నాడు. ''దూరాద్దూరేఅంతికేచ'' అని వేదం చెపుతుంది.

ఈ సందర్భంలో ఒక కథ గుర్తువస్తూంది. ఒక ఊళ్లో పెండ్లికాని యువతి ఒకతె ఉండేది. 'అందరిలోకీ ఎన్నిక ఐన వానినే పెండ్లి చేసుకుంటానని' ఆకన్య పట్టుబట్టి తల్లిదండ్రులు నిర్ణయించిన మగనిని ఇష్టపడలేదు.

తలిదండ్రులకు ఏమీ పాలుపోక నీ ఇష్టమే కానిమ్మన్నారు. ఆపిల్లా పురుషులలో కెల్ల రాజు శ్రేష్ఠుడు, చేసుకుంటే, రాజునే పెళ్లిచేసుకోవాలి, అని నిశ్చయం చేసుకొని ఆవూరి రాజుగారి వెంటబడి అతడు ఎక్కడికిపోతే తాను గూడ అక్కడికే పోయేదట. ఒకరోజు రాజుగారు పల్లకిలో ఊరేగుతున్నారు. రాజుగారి కెదురుగా ఒక సన్న్యాసి వచ్చాడు. రాజుగారు పల్లకిదిగి ఆసన్న్యాసికి సాష్టాంగ పడ్డారు. ఆ అమ్మాయి 'రాజేశ్రేష్ఠుడ'ని అనుకొన్నాను. ఈ సన్న్యాసి రాజుకంటే గొప్పవాడు కాబోలు, కాకుంటే ఈయన కెందుకు నమస్కారం చేస్తాడూ? అని రాజును వదిలి సన్న్యాసిని అనుసరించడం మొదలెట్టింది. సన్న్యాసీ ఆపిల్లా ఊరివెలుపలికి వెళ్ళేరు. అక్కడ ఒక చెట్టుకింద వినాయకుని విగ్రహం ఉన్నది. సన్న్యాసి వినాయకుని ముందు నిలుచుండి గుంజీలు తీశాడు. దీనిని చూచిన ఆ పిల్ల ఆ సన్న్యాసిని వదిలి పెట్టి వినాయకుని ముందు కూచుంది. కొంతసేపటికి తోవలో పోయే కుక్క ఒకటి ఆ వినాయకుని మీద కాలెత్తి అదిచేసే పని అది చేసింది. వినాయకుడే గొప్పవాడనుకొన్నపిల్లకు ఇప్పుడు ఈ శునకం గొప్పదని తోచింది. అందుచేత వినాయకుని వదలి కుక్క వెంటబడ్డది. ఒక పిల్లవాడు ఆకుక్క మీద రాళ్ళు రువ్వగా మొరుగుతూ అది పారిపోయింది. తోవలో పోతున్న ఒక యువకుడు 'ఆ కుక్కను అనవసరంగా ఎందుకు బాధిస్తావని' అ పిల్లవానిని పట్టుకుని వీపుమీద నాలుగు వడ్డిచ్చాడు. అంతటితో ఆ అమ్మాయి శ్రేష్ఠ/వరాన్వేషణ కూడా పూర్తి అయింది. 'ఆ పిల్లవాని మీద చేయి చేసుకున్నవాడే అందరినీ మించినవాడు' అని ఆయువతి తీర్మానించు కుంది. మొట్టమొదట తలిదండ్రులు నిర్ణయించిన వరుడే కడపట ఆ అమ్మాయి మెచ్చిన వరుడు. ఎక్కడో అతిదూరాన స్వామి ఉన్నాడని వెతుకు తున్నావే! ఊరంతా చుట్టినా నీ వెట్లా ఆయనను చూడతలవు? ఆ స్వామి నీ సమీపాన్నే ఉన్నాడు. 'తద్దూరాత్తద్వంతికే' దూరంకంటే అతిదూరాన ఉన్నాడనీ, సమీపానకంటె అతి సమీపాన ఉన్నాడని, సూక్ష్మంగా చెప్పబడ్డది. హోరైజన్‌ అనేది భూమ్యాకాశాలు కలిసేచోటు. మనకు దగ్గరగానే ఉన్నట్లు కనబడుతుంది. హోరైజన్‌ వంకకు పోసాగితే అది దూరం అవుతూనే ఉంటుంది. ఇట్లా ''అదీ అదీ'' అనేబడే స్వామి చాలా దూరమందున్న స్వామి నీయందే ఉన్నాడు. తత్‌-త్వం అది నేవే అని వేదం చెబుతుంది. నేనూనేనూ అని దేనిని తలచుకొంటున్నావో ఆ స్ఫురణయే దైవం. ఆ స్ఫురణమే ఆ ప్రకాశ##మే లేకపోతే నీవు దేవుణ్ణి తలచడానికే ఎడం ఉండదు. నేను తెలిసి కొంటున్నాను. నేను తలచుకొంటున్నాను. అనే ఈ తెలిసికొనే, తలచుకొనే స్ఫురణమే చాలా దూరమందుండేది కూడా. అదే 'త్వమ్‌' నీవు.

