Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page

చెరకువిల్లు - తేటినారి

ధనుః పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా

వసంత స్సామంతో మలయమరుదాయోధనరథః,

తథా ప్యేక స్సర్వం హిమగిరిసుతే కామపి కృపా

మపాంగాంస్తే లబ్ధ్వా జగ దిద మనంగో విజయతే.

మన్మధునివిల్లు చెరకు అనిన్నీ దాని అల్లెత్రాడు తేనెటీగలు అనిన్నీ చెపుతారు. మన్మధునికి పర్యాయపదాలు; పుష్పబాణుడు, పంచబాణుడు అని. విల్లు తియ్యన; తూపులు పూలవంటివి కాక పూవులే. ఈలాటి మధురాలూ మహిమాన్వితాలూ అయిన ఆయుధాల సహాయంతో మదనుడు అందరి మనోవృత్తులనూ కామప్రవృత్తాలుగా చేసి దేవతలకైనా అసాధ్యమైన విజయాన్ని సాథిస్తవి. పశువులు, పక్షులు, కీటాలు, మొదలుకొని పేద్ద వస్తాదు వరకూ ఎల్లరూ తలలు ఒగ్గిన వారే ఇతనికి.

''ప్రపంచమునే పంచబంగాళముచేసిన నాకుపరమేశ్వరు డొకలెక్కా?'' అని అతడు ఒకపుడు తలపోశాడు. అతనికి ఆయుధసముదాయము సంగ్రహించినది అంబిక, ఆమె క్రీగంటిచూపు. కాని ఇపుడామె అతని తలపులోనికి రాలేదు.

ఒక కాలంలో దక్షపుత్రికగా అవతరించి నందువల్ల అంబిక దాక్షాయణి అయింది. కాత్యాయనుడనే మహం
అంబిక దాక్షాయణిగా వున్న కాలంలో దక్షుడు ఒక యాగం చేశాడు కానీ ఈశ్వరుని గౌరవించి ఆహ్వానింపలేదు. అల్లుడేకదా అని అలక్ష్యం చేశాడు. అంబిక మాత్రము నాతండ్రి యాగం చేస్తున్నాడు; నేను వెడతాను అని భర్తతో అన్నది. 'పిలువని పేరంటానికి వెళ్ళడ మెందుకు' 'మీరు రాకపోతే పోనీండి, నేను వెళ్ళి యాగం ఎట్లా జరుగుతుందో చూచి వస్తాను' అని పుట్టింటి మీద మక్కువతో యజ్ఞానికి వెళ్ళింది. ఆమె మనసు ఆమెకే తెలియాలి.

ఆహూతులైన దేవతలందరూ యాగానికి వచ్చారు. దక్షుడు శివుని యాగానికి పిలువక పోవడమే కాక పై పెచ్చు నింద చేశాడు. ఈశ్వర నింద విన్న దాక్షాయణి వోర్వలేక తన శరీరం యజ్ఞ కుండానికి ఆహుతి చేసింది. ఆమెకు సతి అని ఒక పేరు. అందుచేత స్త్రీలు పతి చితిలో పడడానికి ''సతి'' అని పేరు వచ్చింది. ''మహాదేవంహిత్వాతన సతి సతీ నా మచరమే'' అని సౌందర్య లహరి. ఆంగ్లంలో సైతం సహగమనానికి సతి యనియేపేరు.

ఆనాటినుండి ఈనాటి వరకూ సహగమనం చేయకూడదు అని చట్టం వున్నా సంవత్సరంలో ఏ ఇద్దరైనా సహగమనం చేశారని పత్రికలలో చూస్తూవున్నాం. దాక్షాయణి శరీర త్యాగం చేసినట్లు ఈశ్వరుడికి తెలియగానే దక్షునిమీద క్రోధానలం భగ్గుమని మండింది. తన్ను నిందించగా తన శక్తి ప్రాణత్యాగమును చూస్తూ వూరకున్న దేవతలను సైతం ఆయన శిక్షింప దలచాడు.