ఇదే వేదానికి అంతమందుకూడా చెప్పబడ్డది. ఆ తత్త్వమునే వెదకికొంటూ దూరంగా పోయేది. వెదకికొంటూ పోవడానికి కావలసిన శక్తి నీ లోపలే ఉన్నది. అది నీవే, 'తత్‌ తత్‌' అనిచెప్పబడే దైవం నీవు' అని వేదం చెబుతూంది.

వేదాలచివర ఉండే భాగాలకు ఉపనిషత్తు లనిపేరు. 'ఇది ఇది' అని ఏది చెప్పబడుతూందో ఆ 'ఇదం' కు మూలం లేదు. అది మూలం లేనిది. మూలంలేని వస్తువూ విత్తులేని చెట్టూ ఎచటనయినా ఉందా, ఉంటుందా? ఈ కొండలు, ఈ సముద్రాలు, ఈ ఆకాశం, భూమి, పశువులు, మనుష్యులు, కోపం, భయం, ప్రేమ, ఇంద్రియాలు, శక్తి అని చెప్పబడే యింత ప్రపంచానికీ మూలం ఒకటి ఉండి తీరాలి. చూడడమూ, తలచడమూ శీతోష్ణాలను తెలిసికొనే తానూ, మనస్సుద్వారా ఇంద్రియాలద్వారా అనుభవించడమూ ఈ మొదలయిన వాని కన్నిటికీ 'ఇదం' అని పేరు. బుద్ధిమత్త్వమూ, ఆశ్చర్యం కలిగించే వైజ్ఞానిక పరిశోధనమూ వీని కన్నిటికినీ మూలకారణం 'అతడు'. మూలంలేని వస్తువేదీ ఉండదు. మనుష్య శరీరంలో ఒకబీజం ఉన్నట్టే పరమవస్తువులో గూడా ఒకబీజం ఉన్నది.

చింతగింజ మొలకెత్తునపుడు చూడండి, దీనిసంగతి తెలుస్తుంది. నీటిచే మెత్తమెత్తనై పిదపిదనై విత్తుపగిలి దానిలో నుంచి మొలక యెత్తుతుంది. అది క్రమంగా పెరిగి ఒక చెట్టుగా రూపొందుతుంది. ఆ విత్తులో మహావృక్షం కాగలశక్తి ఉన్నది. ప్రపంచంలో గల సమస్త శక్తులకూ, సామర్థ్యానికీ, మేధాసంపదకూ మూలం దైవమే. మూలంలో నున్న శ##క్తే ప్రపంచంలో అంతటా వ్యాప్తమై ఉంది. 'ఇది ఇది' అని చూడబడే అన్ని వస్తువులలో ఉండి చూస్తూఉన్నదే మూలం. ఒక నిలువుటద్దముముందు నిలువబడి చూస్తే మనస్వరూపం ఒకటి మనకు కనబడుతుంది. నాలు గద్దాలు వరుసగా ఉంచి చూస్తే నాలుగు స్వరూపాలున్నూ ఇలా ఎన్నో అద్దాలుంచిచూస్తే ఎన్నో రూపాలున్నూ కనబడతవి. 'ఇది ఇది' అని చూచేవాడే దేవుడు. చూచేవస్తువే చూడబడే వస్తువుకు మూలం. ఆ మూలం అనేది స్ఫురణమే. ఆ స్ఫురణమే జగత్తుకు కారణం. ఇది నీలోనే ఉంది. ఆఖండంగా ఉండవలసిన ఇది నీయొద్దనే ఖండఖండంగా ఉంది. దీపాలు, పంకాలు అని అనేకరూపాలు ఉన్నా మూలశక్తిఐన విద్యుచ్ఛక్తి ఒకటే. మెరుపుతీగెలలో ఉండే శక్తీ మబ్బుల చాటున ఉరుములతో మెరిసే మెరుపుతీగలశక్తీ ఒక్కటే. ఇట్లా వేదానికి అంతంగా ఉండే 'తత్‌' యొక్క సారం 'త్వమ్‌'-నీవే. నీయందుండే మూలమే సర్వజ్ఞుడున్నూ శక్తిమంతుడున్నూ.

గీతలలో ఒకశ్లోకం ఈ విషయాన్నే చెబుతూంది. గీతలలో ఉన్న ఏడువందల శ్లోకాలలోనూ ఈ తత్త్వమే చెప్పబడ్డది. ఒకటి చెపితే చాలు, ఇన్ని చెప్పనక్కరలేదు. అయినప్పటికీ ఇన్ని చెప్పింది-ఇన్ని చెప్పినా ఏ ఒకటి చదివినా చదివినవారి మనసునకు అంటదా అనే అభిప్రాయం తోచే ఇన్ని శ్లోకాలు చెప్పింది.

'అవిభక్తం చ భూతేషు విభక్త మివ చ స్థితమ్‌
భూత భర్తృ చ తద్‌జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ,
భగవద్గీతలో ఎక్కడనో తగిలినట్లు ఈ శ్లోకం జ్ఞాపకం వస్తుంది.
అనన్యా శ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహామ్యహమ్‌.
మీ యోగక్షేమాలు ''నేను చూస్తానని'' భగవంతుడే చెప్పాడు. కాబట్టి యీశ్లోకం అందరికి తెలిసి ఉంటుంది.

యదా యదా హి ధర్మస్యగ్లాని ర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజా మ్యహమ్‌.
ఈ శ్లోకం గూడా అందరకూ గురుతు ఉంటుంది. ఇట్లాకొన్ని శ్లోకాలు గుర్తు ఉంటై. కొన్ని కొన్ని విన్నట్టె ఉండదు. నేను మొదట చదివిన శ్లోకం విన్నట్టు తోస్తూందా? బహుశా తోచక పోవచ్చు.

జ్ఞేయము అనగా తెలియదగినది. ఏది తెలియదగినది? 'తత్‌' అనునది. ఆ 'తత్‌' అనే దానికి భూతభర్తృ-గ్రసిష్ణు 'ప్రభవిష్ణు' అని మూడు విశేషణాలు.

మొదటి గుణం-'భూతభర్త' 'భర్త' అనగా భరించేవాడు. పెండ్లి అయితే ఒక కన్యయొక్క భారాన్ని భరించేవాడు భర్త. అలాటపుడే ఆ పదం సార్థకం. భార్యయొక్క సుఖదుఃఖాలకు అన్నిటికీ అతడు భర్త కావాలి.

భూతభర్త అంటే భూతాలను భరించేవాడు. అన్ని ప్రాణులూ అన్ని జడవస్తువులూ భూతాలు. ఆకాశం, భూమి, అగ్ని, గాలి, నీరు ఇవి పంచభూతాలు. స్థావర జంగమాలు ఖేచర భూచరాలు ఇవన్నీ భూతాలే.

'ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే7ర్జున తిష్ఠతి'
అని గీతలోనే మరో చోట కానవస్తుంది. సర్వభూతాలయూ హృదయంలో ఉండేవాడే ఈశ్వరుడు. భూతభర్త. భరిస్తూ రక్షిస్తూ వుండే వస్తువే 'తత్‌' ఇవి జీర్ణాలు అయిపోతే చివికిపోతే వాని భక్షించేదీ గ్రహించేదీ అతడే. చెట్టు భూమిలో పుటుతుంది. దానిని భరించి రక్షించేది భూమే.