రక్షణ శిక్షణాలు చేసేవాడు రాజు. అట్టివాడు ఈశ్వరుడు. అడిగిన డబ్బిచ్చి జమాఖర్చులు అడగక దుర్వినియోగం చేసినా ఉపేక్ష చేసేవాడు ప్రభువు కాడు. మనము చేసే తప్పులకు దండిస్తూ ఖండిస్తూ సహాయం కొంచెమైనా చేయని వానినిగూడా ప్రభువని చెప్పలేము. రక్షణ శిక్షణాలు రెంటినీ చేసేవాడు ఈశ్వరు డొక్కడే.

సముద్రం తరువగా హాలాహలం పుట్టినప్పుడు తక్కినవారు పారిపోగా విషం మింగి జగత్తును రక్షించింది గరళకంఠుడు. అందరి పాపాలనూ ఆయనే భరించాడు. ''మనలను చేసినవాడు మన అందర పాపాలూ హరిస్తాడు.'' అని ఇతర మనస్థులు అనడం కూడా ఇదే.

దాక్షాయణి దేహ త్యాగం చేసిన తరువాత హిమవంతునికి కూతురై పుట్టింది. పరమేశ్వరినే కొమార్తెగా చూడటానికి హిమవంతుడు ఎంత తపస్సు చేసుకొన్నాడో గదా. ఎంత పుణ్యం చేసుకొన్నాడో గదా. తండ్రికొమార్తె కోసం తపస్సు చేయగా, కొమార్తె ఈశ్వరుని కోసం తపస్సు మొదలు పెట్టింది. ఆ ఈశ్వరుడు దక్షిణామూర్తి యోగంలో ఉన్నాడు. కనులు తెరవడంమీదగాని బయటి ప్రపంచం మీదగానీ ధ్యాసలేదు.

ఆ కాలంలోనే తారకుడనే మహా అసురుడు సురలను ముప్పతిప్పలు పెట్టుతూ ఉన్నాడు. వానిని సంహరించడం కోసం దేవతలు మహాతేజస్వియైన కుమారుడొకడు అవతరింపగూడదా అని తలపోశారు. వశీకరణ చక్రవర్తియైన మన్మధుని ఈశ్వరుని మీదికి పురికొల్పారు. ముఖస్తుతికి మన్మధుడు లొంగాడు. పరమేశ్వరుడు తపస్సు చేసుకునే వనంలోనికి వెళ్లి రుద్రుడికి అభిముఖుడై ఎడమకాలు ముందరకు చాచి విల్లు వంచాడు.

'ఏమిటదీ? మనస్సు చలిస్తోందే' అని ఈశ్వరుడు తన లలాట నేత్రం తెరిచాడు. తత్‌క్షణమే మన్మధుడు గుప్పెడు బూడిదయై అనంగుడై పోయినాడు.

పెనిమిటి బూడిదయై పోగా రతి ఎంతో దుఃఖించింది. దేవి రతిని ఊరడించి ఆమె కనులకు మాత్రం మన్మధుడు గోచరించేటట్లు అనుగ్రహించింది. తారకాసురసంహారం కోసం లోకరక్షణం కోసం పార్వతి మన్మధుని వింటినీ బాణాలనూ తీసి ఈశ్వరుని ముందుచి నమస్కరించింది. మన్మధుడు దండోపాయం చేత జయించలేని కార్యం సామోపాయంచేత ఆమె అవలీలగా నెరవేర్చింది.

దాని తరువాతనే కుమారసంభం, రామాయణంలో వాల్మీకి.

''కుమారసంభవ శ్చైవ ధన్యః పుణ్య స్తథైవ చ''

అని వ్రాశాడు. కాళిదాసు కుమారసంభవము లోనిది ఈ కథే. వీక్షణ మాత్రాన కామాక్షి ఈశ్వరుని కామవశుని చేసేసింది. అటుతర్వాత కళ్యాణము, కుమార జననమూ, సుబ్రహ్మణ్యావతారమూ, ఇతడో ఈశ్వరుని మించిన తేజస్వి. తండ్రిని మించిన కొడుకు. ఈశ్వరునికే ఇతడు ప్రణవం ఉపదేశించాడు. ఈశ్వరుడై కుమారుడుగా అవతరించాడని చెప్పినా జ్ఞానంలో నేమి పరాక్రమంలో నేమి ఈరూపం ముందు కంటె వేయి విధాల యెక్కువగా ప్రకాశించింది.

ఈశ్వరుడు జ్ఞానస్వరూపి. పరతత్వస్వరూపంగా వుంటే చాలడు. కరుణా సముద్రుడై అందర్నీ కటాక్షించాలనీ అవతరించాలనీ జగన్మాత జ్ఞానస్వరూపునికే కామం పొంగేటట్లు చేసింది.

''పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే! నమస్తే జగదేక మాతః'' అని శ్యామలా దండకం. ఈ చెరకు వింటి యొక్కయూ పుష్పబాణాలయొక్కయూ సూక్ష్మతత్త్వం ''లలితాసహస్రంలో'' ''మనోరూపేక్షుకోదండాపంచ తన్మాత్ర సాయకా'' అని చెప్పబడ్డది.

చేరకు తీపి. మనస్సున్నూ తీపే. లోకంలోని జనులందరి సమష్టి మనస్సూ ఆమె చేతిలో వున్న చెరకు విల్లు. చెవిమేనూ, కన్నూ, నాలుకా, ముక్కూ, అనుభవించే విషయాలే తన్మాత్రలు. ఆ తన్మాత్రలనే, పూవు టమ్ములుగా తనచేతిలో పెట్టుకొన్నది. మన కామ నిరోధానికి మనో నిరోధానికి ఆమె కారణం అవుతూంది. ఆమె అనుగ్రహం మాత్రం వుండాలి. మూకకవి తరచు దీనిని గూర్చి ''మీ కటాక్షం శివునే మోహపెడుతోంది, కాని జనుల మోహాన్ని మాత్రం శిధిలం చేస్తుంది.'' అని చెపుతూ వుంటాడు.

కేవలం జ్ఞానమయుడైన ఈశ్వరుని లోకక్షేమం కోసం మోహింపజేసే శివకామసుందరిలో కామాక్షి మోహంలో మునిగిన భక్తుల మోహ నివృత్తి చేస్తోంది. ఇదే ఆమె విశేషం. మూకకవి చెప్పినట్లు ఆమె అనుగ్రహం వుంటేనే మనకు చిత్తంలో అవికారం సమదృష్టీ. నిర్మోహస్థితీ కలుగుతుంది.

ఆమె అనుగ్రహం వుంటే కామం ఎంత కలిగించే వస్తువులైనా మనలను చలింప చేయలేవు. ఎట్టి విభూతియైనా లోభ##పెట్టలేదు. అరిషడ్వర్గములు అంతరించి చిత్తశుద్ధి కలగాలంటే దేవిని ధ్యానించాలి. 'అమ్మా దుర్గుణం అనేది ఒక్కటైనా లేకుండా వుండేటట్లు నాచిత్తాన్ని పరిశుద్ధంచెయ్యి, అని నిత్యమూ వేడుకోవాలి. ఈ వాడుక కలిగితే చిత్తశుద్ధి తానుగా ఏర్పడుతుంది. అదియే ఆమె చరణారవిందాలు ఆశ్రయించినందువల్ల కలిగే ఫలం. మనస్సులో లోపమున్నదంటే చిత్తశుద్ధి లేదన్నమాట.

ఆమె చరణాలను ఎప్పుడూ స్మరించడమే చిరంజీవిత్వం. చిత్తశుద్ధితో ఆమె బిడ్డలాగా ఆమె స్వరూపధ్యానం చేస్తూ ఆత్మానందంలో తేలియాడాలి. శంకరుల సౌందర్య లహరీ ప్రయోజనం ఏమిటయ్యా అంటే రేయీబవలూ జగన్మాతృ స్మరణముచే దోషనివృత్తి చేసికొని మన ఆత్మలను ఆ సచ్చిదానంద స్వరూనిణికి అర్పించడమే.


Jagathguru Bhodalu Vol-1        Chapters        Last Page