ఇట్లా భూతాల నన్నిటినీ ప్రాణుల నన్నిటినీ స్థావర జంగమాదుల నన్నిటినీ భరించే వస్తువే గ్రహిస్తూ వున్నది. వానిని జీర్ణించుకుని మరల 'ప్రభవిష్ణు' పుట్టిస్తున్నది. శ్లోకపూర్వార్ధంలో

అవిభక్తం చ భూతేషు విభక్త మిన చ స్థితమ్‌ అని ఉన్నది. ఎప్పటి కప్పుడు పుట్టుకుంటూ వచ్చే నానా విధాల జీవరాసులు వేరు వేరుగా కనిపించినా అవన్నీ అవిభక్తాలే. విభక్తాలుగా కనిపించే భూతాలన్నింటిలో అవిభక్తమయిన వస్తువొకటి ఉన్న కారణాన ప్రపంచంలోని వస్తువులన్నీ-ప్రాణము, ప్రజ్ఞ ఇత్యాదులు కలవి లేనివి అన్నీ-వీని అన్నిటిలోనూ ఉండి వీనికి మూలమయిన వస్తువు, అది అవిభక్తము. వేరు వేరుగా ఉన్నా ఇది చెట్టు అది గట్టు అని వేరు వేరుగా కనబడ్డా ఇవన్నీ నిజానికొకటే. వేరు వేరు చోటులలో ఉండడాన విభక్తమువలె గోచరిస్తున్నది.

తన్ను తెలిసికొంటే 'తత్‌' నీలో ఏ వస్తువుందో, అదే భూతాల నన్నిటినీ భరిస్తూ గ్రహిస్తూ ప్రభవిస్తూ ఉన్నది.

అవిభక్తం చ భూతేషు విభక్త మివ చ స్థితమ్‌
భూతభర్తృ చ తద్‌ జ్టేయం గ్రసిష్టు ప్రభచిష్ణు చ.
దోసెడు నీళ్లు క్రింద చల్లితే ఆ నీళ్ళలోని ప్రతి నీటిబొట్టూ సూర్యుని ప్రతిబింబిస్తుంది. ఒక సూర్యుడే సహస్రసూర్యుడై అనేక సూర్యుడై కనబడతాడు. ఈ సంగతి.

'అత ఏవ చ ఉపమా సూర్యకాదివత్‌'
అనే బ్రహ్మసూత్రంలో ఉన్నది. అన్నిటికీ మూలమైన శక్తి చైతన్యం-అదే మనలో ఖండంగా తోస్తూంది. ఆ ఒక్కవస్తువే వేదాంతమందుండే 'తత్‌', అదే 'త్వమ్‌'. అదే 'తత్త్వమ్‌'.

ఇపుడు మనకిది పూర్తిగా అర్థమయినటులు తోస్తూంది. ఇటులే ఎన్నడూ అన్నిటిలోనూ ఉంటే దుఃఖం లేదు. అసత్యాలచే మిథ్యలచే ఏర్పడు బాధలూ ఉండవు. నిజముగా ఉండడానికి నిజమయిన వస్తువును పట్టుకోవాలి.

అఖండంగా ఉండే ఒక వస్తువు ఖండఖండాలుగా ఉండే మరొక వస్తువు ఖండఖండాలుగా ధ్యానంచేసి కడపటిస్థితిలో నిర్గుణధ్యానం చేయడానికి మొదలుపెడితే కయ్యాలు కంయ్‌ కం¸్లుూ ఉండవు. ఇదియే ఆచార్యులు ఉపనిషద్‌ వృక్షం నుంచి మనకు గిల్లి ఇచ్చినఫలం. ఈ పక్వస్థితిని పొందడానికి ముందు మొగ్గగా పూవుగా కాయగా క్రమేణ ముదిరి పండే వరకూ ఓర్మి వహించి ఉండాలి. తొందరపడితే ప్రయోజనంలేదు. కాయ అవిసి రాలిపోతుంది.

పక్వస్థితి కలిగేవరకూ జపమూ తపమూ ఉండాలి. వేదాంతంలో ఉండే 'తత్త్వం' అను నిజస్థితి పొందేవరకూ ఇవన్నీ ఉండాలి. అపుడే కాయపండుతుంది. కడపటి 'తత్త్వమ్‌' ఎందున్నది? నీలోనే-చూచే స్ఫురణలోనే ఉన్నది. ఖండం సాధన. అఖండంఅంత్యం విభక్తం సాధనకాలంలో ఉండవలసిన మనోభావం. అంతలో అఖండస్వరూపంతో ఐక్యం కలిగేటప్పుడు వేరు అనేది మాయమౌతుంది. విభక్తం అవిభక్తం ఔతుంది. ఇదే ఆచార్యులవారి ఉపదేశం.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page